ఎం కోటేశ్వరరావు
ఆగండి ఆగండి శీర్షికను చూసి ఉద్రేకపడకండని కొందరికి సవినయ మనవి. ఇది కమ్యూనిస్టులు ఇచ్చిన సలహా కాదు మహాశయులారా ! మోడినోమిక్స్ అంటే తెలుసు కదా ! నరేంద్రమోడీ ప్రావీణ్యత సంపాదించిన ప్రత్యేక ఆర్ధశాస్త్రం. అసలు ఆయనే చదువుకున్నారో మనకు తెలియదు. చదువులతో పనేముంది అంటూ ఆయన ప్రకటించిన విధానాలను చూసి అర్ధశాస్త్ర పండితుడని, ఆ పాండిత్యం అనితర సాధ్యం కనుక ఆయన పేరుతోనే మన మీడియా కితాబిచ్చింది. ఇప్పుడు అదే మీడియాలో ఒక విశ్లేషణ వెలువడింది. చైనా సంగతి తరువాత ముందు బంగ్లాదేశ్‌ను అధిగమించండి అనే శీర్షికతో ఒక విశ్లేషణ వెలువడింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తీరు తెన్నుల గురించి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్) వెల్లడించిన తాజా అంచనా-జోశ్యంలో చెప్పిన అంశాలు మోడినోమిక్స్ గాలితీస్తున్నాయి. ఆండీ ముఖర్జీ అనే జర్నలిస్టు మోడీకి అలాంటి సలహా ఇచ్చేందుకు చేసిన సాహసాన్ని ముందుగా అభినందించాలి. పైన పేర్కొన్న శీర్షికతో ఆండీ రాసిన దాన్ని జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రచురించింది.
ఐఎంఎఫ్ నివేదిక అందరికీ అందుబాటులో ఉంది. అదేమీ రహస్య పత్రం కాదు.మరికొందరు విశ్లేషకులు కూడా దాని మీద వ్యాఖ్యలు, వార్తలు రాశారు. ఆండీ ముఖర్జీ శీర్షిక ఎంతో సూటిగా వాస్తవానికి దగ్గరగా ఉంది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన తలసరి జిడిపి పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ కంటే తగ్గనుందని ఐఎంఎఫ్ చెప్పింది. ” ఏ వర్ధమాన ఆర్ధిక వ్యవస్ద అయినా బాగా పని చేస్తున్నదనటం శుభవార్త. అయితే ఐదు సంవత్సరాల క్రితం 25శాతం ఆధిక్యతలో ఉన్న భారత్ ఇప్పుడు వెనుకపడటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది ” అని ప్రముఖ ఆర్ధికవేత్త కౌశిక్ బసు ఐఎంఎఫ్ నివేదిక వెలువడిన వెంటనే ట్వీట్ చేశారు. మన కేంద్ర పాలకుల స్పందన చూస్తే చీమకుట్టినట్లు కూడా లేదు.
చైనాను అధిగమిస్తామని చెప్పిన వారు చివరకు అత్యంత పేద దేశాల్లో ఒకటైన బంగ్లాదేశ్‌కంటే వెనుకబడిపోవటం విజయనాదాలు తప్ప మరొకటి తెలియని నరేంద్రమోడీ గణానికి జీర్ణించుకోలేని అంశమే. ఒక పెద్ద దేశంగా మన ఆర్ధిక వ్యవస్ధ పెద్దదిగా ఉండవచ్చుగానీ తలసరి విషయంలో ఎంత వెనుకబడి ఉందో ఈ పరిణామం స్పష్టం చేసింది. దీనికి కారణం కరోనా అని ఠకీమని చెప్పవచ్చు. చివరకు దానిలో కూడా మన ప్రధాని అంతర్జాతీయ సమాజంలో తలదించుకోవాల్సిందే. బంగ్లాదేశ్ జనాభా కంటే మనం ఎనిమిది రెట్లు ఎక్కువ. అక్టోబరు 18 నాటికి ప్రపంచంలో కరోనా సోకిన వారు నాలుగు కోట్లు దాటారు.మన దేశంలో 75లక్షల మందికి కరోనా సోకితే, 1,114,064 మంది మరణించారు. అదే బంగ్లాదేశ్‌లో 3,87,295 మందికి వైరస్ సోకగా 5,646 మంది మరణించారు. అంటే మన దేశంలో 20 రెట్లు మరణాలు ఎక్కువ.
మన జిడిపి 10.3శాతం తిరోగమనంలో ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేయగా బంగ్లాదేశ్‌లో 3.8శాతం పురోగమనంలో ఉంటుందని పేర్కొన్నది.అందుకే కరోనా లేకపోయినా తలసరి జిడిపిలో బంగ్లాదేశ్ మనలను మించి పోయి ఉండేదని ఆర్దికవేత్తలు పేర్కొన్నారు. నైపుణ్యం తక్కువగా ఉన్న వారు చేయగలిగిన వస్తు తయారీకి ప్రాధాన్యత ఇచ్చే విధానాలు అనుసరించటమే దీనికి కారణం.తొలి సంవత్సరాల్లో చైనా అనుసరించిన విధానమదే. ఎగుమతులతో పాటు ఉపాధి కల్పించింది. బంగ్లాదేశ్‌లో పని చేయగలిగిన వయస్సులోని ప్రతి ఐదుగురు మహిళల్లో ఇద్దరు కార్మికులుగా ఉన్నారు. మన దేశం కంటే ఎక్కువ. ప్రస్తుతం చైనా నైపుణ్యం తక్కువ అవసరమైన ఉత్పత్తులకు బదులు అధిక నైపుణ్యం కలిగిన వస్తు తయారీ, సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నందున బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలు చైనా వదలిన ఖాళీని పూర్తి చేసి ఎగుమతుల బాటలో పయనిస్తున్నాయి. మన దేశంలో ప్రతి ఏటా కొత్తగా 80లక్షల మందికి ఉపాధి కల్పించాల్సి ఉంది. కరోనా కారణంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులయ్యారు. ఈ నేపధ్యంలోనే చైనాతో పోల్చుకోవటం పక్కన పెట్టి బంగ్లాదేశ్ వంటి దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించాలని ఆండీ ముఖర్జీ సూచించారు.
ఐదేండ్ల క్రితం మన తలసరి జిడిపి బంగ్లాదేశ్ కంటే 24శాతం ఎక్కువగా ఉంది. కానీ 2020లో మన తలసరి జిడిపి 1,876.53 డాలర్లుగా అంచనా వేస్తే బంగ్లాదేశ్‌లో 1,887.97 డాలర్లుగా పేర్కొన్నారు. ఐఎంఎఫ్ అంచనాలు దిగువ విధంగా ఉన్నాయి. 2021లో మన తలసరి జిడిపి 2,030.62 డాలర్లు ఉంటే బంగ్లాదేశ్‌లో 1,989.85గా ఉంటుంది. అయితే 2024లో రెండు దేశాల్లో దాదాపు సమంగా ఉన్నప్పటికీ 2025నాటికి మన దేశంలో 2,729.24 డాలర్లు, బంగ్లాదేశ్‌లో 2,756.10డాలర్లు ఉంటుంది. ఇక చైనా విషయానికి వస్తే 2020లో తలసరి జిడిపి 10,839.43 డాలర్లు. మన పొరుగునే ఉన్న నేపాల్‌లో 1,115, శ్రీలంకలో 3,697 డాలర్లుగా పేర్కొన్నది. అందువలన మన చైనాతో పోటీ పడటానికి బదులు బంగ్లాదేశ్, శ్రీలంకలను అధిగమించేందుకు పూనుకోవటం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.
బంగ్లాదేశ్ కంటే మనం వెనుకబడిపోతున్నామనటాన్ని మన అధికార యంత్రాంగం అంగీకరించటం లేదు. కొనుగోలుశక్తి ప్రాతిపదికన లెక్కించే పిపిపి ప్రకారం 2020 మన తలసరి జిడిపి 6,284 డాలర్లుంటుందని అదే బంగ్లాదేశ్‌లో 5,139 డాలర్లని పేర్కొన్నట్లు పిటిఐ తెలిపింది. ఐఎంఎఫ్ అంచనాలతో ఇప్పుడు అనేక మంది చైనాను పక్కన పెట్టి బంగ్లాదేశ్‌తో మన దేశాన్ని పోలుస్తున్నారు. ఇది ఎన్‌డిఏకు ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోడీకి ఒక పెద్ద సవాలు విసరటం తప్ప వేరు కాదు. 2004-16 మధ్య మన దేశ జిడిపి పెరుగుదల రేటు బంగ్లాదేశ్ కంటే వేగంగా ఉంది. అయితే 2017 నుంచి బంగ్లా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది. గత 15 సంవత్సరాలలో మన జనాభా పెరుగుదల 21శాతం పెరగ్గా బంగ్లాదేశ్‌లో 18శాతం మాత్రమే ఉంది. ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించరని, పిల్లల్ని ఎక్కువగా కని ప్రపంచం మొత్తాన్ని ఇస్లామిక్ సమాజంగా మారుస్తారని ప్రచారం చేసే వారికి ఇది చెంపపెట్టు.
ప్రపంచ ఆకలి నివేదిక 2019, ప్రపంచ బ్యాంకు సమాచారం మేరకు కొన్ని అంశాలలో రెండు దేశాల మధ్య కొన్ని సూచికల పోలిక దిగువ విధంగా ఉంది.
అంశం బంగ్లాదేశ్ ×××××××× భారత్
ద్రవ్యోల్బణ శాతం 5.8 ××××××××× 3,8
కరంట్ ఖాతాలోటు శాతం జిడిపి -2.4 ××××××××× 0.7
జిడిపిలో నిఖర ఎఫ్‌డిఐశాతం 0.4 ×××××××××× 1.1
జిడిపిలో ద్రవ్యలోటు శాతం -8.8 ×××××××××× -12.4
జిడిపిలో రుణశాతం 49 ×××××××××× 90
మానవాభివృద్ధి సూచిక 135 ×××××××××× 129
ఆయు ప్రమాణం సం. 72.3 ×××××××××× 69.4
మహిళా కార్మికుల భాగస్వామ్యశాతం 36 ×××××××××× 20.335
సులభతర వాణిజ్య సూచిక 168 ×××××××××× 63
ఆర్ధిక స్వేచ్చ సూచిక 122 ×××××××××× 105
బ్యాంకుఖాతాలున్న పెద్దలశాతం 50 ×××××××××× 80
మరుగుదొడ్లు ఉన్నవారి శాతం 48.23 ××××××××× 59.43
అపరిశుభ్రత కారణంగా మరణాలు 11.9 ××××××××× 18.6
సమానత్వ సూచిక 50 ××××××××× 112
ఆకలి సూచిక 75 ××××××××× 94
బంగ్లాదేశ్‌లో జనాభా ఎక్కువగా పరిశ్రమలు, సేవారంగం మీద ఆధారపడుతుండగా మన దేశంలో వ్యవసాయరంగం ప్రధానంగా ఉంది. అనేక రంగాలలో పురోగతి ఉన్నప్పటికీ మన దేశంతో పోల్చితే బంగ్లాదేశ్‌లో దారిద్య్రం ఎక్కువగా ఉంది. ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం 2019-20లో బంగ్లాదేశ్‌లో 21.9శాతం మంది దారిద్య్రంలో ఉండగా మన దేశంలో 8.3శాతం ఉన్నారు. 2021-22 నాటికి బంగ్లాలో 21.4శాతానికి తగ్గుతారని మన దేశంలో పదిశాతానికి పెరుగుతారని అంచనా. చైనా అయినా బంగ్లాదేశ్ అయినా ఎదగటానికి దశాబ్దాలు పట్టింది. కానీ మన పాలకులు ముఖ్యంగా గత ఆరు సంవత్సరాలుగా అరచేతిలో స్వర్గాన్ని చూపుతున్నారు. గుజరాత్ నమూనాను దేశమంతటా అమలు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడు చైనా నుంచి కంపెనీలు వస్తున్నాయని ఊరించారు. వస్తే వచ్చాయి, వస్తాయో రావో తెలియని వాటి గురించి ఊహల్లో లెక్కలు వేసుకుంటూ మంచాలు నేసే సోమరిపోతులను గుర్తుకు తెస్తున్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి తగు చర్యలు తీసుకుంటారా ? మరో కొత్త ఊరింపులతో జనాన్ని మభ్యపెడతారా ?
సార్ సూపర్ మ్యాటర్ కానీ ప్రజలకర్థమయ్యో రీతిలో మామూలు పరిభాషలో రచించింటే భగా అర్థవంతంగా వుండేదేమోననీ నా అబిప్రాయం..
LikeLike