Tags
Amit Shah, BJP, LOK SABHA, Narendra Modi Failures, Parliament security breach, PM Narendra Modi’s Silence, smoke canisters, UAPA
ఎం కోటేశ్వరరావు
లోక్‌సభలో 2023 డిసెంబరు పదమూడున జరిపిన పొగబాంబు దాడి నిందితులు అందరూ ఒకే రకమైన సమాధానం చెబుతున్నారు. ఎవరో వారి బ్రెయిన్ వాష్ చేశారని అలా అనుకుందాం. ఇప్పుడు అది ప్రధానం కాదు. దాడి జరిగిన తరువాత ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హౌంమంత్రి అమిత్ షా నోరు విప్పకపోవటమే అసలైన సమస్య. వారి మౌనం, పార్లమెంటుకు రాని కారణంగా గురు, శుక్రవారాల్లో పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళన కానసాగింది. ఈ అంశం గురించి చర్చించాలని కోరగా ప్రభుత్వం నిరాకరించింది. దాంతో సభ్యుల పట్టు కారణంగా పలు అంతరాయాల తరువాత సోమవారానికి వాయిదా పడింది. బయట మాట్లాడుతూ సభకు రాకుండా, మౌనంగా ఉండేట్లు వారి బుద్దులను ఎవరు శుద్ధి చేసినట్లు ? దీన్ని రాజకీయం చేయవద్దని కబుర్లు చెబుతున్నారు. ఎవరూ అలాంటి ఆరోపణలూ ఎవరి మీదా చేయలేదు. బిజెపి నోట రాజకీయం మాట ఎందుకు వచ్చింది ?దాడి గురించి చెప్పమని అడిగితే రాజకీయం అంటారా ? దేశ పౌరులు దేని గురించి ఆందోళన చెందాలి ? అసలేం జరుగుతోంది ? ఏ కథనాన్ని వండి వార్చేందుకు తెరవెనుక బిజెపి పెద్దలు మధనం జరుపుతున్నట్లు ? నిందితులు లోక్‌సభ ప్రేక్షకులుగా ప్రవేశించేందుకు మైసూరు బిజెపి ఎంపీ ప్రతాప్ సింహ పాసులు ఇచ్చినట్లు తేలింది. అదే ప్రతిపక్షాలకు చెందిన వారెవరైనా ఇచ్చి ఉంటే ఇక చెప్పాల్సిందేముంది? ఈ పాటికి రచ్చో రచ్చ. పార్టీ,లోక్‌సభ స్పీకర్ గానీ సదరు ఎంపీ నుంచి వివరణ కోరినట్లు, పోలీసులు ప్రశ్నించినట్లుగానీ ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. అతగాడిని బయటపడవేసేందుకు, తద్వారా బిజెపి పరువు నిలుపుకొనేందుకు చూస్తున్నారా ? దాడి సందర్భంగా నిందితులు చేశారని చెబుతున్న నినాదాలు నిరంకుశత్వం, నిరుద్యోగం, రైతుల ఆందోళన వంటి అంశాలపై నిజమే అయితే వాటి గురించి దేశంలో మరోసారి చర్చ జరిగితే అది కూడా బిజెపికి రాజకీయంగా దెబ్బే. రానున్న ఎన్నికల్లో ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది, దాన్నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎవరి మీద నెపం నెట్టి జనం దృష్టిని మళ్లించాలని చూస్తున్నారు ? ఇలా జనంలో పరిపరి ఆలోచనల సుడులు తిరుగుతున్నాయి. ఈ నెల 22 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగాల్సి ఉంది.
లోక్‌సభలో పొగబాంబు దాడికి సూత్రధారి అని చెబుతున్న కొలకతాకు చెందిన లలిత్ మోహన్ ఝా అనే యువకుడిని రాజస్థాన్‌లో పట్టుకున్నట్లు, అతనే లొంగిపోయినట్లు వార్తలు వచ్చాయి. అతను సామ్యవాది సుభాస్ సభ పేరుతో ఒక స్వచ్చంద సంస్థ ఒక శాఖకు అధ్యక్షుడిగా ఉన్నాడని చెబుతున్నారు. దాడి తరువాత లోక్‌సభ వెలుపలి దృశ్యాలను ఫోన్ ద్వారా వీడియో తీసి వాట్సాప్‌లో పెట్టినట్లు, ఆ ఫోన్‌తో పాటు దాడిలో పాల్గొన్న నలుగురి ఫోన్లనూ ధ్వంసం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. దాడి తరువాత బస్‌లో హర్యానా సరిహద్దు సమీపంలో రాజస్థాన్‌లోని కుచమన్ వెళ్లి ఆ రాత్రి అక్కడ ఒక హౌటల్లో ఉండి, గురువారం నాడు ఢిల్లీ వచ్చి పోలీసులకు లొంగినట్లు వార్తలు. దాడి జరిపేందుకు గత కొద్ది నెలలుగా పార్లమెంటు పాసుల కోసం ప్రయత్నించినట్లు చెప్పాడట. తన కోసం అనేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు గ్రహించి తానే వచ్చి లొంగినట్లు, తన ఫోన్ ద్వారానే వీడియోలు తీస్తున్నట్లు, దాడి నిందితులైన అమోల్, మనోరంజన్, సాగర్, నీలమ్ ఫోన్లను రాజస్తాన్‌లో ధ్వంసం చేసినట్లు ఝా చెప్పాడు.రాజస్థాన్‌కు చెందిన ఝా స్నేహితుడు మహేష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ద కార్యకలాపాల నిరోధ చట్టం(ఉపా) కింద వారిని అరెస్టు చేశారు.వారికి బెయిలు రాదు. నిందితులు రెండు సంస్థల పేర్లతో పాటు ఒకే విధమైన సమాధానాలు చెబుతున్నారని, దొరికితే ఏం చెప్పాలో కూడా వారు ముందుగానే నిర్ణయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం ఆరుగురు ఫేస్‌బుక్‌లో భగత్ సింగ్ పేరుతో ఒక గ్రూపుగా చేరినట్లు, రైతుల నిరసన, మణిపూర్ ఉదంతాలు, నిరుద్యోగం వంటి అంశాల మీద తాము ఆగ్రహం చెందినట్లు అందుకే తామీపని చేసినట్లు అమోల్, మిగతావారు కూడా అలాగే చెప్పారని అంటున్నారు. వీరికి ఎలాంటి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు కనిపించటం లేదని పోలీసులు పేర్కొన్నట్లు పిటిఐ తెలిపింది. దుండగులు లోక్‌సభ లోపల, వెలుపల ఎలాంటి హానికరంగాని పొగబాంబులు పేల్చారు. వారంతా ఢిల్లీ శివార్లలోని హర్యానా గురుగ్రామ్‌కు డిసెంబరు పదిన చేరుకున్నారు.పదమూడవ తేదీన పాసులు తీసుకున్న ఇద్దరు గాలరీ నుంచి సభలోకి దూకి పొగ బాంబులు పేల్చారు. బయట ఉన్న వారు వెలుపల పేల్చారు.లోపల ఎంపీలే వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.2001లో పార్లమెంటు భవనంపై ఉగ్రవాదులు దాడి చేసిన రోజునే వీరు ఎంచుకున్నారు.
దాడి ఉదంతం గురించి ప్రకటన చేసేందుకు ప్రధాని మోడీ సభకు రావాలని, హౌంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఇలా అనుచితంగా ప్రవర్తించారంటూ గురువారం నాడు లోక్‌సభలో 14 మందిని, రాజ్యసభలో ఒకరిని సస్పెండ్ చేశారు.లోక్‌సభలో డిఎంకె ఎంపీ పార్థీవన్ అసలు సభకు రాలేదని, చెన్నరులో ఉన్నట్లు గుర్తించి నాలుక కరుచుకొని పేరు తొలగించారు. పార్లమెంటు ప్రాంగణంలో భద్రత లోక్‌సభ కార్యాలయానిదని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించి ప్రభుత్వానికి సంబంధం లేదనే అభిప్రాయం కలిగించేలా చూశారు. ఉదంతం జరిగింది సభలో అయినా దుండగులు వెలుపలి నుంచి వచ్చారు. పార్లమెంటుకు ప్రత్యేకంగా భద్రతా సిబ్బంది ఉండరు, కేసు నమోదు వెలుపల జరిగింది గనుక ప్రభుత్వమే జవాబు చెప్పాల్సి ఉంటుంది. భద్రత లోపాలకు కారకులంటూ ఎనిమిది మంది సిబ్బందిని లోక్‌సభ కార్యాలయం సస్పెండ్ చేసింది.
విపరీత ప్రవర్తన ఉన్న పిల్లలను, లేదా పెద్ద వారిని వైద్యులకు చూపించాల్సి ఉంటుందని తెలిసిందే. ప్రధానిగా ఉన్న నరేంద్రమోడీ అనేక అంశాలపై మౌనంగా ఉండటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక జనం జుట్టుపీక్కుంటున్నారు.ప్రతి అంశం మీద ప్రధాని మాట్లాడాల్సిన అవసరం లేదని బిజెపి మద్దతుదారులు సమర్ధిస్తారు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది.పార్లమెంటు మీద జరిగిన దాడి గురించి కూడా మాట్లాడకపోవటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ! అసలు జవాబుదారీ తనం ఉన్నట్లేనా ? రెండు వందల మందికి పైగా మరణించి, మరికొన్ని వందల మంది గాయపడి, 70వేల మంది నెలవులు తప్పినా మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించేందుకు మే మూడవ తేదీ నుంచి ఇప్పటి వరకు ప్రధాని వెళ్లలేదు. ఇద్దరు మహిళలను వివస్త్రలను గావించి తిప్పినట్లు వీడియోలు వెల్లడైన తరువాత మూడు నెలలకు మొక్కుబడిగా స్పందించారు. అందుకే అహమ్మదాబాద్‌లో క్రికెట్ మాచ్ చూడటానికి, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ గురించి పట్టించుకోవటానికి తీరిక ఉంటుంది గానీ మణిపూర్ వెళ్లటానికి ప్రధాని కుదరలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మిజోరం వెళ్లి ప్రచారం చేసేందుకు ధైర్యం చేయలేకపోయారు. పక్కనే ఉన్న రాష్ట్రం తగులబడితే చూడటానికి రాలేదుగానీ తగుదునమ్మా ఓట్ల కోసం వచ్చారా అనే విమర్శకు భయపడే అలా చేశారన్నది స్పష్టం.వ్యక్తిగతంగా తనకు, బిజెపికి ఇబ్బంది వచ్చినపుడు మౌనంగా ఉండటం, తరువాత అవకాశం వచ్చినపుడు పార్టీలో తన ప్రత్యర్ధులు, వెలుపల రాజకీయ వ్యతిరేకుల మీద దాడి చేయటం నరేంద్రమోడీ నైజంగా కనిపిస్తున్నది. గుజరాత్ బిజెపి కుమ్ములాటలు, అధికార దెబ్బలాటల్లో జరిగింది అదే. చివరికి గురువు వంటి అద్వానీకే ఏ గతి పట్టించిందీ చూశాము. అందువలన మోడీ మౌనం బలహీనత కాదు, ప్రమాదకరమైన ఆయుధం అని గ్రహించాలి. కౌటిల్యుడి ఎత్తుగడలు తప్ప మరొకటి కాదు.ఇలాంటి వైఖరితో ఎంతకాలం ముందుకు పోతారు, ఏమి సాధిస్తారు అన్నది ప్రశ్న. గణితంలో రెండు రెళ్లు ఎక్కడైనా నాలుగే, కానీ రాజకీయాల్లో కాదు.
అధికారం ఉన్నపుడు ఎవరినైనా ఇంద్రుడు, చంద్రుడు అని పొగడటం సహజం. దానిలో భాగంగానే ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ గతశతాబ్దిలో మహాత్మా గాంధీ మహాపురుషుడైతే, వర్తమానంలో నరేంద్రమోడీ యుగపురుషుడంటూ కీర్తించారు. దీన్నే నక్కకూ నాగలోకానికి పోలిక పెట్టటం అంటారు. అహింస, సత్యవాదిగా బ్రిటీష్ వారి బానిసత్వం నుంచి మనల్ని మహాత్మాగాంధీ విముక్తి చేస్తే నరేంద్రమోడీ దేశాన్ని ప్రగతిబాట పట్టించారని అన్నారు. ముఖస్తుతికీ ఒక హద్దు ఉంటుందని ఇద్దరికీ పోలిక పెట్టటంతో దానిని కూడా చెరిపివేశారని, ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తులకు తగనిపని, సిగ్గుచేటు అని కాంగ్రెస్ విమర్శించింది. వర్తమాన రాజకీయాల్లో జయాపజయాలు కొన్ని మినహాయింపులతో అధికారపక్షం చేసే తప్పిదాలే ప్రతిపక్షాలకు అవకాశాలు కల్పిస్తున్నాయి తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్ హయాంలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న కారణంగా కేంద్రంలో, రాష్ట్రాలలో ఏం చేసినా జనం మరొక మార్గం లేక ఆ పార్టీనే గెలిపించారు. దాని వైఫల్యాలు, ప్రజావ్యతిరేక చర్యలే వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించటానికి, బిజెపికి అవకాశాలు రావటానికి దోహదం చేశాయి. ఇటీవల ఎన్నికలు జరిగిన రాజస్థాన్, చత్తీస్‌ఘర్, మధ్య ప్రదేశ్‌లో బిజెపి గెలవటానికి రెండు చోట్ల పాలకపార్టీగా వైఫల్యం, మూడు చోట్లా కూడా తానే గెలవగలననే అతి విశ్వాసంతో బిజెపిని వ్యతిరేకించే ఇతర పార్టీలను కూడగట్టుకోలేని కాంగ్రెస్ రాజకీయ తప్పిదం, బిజెపికి పోటీగా మృదు హిందూత్వతో జనాలకు దగ్గరకావాలనే దగ్గరదారిని ఎంచుకోవటం తప్ప మరొకటి కాదు. రెండు పార్టీల మధ్య స్వల్ప ఓట్ల తేడా ఉంది. అంతకు ముందు కర్ణాటక, హిమచల్ ప్రదేశ్‌లో బిజెపి అధికారాన్ని పోగొట్టుకుంది. అక్కడ యుగపురుషుడు, విశ్వగురువు మంత్రదండం పనిచేయలేదు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను బిజెపి మౌనమునిగా ఎద్దేవా చేసింది. సోనియా గాంధీకి ఆగ్రహం వస్తుందేమో అన్న భయంతో నోరు విప్పేవారు కాదని ప్రచారం చేసింది. ఇప్పుడు నరేంద్రమోడీకి అలాంటి భయం లేదు. పార్టీలో తనకు ప్రత్యర్ధులుగా ఉన్నవారిని ఎలా తొక్కిపెట్టారో తెలిసిందే. అలాంటి వ్యక్తి ఎందుకు అనేక అంశాల మీద మౌనం పాటిస్తున్నారు. అదానీ మీద వచ్చిన ఆరోపణల మీద పార్లమెంటు స్థంభించినా మాట్లాడలేదు, ఏడాది పాటు రైతులు ఆందోళన చేసినా వారు ఢిల్లీలో ప్రవేశించటానికి వీల్లేకుండా రోడ్ల మీద మేకులు కొట్టించి కూర్చున్నారు తప్ప నోరు విప్పలేదు.విధిలేక మూడు సాగు చట్టాలను ఉపసంహరిస్తూ క్షమాపణలు చెప్పి తరువాత రైతులు లేవనెత్తిన అంశాల మీద మౌనం దాల్చుతున్నారు. తమ నేత మౌనం గురించి అడిగితే మాటల మనిషి కాదు చేతల మనిషి అని బిజెపి సమర్ధించుకుంటుంది. పార్లమెంటు మీద జరిగిన దాడి గురించి కూడా మాట్లాడని వారి చేతిలో దేశం భద్రంగా ఉంటుందని ఎలా నమ్మాలి. బిజెపి ప్రతిపక్షంగా ఉన్న చోట ప్రభుత్వాలను నిలదీసే నైతిక హక్కు వారికి ఉంటుందా !

