• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: one nation one election

జమిలి ఎన్నికలు – జిందా తిలిస్మాత్‌ : అసంబద్ద వాదనలు – అతకని సమర్థనలు !

22 Sunday Sep 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Women

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi Failures, one nation one election, ONOE, Ram Nath Kovind, RSS


ఎం కోటేశ్వరరావు


జమిలి ఎన్నికల గురించి తన అజెండాను అమలు జరిపేందుకు బిజెపి పూనుకుంది. ఆ విధానాన్ని వ్యతిరేకించే పార్టీలు తమ వైఖరిని మరోసారి స్పష్టం చేశాయి. గోడమీది పిల్లులు ఎటు వాటంగా ఉంటే అటు దూకాలని చూస్తున్నాయి. అతల్‌ బిహారీ వాజ్‌పాయి కాలంలో బిజెపి మౌనంగా ఉంది, నరేంద్రమోడీ పదేండ్ల పాలనలో చప్పుడు చేయలేదు. ఇన్నాళ్లూ జమిలి ఎన్నికలతో అభివృద్ధి అనే జ్ఞానోదయం కలిగించిన వృక్షం ఏమిటో తెలియదు. అదే ప్రాతిపదిక అయితే అసలు ఎన్నికలు లేని, తూతూమంత్రంగా జరిగే దేశాలు ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండాలి. ఈ సందర్భంగా ముందుకు వచ్చిన కొన్ని వాదనలు, ఇతర అంశాలను చూద్దాం.


ప్రజాస్వామ్యం ఖూనీ –ముందుగానే నిర్ణయం తీసుకున్న తరువాత పార్టీలు చెప్పేదేముంది ?

జమిలి ఎన్నికల ప్రతిపాదనలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది ? కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఎలా అమలు జరపాలో సూచించండి అంటూ ఒక కమిటీని వేసింది.రోగి కోరుకున్నదే వైద్యుడు ఇచ్చాడన్నట్లు చేసిన సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు, పార్టీలతో చర్చించి ఒక బిల్లును పెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదేమి ప్రజాస్వామ్యం ? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ? కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ 2023 సెప్టెంబరు రెండున తీసుకున్న నిర్ణయం ప్రకారం మాజీ రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఒక ఉన్నత స్థామి కమిటీని వేశారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకుగాను ఆ సమస్యను పరిశీలించి సిఫార్సులు చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని వేసినట్లు న్యాయశాఖ తీర్మానంలో ఉంది.దాని అర్ధం ఏమిటి ముందే తీసుకున్న నిర్ణయాన్ని ఎలా అమలు జరపాలో చెప్పమని కోరటమే కదా ? ప్రతిపక్షాలు తనను గేలి చేసినట్లు నరేంద్రమోడీ ఆరోపించారు. మరి ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం లేదా గేలిచేయటం కాదా ? ఇంత చేసిన తరువాత బిల్లు పెట్టటానికి పార్టీలను అడిగేదేమిటి ? అవి చెప్పేదేమిటి? ఇంతకు ముందే కమిటీకి చెప్పాయి కదా ! అందుకే అనేక పార్టీలు తమ వ్యతిరేకతను పునరుద్ఘాటించాయి. గోడమీది పిల్లులు ఇప్పటికీ నోరు విప్పటం లేదు. స్వాతంత్య్రం వచ్చిన తొలి సంవత్సరాల్లో జమిలి ఎన్నికలు జరిగాయి.రాజ్యాంగంలో ఎక్కడా వాటికి సంబంధించి నిర్దిష్ట ఆదేశమేమీ లేదు.అందుకే రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని కోవింద్‌ కమిటీ కూడా చెప్పింది.

‘‘ తరచూ ఎన్నికలు రాకుండా ఉంటే విధానాలను గొప్పగా కొనసాగించవచ్చు’’

2014 నుంచి కేంద్రంలో నిరాటంకంగా పాలన కొనసాగుతున్నది. ఒకే ప్రభుత్వం ఉంది. అది ప్రకటించిన మేకిన్‌ ఇండియా, మేక్‌ ఇండియా విధానాలు ఎందుకు విఫలమైనట్లు ? మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నట్లు ? దీనికోసం సిద్దాంత గ్రంధాలు రాయనక్కర లేదు. బిజెపి వారే చెబుతున్నట్లు రెండిరజన్ల పాలిత రాష్ట్రాలే ఎక్కువ. అక్కడ గానీ, ఇతర పార్టీల రాష్ట్రాలలో గానీ పదేండ్లలో ఎక్కడైనా మధ్యంతర ఎన్నికలు వచ్చి ఆటంకం కలిగిందా అంటే లేదు. అభివృద్ధి చెందిన దేశాల చరిత్రను చూసినపుడు అనేక అంశాలతో పాటు పరిశోధన మరియు అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డి)కి భారీ మొత్తాలలో ఖర్చు చేయటం తెలిసిందే.మోడీ పాలనలో ఆవు పేడ, మూత్రంలో బంగారం ఉందా మరొకటి ఉందా అన్న పరిశోధనల మీద చూపిన శ్రద్ద మరొకదాని మీద లేదు. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ ప్రధాన సలహాదారు అజయ్‌ కుమార్‌ సూద్‌ చెప్పిందేమిటి ? ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ 2047లో మనం ఎక్కడ ఉండాలని మీరు నన్ను అడిగితే సైన్సుకు సంబంధించి సర్వత్రా వినియోగిస్తున్న సూచికల ప్రకారం మనం ఎగువన మూడు లేదా ఐదవ స్థానంలో ఉండాలి. నిజానికి మనం మూడవ స్థానంలో ఉండాలి.ఒక దేశ శాస్త్రీయ పటిష్టను కొలిచేందుకు అన్ని చోట్లా వినియోగించే సూచికలను చూసినపుడు మనం చాలా వెనుకబడి ఉన్నాము, ప్రపంచ సగటు కంటే తక్కువ ’’ అన్నారు. ఈ సూచికలను మెరుగుపరచాలంటే ఆర్‌ ఆండ్‌ డి మీద పెట్టే మొత్తం ఖర్చు పెరగాలి, పరిశోధకలు, శాస్త్రీయ అంశాలలో మహిళలు, పేటెంట్లవంటివి పెరగాలని కూడా చెప్పారు. దరిద్రం ఏమిటంటే దేశంలో జరిగిన ప్రతి అనర్దానికి నెహ్రూ కారకుడని నిత్యం పారాయణం చేసే పెద్దలు పదేండ్లుగా పరిశోధన రంగ విధాన రూపకల్పన కూడా చేయలేకపోయారు. వేదాల్లోనే అన్నీ ఉన్నాయట అని చెప్పేవారిని నమ్ముకొని వాటిని వెలికితీసేందుకు దశాబ్ద కాలాన్ని వృధా చేశారని అనుకోవాలి. అనేక చర్చల తరువాత 2023లో వచ్చే ఐదేండ్ల కాలంలో 600 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తామని అందుకోసం జాతీయ పరిశోధనా ఫౌండేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అనేక మంది నిజమే కదా అని సంతోషించారు. పాఠ్య పుస్తకాల నుంచి డార్విన్‌ సిద్దాంతాన్ని, కొన్ని శాస్త్రీయ అంశాలను తొలగించారు. ఇదేదో అమాయకంగా చేశారని అనుకుంటే పొరపాటు. కరోనా నిరోధానికి గిన్నెలు మోగించాలని, కొవ్వొత్తులు వెలిగించాలని, గంగలో మునగాలని చెప్పిన పెద్దలకు ఇన్నేండ్ల తరువాతైనా జ్ఞానోదయం అయిందని చాలా మంది సరిపెట్టుకున్నారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు 202324 బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం ఎంతో తెలుసా ? ఏటా సగటున 120 కోట్ల డాలర్లు కేటాయించాల్సి ఉండగా కేవలం 3.09 కోట్ల డాలర్లు మాత్రమే. దశాబ్దాల తరబడి విధానాలను రూపొందించలేకపోవటమే కాదు, దానికి తగిన కేటాయింపులూ లేవు.1990దశకంలో జిడిపిలో 0.8శాతం ఉండగా 2023నాటికి 0.65శాతానికి తగ్గాయి. కబుర్లు మాత్రం రెండుశాతం ఉండాలని చెబుతారు.మూడు దశాబ్దాల క్రితం భారత్‌చైనా కేటాయింపులు దాదాపు సమంగా ఉన్నాయి. ఇప్పుడు చైనా 2.43శాతం ఖర్చు చేస్తోంది. ప్రపంచంలో తొలి అగ్రశ్రేణి వంద విశ్వవిద్యాలయాలు, సంస్థలలో చైనా ఏడిరటిని కలిగి ఉండగా మనదేశంలోని సంస్థలు కొన్ని 200400 మధ్య రాంకుల్లో ఉన్నాయి.మంత్రాలకు చింతకాయలు రాల్తాయా లేదా అని కళ్లలో వత్తులు వేసుకొని మరీ చూసే మన పాలకులు మాత్రం 2047నాటికి వికసిత భారత్‌కు జమిలి ఎన్నికలే జిందాతిలిస్మాత్‌ అంటే జనం చెవుల్లో కమలం పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు.


రాజ్యాంగం ఆమోదించిన ఆదేశిక సూత్రాలను అమలు జరిపేందుకు మాత్రం ముందుకు రారు.జమిలి ఎన్నికల మీద ఏకాభిప్రాయం రాదని తేలిపోయింది.దాన్ని పక్కన పెట్టాల్సిందిపోయి వ్యతిరేకించేవారి మీద రాజకీయదాడి చేసేందుకు పూనుకోవటం అంటే దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించే ఎత్తుగడతప్ప మరొకటి కాదు.1952 నుంచి 1967వరకు లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అప్పుడేమీ దేశం గంతులు వేస్తూ అభివృద్ధి చెందిన దాఖలాలేమీ లేవు. విదేశీ చెల్లింపుల సంక్షోభం, రూపాయి విలువ తగ్గింపు, ఐఎంఎఫ్‌రుణం, ధరల పెరుగుదల తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ఓటమి, కాంగ్రెస్‌లో చీలికతో 1971లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వాల పతనం వంటి పరిణామాలన్నీ జరిగాయి.జస్టిస్‌ బిపి జీవన్‌ రెడ్డి నాయకత్వంలోని లా కమిషన్‌ 1999`2000లో ఖర్చు తగ్గింపు, పాలన మెరుగుదులకు జమిలి ఎన్నికల గురించి పరిశీలించాలని చెప్పింది తప్ప అభివృద్ధికి ముడిపెట్టలేదు. ఇంత పెద్ద దేశానికి ఓటర్లకు, ఓట్ల పెట్టెలకు రక్షణ లేని ఈ దేశంలో ఎన్నికల సమయంలో భద్రతా సిబ్బంది నియామకం,ఎన్నికల సిబ్బందికి అయ్యే ఖర్చు పెద్ద సమస్య కాదు. దాన్నే బూతద్దంలో చూపి ఆ కారణంగానే దేశం వృద్ధి చెందటం లేదంటున్నారు.నియంతలు పాలించిన అనేక దేశాల్లో దశాబ్దాల తరబడి ఒకేపాలన సాగింది. ఎలాంటి ఇబ్బందులు లేవు. అయినా అవేవీ వృద్ధి చెందలేదు. జపాన్‌లో రెండవ ప్రపంచ యుద్దం తరువాత 26సార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగాయి, 38 మంది ప్రధానులు మారారు. అది గత కొన్ని దశాబ్దాలుగా పక్షవాత రోగి మాదిరి దాని అర్థిక వ్యవస్థ ఉంది. అభివృద్ధి నమూనాగా ఒకప్పుడు జపాన్ను చెప్పారు.దాన్ని చూసి నేర్చుకోవాలన్నారు. దాని పరిస్థితి ఏమిటి ? 2012లో జిడిపి ఆరులక్షల కోట్ల దాలర్లు దాటింది. ఇప్పుడు నాలుగు లక్షల కోట్లకు పడిపోయింది.


రామనాధ్‌ కోవింద్‌ కమిటీ దక్షిణాఫ్రికా,జర్మనీ, స్వీడెన్‌, ఇండోనేషియా,ఫిలిప్పీన్స్‌, జపాన్‌, బెల్జియం దేశాలలో జమిలి ఎన్నికల గురించి అధ్యయనం చేసింది. అక్కడ ఏకకాలంలో జరిగే వాటిని మాత్రమే తీసుకుంది తప్ప దామాషా ప్రాతిపదికన ప్రతి ఓటుకూ విలువ నిచ్చే నిజమైన ప్రజాస్వామిక పద్దతిని సిఫార్సు చేయకుండా వదలివేసింది.వాటిని గమనించినట్లు మాత్రం పేర్కొన్నది. ఎందుకుంటే సిఫార్సు చేస్తే బిజెపి ఆగ్రహం వస్తుంది గనుక.ప్రపంచం జమిలి ఎన్నికలు జరుగుతున్నవి మూడే మూడు దేశాలు అవి స్వీడన్‌, బెల్జియం, దక్షిణాఫ్రికా. ఈ మూడు చోట్లా దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయి.మరి ఈ విధానాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు. ఇటీవల ఎన్నికలు జరిగిన దక్షిణాఫ్రికాలో 64లక్షలు (40శాతం) ఓట్లు తెచ్చుకున్న పార్టీకి 200కు గాను 73 సీట్లు వస్తే కేవలం 29వేలు తెచ్చుకున్న పార్టీకి ఒక సీటు వచ్చింది.ప్రతి ఓటుకూ విలువ ఇచ్చే అసలు సిసలు ప్రజాస్వామ్యమంటే ఇది కదా ! కానీ మనదేశంలో జరుగుతున్నదేమిటి ? పార్టీలు తెచ్చుకున్న ఓట్లకు సీట్లకు పొంతన ఉంటోందా ? 2019లో బిజెపికి వచ్చిన ఓట్లు 37.36శాతమైతే సీట్లు 55.8శాతం, అదే 2024లో ఓట్లు 36.56శాతం కాగా సీట్లు 44శాతం వచ్చాయి. మైనారిటీ ఓట్లతో అధికారాన్ని పొందింది.


ఎన్నికల్లో డబ్బు ప్రమేయం ఎలా పెరిగిపోయిందో చూస్తున్నాము. ఇన్నేండ్ల తరువాత తమకు డబ్బు ఇస్తేనే ఓట్లు వేస్తామని కొన్ని చోట్ల, ఇతరులకు ఇచ్చిన మొత్తం తమకెందుకు ఇవ్వలేదని కొన్ని చోట్ల ఓటర్లు ధర్నా చేయటాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు అసలు ఊహించి ఉండరు. ఇలాంటి ధోరణులు పెరిగిన తరువాత డబ్బున్న పార్టీ ఓట్లను టోకుగా కొనుగోలు చేయటం తప్ప మరొకటి జరుగుతోందా ? రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిమితంగా పోటీ చేస్తున్న కమ్యూనిస్టులు తప్ప ఓటర్లకు డబ్బు పంచని పార్టీ ఏది ? దాని ప్రమేయం లేకుండా ఎందుకు చేయరు ? ఎన్నికల విధానాన్ని ఎందుకు సంస్కరించరు ? బిజెపికి ఇవేవీ తెలియనంత అమాయకంగా ఉందా ? ఎన్నికల కమిషన్‌ తొలి సాధారణ ఎన్నికల్లో ప్రతి ఓటుకు చేసిన ఖర్చు రు.0.60 కాగా 2014లో ఆ మొత్తం రు.46.40కి పెరిగింది. తొలి సాధారణ ఎన్నికల్లో ఒక అభ్యర్ధి రు.25వేలకు మించి ఖర్చు చేయకూడదని చెప్పిన ఎన్నికల కమిషన్‌ తాజాగా దాన్ని రు.75 నుంచి 95లక్షల వరకు పెట్టవచ్చని, అసెంబ్లీ అభ్యర్ధులు 28 నుంచి 40 లక్షల వరకు పెంచింది. లెక్కలో చూపకుండా చేసే ఖర్చు గురించి తెలిసిందే. వీటిని పరిగణనలోకి తీసుకొని సిఎంఎస్‌ అనే సంస్థ వేసిన లెక్క ప్రకారం 2019లో ఒక్కో ఓటు ఖర్చు రు.700 కాగా 2024 రు.1,400లకు పెరిగింది.1998లో ఎన్నికల ఖర్చు రు.9,000 కోట్లు కాగా అది 2024లో లక్షా 35వేల కోట్లకు పెరిగినట్లు అంచనా ? దీన్ని నివారించటానికి కమిటీ వేయాల్సిన అవసరం లేదా ?


జమిలి ఎన్నికలు జరపాలని బిజెపి చెబుతున్నది. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించిన ఘనత తమదే అని జబ్బలు చరుచుకుంటున్నది. కానీ ఆచరణలో ఎక్కడా ఆ స్ఫూర్తి కనిపించటం లేదు. రిజర్వేషన్ల బిల్లును ఆమోదించిన తరువాత జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కడా మూడోవంతు సీట్లకు ఆ పార్టీ మహిళలను నిలపలేదు. బిజెపి తాను పోటీ చేసిన 446 స్థానాల్లో కేవలం 69 మందిని 15.47శాతం మందినే నిలిపింది.బిజెడి ఒడిషాలో 33శాతం మందిని నిలిపింది. అసలు 150 స్థానాల్లో మహిళా అభ్యర్దులే లేరు. గత లోక్‌సభలో అన్ని పార్టీల తరఫున 78 మంది గెలిస్తే ఈసారి 73కు తగ్గారు. అదే విధంగా తాను తన మిత్ర పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసి లోక్‌సభతో పాటే ఎన్నికలు జరిపించి ఉంటే ఆదర్శంగా ఉండేది. ఆ పార్టీ చెబుతున్నట్లు దాని వలన కలిగే లాభాలేమిటో ఎందుకు చూపలేదు ? దానికి రాజ్యాంగసవరణలతో పని లేదు. ఏ పార్టీ కూడా వ్యతిరేకించేదేమీ లేదు కదా ! బిజెపికి చివరికి ఎన్నికల కమిషన్‌కూ చిత్తశుద్ది లేదు. గతంలో హర్యానా, మహారాష్ట్రలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఈ సారి బిజెపికి అనుకూలంగా ఉండేందుకు మహారాష్ట్ర ఎన్నికలను విడిగా జరుపుతున్నారు. రెండు రాష్ట్రాలూ బిజెపివేగనుక ఆరునెలల కంటే తక్కువే వ్యవధి ఉన్నందున వాటినైనా రద్దు చేసి లోక్‌సభతో పాటు ఎన్నికలు జరపవచ్చు. అదే విధంగా ఎప్పుడో జరగాల్సిన కాశ్మీరు అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభతో పాటు ఎందుకు జరపలేదంటే సరైన సమాధానం లేదు.


జమిలి ఎన్నికలు మేలని 1999లోనే లా కమిషన్‌ అభిప్రాయపడిరది. దేశాభివృద్దికి ఇది సర్వరోగనివారణి జిందాతిలిస్మాత్‌ అనుకుంటే నాడు అధికారంలో ఉన్న వాజ్‌పాయి ఎందుకు చొరవ తీసుకోలేదు, పోనీ 2014లోనే గద్దె నెక్కిన నరేంద్రమోడీ వెంటనే దీన్ని ఎందుకు ముందుకు తేలేదు ? దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే తన పాలన వైఫల్య దిశగా పోతున్నదని అందరికంటే ముందుగా గ్రహించిన వ్యక్తి మోడీ. ప్రతి ఎన్నికలలోనూ పాతదాన్ని వదలి కొత్త నినాదాన్ని ముందుకు తేవటం తెలిసిందే. అధికారయంత్రాంగ సమయం, డబ్బు వృధాను అరికట్టటానికి ఒకేసారి ఎన్నికలని మరొక పాట పాడుతున్నారు.కోవింద్‌ కమిటీ చేసిన సూచనలలో ఏ కారణంతోనైనా ఒక ప్రభుత్వం పడిపోతే జరిగే ఎన్నికలు ఐదేండ్లలో మిగిలిన కాలానికి మాత్రమే అన్నది ఒకటి. సంక్షోభంతో ఐదేండ్లలో ఎన్నిసార్లు పతనమైతే అన్ని సార్లు జరుపుతారా ? జనాభా లెక్కలతో కలిపి బిసి కులగణన జరపాలని కోరితే దానికి బిజెపి ససేమిరా అంటున్నది.కావాలంటే రాష్ట్రాలు లెక్కించుకోవచ్చు అన్నది. అప్పుడు సిబ్బంది సమయం, డబ్బుదండగకాదా ? జమిలి ఎన్నికల వాదన దీనికి ఎందుకు వర్తించదు ? జమిలి ఎన్నికల చర్చ జరుగుతుండగానే దాని స్ఫూర్తిని దెబ్బతీసేదిగా కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ఒకేసారి జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలను ఈసారి విడదీసింది. మరోవైపు జమిలిని వ్యతిరేకించేపార్టీలకు నీతులు చెబుతున్నారు. ? పదేండ్ల మోడీ విఫల పాలన మీద జనం దృష్టిని మళ్లించేందుకు తప్ప జమిలి ఎన్నికలు మరొక మేలుకు కాదన్నది స్పష్టం. ‘‘ మీరు కొంత కాలం జనాలందరినీ వెర్రి వారిగా చేయగలరు. కొంత మందిని కాలం చేయగలరు. అందరినీ ఎల్లకాలం వెర్రివారిని చేయలేరు.’’ అన్న అబ్రహాం లింకన్‌ మాట మోడీతో సహా ఎవరికైనా వర్తిస్తుంది. కాదంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికల చర్చ : మాజీ రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ కమిటీ ఏర్పాటు !

01 Friday Sep 2023

Posted by raomk in Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

'Ram Nath Kovind committee, BJP, Narendra Modi, Narendra Modi Failures, one nation one election


ఎం కోటేశ్వరరావు


సెప్టెంబరు 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకో పార్టీలకూ, జనానికి తెలవదు. ఆ ప్రకటనతో పాటు ఒకేసారి పార్లమెంట్‌-అసెంబ్లీల ఎన్నికలు జరిపే అంశం గురించి నివేదిక ఇవ్వాలని మాజీ రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. దీంతో జమిలి ఎన్నికల కోసం అవసరమైన బిల్లు, రాజ్యాంగ సవరణల కోసమే ఐదు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలన్న చర్చ దేశంలో ప్రారంభమైంది. ఊరకరారు మహాత్ములు అన్నట్లు నరేంద్రమోడీ నాయకత్వం ఏది చేసినా బిజెపికి, తాను, తన ఆశ్రితుల లబ్ది చూస్తారు అన్నది తెలిసిందే. గత శతాబ్దిలోనే ముందుకు వచ్చింది ఒకేసారి ఎన్నికల అంశం. ఇది సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యతిరేకమని అనేక పార్టీలు, నిపుణులు తిరస్కరించినప్పటికీ 2014 నుంచీ ఒకే దేశం-ఒకే ఎన్నికలంటూ వదలకుండా చెబుతున్నారు.విడివిడిగా ఎన్నికలు జరగటం వలన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం గనుక ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి చర్చించాలని వాదనలు చేస్తారు.


స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1967వరకు లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకేసారి జరిగాయి. కానీ ఆకాలంలో జరిగిందేమిటి ? దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటం, అది రాజకీయ సంక్షోభాలకు కారణం కావటం తెలిసిందే. దాని ఫలితమే 1969లో కొన్ని అసెంబ్లీల రద్దు, తరువాత ముందుగానే 1970లోపార్లమెంట్‌ రద్దు, 1971 ప్రారంభంలో ఎన్నికలు అన్న విషయం తెలిసిందే. ఒక దేశవృద్ది రేటు ఒకేసారి ఎన్నికలు జరపటం, ఎన్నికల ఖర్చు తగ్గింపు మీద, ఆ సమయంలో ప్రవర్తనా నియమావళి మీద ఆధారపడదు. చివరకు దేశం కోసం ధర్మం కోసం అనే పేరుతో ఈ వాదన అసలు ఎన్నికలే వద్దు అనేదాకా పోతుంది. ఆయా దేశాల జిడిపిలు, ఆదాయాలతో పోల్చితే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వాల ఖర్చు నామమాత్రమే. పార్టీలు పెట్టే ఖర్చే దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటోంది. దాని నివారణకు ఒకేసారి ఎన్నికలు పరిష్కారం కాదు.2019లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలు ఖర్చుచేసిన మొత్తాలతో సహా అరవైవేల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా వేశారు. ఇది పోటీచేసిన అభ్యర్ధులు ఇచ్చిన సమాచారం మేరకు అంచనా తప్ప, వాస్తవ ఖర్చు దాని కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. చీటికి మాటికి ఎన్నికలు జరిగితే అభివృద్ధి పధకాల అమలు నిలిచిపోతుందన్నది ఒక పెద్ద తప్పుడు ప్రచారం. ప్రవర్తనా నియమావళి అంటే ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టే కొత్త కార్యక్రమాల ప్రకటనలను నివారించటం తప్ప వాటితో నిమిత్తం లేకుండా ముందే ప్రారంభమై సాగే పధకాల అమలు నిలిపివేత ఉండదు. రైలు మార్గాల నిర్మాణం, విద్యుదీకరణ, ప్రభుత్వ గృహాలు, రోడ్ల నిర్మాణం, పెన్షన్ల చెల్లింపు, చౌకదుకాణాల్లో వస్తువుల సరఫరా వంటివి ఏవీ ఆగటం లేదే.గతంలో గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ గ్రామీణ ఉపాధి పధకం పనులకు విడుదల చేయాల్సిన నిధులకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది. అయితే ఆ విషయాన్ని మీడియాలో ఎక్కడా వెల్లడించకూడదని షరతు పెట్టింది.


కొన్నిదేశాల్లో ఒకేసారి జాతీయ, ప్రాంతీయ, స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ విధంగా చేసి ఖర్చును ఆదాచేయటం వల్ల అవి అభివృద్ధి సాధించినట్లు ఎక్కడా రుజువు లేదు. ఉదాహరణకు అమెరికాలో 1962-2019 మధ్య 57 ఏండ్లలో 26 సంవత్సరాలు తిరోగమన, 16 సంవత్సరాలు ఒక శాతంలోపు, ఐదు సంవత్సరాలు ఒకటి-రెండు శాతం మధ్య వృద్ది నమోదైంది.అమెరికాలో ఎన్నికల ప్రకటన నుంచి పోలింగ్‌ రోజువరకు మన దేశంలో మాదిరి ప్రవర్తనా నియమావళితో నిమిత్తం లేకుండా అనేక చర్యలు తీసుకోవటాన్ని చూశాము. అక్కడ రాష్ట్రానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఎన్నికల కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు, ప్రవర్తనా నియమావళి లేదు. అయినా అక్కడ వృద్ధి రేటు ఎక్కువ సంవత్సరాలు దిగజారింది. కొన్ని లాటిన్‌ అమెరికా, ఐరోపా దేశాలలో నిర్ణీత కాలం వరకు చట్ట సభలు రద్దు కావు, ప్రభుత్వాలు మారుతుంటాయి. అలాంటి దేశాలూ అభివృద్ది సమస్యలను, సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. మన దేశంలో కూడా ఇలా ఐదేండ్ల పాటు పార్లమెంటు, అసెంబ్లీలు రద్దు కాకుండా రాజ్యాంగ సవరణ చేస్తే ఇప్పుడున్న లోపభూయిష్టమైన పార్టీల ఫిరాయింపు చట్టం అవసరం కూడా ఉండదు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే అది కూలిపోయి కొత్త ప్రభుత్వం వస్తుంది. సభ్యత్వాలు రద్దు కావు, అంటే ప్రజాప్రతినిధులను ఎవరు ఎక్కువ మందిని సమీకరిస్తే అది డబ్బుద్వారా లేదా కండబలం ద్వారా కావచ్చు అధికారం వారికే ఉంటుంది. కొన్ని దేశాల్లో జరుగుతోంది అదే. ధనస్వామ్యం తప్ప ప్రజాస్వామ్య జాడ ఉండదు.


నిజానికి ఇప్పుడు కావాల్సింది ఒకే సారి ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్యం మరింతగా వర్దిల్లేవిధంగా, ధన ప్రలోభాలను గణనీయంగా తగ్గించి, ప్రజాభిప్రాయానికి చట్టసభల్లో తగు ప్రాతినిధ్యం లభించేందుకు ఉన్నంతలో మెరుగైన దామాషా పద్దతి ఎన్నికల సంస్కరణలు కావాలి. ప్రజాస్వామ్య కబుర్లు చెప్పే అమెరికాలో దేశాధ్యక్ష ఎన్నికల్లో 50రాష్ట్రాల్లో రెండు చోట్ల తప్ప మిగిలిన చోట్ల మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టరల్‌ కాలేజీ ప్రతినిధులను మొత్తంగా కేటాయిస్తారు. అందువలన దేశం మొత్తంలో ఓట్లు తక్కువ తెచ్చుకున్నా కొన్ని రాష్ట్రాలలో వచ్చిన మెజారిటీ ఆధారంగా ఎలక్టరల్‌ కాలేజీలో పైచేయి సాధించి 2016లో అధ్యక్ష పదవిని డోనాల్డ్‌ ట్రంప్‌ గెలిచారు. దామాషా ప్రాతినిధ్య విధానంలో మైనారిటీ ఓట్లకూ ప్రాతినిధ్యం ఉంటుంది. డబ్బుతో ఓట్లు కొన్నప్పటికీ గెలుస్తారో లేదో తెలియదు కనుక ఎవరూ డబ్బు పెట్టరు, నిజమైన ప్రజాభిప్రాయం వెల్లడి కావటానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు అధికారమే పరమావధిగా ఉన్న పార్టీలు, వ్యక్తులు డబ్బున్నవారికే పెద్దపీట వేస్తూ అధికారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అందుకే దామాషా ప్రాతినిధ్య విధానం గురించి వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలేవీ మాట్లాడవు.


తరచూ ఎన్నికల వలన ప్రభుత్వాలు దీర్ఘకాలిక విధానాలను రూపొందించే అవకాశాలకు ఆటంకం కలుగుతుందని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. పాలకులు మారినా లక్ష్యాల నిర్దేశం, పధకాలు కొనసాగేందుకు ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి అయోగ్‌ పేరుతో అజాగళ స్థనం వంటి అధికారాలు లేని సంస్థను ఏర్పాటు చేసిన పెద్దలు గద్దె మీద ఉండగా దీర్ఘకాలిక విధానాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం, జనాన్ని తప్పుదారి పట్టించే వ్యవహారమే.ఒకేసారి అన్నింటికీ ఎన్నికలు అనేది ప్రజాస్వామిక సూత్రాలకే విఘాతం. ఫెడరల్‌ సూత్రాలకు, రాజ్యాంగ మౌలిక స్వభావానికే విరుద్దం. ఏక వ్యక్తి ఆధిపత్యానికి దారి తీస్తుంది. ఫెడరల్‌ వ్యవస్థను కూలదోసి యూనిటరీకి మళ్లేందుకే బిజెపి ఈ ప్రతిపాదనను పదే పదే ముందుకు తెస్తున్నదనిపిస్తున్నది.1983లో తొలిసారి ఎన్నికల కమిషన్‌ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కన పెట్టింది. వాజ్‌పేయి హయాంలో 1999లో లా కమిషన్‌ ద్వారా ఈ ప్రతిపాదనన తెచ్చారు. తరువాత యుపిఏ పాలనలో దాని ప్రస్తావన లేదు. నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చి,బిజెపికి మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం వచ్చినపుడు 2016లో నీతి ఆయోగ్‌ ద్వారా ముందుకు తెచ్చారు.2018లో లా కమిషన్‌ ఐదు రాజ్యాంగ సవరణలు అవసరమని చెప్పింది. నరేంద్రమోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన వెంటనే మరోసారి చర్చకు తెచ్చారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో కూడా చర్చ సాగించారు. నిర్మాణాత్మక అవిశ్వాసం పేరుతో మరొక ప్రతిపాదనను లా కమిషన్‌ ద్వారా ముందుకు తెచ్చారు. ఒక ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టటానికి ముందు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సభ విశ్వాసం పొందాలని చెప్పారు.2022లో నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు తాము సిద్దంగా ఉన్నామని, అందుకు గాను రాజ్యాంగ సవరణ జరపాలని చెప్పారు. అదే ఏడాది డిసెంబరులో లా కమిషన్‌ అన్ని రాజకీయ పార్టీలు, మేథావులు, అధికారులు తమ సూచనలు పంపాలని కోరింది. ఇపుడు రామనాధ్‌ కోవింద్‌ నాయకత్వంలో ఒక కమిటీని వేసి మరోసారి మోడీ సర్కార్‌ ముందుకు తెచ్చింది.వివరాలు తెలియదు.


ఐడిఎఫ్‌సి అనే ఒక సంస్ధ 1999 నుంచి 2014వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమాచారాన్ని విశ్లేషించింది. ఒకేసారి జరిగితే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఓటర్లు ఒకే పార్టీని ఎంచుకొనేందుకు 77శాతం అవకాశాలుంటాయని పేర్కొన్నది. ఐఐఎం అహమ్మదాబాద్‌ డైరెక్టర్‌గా ఉన్న జగదీప్‌ ఛోకర్‌ జరిపిన విశ్లేషణ కూడా దీన్నే చెప్పింది. 1989 నుంచి ఒకేసారి జరిగిన లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 24 ఉదంతాలలో ప్రధాన రాజకీయ పార్టీలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో దాదాపు ఒకే విధమైన శాతాలలో ఓట్లు పొందాయి. కేవలం ఏడు సందర్భాలలో మాత్రమే ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఈ కారణంగానే గతంలో కాంగ్రెస్‌ మాదిరి ప్రస్తుతం దేశవ్యాపితంగా ఉన్న బిజెపి ఒకేసారి ఎన్నికలు జరిగితే తనకు ఉపయోగమని, ఉన్న అధికారాన్ని మరింతగా సుస్ధిరపరచుకోవచ్చని, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే అవకాశాలను తగ్గిస్తాయని భావిస్తున్నది. ఒకేసారి ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సింది ఉంది. అదే జరిగితే రాష్ట్రాలలో, కేంద్రంలో ఏ కారణాలతో అయినా ప్రభుత్వాలు కూలిపోతే నిర్ణీత వ్యవధి వరకు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంది. దాని అర్ధం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే దాని అధికారమే పరోక్షంగా ఉంటుంది. లేదా ముందే చెప్పుకున్నట్లు అవకాశవాదంతో ఏర్పడే కూటములకు అధికారాన్ని అప్పగించాల్సి వస్తుంది.


కరోనా ప్రభావం గురించి దేశమంతా ఆందోళన చెందుతోంటే దాన్ని పక్కన పెట్టి ప్రధాని కార్యాలయం స్దానిక సంస్ధలతో సహా అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా తయారీ సాధ్యా సాధ్యాల గురించి చర్చించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అలా చేయాలంటే ముందుగా ఆర్టికల్‌ 243కె, 243జడ్‌, ఏ లకు సవరణలు చేయాల్సి ఉంటుందని చర్చ జరిగింది.ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గినప్పటికీ అంతకు ముందున్న స్థితికి అభివృద్ది రేటు పెరగటం గురించి ఎవరికీ విశ్వాసం లేదు. దిగజారిన వృద్ది పునాది మీద పెరుగుదలను చూపి జనాన్ని తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నారు. దేశ అభివృద్ది, ప్రయోజనాల గురించి తమకు తప్ప మరొకరికి పట్టవని, దేశభక్తి ఇతరులకు లేనట్లుగా, దేశద్రోహులకు మద్దతు ఇస్తున్నట్లు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక పధకం ప్రకారం ప్రచారం చేస్తున్నారు. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే 101వసారి నిజంగా మారుతుందని సూత్రీకరణ చేసిన జర్మన్‌ నాజీ మంత్రి గోబెల్స్‌ తరహా ప్రచారం ఇది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఉన్న మెజారిటీ, దేన్నయినా బలపరిచే ఇతర పార్టీలు కూడా ఉన్నందున ఒక్క రోజులోనే కాశ్మీర్‌ రాష్ట్రాన్నే రద్దుచేసినట్లు ఒకేసారి ఎన్నికల కోసం జనాభిప్రాయాన్ని తోసిపుచ్చి రాజ్యాంగ సవరణలు చేయటం నరేంద్రమోడీకి ఒక పెద్ద సమస్య కాదు. అలాంటి పరిణామం జరిగినా ఆశ్చర్యం లేదు.రాజ్యాంగాన్ని మార్చకుండానే తూట్లు పొడిచేందుకు వీలైన అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఫెడరల్‌ అంటూనే అధ్యక్ష తరహా పాలనకు వీలు కల్పించేదే ఒకే సారి ఎన్నికలు అనే భావన.అలాంటి అధికార కేంద్రీకరణ ఉంటేనే సంస్కరణల వేగం పేరుతో దేశ సంపదలను ఆశ్రితులకు అప్పగించేందుకు, కార్మికుల, రైతాంగ హక్కులను హరించి వేసేందుకు అవకాశం ఉంటుంది. స్వేచ్చను హరించుతున్న పాత చట్టాలను రద్దు చేయాలన్నది ఒక ప్రజాస్వామిక డిమాండ్‌. దాన్ని అమలు చేసే పేరుతో మరింత కఠినమైన చట్టాలను రూపొందించేందుకు పూనుకున్నారు. కార్మిక చట్టాలను క్రోడీకరించే పేరుతో కార్మికుల హక్కులకు ఎసరు పెట్టారు. రైతాంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే యత్నాన్ని రైతాంగం విజయవంతంగా తిప్పికొట్టినప్పటికీ ఆ కత్తి మెడమీద వేలాడుతూనే ఉంది. ఇండియా కూటమి రూపంలో ముందుకు వచ్చిన పార్టీలు బిజెపి ముక్త భారత్‌కు పిలుపునిచ్చి ముందుకు పోతుండటంతో నరేంద్రమోడీ నాయకత్వానికి భయం పట్టుకుంది.అందుకే జనం దృష్టిని మళ్లించేందుకు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటారని అనేక మంది భావిస్తున్నారు. వాటిలో భాగంగానే పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పరుస్తున్నారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒకేసారి ఎన్నికలు- అసలు లక్ష్యం ఏమిటి ? సమర్ధనల బండారం !

20 Thursday Jun 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Uncategorized

≈ Leave a comment

Tags

Narendra Modi, one election, one nation, one nation one election

Image result for bjp motive behind one nation, one election call and it's nature

ఎం కోటేశ్వరరావు

ఒక దేశం, ఒకేసారి ఎన్నిక అ ంటే పార్లమెంట్‌, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు అనే ప్రతిపాదన గురించి నిర్ణీత గడువులోగా సూచనలు ఇచ్చే విధంగా త్వరలో ప్రధాని నరేంద్రమోడీ ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ 2019 జూన్‌ 19న జరిగిన అఖిల పక్ష సమావేశం అనంతరం ప్రకటించారు.నలభై పార్టీలకు ఆహ్వానం పంపగా 21 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనను సిపిఎం, సిపిఐ, ఎన్‌సిపి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, మజ్లిస్‌ పార్టీలు వ్యతిరేకించినట్లు వార్తలు రాగా ,అమలు ఎలా అని ప్రశ్నించారు తప్ప ఎవరూ ఆ భావనను వ్యతిరేకించలేదని రాజనాధ్‌ సింగ్‌ విలేకర్లతో చెప్పారు. ఈ అంశానికి సంబంధించి ప్రతిపాదన వెనుక వున్న వుద్దేశ్యాలేమిటి, వివిధ వాదనలు, వాటి బండారం గురించి చూద్దాం.భిన్న అభిప్రాయాలను వినటానికి మేము సిద్దంగా లేము, మా మనోభావాలు దెబ్బతింటాయి అనుకొనే వారు దీనిలో మిగతా భాగం చదవకుండా వదలి వేయటానికి స్వేచ్చ వుంది.

ముందుగా తెలుసుకోవాల్సింది ఈ ప్రతిపాదన సరికొత్తది కాదు, మూడున్నర దశాబ్దాలుగా ఏదో ఒక రూపంలో ముందుకు వస్తూ వెనక్కు పోతున్న అంశం.1983లో ఎన్నికల సంఘం దీని గురించి ప్రస్తావించింది.1999లో వాజ్‌పేయి సర్కార్‌ మరోసారి ముందుకు తెచ్చింది. తరువాత ఎల్‌కె అద్వానీ, ఇప్పుడు నరేంద్రమోడీ వంతుగా వచ్చింది. గతేడాది లా కమిషన్‌ సమర్పించిన నివేదికలో మిగతా అంశాలతో పాటు ప్రస్తుతం వున్న రాజ్యాంగ పరిధిలో జమిలి ఎన్నికలు జరపటానికి అవకాశం లేదని న్యాయశాఖకు నివేదించింది.అంతకు ముందు నీతి అయోగ్‌ కూడా దీని గురించి సూచనలు చేసింది. నరేంద్రమోడీ ఏర్పాటు చేయబోయే కమిటీ ఏమి చెబుతుందో చూద్దాం. బిజెపిని నడిపిస్తున్న సంఘపరివార్‌ తన అజెండాను మరింత ముందుకు తీసుకుపోవాలంటే ప్రస్తుతం వున్న రాజ్యాంగం అనువుగా లేదు. కొంత మేరకు ఆటంకంగా వుంది. అందువలన దాని లౌకిక మౌలిక స్వరూపాన్ని, స్వభావాన్ని సమూలంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలనే దుష్ట ఆలోచన వుంది. ఇప్పటికే ఆర్టికల్‌ 370కోసం రాజ్యాంగాన్ని మార్చాలనే దాని వైఖరి తెలిసిందే. అది జరగాలంటే నూతన రాజ్యాంగసభకు తప్ప పార్లమెంట్‌, సుప్రీం కోర్టులకు కూడా అలాంటి అవకాశం లేదనే అభిప్రాయంలను నిపుణులు ఇంతకు ముందే అభిప్రాయ పడ్డారు. రాజ్యాంగపరిషత్‌తో నిమిత్తం లేకుండా సదరు ఆర్టికల్‌ను సవరించాలంటే పార్లమెంట్‌ ఆమోదంతో పాటు జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఆమోదం కూడా అవసరం. ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఏ పార్టీ అధికారంలో వున్నప్పటికీ అలాంటి తీర్మానం శాసనసభలో ఆమోదం పొందే అవకాశం లేదు. అలా జరగాలంటే అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచటం, హిందువులు మెజారిటీగా వున్న ప్రాంతాలలో సీట్లను పెంచి, ముస్లింలు ఎక్కువగా వున్న చోట తగ్గించి మెజారిటీగా హిందువులు ఎన్నికయ్యేట్లు చూస్తేనే అలాంటి తీర్మానం ఆమోదం పొందే అవకాశం వుంది. కనుకనే బిజెపి ఆ రాష్ట్ర అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుదల, మార్పు గురించి ఆలోచనలు చేస్తున్నది. ప్రస్తుతం వున్న నిబంధనల ప్రకారం దేశంలో మిగతా చోట్ల ఐదు సంవత్సరాలు అయితే జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ వ్యవధి ఆరు సంవత్సరాలు. నరేంద్రమోడీ ముందుకు తెచ్చిన ఒకేసారి ఎన్నికలకు తొలి రాజ్యాంగపరమైన అడ్డంకి ఇక్కడే మొదలౌతుంది. దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటం పోయి కొత్త వివాదాలను ముందుకు తేవటం అంటే అసలు సమస్యలనుంచి జనం దృష్టిని మళ్లించే ఎత్తుగడ దీనిలో వుందన్నది స్పష్టం.

1967వరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. తరువాత దేశంలో ఎన్నికలు నిరంతరం జరుగుతున్న కారణంగా అభివృద్ధి కుంటుపడుతున్నది, పధకాలను అమలు జరపాలంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అడ్డువస్తున్నది. అందువలన ఒకేసారి ఎన్నికలు జరిపితే ఎన్నికల ఖర్చు తగ్గుతుంది. ఎన్నికలలో ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతుంది. భద్రతా సిబ్బంది మీద వత్తిడిని తగ్గించవచ్చు. ప్రధానంగా ముందుకు తెస్తున్న వాదనలు ఇవి. 1999లో లా కమిషన్‌ జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసింది. ఒక వేళ అవిశ్వాస తీర్మానం పెడితే, దానితో పాటు ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి విశ్వాస తీర్మానాన్ని కూడా పెట్టాలని సూచించింది. అంటే ఒక ప్రభుత్వం పడిపోయినా చట్టసభలను రద్దు చేయకుండా ఏదో ఒక ప్రభుత్వాన్ని ఎన్నికచేసి కొనసాగించాల్సిందే.

2015లో పార్లమెంటరీ కమిటీ నివేదికలో జమిలి ఎన్నికలను సిపార్సు చేశారు. తరువాత నరేంద్రమోడీ సూచనల మేరకు 2019, 2021లో రెండు దశల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను జరపాలని నీతి అయోగ్‌ సూచించింది. కానీ దాని మీద రాజకీయ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగిసి మోడీ మరింత మెజారిటీతో విజయం సాధించారు. దీంతో తిరిగి ఈ అంశాన్ని ముందుకు తెచ్చారు. గతంలో నీతి ఆయోగ్‌ ముందుకు తెచ్చిన సూత్రం ప్రకారం 2018,19లో జరగాల్సిన 12 అసెంబ్లీ ఎన్నికలను, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి జరపాలి. మిగిలిన అసెంబ్లీలకు 2021లో జరపాలి. అంటే దీని ప్రకారం ఐదు సంవత్సరాలలో ఒకసారికి బదులు రెండు సార్లు జరుగుతాయి. మరొక సూచన ప్రకారం 2024 నుంచి ఒకేసారి జరపాలి. దీనికి గాను రాజ్యాంగ సవరణలు చేయాలి.

అభివృద్ధికి ఎన్నికలకు లంకె !

ఇది ఒక అసంబద్దమైన వాదన.1952తొలిసాధారణ ఎన్నికల నుంచి 1967వరకు కేరళ వంటి ఒకటి రెండు చోట్ల తప్ప ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ కాలంలో అధికారంలో వున్న కాంగ్రెస్‌ 1967 ఎన్నికలలో లోక్‌సభలో మెజారిటీ తెచ్చుకున్నప్పటికీ తొలిసారిగా తొమ్మిది రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోయింది. నాడు మొదలైన రాజకీయ సంక్షోభం మరో రెండు సంవత్సరాలలో కాంగ్రెస్‌లో చీలికకు, పర్యవసానంగా లోక్‌సభను ఏడాది ముందుగానే రద్దు చేసి 1971లో ఎన్నికలకు పోవటం, ఆ సందర్భంగా ఇందిరా గాంధీ ఎన్నికల అక్రమాలపై కోర్టు తీర్పు, దాన్ని వమ్ము చేసేందుకు రాజ్యాంగసవరణ, అత్యవసర పరిస్ధితి వంటి పరిణామాలన్నీ తెలిసిందే. నిజానికి పదిహేను సంవత్సరాల పాటు రాజకీయ స్ధిరత్వం వున్నా దేశంలో జరిగిన అభివృద్ధి ఏమిటి ? నిరుద్యోగం, ధరల పెరుగుదల, చెల్లింపుల సమస్య తలెత్తటం, ప్రపంచబ్యాంకు పెత్తనాన్ని అంగీకరించటం ఈ కాలంలో జరిగినవే. జయప్రకాష్‌ నారాయణకేమీ పనిపాటా లేక లేదా అధికారం కోసం ఆందోళనలు నిర్వహించలేదు. తరువాత వాజ్‌పేయి పాలనా కాలంలో ప్రభుత్వ స్ధిరత్వానికి ఎలాంటి ముప్పు లేదు, దేశం వెలిగిపోతోందంటూ బిజెపి ప్రచారం చేసుకుంది, అయినా ఆ పార్టీ ఓడిపోయింది. గత అయిదు సంవత్సరాలలో కూడా రాజకీయంగా ఎలాంటి అస్ధిర పరిస్ధితి లేదు, బిజెపి ఏ బిల్లుపెడితే ఆ బిల్లు, ఏ నిర్ణయం తీసుకుంటే అది అమలు జరిగింది. అయినా 1971 నాటి స్ధాయికి నిరుద్యోగం పెరిగింది. ఇద్దరు రిజర్వుబ్యాంకు గవర్నర్లు, ఒక ప్రధాన ఆర్ధిక సలహాదారు అర్ధంతరంగా రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అభివృద్ధి అంకెల గారడీ చేసి లేని అభివృద్ధిని వున్నట్లు చూపారని మాజీ ప్రధాన ఆర్ధిక సలహాదారు చెబుతుంటే, అభివృద్ధి అంకెలే నిజమైతే దానికి అనుగుణ్యంగా వుపాధి ఎందుకు లేదని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు లేదు. ఇలాంటి వాటి మీద చర్చ జరిగితే తమకు నష్టం కనుక వేరే అంశాలను జనం ముందు పెడుతున్నారనే అభిప్రాయం వుంది.

పోనీ ప్రపంచంలో అనేక దేశాలలో పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీలు,చివరికి స్ధానిక సంస్ధలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న వుదంతాలు వున్నాయి. వాటి అభివృద్ధి సంగతేమిటి? ప్రతి ఏటా ఎక్కడో ఒకదగ్గర ఎన్నికలు జరుతున్నా, కేంద్రీకరణ పక్కదారి పడుతున్నా మన దేశ అభివృద్ధి ఏడుశాతంపైగా వుందని, చైనాను అధిగమించామని మన పాలకులు చెబుతున్నారు కదా ! అమెరికాలో అలాంటి పరిస్ధితి లేదు, ఐరోపా దేశాలలో లేదు, అనేక చోట్ల ప్రభుత్వాలు కూలిపోయినా, ఏదోఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి తప్ప చట్ట సభలు రద్దు కావటం లేదు. మరి అక్కడ ఒకటి నుంచి మూడుశాతంలోపే అభివృద్ధి రేటు ఎందుకు వుంటున్నట్లు? ధనిక దేశాలన్నీ సంక్షోభాలను ఎందుకు ఎదుర్కొంటున్నట్లు ? వాణిజ్య యుద్దాలకు ఎందుకు పాల్పడుతున్నట్లు ? అనేక దేశాలలో నియంతలు ఎన్నికలే లేకుండా , లేదూ జరిపినా తూతూ మంత్రంగా చేసి దశాబ్దాల తరబడి అధికారంలో పాతుకుపోయిన చోట్ల కూడా అభివృద్ధి ఆమడ దూరంలో వుండటాన్ని చూశాము. అభివృద్ధి అనుసరించే విధానాలను బట్టి తప్ప ఎన్నికలకు దానికి సంబంధం లేదు. ఎవరైనా వుంది అంటే పైన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.

ఖర్చు తగ్గింపు వాదన !

ఎన్నికల ఖర్చు తగ్గించాలనటంలో ఎలాంటి విబేధం లేదు, అయితే ఏ ఖర్చు అన్నది అసలు సమస్య. ఈ ఏడాది జరిగిన ఎన్నికల ఖర్చు 60వేల కోట్ల వరకు వుంటుందని, దానిలో ఎక్కువ భాగం బిజెపి చేసిందన్నది జగమెరిగిన సత్యం. దాన్ని తగ్గించటం ఎలా అన్నది చర్చిస్తే అర్ధం వుంటుంది. దాన్ని మరుగుపరచి అధికారిక ఖర్చు తగ్గింపు గురించి జనం దృష్టిని పక్కదారి మళ్లిస్తున్నారు. ఒక పోలింగ్‌ బూత్‌లోనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే కలసి వచ్చేది భద్రతా సిబ్బంది, కొంత మేర రవాణా ఖర్చు తప్ప మిగిలినవేవీ తగ్గవు. ఓటింగ్‌ యంత్రాలు, వాటి నిర్వహణకు ఎన్నికల సిబ్బందిలో తగ్గేదేమీ వుండదు. ఒక రాష్ట్రంలో ఒక రోజు ఎన్నికలు జరిపే పరిస్ధితి లేదు, రాను రాను ప్రతి ఎన్నికకూ భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాల్సి వస్తోంది. దానికి కారణం ఎన్నికలు ఎప్పుడూ జరగటం కాదు. శాంతిభద్రతల సమస్యలు, ఓట్ల రిగ్గింగు, గూండాయిజం వంటి ఆవాంఛనీయ ధోరణులు పెరగటం. అలాంటపుడు ఒకేసారి జరిగితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా? ఓట్ల కొనుగోలు, మద్యం, మాదక ద్రవ్యాలు, బహుమతుల వంటి ఇతర ప్రలోభాలను తగ్గించటం ఎలా అన్నది అసలు సమస్య. వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలన్నీ ఒకటో అరో తప్ప రిజర్వుడు నియోజకవర్గాలలో కూడా డబ్బు ఖర్చుపెట్టగల వారినే అభ్యర్ధులుగా నిలుపుతున్న తరువాత వారు గెలుపుకోసం డబ్బు ఖర్చు చేయకుండా ఎలా వుంటారు. ఎన్నికల తరువాత పెట్టిన పెట్టుబడికి వడ్డీతో సహా వసూలు చేసుకోవటమే కాదు, వచ్చే ఎన్నికలకు సైతం అవసరమైన నిధులను సంపాదించుకొనేందుకు చూస్తున్న స్ధితి.ఆంధ్రప్రదేశ్‌కు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఎవరైనా తక్కువ ఖర్చు చేశారా, ఓట్ల కొనుగోలు, అమ్మకాల ధరలేమైనా తగ్గాయా ? ఏ ఎన్నికలలో పోటీ చేసే వారు ఆ ఎన్నికలకే వుంటారు. ఎంపీ, ఎంఎల్‌ఏలుగా ఒకేసారి ఒకరే పోటీ చేయరు. ఈ ఎన్నికల బరిలోకి దిగిన వారు స్ధానిక సంస్దల వైపు రారు. ఎవరి స్ధాయిలో వారి కొనుగోళ్లు, ప్రలోభాలు వుంటాయని తెలంగాణాలో ఆరు నెలల వ్యవధిలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్‌, గ్రామీణ స్ధానిక సంస్ధ ఎన్నికలు రుజువు చేశాయి. కాళేశ్వరం పనులేమీ ఆగలేదు, ఆరు నెలలకు ముందు వుద్యోగఖాళీలనేమీ నింపలేదు, ఎన్నికలు జరిగిన ఆరునెలల్లో కూడా అదే పరిస్దితి. అందువలన అభివృద్ధి ఆగటం అంటే ఏమిటి? ఈ వాదన చివరకు అసలు ఎన్నికలే లేకపోతే అంతా సాఫీగా సాగుతుంది, ఓట్ల ఖర్చు వుండదు, అంతా అభివృద్ధికే మళ్లిస్తారన్న వాదనలనూ ముందుకు తెచ్చేవారు వుంటారు.

అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయి !

ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా అన్ని అభివృద్ధి పధకాలు ఆగిపోతాయి. ఇదొక పచ్చి అవాస్తవం. చట్టసభల పదవీ కాలం అరవై నెలలు అనుకుంటే ఎన్నికల నిర్వహణ జరిగేది గరిష్టంగా ఒక నెల, రెండు నెలలు. ఈ కాలంలో అభివృద్ధి ఆగిపోతుందా? అసలు అభివృద్ధి అంటే ఏమిటి? కేంద్రంలో లేదా రాష్ట్రాలలో ఎన్నికలు వస్తున్నాయంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాక ముందే పధకాలను ప్రకటిస్తున్నారు, నిబంధనావళి అమల్లోకి వచ్చిన తరువాత కొత్త పధకాలు ప్రకటించకూడదు, ఓటర్లను ప్రభావితం చేసే వాగ్దానాలను ఎన్నికల ప్రణాళిక రూపంలో ఎలాగూ చేయవచ్చు. అంతే తప్ప పాతవాటిని అమలు నిలిపివేయాలన్న నిబంధనలేవీ లేవు. సంక్షేమ పెన్షన్లు, వుద్యోగుల జీతభత్యాలు ఆగవు.మహా అయితే కరువు భత్యం వంటివి వాయిదా పడతాయి. రోజూ ఎన్నికలైతే అధికారులు పనులేమి చేస్తారు అన్నది మరొక వాదన. ఎన్నికలు లేనపుడు అధికారులు ముమ్మరంగా పనులు చేస్తున్నట్లయితే లక్షలాది ఫైళ్లు ఎందుకు గుట్టలుగా పేరుకుపోతున్నట్లు ? కోర్టులలో కేసుల విచారణకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఆటంకం కాదు, అయినా ఏండ్లతరబడి ఎందుకు సాగుతున్నట్లు ? మంత్రుల పని కుంటుపడుతుంది, ఇంతకంటే హాస్యాస్పద వాదన మరొకటి లేదు.

స్ధిరత్వం కావాలి !

ఎన్నికైన చట్ట సభలు స్ధిరంగా పని చేయాలి. రద్దు కాగూడదు. కొన్ని దేశాలలో ప్రభుత్వం పడిపోతే మరొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు తప్ప సభలను రద్దు చేసి మాటి మాటికి ఎన్నికలకు పోరు. అసలు ప్రభుత్వాలు పడిపోవాల్సిన అవసరం ఏమి వచ్చింది? అవినీతి, అక్రమాలకు పాల్పడితేనో, ప్రజావ్యతిరేక చర్యలకు జనం నిరసన తెలిపితేనో ఏదో ఒక బలమైన కారణం వుంటే తప్ప ప్రభుత్వాలు పతనం కావు. తూచ్‌ ఈ రోజు ఈ ఆట, రేపు ఇంకొక ఆట ఆడుకుందామని చెప్పటానికి ఎంపీలు, ఎంఎల్‌ఏలు ఏమైనా పసిపిల్లలా ! స్దిరత్వం పేరుతో ఒక ప్రభుత్వం కూలినా మనకేమీ ఢోకా లేదు మరొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం లెమ్మని ప్రజాప్రతినిధులు రెచ్చిపోయే పరిస్ధితిని జనం మీద రుద్దాలని చూస్తున్నారా ? తమకు వాగ్దానం చేసిన విధంగా లేదా తాము ఆశించిన విధంగా తమ ప్రజాప్రతినిధి పని చేయటం లేదని వెనక్కు పిలిపించాలని కోరే హక్కు ఓటర్లకు ఇస్తారా అంటే దాని ప్రస్తావనే లేదు.

Sitaram Yechury news

బిజెపి ఎందుకు జమిలి ఎన్నికలను కోరుతోంది ?

లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినపుడు ఓటర్లు ఏదో ఒక పార్టీనే ఎన్నుకున్నట్లు గత ఎన్నికల ఫలితాల విశ్లేషణ వుంది. అందువలన అది తమకు అనుకూలంగా వుంటుందని బిజెపి భావిస్తోంది. గతంలో ఆ పార్టీ కొన్ని చోట్ల బలంగా వున్నప్పటికీ దేశవ్యాపితంగా లేదు, ఇప్పుడు దేశవ్యాపితంగా పెద్ద పార్టీగా ఎదిగింది కనుక తమకు అనుకూలం కనుక ఎలాగైనా ఆ విధానాన్ని అనుసరించాలనే ఆతృత ఇప్పుడు దానిలో కనిపిస్తున్నది. 2014 ఎన్నికల్లో ఢిల్లీలో బిజెపికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఓటర్లు వెంటనే తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని చావు దెబ్బతీసి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా తీర్పు చెప్పారు. అలాంటి పరిస్ధితి రాకుండా చూడాలని కోరుకుంటోంది. గత ఎన్నికల్లో రెచ్చగొట్టిన మాదిరి మతభావాలు, విద్వేష ప్రచారం, వుపయోగించుకొనేందుకు పుల్వామా, కార్గిల్‌ వంటివి ప్రతి సంవత్సరం, ప్రతి సందర్భంలోనూ రావు. రెండవది విద్వేష ప్రచారాన్ని ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రంలో రెచ్చగొట్టటం ప్రారంభిస్తే అది ఎల్లకాలమూ, అన్నివేళలా ఆశించిన ఫలితాలు రావు. ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు, ఒకే పార్టీ, ఒకే నాయకుడు, ఒకే మతం, అది కూడా హిందూమతం ఇలా అజెండాను అమలు జరపవచ్చు. ప్రస్తుతం అన్ని పార్టీల కంటే అది ఆర్ధికంగా, ఇతరత్రా బలంగా వుంది కనుక ఒకేసారి ఎన్నికలు జరిపితే మిగతా వాటి కంటే ముందుండవచ్చు. ఇలా దాని కారణాలు దానికి వున్నాయి.

జమిలి ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసింది ఎవరు ?

పార్లమెంట్‌, అసెంబ్లీలకు ఒకేసారి జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసింది కాంగ్రెస్‌ పార్టీ అని బిజెపి నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దానికి గాను 1959లో కేరళలో కమ్యూనిస్టు నేత నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయటాన్ని చూపుతున్నారు. దానిలో కాదనాల్సిందేమీ లేదు. అయితే ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండోవైపు కూడా చూడాలి. నేటి బిజెపి పూర్వ రూపం జనసంఘం. నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేయటంలో కాంగ్రెస్‌,ఆర్‌ఎస్‌ఎస్‌ దాని రాజకీయ విభాగం జనసంఘం, కేరళలోని మెజారిటీ, మైనారిటీ మతశక్తులు, మీడియా, వీటన్నింటినీ సమన్వయ పరచిన అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ, అమెరికా రాయబారులు తమ వంతు పాత్రను పోషించారు. ఇదంతా విమోచన సమరం పేరుతో సాగించారు. దానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎత్తుగడలు ఎవరు రూపొందించారో అన్నింటినీ పాట్రిక్‌ మోయిన్‌ హన్‌ అక్షర బద్దం చేశారు. ఆ పధకంలో భాగంగా జనసంఘం నేత వాజ్‌పేయి కొట్టాయం వచ్చి మళయాల మనోరమ పత్రిక అధిపతి మామెన్‌ మాప్పిలై అధ్యక్షతన జరిగిన సభలో కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేశారు. 1959 జూలై 31న ఆర్టికల్‌ 356ను తొలిసారిగా వుపయోగించి నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆగస్టు ఒకటం తేదీన విజయ దినం పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘంతో సహా కమ్యూనిస్టు వ్యతిరేకులందరూ సంబరాలు చేసుకున్నారు.

ప్రభుత్వాన్ని రద్దు చేసిన తరువాత అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తూ పార్లమెంట్‌లో తీర్మానాన్ని ప్రవేశపెట్టినపుడు జనసంఘం నేతగా వాజ్‌పేయి బలపరుస్తూ ఏం మాట్లాడారో చూడండి.’ కేరళ జనం అభినందనలకు అర్హులు, భవిష్యత్‌లో కూడా వారు కమ్యూనిస్టు పార్టీకి తగిన జవాబు చెబుతారని ఆశిస్తున్నాను.నేను కాంగ్రెస్‌ను విమర్శించే వాడినే అయినప్పటికీ కాంగ్రెస్‌ నాయకత్వంలోని 13 రాష్ట్రాలలో ఏం జరిగిందో చెప్పటానికి నేను వెనుకాడను, ఎక్కడా సెల్‌ కోర్టులను ఏర్పాటు చేయలేదు(కమ్యూనిస్టు పార్టీ శాఖల కోర్టులని వాజ్‌పేయి భావం), పద్నాలుగు సంవత్సరాల యువకులు వారి ఇండ్ల నుంచి బయటకు రాకుండా నిషేధించలేదు. కమ్యూనిస్టులను వివాహం చేసుకోవాలని ఏ తలిదండ్రులూ తమ బిడ్డలకు చెప్పలేదు, సెల్‌ కోర్టులను దిక్కరించిన వారిని ఎక్కడా కత్తిపోట్లకు గురిచేయలేదు. ఈ మాటలు చెబుతూ నేను తీర్మానాన్ని బలపరుస్తున్నాను ‘ అన్నారు. తరువాత జనతా పార్టీలో విభాగమైన వాజ్‌పేయి తదితరులు అదే ఆర్టికల్‌ను వుపయోగించి కాంగ్రెస్‌ ప్రభుత్వాలను రద్దు చేయటం గురించి వేరే చెప్పనవసరం లేదు.

కేరళలో కమ్యూనిస్టుల గురించిన తప్పుడు ప్రచారం ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో తరచుగా కనిపిస్తున్నట్లుగా కమ్యూనిస్టు గ్రామాల్లో మరొక పార్టీని బతకనివ్వరని, వ్యతిరేకించేవారిని చంపివేస్తారనే ప్రచారం 1950దశకంలోనే ప్రారంభమైంది. వాజ్‌పేయి అంతటి వ్యక్తే దాన్ని పార్లమెంట్‌ వేదికగా కొనసాగించిన తరువాత ఆయన వారసులుగా చెప్పుకొనే అంతర్జాల పోకిరీల గురించి చెప్పాల్సిన పనిలేదు. లవ్‌ జీహాద్‌ పేరుతో ఇప్పుడు ముస్లింలపై తప్పుడు ప్రచారం చేసినట్లుగానే గతంలో కమ్యూనిస్టుల మీద కూడా ఇలాంటి నిందా ప్రచారం జరిగినట్లు వాజ్‌పేయి వుపన్యాసమే సాక్షి.

Image result for one nation, one election

రాజ్యాంగ నిబంధనలు, స్ఫూర్తికి వ్యతిరేకమైన ఈ ప్రతిపాదనలను వామపక్షాలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాయి. కాన్ని ప్రాంతీయ పార్టీలు వాటి పర్యవసానాలు, తెరవెనుక లక్ష్యాలను గుర్తించలేక సమర్దిస్తున్నాయి. ఎన్నికల్లో కండబలం, ధనబలం, అధికార దుర్వినియోగాన్ని గణనీయంగా అరికట్టేందుకు ఇప్పుడున్న మార్గం దామాషా పద్దతిలో ఎన్నికల నిర్వహణ చేపట్టటమే. ఎవరైనా ఫిరాయింపులను ప్రోత్సహించినా, పాల్పడినా వారి సభ్యత్వం రద్దయి, ఆ పార్టీ జాబితాలో వున్న ఇతరులతో ఆ స్ధానాన్ని పూర్తి చేసే విధంగా సంస్కరణలు చేపట్టాలి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఎంతమందికి అవకాశం వస్తుందో ముందుగా తెలియదు కనుక అభ్యర్ధులు డబ్బు ఖర్చు చేసే పరిస్ధితి వుండదు. ఎవరైనా వ్యక్తులుగా పోటీ చేయదలచుకుంటే, నియోజకవర్గాలు ఎలాగూ వుంటాయి కనుక వాటిలో పోటీ చేసి సత్తా వుంటే తగిన ఓట్లు తెచ్చుకొని ఎన్నిక కావచ్చు. అందువలన ఇలాంటి ఆచరణ సాధ్యమైన విధానాల గురించి చర్చిస్తే వుపయోగం. అందుకు బిజెపితో సహా ఎన్ని పార్టీలు సిద్ధం అన్నది ప్రశ్నార్దకం.ఎందుకంటే ప్రతి పార్టీ డబ్బు, రెచ్చగొట్టటం వంటి పద్దతుల్లో గెలవటం సులభం అనుకుంటున్నందున ప్రతి ఓటు తన ప్రతినిధిని చట్టసభలకు పంపే న్యాయం జరిగే ఇలాంటి ప్రజాస్వామ్యబద్దమైన సంస్కరణలకు అనుకూలంగా వున్న పార్టీలను ప్రోత్సహించటంతో పాటు పౌర సమాజమే ముందకు వచ్చి, అడ్డుపడుతున్న వారిని నిలదీయాల్సిన అవసరం వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d