Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


బిజెపి నేత, ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ” ఆర్గనైజర్‌ ” మాజీ సంపాదకుడు శేషాద్రి చారి (లడఖ్‌ ఉదంతం జరగక ముందు ) డెబ్బరు సంవత్సరాలుగా టిబెట్‌ సందిగ్దత, నెహ్రూ చేయలేనిదానిని మోడీ చేయగలరు అంటూ జూన్‌లో ఒక విశ్లేషణ రాశారు. టిబెట్‌ కుడి అరచేతికి ఉన్న సిక్కిం, భూటాన్‌, నేపాల్‌, లడఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ అనే ఐదు వేళ్లను ఆక్రమించాలని చైనా నేత గ్జీ జింపింగ్‌ కోరుతున్నారంటూ ఆరోపించారు. ప్రస్తుతం ప్రపంచంలో చైనా వ్యతిరేకత కనిపిస్తోందని, మన దేశం టిబెట్‌ తురుపు ముక్కను వినియోగించుకోవాలని నరేంద్రమోడీకి సలహా ఇచ్చారు. టిబెట్‌ స్వాతంత్య్రాన్ని గుర్తించాలని, దలైలామాకు భారత రత్న ఇవ్వాలన్నది మొత్తం వ్యాస సారాంశం.
టిబెట్‌ను చైనా నుంచి వేరు చేసి అక్కడ పాగా వేసి మన దేశాన్ని, చైనాను దెబ్బతీయాలని చూసింది అమెరికా. అందుకు గాను బౌద్దమత నేత, అధికారాన్ని చెలాయించే దలైలామాను తిరుగుబాటుకు రెచ్చగొట్టటమే కాదు, అనుచరులకు ఆయుధాలిచ్చి విఫల తిరుగుబాటు చేయించింది. విధిలేని స్ధితిలో కొత్త ఎత్తుగడల్లో భాగంగా దలైలామాను వదిలించుకున్న అమెరికన్లు చైనాతో సయోధ్యకు వచ్చారు. ఐక్యరాజ్యసమితిలో అసలైన ప్రతినిధిగా కమ్యూనిస్టు చైనాను గుర్తించేందుకు దిగి వచ్చారు. అలాంటి దలైలామాను మనం తలకెక్కించుకొన్నాం. దీంతో సాధించేదేమిటి ? గుడ్డి చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకత జబ్బుతో ప్రేలాపనలు తప్ప అంత పెద్ద అమెరికాయే వదలి పెట్టిన టిబెట్‌ సమస్యను తురుఫు ముక్కగా వాడు కోవటం ఏమిటి ? పర్యవసానాలను ఆలోచించే, అసలు ఆట తెలిసిన వారు ఇచ్చే సలహాయేనా ఇది !
టిబెట్‌ తిరుగుబాటుదార్లను సృష్టించి వారికి ఆయుధాలు, శిక్షణ ఇచ్చిన వారిలో ఒకడైన సిఐఏ అధికారి జాన్‌ కెన్నెత్‌ నాస్‌ రాసిన పుస్తకంలో 1950దశకం నుంచి రెండున్నర దశాబ్దాల పాటు టిబెట్‌లో అమెరికా నిర్వాకం గురించి వివరించాడు. మావో జెడాంగ్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టులను నిలువరించి సోషలిస్టు దేశంగా మారకుండా చాంగ్‌కై షేక్‌ నాయకత్వంలోని కొమింటాంగ్‌ పార్టీ ప్రభుత్వం చైనాను కాపాడుతుందన్న అంచనాకు వచ్చిన అమెరికా, అది అసాధ్యమని చాలా ఆలస్యంగా గ్రహించింది. దాంతో దింపుడు కళ్లం ఆశ మాదిరి టిబెట్‌లో దలైలామాతో తిరుగుబాటుకు కుట్ర చేసింది. టిబెట్‌ సరిహద్దులోని నేపాల్‌ ముస్టాంగ్‌ కేంద్రంగా చేసుకొని సిఐఏ ఆయుధాలను అందచేసి తిరుగుబాటు దార్లను టిబెట్‌లోకి ప్రవేశ పెట్టేందుకు చేసిన ప్రయత్నాలను చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వమ్ము చేసింది.1969 వరకు అమెరికా అన్ని ప్రయత్నాలు చేసింది. అమెరికన్ల మాటలు, అంచనాలను నమ్మి దలైలామా నాయకత్వంలోని తిరుగుబాటుదార్లు టిబెట్‌ను స్వాధీనం చేసుకుంటారని భావించిన నెహ్రూ, తరువాత అధికారానికి వచ్చిన లాల్‌బహదూర్‌ శాస్త్రి, ఇందిరా గాంధీ కూడా టిబెటన్లకు సాయం చేశారు. చివరికి అది సాధ్యం కాదని అమెరికా చేతులెత్తేసింది. తిరుగుబాటుదార్లకు ఆశ్రయం కల్పించిన నేపాల్‌ కూడా చివరకు గెరిల్లాలు ఆయుధాలను అప్పగించి లొంగిపోవాలని వత్తిడి తీసుకు వచ్చింది.1974జూలై 23న విధిలేని పరిస్ధితుల్లో దలైలామా తన అనుచరులు లొంగిపోవాలని వర్తమానం పంపాడు. అయితే దాన్ని ఉల్లంఘించిన ఒక బృందం భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా నేపాలీ దళాలు హతమార్చాయి. దాంతో దలైలామా తిరుగుబాటు ముగిసినట్లయింది.
అప్పటికే అంటే 1970దశకం ప్రారంభం నాటికే అమెరికన్లు చైనాతో సయోధ్యకు వచ్చారు. ఐక్యరాజ్యసమితిలో కమ్యూనిస్టు చైనాను అనుమతించేందుకు అంగీకరించారు. కమ్యూనిస్టుల నాయకత్వంలోనిదే అసలైన చైనా అని, తైవాన్‌, టిబెట్‌తో సహా చైనా ఒక్కటే అని గుర్తించారు. కమ్యూనిస్టుల లాంగ్‌ మార్చ్‌లో అనేక విజయాలు సాధిస్తూ ఒక్కో ప్రాంతం మీద పట్టుసాధిస్తున్న సమయంలో రెండవ ప్రపంచ యుద్దం తరువాత చాంగ్‌కై షేక్‌ నాయకత్వంలోని మిలిటరీకి నేపాల్‌, సిక్కిం, భారత్‌ ద్వారా టిబెట్‌ మీదుగా ఆయుధాలు చేరవేయాలని కొల్‌కతా రాయబార కార్యాలయం కేంద్రంగా అమెరికా పధకాలు వేసింది. టిబెట్‌ను ఒక స్వతంత్ర రాజ్యంగా ప్రకటించేందుకు అవసరమైన కుట్ర చేసింది. అయితే చాంగ్‌కై షేక్‌ దాన్ని అడ్డుకున్నాడు. టిబెట్‌లోని శక్తులు స్వాతంత్య్రం ప్రకటించుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారీ అది చైనాలో టిబెట్‌ అంతర్భాగమే అనే వైఖరిని తొలి నుంచీ కొమింటాంగ్‌ పార్టీ తీసుకుంది. టిబెట్‌కు స్వాతంత్య్రం ప్రకటించితే తీరా కమ్యూనిస్టులను ఓడించి చాంగ్‌కై షేక్‌ చైనాపై ఆధిపత్యం సాధిస్తే ఆ స్వాతంత్య్రం నిలవదని అమెరికాకు తెలుసు. అందుకే తొందరపడలేదు. ఎప్పుడైతే కమ్యూనిస్టుల ఆధిపత్యానికి తిరుగులేదని, వారిని అడ్డుకొనే సత్తా కొమింటాంగ్‌ సేనలకు లేదని తేలిపోయిందో, టిబెట్‌ను కూడా విముక్తి చేసేందుకు కమ్యూనిస్టు దళాలు ప్రవేశించాయో అప్పుడు అమెరికన్లు టిబెట్‌కు స్వాతంత్య్రం, చైనా ఆక్రమణ వంటి ఆరోపణలతో తిరుగుబాటును రెచ్చగొట్టారు. ఇదంతా 1950 తరువాతే జరిగింది. అప్పటికి చైనాలో అనేక చోట్ల కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. మావో నాయకత్వంలోని కమ్యూనిస్టులు తమ సంపూర్ణ అధికారాన్ని ఇంకా నెలకొల్పని స్ధితి ఉంది. ముందు ప్రధాన భూభాగంలో అధికారాన్ని స్ధిరపరచుకొని తైవాన్‌లో తిష్ట వేసిన చాంగ్‌కై షేక్‌ సేనల సంగతి చూడవచ్చని కమ్యూనిస్టులు భావించారు. ఈ నేపధ్యంలో తమ పని సులువు అవుతుందనే అంచనాతో అమెరికన్లు తమ కుట్రలతో ముందుకు పోయి భంగపడ్డారు.
అమెరికా పధకాలకు అనుగుణ్యంగా మన పాలకులు ద్వంద్వ వైఖరిని అనుసరించారు. టిబెట్‌ ప్రాంతంతో సహా చైనా ఒక్కటే అని గుర్తిస్తూనే అమెరికన్ల సలహామేరకు దలైలామాకు మతపెద్ద పేరుతో ఆశ్రయం కల్పించటం, ప్రవాస తిరుగుబాటు ప్రభుత్వం కొనసాగటానికి అనుమతి, వారి అవసరాలను చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అమెరికన్లు టిబెట్‌ సమస్యను ఐక్యరాజ్యసమితిలో చర్చనీయాంశంగా చేసేందుకు సర్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. మానవహక్కులకు భంగం కలుగుతోందనే పేరుతో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు.న్యూయార్క్‌, లండన్‌, జెనీవాలలో కార్యాలయాల ఏర్పాటుకు దలైలామాకు సాయం చేశారు.
సోవియట్‌ యూనియన్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య 1960 దశకంలో తలెత్తిన వివాదాలను సాకుగా తీసుకొని చైనాతో చేతులు కలిపి సోవియట్‌ను దెబ్బతీయాలని అమెరికన్లు పధకం వేశారు. దానిలో భాగంగానే చైనాకు ఐక్యరాజ్యసమితిలో గుర్తింపు, చైనాతో అమెరికన్లు దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారన్నది ఒక అభిప్రాయం. 1972లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ బీజింగ్‌ పర్యటన జరిపాడు. ఇరు దేశాల చర్చలలో ఎక్కడా టిబెట్‌ ప్రస్తావన లేదు. అంతకు ముందు నిక్సన్‌ పర్యటనకు ఏర్పాట్లు చేసేందుకు విదేశాంగ మంత్రి హెన్రీకిసింజర్‌ రాక సమయంలో చైనా నాయకత్వం టిబెట్‌ అంశాన్ని కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. 1975లో డెంగ్‌సియావో పింగ్‌ తనదైన శైలిలో న్యూయార్క్‌లో దలైలామా ఒక చిన్న కార్యాలయం ఏర్పాటు చేసుకున్నట్లు విన్నాం అన్నట్లుగా అమెరికన్లతో ప్రస్తావించారట. అప్పుడు అధ్యక్షుడు గెరాల్డ్‌ ఫోర్డ్‌ మాట్లాడుతూ టిబెట్‌కు సంబంధించినంత వరకు ప్రభుత్వ పరంగా మేము ఎలాంటి చర్యలనైనా వ్యతిరేకిస్తాం, మద్దతు ఇవ్వం. అంతే కాదు టిబెట్‌కు సంబంధించి భారతీయులు తీసుకొనే చర్యలను కూడా మేము సమర్ధించం అని స్పష్టం చేశాడు.దాంతో డెంగ్‌ నవ్వుతూ అయితే దలైలామా అక్కడ ఉండటం భారతీయులకు భారంగా మారుతుందన్నమాట అంటూ ఆ ప్రస్తావనను ముగించారు.
ఆ తరువాతే దలైలామా దూకుడు తగ్గించారు. దలైలామాను చైనాకు అనుమతించటం గురించి డెంగ్‌ సియావో పింగ్‌ మాట్లాడుతూ ఆయన చైనా పౌరుడిగా తిరిగి రావాలి, అదే దేశభక్తి అని చెప్పారు. అయితే ఎలాంటి షరతులు విధించకుండా ఉంటేనే తాను చైనా వెళతానని దలైలామా చెప్పారు. నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం దలైలామాతో రాజకీయం చేయాలని చూస్తున్నది. దానివలన మన దేశానికి ఒరిగేదేమీ లేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఒక పెద్ద బౌద్ధ కేంద్రం ఉన్న తవాంగ్‌ ప్రాంతం నుంచే దలైలామా టిబెట్‌ నుంచి పారిపోయి మన దేశంలో ప్రవేశించాడు. దలైలామా ఆ పట్టణాన్ని సందర్శించటాన్ని తాము అభ్యంతర పెడుతున్నామని చైనా మోడీ సర్కార్‌కు తెలియచేసింది. మక్‌మోహనరేఖ ప్రకారం తవాంగ్‌తో సహా కొన్ని ప్రాంతాలు తమ టిబెట్‌లోని దక్షిణ భూభాగాలని చైనా చెబుతున్నది. అయితే అవి ఎన్నడూ చైనాలో లేవు. చైనా అభ్యంతరాలను తోసి పుచ్చి అరుణాచల్‌పై ఆధిపత్యం మనదే అని స్పష్టం చేసే ప్రక్రియలో భాగంగా దలైలామా పర్యటనను మోడీ సర్కార్‌ ఏర్పాటు చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సమస్యకు, దలైలామా పర్యటనకు ముడిపెట్టాల్సిన అవసరం లేదన్నది ఒక అభిప్రాయం.
దలైలామా మన దేశంలో ఎంతకాలం ఉంటారు, కాందిశీకులుగా మనం గుర్తించని ఏ దేశానికీ చెందని వారిగా పరిగణిస్తున్న టిబెటన్లు ఎంతకాలం చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవిస్తారు ? వంటి సమస్యలు దలైలామా, ఆయన గణం ముందు ఉన్నాయి. ఎక్కువకాలం వారు బతకలేరన్నది వాస్తవం. టిబెట్‌ మీద చైనా సార్వభౌమత్వాన్ని అంగీకరించనంత వరకు వారి పరిస్ధితి అగమ్యగోచరమే. అమెరికా వదిలించుకున్న దలైలామాను కాంగ్రెస్‌ పాలకులు, ఇప్పుడు బిజెపి పాలకులు తగిలించుకొని భుజాల మీద ఎక్కించుకొని మోస్తున్నారు. బిజెపి నేతలు మరొక అడుగు ముందుకు వేసి ఆయనకు భారత రత్న ఇవ్వాలని మోడీ సర్కార్‌కు వినతులు పంపారు. తమ చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకతను తమకు తామే సంతుష్టీకరించుకొనేందుకు తప్ప దీని వలన సాధించేదేమీ ఉండదని వారికి చెప్పినా ప్రయోజనం లేదు ! దలైలామాకు మద్దతు ఇచ్చిన సమయంలో అమెరికన్లు చెప్పిన మాటలు, సమాచారాన్ని ఇంకా వదలని సంఘపరివార్‌ శక్తులు ఆ పాతబడిన అంశాలనే పట్టుకు వేలాడుతుంటాయి. వాస్తవ, వర్తమానాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు.
అసాధ్యమైన అంశాన్ని తలకెత్తుకొని చైనాతో తలపడి సాధించేదేమిటి ? చైనాతో తలెత్తిన సరిహద్దు సమస్య వేరు, టిబెట్‌ వేరు. అరుణాచల్‌ ప్రదేశ్‌తో సహా సరిహద్దు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిజంగానే కోరుకుంటే టిబెట్‌తో లంకె పెట్టటం తగని పని ? చైనా తిరుగుబాటు దారు దలైలామాకు, ఖలిస్ధాన్‌ లేదా వేర్పాటు కాశ్మీర్‌ పేరుతో విదేశాల్లో తిష్టవేసిన మన దేశ వేర్పాటు వాదులకు పెద్ద తేడా ఏముంది ? మత పెద్ద పేరుతో ఆశ్రయం కల్పించటమే ఒక తప్పిదం. ప్రతిదానికి జవహర్‌లాల్‌ నెహ్రూ విధానాన్ని విమర్శించే బిజెపి దలైలామా విషయంలో తప్పిదం చేసిన అదే నెహ్రూ బూట్లలో కాళ్లు పెట్టి నడవటం ఏమిటి ?