Tags

, ,


ఎం కోటేశ్వరరావు


ఏ రోజు ఏ దేశం మాంద్యంలోకి కూరుకుపోయిందో అనే వార్త వినాల్సి వస్తుందో తెలియటం లేదు. వరుసగా ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధలో అయినా జిడిపి వృద్ధి రేటు తిరోగమనాన్ని సూచిస్తే ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి పోయినట్లుగా పరిగణిస్తారు. బ్రిటన్‌కు చెందిన సంస్ధ యు గవ్‌ జరిపిన తాజా సర్వే వివరాల ప్రకారం మన ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉన్నవారి శాతం చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. దీన్నే మరో విధంగా చెప్పాలంటే మీకు నేను ఉన్నాను అని మన ప్రధాని నరేంద్రమోడీ ధీమా మీద ఆర్ధిక వ్యవస్ధ విషయంలో జనంలో విశ్వాసం లేదు అని సర్వే ఫలితం సూచిస్తోంది.
తాజాగా ఫిలిఫ్పైన్స్‌ 29 సంవత్సరాల తరువాత తొలిసారిగా మాంద్యంలోకి జారింది. తొలి త్రైమాస కాలంలో 0.7 శాతం తిరోగమనాన్ని సూచించగా ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో 9శాతం ఉండవచ్చన్న అంచనాలను తారు మారు చేసి 16,5 దిగజారింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో అనేక దేశాల తిరోగమనం గత ఏడాదే ప్రారంభమైంది. కరోనా మహమ్మారి పతన వేగాన్ని పెంచింది. గత ఏడునెలలుగా ప్రపంచాన్ని కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తున్నది. ఫిలిఫ్పైన్స్‌లో ఇది రాసిన సమయానికి లక్షా 16వేల కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాపితంగా కోటీ 90లక్షల మందికి సోకింది, కోటీ 22లక్షల మంది కోలుకున్నారు, ఏడు లక్షల 12 మందికి పైగా మరణించారు.49.73లక్షల మందితో అమెరికా, 28.62లక్షల మందితో బ్రెజిల్‌ ఒకటి రెండు స్దానాల్లో ఉంటే మన దేశంలో 19.64 లక్షల మందికి పైగా సోకింది. తొలి రోజుల్లో పాకిస్దాన్‌ కేసులు మనలో సగం వరకు ఉండేవి ఇప్పుడు 2.81లక్షలతో 14వ స్ధానంలో, 2.46లక్షలతో బంగ్లాదేశ్‌ 16, చైనా 84వేల కేసులతో 29వ స్ధానంలో ఉంది.

ఆర్ధిక వ్యవస్ధ, తమ భవిష్యత్‌ గురించి ప్రపంచంలోని జన ఆలోచనా ధోరణి ఎలా ఉంది ?
బ్రిటన్‌కు చెందిన యు గవ్‌ అనే ఒక సంస్ధ తాజాగా నిర్వహించిన సర్వే వివరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. దాని ప్రకారం అతి పెద్ద ఆందోళనకర అంశం ప్రపంచ వ్యాపిత ఆర్దిక మాంద్యం. అయితే ఇది అన్నిదేశాలలో ఒకే తీవ్రతతో లేదు. ప్రపంచంలో మెక్సికన్లు తీవ్ర నిరాశ, ఆందోళన చెందుతుండగా, సోషలిస్టు వియత్నాం, చమురు సంపదలున్న మధ్య ప్రాచ్య దేశాల జనం తమ ఆర్దిక వ్యవస్ధ గురించి ఎక్కువ మంది ఆశాభావంతో ఆదుర్దాలేకుండా ఉన్నారు.

దేశాల ఆర్ధిక వ్యవస్ధల కుంగుబాటు ఎలా ఉంది ?
మన దేశ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ ఒకటితో ప్రారంభం అవుతుంది.అనేక దేశాల్లో జనవరి నుంచి ఆరంభం. మనకు మూడు నెలలు గడిస్తే అనేక దేశాలకు ఆరునెలలు గడిచింది. ప్రతి మూడు నెలలకు ఆర్ధిక ఫలితాలను మదింపు వేయటం దాదాపు అన్ని చోట్లా ఉన్నది. మన ఆర్ధిక వ్యవస్ధకు సంబంధించి లాక్‌డౌన్‌ కారణంగా సమాచార సేకరణ సిబ్బంది బయటకు వెళ్లలేని కారణంగా సమాచారం సమగ్రమైంది కాదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అంచనాలు తప్ప వాస్తవాలు ఇంకా బయటకు రావటం లేదు. మిగతా దేశాలు కూడా పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తున్న సూచనలు కనిపించటం లేదు. అరకొరగా వస్తున్నాయి. ఫైనాన్సియల్‌ టైమ్స్‌ అనే పత్రిక ధనిక దేశాల ఆర్ధిక వ్యవస్ధలు సగటున ఏడుశాతం, వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అది రెండున్నరశాతం తిరోగమనంలో ఉండవచ్చని అంచనా వేసింది.
ఇప్పటి వరకు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ ఎన్ని సార్లు మాంద్యంలోకి పోయింది, వాటి తీవ్రత ఎలా ఉంది ?
1876 నుంచి ఇప్పటి వరకు 14సార్లు ప్రపంచం మాంద్యానికి గురైంది. వీటిలో కొన్ని దేశాలకు మినహాయింపు ఉన్నా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను మొత్తంగా చూసినపుడు ఈ నిర్ధారణకు వచ్చారు.1930-32 సంవత్సరాలలో 17.6, 1945-46లో 15.5, 1914లో 6.7శాతాలు గరిష్టంగా నమోదు కాగా 2020లో 6.2శాతం ఉండవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత 2009లో వచ్చిన ఆర్ధిక మాంద్యం 2,9శాతమే తిరోగమనం అయినా చాలా పెద్దదని ఆర్ధికవేత్తలు చెప్పారు, ఇప్పుడు దానికి రెండు రెట్లు 6.2శాతం అని అంచనా, ఇంకా దిగజారినా ఆశ్యర్యం లేదు. అనేక దేశాలో 2009 నాటి మాంద్య ప్రభావం ఇంకా కొనసాగుతుండగా మరో మాంద్యం ముప్పు ఉందని కరోనాకు ముందే అనేక మంది హెచ్చరించారు. ఇప్పుడు జమిలిగా మరో పెద్ద సంక్షోభం రానున్నది, దీని ప్రభావం ఎంతకాలం ఉంటుందో చెప్పలేని స్ధితి.

వివిధ దేశాల్లో అభివృద్ధి రేటు పతనాల తీరు ఎలా ఉంది ?
సమగ్రమైన సమాచారం ఇంకా రావటం లేదు, అంచనాలు, తాత్కాలిక గణాంకాలు మాత్రమే వెలువడుతున్నాయి. వాటిలో సింగపూర్‌ ఆర్ధిక వ్యవస్ధ చిన్నదే అయినా తొలి మూడు మాసాల్లో 3.3శాతం పతనం కాగా రెండవ త్రైమాసంలో 41.2శాతం మైనస్‌లో పడింది. అమెరికా రెండవ త్రైమాసంలో 33శాతం, యూరో జోన్‌లో 12.1శాతం అయితే స్పెయిన్‌లో 18.5 జర్మనీ 10.1, స్పెయిన్‌ స్వీడన్‌లో 8.6 శాతాల చొప్పున తిరోగమనంలో చైనాలో తొలి మూడు మాసాల్లో 6.8శాతం మైనస్‌ అయితే రెండవ త్రైమాసంలో 3.2శాతం అభివృద్ధిలోకి వచ్చింది. దక్షిణ కొరియాలో మొదటి మూడు నెలల్లో 3.3శాతం తిరోగమనం కాగా రెండవ త్రైమాసంలో 1.3శాతం నమోదు కావటంతో సాంకేతికంగా మాంద్యం ముంగిట ఉన్నట్లే భావిస్తున్నారు. మన దేశం తొలి త్రైమాస వివరాలు ఇంకా ప్రకటించలేదు గానీ వివిధ సంస్ధలు 6.1శాతం మైనస్‌ అని అంచనా వేశాయి. రానున్న ఏడాది కాలంలో తమ వ్యవస్ధలు ఆర్ధిక మాంద్యంలోకి పోతాయని మెక్సికో, ఫ్రాన్స్‌ దేశాలు, చైనాలో పెట్టుబడిదారీ వ్యవస్ధ ఉన్న హాంకాంగ్‌ ప్రాంత పౌరుల్లో నాలుగింట మూడువంతుల మంది భావిస్తున్నారు.

చైనా, మన, ఇతర దేశాల గురించి యు గవ్‌ సర్వే ఏమి చెప్పింది ?
రెండుదేశాల మధ్య నెలకొన్న పరిస్ధితుల్లో ఆర్ధికం గురించి జనం ఏమనుకుంటున్నారన్నది నిజంగా ఆసక్తి కలిగించేదే. మన దేశంలో 54శాతం మంది మాంద్యంలోకి పోనున్నామని చెప్పగా ఇప్పుడున్న స్దితే కొనసాగుతుందని చెప్పిన వారు 21, అచ్చేదిన్‌ అని చెప్పిన వారు 14శాతం మంది ఉన్నారు. దీనికి కారణం ఏమిటన్నది మరొక ప్రశ్నకు వచ్చిన సమాధానం వెల్లడిస్తోంది. సర్వేకు ముందు నెలతో పోల్చితే సర్వే సమయంలో తమ ఆదాయం తగ్గిందని చెప్పిన వారి సంఖ్య మెక్సికోలో 58శాతం కాగా రెండవ స్ధానంలో ఫిలిప్పీన్స్‌లో 51, మూడవ స్ధానంలో ఉన్న మన దేశంలో 50శాతం మంది చెప్పారు. ఆదాయాలు పడిపోవటం ఎక్కువగా ఉన్న కారణంగానే యథాతధ స్ధితి కొనసాగుతుందని చెప్పిన వారి సంఖ్య తక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన పధకం తమను ఉద్దరిస్తుందన్న విశ్వాసం జనంలో కలిగించలేదని కూడా సర్వేలో వెల్లడైన అభిప్రాయం సూచిస్తున్నది.
మాంద్య భయం ఎక్కువగా ఉన్న అమెరికా, ఫ్రాన్స్‌తో సహా ఐరోపా దేశాల్లో ఆదాయం తగ్గినవారి శాతం కనిష్టంగా ఉంది. చైనా విషయానికి వస్తే ఆదాయం తగ్గిన వారు 29, వియత్నాంలో 25శాతం ఉన్నారు. స్ధిరంగా ఉన్న వారు మన దేశంలో 34శాతం అయితే చైనాలో 52 శాతం ఉన్నారు. వియత్నాంలో స్ధిరంగా ఉన్న వారి శాతం41 అయితే ఆదాయం పెరిగిన వారు 33శాతం ఉన్నారు కనుక అక్కడి వారిలో ఆందోళన లేదని సర్వేలో వెల్లడైంది.
చైనాలో మాంద్యం గురించి చెప్పిన వారు 30, యథాతధ స్ధితి కొనసాగుతుందన్న వారు 50, మెరుగుపడుతుందని 12శాతం మంది చెప్పారు. అమెరికాలో 47శాతం మంది ఆర్ధిక మాంద్యం గురించి భయపడుతున్నారు. స్ధిరంగా ఉంటుందని 16శాతం, అభివృద్ధి పధంలో ఉంటామని 20శాతం చెప్పారు. సోషలిస్టు వియత్నాంలో మాంద్యం గురించి భయపడుతున్నవారు 24, యథాతధంగా ఉంటుందన్న వారు 56, మరింత పురోగమిస్తామని ఆశాభావం వెలిబుచ్చిన వారు 15శాతం మంది ఉన్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ జనంలో ప్రపంచంలో అత్యధికంగా 27శాతం మంది తమ ఆర్దిక వ్యవస్ధలు పురోగమిస్తాయనే ఆశాభావం వెల్లడైంది.