ఎం కోటేశ్వరరావు
అమెరికన్లు ఇప్పుడు అసహనంతో ఉన్నారు . ప్రపంచంలో తిరుగులేని శక్తి అన్న భావన క్రమంగా తగ్గిపోతోంది. దాని అర్దం అది బలహీనపడిందని కాదు. తమ పెద్దన్న పెత్తనాన్ని ప్రతి చిన్న దేశమూ సవాలు చేస్తోంది. అందువలన చైనాను దెబ్బతీసి మిగతా దేశాలను భయపెట్టాలని చూస్తోందా ? అందుకుగాను చేయబోయే తదుపరి యుద్దం చైనాతోనా ? దానికి అనుగుణ్యంగానే పావులు కదుపుతున్నారా ? రెండవ ప్రపంచ యుద్దరంగం ఐరోపా అయితే మూడవ యుద్దం ఆసియా కేంద్రంగా జరగనుందా ? ఐరోపాతో మొదలు పెట్టి ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలని చూసిన హిట్లర్ రెండవ యుద్దానికి కారకుడు. ప్రపంచం మీద తమ పట్టు జారిపోతోందని భావిస్తున్న అమెరికా తెగింపు మూడవ యుద్దానికి దారి తీస్తుందా ? ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలుగానే ఇప్పుడు కనిపించవచ్చుగానీ పరిణామాలన్నీ వీటి చుట్టూనే తిరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే నిజంగానే యుద్దం జరుగుతుందా? సామ్రాజ్యవాద కార్పొరేట్‌ల లాభాల కోసం వాటి చౌకీదార్లుగా ఉండే పాలకులు ఎంతకైనా తెగిస్తారన్నది గత అనుభవం. ఇప్పుడు యుద్దం లాభమా ? ఆ వాతావరణం సృష్టించి మార్కెట్ వాటాను దక్కించుకోవటం ముఖ్యమా అన్న మధనం జరుగుతోంది !
మరోవైపు తమ జోలికి వస్తే తాట తీస్తాం అన్నట్లుగా చైనా తన వ్యతిరేకులకు సందేశాలు పంపుతోంది.సోమవారం నుంచి శుక్రవారం వరకు(9 నుంచి 13వ తేదీ) చైనాలో జరిపే రష్యాతో కలసి జరిపే సంయుక్త మిలిటరీ విన్యాసాలు అమెరికా, దాని మిత్రదేశాలకు ఒక హెచ్చరికగా భావించవచ్చు. మరొక దేశంతో జరిపే విన్యాసాలకు తొలిసారిగా చైనా జె-20 యుద్ద విమానాలను తరలించటం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా అంబుల పొదిలో ఇవి కీలకంగా ఉన్నాయి. సైనిక విన్యాసాలు చైనా వాయువ్య మూలలోని నింగ్జియా హుయి రాష్ట్రంలోని సైనిక శిక్షణ కేంద్రంలో జరుగుతున్నాయి. యుద్ద విమానాలతో పాటు బడా రవాణా విమానాలు, ఇతర ఆధునిక ఆయుధాలను కూడా ప్రదర్శించనున్నారు. రష్యా నుంచి ఎస్‌యు-30 ఫైటర్ జెట్‌లు గతనెలలోనే ఇక్కడకు చేరుకున్నాయి. ఉభయదేశాల నిపుణులు, సిబ్బంది ఆయుధాల ప్రయోగం, మెళకువలను తెలుసుకుంటారు. యుద్ధ రంగంలో ఎలా వ్యవహరిస్తారో అదేమాదిరి ఇక్కడ ఆయుధాలను ప్రయోగించి ప్రదర్శనలు నిర్వహిస్తారు. పదివేల మంది మిలిటరీ సిబ్బంది దీనిలో పాల్గొంటారు. ఈ చర్య ద్వారా రెండు దేశాల మధ్య ఉన్న పరస్పర విశ్వాసం, సవాళ్లను ఎదుర్కోవాలనే సంకల్పం ఉన్నత స్ధాయికి చేరినట్లు ప్రదర్శితం అవుతుందని భావిస్తున్నారు. సముద్ర మట్టానికి రెండువేల మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో వివిధ విభాగాల సంక్లిష్టమైన సైనిక విన్యాసాలకు, శిక్షణకు అనువుగా ఉంటుంది. గత ఏడాది రష్యాలోని కవకాజ్ ప్రాంతంలో సైనిక విన్యాసాలు జరిగాయి. వాటిలో రష్యా తన ఆధునిక ట్యాంకులు, క్షిపణులు, ఇతర ఆధునిక ఆయుధాలను ప్రదర్శించింది.
ప్రపంచ పరిణామాలను గమనిస్తున్న వారు అనేక కోణాలను ఆవిష్కరిస్తున్నారు. వాటిని వేటిని కొట్టిపారవేయలేము, అలాగని యథాతధంగా స్వీకరించలేము. ఆసియా కీలకం లేదా ఇరుసు అన్న సామ్రాజ్యవాదుల పధకం ఎప్పుడో ప్రారంభమైంది. అధికారంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరున్నా కొనసాగుతోంది. దానిలో భాగంగానే చైనా చుట్టూ వందలాది సైనిక స్ధావరాలను అమెరికా ఏర్పాటు చేస్తోంది. మూడింట రెండువంతుల నౌకా, వైమానిక దళాలను ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి తరలిస్తోంది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఇంత పెద్ద మిలిటరీ కేంద్రీకరణ లేదు.ఇరవై ఒకటవ శతాబ్దివిజయాన్ని స్వంతం చేసుకొనేందుకు చైనాతో పోటీ పడుతున్నామని జోబైడెన్ పార్లమెంట్ తొలి ప్రసంగంలోనే చెప్పాడు.ఐరోపాలో నాటోతో ఎలా చేస్తున్నామో ఆసియాలో కూడా ఇండో-పసిఫిక్ అలాంటిదే అని కూడా దాచుకోకుండా చెప్పాడు. చైనాను బూచిగా చూపి మిలిటరీ ఖర్చును విపరీతంగా పెంచివేస్తున్నారు. ప్రచ్చన్న యుద్దంలో విజయం సాధించామని చెప్పుకున్న అమెరికా మూడు దశాబ్దాల తరువాత అనేక ప్రశ్నలకు జవాబులు చెప్పలేని స్ధితిలో పడిపోయింది.
దక్షిణ, తూర్పు చైనా సముద్రాలలో ఇటీవలి కాలంలో అమెరికా యుద్ద నౌకలు పదే పదే సంచరిస్తున్నాయి. చైనాను రెచ్చగొట్టటం ఒకటైతే, ఆ ప్రాంత అనుపానులు-చైనా కదలికల మీద కన్నువేయటం రెండవది, చూశారా చైనా సమీపంలోకి మేము వచ్చాం అని పరిసర ప్రాంతదేశాలలో విశ్వాసం కలిగించే లక్ష్యం వంటివి ఉన్నాయి. అమెరికా ఒక్కటే కాదు, మేము సైతం యుద్ద అగ్నికి అన్నట్లుగా ఈ ప్రాంతంలో రెండు యుద్ద నౌకలను శాశ్వతంగా ఉంచుతామని జపాన్‌తో కలసి బ్రిటన్ ప్రకటించింది.ప్రస్తుతం మిలిటరీ కూటమి కాదని చెబుతున్నప్పటికీ అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌తో కూడిన చతుష్టయ కూటమిని ఆసియా నాటోగా మార్చాలన్న ఎత్తుగడ ఉంది. తైవాన్ విలీనానికి చైనా బలప్రయోగం చేయనున్నదనే ప్రచారం వెనుక కూడా తమ మిలిటరీ చర్యలను సమర్దించుకొనేందుకే అన్నది స్పష్టం. తైవాన్ రక్షణకు తాము, అమెరికా ఉమ్మడిగా వ్యవహరిస్తామని జపాన్ ఉప ప్రధాని తారో అసో చెప్పాడు. తైవాన్ సమీపంలోని ఒకినావా, ఇతర జపాన్ దీవుల్లో 50వేల మంది సైనికులతో అమెరికా అనేక స్దావరాలను నిర్వహిస్తున్నది. అమెరికాలోని ఇండో-పసిఫిక్ వ్యవహారాల అధిపతి కర్ట్ కాంప్‌బెల్ మాట్లాడుతూ తొలిసారిగా తమ వ్యూహాత్మక, ఆర్ధిక ప్రయోజనాలు, మిలిటరీ కేంద్రీకరణను ఇండో-పసిఫిక్ ప్రాంతానికి మళ్లిస్తున్నామని వెల్లడించాడు. ఒబామా హయాంలో పన్నెండు సార్లు యుద్ద నావలను తైవాన్ జలసంధివైపు నడిపిస్తే ట్రంప్ 13సార్లతో ఆ రికార్డును తిరగరాశాడు. బైడెన్ ఆరునెలల్లోనే ఏడుసార్లు నడిపి సరికొత్త రికార్డు దిశగా పయనిస్తున్నాడు.
తన ఉపగ్రహం లేదా తొత్తు దేశమైన ఇజ్రాయెల్ ప్రభుత్వ కనుసన్నలలో నడిచే పెగాసస్ నిఘా, చొరబాటు గురించి అమెరికా ఇంతవరకు స్పందించలేదు, అనధికారికంగా జర్నలిస్టుల మీద నిఘావేయటాన్ని ఖండిస్తున్నామని మాత్రమే వ్యాఖ్యానించింది.కానీ అదే అమెరికా గతంలో రష్యా మీద, ఇప్పుడు చైనా మీద రుజువు కాని ఆరోపణలతో ఆంక్షలకు తెగబడుతోంది. తమ దేశ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు జోక్యం చేసుకున్నట్లు, మైక్రోసాఫ్ట్ సర్వర్‌ను దెబ్బకొట్టేందుకు, సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. ఇప్పుడు పెగాసెస్ మీద మౌనం ఎందుకు ? చైనాకు వ్యతిరేకంగా సెంటర్ ఫర్ ఏ న్యూ అమెరికన్ సెక్యూరిటీ(సిఎన్‌ఏఎస్) పేరుతో ఆసియా ఇరుసు పధకాన్ని రూపొందించిన కాంప్‌బెల్, యుద్ద నేరగాడు మైఖేల్ ఫ్లోర్‌నోరు ఏర్పాటు చేసిన సంస్ధకు పెద్ద మొత్తంలు మైక్రోసాఫ్ట్ నిధులు ఇచ్చింది. యుద్దమంటూ వస్తే 72 గంటల్లో యావత్ చైనా పౌర, మిలిటరీ నౌకలను నాశనం చేసేందుకు అవసరమైన సామర్ధ్యాన్ని పెంటగన్‌కు సమకూర్చటమే తమ లక్ష్యమని బహిరంగంగానే చెప్పాడు.ఈ సంస్ద, దానితో సంబంధాలు ఉన్న అనేక మంది ఇప్పుడు బైడెన్ యంత్రాంగంలో తిష్టవేశారు.ఈ సంస్ధకు అమెరికా విదేశాంగశాఖ,తైవాన్ ప్రభుత్వం, నార్త్‌రాప్ గ్రుమన్, లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, కామ్‌కాస్ట్, ఎక్సాన్, మాస్టర్‌కార్డ్, అమెరికాలోని జపాన్ రాయబార కార్యాలయం, సిటీగ్రూప్, ఫేస్‌బుక్, గూగుల్, రేథియాన్, జార్జిటౌన్ యూనివర్సిటీ వంటి సంస్దలు పెద్ద మొత్తాలలో నిధులు అందచేస్తున్నాయి. ఇలాంటి సంస్ధలు ఒక్క చైనాకే వ్యతిరేకం అనుకుంటే పొరపాటు, అనేక దేశాలలో అమెరికన్,మిలిటరీ, కార్పొరేట్లకు, ఇజ్రాయెల్, సౌదీ అరేబియావంటి దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తాయి. రష్యాకు వ్యతిరేకంగా 2014లో దాని ముంగిట ఉన్న ఉక్రెయిన్‌లో నయా నాజీలను అధికారంలో కూర్చోబెట్టాయి.ఇలా అనేక దేశాల్లో వ్యవహరిస్తున్నాయి.
ప్రపంచంలో ప్రతివారి నుంచి తమకు ప్రమాదం ఉందనే ప్రచారంతో అమెరికన్లను మభ్యపెట్టి ఆ దేశ పాలకులు 70దేశాలలో 800వందల సైనిక స్దావరాలు, కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రపంచాన్ని తమ గుప్పిట పెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖండాంతర క్షిపణులు, మధ్యశ్రేణి అణ్వాయుధాల పరిమితి ఒప్పందం, గగనతలాన్ని స్వేచ్చగా ఉంచాలనే ఒప్పందాల నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగింది.ఇది ఆయుధ పోటీకి దారితీస్తోంది. రెండువేల సంవత్సరం వరకు అమెరికా తన సేనలను ప్రధానంగా జర్మనీ, ఉత్తర ఆఫ్రికా దేశాలు, మధ్యప్రాచ్యం, దక్షిణ ఆసియాలో అధికంగా మోహరించింది.2011 సెప్టెంబరులో న్యూయార్క్ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడి తరువాత మధ్యప్రాచ్యంలో కేంద్రీకరించారు. ఒక దశలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లో లక్ష మంది చొప్పున అమెరికన్ సైనికులు ఉన్నారు. తరువాత తూర్పు ఆసియాలో మోహరించారు.
సోవియట్ యూనియన్ను కూల్చివేసిన తరువాత స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించిన రిపబ్లిక్‌లు మిలిటరీల్లో 50శాతం వరకు తగ్గించాయి. ఇదే సమయంలో ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, మన దేశం 40,30,15శాతం చొప్పున మిలిటరీని, బడ్జెట్లను పెంచాయి.జిడిపిలో ఒకశాతం లోపుగానే ఖర్చు చేయాలని స్వయంగా విధించుకున్న నిబంధనను జపాన్ పక్కన పెట్టింది.తనను చక్రబంధంలో బిగించేందుకు అమెరికా పూనుకున్నదని అర్ధం చేసుకున్న చైనా తన బలగాలను గణనీయంగా పెంచుకుంటున్నది. వాటికి సంబంధించి అంచనాలే తప్ప నిర్ధిష్ట సమాచారం బయటికి తెలియదు.1995లో కేవలం 50 స్వల్ప శ్రేణి ఖండాంతర క్షిపణులు కలిగి ఉన్న చైనా 2019లో 750 నుంచి 1500వరకు, 950 మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణులు సమకూర్చుకున్నట్ల్లు వార్తలు వచ్చాయి.
రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికన్లు చేసిన ప్రతి యుద్దంలోనూ, ప్రతి చిన్న దేశం చేతిలోనూ ఓడిపోయారు. అలాంటిది చైనాతో పెట్టుకొని నెగ్గుకు రావటం అన్నది కలలో మాట.మొదటి ప్రపంచ యుద్దంలో ఓటమి, విజేతలు రుద్దిన ఒప్పందాలు జర్మన్ కార్పొరేట్ల అవకాశాలను దెబ్బతీసిన పరిస్ధితి, దాన్ని అవకాశంగా తీసుకొని హిట్లర్ మాదిరి జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టాల్సిన అవసరం చైనాకు లేదు. తన ప్రయోజనాల రక్షణకు వెనుకడుగువేసే అవకాశమూ లేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా తప్పుకున్నప్పటికీ పశ్చిమ, మధ్య ఆసియాలో తన ప్రయోజనాల కోసం మరొక చోట దుకాణం తెరిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అది ఆ ప్రాంత దేశాలతో పాటు రష్యా, చైనాలకు ముప్పుతెచ్చే పరిణామం అవుతుంది.