• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Turkey

సిరియా పోరు ముగియలేదన్న ఐరాస – కొత్త కుట్రకు తెరతీసిన అమెరికా !

18 Wednesday Dec 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Abu Mohammed al-Jolani, CIA money, Donald trump, Hayat Tahrir al-Sham, iran, Netanyahu, RUSSIA, Syria’s war, Turkey

ఎం కోటేశ్వరరావు


ఐదుదశాబ్దాలకు పైగా సాగిన అసద్‌ కుటుంబ పాలన సిరియాలో ముగిసింది.అరబ్‌ సోషలిస్టు బాత్‌ పార్టీనేత, అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ పాలన 2000 సంవత్సరం జూలై 17 నుంచి 2024 డిసెంబరు 8వరకు సాగింది.అంతకు ముందు బషర్‌ తండ్రి హఫీస్‌ ఆల్‌ అసద్‌ 1971 మార్చి 14 నుంచి మరణించిన 2000 జూన్‌ పది వరకు అధికారంలో ఉన్నాడు. మధ్యప్రాచ్యంలో పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పూర్వపు సోవియట్‌ యూనియన్‌, తరువాత రష్యా పాలకులు సిరియాకు ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. నవంబరు చివరి వారం నుంచి హయత్‌ తహ్రరిర్‌ అల్‌ షామ్‌(హెచ్‌టిఎస్‌) సాయుధ సంస్థ, దానికి మద్దతు ఇచ్చిన వారు కలసి అసద్‌ మిలిటరీపై పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించి డిసెంబరు ఎనిమిదవ తేదీన రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకోవటం, అసద్‌ కుటుంబం రష్యాకు ప్రవాసం వెళ్లటంతో సిరియాలో నూతన అధ్యాయం మొదలైంది.సిరియా ఉగ్రవాదుల చేతికి చిక్కిన తరువాత తాను ప్రవాసం వెళ్లినట్లు మాజీ అధ్యక్షుడు అసాద్‌ చేసినట్లుగా చెబుతున్న ప్రకటనలో ఉంది.ముందుగా రూపొందించిన పథకం ప్రకారమే తాను తప్పుకున్నట్లు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదన్నాడు.సిరియా తమ తొత్తుల చేతికి చిక్కనందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ ఉక్రోషాన్ని వెళ్లగక్కాడు. అక్కడ తాము పోరాటం జరపలేదని తొలుత ప్రకటించిన ట్రంప్‌ సోమవారం నాడు మరోసారి స్పందించాడు. ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా టర్కీ పని ముగించిందని అంటూనే బలవంతంగా ఆక్రమించిందని వ్యాఖ్యానించాడు.మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడు సిరియాలో ఉన్న 900 మంది తమ సైనికులను ఉపసంహరించనున్నట్లు ప్రకటించిన ట్రంప్‌ తరువాత మాట మార్చాడు. సోమవారం నాడు అదే ప్రశ్నకు తరువాత చూద్దామన్నట్లుగా స్పందించాడు. ఇప్పుడు సిరియా భవిష్యత్‌ ఏమిటన్న ప్రశ్నకు ఎవరికీ ఏమీ తెలియదని, టర్కీ కీలక పాత్ర పోషించనుందని చెప్పాడు.


అసద్‌ ప్రభుత్వం పతనమైన తరువాత కూడా సిరియాలో ప్రత్యర్థివర్గాల మధ్య శతృత్వం కొనసాగుతున్న కారణంగా అక్కడ పోరు ఇంకా ముగియలేదని ఐరాస ప్రతినిధి గెయిర్‌ పెడర్సన్‌ చెప్పాడు. మంగళవారం నాడు భద్రతా మండలి సమావేవశంలో మాట్లాడుతూ పరిస్థితి పెద్ద ఉపద్రవానికి దారితీసేదిగా ఉందని చెప్పాడు. అమెరికా మద్దతుతో పని చేస్తున్న సిరియన్‌ డెమోక్రటిక్‌ ఫోర్స్‌(ఎస్‌డిఎఫ్‌) టర్కీ మద్దతు ఉన్న సిరియన్‌ నేషనల్‌ ఆర్మీ (ఎస్‌ఎన్‌ఏ) మధ్య జరుగుతున్న పోరును చూసిన తరువాత ఐరాస ప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన సయోధ్య గడువును పొడిగించినట్లు అమెరికా చెబుతోంది. మరోవైపు అమెరికా మద్దతుతో సిరియాలోని గోలన్‌ గుట్టలను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్‌ ఇప్పుడు ఐరాస ఆధ్వర్యంలో ఉన్న బఫర్‌జోన్‌ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకుంటామని, ఆ ప్రాంతంలో ఉన్న పౌరుల రక్షణకు ఆ ప్రాంతం అవసరమని సాకు చెబుతోంది. గతంలో కూడా అదే పేరుతో గోలన్‌ గుట్టలను కబ్జా చేసింది.

అసద్‌ స్థానంలో కొత్తగా అధికారానికి వచ్చిన వారు ఉగ్రవాదులా కాదా అంటే అవును అన్నది వాస్తవం.హెచ్‌టిఎస్‌ నేత అబూ మహమ్మద్‌ అల్‌ జొలానికి ఆ నేపధ్యం ఉంది, ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థలో పని చేశాడు. తాజాగా అధికారానికి రావటం కోసం అలాంటి వారితో చేతులు కలిపాడు. ఇదే సమయంలో ఆల్‌ఖైదాతో విడగొట్టుకోవటంతో పాటు జీహాదీలకు వ్యతిరేకంగా పనిచేసిన చరిత్ర కూడా ఉంది. అతగాడిని అమెరికా ఇప్పటికీ ఉగ్రవాదిగానే పరిగణిస్తున్నది, గతంలో అరెస్టు చేసి జైల్లో కూడా పెట్టింది. అయితే తాజాగా అమెరికన్లు అధికారంలో ఉన్నవారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అసద్‌ ప్రభుత్వం కూలిపోయినందుకు అక్కడి జనం ఆనందంతో ఉన్నారు. అది ఎంతకాలం ఉంటుంది ? రానున్న రోజుల్లో జొలానీ నాయకత్వంలోని ప్రభుత్వం ఎలా ఉంటుంది, అసలు స్థిరత్వం చేకూరుతుందా అనే ప్రశ్నలు తలెత్తాయి. గాజాలో ఇజ్రాయెల్‌ మారణకాండ ప్రారంభమై పద్నాలుగు నెలలు గడిచాయి. పాలస్తీనియన్లకు మద్దతుగా ఉన్న లెబనాన్‌లోని హిజబుల్లా సాయుధ సంస్థతో ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న తరువాత సిరియా పరిణామాలు జరిగాయి.2011లో ప్రారంభమైన అంతర్యుద్ధంతో సిరియన్లు అనేక విధాలుగా దెబ్బతిన్నారు, దేశం సర్వనాశనమైంది. కుక్కలు చింపిన విస్తరిలా సాయుధ ముఠాలు కొన్ని ప్రాంతాలను తమ అదుపులో ఉంచుకున్నాయి. ఆరులక్షల మంది వరకు పౌరులు, సాయుధులు, సైనికులు మరణించినట్లు అంచనా, 70లక్షల మంది అంతర్గతంగా నెలవులు తప్పగా మరో 70లక్షల మంది వరకు ఇరుగు పొరుగుదేశాలకు శరణార్ధులుగా వెళ్లారు. అంతర్యుద్ధం ముగిసినా సాధారణ జీవన పరిస్థితి ఎంతకాలానికి పునరుద్ధరణ అవుతుందన్నది పెద్ద ప్రశ్న.


కొత్త ప్రభుత్వం కొలువు తీరలేదు,వారు తమతో ఎలా ఉంటారో తెలియదు కనుక రానున్న రోజుల్లో సిరియాను దెబ్బతీయాలంటే దాని పాటవాన్ని దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఆయుధ ఫ్యాక్టరీలు,నౌకా దళం ఇతర మిలిటరీ వ్యవస్థలను నాశనం చేస్తున్నది. వాటిలో ఇరాన్‌, రష్యా సరఫరా చేసిన ఆయుధాలు, వాటి నిల్వకేంద్రాలు కూడా ఉన్నాయి. ఇదంతా అమెరికా కనుసన్నలలో జరుగుతున్నదని వేరే చెప్పనవసరం లేదు. గత కొద్ది నెలలుగా లెబనాన్‌పై దాడి అక్కడ పెద్ద సాయుధ శక్తిగా ఉన్న హిజబుల్లాపై దాడులు, దాని నేతల హత్యలో ఇజ్రాయెల్‌ పాత్ర గురించి తెలిసిందే. సిరియాకు మద్దతుగా అది ఇంకేమాత్రం దాడులు చేసే స్థితిలో లేదని చెబుతున్నారు. కొనసాగుతున్న ఉక్రెయిన్‌ సైనిక చర్య కారణంగా రష్యా, ఆంక్షల వలన ఇరాన్‌ మిలిటరీ సరఫరాలు కూడా తగ్గిపోయాయి. సిరియాలో ఉన్న తన నౌకా కేంద్రాన్ని రక్షించుకోవటంలోనే రష్యా మునిగి ఉంది. సిరియాలో అధికారాన్ని చేజిక్కించుకున్న హెచ్‌టిఎస్‌ సంస్థకు టర్కీ ప్రధాన మద్దతుదారుగా ఉంది. పరోక్షంగా ఇజ్రాయెల్‌ కూడా ఒక దశలో సాయం చేసిందని నిఘావర్గాలు చెబుతున్నాయి. అసద్‌ ప్రభుత్వం అణచివేతలకు పాల్పడిరదనే విమర్శలు ఉన్నప్పటికీ అది ఇస్లామిక్‌ మత ఛాందసవాదాన్ని ప్రోత్సహించిన దాఖలాలు లేవు. ముస్లింలలో అనేక తెగలు ఉన్నాయి. అవి ఒక్కో ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి. వాటిలో కర్దులు ఒకరు. ఇస్లామిక్‌ తీవ్రవాద ఐసిస్‌, ఆల్‌ఖైదా కూడా అసద్‌ను వ్యతిరేకించాయి. వీటితో పాటు అమెరికా తనకు అనుకూలమైన శక్తులకు భారీ ఎత్తున సాయం చేసింది. అవేవీ అసద్‌ ప్రభుత్వాన్ని కదిలించలేకపోయాయి. సిరియాలో చమురు నిల్వలున్న ప్రాంతాల మీద అమెరికా ఆధిపత్యం ఉంది. అక్కడ దాని సైనికులు కూడా ఉన్నారు. గతంలోనే సిరియాలోని గోలన్‌ గుట్టల ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ ఆక్రమించింది. కొంత ప్రాంతాన్ని ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో బఫర్‌ జోన్‌గా ఉంచారు. అక్కడికి ఎవరూ ప్రవేశించకూడదు. అయితే డిసెంబరు ఎనిమిది నుంచి ఇజ్రాయెల్‌ దళాలు అతిక్రమించి సిరియాలోకి చొచ్చుకుపోయాయి.
ఇప్పుడు సిరియా భవితవ్యం ఏమిటి అంటే ఎవరూ ఏమీ చెప్పలేని స్థితి.అమెరికా కుట్రలకు వ్యతిరేకంగా దశాబ్దాలపాటు జోక్యం చేసుకున్న రష్యా రానున్న రోజుల్లో ఎలాంటి పాత్ర పోషించేది తెలియదు.నూతన పాలకులు టర్కీ కనుసన్నలలో పని చేసే అవకాశం ఉంది. నాటోలో అది అమెరికా అనుయాయి.అదే సమయంలో కొన్ని అంశాలలో దానితో విబేధించి రష్యాతో సంబంధాలు కలిగి ఉంది. సిరియా పరిణామాల్లో రష్యా, అమెరికా రెండూ తమ ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నించాయి. దాన్ని అదుపులోకి తెచ్చుకొనేందుకు అమెరికా పెద్ద ఎత్తున తిరుగుబాటుదార్లను ప్రోత్సహించింది.ఇటీవల జరిగిన పరిణామాలను చూసినపుడు సిరియాలో ఇంక అమెరికా చేసేది ఏముంది అని కొందరు నిరుత్సాహాన్ని ప్రకటించారు. ప్రచ్చన్న యుద్ధం ముగిసిన 1990దశకం తరువాత ‘‘ఆపరేషన్‌ టింబర్‌ సైకామోర్‌ ’’ పేరుతో అమెరికా భారీ మొత్తాలను సిరియాలో కుమ్మరించిందని చెబుతున్నారు. ఉదారవాద తిరుగుబాటుదార్ల ముసుగులో 2013 నుంచి 2017వరకు నాలుగు సంవత్సరాలలో అమెరికా సిఐఏ ద్వారా వివిధ సంస్థలకు వంద కోట్ల డాలర్లకు పైగా అందచేసిందని అంచనా. ఆ తరువాత కూడా తరతమ తేడాలతో ఇదే విధంగా తిరుగుబాటుదార్లకు చేరుస్తున్నది. అసద్‌ వ్యతిరేకులకు మద్దతుతో పాటు సిరియాలోఅమెరికాను కూడా వ్యతిరేకించే శక్తులను దెబ్బతీసేందుకు చూసింది. అమెరికా మిలిటరీ కూడా 50 కోట్ల డాలర్లతో తిరుగుబాటుదార్లకు శిక్షణ, ఆయుధాలను అందచేసింది. ఇవన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. టర్కీ మద్దతు ఉన్న తిరుగుబాటుదార్లు డమాస్కస్‌ను పట్టుకుంటారని కూడా అమెరికా ఊహించినట్లు కనపడదు.లేదా నిస్సహాయంగా ఉండిపోయిందని చెప్పవచ్చు. అందుకే ట్రంప్‌ అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా మాట్లాడుతున్నాడు.
ఒబామా గనుక కాస్త ముందుగా జాగ్రత్తపడి ఉంటే అసద్‌ తొలగింపు మరింత వేగిరం, అమెరికా ప్రమేయం కూడా ఉండేదని రణోన్మాదులు కొందరు నిష్టూరాలాడుతున్నారు.అమెరికా మద్దతు ఇచ్చిన మిలిటెంట్‌ సంస్థలన్నీ అంతర్గత కుమ్ములాటలు, అవినీతి, గూండాయిజాలతో కొట్టుకు చచ్చాయని, ఆల్‌ఖైదాకు ఆయుధాలు అమ్ముకున్నట్లు విమర్శిస్తున్నారు. ఈ శక్తులు అసద్‌ మీద వత్తిడి తెచ్చి అంతర్జాతీయ సమాజంతో చర్చలకు నెడతాయని అమెరికా ఊహించినదానికి భిన్నంగా అసద్‌ బలమైన శక్తితో అనేక నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు సిరియాలో మాజీ అమెరికా రాయబారి రాబర్ట్‌ పోర్డ్‌ చెప్పాడు. సిఐఏ మద్దతు ఇచ్చిన తిరుగుబాటుదార్లు ఒక బాల ఖైదీ తలనరికే వీడియోను చూసిన డోనాల్డ్‌ ట్రంప్‌ సిరియా మీద ఆసక్తి కోల్పోయాడని, అమెరికా మిలిటరీ తరువాత సిరియాలోని కర్దులకు మద్దతు ఇవ్వటంపై కేంద్రీకరించిందని చెబుతున్నారు.అమెరికా నుంచి నిధులు పొందిన ఫ్రీ సిరియన్‌ ఆర్మీ వంటి సంస్థలు చివరకు టర్కీ అనుకూల సిరియన్‌ నేషనల్‌ ఆర్మీగా మారిపోయాయని, వారు కర్దులపై అత్యాచారాలు, దోపిడీలకు పాల్పడటంతో అదే అమెరికా చివరికి మానవహక్కులకు భంగం కలిగించారనే పేరుతో ఆంక్షలు విధించిందని, చివరికి నవంబరు చివరి వారంలో ఈ శక్తులు లూటీలకు పాల్పడుతుండటంతో తాజాగా అధికారానికి వచ్చిన హెచ్‌టిఎస్‌ దళాలు వారిని అణచివేసి అరెస్టు చేశాయని ఇలాంటి పనులు చేసిన తరువాత అమెరికాకు సిరియాలో ఇంక చేసేందుకు ఏమి మిగిలిందని ప్రశ్నిస్తున్నారు.ఈ విమర్శలన్నీ మరింత గట్టిగా వ్యవహరించలేదని, సిరియాను తమ అదుపులోకి తెచ్చుకోలేదని తప్ప పరాయి దేశంలో జోక్యం తప్పనే కోణం నుంచి కాదు. రాబోయే రోజుల్లో ఏమి జరిగినప్పటికీ అమెరికా డ్రైవర్‌ సీట్లో కూర్చొనే అవకాశం లేదని, చేసిన ఖర్చంతా వృధా అయిందని విమర్శిస్తున్నారు.
సిరియాలో అసద్‌ ప్రభుత్వాన్ని కూలదోయటంలో ఏకీభావంతో ఉన్న శక్తులన్నీ తరువాత అధికారాన్ని అలాగే పంచుకుంటాయని చెప్పలేకపోతున్నారు. లిబియాలో అమెరికాను వ్యతిరేకించిన గడాఫీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు నాటో కూటమి దేశాలన్నీ తిరుగుబాటు శక్తులను ప్రోత్సహించాయి, తీరా 2011లో గడాఫీ సర్కారు కూలిపోయిన తరువాత ఇప్పటి వరకు అధికారం కోసం కుమ్ములాడుకుంటూనే ఉన్నాయి. అదే స్థితి సిరియాలో తలెత్తవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికీ హెచ్‌టిఎస్‌ను ఉగ్రవాద సంస్థగా దాని నేత జొలానీ ఉగ్రవాదిగా వర్ణిస్తున్న అమెరికా రానున్న రోజుల్లో అతని నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడితే ఎలా వ్యవహరిస్తుందన్నది ప్రశ్న.అతనికీ అదే పరిస్థితి.ఈ సంస్థ రానున్న రోజుల్లో ఇరాన్‌తో చేతులు కలపవచ్చని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు అనుమానిస్తున్నాడు. అది గనుక తమపై దాడికి దిగితే ప్రతిస్పందన గట్టిగా ఉంటుందని, గత ప్రభుత్వానికి ఏమి జరిగిందో దీనికీ అంతే అని హెచ్చరించాడు.నూతన పాలకులతో రష్యా సంబంధాలు పెట్టుకోవచ్చని, ఇరాన్‌ కూడా అదే చేయవచ్చని కూడా పశ్చిమదేశాల పరిశీలకులు చెబుతున్నారు. సిరియాలో ఉన్న తమ సైన్యాన్ని వెనక్కు రప్పిస్తానని గతంలో డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పాడు. అయితే జనవరి 20న కొలువు తీరనున్న ట్రంప్‌ సర్కార్‌లో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న మార్కో రుబియో మాత్రం వేరుగా స్పందించాడు. రానున్న రోజుల్లో ఉగ్రవాద ముప్పు తలెత్తితే ఎదుర్కొనేందుకు అక్కడ తమ సైన్యం ఉండటం అవసరమని సెలవిచ్చాడు.సిరియాలో ఇప్పటికైతే పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

టర్కీకి అమెరికా వెన్నుపోటు !

16 Thursday Aug 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Donald trump, NATO allies, Recep Tayyip Erdoğan, Turkey, Turkish lira, U.S.

Image result for U.S. is stabbing Turkey in the back

ఎం కోటేశ్వరరావు

ఇనకులమున జనియించిన నృపతులు ఈ దారుణము సహించెదరా, విను వీధిని శ్రేణులుగా నిలిచి విడ్డూరమును చూచెదరా, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ, విధి విధానమును తప్పించుటకు ఎవరు సాహసించెదరూ.. అంటూ కొసరాజు రాసిన పాటకు స్వరాలు సమకూర్చి స్వయంగా గానం చేసిన ఘంటసాల గీతాన్ని లవకుశ సినిమాలో చూసి కన్నీళ్లు కార్చేవారు ఇప్పటికీ వున్నారంటే అతిశయోక్తి కాదు. అది ఇతిహాస గాధ. ప్రపంచవ్యాపితంగా ఎందరినో కష్టాల పాలు చేసే, తప్పించటానికి అవకాశం వున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పలు దేశాల మీద ప్రారంభించిన వాణిజ్య లేదా ఆర్ధిక యుద్దమనే దారుణాన్ని సహించాలా, ఎలా అడ్డుకోవాలన్నది ఇప్పుడు ప్రపంచం ముందున్న వాస్తవం. అమెరికాను మనకు మంచి స్నేహదేశంగా చిత్రించేందుకు నిక్కర్ల నుంచి పాంట్స్‌కు మారిన వారు నానా తంటాలు పడుతున్నారు. అలాంటి మిత్రదేశం దెబ్బకు తొలిసారిగా మన రూపాయి గురువారం వారం నాడు ఒక దశలో ఒక డాలరుకు మారకం విలువ 70.32కి పడిపోయి సరికొత్త రికార్డును సృష్టించింది. ఒక్క మన దేశమే కాదు ప్రపంచాన్నంతటినీ ట్రంప్‌ ప్రమాదపు అంచుల వరకు తీసుకుపోతున్నాడు. మరి ఈ దారుణాన్ని ఎవరు అడ్డుకోవాలి? జనం శ్రేణులుగా నిలిచి విడ్డూరంగా చూడాలా ?

తమ ఎగుమతులపై పన్ను విధించి కరెన్సీ లీరాను దెబ్బతీసిన అమెరికాపై ప్రతీకారంగా అమెరికా కార్లపై 120శాతం, మద్యంపై 160, పొగాకు వుత్పత్తులపై 60శాతానికి దిగుమతి పన్నును టర్కీ పెంచింది. మరోవైపు 15బిలియన్‌ డాలర్ల మేరకు టర్కీలో పెట్టుబడులు పెడతామని కతార్‌ ప్రకటించటంతో లీరా కొద్దిగా కోలుకుంది.ఏడాది క్రితం సౌదీ అరేబియా నాయకత్వంలో నాలుగు అరబ్‌ దేశాలు కతార్‌పై వాణిజ్య, దౌత్యపరమైన ఆంక్షలను విధించాన్ని టర్కీ వ్యతిరేకించింది. ఇపుడు కతార్‌ ఈ విధంగా బదులు తీర్చుకుంది. టర్కీ అవసరాలలో 15బిలియన్‌ డాలర్లు చిన్న మొత్తమే అయినప్పటికీ అమెరికాకు వ్యతిరేకంగా సాధించిన నైతిక విజయమిది.

దశాబ్దాల తరబడి ఆంక్షలతో క్యూబాను అతలాకుతలం చేసిన అమెరికా తాత్కాలికంగా వెనక్కు తగ్గింది. గత కొద్ది సంవత్సరాలుగా వామపక్ష పాలనలో వున్న వెనెజులా, నయా పెట్టుబడిదారీ ఏలుబడిలో వున్న రష్యా, మతశక్తుల ఏలుబడిలో వున్న ఇరాన్‌, పొరుగునే వున్న మిత్రదేశాలు మెక్సికో, కెనడా, సోషలిస్టు దేశమైన చైనాపై ఆర్ధిక, వాణిజ్య దాడులను జరుపుతున్నది. ఐరోపా యూనియన్‌తో తాత్కాలిక రాజీకుదుర్చుకుంది. పాతికేండ్ల క్రితం సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత తమకిక ఎదురులేదని ప్రకటించుకున్న అమెరికా ఇప్పుడు బస్తీమే సవాల్‌ అంటూ తన, పరబేధం లేకుండా ఎందుకు కత్తులు దూస్తున్నది? పర్యవసానాలేమిటి? తాజాగా మన రూపాయి రికార్డు పతనానికి కారణం నాటో కూటమిలో కీలక సభ్యదేశమైన టర్కీపై అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఆదేశాన్ని ఏ క్షణంలో అయినా పతనంలోకి నెట్టే అవకాశం వుందని విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా ఆర్ధిక, రాజకీయ, మిలిటరీ ఎత్తుగడులలో ఎంతో కీలకమైనది ఐరోపా కేంద్రంగా వున్న నాటో కూటమి.దానిని మరింతగా విస్తరించేందుకు ఒకవైపు పూనుకున్న అమెరికా మరోవైపు కీలకమైన భాగస్వామి టర్కీతో సంబంధాలను దెబ్బతీసేందుకు పూనుకుంది. తమను వెన్నుపోటు పొడిచేందుకు అమెరికా చూస్తున్నదని టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయిప్‌ ఎర్డోగన్‌ తాజా పరిణామాలపై వ్యాఖ్యానించాడు.ఆర్ధిక యుద్ధాల తూటాలు, ఫిరంగి గుండ్లు, క్షిపణులను ప్రయోగించినప్పటికీ తాము వెనక్కు తగ్గేది లేదని హెచ్చరించాడు. టర్కీ కరెన్సీ లీరా పతనమైన కారణంగానే తాము పన్నులను పెంచినట్లు ట్రంప్‌ తన చర్యను సమర్ధించుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు లీరా 41శాతం పతనమైంది. దీంతో టర్కీలో విదేశీ వస్తువుల ధరలు పెరిగిపోయి డిమాండ్‌ తగ్గిపోయింది. వీటిని సాకుగా చూపి గతవారంలో టర్కీ నుంచి దిగుమతి అయ్యే వుక్కుపై 50, అల్యూమినియంపై 20శాతం చొప్పున సుంకాన్ని విధించటంతో టర్కీ కరెన్సీ లీరా, స్టాక్‌ మార్కెట్‌ మరింతగా పతనమయ్యాయి, ద్రవ్యోల్బణం 15శాతానికి పెరిగింది. ఇవన్నీ ఆర్ధిక సంక్షోభానికి దారితీయవచ్చని భావిస్తున్నారు.దీనికి మతాధికారి ఆండ్రూ బ్రూసన్‌ను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌ను కూడా ట్రంప్‌ సర్కార్‌ జోడించింది. టర్కీ యూరేసియా దేశం.ఐరోపాలో ఎక్కువ భాగం వుండటంతో అక్కడి ఏకైక ముస్లిం దేశంగా పరిగణిస్తారు. ఐరోపాలోని గ్రీస్‌, బల్గేరియా, యూరేసియాలోని జార్జియా, ఆర్మీనియా, అజర్‌బైజాన్‌, ఆసియాలోని ఇరాన్‌, ఇరాక్‌, సిరియాలు సరిహద్దుగా వుంది. ఈ ప్రాంతంలో అమెరికా తన ప్రయోజనాలకు పెద్ద పీట వేయటంతో విధిలేక కొన్ని సార్లు అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించుతున్నది, తాజా వివాదానికి నేపధ్యమిదే. నిజానికి అమెరికా చేసుకొనే దిగుమతుల్లో టర్కీ నుంచి వుక్కు 4.2, అల్యూమినియం ఒకశాతం లోపే వున్నది. అందువలన వీటి కంటే రాజకీయకారణాలే ప్రస్తుతం వుభయ దేశాల మధ్య విబేధాల పెరుగులకు కారణాలుగా చెప్పవచ్చు.

2003లో జార్జి డబ్ల్యు బుష్‌ నాయకత్వంలో ఇరాక్‌పై అమెరికా దాడి చేసింది. అది మొదలు ఆ ప్రాంతంలో అమెరికా ప్రమేయంతో జరుగుతున్న పరిణామాలలో టర్కీకి సమస్యలు తలెత్తుతూనే వున్నాయి. టర్కీ, ఇరాన్‌, సిరియా సరిహద్దు ప్రాంతంలో కుర్దులు పెద్ద సంఖ్యలో వున్నారు. ఇజ్రాయెల్‌ మాదిరి తమకు ప్రత్యేకంగా కుర్దిస్దాన్‌ ఏర్పాటు చేయాలన్నది ఎప్పటి నుంచో వారి డిమాండ్లలో ఒకటి. అది జరిగితే ఆ ప్రాంత దేశాల స్వరూపమే మారిపోతుంది కనుక ఎవరూ అంగీకరించటం లేదు. పశ్చిమాసియా వివాదాలలో అమెరికన్లు కుర్దులకు మద్దతు తెలిపి వారిని పావులుగా వాడుకుంటున్నారు. సిరియాలో అసాద్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఐఎస్‌ తిరుగుబాటుదార్లను ఎదుర్కోవటంలో కుర్దులది ప్రధాన పాత్ర. వారికి అమెరికా మద్దతు ఇస్తున్నది. ఇరాక్‌, టర్కీలలోని కుర్దులు తమకు ప్రత్యేకం దేశం కావాలంటూ చేస్తున్న సాయుధ చర్యలను అక్కడి ప్రభుత్వాలు అణచివేస్తున్నాయి.

రెండు సంవత్సరాల క్రితం టర్కీలో ఒక విఫల తిరుగుబాటు జరిగింది. దానికి కుర్దిస్ధాన్‌ వర్కర్స్‌ పార్టీ, దానితో సంబంధాలున్న అమెరికా మతాధికారి ఆండ్రూ బ్రున్‌సన్‌ సంధానకర్తగా వున్నాడని భావించిన టర్కీ ప్రభుత్వం అతగాడిని అరెస్టు చేసి విడుదలకు తిరస్కరించింది. ప్రస్తుతం అధికారంలో వున్న ఎకెపి పార్టీ సహకారంతో రెండు దశాబ్దాల క్రితం టర్కీలో గులెన్‌ పేరుతో ఒక ఇస్లామిక్‌ సంస్ధ వునికిలోకి వచ్చింది. ప్రభుత్వ అండదండలతో దానితో సంబంధం వున్న అనేక మంది ప్రభుత్వ యంత్రాంగంలోకి చొరబడ్డారు. అది ఎంతవరకు వచ్చిందంటే పోలీసు, న్యాయవ్యవస్ధలోని గులెన్‌ సభ్యులు, ఆ సంస్ధను పెంచి పోషించిన ఎకెపి పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరు తలెత్తింది. చివరకు అధ్యక్షుడు ఎర్డోగన్‌పై తిరుగుబాటుకు ఆ సంస్ధ పురికొల్పింది. అయితే దానిని కఠినంగా అణచివేశారు. దానికి సహకరించాడంటూ అమెరికా మతాధికారిని అరెస్టు చేసి గులెన్‌ ఒక వుగ్రవాద సంస్ధ అని ప్రకటించింది.తిరుగుబాటును ప్రోత్సహించిన ఫతుల్లా గులెన్‌ అమెరికాలోని పెన్సిల్వేనియాలో వుంటున్నాడు. అతడిని తమకు అప్పగించాలన్న టర్కీ డిమాండ్‌ను అమెరికా తిరస్కరించింది. వుగ్రవాదం పట్ల అమెరికా మెతకగా వుందంటూ టర్కీ విమర్శించింది. అప్పటి నుంచి వుభయ దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు. ఒక దేశాన్ని లొంగదీసుకోవాలంటే దాని ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం అమెరికా ఆయుధాల్లో ఒకటి. టర్కీ విషయంలో అదే జరుగుతోందా ? ఇటీవలి కాలంలో జరిగిన మరికొన్ని పరిణామాలు అమెరికాకు మింగుడు పడటం లేదు.

అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వుపసంహరించుకున్న అమెరికా ఇరాన్‌పై విధించిన ఆంక్షలను తాము ఖాతరు చేసేది లేదని టర్కీ ప్రకటించింది. ఇటీవలి కాలంలో అమెరికా ప్రత్యర్ధి అయిన రష్యాతో టర్కీ సంబంధాలు పెరుగుతున్నాయి. క్షిపణులను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. అది అమెరికన్లను మరింత ఆగ్రహానికి గురిచేస్తున్నది. సిరియాలో రష్యా మద్దతు వున్న ప్రభుత్వానిది పైచేయిగా వుంది. రష్యా, ఇరాన్‌, టర్కీలే సిరియా పరిణామాలను నిర్దేశించేవని ఇప్పటికే తేలిపోయింది. అమెరికన్లకు అది పరాభవమే. చైనా చొరవతో ప్రారంభమైన సిల్క్‌ రోడ్‌తో పాటు చైనా, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం, తదితర చర్యలు సిరియా పునర్‌నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించటంతో పాటు ఇరాన్‌ స్ధిరపడటానికి దోహదం చేసేవిగా వున్నాయి. ఇది అమెరికన్లకు ఏమాత్రమూ అంగీకారం కాదు. సిరియా తదితర పరిణామాలలో అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌ నిలబడుతోంది. ఇరాన్‌తో వాణిజ్యాన్ని వదులుకొనేది లేదని చైనా స్పష్టం చేసింది. అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా తన వెసులుబాటు కోసం ఇరాన్‌ వంటి దేశాలతో సంబంధాల మెరుగుదలకు చమురురంగంలో పెట్టుబడుల వంటివాటితో పూనుకుంది.

ఒక మతాధికారిని అడ్డం పెట్టుకొని టర్కీని తమ కాళ్లముందు పడేసుకోవాలని చూస్తోందని ఎర్డోగన్‌ మండిపడ్డారు. అమెరికా గనుక తన పద్దతులను మార్చుకోనట్లయితే తాము కొత్త స్నేహితులు, కలసి వచ్చే వారికోసం చూడాల్సి వస్తుందని న్యూయార్క్‌టైమ్స్‌ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. గత ఆరుదశాబ్దాల కాలంలో అమెరికాతో కలసి తాము ఎలాపని చేసిందీ ఏకరువు పెట్టి అవన్నీ మరచిపోయి తమతో వ్యవహరిస్తున్నారని, తమ పౌరుల ఆందోళనను అర్ధం చేసుకోవటం లేదని పేర్కొన్నాడు. తమ దేశంలో జరిగిన తిరుగుబాటు మీద సంతృప్తికరంగా అమెరికా స్పందించలేదని, తిరుగుబాటకు కారకుడైన వ్యక్తిని తమకు అప్పగించలేదని పేర్కొన్నాడు. ఒక మతాధికారి కోసం మీరు నాటోలోని మీ వ్యూహాత్మక భాగస్వామిని మార్చేందుకు చూస్తున్నారు, బెదిరింపులతో మా దేశాన్ని మీదారికి తెచ్చుకోలేరు, మీకు డాలర్లు వుంటే మాకు అల్లా వున్నాడు, మేము స్వాతంత్య్రంతో పోరాడతాము అని హెచ్చరించాడు.అమెరికా స్వయంగా వుగ్రవాద గ్రూపుగా ప్రకటించిన సిరియా మద్దతు వున్న పికెకె సంస్ధకు అమెరికా ఐదువేల ట్రక్కులు, రెండువేల విమానాల ద్వారా ఆయుధాలను అందచేసిందని, ఆ సంస్ధ చేతిలో 1984 నుంచీ వేలాది మంది తమ పౌరులు మరణించారని పేర్కొన్నాడు. అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించిన నేపధ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఎర్డోగన్‌ ఫోన్లో సంభాషించాడు.

టర్కీ పాలకుల విషయానికి వస్తే అమెరికా అనుచిత కార్యకలాపాలన్నింటిలో భాగస్వాములయ్యారు.దేశంలో భిన్నాభిప్రాయాన్ని అణచివేయటంలో పేరు మోశారు. వ్యూహాత్మక స్ధానంలో వున్న కారణంగా అమెరికా, ఇతర పశ్చిమ ఐరోపా ధనిక దేశాల మాదిరి ప్రాంతీయ పరిణామాలలో పాత్రవహించాలని సహజంగానే కోరుకుంటారు. అమెరికా బలంగా వున్నపుడు ఎర్డోగన్‌ వంటి వారు ఎలా తలొగ్గుతారో బలహీనపడినపుడు దాని నుంచి లబ్ది పొందేందుకు కూడా అదే మాదిరి తలెత్తుతారు. టర్కీ తీరుతెన్నులు ఇప్పుడు అలాగే వున్నాయి. ఇప్పుడున్న స్ధితిలో మరో అధికార కేంద్రం పెరగటాన్ని అమెరికా అంగీకరించదు. టర్కీ నాటో సభ్యురాలు, రష్యా ఆ కూటమికి ప్రధమ శత్రువు, తోటి సభ్యురాలిపై అమెరికా కత్తి గట్టింది. సిరియాకు రష్యా పూర్తి మద్దతు ఇస్తున్నది. సిరియాపై గతంలో ఐఎస్‌ తీవ్రవాదులు దాడి చేసేందుకు టర్కీ ప్రాంతాన్ని అమెరికా వుపయోగించుకుంది. ఇప్పుడు మారిన పరిస్ధితులలో ఐఎస్‌ తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు టర్కీలోని వైమానిక స్ధావరాన్ని నాటో వినియోగిస్తున్నది. అమెరికా తమపై కత్తి కట్టింది కనుక దాన్ని మూసివేయాలని కొందరు వత్తిడి తెస్తున్నారు. టర్కీ దిగుమతి చేసుకొనే చమురులో సగం ఇరాన్‌ నుంచే వస్తోంది. అమెరికా ఆంక్షలను టర్కీ తిరస్కరించింది. నాటో సభ్యురాలైనప్పటికీ రష్యా నుంచి టర్కీ క్షిపణులను కొనుగోలు చేస్తున్నది. ఇవన్నీ ఒక సంక్లిష్ట పరిస్ధితికి నిదర్శనం.ఐరోపా యూనియన్‌ తక్షణమే అమెరికాతో ఘర్షణకు దిగటానికి సిద్ధం కాదు కనుకనే పన్నుల విషయంలో తాత్కాలిక రాజీకి వచ్చింది. అమెరికాకు అనేక షరతులు విధించింది. ఐరోపా కార్పొరేట్ల ప్రయోజనాలకు దెబ్బతగలనంత వరకే ఈ రాజీ. అమెరికా వత్తిడికి తలొగ్గిన టర్కీ సర్కార్‌ మతాధికారి బ్రున్స్‌న్‌ను జైలు నుంచి గృహనిర్భంధానికి మార్చింది. తాజా వివాదంలో బ్రున్సన్‌ ఒక తురుపు ముక్క మాత్రమే. నల్ల సముద్రం, మధ్యప్రాచ్చం, పసిఫిక్‌ సముద్రాల మధ్య వున్న టర్కీ ప్రాధాన్యత గురించి అమెరికన్లకు తెలియదనుకోవటం పొరపాటు. అందువలన తెగేదాక లాగకపోవచ్చు. ఒకవేళ అదే జరిగితే ప్రపంచ రాజకీయాల పరిణామాలు మరో మలుపు తిరుగుతాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పార్లమెంటరీ, మీడియా కుట్రలతో ప్రభుత్వాల కూల్చివేత !

13 Tuesday Sep 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ 1 Comment

Tags

Brazil, elected governments, Honduras, parliamentary and media coup, Parliamentary coup, Prague, Turkey

Image result for parliamentary and media coup against elected governments

సత్య

     గత కొద్ది వారాలుగా వివిధ ఖండాలలోని కొన్ని దేశాలలో జరిగిన పరిణామాలను పరిశీలించినపుడు పార్లమెంటరీ వ్యవస్ధలు, మీడియా సంస్ధలు, వ్యక్తుల పాత్రలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. పార్లమెంటరీ వ్యవస్థలు పరిహాసం పాలౌతున్నాయి, కుట్రలకు నిలయాలుగా మారుతున్నాయి. మీడియా ‘స్వతంత్ర’ సూచిక వేగంగా పడిపోతున్నది. ఏదో ఒక పక్షాన చేరి తారసిల్లటానికే యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయి. చాలా కాలంగా కప్పుకున్న మేకతోళ్లను తీసి అవతల పడవేస్తున్నాయి. అందుకే గతంలో పత్రికలు పెట్టుబడిదారులకు పుట్టిన విష పుత్రికలు అని వర్ణించినపుడు విపరీత వ్యాఖ్యానంగా భావించిన వారు మీడియా పోకడలను చూసి ఇప్పుడు నిజమే అన్న నిర్ధారణలకు వస్తున్నారు. వర్గ సమాజంలో అటో ఇటో చేరకుండా తటస్థంగా వుండటం అసాధ్యమని, అదొక ముసుగు మాత్రమే అని కమ్యూనిస్టులు ఎప్పుడో చెప్పారు. ఎవరైనా తాము అటూ ఇటూ కాదు అని చెప్పారంటే మార్పును వ్యతిరేకించి వున్న వ్యవస్ధను వున్నట్లుగా వుంచాలని చెప్పటమే. పర్యవసానం ఆ వ్యవస్ధను కాపాడాలని కోరుకొనే వారికి మద్దతు ఇవ్వటమే. ముందే కూసిన కోయిల కూతలను పరిగణనలోకి తీసుకోనట్లే ఆ కమ్యూనిస్టులు అన్నీ ఇలాగే చెబుతారు అని తోసిపుచ్చిన వారు ఇప్పుడేమంటారో తెలియదు. ఏమన్నా అనకున్నా వాస్తవాలను ఎల్లకాలం దాయటం కష్టం.

      జూలై 15న ఐరోపాలోని టర్కీలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు మిలిటరీలోని ఒక వర్గం విఫల తిరుగుబాటు చేసింది. కుట్రలో జర్నలిస్టులు కూడా వున్నట్లు తేలటంతో టర్కీ ప్రభుత్వం అనేక మంది ఇతర కుట్రదారులతో పాటు వంద మంది జర్నలిస్టులను కూడా అరెస్టు చేసింది. అమెరికాలో తిష్టవేసిన టర్కీ ముస్లిం ఇమాం ఫతుల్లా గులెన్‌ సిఐఏతో కలసి రూపొందించిన కుట్ర మేరకు సైనికాధికారులు ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించారన్న విషయం తెలిసిందే. కుట్రను విఫలం చేసిన తరువాత గులెన్‌కు మద్దతు ఇస్తున్న 130 మీడియా సంస్ధలు మూతపడ్డాయి. వందమంది వరకు జర్నలిస్టులను అరెస్టు చేశారు. కొందరు విదేశాలకు పారిపోయారు. ఆగస్టు నెలాఖరులో బ్రెజిల్‌ పార్లమెంట్‌ అభిశంసన తీర్మానం ద్వారా ఆ దేశపు వామపక్ష వర్కర్స్‌ పార్టీ (పిటి)నేత అయిన దిల్మా రౌసెఫ్‌ను దేశాధ్యక్ష పదవి నుంచి తొలగించారు. దీన్ని ప్రజాస్వామిక కుట్రగా కొంత మంది వర్ణించారు. కుట్రల జాబితాలోకి కొత్త పదం చేరింది. ఈ ప్రజాస్వామిక కుట్రలో స్వతంత్ర పాత్ర పోషిస్తున్నామని చెప్పుకొనే మీడియా ఒక ముఖ్యపాత్ర వహించిందన్న విమర్శలు కూడా గట్టిగానే వచ్చాయి. దీంతో ప్రభుత్వాల కూల్చివేత కుట్రదారుల్లో మీడియా అధిపతులు కూడా వుంటారని చేర్చాల్సి వుంది. ఈ వార్తలు చదువుతున్న సమయంలోనే బంగ్లాదేశ్‌లో వంగ బంధు ముజబుర్‌ రహ్మాన్‌ హత్య, ప్రభుత్వ కూల్చివేతలో భాగస్వామి అయ్యారనే నేరారోపణపై విచారణకు గురై వురి శిక్ష పడిన ఒక మీడియా అధిపతి మీర్‌ ఖాసిం అలీని 1971లో చేసిన నేరాలకు గాను సెప్టెంబరు మొదటి వారంలో వురి తీశారు. నేరం చేసి సమయంలో పాకిస్థాన్‌ అనుకూల విద్యార్ధి సంఘనేతగా వున్నప్పటికీ తరువాత కాలంలో ఒక పెద్ద వాణిజ్య, మీడియా అధిపతిగా ఎదిగాడు.

   అధికార రాజకీయాలు- ప్రభుత్వాలపై మీడియా అధిపతులు లేదా సంస్ధల ప్రమేయం లేదా పెత్తనం, ప్రభావం ఎలాంటిదో తెలుగువారికి చెప్పనవసరం లేదు. ఒక పార్టీకి వ్యతిరేకంగానో అనుకూలంగానో మాత్రమే కాదు, పార్టీ అంతర్గత విబేధాలలో కూడా జోక్యం చేసుకోవటాన్ని ఎన్‌టిరామారావుపై తెలుగుదేశంలో తిరుగుబాటు సందర్భంగా అందరూ చూశారు. కాంగ్రెస్‌ నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెండు పత్రికలపై బహిరంగంగానే విమర్శలు చేయగా తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ఒక పత్రిక, ఛానల్‌ విలేకర్లను తమ పార్టీ సమావేశాలకు రావద్దని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక నేత లేదా పార్టీని కొన్ని పత్రికలు ఎలా పెంచి పెద్ద చేయవచ్చో, నచ్చనపుడు సదరు నేతను వ్యతిరేకించి ఎలా బదనాం చేయవచ్చో, అదే పార్టీలో అంతకంటే ఎక్కువగా తమకు వుపయోగపడతారనుకున్నపుడు ఇతర నేతలు, పార్టీలను ఎలా ప్రోత్సహిస్తారో ప్రత్యక్షంగా చూశారు, చూస్తున్నారు, భవిష్యత్‌లో కూడా చూస్తారు. మీడియా ఏకపక్షంగా వ్యవహరించినా లేక ఒక పక్షం వహించిందని జనం భావించినా ఏం జరుగుతుందో కాశ్మీర్‌ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. కాశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలు, అక్కడి పరిస్థితిని జాతీయ మీడియా సంస్ధలు వక్రీకరిస్తున్నాయి లేదా వాస్తవాల ప్రాతిపదికన వార్తలను అందించటం లేదన్న విమర్శలు ఇటీవలికాలంలో పెరిగిపోయాయి. పార్లమెంటరీ అఖిలపక్ష బృందం పర్యటన సందర్భంగా కాశ్మీర్‌లోయలో కర్ప్యూను సడలించారు. ఆ సమయంలో ప్రెస్‌ అని స్టిక్కర్‌ పెట్టుకున్న వాహదారులపై అక్కడి నిరసనకారులు దాడులకు పాల్పడిన ఘటనలు జరిగాయి. కొంత మంది విలేకర్లు తాము జాతీయ మీడియాకు చెందినవారం కాదు, స్దానిక సంస్ధలలో పని చేస్తున్నామని చెప్పినా జర్నలిస్టులంటే జర్నలిస్టులే తప్పుడు రాతలు రాస్తారు, తప్పుడు దృశ్యాలను చూపుతారు అంటూ వరసపెట్టి దాడి చేసిన వుదంతాలు వున్నాయి. ఇది కాశ్మీర్‌కే పరిమితం కాదు, కొన్ని ఛానల్స్‌ లేదా పత్రికలకే పరిమితం కాబోదు. యాజమాన్యాల వైఖరి కారణంగా ఆ సంస్థలలో పని చేసే జర్నలిస్టులకు రాబోయే రోజుల్లో తలెత్తనున్న ముప్పును ఇవి సూచిస్తున్నాయి.

   టర్కీలో కుట్ర నుంచి తప్పించుకున్న ఎర్డోగన్‌కు గతంలో మద్దతు ఇచ్చిన శక్తులే వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ మాదిరి టర్కీ, ఇరాక్‌, సిరియా తదితర దేశాలను చీల్చి ఆ ప్రాంతంలో కుర్దిస్ధాన్‌ ఏర్పాటు చేయాలన్న పధకాన్ని అమలు జరిపేందుకు అమెరికా పూనుకుందన్న వార్తలతో రష్యన్లు ముందుగానే టర్కీని హెచ్చరించటంతో కుట్రను జయప్రదంగా తిప్పి కొట్టగలిగినట్లు చెబుతున్నారు. కుట్రకు పాల్పడిన వారిలో సైనికాధికారులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులను టర్కీ ప్రభుత్వం అరెస్టు చేసి రానున్న రోజుల్లో విచారణ జరిపి శిక్షలు విధించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. అందువలన మీడియా పాత్ర ఏమిటనే చర్చ రాబోయే రోజుల్లో పెద్దగా జరగటం అనివార్యం.

   ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోవటమా లేదా అన్న సమస్యపై జరిగిన ప్రజాభి ప్రాయసేకరణలో మీడియా ఎలా వ్యవహరించిందో చూశాము. చివరకు ప్రభుత్వ నిధులతో నడిచే బిబిసి కూడా ఒకవైపు మొగ్గింది. నిజానికి ఆ ప్రజాభిప్రాయ సేకరణలో వర్గ సమస్య లేదు. కార్పొరేట్‌ శక్తుల లాభనష్టాల విషయంలో తలెత్తిన విభేధాలతో కొన్ని సంస్ధలు విడిపోవటానికి అనుకూలిస్తే మరికొన్ని వ్యతిరేకించాయి. నవంబరు నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అధికార డెమోక్రటిక్‌ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీల అభ్యర్ధుల ఎన్నిక ప్రక్రియలో మీడియా సంస్ధలు ఎలా జోక్యం చేసుకున్నాయో, ఇప్పుడు అభ్యర్ధులు ఖరారైన తరువాత మొత్తంగా మీడియా రెండు శిబిరాలుగా చీలిపోవటాన్ని చూడవచ్చు. అసలు ఆ ఎన్నికలే కొంత మంది దృష్టిలో పెద్ద ప్రహసనం అయితే దానిలో మీడియా జోక్యం చేసుకొని తిమ్మినిబమ్మిని చేయటం, ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేయటం కనిపిస్తుంది. లాటిన్‌ అమెరికాలో జరిగిన పరిణామాలలో మీడియా పాత్రను మరింత అధ్యయనం చేయాల్సి వుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదులు లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండ దేశాలలో అనేక మంది నియంతలను రంగంలోకి తెచ్చి తమ కార్పొరేట్‌ అనుకూల వ్యవస్ధలను ఏర్పాటు చేశారు. లాటిన్‌ అమెరికాలో దాదాపు ప్రతి దేశం సైనిక తిరుగుబాట్లు, నియంతల పాలనలో మగ్గటమే గాక ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధల విధానాలైన నయావుదారవాద ప్రయోగశాలగా మార్చి వేశారు. ఈ క్రమాన్ని అక్కడి మీడియా మొత్తంగా బలపరచటమేగాక, నియంతలు, అభివృద్ధి నిరోధకులను సోపానాలుగా చేసుకొని ప్రతి దేశంలో మీడియా రంగంలో గుత్తాధిపతులు తయారయ్యారు. నీకిది నాకది అన్నట్లుగా నియంతలు, కార్పొరేట్లు, మీడియా అధిపతులు కుమ్మక్కై పంచుకున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారందరూ ఒకరి ప్రయోజనాలను ఒకరు కాపాడుకొనేందుకు ఏకం అవుతారని కూడా వేరే చెప్పనవసరం లేదు.

   నయావుదారవాద విధానాలు, నియంతలకు వ్యతిరేకంగా ప్రతి దేశంలోనూ సాయుధ, ప్రజా పోరాటాలు చెలరేగాయి. దాంతో నియంతలతో ఎల్లకాలం జనాన్ని అణచలేమని గ్రహించిన సామ్రాజ్యవాదం విధిలేని పరిస్థితుల్లో నియంతల స్ధానంలో ప్రజాస్వామ్య వ్యవస్ధల పునరుద్ధరణకు తలవంచక తప్పలేదు. దాంతో దాదాపు ప్రతి దేశంలోనూ ఎన్నికలు స్వేచ్చగా జరిగిన చోట నియంతలను వ్యతిరేకించిన, పోరాడిన శక్తులు అధికారానికి వచ్చాయి. వాటిలో కొన్ని చోట్ల వామపక్ష శక్తులున్నాయి. క్రమంగా అనేక దేశాలలో అవి ఎన్నికల విజయాలు సాధించటం, పౌరులకు వుపశమనం కలిగించే చర్యలు తీసుకొని ఒకటికి రెండు సార్లు వరుసగా అధికారానికి వస్తుండటం, రాజకీయంగా అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకోవటం, తమలో తాము సంఘటితం కావటానికి ప్రయత్నించటం వంటి పరిణామాలు అమెరికన్లకు నచ్చలేదు. దీంతో తిరిగి కుట్రలకు తెరలేపింది. గతంలో లేని విధంగా పార్లమెంటరీ కుట్ర, ప్రజాస్వామ్య ఖూనీలకు పాల్పడింది. వాటికి మీడియా సంస్ధలు వెన్నుదన్నుగా కత్తి చేయలేని పనిని కలంతో పూర్తి చేస్తున్నాయి.

Image result for parliamentary and media coup against elected manual zelaya

హొండురాస్‌ అధ్యక్షుడిని పక్కదేశం కోస్టారికాలో పడేశారు

     హొండూరాస్‌లో జోస్‌ మాన్యుయల్‌ జెలయా రోసాలెస్‌ దేశాధ్యక్షుడిగా 2006లో ఎన్నికయ్యాడు. మితవాద వేదిక నుంచి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ మిగతా లాటిన్‌ అమెరికా దేశాల ప్రభావంతో విదేశాంగ విధానంలో వెనెజులా, బ్రెజిల్‌,అర్జెంటీనాలతో కలసి అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకొని లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల కూటమిలో చేరాలని నిర్ణయించాడు. మితవాద కూటమి నుంచి వామపక్ష వైఖరి తీసుకోవటం హొండురాస్‌ మితవాద రాజకీయ శక్తులతో పాటు వాణిజ్య, పారిశ్రామిక, మీడియా శక్తులకు అసలు మింగుడు పడలేదు. విదేశాంగ విధానంతో పాటు అందరికీ వుచిత విద్య, చిన్న రైతులకు సబ్సిడీలు, వడ్డీరేటు తగ్గింపు, కనీసం వేతనం 80శాతం పెంపు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, వుద్యోగులకు సామాజిక భద్రత కల్పన, దారిద్య్ర నిర్మూలన వంటి చర్యలు తీసుకున్నారు. ప్రయివేటు మీడియా ప్రభుత్వ కార్యకలాపాలను దాదాపు బహిష్కరించింది.అసలేం జరుగుతోందో కూడా జనానికి తెలియకుండా అడ్డుకుంది. దాంతో రోజుకు రెండు గంటల పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి టీవీ, రేడియో ప్రసారం చేయాలనే వుత్తరువులను జెలయా జారీ చేశాడు. ప్రతిపక్షం దీనిని నిరంకుశ చర్యగా అభివర్ణించింది. దేశంలో హత్యల రేటు మూడు శాతం తగ్గిన సమయంలో పెరిగిపోయినట్లు మీడియా ప్రచారం చేసింది. జెలయాను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఆయనను తీవ్రంగా విమర్శించే ఒక జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దానిని అవకాశంగా తీసుకొని ఇంకే ముంది జెలయానే ఆ పని చేయించాడు, జర్నలిస్టులకు రక్షణ లేదనే ప్రచారం మొదలు పెట్టారు. 2010లో జరిగే ఎన్నికలలో అధ్యక్ష, పార్లమెంట్‌, స్దానిక సంస్ధలతో పాటు దేశ రాజ్యాంగ సవరణల గురించి కూడా ఓటింగ్‌ నిర్వహించాలని జెలయా 2009లో ప్రతిపాదించాడు. ఇంతకంటే ప్రజాస్వామిక ప్రతిపాదన మరొకటి వుండదు. కానీ జెలయా తన పదవీ కాలాన్ని పొడిగించుకొనేందుకే ఈ ప్రతిపాదన తెచ్చారని, ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ సవరణలు చేయరాదనే నిషేధాన్ని వుల్లంఘించినందున పదవికి అనర్హుడు అంటూ అభిశంశస ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.నిజానికి పార్లమెంట్‌లో మెజారిటీ వుంటే అధ్యక్షుడు రాజ్యాంగాన్ని సవరించటానికి వీలుంది. రెండవది అధ్యక్షపదవికి ఎన్నిక జరిపే సమయంలోనే రాజ్యాంగాన్ని సవరించటానికి జనం ఆమోదం కోసం ఓటింగ్‌ జరపాలని పెట్టినందున ఆ ఎన్నికలో ఓడిపోతే ఇంటికి పోవాలి, గెలిస్తే కొనసాగవచ్చు, రాజ్యాంగ సవరణ ద్వారా కొనసాగే సమస్యే అక్కడ తలెత్తలేదు.

    రాజ్యాంగ సవరణపై ప్రజాభిప్రాయ సేకరణతో సహా ప్రతిపోలింగ్‌ కేంద్రానికి నాలుగు బ్యాలట్‌ బాక్సులను తరలించేందుకు సహకరించాలని జెలయా మిలిటరీని కోరాడు. మిలిటరీ ప్రధాన అధికారి ధిక్కరించటంతో జెలయా అతడిని బర్తరఫ్‌ చేశాడు. మిలిటరీ అధికారికి మద్దతుగా రక్షణ మంత్రితో పాటు పలువురు మిలిటరీ అధికారులు రాజీనామా చేశారు. సైనికాధికారిని బర్తరఫ్‌ చేయటం రాజ్యాంగ విరుద్ధమంటూ పార్లమెంట్‌, సుప్రీం కోర్టు కూడా తీర్మానించాయి. అయితే బర్తరఫ్‌కు రెండు రోజుల ముందే కీలక ప్రాంతాలలో సైన్యాన్ని మోహరించటం, బర్తరఫ్‌కు ముందు రోజే ఆ పని చేసినట్లు వార్తలు వ్యాపించటాన్ని బట్టి కుట్రలో భాగంగానే ప్రధాన అధికారి ధిక్కరణ కూడా వుందని వెల్లడైంది. సైనిక దళాల ప్రధాన అధికారిని బర్తరఫ్‌ చేసిన మరుసటి రోజు జెలయాను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించటం, వెంటనే సైన్యం ఆపని చేసింది. నిదుర మంచం మీద వున్న జెలయాను అరెస్టు చేసి పక్కనే వున్న కోస్టారికాలో పడేసి వచ్చారు. హింసాకాండ చెలరేగే ప్రమాదం వుందనే కారణంగా అధ్యక్షుడిని బర్తరఫ్‌ చేసినట్లు సాకు చెప్పారు. తరువాత జెలయా రాజీనామా పత్రాన్ని ఆమోదిస్తున్నట్లు పార్లమెంట్‌ తీర్మానించింది. నిజానికి జెలయా ఎలాంటి రాజీనామా పత్రంపై సంతకం చేయలేదు. ఐక్యరాజ్యసమితో సహా అంతర్జాతీయ సంస్థలు అనేకం ఖండించాయి, చివరకు కుట్ర సూత్రధారి ఒబామా కూడా తొలగింపు చట్టబద్దం కాదని ప్రకటించాల్సి వచ్చింది.తరువాత జరిగిన ఎన్నికలలో అనేక అక్రమాలు జరిగాయి. తొలుత 60శాతం ఓట్లు పోలయ్యాయని, 55శాతం ఓట్లతో కొత్త అధ్యక్షుడు ఎన్నికైనట్లు ప్రకటించారు, ఆ తరువాత అసలు పోలైంది 49శాతమే అని పేర్కొన్నారు. ఈ అక్రమాన్ని మీడియా బయటపెట్టకపోగా సక్రమమే అని చిత్రించి మద్దతు ఇచ్చాంది.

Image result for parliamentary  coup against elected governments

పరాగ్వేలో పేదల పక్షాన పనిచేయటమే తప్పిదమైంది

      రోమన్‌ కాథలిక్‌ బిషప్‌గా పని చేసిన ఫెర్నాండో అరిమిందో ల్యూగో మెండెజ్‌ పరాగ్వే అధ్యక్షుడిగా 2008-12 సంవత్సరాలలో పని చేశారు. చిన్నతనంలో రోడ్లపై తినుబండారాలను విక్రయించిన ల్యూగో కుటుంబానికి నియంతలను ఎదిరించిన చరిత్ర వుంది. దాంతో ల్యూగో సాధారణ విద్యనభ్యసించి ఒక గ్రామీణ ప్రాంతంలో టీచర్‌గా పని చేశారు. ఆ సందర్భంగా వచ్చిన అనుభవంతో ఆయన క్రైస్తవ ఫాదర్‌గా మారారు. ల్యూగోను ఈక్వెడార్‌లో పనిచేయటానికి పంపారు. అక్కడ పని చేసిన ఐదు సంవత్సరాల కాలంలో పేదల విముక్తి సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్నారు. అది గమనించిన పరాగ్వే పోలీసులు 1982లో స్వదేశానికి తిరిగి వచ్చిన ల్యూగోను దేశం నుంచి వెలుపలికి పంపి వేయాలని చర్చి అధికారులపై వత్తిడి తెచ్చారు. దాంతో ఐదు సంవత్సరాల పాటు రోమ్‌లో చదువుకోసం పంపారు. 1994లో బిషప్‌గా బాధ్మతలు స్వీకరించారు. ఎన్నికలలో పోటీ చేయటానికి వీలుగా తనను మతాధికారి బాధ్యతల నుంచి విడుదల చేసి కొంత కాలం సెలవు ఇవ్వాలని 2005లో కోరారు. చర్చి నిరాకరించింది, తరువాత పోటీ చేసి గెలిచిన తరువాత సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు ఆయన భూ పోరాటాలను బలపరిచారు. అప్పటికే పేదల బిషప్పుగా పేరు తెచ్చుకున్న ల్యూగోను అంతం చేస్తామని బెదిరించినప్పటికీ లొంగలేదు. ఆయన తండ్రి నిరంకుశ పాలకులను ఎదిరించి 20 సార్లు జైలుకు వెళ్లటాన్ని ఆయన చూసి వున్నాడు. 2008లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.తాను వేతనం తీసుకోనని ప్రకటించాడు.తొలిసారిగా గిరిజన తెగల నుంచి ఒకరిని వారి వ్యవహారాల మంత్రిగా నియమించారు. ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న మాదిరి అవినీతి నిరోధం, భూ సంస్కరణల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు. పేదలకు ఇండ్ల నిర్మాణం, నగదు బదిలీ కార్యక్రమాలు చేపట్టారు.

    పేదలకు మద్దతు ఇచ్చి భూసంస్కరణలకు పూనుకున్న ల్యూగోను పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరిగింది. దానిలో భాగంగా భూ ఆక్రమణ చేసిన పేదలను తొలగించేందుకు పోలీసులు కాల్పులు జరిపి 17 మందిని బలిగొన్నారు.ఈ వుదంతం దేశంలో అభద్రతకు చిహ్నం అని ప్రచారం ప్రారంభించిన పార్లమెంట్‌ సభ్యులు ప్రజలకు భద్రత కల్పించాలంటే దేశాధ్యక్షుడిని తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. వారం రోజుల్లో పార్లమెంట్‌ వుభయ సభల్లో తీర్మానాలు చేసి తొలగించారు. వున్నత న్యాయ స్ధానం కూడా దానిని సమర్ధించింది. అక్కడి మీడియాకు దీనిలో ఎలాంటి తప్పు కనిపించలేదు.

   ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన బ్రెజిల్‌ వామపక్ష అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ ప్రజాస్వామ్య బద్దంగా పని చేయకపోవటమనే ఒక నేరాన్ని ఆపాదించి అభిశంసన ప్రక్రియ ద్వారా పదవి నుంచి తొలగించారు. ప్రపంచంలో, లాటిన్‌ అమెరికా పరిణామాలలో ఇదొక కొత్త అధ్యాయానికి నాంది.మిలిటరీ కుట్ర, మరొక కుట్ర గురించి చరిత్రలో వుందిగానీ ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్య, మీడియా కుట్ర ‘ తోడు కావటం ఈ పరిణామంలో గమనించాల్సిన అంశం. అధ్యక్షురాలిపై ఎలాంటి అవినీతి, అక్రమాల కేసులు లేవు. అయినప్పటికీ అక్కడి మీడియా ఆమెను అవినీతిపరురాలిగా చిత్రించి జనాన్ని నమ్మేట్లు చేసింది. అభిమానించిన జనమే అనుమానించేట్లు చేయటాన్ని చూసి శకుని సైతం సిగ్గు పడేట్లు, తనకు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదని తలపట్టుకునేట్లు చేసింది. ఎన్నికలను తొత్తడాన్ని చూశాము, ఎన్నికైన ప్రభుత్వాలను ఎంత సులభంగా కూలదోయవచ్చో చూస్తున్నాము. బ్రెజిల్‌ అధ్యక్షురాలిపై బాధ్యతా నిర్వహణలో వైఫల్యమనే నేరాన్ని ఆరోపించి పదవి నుంచి తొలగించటం ప్రజాస్వామ్యం, ప్రజాతీర్పును పరిహసించటమే. పార్లమెంట్‌ అనుమతి లేకుండా దిల్మా రౌసెఫ్‌ ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేశారన్నది ప్రధాన ఆరోపణ. గతంలో అనేక సందర్భాలలో అలా ఖర్చు చేయటం తరువాత పార్లమెంట్‌ ఆమోదం పొందటం అన్నది అన్ని చోట్లా జరిగినట్లే అక్కడా జరిగింది. అటువంటి పద్దతులను నివారించాలంటే అవసరమైన నిబంధనలను సవరించుకోవచ్చు, రాజ్యాంగ సవరణలు చేసుకోవచ్చు. అసలు లక్ష్యం వామపక్ష అధ్యక్షురాలిని పదవి నుంచి తొలగించటం కనుక ఏదో ఒక సాకుతో ఆపని చేశారు. దొంగే దొంగ అని అరచి నట్లుగా అనేక అవినీతి కేసులలో ఇరుక్కున్నవారే అధ్యక్షురాలిపై కుట్ర చేసి పార్లమెంట్‌, కోర్టులను వుపయోగించుకొని పదవి నుంచి తొలగించారు.ఈ క్రమం ప్రారంభమైనపుడే అనేక మంది అంతర్జాతీయ న్యాయ నిపుణులు అభిశంసనకు ఎలాంటి ఆధారమూ లేదని ప్రకటించారు. అయినా జరిగిపోయింది.పాండవ పక్షపాతి కృష్ణుడికి ముందుగా వచ్చిన ధుర్యోదనుడిని తప్పించుకోవటానికి ముందుగ వచ్చితీవు, మున్ముందుకు అర్జును జూచితి అన్నట్లుగా దిల్మా రౌసెఫ్‌కు వ్యతిరేకంగా ఓటు చేసిన వారందరూ దాదాపు ఏదో ఒక అవినీతి కుంభకోణం కేసులలో వున్నవారే అయినా మీడియాకు అదేమీ కనిపించలేదు.

  వామపక్ష శక్తులు శక్తివంతమైన మీడియాతో ప్రారంభం నుంచి సర్దుకు పోయేందుకు ప్రయత్నించాయి. దాంతో తొలి రోజుల్లో ఇష్టంలేని పెండ్లికి తలంబ్రాలు పోసినట్లుగా వున్న పత్రికలు అవకాశం దొరికనపుడల్లా వామపక్షాలపై ఒకరాయి విసురుతూ పని చేశాయి. లాటిన్‌ అమెరికాలోని కార్పొరేట్‌, అమెరికన్‌ సామ్రాజ్యవాదులు వామపక్ష శక్తులను అదికారం నుంచి తొలగించాలనుకున్నతరువాత మీడియా పూర్తిగా వాటితో చేతులు కలిపింది.మచ్చుకు బ్రెజిల్‌ మీడియా సంస్ధల నేపధ్యాన్ని చూస్తే అవి వామపక్షాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. లాటిన్‌ అమెరికాలోని మీడియా సంస్ధలన్నీ దాదాపు కుటుంబ సంస్థలే. బ్రెజిల్‌లోని రెడె గ్లోబో మీడియా సంస్ధ రాబర్ట్‌ మారినిహో కుటుంబం చేతుల్లో వుంది. 1980 దశకం నాటికే అధికారంలో వున్న మిలిటరీ నియంతల ప్రాపకంతో 75శాతం వీక్షకులు, చదువరులపై ఆధిపత్యం సాధించింది. నియంతల పాలన అంతరించిన తరువాత 1989లో జరిగిన తొలి ప్రత్యక్ష అధ్యక్ష ఎన్నికలో పిటి పార్టీ నేత లూలా డిసిల్వాను ఓడించిన ఫెర్నాండో కాలర్‌కు ఈ సంస్ధకు చెందిన టీవీ గ్లోబో బహిరంగంగా మద్దతు ఇచ్చింది. 1990దశకంలో కొత్త సంస్ధలకు అవకాశ ం ఇచ్చినప్పటికీ దాని పట్టు తగ్గలేదు. వామపక్ష పిటి పార్టీ అధికారానికి వచ్చిన తరువాత కూడా 2005లో బ్రెజిల్‌ ప్రకటనల బడ్జెట్‌లో సగం మొత్తం దానికే వెళ్లింది. అయినప్పటికీ మీడియా తన కార్పొరేట్‌, సామ్రాజ్యవాద అనుకూల వైఖరులను ప్రదర్శించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఈ పూర్వరంగంలో మీడియా రంగాన్ని ప్రజాస్వామీకరించాలన్న అభిప్రాయాన్ని కొందరు వెలిబుచ్చుతుండగా, గుత్త సంస్ధలుగా ఎదగకుండా ఆంక్షలు విధించాలని మరికొందరు చెబుతున్నారు. వర్గ వ్యవస్ధలో దోపిడీదారులకు ఒక ఆయుధంగా మీడియా వుపయోగపడుతున్నందున ప్రత్యామ్నాయ మీడియాను కూడా రూపొందించాలనే అభిప్రాయం కూడా వెల్లడి అవుతోంది. అయితే ఈ ప్రతిపాదనలేవీ నిర్ధిష్ట రూపం తీసుకోవటం లేదు.

గమనిక ఈ వ్యాసం ‘వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి ‘ మాస పత్రికలో ప్రచురణ నిమిత్తం రాసినది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d