Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు


” నేను తినను ఇతరులను తిననివ్వను ” ఇదీ నరేంద్రమోడీ జనానికి చెప్పిన మాటలు. అంతే కాదు, జనం సొమ్ముకు చౌకీదారు(కాపలాదారు)నని కూడా చెప్పుకున్నారు. ఇంకేముంది ! అనుచర గణమంతా తమ పేర్ల చివర చౌకీదార్‌ అని తగిలించుకున్నారు. అందరూ జేజేలు పలికారు. అవినీతిని అంతం చేసే కొత్త దేవుడు దిగివచ్చారని ప్రచారం చేశారు. ఇంతకాలం తిన్న సొమ్మంతా అణాపైసలతో కక్కిస్తారని అన్నారు. గాలి దుమారం మాదిరి ఎవరినీ గుక్క తిప్పుకోనివ్వలేదు. రాజకీయ ప్రత్యర్ధుల నోళ్లు మూతపడ్డాయి. కాలం గడిచిన కొద్దీ ఎవరైనా ప్రశ్నిస్తే కొంత సమయం ఇవ్వండి, ఇన్నాళ్లూ ఆగినవారు అంతతొందరపడతారేం అంటూ ఎదురుదాడికి దిగారు. ఐదేండ్లు గడిచాయి.


రెండవ సారి అధికారానికి వచ్చిన మోడీ గారి ఏలుబడి త్వరలో రెండు (మొత్తం ఏడు ) సంవత్సరాలను పూర్తి చేసుకోబోతోంది. తాజాగా ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌(టిఐ) సంస్ధ ప్రపంచ దేశాలలో 2020 అవినీతి ర్యాంకులను ప్రకటించింది. దానిప్రకారం మన దేశం 2019లో 80వ స్ధానంలో ఉన్నది కాస్తా ఆరు స్ధానాలు పోగొట్టుకొని 86కు దిగజారింది. ఇలా ఎందుకు జరిగిందో అడిగేవారూ లేరు అడిగినా చెప్పేవారు లేరు. మదనపల్లి జంటహత్యల కేసులో ఉన్మాద నిందితుల మాదిరి మరోలోకంలో ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ సూచికలు ఆయా దేశాల్లోని వాస్తవ అవినీతిని ప్రతిబింబించవని, అయితే పరిస్ధితిని వెల్లడిస్తాయన్నది కొందరి అభిప్రాయం. నిజమే, నిజాలను ఏడు నిలువుల్లోతున పూడ్చిపెట్టే స్ధితిలో అది నిజం. ఈ సూచికలను రూపొందించే టిఐ కమ్యూనిస్టులతోనో లేక బిజెపి వ్యతిరేకులో, హిందూత్వ వ్యతిరేకులతోనో నిండిన సంస్ధ కాదు. వందకుపైగా దేశాలలో పని చేస్తున్న ఒక స్వచ్చంద సంస్ద. అవినీతిని వ్యతిరేకించటం, దేశాల అవినీతి ర్యాంకులను ప్రకటించటం వంటి కార్యకలాపాలను అది నిర్వహిస్తుంది. ప్రతి ఏటా కరప్షన్‌ పర్సెప్షన్‌ ఇండెక్స్‌(సిపిఐ)ను ప్రకటిస్తోంది. జనవరి 28న తాజా సూచికలను ప్రకటించింది.


కోవిడ్‌-19 అంటే కేవలం ఆరోగ్య, ఆర్ధిక సంక్షోభమే కాదు, అవినీతి సంక్షోభం కూడా అని నివేదిక ముందుమాటల్లో ఆ సంస్ధ అధ్యక్షురాలు డెలియా ఫెరారియా రుబియో పేర్కొన్నారు. ” మరొకటి ఏమంటే దాన్ని నియంత్రించటంలో మనం విఫలం అవుతున్నాము. గతేడాది ప్రభుత్వాలు పరీక్షకు గురైనట్లుగా మరియు ఉన్నత స్ధాయిలో ఉన్న అవినీతి సవాలును ఎదుర్కొనటంలో అంత తక్కువగా వ్యవహరించిన తీరు మరొకటెన్నడూ మన జ్ఞాపకాల్లో లేదు. అవినీతి తక్కువ సూచికలున్న దేశాలు కూడా ఇంటా బయటా అవినీతిని స్ధిరపరచకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని డెలియా పేర్కొన్నారు.


2012కు ముందు సూచికలను ఒక పద్దతిలో రూపొందిస్తే తరువాత దాన్ని మార్చారు. 2012 నుంచి వివిధ దేశాల సూచికలను విశ్లేషించినపుడు 26 దేశాలు తమ స్ధానాలను గణనీయంగా మెరుగుపరచుకున్నాయి. మరో 22 దేశాలు తమ స్ధానాలను దిగజార్చుకున్నాయి. సగం దేశాలలో పరిస్ధితిలో మార్పులేదు. ఈ నేపధ్యంలో మన దేశం ఎక్కడుంది ? దీనికి కారకులు ఎవరు ? ప్రతి ఒక్కరూ ఆలోచించాలా లేదా ? ఏ దేశంలో అయినా అవినీతి పెరిగినా, తరిగినా, మార్పులేకపోయినా దానికి ఆయా దేశాల్లో అధికారంలో ఉన్న పార్టీలు తప్ప మరొకరిని బాధ్యులుగా చూడలేము.
అవినీతి సూచికలు విడుదల అయిన రోజే కరోనా మహమ్మారి పట్ల వ్యవహరించిన తీరు తెన్నుల మీద లోవీ సంస్ధ 98దేశాల సూచికలను విడుదల చేసింది. నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కరోనాను ఎలా ఎదుర్కొన్నదీ వంది మాగధులు ఎలా పొగుడుతున్నదీ చూశాము. అయితే లోవీ సంస్ధ మన దేశానికి 86 ర్యాంకు ఇచ్చింది. అన్నింటి కంటే అవమానకరం ఏమంటే ఇరుగుపొరుగు దేశాల్లో మనకంటే మెరుగ్గా బంగ్లాదేశ్‌ 84, నేపాల్‌ 70, పాకిస్ధాన్‌ 69, శ్రీలంక 10వ స్ధానంలో ఉంది. చైనా విడుదల చేసిన సమచారాన్ని నమ్మటం లేదు గనుక ఆ దేశానికి చెందిన సమాచారం లేనందున దాన్ని పరిగణనలోకి తీసుకోవటం లేదని లోవీ సంస్ధ చెప్పింది. వంద మార్కులకు గాను మన దేశానికి వచ్చింది 24.3 మాత్రమే. మొదటి రెండు స్ధానాల్లో ఉన్న న్యూజిలాండ్‌కు 94.4, వియత్నాంకు 90.8, పదవ స్ధానంలోని శ్రీలంకకు 76.8 మార్కులు వచ్చాయి.

లాటిన్‌ అమెరికాలోని ఉరుగ్వే ఆ ఖండంలో మెరుగైన స్ధానంలో ఉంది. ఆరోగ్య సంరక్షణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన కారణంగా మహమ్మారులు తలెత్తినపుడు వాటి పర్యవేక్షణకు మెరుగైన వ్యవస్ధను కలిగి ఉంది, ఈ కారణంగానే ఎల్లో ఫీవర్‌, జైకా వైరస్‌ తలెత్తినపుడు వాటి పట్ల ఎంతో సమర్దవంతంగా వ్యవహరించగలిగింది. మరో వైపున బంగ్లాదేశ్‌ విషయానికి వస్తే (కరోనా కట్టడిలో మనకంటే రెండు స్ధానాలు ఎగువ ఉన్నప్పటికీ) ఆరోగ్య సంరక్షణ కేటాయింపులు చాలా తక్కువ, కరోనా సమయంలో అన్ని రకాల అవినీతి వ్యవహారాలు చోటు చేసుకున్నాయని టిఐ పేర్కొన్నది.


మహమ్మారిని ఒక దేశం మొత్తంగా ఎలా ఎదుర్కొన్నదని చూస్తారు తప్ప రాష్ట్రాలవారీ కాదు. మన పెద్దలు ఆరోగ్యం రాష్ట్రాలకు సంబంధించింది కనుక మన దేశ ర్యాంకు దిగువ స్ధానంలో ఉండటానికి నరేంద్రమోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా చూడకూడదని వాదిస్తారు. మెజారిటీ రాష్ట్రాలు బిజెపి పాలనలోనే ఉన్నాయి. అందువలన వైఫల్య ఖాతాతో తమకేమీ సంబంధం లేదంటే కుదరదు. అలా అనుకుంటే నేపాల్లోనూ, పాకిస్ధాన్‌, శ్రీంకలోనూ రాష్ట్రాలు ఉన్నాయి. చిన్న దేశాలకు తక్కువ, పెద్ద దేశం కనుక ఎక్కువ ఉంటాయి. మరోవైపున కరోనా వ్యాక్సిన్‌ తమ బిజెపి పార్టీ ప్రయోగశాలలో తయారైనదాన్ని ప్రపంచ దేశాలకు పంపుతున్నట్లు ఫోజు పెడుతున్నదెవరో తెలిసిందే. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అంటే ఇదే. ప్రపంచానికి నరేంద్రమోడీ కనిపిస్తారు తప్ప రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాదు. మరొక దేశం లేదా ప్రపంచ సంస్ధలు కరోనా నిరోధంలో మీ విజయాలు లేదా వైఫల్యాల పాఠాలు ఏమిటని కేంద్ర ప్రభుత్వానికి రాస్తాయి తప్ప రాష్ట్రాలకు కాదు. కరోనా అంటే అనూహ్యంగా వచ్చింది. చప్పట్లు, దీపాలు వెలిగిస్తే పోతుందనుకున్నాం. కొందరు యజ్ఞయాగాలు చేసి, ఆవు మూత్ర సేవనం ద్వారా తగ్గించాలని చూశారు. కరోనా వాక్సిన్‌కూ జాతీయవాదాన్ని రుద్ది సొమ్ము చేసుకోవాలనుకున్నారు. లోవీ సంస్ధ పనిగట్టుకొని చేయకపోయినా అది ప్రకటించిన సూచికతో మన ప్రధాని నరేంద్రమోడీ ప్రపంచంలో తలవంచుకొనేట్లు చేసింది. భజన కార్యక్రమాలకు తెరదించింది.

కరోనా సూచికతో పాటు వెలువడిన అవినీతి సూచికకు ఎంతో ప్రాదాన్యత ఉంది. అధికారాంతమంది చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్‌ అన్నట్లు అధికారానికి ఎదురులేనంత వరకు అవినీతి తివాచీల అడుగునే ఉంటుంది. తరువాత బయటపడక తప్పదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ అవినీతి, అక్రమాల గురించి అన్ని పార్టీలు చెప్పాయి గానీ బిజెపి అన్నింటి కంటే ఎంతో ఎత్తున ఉంది. ఆ పార్టీ వారు చెప్పినన్ని కబుర్లు మరొకరు చెప్పలేదు. అవినీతితో కూడ బెట్టిన నల్లధనం వెలికితీత, విదేశాల్లో ఉన్నదాన్ని తెచ్చి ప్రతి ఒక్కరికీ పదిహేను లక్షల చొప్పున పంచుతామన్నట్లుగా జనాన్ని నమ్మించారు. కాంగ్రెస్‌ హయాంలో అవి నీతి, అక్రమాల గురించి 2014లోక్‌సభ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది బిజెపినే కదా ! కాదంటారా ? ఆచరణ ఏమిటన్నదే అసలు సమస్య !


ట్రాన్సఫరెన్సీ ఇంటర్నేషనల్‌ సూచిక ప్రకారం అవినీతిలో మన దేశం, ఇరుగు పొరుగు దేశాల స్ధానం, పాయింట్ల వివరాలను దిగువ పట్టికలో చూడవచ్చు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014వ సంవత్సరం, 2020 తాజా సూచిక ఇవరాలు ఇలా ఉన్నాయి.

దేశం ×××××× 2014 ×× పాయింట్లు×× 2020 ×× పాయింట్లు

శ్రీలంక ×××××× 85 ××× 38 ××× 94 ××× 38
నేపాల్‌ ××××××× 126 ××× 29 ××× 117 ××× 33
పాకిస్ధాన్‌ ×××××× 126 ××× 29 ××× 124 ××× 31
చైనా ××××××× 100 ××× 36 ××× 78 ××× 42
భారత్‌××××××× 85 ××× 38 ××× 86 ××× 40
బంగ్లాదేశ్‌××××× 145 ××× 25 ××× 146 ××× 26
పై వివరాలను గమనించినపుడు గడచిన ఆరు సంవత్సరాలలో అవినీతిని అంతం చేస్తా, నేను తినను ఎవరినీ తిననివ్వను అని చెప్పిన నరేంద్రమోడీ పాలనలో జరిగిందేమిటి ? ఈ సూచికలను రూపొందించిన సంస్ధ అన్ని దేశాలకు ఒకే ప్రమాణాలను పాటించింది. ఆరేండ్లలో చైనా సూచిక 22 పాయింట్లు, పాకిస్ధాన్‌ రెండు పాయింట్లు మెరుగుపరుచుకున్నాయి. శ్రీలంక తొమ్మిది, భారత్‌, బంగ్లాదేశ్‌ ఒక పాయింట్‌ దిగజారాయి.

1995లో 41దేశాలకు అవినీతి సూచికను తొలిసారి రూపొందించారు. దీనిలో గరిష్టంగా పది పాయింట్లు ఇచ్చారు. ఎంత ఎక్కువ తెచ్చుకుంటే ఆ దేశంలో అవినీతి అంత తక్కువగా ఉంటుందని సూచిక వెల్లడిస్తుంది. ఈ వరుసలో మన దేశం తొలి సూచికలో 2.78 పాయింట్లు పొంది 35వ స్ధానంలో నిలిచింది. తరువాత దేశాలను క్రమంగా విస్తరించారు. అతల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న 1999లో 99 దేశాల సూచికలో మన దేశం 2.9 పాయింట్లు పొంది 72వ స్దానంలో నిలిచింది. ఆయన పదవీ కాలం చివరి సంవత్సరం 2004లో 146 దేశాల జాబితాలో 2.8 పాయింట్లతో 90వ స్ధానం వచ్చింది.2012, 2013 సంవత్సరాలలో 176 దేశాలలో 94వ స్ధానంలో నిలిచాము. 2014లో 85, 2015లో 76, 2016లో 79, 2017లో 81, 2018లో 78, 2019లో 80వ స్ధానంలో ఉంది.
పైన పేర్కొన్న వివరాల ప్రకారం వాజ్‌పేయి ఏలుబడిలో 72 నుంచి 90వ స్ధానానికి ఎందుకు దిగజారిందో ఎవరైనా చెప్పగలరా ? మన్మోహన్‌ సింగ్‌ ప్రారంభం 90వస్ధానం అనుకుంటే అది 2013కు 94కు పెరిగి మరుసటి ఏడాదికి 85కు ఎందుకు తగ్గినట్లు ? పోనీ రెండు ప్రభుత్వాల్లో అవినీతి లేదా ?


అవినీతి తక్కువగా ఉండే తొలి 25దేశాల్లో కూడా అవినీతి అసలు లేదని అర్ధం కాదని ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ పేర్కొన్నది. తన నివేదికలో అనేక అంశాలను ప్రస్తావించింది. ఎగుమతి-దిగుమతి వ్యాపారం అంటేనే రెండు వైపులా అవినీతి అక్రమాలకు తెరలేపుతుంది. దీనిలో ఏ దేశమూ మడి కట్టుకు కూర్చోలేదు. టిఐ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎగుమతులు ఎక్కువగా చేస్తున్న 47 దేశాలలో మన నరేంద్రమోడీ మాదిరి మేము తినము, ఇతరులకు పెట్టం అంటూ ఓయిసిడి ముడుపుల వ్యతిరేక ఒప్పందంపై సంతకాలు చేసినవి కూడా ఉన్నాయి. ఎన్నో అనుకుంటాంగానీ అన్నింటినీ అమలు జరపగలమా ?మనం మడి గట్టుకుంటే మిగతావారు అలాగే చేస్తారా నలుగురితో పాటే అంటూ అవినీతికి పాల్పడుతున్నాయి. వస్తు, సేవలతో పాటు అవినీతినీ ఎగుమతి చేస్తున్నాయి. మన దేశం, చైనా, సింగపూర్‌ వంటివి ఓయిసిడి ఒప్పందంలో భాగస్వాములు కానప్పటికీ ఐరాస అవినీతి వ్యతిరేక ఒప్పందంలో భాగస్వాములే.


నలభై ఏడు ఎగుమతి దేశాలలో నాలుగు దేశాల వాటా 16.5, తొమ్మిది 20.2శాతం, 15 దేశాలు 9.6, 19 దేశాలు 36.5శాతం ప్రపంచ ఎగుమతులు చేస్తున్నాయి. వీటిలో తరతమ స్ధాయిల్లో ముడుపుల నిరోధ చర్యలు తీసుకుంటున్నాయి. నామ మాత్రం లేదా అసలు ఎలాంటి చర్యలూ తీసుకోని 19 దేశాల జాబితాలో చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, భారత్‌ వంటి దేశాలను చేర్చారు. ప్రస్తుతం ప్రపంచ ఫ్యాక్టరీగా లేదా ఎగుమతుల కేంద్రంగా ఉన్న చైనా 2020 ప్రపంచ ఎగుమతుల్లో 13.3శాతం కలిగి ఉండగా టిఐ అవినీతి సూచికలో 78వ స్ధానంలో ఉంది. ప్రపంచ ఎగుమతుల్లో కేవలం 1.7శాతం ఉన్న మన దేశం 86వ స్ధానంలో ఉంది. మన నరేంద్రమోడీ చెబుతున్నట్లుగా చైనాను పక్కకు నెట్టేసి మనం ప్రధమ స్ధానం ఆక్రమిస్తే అవినీతిలో అట్టడుగు స్ధానంలోకి పోయినా ఆశ్చర్యం లేదు అని ఎవరైనా అనుకుంటే తప్పు పట్టగలమా ?

అవినీతి చాలా తక్కువ ఉన్న జాబితాలో చోటు చేసుకున్న దేశాలకు చెందిన కంపెనీల అవినీతి ఎంత పెద్దగా ఉంటుందో చూద్దాం. డెన్మార్క్‌ 88 పాయింట్లతో అగ్రస్ధానంలో ఉన్న చోట కూడా అవినీతి ఎలా జరుగుతుందో డేన్స్‌కే బ్యాంకు కుంభకోణం తార్కాణం. 2007-15 మధ్య ఈ బ్యాంకు ద్వారా 230 బిలియన్‌ డాలర్ల మేర నిధులు అక్రమంగా చేతులు మారాయి. ఐరోపాలో అతి పెద్ద కుంభకోణంగా పేరుమోసింది. పర్యవేక్షణ వ్యవస్ధలోపాన్ని వినియోగించుకొని ఈ అక్రమానికి తెరలేపారు. అందరూ శాఖాహారులే రొయ్యల బుట్ట మాయం అన్నట్లుగా అవినీతి గురించి పెద్ద కబుర్లు చెప్పే ఐరోపా యూనియన్‌లో ఇది ఎలా జరిగినట్లో బయటకు రావటం లేదు. ఎయిర్‌బస్‌, ఇది అమెరికా బోయింగ్‌ కంపెనీకీ పోటీగా ఐరోపా దేశాలు ఉమ్మడిగా ఏర్పాటు చేసిన కంపెనీ. ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌లోని దాని విభాగాలు ఘనా, శ్రీలంక,తైవాన్‌, ఇండోనేషియా, మలేషియా, చైనా వంటి 16దేశాలకు సరఫరా చేసిన విమానాలు, సంబంధిత విడిభాగాల ముడుపుల కేసు పరిష్కారానికి 2020లో అది అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లకు ఉమ్మడిగా దాదాపు నాలుగు బిలియన్‌ డాలర్లు (మన 30వేల కోట్ల రూపాయలకు సమానం)అపరాధ రుసుం చెల్లించింది. కోట్ల డాలర్లు ముడుపులుగా చెల్లించిన ఉదంతాలపై పది సంవత్సరాల పాటు దర్యాప్తు సాగింది. చిత్రం ఏమంటే ముడుపులు చేతులు మారాయి, దానికి వ్యక్తులుగా ఎవరు బాధ్యులో తేల్చలేకపోయినట్లు దర్యాప్తులో పేర్కొన్నారు.

నిజానికి తెలియక కాదు. అధికారయంత్రాంగం, వారితో చేతులు కలిపిన వారిని రక్షించటం తప్ప మరొకటి కాదు. మన దేశంలో స్ప్రెక్ట్రం, ఇతర అవినీతి కేసులు కూడా గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లు ముగిసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అవన్నీ పక్కాచట్టపరంగా జరిగాయని చెబుతున్నారు.ఈ కేసులో ప్రధాన పాత్రపోషించిన ఫ్రాన్స్‌ మన దేశానికి సరఫరా చేసిన రాఫెల్‌ విమానాల లావాదేవీల్లో ఎంత ఎలా ముడుపులు చెల్లించిందో బయటకు రావాల్సి ఉంది. బెల్జియంకు చెందిన సెమ్‌లెక్స్‌ కంపెనీ ముడుపుల కేసు మరొకటి. ఇది పాస్‌పోర్టులు, లైసన్సుల సంబంధిత బయోమెట్రిక్‌ పత్రాలను తయారుచేస్తుంది. మొదటి పది స్ధానాల్లో ఉన్న దేశాలు కూడా అవినీతికి అతీతం కాదు. తేడా ఏమంటే మన దేశంలో మాదిరి చిల్లరమల్లర అవినీతి, చిన్న మొత్తాలకు పీక్కుతినే బాపతు కనపడదు. కంపెనీల బడా అక్రమాలు ఎన్నో. స్వీడన్‌, స్విడ్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌ వంటి పన్నుల స్వర్గాలుగా ఉన్న దేశాలన్నీ అలాంటివే. ప్రపంచంలో ఎక్కడెక్కడి అవినీతి సొమ్మూ ఈ దేశాల్లోని బ్యాంకులకు చేరుతుంది. ఆ సొమ్ము ఎక్కడిది అని అడిగే వారు ఉండరు కనుక పెద్ద మొత్తంలో చేతులు మారుతుంది. అనేక ఉదంతాలను టిఐ ఉటంకించింది ?


మా నరేంద్రమోడీ ఒక్క అవినీతి కుంభకోణంలో అయినా ఇరుక్కున్నారా చెప్పండి అని కొంత మంది అమాయకంగా లేదా అతి తెలివిగా ప్రశ్నిస్తారు. ఆమాటకు వస్తే పదేండ్ల పాటు ప్రధానిగా ఉన్నమన్మోహన్‌ సింగ్‌, అంతకు ముందు ప్రధానిగా ఉన్న అతల్‌బిహారీ వాజ్‌పేయి మీద కూడా వ్యక్తిగతంగా ఆరోపణలు లేవు. అవినీతి సూచికలు పెరిగాయి- తగ్గాయి. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం(మీకది-మాకిది అని పంచుకోవటం) మన దేశంలో పెరుగుతున్న కాలమది. వ్యక్తిగతంగా లబ్ది పొందారా లేదా అన్నది కాదు తమను ఆశ్రయించిన వారికి లబ్ది చేకూర్చి వారి నుంచి ఎన్నికలు, ఇతర సందర్భాలలో వారి నుంచి నిధులు పొందారా లేదా అన్నదే అసలు సమస్య. ఆ రీత్యా చూసినపుడు ప్రతి ప్రధాని హయాంలో ఆశ్రిత పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తలు ఉన్నారు.

అవినీతి కొత్త దారులు తొక్కుతున్న సమయంలో అది వెంటనే బయటపడదు. కాంగ్రెస్‌ నేతలు వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి కమిషన్లు తీసుకున్నారన్నది మరొక విమర్శ. అవినీతి పరుల శిరస్సులు ఖండిస్తా అన్నట్లుగా కబుర్లు చెప్పిన నరేంద్రమోడీ ఏలుబడిలో ఎందరు అవినీతి పరులను శిక్షించారు, వారు కాజేసిన సొమ్మును ఎంత రాబట్టారో చెప్పమనండి ! అవినీతి అంటే 2జి, 3జి, బొగ్గు గనుల కేటాయింపు వంటివే కాదు, అనేక రూపాల్లో ఉంటుంది. గతంలో జరిగిన అనుభవాలతో కుంభకోణాలు పునరావృతం కాకుండా ఉండేందుకు కేటాయింపుల పద్దతి, నిబంధనలను మార్చారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా ఒక్కోరంగంలో ఒక్కో కార్పొరేట్‌ కంపెనీ కేంద్రీకరించినపుడు వాటి మధ్య పోటీ ఉండదు. నిబంధనలు వాటికి అనుకూలంగా రూపొందిస్తున్నారు. ఏమాత్రం అనుభవంలేని, మిగతా కంపెనీల్లో దివాలా ప్రకటించిన అనిల్‌ అంబానీకి ప్రభుత్వ రంగ సంస్ధను పక్కన పెట్టి రాఫెల్‌ విమానాల బాధ్యతను ఎందుకు అప్పగించినట్లు ? అధిక ధరలకు ఎందుకు కొనుగోలు చేసినట్లు ?


పెట్టుబడిదారీ వ్యవస్ధలో అవినీతి పుట్టుకతోనే ఉంటుంది, దాన్ని విడదీసి చూడలేము. చైనాలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంలో భాగంగా ఆ వ్యవస్ధ ఉత్పాదక శక్తులు అభివృద్ధి చెందేంత వరకు పెట్టుబడిదారులను పరిమితంగా అనుమతించాలని, పెట్టుబడులను, తమ వద్దలేని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆహ్వానించాలని చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. మంచి గాలికోసం కిటికీలను తెరిచినపుడు గాలితో పాటు ఈగలు, దోమలు కూడా ప్రవేశిస్తాయి. వాటిని ఎలా అరికట్టాలో మాకు తెలుసు అంటూ సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌సియావో పింగ్‌ చెప్పారు. అందుకే అక్కడ కూడా అవినీతి ఉదంతాలు బయటకు వస్తుంటాయి. అనేక విదేశీ కంపెనీలు అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలో కూడా స్వార్ధం చూసుకొనే వారిని లంచాలతో లోబరుచుకోవటం, వారిని కఠినంగా శిక్షించటం ఎరిగిందే. మన దేశంలో అలాంటి ఉదంతం ఒక్కటైనా ఉందా ? విజయ మల్య దర్జాగా దేశం వదలి పారిపోతుంటే గుడ్లప్పగించి చూస్తూ వెళ్లిపోనిచ్చారు. అతగాడికి సమాచారం అందించిన వారెవరో కూడా ఇంతవరకు బయటకు రాలేదు. పోనీ కోర్టుల ద్వారా ఎంత మందిని శిక్షించారు ? ఎంత సొమ్మును రాబట్టారు ? విదేశాలకు పారిపోయిన వారిని ఎందరిని రప్పించారు ? ప్రజాస్వామ్యం అంటే దొంగలకు స్వేచ్చ ఇవ్వటమా ?


అన్నం ఉడికిందో లేదో చూసేందుకు ఒక్క మెతుకును చూస్తే చాలు అన్న విషయం తెలిసిందే. (ఇప్పుడు ప్రెషర్‌ కుక్కర్లు కనుక అందుకు చాలా మందికి అవకాశమే లేదు) అలాగే బిజెపి బండారాన్ని అర్ధం చేసుకోవాలంటే లోక్‌పాల్‌ నియామకం తీరు చాలు. అవినీతి వ్యతిరేక, ప్రజా ప్రయోజనాల రక్షణకు లోక్‌పాల్‌ వ్యవస్ధను ఏర్పాటు చేయాలని 1960 దశకంలో ప్రతిపాదించారు. నలభై అయిదు సంవత్సరాలు, పది విఫలయత్నాల తరువాత అన్నాహజారే తదితరుల ఉద్యమం నేపధ్యంలో దానికి దుమ్ముదులిపి 2013లో పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదించాయి. అవినీతి నిరోధం గురించి గొప్ప కబుర్లు చెప్పే బిజెపి ఏలికలు అధికారానికి వచ్చిన ఐదు సంవత్సరాల వరకు నియామకం గురించి పట్టించుకోలేదంటే వారి చిత్తశుద్ది ఏమిటో వెల్లడి అవుతోంది. 2019లోక్‌ సభ ఎన్నికల ముందు మార్చి 19న లోక్‌పాల్‌ నియామకం జరిపారు. ఇంతకాలం ఎందుకు పట్టిందో ? ఎవరు అడ్డుకున్నారో ఎవరైనా చెప్పగలరా ? న్యాయస్ధానంలో రుజువయ్యే వరకు ఎవరూ అవినీతి పరులు కాదంటూ అవినీతి, అక్రమాల కేసుల్లో ఇరుక్కున్నవారిని అన్ని పార్టీల నుంచి ఇప్పుడు బిజెపి చేర్చుకుంటున్నది. దాని చిత్తశుద్ది ఎక్కడ ? మిగతా పార్టీలకూ దానికీ తేడా ఏముంది ?