ఎం కోటేశ్వరరావు
లాటిన్ అమెరికాలో కొన్ని చోట్ల తగిలిన తీవ్ర ఎదురు దెబ్బలతో ఇంకేముంది వామపక్షాల పని ముగిసింది అని చాలా మంది సంతోషించారు. ఎదురు దెబ్బలు తగిలిన ప్రతి సారీ మనుషుల ప్రాణాలు పోయేట్లయితే మానవ జాతి ఇంతలా పెరిగి ఉండేది కాదు. అలాంటిది తగిలిన ఎదురు దెబ్బలకు ఉద్యమాలు అంతరించిపోతాయను కోవటం ఒక భ్రమ మాత్రమే. సామ్రాజ్యవాదుల కుట్రలు, వాటికి వ్యతిరేకంగా జాగ్రత్తలను తీసుకోకపోవటం, నయా ఉదారవాదం మీద భ్రమలు, దాని ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయటం, నయా ఉదారవాద పునాదులను కదిలించకపోవటం వంటి అనేక అంశాలు వామపక్షాల ఎదురు దెబ్బల వెనుక ఉన్నాయి. ఎదురు దెబ్బలను మాన్పుకొని తిరిగి పయనం ఎలా సాగిస్తామో ఉద్యమాలూ అంతే . ఇటీవల జరిగిన పరిణామాలు, కొన్ని చోట్ల ఎన్నికలలో తిరిగి వామపక్షాలు విజయం సాధించటాన్ని కొందరు మరోసారి వామపక్ష పురోగమన తరంగం ప్రారంభం అయిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కడలి తరంగాల ఆటు పోట్లు నిత్యం జరుగుతుంటాయి. సముద్రం అలాగే ఉంటుంది. అదే మాదిరి ఉద్యమాలుంటాయి. అల అది పురోగామి లేదా తిరోగామి ఏదైనా జనానికి కొత్త అనుభవం నేర్పుతుంది.
లాటిన్ అమెరికా ప్రత్యేకించి బొలీవియాలో ఉన్న పరిస్దితి గురించి దేశ మాజీ ఉపాధ్యక్షుడు అల్వారా గార్సియా లినేరా మాట్లాడుతూ రెండవ పురోగమన తరంగంలో ఉన్నామని చెప్పారు.యాభై ఎనిమిది సంవత్సరాల లినేరా చేగువేరా స్ఫూర్తితో ఏర్పాటయిన టపాక్ కటారీ గెరిల్లా సైన్య నేతగా పని చేశారు. తిరుగుబాటు చేశారనే ఆరోపణలతో 1992లో అరెస్టు చేసి 1997లో విడుదల చేశారు. ఇవోమొరేల్స్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2005 నుంచి 2019వరకు దేశ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో తిరిగి ఎన్నికైన వారిద్దరి మీద పోలీసు, మిలిటరీ తిరుగుబాటు చేసి దేశం నుంచి వెళ్లిపోయేట్లు చేసింది. గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికలలో మొరేల్స్ నాయకత్వంలోని మాస్ పార్టీ అభ్యర్ధి లూయీస్ ఆర్సీ ఘన విజయం సాధించటంతో ఇద్దరూ స్వదేశానికి చేరుకున్నారు.
ఒక వార్తా సంస్దతో తన స్వగృహంలో మాట్లాడుతూ ఏడాది తరువాత ఇంటి తలుపులు తెరిచినపుడు వచ్చిన శబ్దాలు తనను ఎంతో ఉద్వేగానికి గురి చేశాయన్నారు. లూయీస్ ఆర్సీ 55శాతం ఓట్లతో అధికారానికి రావటం వామపక్ష వాద విజయాలు మరియు పురోగమనాన్ని నిర్దారించింది.కొంత మంది వామపక్ష సైకిలు చక్రం తిరగటం ఆగిపోయిందనటం వాస్తవం కాదనేందుకు ప్రత్యక్ష నిదర్శనం ఇది, వామపక్ష ఉద్యమం తరంగాల వంటిది తప్ప ఆగిపోయే చక్రం కాదు, తరంగాలు వస్తుంటాయి పోతుంటాయి అన్నారు. తొలి తరంగం బలమైన ప్రజాకర్షణ గల నాయకత్వంతో విప్లవాత్మక పురోగమనవాదం అయితే రెండవది అలాంటి ప్రజాకర్షక నాయకత్వం లేని సాధారణ పురోగమనవాదంగా మనం చూస్తామన్నారు. మధ్యేవాద మితవాద శక్తుల పతనం పచ్చిమితవాద శక్తులకు దారి కల్పిస్తుంది, బలపడతాయి, దీన్ని మనం బ్రెజిల్లో చూశాము. ఇదేదో ఏదో ఒక చోట జరిగింది కాదు, డోనాల్డ్ ట్రంప్‌లో చూశాము, ఐరోపాలో చూస్తున్నాము. మధ్యేవాద మితవాదం విప్లవాత్మకంగా మారలేక వామపక్ష ప్రజాకర్షకనేతలను విమర్శిస్తూ హింసాత్మక మితవాదులనుంచి తనకు తాను దూరం జరుగుతోందని లినేరా చెప్పారు. బొలీవియాలో మరోసారి కుట్ర జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు బదులిస్తూ అందుకే నేను యువతను కలిసిన ప్రతిసారీ మరోసారి కుట్ర జరిగితే మీరేం చేస్తారు అని అడుగుతాను. అదొక సంస్దాపరమైన ప్రశ్న. అలా అడగటం ద్వారా సంఘటితం కావటం, రాజకీయ శిక్షణవైపు, స్పష్టమైన మార్గంవైపు వారిని నెడుతుంది. కేవలం ఎన్నికల కూటములకు మించి ఆలోచించటం నూతన ప్రజాస్వామ్య తరంగానికి ముఖ్యం అన్నారు.
అనేక చోట్ల ప్రతిపక్ష స్ధానాల్లోకి పోయిన లాటిన్ అమెరికా వామపక్షం తిరిగి నూతన ఎన్నికల విజయాల గురించి ఆశలు రేపుతున్నది.చిలీలో 1973లో వామపక్ష అధ్యక్షుడు సాల్వెడార్ అలెండీని హత్య చేసి నియంత అగస్టో పినోచెట్ అధికారాన్ని చేపట్టాడు. వామపక్ష ఉద్యమాన్ని అణచివేశాడు. పినోచెట్ అధికారం కోల్పోయిన తరువాత ఎవరు అధికారానికి వచ్చినా అతగాడి నిరంకుశ రాజ్యాంగమే అమల్లో ఉంది. గతేడాది జరిగిన ప్రజా ఉద్యమం కారణంగా వామపక్షాలు ఆమోదించిన కొత్త రాజ్యాంగ రచన జరగనుంది. దాని రూపు రేఖల మీద కొందరికి అనుమానాలు ఉన్నప్పటికీ అది కూడా ఒక విజయంగానే పరిగణించాల్సి ఉంది. అన్నీ సక్రమంగా జరిగి కొత్త రాజ్యాంగం ప్రకారం ఈ ఏడాది నవంబరులో ఎన్నికలు జరిగితే వామపక్షాలు సమైక్యంగా ఉంటే విజయం సాధించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. వామపక్షం అని పూర్తిగా చెప్పేందుకు లేకున్నా వారితో కలసిపని చేసే, అర్జెంటీనాలో గతంలో అధికారానికి వచ్చి తరువాత ఓడిపోయిన పెరోనిస్టు పార్టీ 2019లో అధికారానికి వచ్చింది. ” లాటిన్ అమెరికాలో వామపక్షాలు వెనుకపట్టు పట్టినా మితవాదం-వామపక్షం మధ్య వైరుధ్యం ముగియలేదు.2021లో వామపక్షం తిరిగి లాటిన్ అమెరికాలో ముందుకు పోయేందుకు వీలుగా ఉంది. ఈక్వెడోర్‌లో మాజీ అధ్యక్షుడు రాఫెల్ కొరెయా బలపరచిన వామపక్ష అభ్యర్ధి ఆండ్రెస్ అరౌజ్ విజయం సాధిస్తే ఎంతో ప్రాధాన్యత కలిగినది అవుతుంది. లాటిన్ అమెరికాలో పురోగమన వాదం నూతన రాజకీయ దశకు నాంది అవుతుంది” అని కొలంబియాకు చెందిన సామాజికవేత్త జేవియర్ కాలడెరన్ కాస్టిలో చెప్పారు. పెరూలో వామపక్ష విజయావకాశాలు పెరుగుతున్నాయి, వెరోనికా మెండోజా విజయం సాధించే అవకాశాలున్నాయని కూడా అన్నారు. ”నయా ఉదారవాదానికి బొలీవియా, చిలీలో పెద్ద దెబ్బ తగిలింది. నేడు నయా వుదారవాదవిధానాల పర్యవసానాలకు వ్యతిరేకంగా జనం పోరాడుతున్నారు. పురోగామి శక్తులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పురోగమించే అవకాశాలు అంటే గత దశాబ్దంలో మాదిరి సాధ్యమైనంత త్వరలో అని కాదు. నయా ఉదారవాద శక్తులకు తమ ఇబ్బందులేమిటో తెలుసు, ఇదే సమయంలో పురోగామిశక్తుల పురోగమనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2022లో జరిగే కొలంబియన్ ఎన్నికలలో కొందరు పురోగామి శక్తులు విజయం సాధించవచ్చు ” అని కాస్టిలో చెప్పారు. బ్రెజిల్ గురించి చెబుతూ ” అది లాటిన్ అమెరికాలో పెద్ద దేశం. అది లాటిన్ అమెరికాలో బలాబలాల పొందికను కచ్చితంగా మారుస్తుంది. ప్రస్తుతానికి అది పచ్చి మితవాదశక్తుల చేతుల్లో ఉంది. అక్కడ పురోగమనం ఉన్నా అది సంపూర్ణం కాదు, పోరు ఇంకా సాగుతూనే ఉంది.అక్కడ పురోగామి శక్తులు ఉన్నా ఇంకా ఎంతో ముందుకు పోవాల్సి ఉంది.
చిలీ సోషలిస్టు పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఎన్రిక్వెజ్ ఒమినామీ ఇలా అభిప్రాయపడ్డారు.” లాటిన్ అమెరికా ఖండం మరింత సన్నిహితం అయ్యేందుకు సాధ్యమైనన్ని ప్రభుత్వాలతో వామపక్షం తిరిగి ముందుకు రావాలి. అది వాణిజ్య పరంగా, ఆర్ధిక విలువ, రుణాలపై మారటోరియం, మిలిటరీ ఖర్చు, అమెరికాతో సంబంధాలలో జరగాలి. ఆర్దిక సామర్ధ్యం కంటే సామాజిక న్యాయం గురించి వామపక్షం కేంద్రీకరిస్తుంది, కనుక ఇది ఎంతో ముఖ్యం. మితవాద లేదా ఉదారవాద ప్రభుత్వాలు అర్జెంటీనా, బొలీవియా, చిలీ, ఈక్వెడోర్లలో తమ వాగ్దానాలను నిలుపుకోలేదు కనుక వామపక్షాలకు అవకాశాలు ఉన్నాయి.దీనికి తోడు లాటిన్ అమెరికా వామపక్షం వ్యవస్దా వాదాన్ని మార్చాల్సి ఉందనే పాఠాన్ని నేర్చుకున్నది. మధ్య తరగతి డిమాండ్లకు అనుగుణ్యంగా సామాజిక న్యాయం కోసం పోరాడాలి” అన్నారు.
ఏప్రిల్ నెలలో రెండవ దఫా ఎన్నికలు జరగాల్సిన ఈక్వెడోర్‌లో ఏం జరగనుందో ఇప్పటికీ స్పష్టత లేదు. అమెరికా అనుకూల హరితవాది యకు పెరెజ్‌ను రెండవ స్ధానంలో నిలిపేందుకు, తుది దఫా ఎన్నికల్లో వామపక్ష అభ్యర్ధిని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో నాలుగు జైళ్లలో ఆటవిక పద్దతిలో జరిగిన హింసాత్మక ఘటనల్లో 81 మంది మరణించారు. రంపాలతో శరీరాలను కోయటం, కుళ్లపొడవటం, ముక్కలు చేయటం వంటి దారుణాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.లాటిన్ అమెరికాలోని కొలంబియా వంటి కొన్ని దేశాల్లో ఇటువంటి చర్యలకు పోలీసులు, పారామిలిటరీ, ప్రభుత్వకిరాయి హంతక దళాలు, వాటిని ఎదిరించే వారు పాల్పడటం తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు ధరించి గుర్తింపు బయటకు రాకుండా ఇలాంటి పనులు చేయించి ఇతరుల మీద నిందలు వేయటం సర్వసాధారణం. ఈక్వెడోర్ జైళ్లలో జరిగిన ఉదంతాలకు మాజీ అధ్యక్షుడైన వామపక్ష రాఫెల్ కొరెయా అనుచరులే కారణమని ప్రభుత్వం ప్రకటించటం వెనక ఉన్న కుట్ర ఏమిటో స్పష్టం.రెండవ దఫా జరగనున్న ఎన్నికలలో కొరెయా బలపరచిన అభ్యర్దిని దెబ్బతీసే దుర్మార్గమైన ఎత్తుగడ ఇది.మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో అనేక మంది నేరగాండ్లు ఈ జైళ్లలో ఉన్నారు. అలాంటి సంఘవ్యతిరేక చర్యలకు పాల్పడే ముఠాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా జైళ్లలో కూడా వారు మారణకాండకు పాల్పడిన ఉదంతాలెన్నో. తాజా ఉదంతాలలో మరణించిన వారిలో అలాంటి మాఫియాలకు చెందిన వారు ఉన్నప్పటికీ ప్రభుత్వం చేయించిన దారుణం తప్ప రాజకీయంగా వామపక్ష పార్టీకి ఎలాంటి సంబందం లేదు. జైళ్లలో ఉన్నవారికి అధికారుల అనుమతి, అవకాశం ఇవ్వకుండా అలాంటి మారణాయుధాలు ఎలా అందుబాటులోకి వస్తాయి ? వామపక్ష ఇఎల్‌ఎన్ పార్టీకి మాదకద్రవ్యాల ముఠాల నుంచి నిధులు అందుతున్నాయని ముందే తప్పుడు ప్రచారం చేశారు. ఆ పార్టీ అభ్యర్ధి ఆండ్రెస్ అరుజ్ ప్రధమ స్ధానంలో ఉన్నందున, ఏదో ఒకసాకుతో అసలు ఎన్నికలనే రద్దు చేసేందుకు ఇదంతా చేశారన్నది స్పష్టం.
అమెరికా అనుకూల అభ్యర్ధి యకు పెరెజ్ అనూహ్యంగా మూడవ స్ధానంలో రావటంతో అసలు రెండోసారి పోటీకే అనర్హుడయ్యాడు.మూడో స్ధానంలో వచ్చిన మరోమితవాది లాసో అతని మధ్య ఓట్ల తేడా కేవలం 20వేలు లోపు కావటంతో లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ యాగీ చేశాడు. దానికి ఎన్నికల సంఘం అంగీకరించింది. తీరా చూస్తే దానిలో కూడా పసలేదని తేలింది. లెక్కింపులో అటువేయాల్సిన ఓట్లను ఇటు వేశారని చెప్పిన 31 పత్రాలను పరిశీలించగా వాటిలో ఉన్న మొత్తం ఓట్లే పదహారు వేలు. అవి మొత్తం పెరేజ్‌కు వచ్చినా మూడవ స్ధానం మారదు.వాటిలో 7,233 ఓట్లలో మాత్రమే ఓటు నంబరు, ఓటరు సంతకానికి తేడాలు కనిపించాయి, వాటిలో కూడా 1,453ను రెండుసార్లు లెక్కించారు. అందువలన అది కూడా వీగిపోయిన తరువాత చట్టపరంగా ఇతర ఇబ్బందులు కలిగించేందుకు పూనుకోవటంతో పాటు జైల్లో హత్యాకాండ చేయించారు. అందువలన అడుగడుగునా ఎన్నికలను తొత్తడం చేసేందుకు కుట్ర సాగుతూనే ఉంది. దానిలో భాగమే మాదకద్రవ్య మాఫియా నుంచి వామపక్ష అభ్యర్ధికి నిధులు అందాయన్న మరొక కట్టుకధ. దాని మీద ఫిర్యాదు, విచారణ తతంగం. ఎంతకు బరితెగించారంటే ఏప్రిల్‌లోగా వామపక్ష అభ్యర్ధి అరౌజ్ పతనం కానట్లయితే తరువాత అక్రమంగా నిధులు పొందారన్న కారణంతో పతనం అవుతాడని యకు పెరేజ్ ప్రకటించటం కుట్రగాక మరేమిటి ?
ఈ కుట్రలను వ్యతిరేకిస్తూ అంతర్గతంగా అనేక మంది గళమెత్తుతున్నారు.ప్రజాస్వామిక ప్రక్రియ ఈక్వెడోర్‌లో కొనసాగుతుందనే హామీ ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ అబ్రాడోర్, అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్ ప్రకటించాల్సి వచ్చింది. ఈ ప్రకటనను బొలీవియా అధ్యక్షుడు లూయీస్ ఆర్సీ కూడా బలపరిచారు. రాఫెల్ కొరియా నాయకత్వంలో ఉన్న పార్టీకి ద్రోహం చేసి విద్రోహ శక్తులతో చేతులు కలిపిన ప్రస్తుత అధ్యక్షుడు లెనిన్ మోరెనో తన అభ్యర్ధి సోదిలో కూడా లేకుండా పోవటంతో ఇప్పుడు బ్యాంకర్ అయిన రెండవ స్ధాన అభ్యర్ధి లాసోకు మద్దతు ఇస్తున్నాడు. కనిపించని కుట్రల నేపధ్యంలో ఇప్పటి వరకు ఉన్న పరిస్దితిని బట్టి పోటీ అరౌజ్ -లాసో మధ్య జరుగుతుందా ? మితవాదశక్తులన్నీ లాసో వెనుక నిలుస్తాయా ? అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయా అన్నది చెప్పలేము. ఇక్కడ అరౌజ్ విజయం లాటిన్ అమెరికాలో వామపక్షాల నిర్ణయాత్మక పాత్రను మరింత ముందుకు తీసుకుపోనుంది. అయితే సామ్రాజ్యవాదులు దీన్ని అనుమతిస్తారా లేక గతం మాదిరి మిలిటరీ నియంతలను తిరిగి రంగంలోకి తెస్తారా ?