ఎం కోటేశ్వరరావు
అవును, వినటానికి ఆశ్చర్యంగానే ఉంది, పచ్చి నిజం. ఒక వైపు కోవిద్-19(కరోనా వైరస్)ను అదుపులోకి తెచ్చేందుకు అపూర్వరీతిలో ప్రయత్నిస్తున్న చైనా మరోవైపు ముంచుకు వస్తున్న మిడతల దండు ముప్పును ఎదుర్కొనేందుకు తన బాతులు, కోళ్ల వీరులను యుద్ధానికి తరలిస్తోంది. ఎత్తయిన, మంచుతో ఉండే హిమాలయాల కారణంగా మిడతలు చైనా మీద దాడి చేసే అవకాశాలు పరిమితమే అయినప్పటికీ ఇరుగుపొరుగుదేశాలకు సాయ పడేందుకు, తమ దేశంపై దాడి చేస్తే ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు తీసుకొంటోంది. రసాయనాలతో మిడతలను సంహరించే అవకాశాలున్నా పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ఎరిగిన చైనా సాధ్యమైన మేరకు వాటితో నిమిత్తం లేకుండా హానిలేని ఫంగస్‌లను కూడా పెద్ద ఎత్తున తయారు చేస్తోంది.
గత కొన్ని దశాబ్దాలలో లేని విధంగా కొద్ది వారాలుగా తూర్పు ఆఫ్రికాలోని అనేక దేశాలలో పంటలను తుడిచి పెట్టిన మిడతలు ఇప్పుడు సౌదీ అరేబియా, పాకిస్ధాన్, మన దేశం, చైనా వైపు పయనిస్తున్నాయి. దాదాపు 360 నుంచి 400 బిలియన్ల మిడతలు దాడుల్లో ఉన్నట్లు అంచనా. చైనా పశ్చిమ సరిహద్దు రాష్ట్రమైన గ్జిన్‌జియాంగ్ సరిహద్దుల్లో ఉన్న పాకిస్ధాన్, భారత్ ప్రాంతాలకు విస్తరిస్తున్న మిడతలను ఎదుర్కొనేందుకు ఇప్పటికే లక్ష బాతు సైన్యాన్ని చైనా సిద్దం చేసింది. వాటిని రాబోయే రోజుల్లో పాకిస్ధాన్‌లోని సింధు, పంజాబ్, బెలూచిస్తాన్ రాష్ట్రాలకు తరలించేందుకు ఇప్పటికే చైనా అధికారులు కొన్ని ప్రాంతాలను సందర్శించి తీసుకోవలసిన చర్యల గురించి అధికారులు, రైతులతో మాట్లాడారు. బాతులకు నీరు అవసరమైనందున నీరు లేని ఎడారి ప్రాంతాలలో వాటిని వినియోగించటం గురించి పరిశీలన చేస్తున్నారు. మిడతల దండు దాడులతో ఇప్పటికే పాక్ ప్రధాని జాతీయ అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు. పంటల నష్టంతో ఆహారకొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
రసాయనాలతో మిడతలను హతమార్చవచ్చుగానీ, అది మరికొన్ని కొత్త సమస్యలను సృష్టిస్తుంది, అందువలన చైనీయులు సహజంగా మిడతల పని పట్టే పద్దతులను పాతిక సంవత్సరాల క్రితమే ప్రయోగించి జయప్రదమయ్యారు. ఇప్పుడు పెద్ద ఎత్తున నివారణ చర్యలకు సిద్దం అవుతున్నారు. ఒక్కొక్క కోడి రోజుకు 70మిడతలను తింటే ఒక బాతు 200లను ఆరగిస్తుంది. ఒక బాతు నాలుగు చదరపు మీటర్ల విస్తీర్ణంలోని మిడతలను అదుపు చేయగలదు. ప్రకృతిలో మిడతలు ఒక భాగం. కొన్ని సందర్భాలలో అవి అలవిగాని రీతిలో విపరీతంగా పెరిగిపోవటానికి నిర్దిష్టంగా ఫలానా పరిస్ధితులు కారణమని చెప్పలేని స్దితి. అందువలన వాటిని పర్యవేక్షించి తీవ్రతను అంచనా వేసి చర్యలు తీసుకోవటం తప్ప మరొక మార్గం లేదు. బాతులతో పాటు గంటకు 16000 హెక్టార్లలోని మిడతలపై రసాయనాలు చల్లి హతమార్చేందుకు చైనా 50 డ్రోన్లను, విమానాలను కూడా అందచేసేందుకు పాక్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. రసాయనాలను ఉపయోగించినపుడు మిడతలతో పాటు మానవాళి, పంటలకు ఉపయోగపడే పరపరాగ సంపర్కానికి దోహదం చేసే తేనెటీగల వంటివి కూడా అంతరిస్తాయి. దాని వలన జరిగే నష్టాలను కూడా పరిగణనలోకి తీసుకొని సహజ పద్దతుల్లో ఎదుర్కొనేందుకు, తక్కువ ఖర్చుతో కూడిన గువోషాఓ రకం బాతులు మిడతలను తినటంలో ఎంతో నైపుణ్యం గలవిగా పరిగణిస్తున్నారు. వాటిని చైనా ప్రత్యేకంగా ఉత్పత్తి చేస్తున్నది. గాలి వాలును బట్టి హిమాలయాలు అడ్డుగా ఉన్నందున, చలి కారణంగా చైనాకు మిడతల దండు ముప్పు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అయినా ముందు జాగ్రత్తగా బాతు, కోళ్ల సైన్యాన్ని సన్నద్ద పరుస్తున్నారు. అవసరమైన పాకిస్దాన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
తాజా దండు ప్రారంభాన్ని గతేడాది జూన్‌లో గమనించారు. అయితే అది ఈ ఏడాది జనవరి నాటికి అదుపు తప్పి పెరిగిపోయింది. తూర్పు ఆఫ్రికాలోని కెన్యాలో జనవరినెలలో ఐదువేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కేంద్రీకృతమై పదివేల కిలోమీటర్లకు పెరిగి అక్కడి పంటలు, పచ్చదనాన్ని హరించి నుంచి గాలివాలును బట్టి పరిసర దేశాల మీద దాడి చేస్తున్నాయి. ఆహార భద్రతకు అసాధారణ ముప్పు వచ్చిందని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్ధ ప్రకటించింది. గతేడాది చివరిలో ఎమెన్, మరికొన్ని దేశాలలో భారీ వర్షాలు పడటంతో మిడతలు తామర తంపరగా పెరగటానికి అనువైన పరిస్ధితి ఏర్పడింది.
ఒక చదరపు కిలోమీటరు ప్రాంతంలో పదిహేను కోట్ల మిడతలు ఉంటాయని, గాలి తీవ్రతను బట్టి రోజుకు గరిష్టంగా 150కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.ఒక రోజులో 35వేల మంది ఎంత ఆహారం తింటారో ఒక చదరపు కిలోమీటరులో విస్తరించిన మిడతలు రోజులో అంత మొత్తాన్ని ఖాళీ చేస్తాయని అంచనా. వాతావరణాన్ని బట్టి ఒక దండు దండయాత్ర ఒకటి నుంచి రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఏడాదిలో రెండు నుంచి ఐదు తరాలు వృద్ధి చెందుతాయి. ఒక మిడత గుడ్డు నుంచి సంపూర్ణంగా ఎదగటానికి మూడునెలల సమయం పడుతుంది. ఒకేసారి అనేక గుడ్లను పెడతాయి.
చైనా విషయానికి ముఖ్యంగా ఆహార భద్రతను గమనంలో ఉంచుకొని దేన్నీ తక్కువగా చూడటం లేదు. గతేడాది దాదాపు కోటి హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా దేశంలోని 44కోట్ల పందులలో సగాన్ని హతమార్చాల్సి వచ్చింది. అక్కడి వారి ఆహారంలో పంది మాంసం ప్రముఖపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
కేవలం మిడతలను మాత్రమే హతమార్చే ఫంగస్‌కూడా అందుబాటులో ఉంది. పదిహేను సంవత్సరాల క్రితం మిడతల దండు నివారణకు దానిని ఉపయోగించి ఫలితాలు సాధించారు. అయితే అవి మిడతలను సంహరించేందుకు ఎక్కువ వ్యవధి తీసుకుంటున్నాయి. చైనాలో ఈ బయో ఫెస్టిసైడ్స్‌ను కూడా వినియోగిస్తున్నారు. తూర్పు ఆఫ్రికాలో ప్రస్తుత వినియోగానికి చైనాలోని ఫ్యాక్టరీలు వేలాది టన్నుల ఫంగస్ రకాలను తయారు చేస్తున్నాయి. వాటిలో కొన్ని జన్యుమార్పిడి రకాలు కూడా ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా మూతవేసిన వాటిలో ఈ ఫంగస్‌ను తయారు చేసేవి కూడా ఉన్నాయి. అయితే ఆఫ్రికా అవసరాల రీత్యా వాటిని తెరిచి పెద్ద ఎత్తున ఫంగస్‌ను తయారు చేస్తున్నారు.