యం. జయలక్ష్మి
జూన్ 24, 1989, చైనాపార్టీ వందేళ్ళ చరిత్రలో ఒక ముఖ్యఘట్టం. సోషలిస్టు చైనా నిలదొక్కుకోటానికి పునరంకితమైన రోజది. తూర్పుయూరపులో, సోవియట్ యూనియన్‌లో మాదిరే చైనా ప్రభుత్వమూ, పార్టీ పతనమవుతాయని సామ్రాజ్యవాదులు కన్న కలలను వమ్ముచేస్తూ చర్యలు తీసుకొన్న రోజు. 24వతేదీన ముగిసిన రెండురోజుల విస్త త ప్లీనరీ సమావేశంలో నాటివిద్యార్థి ఆందోళనపై ప్రధాని, పోలిట్ బ్యూరో సభ్యుడు లీపెంగ్ నివేదికను చర్చించి ఆమోదించారు. కేంద్రనాయకులు 557మంది పాల్గొని, ముఖ్యనిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ప్రధానకార్యదర్శి జావోజియాంగుని అన్ని పదవులనుంచీ తొలగించారు. సంస్కరణలక్రమంలో ”బూర్జువా లిబరలైజేషన్”ని ఎదుర్కోవాలని, అందరూ కట్టుబడివుండాల్సిన నాలుగు మౌలిక సూత్రాలను పునరుదోటించారు. అవి: సోషలిస్టు పథం, జనతా ప్రజాతంత్ర నియంత త్వం, మా.లె.మావోసిద్ధాంత నేత త్వం, అన్నిటికన్నా కీలకమైన పార్టీ నాయకత్వం. ఈ సూత్రాలను పాటించని వారు పార్టీ, ప్రభుత్వ వ్యవస్థలపై దాడులను నిర్వహించారని, ప్రజా చైనా, పార్టీ భవితవ్యాన్ని దెబ్బతీయటానికి, సామ్రాజ్యవాదుల ప్రోత్సాహంతో జరిగిన తిరుగుబాటు కుట్రస్వభావాన్ని అర్థంచేసుకోకుండా, దాన్ని బలపరిచి, ఆయనతోపాటు మరి కొద్దిమంది తీవ్రమైన తప్పుని చేశారని వివరించారు.
1989జూన్4 నాడు ”తియనన్మెన్ స్క్వేర్ లో పదివేలమంది విద్యార్థులను సైన్యం కాల్చి చంపిందని” ఒక విషప్రచారంతో అమెరికా, పశ్చిమదేశాల సామ్రాజ్యవాదులు తమ కుట్రను కప్పిపెట్టుకో చూశారు. ఆ ఆందోళనను చైనా మరిచిపోయినా, అమెరికా, పశ్చిమదేశాలు, భారతీయమీడియా ఏటా జూన్ నెలలో గుర్తుచేస్తుంటాయి. కాగా చైనాపార్టీ నాడు చెప్పినదే మౌలికంగా సరైనదని చెప్పకనే చెప్పిన ఒక పుస్తకం ఇటీవల విడుదలైంది. దానిక్లుప్త పరిచయమే ఈ వ్యాసలక్ష్యం.
చైనావ్యతిరేక దుమారాన్ని తిరిగి ప్రోత్సహిస్తున్ననేటి బైడెన్ యుగంలో నాటిచరిత్రని ”తిరగరాసిన” పుస్తకం ” తియన్మెన్ స్క్వేర్ : ద మేకింగ్ ఆఫ్ ఏ ప్రొటెస్ట్ – ఏ డిప్లొమాట్ లుక్స్ బాక్ ” సాదాసీదా రచయిత కథనం కాదది: ఆనాడు చైనాలో ఇండియా దౌత్యవేత్తగా వుండిన చైనా నిపుణుడు, ప్రత్యక్షసాక్షి విజరు గోఖలే రాశారు. ఈ ఏడాది మేనెలలో విడుదలైన 181పేజీల (399రూ. హార్పర్ కాలిన్స్) పుస్తకం దౌత్యప్రపంచంలో సంచలనం. ఆతర్వాత భారత విదేశాంగశాఖ కార్యదర్శి అయిన గోఖలే కథనం విలువైనది, మరుగునపడిన అనేక వాస్తవాలను వెలికి తెచ్చినది అని గతంలో చైనాలో పనిచేసి, తర్వాత అదే పదవిని అలంకరించిన శ్యాంశరణ్, శివశంకరమీనన్ వంటివారు ప్రశంసించారు. ‘ఎంతోకాలంగా బైటపెట్టాలనుకున్న విషయాలివి. కానీ ”నేనున్న పరిస్థితులలో” కుదరలేదు’ ుఅని రాశారు గోఖలే. గతఏడాదే విదేశాంగ కార్యదర్శిగా రిటైరయ్యారు. .
ఆ ఘటనల గురించిన పాశ్చాత్య కథనాన్ని మీ పుస్తకంలో సవాలు చేశారు. అది ఎందుకు అవసరమయ్యింది? అని టైమ్స్ ఆఫ్ ఇండియా (మే23) విదేశీవ్యవహారాల నిపుణులు ప్రశ్నించారు. ఇరుపక్షాల మీడియా కూడా భావజాలపర పక్షపాతాలతో కూడివుంది. ఆ 50రోజుల ఘటనలను స్వంత అనుభవంతో చూశాను. నిజంగా ఏం జరుగుతున్నది అని పరిశీలించకుండా, ఒకరి కథనాల ఆధారంగా మరొకరు వార్తలను వండి వడ్డించారు. చైనా విద్యార్థుల్లో కొందరు కూడా అందులో భాగమయ్యారు. వారు చెప్పినవి పూర్తి వాస్తవాలు కావు. ప్రశ్నించదగినవి, నాకు స్వయంగా తెల్సిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అవన్నీ నా కళ్ళు తెరిపించాయి. ఈమొత్తాన్ని పాశ్చాత్య మీడియా తమదైన రీతితో వక్రీకరించింది. అందుకే వీటిని బైటపెట్టాల్సిన అవసరముంది అని భావించాను అని గోఖలే జవాబిచ్చారు.
కరోనా గురించి చైనావ్యతిరేక పాశ్చాత్య దుమారం (భారత మీడియా దానికి యుద్ధోన్మాద భేరీలను జోడించి ప్రచారం చేస్తుంటుంది: స్వంత విలేకరుల కథనాలు దాదాపు లేవని ఈ వ్యవహారాలు ఏకాస్త తెల్సినవారయినా ఇట్టే గ్రహించగలుగుతారు) ఈ నేపధ్యంలో గోఖలే రచన ఎంతో ప్రాముఖ్యత కలిగినది. అమెరికా అంటే ప్రపంచవ్యాప్త దోపిడీదారనీ, పసిపిల్లలతో సహా లక్షలాది మంది పౌరులను బలిగొన్న యుద్ధోన్మాదరాజ్యం అనీ, ప్రత్యేకించి నల్లవారిని అణగదొక్కిన జాత్యహంకార పోలీసువ్యవస్థ కలిగినదనీ తెల్సినదే. వియత్నాంలో ఘోరమైనఓటమి (1975) తర్వాత అమెరికా మిలటరీ వెనక్కితగ్గిన కాలమిది.
చైనా విప్లవం, మావో విజయాలను అనుభవించడమేతప్ప, గతకాలపు అగచాట్ల, పోరాటాల లోతు తెలియని యువతరంవారి ఆందోళన తియన్మెన్ స్క్వేర్ సంఘటనలు. పాశ్చాత్య పెట్టుబడిదారీవిధానపు బూర్జువాప్రజాస్వామ్యం బండారం తెలియని విద్యార్థులు వారు. 1970తర్వాత అమెరికాతో ప్రభుత్వపరంగా సంబంధాలు ఏర్పడి, ఇరుదేశాలూ హలోహలో అని పలకరించుకుంటున్న వాతావరణం. ఆతర్వాత పుట్టిపెరిగిన విద్యార్థితరంలో పాశ్చాత్యదేశాల స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాత త్వంల గురించిన పైపైఅవగాహనే వుంది. ”సంపూర్ణ పాశ్చాత్యీకరణ”ను, అమెరికాలోని ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ విగ్రహ నమూనాని కూడా తలకెత్తుకున్నారు కొందరు చైనావిద్యార్థులు.
ఆ నేపథ్యంలో నాటి చైనా నాయకత్వంలో ఒక ఆందోళన మొదలైంది. ””ఎర్ర జన్యువు”ని తర్వాతితరాలకి అందించాలి అని నేటి అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. నాడూనేడూ కూడా ఈ ‘రెడ్ జీన్’ కీలక సంకేతం ు అన్నారు గోఖలే (టైమ్సులో). అభివ ద్ధి, సంపదలు, సౌకర్యాలు, టెక్నాలజీలన్నీ కలిసి ‘రెడ్ జీన్’ని పలుచనచేసేస్తాయేమో అన్నది ఒక అభిప్రాయం. డెంగ్ ఆర్థిక సంస్కరణలు మొదలై పదేళ్ళు దొర్లినాయి. విదేశీ, దేశీ పెట్టుబడిదారులను అనుమతిస్తూనే స్వతంత్ర ‘నవచైనా నిర్మాణ స్వప్నం’ మొదలైంది. ”చైనా తరహా సోషలిజం” పేరిట అనుసరించిన వ్యూహం-ఎత్తుగడల పట్ల అవగాహనలో గందరగోళం నెలకొనివుంది, ముఖ్యంగా యువతరంలోని పార్టీకేడర్లో, నాయకత్వంలో కూడా వున్నది. ఆనాటికే కొన్ని భ్రమలూ, అలజడులూ తలెత్తాయి. ఆ ప్రమాదాన్ని పసిగట్టే ”బూర్జువా లిబరలైజేషన్’కి వ్యతిరేకంగా చైనాపార్టీ ఆనాడే (1987) ఒక ఉద్యమాన్ని నిర్వహించింది. ఎన్నిసంస్కరణలు వచ్చినా నాలుగు మౌలికసూత్రాల చట్రానికి లోబడిమాత్రమే వుండాలని చైనాపార్టీ, ప్రభుత్వమూ ఆదేశికసూత్రాలను ప్రకటించారు(పార్టీ 13వ మహాసభలో, 1987అక్టోబరు). సంస్కరణలక్రమంలో పెచ్చరిల్లిన ”బూర్జువా లిబరలైజేషన్ ని ఎదుర్కోవాలని, అందరూ కట్టుబడివుండాల్సిన ఆ సూత్రాలను పునరుదోటించారు. అవి: సోషలిస్టు పథం, జనతా ప్రజాతంత్ర నియంత త్వం, మా.లె.మావోసిద్ధాంత నేత త్వం, అన్నిటికన్నా కీలకమైన పార్టీ నాయకత్వం.
ఆ పరంపరలో వచ్చినవే తియన్మెన్ స్క్వేర్ సంఘటనలు.హఠాత్తుగా వచ్చినవి కాదు.
ఆర్థిక సంస్కరణలతో సోషలిస్టు చైనా ‘ ఉదారవాద (పెట్టుబడిదారీ) చైనా’గా మారిపోతుందని పాశ్చాత్యదేశాలు భావించాయి. అది తప్పుదారి పట్టిన పాశ్చాత్య ఊహ మాత్రమే అంటారు గోఖలే. 1989నుంచీ భారత విదేశాంగశాఖ, రాజకీయ నాయకత్వంకూడా దాన్ని విశ్వసించటంలేదు. ఆమాట పాశ్చాత్యులకు చెప్పాం కూడా. అయినా చైనా మార్కెటు, అక్కడ వస్తున్న లాభాలతో వారు మిన్నకుండిపోయారు అన్నారు గోఖలే(టైమ్స్).
”పాశ్చాత్యీకరించబడిన” ఆసియా అగ్రరాజ్యంగా చైనా వుండబోదు. దీన్ని భారతీయులు కూడా బాగా అర్థంచేసుకోవాలి. మనతో సరిహద్దు తగాదా చైనా కమ్యూనిస్టులు స ష్టించినది కాదు. అంతకుముందటి ”జాతీయ” చైనా, అమెరికా అనుకూల చియాంగ్ కై షేక్ కాలపు చైనా వైఖరీ ఇదే. వారెవ్వరూ మెక్ మహన్ లైనుని, సిక్కింని (దలైలామా కూడా 2008దాకా) గుర్తించలేదు అని ఎత్తిచూపారు గోఖలే.
ఆనాటి ఘటనల గురించి ఎన్నో కథనాలున్నాయి. భారత ద క్కోణం గల ”విశిష్టమైన కాంట్రిబ్యూషన్ ఈ పుస్తకం” అని ప్రశంసించారు సి.ఉదయభాస్కర్. ఆయన చైనా వ్యూహవ్యవహారాల నిపుణుడు, వ్యాఖ్యాత. ఇప్పటిదాకా చెప్పని కథనాన్ని ఎంతో నచ్చచెప్పేరీతిలో, ఆచితూచి రాసిన పుస్తకం అన్నారాయన. నేను కళ్ళారాచూసిన వాస్తవాలకు అన్వయంజోడించి, 30ఏళ్ళతర్వాత వెనక్కిచూసుకుంటే అర్థమయ్యేద ష్టితో రాసిన 10అధ్యాయాల పుస్తకం అని చెప్పుకున్నారు గోఖలే. ఆనాడు 500బిలియన్ డాలర్లున్న చైనా జీడీపీ నేడు 14000బిలియన్లకు చేరుకున్నది. చైనా ప్రజలు నేడు సంపన్నవంతులై, గర్వంతో తలఎత్తుకొని వున్నారు. డెంగ్ చూపెట్టిన, ఆతర్వాత నాయకులంతా అనుసరించిన మార్గంతో వారు ఈ స్థాయికి చేరారు. 1989తర్వాత నేటివరకూ అక్కడి యువతరం, విద్యార్థులు ఎన్నడూ నిరసన తెలిపే అవసరం రాలేదు. ఇప్పటి చైనామార్గం స్థానంలో ”ప్రజాస్వామ్యం పేరిట మరోవ్యవస్థని కోరుకుంటారేమోనన్న సూచనలేవీ మెజారిటీప్రజల్లో కన్పించటంలేదు” అని నిర్ధారించారు గోఖలే అని ఉదయభాస్కర్ చెప్పారు. పాశ్చాత్యదేశాలకు తమ తప్పులను గుర్తించటానికి 30ఏళ్ళు పట్టింది అంటారు గోఖలే.
ఆనాటి కొందరు విద్యార్థినేతలు ఎలాంటి వారంటే చాటుగా భోజనాలుచేస్తూ నిరాహారదీక్షలు చేసినవారు, పాశ్చాత్యదేశాల, మీడియాల ఆకర్షణ గలవారు అని గోఖలే రాశారు. నిజానికి నిరాహారదీక్షలు చేయరాదని విద్యార్థుల ఫెడరేషన్ తీర్మానించింది కూడా. అయినా ఒక నాయకుడు మీడియాముందు ఈ ”డ్రామాను” మొదలుపెట్టాడు. విద్యార్థులలోబాగా చీలిక వుండేదనీ, తమనితాము నాయకులుగా చెప్పుకునేవారు రహస్య ఎజెండాలతో ఎలాపనిచేశారో బయటపెట్టారు గోఖలే. సంస్కరణలగురించి పార్టీనాయకత్వంలో విభేదాలు, చర్చలు కొనసాగుతున్నకాలం. అలాంటి ఒక పొలిట్ బ్యూరో సమావేశంలో హుయావో బాంగ్ గుండెపోటుతో 15-4-1989న మరణించారు. డెంగ్ అనుయాయే అయినా, కళ్ళెంలేని లిబరలైజేషన్ వైపు మొగ్గిన నేత. అది తప్పేనన్న ఆత్మవిమర్శతో ప్రధానకార్యదర్శిగా (16-1-1987) రాజీనామాచేసి, పొలిట్ బ్యూరోలో వుండగా మరణించారు. నాటి వాతావరణాన్ని, విభేదాలను వాడుకొని విద్యార్థులని ఎగదోశాయి పార్టీలోని కొన్ని శక్తులు, లాబీలు. దానికి ఆజ్యంపోశాయి విదేశాలు, విదేశీమీడీయా. అలా ఏప్రిల్18-22న సంతాపంపేరిట వేలాదిమంది తరలివచ్చారు.అదే ముదిరి 50రోజులు కొనసాగింది. ప్రధానే మైదానంలోకివచ్చి తమతో చర్చలు జరపాలని మొండి డిమాండు పెట్టారు కొందరు. ప్రధాని లీపెంగ్ జనంమధ్యకి వచ్చి, నేలపైకూర్చొని మే18న జరిపిన సుదీర్ఘచర్చలను, ఫోటోలను ఆనాటి చైనా టీవీ, పత్రికలు ప్రచురించాయి.
300మందికిపైగా కీలకపార్టీ, ప్రభుత్వ నాయకులంతా వుండే కేంద్రస్థానం అది. వారి నివాసాలు, ఆఫీసులు, ప్రభుత్వ సెక్రటేరియట్ కూడా అందులోనే. అలాంటిస్థానాన్ని లక్షమంది విద్యార్థులు చుట్టుముట్టిన నెలతర్వాత, మే18న పొలిట్ బ్యూరో నిర్ణయంతో, మే20నగానీ మార్షల్ లా ప్రకటించలేదు. ఆతర్వాతే సైన్యప్రవేశం, కానీ నగరం వెలుపలే ఉంచారు. మే15-16న రష్యానేత గోర్బచేవ్ పర్యటన సందర్భంగా స్క్వేర్ లో కార్యక్రమాలకోసం మైదానాన్ని ఖాళీ చేయాలా అని చర్చించారు. కానీ చేయలేదు. జూన్ 3 రాత్రిదాకా ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు. ప్రపంచ మానవాళి చరిత్రలో ఇలాంటి తిరుగుబాటుని అన్నిరోజులు అనుమతించిన రాజ్యం మరొకటిలేదు. ఏదైనావుంటే ఎవరైనా ఉదహరించవచ్చు. చర్చలద్వారా 90-95 శాతంమందిని నచ్చచెప్పి ఇళ్ళకు పంపేశారు. వారు పోగా ఇంకా 5నుంచి10వేలమంది దాకావుంటారు.
”మొత్తం” ఎంతమంది చనిపోయారు? చైనాలెక్క 300 (సైనికులతోసహా). జూన్3రాత్రి గురించి నేటికీ వ్యాప్తిలోవున్నపుకార్లు: పదివేలమంది. అమెరికాగూఢచారి సంస్థ ఎన్ఎస్ఏ 500 మందిదాకా, యామ్నెస్టీ 1000దాకా, న్యూయార్క్‌టైమ్స్(జూన్21)400-800దాకా. స్క్వేర్ లో విద్యార్థుల మరణాలే లేవని, ఇతరచోట్ల అల్లర్లలో చనిపోయారని చైనా ప్రకటించింది. నిజమే ‘ అక్కడ అలాంటి ఆధారాలేవీ లేవ’ని వాషింగ్టన్ పోస్టు, సిబిఎస్ విలేకరులు, ”అక్కడ ఎలాటి ఊచకోతనీ చూడలేద”ని సంఘీభావంగా జనంమధ్యేవున్న తైవాన్ విలేకరి, ”అక్కడ” రక్తపాతం జరుగలేదని 2011లో అమెరికా రాయబార కార్యాలయం పంపిన రహస్య కేబుల్స్ చెప్పాయి. పాశ్చాత్యకపటాన్ని చైనా నిర్దిష్టంగా బట్టబయలుచేసింది. దానితో కొన్ని ఏజెన్సీలు (వాయిస్ ఆఫ్ అమెరికా) తమతప్పులను కొంత అంగీకరించాయి. మరయితే జూన్ 3 రాత్రి ఏంజరిగింది? పూర్తివివరాలు ఈ పుస్తకంలోనూ లేవు. జర్నలిస్టిక్ నియమాలను తుంగలోతొక్కి ఊహాగానాలతో, రూమర్లతో, కట్టుకథలతో పాశ్చాత్యమీడియా పచ్చికపటంతో ఎలా వ్యవహరించిందో అద్భుతంగా వెల్లడించారు గోఖలే అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. ఈ ”తిరగరాసిన చరిత్ర”ని తరచి చూడాల్సిన అవసరం వుంది.
వ్యాస రచయిత్రి ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంకు మాజీ అధికారిణి
కొంచం కటువుగా చెబుతున్నందుకు క్షమించాలి,
కమ్యూనిస్టులను చైనా తొత్తులు అనేది ఇటువంటి రాతల వల్లనే. కమ్యూనిస్ట్ భావజాలం మీద అభిమానం అంటే రష్యా, చైనా చేసిన ప్రతి చెత్త ని సమర్ధించాల్సిన అవసరం లేదు. ప్రతి సంఘటనకి వేరు వేరు దృష్టి కోణాలు విశ్లేషణలు ఉంటాయి, కానీ ఇదే తియన్మెన్ స్క్వేర్ గురించి చైనా ప్రజలు చరిత్ర లో కానీ, కనీసం ఇంటర్నెట్ లో కానీ సరైన సమాచారం లేకుండా చేయటం వాస్తవం కాదా ? ప్రజలకి సమాచారాన్ని దూరం చేయడం , వారి వాక్స్వాతంత్రాన్ని దూరం చేసిన దేశం కోసం మీరు ఎందుకు సర్ పోరాడుతున్నారు? మీరు చెప్పేదే నిజమయితే సంబరాలు చేసుకోమనండి ఆ రోజు ! అక్కడ జరిగింది తప్పు, నిరాయుధులైన విద్యార్థుల మీద సైన్యం, యుద్ధ ట్యాంకులతో చేసిన నరమేధం అది. బలం, బలగం తో వియాత్నం లో అమెరికా కమ్యూనిజం ని ఆపటానికి ప్రయత్నం చేసింది, ఇక్కడ చైనా ప్రభుత్వం అదే బలాన్ని, బలగాన్ని తన సొంత ప్రజల మీద వాడింది… పెద్ద తీడా ఏమి లేదు. రెండు తప్పే
చైనా విద్యార్థులు అవివేకులు, అనుభవం లేని వారు, ప్రాశ్చాత్యులకు బానిసలూ అనే విదంగా మీరు రాసారు. అమెరికా లో మహిళలు, నల్లవారి హక్కుల కోసం పోరాటం చేసిన్నపుడు, ఇలాంటి కూతలే అమెరికా పాలకులు తమ విద్యార్థుల మీద కూసారు; కమ్యూనిస్టులు, రష్యా వాళ్ళ కుతంత్రంలో భాగం అని . మన మోదీ భక్తులు వారిని వ్యతిరేకించే వారి మీద ఇలాంటివే కూతలు, పాకిస్తానీయులు, కమ్యూనిస్టులు, ప్రాశ్చత్య సంస్కృతికి బానిసలూ అంటూ విషయం పక్కదారి పాటిస్తారు. మీకు, వారికి ఏమిటి తేడా?
వంచన, వివక్ష, అణచివేతల మీద కమ్యూనిస్ట్ మార్గం లో రష్యా, చైనా సాధించిన విజయాలు చెప్పుకుందాం; కానీ చైనా, రష్యాల రక్త చరిత్రల కోసం పోరాడటం మానేసి; ఆర్ధిక, సామాజిక స్వేచ్ఛ కోసం, మతం లేని రాజ్యం కోసం, మానవ హక్కుల కోసం, వాక్స్వాతంత్రం కోసం, స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాటం చేయండి. చెప్పడానికి కొంచం సిగ్గుగా ఉన్నా మొదటి రెండు విషయాల్లో తప్ప కమ్యూనిస్టులు మిగతా విషయాల్లో అణచివేస్తున్న వారిగానే ఉన్నారు తప్ప అణగారిన వర్గాల కోసం లేరు! మన పోరాటం అణచివేత మీద, అది ఏ రూపం లో ఉన్నా సరే. మార్క్స్ మహాశయులు ఈ రోజు మళ్ళీ పుడితే, కమ్యూనిజమే ఒక మతంగా మారిన ఈ దుస్థితికి బాధపడతారు.
LikeLike
ఈ ఆర్టికల్ రాసిన వారు ఎం జయలక్ష్మి. రచయిత ఎవరైనా దానితో పూర్తిగా ఏకీ భవించిన కారణంగానే ప్రచురితమైంది. దానిలో చైనా విద్యార్దులకు మీరు ఆపాదించిన వాటిని రచయిత్రి ఉపయోగించలేదు. అయినా ఇలాంటి ఆరోపణ చేయటం సంస్కారం కాదని చెప్పటానికి విచారిస్తున్నాను. అలా అనుకుంటే మీరు రాసిన తీరును చూసి మీక్కూడా చాలా అంశాలను ఆపాదించవచ్చు. నేను ఆపని చేయదలచలేదు. ఆ ఉదంతం గురించి అభాండాలు, ఆరోపణలు చేసిన వారిలో మీరూ ఒకరు. ప్రతిదానితో అందరూ ఏకీభవించాల్సిన అవసరం లేదు. ఒక వైపు సోషలిజాన్ని, కమ్యూనిజాన్ని సమర్ధిస్తూనే అన్యవర్గ ధోరణుల ప్రభావంతో శత్రు విమర్శలను బుర్రలకు ఎక్కించుకొనే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో మీరూ ఒకరని మాత్రమే ఇక్కడ చెప్పదలచుకున్నాను. మీరు కటువుగా చెప్పినందుకు, ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుగా ఉందని చెప్పారు. ఇలాంటి పదజాలం ఉపయోగించినందువలన ఎలాంటి ప్రయోజనం లేదు. లాటిన్ అమెరికాలో, ఐరోపాలో వామపక్ష వాదులం అని చెప్పుకొనే వారు రోజూ మీ మాదిరి వేస్తున్న అభాండాలు పుంఖాను పుంఖాలుగా ఉన్నాయి. మీ స్పందనకు కృతజ్ఞతలు, రచయిత అభిప్రాయాలు, మీ స్పందన, నా ప్రతి స్పందన మంచి చెడ్డలను పాఠకులకే వదలివేద్దాం.
LikeLike
“..ఇలాంటి పదజాలం ఉపయోగించినందువలన ఎలాంటి ప్రయోజనం లేదు” అని అన్నారు, ఆవేదన వల్ల చెబుతున్న మాటలే కానీ ఆవేశంతో కాదు అని వివరించడానికి వాటిని వాడటం జరిగింది, బహుశా ఆ విషయం చేరవేయలేక పోయాను అనుకుంట.
“.. చైనా విద్యార్దులకు మీరు ఆపాదించిన వాటిని రచయిత్రి ఉపయోగించలేదు” అని అన్నారు. ఇక్కడ అర్థం ఏంటి: “చైనా విప్లవం, మావో విజయాలను అనుభవించడమేతప్ప, గతకాలపు అగచాట్ల, పోరాటాల లోతు తెలియని యువతరంవారి ఆందోళన తియన్మెన్ స్క్వేర్ సంఘటనలు. పాశ్చాత్య పెట్టుబడిదారీవిధానపు బూర్జువాప్రజాస్వామ్యం బండారం తెలియని విద్యార్థులు వారు. ”
అనుభవం లేని వారు – వారికి చరిత్ర తెలియదు, గత అనుభవాలు తెలియవు, కష్టాలు అనుభవించలేదు అనేకదా రచయిత్రి అన్నది
అవివేకులు – గత పోరాటాల లోతు తెలియదు, పాశ్చాత్య బండారం తెలియదు అంటే చెప్పదలుచుకున్నది ఇది కాదా
ప్రాశ్చాత్యులకు బానిసలూ – ఈ క్రింది వాటి పరమార్ధం ఇది కాదా:
“పాశ్చాత్య పెట్టుబడిదారీవిధానపు బూర్జువాప్రజాస్వామ్యం బండారం తెలియని విద్యార్థులు వారు”, “…పాశ్చాత్యదేశాల, మీడియాల ఆకర్షణ గలవారు” “..తమనితాము నాయకులుగా చెప్పుకునేవారు రహస్య ఎజెండాలతో ఎలాపనిచేశారో..” “..పాశ్చాత్యదేశాల స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతత్వంల గురించిన పైపైఅవగాహనే వుంది. ”సంపూర్ణ పాశ్చాత్యీకరణ”ను, అమెరికాలోని ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ విగ్రహ నమూనాని కూడా తలకెత్తుకున్నారు కొందరు చైనావిద్యార్థులు…”
“ఒక వైపు సోషలిజాన్ని, కమ్యూనిజాన్ని సమర్ధిస్తూనే అన్యవర్గ ధోరణుల ప్రభావంతో శత్రు విమర్శలను బుర్రలకు ఎక్కించుకొనే వారు చాలా మంది ఉన్నారు”, “ఐరోపాలో వామపక్ష వాదులం అని చెప్పుకొనే వారు రోజూ మీ మాదిరి వేస్తున్న అభాండాలు పుంఖాను పుంఖాలుగా ఉన్నాయి” అని అన్నారు, ఇక్కడ మీతో ఏకీభవిస్తాను.
శత్రు విమర్శ ఆధారంగా స్వీయ విశ్లేషణ చేసుకొని తప్పులని అంగీకరించనప్పుడు పురోగతి ఉండదు. అవును వామపక్ష వాదులం అని తలెత్తుకు చెప్పుకుంటాం, మాది వామ పక్షమే తప్ప చైనా పక్షమో రష్యాపక్షమో కాదు. సమ సమాజ స్థాపనే వామ పక్ష లక్ష్యం, అంత మాత్రాన మార్గాలు వేరైనా గమ్యం ఒకటే కదా అని వామపక్ష వాదుల ప్రతి మార్గాన్ని, ప్రతి పనిని సమర్ధించము. అందరమూ ఆఖరికి కాడికే కదా అని జీవితం లో జరిగే ప్రతిదీ చూస్తూ ఉరుకోలేం కదా, ఇది అలానే.
చివరగా ఒక్క మాట, తియన్మెన్ స్క్వేర్ కి కమ్యూనిజానికి ఎటువంటి సంబంధం లేదు, నిరాయుధాల మీద సైన్యాన్ని పంపండి అని కమ్యూనిజం చెప్పలేదు. అక్కడ జరిగిన తప్పు అయినా, ఒప్పు అయినా చైనా కి పరిమితం. ఇలాంటి వాటితో కమ్యూనిజానికి ముడి పెట్టి విమర్శించే పెట్టుబడిదారీ సమాజానిది ఎంత తప్పో, అదే నిజమన్నట్టు వాటిని సమర్ధింకునే ప్రయత్నం చేయడం కమ్మూనిస్టుల తప్పు. ఆ ఘటనలకు సమాధానం రష్యా చైనా లు చెప్పుకుంటాయి. వామపక్ష భావజాలం, దాని పర్యవనాల మీద విమర్శలకే సమాధానం చెప్పాలి తప్ప; వామ పక్ష వ్యక్తులు లేదా పాలకుల పైన వచ్చే ప్రతిదీ వామక్షం మీద విమర్శ కాదు, వాటికి సమాధానం చెప్పనవసరం లేదు.
LikeLike
హరి కృష్ణ గారూ మరోసారి నా అభిప్రాయం స్పష్టం చేస్తున్నాను. భావమిది,అర్ధమిది అని ఇతరులు అనని వాటిని వారికి ఆపాదించటం తగనిపని. వ్యాసం మీద అభిప్రాయం వెల్లడించే, విబేధించే, విమర్శ చేసే హక్కు మీకుంది. కానీ ఆ పరిధి దాటితే కొన్ని సమస్యలు వస్తాయని గమనించండి. చర్చ వేరు, రచయితలకు ఉద్దేశ్యాలను ఆపాదించటం వేరు.
”చైనా విప్లవం, మావో విజయాలను అనుభవించడమేతప్ప, గతకాలపు అగచాట్ల, పోరాటాల లోతు తెలియని యువతరంవారి ఆందోళన తియన్మెన్ స్క్వేర్ సంఘటనలు. పాశ్చాత్య పెట్టుబడిదారీవిధానపు బూర్జువాప్రజాస్వామ్యం బండారం తెలియని విద్యార్థులు వారు. ”
అన్నది రచయిత్రి అభిప్రాయం. మీరు ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు అది మీ స్వేచ్చ. కానీ అనుభవం లేదు, చరిత్ర, పోరాటాలు, బూర్జువా ప్రజాస్వామ్యం గురించి తెలియదు అంటే దానికి మీరు అవివేకులు అని భాష్యం చెబుతున్నారు. మన స్వాతంత్య్ర పోరాటం, త్యాగాలు, అనుభవాలు పూర్తిగా నేటి యువతరానికి తెలిసి లేదా అవగాహన ఉంటే కేంద్రంలో, రాష్ట్రాలలో మతశక్తులను ఎందుకు బలపరుస్తున్నట్లు ? గతంలో చేసింది తప్పు అని స్వాతంత్య్రానికి ముప్పు తెచ్చే శక్తులను సంపూర్ణ అవగాహనతో బలపరుస్తారని భావమా ?
ఒక విషయం తెలియకపోతే తెలియని తనమే తప్ప అవివేకం కాదు. చైనా విద్యార్ధులు అన్నీ తెలిసిన, అనుభవాలను కాచి వడపోసిన సమగ్ర తరం అని మీరు చెప్పదలచుకున్నారా ? సోవియట్ యూనియన్, తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేస్తుంటే జనం ప్రేక్షకపాత్ర వహించటం లేదా సమర్ధించారు. దాని అర్ధం సోషలిజం పనికిరాదనే సంపూర్ణ జ్ఞానవంతులైనట్లు భావించాలా ? ఆ పరిణామాల వెనుక కుట్రలేమీ లేవని చెబుతారా ?
స్వాతంత్య్ర పోరాటాలైనా, విప్లవ పోరాటాలైనా వాటి దశలను బట్టి అనుభవాలు, కర్తవ్యాలు ఉంటాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత గతం గురించి ఆలోచిస్తారా అనంతర పరిస్ధితి మీద కేంద్రీకరిస్తారా ? అలాగే చైనా విప్లవానికి ముందున్న పరిస్ధితి జయప్రదం అయిన తరువాత ఎలా ఉంటుంది. యువతీ యువకులు తుపాలు పట్టుకొని లాంగ్ మార్చ్‌లు చేయాల్సిన అవసరం లేదు కదా ? కొత్త కర్తవ్యాలు, కొత్త అనుభవాలు ఉంటాయి.
కొన్ని ప్రాంతాల్లోనే సోషలిస్టు శక్తులు అధికారంలో ఉన్నా లేక రాజకీయంగా బలంగా ఉన్నప్పటికీ అన్యవర్గ ధోరణులు వారి మీద నిరంతరం పడుతూ ఉంటాయి. దానికి చైనా విద్యార్ధులు అతీతులు అని చెబుతారా ? అలాంటి భావాలు పడినపుడు పాశ్యాత్య సంస్కృతి, పెట్టుబడిదారీ విధానం మీద భ్రమలకు లోనయ్యే అవకాశం ఉండదా ?
సోవియట్ యూనియన్, తూర్పు ఐరోపా రాజ్యాలను కూల్చి వేసి విజయం సాధించామని సామ్రాజ్యవాదులు చెప్పుకున్నప్పటికీ ప్రస్తుతం సామ్రాజ్యవాదం-సోషలిస్టు శక్తుల మధ్య వైరుధ్యమే ప్రధానంగా పని చేస్తున్నది. అందువలన సోషలిస్టు దేశాలకు, సిద్దాంతానికి వ్యతిరేకంగా నిరంతరం దాడి చేస్తున్నపుడు అంతర్జాతీయ భావజాలం కలిగిన సోషలిస్టు శక్తులు మౌనంగా ఉండటం లేదా తప్పుడు సమాచారాన్ని సమర్ధించటం ద్వారా సోషలిస్టు సిద్దాంతానికి మేలు చేస్తున్నట్లా కీడు చేస్తున్నట్లా ?
సాంస్కృతిక విప్లవం పేరుతో జరిగిన తప్పులను చైనా పార్టీయే స్వయంగా చెప్పింది. అదే పార్టీ తియన్మెన్ స్క్వేర్ ఉదంతం వెనుక ఉన్న కుట్ర, ప్రమాదాన్ని కూడా చెప్పింది, దాన్ని ఛేదించింది. అలాంటి కుట్రలను పసిగట్టటంలో సోవియట్, తూర్పు ఐరోపా రాజ్యాల పార్టీలు, ప్రభుత్వాలు కూడా విఫలమయ్యాయి. వ్యవస్ధలను పోగొట్టుకున్నాయి.
” తియన్మెన్ స్క్వేర్ కి కమ్యూనిజానికి ఎటువంటి సంబంధం లేదు, నిరాయుధాల మీద సైన్యాన్ని పంపండి అని కమ్యూనిజం చెప్పలేదు. ”
తియన్మెన్ స్క్కేర్ ఉదంతానికి కమ్యూనిజానికి సంబంధం లేదు అనటం ద్వారా మీరు అక్కడ జరిగిన కుట్రను చూసేందుకు నిరాకరిస్తున్నారు. నిరాయుధుల మీదకు సైన్యాన్ని పంపమని కమ్యూనిజం చెప్పలేదు, కానీ కమ్యూనిజానికే ముప్పు తెచ్చే కుట్ర జరుగుతున్నపుడు చూస్తూ ఊరుకోమని కూడా కమ్యూనిజం చెప్పలేదు. శ్రామికవర్గ ప్రయోజనాల రక్షణకు కమ్యూనిస్టులు పనిచేయాలి అంటే అర్ధం ఏమిటి ? అటువంటి వ్యవస్ధల నిర్మాణాన్ని అడ్డుకొనే శక్తులకు స్వేచ్చ ఇవ్వమని చెప్పటం కాదు కదా !
” అక్కడ జరిగిన తప్పు అయినా, ఒప్పు అయినా చైనా కి పరిమితం. ఇలాంటి వాటితో కమ్యూనిజానికి ముడి పెట్టి విమర్శించే పెట్టుబడిదారీ సమాజానిది ఎంత తప్పో, అదే నిజమన్నట్టు వాటిని సమర్ధించుకునే ప్రయత్నం చేయడం కమ్మూనిస్టుల తప్పు. ఆ ఘటనలకు సమాధానం రష్యా చైనా లు చెప్పుకుంటాయి. వామపక్ష భావజాలం, దాని పర్యవనాల మీద విమర్శలకే సమాధానం చెప్పాలి తప్ప వామ పక్ష వ్యక్తులు లేదా పాలకుల పైన వచ్చే ప్రతిదీ వామక్షం మీద విమర్శ కాదు, వాటికి సమాధానం చెప్పనవసరం లేదు.”
చైనా కమ్యూనిస్టు పార్టీలో నాటి ప్రధాన కార్యదర్శితో సహా కొందరు నాయకులు వామపక్ష భావజాలం ప్రాతిపదికన పరిణామాలను బేరీజు వేయలేదు కనుక, అలాంటి అనుభవాలు ఎక్కడైనా తలెత్తవచ్చు కనుక ప్రపంచ కమ్యూనిస్టులు వాటి మీద ఒక అభిప్రాయం ఏర్పరుచుకోకుండా, గుణపాఠాలను తీసుకోకుండా ఉండజాలరు. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో మాది చైనా మార్గం, సోవియట్ మార్గం అని చెప్పిన పార్టీలు ఉన్నాయి. మావోయే మా చైర్మన్ అన్న విపరీత పోకడలు పోయిన వారూ ఉన్నారు. వాటికి భిన్నంగా మాది మా స్వతంత్ర పంధా అని చెప్పిన పార్టీలూ ఉన్నాయి. ఒక దేశ పెట్టుబడిదారులు మరొక దేశాన్ని చూసి ఎలా పాఠాలు నేర్చుకుంటారో, కమ్యూనిస్టులకు ఆ సూత్రం ఎందుకు వర్తించదు ?
LikeLike
భావోద్వేగం లో విషయం చెప్పడం లో నేను కొంత పరిధి దాటిన మాట వాస్తవం, అదే సమస్య అయితే ఈ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను “చైనా విద్యార్థులు అవివేకులు, అనుభవం లేని వారు, ప్రాశ్చాత్యులకు బానిసలూ అనే విదంగా మీరు రాసారు”. వీటి స్థానం లో “విద్యార్థుల మీద వ్యక్తిగత విమర్శలు చేసారు, విషయం మీద కాకుండా” అని మార్చుకుంటున్నాను. ఆ విద్యార్థుల పరిజ్ఞానం మీద విశ్లేషణలు సమంజసమా? నేర్చుకునే దశలో ఉన్నారు కాబట్టే వారు విద్యార్థులు. చర్చ విద్యార్థులు పోరాడిన విషయాల మీద జరగాలి కానీ వారి మీద కాదు.
ప్రతి వ్యక్తి ఏదో ఒక ప్రభావంతో కొన్నిటిని నమ్ముతారు. ఆ నమ్మకం ఎందుకు తప్పు, లేదా ఎందుకు ఒప్పు అని విశ్లేషించాలి, కానీ కమ్యూనిస్ట్, కాపిటలిస్ట్, లిబరల్ భావజాలం ప్రభావం అని ఏదో ఒకటి పట్టుకుని కొట్టి పారేయటం సరైన పద్దతి కాదు.
కమ్యూనిజానికి దీనికి సంభందం లేదు అన్నపుడు నా ఉద్దేశం కమ్యూనిజం మీద కుట్ర జరగలేదని కాదు, వాటిని విశ్లేషించవద్దని కాదు. ఆ కుట్రని తిప్పికొట్టే ప్రయత్నం లో జరిగిన తప్పులు, పాలకుల తప్పులే తప్ప కమ్యూనిస్ట్ భావజాల పర్యవసానాలు కాదు అని చెప్పటం నా ఉద్దేశం.
వేరే దేశాల, సమాజాలని చూసి నేర్చికోవడం కచ్చితంగా తప్పు కాదు. నా వరకు అయితే ఇక్కడ ఆ విశ్లేషణ కంటే ఎక్కువ, ఒక దృష్టికోణాన్ని సమర్ధిచడానికే రాసినట్టు అనిపించింది తప్ప, నిజంగా ఆ సంఘటన తాలూకు విశ్లేషణలాగా అనిపించలేదు. ప్రాశ్చాత్యుల, విద్యార్థుల తప్పులు చెప్పే ప్రయత్నం బాగానే చేసారు, కానీ చైనా సైన్యం మరియు యుద్ధ ట్యాంకులని నిరాయుధుల మీదికి పంపవలిసిన అత్యవసరం ఏమిటి వంటి వాటిమీద కానీ, ఆ ఘటన లో చైనా పాలకుల తప్పుల మీద కానీ పెద్దగా ఏమి లేదు … బహుశా అది కేవలం నా ఒక్కడి ద్రుష్టికోణం కావొచ్చు!
మన మన పరిధుల వల్ల, మీరు నేను కొన్ని విషయాల్లో విభేదుంచుకుంటూ ఉండవచ్చు; కానీ మతత్వ శక్తులతో ఉన్న ప్రమాదాలతో పోలిస్తే ప్రస్తుతానికి మన విభేదాల వల్ల వచ్చే సమస్యలు చిన్నవి. మన విభేదాలే పెద్ద సమస్య అయ్యే రోజు కోసం వేచి చూస్తూ సెలవు.
LikeLike
హరికృష్ణ గారూ మీ అభిప్రాయాల ధోరణి చూస్తే భావోద్వేగం కంటే వేరే సమస్య ఉన్నట్లు భావిస్తున్నాను. గుమికూడారు. తియన్మెన్ మైదానంలో, ఇతర చోట్ల విద్యార్ధులు వేలాది మంది గుమికూడారు. మీరన్నట్లుగా వేళ్ల మీద లెక్కించదగిన సంఖ్య అయితే వ్యక్తిగత విమర్శలు అంటే అర్ధం ఉంది. వారు లేవెనెత్తిన అంశాల మీదనే చర్చ. అసలు వారేం లేవనెత్తారు, దాని నేపధ్యం ఏమిటి ? ఏ పేరుతో గుమి కూడటం ప్రారంభించి ఏ డిమాండ్లను ముందుకు తెచ్చారో మీరు ఒక్కసారి వెనక్కు తిరిగి అధ్యయనం చేయాలని మనవి. నేర్చుకొనే దశలో ఉన్న విద్యార్ధులు అని మీరే అన్నారు, వారు తప్పులు కూడా చేయవచ్చు, పొరపాటు అభిప్రాయాలు కలిగి ఉండవచ్చు. కమ్యూనిస్టులు కనుకనే దేశ నాయకత్వం వారి మధ్యకు వచ్చి చర్చలు జరిపింది. వారు లేదా వారి వెనుక ఉన్న వారు కమ్యూనిస్టు మౌలిక సూత్రాలకు విరుద్దంగా ఆలోచిస్తున్నారని పార్టీ నిర్ధారణకు వచ్చిన తరువాతనే చర్య తీసుకుంది. మీరు లేదా ఇతర విదేశీయులు ఆరోపించినట్లు వేలాది మందిని ఊచకోత కోయలేదు, యుద్ద టాంకులను వారి మీద ప్రయోగించలేదు. నమ్మటమా లేదా అనేది మీ ఇష్టం.
” ప్రతి వ్యక్తి ఏదో ఒక ప్రభావంతో కొన్నిటిని నమ్ముతారు. ఆ నమ్మకం ఎందుకు తప్పు, లేదా ఎందుకు ఒప్పు అని విశ్లేషించాలి, కానీ కమ్యూనిస్ట్, కాపిటలిస్ట్, లిబరల్ భావజాలం ప్రభావం అని ఏదో ఒకటి పట్టుకుని కొట్టి పారేయటం సరైన పద్దతి కాదు.”
మీరు చెప్పిన ప్రభావం అనేది గాల్లోంచి రాదు. భౌతిక పరిస్ధితుల మీద ఆధారపడే వస్తుంది. తియన్మెన్ స్క్వేర్ ఉదంతాలకు మూడు సంవత్సరాల ముందే, ఒక ప్రొఫెసర్ కమ్యూనిస్టు సిద్దాంతం, ఆచరణకు భిన్నంగా చేసిన ప్రసంగాలు చైనాలో పెద్ద ఎత్తున ప్రాచుర్యం పొందాయి. వాటిని కమ్యూనిస్టు ప్రధాన కార్యదర్శిగా ఉన్న హు యావో బాంగ్ ఉపేక్షించటం లేదా పరోక్షంగా ప్రోత్సహించారు. వాటిని పట్టుకొని విద్యార్ధులు కొందరు 1986లోనే దేశంలో ప్రదర్శనలు చేశారు.1989 ఏప్రిల్ 15న హు మరణించారు. ఆయనకు సంతాపం తెలిపే పేరుతో మరోసారి విద్యార్ధులు సమావేశాలు జరిపి, వాటి కొనసాగింపుగా సంస్కరణల పేరుతో ఆందోళనకు దిగారు. వారి మీద ఉన్న ప్రభావం అదే, అది సరైంది కాదు, సోషలిస్టు వ్యవస్ధకు వ్యతిరేకం అని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం భావించింది. సోవియట్‌లో గ్లాస్‌నోస్త్ పేరుతో గోర్బచెవ్ అనుసరించిన వైఖరి చివరికి దేనికి దారితీసిందో చూశాము. దాన్ని అక్కడి పార్టీ నాయకత్వం విమర్శనాత్మకంగా చూడలేకపోయింది.
కుట్రను తిప్పికొట్టే క్రమంలో తప్పులు అని మీరు అనటం అక్కడ జరిగినట్లు చెబుతున్న ఊచకోత వాస్తవం అని నమ్మిన పర్యవసానమే. ప్రచార దాడికి గురైన అనేక మందిలో మీరూ ఒకరుగా ఉన్నారు. ఇప్పుడు కరోనా వైరస్‌ను చైనాయే సృష్టించింది అన్నది ఒక ప్రచారమైతే, కొంత మంది ముందుకు పోయి చైనా వారు కావాలని చేయలేదు గానీ ప్రయోగాల సమయంలో ప్రమాదవశాత్తూ బయటికి వచ్చిందని తమకు తామే నిర్ధారిస్తున్నారు. నమ్మించే ప్రచార ఎత్తుగడల్లో తేడా తప్ప రెండూ ఒకటే.
” నా వరకు అయితే ఇక్కడ ఆ విశ్లేషణ కంటే ఎక్కువ, ఒక ద ష్టికోణాన్ని సమర్ధిచడానికే రాసినట్టు అనిపించింది తప్ప, నిజంగా ఆ సంఘటన తాలూకు విశ్లేషణలాగా అనిపించలేదు.”
కచ్చితంగా చైనా కమ్యూనిస్టు పార్టీ తియన్మెన్ ఉదంతం గురించి చెప్పినదాన్ని సమర్ధిస్తూ రాసిన వ్యాసమే అది. పుస్తక రచయిత అక్కడ జరిగిన వాటి గురించి రాసిన సమీక్ష. విశ్లేషణ అంటే అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లు ఉండాలనా ? మొండికేసిన విద్యార్ధులను బయటకు పంపటానికి చేయాల్సిందంతా చేశారు. విద్యార్ధులకు ఎదురుగా సైనికులు ఎలా కూర్చున్నారో కావాలంటే మీరు అనాటి చిత్రాలను చూడవచ్చు. ప్రపంచంలో ఎక్కడా అలా జరగదు. ఆశాభంగం చెందిన విద్యార్ధులు సైనికుల మీద దాడి చేశారు, కొంత మందిని చంపివేశారు. తరువాత స్వల్ప బలప్రయోగం జరిగింది తప్ప ఊచకోతేమీ లేవు. అక్కడ జరిగింది సోషలిస్టు వ్యవస్ధ కోసం తప్ప కొద్ది మంది పెట్టుబడిదారుల కోసం కాదు.
” మతత్వ శక్తులతో ఉన్న ప్రమాదాలతో పోలిస్తే ప్రస్తుతానికి మన విభేదాల వల్ల వచ్చే సమస్యలు చిన్నవి. మన విభేదాలే పెద్ద సమస్య అయ్యే రోజు కోసం వేచి చూస్తూ సెలవు.”
ఇది చాలా చిత్రంగా ఉంది, విబేధాలను పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద సమస్య అయ్యే రోజు కోసం ఎదురు చూస్తానంటున్నారు. అదే జరిగితే మీరో నేనో దోపిడీ, మతశక్తులకు తెలిసో తెలియకో దగ్గర అవుతాం. నేనయితే అలాంటి రోజు కోసం ఎదురు చూడను, సెలవు.
LikeLike
నా వైపు వాదనలు ముగించాలి అనుకున్నప్పటికీ ఒక వివరణ ఇవ్వడానికే ఇది: “…మన విభేదాలే పెద్ద సమస్య అయ్యే రోజు కోసం వేచి చూస్తూ సెలవు” ఇక్కడ నా ఉద్దేశం మతతత్వ శక్తులు పూర్తిగా అంతం అయ్యి, మన వామ పక్షాల మధ్య ఉన్న సైద్ధంతిక విభేదాలే దేశంలో అతి పెద్ద సమస్యగా ఉండే రోజు కోసం మనం వేచిచూద్దాం, మరల మన వాదనలు అప్పుడు మొదలుపెడదాం అని. దయచేసి తప్పుగా అర్ధం చేసుకోకండి. వామపక్ష వాదులు మతతత్వం లోకి వెళ్లారు అంటే నా ఉద్దేశంలో వారి హృదయం, శరీరం కంటే ముందే చనిపోయిందని.. ఆ రోజు మనకి రాదనీ, రాకూడదని ఆకాంక్షిస్తున్నాను.
LikeLiked by 1 person