Tags
#India oil taxes, India oil price, narendra modi bhakts, Narendra Modi Failures, Watsapp fake news
ఎం కోటేశ్వరరావు
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ ! అది ఎప్పుడు సాధ్యం అవుతుంది ? మనం అంటే జనం బుర్రలకు పని పెట్టకుండా, చరిత్రను మర్చిపోతేనే అలాంటి వారు రెచ్చిపోతుంటారు. సమాజం పుచ్చిపోతుంది !
ఇపుడు అదే జరుగుతోంది. కారణాలు ఏవైనా, పేనుకు పెత్తనం ఇచ్చినట్లు మనం మెదళ్లను విదేశీ వాట్సాప్‌కు అప్పగించాం, ఇప్పుడు స్వదేశీ ”కూ ”కు అప్పగించమని కొందరు చెబుతున్నారు. ఎందుకంటే తప్పు యాప్‌లది కాదు. విదేశీ అయినా, స్వదేశీ అయినా మనం వాటిలో దేన్ని ఉంచితే దాన్నే పదుగురిక పంచుతాయి. అందుకే పళ్లూడ గొట్టించుకొనేందుకు ఏ రాయి అయితేనేం ? బుర్రలను తాకట్టు పెట్టదలచుకుంటే ఎక్కడైతేనేం ! దాన్ని కూడా చూద్దాం !
వినేవాడికి బుర్రలేకపోతే చెప్పేవాడికి లోకువ ! నేనూ ఇక్కడ కొన్ని విషయాలు చెబుతున్నాను గనుక మెదడుకు పని పెట్టమనే చెబుతున్నా. వినదగునెవ్వరు చెప్పిన అన్నట్లుగా ఎవరు చెప్పినా వినండి. హంస పాలూ నీళ్లను వేరు చేస్తుందంటారు, మనమూ మంచీ-చెడును వేరు చేసి మంచిని స్వీకరించుదాం !
పెట్రోల్ ,డీజిల్, ఎల్పిజి ధరలేం ఖర్మ ! రాబోయే రోజుల్లో ప్రతి వస్తువు, సేవ ధర పెరుగుతుంది. ఏమంటే దేశభక్తి అంటారు ! నరేంద్రమోడీ గారి అచ్చేదిన్ ఆచరణ అదే కదా ! వాట్సాప్‌లో తిప్పుతున్న అనేక పోస్టులలో ఒక దాని ప్రకారం కేంద్రలోని పెద్దలకు అవగాహన ఉంది కనుకనే వాటిని పెంచుతున్నారట ! వారికి లేదని ఎవరన్నారు. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో వడ్డించేందుకు కావాలనే చేస్తున్నారు. సందేహం లేదు. తెగించిన వాడికి తెడ్డే లింగం ! ఇంతకు ముందు ధరలు పెంచితే జనం ఆగ్రహిస్తారనే భయం ఉండేది కనుక పాలకులు కాస్త వెనుకా ముందూ చూసే వారు. దున్నపోతు మీద వాన కురిసినట్లుగా పరిస్దితి ఉందని గ్రహించారు గనుకనే చెప్పి మరీ చేస్తున్నారు.
గతేడాది లాక్‌డౌన్ సమయంలో డిమాండ్ లేకపోవటంతో ఒక దశలో ముడి చమురు ధర15 డాలర్లకు పడిపోయినా సౌదీ అరేబియా నుంచి మన దేశం పాత ధరకే కొనుగోలు చేసిందట ? డిమాండ్ తగ్గినా సౌదీ నుంచి కొనుగోళ్లను ఆపలేదట, డిమాండ్ లేనపుడు ఎందుకు కొనుగోలు చేసినట్లు ? అదీ పాత ధరకు ! స్వంత జనం మీద అంత కోపమెందుకు ? సౌదీ మీద అంత ప్రేమ ఎందుకబ్బా ! మనం చెవులప్పగిస్తే ఫ్రీగా ఉన్నాయి కదా అని ప్రతి చెత్త వాటిలో వేసిపోతారు !
అంతర్జాతీయ మార్కెట్లో ఏరోజు ఎంత ఉంటే ఆరోజు మన వినియోగదారుల నుంచి అంత వసూలు చేయాలన్నది మన విధానం. మన కొనుగోలు కూడా అలాగే ఉంటుంది తప్ప వచ్చే ఏడాది సరఫరా చేసే చమురుకు ముందు సంవత్సరమే ఒప్పందాలేమీ ఉండవు. ధర తగ్గినా సౌదీ నుంచి పాత ధరలకే కొనుగోలు చేయటం అంటే జనానికి శఠగోపం పెట్టటం, కుంభకోణం ఉన్నట్లే ! లేదా రాసిన వారికి అసలు విషయం పరిజ్ఞానం లేకపోయి ఉండాలి.
ఒపెక్ (చమురు ఎగుమతి దేశాలు) ధరలు పెంచే ఆలోచనలో ఉండగా మన దేశ విజ్ఞప్తి మేరకు ఆసియా ఖండం వరకు పాత ధరలకే ఇవ్వటానికి ఒప్పుకున్నాయట. అలాంటపుడు సెంచరీ దిశగా ప్రతి రోజూ ధరలను పెంచటం ఎందుకు ? పాత ధరలు ఎంతో ఇప్పుడు ఎంతకు కొంటున్నామో చెప్పమనండి, మన బండారం బయటపడుతుంది.
చైనా యాప్‌లను నిషేధించినా, వారి వస్తువులను కొనుగోలు చేయం అని బెదిరించినా సరిహద్దుల్లో చెట్టు చివరి ఆకు కూడా ఊగలేదు. మీరూ మూసుకోండి-మేమూ మూసుకుంటాం అన్నట్లుగా ఒప్పందం చేసుకొని సరిహద్దుల్లో చైనా-భారత్ సైన్యాలు గతంలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడికే వెనక్కు వెళ్లాయి. కొండల దిగువన ఉన్న చైనా వారు వెనక్కు తగ్గారు, కంపు ట్రంప్ మాటలు నమ్మి ఏదో అనుకొని, ఏదో చేద్దామని కొండలెక్కిన మనం కాళ్లనొప్పులతో దిగాము తప్ప జరిగిందేమీ లేదు.
అలాంటిది కొనుగోలు దేశంగా ఉన్న మనం కోరితే లేదా బెదిరిస్తే ఒపెక్ దేశాలు ధరలు తగ్గించాయంటే, ఒక్కసారికేం ఖర్మ 56 అంగుళాల ఛాతీ రోజూ గడ్డం నిమురుకోవటం మాని ఆ పని మీద కేంద్రీకరిస్తే జనం మీద బాదుడు తగ్గుతుంది కదా ! మనం ఎప్పుడు ఏ దేశం నుంచి చమురును ఎంతకు కొనుగోలు చేశామో, అధికారికంగా శ్వేత పత్ర ప్రకటన లేదా ప్రభుత్వ ప్రకటన చేయమనండిి అసలు సంగతి బయటపడుతుంది ! టూల్‌కిట్టూ కాదు, దేశద్రోహం అంతకంటే కాదు. దీన్ని కూడా అడగలేక ఏమి చెప్పినా తలలు ఊపుతాం – ఎందుకంటే మనం గంగిరెద్దులం కదా !
” క్రూడ్ ధరలు నిలకడగానే ఉన్నా దేశంలో పెట్రోల్ , డీజిలు ధరల పెంపు ఎందుకంటే వీలు ఉన్నంత వరకు వీటి ద్వారా మళ్ళీ ఆర్ధికంగా నిలదొక్కుకోవడం కోసమేనట ! లాక్ డౌన్ సమయంలో ఆదాయం లేదు కానీ కేంద్ర ప్రభుత్వం అల్పదాయ ప్రజల ఆరు నెలల పాటు ఉచిత రేషన్ ఇచ్చిందట.” కనుక చమురు ధరలు పెంచటం సమర్దనీయమే అని భజన చేయటం.
ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఆరు నెలల పాటు కుటుంబానికి నెలకు ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు ఇవ్వటానికి 90వేల కోట్ల రూపాయలు ఖర్చయిందట. అంటే కుటుంబానికి రూ.1,125 కేటాయించారు. ఇంతకంటే ఎక్కువ ఖర్చు చేశారని సాధికారికంగా సమాచారం చెబితే సవరిస్తా ! కేంద్ర ప్రభుత్వం మార్చి నెల 14న కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిలు మీద మూడేసి రూపాయలు, మే ఐదవ తేదీన రూ.10,13చొప్పున పెంచింది. తద్వారా కేంద్రానికి అదనంగా వస్తుందని చెప్పిన ఆదాయం ఎంత ? రెండు లక్షల కోట్ల రూపాయలు. అంతకు ముందు లీటరు పెట్రోలు మీద రూ.9.48గా ఉన్న పన్ను 22.98కి పెంచారు. అంటే మరో రెండులక్షల కోట్లు ఉంటుంది. మరి దాన్ని ఎందుకు పెంచినట్లు ? అప్పుడేమీ కరోనా, ఉచిత రేషన్ లేదే ? మనకు ఇచ్చింది ఎంత మన జేబుల నుంచి కొల్లగొట్టింది ఎంత ? దేశ భక్తి ఉండాల్సిందే గానీ అది మరీ మత్తులోకి దిగకూడదు. దిగితే మన ఒంటి మీద దుస్తులు కూడా మిగల్చరు ! ఏది చెబితే దాన్ని నమ్మేందుకు మనం గంగిరెద్దులమా ? అయినా తలలెందుకు ఊపుతున్నాం ?
చమురు ధరల పెంపుదలకు మరో అంశాన్ని మెదళ్లకు ఎక్కించే యత్నం జరుగుతోంది. కరోనా, ఉచిత రేషను అంటే ఎక్కువ కాలం నడవదు . మరి అదేమిటి ? ” 2020 ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు లడాక్ దగ్గర 50,000 మంది సైనికులని మోహరించింది మన దేశం. యుద్ధ టాంకులు, ఆర్టీలరీ గన్స్ తో పాటు నిత్యం యుద్ధ విమానాలని గస్తీ లో ఉంచింది. కేవలం సైనికులని తరలించడానికే 10,000 కోట్లు ఖర్చు అయ్యింది. ఇక మీరేజ్ యుద్ధ విమానం ఒక గంట గాలిలో ఎగిరితే అయ్యే ఖర్చు 6 లక్షలు అవుతుంది. ఒక ఎస్‌యు మిగ్ అయితే ఒక గంటకి 10 లక్షల ఖర్చు అవుతుంది. ఒక సి-30 రవాణా విమానం లోడ్ తో గాల్లోకి లేచి దింపినందుకు అయ్యే ఖర్చు అక్షరాల 750 కోట్లు అవుతుంది. యావరేజ్ గా చూస్తే మొత్తం 10 నెలల కాలానికి రోజుకి 5 వేల కోట్లు ఖర్చు అయ్యింది. పూర్తి స్థాయి యుద్ధం కనుక వస్తే రోజుకి లక్ష కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది – ఇది రెండు లక్షల కోట్లకి కూడా పెరగవచ్చు. మీరేజ్, రాఫెల్ ల తో వాడే ఒక్కో మిసైల్ ఖరీదు 600 కోట్లు ఉంటుంది మరి ఈ ఖర్చు ఎవరు భరిస్తారు ? ఎక్కడా తగ్గకుండా కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల్లో గట్టిగానే నిలబడ్డది. దేశ భద్రత ద ష్ట్యా ఇది తప్పని సరి ఖర్చు. ” అని సమర్ధన !
మన ప్రాంతాన్ని చైనా ఆక్రమించలేదని గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా చెప్పారు. తన ప్రకటనను వక్రీకరించారని అనలేదు కనుక ఇప్పటికీ అదే మాటతో ఉన్నారనుకుందాం ! ఒక్క అంగుళం ఆక్రమించినా ఊరుకునేది లేదని రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ స్పష్టం చేశారు. చైనా పది సార్లు సరిహద్దులను అతిక్రమిస్తే మనం 50సార్లు అతిక్రమించాం అని మాజీ సైనికాధిపతి, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న వికె సింగ్ తాజాగా చెప్పారు. సరిహద్దుల వెంబడి మనం తిష్టవేశాం, అది చైనా మీద వత్తిడి పెంచుతోందని కూడా సింగ్ చెప్పారు.
ప్రధాని చెప్పినట్లు మన ప్రాంతాన్ని చైనా వారు ఆక్రమించలేదు, రాజనాధ్ చెప్పినట్లు ఒక్క అంగుళం కూడా కొత్తగా ఆక్రమించలేదు ,అయినా వికె సింగ్ గారు చెప్పినట్లు మనం వెళ్లి సరిహద్దులో కూర్చున్నాం. అందుకు గాను మనకు వదిలిన చమురు ఎంత. రోజుకు ఐదు వేల కోట్లంటే నెలకు లక్షా యాభై వేల కోట్లు, పది నెలలకు పదిహేను లక్షల కోట్లు ? ఇదంతా ఎందుకు చేసినట్లు ? అంత ఖర్చు భరించే స్దితిలో దేశం ఉందా ? ప్రతి పైసాకు జవాబుదారీ వహిస్తా అని చెబుతున్నవారు చేయాల్సిన పనేనా ఇది ? ఎవడబ్బ సొమ్మని రామచంద్రా అన్న రామదాసు గుర్తుకు రావటం లేదూ ! తేడా ఏమిటంటే ఆయన నవాబు జైల్లో బందీగా ఉండి వాపోయాడు. మనం హిందూత్వ ప్రజాస్వామ్య బందీలుగా ఉండి నోరు విప్పలేకపోతున్నాం. రామదాసు రక్షణకు రాముడు వచ్చాడంటారు. మన రక్షణకు కనీసం జైల్లో పరామర్శించేందుకు సైతం రాముడు వచ్చే అవకాశం లేదు. వచ్చినా అధికారులు అనుమతించరు.
పోనీ చైనా వారు కొత్తగా మన ప్రాంతాన్ని ఒక్క అంగుళం అయినా ఆక్రమించినట్లు చెప్పి ఉంటే దాన్ని కాపాడుకొనేందుకు పదిహేను లక్షల కోట్లేమిటి, దేశం మొత్తాన్ని అమ్మివేసి ఆ సొమ్ముతో అమెరికా నుంచి తెచ్చుకొనే ఆయుధాలతో సదరు అంగుళాన్ని తిరిగి తెచ్చుకొనేందుకు పూనుకున్నా ఎవరూ అభ్యంతర పెట్టరు. దేశభక్తిలో ఎవరూ ఎవరికి తీసిపోరు ! ఏమీ లేని దానికి కరోనా కాలంలో ఇంత ఖర్చా ? అనేక దేశాలకు సరిహద్దు సమస్యలున్నాయి. ఎవరైనా కరోనా కాలంలో ఇలాంటి పని చేశారా ? ఇది రాజనీతా – బాధ్యతా రాహిత్యమా ! ఏది చెబితే దానికి తలూపటానికి మనం గంగిరెద్దులమా ! అయినా తలలెందుకు ఊపుతున్నాం ?
” ఈ ఖర్చు అంతా కోవిడ్ టాక్స్ పేరు మీదనో లేదా యుద్ధ టాక్స్ పేరు మీదనో మన నుండి వసూలు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఆయిల్ పూల్ ఖాతా మీదనే భారం వేస్తున్నది అది కూడా ఇంకో రెండు నెలలు మాత్రమే. మే నెల ఆరంభం నుండి మళ్ళీ పెట్రో రేట్లు తగ్గుతాయి. భయం అవసరం లేదు. ”
జనానికి బుర్రలేదనుకొనే అతి తెలివి వాదనతప్ప పైన పేర్కొన్న లక్షల కోట్ల ఖర్చును జనం నుంచి వసూలు చేయటం లేదట ? ఆయిల్ పూల్ ఖాతా నుంచి చేస్తున్నారట. దానికి డబ్బు ఎక్కడ నుంచి వస్తోంది? నరేంద్రమోడీ గారికి అల్లాఉద్దీన్ అద్భుత దీపం ఏమైనా దొరికిందా ! జనాన్ని ఇంత వెర్రివారిగా జమకడుతున్నవారినా మనం నోరెత్తకుండా అంగీకరిస్తున్నది ? ఎందుకిలా ప్రశ్నించలేని స్ధితికి చేరుకున్నాం ? గంగిరెద్దులమా ?
ఆయిల్ పూల్ అనండి మరొకటనండి పేరేదైతేనేం గత కొద్ది సంవత్సరాలుగా కేంద్రానికి రాష్ట్రాలకు వస్తున్న ఆదాయ వివరాలు కోట్ల రూపాయలలో దిగువ విధంగా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్నఅంకెలు కేంద్రం,రాష్ట్రాల పన్నులలో చమురు రంగం వాటాల శాతాలు.
సంవత్సరం 2013-14 ××××× 2014-15 ××××× 2015-16 ××××× 2016-17
కేంద్రం 1,04,163(38.0) ×× 1,22,925(39.2) ×× 2,13,995(57.4) ×× 2,37,388(52.6)
రాష్ట్రాలు 1,27,957(27.2) ×× 1,31,595(25.7) ×× 1,29,214(23.5) ×× 1,53,287(25.1)
కేంద్ర ప్రభుత్వం పెంచిన పన్ను భారాన్ని ఈ అంకెలు చెబుతున్నాయి. మనం చెల్లిస్తున్నవే. ఇచ్చిన అంకెలన్నీ కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన సంవత్సరాలవే. ఈ పెంపుదల సమయంలో కరోనా లేదు, సరిహద్దుల్లో సరాగాలు, పనేమీ లేదు ఒకసారి వచ్చి పోండి అన్న ఆత్మీయ పిలుపులే తప్ప మరొకటి లేదు కదా ! ఎందుకు పెంచినట్లు ? పైన పేర్కొన్న అంకెలకు గత ఏడాది పెంచిన పన్నుల మొత్తం రెండు లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ఆదాయానికి కలుపుకోవాలి. కేంద్ర పన్నుల మీద కూడా రాష్ట్రాల వాట్ ఉంటుంది కనుక ఆ మేరకు కొంత మేరకు రాష్ట్రాలకు కూడా ఆదాయం పెరుగుతుంది తప్ప శాతాలలో పెద్ద మార్పు ఉండదు.
ఒకవేళ ఆయిల్ పూల్ – మరొకటో ఏదో ఒకటి. కరోనా, సరిహద్దుల కోసమే పన్నులు పెంచా అని విలేకర్ల సమావేశం పెట్టి చెప్పే ధైర్యం ఎలాగూ నరేంద్రమోడీ గారికి లేదు కనుక కనీసం తన మన్‌కీ బాత్‌లో సెలవిమ్మనండి. పార్లమెంటులో చెప్పమనండి. కొద్ది నెలలే గనుక భరిద్దాం.
మనం చర్చిస్తున్న పోస్టులో రాసినట్లు ఆసియా ఖండానికి చమురు రేట్లు తగ్గించిన నరేంద్రమోడీ గారికి మిగతా దేశాల వారందరూ జేజేలు పలుకుతూ ఉండి ఉండాలి. లేకపోతే నేపాల్, శ్రీలంకతో సహా ఇరుగు పొరుగుదేశాల్లో కూడా బిజెపిని ఏర్పాటు చేసి అధికారానికి వచ్చేందుకు ప్రయత్నించాలని త్రిపుర పర్యటనలో హౌం మంత్రి అమిత్ షా ఎందుకు చెబుతారు, ఆ విషయాన్ని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవదేవ్ ప్రపంచానికి ఎలా వెల్లడిస్తారు. బిజెపి నాయకులు జనాన్నే కాదు చివరికి స్వంత పార్టీ వారిని కూడా వెర్రి పుష్పాల కింద జమకడుతున్నారన్నమాట. లేకపోతే విదేశాల్లో బిజెపి ఏర్పాటు ఏమిటి ? నరేంద్రమోడీ ఘనత కారణంగా మన, ఇరుగు పొరుగుదేశాల్లో ఫిబ్రవరి 15న గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డాట్ కామ్ సమాచారం ప్రకారం పెట్రోలు, డీజిలు ధరలు, సెంట్లు, మన కరెన్సీలో(ఫిబ్రవరి 18 మారకపు రేటులో) ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది ఖలిస్తానీ లేదా చైనా, పాకిస్దాన్ టూలకిట్టులో భాగం కాదని మనవి.
దేశం ×××××× పెట్రోలు ×××× డీజిలు
భారత్ ××××× 126 (91.37) ×× 115 (83.39)
బంగ్లాదేశ్ ××× 105 (73.24) ×× 77 (55.84)
చైనా ×××××× 103 (74.69) ×× 90 (65.26)
నేపాల్ ××××× 95 (68.89) ×× 80 (58.04)
శ్రీలంక ×××× 83 (60.19) ×× 54 (39.16)
పాకిస్దాన్ ××× 70 (50.76) ×× 73 (52.93)
భూటాన్ ××× 68 (49.31) ×× 64 (46.41)
మయన్మార్× 67 (68.89) ×× 60 (43.51)
మనం కోరితే ఒపెక్ సంస్ద ఆసియా ఖండానికి ధరలు తగ్గించిందని చెబుతున్న పెద్దలకు ఒక ప్రశ్న. విదేశాలకే మన మాట మీద అంత ప్రేమ ఉండి అడిగిన మనకే గాక ఆసియా మొత్తానికి ఉదారంగా భారం తగ్గించేందుకు కారకులైన మాననీయ నరేంద్రమోడీ మన దేశంలో ఇంత ఎక్కువకు ఎందుకు అమ్మిస్తున్నారు ? మనకెందుకీ దరిద్రం పట్టుకుంది. ఎక్కడిదీ ఏలినాటి శని ? కరోనా అందరికీ ఉంది. సరిహద్దుల్లో వివాదానికి మనం పదిహేను లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నపుడు చైనా వారికీ అంతే మొత్తం ఖర్చు అవుతుంది కదా ? మరి వారెందుకు ఆయిల్‌పూల్‌లో పన్నులు వసూలు చేయటం లేదు ? గంగిరెద్దుల్లా తలాడించటం తప్ప మనం ఇవేవీ అడగకూడదు !
” 100 రూపాయలు ఉన్న బీరు 160 అయితే ఎవరూ కిక్కురుమనరు కానీ పెట్రోల్ లీటర్ 100 అయిపోతున్నది అని గగ్గోలు పెట్టేస్తున్నారు. ఒక కుటుంబం రెస్టారెంట్ కి వెళ్ళి భోజనం చేస్తే 2000 అవుతున్నది కానీ ఎవరికీ ఇబ్బంది అనిపించడం లేదు. స్టేట్ హైవే ల మీద టోల్ గెేట్‌లు పెట్టి వసూలు చేస్తుంటే మాత్రం కమ్మగా ఉంటున్నది. అసలు 10 ఖరీదు చేసే ఒక క్వార్టర్ విస్కీ ని 150 రూపాయాలకి అమ్ముతుంటే ఎవడూ ఆడగడు. కానీ దేశానికి అవసరం అయ్యే ఖర్చు మీద మాత్రం గొంతులు లేస్తాయి ఇది మన దౌర్భాగ్యం. ”
చమురు ధరలు ఎంత పెరిగినా జనం పట్టించుకోవటం లేదు అన్నది స్పష్టం. అప్పో సప్పో చేసి దేశం కోసం చమురు కొంటున్నవారు ఎక్కడా కనీసంగా నిరసన తెలిపిన పాపాన కూడా పోలేదు. ఒకవైపు రోడ్డు పేరుతో పెట్రోలు మీద సెస్ వేస్తున్నారు. మరో వైపు ద్విచక్ర వాహనాల మీద తప్ప మిగిలిన వాటన్నింటికీ ”తోలు” వసూలు చేస్తున్నారు. అయినా సరే నోరు మూసుకొని చెల్లించాల్సిందే ! గంగిరెద్దులం కదా మాట్లాడ కూడదు ! మనసులో కూడా ధరలు పెరిగాయి అనుకోకూడదు అన్నమాట ! ఎక్కడ నోరు తెరుస్తామో అని ముందుగానే మన నోరు మూయించేందుకు తిడుతున్నతిట్లు తప్ప ఇవి మరొకటి కాదు. ఒక వేళ ఎవరైనా చమురు ధరల మీద ఆందోళన చేశారో ! మీ వెనుక ఏపాకిస్ధానో, చైనానో ఉందనో, మీకు ఏదో ఒక ఉగ్రవాద సంస్ద నుంచి నిధులు అందుతున్నాయనో వెంటనే ముద్రవేస్తారు ! రైతులను చూస్తున్నాం కదా ! గంగిరెద్దులం కనుక తలెత్తటం లేదు !
వాట్సాప్‌లో తిరుగుతున్న మరో పోస్టు ఇరాన్‌కు చమురు బిల్లు చెల్లింపు గురించి. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే చెబితే నిజం అవుతుందన్నగోబెల్స్ సూత్రాన్ని పక్కాగా అమలు జరుపుతున్నారు. యుపిఏ పాలనా కాలంలో చమురు ఖాతాలో ఇరవై లక్షల కోట్ల లోటు పెట్టారని, ఇరాన్‌కు అరవైవేల కోట్ల రూపాయల చెల్లింపు గురించి గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దాచి పెట్టిందని, ఆ సొమ్మును ప్రభుత్వం వినియోగించుకుందని, మోడీ సర్కార్ మీద భారం మోపిందనే ఆరోపణలు పదే పదే చేస్తున్నారు. వాస్తవం ఏమిటి ?
ఇరాన్‌పై పశ్చిమ దేశాల ఆంక్షలు అమలు జరుపుతున్న సమయంలో మన దేశంలోని మంగళూరు చమురు శుద్ది కర్మాగారం, హెచ్‌పిసిఎల్,ఐఓసి, హెచ్‌పిసిఎల్ మిట్టల్ ఎనర్జీ, ఎస్సార్ ఆయిల్ కంపెనీలు ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకున్నాయి. దానికి గాను నలభైశాతం మొత్తాన్ని మన రూపాయల్లో చెల్లించాయి. అయితే మన దేశం మిగిలిన మొత్తాన్ని చెల్లించేందుకు సిద్దపడినప్పటికీ ఆంక్షల కారణంగా అంతర్జాతీయ బ్యాంకులు భయపడి సొమ్ము తీసుకొనేందుకు ముందుకు రాలేదు. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది, ఆంక్షలను సడలించారు. టర్కీకి చెందిన హాక్‌బ్యాంక్ ముందుకు వచ్చింది, 6.5బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో 43వేల కోట్లు) మొత్తాన్ని యూరోలలో చెల్లించాలని బ్యాంకు, ఇరాన్ కూడా కోరింది. ఆ మేరకు ప్రభుత్వం చెల్లించింది. అప్పటి వరకు ఆ సొమ్ము ఆయా కంపెనీల దగ్గరే ఉండిపోయింది తప్ప మన్మోహన్‌సింగ్ సర్కార్ వాడుకోలేదు, మోడీ సర్కార్ తన బొక్కసం నుంచి చెల్లించిందీ లేదు. అయితే ప్రభుత్వం ద్వారా చెల్లింపులు జరిగాయి. గత ప్రభుత్వం చమురు ఖాతాలోటు పూడ్చుకొనేందుకు గాను పన్ను భారం పెంచామని చెప్పుకొనేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేశారు. మనం గంగిరెద్దుల మాదిరి తలూపాలా ? నిజాల నిగ్గు తేల్చాలా ? మన గత చరిత్ర తలెత్తుకున్నది తప్ప తలూపింది కాదు మరి !!