Tags

, , ,

హంగరీ ప్రదర్శనలు

ఎం కోటేశ్వరరావు

ఐరోపాలో ప్రస్తుతం భౌతికంగా చలి, రాజకీయంగా వేడి పోటీ పడుతున్నాయి.మే నెలలో ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికల గడువు దగ్గరపడుతోంది. ఈ పూర్వరంగంలో పలు చోట్ల పెల్లుబుకుతున్న ఆందోళనలనల పట్ల ఎలా వ్యవహరించాలో పాలక పార్టీలకు దిక్కుతోచటం లేదు. పచ్చి మితవాదులు, నయా నాజీలు, ఫాసిస్టు శక్తుల ప్రభావం పెరుగుతోంది. ఫ్రాన్సులో పసుపు చొక్కాల ఆందోళనను చల్లబర్చేందుకు అధ్యక్షుడు మక్రాన్‌ కొన్ని రాయితీలు ప్రకటించినప్పటికీ ప్రతి శనివారం జరుగుతున్న నిరసన ప్రదర్శనలు ఐదవ తేదీన కూడా జరిగాయి. సోషలిజాన్ని కాలదన్నుకొని పెట్టుబడిదారీ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టిన దేశం హంగరీ. పూర్తి పరిహారం లేకుండా ఓవర్‌టైమ్‌ చేయటం లేదా చేసిన పనికి వెంటనే చెల్లింపులు చేయనవసరం లేకుండా వీలు కల్పిస్తూ పార్లమెంట్‌ ఆమోదించిన బిల్లును ‘బానిస చట్టం ‘గా వర్ణిస్తూ దానికి వ్యతిరేకంగా వేలాది మంది కార్మికులు వణికిస్తున్న చలిని కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిపారు. మరోపూర్వ సోషలిస్టు రాజ్యమైన సెర్బియాలో వరుసగా ఐదవ శనివారం ఐదవ తేదీన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ఇవి మచ్చుకు కొన్ని. గతానికి భిన్నంగా ఈ ఆందోళనల సందర్భంగా జనం తీవ్రంగా స్పందించటం ఒక ముఖ్యాంశం. అన్ని చోట్లా ఆందోళనల లక్షణాలు ఒకే విధంగా లేనప్పటికీ మొత్తం మీద చూసినపుడు జనాకర్షక వైఖరులు, ఆర్ధిక జాతీయవాదం ముందుకు వస్తున్నాయి. ఇవి విడివిడిగానూ, ఒకదానినొకటి ఆశ్రయించిగానీ వుంటాయి. ఈ వైఖరిని ఐరోపా యూనియన్‌ను బలహీనపరిచేందుకు దోహదం చేస్తుందన్నది కొందరి అంచనా. పది సంవత్సరాల క్రితం పెట్టుబడిదారీ ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపివేసి ఇప్పటికీ ప్రభావం చూపుతూ అందరికీ సుపరిచితమైన 2008 ఆర్ధిక సంక్షోభం పర్యవఐరోటసానాలే ఇవన్నీ అని చెప్పవచ్చు.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత స్ధూలంగా ఐరోపాలో సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీలు, మితవాద పార్టీలుగా రాజకీయ పక్షాలు వున్నాయి. గత పది సంవత్సరాలలో సాంప్రదాయ మితవాదం స్ధానే పచ్చిమితవాద శక్తులు పెరిగి పెద్దవి అవుతున్నాయి. గత పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ తాము నూతన ఐరోపాను నిర్మిస్తామనే ప్రజాకర్షక వాగ్దానాలు, వలస కార్మికులు ముఖ్యంగా ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే శక్తులు పెరుగుతున్నాయి. ముస్లిం తీవ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా నాయకత్వంలో పశ్చిమాసియా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యంలో ఐరోపా ప్రభుత్వాల మద్దతుతో దాడులు చేస్తున్న పూర్వరంగంలో ఐరోపాలోని మితవాద శక్తులలో ముస్లిం వ్యతిరేకత పెరగటంలో ఆశ్చర్యం లేదు. పదేండ్ల నాటి ఆర్ధిక సంక్షోభంతో వలస కార్మికుల రాక తమ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదనే భావం ఐరోపాలో కలుగుతున్నది.

కొన్ని దేశాలలో జరుగుతున్న పరిణామాలు కొన్నేండ్ల నాటి అరబ్బు వసంత కాల ఆందోళనలను పోలి వున్నాయన్నది కొందరి వర్ణన. సోవియట్‌ యూనియన్‌ మాదిరి ఆరు నుంచి 28 దేశాలకు విస్తరించిన ఐరోపా యూనియన్‌ కూడా ప్రజాకర్షక, ఆర్ధిక జాతీయవాదాలతో కూలిపోతుందా అని కూడా పరిపరివిధాల ఆలోచిస్తున్న వారు లేకపోలేదు. అనేక దేశాలలోని పరిణామాలు అంతర్గత రాజకీయ నాటకాల లక్షణాలను కూడా కలిగి వున్నాయి. వీటికి వలసల సమస్య వుమ్మడిగా వుంది. అమెరికా, రష్యాలు ఐరోపా రాజకీయవేదిక మీద ప్రధాన పాత్రధారులుగా వున్నాయి. ఐరోపా యూనియన్‌ వుమ్మడిగా రష్యాను వ్యతిరేకిస్తున్నది, అదే సమయంలో కొన్ని దేశాలు భిన్నవైఖరిని వ్యక్తం చేస్తున్నాయి. ఐరోపా యూనియన్‌ తమ శత్రువు అని డోనాల్డ్‌ ట్రంప్‌ వర్ణించిన అంశం కూడా తెలిసిందే. ఈ పరిణామాలు వాటి మధ్య వున్న అంతర్గత వైరుధ్యాలకు నిదర్శనం. పాలకవర్గాలు రాజీపడుతున్న కారణంగా ఒక కొత్త రూపాన్ని తీసుకొనే స్థితి ఇంకా రాలేదు. ఒక కూటమిగా ఐరోపా బతికి బట్టగలుగుతుందా అన్న సందేహాలు కూడా వెలువడుతున్నాయి.

2019వ సంవత్సరం ఐరోపాలో అనేక పరిణామాలు సంభవిస్తాయని జోశ్యాలు వెలువడుతున్నాయి. మార్చి 29 ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగనుంది. ఇటలీ ఆర్ధిక సంక్షోభం మరింత ముదరవచ్చు. మే నెలలో జరిగే ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికలలో మితవాద పార్టీలు మెజారిటీ సాధించటం లేదా దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయి.పూర్వపు యుగోస్లావియా నుంచి ప్రత్యేక దేశంగా ఆవిర్భవించిన సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్‌ యుసిక్‌ నియంతృత్వ వైఖరికి వ్యతిరేకంగా వేలాది మంది గత ఐదు వారాలుగా ప్రతి శనివారం రాజధాని బెల్‌గ్రేడ్‌లో ప్రదర్శనలు జరుపుతున్నారు. నవంబరు నెలలో క్రుసెవాక్‌ పట్టణంలో ప్రతిపక్ష నేత బర్కొ స్టెఫానోవిస్‌ మీద దాడి చేసిన దుండగులు అధికారపక్షానికి చెందిన వారేనని ప్రతిపక్షాలు విమర్శించాయి.డిసెంబరు ఎనిమిది నుంచి జరుగుతున్న ప్రదర్శనల్లో విద్యార్ధులు, కళాకారుల వంటి అనేక మంది ప్రముఖులు భాగస్వాములౌతున్నారు. యాభై లక్షల మందిలో ఒకరిని అనే బ్యానర్‌ వెనుక ప్రదర్శనలు జరుపుతున్నారు. ఒక వేళ 50లక్షల మంది వీధుల్లోకి వచ్చినప్పటికీ తాను ప్రతిపక్షంతో మాట్లాడేది లేదని, జనంచెప్పేది వింటానంటూ అధ్యక్షుడు యుసిక్‌ జనాన్ని మరింతగా రెచ్చగొట్టాడు. ముఫ్పై ప్రతిపక్ష పార్టీలు, సంస్ధలు సెర్బియా కోసం కూటమి పేరుతో ప్రదర్శనలు జరుపుతున్నాయి.దేశం రోజు రోజుకూ నియంతృత్వంవైపు పయనిస్తున్నదని, ప్రజాస్వామిక వ్యవస్ధలను చిన్నచూపు చూస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మీడియాలో స్వేచ్చలేదు, జర్నలిస్టులకూ స్వేచ్చ లేదని, ఎన్నికలు కూడా స్వేచ్చగా జరిగే పరిస్ధితి లేదని విమర్శిస్తున్నాయి.

యాభై లక్షల మందిలో ఒకరిని అనే బ్యానర్‌ వెనుక ప్రదర్శనలు

ఏడాదికి నాలుగు వందల గంటల పాటు ఓవర్‌టైమ్‌ వర్క్‌ చేయాలన్న యజమానులకు అనుగుణంగా చట్టం చేసిన హంగరీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డిసెంబరులో ప్రారంభమైన నిరసనలు ఈనెలలో కూడా కొనసాగాయి. ఐదవ తేదీన జాతీయ సమ్మెకు పిలుపు నివ్వగా మరోసారి 19వ తేదీన నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. మెరుగైన వేతనాలు, సులువైన వుద్యోగ విరమణ విధానాన్ని కూడా వారు కోరుతున్నారు.అయితే ఈ ఆందోళనల వెనుక హంగేరియన్‌-అమెరికన్‌ బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌ హస్తం వుందని, పెద్ద మొత్తంలో నిధులు అందచేసినట్లు హంగరీ ప్రభుత్వం ఆరోపించింది. వలసదారుల అనుకూల విధానాలను తాము అడ్డుకుంటున్న కారణంగానే ఇదంతా జరుగుతోందని పేర్కొన్నది. కార్మిక చట్టంతో సహా అనేకం నిరంకుశంగా వున్నాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. మరింత పని మరింత సంపాదన అనే ముసుగులో ఓవర్‌టైమ్‌ పరిమితిని ఏడాదికి 250 నుంచి 400గంటలకు పెంచటమే కాదు, పని చేసినందుకు వేతనం ఇంతకు ముందున్న చట్ట ప్రకారం ఏడాది లోపు ఎప్పుడైనా చెల్లించవచ్చు. తాజా చట్టంలో ఆ పరిమితిని మూడు సంవత్సరాలకు పెంచారు. కొన్ని సందర్భాలలో అదనపు వేతనం చెల్లించే అవకాశ ం లేకుండా చేశారు. ఇప్పటికే ఇరుగుపొరుగు దేశాలతో పోల్చితే పని గంటలు ఎక్కువ, వేతనాలు తక్కువగా వున్నాయి. హంగరీ నుంచి పెద్ద సంఖ్యలో విదేశాలకు వలసలు పోయిన కారణంగా స్ధానిక బహుళజాతి కంపెనీ ఫ్యాక్టరీలు, కార్యాలయాల్లో పనిచేసే కార్మికుల సంఖ్య తక్కువగా వుండటంతో బలవంతంగా పని చేయించేందుకు ఈ చట్టాన్ని తీసుకు వచ్చారు. దీంతో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన వారు కూడా నిరసనలలో భాగస్వాములయ్యారని వార్తలు వచ్చాయి.

అనేక దేశాలలో జనం వీధుల్లోకి రావటం అక్కడి అసంతృప్తికి నిదర్శనం అయితే పచ్చి మితవాద పార్టీలు జనాన్ని ఆకర్షించటం మరొక సూచిక.2019 వారిదే అవుతుందా ? ఇటలీలో గతేడాది జరిగిన ఎన్నికలలో 630కిగాను 125 సీట్లు తెచ్చుకొని ఇటలీ సంకీర్ణ ప్రభుత్వంలో నార్తరన్‌ లీగ్‌ అనే మితవాద పార్టీ భాగస్వామిగా వుంది. పేరుకు చిన్నపార్టీ అయినా ప్రభుత్వ అజెండాను రూపొందించటంలో పెద్ద పాత్ర నిర్వహిస్తున్నది. యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడిగా వున్న జీన్‌ క్లాడ్‌ జుంకర్‌ తరచూ ఈ ప్రజాకర్షక శక్తులు, జాత్యంహంకారులు, ఫాసిస్టులు, సిల్వనీ(ఇటలీ) లీపెన్‌, జర్మనీ ఎఎఫ్‌డిపార్టీ వంటితో ఐరోపా ప్రమాదంలో వుంది అంటారు. ప్రస్తుతం హంగరీ, నార్వే, స్వీడన్‌, ఫిన్లాండ్‌, ఆస్ట్రియా, ఇటలీల్లో పచ్చి మితవాద పార్టీలు పాలక పక్షాలు లేదా భాగస్వామ్య పక్షాలుగా వున్నాయి. గతేడాది స్లోవేనియా పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికలలో 90కి గాను రెండు పచ్చిమితవాదపార్టీలు 29 సీట్లు తెచ్చుకున్నాయి. అక్కడి ఇంకా ప్రభుత్వం ఏర్పడలేదు. హంగరీ ఎన్నికలలో 199 స్ధానాలకు గాను రెండు మితవాద పార్టీలు 133, 26 చొప్పున 159 సీట్లు తెచ్చుకొన్నాయి. ఇటలీ ఎన్నికలలో మెజార్టీ సీట్లు మితవాద పార్టీలకే వచ్చాయి. దిగువ సభలోని 630 సీట్లకుగాను మూడు మితవాద పార్టీలకు కలిపి 379 వున్నాయి. ఎగువ సభలో 315కుగాను 140 తెచ్చుకున్నాయి. 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభ ఫర్యవసానంగా ప్రస్తుతం ఇటలీ తీవ్రమైన ఆర్ధిక సమస్యల్లో వుంది. జర్మనీలో ఐదు సంవత్సరాల క్రితం ఏర్పడిన జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ(ఎఎఫ్‌డి) 2017 ఎన్నికల్లో అతి పెద్ద ప్రతిపక్ష పార్టీగా ముందుకు వచ్చింది.2015లో దాదాపు పదిలక్షల మంది జర్మనీకి వలస వస్తే వారిలో ఎక్కువ మంది ముస్లిం దేశాల నుంచి వచ్చిన వారే వున్నారు. ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి ఎఎఫ్‌డి బలం సంపాదించుకుంది.

వివిధ సర్వేలు మితవాద శక్తులు గతం కంటే బలంగా తయారవుతున్నాయని, వివిధ పార్టీల మధ్య విబేధాలున్నప్పటికీ ఐరోపాయూనియన్‌కు బ్రేకులు వేసేవిగా వున్నాయని చెబుతున్నారు. ఇటీవలి వరకు అనేక దేశాలలో నోటి తుత్తర శక్తులుగా వున్నప్పటికీ ప్రస్తుతం అనేక దేశాలలో అధికారంలో వుండటం లేదా అధికార పక్షాలకు మద్దతు ఇచ్చేవిగా తయారయ్యాయి. ఇటీవలి కాలంలో పెరిగిపోయిన వలసలను వ్యతిరేకిస్తూ వలసల రహిత ఐరోపా కావాలని, ఐరోపా యూనియన్‌ బదులు ఐరోపా జాతులుగా వుండాలని చెబుతున్నాయి. యూరోబారో మీటర్‌ తాజా సర్వే ప్రకారం ఐరోపా యూనియన్‌ సభ్యత్వం తీసుకోవటం మంచిదే అయినప్పటికీ అది తప్పుడు మార్గంలో నడుస్తున్నదని 62శాతం మంది అభిప్రాయపడ్డారు. వలసల తక్షణ సమస్యగా భావిస్తున్నారు. మితవాద పార్టీలు 20శాతం మేరకు ఐరోపా వ్యాపితంగా ఓట్లను తెచ్చుకొనేవిగా వున్నాయని, ఇది మెజారిటీ సాధించేందుకు దోహదం చేయకపోయినా ఐరోపా యూనియన్‌ పనికి ఆటంకాలు కలిగించేందుకు వీలుకలిగిస్తాయని భావిస్తున్నారు. మేము ఒక చారిత్రక మలుపులో వున్నాం, తీవ్రమైన ప్రపంచీకరణ ముగింపుకు రానున్నది అని ఫ్రెంచి నేషనలిస్టు పార్టీ నాయకురాలు మారినె లీపెన్‌ ఇటీవల సోఫియా నగర పర్యటనలో చెప్పారు.

ఐరోపాలో జర్మన్‌- ఫ్రెంచి కూటమి ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు ఏకం కావాల్సి వుందని పచ్చి మితవాద పార్టీ నార్తరన్‌ లీగ్‌ నాయకుడు ఇటలీ డిప్యూటీ ప్రధాని, హోంమంత్రి మాట్టియో సాల్విని పోలాండ్‌ పాలకపార్టీ నేతలతో బుధవారం నాడు చెప్పారు. పోలాండ్‌ లా మరియు జస్టిస్‌ పార్టీ కూడా పచ్చిమితవాది అన్న విషయం తెలిసిందే. మే నెలలో జరిగే ఐరోపా పార్లమెంటరీ ఎన్నికలకు ముందే భావసారూప్యత గలిగిన పార్టీలు ఒక్కటై ‘ఐరోపా వసంతానికి’ నాంది పలకాలని సాల్విని కోరాడు. ఈ రెండు పార్టీలు ముస్లిం వ్యతిరేకత, ఐరోపా యూనియన్‌ వ్యతిరేకత వంటి అంశాలలో ఏకీభావం కలిగి వున్నాయి. పోలాండ్‌ హోం మంత్రి జోచిమ్‌ రుడ్‌జిన్‌స్కీతో కలసి విలేకర్లతో మాట్లాడాడు. ఐరోపా విలువలను పునరుద్దరించాలని, బ్యూరోక్రాట్ల పాలనకు దూరంగా వుండాలని కోరాడు. ఐరోపా వ్యాపితంగా వున్న తమ వంటి పార్టీలైన ఫైవ్‌ స్టార్‌ మువ్‌మెంట్‌ (ఎం5ఎస్‌) వంటివాటితో సమన్వయం చేసుకోవాలని సాల్విని ప్రయత్నిస్తున్నాడు. అక్టోబరు నెలలో ఫ్రెంచి నేషనల్‌ ఫ్రంట్‌ నాయకురాలు మారినె లీపెన్‌తో ఇప్పటికే చర్చలు జరిపాడు. ఇటలీ ఎం5ఎస్‌ పార్టీ అక్కడ పార్లమెంట్‌లో పెద్ద పార్టీగా విజయం సాధించి నార్తరన్‌ లీగ్‌తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ నేత యుగీ డి మాయియో మంగళవారం నాడు బ్రసెల్స్‌లో పోలాండ్‌ కుకిజ్‌ 15 పార్టీ నేత పావెల్‌ కుకిజ్‌, ఫిన్లాండ్‌, లాత్వియా మితవాద పార్టీ నేతలతో చర్చలు జరిపాడు. ఫ్రాన్స్‌లో పసుపు చొక్కాల వారు ఆందోళన విరమించవద్దని కోరాడు.