Tags

, , , , ,

Image result for nato brussels summit 2018

ఎం కోటేశ్వరరావు

గత కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్న వారికి ఒక మౌలిక ప్రశ్న తలెత్తుతోంది.అమెరికా పాలకవర్గం(దాని ప్రతినిధులు రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీలనేతలు) ప్రపంచాన్ని ఏవైపు తీసుకుపోతున్నది? పర్యవసానాలు ఎలా వుంటాయి? ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌, వుత్తర కొరియాతో అణు సమస్యపై తొలిసారిగా ఒక ఒప్పందానికి వస్తున్నట్లు ప్రకటించాడు. ఇరాన్‌తో ఏ దేశమైనా లావాదేవీలు జరిపితే వాటి మీద కూడా తన కొరడా ఝళిపిస్తానని భారత్‌ వంటి దేశాలను బెదిరించాడు.కెనడాలో జరిగిన జి7 సమావేశంలో అన్నింటా తన అనుయాయిగా వున్న కెనడా, ఇతర మిత్ర దేశాల మీద విరుచుకుపడ్డాడు. చైనాతో పాటు కెనడా, మెక్సికో, ఐరోపా యూనియన్‌ మీద కూడా వాణిజ్య యుద్దం ప్రకటించాడు. తాజాగా ఈనెల 11,12 తేదీలలో జరిగిన నాటో కూటమి దేశాల సమావేశంలో మిలిటరీ ఖర్చు పెంచుతారా లేదా అంటూ బెదిరింపులకు దిగాడు. ఐరోపా యూనియన్‌లో అగ్రరాజ్యమైన జర్మనీపై విరుచుకుపడుతూ ఇంధనం కోసం రష్యా చేతిలో బందీ అయిందని మండిపడ్డాడు. నాటో ఖర్చు అంతటినీ అమెరికాయే భరిస్తోందంటూ అతిశయోక్తులు పలికి అపహాస్యం పాలయ్యాడు. అంతే కాదు దాదాపు అన్ని విషయాల్లో అమెరికాకు వత్తాసు పలుకుతూ, ఐరోపా యూనియన్‌లో అమెరికా ఏజంటు వంటిది అని పేరు తెచ్చుకున్న బ్రిటన్‌ను కూడా ట్రంప్‌ వదల్లేదు. ప్రధాని థెరెస్సా మే గురించి, బ్రెక్సిట్‌ గురించి నోరుపారవేసుకున్నాడు. దీంతో సోమవారం నాడు బ్రిటన్‌ పర్యటనలో లక్షలాది మంది నిరసన ఎదుర్కొన్నాడు. బ్రసెల్స్‌ నాటో సమావేశంలో నిజమైన బేధాభిప్రాయం దానికి నిధుల చెల్లింపు గురించే అని నాటో వర్గాలు వెల్లడించాయి. లోపల ఎన్ని బేధాభిప్రాయాలు వున్నా, ట్రంప్‌ ప్రవర్తనపై అసంతృప్తి వున్నా ఐరోపా నేతలు సంయమనం పాటించారు. తాత్కాలికంగా అయినా ట్రంప్‌ను సంతృపరచేందుకు ప్రయత్నించారు. ఈ పరిణామలన్నీ దేనికి సూచిక ?

ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ముఖ్యంగా సోవియట్‌ పూర్వపు రిపబ్లిక్‌లైన జార్జియా, వుక్రెయిన్లలో రష్యా మిలిటరీ జోక్యం ముగిసిందనుకున్న ప్రచ్చన్న యుద్ధం మరో రూపంలో ప్రారంభం అవుతుందా అన్న ప్రశ్నను రేకెత్తించాయి. రష్యాను ఒంటరిని చేయాలని నాటో అనే శిఖండిని ముందు పెట్టుకొని అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు ఎలా ప్రయత్నిస్తున్నాయో రష్యా కూడా నాటోలో రాజకీయ విబేధ విత్తనాలు నాటేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. బ్రసెల్స్‌ సమావేశాల్లో వాటి గురించి స్వయంగా అమెరికాయే బయటపడటం విశేషం. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా, ఐరోపా దేశాలు 1949లో వుమ్మడి మిలిటరీ రక్షణ కూటమిగా వుత్తర అట్లాంటిక్‌ సంధి సంస్ధ(నాటో)గా ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటిలో 29దేశాలు వున్నాయి. నాటి సోవియట్‌ నుంచి రక్షించుకొనే పేరుతో ఏర్పడిన ఈ సంస్ధ 1991 అది రద్దయిన తరువాత కూడా కొనసాగటమే కాదు, దాని ఖర్చును రెట్టింపు చేయాలని తాజాగా బ్రసెల్స్‌లో జరిగిన సమావేశంలో డోనాల్డ్‌ ట్రంప్‌ సభ్యరాజ్యాలను డిమాండ్‌ చేశాడు. గత ఏడు దశాబ్దాలలో కమ్యూనిస్టు సోవియట్‌ లేదా తరువాత దాని వారసురాలిగా మారిన పెట్టుబడిదారీ రష్యా గానీ నాటో సభ్యరాజ్యాల మీద దాడి లేదా ప్రయత్నం కూడా చేయలేదు. అయినా సరే దాన్నింకా బలపరచాలని అమెరికా కోరటం వెనుక వున్న వుద్దేశ్యం ఏమిటి? ఎవరి నుంచి ముప్పు వస్తుస్తుందని ఐరోపా రాజ్యాలు భయపడుతున్నాయి?

1991లో సోవియట్‌ యూనియన్‌ను కూల్చివేశారు. అప్పటి వరకు దానికి వ్యతిరేకంగా పని చేసిన నాటో తదుపరి ప్రయాణం ఏదిశగా సాగాలి, అసలు కొనసాగటం అవసరమా అన్న దిశలో చర్చలు జరిగాయి. పశ్చిమ ఐరోపాతో పాటు తూర్పు ప్రాంతానికి కూడా రక్షణ ఛత్రాన్ని విస్తరింప చేయాలని నాటి బిల్‌క్లింటన్‌ సర్కార్‌ మొగ్గు చూపింది. ప్రపంచం మీద పెత్తనం కొనసాగించాలన్నదే అంతర్గత అంశం. సోవియట్‌ ముప్పు లేకపోయిన తరువాత ఐరోపా రక్షణకు అమెరికా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదని కొంత మంది అమెరికా రక్షణశాఖలో అభిప్రాయాలు వెల్లడయ్యాయి. నాటో విస్తరణ కూటమిని పలుచన చేస్తుందని బ్రిటన్‌, విస్తరణ నాటో ప్రభావాన్ని అవసరానికి మించి పెంచుతుందని ఫ్రాన్స్‌ భయం వ్య్తం చేసింది. చిత్రం ఏమిటంటే 69 సంవత్సరాల క్రితం నాటో ఏర్పాటు లక్ష్యం వేరు, ఆచరణలో దాన్ని వినియోగిస్తున్న తీరు వేరుగా వుంది. నాటో ఒప్పందం ప్రకారం ఐరోపా, వుత్తర అమెరికా ఖండంలోని సభ్య రాజ్యాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిపై ఎవరైనా దాడి చేస్తే అందరి మీద జరిగిన దాడిగా పరిగణించి ప్రతిఘటించాలి. ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి కూడా అటువంటి దాడి జరగలేదు. సరికదా నాటో దేశాల సరిహద్దుల వెలుపల నాటో సభ్య దేశాలే ఏదో ఒకసాకుతో మిలిటరీ జోక్యం చేసుకుంటున్నాయి. కొత్త భద్రతా సమస్యలు తలెత్తాయనే పేరుతో దాన్ని కొనసాగించేందుకు కొత్త సాకులు వెతుకుతున్నాయి.

Nato

1990దశకంలో నాటి యుగోస్లావియా జాతుల విబేధాలతో ముక్కలైంది. ఐక్యరాజ్యసమితి బోస్నియా, హెర్జెగోవినా మీద విమానాలు ఎగరకూడదని ఆంక్షలు విధించింది. దాన్ని అవకాశంగా తీసుకొని తొలిసారిగా నాటో దళాలు 1994లో నాలుగు బోస్నియా విమానాలను కూల్చివేశాయి. ఆ తరువాత కొసోవోలో శాంతి పరిరక్షణ పేరిట, మధ్యధరా సముద్రంలో భద్రతా గస్తీ, సోమాలియాలో ఆఫ్రికన్‌ దళాలకు మద్దతు, ఆఫ్ఘనిస్తాన్‌లో వుగ్రవాదానికి వ్యతిరేకంగా మద్దతు పేరుతో నాటో జోక్యం చేసుకుంది. ఇవన్నీ అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాద ఎత్తుగడలు, లక్ష్యాలలో భాగంగానే జరిగాయి తప్ప ఐరోపాకు వచ్చిన ముప్పేమీ లేదు. ఇంతే కాదు ఐక్యరాజ్యసమితి లక్ష్యాలను నీరుగార్చి, దాని లక్ష్యాలను కూడా దెబ్బతీసే విధంగా నాటో రాజ్యాలు వ్యవహరిస్తున్నాయి. వుదాహరణకు లిబియా మీద 2011లో ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది. వాటిని అమలు జరిపే పేరుతో రంగంలోకి వచ్చిన అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తరువాత కొద్ది రోజుల్లోనే ఆ బాధ్యతను నాటో కమాండ్‌కు అప్పగించాయి. టర్కీ ఆందోళన వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదు.లిబియాపై దాడులు చేసేందుకు జర్మనీ, పోలాండ్‌ తిరస్కరించాయి.

తమ సభ్యదేశంపై జరిగిన దాడిని వుమ్మడిగా ఎదుర్కోవాలనే సూత్రాన్ని 2001లో ఆప్ఘనిస్తాన్‌లో నాటో ముందుకు తెచ్చింది. వుగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే పేరుతో అక్కడ జోక్యం చేసుకుంది అమెరికా.అమెరికా సేనల మీద దాడులు జరిపింది ఆల్‌ఖైదా వుగ్రవాదులు. దానికి నాటో సూత్రానికి లంకెపెట్టి అమెరికా నాయకత్వంలోని దళాలు అక్కడి ప్రభుత్వానికి సాయం చేసే పేరుతో తిష్టవేశాయి. రెండు సంవత్సరాల తరువాత ఆ బాధ్యతను నాటో స్వీకరించింది.అయితే కొన్ని దేశాలు జాతీయ కారణాలు చూపి ఆ దాడులకు తమ సైన్యాన్ని పంపలేదు. నాటో, దాని భాగస్వామ్య దేశాల పేరుతో 50కిపైగా దేశాల నుంచి లక్షా 30వేల మంది సైన్యాన్ని దించి 2014వరకు దాడులు చేశారు. వాటిలో వుగ్రవాదుల చేతుల్లో మరణించిన వారిలో చురుకుగా పాల్గన్న అమెరికా, బ్రిటన్‌, కెనడా, నెదర్లాండ్స్‌ వంటి దేశాలవారే అధికులు. ఆ తరువాత గత నాలుగు సంవత్సరాలుగా అక్కడి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పేరుతో 16వేల మంది నాటో సైనికులు అక్కడ కొనసాగుతుండగా వారిలో సగం మంది అమెరికన్లే. అదే ఆల్‌ఖైదా వుగ్రవాదులకు అమెరికాతో పాటు ఐరోపా పశ్చిమ దేశాలన్నీ అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి సిరియాలో వున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించటాన్ని గమనించాలి. వాటికి వ్యతిరేకంగా అక్కడ రష్యా సేనలు సిరియాకు మద్దతు ఇస్తున్నాయి. నాటో విస్తరణ ఐరోపాకే పరిమితం చేయలేదు. రష్యాను చుట్టుముట్టేందుకు ఆసియాలోని అజర్‌బైజాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ తదితర దేశాలకు సైతం ఏదో ఒకసాకుతో విస్తరించేందుకు పూనుకున్నారు. దీని వెనుక రష్యాను దిగ్బంధనం చేయటంతో పాటు ఇరాన్‌ సరిహద్దుల వరకు నాటో పేరుతో అమెరికా దళాలను రప్పించే ఎత్తుగడ వుంది. అజర్‌బైజాన్‌ సరిహద్దులో ఇరాన్‌ వుంది. 1990దశకంలో జర్మనీ ఏకీకరణ సమయంలో నాటోను తూర్పు దిశగా విస్తరించబోమని అమెరికా ఇచ్చిన హామీలకు భిన్నంగా తూర్పుకే కాదు, చివరకు ఆసియాకు సైతం వస్తున్నది. అందువలన నాటో ఏర్పడిన లక్ష్యాలకు, ఇప్పుడు చేస్తున్నదానికి వున్న ఏకైక లక్ష్యం ఏమిటంటే అప్పుడూ ఇప్పుడూ ఈ ప్రాంతంపై అమెరికా పెత్తనాన్ని విస్తరించటమే. నాటోను కొనసాగించితే దీర్ఘకాలంలో ప్రమాదముంటుంది, అదే తూర్పుదిశగా వేగంగా విస్తరింపచేస్తే రష్యాను నయా సామ్రాజ్యవాద దేశంగా మార్చటానికి దారితీస్తుందని 1994లో అమెరికా విదేశాంగ మంత్రి వారెన్‌ క్రిస్టోఫర్‌ హెచ్చరించారు. అయితే రష్యా, నాటో వైపు నుంచి కూడా పరిస్ధితిని దిగజార్చకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వుక్రెయిన్‌ తూరుప్రాంతంలోని క్రిమియాను రష్యా తనలో విలీనం చేసుకుంది. జార్జియాలో కూడా జోక్యం చేసుకొని తన పలుకుబడిని పెంచుకుంటున్నది . వాటిని చూపి ఐరోపాకు ముప్పుతొలగలేదని అమెరికా చెబుతున్నది. రష్యాపై ఆంక్షలను విధిస్తున్నది. వాటిని కొన్ని ఐరోపా దేశాలు సమర్ధిస్తున్నాయి. 2014 నుంచి రష్యాతో పౌర, మిలిటరీ సహకారాన్ని నాటో నిలిపివేసింది. తూర్పు ఐరోపాలో బాల్టిక్‌ సముద్ర ప్రాంతంలో మిలిటరీ కార్యకలాపాలను పెంచింది. ఈ రెండు దేశాలను నాటోలో చేర్చుకుంటే పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని రష్యా హెచ్చరిస్తున్నది. ఈ కారణంగానే ఆ దేశాలను నాటోలో చేర్చుకొనేందుకు కూటమి దేశాలు తొందరపడటం లేదు. వాటిని ఈపాటికి చేర్చుకొని వుంటే పరిణామాలు, పర్యవసానాలు వేరే విధంగా వుండి వుండేవి. అయితే రష్యా మద్దతు వున్న తిరుగుబాటదార్లను అదుపు చేసే పేరుతో వుక్రెయిన్‌కు అత్యంత అధునాత ఆయుధాలను అమెరికా విక్రయిస్తున్నది. క్రిమియాను విలీనం చేసుకున్న తరువాత అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ చేసిన వుపన్యాసంలో నాటో కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ అనేకసార్లు వారు మాతో అబద్దాలు చెప్పారు, మాకు తెలియకుండా నిర్ణయాలు తీసుకున్నారు, తూర్పు దిశగా నాటో విస్తరణ జరిగింది, మా సరిహద్దులలో మిలిటరీ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు, ఒక్క ముక్కలో చెప్పాలంటే మమల్ని అదుపు చేయాలనే పశ్చిమదేశాల విధానంతో పద్దెనిమిది, పందొమ్మిది, ఇరవయశతాబ్దాలలో నడిచాయి, నేడు కూడా కొనసాగిస్తున్నాయి.’ అన్నారు.

తమదేశంతో సహా రష్యా విదేశాల ఎన్నికలలో జోక్యం చేసుకుంటున్నది, నూతన అణ్వాయుధాలను తయారు చేస్తున్నది. ఐరోపాలోని వ్యవస్ధలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నది, ఐరోపా రక్షణలో అమెరికా విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నది అని అమెరికా ఆరోపిస్తున్నది. ఐరోపాలో తాను ఏర్పాటు చేస్తున్న పరిమిత క్షిపణి రక్షణ వ్యవస్ధలు ఇరాన్‌ దాడిని ఎదుర్కొనేందుకు అని అమెరికా చెబుతున్నది. ఈ మాటలను ఎవరూ నమ్మరని వేరే చెప్పనవసరం లేదు. క్రిమియాలో రష్యా జోక్యాన్ని సాకుగా చూపుతూ తటస్ధ దేశాలుగా వున్న ఫిన్లండ్‌, స్వీడన్‌లను కూడా నాటో చేర్చుకొనేందుకు పావులు కదుపుతున్నారు. ఇదే సమయంలో రష్యా నుంచి ఆధునిక క్షిపణి వ్యవస్ధలను సమకూర్చుకొనేందుకు టర్కీ పాలకులు ప్రయత్నించటానికి నాటోలోని మిగతా దేశాలు అభ్యంతర పెడుతున్నాయి.

ఈ పూర్వరంగంలో జూలై 11,12 తేదీలలో బ్రసెల్స్‌లో నాటో కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశాలలో ట్రంప్‌ వ్యవహరించిన తీరు అపహాస్యం పాలైంది. బ్రసెల్స్‌ సమావేశం విజయవంతమైందని ట్రంప్‌ ప్రకటించాడు. సభ్యదేశాల నేతలతో తన సంబంధాలు ఎంతో బాగున్నాయని మరీ మరీ చెప్పాడు. అయితే జరిగిన పరిణామాలు అలా కనిపించటం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్‌-రుమేనియా అధ్యక్షుడు క్లాస్‌ లోహానిస్‌ భేఠీ వార్తల సేకరణ వుందంటూ ప్రధాన వార్తా కేంద్రం నుంచి వెళ్లిపోయిన రుమేనియా విలేకర్లు వెంటనే తిరిగి వచ్చి సమావేశం రద్దయినట్లు తెలిపారు. అంతే కాదు అజర్‌బైజాన్‌, వుక్రెయిన్‌, జార్జియానేతలతో వుందన్న సమావేశాల పరిస్ధితీ అదే అయింది.

గతంలో సభ్యరాజ్యాల స్ధూల జాతీయాదాయం(జిడిపి)లో రెండుశాతం మొత్తాన్ని 2024నాటికి రక్షణకు కేటాయించాలని నాటో నిర్ణయించింది.దాన్ని వచ్చే జనవరి నాటికే అమలు చేయాలని, తరువాత నాలుగుశాతానికి పెంచాలని ట్రంప్‌ పట్టుపట్టాడు. అతగాడితో ఇప్పుడు గొడవెందుకు సరే అలాగే చేద్దాం లెమ్మన్నట్లుగా సభ్యదేశాల స్పందన వుంది. ఈ సమావేశాలలో అమెరికా ఆయుధ కంపెనీల ప్రతినిధిగా ట్రంప్‌ విశ్వరూపం కనిపించింది అంటే అతిశయోక్తి కాదు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘నేను అధికారానికి రాక ముందు ఆయుధాల గురించి విన్నాను గానీ పదవిలోకి వచ్చాక నేను నిజంగా తెలుసుకున్నాను. ఇతరులు తయారు చేసే వాటి కంటే మావి ఎంతో మెరుగైనవి, మీరు మాకంపెనీలు లాక్‌హీడ్‌, బోయింగ్‌, గ్రమ్మన్‌ వంటి వాటిని చూడండి, ఎలాంటి మెటీరియల్‌ను వాడుతున్నామో, ఎంతో నాణ్యమైన పరికరాలను తయారు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మా పరికరాలను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారు. వారెంతో మంచి పని చేస్తున్నారు, వారందరికీ చేయగలరా? కాబట్టి వాటిలో కొన్ని దేశాలకు సాయపడుతున్నాం, మంచి పరికరాలను కొనుగోలు చేయగలుగుతున్నారు.’ ఇలా ఒక కంపెనీ ప్రతినిధి తప్ప ఒక దేశాధినేత చెప్పే మాటలుకావు. ఈ సమావేశాలలో ట్రంప్‌ తన అజెండాకు ఆమోదముద్ర వేయించుకున్నాడా లేదా అన్న చర్చ జరుగుతోంది.

సమావేశాల ప్రారంభంలోనే ట్రంప్‌ జర్మనీపై దాడికి దిగాడు. ఇంధనం కోసం ఎక్కువగా ఆధారపడి తనంతట తానే రష్యాకు బందీ అయిందని, నాటో రక్షణ నిమిత్తం చెల్లింపులలో విఫలమైందని ఆరోపించాడు. చమురుకైతే బిలియన్లకు బిలియన్లు చెల్లిస్తారు గానీ నాటో విషయంలో ముందుకు రారు అని వ్యాఖ్యానించాడు. ‘ జర్మనీని రష్యా పూర్తిగా అదుపు చేస్తోంది. ఈ దేశాలు(నాటో కూటమి) కేటాయింపులు పెంచాలి, దశాబ్దకాలంలో కాదు, వెంటనే కేటాయించాలి.జర్మనీ ధనిక దేశం, వారు కొద్దికొద్దిగా 2030నాటికి పెంచుతామంటున్నారు. వారు తక్షణమే, రేపే పెంచితే మాకెలాంటి సమస్య వుండదు.(విలేకర్ల సమావేశంలో పక్కనే వున్న నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్‌ బర్గ్‌తో మాట్లాడుతూ) ప్రతి ఏటా గ్యాస్‌ కోసం జర్మన్లు బిలియన్లకొద్దీ డాలర్లు రష్యాకు చెల్లిస్తుంటారు, కానీ రష్యా నుంచి రక్షించాలని మమ్మల్ని కోరతారు, ఇది సరైంది కాదని నేను అనుకుంటున్నాను. రష్యా చేతిలో జర్మనీ బందీ అయింది, తన ఇంధనంలో 70శాతాన్ని రష్యా నుంచి పొందుతోంది.’ అన్నాడు.

రష్యా నుంచి బాల్టిక్‌ సముద్ర ప్రాంత దేశాలన్నింటికీ గ్యాస్‌ను సరఫరా చేసే పదకొండు బిలియన్‌ డాలర్ల పైప్‌లైన్‌కు జర్మనీ మద్దతు తెలిపింది. ఈ వైఖరి ఇతర ఐరోపా దేశాలకు నచ్చలేదు. ‘ ఇది ప్రయివేటు వాణిజ్య పధకం, దీనికి జర్మన్లు చెల్లించిన పన్నుల నుంచి ఎలాంటి కేటాయింపులు లేవని జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ స్పష్టం చేశారు.జర్మనీ రక్షణ మంత్రి అర్సులా వాండెర్‌ లేయాన్‌ మాట్లాడుతూ మాకు రష్యాతో అనేక సమస్యలున్నాయనటంలో ఎలాంటి సందేహం వుండనవసరం లేదు. మరోవైపు దేశాలు లేదా కూటములు మరియు వ్యతిరేకులతో కూడా సమాచార సంబంధాలను కొనసాగించాల్సి వుంది.’ అన్నారు. రష్యన్‌ గ్యాస్‌ మీద ఆధారపడటాన్ని తగ్గించాలనే అంశంపై నాటోలోని ఐరోపా దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదని స్టోల్టెన్‌ బర్గ్‌ కూడా చెప్పారు.

తొలి రోజే అనేక మంది దేశాధినేతలతో ప్రయివేటుగా చర్చలు జరపటంతో రెండో రోజు అజెండా అంశాలపై ఎవరూ భిన్నాభిప్రాయం వెల్లడించలేదు. మిగతా దేశాధినేతలందరూ వుదయం తొమ్మిది గంటలలోపే సమావేశానికి హాజరైనప్పటికీ ట్రంప్‌ కావాలనే ఆలస్యంగా వచ్చారని విమర్శలు వచ్చాయి. జార్జియా, ఆప్ఘనిస్తాన్‌ల గురించి చర్చించే అజెండా వున్నప్పటికీ అదేమీ పట్టనట్లుగా యూరోపియన్ల రక్షణ ఖర్చు గురించి మాట్లాడటం మొదలెట్టారు. వచ్చే ఏడాది జనవరిలోగా ఖర్చుల కేటాయింపు పెంచనట్లయితే అమెరికా తనదారి తాను చూసుకుంటుందని వ్యాఖ్యానించగానే సమావేశంలో వున్నవారంతా అవాక్కయ్యారు. ట్రంప్‌ మాటల గురించి ఎవరూ విబేధించలేదు గానీ వాటికి మాత్రం భిన్న భాష్యాలు వెల్లడయ్యాయి. దీని అర్ధం అమెరికాతో ఘర్షణ పడటానికి ప్రస్తుతానికి ఎవరూ సిద్ధంగా లేరన్నది స్పష్టం.

రక్షణ ఖర్చు పెంచని పక్షంలో తాము నాటో నుంచి వైదొలుగుతామని ట్రంప్‌ బెదిరించినట్లుగా రాయిటర్స్‌ పేర్కొన్నది. ట్రంప్‌ మాటలకు అర్ధం అదని తాను భావించటం లేదని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ పేర్కొన్నాడు. ట్రంప్‌ వ్యాఖ్యలతో సమావేశ గదిలో విస్మయం వ్యక్తం కావటంతో నాటో జనరల్‌ సెక్రటరీ వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి అక్కడే వున్న ఆఫ్ఘనిస్తాన్‌, అజర్‌బైజాన్‌ ప్రతినిధులతో మీరు నాటో సభ్యులు కానందున బయటకు వెళ్లండని చెప్పారు. తరువాత సమావేశంలో ఎవరూ ఎలాంటి కొత్త ప్రతిపాదనలూ చేయలేదు, ఐరోపా నాయకులందరూ అంతకు ముందు ప్రకటించిన మీడియా సమావేశాలను రద్దు చేసుకొని నేరుగా విమానాశ్రయాలకు వెళ్లిపోయారు. మీడియా సమావేశ కార్యక్రమం లేనప్పటికీ షెడ్యూలు మార్చుకొని ట్రంప్‌ 35నిమిషాలు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశం జయప్రదమైందని, ఇతర నేతలతో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పుకున్నారు. ట్రంప్‌తో ఎలాంటి వుద్రిక్తత ఏర్పడలేదని, ట్రంప్‌ ముక్కుసూటిగా మాట్లాడి వుండవచ్చు,కేటాయింపు పెంచుతామని సభ్యులు వాగ్దానం చేశారని నాటో ప్రధాన కార్యదర్శి అన్నారు.

రష్యా నుంచి ముప్పు వస్తోందనే పేరుతో నాటో కూటమి గతేడాది 900బిలియన్‌ అంటే దాదాపు లక్షకోట్ల డాలర్లను ఖర్చు చేశాయి. వీటిలో అధికభాగం అమెరికా ఖర్చు చేసిన మాట నిజమే. కానీ అదే రీతిలో ఆ సొమ్ములో అధిక భాగం తిరిగి అమెరికన్‌ సైన్యం, అమెరికన్‌ ఆయుధ కంపెనీలకే చేరుతుందనే విషయం చెప్పనవసరం లేదు. ఇదే సమయంలో రష్యా చేసిన ఖర్చు కేవలం 66 బిలియన్‌ డాలర్లు మాత్రమే. అవసరం లేకపోయినా విస్తరణ పేరుతో నాటో మిలిటరీని రష్యా ముంగిటకు తీసుకుపోతున్న అమెరికా ఎత్తుగడలే నేడు ఐరోపాలో వుద్రిక్తతలకు కారణం అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఐరోపాకు లేని ముప్పును చూపుతూ అమెరికా మిలిటరీ కార్పొరేట్‌లు ఐరోపా దేశాలను అదిరించి బెదిరించి తమ ఆయుధాలను, వినిమయ వస్తువులను అంటగట్టేందుకు చూడటం తప్ప ట్రంప్‌ చర్యల్లో మరొకటి కనిపించటం లేదు.

ఐరోపా రాజ్యాలు అమెరికాతో ప్రత్యక్ష ఘర్షణకు సిద్ధం కాదు. అందుకే ఒకవైపు దానితో మిత్రత్వాన్ని నెరపుతూనే తమ ప్రయోజనాలను తాము చూసుకుంటున్నాయని చెప్పవచ్చు. వుదాహరణకు అనేక అంశాలలో అమెరికా వైఖరిని ఐరోపాయూనియన్‌ ఏకీభవించటం లేదు. వుక్రెయిన్‌లో భాగంగా వున్న క్రిమియాను అక్కడి పౌరుల ఆకాంక్షలకు అనుగుణ్యంగా రష్యా తనలో విలీనం చేసుకున్నది.ఆ చర్యను జర్మనీ విమర్శించినప్పటికీ తనకు అవసరమైన చమురు అవసరాలకోసం రష్యన్‌ చమురు కంపెనీ గాజ్‌పోమ్‌తో జర్మనీ 11 బిలియన్‌ డాలర్లతో ఒకపైప్‌లైన్‌ నిర్మాణంపై 2015లో ఒప్పందం చేసుకుంది. దాని గురించే ట్రంప్‌ బ్రసెల్స్‌లో జర్మనీపై విరుచుకుపడ్డాడు. నాటో రక్షణ ఖర్చును తమకు ఇవ్వాలని అమెరికా పట్టుబడుతున్నది, అయితే ఐరోపా దేశాలు ఆ ఖర్చుతో తమ ఏర్పాట్లను తాము చేసుకుంటున్నాయి, ఆ మొత్తాలను కూడా నాటో ఖర్చులో భాగంగానే చూపుతున్నాయి. నాటో సమావేశాలకు ముందు ట్రంప్‌ చేసిన ట్వీట్లు, వ్యాఖ్యలను గమనించటం అవసరం. నాటోలోని అనేక దేశాలు తమను రక్షించాలని కోరుకుంటాయి, అవి అంగీకరించిన మేరకు జిడిపిలో రెండుశాతం ఖర్చుచేయకపోవటమే కాదు, ఏండ్ల తరబడి వుపేక్షిస్తున్నాయి, అవి పాతబకాయిలను కూడా చెల్లిస్తాయా?అని ట్వీట్‌ చేశాడు. బ్రసెల్స్‌ బయలు దేరే ముందు ‘ఐరోపాలో మా రైతులు, కార్మికులు, కంపెనీలు వ్యాపారం చేయటాన్ని ఐరోపా యూనియన్‌ అసాధ్యం గావిస్తున్నది, మరోవైపు నాటో ద్వారా మేము సంతోషంగా వారిని రక్షించాలని కోరుకుంటారు, దానికి నాజూకు చెల్లింపులు చేస్తారు, ఇలా ఎలా పని జరుగుతుంది.’ అన్న ట్రంప్‌ వచ్చీ రావటంతోనే జర్మనీపై విరుచుకు పడ్డారు. రష్యా చేతిలో జర్మనీ బందీ అయింది అన్న ట్రంప్‌తో తాను ఏకీభవించటం లేదని ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ పేర్కొన్నారు. తమను మాస్కో గానీ వాషింగ్టన్‌గానీ అదుపు చేయటం లేదని జర్మన్‌ అధికారులు తిప్పికొట్టారు.

తాను ఎక్కడ వున్నా అమెరికన్ల గురించే ఆలోచిస్తూ వుంటానని చెప్పేందుకు ట్రంప్‌ ప్రయత్నించాడు.’నేను ఇప్పుడు బ్రసెల్స్‌లో వున్నప్పటికీ మన రైతుల గురించే ఎల్లవేళలా ఆలోచిస్తున్నాను. 2012 నుంచి నా ఎన్నిక నాటికి సోయాబీన్స్‌ ధర సగం పడిపోయింది, గత పదిహేను సంవత్సరాలుగా రైతులకు తక్కువగా చెల్లిస్తున్నారు. ఇతర దేశాల వాణిజ్య ఆటంకాలు మరియు పన్నులతో వారి వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. నేను గతం కంటే మెరుగ్గా ఈ సమస్యలను లేవనెత్తుతాను, అయితే అది అంతత్వరగా ముందుకు పోదు. మన రైతులందరికీ సమాన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను, మనం విజయం సాధిస్తాము ‘ ఇలా సాగింది.

నాటో కొనసాగాల్సిన అవసరం గురించి సంస్ధ ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలటెన్‌బర్గ్‌ మాట్లాడుతూ ‘ బలమైన నాటో ఐరోపా, అమెరికాకు మంచిది. విడిపోవటం కంటే కలసి వుంటే ధృడంగా వుంటామని రెండు ప్రపంచ యుద్ధాలు, ప్రచ్చన్న యుద్ధం మాకు నేర్పాయి.ఐరోపాలో అమెరికా మిలిటరీ,కెనడా వునికి ఐరోపాకు మాత్రమే కాదు వుత్తర అమెరికా మరియు ప్రత్యేకించి అమెరికా(యుఎస్‌)కు మంచిది, ఎందుకంటే అమెరికా ఒక ప్రపంచ శక్తిగా ఎదగటానికి అది తోడ్పడుతుంది. బాల్టిక్‌ సముద్ర గ్యాస్‌ పైప్‌లైన్‌కు జర్మనీ మద్దతు ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించాల్సింది నాటో సభ్యదేశాలు కాదు, అది ఒక జాతీయ నిర్ణయం.’

నాటో తొలిరోజు సమావేశ ప్రారంభానికి ముందు వుదయపు అల్పాహార విందు సందర్భంగా ట్రంప్‌ వ్యాఖ్యలు విస్మయాన్ని కలిగించాయి. నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్‌బర్గ్‌తో నాటో ఖర్చులో అత్యధిక భాగం తమ దేశమే భరిస్తోందని వ్యాఖ్యానించాడు. జర్మనీ ఒకశాతం కంటే కొద్దిగా ఎక్కుగా చెల్లిస్తోంది. అదే అమెరికా జిడిపిలో 4.2శాతం చెల్లిస్తోంది. ఇది సరైంది కాదు, మేము జర్మనీని రక్షిస్తున్నాము, మేము ఫ్రాన్స్‌ను రక్షిస్తున్నాము, మేము ప్రతి ఒక్కరినీ రక్షిస్తున్నాము. దానికి ఇంకా మేము ఎంతో చెల్లిస్తున్నాము. విందు అనంతరం ట్రంప్‌ వైఖరిని స్టోల్టెన్‌ బర్గ్‌ అపహాస్యం చేశాడు. వుదయపు అల్పాహార విందు బాగుంది…. దీనికి అమెరికాయే బిల్లు చెల్లించింది అని వ్యాఖ్యానించాడు. ట్రంప్‌ అధ్యక్షుడు అయిన తరువాత ఐరోపాలో మిలిటరీ వునికి నిమిత్తం 40శాతం నిధులు పెంచాడు. అమెరికా సైన్యాలు ఎక్కువగా వున్నాయి, గతం కంటే విన్యాసాలు, మౌలిక సదుపాయాల నిమిత్తం పెట్టుబడులు కూడా పెరిగాయి’ అన్నాడు.

Image result for nato brussels summit 2018

గతంలో అంగీకరించిన మేరకు నాటో నిర్వహణకు పూర్తిగా నిధులు చెల్లిస్తున్నది అమెరికా, బ్రిటన్‌, పోలాండ్‌, గ్రీస్‌, ఎస్తోనియా మాత్రమే. తాను హాజరైన తొలి సమావేశనాటి కంటే సభ్య దేశాలు చెల్లిస్తున్న మొత్తం గణనీయంగా తగ్గిపోయిందంటూ ట్రంప్‌ అవాస్తవం చెప్పారంటూ పొలిటీ ఫాక్ట్‌ అనే వెబ్‌సైట్‌ పేర్కొన్నది. 2014లో ఐరోపా దేశాలు, కెనడా చెల్లించిన మొత్తం 254బిలియన్‌ డాలర్లు 2017 నాటికి 275కు పెరిగినట్లు పేర్కొన్నది. నాటో ఖర్చులో 70 నుంచి 90శాతం వరకు అమెరికా చెల్లిస్తున్నదని చెప్పటం అవాస్తవమని తెలిపింది. నాటోకు ఎంత ఖర్చు చేయాలనేది ఎక్కడా నిర్ధారించలేదు. సంస్ధ వుమ్మడి నిధిలో అమెరికా 22శాతం చెల్లిస్తున్నది. సభ్యదేశాల రక్షణ బడ్జెట్‌ ఎంతో నాటో సేకరిస్తుంది, వాటి మొత్తాలను కలిపి చూసుకున్నపుడు అమెరికా రక్షణ కోసం 70శాతం ఖర్చు చేస్తున్నది. అమెరికా ప్రపంచ మిలిటరీ శక్తి గనుక అంతవుంది, ఐరోపా సభ్యదేశాలు అలాంటివి కాదు. తమ రైతాంగానికి ఐరోపా యూనియన్‌ తలుపులను మూసింది అని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా కంటే ఐరోపా యూనియన్‌ సగటున చూసినపుడు కొద్దిగా ఎక్కువ పన్నులు విధిస్తున్నది. 30శాతం వ్యవసాయ వుత్పత్తులపై ఇరువైపులా పన్నులు లేకుండా ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. ఫలితంగా 28 సభ్యరాజ్యాలు, ఐరోపా యూనియన్‌ 2017లో అమెరికాకు వ్య వసాయ వుత్పత్తులలో ఐదవ పెద్ద ఎగుమతిదారుగా మారింది. అమెరికా తాను ఎగుమతి చేసుకున్నవాటి కంటే దిగుమతులు ఎక్కువ చేసుకుంది.

గతంలో రెండుశాతం వరకు ఖర్చు చేయాలని అనుకున్నారు, ఇప్పుడు దాన్ని విధిగా చేయాలని ట్రంప్‌ అన్నాడు. రక్షణ నిమిత్తం జిడిపిలో రెండుశాతం ఖర్చు చేయాలని 2006లో అంగీకరించిన మాట వాస్తవం. అయితే అంత మొత్తాన్ని విధిగా ఖర్చు చేయాలనే అంగీకారమేదీ లేదు. ఈ వారంలో ఆ మేరకు నిర్ణయం జరిగిందేమో తెలియదు. రెండుశాతం మొత్తం కేటాయింపులను 2024 నాటికి క్రమంగా పెంచుకుంటూ పోవాలని 2014లో మార్గదర్శక సూత్రాలను ఆమోదించారు. ఆ మేరకు వ్యవహరించినవి ఐదు దేశాలు మాత్రమే. బ్రసెల్స్‌ సమావేశాల తరువాత ట్రంప్‌ బ్రిటన్‌ పర్యటన జరిపారు. సోమవారం నాడు హెల్సింకీలో ట్రంప్‌-పుతిన్‌ భేఠీ జరగనుంది. ఆ తరువాత నాటో, ట్రంప్‌ పర్యటన వివరాల సమాచారం వెల్లడయ్యే అవకాశం వుంది.