Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కేరళలో ఈనెల 26న జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో సాధించిన విజయం కొనసాగింపుగా పైచేయి సాధించాలని సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ చూస్తుండగా 2019 పార్లమెంటు ఎన్నికలలో వచ్చిన సీట్లను నిలుపుకోవాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌ కూటమి ప్రయత్నిస్తోంది. ఏదో ఒక సీటు సాధించి రాష్ట్రంలో తమకూ స్థానం ఉందని పరువు నిలుపుకొనేందుకు బిజెపి చూస్తోంది. జనసంఘం తరువాత బిజెపిగా ఉన్న పార్టీకి గతంలో ఒకసారి ఒక అసెంబ్లీ స్థానం రావటం తప్ప కేరళ నుంచి పార్లమెంటులో ప్రాతినిధ్యం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభ ద్వారా కేరళ బిజెపి నేతలు ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఒక స్థానాన్ని కూడా కోల్పోయింది. ఈ ఎన్నికలలో అనూహ్యంగా కేరళ స్టోరీ పేరుతో వచ్చిన ఒక సినిమాను సంఘపరివార్‌ ప్రోద్బలంతో క్రైస్తవ మతాధికారులు ప్రదర్శిస్తున్నారు. లవ్‌ జీహాద్‌ పేరుతో కాషాయ దళాలు ముందుకు తెచ్చిన కుట్ర సిద్దాంతంతో కూడా కూడిన ఊహాజనిత చిత్రమే అది.ముస్లిం యువకులు హిందూ, క్రైస్తవ మతాలకు చెందిన యువతులకు వలపు వలవేసి మతమార్పిడికి చూస్తున్నారన్నదే ఆ చిత్ర కథ. ఇటీవల బిజెపి వైపు మొగ్గిన కొందరు క్రైస్తవ మతపెద్దలు తమ మతానికి చెందిన యువతులను హెచ్చరించే పేరుతో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. దీన్ని దూరదర్శన్‌లో కూడా ఇటీవల ప్రదర్శించారు. దీంతో ఎంత మంది బిజెపికి ఓటు వేస్తారో తెలియదు. దీనివెనుక ఉన్నవారు ఊహించని విధంగా అదే క్రైస్తవ మతానికి చెందిన వారు మణిపూర్‌లో క్రైస్తవ గిరిజనుల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాల ఉదంతాలతో రూపొందించిన ” అణచివేతకు గురైనవారి ఆక్రందన ”( క్రై ఆఫ్‌ ద అప్రెస్‌డ్‌) పేరుతో రూపొందించిన ఒక డాక్యుమెంటరీని పోటీగా ప్రదర్శిస్తున్నారు. కేరళలో 18శాతం మంది క్రైస్తవమతాన్ని అవలంభించే జనం ఉన్నారు. ముస్లింలు 26.6శాతం ఉన్నారు. మణిపూర్‌లో కుకీ తదితర గిరిజనుల మీద దాడులు జరుగుతున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ ఒక్కసారి కూడా ఆ రాష్ట్రాన్ని సందర్శించి బాధితులకు ఊరటగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అక్కడ అధికారంలో ఉన్న బిజెపి హిందూమతానికి చెందిన మెయితీలకు మద్దతుగా ఉందనే విమర్శలు ఉన్నాయి.


కమ్యూనిజం, కమ్యూనిస్టు పార్టీ మీద తప్పుడు ప్రచారం చేసి కేరళలో మెజారిటీ క్రైస్తవుల ఓట్లు పొందటంలో గతంలో కాంగ్రెస్‌ ఎత్తుగడలు పారాయి. తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అనేక చోట్ల కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు బిజెపి కూడా రంగంలోకి దిగి వారిని సంతుష్టీకరించేందుకు చర్చీల చుట్టూ చక్కర్లు కొడుతున్నది.కేరళ స్టోరీ చిత్రాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నది. అర్‌ఎస్‌ఎస్‌ అజెండాలో భాగంగానే అధికారాన్ని దుర్వినియోగం చేసి దూరదర్శన్‌లో కేరళ స్టోరీ చిత్రాన్ని ప్రదర్శించినట్లు సిపిఎం, కాంగ్రెస్‌ రెండూ విమర్శించాయి.తమకేమీ సంబంధం లేదని బిజెపి బుకాయించింది. ఓట్ల కోసం కమలనాధులు దేనికైనా సిద్దపడుతున్నారు. కేరళలో 2019లో ఇరవై స్థానాలకు గాను కేవలం ఒక్కచోటే సిపిఎం గెలిచింది. ఈ సారి పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పును ఎల్‌డిఎఫ్‌ సమర్ధించింది. దానికి తోడు కేంద్రంలో రెండవసారి నరేంద్రమోడీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే సమర్ధవంతంగా ఎదుర్కోగలిగింది కాంగ్రెస్‌ మాత్రమే అని జనం నమ్మటం, వయనాడు నుంచి పోటీ చేస్తున్న రాహుల్‌ గాంధీ గెలిస్తే ప్రధాని అవుతారన్న ప్రచారం కాంగ్రెస్‌ గెలుపుకు దోహదం చేశాయి. తరువాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శబరిమల వివాదం ఎలాంటి ప్రభావం చూపలేదు. కేంద్రంలో బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో సిపిఎం, సిపిఐ కూడా భాగస్వాములుగా ఉండటంతో ఎవరు గెలిచినా బిజెపిని వ్యతిరేకించే వారే గనుక గతంలో మాదిరి బిజెపిని గట్టిగా వ్యతిరేకించే ముస్లింలు కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపే అవకాశం లేదని, ఎవరు గట్టిగా నిలబడతారని భావించే వారికి ఓటు వేయనున్నారని సాధారణంగా కమ్యూనిస్టులను వ్యతిరేకించే ప్రముఖ పత్రిక మళయాళ మనోరమ ఒక సమీక్షలో పేర్కొన్నది.


ముందే చెప్పినట్లు 2019లో జరిగిన ఎన్నికలలో శబరిమల వివాదం మీద కమ్యూనిస్టు వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌ కూటమికి (48.48శాతం) 96,29,030 ఓట్లు, 19 సీట్లు వచ్చాయి. ఎల్‌డిఎఫ్‌ కూటమికి (36.29శాతం) 71,56,387 ఓట్లు, ఒక సీటు వచ్చింది. బిజెపి కూటమికి (15.64శాతం) 31,71,792 ఓట్లు వచ్చాయి. తరువాత రెండు సంవత్సరాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌కు 1,05,55, 516 ఓట్లు(45.43శాతం), కాంగ్రెస్‌ కూటమికి 81,96,813 ఓట్లు(39.47శాతం) రాగా బిజెపి కూటమి ఓట్లు 23,54,468(12.41శాతం) వచ్చాయి. నరేంద్రమోడీ రెండవసారి మరింత బలంగా అధికారానికి వచ్చారని, తమ బలం పెరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో 35 సీట్లతో తాము అధికారానికి వస్తున్నట్లు బిజెపి ప్రచారం చేసుకుంది. అంతకు ముందు ఉన్న ఒక్క సీటూ పోయింది. 2016 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 2.55శాతం, 2019 పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే 3.23శాతం ఓట్లు కోల్పోయింది. ఇప్పుడు ఐదు సీట్లు తెచ్చుకుంటామని, పదేండ్లలో రాష్ట్రంలో అధికారానికి వస్తామని బిజెపి నేత ప్రకాష్‌ జవదేకర్‌ చెబుతున్నారు. గతంలో నరేంద్రమోడీ పలుకుబడి, శబరిమల వివాదంపై రెచ్చగొట్టుడు దానికేమీ లాభించలేదు.


శైలజా టీచర్‌పై ముగ్గురు శైలజల పోటీ ! సిఏఏ ప్రస్తావనకు భయపడిన కాంగ్రెస్‌ !!
కేరళ లోక్‌సభ ఎన్నికలు మొత్తంగా ఆసక్తి కలిగిస్తున్నప్పటికీ సిపిఎం అభ్యర్ధిగా వడకర స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రస్తుత ఎంఎల్‌ఏ కె కె శైలజ టీచర్‌ మీద అదే పేరు గలిగిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున పాలక్కాడ్‌ ఎంఎల్‌ఏ షఫీ పరంబి రంగంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు చోట్ల ఎల్‌డిఎఫ్‌ ప్రతినిధులు గెలిచారు. కన్నూరు లోక్‌సభ పరిధిలోని మట్టనూర్‌ అసెంబ్లీ నుంచి కెకె శైలజ రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 61వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. తాము అధికారంలోకి వస్తే వివాదాస్పద సిఏఏ(చట్టం)ను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో దాని ఊసెత్తలేదు. ప్రశ్నించిన విలేకర్లతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సతీశన్‌ ఇంకేదైనా ప్రశ్న ఉండే అడగండని సమాధానాన్ని దాటవేశారు. పిసిసి తాత్కాలిక అధ్యక్షుడు ఎంఎం హసన్‌ మాట్లాడుతూ మేము అ చట్టాన్ని రద్దు చేయాలని ఆసక్తితో ఉన్నాం అయితే సిపిఎంను మెప్పించేందుకు దాన్ని మానిఫెస్టోలో చేర్చాల్సిన అవసరం లేదు. మార్క్సిస్టులు చెప్పినట్లు మానిఫెస్టోను రాయాల్సిన అవసరం లేదన్నారు.


కుక్కలా మొరుగుతున్నారని తండ్రిని తూలనాడిన కొడుకు !
పత్తానంతిట్ట నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కుమారుడు ఓడిపోవటం ఖాయమని, అక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ గెలుస్తుందని కేరళ మాజీ సిఎం ఏకె ఆంటోనీ చెప్పారు.కుటుంబం-రాజకీయాలు వేరు వేరని తాను తొలి నుంచి చెబుతున్నానని తన పిల్లల గురించి ఎక్కువగా అడగవద్దని అన్నారు. కాంగ్రెస్‌ నేతల పిల్లలు బిజెపిలో చేరటం తప్పిదమన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా పత్తానంతిట్ట ప్రచారానికి వెళ్లటం లేదని అన్నారు. కేరళలో శబరిమల సమస్య ముగియటంతో బిజెపి స్వర్ణయుగం ముగిసిందని అన్నారు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలపై కుమారుడు అనిల్‌ ఆంటోనీ స్పందిస్తూ గాంధీ కుటుంబం కోసం నిలబడుతున్నవారిని చూసి విచారిస్తున్నానని, కాలం చెల్లిన నేతలు మాత్రమే కాంగ్రెస్‌లో ఉన్నారని, చంద్రుడిని చూసి కుక్కలు మొరిగినట్లుగా ఈ నేతలు ప్రవర్తిస్తున్నారని అన్నారు. తండ్రి పట్ల అనిల్‌ అంటోనీ కాస్త మర్యాదను చూపాలని తిరువనంతపురం కాంగ్రెస్‌ అభ్యర్ధి శశిధరూర్‌ సలహా ఇచ్చారు. బిజెపి నేతల భాషతో తాను పోటీపడలేనన్నారు.


బిజెపి ప్రచార తీరు ఇదా !
వయనాడ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పోటీ చేస్తుండగా ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధిగా సిపిఐ జాతీయ మహిళానేత అన్నీ రాజా బరిలో ఉన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు.తాను గెలిస్తే నియోజకవర్గంలోని సుల్తాన్‌ బాతరీ పేరును గణపతి వట్టం అని మారుస్తానని ప్రచారం చేస్తున్నారు. టిప్పు సుల్తాన్‌ ఈ ప్రాంతంలోని ఒక పాడుపడిన జైన ఆలయంలో తన ఫిరంగులను ఉంచి బ్రిటీష్‌ వారి మీద యుద్ధం చేశాడు. దాంతో బ్రిటీష్‌ వారు ఆ ప్రాంతాన్ని సుల్తాన్‌ బ్యాటరీ అని పిలిచారని తరువాత అదే సుల్తాన్‌ బాతరీగా మారిందని చెబుతున్నారు. అక్కడ ఒక చిన్న గణపతి ఆలయం ఉందని, అందువలన గణపతి వట్టం అని కూడా పిలిచారని కొందరు చెబుతారు. ఇది టిప్పు సుల్తాన్‌ ప్రాంతం కాదు గనుక గణపతివట్టంగా పేరు మార్చాలని బిజెపి నేత చెప్పారు. ఎన్నికల్లో చెప్పుకొనేందుకు ఏమీలేక బిజెపి జోకులు పేలుస్తోందని కాంగ్రెస్‌ నేతలు కొందరు అపహాస్యం చేశారు.