ఎం కోటేశ్వరరావు
” భారత్‌కు రూపాయి విలువ పతనం పెద్ద తలనొప్పిగా మారింది ” అన్నది తాజాగా ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక. దానిలోని అంశాలతో ఏకీభవించటమా లేదా అన్నది వేరే అంశం.దేశానికిఅంటే జనానికి తలనొప్పిగా మారింది మన కరెన్సీ పతనమా ? అది జరుగుతుంటే గుడ్లప్పగించి చూస్తున్న లేదా కావాలని వదలి వేసిన పాలకులా ? ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన అంశం. మన్మోహన్ సింగ్ గారు ఏలుబడిలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అన్నది వదిలేద్దాం. ఆరోజులు గతించాయి. తనకు ఎలాంటి హానీమూన్(కుదురుకొనేందుకు అవసరమైన వ్యవధి) అవసరం లేదు అనిచెప్పిన నరేంద్రమోడీ మూడున్నర సంవత్సరాల ఏలుబడి తరువాత 2018 జనవరి ఒకటిన ఒక డాలరుకు రు.63.85గా ఉన్నది 2022 డిసెంబరు 31న రు.74.50కి దిగజారింది, 16.68శాతం పతనమైంది.2011 నుంచి చూస్తే రు.45.40 నుంచి 64శాతం దిగజారింది. తాము అధికారానికి వస్తే ఆ స్ధాయిలో నిలబెడతామని అచ్చే దిన్ ఆశల్లో భాగంగా మోడీ చెప్పారు.ఇన్నేండ్ల తరువాత ఎక్కడకు తీసుకుపోతారో తెలియని స్ధితిలో ఉన్నారు.
కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు రూపాయి విలువ పడిపోవటానికి ప్రధాన కారణాల్లో చమురు ఒకటి. ఏటేటా చమురు వినియోగం పెరుగుతున్నందున దిగుమతులు కూడా పెరుగుతున్నాయి. అందుకు డాలర్లు అవసరం కనుక మన కరెన్సీ విలువ పడిపోతున్నది. నరేంద్రమోడీ సర్కార్ అధికారానికి రాకముందు కేంద్ర చమురుశాఖ మంత్రిగా ఉన్న మణిశంకర అయ్యర్ చెప్పినదాని ప్రకారం దేశంలో 225బిలియన్ పీపాల చమురు నిల్వలున్నాయి. దాన్ని వెలికితీస్తే మన దిగుమతుల బిల్లు గణనీయంగా తగ్గుతుంది. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అంటారు కదా ! మోడీ సర్కార్ అధికారానికి వచ్చినపుడు 2013-14లో 37,788వేల మెట్రిక్ టన్నులు(టిఎంటి) ఉత్పత్తి జరిగితే క్రమంగా తగ్గుతూ 2019-20నాటికి పద్దెనిమిది సంవత్సరాల కనిష్టానికి 32,173 టిఎంటికి, మరుసటి ఏడాది 30,500కు పడిపోయింది. ఈ వైఫల్యానికి కూడా నెహ్రూ కారణమని చెబుతారా ? ఏమో వినే జనాలుంటే ఏమైనా వినిపించగల చతురులు కదా ! దేశీయ ఉత్పత్తి ఎందుకు తగ్గిపోతోందో మన్‌కీ బాత్‌లో ఐనా చెప్పగలరా ?
ఆర్ధికవేత్తలు చెబుతున్న మరొక కారణం, దేశంలో వడ్డీ రేట్లు తక్కువగా కారణంగా విదేశీమదుపుదార్లకు ఆకర్షణీయంగా లేకపోవటమట. అంటే మన కరెన్సీ గిరాకీ తగ్గితే పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు తగ్గుతాయి. రిజర్వుబాంకు ద్రవ్యవిధానం మీద కేంద్రీకరిస్తే జనాల చేతుల్లోకి నగదు వస్తుందని, దాని బదులు ద్రవ్యపరమైన ఉద్దీపనలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కొందరు విమర్శిస్తున్నారు. ఒమైక్రాన్ విస్తరిస్తున్న కారణంగా ప్రపంచంలో మరోమారు డాలరుకు ప్రాధాన్యత ఏర్పడుతున్నదని, దీంతో రూపాయి డిమాండ్ ఇంకా తగ్గుతుందన్నది తర్కం. గత ఎనిమిది సంవత్సరాల తీరు తెన్నులను చూసినపుడు దిగుమతులు పెరగటం తప్ప ఎగుమతులు పరిమితంగానే ఉన్నందున రెండు పర్యవసానాలు కలుగుతున్నాయి. ఒకటి మన విదేశీమారక ద్రవ్యనిల్వలపై నిరంతర వత్తిడి, మన సంపద లాభాల రూపంలో విదేశాలకు తరలుతున్నది. రూపాయి విలువ పడిపోతున్నందున మన వినియోగదారులమీద భారం పెరుగుతున్నది.అది జీవన ప్రమాణాలు, జీవన నాణ్యతను దెబ్బతీస్తున్నది.మన వాణిజ్యలోటు ఏడాది క్రితంతో పోల్చితే రెట్టింపైంది.చమురుపై పన్నుల భారం పెంపుదల, ఆహార వస్తువుల ధరల పెరుగుదల, వీటి వలన అదుపులేని ద్రవ్యోల్బణం తలెత్తుతుంది.
2021ఏప్రిల్‌లో రికార్డు స్ధాయిలో రూపాయి విలువ రు.76.91కి దిగజారింది. రిజర్వుబాంకు తీసుకున్న చర్యలతో ప్రస్తుతం రు.74-75 మధ్య కదలాడుతున్నది.2022లో అమెరికా, ఇతర దేశాల కరెన్సీ విధానాలతో రూపాయి ఏ విధంగా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది. ఈ ఏడాది అమెరికాలో మూడు సార్లు వడ్డీ రేటు పెంచవచ్చన్న వార్తలు వచ్చాయి. ఇది మన వంటి దేశాలకు చెడువార్త. మన దేశ ద్రవ్యమార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారంతా వెనక్కు తీసుకొని అమెరికాకు తరలిస్తారు. బాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేటు పెంచటంతో ఎఫ్‌పిఐలు డిసెంబరులో రు.17,147 కోట్లు స్టాక్‌మార్కెట్ల నుంచి, రు.12,280 కోట్లు బాండ్ల నుంచి వెనక్కు తీసుకున్నాయి. గతేడాది చివరి మూడు నెలల్లో స్టాక్ మార్కెట్ నుంచి రు.36,642 కోట్లు వెనక్కు పోయాయి.2021 సెప్టెంబరు-డిసెంబరు మాసాల్లో మన కరెన్సీ 2.2శాతం పతనం కావటంతో స్టాక్‌మార్కెట్ నుంచి నాలుగు బిలియన్ డాలర్లను విదేశీ నిధి సంస్ధలు వెనక్కు తీసుకున్నాయి. 2019 తరువాత అధికంగా వాణిజ్యలోటు ఈ ఏడాది(2022 మార్చి నాటికి) 200 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా. ఇది గతేడాదితో పోలిస్తే రెట్టింపు. ఇప్పుడున్న తీరు ప్రకారం మన దిగుమతులు, ఎగుమతులు కొనసాగితే మన దగ్గర ఉన్న విదేశీమారక ద్రవ్యనిల్వలు 15.8 నెలలకు సరిపోతాయి. వాటిలో ఏమాత్రం తేడాలు వచ్చినా అంటే ఎగుమతులు తగ్గినా, దిగుమతులు పెరిగినా ఇబ్బందే.
ధనికదేశాల్లో వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. మన జనానికి, ఆర్ధిక రంగానికి కరోనా సోకినా స్టాక్ మార్కెట్‌కు అంటలేదు. మరింతగా పెరిగింది. ఆత్మనిర్భరత, పన్నుల తగ్గింపు, ఇతర ప్రభుత్వ(ప్రజల)రాయితీల కారణంగా ఈ కాలంలో సెన్సెక్స్ పెరిగిందే తప్ప తగ్గలేదు. అందుకే విదేశాల నుంచి మదుపుదార్లు పెద్ద మొత్తంలో కంపెనీల వాటాలను కొనుగోలు చేసి లాభాల రూపంలో తరలించుకుపోతున్నారు. మనకు వచ్చే విదేశీ మారక ద్రవ్యం మన ఎగుమతులు, ప్రవాసులు పంపిన మొత్తాలు, విదేశీ రుణాలు, స్టాక్‌మార్కెట్లో పెట్టుబడుల ద్వారా సమకూరుతోంది. అనేక కంపెనీలు విదేశాల నుంచి తక్కువ వడ్డీలకు రుణాలు తీసుకున్నాయి.మన విదేశీ రుణభారంలో 37.4శాతం ఇవే. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే ఈ రుణాలు తీసుకున్నవారు వెంటనే చెల్లింపులకు పూనుకుంటే మన దగ్గర డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది.
2021లో 2.5శాతం దిగజారిన రూపాయి అదే తీరులో కొనసాగి 2022లో సగటున రు.76వద్ద, 2023లో 78 వద్ద ఉంటుందని ఫిచ్ రేటింగ్ సంస్ధ జోశ్యం చెప్పింది.వాలెట్ ఇన్వెస్టర్ అనే సంస్ధ అంచనా ప్రకారం 2022 డిసెంబరు నాటికి మన రూపాయి మారకం రేటు రు.77.7207 నుంచి 77.539 గరిష్ట, కనిష్ట ధరగా ఉంటుందని అంచనా వేసింది. పతనం కొనసాగితే ఎగమతులు పెరుగుతాయని ఆర్ధికవేత్తలు చెబుతారు. ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందనట్లుగా కరెన్సీపతనం జన జీవితాలను అతలాకుతలం చేస్తుంది.ఇప్పుడు ఒక డాలరును కొనుక్కోవాలంటే రు.75 చెల్లించాలి అనుకుంటే, అదే 2023నాటికి రు.78 సమర్పించుకోవాలి. అదే అచ్చేదిన్ ప్రచారంలో నరేంద్రమోడీ గారు వాగ్దానం చేసినట్లు రూపాయి విలువను తాను అధికారంలోకి వచ్చినప్పటికీ స్ధాయి రు.58కైనా పెంచితే మనం జేబుల నుంచి కొల్లగొడుతున్న పెట్రోలు, డీజిలు బిల్లు గణనీయంగా తగ్గుతుంది.
2020 డిసెంబరు 11 నాటికి విదేశీమారక ద్రవ్యం 578.57బి.డాలర్లు ఉంది, అది 2021డిసెంబరు 10 నాటికి 635.83బి.డాలర్లకు పెరిగింది. ఇది 2020 మార్చి నుంచి 2021నవంబరు వరకు 72-75 మధ్యరూపాయి విలువ ఉండేందుకు తోడ్పడింది. అమెరికా, ఇతర ధనిక దేశాల నుంచి మన దేశానికి డాలర్లు,పౌండ్లు, ఎందుకు వస్తున్నట్లు ? 2020 మార్చి 15న అమెరికన్ ఫెడరల్ రిజర్వు(మన రిజర్వుబాంకు వంటిది) వడ్డీ రేటు 0 నుంచి 0.25శాతం ఉంటుందని పేర్కొన్నది. మన దేశంలో అంతకంటే ఎక్కువే ఉన్నందున మన కరెన్సీ విలువ తగ్గినా మదుపుదార్లకు లాభమే కనుక స్టాక్‌మార్కెట్లో, ఇతరంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఏడాది ఈ వడ్డీ పెరుగుతుందనే సంకేతాలు వెలువడినందున అలా పెట్టుబడులు పెట్టిన వారు కొందరు వెనక్కు తీసుకుంటున్నారు.
2022లో మూడు సార్లు వడ్డీ రేటు పెంచితే ప్రస్తుతం ఉన్న 0.1 నుంచి 0.6 నుంచి 0.9శాతం వరకు అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయని అంచనా, అదే జరిగితే మన మార్కెట్ నుంచి మరిన్ని డాలర్లు తరలిపోతాయి. అందుకే మనల్ని అమెరికా ఆయుధాలతో దెబ్బతీయనవసరం లేదు వడ్డీ రేట్లతోనే ఆ పని చేయగలదు అని చెప్పాల్సి వస్తోంది.’ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి పతనం కేవలం పాలకుల అవినీతి వల్లనే. అది పారిశ్రామిక ప్రగతి, ఎగుమతి, దిగుమతులపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తోంది ‘ అన్నవి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గారి నోటి నుంచి వెలువడిన సుభాషితాలు. భటిండా విమానాశ్రయానికి ప్రాణాలతో తిరిగి వచ్చాను, అందుకు గాను మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియ చేయండి అని తాజాగా ప్రధాని నరేంద్రమోడీ పంజాబ్ అధికారులతో అన్న అంశం, దాని గురించి రాష్ట్రపతికి వివరించిన అంశం తెలిసిందే.దేశాన్ని రక్షించే చేతులని చెబుతున్న ప్రధాని మోడీ అమెరికా వడ్డీ రేటు దాడి నుంచి యావత్ దేశాన్ని రక్షించగలరా ?