Tags

, , , , ,

ఎంకెఆర్‌

పదిహేడు సంవత్సరాల తరువాత వెనెజులా మితవాద పార్టీల కూటమి పార్లమెంట్‌లో తాను సాధించిన మెజారిటీని అడ్డం పెట్టుకొని పార్లమెంట్‌ తొలి సమావేశం తొలిరోజే రౌడీయిజానికి పాల్పడింది. గత నెలలో వెనెజులా పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికలలో పాలక వామపక్ష సోషలిస్టు పార్టీ కూటమి ఓడిపోయింది. అధ్యక్ష పదవిలో ఛావెజ్‌ వారసుడిగా వున్న నికోలస్‌ మదురో పదవీ కాలం మరో మూడు సంవత్సరాలు వుంది. అధికారంలో సోషలిస్టులు, పార్లమెంటులో మెజారిటీగా మితవాదులు వున్న ఒక అసాధారణ స్థితిలో బుధవారం నాడు తొలిసారిగా కొత్త పార్లమెంట్‌ సమావేశం ప్రారంభమైంది. ఆరునెలల్లో మదురో ప్రభుత్వాన్ని కూలదోస్తామని శపధాలు చేసిన మితవాదులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు పూనుకుంటే వెనెజులా శ్రామికవర్గం చేతులు ముడుకు కూర్చుంటుందా ? వుక్కు పిడికిలితో తాము ప్రతిఘటిస్తామని మదురో హెచ్చరించారు. పార్లమెంట్‌ తొలిరోజే పార్లమెంట్‌ వెలుపల అటు మితవాదుల, ఇటు వామపక్షవాదుల మద్దతుదారులు వేలాది మంది గుమికూడి ప్రదర్శనలు చేశారు. వీధులలో కొట్లాటలు మినహా వాతావరణం ఘర్షణ పూరితంగా తయారైంది. పార్లమెంటులో బొలివేరియన్‌ విప్లవ నేత హ్యూగో ఛావెజ్‌ ఫొటోలను తొలగించి మితవాదులు రెచ్చగొట్టే చర్యలకు పూనుకున్నారు.

వెనెజులా సోషలిస్టు పార్టీ నాయకత్వం చేసిన కొన్ని తప్పిదాలు, అవినీతి అక్రమాలను అరికట్టటంలో చేసిన జాగు వంటి అనేక కారణాలతో కొన్ని తరగతుల ప్రజానీకం దూరమయ్యారు. అందువలననే 2013లో జరిగిన ఎన్నికలలో బొటాబొటీ మెజారిటీతో మదురో ఎన్నికయ్యారు. గత నెలలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో మితవాదులు, వామపక్ష కూటమికి ఓట్ల తేడా పదిశాతం వరకు పెరిగింది. దీని అర్ధం ఓటర్లు మితవాద విధానాలకు మద్దతు పలుకుతారని కాదు. కార్పొరేట్‌ శక్తులు ప్రారంభించిన ఆర్ధిక యుద్ధాన్ని ఎదుర్కోవటంలో మదురో సర్కార్‌ విఫలమైంది. దానికి తోడు చమురు ధరలు పడిపోయి ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.ఈ పూర్వరంగంలో ఆర్ధిక పరిస్ధితిని తాము చక్కదిద్దుతామని మితవాదులు ఓటర్ల ముందుకు వచ్చారు. వారిపై భ్రమలు వున్న ఒక తరగతి అటువైపు మొగ్గటంతో ఫలితాలు సోషలిస్టులకు ప్రతికూలంగా వచ్చాయి.

మదురో పాలనలో పెరిగిపోయిన అవినీతిని రూపుమాపుతామంటూ ప్రకటించిన నూతన పార్లమెంట్‌ అధ్యక్షుడు హెన్రీ రామోస్‌ అలప్‌ ప్రవర్తనతో మొదటి రోజే ప్రతిపక్ష సభ్యులు వాకౌట్‌ చేశారు.తమలో ఒక్కరికే అవకాశం ఇచ్చి అడ్డుకున్నారని వారు విమర్శించారు. తొలి ఎవరు మాట్లాడినా అవకాశం ఇవ్వాలని నిబంధనలు వున్నాయని చెప్పారు.తొలి రోజే ప్రజావ్యతిరేకమైన నయా వుదారవాద బిల్లు ప్రతిపాదనలను మితవాదులు పార్లమెంట్‌ ముందుకు తెచ్చారు. అనేక నేరాలకు శిక్షలు పడి జైళ్లలో వున్న తమ వారిని రాజకీయ ఖైదీలనే ముద్రతో విడిపించుకొనేందుకు క్షమా భిక్ష చట్ట సవరణను మితవాదులు ప్రతిపాదించారు. దీనికి అమెరికా మద్దతు ఇచ్చింది. ఇలాంటి బిల్లులను అధ్యక్షుడు మదురో అడ్డుకుంటారని వేరే చెప్పనవసరం లేదు. ఇళ్ల కార్యక్రమంలో లబ్దిదారులకు వాటిపై యాజమాన్య హక్కు కల్పించాలనే మరొక ప్రతిపాదన తెచ్చారు. ఒక సామాజిక కార్యక్రమాన్ని ప్రయివేటీకరించటం తప్ప మరొకటి కాదని వామపక్షాలు విమర్శించాయి. సామాజిక భద్రతా పధకం కింద 30లక్షల మందికి పైగా లబ్దిదారులైన వుద్యోగ విరమణ చేసిన వారికి అందచేసే ఔషధాలు, ఆహార సరఫరాను క్రమబద్దీకరించే పేరుతో మరొక ప్రతిపాదనను మితవాదులు తెచ్చారు.

మరోవైపు గతేడాది ఆమోదించిన బిల్లులకు చట్ట రూపం కల్పిస్తూ అధ్యక్షుడు మదురో నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రజల హక్కులకు మద్దతు ఇస్తున్న చట్టాలను పరిరక్షించుకొనేందుకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసిన తరువాత గత నెల రెండవ వారంలో సామాజిక కమిటీల పార్లమెంటు సమావేశం జరిగింది. వెనెజులాలో సామాజిక కమిటీల వున్నత సంస్ధ అది. గత పదిహేడు సంవత్సరాల బొలివేరియన్‌ విప్లవపాలనా కాలంలో ప్రజానుకూలంగా తీసుకువచ్చిన మార్పులు, చట్టాలను పరిరక్షించుకోవాలని అది పిలుపునిచ్చింది. ప్రజల సాధికారతను పార్లమెంట్‌ హరిస్తే తాము పోరాటాలు చేసేందుకు సిద్ధంగా వున్నామని వక్తలు పేర్కొన్నారు. ఇదంతా కూడా పార్లమెంట్‌లో మెజారిటీగా వున్న మితివాదుల బెదిరింపుల పూర్వరంగంలో జరిగింది. సామాన్య ప్రజలు ఇప్పటి వరకు అనుభవిస్తున్న సామాజిక భద్రత, సంక్షేమ పధకాలకు ఏ మాత్రం కోత పెట్టినా అది పోరాటాలకు దారి తీయటం అనివార్యంగా కనిపిస్తోంది. అదే ఖండంలోని అర్జెంటీనాలో అధికారానికి వచ్చిన మితవాదులు పెద్ద సంఖ్యంలో ప్రభుత్వ రంగ సంస్ధలు, ప్రభుత్వ వుద్యోగులను తొలగించటానికి చేస్తున్న ప్రయత్నాలు కొనసాగితే ఆందోళన తప్పదని అక్కడి కార్మిక సంఘాలు ఇప్పటికే హెచ్చరించాయి.