Tags

, , , , , , , , ,

Image result for emmanuel macron epouse

తనకంటే 25 ఏండ్ల పెద్ద అయిన  భార్య బ్రిగిట్టితో 39 ఏండ్ల ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌

ఎం కోటేశ్వరరావు

ఆదివారం నాడు ఫ్రాన్స్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ఓటర్లు ఆ పదవికి ఎవరినీ ఎన్నుకోలేదు గానీ గత యాభై సంవత్సరాలుగా అధికారంలో వుంటున్న రెండు పార్టీలను తుది విడత పోటీకి కూడా అనర్హులను గావించి తొలిసారిగా కొత్త వారిని ఎన్నుకొనేందుకు రంగం సిద్ధం చేశారు. పోటీ చేసిన పది మంది అభ్యర్దులలో ఏ ఒక్కరికీ మెజారిటీ ఓట్లు రాకపోవటంతో తొలిరెండు స్ధానాలలో వున్న ఇద్దరు అభ్యర్ధుల మధ్య మే నెల ఏడవ తేదీన మరోసారి ఓటింగ్‌ జరగనుంది. ఈ ఫలితాలు వెలువడిన తరువాత ఫ్రెంచి, ఐరోపా స్టాక్‌ మార్కెట్ల సూచీలు పెరగటం, అనేక మంది విశ్లేషకులు హర్షం వెలిబుచ్చటాన్ని బట్టి , ప్రత్యర్ధిగా పచ్చి మితవాది వున్న కారణంగా మొదటి స్ధానంలో వుండి, మధ్యేవాదిగా వర్ణితమైన ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ తుది విడత ఓటింగ్‌లో విజేతగా నిలవటం ఖాయంగా కనిపిస్తోంది. ఐరోపా కమిషన్‌ పదవులలో వున్న వారు ఎన్నికల సమయంలో ఒక అభ్యర్ధికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా బహిరంగ ప్రచారం చేయటం, వ్యాఖ్యానించటం వుండదు. ఈ సారి దీనికి విరుద్ధంగా ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ ప్రధమ స్ధానంలో వున్నందుకు అభినందించటమే గాక తుది విడత కూడా విజయం సాధించాలని, మారీ లీపెన్‌ గెలిస్తే ఐరోపా యూనియన్‌ను నాశనం చేస్తారని ఐరోపా కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జంకర్‌ ప్రకటించారు. పోటీకి అర్హత సాధించటంలో విఫలమైన మితవాద రిపబ్లికన్‌, సోషలిస్టు పార్టీ కూడా మే ఏడవ తేదీ ఎన్నికలలో బలపరుస్తామని ప్రకటించాయి. అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప మితవాది లీపెన్‌ గెలిచే అవకాశాలు లేవు.ఈ ఎన్నికలలో వామపక్ష సంఘటన అభ్యర్ధి జీన్‌లక్‌ మెలంచన్‌ తుది విడత అధ్యక్ష పదవి పోటీలో వుంటారని భావించిన వామపక్ష అభిమానులు ఆశించిన విధంగా ఓటింగ్‌ లేకపోవటంతో ఒకింత ఆశాభంగానికి గురికావటం సహజం. ఫలితాల సరళిపై కమ్యూనిస్టు పార్టీ నేత పిరే లారెంట్‌ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఓటింగ్‌ శాతాన్ని గణనీయంగా పెంచుకోవటం ఫ్రాన్స్‌లోనే కాదు, ప్రపంచ వ్యాపితంగా వామపక్ష అభిమానులలో ఆశలు పెంచే అంశం.రెండు, మూడు, నాలుగు స్ధానాలలో నిలిచిన అభ్యర్ధుల మధ్య వ్యత్యాసం రెండుశాతం కంటే తక్కువగా వుండటాన్ని బట్టి పోటీ ఎంత తీవ్రంగా జరిగిందో వూహించవచ్చు. వివిధ పార్టీల అభ్యర్ధులకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా వున్నాయి. ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌( ఇఎంఎ) 24.01, లీపెన్‌(ఎఫ్‌ఎన్‌) 21.3, ఫిలన్‌(ఎల్‌ఆర్‌) 20.01,మెలంచన్‌ (ఎల్‌ఎఫ్‌) 19.58, హమన్‌ ( పిఎస్‌) 6.36, డ్యూపాంట్‌ ఇగ్నన్‌(డిఎల్‌ఎఫ్‌) 4.7,లాసాలే (ఆర్‌) 1.21,పౌటు (ఎన్‌పిఏ) 1.09 మరో ముగ్గురికి 0.92,0.64,0.18 శాతం చొప్పున ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికల ప్రాధాన్యత, విశేషాలను క్లుప్తంగా చూద్దాం.

Image result for marine le pen

మితవాద పార్టీ నేషనల్‌ ఫ్రంట్‌  మారినే లీపెన్‌

1965 నుంచి 2012 వరకు జరిగిన తొమ్మిది ఎన్నికలలో సోషలిస్టు పార్టీ మూడు సార్లు, పలు పేర్లు మార్చుకున్న మితవాద పార్టీ ఆరుసార్లు అధికారానికి వచ్చింది. ఈ సారి ఆ రెండు పార్టీలకు చెందిన అభ్యర్ధులలో ఒక్కరు కూడా పోటీకి అర్హమైన సంఖ్యలో ఓట్లను సంపాదించుకోలేకపోయారు.అధికారానికి వచ్చి రెండవ సారి కూడా అధికారాన్ని కోరకుండా పోటీకి దూరంగా వున్న వ్యక్తిగా ప్రస్తుత అధ్యక్షుడు హోలాండే చరిత్రకెక్కారు. ఆయన బదులు పోటీ చేసిన సోషలిస్టు పార్టీ (పిఎస్‌) అభ్యర్ధి హమన్‌ ఐదవ స్ధానంలో నిలిచారు. గత ఎన్నికలలో ప్రస్తుతం అధ్యక్షుడిగా వున్న ఫ్రాంకోయిస్‌ హాలాండే తొలి విడత 28.63 శాతం ఓట్లతో ప్రధమ స్ధానంలో నిలిచారు. అంతకు ముందు ఎన్నికలలో 25.87శాతంతో రెండవ స్ధానంలో వున్నారు. ఐరోపాలో సోషలిస్టు పార్టీలుగా వున్న శక్తులు మితవాద శక్తులకు భిన్నంగా వ్యవహరించకపోవటం, నయా వుదారవాద విధానాలలో భాగంగా అంతకు ముందు అమలులో వున్న సంక్షేమ పధకాలకు కోతలు పెట్టటంలో మితవాద శక్తులకు భిన్నంగా సోషలిస్టులు వ్యవహరించకపోవటంతో కార్మికవర్గం ఆ పార్టీలకు క్రమంగా దూరం అవుతోంది.ఇదే సమయంలో ప్రత్యామ్నాయశక్తులు రూపొందలేదు.

ఇక సాంప్రదాయక మితవాద శక్తులకు ప్రాతినిధ్యం వహించే యుఎంపి ఈ ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీ(ఎల్‌ఆర్‌)గా పేరు మార్చుకొని పోటీ చేసి 19.9శాతం ఓట్లతో మూడవ స్ధానంలో నిలిచింది. గత ఎన్నికలలో 27.18శాతం ఓట్లతో రెండవ స్ధానం, 2007లో 31.18శాతంతో ప్రధమ స్ధానంలో నిలిచింది.

ఫ్రెంచి రాజకీయ రంగంలో మితవాదులు, అతివాదులిద్దరినీ ఏకం చేస్తాను నేను ఏ భావజాలానికి చెందిన వాడిని కాదు, తనది మూడవ మార్గం అంటూ ఏడాది క్రితం ‘ముందుకు పోదాం’ పేరుతో ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేసిన మాజీ ప్రభుత్వ వుద్యోగి, మాజీ విత్త మంత్రి, ఐరోపా యూనియను కొనసాగాలని కోరుకొనే బ్యాంకరు అయిన ఇమ్మాన్యుయెల్‌ మక్రానన ప్రజారంజక నినాదాలతో, ప్రభుత్వ వ్యతిరేక వుపన్యాసాలతో ఓటర్ల ముందుకు వచ్చాడు. సోషలిస్టు పార్టీ సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభిన ఇతగాడు హోలాండు ప్రభుత్వంలో విత్త మంత్రిగా కూడా పని చేశాడు. హోలాండే ప్రభుత్వం ప్రజల నుంచి దూరం కావటాన్ని గమనించి గతేడాది ఆగస్టులో రాజీనామా చేసి అంతకు ముందే తాను ఏర్పాటు చేసిన ‘ముందుకు పోదాం’ పేరుతో రంగంలోకి దిగాడు. ఏడాది కూడా గడవక ముందే అధికార పీఠాన్ని అధిష్టించేందుకు సిద్దమయ్యాడు. కొంత మంది విశ్లేషకులు ఇతడిని వుదారవాది అని పిలిస్తే మరి కొందరు సోషల్‌ డెమాక్రాట్‌ అన్నారు. సోషలిస్టు పార్టీలో వున్న సమయంలో దాని లోని మితవాదులను బలపరిచాడు.

గతేడాది సోషలిస్టు పార్టీ నుంచి రాజీనామా చేసిన సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ నేను సోషలిస్టును కాదు అని చెప్పాల్సిందిగా నా నిజాయితీ నన్ను వత్తిడి చేసింది, వామపక్ష(సోషలిస్టు పార్టీని కూడా వామపక్షం అని పిలుస్తారు) ప్రభుత్వంలో మంత్రిగా ఎందుకున్నానంటే ఇతరుల మాదిరి ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలనుకున్నాను ‘ అన్నాడు. ఫ్రాన్స్‌లో యూరో అనుకూల ఏకైక రాజకీయ పార్టీ తమదే అని స్పష్టీకరించాడు. ఆర్ధికంగా నయా వుదారవాద విధానాలను కొనసాగించాలని కోరే ఇతగాడు రాజకీయంగా అమెరికా అనుకూల వైఖరిని వివిధ సందర్భాలలో వెల్లడించాడు. పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించేందుకు వ్యతిరేకి. సిరియా విషయంలో అమెరికాను అనుసరిస్తాడు. ఈ కారణంగానే అతను ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్ధిగా ముందు వరుసలో వుండటంతో ఫ్రెంచి, ఐరోపా, ప్రపంచ పెట్టుబడిదారులందరూ హర్షం వెలిబుచ్చారు. స్టాక్‌ మార్కెట్లు పరుగులు తీశాయి. రెండవ విడత ఎన్నికలలో తమ ఓట్లు మాక్రాన్‌కే వేస్తామని వెంటనే రిపబ్లికన్‌ పార్టీ, సోషలిస్టు పార్టీల అభ్యర్ధులిద్దరూ ప్రకటించారు. వామపక్ష సంఘటన ఇంకా ప్రకటించలేదు. వామపక్ష, కమ్యూనిస్టు మద్దతుదారులు పచ్చి మితవాది మారినే లీపెన్‌కు ఓటు వేసే అవకాశం లేదు కనుక ప్రపంచ మీడియా మొత్తం ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ కాబోయే ఫ్రెంచి అధ్యక్షుడు అన్న రీతిలో వార్తలు ఇచ్చాయి. కొందరు విశ్లేషకులు లీ పెన్‌ గెలుపు అవకాశాల గురించి కూడా చర్చించారు.

ఫ్రెంచి రాజకీయాలలో పచ్చి మితవాద పార్టీ నేషనల్‌ ఫ్రంట్‌ ఎదుగుదల ఒక ముఖ్యాంశం.అల్జీరియాకు స్వాతంత్య్రం ఇవ్వటం, దానిపై ఆధిపత్యాన్ని వదులుకోవటం ఇష్టం లేని పచ్చి మితవాదుల బృందానికి చెందిన వ్యక్తి మారీ లీపెన్‌. అల్జీరియా ఫ్రాన్స్‌లో భాగమే అనే అవగాహనను వదులుకుంటున్నట్లు ఫ్రెంచి మితవాద పార్టీ అధ్యక్షుడు డీగాల్‌ ప్రకటించిన పూర్వరంగలో లీపెన్‌ తదితరులు 1972లో నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. దానికి లీ పెన్‌ నాయకుడయ్యాడు. 1973 పార్లమెంట్‌ ఎన్నికలలో పోటీ చేసిన ఈ పార్టీకి దేశం మొత్తం మీద కేవలం 0.5శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. పారిస్‌లోని లీపెన్‌ నియోజకవర్గంలో ఐదుశాతం వచ్చాయి. ఇటువంటి పార్టీ 1981 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయటానికి తగిన అర్హతను కూడా సంపాదించలేకపోయింది. 1984 ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికలలో 11శాతం ఓట్లు పది సీట్లు సంపాదించి ఫ్రెంచి రాజకీయాలలో సంచలనం సృష్టించింది.1988 అధ్యక్ష ఎన్నికలలో లీ పెన్‌ ఫ్రెంచి ప్రయోజనాలు ముందు అనే ప్రచారంతో పోటీ చేసి 14.4 శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. మూడవ ప్రధాన పార్టీగా అవతరించింది. 2002 అధ్యక్ష ఎన్నికలలో అనూహ్యంగా 16.86 శాతం ఓట్లు తెచ్చుకొని రెండవ స్ధానంతో తొలిసారిగా లీపెన్‌ అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.2007 ఎన్నికలలో 10.44 శాతం ఓట్లతో నాలుగవ స్ధానంలో, 2012లో 17.9 శాతంతో మూడవ స్ధానంలో తాజా ఎన్నికలలో 21.3 శాతంతో రెండవ స్ధానంలోకి నేషనల్‌ ఫ్రంట్‌ అవతరించింది. మారి లీపెన్‌ కుమార్తె మారినే లీపెన్‌ 2012 ఎన్నికలలో తొలిసారిగా పోటీ చేశారు. మారీ లీపెన్‌ వివాదాస్పద, నేర చరిత్ర, వదరుబోతు తనం కారణంగా నేషనల్‌ ఫ్రంట్‌ను అభిమానించేవారికంటే వ్యతిరేకించే వారు ఎక్కువయ్యారు. ఈ పూర్వరంగంలో 2015లో ఒక ప్రత్యేక సమావేశంలో లీ పెన్‌ను ఆయన కుమార్తె స్వయంగా పార్టీ నుంచి బహిష్కరించింది. ఐరోపా యూనియన్‌ నుంచి ఫ్రాన్స్‌కు విముక్తి కలిగించటమే తన లక్ష్యమని ఆమె తన ప్రచార అస్త్రంగా చేసుకుంది.

Image result for jean luc melenchon

వామపక్షపార్టీలు, కమ్యూనిస్టు పార్టీ బలపరిచిన  మెలెంచన్‌

ఈ ఎన్నికలలో మూడవ స్ధానంలో రిపబ్లికన్‌ పార్టీ వుండగా స్వల్ప తేడాతో నాలుగవ స్ధానంలో వామపక్షపార్టీలు, కమ్యూనిస్టు పార్టీ బలపరిచిన జీన్‌ లూ మెలెంచన్‌ వున్నారు. ఆయన 19.58శాతం ఓట్లు సాధించటం ఈ ఎన్నికల ప్రత్యేకతలలో ఒకటి. ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీ విషయానికి వస్తే రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు పార్లమెంట్‌ ఎన్నికలలో గరిష్టంగా 28శాతం సంపాదించగా అధ్యక్ష ఎన్నికలలో 1969 ఎన్నికలలో ఆ పార్టీ గరిష్టంగా 21.7శాతం ఓట్లు సాధించింది. ఆ దశకంలో అక్కడ జరిగిన యువజన-విద్యార్ధి వుద్యమాల పూర్వరంగంలో ఈ ఫలితం వచ్చింది. తరువాత 1981ఎన్నికలలో 15.35 శాతం వచ్చాయి తరువాత క్రమంగా తగ్గుతూ 2007 ఎన్నికలలో 1.93శాతానికి పడిపోయాయి. ఐరోపా యూనియన్‌ ఎన్నికలలో 1989-2014 మధ్య 7.7-5.9 శాతం మధ్య ఓట్లు వచ్చాయి. ఫ్రెంచి పార్లమెంట్‌ ఎన్నికలలో కూడా దాదాపు అదే ప్రతిబింబించింది. 2012 ఎన్నికలలో మెలెంచన్‌ వామపక్ష ఫ్రంట్‌ అభ్యర్ధిగా పోటీ చేసి 11 శాతం తెచ్చుకున్నారు. తాజా ఎన్నికలలో ఒక దశలో మొదటి రెండు స్ధానాలలో వుంటారా అన్నట్లుగా ప్రచారం జరిగింది. అభిప్రాయ సేకరణలో తొలి నలుగురు అభ్యర్ధుల మధ్య ఓట్ల తేడా పెద్దగా లేకపోవటంతో తొలిసారిగా ప్రాన్స్‌లో తీవ్ర మితవాద, సమరశీల వామపక్ష అభ్యర్ధి మధ్య పోటీ వుంటుందా అన్న వాతావరణం వచ్చింది. ఆ కారణంగానే మెలెంచన్‌ గనుక అధ్యక్షుడిగా ఎన్నికైతే తాము ఫ్రాన్స్‌ నుంచి పెట్టుబడులతో సహా వెళ్లిపోతామని కొందరు పెట్టుబడిదారులు ఎన్నికల ముందు బెదిరింపులకు దిగారు. సోషలిస్టు పార్టీలో తీవ్ర వామపక్ష వాదిగా వున్న మెలెంచన్‌ ఆ పార్టీ విధానాలతో విబేధించి 2008లో దాన్నుంచి విడివడి వామపక్ష పార్టీని ఏర్పాటు చేశారు. తరువాత ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ కూడా భాగస్వామిగా వున్న వామపక్ష సంఘటన అభ్యర్ధిగా గత రెండు ఎన్నికలలో పోటీ చేశారు. అయితే మీడియా ఆయనను కమ్యూనిస్టుగా వర్ణించింది తప్ప ఆయనేనాడూ కమ్యూనిస్టుపార్టీలో పని చేయలేదు. కార్మికుల పని గంటలను వారానికి 35 నుంచి 32కు తగ్గించాలని,నెలకు 33వేల యూరోలు దాటిన వారి ఆదాయాన్ని బట్టి పన్ను రేటును 100శాతానికి పెంచాలని, వుద్యోగ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు తగ్గించాలని, ప్రభుత్వ ఖర్చును పెంచాలని, మెలెంచన్‌ తన ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నాటో నుంచి ఫ్రాన్స్‌ వైదొలగాలని, రష్యాతో సఖ్యతగా వుండాలని,మితవాదులు, పెట్టుబడిదారులకు అనుకూలంగా వున్న విధానాలను ఐరోపా యూనియన్‌ సంస్కరించని పక్షంలో యూనియన్‌ నుంచి వైదొలగాలని అన్నారు. ఆయన ప్రచార తీరును చూసి మితవాద పత్రిక లీ ఫిగారో ‘ఫ్రెంచి ఛావెజ్‌ ‘ అంటూ ఓటర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. ఫ్రాన్స్‌లోని అతిపెద్ద పారిశ్రామిక సంస్ధ మెడెఫ్‌ ప్రతినిధి పిరే గాటెజ్‌ మాట్లాడుతూ ఆర్ధిక విధ్వంసం-ఆర్ధిక గందరగోళం మధ్య ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సి వుంటుందని, లీపెన్‌-మెలెంచన్‌ మధ్య పోటీ పరిస్ధితి గురించి వ్యాఖ్యానించారు.

ఎన్నికల ఫలితాల గురించి కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రకటనలో చేసిన వ్యాఖ్యలలోని కొన్ని అంశాలు ఇలా వున్నాయి.’ తొలి విడద ఎన్నికల ఫలితాలు దేశంలోని తీవ్ర పరిస్ధితికి నిదర్శనం. జీన్‌ లక్‌ మెలాంచన్‌ దాదాపు 20శాతం ఓట్లు తెచ్చుకోవటం భవిష్యత్‌పై నూతన ఆశలను రేకెత్తిస్తోంది. నూతన సమాజం కోసం గొంతెత్తిన లక్షల మంది పోరాటం కొనసాగుతుంది. వారి ఆకాంక్ష ఇంకా పెరగనుంది.పట్టణాలలో మంచి ఫలితాలు వచ్చాయి. ఫ్రెంచి రాజకీయాలలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.మానవాళి విముక్తి అనే లక్ష్యాన్ని సాధించేందుకు ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీ పని చేస్తున్నది.తక్షణ కర్తవ్యంగా మే ఏడున జరగనున్న ఎన్నికలలో అధ్యక్ష పదవికి మారినె లీపెన్‌ ఎన్నిక కాకుండా అడ్డుకోవటం. అంటే దీని అర్ధం ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ మంత్రిగా వున్నపుడు ఆయన అమలు జరిపిన వుదారవాద, సామాజిక వ్యతిరేక కార్యక్రమానికి మద్దతు పలికినట్లు కాదు, వాటికి వ్యతిరేకంగా రేపు కూడా పోరాడుతాము.అధ్యక్ష ఎన్నికలలో రెండవ దఫా ఎన్నికలతో ఎదురైన పరిస్ధితులలో జూన్‌ 11,18 తేదీలలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. తొలి విడత ఎన్నికలలో సాధించిన ఓట్లను బట్టి ప్రజా ప్రయోజనాలకు బద్దులై వుండే కమ్యూనిస్టుపార్టీ, వామపక్ష సంఘటనలోని ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఎంపీలను గెలిపించుకోవాల్సి వుంది.’ అని పేర్కొన్నది.

ఫ్రెంచి రాజకీయాలలో మఖలో పుట్టి పుబ్బలో అంతరించింది అన్నట్లుగా అనేక పార్టీలు పుట్టి ఒకటి రెండు ఎన్నికలలో పోటీ చేసి తరువాత కనుమరుగు కావటం ఒక ధోరణిగా వుంది. అలాంటి కోవకే చెందిన ముందుకు పోదాం (ఎన్‌ మార్చ్‌) అనే పార్టీ సాంప్రదాయ పార్టీలను తోసి రాజని తొలిసారిగా ఏకంగా అధికారానికి వచ్చే బలాన్ని సంపాదించుకోవటం ఒక నూతన పరిణామం. ఐరోపాలోని అనేక దేశాలలో నెలకొన్న రెండు పార్టీల వ్యవస్ధలకు కాలం చెల్లనుందా అనేందుకు ఇది సూచన. అదే జరిగితే సైద్ధాంతిక ప్రాతిపదికన రాజకీయ సమీకరణలు వేగవంతమౌతాయి. ఫ్రాన్స్‌లో మితవాద నినాదాలు, రాజకీయాలతో నేషనల్‌ ఫ్రంట్‌ బలం పుంజుకోవటంతో పాటు వామపక్ష పార్టీ క్రమంగా బలం పెంచుకోవటం కూడా ఒక ముఖ్య పరిణామమే.

2008 నుంచి ధనిక దేశాలలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభ పూర్వరంగంలో మితవాద శక్తులు జాతీయవాదం ముసుగులో ప్రపంచీకరణను వ్యతిరేకించటం, దేశీయ పెట్టుబడిదారులు, వ్యాపారులకు రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని కోరటం, ప్రజలపై భారాలు మోపే విధానాలకు మద్దతు పలకటం అనేక దేశాలలో వెల్లడౌతున్న కొత్త పరిణామం. ఐరోపా యూనియన్‌ నుంచి విడివడి తన పలుకుబడి, పూర్వపు సంబంధాలతో తమ దేశ పెట్టుబడిదారులకు మేలు చేయగలమనే ధీమాతో బ్రిటన్‌ పాలకవర్గం ఐరోపా యూనియన్‌ నుంచి వైదొలగేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐరోపా యూనియన్‌లో ప్రస్తుతం జర్మనీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. తన ఆర్ధిక బలంతో మిగతాసభ్య దేశాలతో వాణిజ్య మిగులు సాధించిన జర్మన్లపై మిగతా దేశాలలో వ్యతిరేకత పెరుగుతోంది. మే ఏడున జరిగే ఎన్నికలలో అందరూ వూహిస్తున్నట్లు కొత్త పార్టీ నేత ఇమ్మాన్యుయేల్‌ మక్రాన్‌ ఎన్నికై తన విధానాలను ప్రకటించిన తరువాత మరింత స్పష్టత వస్తుంది. అయితే స్టాక్‌ మార్కెట్‌ సంబరాలను బట్టి కార్పొరేట్‌ శక్తులకు అనుకూల వైఖరి తీసుకుంటారని, పెను మార్పులేమీ వుండవని కొందరు విశ్లేషకుల అంచనాలు వాస్తవానికి దగ్గరగా వున్నాయి. అదే జరిగితే ఆగ్రహం, నిరాశా నిస్పృలతో వున్న ఫ్రెంచి యువత ఎలా స్పందిస్తుందో చూడాల్సి వుంది.