Tags
anti china, BJP, fake news, Indo - China trade, Indo-China standoff, Narendra Modi Failures, RSS, Xi Jinping
ఎం కోటేశ్వరరావు
ఫేక్ న్యూస్, కృత్రిమ మేథతో నకిలీ ఫొటోలతో సామాజిక మాధ్యమంలో జరిపే ప్రచారంలో మనదేశం ఎంతో ముందుంది. నకిలీ వార్తల ముప్పు ఎక్కువగా ఉన్న దేశాలలో మనం ప్రధమ స్థానంలో ఉన్నట్లు గతంలో ప్రపంచ ఆర్థికవేదిక నివేదిక హెచ్చరించింది. గడచిన పది సంవత్సరాలలో ఈ ప్రచారదాడికి గురికాని వాట్సాప్ ఉన్న ఫోన్ బాధితులు లేరంటే అతిశయోక్తి కాదు.అది నరేంద్రమోడీ, జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ, మతం, విద్వేషం, తప్పుడు సమాచారం, వక్రీకరణ ఇలా పలు రూపాల్లో ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఫలానా కంపెనీ లేదా వ్యక్తి దివాలా తీసిన కారణంగా తమ దగ్గర మిగిలిపోయిన వస్త్రాలను కారుచౌకగా విక్రయించి సొమ్ముచేసుకోవాలనుకుంటున్నారు అంటూ పత్రికల్లో ప్రకటనలు వచ్చేవి, నాసిరకం సరుకు అంటగట్టి దుకాణం ఎత్తివేసేవారు. ఈ వార్త ఏ ప్రధాన పత్రికల్లో, టీవీల్లో రాదు అంటూ తప్పుడు సమాచారాన్ని వాట్సాప్‌లో ఉచితంగా అందించే సామాజికసేవకులను మనం చూస్తున్నాం. అలాంటిదే ఇప్పుడు ఒక ఫొటో, దాని కింద సమాచారం ఒకటి తిరుగుతోంది.
ఎక్కడైతే ఘర్షణ జరిగిందో అక్కడే నాలుగు సంవత్సరాల తరువాత తొలిసారిగా దీపావళి రోజు భారత్‌చైనా సైనికులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. ఇలాంటి దృశ్యం మరోసారి చూడాలని కోరుకుంటున్నవారికి సంతోషం, ఘర్షణ కొనసాగాలని చూసిన వారికి విషాదం కలిగించింది. సంవత్సరాల పాటు సాగిన చర్చల అనంతరం అక్టోబరు మూడవ వారంలో ఉభయ దేశాల ప్రతినిధులు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సడలించి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఒక ఒప్పందానికి వచ్చారు. దాన్ని రష్యాలోని కజాన్ నగరంలో జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా అక్టోబరు 23న మన ప్రధాని నరేంద్రమోడీచైనా అధ్యక్షుడు షీ జింపింగ్ నేతృత్వంలో ఉభయదేశాల ప్రతినిధి బృందాలు సమావేశమై తుదిరూపమిచ్చాయి. ఒక క్రమ పద్దతిలో గాల్వన్ లోయ ఉదంతాలకు ముందున్న పరిస్థితిని పునరుద్దరించేందుకు అంగీకరించారు, ఆ మేరకు అక్టోబరు చివరివారంలో సైనిక దళాల ఉపసంహరణ కూడా జరిగింది.ఈ తరుణంలో చైనా వ్యతిరేక మోడీ అనుకూల సోషల్ మీడియా మరుగుజ్జులు రంగంలోకి దిగారు. చైనా దేశ మాప్ నేపధ్యంలో నరేంద్రమోడీ ఒక సింహాసనం లాంటి కుర్చీలో ఠీవీగా కూర్చొని ఉంటే షి జింపింగ్ మోకాళ్ల మీద కూర్చుని భూమిని అప్పగిస్తున్నదానికి చిహ్నంగా చెట్లు ఉన్న ఒక పచ్చని పళ్లెంలాంటి దాన్ని సమర్పించుకుంటున్నట్లు తయారు చేసిన నకిలీ కృత్రిమ చిత్రాన్ని సోషల్ మీడియాలో వదిలారు. దాన్ని చైనా సోషల్ మీడియాలో వైరల్ చేశారని, అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం సెన్సార్ చేసిందని, షేర్ చేస్తున్న వారి మీద కఠిన చర్యలకు దిగుతున్నట్లు సమాచారం వచ్చిందని రాశారు. తప్పుడు సమాచార వ్యాప్తిలో ఇదొక కొత్త టెక్నిక్, అబ్బే మనకేం సంబంధం లేదు చైనాలోనే అలాంటిది జరిగినట్లు నమ్మించే అతి తెలివి తప్ప మరొకటి కాదు. తప్పుడు చిత్రాలు, సమాచారాన్ని ప్రచారం చేసే వారు ఎక్కడో ఒక దగ్గర దొరికి పోతారు.
చైనా ఆక్రమించుకున్న 90వేల చదరపు మీటర్ల ప్రాంతాన్ని (22.23ఎకరాలు) తిరిగి మనదేశానికి అందచేసినట్లు రాశారు. నిజానికి రెండు దేశాల మధ్య వివాదం ఉన్న స్థల విస్తీర్ణం 90వేల చదరపు మీటర్లు కాదు కిలోమీటర్లు. ఆ ప్రాంతాన్ని నిజంగా చైనా అప్పగిస్తే అది ప్రపంచ వార్తగా మారి ఉండేది.సరిహద్దుల్లో గతంలో మాదిరి ఎవరి ప్రాంతాల్లో వారు ఉండటం గురించి, గస్తీమీద ఒక ఒప్పందానికి వచ్చారు తప్ప ఒక్క గజం స్థలం కూడా మార్పిడి జరగలేదు, అసలు దాని మీద చర్చలే జరగలేదు. అది మాది అంటే మాది అని మన ప్రభుత్వం, చైనా సర్కార్ ఎప్పటి నుంచో పరస్పరం వాదించుకుంటున్నాయి. మన ఆధీనంలో 84వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ తమదని, టిబెట్ దక్షిణ ప్రాంతమని చైనా చెబుతుంటే వారి ఆధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్ ప్రాంతం 90వేల చదరపు కిలోమీటర్లు మనదని అంటున్న అంశం తెలిసిందే. రెండు దేశాల మధ్య వివాదం అదే కద. అసలేమీ జరగనిదాన్ని చైనా సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేస్తారు. అక్కడ మన మాదిరి దేన్నిబడితే దాన్ని జనం మీదకు వదలటానికి గూగుల్, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్‌లు లేవు. వాటి మీద నిషేధం ఉంది. అవెక్కడా కనిపించవు. చైనా సర్కార్ అధికారికంగా నిర్వహించే బైడు వంటి సామాజిక మాధ్యమవేదికలు ఉన్నాయి.నిజంగా ఎవరైనా అలాంటి పిచ్చి పోస్టు వాటిలో పెడితే వెంటనే తొలగించే సాంకేతిక నైపుణ్యం చైనా దగ్గర ఉంది. అందువలన అలాంటి వాటిని వైరల్ చేసే అవకాశం అక్కడ లేదు. అలాంటి చిత్రాల గురించి నిజానిజాలు తేల్చేందుకు చూసిన వారికి మన సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక కృత్రిమ చిత్రంగా తేలింది తప్ప చైనాలో తయారైందిగా కనిపించలేదు. ఒకవేళ ఎవరికైనా అలాంటి సమాచారం ఉంటే ఆధారాలతో వెల్లడిరచవచ్చు. ఆ చిత్రం తీరుతెన్నులను చూస్తే నరేంద్రమోడీ గొప్పతనాన్ని కృత్రిమంగా పెంచేందుకు చూస్తున్న కిరాయిబాపతు సృష్టి తప్ప మరొకటి కాదు అన్నది స్పష్టం. వారికి అదొక తుత్తి(తృప్తి),చౌకబారుతనం తప్ప మరొకటి కాదు. నిజంగా అలాంటి వాటిని పదే పదే ప్రచారం చేస్తే నిజం చెప్పినా ఒకనాటికి మోడీ భక్తులు కూడా నమ్మని స్థితి ఏర్పడుతుంది.పరాయి దేశాల్లో అపహాస్యం పాలౌతారు.
2020లో గాల్వన్‌లోయ సరిహద్దులో రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణ ఆసియా రాజకీయాల్లో భూకంపం అని కొందరు వర్ణించారు. ముఖ్యంగా అమెరికా మీడియా మాటలను చూస్తే భారత్‌చైనాల మధ్య మరో యుద్ధమే తరువాయి అన్నట్లుగా భ్రమపడిన వారున్నారు. ఇంకే ముంది మన చేతికి మట్టి అంటకుండా చైనాను నిరోధించే బాధ్యత నరేంద్రమోడీ నెత్తిన పెట్టవచ్చనుకున్నారు అమెరికన్లు. సరిహద్దులో లక్షల సైన్యం కొనసాగితే మరింతగా సొమ్ము చేసుకోవచ్చని అమెరికా, ఇతర ఐరోపా దేశాల ఆయుధ కంపెనీలు మన గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.మన మార్కెట్లో తమ సరకులను కుమ్మరించి లాభాలు పిండుకోవచ్చని కలలు కన్నాయి. ఇప్పుడవి కల్లలయ్యాయి. చైనా నుంచి గత నాలుగేండ్లుగా రికార్డు స్థాయిలో దిగుమతులు చేసుకోవటమే కాదు, నిషేధించిన పెట్టుబడులను కూడా పొందేందుకు మోడీ సర్కార్ నిర్ణయించింది. దీంతో ఇప్పుడు కుదిరిన సయోధ్య చైనా వ్యతిరేకులకు పిడుగుపాటుగా ఉంది. తమ ఎన్నికలకు పక్షం రోజుల ముందు కుదిరిన ఈ అవగాహనను అమెరికన్లు ఊహించినప్పటికీ పరిస్థితి తమ చేతుల్లో లేదన్న ఉక్రోషంతో ఉన్నారు. మనదేశంలోని కొన్ని శక్తులకు మింగుడు పడకపోయినా కార్పొరేట్ల వత్తిడి కారణంగా లోలోపల ఉడుక్కుంటున్నారు.
చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌పై పోస్టు పెట్టినందుకు, దాన్ని వైరల్‌చేసిన వారి మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందంటూ సంఘపరివార్ మరుగుజ్జులు గుండెలు బాదుకుంటున్నారు.లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి అమిత్ షా ఉపన్యాసమంటూ ఫేక్ వీడియోలు తయారు చేసిన వారి మీద పెట్టిన కేసులు, అరెస్టుల సంగతి వారికి తెలిసినా చైనాలో సామాజిక మాధ్యమాలలో స్వేచ్చ లేదనట్లుగా ఫోజుపెడుతున్నారు. మరి అపర ప్రజాస్వామికవాది అమిత్ షా తరఫున ఎందుకు కేసులు పెట్టినట్లు ? నిజానికి చైనాలో సదరు పోస్టు మీద కేసులు పెట్టారో అసలు అది అక్కడ వైరల్ అయిందో లేదో కూడా తెలియదు. అయిందని చెప్పేవారి దగ్గర ఎలాంటి నిర్ధారిత సమాచారమూ లేదు. ఒక్క అధ్యక్షుడి మీద వక్రీకరణ వార్తల మీదే కాదు, గంగానదిలో మునిగితే కరోనా రాదు, దీపాలు వెలిగిస్తే, చప్పట్లు కొడితే పారిపోతుంది అని బాధ్యతా రహితంగా ప్రచారం చేసి జనాలను తప్పుదారి పట్టించేవారి మీద కూడా అక్కడ కేసులు పెడతారు, స్వేచ్చగా వదలి జనాల బుర్రలను ఖరాబు కానివ్వరు. ఐదు సంవత్సరాల క్రితం షీ జింపింగ్ మహాబలిపురాన్ని సందర్శించినపుడు అక్కడ నరేంద్రమోడీ షీ ముందు వంగి నమస్కారం చేసినట్లు ఆ రోజుల్లో ఒక ఫొటో వైరల్ అయింది. తీరా అది ఫేక్ అని తేలింది. ఎప్పుడో 2014లో కర్ణాటకలోని తుముకూర్ మహిళా మేయర్ స్వాగతం పలికినపుడు నరేంద్రమోడీ వంగి అభివాదం చేసినప్పటి చిత్రాన్ని షీ జింపింగ్‌కు కలిపి వైరల్ చేశారు. ఇలా మోడీకి వ్యతిరేకంగా, అనుకూలంగా పెద్ద ఎత్తున అనేక ఫేక్ చిత్రాలు, వార్తలను ప్రచారంలో పెట్టారు. ఇటీవల ఐరాస సమావేశాలకు మోడీ న్యూయార్క్ వెళ్లినపుడు చైనాను భద్రతా మండలి శాశ్వత సభ్యరాజ్యంగా తొలగించారని, భారత్‌కు చోటు కల్పించారంటూ మోడీ ప్రతిష్టను పెంచేందుకు ఒక తప్పుడు వీడియో, సమాచారాన్ని వైరల్ చేశారు. అది ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ఉంది. 1970దశకం వరకు కమ్యూనిస్టు చైనాను ఐరాసలో అసలు గుర్తించలేదు, దానికి అడ్డుపడిరది అమెరికా అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటికీ నెహ్రూ కమ్యూనిస్టు చైనాకు భద్రతా మండలిలో సభ్యత్వానికి మద్దతుపలికారంటూ కాషాయదళాలు పచ్చి అబద్ద ప్రచారం చేస్తుంటాయి. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందే ఐరాస స్థాపక దేశంగా 1945 నుంచీ రిపబ్లిక్ ఆఫ్ చైనా పేరుతో శాశ్వత సభ్యత్వ హోదా ఉంది. ఆ తరువాత నాలుగేండ్లకు 1949లో కమ్యూనిస్టులు చైనాలో అధికారానికి వచ్చారు. ఆ తరువాత కూడా 1971వరకు తైవాన్‌లో ఉన్న తిరుగుబాటు ప్రభుత్వాన్నే అసలైన చైనా పాలకులుగా గుర్తించి అదే హోదాను కొనసాగించారు.1971లో తైవాన్ పాలకులకు ఉన్న గుర్తింపును రద్దు చేసి కమ్యూనిస్టుల నాయకత్వంలోని పీపుల్స్ రిపబ్లిక్ చైనా పాలకులను గుర్తించారు. తైవాన్ ప్రాంతం చైనాలో అంతర్భాగం అని ఐరాస గుర్తించింది. నెహ్రూ 1964లో మరణించారని తెలిసిందే. 1971 నుంచి ఇప్పటి వరకు మనకు అత్యంత ఆప్తులు, భాగస్వాములు అంటున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు గానీ మనకు శాశ్వత సభ్యత్వ హోదా ఇవ్వాలని ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఐరాసలో తీర్మానం పెట్టలేదు. ఇదంతా తెలిసినప్పటికీ మోడీ శాశ్వత సభ్యత్వాన్ని సాధించారంటూ తప్పుడు వీడియోలు తయారు చేసి జనంలోకి వదిలారు. ఫేక్ న్యూస్ చూసేవారికి బుర్ర ఉండదని వారికి ఎంత నమ్మకమో ! షీ జింపింగ్‌మోడీ గురించి పెటిన చిత్రం కూడా అంతే !
