Tags

, , , , , ,

Image result for china china china patrick shanahan

ఎం కోటేశ్వరరావు

జనవరి రెండవ తేదీన ప్రపంచంలో జరిగిన పరిణామాలలో రెండు ఆసక్తికరంగా వున్నాయి. ఒకటి అమెరికా రక్షణశాఖ తాత్కాలిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే పాట్రిక్‌ షహనాహన్‌ పెంటగన్‌ అధికారులతో మాట్లాడుతూ మనం ఒకవైపు సిరియా, ఆఫ్ఘనిస్తాన్లలో ఇస్లామిక్‌ తీవ్రవాదులతో పోరాడుతున్నప్పటికీ రాబోయే రోజుల్లో కేంద్రీకరించాల్సింది చైనా, చైనా, చైనా అని వ్యాఖ్యానించినట్లు రక్షణశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. కొన్ని మీడియా సంస్ధలు అదే శీర్షికతో వార్తలను ఇచ్చాయి. దానికి కొద్ది సేపటి ముందే చైనా రాజధాని బీజింగ్‌లో మాట్లాడిన దేశాధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. తోటి తైవాన్‌ సోదరులకు ఒక విన్నపం అంటూ 1979లో చైనా చేసిన ప్రకటన 40వ వార్షికోత్సవం సందర్భంగా రెండు ప్రాంతాల మధ్య ఇంతకాలం నెలకొన్న స్ధిరమైన సంబంధాల దశ నుంచి పునరేకీకరణకు చొరవ చూపాల్సిన సమయమాసన్నమైందని చెప్పారు. బలవంతంగా విలీనం చేసుకొనేందుకు తమకు అవకాశం వున్నా శాంతియుత పద్దతులకే ప్రాధాన్యత ఇస్తామని జింపింగ్‌ చెప్పారు. నిజానికి ఇది తైవాన్‌ కంటే అమెరికాకు చేసిన హెచ్చరికగానే తీసుకోవాల్సి వుంది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న వుద్రిక్తతలకు ఇది ఒక సూచికగా కూడా చెప్పవచ్చు.

ఏడు దశాబ్దాల క్రితం చైనాలో విప్లవం జయప్రదమై కమ్యూనిస్టులు అధికారానికి వచ్చే సమయానికి తైవాన్‌ అనే రాష్ట్రం, కమ్యూనిస్టుల ఆధీనంలోకి రాలేదు. ప్రస్తుతం అక్కడ దాదాపు రెండున్నర కోట్ల మంది జనం వున్నారు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతంగా వున్న హాంకాంగ్‌ బ్రిటీష్‌ వారి కౌలు కింద, మకావో దీవులు పోర్చుగీసు కౌలు కింద వున్నాయి. చుట్టూ సామ్రాజ్యవాదుల కుట్రలు. ఇంటా బయటి శత్రువుల కుట్రలను అధిగమించి ప్రధాన భూభాగం చైనాలో కమ్యూనిస్టులు నిలదొక్కుకోవటానికి దాదాపు పది సంవత్సరాలు పట్టింది.ఈలోగా జరిగిన అనేక పరిణామాల పర్యవసానంగా తైవాన్‌ విలీనం సంక్లిష్టంగా మారింది. కొత్త సమస్యలను ముందుకు తెచ్చింది.

చైనా సంస్కరణలతోపాటు కమ్యూనిస్టు చైనా ప్రభుత్వాన్ని అమెరికా గుర్తించి, తైవాన్‌కు సాంకేతికంగా గుర్తింపు రద్దు చేసి కూడా 40సంవత్సరాలు గడిచాయి. 1978 డిసెంబరు 15న తాము చైనాను గుర్తిస్తున్నట్లు, తైవాన్‌తో దౌత్య సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్లు నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ ప్రకటించారు. ఈ నిర్ణయం 1979 జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఆ రోజు నుంచి తైవాన్‌ సంబంధాల చట్టం పేరుతో అమెరికా తైవాన్‌తో నూతన సంబంధాలకు కూడా నాలుగు దశాబ్దాలు నిండాయి. ఆ చట్టం ప్రకారం అమెరికా ఒక దేశాన్ని అధికారికంగా గుర్తించినపుడు ఎలాంటి సంబంధాలుంటాయో ఒక్క రాయబారకార్యాలయం, రాయబారి నియామకం తప్ప ఆయుధాల విక్రయంతో సహా మిగిలినవన్నీ అనధికారికంగా కొనసాగుతాయి. అందుకుగాను తైవాన్‌లో అమెరికన్‌ సంస్ధ పేరుతో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇంతకాలం ఆధునిక ఆయుధాలు, విమానాలు, జలాంతర్గాములతో సహా అన్నింటినీ తైవాన్‌కు విక్రయించిన అమెరికా గతేడాది తైవాన్‌లో జోక్యానికి ప్రాతిపదికవేసుకుంది. తైపే లోని అమెరికన్‌ సంస్ద రక్షణకు మెరైన్‌ దళాలను పంపాలని అమెరికా విదేశాంగశాఖ ట్రంప్‌ ప్రభుత్వాన్ని కోరింది. అంతకు ముందు తొలిసారిగా 2017లో రెండు యుద్ధనౌకలను తైవాన్‌ జలసంధిలోకి అమెరికా తరలించింది. మరోసారి జెట్‌ యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా పూనుకుంది. ఈ పూర్వరంగంలో గ్జీ జింపింగ్‌ ప్రకటన, హెచ్చరికలను చూడాల్సి వుంది.

1949లో చైనాలో మావో జెడాంగ్‌ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గుర్తించేందుకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలుఐక్యరాజ్యసమితి కూడా నిరాకరించింది. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ మూడు దశాబ్దాల పాటు అసలైన చైనాగా కొనసాగింది. అయితే 1960 దశకంలో సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య సైద్ధాంతిక విబేధాలు తలెత్తిన నేపధ్యం, విదేశీ పెట్టుబడులు అవసరమని చైనా నాయకత్వం భావించిన తరుణంలో ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్‌లో ప్రవేశానికి అవకాశాలు వచ్చాయని అంచనా వేసిన అమెరికా పారిశ్రామిక, వాణిజ్య వర్గాల వత్తిడి మేరకు 1970దశకం రెండవ అర్ధభాగంలో కమ్యూనిస్టు చైనాతో సయోధ్యకు అమెరికా సిద్దపడింది. రాజకీయంగా సోవియట్‌ మీద వత్తిడి పెంచే లక్ష్యం కూడా దాగి వుండటంతో అమెరికా నేతలు చైనాకు దారితీశారు. పరస్పరం లాభదాయకమని గుర్తించి 1979 జనవరి ఒకటి నుంచి దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒకే చైనాను సాంకేతికంగా గుర్తించినప్పటికీ తైవాన్‌ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేంత వరకు, తైవాన్‌ పౌరులు ఆమోదించే వరకు తైవాన్‌పై చైనా సార్వభౌమత్వాన్ని గుర్తించటం లేదని, యథాతధ స్ధితిని మార్చేందుకు తైవాన్‌ లేదా చైనా ప్రయత్నించకూడదని, చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తే తైవాన్‌కు మద్దతు ఇస్తామని తన చట్టంలో రాసుకుంది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో అవాంఛనీయ జోక్యమే అని ఆ చట్టం మీద చైనా వ్యాఖ్యానించింది.

అంతర్భాగమైన తైవాన్‌ దీవులను విలీనం చేసుకొనే అవకాశం వున్నప్పటికీ చైనా తన అధికారాన్ని వుపయోగించలేదు. దీనికి వివిధ అంశాలు దోహదం చేశాయి. 1949లో చైనా పాలకుడిగా వున్న చాంగ్‌కై షేక్‌ తైవాన్‌కు పారిపోతూ తనతో పాటు మొత్తం బంగారు నిల్వలను త్రిదళాలకు చెందిన ఇరవైలక్షల మంది సైనికులను కూడా తరలించాడు. అంతర్యుద్ధ సమయంలో బర్మా సరిహద్దులతో సహా అనేక చోట్ల నిధుల కోసం నల్లమందు సాగును ప్రోత్సహించి పెద్ద మొత్తంలో నిధులు పోగేశాడు. దాదాపు పన్నెండువేల మంది సైనికులు బర్మా సరిహద్దు ప్రాంతాలలో తిష్టవేసి అమెరికా సాయంతో 1954వరకు తిరుగుబాట్లు చేయించాడు. చైనా అధికారం తనదే అని ప్రకటించుకున్నాడు. తైవాన్‌ను సైనిక పరంగా విలీనం చేసుకొనేందుకు మావో నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకున్న సమయంలో 1950లో వుత్తర కొరియాపై అమెరికా నాయకత్వంలోని సేనలు దక్షిణ కొరియా రక్షణ పేరుతో దాడులకు దిగాయి. వుత్తర కొరియాను కాపాడుకొనేందుకు నాటి సోవియట్‌ యూనియన్‌, చైనా తన సైనికబలగాలను ఇటువైపు మళ్లించాల్సి వచ్చింది. దాంతో తైవాన్‌ విలీనం వాయిదా పడింది. ఐక్యరాజ్యసమితిలో అమెరికా అండతో నాడున్న బలాబలాల్లో చాంగ్‌కై షేక్‌ నాయకత్వంలోని ప్రభుత్వాన్నే అధికారికమైనదిగా గుర్తింపును కొనసాగించారు. తరువాత అమెరికన్లు తైవాన్‌ను ఒక బలీయమైన సైనికశక్తిగా నాటి నుంచి నేటి వరకు తయారు చేస్తూనే వున్నారు.

తైవాన్‌ వెన్నుదన్నుగా అమెరికా వున్న పూర్వరంగంలో దాన్ని ఎదిరించి తైవాన్‌ను విలీనం చేసుకోగలిగిన శక్తి చైనాకు ఇటీవలి వరకు లేదన్న విశ్లేషకుల అంచనా వాస్తవానికి దగ్గరగా వుంది. ఇప్పుడు అజెండా, మార్గాన్ని నిర్దేశించే శక్తి వచ్చినట్లు గ్జీ ప్రకటనను బట్టి భావిస్తున్నారు.హాంకాంగ్‌లో 1992లో పాక్షిక అధికారాలు కలిగిన చైనా-తైవాన్‌ ప్రతినిధులు జరిపిన సమావేశంలో చైనా అంటే ఒక్కటే అనే ఒక ఏకాభిప్రాయం వ్యక్తమైంది. రెండు ప్రాంతాల మధ్య సంబంధాల పునరుద్దరణకు నాంది పలికింది. అయితే దానిని గుర్తించేందుకు తైవాన్‌లోని డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ నిరాకరిస్తోంది. భిన్న భాష్యాలు చెబుతోంది. చైనా ఒక్కటే, అవిభక్త దేశానికి ఏకైక ప్రతినిధి పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా(పిఆర్‌సి), ఒకే దేశంలో రెండు వ్యవస్ధలు, విలీనం శాంతియుతంగా జరగాలి, తప్పని సరి అయితే బలప్రయోగం తప్పదు అన్నది బీజింగ్‌ భాష్యం. తైవాన్‌ కేంద్రంగా వున్న డెమోక్రటిక్‌ పార్టీ, మరికొందరి భాష్యం ప్రకారం చైనా ఒక్కటే, దాని అసలైన ప్రతినిధి రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా(ఆర్‌ఓసి), జలసంధికి రెండువైపులా వున్న ఒకే దేశం. రెండు ముక్కలూ సార్వభౌమత్వం కలిగినవే. రెండు దేశాలూ సంప్రదించుకోవచ్చు. విలీనానికి బల ప్రయోగం జరపబోమని మేము వాగ్దానం చేయటం లేదు, అన్ని రకాల అవసరమైన పద్దతులను కలిగి వుంటాం. తైవాన్‌ స్వాతంత్య్రం అనేది చరిత్ర ధోరణికి వ్యతిరేకం, మరొక మార్గం లేని చోటుకు అది తీసుకుపోతుంది. శాంతియుత విలీనం తరువాత తైవాన్‌ సోదరుల సామాజిక వ్యవస్ధను జీవన విధానాన్ని పూర్తిగా గౌరవిస్తాం, ప్రయివేటు ఆస్ధులు, మతవిశ్వాసాలను, న్యాయమైన హక్కులు, ప్రయోజనాలను పూర్తిగా రక్షిస్తాం అని జనవరి రెండవ తేదీన గ్జీ స్పష్టం చేశారు. గతేడాది జరిగిన స్ధానిక ఎన్నికలలో 1992ఏకాభిప్రాయాన్ని గుర్తించని, వ్యతిరేకించే డిపిపి, కొమింటాంగ్‌ పార్టీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సాధారణ ఎన్నికలు 2020లో జరగనున్నాయి. హాంకాంగ్‌, మకావూల విలీనం సమయంలో అక్కడ వున్న పెట్టుబడిదారీ వ్యవస్ధలను 2049 డిసెంబరు 31వరకు కొనసాగిస్తామని చైనా ప్రభుత్వం పేర్కొన్నది.ఇదే అంశాన్ని తైవాన్‌కు కూడా వర్తింప చేస్తామన్నదే గ్జీ తాజా సందేశ అంతరార్ధం.

Image result for angry  patrick shanahan

చైనా పట్ల కఠిన వైఖరిని తీసుకోవాలనే వైఖరి కలిగిన షహనాహన్‌ పెంటగన్‌లో మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగించదు. బస్తీమే సవాల్‌ అంటూ చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగిన డోనాల్డ్‌ ట్రంప్‌కు సై అంటే సై అనే రక్షణ మంత్రి తోడయ్యాడు. 2018 జాతీయ రక్షణ వ్యూహం పేరుతో పెంటగన్‌ రూపొందించిన పత్రంలో వ్యూహాత్మక పోటీదారు చైనా అని పేర్కొన్నారు. చైనా, రష్యాల నుంచి తలెత్తుతున్న ముప్పులు అగ్రభాగాన వున్నాయని, వారినియంత్రత్వ వైఖరులకు అనుగుణ్యంగా ప్రపంచాన్ని మలచాలని, పెంటగన్‌ ప్రాధాన్యతల్లో వాటిని ప్రధానమైనవిగా చేర్చాలని పేర్కొన్నారు. అమెరికా రక్షణ ఖర్చులో సింహభాగాన్ని పొందుతున్న ఐదు అగ్రశ్రేణి ఆయుధ కంపెనీల్లో ఒకటైన బోయింగ్‌లో మూడు దశాబ్దాలపాటు వున్నత అధికారిగా షహనాహన్‌ పని చేశాడు. సిరియా నుంచి సేనల వుపసంహరణ ప్రకటనకు నిరసనగా రక్షణ మంత్రి మాటిస్‌ రాజీనామా చేసిన తరువాత వుప మంత్రిగా వున్న షహనాహన్‌ తాత్కాలిక మంత్రిగా వుంటారని ప్రకటించిన రోజే ట్రంప్‌ సర్కార్‌ బోయింగ్‌ నుంచి యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందం చేసుకుంది. అతగాడిని వుప మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తారని వచ్చిన వార్తల గురించి సెనెట్‌ కమిటీ అధ్యక్షుడిగా వున్న జాన్‌ మెకెయిన్‌ వ్యాఖ్యానిస్తూ కోళ్ల గూటిలో నక్కను పెడతారని అనుకోవటం లేదన్నాడు.

షహనాహన్‌ మాటలను బట్టి రానున్న రోజుల్లో ఒకవైపు వాణిజ్య యుద్ధంతో పాటు మిలిటరీ రీత్యా మరింతగా చైనాపై కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వున్న బలాబలాను బట్టి అమెరికాను అతిక్రమించే శక్తి చైనాకు లేదు. అయితే అమెరికా అలాంటి దుస్సాహసానికి ఒడిగడితే తగిన మూల్యం చెల్లించే విధంగా ప్రతిఘటించే శక్తి చైనా సంతరించుకుంది. అమెరికా ఖండాంతర అణు క్షిపణులతో సమానమైన డాంగ్‌ఫెంగ్‌ 41క్షిపణి చైనా అమ్ములపొదిలో 2017లో చేరింది. అణుయుద్ధమే సంభవిస్తే విజేతలంటూ ఎవరూ వుండరు.