Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ ప్రధానిగా పదవిని స్వీకరించి నాలుగు సంవత్సరాలు గడిచింది. స్వదేశీ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న రాష్ట్రపతి అంటూ ఒక జోక్‌ సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా మోడీ పదవీ స్వీకార ప్రమాణం చేసింది మొదలు ఇప్పటి వరకు విదేశీ ప్రయాణాల్లోనే ఎక్కువగా గడిపారనే పేరు తెచ్చుకున్నారు. మోజు తీరినపుడు, అసంతృప్తి కలిగినపుడు ఎప్పుడన్నా జనం ఈ విషయాల గురించి చర్చించి వుంటారేమోగానీ మన విదేశాంగ విధానం గురించి మాత్రం కచ్చితంగా చర్చకు రావటం లేదని చెప్పవచ్చు. అంతర్గత విధానాలు మన జన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో వర్తమాన ప్రపంచీకరణ యుగంలో విదేశాంగ విధానాల పర్యవసానం కూడా తీవ్రంగానే వుంటుంది. ఈ విషయం మనకు స్వాతంత్య్రానికి ముందు తెలిసినంతగా ఇప్పుడు తెలియటం లేదు. బ్రిటీష్‌ పాలకుల దేశీయ, విదేశాంగ విధానాలు మన దేశాన్ని ఎలా దోపిడీకి గురిచేశాయో నాడు స్వాతంత్య్ర సమరయోధులు నిత్య పారాయణం చేసేవారు. ఇప్పుడు కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీలేవీ ఈ విషయాల గురించి నోరెత్తవు.

సోవియట్‌ యూనియన్‌ కూల్చివేత, మన దేశంలో సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టిన 1991 నుంచి మన దేశ విదేశాంగ విధానంలో పెద్ద మార్పులు వచ్చాయి. నాటి నుంచి నేటి వరకు చూస్తే అలీన విధానం నుంచి వైదొలగి అమెరికా బిగి కౌగిట్లోకి మరింతగా చేరువు కావటం ముఖ్యమైన మార్పు. గత పాతిక సంవత్సరాలలో కాంగ్రెస్‌, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ఎవరు అధికారంలో వున్నప్పటికీ అదే కొనసాగుతోంది. యుపిఏ పాలనా కాలంలో అమెరికావైపు మొగ్గు, దానికి చిన్న భాగస్వామిగా చేరేందుకు పూనుకున్న కారణంగానే వామపక్షాలు మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు వుపసంహరించిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ హయాంలో వాటిలో ఎలాంటి మార్పు లేదు, మరింత విస్తృతం, చేరువైంది. 2015లో బరాక్‌ ఒబామా మన దేశ పర్యటనకు వచ్చినపుడు సంయుక్త స్వప్న దర్శనం పేరుతో ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారం ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా భూ, రాజకీయ వ్యూహంతో సమన్వయం చేసుకొనేందుకు మన దేశం అంగీకరించింది. సోషలిస్టు చైనా, వియత్నాం, లావోస్‌ వియత్నాంలను చక్రబంధంలో బిగించటంతో పాటు ఈ ప్రాంతంపై మొత్తంగా తన పట్టుబిగించుకోవటం అమెరికా లక్ష్యం. ఇప్పటికే జపాన్‌, ఆస్ట్రేలియాలతో అమెరికాకు ఒప్పందం వుంది. ఆ మూడింటితో సమన్వయం చేసుకుంటామని మోడీ సర్కార్‌ మరొక అడుగు ముందుకు వేసింది. అంతకు ముందు చేసుకున్న రక్షణ ఒప్పందాన్ని మరో పది సంవత్సరాలు పొడిగించింది. గతంలో ఏ ప్రభుత్వమూ అంగీకరించని విధంగా మన రేవులు, వైమానిక స్ధావరాలకు వచ్చి అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ ఓడలు ఇంధనం నింపుకొనేందుకు, మరమ్మతులు చేయించుకొనేందుకు అంగీకరించింది. ఇది మన సార్వభౌమత్వాన్ని తక్కువ చేసుకోవటమే.

దశాబ్దాల తరబడి అనుసరిస్తున్న విధానాన్ని పక్కన పెట్టి ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద భావజాలానికి అనుగుణంగా ఇజ్రాయెల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్రమోడీ చరిత్రకెక్కారు.పాలస్తీనా సందర్శనను తప్పించారు. వెనెజులా రాజధాని కారకాస్‌లో జరిగిన అలీన దేశాల సభకు వెళ్లకుండా అమెరికాను మెప్పించేందుకు ప్రయత్నించారు. ఇలా అమెరికా, ఇతర సామ్రాజ్యవాద దేశాలు, వాటి అడుగుజాడలలో నడిచే దేశాలతో బంధాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇతర దేశాలకు ఇవ్వలేదు. వుదాహరణకు మన దేశం బ్రెజిల్‌,రష్యా,చైనా, దక్షిణాఫ్రికాతో కలసి బ్రిక్స్‌ కూటమిగా ఏర్పడింది. అదే విధంగా షాంఘై కూటమిలో పూర్తి సభ్యురాలిగా చేరింది. ఇవి ప్రాంతీయ, పరస్పర సహకారం, బహుళధృవ ప్రపంచ వ్యవస్ధ ఏర్పాటు వంటి అనేక లక్ష్యాలను కలిగి వున్నాయి. వాటన్నింటినీ వదలి పెట్టి కేవలం వుగ్రవాద సమస్య మీద మాత్రమే ఈ వేదికల మీద మోడీ సర్కార్‌ కేంద్రీకరిస్తున్నది. పోనీ వుగ్రవాదులను పెంచి పోషిస్తున్న అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాలను, సౌదీ వంటి రాజ్యాల వైఖరి, చర్యలను తప్పుపడుతున్నదా అంటే లేదు.

ఇరుగు పొరుగు దేశాలన్న తరువాత అనేక సమస్యలూ, సానుకూల అంశాలూ వుంటాయి.మన రక్షణ ఖర్చు తగ్గి ఆమేరకు అభివృద్ధి వైపు కేంద్రీకరించాలంటే సరిహద్దులలో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొని సానుకూల అంశాలను పెంచుకోవటం అవసరం. నరేంద్రమోడీ సర్కార్‌ వైఖరి ఆవిధంగా లేదు. పాకిస్ధాన్‌ మనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న మాట వాస్తవం. దానికి సూత్రధారి, తెరవెనుక పాత్రధారి అమెరికా అన్నది బహిరంగ రహస్యం. అలాంటి దేశంతో సఖ్యత, పాకిస్ధాన్‌తో వైరంలో అర్ధం లేదు. పాక్‌తో వైరాన్ని పెంచుకోవటం ద్వారా దేశంలో ముస్లిం వ్యతిరేకతను, జాతీయ దురహంకారాన్ని రెచ్చగొట్టి హిందూ ఓట్‌ బ్యాంకును ఏర్పరచుకోవాలనే యావ తప్ప మరొక లక్ష్యం కనిపించటం లేదు.పోనీ పాకిస్ధాన్‌ను సరిహద్దులలో అదుపు చేసిందా అంటే అదీ లేదు. ఎప్పుడు ఎక్కడ కాల్పులు జరుపుతారో, రెచ్చగొడతారో, వుగ్రవాదులను మన దేశంలో ప్రవేశపెడతారో, ఎక్కడ దాడులు చేయిస్తారో తెలియని స్ధితి. పక్కనే వున్న నేపాల్‌లో మధేషీ ఆందోళనకు మద్దతు తెలిపి ఆ దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకొని అక్కడి ప్రజానీకానికి, అన్ని రాజకీయపార్టీలను వ్యతిరేకం చేసుకున్నది. నరేంద్రమోడీ భజనలో భాగంగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తప్పుడు వ్యాఖ్యలు చేసి చివరకు క్షమాపణ చెప్పారు. నరేంద్రమోడీ మే రెండవ వారంలో నేపాల్‌ పర్యటనలో భాగంగా జనక్‌పూర్‌( సీత జన్మించిన ప్రాంతం అని నమ్మకం)లో ఒక సభలో ప్రసంగించారు. దానికి వచ్చిన జనాన్ని భారతీయులని సుష్మా స్వరాజ్‌ పేర్కొన్నారు. అది నేపాల్‌ సార్వభౌమాధికారాన్ని కించపరచటమే.

డోక్లాం సమస్య భూటాన్‌ాచైనా తేల్చుకోవాల్సిన అంశం. ఆ ప్రాంతంలో చైనా మిలిటరీ కేంద్రీకరణ జరిగితే దాని గురించి చైనాతో చర్చలు జరిపి పరిష్కరించుకోవచ్చు. అందుకు విరుద్దంగా అక్కడ జోక్యం చేసుకోవటం ద్వారా సాధించిందేమీ లేకపోగా చైనాతో అనవసరంగా మరో సమస్యను తెచ్చుకున్నట్లయింది. ఒకనోటితో అధికారికంగా చైనాతో సంబంధాల మెరుగుదల గురించి చెబుతూ మరోనోటితో నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో సంఘపరివార్‌ వ్యవస్ధలు నిమగ్నమయ్యాయి. దక్షిణ చైనా సముద్రం మీద ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నించటమంటే చైనాను చక్రబంధంలో బిగించటమే. దాని వ్యూహంలో మన దేశం భాగస్వామి కావటం అంటే మన ప్రయోజనాలను మనమే దెబ్బతీసుకున్నట్లు. మన మలబార్‌ తీరంలో అమెరికా, జపాన్‌తో కలసి మనం సైనిక విన్యాసాలు చేయటం దానిలో భాగమే. దానికి ప్రతీకారంగా అణుసరఫరా గ్రూపులో మనకు సభ్యత్వం రాకుండా చైనా అడ్డుపడుతోంది. అజార్‌ మసూద్‌ను వుగ్రవాదిగా ప్రకటించేందుకు ఐరాసలో చైనా అడ్డుపడటం కూడా చైనా పట్ల మనం అనుసరిస్తున్న వైఖరి పర్యవసానమే. చైనా మసూద్‌ పట్ల అనుసరించిన వైఖరికి ప్రతిగా చైనా వుగ్రవాదిగా ఇంటర్‌పోల్‌ ప్రకటించిన వాడిని మన దేశం ఆహ్వానించటం, టిబెట్‌ను చైనా అంతర్భాంగా గుర్తిస్తూనే మరోవైపు దానిని రెచ్చగొడుతూ దలైలామాను అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటనకు అంగీకరించటం వంటి వన్నీ ప్రతీకార పర్యవసానాలే.యూరేషియాాఆఫ్రికన్‌ రైలు,రోడ్డు, సముద్ర రవాణా పధకానే ఒన్‌ బెల్ట్‌ ఒన్‌ రోడ్‌ ప్రాజెక్టుఅని పిలుస్తున్నారు. చైనా చొరవతో ప్రారంభమైన ఈ పధకంలో చేరేందుకు దాదాపు వంద దేశాలు సంతకాలు చేశాయి. చైనాాపాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ కూడా దానిలో భాగమే. దానిలో చేరటమా లేదా అన్నది నిర్ణయించుకోవటానికి భారత్‌కు హక్కుంది. చేరకపోతే మన దేశం వంటరి అవుతుంది.ఆ పధకాన్ని వ్యతిరేకించేందుకు మద్దతు పలికిన అమెరికా ఇటీవల బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి ఒక ప్రతినిధి వర్గాన్ని పంపింది. మనం మాత్రం దూరంగా వుండటం ఎవరికి ప్రయోజనమో ఆలోచించుకోవాలి.

మన విదేశాంగ విధానంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రెండు రకాల ధోరణులు వున్నాయి. పూసల్లో దారంలా సామాన్య జన ప్రయోజనాల కంటే మన కార్పొరేట్‌ సంస్ధలకు లాభాలే ముఖ్యంగా దానిని అమలు జరుపుతూ వచ్చారు. ఆ క్రమంలో 1991కి ముందు మన జనానికి కూడా కొన్ని వుపయోగాలు జరిగాయి. పెట్టుబడిదారుల నాయకత్వంలో భూస్వామిక శక్తులు స్నేహితులుగా మన పాలకవర్గ పొందిక వుంది. అందువలన రెండు దోపిడీ తరగతుల ప్రయోజనాలు ఎప్పుడూ ఇమిడి వుంటాయి. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు మన దేశం వదలి వెళ్లిన వెంటనే ఆ స్ధానాన్ని ఆక్రమించేందుకు అమెరికా ప్రయత్నించింది. అప్పుడే విస్తరణకు ప్రయత్నిస్తున్న స్వదేశీ పెట్టుబడిదారులకు అది సమ్మతం కాదు. అదే సమయంలో రెడవ ప్రపంచ యుద్ధంలో ఎంతో నష్టపోయినప్పటికీ సోవియట్‌ యూనియన్‌ పారిశ్రామికంగా బాగా పుంజుకున్నది. రాజకీయంగా సామ్రాజ్యవాదుల కూటమిని సవాలు చేసేదిగా బలంగా తయారైంది. దీన్ని అవకాశంగా తీసుకొని లబ్దిపడేందుకు సోవియట్‌వైపు మొగ్గిన పాలకవర్గం ఎంతగానో లబ్దిపొందింది. తనవైపు నిలబడిన నిలబడిన భారత్‌ను నిలుపుకొనేందుకు సోవియట్‌ యూనియన్‌, తమ వైపు ఆకర్షించేందుకు అమెరికా కూటమి కూడా మన దేశంలో అనేక బడాపరిశ్రమలు, ఇతర సంస్ధల ఏర్పాటుకు పోటీ పడ్డాయి. సోవియట్‌ది పైచేయిగా వుంది. 1950-90 దశకం మధ్య మన కార్పొరేట్‌ సంస్ధలు మరింత విస్తరించి మరొక దేశంతో నిమిత్తం లేకుండా స్వంతంగా బడా పరిశ్రమలు ఏర్పాటు చేసే స్ధాయికి ఎదగటమే కాదు, మన కంటే చిన్న దేశాలలో తమ పెట్టుబడులను పెట్టేవిగా తయారయ్యాయి. సోవియట్‌ కూలిపోవటం, ఆ సమయానికి బలమైన దేశీయ గుత్తపెట్టుబడిదారీ వర్గం తయారు కావటంతో ప్రభుత్వ ప్రమేయం తగ్గి ఆర్ధిక రంగాన్ని మొత్తంగా తమకు అప్పగించాలనే డిమాండ్‌ చేయటంతో సంస్కరణల పేరుతో 1991లో విధానాల మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో ప్రపంచ ఆర్ధిక శక్తిగా వున్న అమెరికా తదితర దేశాలతో జతకట్టి జూనియర్‌ భాగస్వాములుగా మారేందుకు కూడా పాలకవర్గం నిర్ణయించుకుంది. పర్యవసానంగా మన మార్కెట్‌ను తెరవాల్సివచ్చింది. తొలుతు సంయుక్త భాగస్వామ్య సంస్ధల రూపంలో ప్రవేశించిన విదేశీ సంస్ధలు క్రమంగా వాటి స్ధానంలో తమ వుత్పత్తులనే నేరుగా ప్రవేశపెట్టాయి. ఎలక్ట్రానిక్‌ రంగంలో 1990 దశకంలో మార్కెట్‌కు వచ్చిన స్వదేశీ బ్రాండ్‌ టీవీలు ఇప్పుడు మనకు ఒక్కటీ కనపడదు, ఆటోమొబైల్‌ రంగంలో కూడా అదే పరిస్ధితి స్వరాజ్‌-మజ్డా, మారుతీ-సుజుకి, హీరో-హోండా వంటి కంపెనీల ఒప్పందాలు ముగిసిన తరువాత అత్యధిక భాగం విదేశీ కంపెనీలు తమ వుత్పత్తులను స్వయంగా ఇక్కడే తయారు(విడిభాగాల కూర్పు) చేయటం, ఇక్కడి నుంచి ఎగుమతులు కూడా చేయటం ప్రారంభించాయి. బలమైన స్వదేశీ హీరో వంటి కంపెనీలు వాటితో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు మన రిటెయిల్‌ రంగంలోకి ప్రవేశించేందుకు అమెజాన్‌, మెట్రో, వాల్‌మార్ట్‌ వంటి కంపెనీలు రంగంలోకి దిగాయి. ఎప్పుడైతే సామ్రాజ్యవాద దేశాల నుంచి పెట్టుబడులు రావటం ప్రారంభమైందో ప్రపంచ రాజకీయాలలో వాటి విధానాలను కూడా మన మీద రుద్దటం ప్రారంభించారు. వుదాహరణకు ఇజ్రాయెల్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా స్వతంత్ర పాలస్తీనా పునరుద్దరణకు మద్దతు ప్రకటించింది మన దేశం. ఇప్పటికీ అధికారికంగా దాని నుంచి వైదొలగనప్పటికీ ఆచరణలో నీరుగార్చటాన్ని చూస్తున్నాము. ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెంచుకోవటమే దానికి నిదర్శనం.

మన కార్పొరేట్‌ రంగం అటు సోవియట్‌, ఇటు అమెరికా, ఐరోపా ధనిక దేశాలను వినియోగించుకొని లాభపడేందుకు గతంలో ప్రయత్నించినట్లుగానే ఇప్పుడు కూడా చేస్తోంది. విబేధాలను వినియోగించుకొని లాభపడేందుకు చూడటం గురించి వేరే చెప్పనవసరం లేదు.తనకు నష్టం కలిగిస్తుందనుకున్నపుడు అమెరికా వాంఛలకు వ్యతిరేకంగా వ్యవహరించటాన్ని కూడా చూడవచ్చు. చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధం ప్రారంభించింది అనగానే అది మనకు ఎలా లాభమో దాన్నుంచి ఎలా లబ్ది పొందవచ్చో సూచిస్తూ వాణిజ్య వార్తల పత్రికల్లో అనేక మంది విశ్లేషణలు రాశారు. దాదాపు అన్ని దేశాలతో వాణిజ్య లావాదేవీలలో ఈరోజు చైనా మిగులును కలిగి వుంది. ఈ పరిస్ధితి ఎంతకాలం అన్నది ఒక ప్రశ్న. ఇటీవలి కాలంలో చూస్తే అన్ని దేశాలూ ముఖ్యంగా ధనిక దేశాలు చైనా పట్ల ముద్దులాట-దెబ్బలాటలు అడుతున్నాయి. అమెరికా బెదిరింపులు, అదే సమయంలో ఐరోపా దేశాల మౌనం దానిలో భాగమే. మన విషయానికి వస్తే ఏటేటా చైనాతో వాణిజ్యలోటు పెరిగిపోతోంది. గడిచిన పది సంవత్సరాలలో ఈ మొత్తం 16 నుంచి 51బిలియన్‌ డాలర్లకు పెరిగింది.నరేంద్రమోడీ హయాంలో గత నాలుగు సంవత్సరాలలో తగ్గుదల తప్ప పెరుగుదల లేదు. కారణం చైనాతో రాజకీయంగా వైరభావంతో వుండటం ఒకటి అని వేరే చెప్పనవసరం లేదు. గత కొద్ది కాలంగా మన ఎగుమతిదారుల లాబీవత్తిడి కారణంగా ఈ మధ్య నరేంద్రమోడీ ఎలాంటి అజెండా లేకుండానే చైనా పర్యటన జరిపి వచ్చారు. పైకి అలా కనిపించినప్పటికీ మన దిగుమతులు పెంచాలని కోరటమే అసలు లక్ష్యం. అందుకే చైనాపై రెచ్చగొట్టే వైఖరిని ఇటీవలి కాలంలో తగ్గించింది అని కూడా చెప్పాలి.

Image result for narendra modi foreign policy, china cartoons

ఇరాన్‌తో రాజకీయ వైరంలో భాగంగానే దానితో కుదిరిన అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగింది. అయితే దానికనుగుణ్యంగా మన దేశం కూడా ఇరాన్‌తో తెగతెంపులు చేసుకుంటే నష్టపోయేది మనమే. అసలే చమురు ధరలు పెరుగుతూ దడపుట్టిస్తున్న తరుణంలో రూపాయి వాణిజ్యానికి అంగీకరించిన ఇరాన్‌ను వదులుకుంటే ఇబ్బంది మనకే. అందుకే అణుఒప్పందం విషయంలో మన వైఖరి ఇరాన్‌కు అనుకూలంగానే వుంది. మొత్తం మీద చూసినపుడు అమెరికా వైపే మొగ్గుచూపుతున్నప్పటికీ అది తమ లాభాలకు ముప్పురానంత వరకే మన కార్పొరేట్‌ రంగం దానిని అనుమతిస్తుంది, మొదటికే మోసం వచ్చినపుడు ప్రతిఘటించటం తప్పనిసరి.