Tags

, ,

Coronavirus: PM Modi to address nation on Thursday - INDIA ...

ఎం కోటేశ్వరరావు
దేశంలో ఏమి జరుగుతోంది ? బుద్ధి జీవులు(మేథావులు) ఏమి ఆలోచిస్తున్నారు, ఏమి చేస్తున్నారు, ఏ దిశానిర్దేశం చేస్తున్నారు. వివిధ తరగతులు ఏమి ఆలోచిస్తున్నాయి,ఏం చేయాలనుకుంటున్నాయి? మన చుట్టూ జరుగుతున్న వాటి గురించి పట్టించుకుంటున్నామా? మనమేం చేస్తున్నామో మనకు తెలుస్తోందా ? ఇది ఒక ఆలోచన మాత్రమే, ఆసక్తి ఉన్నవారు మాత్రమే ముందుకు పోండి, ఆల్‌ ఈస్‌ వెల్‌ (అంతా బాగుంది ) అనుకుంటున్నవారు చదివి ఇబ్బంది పడకండి. ఆలోచనా పరులైతై మీ భావాలను బయట పెట్టండి. దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం కాస్త బతికే ఉంది. జరుగుతున్నవి నాకు సంబంధం లేనివి కదా నేనెందుకు మాట్లాడాలి అనుకోకండి. మీవరకు వచ్చే సరికి మీకోసం మాట్లాడేవారు మిగలరని తెలుసుకోండి.
గృహబందీ శాశ్వతం కాదని,పరిమితకాలమైనా తప్పదని తెలుసు. గతంలో నరేంద్రమోడీ అనాలోచితంగా పెద్ద నోట్లను రద్దు చేసినపుడు జనం నీరాజనాలు పట్టారు. ఇప్పుడు గృహబందీ ప్రకటించినా అనేక మంది కోటీశ్వరులు, మధ్యతరగతి, చీకట్లో ఉన్న వారు అదే చేస్తున్నారు. నోట్ల రద్దు జనం, ఆర్ధిక వ్యవస్ధ ప్రాణాలు తీసింది. రెండవది జాగ్రత్తలు పాటించిన వారి ప్రాణాలు కాపాడుతుంది. మొదటి చర్య మోడీ స్వమస్తిష్కం నుంచి పుడితే, రెండవది చైనా నుంచి అరువు తెచ్చుకున్నది.(చైనా వస్తువులను, దాని కమ్యూనిస్టు ఆలోచనలను బహిష్కరించాలని చెప్పేవారు దీని గురించి మౌనం దాల్చారు ఎందుకో మరి )
ప్రపంచంలో జిడిపిలో ఐదో స్ధానంలో ఉన్న మన దేశం జనధన్‌ ఖాతాలకు 1500(డాలర్లలో 20) రూపాయలు నేరుగా నగదు మూడు దఫాలుగా పంపిణీ చేస్తోంది.(ఒకేసారి ఇస్తే దుర్వినియోగం చేస్తారని కాబోలు) అదే 42వ స్ధానంలో ఉన్న పాకిస్ధాన్‌ దాని కరెన్సీలో ఒకేసారి పన్నెండువేల రూపాయలు(డాలర్లలో 75) ఇస్తోంది. అయినా తాము చేసింది పెద్ద గొప్పని మన బిజెపి నేతలు చెప్పుకుంటారు. పాక్‌ పధకాన్ని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. మరోవైపు మన దేశానికి ఆరోగ్య సంరక్షణ చర్యలకు గాను ప్రపంచబ్యాంకు ఒక బిలియన్‌ డాలర్ల పాకేజ్‌ ప్రకటించింది. పాకిస్దాన్‌ కూడా తీసుకొని ఉండవచ్చు. కానీ ప్రపంచంలో కరోనా విపత్తు సహాయ చర్యలకు గాను మన దేశం జిడిపిలో మూడు నుంచి ఐదుశాతం ఖర్చు చేసేందుకు ఆలోంచాలని ప్రకటించింది. కానీ మోడీ ప్రకటించింది 0.7శాతమే అని తెలిసినా కొందరు ఆహా ఓహౌ అంటూ విరగబడిపోతున్నారు. మన వివేకం ఏమైనట్లు ?
జిడిపిలో మన దేశాన్ని ఐదవ స్ధానంలో తీసుకుపోయామని బిజెపి వారు చెప్పుకుంటుంటే ఆ విషయాన్ని మనం లొట్టలు వేసుకుంటూ ఆహా మోడీ గారి ఘనత కదా అనుకుంటున్నాం. తలసరి జిడిపిలో ఎక్కడున్నాం, ఎవరితో పోల్చుకోవాలి, సంబరాలు చేసుకొనేంతగా పరిస్ధితి మెరుగుపడిందా అన్నది ప్రశ్న. 2017లో చైనా 75, పాకిస్ధాన్‌ 1501వ స్ధానాల్లో ఉంటే మనది 145. అదే 2019 అంచనాలకు వచ్చేసరికి చైనా 65, పాకిస్ధాన్‌ 151 మనం 139వ స్ధానంలో ఉన్నాం. ఇది కూడా ఘనతేనా, దీనికి బాధ్యత ఎవరిది ? మన కంటే నరేంద్రమోడీ ఉన్నారు కనుక చక్రం తిప్పి రాంకు పెంచారనుకుందాం కాసేపు. బంగ్లాదేశ్‌ ఈ కాలంలోనే 153 నుంచి 150, 143వ స్ధానానికి మెరుగు పరచుకుంది. అక్కడ మోడీ లేకపోయినా పది స్ధానాలు పైకి ఎగబాకితే మోడీ మంత్రదండం ఉన్నా కేవలం ఆరు రాంకులే పెరిగింది. దీని గురించి వ్యాఖ్యానం అవసరం ఏముంది ?
ప్రపంచంలో అనేక దేశాలు కరోనా కారణంగా వందలాది సంక్షేమ చర్యలను చేపట్టాయి. వీటన్నింటిలో ఇప్పటివరకు నరేంద్రమోడీ సర్కార్‌ చేపట్టింది అన్నింటి కంటే మెరుగ్గా ఉందని గానీ లేదా మెరుగైన చర్యలు చేపట్టిన వాటిలో ఒకటిగా ఉందని గానీ ఏ అంతర్జాతీయ సంస్ధా చెప్పలేదు, అయినా స్వంత డబ్బా మోగుతూనే ఉంది. ఒక బిలియన్‌ డాలర్లను మన ఆరోగ్య రంగానికి ఇస్తామని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఇది అప్పా, దానమా అన్నది పక్కన పెడదాం. అప్పయినా దానమైనా మోడీ గారికి ఘనత తెచ్చే అంశం కాదు. ఈ సందర్భంగా బ్యాంకు మన దేశ డైరెక్టర్‌గా ఉన్నó జునైద్‌ అహమ్మద్‌ మాట్లాడుతూ భారత్‌ కరోనా ఉద్దీపనకు భారత్‌ జిడిపిలో మూడు నుంచి ఐదుశాతం వరకు ఖర్చు చేసేందుకు ఆలోచించాలని చెప్పాడు. ఆయన బంగ్లాదేశ్‌ ఆర్ధికవేత్త అయిపోయాడు కనుక సరిపోయింది గానీ అదే పాక్‌ జాతీయుడు అయి ఉంటే మా మోడీని ఇరకాటంలో పెట్టేందుకు అలా మాట్లాడి ఉండే వారని ఈ పాటికి బిజెపి మరుగుజ్జులు సామాజిక మాధమాల్లో గంతులు వేసి ఉండేవారు. ఒకటికి రెండు సార్లు ధృడ సంకల్పాన్ని యావత్‌ జాతి ప్రకటించాలని పిలుపు ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ మూడవసారి గృహబందీ పొడిగించినపుడు దేశ ప్రజలను ఉద్దేశించి మాటా పలుకు లేదు. సంకల్పాన్ని మరో ప్రదర్శించమని జనాన్ని కోరలేదు. ఎందుకనో ఎవరైనా ఆలోచించారా ?
సుభాషితాల వల్లింపు ఎక్కువైతే ఏమి జరుగుతుందో రాజకీయాల్లో జనాన్ని ఏమార్చటంలో తలపండిన నరేంద్రమోడీకి తెలియంది కాదు. తమ ఆర్ధిక ఇబ్బందుల గురించి రాష్ట్రాలు మెల్లగా గొణుగుతున్నాయి. కేంద్రం ఎలాంటి పాకేజ్‌లు ప్రకటించే సూచనలు లేవు. అందువలన మరోసారి చప్పట్లు కొట్టాలనో, విద్యుత్‌ దీపాలు ఆర్పి వేరే దిపాలు వెలిగించాలనో మరొకటో చెబితే ఈ కబుర్లు ఇంక చాల్లే అనే స్ధితి వచ్చేసింది కనుక జనంలో పలుచనౌతారు. అందుచేత మరో మాట లేకుండా ఆర్మీతో పూలు చల్లించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
గృహబందీ తొలిసారి ప్రకటించినపుడు పెద్ద నోట్ల రద్దు మాదిరి ఆకస్మికంగా ప్రకటించేశారు. ఇంత పెద్ద దేశంలో కోట్లాది మంది ప్రతి రోజూ ప్రయాణిస్తారని, వారంతా ఎక్కడిక్కడ చిక్కుకుపోతే ఇబ్బందులు పడతారని సామాన్యుల గుండె చప్పుడు తనకంటే మరొకరికి తెలియదని చెప్పుకొనే ప్రధానికి తట్టలేదా ఎవరూ చెప్పలేదా ? మొత్తానికి ఏమి జరిగిందో ఇంతవరకు తెలియలేదు. పోనీ వలస కార్మికులను స్వస్ధలాలకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ఎట్టకేలకు నిర్ణయించారు. అందుకయ్యే ఖర్చును ఎవరు భరించాలనేది కూడా ముందుకు చర్చించకుండా ఎంత నగుబాట్ల వ్యవహారం చేశారో చూశాము. ఎవరికీ బుర్రలేదా లేక మరేదైనా జరిగిందా ? ఆ ఖర్చు మేము భరిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించిన తరువాత నష్టనివారణ చర్యలు తీసుకున్నారు. పిఎం కేర్‌కు చేరిన వేల కోట్ల రూపాయల్లో రైల్వేలు ఇచ్చిన 150 కోట్లు కూడా ఉన్నాయి. దానికి ఎంత వచ్చిందో దేనికి కేటాయిస్తున్నారో మనకు తెలుసా ? వలన కార్మికుల రవాణాకు అయ్యే ఖర్చును పిఎం కేర్‌ నిధి నుంచి ఇస్తామని చెబితే సొమ్మేం పోయేది? పరాయి రాష్ట్రంలో చిక్కుకుపోయిన గుజరాతీల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దాంతో మిగతా చోట్ల నుంచీ అదే డిమాండ్‌ వచ్చింది. విదేశాలలో చిక్కుకుపోయిన వారిని తీసుకురావటం గురించి ప్రతిదేశమూ ఏర్పాట్లు చేసింది గానీ మన దేశంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రచార ఆర్భాటం ఎక్కడా కానరాదు. దానికి వందే భారత్‌ అని ఒక పేరు, పోనీ అదేమైనా కొత్తదా కాదే వందే మాతరానికి అనుకరణ కాదా ? విదేశాల్లో వున్న వారికోసం విమానాలు, మిలిటరీ నావలను పంపి తీసుకువస్తున్నారు, వారి దగ్గర ఖర్చు వసూలు చేస్తున్నారు. దాన్నొక విజయంగా ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వలస కార్మికులు మేము టిక్కెట్లు కొని ప్రయాణిస్తామని మొత్తుకుంటున్నా రైళ్లను ఏర్పాటు చేసేందుకు వారాల తరబడి ఎందుకు ముందుకు రాలేదు. అలాంటి ఏర్పాటే ఉంటే ఔరంగాబాద్‌ దగ్గర వలస కూలీలు రైలు పట్టాలపై పడుకొనే వారా, వారి మీదుగా రైలు వెళ్లి దుర్మరణం చెందేవారా? అనేక రాష్ట్రాలు వేరే చోట చిక్కుకుపోయిన తమ రాష్ట్ర కూలీలను తిరిగి వచ్చేందుకు అనుమతి ఇవ్వటం లేదు. ఏమిటిది? మనం ఎటు పోతున్నాం, ఇది ప్రజాస్వామ్యమా మరొకటా ?
చరిత్రలో, కొన్ని సినిమాల్లో కార్మికులను బందీలుగా తీసుకుపోయి వారిని అక్కడి నుంచి బయటకు వెళ్లనివ్వకుండా చచ్చేంత వరకు వెట్టి చాకిరీ చేయించుకోవటం చూశాము. కర్ణాటక నుంచి వలస కార్మికులు వెళ్లిపోవటానికి వీల్లేదు, మేము నష్టపోకూడదని భవన నిర్మాణ కంపెనీల లాబీ వత్తిడి తెస్తే ఆ రాష్ట్ర బిజెపి ముఖ్యమంత్రి ఎడ్డియూరప్ప ప్రత్యేక రైళ్లను రద్దు చేయాలని ఆదేశించటాన్ని ఏమనాలి ? బిజెపి ఒక జాతీయ పార్టీ, దానికి ఒక విధానమంటూ ఉండాల వద్దా? ముదిమది తప్పిన వ్యవహారమా, మరొకటా ? కేంద్రం ప్రకటించిన విధానాన్ని కూడా అమలు జరపరా ?చివాట్లు పడిన తరువాత నిర్ణయాన్ని మార్చుకున్నారు. గృహబందీ నిబంధనల సడలింపు గురించి కేరళ ప్రభుత్వం ప్రకటించగానే కేంద్ర హౌంశాఖ బహిరంగ ప్రకటనల ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. మరి ఎడ్డి యూరప్ప విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? రెండు నాలుకల ధోరణి, కరోనాలో కూడా రాజకీయం చేయటం కాదా ?

Coronavirus In India: How Indians are dealing with the onset of a ...
మద్యం దుకాణాలను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతి ఇవ్వలేదని బిజెపి నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. పోనీ బిజెపి పాలిత రాష్ట్రాలతో సహా పలుచోట్ల సడలించారు, భౌతిక దూరం పాటించకుండా మందుబాబులు కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు, ( మందు షాపులు ఎందుకు తెరిచారంటే కరోనా కారణంగా తలెత్తిన నిధుల కొరతను అధిగమించటానికనేకదా పాలకులు చెబుతోంది) విరగబడి మందు కొనేందుకు పోటీలు పడటం వారికి ఉన్న దేశభక్తి ప్రదర్శనకు నిదర్శనం అనుకుందాం. అనుమతి ఇవ్వకపోతే వరుసల్లో మందుకోసం బేటాలతో పాటు బేటీలు కూడా నిలబడటాన్ని చూసిన తరువాత అయినా రాష్ట్రాలను ఎందుకు హెచ్చరించలేదో ఆలోచిస్తున్నామా ? ఈ కారణంగా ఎక్కడైనా కరోనా ప్రబలితే బాధ్యత ఎవరిది ?
కరోనా వ్యాప్తి నిరోధానికి గృహబందీని జనవరి మూడవ వారం నుంచే చైనాలో అమలు జరుపుతున్నారని తెలుసు. తబ్లిగీ జమాత్‌ సంస్ధ మలేషియాలో నిర్వహించిన సామూహిక సమావేశాల కారణంగా ఫిబ్రవరినెలలో కరోనా వైరస్‌ వ్యాపించిందని ప్రపంచానికంతకూ తెలిసిందే. ఆ అనుభవంతో మార్చినెల రెండవ వారంలో మన దేశం కంటే ముందు పాకిస్ధాన్‌లో అదే సంస్ధ సమావేశాలను అక్కడి ప్రభుత్వం నిషేధిస్తే అర్ధంతరంగా సమావేశాలను ముగించారు. అక్కడా వైరస్‌ వీరి కారణంగానే వ్యాపించింది. ఇవన్నీ తెలిసి ఢిల్లీలో అలాంటి సమావేశాలను ఎందుకు అనుమతించారు, ఎవరు అనుమతించారన్నది ఎవరమైనా ఆలోచించామా ? తబ్లిగీ సంస్ధ బాధ్యతా రహితంగా వ్యహరించిందనటంలో మరోమాట లేదు. వారి సమావేశాలకు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షాగారే కదా అనుమతులు ఇచ్చింది. మలేషియా నుంచి ఇతర దేశాల నుంచి వైరస్‌ను మోసుకువచ్చిన వారి వీసాలను ఎందుకు రద్దు చేయలేదు, పోనీ టూరిస్టులనో మరో పేరుతోనే వచ్చారు, వారికి ఎందుకు పరీక్షలు చేయలేదు, కరోనా ఉంటే క్వారంటైన్‌ ఎందుకు చేయలేదు. ఈ ప్రశ్నలన్నీ వేయాలా వద్దా? లేక మోడీ పార్టీ పాకేజ్‌లకు అమ్ముడు పోయిన లేదా మతోన్మాదం తలకెక్కిన మీడియా కరోనా వ్యాప్తికి కారణమైన తబ్లిగీ జమాత్‌ పేరుతో యావత్‌ ముస్లిం సామాజిక తరగతి మీద దాడి చేస్తుంటే, ఇదేమి విపరీతం అని ఎందుకు ఆలోచించలేకపోయాము, అసలు తబ్లిగీ సమావేశాలకు అనుమతి ఇవ్వటం వెనుక కారణం ఆ సమావేశాల తరువాత ఆయోధ్యలో ఇతర చోట్లా తలపెట్టిన అంతకంటే పెద్ద శ్రీరామనవమి సమావేశాలే కారణమని(తరువాత రద్దు చేయటం వేరే) ఎందుకు ఆలోచించలేకపోయాము ?
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పాకేజ్‌ లక్షా 70వేల కోట్లు, ఈ పాకేజ్‌తో నిమిత్తం లేకుండా జూన్‌లో రైతాంగానికి రెండువేల రూపాయల చొప్పున ఇవ్వాల్సిన దాదాపు 20వేల కోట్లు ముందే ఇచ్చి దాన్ని కూడా పెద్ద సాయంగా చిత్రించారు. ఇంకా ఇలాంటివే దాదాపు లక్ష కోట్ల రూపాయల వరకు ఉన్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పోతే మార్చినెలలో మూడు రూపాయలు, తాజాగా పెట్రోలియం ఉత్పత్తుల మీద పెంచిన పన్నుల ద్వారా మొత్తం ఏడాదికి రెండులక్షల కోట్ల రూపాయల వరకు కేంద్రానికి అదనపు ఆదాయం రానుంది. డీజిల్‌ లేదా పెట్రోలు మీద లీటర్‌కు ఒక రూపాయి పెంచితే కేంద్రానికి ఏడాదికి 14వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచి పెంచిన డిఏ, జూలై, వచ్చే ఏడాది జనవరిలో పెరగాల్సిన(ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది కనుక ఎక్కువా తక్కువ కావచ్చుగానీ డిఏ పెరుగుతుంది) డిఏను కూడా జూలై వరకు పెంచకుండా 17శాతాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. దీని వలన అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకు లక్షా 20వేల కోట్ల రూపాయలు చెల్లింపు బాధ్యత ఏడాదిన్నరపాటు తగ్గుతుంది. ఎల్‌టిసి, వేతనంతో కూడిన సెలవుల వంటి వాటి మీద మరికొన్ని ఆంక్షలు విధించారు. ఇవిగాక పారిశ్రామిక సంస్ధలు ఇచ్చిన వేల కోట్ల రూపాయల పిఎం కేర్‌ నిధులున్నాయి. అంటే ఇప్పటి వరకు జనానికి ఇచ్చింది ఎక్కువా కరోనా పేరుతో జనం జేబుల నుంచి కొట్టివేస్తున్నది ఎక్కువా? దేశభక్తి కళ్లతో చూసినా వేద గణితం ప్రకారం చూసినా ఎక్కువే కదా !
గృహబందీ వ్యవధి పెరిగే కొద్దీ ప్రధాని నరేంద్రమోడీ తన ఎత్తుగడలు మారుస్తున్నారు. దానిలో భాగమే తాజా పరిణామాలు. కేంద్రం సుభాషితాలు వల్లిస్తూ, పెత్తనం చలాయిస్తున్నది, పైసా విదల్చటం లేదు, సమస్యలను రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సి వస్తోంది. పోనీ ప్రత్యేక చర్యగా భావించి పరిమితికి మించి కరోనా అప్పులు చేసేందుకు అనుమతి ఇస్తున్నారా లేదు. కేంద్రం మీద నిధుల వత్తిడి తగ్గాలంటే రాష్ట్రాలలో ఒక ప్రధాన ఆదాయవనరుగా ఉన్న మద్యం అమ్మకాలను అనుమతించారు తప్ప అదేమైనా కరోనా నియంత్రణ చర్య కాదే.దేశంలోని మధ్య తరగతి, ధనికుల మన్ననలను పొందే చర్యలను ప్రకటించి భజన చేసే మీడియాలోనూ, చెక్క భజన చేసే పాలకపార్టీ సామాజిక మాధ్యమ విభాగాలతో ప్రచారం చేయిస్తున్నారు.
అత్యవసర వస్తువుల సరఫరాను మెరుగుపరచే పేరుతో కార్మికుల పని గంటలను ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనేక రాష్ట్రాలు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాయి. తాజా ఆదేశాల ప్రకారం యజమానులు కోరితే పన్నెండు గంటల వరకు విధిగా కార్మికులు పని చేయాల్సి ఉంటుంది. మాకు అదనపు వేతనం లేదా ఓవర్‌ టైమ్‌ వద్దు నిబంధనల ప్రకారం ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తామంటే కుదరదు. వాస్తవానికి ఇప్పటికే కార్మిక చట్టాలను గాలికి వదలిన కారణంగా అనేక చోట్ల పన్నెండు గంటల పని చేయిస్తున్నారు. ఓవర్‌టైమ్‌లేదు, కనీస వేతనాలు, పని పరిస్ధితుల నిబంధనల అమలు లేదు. కేంద్రం, రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకొనేందుకు తక్షణ కారణం తమ స్వస్ధలాలకు వెళ్లిపోయిన వలస కార్మికులు వెంటనే తిరిగి వచ్చే అవకాశాలు పరిమితం కావటమే. అందువలన కొత్తవారిని నియమించి వారికి శిక్షణ ఇవ్వటం, ఒకసారి పని ఇచ్చిన తరువాత తొలగింపు సమస్యలతో కూడుకున్నది కావటంతో యజమానులు అందుబాటులో ఉన్న వారిమీదే పని భారం పెంపుదలకు పూనుకున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించటం తప్ప మరొక కారణం లేదు.

Prime Minister Narendra Modi On Coronavirus: Total Lockdown From ...
గృహబందీ సమయంలో సరకు రవాణాలో ఇబ్బందులు తప్ప ఇంతవరకు నిత్యావసర సరకుల కొరత ఏర్పడలేదు. నిజానికి అనేక కారణాలతో వినిమయం పరిమితం అయింది. తగ్గిపోయింది కూడా. కరోనాతో నిమిత్తం లేకుండానే డిమాండ్‌ పడిపోయింది.2011-12తో పోల్చితే 2017జూలై 2018జూన్‌ మధ్య గ్రామీణ ప్రాంతాలలో వినియోగ గిరాకీ 8.8శాతం పడిపోయిందని జాతీయ గణాంక సంస్ధ(ఎన్‌ఎస్‌ఓ) తెలిపింది. దేశ జనాభాలో మూడింట రెండువంతుల మంది గ్రామాలలోనే ఉంటున్నారు. దుస్తులు, ఆహారం,విద్యపై ఖర్చు పడిపోయింది, తృణ ధాన్యాల వంటి అత్యవసర వస్తువుల డిమాండ్‌ 20శాతం వరకు పడిపోయిందని అంచనా.1972-73 తరువాత తొలిసారిగా దేశంలో పట్టణ ప్రాంతాలలో రెండుశాతం డిమాండ్‌ పెరిగినా గ్రామీణ ప్రాంతాలలో దిగజారిన కారణంగా మొత్తంగా 3.7శాతం తలసరి వినిమయ ఖర్చు పడిపోయింది. అయితే ప్రభుత్వం ఈ గణాంకాలను విశ్లేషించే పేరుతో ఖరారు చేయకుండా తొక్కి పెడుతోంది. కరోనా కారణంగా గ్రామాలకు తరలి పోతున్న కోట్లాది మంది వలస కార్మికులకు గ్రామాలలో పనులు ఉండవు. అందువలన గ్రామీణ వినియోగం రానున్న రోజుల్లో ఇంకా పడిపోయే అవకాశం ఉంది. అటువంటపుడు పన్నెండు గంటల పాటు పనిచేయించాల్సిన అవసరం ఏముంది ?
2016లో చేసిన బుర్ర తక్కువ పని పెద్ద నోట్ల రద్దు వలన మోడీగారు చెప్పినట్లు సత్ఫలితాలకు బదులు దుష్ఫలితాలు కలిగాయి. మరుసటి ఏడాది ప్రవేశపెట్టిన జిఎస్‌టి మరికొంత దెబ్బతీసింది. ఆ దెబ్బలకు అలవాటు పడుతున్న స్ధితిలో పులిమీద పుట్రలా కరోనా ప్రభావం దేశ ఆర్ధిక స్ధితిని మరింత దిగజార్చనుంది. జిడిపి వృద్ధి రేటు సున్నా అవుతుందా ఇంకా దిగజారుతుందా అన్నది ఎవరూ చెప్పలేని స్ధితి. అయినా ఇంకా మంచిదినాలు రానున్నాయి(అచ్చేదిన్‌) అంటే మూతికి చిక్కెం బిగించి కంటికి కనపడేలా దూరంగా గడ్డి కట్ట చూపుతుంటే ఆశతో ముందుకు సాగే గుర్రాల మాదిరి పరుగెడుతూనే ఉన్నాం. మన మాదిరి మెదడు పెరగలేదు కనుక అవి పరుగెడతాయి, మన సంగతేమిటి.
ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే ఇక్కడ పెంచుతాము, తగ్గితే తగ్గిస్తాము అని కబుర్లు చెప్పారు. మార్చినెల 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో పీపా ధర సగటున 60డాలర్లకు కొనుగోలు చేసిన మనం ఏప్రిల్‌లో ఇరవై డాలర్లకు లోపే కొన్నాం. జనవరి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌ ధరలు తగ్గుతున్నాయి, మార్చినెలలో మరింత తగ్గాయి. అయినా మార్చి 16 నుంచి నేటి వరకు అంతకు ముందు ఉన్న ధరనే ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఎందుకు ఆ పని చేస్తున్నారో వారు చెప్పరు, ఏమిటీ పట్టపగలు జేబు కొట్టుడు అని మనమూ అడగం. ధరలు తగ్గిన తరువాత వినియోగదారుల మీద రెండులక్షల కోట్ల రూపాయల వరకు పన్నుబాదితే ఇదేమని ప్రశ్నించలేని బలహీనత లేదా లొంగుబాటు ఏమిటి ?

Brick Tamland Anchorman - I have no idea What's going on! | Funny ...
తప్పులు అందరూ చేస్తారు. వాటిని అంగీకరించి సరిదిద్దుకోవటమే గొప్ప అని మన పెద్దలు చెప్పారే. కమ్యూనిస్టులు తాము అనుసరించిన విధానాలు, ఎత్తుగడల తప్పుల గురించి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాసభల్లో సమీక్షించుకుంటారు. వాటిని బహిరంగంగానే అంగీకరిస్తారు. కొందరు దెప్పుతున్నట్లు విదేశీ సిద్ధాంతాలను పాటించేవారిలోనే ఆ నిజాయితీ కనిపిస్తున్నప్పుడు పక్కా భారతీయం అమలు జరుపుతున్నామని చెప్పుకొనే నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు పెద్ద తప్పిదం అని జాతికి ఎప్పుడైనా చెప్పారా ? ఎందుకు చెప్పలేదు ? ఆయన ఖర్మకు ఆయన్ను వదిలేద్దామా ? వ్యక్తులుగా అయితే అలాగే చేద్దుము, కానీ ప్రధాని, ముఖ్యమంత్రులు వ్యక్తులు కాదే, వ్యవస్ధకు ప్రతినిధులు. వారి ఖర్మలకు జనం అనుభవించాలా ? ఇదెక్కడి వేదాంతం ? ఇదెక్కడి భారతీయత ?
ఇలా చెప్పుకుంటూ పోతే బిజెపి వారు ఆలపించిన భజన గీతాల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి.ఏ విదేశీ దుండగీడు వచ్చినా చేవచచ్చినట్లు భరించి పాలన అప్పగించి ఎన్ని విధాలుగా నష్టపోయామో తెలిసిందే. అలాగే స్వదేశీయుడు ఏమి చేసినా అలాగే భరించాలా ? కొంత మంది మన వేదవిజ్ఞానం, పురాతన తర్కజ్ఞానం గురించి గొప్పగా చెబుతారు. అదే నిజమైతే మనం వాటిలో ఆవగింజలో అరవయ్యో వంతు వంటబట్టించుకున్నా ఎందుకు అనే ఒక చిన్న ప్రశ్న కూడా మనల్ని మనం, పాలకులను అడిగి ఉండేవారం కాదా ? ఎక్కడుందీ లోపం, ఎవరైనా ప్రశ్నిస్తే కమ్యూనిస్టు విదేశీ సిద్ధాంతాన్ని అరువు తెచ్చుకున్నారని ఎదురుదాడికి దిగుతారు. ఏం జరిగినా నోరు సహా అన్నీ మూసుకొని కూర్చోమని మన స్వదేశీ వేదజ్ఞానం, తర్కం చెప్పిందా ?