ఉక్రెయిన్‌ సంక్షోభంలో పుతిన్‌ తొలి విజయం : ఆంక్షల ఎత్తివేత షరతులతో అమెరికాతో ఒప్పందం !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


సోమవారం నాడు అమెరికాతో కుదిరిన ఒప్పందం మేరకు నల్ల సముద్ర ప్రాంతలో స్వేచ్చగా నౌకా సంచారానికి రష్యా అంగీకరించింది. అయితే తమ షరతులను ముందుగా అమలు జరపాలని స్పష్టం చేసింది. బంతిని అమెరికా మైదానం వైపు నెట్టింది. తమ ఆహార ఎగుమతులకు వీలుగా ద్రవ్య సంస్థల మీద విధించిన ఆంక్షలను అమెరికా ఎత్తివేసిన తరువాతే ఒప్పందం అమల్లోకి వస్తుందని చెప్పింది. మాస్కోలోని అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆహార వాణిజ్యంతో సంబంధం ఉన్న రష్యన్‌ వ్యవసాయ, ఇతర బాంకుల మీద ఉన్న ఆంక్షల ఎత్తివేతతో సహా ఇతర అంశాలను కూడా అమలు జరపాలని స్పష్టం చేసింది. ప్రపంచ మార్కెట్లకు గతంలో మాదిరి ఆహారం, ఎరువుల ఎగుమతుల పునరుద్దరణ, తమ పతాకాలున్న నౌకల మీద ఆంక్షల తొలగింపు, సముద్ర ప్రయాణ బీమా ధరల తగ్గింపు, వివిధ రేవులను, ద్రవ్య లావాదేవీలు జరిపేందుకు చెల్లింపుల వ్యవస్థలను అందుబాటులోకి తేవటం వంటివి ఉన్నాయి. అమెరికా అధ్యక్ష భవనం చేసిన ప్రకటనలో కూడా పైన పేర్కొన్న అంశాల పునరుద్దరణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నది. క్రెమ్లిన్‌ విడిగా చేసిన మరొక ప్రకటనలో మార్చి 18 నుంచి నెల రోజుల పాటు రష్యా మరియు ఉక్రెయిన్‌ ఇంథన వ్యవస్థల మీద పరస్పరం దాడులు చేసుకోకుండా ఉండేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నది. ఒప్పంద వ్యవధిని పొడిగించేందుకు లేదా ఎవరు విఫలమైనా ఒప్పందం నుంచి వెనక్కు తగ్గేందుకు అవకాశం ఉందని కూడా తెలిపింది. అంతకు ముందు అమెరికా ప్రతినిధులతో సమావేశమైన తరువాత రష్యాతో కుదిరిన ఒప్పందానికి తాము అంగీకరిస్తున్నట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. మొత్తం మీద చూసినపుడు పుతిన్‌ తొలి విజయం సాధించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా ఆంక్షలు, ఉక్రెయిన్‌ కారణంగానే నల్ల సముద్ర స్వేచ్చా రవాణా ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. ఇప్పుడు బంతి అమెరికా కోర్టు వైపు వెళ్లింది. దాని చిత్తశుద్దికి పరీక్ష అని చెప్పవచ్చు.


ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి అమెరికా, రష్యా ప్రతినిధి వర్గాల మధ్య సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో సోమవారం నాడు చర్చలు జరిగాయి.వాటి తీరుతెన్నుల గురించి ప్రతినిధులు తమ దేశ నేతలకు వివరించిన తరువాత అవగాహన గురించి మంగళవారం రాత్రి ఎవరికి వారు విడిగా ప్రకటనలు చేశారు. పది గంటల పాటు జరిగిన సంప్రదింపులలో మూడు సార్లు విరామం ఇచ్చారు. చర్చల తరువాత అమెరికా ప్రతినిధులు ఉక్రెయిన్‌ అధికారులతో చర్చలు జరిపారు. ఒకవైపు చర్చలు సాగుతున్నప్పటికీ రెండు పక్షాలూ దాడులు కొనసాగించాయి. తాము 30 మంది రష్యన్‌ సైనికులను చంపివేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించుకుంది. తాము ట్రంప్‌ ప్రతిపాదించిన నెల రోజుల కాల్పుల విరమణను అంగీకరించలేదని, ఇంథన మౌలిక సదుపాయాలపై దాడులను వాయిదా వేసేందుకు మాత్రమే అంగీకరించినట్లు రష్యా ప్రతినిధులు అంతకు ముందు చెప్పారు.


నల్ల సముద్రంలో రేవుల నుంచి ఎగుమతి అయ్యే ధాన్యం,నూనెలు,ఎరువుల తనిఖీ గురించి గతంలో కుదిరిన ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. దానిలో తమ ఎగుమతుల మీద ఉన్న ఆంక్షల భాగాన్ని అమలు జరపలేదని గతంలో పేర్కొన్నది. ఇతర అంశాలపై సైనిక చర్యనాటి నుంచి రష్యా చేస్తున్న డిమాండ్లలో ఇంతవరకు ఎలాంటి మార్పు లేదు. నాటోలో చేరాలన్న ప్రతిపాదనను అధికారికంగా జెలెనెస్కీ ఉపసంహరించుకోవాలి,ఉక్రెయిన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్న, స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించిన నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ సేనలను ఉపసంహరించుకోవాలి. సోవియట్‌ కాలంలో ఉక్రెయిన్‌ పాలనా పరిధిలోకి వచ్చిన క్రిమియా ద్వీపకల్పాన్ని 2014లో రష్యా తిరిగి తనలో విలీనం చేసుకున్నది. దానితో సహా, రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటు ప్రాంతాలన్నింటినీ వెనక్కు అప్పగించాలని ఉక్రెయిన్‌ కోరుతున్నది. అలాంటి ఆశలు పెట్టుకోవద్దని జెలెనెస్కీకి అమెరికా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఒక వేళ ఒప్పందం కుదిరి మిలిటరీ చర్యను ఉపసంహరించుకున్న తరువాత శాంతి సేనలనో మరొక పేరుతోనో తమను వ్యతిరేకించే దేశాల మిలిటరీని సరిహద్దుల్లో అంగీకరించేది లేదని కూడా రష్యా స్పష్టం చేసింది.


ఒక వైపు చర్చలకు తేదీ, స్థలం నిర్ణయించిన తరువాత జెలెనెస్కీ టైమ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్‌పై ఆరోపణలు చేశాడు. సౌదీలో చర్చల రోజే వాటిని ఆ పత్రిక ప్రచురించింది. రష్యన్లు చేస్తున్న తప్పుడు ప్రచారాలు అమెరికా అధ్యక్ష భవనంలో పని చేస్తున్న కొంత మంది మీద ప్రభావం చూపుతున్నాయని జెలెనెస్కీ ఆరోపించాడు. వారు స్వంత గూఢచారుల సమాచారం కంటే పుతిన్‌ మీదనే ఎక్కువగా విశ్వాసం ఉంచుతున్నట్లు చెప్పాడు. యుద్దం ముగియాలని ఉక్రేనియన్లు కోరుకోవటం లేదని అందువలన వారిని దారికి తెచ్చేందుకు ఏదో ఒకటి చేయకతప్పదన్న సూచన అమెరికన్లకు వెళ్లిందని అన్నాడు. రష్యాలోని కురుస్కు ప్రాంతంలో ఉన్న తమ సేనలను రష్యా చక్రబంధం చేసిందన్న ట్రంప్‌ వ్యాఖ్యలు కూడా తప్పుడు సమాచార ప్రభావమే అన్నాడు. పుతిన్ను సంతుష్టీకరించేందుకు, జెలెనెస్కీని అంకెకు రప్పించేందుకు గానీ అందచేస్తున్న మిలిటరీ సాయం, గూఢచార సమాచార అందచేత నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్‌ యంత్రాంగం ఐరోపా నుంచి వత్తిడితో తరువాత వాటిని పునరుద్దరించింది. విలువైన ఖనిజాల ఒప్పందంపై సంతకాలు చేసేందుకు వాషింగ్టన్‌ వచ్చిన జెలెనెస్కీ ఓవల్‌ కార్యాలయంలో డోనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌తో గొడవపడి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. పాక్షిక ఒప్పందానికి సుముఖత తెలిపిన తరువాత కూడా రష్యా ప్రతిరోజూ దాడులు చేస్తున్నదని, వాటిని నివారించాలంటే పుతిన్‌ మీద మరింత వత్తిడి తేవాలని జెలెనెస్కీ తన మద్దతుదార్లను కోరుతున్నాడు. గత ఒక్క వారంలోనే నియంత్రిత బాంబుదాడులు 1,580, 1,100డ్రోన్‌ దాడులు, వివిధ రకాల 15 క్షిపణులతో దాడులు చేసినట్లు చెప్పాడు. వాటిలో 1,02,000 వరకు విదేశీ విడిభాగాలు ఉన్నాయని, దీని అర్ధం ఇప్పటి వరకు రష్యా మీద విధించిన ఆంక్షలు ఫలించలేదని తేలింది గనుక ఆంక్షల నిబంధనలలో ఉన్న లోపాలను సవరించి కఠినంగా అమలు జరపాలన్నాడు. అందుకోసం కొత్త నిర్ణయాలు, కొత్తగా వత్తిడి అవసరమన్నాడు.


క్రిమియా,డాన్‌బాస్‌, రష్యా అదుపులో ఉన్న మరో రెండు ప్రాంతాలు ఉక్రెయిన్‌ సంక్షోభంలో కీలక అంశాలని అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌ విట్‌కోఫ్‌ రియాద్‌ చర్చలకు రెండు రోజుల ముందు చెప్పాడు.రష్యా పాలనకు మద్దతు ఇచ్చిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం వాటిని రష్యా ప్రాంతాలుగా ప్రపంచ దేశాలు అంగీకరిస్తాయా అన్నది ముఖ్యమన్నాడు. వాటి మీద అంగీకారం కుదిరితే సమస్య పరిష్కారం అవుతుందన్నాడు. ఈ నాలుగు ప్రాంతాల్లో మెజారిటీ జనం రష్యన్‌ భాష మాట్లాడతారని, రష్యా పాలనకు ఆమోదం తెలిపారన్నాడు. వీటిని ఆమోదిస్తే జెలెనెస్కీ రాజకీయంగా బతుకుతాడా అన్నది కూడా కీలకాంశమన్నాడు. వాటిని రష్యన్‌ ప్రాంతాలుగా గుర్తించేది లేదని జెలెనెస్కీ గతంలో స్పష్టం చేశాడు. ఐరోపా ప్రమేయం లేని సౌదీ చర్చల్లో ముందుకు వచ్చిన ఇతర అంశాలేమిటి? ఐరోపా యూనియన్‌, ఇతర నాటో దేశాలు ఎలా స్పందిస్తాయన్నది, తదుపరి ముందుకు పోవటం ఎలా అన్నది ముందు ముందు చూడాల్సి ఉంది.


ఇజ్రాయెల్‌లో నిరసన ప్రదర్శనలు !
ఒక పరిణామం ఆందోళన, ఆగ్రహాలకు దారి తీస్తున్నది. మరొక సంక్షోభ తాత్కాలిక పరిష్కారం గురించి సానుకూల సంకేతాలు. బందీల విముక్తి దానికి ప్రతిగా ఖైదీల విడుదలకు సంబంధించి గాజాలోని హమస్‌తో కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ ఉల్లంఘించింది. మరోమారు గాజాలో మారణకాండను ప్రారంభించింది.దీని మీద ప్రపంచంలో వెల్లడైన నిరసన అంతా ఒక ఎత్తయితే ఏకంగా ఇజ్రాయెల్‌లోనే లక్షలాది మంది ప్రధాని నెతన్యాహు రక్తదాహాన్ని నిరసిస్తూ ప్రదర్శనలు జరపటం గమనించాల్సిన పరిణామం. బందీలను తమ వద్ద ఉంచుకొని వేలాది మంది ప్రాణాలను తీసేందుకు, లక్షలాది భవనాలను నేలమట్టం గావించటాన్ని ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారనే వత్తిడి పాలస్తీనియన్ల నుంచి వచ్చిన కారణంగానే హమస్‌ శాంతి ఒప్పందానికి అంగీకరించింది. దీని అర్ధం గాజన్లు హమస్‌ను వ్యతిరేకిస్తున్నారని కాదు. అలాగే బందీల గురించి పట్టించుకోకుండా అరబ్బుల ఊచకోత, పాలస్తీనా ప్రాంతాలపై దాడులతో సాధించేదేమిటని ఇజ్రాయెలీ పౌరులు కూడా పెద్ద ఎత్తున వత్తిడి చేసిన కారణంగానే నెతన్యాహ ఒక అడుగు వెనక్కు వేయాల్సి వచ్చింది. యూదులు మారుమనసు పుచ్చుకొని తమ ప్రభుత్వంపై ఆగ్రహిస్తున్నారని అనుకున్నా పొరపాటే. నిజానికి అలాంటి ధోరణే ఉంటే ఏడాదిన్నర కాలంగా మారణకాండను సహించి ఉండేవారే కాదు. అలా అని మొత్తం యూదులందరూ ఉన్మాదులే అనుకున్నా తప్పే.గాజా ప్రాంతాన్ని శాశ్వతంగా ఆక్రమించేందుకు ఇజ్రాయెల్‌ పథకవేయనున్నట్లు, దానికి గాను అనేక సాకులు చెబుతున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. మార్చి ఒకటవ తేదీన కాల్పుల విరమణ తొలి దశ ముగిసింది. హమస్‌ వద్ద ఇంకా 59 మంది బందీలు ఉన్నట్లు చెబుతుండగా వారిలో 35 మంది మరణించి ఉండవచ్చని కూడా అంటున్నారు..


గత వారంలో మారణకాండను తిరిగి ప్రారంభించిన ఇజ్రాయెల్‌ ఈసారి గాజాను శాశ్వతంగా ఆక్రమించుకోవాలని కొందరు బహిరంగంగానే పిలుపు ఇస్తున్నారు. అమెరికా సంగతి సరేసరి. దాన్ని తాము స్వాధీనం చేసుకొని విహార కేంద్రంగా మారుస్తామని, అక్కడ ఉన్న జనాలను జోర్డాన్‌, ఈజిప్టు తదితర దేశాలకు తరలించి పునరావాసం కల్పిస్తామని ట్రంప్‌తో సహా అక్కడి దుర్మార్గులు మాట్లాడుతున్నది తెలిసిందే.2023 అక్టోబరు ఏడు నుంచి గాజా మీద దాడులు జరుపుతున్నా, దాన్ని అష్టదిగ్బంధనం కావించినప్పటికీ ఇజ్రాయెల్‌ మిలిటరీ బందీల జాడ కనుక్కోలేకపోవటమే గాక ఒక్కరంటే ఒక్కరిని కూడా విడుదల చేయించలేకపోయింది. దాని దాడుల్లో కొంత మంది బందీలు మరణించినట్లు హమస్‌ గతంలో పేర్కొన్నది. బందీల ప్రాణాలను ఫణంగా పెట్టి పాలస్తీనియన్లను సాధిస్తారా అని ఆలోచించే వారి సంఖ్య టెల్‌అవీవ్‌లో పెరుగుతున్నది. అందుకే గతంలో జరిగిన ప్రదర్శనలతో పోలిస్తే భారీ సంఖ్యలో జనం పెరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని నెతన్యాహు నివాసం వద్దకూడా నిరసన వెల్లడిరచారు. రాజధాని టెల్‌అవీవ్‌లో లక్ష మంది పాల్గొన్నారు. అంతర్గత గూఢచార సంస్థ అధిపతి, అటార్నీ జనరల్‌ను తొలగించాలనే ఆలోచనకు వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. తిరిగి డాడులు కొనసాగిస్తే బతికి ఉన్న బందీలకు ప్రాణహాని కలుగుతుందని, ముందు వారు విడుదల కావాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెలీ జాతీయ పతాకాలతో పాటు ప్రతిపక్ష పార్టీల జెండాలు, బానర్లు కూడా ప్రదర్శించారు. నియంత్రత్వ ఉన్మాదానికి స్వస్తి పలకాలనే పెద్ద బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.


గత వారం రోజులుగా గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్‌ మారణకాండ కొనసాగుతూనే ఉంది. ఒక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న, ఒక గుడారంలో సేదతీరుతున్న హమస్‌ అగ్రనేతలు ఇద్దరు ఈ దాడుల్లో మరణించారు. అల్‌ జజీరా విలేకరి ఒకరు కూడా మృతుల్లో ఉన్నారు. గాజాతో పాటు పశ్చిమగట్టు ప్రాంతాలపై కూడా ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడులు జరుపుతూ అనేక మందిని అరెస్టు చేస్తున్నది. ఇప్పటి వరకు గాజా ప్రాంతంలో 50,144 మందిని చంపివేసినట్లు,1,13,704 మంది గాయపడ్డారని, 61,700 మంది కనిపించటం లేదని గాజా ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడిరచింది. పాలస్తీనియన్లకు మద్దతు తెలుపుతున్న ఎమెన్‌పై దాడుల పథకం వివరాలను పొరపాటున ఒక జర్నలిస్టుకు పంపిన మాట నిజమే అని అమెరికా ప్రభుత్వం పేర్కొన్నది. మరోవైపు దాడులను కొనసాగిస్తూనే ఉంది. రెండు నెలల కాల్పుల విరమణ తరువాత మరోసారి ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించిన పూర్వరంగంలో ఈజిప్టు రెండవ దశ కాల్పుల విరమణకు కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది. వారానికి ఐదుగురు బందీల చొప్పున హమస్‌ విడుదల చేయాలని దానికి అనుగుణంగా దాడుల విరమణ జరగాలని, దీనికి హమస్‌, అమెరికా అంగీకరించినట్లు ఇజ్రాయెల్‌ వైపు నుంచి స్పందన లేదని వార్తలు వచ్చాయి. గాజాలో అదనపు ప్రాంతాలను ఆక్రమించాలని రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ తమ దళాలను ఆదేశించినందున రాజీ ప్రతిపాదనలకు సిద్దంగా లేదని స్పష్టం అవుతున్నది. ఇస్లామిక్‌ జీహాద్‌ అనే సంస్థ తాజాగా ఇజ్రాయెల్‌పై రాకెట్లదాడి జరిపింది. దాంతో తమపై దాడులు మరింతగా పెరిగాయంటూ బెల్ట్‌ లహియా ప్రాంతంలో పాలస్తీనియన్లు నిరసన ప్రదర్శన జరిపారని, ముసుగులు ధరించిన హమస్‌ సాయుధులు వారిని చెదరగొట్టినట్లు బిబిసి ఒక వార్తను ఇచ్చింది. అది వాస్తవమైతే మిలిటెంట్ల రెచ్చగొట్టుడు చర్యలను పాలస్తీనియన్లు సహించకపోవచ్చని చెప్పవచ్చు.

అంతన్నాడిoతన్నాడే మోడీ తాత : ఘోరంగా విఫలమమైన ‘‘ చైనా ఫ్యాక్టరీల ’’ ఆకర్షక ‘‘ ఆత్మ నిర్భర ’’ పధకం !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు

చైనా నుంచి బయటకు వచ్చే ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలను ఆకర్షించేందుకు, మేకిన్‌, మేడిన్‌ ఇండియా పధకాలను కొనసాగింపుగా అత్మనిర్భరత పధకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఉత్పాదకతతో ముడిపడిన నగదు ప్రోత్సాహక పధకాన్ని (పిఎల్‌ఐ) ప్రధాని నరేంద్రమోడీ ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. అది ఆశించిన లక్ష్యాలకు సుదూరంగా ఉండటంతో నిలిపివేయాలని నిర్ణయించినట్లు రాయిటర్‌ వార్తా సంస్థ పేర్కొన్నది. జాతీయ పత్రికలన్నీ ప్రముఖంగా ఈ వార్తను ఇచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు పిఐబి ద్వారా ఒక ప్రకటనను విడుదల చేసింది. దాన్ని కొనసాగిస్తున్నట్లు లేదా నిలిపివేస్తున్నట్లుగానీ చెప్పకుండా ఆ పధకం ద్వారా జరిగిందాని గురించి పెద్ద వివరణ ఇచ్చింది. పిఎల్‌ఐ పధకం కింద రు.1.97లక్షల కోట్ల రూపాయలను(డాలర్లలో 23 బిలియన్లు) కేంద్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహం ఇచ్చేందుకు పక్కన పెట్టింది. ఈ మొత్తాన్ని 2019`20 ఆర్థిక సంవత్సరంతో ప్రారంభించి నాలుగు లేదా ఆరు సంవత్సరాలలో ఉత్పత్తి, ఎగుమతులు చేసే సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించారు. దీన్ని అమలు జరిపితే జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా 25శాతానికి పెరుగుతుందని చెప్పారు. ఈ పధకాన్ని గతంలో ప్రకటించిన 14పైలట్‌ రంగాలు, నిర్దేశించిన గడువును పొడిగించకూడదని నిర్ణయించినట్లు వార్త. వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ పధకాన్ని సమీక్షించి ఈ మేరకు నిర్ణయించిందని, తనకు అందిన ఆ నివేదిక వెల్లడిరచిందని రాయిటర్స్‌ పేర్కొన్నది. ఈ పధక వైఫల్యం గురించి వ్యాఖ్యానించాలని కోరగా ప్రధాని కార్యాలయం, వాణిజ్య మంత్రిత్వశాఖ స్పందించలేదని వార్తా సంస్థ పేర్కొన్నది. ఈ పధకాన్ని నిలిపివేసినంత మాత్రాన ఉత్పాదక లక్ష్య్యాలను వదలివేసినట్లు కాదని, ప్రత్యామ్నాయాలను రూపొందిస్తారని ఇద్దరు అధికారులు చెప్పినట్లు కూడా పేర్కొన్నది.కేంద్ర ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్న వివరాలు కూడా పిఎల్‌ఐ పథక వైఫల్యాలను నిర్ధారించాయి.


రాయిటర్స్‌ వార్త సారాంశం దిగువ విధంగా ఉంది. యాపిల్‌ ఫోన్లను సరఫరా చేసే ఫాక్స్‌కాన్‌, రిలయన్స్‌తో సహా 750 కంపెనీలు ఈ పధకం కింద రాయితీ పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. పథకం గడువును పెంచాలని అనేక సంస్థలు కోరినప్పటికీ అంగీకరించకూడదని అధికారులు తమ అభిప్రాయాలను సమీక్షలో నమోదు చేశారు. అనేక సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించలేదు. దారిలో ఉన్నవారు కూడా నత్తనడక నడుస్తున్నట్లు తేలింది. 2024 అక్టోబరు నాటికి కొన్ని సంస్థలు 151.93 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తూత్పత్తి చేశాయని, ఇది నిర్దేశిత లక్ష్యంలో 37శాతమే అని తేలింది. ప్రోత్సాహకం కింద పక్కన పెట్టిన 2,300 కోట్ల డాలర్లకు గాను ఇప్పటివరకు సంస్థలకు చెల్లించింది కేవలం 173 కోట్ల డాలర్లు లేదా ఎనిమిది శాతం మాత్రమేనని కూడా తేలింది. ఈ పధకం ప్రారంభించినపుడు ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక ఉత్పాదకత వాటా 15.4శాతం ఉండగా ప్రస్తుతం 14.3శాతానికి పడిపోయింది. పిఎల్‌ఐ పధకం వలన ఔషధ, సెల్‌ఫోన్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగినట్లు గతేడాది ప్రభుత్వం సమర్ధించుకుంది. కనీస వృద్ధి లక్ష్యాలను చేరుకోని కారణంగా కొన్ని నమోదైన సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వలేదని సమీక్ష నివేదికలో పేర్కొన్నారు. సోలార్‌ రంగంలో పన్నెండు కంపెనీల నమోదు కాగా వాటిలో రిలయన్స్‌, అదానీ, జెఎస్‌డబ్ల్యుతో సహా ఎనిమిది లక్ష్యాలకు చేరే అవకాశం లేదని 2024 డిసెంబరు సమీక్షలో తేలింది. 2027 నాటికి ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించినదానిలో రిలయన్స్‌ కంపెనీ కూడా 50శాతానికి మించే అవకాశం లేదని వెల్లడైంది. అప్పటికి పధకం గడువు ముగిసిపోతుంది. అదానీ కంపెనీ తయారీకి అవసరమైన పరికరాలనే కొనుగోలు చేయలేదు. పథకం గడువు 2027 తరువాత పొడిగించాలని పునరుత్పాదక ఇంథన మంత్రిత్వశాఖ చేసిన వినతిని వాణిజ్యశాఖ తిరస్కరించింది. అసలు పనిచేయని వారికి లబ్ది చేకూర్చటం తగనిపని అని పేర్కొన్నది. ఉక్కు రంగంలో నమోదైన 58 కంపెనీలలో ఎలాంటి పురోగతి లేని 14ను జాబితా నుంచి తొలగించారు.


రాయిటర్స్‌ వార్త తరువాత శనివారం నాడు పిఐబి విడుదల చేసిన ప్రకటనలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. పిఎల్‌ఐ పధకంతో స్థానిక ఉత్పత్తి పెరిగింది, కొత్త ఉపాధి వచ్చింది, ఎగుమతులకు ప్రోత్సాహం వచ్చింది.2024 నవంబరు నాటికి ప్రోత్సాహక మొత్తం కారణంగా రు.1.61లక్షల కోట్ల పెట్టుబడి రాగా, 14లక్షల కోట్ల మేర ఉత్పత్తి జరిగింది,రు.5.31లక్షల కోట్ల మేర ఎగుమతులు జరిగాయి, 11.5లక్షల ప్రత్యక్ష , పరోక్ష ఉద్యోగాలు వచ్చాయి. పద్నాలుగు రంగాలలో 764 దరఖాస్తులను ఆమోదించగా వాటిలో 176ఎంఎస్‌ఎంఇ సంస్థలున్నాయి. పది రంగాల పరిశ్రమలకు ప్రోత్సాహక మొత్తం రు.14,020 కోట్లు విడుదల చేశారు. అనేక పరిశ్రమలు అమలు దశలో ఉన్నాయి, తరువాత అవి ప్రోత్సాహకాలకు దరఖాస్తులు చేస్తాయి. ఉక్కు రంగంలో రు.27,106 కోట్ల మేరకు పెట్టుబడులు పెడతామని చెప్పిన కంపెనీలు రు.20వేల కోట్లు పెట్టాయని, తొమ్మిది వేల మందికి ఉపాధి దొరికిందని, ఇప్పటి వరకు 48 కోట్లు ప్రోత్సాహకం ఇచ్చినట్లు, 58 ప్రాజెక్టులకు గాను 14 వెనక్కు తగ్గినట్లు, పిఎల్‌ఐ రెండవ దశలో ఇరవై అయిదు వేల కోట్ల పెట్టుబడులతో 35 కంపెనీలు ఆసక్తి చూపినట్లు పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం ఏమి చెప్పినప్పటికీ నాలుగు సంవత్సరాల తరువాత రు.1.97లక్షల కోట్ల సబ్సిడీ మొత్తంలో విడుదల చేసింది రు.14,100 కోట్లే అని స్వయంగా చెప్పిందంటే ఏడుశాతం మొత్తం కూడా ఖర్చు కాలేదు, రాయిటర్స్‌ కథనం వాస్తవమే అని తేలింది. మేకిన్‌, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత పేర్లతో పదేండ్లుగా కాలక్షేపం చేసినా ఫలితం దక్కలేదు గనుక మరొక పేరుతో ప్రయోగాలు చేస్తారేమో చూడాల్సి ఉంది.


అంతా వారే చేశారని గోబెల్స్‌ను పూజిస్తూ కాంగ్రెస్‌ మీద పదే పదే ప్రచారం చేయటం తప్ప పదేండ్లలో మోడీ ఏం చేశారన్నది ప్రశ్న. సమావేశాల మీద సమావేశాలు, ముసాయిదా విధానాల పేరుతో భారత్‌ కాలక్షేపం చేస్తుండగా చైనా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, ఒక్క గుండుకూడా పేల్చకుండా, చేయాల్సింది చేస్తోందని బిజినెస్‌ టుడే పత్రిక 2025 మార్చి 22న ఒక కథనాన్ని ప్రచురించింది. వివేక్‌ ఖత్రి అనే చార్టడ్‌ ఎకౌంటెంట్‌, ఇన్ఫ్లుయెన్సర్‌ చేసిన ఎక్స్‌ పోస్టును, అభిప్రాయాలను ఉటంకించింది. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తి క్రీడలో ఎలాంటి శబ్దం, పతాకశీర్షికలు లేకుండా మౌనంగా భారత్‌ను పక్కకు నెట్టే వ్యూహాన్ని చైనా అనుసరించిందని అతను ఆరోపించాడు. చైనా లక్షకోట్ల డాలర్ల వాణిజ్య మిగులు అంటే కేవలం ఆర్థిక గణాంకం కాదని భూ భౌతిక రాజకీయ అస్త్రమన్నాడు. ప్రపంచ కంపెనీలు చైనా ప్లస్‌ ఒన్‌ అనే వ్యూహంతో బీజింగ్‌ను వెనక్కు నెట్టకుండా హంగరీ, మెక్సికో, మొరాకో, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు చక్కగా చైనాతో చేతులు కలుపుతున్నాయని, చైనాతో పోటీ లేని ఉత్పాదక వాతావరణంలో ఉదారంతో విదేశీ పెట్టుబడులను పొందుతున్నాయని వివేక్‌ ఖత్రి పేర్కొన్నాడు.


భారత్‌ను ఎదగనీయకుండా చైనా చూస్తున్నదని వివేక్‌ వంటి వారు చెప్పటం ఆడలేక మద్దెల ఓడు అనటం తప్ప మరొకటి కాదు. భారత పరిశ్రమలకు అవసరమైన కీలక విద్యుత్‌ వాహనాల విడిభాగాలు, సోలార్‌ మాడ్యూల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పతికి అవసరమైన పరికరాలను చైనా అడ్డుకుంటున్నదని, భారత సరఫరా గొలుసు సామర్ద్యాన్ని నిర్మించకుండా తన కార్పొరేట్లను నిరోధిస్తూ ఫాక్స్‌కాన్‌,బివైడి కంపెనీల విస్తరణను నిరుత్సాహపరుస్తున్నదని వివేక్‌ ఖత్రి ఆరోపించారు. ప్రపంచ ఐఫోన్‌ ఉత్పత్తిలో నాలుగో వంతు భారత్‌లో చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 15శాతమే జరుగుతున్నన్నారు. భారత్‌ 26 బిలియన్‌ డాలర్ల విలువగల ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతి చేస్తుండగా వియత్నాం 126 బిలియన్‌ డాలర్లు చేస్తున్నదని , తైవాన్‌, జపాన్‌ సంస్థలు వెనక్కు పోతున్నట్లు చెప్పారు. జపాన్‌కు చెందిన పదింటిలో ఒక కంపెనీ మాత్రమే భారత్‌లో పెట్టుబులు పెట్టేందుకు చూస్తున్నదని అది కూడా నియంత్రణల సంక్లిష్టత, రెడ్‌టేప్‌, అమలు జరపగలమా లేదా అన్న అనిశ్చితి ఉన్నట్లు చెప్పిందని వెల్లడిరచారు. తక్కువ విలువగల పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులను భాగస్వామ్య దేశాలకు అప్పగిస్తూ కీలకమైన, మేథోసంపత్తి హక్కులున్నవాటిని చైనా అట్టిపెట్టుకుంటున్నదని, దీర్ఘకాలిక ప్రాతిపదిక మీద మొరాకో నుంచి మెక్సికో వరకు పారిశ్రామిక నడవాలను నిర్మిస్తున్నదని, తన అవసరాలకు అనుగుణంగా ప్రపంచీకరణను మలుచుకుంటున్నదని ఖత్రి విమర్శించారు.


భారత్‌ ముందుకు పోతుంటే అడ్డుకుంటున్నదని చైనాను నిందించేవారు నిత్యం కనిపిస్తారు. గతంలో చైనాను చక్రబంధం చేస్తే దాన్నుంచి బయటపడేందుకు అది అనుసరించిన విధానాలు తప్ప ప్రత్యేకించి ఎవరూ చేయూతనిచ్చి పైకి లేపలేదు. ధనిక దేశాలు తమ వద్ద మూలుగుతున్న పెట్టుబడులను అలాగే ఉంచుకుంటే వడ్డీ కూడా రాని స్థితిలో చైనాలో పెట్టుబడులు పెట్టాయి తప్ప కమ్యూనిస్టుల మీద ప్రేమతో కాదు.జపాన్‌లో ఎవరన్నా డబ్బుదాచుకోవాలంటే బ్యాంకులకు ఎదురు చెల్లించాలి తప్ప ఎలాంటి వడ్డీ ఉండదు.ధనిక దేశాల్లో శ్రామికులకు ఎక్కువ మొత్తాలు వేతనాలు చెల్లించాలి, చైనాలో జనాభా ఎక్కువ గనుక చౌకగా పనిచేయించుకొని ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవాలని అవే ధనికదేశాలు చూశాయి. తమ జనానికి పని చూపాలి, అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు కావాలి గనుక చైనా సంస్కరణల బాట పట్టి నేటి స్థితికి ఎదిగింది, దానికి అది అనుసరించిన స్థిరమైన, విశ్వసనీయమైన విధానాలే కారణం. ఆత్మనిర్భరత పేరుతో రెండు లక్షల కోట్ల నగదు ప్రోత్సాహం ఇస్తామన్నా కంపెనీలు ఎందుకు రాలేదో, వచ్చినవి ఎందుకు ఉత్పత్తిచేయలేదో ఆలోచించాల్సిందిపోయి, చైనా అడ్డుకున్నదని చెబితే కుదురుతుందా !


ఇప్పటికీ చైనా గురించి అనేక అతిశయోక్తులు, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. చౌకరకం వస్తువులను మాత్రమే ఉత్పత్తి చేస్తుందన్నది వాటిలో ఒకటి. అలాంటి వస్తువులను దిగుమతి చేసుకోవటంలో నరేంద్రమోడీ రికార్డులను బద్దలు కొట్టారు, అమెరికా, ఐరోపా దేశాలకు అవి లేకపోతే రోజు గడవదు. ఎందుకు దిగుమతి చేసుకుంటున్నట్లు ? మరోవైపు చైనా మీద పడి ఎందుకు ఏడుస్తున్నట్లు ? చైనా ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని, అక్కడి నుంచి విదేశీ పరిశ్రమలు, కంపెనీలు బయటకు వెళుతున్నాయని, అవి హిమాలయాలను దాటి భారత్‌ వస్తున్నట్లుగా అనేక మంది చిత్రించారు. కరోనా తరువాత అతిశయోక్తులు ఎన్నో. ఏ ఒక్కటీ నిజం కాలేదు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015లో 2.1లక్షల కోట్ల డాలర్ల నుంచి 2025లో దేశ జిడిపి 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు, ఇది 105శాతం పెరుగుదల అని ప్రపంచంలో ఏ పెద్ద దేశమూ ఇంతటి అభివృద్ధి సాధించలేదని బిజెపి ఐటి సెల్‌ అధినేత అమిత్‌ మాలవీయ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని గొప్పలు చెప్పుకున్న అంశం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతటి అభివృద్ధిని ఏ ప్రభుత్వమూ సాధించలేదని కూడా చెప్పారు. 2004మన్మోహన్‌ సింగ్‌ అధికారానికి వచ్చినపుడు జిడిపి 709 బిలియన్‌ డాలర్లు కాగా 2014 నాటికి అది 2030 బిలియన్లకు పెరిగింది. ఏ ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని అడిగినా యుపిఏ పాలనా కాలంలో పెరుగుదల రేటు ఎక్కువని చెబుతారు. అబద్దాలలో పుట్టి అబద్దాలలో పెరుగుతున్నవారు తప్ప ఇలాంటి తప్పుడు ప్రకటనలు మరొకరు చేయరు.

రహస్య పత్రాల వెల్లడి : ఆవు వ్యాసం తప్ప అమెరికా కెనడీ హత్య కుట్ర వెల్లడి కాలేదు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


అమెరికా చరిత్రలో పిన్న వయస్కుడిగా 35వ అధ్యక్ష పదవికి ఎన్నికైన జాన్‌ ఎఫ్‌ కెనడీ జీవితం 43 ఏండ్లకే అర్ధంతరంగా ముగిసింది.1961 జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత 1963 నవంబరు 22న డాలస్‌ నగరంలో హత్యకు గురయ్యాడు. చిత్రం ఏమిటంటే ఇంతవరకు హత్య వెనుక ఎవరున్నదీ అమెరికా చెప్పలేకపోయింది. అనేక అంశాలను ఇట్టే పసిగట్టి గుట్టువిప్పగల ఎఫ్‌బిఐ,సిఐఏ,జాతీయ దర్యాప్తు సంస్థలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. నిజంగా వైఫల్యమా ? లేక హంతకుడి వెనుక ఈ సంస్థలలో ఏదో ఒకటి ఉందా, ఉంటే ఎవరి ప్రోద్బలంతో హత్య జరిగింది అన్నది ఎప్పటికీ వెల్లడిగాని రహస్యంగానే మిగిలిపోతుందా ? తాజాగా కెనడీ హత్యకు సంబంధించి రహస్యంగా ఉన్న పత్రాలన్నింటినీ బహిరంగ పరచాలని మార్చి 18వ తేదీన అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించిన మేరకు 63వేల పేజీలను విడుదల చేశారు. అనేక కాగితాల్లో ఏముందో తెలియకుండా చేసేందుకు నల్లటి ఇంకు పూశారు. అందువలన కొత్త అనుమానాలు తలెత్తటం తప్ప తెలిసిందేమీ లేదని చెబుతున్నారు. అన్నివేల పేజీలను చదవటం వెంటనే సాధ్యమయ్యేది కాదు గనుక వాటిలో ఎక్కడైనా అణుమాత్రమైనా ఆధారాలుంటే తరువాత బయటకు వస్తుందని ఆశించాలా లేక అలాంటివి కనిపించకుండానే ఇంకు పూశారనుకోవాలా ? 1992లో చేసిన ఒక చట్ట ప్రకారం 25 సంవత్సరాలలోగా కెనడీ హత్యకు సంబంధించి వివరాలన్నీ వెల్లడిరచాలని నిర్దేశించారు. ఆ మేరకు 2017లోనే బయటపెట్టనున్నట్లు ట్రంప్‌ ప్రకటించాడు. అయితే షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా రక్షణ వ్యవహారాలు అందులో ఉంటే వాటికి మినహాయింపు కూడా ఇచ్చారు. ట్రంప్‌ గతంలో కొన్నింటిని, తరువాత జో బైడెన్‌ మరికొన్ని, తాజాగా ట్రంప్‌ మరికొన్నింటిని విడుదల చేసేందుకు ఆదేశాలిచ్చాడు.


‘‘ కెనడీ అర్ధశతాబ్దం ’’ పేరుతో ఒక గ్రంధాన్ని రాసిన వర్జీనియా విశ్వవిద్యాలయ రాజకీయ శాస్త్ర ఫ్రొఫెసర్‌ రికార్డులను పూర్తిగా సమీక్షించాలంటే సమయం పడుతుందన్నారు. మొత్తం ఎనభైవేల పేజీల రికార్డులను విడుదల చేయనున్నట్లు ట్రంప్‌ ప్రకటించినందుకు మరికొన్ని త్వరలో వెల్లడి కావచ్చు. ఇప్పటి వరకు విడుదల చేసిన ఫైళ్లలో సిఐఏ గురించిన సమాచారం ఎంతో ఉంది తప్ప కెనడీ హత్య వెనుక కుట్ర గురించేమీ లేదన్నది వెంటనే వెల్లడైన స్పందన.ట్రంప్‌ నిర్ణయానికి ముందు మూడు నుంచి మూడున్నరవేల ఫైళ్లు విడుదల కావాల్సి ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. ఫిబ్రవరి నెలలో తాము కొత్తగా 2,400 కొత్త రికార్డులను కనుగొన్నట్లు ఎఫ్‌బిఐ చెప్పింది. అందువలన ఇంకా ఎన్ని విడుదల కావాల్సిందీ స్పష్టంగా చెప్పలేని స్థితి. లీ హార్వే ఓస్వాల్డ్‌ అనే 24 సంవత్సరాల యువకుడు కెనడీ మీద కాల్పులు జరిపాడని చెప్పారు. వాడిని పోలీసు కస్టడీ నుంచి జైలుకు తరలిస్తుండగా జాక్‌ రూబీ అనే నైట్‌క్లబ్‌ యజమాని కాల్చి చంపాడు. ఎందుకంటే వాడికి కోపం వచ్చిందట. ఇదంతా కేవలం రెండు రోజుల్లోనే జరిగింది. ఈ తీరు చూసిన తరువాత బుర్ర ఉన్నవారెవరికైనా పెద్ద కుట్ర దీని వెనుక ఉంది అన్న అనుమానం రాకుండా ఎలా ఉంటుంది.


తాజాగా వెల్లడైన పత్రాల ప్రకారం ఓస్వాల్డ్‌ గురించి సిఐఏ గట్టి నిఘావేసినట్లు తేలింది. అలాంటపుడు ఎందుకు నిర్లక్ష్యం వహించినట్లు ? ఈ పత్రాలలో చాలా వాటిని పాక్షికంగా గతంలోనే విడుదల చేశారు. ఇప్పుడు చేసిందేమంటే పూర్తి పాఠాల బహిర్గతం.కెనడీ హత్యకు ముందు ఓస్వాల్డ్‌ సోవియట్‌ వెళ్లినట్లు తిరిగి వచ్చిన తరువాత 1963సెప్టెంబరులో మెక్సికో సిటీ వెళ్లినట్లు, అక్కడ సోవియట్‌ రాయబార కార్యాలయం ముందు ఉన్న మూడు సార్లు గేటు ముందుకు ఉన్న చౌకీదారుతో మాట్లాడినట్లు సిఐఏ నమోదు చేసినా ఒక్కసారే అతడిని గుర్తించినట్లు చెబుతున్నారు. అయితే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిందేమీ లేదని సిఐఏ ఒక మెమోలో పేర్కొన్నట్లు కూడా వెల్లడైంది. 1959 నుంచే ఓస్వాల్డ్‌ మీద నిఘావేసినట్లు కూడా వెల్లడైంది. అయితే ఒక యువకుడి మీద ప్రత్యేకించి,కెనడీ అధికారానికి రాక ముందునుంచే ఎందుకు నిఘా పెట్టారన్నది సందేహాస్పద అంశం. రష్యా వెళ్లాడు గనుక అని చెప్పవచ్చు. హత్యకు ముందు ఇతగాడి మీద నిఘావేసిన ఒక అధికారి సమర్పించిన సమాచార ఫైలును ఇప్పటికీ విడుదల చేయలేదు. అమెరికా విదేశాంగ విధాన వ్యవహారాలలో సిఐఏ పాత్ర ఎక్కువగా ఉందని, రాయబార కార్యాలయాల్లో దాని ఏజంట్లే దౌత్యవేత్తల ముసుగులో ఉన్నట్లు వీటి గురించి ఆర్థర్‌ షెల్సింగర్‌ అనే సహాయకుడు కెనడీ వివరించినట్లు సిఐఏ గురించి కెనడీకి నమ్మకం, సదభిప్రాయం లేదని, సత్సంబంధాలు కూడా లేవని తేలింది. కెనడీ పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో అమెరికా రాయబార కార్యాలయాల్లో పని చేస్తున్న రాజకీయ ప్రతినిధుల్లో 47శాతం మంది సిఐఏ కనుసన్నలలో పని చేసేవారే. ఉదాహరణకు పారిస్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో నాడున్న 123 మంది ముసుగులో ఉన్న ఏజంట్లే, చిలీ కార్యాలయంలో ఉన్న పదమూడు మందిలో పదకొండు మంది కూడా వారే. మొత్తం 3,700 మంది దౌత్య సిబ్బందిగా పేర్కొన్నవారిలో 1,500 మంది మాత్రమే విదేశాంగశాఖకు చెందిన వారు, మిగతా వారంతా మిలిటరీ లేదా గూఢచార సంబంధంగలవారేనని అతను నివేదించాడు. కంటికి కనిపించని దొంగ చెవుల ద్వారా సేకరించిన సమాచారం, చిత్రాలను చూసేందుకు ఎక్స్‌రేస్‌ను వినియోగించినట్లు తేలింది. అతి నీలలోహిత కిరణాలను ప్రసరింప చేస్తే కనిపించే రంగులను కొన్ని పబ్లిక్‌ ఫోన్లకు పూసి ఉపయోగించినట్లు కూడా వెల్లడైంది. ఇలాంటి మరికొన్ని ప్రక్రియల గురించి కూడా బహిర్గతమైంది. తరువాత కాలంలో అవన్నీ లోకానికి తెలిసిన కారణంగా ఇప్పుడు దాయాల్సిందేమీ లేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో మిలిటరీ గూఢచారిగా ఉన్న గారీ అండర్‌హిల్‌ సేకరించినట్లు చెబుతున్న సమాచారం ప్రకారం కెనడీ హత్యవెనుక సిఐఏ హస్తం ఉన్నట్లు ఒక వర్తమానంలో కనుగొన్నాడని 1967లో ఒక పత్రిక ప్రచురించింది, అయితే 1964లోనే అండర్‌హిల్‌ ఆత్మహత్య చేసుకున్నాడని, కానీ దాని మీద అనుమానాలున్నట్లు సదరు పత్రిక పేర్కొన్న అంశానికి ప్రాధాన్యత ఏర్పడిరది. అయితే ఇదేమీ సరికొత్త అంశం కాదు. 2017లో విడుదల చేసిన వాటికి ఒక పేజీ అదనంగా తోడైంది.


కెనడీ హత్య గురించి అనేక కుట్ర సిద్దాంతాలు, అనుమానాలు నేటికీ వెల్లడౌతూనే ఉన్నాయి. సినిమాలు కూడా వచ్చాయి. ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లుగా అసలు విషయం తేలటం లేదు. ఓస్వాల్డ్‌ సోవియట్‌లో ఉండి వచ్చాడని, అందువలన హత్యకు అక్కడే కుట్ర జరిగిందన్నది ఒకటి. అధ్యక్షులుగా గాడిద పార్టీ ఉన్నా ఏనుగు పార్టీ ప్రతినిధి ఉన్నా సోవియట్‌, తరువాత రష్యాను వ్యతిరేకించిన వారే తప్ప మరొకరు లేరు. అలాంటపుడు రష్యన్ల హస్తం గురించి ఎందుకు తేల్చలేకపోయారు ? కెనడీ డెమోక్రాట్‌ గనుక రిపబ్లికన్లు కుట్ర చేశారనుకుంటే మరి స్వంత పార్టీ వారెందుకు రుజువు చేయలేకపోయారు, లేదూ స్వంత మనుషులే అనుకుంటే అదే పని రిపబ్లికన్లు కూడా చేయలేదు కదా ! కొందరు క్యూబన్ల కుట్ర, మెక్సికో అన్నారు, వాటి గురించీ తేల్చలేకపోయారు. మోటారు వాహనంలో ప్రయాణిస్తుండగా ఓస్వాల్డ్‌ కాల్చినట్లు చెప్పారు. అయితే అతను మెరైన్‌ తప్ప షూటింగ్‌లో అంత నేర్పరి కాదన్నది మరొక వాదన. కాల్పులు జరిగిన సమయంలో అతను సోవియట్‌ కెజిబి అదుపులో లేడని దానికోసం పనిచేసిన ఒక ప్రొఫెసర్‌ కథనం.


సిఐఏకు కమ్యూనిస్టులు లేదా వ్యతిరేకులు అనే బేధం లేదు. వాషింగ్టన్‌ డిసిలో మిత్రదేశమైన ఫ్రాన్సు రాయబార కార్యాలయంలో కూడా దొంగచాటుగా సమాచారాన్ని సేకరించటమేగాక కొన్ని పత్రాలను కూడా తస్కరించినట్లు తాజాగా విడుదల చేసిన ఫైళ్లలో వెల్లడైంది.కెనడీ కాలంలో సిఐఏ డైరెక్టర్‌గా పనిచేసిన జాన్‌ మెకాన్‌ తన పదవీ కాలంలో పోప్‌ జాన్‌23, పోప్‌ పాల్‌6తో నెరిపిన సంబంధాలు కూడా కొన్ని అనుమానాలను రేకెత్తించాయి. ఇతగాడి హయాంలోనే డొమినికన్‌ రిపబ్లిక్‌ పాలకుడు రాఫేల్‌ ట్రుజిలో హత్యకు సహకరించిన సిఐఏ అధికారుల పేర్లు, బొలీవియాలో తమకు అనుకూలమైన అభ్యర్థికి అనుకూలంగా తీసుకున్న చర్యలు, కమ్యూనిజానికి వ్యతిరేకంగా చేసిన కుట్రల్లో భాగంగా రాజకీయ పార్టీలకు అందచేసిన నిధుల గురించి వివరాలు కూడా బయటకు వచ్చాయి. ‘‘ చీకటి ప్రాంతాల ’’ పేరుతో మన ఢల్లీి, కొలకత్తాతో సహా ప్రపంచంలో ఏ ఏ నగరాల్లో సిఐఏ కార్యాలయాలను ఏర్పాటు చేసిందో కూడా ఈ పత్రాల నుంచి వెలికి తీసి రష్యన్‌ టీవీ ప్రకటించింది.


కెనడీ హత్య గురించి దర్యాప్తు జరిపేందుకు 1964లో వారెన్‌ కమిషన్‌ ఏర్పాటు చేశారు. అదేమీ తేల్చలేదు. 1963 నవంబరు 22 మధ్యాహ్నం డలాస్‌ నగరంలో తన సతీమణి జాక్విలిన్‌, టెక్సాస్‌ గవర్నర్‌ జాన్‌ కోనల్లీ, అతని సతీమణి టాప్‌లేని కారులో ప్రయాణిస్తుండగా 12.30 సమయంలో రైఫిల్‌తో కాల్పులు జరిగాయి. కెనడీ, జాన్‌ కోనలీ ఇద్దరు గాయపడ్డారు. వెంటనే పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించగా ఒంటి గంటకు కెనడీ మరణించాడు, కోనలీ గాయాలతో కోలుకున్నాడు. కాల్పులు జరిపిన ఒక గంటలోనే ఓస్వాల్డ్‌ను పట్టుకున్నారు. రోడ్డు పక్కనే ఉన్న ఒక భవన ఆరవ అంతస్తులో ఉండి కాల్చినట్లు చెప్పారు. కెనడీ ప్రయాణిస్తున్న వాహన శ్రేణికి ఒక వ్యక్తి అడ్డుగా వచ్చినట్లు, అతడిని ఆ భవనంలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదని, ఒక అరగంట ముందు ఓస్వాల్డ్‌ కనిపించినట్లు ఆ భవనంలో పని చేస్తున్న ఉద్యోగులు చెప్పారు. అంతకు ఒక నెల రోజుల ముందే నిందితుడు అక్కడ పని చేస్తున్నట్లు కూడా వెల్లడిరచారు. ఓస్వాల్డ్‌ను పట్టుకొనేందుకు ప్రయత్నించిన పోలీసు జెడి టిపిట్‌ను ఒక రివాల్వర్‌తో చంపివేసినట్లు తెలిపారు.మొత్తం మీద హంతకుడి వెనుక ఉన్నది ఎవరు, కుట్ర ఏమిటి అన్నది వారెన్‌ కమిషన్‌ గానీ, వెల్లడిరచిన రహస్య పత్రాలు గానీ తేల్చలేకపోయాయి. సూత్రధారి సిఐఏ అయితే పాత్రధారి ఎవరు, ఎందుకు కుట్ర చేశారన్నది బహుశా ఎప్పటికీ వెల్లడయ్యే అవకాశాలు లేవని, అంతుచిక్కని ఒక రహస్యంగా మిగిలిపోవచ్చని భావిస్తున్నారు.

బర్లీ పొగాకు రైతులను గాలికి వదిలేసిన పొగాకు బోర్డు

Tags

, , , ,

డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌,

గత రెండు మూడు సంవత్సరాలు బర్లీ పొగాకు రేటు లాభసాటిగా ఉండటంతో బర్లీ పొగాకు వైపు రైతులు మళ్లారు. గత సంవత్సరం అడుగు ఆకు కూడా క్వింటాలు పదివేల రూపాయలకు అమ్ముడు పోయింది. ఈ సంవత్సరం అడుగు ఆకు నాలుగైదు వేల రూపాయలకు మించలేదు. కంపెనీలు బాండు ఇచ్చినా పొగాకు కొనటం మందంగా ఉంది. 30-40 వేల రూపాయలకు ఒక ఎకరం పొలం కౌలుకు తీసుకొని, బర్లీ పొగాకు పంటను వేసిన రైతులున్నారు.2023-24 సంవత్సరంలో భారతదేశ పొగాకు ఎగుమతులు రూ.12,006 కోట్లు. 2022-23లో భారతదేశంలో పొగాకు అమ్మకాల ద్వారా వచ్చిన ఎక్సైజ్‌ ఆదాయం రూ.72,788 కోట్లు. ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తున్నా రైతులకు ఆశ, నిరాశలను చూపిస్తూ ప్రభుత్వం, కంపెనీలు రైతులతో ఆడుకుంటున్నాయి.

పొగాకు బోర్డు

పొగాకు రైతులకు న్యాయమైన, లాభదాయకమైన ధరలు లభించేలా చూడటం, ఎగుమతులను ప్రోత్సహించటం బోర్డు ప్రాథమిక కర్తవ్యం. అయితే పొగాకు బోర్డు ఒక్క ఫ్లూ క్యూర్డ్‌ వర్జీనియా పొగాకు (ఎఫ్‌.సి.టి) గురించి మాత్రమే పట్టించుకుంటుందట. బర్లీ పొగాకు, నాటు పొగాకు లాంటివి తమ పరిధిలో లేవని తప్పుకుంటోంది. పొగాకు పండించే రైతులందరి ప్రయోజనాలను కాపాడవలసిన పొగాకు బోర్డు…బర్లీ పొగాకు పండించిన రైతులను కంపెనీల దయా దాక్షిణ్యాలకు వదిలేసింది.
బర్లీ పొగాకుకు విదేశాలలో ఎక్కువ డిమాండ్‌ వుంది. అమెరికా, బ్రిటన్‌లో తయారయ్యే సిగరెట్లలో బర్లీ పొగాకు ప్రధాన స్థానాన్ని పొందింది. సిగరెట్‌లో మంచి ఫ్లేవర్‌ కోసం, ఘాటుగా వుండటం కోసం బర్లీ పొగాకును సిగరెట్‌ తయారీలో తప్పనిసరిగా వాడతున్నారు. ఇదివరకు అమెరికా లోని కెంటకీ రాష్ట్రంలో బర్లీ పొగాకును ఎక్కువగా సాగు చేసేవారు. అక్కడ బర్లీ పొగాకు సాగు తగ్గింది. దేశ, విదేశీ అవసరాలకు 100 మిలియన్‌ కేజీల బర్లీ పొగాకు అవసరం వుంటుందని అంచనా.

పొగాకు పరిశోధనా సంస్ధ

తూర్పు గోదావరి జిల్లాలో కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ సి.టి.ఆర్‌.ఐ 75 సంవత్సరాల నుండి రాజమండ్రిలో పనిచేస్తున్నది. దక్షిణ ప్రాంతపు తేలిక నేలలు ఉన్న ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలలో సాగు చేసే బర్లీ పొగాకు నూతన విత్తనాలను ‘విజేత’ పేరున విడుదల చేశారు.ఇదివరకు పది వేల మిలియన్‌ కేజీల ఎగుమతి ఉన్న బర్లీ పొగాకు ఇప్పుడు 45 వేల మిలియన్‌ కేజీలకు పెరిగిందని ఆ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు అన్నారు.ప్రత్యామ్నాయ పంటలైన మిర్చి, శనగ, మొక్కజొన్న, సుబాబుల్‌, జామాయిల్‌, పామాయిల్‌ పంటలు వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కానీ ప్రత్యామ్నాయ పంటల ధరలకు గ్యారంటీ లేదు. కనీస మద్దతు ధరలు అమలు పరచే యంత్రాంగం లేదు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లేదు. కచ్చితంగా కొంటారనే గ్యారంటీ లేదు. వ్యవసాయ ఖర్చులు-ఎరువులు, పురుగు మందులు, కౌలు, కూలీ రేట్లు భారీగా పెరిగాయి. ఇటువంటి పరిస్ధితులలో పొగాకు ధరలు గత రెండు సంవత్సరాలుగా ఆశాజనకంగా వున్నాయి. గతంలో పొగాకు సాగును ఆపేసిన పాత గుంటూరు జిల్లా రైతులు మళ్లీ పొగాకు పంట వైపు మళ్ళారు. పొగాకు సాగు గణనీయంగా పెరిగింది.

పొగాకు బోర్డు పరిధిలో బర్లీ పొగాకు ఎందుకు లేదు? ప్రభుత్వం స్పందించాలి!

ఇండియన్‌ టొబాకో కంపెనీ, గాడ్‌ ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా లిమిటెడ్‌, దక్కన్‌ టుబాకో, పోలిశెట్టి కంపెనీ, పి.టి.పి, ఎం.ఎల్‌ మరియు అలియన్స్‌ వన్‌ కంపెనీలు బర్లీ పొగాకు సాగును ప్రోత్సహించాయి. కొందరు విత్తనాలిచ్చారు. కొందరు హామీలిచ్చారు. పొగాకు నారును సప్లరు చేశారు. కచ్చితంగా కొంటామని కొన్నిచోట్ల బాండ్లు ఇచ్చారు. పొగాకు బోర్డు పరిధిలో బర్లీ పొగాకు లేకపోవడంతో రైతులకు నష్టం జరుగుతుంది. బేరన్‌ పొగాకు / వర్జీనియా పొగాకు సాగు చేస్తున్నటువంటి రైతులకు టుబాకో బోర్డు కొన్ని రక్షణలు కల్పిస్తున్నది. టుబాకో బోర్డు కల్పిస్తున్న రక్షణలు, ప్రయోజనాలు బర్లీ పొగాకు పండించే రైతులకు లేవు. గత సంవత్సరం ధరలు కూడా రావటం లేదు. గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, ఏ ప్రాంతంలో ఏరకమైన పొగాకు, ఎంత మొత్తంలో సాగు చేశారనేది ప్రభుత్వం దగ్గర అంచనాలు ఉన్నాయో లేదో తెలియనటువంటి పరిస్థితి. పొగాకు మార్కెట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే మరెవరు జోక్యం చేసుకుంటారు? పొగాకు బోర్డు తన పరిధిలో లేదంటుంటే ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. రైతులు నిలువెత్తున మునిగిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా?

పంటలకు న్యాయమైన ధరలను సాధించుకోగల శక్తి రైతుల చేతుల్లోనే ప్రపంచంలోని పొగాకు ధరలు, సిగరెట్ల ధరలు, ఐ.టి.సి, బ్రిటిష్‌ అమెరికన్‌ టుబాకో కంపెనీ, ఫిలిప్‌ మోరిస్‌ లాంటి బహుళజాతి సంస్ధల (యం.యన్‌.సి) చేతిలో వున్నాయి. వారి లాభాలకు అంతులేదు. వారి నుండి పంటలకు న్యాయమైన ధరలను సాధించుకోగల శక్తి రైతుల చేతులలోనే వుంది. ప్రజా ఉద్యమాలతోనే తమ న్యాయమైన వాటాను సాధించకోగలరు. కార్పొరేట్‌ కంపెనీల చేతులలో కీలు బొమ్మలైన ప్రభుత్వాలు రైతుల ప్రయోజనాలను కాపాడ లేవు. బహుళజాతి సంస్ధలు రైతుల సంక్షేమం కోసం ఏర్పడలేదు. గిట్టుబాటు ధరలు కల్పించితే వారి లాభాలు తగ్గిపోతాయి. నీతి, జాతి లేనటువంటి యం.యన్‌.సి.లు, వారితో పోషింపబడుతున్న ప్రభుత్వాధిపతులు రైతులను కాపాడతారనుకుంటే, గొర్రె కసాయివాడిని నమ్మినట్లవుతుంది. లాభసాటి ధర కావాలంటే రైతులు నిలబడాలి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించి అమలు పరచమని పోరాడాలి.

తప్పుడు సెక్షన్లతో అణచివేతలో నరేంద్రమోడీ – డోనాల్డ్‌ ట్రంప్‌ ఇద్దరూ ఇద్దరే : ఇక్కడ ఎస్‌ఎఫ్‌ఐ శివానందన్‌ – అక్కడ మహమ్మద్‌ ఖలీల్‌ !

Tags

, , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇప్పటివరకైతే భారత్‌, అమెరికా రెండూ పెద్ద ప్రజాస్వామిక దేశాలే ఎవరూ కాదనటం లేదు. కానీ ఆచరణ చూస్తే నిరంకుశత్వానికి దారితీస్తున్నట్లుగా వ్యవహరించటం ఆందోళన కలిగిస్తోంది.వ్యవస్థలను దిగజారుస్తున్నారు, కొత్త అర్ధాలు చెబుతున్నారు, పాలకులను విమర్శించటాన్ని దేశద్రోహంగా చిత్రిస్తూ బ్రిటీష్‌ వలస పాలకులను గుర్తుకు తెస్తున్నారు. మన గతం గురించి మరచిపోయిన వారికి దాన్ని గుర్తు చేయటం కూడా ఒకందుకు మంచిదేనేమో ? ఏదీ ఊరికే రాదు అన్నట్లుగా మన స్వేచ్చ, స్వాతంత్య్రాలు ఊరికే రాలేదు అని కొందరైనా తెలుసుకుంటారు.రెండు చోట్లా చట్టాలు, నిబంధనలకు వక్రభాష్యాలు చెప్పి భావ ప్రకటన, నిరసన తెలిపే హక్కును హరించే ఉదంతాల గురించి చెప్పుకోవటం దేశ వ్యతిరేకతగా పరిగణించినా ఆశ్చర్యం లేదు, రోజులిలా ఉన్నాయి, ఏం జరిగినా ఎదుర్కోక తప్పదు మరి. గత ఏడాది ఏప్రిల్‌ నెలలో ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) అభివృద్ధి అధ్యయనాల విభాగంలో పిహెచ్‌డి చేస్తున్న రామదాస్‌ ప్రిని శివానందన్‌ అనే పరిశోధకుడిని సంస్థ సస్పెండ్‌ చేసింది. ఎందుకటా ! న్యూఢల్లీిలో విద్యార్ధులు భారత్‌ను రక్షించండి`బిజెపిని తిరస్కరించండి అనే నినాదంతో పార్లమెంట్‌వద్దకు ప్రదర్శన నిర్వహించారని, దానిలో భాగస్వామి కావటం జాతి వ్యతిరేకతకిందకు వస్తుందని కారణం చెప్పింది.కేరళలో దళిత సామాజిక తరగతికి చెందిన ఈ యువకుడు ముంబైలో చదువుతూ మహారాష్ట్ర ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా పని చేశాడు.


టిస్‌ చెప్పిన సాకులు లేదా కారణాలను చూస్తే ఎవరూ కూడా ప్రభుత్వాల విధానాల మీద నిరసనలు, అసమ్మతి తెలపటానికి వీల్లేదు. ఎందుకంటే ఏదో ఒక ప్రభుత్వ పథకం కింద ఆర్థికంగానో, సేవాపరంగానో ప్రతివారూ లబ్దిదారులే, అలాంటపుడు ఎవరూ ఏ ప్రభుత్వాన్నీ విమర్శించకూడదు, భజన మాత్రమే చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని ఢల్లీిలో జరిగిన ప్రదర్శనలో విమర్శించారు, దాన్లో పాల్గొన్నందున శివానందన్‌ జాతి వ్యతిరేకి అనటమే కాదు అతని మీద చర్యలు తీసుకొనేందుకు దర్యాప్తు సంస్థలు ముందుకు రావాలని కూడా టిస్‌ కోరింది. న్యాయవ్యవస్థ ఇంకా ఉనికిలో ఉంది గనుక తన సస్పెన్షన్‌ చెల్లదని ప్రకటించాలని కోరుతూ అతను బోంబే హైకోర్టుకు వెళ్లాడు. ఎంఎం సత్తాయి, ఎఎస్‌ చందూర్కర్‌ డివిజన్‌ బెంచ్‌ అతని పిటీషన్ను కొట్టివేస్తూ టిస్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయనున్నట్లు శివానందన్‌ చెప్పాడు. ఇది వ్యక్తిగత సమస్య కాదని మొత్తం విద్యార్ధి సమాజం మీద ప్రభావితం చూపనున్నందని అన్నాడు.కేంద్ర ప్రభుత్వం నుంచి ఫెలోషిప్‌ పొందుతున్న కారణంగా రాజకీయ పరమైన కార్యకలాపాల్లో పాల్గ్గొంటే చర్యలు తప్పవని, సంస్థలో ఉన్నపుడు రాజకీయ అభిప్రాయాలకు దూరంగా ఉండాలని కోర్టు పేర్కొన్నది. ఒక టెలికాం ఉద్యోగి యువకుడిగా ఉన్నపుడు ఒక యువజన సంఘ సమావేశంలో పాల్గొన్నందున ఉద్యోగం నుంచి తొలగించితే ఆ కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. అతను పాల్గొన్నది నిషేధిత సంస్థ కాదు, యువకులు యువజన సంఘాల సమావేశాల్లో గాక మరిదేనిలో పాలుపంచుకోవాలని ప్రశ్నిస్తూ ఉద్యోగం నుంచి తొలగించటాన్ని తప్పు పడుతూ జస్టిస్‌ ఓ చిన్నపరెడ్డి చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. తరువాత ఉద్యోగిగా ఆ యువకుడు ఉద్యోగ విరమణ చేసేవరకు టెలికాం ఉద్యోగుల యూనియన్లో కూడా చురుకుగా పని చేశారు.


కోర్టు పేర్కొన్న అంశాలు సరైనవి కాదని, ఒక విద్యార్ధి అర్హత పరీక్షలో పాసైనపుడు ఫెలోషిప్‌ ఒక హక్కు తప్ప దయాధర్మం కాదని, పరిశోధక విద్యార్థికి ఫెలోషిప్‌ ఇవ్వటం తనంతటతాను బతకటానికి అవసరమైన ఉద్యోగ సంపాదన కోసం కాదని, జాతి నిర్మాణ క్రమంలో తోడ్పడేందుకు ఇచ్చే మొత్తమని శివానందన్‌ చెప్పాడు. ఏ విద్యా సంస్థ అయినా జారీచేసే సర్క్యులర్‌ కంటే రాజ్యాంగం ఎంతో ముఖ్యమైనదని తాను భావిస్తున్నానని, రాజ్యాంగ హక్కును వినియోగించుకున్నందుకు తనను శిక్షించారని అన్నాడు. టిస్‌ లేదా ఏ విశ్వవిద్యాలయం జారీచేసే నిబంధనలు, సర్క్యులర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించకూడదని, విద్యా సంస్థలు నిష్పాక్షికంగా ఉండాలని, ఒక తరహా రాజకీయాలకు ఒక విశ్వవిద్యాలయం తనను తాను ఎలా అనుంబంధించుకుంటుదని ప్రశ్నించాడు.


పార్లమెంట్‌కు ప్రదర్శన బానర్‌ కింద భారత్‌ను రక్షించండి, బిజెపిని తిరస్కరించండి అనే నినాదంతో తాను ప్రదర్శనలో పాల్గొంటే తాను పట్టుకున్న ప్లకార్డు మీద టిస్‌ పేరు ఉన్నట్లు అధికారులు ఆరోపించారచెప్పాడు. ప్రోగ్రెసివ్‌ స్టూడెంట్స్‌ ఫోరమ్‌(పిఎస్‌ఎఫ్‌) ప్రధాన కార్యదర్శిగా ప్రదర్శనలో పాల్గొన్నాను తప్ప టిస్‌ ప్రతినిధిగా కాదని అన్నాడు. తనను సస్పెండ్‌ చేసిన టిస్‌ కమిటీ, హైకోర్టు ముందు కూడా తాను ఇదే చెప్పానన్నాడు. శివానందన్‌ 2015లో టిస్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌గా చేరి తరువాత అక్కడే ఎంఫిల్‌ పూర్తి చేసి పరిశోధక విద్యార్థిగా నమోదయ్యాడు. టిస్‌ గతంలో ఒక ప్రజాస్వామిక సంస్థగా కనీసం నటించేదని ఇటీవలి సంవత్సరాలలో విద్యార్ధులు చేపట్టే ఎలాంటి కార్యక్రమాలకు అనుమతించటం లేదని చెప్పాడు. అయోధ్యలో రామాలయ ప్రారంభాన్ని ఒక జాతీయ కార్యక్రమంగా చేపట్టినపుడు జాతీయ అవార్డు పొందిన ఆనంద పట్వర్ధన్‌ డాక్యుమెంటరీ ‘‘ రామ్‌ కె నామ్‌ (రాముడి పేరుతో ) ’’ ను అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రదర్శించారని తాను ఆ సమయంలో ప్రమాదంలో గాయపడి ప్రదర్శనకు రాలేకపోయానని, అయితే బాబరీ మసీదు విధ్వంసం సందర్భంగా జరిగిన దుర్మార్గమైన వాస్తవాలను తెలుసుకొనేందుకు అందరూ చూడాలని కోరుతూ తన అభిప్రాయాలను సామాజిక మాధ్యమంలో వెల్లడిరచగా దాన్ని కూడా దేశ వ్యతిరేక చర్యగా టిస్‌ తన మీదకు మళ్లించిందని పేర్కొన్నాడు. కేంద్రం నుంచి 50శాతం పైగా నిధులు పొందుతున్న సంస్థలన్నింటిని కేంద్రం తన ఆధీనంలోకి తెచ్చుకున్న తరువాత టిస్‌లో అనేక పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఎక్కడ పది మంది విద్యార్దులు కూర్చుంటే, చివరకు తమ గ్రూపు ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు ఒక చోట చేరినా సంస్థను అస్థిరపరిచేందుకు చూస్తున్నారంటూ చెదరగొట్టటం జరుగుతోందన్నాడు.శివానందాన్ని హెచ్చరిస్తూ అనేక సార్లు తప్పుడు నోటీసులు జారీ చేసింది. భగత్‌ సింగ్‌ స్మారక ఉపన్యాసం చేసేందుకు పిలిచిన అతిధులను వివాదాస్పద ప్రసంగీకులు అనే సాకుతో వారి పేర్లు లేకుండా ఇచ్చిన నోటీసు అలాంటి వాటిలో ఒకటి. సదరు వివాదాస్పద అతిధులు ఎవరంటే మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్‌, ప్రముఖ జర్నలిస్టు పి శాయినాధ్‌, జెఎన్‌యు మాజీ ప్రొఫెసర్‌, ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ మాజీ సంపాదకుడు గోపాల్‌ గురు. గతేడాది టిస్‌ విద్యార్ధి సంఘ ఎన్నికలను రద్దు చేసింది, ప్రోగ్రెసివ్‌ స్టూడెంట్స్‌ ఫోరమ్‌ను నిషేధించింది. విద్యార్థులు ఆందోళన చేయటంతో వెనక్కు తీసుకుంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే టిస్‌కు ఎలాంటి అభ్యంతరం ఉండదు, కేంద్ర ప్రభుత్వ ఫెలోషిప్‌ తీసుకొనే వారు బిజెపి రాజకీయాలను విమర్శించకూడదంటే నేను అంగీకరించను, దేశంలో ఉండాలంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బిజెపి సభ్యత్వం తీసుకోవటానికి లేదా సానుభూతిపరునిగా ఉండటానికి నన్ను బలవంతం చేయలేరని శివానందన్‌ చెప్పాడు.

అమెరికాలో ఏం జరుగుతోంది !
మహమ్మద్‌ ఖలీల్‌ అమెరికా పౌరసత్వం కలిగిన సిరియా దేశస్థుడు. అతని మీద చట్ట ఉల్లంఘనకు పాల్పడిన కేసులేవీ లేవు. అతన్ని బలవంతంగా సిరియా పంపేందుకు ట్రంప్‌ యంత్రాంగం చూస్తోంది. ఖలీల్‌ చేసిన నేరం ఏమిటో తెలుసా ? గాజాలో పాలస్తీనియన్లపై మారణకాండకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ దుశ్చర్యలను ఖండిస్తూ కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్ధుల నిరసనకు నాయకత్వం వహించటమే. వాక్‌, సభా స్వాతంత్య్రాలు విలసిల్లుతుంటాయని భావించే దేశంలో ఇది జరిగింది. అతని భార్య ఎనిమిది నెలల గర్భవతి, అరెస్టు చేసిన ఖలీల్‌ గ్రీన్‌కార్డును రద్దు చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం అతనుండే న్యూయార్క్‌ రాష్ట్రం నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లూసియానాలోని ఒక నిర్బంధ శిబిరానికి తరలించి తన మానవత్వ ముఖాన్ని ప్రదర్శించుకుంది. ఈ ఉదంతం తరువాత గ్రీన్‌ కార్డు ఉన్నంత మాత్రాన ఎవరూ అమెరికాలో శాశ్వతంగా ఉండే హక్కు ఉన్నట్లు కాదని ఉపాధ్యక్షుడు జెడివాన్స్‌ ప్రకటించాడు. అంటే ప్రభుత్వం తలచుకుంటే ఎప్పుడైనా రద్దు చేయవచ్చనే బెదిరింపు దీని వెనుక ఉంది. పాలస్తీనియన్లకు మద్దతుగా విద్యార్ధులు ఆందోళనకు దిగినపుడు స్థానికులా, వలస వచ్చినవారా అనే తేడా లేకుండా అందరూ నిరసనల్లో పాల్గొన్నారు. దీన్ని నాటి బైడెన్‌ సర్కార్‌ నేటి ట్రంప్‌ జమానా కూడా సహించటం లేదు. గాజాలో మారణకాండకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ నిస్సిగ్గుగా మద్దతు ఇస్తూ మానవహక్కుల పరిరక్షణ గురించి ప్రపంచానికి సూక్తులు వల్లిస్తారు.


పాలస్తీనియన్లకు మద్దతు పలికిన మహమ్మద్‌ ఖలీల్‌ మీద 1952 నాటి కమ్యూనిస్టు వ్యతిరేక చట్టంలోని సెక్షన్లను మోపటాన్ని బట్టి ట్రంప్‌ అసలు రూపం వెల్లడైంది. వలస వచ్చే వారు కమ్యూనిస్టు పార్టీ సభ్యుడైనా లేదా అనుంబంధం ఉన్నప్పటికీ వీసాలను తిరస్కరించటానికి లేదా అనర్హులుగా ప్రకటింటానికి ఆ చట్టం వీలు కల్పిస్తుంది. ఒకవేళ అమెరికా వచ్చినప్పటికీ తిరిగి పంపే అధికారం ప్రభుత్వానికి ఉంది. కమ్యూనిజానికి సంబంధించిన సాహిత్యాన్ని రాసినా, ముద్రించినా, తెలిసి కూడా పంపిణీ చేసినప్పటికీ తిప్పి పంపే అధికారం ఉంది. ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉన్నప్పటికీ అలాంటి చర్యలు తీసుకోవచ్చు. ఉదారవాదులనే పేరున్న ప్రతిపక్ష డెమోక్రాట్లలో కొందరు ఖలీల్‌ అరెస్టు, గ్రీన్‌కార్డు రద్దును మాట మాత్రంగా ఖండిరచినప్పటికీ తమ పాలిత న్యూయార్క్‌ రాష్ట్రవాసి అరెస్టు గురించి నిరసన వ్యక్తం చేయలేదు. అమెరికాలో గాడిద పార్టీ, ఏనుగు పార్టీ ఏదైనా ఒక్కటే అనేందుకు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు.కమ్యూనిస్టు వ్యతిరేకత, అమెరికా విదేశాంగ విధానాలపై విమర్శను రెండు పార్టీలూ సహించవు.


2023లో డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక ప్రతిజ్ఞ చేశాడు. అదేమంటే అమెరికా విధానాలను విమర్శించే విదేశీయులు, క్రైస్తవులను ద్వేషించే కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, సోషలిస్టులు ఎవరినీ అమెరికాలోకి అడుగుపెట్టనివ్వం దీనికి గాను 1952 నాటి చట్టాన్ని వినియోగిస్తాం,దేశీయంగా పెరిగన కమ్యూనిస్టులు, మార్క్సిస్టులను అదుపు చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని చెప్పాడు. ట్రంప్‌ తొలిసారి అధికారానికి వచ్చినపుడు అమెరికాను సోషలిస్టు దేశంగా మారనిచ్చే సమస్యేలేదని ప్రకటించటాన్ని అత్యధిక డెమోక్రాట్లు హర్షించారు. అయితే చరిత్రను చూస్తే కమ్యూనిస్టుల రాకను నిషేధించే చట్టం ఉన్నప్పటికీ పూర్తిగా నిరోధించటం గానీ, అమెరికాలో సోషలిస్టు, కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిని అడ్డుకోవటం గానీ చేయలేకపోయారన్నది వాస్తవం. మన దేశానికి చెందిన కష్మా సావంత్‌ వంటి వారు అనేక మంది అమెరికా వెళ్లి వామపక్ష వాదులుగా మారిన సంగతి తెలిసిందే. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అపేందుకు చూసిన ప్రబుద్దుల సంగతి తెలిసిందే, భావజాలమూ అంతే, ఎవరూ ఆపలేరు, ఎంతగా అడ్డుకుంటే అంతే వేగంతో విస్తరిస్తుందన్నది చరిత్ర చెప్పిన సత్యం !

అమెరికా దమన రీతి : ఎమెన్‌పై దాడి, గాజాలో తిరిగి మారణకాండ !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు


సామ్రాజ్యవాదులకు ప్రత్యేకించి ప్రపంచాన్ని తన చంకలో పెట్టుకోవాలని చూస్తున్న అమెరికన్లకు నిత్యం ఎక్కడో ఒక చోట ఉద్రిక్తతలు లేదా యుద్ధం ఉండాల్సిందే. అప్పుడే అక్కడి మిలిటరీ పరిశ్రమలు పని చేస్తాయి, బిలియన్ల కొద్దీ లాభాలు సంపాదించి పెడతాయి. ఒక వైపు ఉక్రెయిన్‌లో పోరు నివారిస్తా, పుతిన్‌తో మాట్లాడతా అంటున్న ట్రంప్‌ మరోవైపు మధ్య ప్రాచ్యంలోని ఎమెన్‌పై శనివారం నుంచి వైమానిక దాడులకు తెరతీశాడు. దీనికి కారణం ఏమిటి ? ఈ సందర్భంగా తోడేలు ` మేకపిల్లను కథను గుర్తుకు తెచ్చుకోవాలి. కాలువ నీటిని మురికి చేస్తూ నేను తాగేందుకు పనికి రాకుండా చేస్తున్నావంటూ మేకపిల్లతో తోడేలు దెబ్బలాటకు దిగింది. అదేమిటి నువ్వు ఎగున ఉన్నాను, నేను దిగువ ఉన్నాను, పైన నీళ్లు ఎలా మురికి అవుతాయని మేకపిల్ల ప్రశ్నించింది. నువ్వు గాకపోతే నీ అమ్మ మురికి చేసిందంటూ తోడేలు మేకపిల్ల మీద దాడి చేసి మింగేసింది. తాజా దాడులకు ట్రంప్‌ చెబుతున్న కారణం కూడా అదే మాదిరి ఉంది. ఎర్ర సముద్రంలో నౌకలపై జనవరి 19 తరువాత ఎమెన్‌ ఎలాంటి దాడులు జరపలేదు కదా ఇప్పుడెందుకు దానిపై యుద్ధానికి దిగారని ప్రశ్నిస్తే గతంలో వారు చేసిన దాడులతో మాకు ఎంతో నష్టం జరిగింది, ప్రాణాలకు ముప్పు తలెత్తిందని ట్రంప్‌ చెబుతున్నాడు. నిజానికి దుష్టాలోచనతోనే అమెరికా తెగించింది. గాజాలో కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇజ్రాయెల్‌ మరోసారి అక్కడి పౌరులను హత్య చేసేందుకు పూనుకుంది. సోమవారం రాత్రి నుంచి ఆకస్మికంగా వైమానిక దాడులు జరిపి వందలాది మంది ప్రాణాలు తీసింది. ఎలాంటి ముందస్తు ప్రకటనలూ చేయలేదు. మానవతా పూర్వక సాయం చేస్తున్న ప్రాంతాలను కూడా వదలలేదు. ఇదే సమయంలో దానికి మద్దతుగా ఎమెన్‌పై అమెరికా దాడులు ప్రారంభించింది.ఈ రెండిరటిని వేర్వేరుగా చూడలేము.


ఉద్రిక్తతలను సడలించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అగ్రరాజ్యం అమెరికా మధ్య ప్రాచ్యంలో మరోసారి అగ్నికి ఆజ్యం పోసింది. శనివారం నుంచి ఎర్ర సముద్ర తీరంలోని ఎమెన్‌పై వైమానికదాడులకు పూనుకుంది. రాజధాని సనా నగరంతో సహా 30 ప్రాంతాల మీద దాడులు జరుగుతున్నట్లు పెంటగన్‌ వర్గాలు పేర్కొన్నాయి. దానికి ప్రతిగా ఆ ప్రాంతంలో తిష్టవేసిన అమెరికా విమానవాహక యుద్ధనౌక, ఇతర మిలిటరీ నౌకలపై హౌతీ సాయుధులు దాడులు చేస్తున్నారు. అమెరికా దాడులకు తక్షణ కారణంగా చెబుతున్న సాకును చూస్తే దుష్టాలోచన కడుపులో పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండకు విరామంగా శాంతి ఒప్పందం కుదిరింది. దాన్ని అడుగడుగునా ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్‌ను పల్లెత్తు మాట అనని ట్రంప్‌ ఎమెన్‌పై దాడులకు ఆదేశించాడు. పదిరోజులుగా గాజాలోని పాలస్తీనియన్లకు బయటి నుంచి వస్తున్న సాయాన్ని అందనీయకుండా ఇజ్రాయెల్‌ అడ్డుకుంటున్నది. అలాగే కొనసాగితే తాము అటువైపు వెళ్లే నౌకలపై దాడులకు దిగుతామని హౌతీలు ప్రకటించారు తప్ప కొత్తగా ఎలాంటి దాడి చేయలేదు.ఈ ప్రకటనను సాకుగా తీసుకొని తమ నౌకలకు ముప్పు తలెత్తిందని, స్వేచ్చగా నౌకాయానం జరగాలంటూ దాడులు జరుపుతున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ దాడుల్లో కొంత మంది నేతలను చంపివేసినట్లు అధ్యక్ష భవనం ఒక ప్రకటన చేసింది. మొత్తం 53 మంది మరణించారు.


గాజా ప్రాంతంపై దాడులకు తెగబడి 2023 అక్టోబరులో మారణకాండకు పాల్పడిన ఇజ్రాయెల్‌ చర్యలను ఖండిస్తూ అప్పటి నుంచి ఇటీవలి శాంతి ఒప్పందం వరకు 136 యుద్ధ, వాణిజ్య నౌకలు ప్రత్యేకించి ఇజ్రాయెల్‌ వైపు ప్రయాణించేవాటిమీద హౌతీలు దాడులు జరిపారు.క్షిపణులు, డ్రోన్లతో జరిపిన దాడుల్లో రెండు నౌకలు మునిగిపోగా నలుగురు నావికులు మరణించారు. శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చిన జనవరి 19 నుంచి ఎలాంటి దాడులు లేవు. గాజాలోని పౌరులకు అందచేస్తున్న సాయాన్ని అడ్డుకుంటున్న ఇజ్రాయెల్‌ నౌకల మీద దాడులు చేస్తామని గత బుధవారం నాడు హౌతీలు ప్రకటించగా ఆ సాకుతో శనివారం నుంచి అమెరికా దాడులకు తెగబడిరది.‘‘ హౌతీల దాడుల కారణంగా అమెరికా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల డాలర్ల నష్టం జరిగింది.అమాయకుల ప్రాణాలకు ముప్పు తలెత్తింది ’’ అని ట్రంప్‌ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాడు. గాజాను మొత్తంగా సర్వనాశనం చేసి వేలాది మంది పౌరులను ఊచకోత కోసి ఇజ్రాయెల్‌ కలిగించిన బాధ, వేదనలు ట్రంప్‌కు కనిపించలేదు. ప్రస్తుతం ఎర్ర సముద్రంలో యుఎస్‌ఎస్‌ హారీట్రూమన్‌ విమానవాహక నౌక, మూడు నౌకాదళ డెస్ట్రాయర్లు, ఒక క్రూయిజర్‌ను అమెరికా మోహరించింది. ఇవిగాక యుఎస్‌ఎస్‌ జార్జియా అనే క్రూయిజ్‌ క్షిపణి జలాంతర్గామి కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నది. అమెరికా షిప్పింగ్‌, వైమానిక, నౌకాదళ ఆస్తుల రక్షణకు, స్వేచ్చగా నౌకా విహారం కోసం దాడులు చేసినట్లు ట్రంప్‌ చెప్పాడు.హౌతీల చర్యలకు పూర్తి బాధ్యత ఇరాన్‌దే అని ఆరోపించాడు. హౌతీల దాడులను ఇరాన్‌ చేసినట్లుగానే పరిగణిస్తామన్నాడు. నౌకలపై దాడులను ఆపేంతవరకు తమ దాడులు కొనసాగుతాయని చెప్పాడు.2025 జనవరి 20న రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత మరొక దేశంపై ట్రంప్‌ జరిపిన తాలిదాడిగా చరిత్రలో నమోదైంది.


2015లో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం నుంచి గతంలో ట్రంప్‌ నాయకత్వంలోని ప్రభుత్వం ఏకపక్షంగా ఉపసంహరించుకుంది. తాజాగా మరోసారి దాని గురించి చర్చించేందుకు ముందుకు రావాలని ఇరాన్‌కు లేఖ రాసినట్లు అమెరికా చెప్పింది. తాము సముఖంగానే ఉన్నామని అయితే వత్తిడి, బెదిరింపులతో చర్చలకు వచ్చేది లేదని, తమకు అందిన లేఖలో కొత్త విషయాలేమీ లేవని, దాని మీద తరువాత స్పందిస్తామని ఖమేనీ నాయకత్వం స్పష్టం చేసింది. ఒకవైపు సంప్రదింపుల ప్రకటనలు చేస్తూనే మరోవైపు రెచ్చగొట్టే విధంగా ట్రంప్‌ ఆచరణ ఉంది.తమతో ఒప్పందానికి రాకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని బెదిరించాడు.తమ విదేశాంగ విధానం ఎలా ఉండాలో ఆదేశించే అధికారం అమెరికాకు లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది.తమపై దాడులకు దిగిన అమెరికా నౌకాదళంపై 72 గంటల్లో నాలుగుసార్లు క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు ఎమెన్‌ హౌతీలు ప్రకటించారు. రెండు పక్షాలూ మిలిటరీ చర్యలను విరమించాలని ఐరాస కోరింది. అమెరికా దాడుల పర్యవసానాలను గల్ఫ్‌ దేశాలు పరిశీలిస్తున్నాయి, పరిమిత దాడులా లేక నిరవధికంగా సాగించేది స్పష్టం కాలేదు.తమ నౌకలపై దాడులను నిలిపివేసేంతవరకు తమ చర్యలు కొనసాగుతాయని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేత్‌ అన్నాడు. అమెరికా 47 వైమానిక దాడులు జరిపింది. ప్రపంచ నౌకా రవాణా ఎర్ర సముద్రం ద్వారా పన్నెండుశాతం జరుగుతోందని, అమెరికా దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని చర్చలు జరపాలని రష్యా కోరింది.చైనా కూడా అదే మాదిరి స్పందించింది.


నాలుగో వంతు షియా, నాలుగింట మూడువంతుల సున్నీ ముస్లిం తెగలతో కూడిన దేశం ఎమెన్‌. మిలిటరీ, నౌకారవాణా రీత్యా కీలకమైన అరేబియాఎర్ర సముద్రాలను కలిపే ఏడెన్‌ గల్ఫ్‌లో ఉన్న ఆసియా దేశం. ఎదురుగా ఆఫ్రికాలోని జిబౌటీ ఉంది. సౌదీ అరేబియా, ఓమన్‌, ఎర్ర సముద్రం, అరేబియా సముద్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. అరేబియా సముద్రంలో ప్రవేశించాలంటే ఎమెన్‌ దాటి రావాల్సిందే. ఈ కీలకమైన ప్రాంతాన్ని అదుపులోకి తెచ్చుకొనేందుకు అమెరికా దీర్ఘకాలంగా ప్రయత్నిస్తున్నది.మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ కేంద్రంగా ఉన్న ఒట్టోమన్‌ సామ్రాజ్యం పతనమైనపుడు ఉత్తర ఎమెన్‌ స్వతంత్ర దేశంగా అవతరించింది. అయితే బ్రిటీష్‌ వారు ఏడెన్‌ గల్ఫ్‌ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని దక్షిణ ఎమెన్‌ ప్రాంతాన్ని తమ రక్షిత వలస దేశంగా ఉంచుకున్నారు.1960దశకంలో సోవియట్‌ యూనియన్‌ మద్దతుతో రెండు సంస్థలు వలస పాలకులపై తిరుగుబాటు చేశాయి. దాంతో ఉత్తర ఎమెన్‌లో 1967లో విలీనం చేసేందుకు ఆంగ్లేయులు ప్రతిపాదించారు తరువాత జరిగిన పరిణామాల్లో 1972లో ఉత్తర,దక్షిణ ఎమెన్‌ ప్రాంతాలలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఉత్తర ఎమెన్‌లో ఉన్నవారికి కమ్యూనిస్టు వ్యతిరేక సౌదీ అరేబియా, దక్షిణ ఎమెన్‌కు సోవియట్‌ మద్దతు ఇచ్చింది. అదే ఏడాది కైరోలో కుదిరిన ఒప్పందం మేరకు రెండు ప్రాంతాలను విలీనం చేసేందుకు నిర్ణయించారు. రెండు చోట్ల వేర్వేరు ప్రభుత్వాలు ఉన్నాయి. 1979లో తిరిగి అంతర్యుద్ధం చెలరేగింది.1990లో విలీనం జరిగే వరకు ఉత్తర ఎమెన్‌కు సౌదీ మద్దతు కొనసాగింది.


వర్తమాన విషయాలకు వస్తే పేరుకు ఎమెన్‌ దేశంగా ఉన్నప్పటికీ, మొత్తం ప్రాంతాన్ని పాలించే ప్రభుత్వం పేరుకు మాత్రమే ఉంది. మొత్తం ఆరు సాయుధ శక్తులు ఆయా ప్రాంతాలపై పట్టు కలిగి ఉన్నాయి. నిత్యం చర్చల్లో ఉండేది హౌతీలు. ఎందుకంటే రాజధాని సనాతో సహా కీలక ప్రాంతాలన్నీ వారి చేతిలో ఉన్నాయి. అమెరికా లేదా ఇజ్రాయెల్‌ చేసే దాడులన్నీ ఈ ప్రాంతం మీదనే. వీరికి ఇప్పుడు ఇరాన్‌ మద్దతు ఇస్తుండగా వ్యతిరేకించే శక్తులకు గతంలో సౌదీ అరేబియా సాయం చేసేది. చైనా మధ్యవర్తిత్వంలో ఇరాన్‌, సౌదీ సాధారణ సంబంధాలు నెలకొల్పుకొనేందుకు అంగీకరించటంతో ఇప్పుడు సౌదీ సాయం నిలిచిపోయింది.హౌతీలను వ్యతిరేకించేవారికి అమెరికా మద్దతు కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌తో పాటు తన మద్దతుదార్లకు తోడ్పడేందుకు అమెరికా గతంలో, తాజా దాడులు జరుపుతోంది. హౌతీ అంటే దేవుడి సహాయకులు అనే అర్ధంతో పాటు ముస్లింలో ఒక గిరిజన తెగ అది. ఇతర ముస్లింలకు దీనికి తేడా ఉంది, వీరు ఎమెన్‌లో తప్ప మరో ఏ ఇస్లామిక్‌ దేశంలోనూ లేరు.


శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇజ్రాయెల్‌ నిరాశ్రయులైన పాలస్తీనియన్లకు బయటి నుంచి వస్తున్న సాయాన్ని అందకుండా అడ్డుకుంటున్నది.మరోవైపు హమాస్‌ మీద నిందలు వేస్తూ సోమవారం రాత్రి నుంచి గాజాలోని గుడారాల్లో ఆశ్రయం పొందిన అభాగ్యుల మీద వైమానిక దాడులకు తెగబడి 200 మందికి పైగా ప్రాణాలు తీసినట్లు వార్తలు వచ్చాయి. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని భావిస్తున్నారు. బుధవారం ఉదయానికి అందిన సమాచారం మేరకు 400గా తేలింది. వీరిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. హమస్‌ తిరిగి సాయుధంగా తయారవుతున్నదని, వారి నేతల మీదనే దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రపంచాన్ని నమ్మించేందుకు పూనుకుంది. బందీల విడుదలకు హమస్‌ తిరస్కరిస్తున్నదని, కాల్పుల విరమణకు తమ ప్రతిపాదనలను ఆమోదించటం లేదంటూ పెద్ద ఎత్తున దాడులకు మిలిటరీని పంపాలని ప్రధాని నెతన్యాహు ఆదేశించాడు. ఇది ప్రారంభం మాత్రమే అని పెద్ద ఎత్తున దాడు చేయనున్నట్లు చెప్పాడు. గాజాలో నరక ద్వారాలు తెరుస్తామని మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ చెప్పాడు. గతంలో అంగీకరించిన ఒప్పందంలో రెండవ దశను ఉల్లంఘించేందుకే తాజా దాడులని పరిశీలకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ ఏకపక్షంగా కాల్పుల విరమణకు స్వస్థి పలుకుతున్నదని హమస్‌ విమర్శించింది. మరోసారి ప్రారంభమైన దమనకాండకు అమెరికా కూడా బాధ్యత వహించాల్సిందే !

ఎర్రపూల వనం : మావో లిటిల్‌ రెడ్‌ బుక్‌ అట్ట రంగు నీలం ! అయితేనేం, అంశాలు కమ్యూనిజమే కదా !!

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


పిల్లి నల్లదా తెల్లదా అన్నది కాదు, అది ఎలుకల్ని వేటాడుతుందా లేదా అన్నదే చూడాలన్నది ఒక చైనా సామెత. కమ్యూనిస్టులు ముద్రించే సాహిత్యం అంటే ఎర్రటి అట్టలుంటాయని చాలా మంది అనుకుంటారు, అది పాక్షికంగా వాస్తవం కూడా. పోలీసులు నక్సలైట్లను బూటకపు ఎన్‌కౌంటర్లలో హత్య చేసినపుడు వారి దగ్గర స్వాధీనం చేసుకున్నట్లు చెప్పిన వస్తువుల్లో ఎర్ర అట్టలతో ముద్రించిన పుస్తకాలను కూడా చూపేవారు. నిజానికి ఎర్ర అట్టలతో పుస్తకాలు ముద్రించిన వారిలో ఎందరు చివరి వరకూ కమ్యూనిస్టులుగా ఉన్నారు ? గాడి తప్పి జెండాను పక్కన పడేయటం, ఉద్యమాన్ని నాశనం చేయటం, ద్రోహం చేసిన వారి చరిత్రలు తెలిసినవే. సాంస్కృతిక విప్లవం పేరుతో అమలు జరిపిన కార్యక్రమానికి ముందు మావో జెడాంగ్‌ ఆలోచనలతో కూర్చిన ఒక పుస్తకాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ 1964లో ప్రచురించింది. దాన్నే లిటిల్‌ రెడ్‌ బుక్‌ అని పిలిచారు. ఆ పుస్తకపు తొలి ముద్రణ అట్ట నీలి రంగులో ఉంది.తరువాత అది ఎర్ర అట్టతో వందకోట్లకు పైగా ముద్రణలు పొందిందని చెబుతారు. తొలి నీలి రంగు ప్రతి అరుదైనదిగా మారింది. ఈ ప్రతిని ఏప్రిల్‌లో న్యూయార్క్‌లో జరిగే అంతర్జాతీయ ప్రాచీన పుస్తక ప్రదర్శనలో ప్రదర్శించటమే గాక వేలంలో దాని ధరగా పదిలక్షల పౌండ్లు నిర్ణయించారు. విప్లవంలో చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ పాత్ర గురించి మావో చెప్పిన అంశాలతో ఈ పుస్తకం ప్రారంభమౌతుంది. 1964 ముద్రణకు ముందు చైనా ప్రజా విముక్తి సైన్యాన్ని ఉద్దేశించి మావో చెప్పిన అంశాలతో సంకలనం జరిగింది. తరువాత అనేక మార్పులు, చేర్పులతో మరింత స్పష్టత,క్లుప్తతతో రూపొందించారు. ఈ పుస్తక ముద్రణ తరువాత 1966లో వివాదాస్పద సాంస్కృతిక విప్లవ కార్యక్రమాన్ని అమలు చేశారు. అప్పుడు ఎర్ర అట్టతో మరోసారి మార్పులు చేసిన ఈ గ్రంధం అనేక ముద్రణలు పొందింది. జస్టిన్‌ ష్కిల్లర్‌ అనే అమెరికన్‌ రెండు దశాబ్దాలకు పైగా వివిధ దేశాల నుంచి అపురూప పుస్తకాలను సేకరించాడు. 1990 దశకం ప్రారంభంలో ష్కిల్లర్‌ చైనా వెళ్లాడు. ఆ సమయానికి 1963నాటి ముద్రణ ప్రతులను సంస్థలు, వ్యక్తులు పక్కన పడేశారని ఆ తరుణంలో ఆ ప్రతిని సంపాదించినట్లు పుస్తకాల అమ్మకాలను పర్యవేక్షిస్తున్న లండన్‌కు చెందిన అపురూప పుస్తకాల డీలర్‌ మాట్‌ విల్స్‌ చెప్పాడు. ఈ ప్రదర్శన`అమ్మకంలో అనేక తొలి , అంతర్జాతీయ ముద్రణల అపురూప ప్రతులను ప్రదర్శిస్తారు.


మావో ఆలోచనా విధానంలో కొన్ని అంశాలను తరువాత చైనా కమ్యూనిస్టు పార్టీ పక్కన పెట్టినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ పాత్ర, విప్లవ అనుభవాల గురించి మావో చెప్పిన అనేక అంశాలు ఇప్పటికీ చైనా కమ్యూనిస్టులకు, అంతర్జాతీయంగా మార్గదర్శకంగానే ఉన్నాయి. మరణానంతరం మావో పాత్రను తగ్గించటం లేదా విస్మరించటం వంటి తప్పిదాలకు కమ్యూనిస్టు పార్టీ పాల్పడలేదు.ప్రతి ఒక్కరూ ధనవంతులౌతారని ఊహించుకోవటానికే భయం వేస్తున్నదని ఆ పుస్తకంలో ఒక సందర్భంగా మావో చెప్పారు. ఆరుదశాబ్దాల తరువాత చైనా ఆ దిశగా ప్రయాణిస్తుందని, అసాధ్యం అనుకున్నదానిని తాను మార్గదర్శకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీ సుసాధ్యం చేసే బాటలో పయనిస్తుందని మావో ఊహించి ఉండరు. లిటిల్‌ రెడ్‌ బుక్‌ ప్రతిని ఎవరు స్వంతం చేసుకుంటారో, విక్రేతలు ఆశిస్తున్నట్లుగా పదిలక్షల పౌండ్లకా తక్కువ ఎక్కువలకు అమ్ముడు పోతుందా అన్నది వేరే అంశం. మావో జీవితాంతం వ్యతిరేకించిన ధనికస్వామ్యపు ప్రతినిధులు, భాగస్వాములే దాన్ని సొంతం చేసుకుంటారు. వారికి అది ఒక అలంకరణ వస్తువు మాత్రమే. కమ్యూనిస్టులు, కష్ట జీవులు అంత ధరకు కొనుగోలు చేయరు గానీ దానిలో ఉన్న అంశాలను మాత్రం సొంతం చేసుకుంటారు, ఆచరించేందుకు చూస్తారు, భవిష్యత్‌ తరాలకు అందిస్తారు.

సైప్రస్‌లో మరో కమ్యూనిస్టు పార్టీ !
ప్రాణం ఉన్నంత వరకు జీవి బతుకుపోరాటం చేస్తూనే ఉంటుంది. అలాగే సజీవంగా ఉన్న ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో నిరంతరం మధనం జరుగుతూనే ఉంటుంది. సైప్రస్‌లో కొందరు 2024 సైప్రస్‌ కమ్యూనిస్టు ఇనీషియేటివ్‌(సిసిఐ) పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. సైప్రస్‌ కమ్యూనిస్టు పార్టీ అకెల్‌(ప్రోగ్రెసివ్‌ పార్టీ ఆఫ్‌ వర్కింగ్‌ పీపుల్‌) కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు క్రిస్టోస్‌ కౌర్టెల్లారిస్‌ దీనికి నాయకత్వం వహిస్తున్నాడు. క్రిస్టోస్‌ తాత అకెల్‌ ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. తాము ఎన్నికల్లో పాల్గ్గొనటం కంటే సంస్థాగతంగా పటిష్టం కావటానికి ప్రాధాన్యత ఇస్తామని, కమ్యూనిస్టు పార్టీ లేని లోటును పూడుస్తామని తాజాగా ఆ పార్టీనేత ఒకరు చెప్పారు.అకెల్‌ పార్టీ సైప్రస్‌ పార్లమెంటులోని 56 స్థానాలకు గాను 15 సీట్లతో, 21శాతం ఓట్లతో రెండవ స్థానంలో ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని సిసిఐ చెప్పుకుంది.

దక్షిణ కొరియాలో కమ్యూనిస్టు వ్యతిరేకత`క్రైస్తవ సువార్తకులు !
దక్షిణ కొరియాలో సైనిక పాలన ప్రకటించి తీవ్ర వ్యతిరేకత వెల్లడి కావటంతో కొద్ది గంటల్లోనే రద్దు చేసిన అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ మీద కోర్టు తీర్పు వెలువడనుండగా అతగాడికి మద్దతుగా, వ్యతిరేకంగా శనివారం నాడు లక్షల మంది రాజధాని సియోల్‌ పట్టణంలో ప్రదర్శనలు జరిపారు. వ్యతిరేకంగా పదిలక్షల మంది, అనుకూలంగా మూడున్నరలక్షల మంది పాల్గ్గొన్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. కమ్యూనిస్టు ముప్పు నుంచి తప్పించేందుకే తాను మిలిటరీ పాలన విధించానని యూన్‌ సమర్ధించుకున్నప్పటికీ గద్దె దిగాల్సిందేనని పార్లమెంటు గతేడాది డిసెంబరులో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది, దాన్ని ధిక్కరించటంతో అరెస్టు కూడా చేశారు. మార్చినెల ఏడవ తేదీన అరెస్టు వారంటును కోర్టు రద్దు చేయటంతో జైలు నుంచి విడుదల చేశారు, యూన్‌ పార్లమెంటు చర్యను కోర్టులో సవాలు చేశాడు. అక్కడి చట్ట ప్రకారం తిరుగుబాటు చేసిన వారికి ఉరిశిక్ష, జీవిత ఖైదు విధించవచ్చు, తప్పుచేయలేదంటే అధ్యక్షుడు గనుక తిరిగి పదవిలో కూర్చో పెట్టవచ్చు. తీర్పు సమయం దగ్గరపడిన కొద్దీ దేశంలో అనుకూల, వ్యతిరేక వర్గాలు సమీకరణలకు పూనుకున్నాయి. యూన్‌ తరఫున అక్కడి క్రైస్తవ ఇవాంజెలికల్స్‌ రంగంలోకి దిగారు. తమ అధ్యక్షుడిని తిరిగి గద్దె మీద ప్రతిష్టించాలని డిమాండ్‌ చేస్తున్నారు.దేశమంతటా ఈ మేరకు ప్రదర్శనలు చేస్తూ కమ్యూనిజం ముప్పు ఉన్నందున రక్షకుడిగా యూన్‌ ఉండాల్సిందేనంటూ ఉపన్యాసాలు చేస్తున్నారు.దేవుడు రచించిన మంచి పధకంలో భాగంగానే యూన్‌ చర్యలు తీసుకున్నాడంటూ బోధలు, ప్రార్ధనలు చేస్తున్నారు. చివరి వరకు పోరాడాల్సిందేనంటూ యూన్‌కు మద్దతు తెలుపుతున్నారు.దేశంలోని క్రైస్తవులు రెండు పక్షాలుగా చీలిపోయారు. మూడిరట రెండు వంతుల మంది సీనియర్‌ పాస్టర్లు యూన్‌ తొలగింపును సమర్ధిస్తున్నట్లు సర్వే వెల్లడిరచింది.అమెరికాలో ఎవాంజెలికల్స్‌ డోనాల్డ్‌ ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నట్లే దక్షిణ కొరియాలో కూడా యూన్‌కు మద్దతు ఇస్తున్నారు. ఉత్తర కొరియా, చైనా ఏజంట్లు, మద్దతుదార్లు దక్షిణ కొరియా ప్రభుత్వంలో చొరబడినట్లు, వారందరినీ రూపుమాపాల్సిందేనని వారు సాధారణ జనాన్ని రెచ్చగొడుతున్నారు.యూన్‌ తిరిగి అధికారానికి రాకపోతే చైనా, ఉత్తర కొరియా అనుకూల పార్లమెంటు సభ్యులు దేశాన్ని చైనాకు సామంత దేశంగా, సోషలిస్టు రాజ్యంగా మార్చుతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 1950దశకంలో ఉత్తర కొరియాపై అమెరికా దాడి చేసినపుడు దాన్ని పవిత్ర యుద్ధంగా దక్షిణ కొరియాలోని చర్చి వర్ణించి అమెరికాకు మద్దతు పలికింది. ఇటీవలి పరిణామాల గురించి యూట్యూబర్లు పెద్ద ఎత్తున రంగంలోకి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు, వారి వెనుక ఎవరు ఉన్నదీ అర్ధం చేసుకోవటం కష్టం కాదు.

అమెరికాను వెన్నాడుతున్న చైనా కమ్యూనిస్టు భయం !
కమ్యూనిజాన్ని ఏడు నిలువుల లోతున పాతి పెట్టామని, విజయం సాధించామని మూడు దశాబ్దాల క్రితం ప్రకటించుకున్న అమెరికాను ‘‘ కమ్యూనిస్టు భూతం ’’ ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇటీవల అమెరికా జాతీయ భద్రతకు చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి ఎలా ముప్పు వచ్చిందో చెప్పాలంటూ పార్లమెంటరీ కమిటీ కొన్ని ప్రశ్నలను సంధించింది. చైనా వాంఛలేమిటి, సైబర్‌, అంతర్గత భద్రతకు దాన్నుంచి ముప్పు ఎలా ఉంది, చైనా వివిధ దేశాల నుంచి ఎలా ముప్పు కలిగిస్తోందో చెప్పాలని కోరింది. దానికి గాను ఆ కమిటీ ముందు వివరించిన అంశాల సారం ఇలా ఉంది. చైనా కమ్యూనిస్టు పార్టీ జాతీయవాదంతో పని చేస్తోంది. సామ్రాజ్యవాదుల చేతిలో దశాబ్దం పాటు పొందిన అవమానాలకు బదులు తీర్చుకోవాలని చూస్తోంది.అమెరికా నాయకత్వంలోని ప్రపంచ వ్యవస్థను అధిగమించాలన్న పెద్ద పథకంతో ఉంది.సాంకేతికంగా, ఆర్థికంగా, మిలిటరీ పరంగా కూడా అధిగమించే, ఓడిరచే సత్తాను సమకూర్చుకోవాలని చూస్తోంది. పశ్చిమార్ధగోళంలో మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది.భూ, సముద్ర, ఆకాశంలో కూడా మిలటరీ రీత్యాపై చేయిగా మారాలనుకుంటున్నది.


అంతర్జాతీయ సంస్థలలో నాయకత్వ పాత్రకోసం,పశ్చిమ దేశాల కూటమిని చీల్చాలని చూస్తోంది. అమెరికా వ్యక్తిగత సమాచారాన్ని పొందటం ద్వారా గూఢచార అవసరాలను తీర్చుకోవాలని, లక్ష కోట్ల మేథోసంపత్తి సంపదను కొట్టేసేందుకు వివిధ కంపెనీలు, అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో చొరబడాలని, ఉన్నత అధికారుల వివరాలను సేకరించాలని, యుద్ధ సమయాలలో గగనతలంలో పోరు సాగించేందుకు అవసరమైన ఏర్పాట్లకోసం ప్రయత్నిస్తున్నది. చైనా నుంచి పని చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఉత్పత్తులను అమెరికా ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయటాన్ని నిషేధించాలి.అమెరికా వ్యవస్థలు, కంపెనీలు ఎలా పనిచేస్తున్నదీ తెలుసుకొనేందుకు చైనా ప్రయత్నించటాన్ని అనుమతించకూడదు. అమెరికా వ్యవస్థలలో వినియోగించేందుకు చైనా కంపెనీల పరికరాలను నిషేధించాలి.అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ఫెంటానిల్‌ తయారీకి చైనా ప్రభుత్వం కంపెనీలకు రాయితీలు ఇస్తున్నది.రహస్యంగా పనిచేస్తున్న చైనా బాంకులు ఫెంటానిల్‌ సరఫరాదార్లకు తోడ్పడుతూ వచ్చిన లాభాలను స్వంతం చేసుకుంటున్నాయి. ఇలాంటి సంస్థలు, వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించాలి.నగదు చేతులు మారకుండా అవసరమైన మేరకు చట్టాలను సవరించాలి.


పార్లమెంటరీ కమిటీ ముందు ఈ అంశాలన్నింటినీ చెప్పిన తరువాత రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ బైరన్‌ డోనాల్డ్స్‌ అమెరికా మద్దతు ఇస్తున్న తైవాన్‌ చట్టం పేరుతో ఒక బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టాడు. తైవాన్‌ స్వాతంత్య్రానికి మద్దతు ఇవ్వాలని, అమెరికా పత్రాల్లో చైనీస్‌ తైపే అనే పదాలకు బదులు తైవాన్‌ అని సవరించాలని, ఆ మేరకు అన్ని వెబ్‌సైట్లలో మార్చాలని ప్రతిపాదించాడు. అమెరికాకు వ్యూహ్మాక భాగస్వామిగా తైవాన్‌ ఉండాలని బైరన్‌ చెప్పాడు. ప్రపంచ వేదికల మీద చైనా తన ప్రభావాన్ని పెంచుకొనేందుకు చూస్తున్నదని అన్నాడు.డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత మరోసారి చైనా మీద వాణిజ్య యుద్ధం ప్రారంభించిన తరువాత ఇలాంటి రెచ్చగొట్టే అంశాలను పార్లమెంటులో ప్రతిపాదించటం ఆశ్చర్యం కలిగించటం లేదు. ఇంకా ఇలాంటివి ఎన్నింటిని చూడాల్సి వస్తుందో !

పైసామే పరమాత్మ : ఎలన్‌ మస్క్‌తో చేతులు కలిపిన ‘‘ దేశభక్త ’’ జియో, ఎయిర్‌టెల్‌ ! దేశ రక్షణ సంగతేమిటి !!

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ నేతలను మన చుట్టూ తిప్పుకోగల విశ్వగురువుగా నరేంద్రమోడీని కొంత మంది గతంలో వర్ణించారు, అది ఒక కోణంలో నిజమే, బహుళజాతి గుత్త సంస్థలన్నీ మన మార్కెట్‌లో ప్రవేశించేందుకు మోడీ చుట్టూ తిరుగుతున్నారు. రెండోవైపు చూస్తే ప్రపంచ పెట్టుబడిదారుల నేతలను ప్రసన్నం కావించుకొనేందుకు సంతుష్టీకరించేందుకు మోడీ వారి చుట్టూ తిరుగుతున్నారు. తెరవెనుక జరిగే దీని గురించి కోటి మంది గొంతెత్తినా నమ్మని వారి కళ్లు తెరిపించేందుకు ఒక్క దృష్టాంతం చాలు. ఇప్పుడు అదే జరిగింది, అయినా మేం నమ్మం అనేవారిని ఎవరేం చేయలేరు.అంబానీ చెప్పినట్లు నరేంద్రమోడీ వినటం పదేండ్లుగా జరుగుతున్న సాధారణ విషయం. అదే మోడీ డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పినట్లు నడుచుకోవటమే అసలైన వార్త. అదేమిటంటారా ? ఎలన్‌మస్క్‌ స్పేస్‌ఎక్స్‌ కంపెనీ స్టార్‌లింక్‌ ఉపగ్రహ అంతర్జాల సేవలకు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కానీ ఆ కంపెనీ సేవలను తమ ఖాతాదార్లకు అందించటానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు జియో అధినేత ముకేష్‌ అంబానీ, ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ మిట్టల్‌ వెల్లడిరచారు. వారికలా ముందే తెలిసిపోతాయి మరి. దీన్ని బట్టి నేర్చుకోవాల్సిందేమిటంటే ఆలూలేదూ చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెతను తిరిగి రాసుకోవాలి. ఆలూచూలూ లేకుండానే కొడుకును కనొచ్చు, పేరుపెట్టవచ్చు. స్టార్‌లింక్‌ను మన దేశంలో ప్రవేశపెట్టేందుకు 2021 నుంచి ఎలన్‌మస్క్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికింకా అనుమతి ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే గిస్తే అనే పేరుతో ఒప్పందం చేసుకోవటం విశేషం. దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ ఆమోద ముద్ర లాంఛనమే అన్నది తేలిపోయింది. మన దేశ దిగ్గజాలను ఒప్పించేందుకు మెప్పించేందుకు ఇంతకాలం స్టార్‌లింక్‌కు అనుమతి ఇవ్వలేదని, ఒక అవగాహనకు వచ్చిన తరువాత పచ్చజెండా ఊపేందుకు నిర్ణయించినట్లు స్పష్టమైంది.


కొంత మంది దృష్టిలో స్వదేశీ కార్పొరేట్‌ శక్తులు దేశభక్తులు, ఎప్పటి వరకు అంటే కారణాలు ఏమైనప్పటికీ వారు విదేశీ కార్పొరేట్లతో పోరాడినంతవరకు, తరువాత ? స్వాతంత్య్రానికి ముందు మహాత్మాగాంధీకి నాటి ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్త బిర్లా కుటుంబం ఎంతో మద్దతు ఇచ్చింది. అంతకు ముందు దాదాభాయ్‌ నౌరోజీ బరోడా రాజు దగ్గర దివాన్‌(మంత్రి)గా పనిచేశారు, బ్రిటన్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు, మూడుసార్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు, రెండవ సోషలిస్టు ఇంటర్నేషనల్లో సభ్యుడిగా కూడా స్వల్పకాలం పని చేశారు. మనదేశ సంపదను బ్రిటన్‌ ఎలా పీల్చివేస్తున్నదో తెలియచెప్పారు.వారే కాదు, అనేక మంది స్వదేశీ వాణిజ్య, పారిశ్రామికవేత్తలు స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో బ్రిటీష్‌ వారిని వ్యతిరేకించారు. ఎవడి గోలవాడిది, ఎవరి కారణం వారిది.చాలా మందికి భూ సంస్కరణలు అంటే భూమికోసం, భుక్తికోసం పోరాటాలు జరిపిన కమ్యూనిస్టుల కారణంగానే మనదేశంలో వాటిని ప్రవేశపెట్టారని అనుకుంటారు. అది వాస్తవం కాదు, అసలు కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడక ముందే వాటికి నాంది పలికారు. నూతన వ్యవస్థ రూపుదిద్దుకుంటున్నపుడు దానికి పాతవ్యవస్థ ఆటంకంగా ఉంటే బద్దలు కొట్టి మరీ అవతరిస్తుంది. కోడి గుడ్డులో పిల్ల ఏర్పడగానే అది బయటకు వచ్చేందుకు అంతకు ముందు రక్షణగా ఉన్న పెంకెను బద్దలు కొట్టుకొని బయటకు వస్తుంది తప్ప అయ్యో ఒకనాడు నాకు రక్షణగా ఉందే అని జాలిపడదు. పెట్టుబడిదారీ వ్యవస్థ పురోగమనానికి ఆటంకంగా ఉన్న ఫ్యూడల్‌ వ్యవస్థను బద్దలు కొట్టటమే ఫ్రెంచి విప్లవ సారం. అది భూసంస్కరణలకు తెరలేపింది. మన దేశంలో స్వదేశీ పెట్టుబడిదారులు ఎదిగేందుకు వలస పాలన, విదేశీ కంపెనీలు ఆటంకంగా ఉన్నాయి. అందుకే బిర్లావంటి పారిశ్రామికవేత్తలు, దాదాభాయ్‌ నౌరోజీ వంటి వాణిజ్యవేత్తలు కూడా వలస పాలనను వ్యతిరేకించారు. ఇది దోపిడీ వర్గ మిత్రవైరుధ్యం, ప్రతి వలస దేశంలోనూ కనిపిస్తుంది. స్వాతంత్య్రం తరువాత బిర్లా వంటి వారు ఏం చేశారన్నది చూస్తే మరింతగా అర్ధం అవుతుంది.


బడా పరిశ్రమల ఏర్పాటుకు తమ వద్ద తగినంత పెట్టుబడిలేని కారణంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పేరుతో ప్రభుత్వరంగాన్ని ఆమోదించారు. తగిన బలం పుంజుకున్న తరువాత నూతన ఆర్ధిక విధానాల పేరుతో ఒక్క రక్షణ సంబంధిత రంగాలలో తప్ప మిగతా వాటిలో ప్రభుత్వ పెట్టుబడులు పెట్టకుండా చేయటంలో విజయం సాధించారు. విదేశీ కంపెనీలకు ద్వారాలు తెరవటంతో వాటితో పోటీ పడలేక చేతులు కలిపి సంయుక్త సంస్థల ఏర్పాటుతో లాభాలను పంచుకొనేందుకు చూశారు. ఇవి ముఖ్యంగా ఆటోమొబైల్‌, బీమా తదితర రంగాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. స్వరాజ్‌మజ్డా, మారుతీసుజుకీ, ఇండోసుజుకీ, హీరోహోండా, టాటాడైల్మర్‌,మహింద్రరేనాల్ట్‌, భారతీఆక్సా ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. సర్దుకుపోదారం రండి అనటానికి ఇవి ఉదాహరణలు. పోటీబడి దెబ్బలాడుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు రిలయన్స్‌అమెజాన్‌ ఉదంతం.దేశంలో రిటైల్‌ రంగంలో తమకు పోటీ లేకుండా చూసుకోవాలని చూసిన రిలయన్స్‌ను దెబ్బతీసేందుకు ఫ్యూచర్‌ గ్రూపు దుకాణాలను కొనుగోలు చేయాలని అమెజాన్‌ చూసింది. దాన్ని పడనీయకుండా రిలయన్స్‌ రంగంలోకి దిగింది. చివరికి ఫలితం ఏమంటే 2022 నుంచి ఫ్యూచర్‌ గ్రూపు మూతపడిరది. ముకేష్‌ అంబానీ నేడు ఎలన్‌ మస్క్‌తో రాజీకి వచ్చినట్లే అమెజాన్‌తో కూడా చేతులు కలిపి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. నాడు రిలయన్స్‌కు ప్రధాని మోడీ అండగా ఉన్నారు గనుకనే అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ మూడు రోజుల పాటు ఢల్లీిలో మకాం వేసినా మోడీ దర్శన భాగ్యం కలగక వెనక్కు తిరిగి వెళ్లిపోయినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి. ఇప్పుడు రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌ కంటే బలమైన స్టార్‌లింక్‌కు సాక్షాత్తూ డోనాల్డ్‌ట్రంపే మద్దతు ఇస్తున్నందున దాన్ని అడ్డుకోవటానికి మోడీకి 56 అంగుళాల ఛాతీ సరిపోయినట్లు కనిపించటం లేదు. సముద్రపు భారీ అలలకు వెన్ను వంచి తప్పించుకోవటం తప్ప ఎదురునిలిచినవారెవరూ బతికి బట్టకట్టలేరు, జియో, ఎయిర్‌టెల్‌ అదే చేశాయి. అడ్డుకొనేందుకు చూసి పోటీ పడలేక తెల్లజెండా ఎత్తి చేతులు కలిపాయి. ఫిబ్రవరి రెండవ వారంలో అమెరికా పర్యటనలో నరేంద్రమోడీతో ఎలన్‌మస్క్‌ భేటీలోనే ఆ కంపెనీలకు ఉప్పంది ఉంటుంది. ఈ మూడూ కలసి వినియోగదారులకు లబ్దిచేకూరుస్తాయా, ఒక్కటిగా చేరి పీక్కు తింటాయా చూడాల్సి ఉంది.


ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ వ్యాపారాల్లో ఉపగ్రహ ఆధారిత స్టార్‌లింక్‌ అంతర్జాలం అది పెద్దది, 125దేశాల్లో సేవలను అందిస్తున్నది.అనేక సంస్థలను మింగేసింది. మనదేశంలో జియో, ఎయిర్‌టెల్‌ కూడా అలాంటివే. స్టార్‌లింక్‌ను మనదేశంలో ప్రవేశపెట్టాలని ఎలన్‌మస్క్‌ గత నాలుగు సంవత్సరాలుగా ఎంతగా ప్రయత్నిస్తున్నాడో ఈ రెండు కంపెనీల యజమానులు తమ పలుకుబడిని ఉపయోగించి అంతే గట్టిగా ఇప్పటివరకు అడ్డుకున్నాయి. చివరకు ట్రంప్‌ వత్తిడిని మోడీ అడ్డుకోలేరని గ్రహించి తామే లొంగి ఎంత దక్కితే అంతే ప్రాప్తం అన్నట్లుగా రాజీపడ్డాయి. మన దేశ కార్పొరేట్ల తీరుతెన్నులకు ఇది మరొక నిదర్శనం.2023 డిసెంబరులో చేసిన టెలికాం చట్ట ప్రకారం భూ సంబంధ స్పెక్ట్రమ్‌ వేలం ద్వారా, ఉపగ్రహ స్పెక్ట్రమ్‌ను అధికారయంత్రాంగం ద్వారా ఒక ఫీజు నిర్ణయించి కేటాయించేట్లు నిర్ణయించారు. ఎలన్‌ మస్క్‌ మన మార్కెట్‌ మీద ఎప్పటి నుంచో కన్నేసి ఉన్నకారణంగా అందుకు అనుగుణంగా మోడీ సర్కార్‌ పావులు కదిపిందని వేరే చెప్పనవసరం లేదు. మస్క్‌ కంపెనీ స్టార్‌లింక్‌ దరఖాస్తు కేంద్రం ముందు ఉంది. న్యాయమైన పోటీ విధానాన్ని ఎందుకు అనుసరించరని దిగ్గజ కంపెనీలైన అంబానీ రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ కేంద్రాన్ని అడిగాయి. ప్రభుత్వ విధానం మార్కెట్‌లో అసమాన పోటీకి దారి తీస్తుందని స్పష్టం చేశాయి. రక్షణ, సముద్రయానం,ప్రకృతి విపత్తుల అవసరాల వంటి వ్యవస్థలకు ప్రభుత్వాలు కేటాయింపులు జరపవచ్చని, వాణిజ్య అవసరాలకు మాత్రమే వేలం వేయాల్సిందేనని అవి పేర్కొన్నాయి.చివరకు రాజీ పడ్డాయి.


స్టార్‌లింక్‌ వలన ఏమిటీ ఉపయోగం అంటే ఇంటర్నెట్‌ మరింత వేగం పెరుగుతుంది అని చెబుతున్నారు. అంటే స్టార్‌లింక్‌ కనెక్షన్‌ ఉన్నవారు ఇలా నొక్కగానే అలా సినిమాలు, ఇతర సమాచారం వారి ముందు వాలుతుంది. మారు మూల ప్రాంతాలకూ ఆ సౌకర్యం ఉంటుంది. వీడియో కాల్స్‌లో మన ముందుఉన్నట్లే బొమ్మలు కనిపిస్తాయి,వినిపిస్తాయి. సినిమాలో ఆకర్షణీయ దృశ్యాలను ముందుగా చూపి వీక్షకులను ఆకర్షించేందుకు చూసినట్లుగానే ఇవన్నీ చూపుతున్నారు, చెబుతున్నారు.ఈ సౌకర్యం లేదా సేవలు పొందేవారు ఎంత మూల్యం చెల్లించాలో ఇంకా తెలియదు.మనదేశంతో భూ సరిహద్దు ఉన్న దేశాల నుంచి పెట్టుబడులతో, అదే విధంగా చైనా యాప్‌లతో దేశరక్షణకు ముప్పు ఉంటుందని పెద్ద ఎత్తున హడావుడి చేసిన రోజులను గుర్తుకు తెచ్చుకోవాలి.పెట్టుబడుల మీద ఆంక్షలు, యాప్‌లను నిషేధించారు. ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌తో కూడా దేశరక్షణకు సంబంధించిన ఆందోళనను అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. సిపిఐ(ఎం), కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ మేరకు ప్రకటనలు చేశాయి. స్టార్‌లింక్‌ కనెక్షన్లు తీసుకున్న సంస్థల ద్వారా దేశభద్రత, విలువైన కీలక సమాచారం సరిహద్దులు దాటిపోయేందుకు అవకాశాలున్నాయని చెబుతున్నారు.టిక్‌టాక్‌ను, ఇతర యాప్‌లను అదే కారణంతో కదా నిషేధించారు, మరి దీన్నుంచి అలాంటి ముప్పులేదా ? రెండిరజన్ల పాలన నడుస్తున్న మణిపూర్‌లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేసిన సమయాల్లో ఉగ్రవాదులు, ఇతరులు స్టార్‌నెట్‌ సేవలను పొంది సమాచారాన్ని చేరవేసినట్లు డిసెంబరు, జనవరి నెలల్లో గార్డియన్‌ పత్రిక వెల్లడిరచిన సంగతి తెలిసిందే. భద్రతా దళాలు చేసిన సోదాలలో స్టార్‌లింక్‌ యాంటెన్నా, ఇతర పరికరాలను పట్టుకున్నారు. అయితే వినియోగించారని చెబితే పరువుపోతుంది గనుక అవి పని చేయటం లేదని లీకులు వదిలారు. ఏదో ఒకసాకుతో 2024లో ఇంటర్నెట్‌ సేవల నిలిపివేతలో ‘‘నిరంకుశ ’’ పాలన సాగుతున్న మయన్మార్‌లో 85 సార్లు జరిగితే ‘‘ ప్రజాస్వామిక ’’ భారత్‌లో 84 దఫాలు మూసివేసినట్లు సమాచారం. తరువాత 21సార్లతో బిజెపి నిత్యం భక్తి, అనురక్తితో తలుచుకుంటూ పారాయణం చేసే పాకిస్థాన్‌ ఉంది. ప్రజాస్వామిక దేశాలలో మనదే అగ్రస్థానం. ఇలాంటపుడు ఇంకా అధికారికంగా స్టార్‌లింక్‌ అనుమతులు లేనపుడే ఇలా ఉంటే ఇచ్చిన తరువాత దాని మీద నియంత్రణ, పర్యవేక్షణ ప్రశ్నార్ధకమే.

ట్రంప్‌ 50 రోజుల పాలన : నెల రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్‌ ఓకె, పట్టుబిగిస్తున్న పుతిన్‌ !!

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు


అమెరికా సూచించిన నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ అంగీకరించింది. సంక్షోభ ముగింపుకోసం రెండుదేశాల ప్రతినిధులు మంగళవారం నాడు సౌదీ అరేబియా నగరం జెడ్డాలో సమావేశం జరిపారు. ఈ వర్తమానాన్ని రష్యాకు పంపుతామని ప్రకటించారు.ఉక్రెయిన్‌ సంసిద్దత వ్యక్తం చేసిందని చెబుతూ నిలిపివేసిన మిలిటరీ సాయం, గూఢచార సమాచార అందచేతను వెంటనే పునరుద్దరించనున్నట్లు అమెరికా ప్రకటించింది. బుధవారం ఉదయం వరకు దీని మీద రష్యా స్పందన వెలువడలేదు.కాల్పుల విరమణ తరువాత ఖనిజాల ఒప్పందం చేసుకోనేందుకు ఏకీభావం కుదిరినట్లు సమాచారం. మరోవైపు పుతిన్‌, జెలెనెస్కీ సేనలు దాడుల తీవ్రతను పెంచాయి. ఉక్రెయిన్‌ ఆక్రమించిన కురుస్కు ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు రష్యా సేనలు కేంద్రీకరించాయి. సంప్రదింపులకు తాను పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు సోమవారం నాడే అక్కడకు చేరుకున్న జెలెనెస్కీ ప్రకటించాడు. యుద్ధం ప్రారంభమైన మరుసటి రోజునుంచే తాము శాంతిని కోరుతున్నామని, కొనసాగటానికి రష్యాయే కారణమని సామాజిక మాధ్యమంలో ఆరోపించాడు. ఒకవైపు మిలిటరీ సాయం, గూఢచార సమాచార అందచేత నిలిపివేసి ఉక్రెయిన్‌ మీద, దారికి రాకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తానని రష్యాను ట్రంప్‌ బెదిరించాడు.తాము ఇరుపక్షాల పట్ల సమవైఖరితో ఉన్నట్లు కనిపించేందుకు ఒక ఎత్తుగడగా ఇలా చేసినట్లు కొందరు చెబుతున్నారు. కురుస్కు ప్రాంతంలో తిష్టవేసిన జెలెనెస్కీ సేనలను అదుపులోకి తెచ్చుకొనేందుకు రష్యా ఏడువైపుల నుంచి చక్రబంధాన్ని బిగిస్తున్నట్లు వార్తలు. దీన్ని బ్రిటన్‌ మిలిటరీ గూఢచారులు కూడా ధృవీకరించారు. ఉక్రెయిన్‌ వైపు నుంచి కురుస్కు వచ్చే రోడ్లను మూసివేసినట్లు చెబుతుండగా తమకు ఎలాంటి ముప్పు లేదని జెలెనెస్కీ మిలిటరీ ప్రకటించింది. కొద్ది నెలల క్రితం ఉక్రెయిన్‌ సేనలు ఈ ప్రాంతంలో పదమూడువేల చదరపు కిలోమీటర్ల మేర రష్యా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. దానిని తిరిగి స్వాధీనం చేసుకోవటం కంటే రష్యా ఉక్రెయిన్‌ మీద దాడులు కేంద్రీకరించింది. రష్యాతో జరిపే చర్చల్లో తాను ఆక్రమించుకున్న ప్రాంతాన్ని తురుపుముక్కగా వినియోగించుకోవాలని జెలెనెస్కీ చూశాడు. అయితే దాని గురించి పుతిన్‌ ఎలాంటి ప్రస్తావన తేవటం లేదు. ఫిబ్రవరి నాటికి 800 చదరపు కిలోమీటర్ల మేర స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పుడు మిగిలిన ప్రాంత విముక్తికి కేంద్రీకరించినట్లు వార్తలు. రష్యన్ల మాదిరే క్లిష్టమైన నిర్ణయాలు చేసేందుకు జెలెనెస్కీ సిద్దం గావాలని జెడ్డాకు వస్తూ అమెరికా విదేశాంగ మంత్రి మారియో రూబియో విమానంలో విలేకర్లతో చెప్పాడు.


ఏం జరుగుతుందో చూద్దామన్నట్లుగా ఉన్న ఐరోపా యూనియన్‌ మంగళవారం నాడే పారిస్‌లో భేటీ అయింది. ముప్పై దేశాలకు చెందిన మిలిటరీ అధిపతులు, రాజకీయవేత్తలు పాల్గొన్నారు.ఈ సమావేశాల్లో ఉక్రెయిన్‌ భద్రత, సాయం గురించి చర్చించినట్లు తప్ప వివరాలు వెల్లడి కాలేదు. శనివారం నాడు బ్రిటన్‌ ప్రధాని కెయిర్‌ స్టార్మర్‌ ప్రపంచ నేతలతో అంతర్జాలంలో మాట్లాడేందుకు నిర్ణయించారు. కలసి వచ్చే వారితో ఒక కూటమి ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాతో తాము దగ్గర కావటం తమ ప్రయోజనాలకు భంగకరమని బ్రిటన్‌ భావిస్తున్నదని రష్యన్‌ విదేశీ గూఢచార సంస్థ ఒకటి పేర్కొన్నది.గూఢచర్య ఆరోపణలతో ఇద్దరు తమ దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ రష్యా తప్పుడు ఆరోపణలు చేసిందని బ్రిటన్‌ ఆరోపించింది. ఇదే తొలిసారి కాదని గతంలో కూడా ఇలాగే చేసిందని పేర్కొన్నది. గతేడాది ఏడుగురు బ్రిటీష్‌ దౌత్య సిబ్బందిని రష్యా ఇదే ఆరోపణలతో బహిష్కరించింది. తాజా బహిష్కరణకు ముందు లండన్‌లోని రష్యా దౌత్యసిబ్బందిలో ఒకరి నియామకాన్ని రద్దు చేసింది, కార్యాలయ వ్యవహారాలను పరిమితం కావించింది.దీనికి ప్రతిగా రష్యా బ్రిటీష్‌ దౌత్యవేత్తలను బహిష్కరించింది.వారు తప్పుడు సమాచారంతో రష్యాలో ప్రవేశించినట్లు తెలిపింది. తొలి రోజుల్లో ఉక్రెయిన్‌ శాంతి ఒప్పందానికి ముందుకు వచ్చినప్పటికీ బ్రిటన్‌ అడ్డుపడినట్లు గతంలో వార్తలు వచ్చాయి, అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు.తాజాగా ఉక్రెయిన్‌కు మద్దతుగా అనేక దేశాలను బ్రిటన్‌ సమీకరిస్తున్నది. ఉక్రెయిన్‌కు శాంతి పరిరక్షణ పేరుతో మిలిటరీని పంపితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని ఆస్ట్రేలియాను అక్కడి రష్యా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో హెచ్చరించింది. పశ్చిమ దేశాల బూట్ల చప్పుళ్లను చూస్తూ ఊరుకోబోమని పేర్కొన్నది. తమ గడ్డ నుంచి రిమోట్‌ ద్వారా ప్రయోగించే 45లక్షల డ్రోన్లను తయారు చేయనున్నట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. వాటిలో బాంబులను పెట్టి సరిహద్దులో లేదా రష్యా ఆధీనంలోని ప్రాంతాల మీద దాడులకు వీటిని వినియోగిస్తారు.


అనూహ్యమైన రాజకీయ పరిణామాల పూర్వరంగంలో చైనా మధ్యవర్తిత్వంతో ఉప్పు నిప్పుగా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్‌ రాజీకి వచ్చి సాధారణ సంబంధాలు నెలకొల్పుకుంటున్నాయి. రాజు మహమ్మద్‌బిన్‌ సల్మాన్‌ అధికారానికి వచ్చాక అమెరికాకు దూరం జరుగుతూ అంతర్జాతీయ సమావేశాలకు తటస్థ వేదికగా తయారవుతున్నారు. అరబ్‌లీగ్‌ సమావేశాలు అక్కడే జరిగాయి, ఉక్రెయిన్‌పై చర్చలకు సైతం తెరతీశారు. మధ్య ప్రాచ్యంలో తిరుగులేని శక్తిగా కనిపించేందుకు చూస్తున్నారు. అందరూ ఎదురుచూస్తున్న శాంతి కావాలో లేదో ఉక్రెయిన్‌ తేల్చుకోవాలని సౌదీ చర్చలపై రష్యా స్పందించింది. సముద్ర, వాయుదాడుల నిలిపివేతకు ఒప్పందం కుదుర్చుకోవాలని ఉక్రెయిన్‌ ప్రతిపాదించే అవకాశం ఉందని, మరోసారి దాడులు రష్యా దాడులు జరగకుండా రక్షణ కోసం పట్టుబట్టవచ్చని వార్తలు, గతంలో ఐరోపా యూనియన్‌ కూడా దీన్నే ప్రతిపాదించింది. వీటిని మాత్రమే సులభంగా పర్యవేక్షించవచ్చని చెబుతున్నారు. ఈ వారంలో అమెరికాతో చర్చలు జరిగే అవకాశం లేదని, ఆవైపు నుంచి ఎలాంటి వర్తమానం రాలేదని రష్యా విదేశాంగశాఖ ప్రకటించింది. వారితో సంబంధాల పునరుద్దరణ గురించి సంప్రదింపులు ప్రాధమికదశలో ఉన్నాయని రష్యా ప్రతినిధి దిమిత్రి పెట్కోవ్‌ చెప్పాడు. మార్గం ఎంతో క్లిష్టంగా, సుదీర్ఘంగా ఉందని అయినప్పటికీ రెండు దేశాల నేతలు రాజకీయ సంకల్పాన్ని ప్రకటించారని అన్నాడు.ఉక్రెయిన్‌కు తన స్టార్‌లింక్‌ ఉపగ్రహ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన ఎలన్‌ మస్క్‌ ప్రశ్నించిన వారిని మీరెంత, మీ బతుకెంత నోరు మూసుకోండి అంటూ విరుచుకుపడుతున్నాడు.తన సేవలు నిలిపివేస్తే జెలెనెస్కీ సేనలు కుప్పకూలిపోతాయని కూడా అన్నాడు. ఉక్రెయిన్‌ తరఫున స్టార్‌లింక్‌కు రుసుము చెల్లిస్తున్న పోలాండ్‌ దీని మీద స్పందిస్తూ తాము ప్రత్నామ్నాయ కంపెనీ సేవలను ఎంచుకుంటామన్నది.మస్క్‌కు అంత అహంకారం పనికి రాదని పేర్కొన్నది. స్టార్‌లింక్‌ లేకపోతే ఉక్రెయిన్‌ ఎప్పుడో ఓడిపోయి ఉండేదని అమెరికా మంత్రి రూబియో వ్యాఖ్యానించాడు. ఈ పరిణామం తరువాత ఫ్రాంకోబ్రిటీష్‌ యూటెల్‌సాట్‌ కంపెనీ వాటాల ధరలు 650శాతం పెరిగాయి.

సౌదీలో మంగళవారం నాటి చర్చలతో వెంటనే తేలేదేమీ ఉండదని వాషింగ్టన్‌మాస్కో సంప్రదింపులకు తెరతీస్తాయని, ఈ లోగా రష్యా తాను చేయదలచుకున్నది చేస్తుందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి.దానికి నిదర్శనంగా గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే ట్రంప్‌ ఒక ప్రకటన చేస్తూ అవసరమైతే రష్యా మీద కొత్త ఆంక్షలు, సుంకాలు విధిస్తామని ప్రకటించాడు. పుతిన్‌తో కంటే జెలెనెస్కీతో వ్యవహరించటం ఎంతో క్లిష్టంగా ఉందని కూడా అన్నాడు. ట్రంప్‌ ప్రకటనను రష్యా ఖాతరు చేయలేదు. తరువాత దాడులను మరింతగా పెంచింది. సరిహద్దుల నుంచి రష్యా రేపే వెళ్లిపోతుందని తాము అనుకోవటం లేదని, కాల్పుల విరమణ కొన్ని నెలలు, సంవత్సరాలు ఉన్నప్పటికీ తమ తరువాత భద్రత గురించి ఉక్రెయిన్‌ ఆలోచిస్తున్నది. కొద్ది రోజుల క్రితం సౌదీలో జరిగిన చర్చలలో తాత్కాలిక కాల్పుల విరమణకు షరతులతో రష్యా సుముఖత చూపింది. అంతిమంగా కుదరాల్సిన శాంతి ఒప్పందంలో ఉండాల్సిన అంశాల గురించి ముందే వెల్లడిరచాలని, ఏ ఏ దేశాలు భాగస్వాములౌతాయి, శాంతి పరిరక్షణ ఎలా జరుగుతుంది అన్నది స్పష్టం కావాలని షరతులు పెట్టింది. ఉక్రెయిన్‌ గడ్డపై నాటో దళాల ఏర్పాటును వ్యతిరేకించింది. ఆ తరువాతే శాంతి పరిరక్షణకు సముఖంగా ఉండే దేశాలతో కూటమి ఏర్పడాలని ఐరోపా యూనియన్‌ ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది.చైనా, భారత్‌ వంటి దేశాలతో కూడినది తమకు అనువుగా ఉంటుందనే సంకేతాలను రష్యా పంపింది.


అమెరికాతో సహా ప్రపంచం మొత్తాన్ని వ్లదిమిర్‌ పుతిన్‌ వంగదీశాడని, విజయం సాధించాడని మీడియా పండితులు వాపోయారు. నాలుగో ఏట ప్రవేశించిన ఉక్రెయిన్‌ సంక్షోభంలో ఎటువైపు ఎందరు మరణించారన్నది ఇప్పటికీ వెల్లడికాలేదు. పశ్చిమ దేశాలు లక్షా యాభైవేల నుంచి రెండులక్షల మంది రష్యా సైనికులు మరణించినట్లు చెబుతుండగా ఇంతవరకు 5,937 మంది మరణించినట్లు రష్యా రక్షణమంత్రిత్వశాఖ చెప్పింది.ఉక్రెయిన్‌ అధికారికంగా చెప్పినదాని ప్రకారం 45,100 మంది మరణించగా 3.9లక్షల మంది గాయపడ్డారు. మొత్తం 80లక్షల మంది పౌరులు విదేశాలకు శరణార్దులుగా వెళ్లటం గానీ తమ నెలవులు తప్పినట్లు చెబుతున్నారు. ఊహించని మలుపులు తిరుగుతున్న ఈ సంక్షోభంలో ఇంతకాలం రష్యాను దురాక్రమణదారుగా వర్ణించిన అమెరికా భద్రతా మండలిలో గతనెలలో ప్రవేశపెట్టిన అలాంటి తీర్మానాన్ని వీటో చేయటం విశేషం. నాటో కూటమిలో ఒక్క ఐరోపా దేశాలు మాత్రమే రష్యాను వ్యతిరేకిస్తున్నాయి. తమ రక్షణకు హామీ ఇవ్వకపోతే ఖనిజాల ఒప్పందం మీద సంతకం చేసేది లేదంటూ ట్రంప్‌ సమక్షంలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌తో పదినిమిషాల పాటు జెలెనెస్కీ వాదులాటకు దిగి వెళ్లిపోయాడు. తరువాత మెత్తబడి మరోసారి అమెరికాతో చర్చలకు వచ్చాడు. రష్యా వైఖరిలో ఎలాంటి మార్పులు లేవు. తమ స్వాధీనంలోకి వచ్చిన ఉక్రెయిన్‌ ప్రాంతాలను తిరిగి అప్పగించేది లేదని, వాటిని స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని పుతిన్‌ పట్టుబడుతున్నాడు. వాటి మీద ఆశలు వదులుకోవాలని ట్రంప్‌ కూడా జెలెనెస్కీకి చెప్పాడు. ఈ పూర్వరంగంలో సౌదీ చర్చలు ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీసేది ఎవరూ చెప్పలేని స్థితి నెలకొన్నది.


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వచ్చి 50రోజులు దాటింది.రోజుకొక మాట, ఎప్పుడేం చేస్తాడో తెలియని అనిశ్చితి ప్రపంచాన్నే కాదు, అమెరికాను సైతం ఆవరించింది. ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు చెప్పలేను, ఇప్పుడు సంధికాలంలో ఉన్నాం అన్న ట్రంప్‌ వ్యాఖ్యతో సోమవారం నాడు అమెరికా స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమైంది. నాలుగు లక్షల కోట్ల డాలర్ల మేర సంపద విలువ పడిపోయింది. ఈ ప్రభావంతో చైనా, హాంకాగ్‌ స్టాక్‌ మార్కెట్లు కూడా మంగవారం నాడు పతనమైనా తిరిగి కోలుకున్నట్లు వార్తలు. గత ఏడాది కాలంగా కొంత మంది మాంద్య భయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రంప్‌ గెలిస్తే నివారిస్తాడని అనేక మంది ఆర్థికవేత్తలు ఆశలు పెట్టుకున్నారు.వర్తమాన పరిణామాలను బట్టి సందేహమే అని పెదవివిరుస్తున్నారు.‘‘ జోశ్యాలను నేను అసహ్యించుకుంటాను. మనం చాలా పెద్ద కసరత్తు చేస్తున్నాం గనుక సంధికాలం ఉంటుంది.అమెరికాకు సందపదలను తిరిగి తీసుకువస్తున్నాం, అదే పెద్ద విషయం. అది కొంత సమయం తీసుకోవచ్చు గానీ మనకు ఎంతో గొప్పది. ’’ అని ఆదివారం నాడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. చైనాపై సుంకాల గురించి మాట మార్చలేదు గానీ మెక్సికో, కెనడాల మీద అమలు జరుపుతానని ఒక మాట నెల రోజుల వాయిదా అని మరో మాట, అంతలోనే అబ్బే అదేం లేదంటూ చేస్తున్న ప్రకటనలు కొంత గందరగోళానికి దోహదం చేస్తున్నాయి. రానున్న పన్నెండు నెలల కాలంలో మాంద్య అవకాశాలు 15 నుంచి 20శాతానికి పెరిగినట్లుశుక్రవారం నాడు గోల్డ్‌మన్‌ శాచస్‌ ప్రకటించింది. ట్రంప్‌ ప్రకటించిన సుంకాలు అమల్లోకి వస్తే ధరలు,ద్రవ్యోల్బణ పెరుగుదలతో వృద్ధి రేటు దెబ్బతిని మాంద్యంలోకి పోవచ్చని స్టాక్‌మార్కెట్లో మదుపుదార్లు భయపడుతున్నారు.

పన్ను తగ్గింపు ఒప్పుకోలేము – చెప్పుకోలేము : ‘‘ అసలు సిసలు భారతీయుడు ’’ నరేంద్ర మోడీకి పక్కా అమెరికన్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ అగ్నిపరీక్ష !

Tags

, , , , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ అని యావత్‌ ప్రపంచం అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ గురించి పాడుకుంటోందంటే అతిశయోక్తి కాదు. ఆ పెద్దమనిషి తీరు చూస్తుంటే అసలు సిసలు భారతీయులం అని చెప్పుకుంటున్న సంఘపరివార్‌కు, అది ముందుకు తెచ్చిన ప్రధాని నరేంద్రమోడీకి అగ్నిపరీక్ష పెట్టినట్లు కనిపిస్తోంది. పదే పదే ప్రతి సుంకాలు, ఆంక్షల గురించి మాట్లాడుతున్నాడు. అమెరికా వస్తువులపై దిగుమతి పన్నులు తగ్గించేందుకు భారత్‌ అంగీకరించిందని శుక్రవారం నాడు చెప్పాడు.వారు చేస్తున్నదానిని చివరకు ఎవరో ఒకరు బహిర్గత పరిచారు అని తన గురించి తానే చెప్పుకుంటూ మనదేశం గురించి మాట్లాడాడు. అయితే సుంకాల తగ్గింపు గురించి ఒప్పుకోలేరుచెప్పుకోలేరు అన్నట్లుగా మన పాలకుల స్థితి ఉంది. అంగీకరించినట్లు మన విదేశాంగశాఖ నిర్ధారించలేదు గానీ వాటి గురించి సంప్రదింపులు జరుగుతున్నట్లు చెప్పినట్లు వార్తా సంస్థ ఒకటి పేర్కొన్నది.ట్రంప్‌ చెప్పిన దాని గురించి నేను మాట్లాడను గానీ, ఇవన్నీ సంప్రదింపులలో ఉన్న అంశాలు గనుక వాటి గురించి చెప్పకూడదని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ వ్యాఖ్యానించారు.ఇటీవల జరిగిన అనేక వాణిజ్య ఒప్పందాలలో సుంకాల సరళీకరణ మౌలిక అంశంగా ఉన్న సంగతి తెలిసిందే అని కూడా చెప్పారు. ట్రంప్‌కు లేని మర్యాద మనకు అవసరమా ? ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలన్నింటీని రద్దు చేసుకొని ఆదరాబాదరా మన వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ వాషింగ్టన్‌ వెళ్లారు. అక్కడ చర్చలు జరుపుతుండగానే ఏప్రిల్‌ రెండు నుంచి పన్నులు విధిస్తామని ట్రంప్‌ చెప్పాడు. మంత్రి ఇంకా అక్కడ ఉండగానే సుంకాలు తగ్గించేందుకు అంగీకరించినట్లు కూడా అదే నోటితో ప్రకటించటం గమనించాల్సిన అంశం. దీనిలో రెండు కోణాలు ఉన్నాయి. ఇలా ప్రకటించి మనదేశాన్ని ఇరికించేందుకు చూడటం ఒకటి. లేదా మనమంత్రి ఒక స్పష్టమైన హామీ ఇచ్చి ఉండాలి. మన నిర్వాకం గురించి ముందుగా ఇతరుల ద్వారానే మనం తెలుసుకోవాలి మరి. ఇది కూడా మోడీ విదేశాల్లో పెంచినట్లు చెప్పిన దేశ ప్రతిష్టలో భాగమేనా ! అసలు మనమంత్రి అలా వెళ్లాల్సిన అవసరం ఏమిటి ? ట్రంప్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడా ? మోడీ విధానాల గురించి రాహుల్‌ గాంధీ విదేశాల్లో విమర్శలు చేయటం ఏమిటని ప్రశ్నించేవారు, ట్రంప్‌ చేసిన ప్రకటన మీద నోటికి తాళం వేసుకోవటం ఏమిటి ?


అబద్దాలు చెప్పటం ట్రంప్‌కు, నిజాలు చెప్పకపోవటం మన కేంద్ర పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. గాజాలోని పాలస్తీనియన్లకు శాశ్వత ఆశ్రయం కల్పించేందుకు జోర్డాన్‌ అంగీకరించిందని, ఆ దేశ రాజు అబ్దుల్లాతో కలసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో చెప్పాడు. అది వాస్తవం కాదని, తాము అంగీకరించేది లేదని తరువాత అదే అబ్దుల్లా ప్రకటించాడు. ఉక్రెయిన్‌ భద్రతకు ఎలాంటి హామీ ఇవ్వకుండా విలువైన ఖనిజాల ఒప్పందం మీద సంతకాలు చేయించి కొట్టేసేందుకు ట్రంప్‌ ఇదే ఎత్తుగడ అనుసరించాడు. అయితే జెలెనెస్కీ అడ్డం తిరగటంతో ఓవల్‌ ఆఫీసు పత్రికా గోష్టిలో పదినిమిషాల రచ్చ, జెలెనెస్కీ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ టీవీ ప్రసంగంలో చేసిన ప్రకటన గురించి ఆదివారం నాడు ఇది రాసిన సమయానికి మనదేశం నుంచి ఎలాంటి స్పందన, వివరణ వెలువడలేదు. ఎలన్‌ మస్క్‌ ఇండియాలో వ్యాపారం చేయాలని అనుకుంటున్నట్లు నేను భావిస్తున్నాను అని నరేంద్రమోడీతో భేటీ అయినపుడు ట్రంప్‌ నిర్మొహమాటంగా చెప్పినట్లు మీడియాలో వచ్చిన వార్తలు నిజమేనా ? యాభై ఆరు అంగుళాల ఛాతీ ఉన్నా భయమా ? తెరవెనుక ఏదో జరిగింది అనుకోవాలా ….? పార్లమెంటు సమావేశాల్లో ఉండగా అక్కడ చెప్పకుండా ఒక నిర్ణయం తీసుకొని నిజంగానే ట్రంప్‌కు చెబితే మనల్ని మనమే అవమానించుకున్నట్లు, ప్రజాస్వామ్యం, ప్రజాప్రతినిధులను కించపరిచినట్లు, రాజ్యాంగ వ్యవస్థలను దిగజార్జినట్లు కాదా ?

మన విశ్వగురువు నరేంద్రమోడీ తీరేవేరు, మరొకరు సాటి రారు. ట్రంప్‌ చేస్తున్న ప్రకటనల గురించి కెనడా,మెక్సికో,చైనా స్పందన, ప్రతిస్పందన చూశాము. మన మోడీ ఎందుకు మాట్లాడటం లేదని 140 కోట్ల మంది జనం మల్లగుల్లాలు పడుతున్నారు.అలాంటి చిన్న విషయాలు అసలు పట్టించుకోనవసరం లేదన్నట్లు కనిపిస్తోంది.వాటి బదులు దేశంలో 2050 నాటికి 44 కోట్ల మందికి ఊబకాయం వస్తుందని జాతిని హెచ్చరిస్తున్నారు. టెలికాం శాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రిపబ్లిక్‌ టీవీ సభలో మాట్లాడుతూ విదేశీ టెలికాం కంపెనీలకు ఎలాంటి ఆంక్షలను విధించేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ ప్రసారాలకు తలుపులు బార్లా తెరిచినట్లు స్పష్టమైంది.మనదేశ టెలికాం రంగం ఎంతో నిబ్బరంతో ఉందని, ప్రపంచ సంస్థలను ఆహ్వానించేందుకు సిద్దంగా ఉందని , భారత్‌ ఎవరినీ చూసీ భయపడటం లేదని చెప్పారు.తనకు దేశ పౌరులు అత్యంత ముఖ్యమని, ప్రపంచంలో అందుబాటులో ఉన్నవాటిలో వారు దేన్ని కోరుకుంటే దాన్ని తెచ్చి ఇవ్వటం మంత్రిగా తన విధి, వసుధైక కుటుంబంలో తనకు విశ్వాసం ఉందన్నారు.


జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఎలన్‌ మస్క్‌ మనదేశ ఇంటర్నెట్‌, విద్యుత్‌ వాహనాల రంగంలోకి పెద్ద అడుగువేయనున్నట్లు కనిపిస్తోంది. యుపిఏ హయాంలో స్పెక్ట్రమ్‌ను అనుకూలురకు కేటాయించి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించిన నరేంద్రమోడీ తాను వేలం పద్దతిలో కేటాయించనున్నట్లు చెబితే, నిజంగానే అనేక మంది అభినందించారు. ఇప్పుడు ఎలన్‌ మస్క్‌ విషయానికి వస్తే ఉపగ్రహ స్పెక్ట్రమ్‌ వేలానికి బదులు అధికార కేటాయింపులకు ఎందుకు పాల్పడుతున్నట్లు ? ఇది మరో స్పెక్ట్రం కుంభకోణం కాదా ! అడిగితే దేశద్రోహులు అంటారేమో, అడిగితే ఏమిటి ముకేష్‌ అంబానీగారు ఇప్పటికే అడిగేశారు. అదేదో సినిమాలో వినపడలా అన్న చెవిటి పాత్ర డైలాగ్‌ను గుర్తుకు తెచ్చుకుందాం. నిజానికి వినపడకపోవటం కాదు, కావాలని చేసిందే. రెండు రకాల కేటాయింపు విధానాలెందుకు ? 2023 డిసెంబరులో చేసిన టెలికాం చట్ట ప్రకారం భూ సంబంధ స్పెక్ట్రమ్‌ వేలం ద్వారా, ఉపగ్రహ స్పెక్ట్రమ్‌ను అధికారయంత్రాంగం ద్వారా ఒక ఫీజు నిర్ణయించి కేటాయించేట్లు నిర్ణయించారు. ఎలన్‌ మస్క్‌ మన మార్కెట్‌ మీద ఎప్పటి నుంచో కన్నేసి ఉన్నకారణంగా అందుకు అనుగుణంగా మోడీ సర్కార్‌ పావులు కదిపిందని వేరే చెప్పనవసరం లేదు. మస్క్‌ కంపెనీ స్టార్‌లింక్‌ దరఖాస్తు కేంద్రం ముందు ఉంది. న్యాయమైన పోటీ విధానాన్ని ఎందుకు అనుసరించరని దిగ్గజ కంపెనీలైన అంబానీ రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ కేంద్రాన్ని అడిగాయి. ప్రభుత్వ విధానం మార్కెట్‌లో అసమాన పోటీకి దారి తీస్తుందని స్పష్టం చేశాయి. రక్షణ, సముద్రయానం,ప్రకృతి విపత్తుల అవసరాల వంటి వ్యవస్థలకు ప్రభుత్వాలు కేటాయింపులు జరపవచ్చని, వాణిజ్య అవసరాలకు వేలం వేయాల్సిందేనని అవి పేర్కొన్నాయి. ఎలన్‌ మస్క్‌ దరఖాస్తు మీద ఇంకా అంతిమ నిర్ణయం తీసుకోలేదు. తీసుకుంటే మాత్రం నరేంద్రమోడీతో జియో,ఎయిర్‌టెల్‌,ఇతర కంపెనీలు లడాయికి దిగటం ఖాయం. భూ సంబంధ స్ప్రెక్ట్రమ్‌ను ఒకరికి కేటాయించినదానిని మరొకరు వినియోగించలేరని, కానీ ఉపగ్రహస్రెక్ట్రమ్‌ను ఎవరైనా పంచుకోవచ్చని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వాదించారు. మంత్రికి తెలిసిన మాత్రం జియో, ఎయిర్‌టెల్‌ యాజమాన్యాలకు తెలియకుండానే వేలం గురించి మాట్లాడాయనుకోవాలా ?

అమెరికాలో స్టార్‌లింక్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటే 120 డాలర్లు చెల్లించాల్సి ఉండగా ఆఫ్రికాలో మార్కెట్‌ను స్వంతం చేసుకొనేందుకు కేవలం పదిడాలర్లకు అందచేస్తున్నది. మనదేశంలో కూడా అదే విధంగా పోటీ పడితే ప్రపంచ ధనికుడు ఎలన్‌మస్క్‌తో ఆసియా ధనికుడు ముకేష్‌ అంబానీ తట్టుకోగలరా ? ఇలా అంటున్నానంటే అంబానీ పట్ల సానుభూతి ఉండి కాదు, ఎందుకంటే మన బిఎస్‌ఎన్‌ఎల్‌ను దెబ్బతీసిన వారిలో ఆ పెద్దమనిషి కూడా ఉన్నందున అనుభవించాల్సిందే కదా ! ముకేష్‌ అంబానీ రిటైల్‌ స్టోర్ల నిర్వహణలో తనకు పోటీగా వచ్చిన అమెజాన్‌ కంపెనీని నరేంద్రమోడీ సహకారంతో తాత్కాలికంగా వెనక్కు నెట్టారు, కానీ మరోసారి పెద్ద ఎత్తున అమెజాన్‌ రంగంలో దిగేందుకు చూస్తున్నది. ట్రంప్‌ మద్దతు దానికి ఉంటుంది. రెండు కంపెనీలు పోటీ పడనున్నాయి. ఏఏ రంగాలలో తలపడేదీ ముందు ముందు తెలుస్తుంది.అమెజాన్‌ ఉపగ్రహ ఇంటర్నెట్‌ కుయిపర్‌ కూడా అనుమతి కోసం చూస్తున్నది.ముకేష్‌ అంబానీ జియో కంపెనీ స్టార్‌ ఇండియా, డిస్నీతో చేతులు కలిపేందుకు నిర్ణయించారు. రానున్న రోజుల్లో అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, సోనీలతో పోటీకి సిద్దపడుతున్నాయి.


ఇక ఎలన్‌ మస్క్‌, అతగాడిని భుజాల మీద మోస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశంలో టెస్లా విద్యుత్‌ కార్లను విక్రయించటానికి 110శాతం దిగుమతి పన్ను ఆటంకంగా ఉంది. స్టార్‌లింక్‌ మనదేశంలో కార్యకలాపాలు ప్రారంభిస్తే లైసన్సు ఫీజు నామమాత్రం గనుక తక్కువ ధరలకే కనెక్షన్లు ఇస్తుందని వేరే చెప్పనవసరం లేదు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లుగా ఇతర కంపెనీలను దెబ్బతీసేందుకు జియో చూసినట్లుగానే మస్క్‌ వస్తే దానితో పాటు, ఇతర కంపెనీల ఖాతాదారులందరూ మారిపోయే అవకాశం ఉంది.అలాగే కార్ల రంగంలో రారాజుగా ఉన్న టాటా, చిన్న కంపెనీలైన ఎంజి, కోటక్‌లకు ఎసరు వస్తుందని భావిస్తున్నారు. విదేశీ కార్ల మీద పన్ను తగ్గిస్తే సదరు అవకాశాన్ని ఒక్క టెస్లా మాత్రమే కాదు, చైనా, ఇతర దేశాల కంపెనీలు కూడా వినియోగించుకుంటాయి. వినియోగదారులు లబ్ది పొందుతారు. మన పరిశ్రమలు, ఉపాధి సంగతేమిటన్నదే ప్రశ్న. ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ను దెబ్బతీస్తుంటే కొంత మేరకు అడ్డుకొనేందుకు పోరాడిన ఉద్యోగులు ఓడిపోయారు. కానీ తమను దెబ్బతీసే చర్యలకు అనుమతిస్తే మన బడాకార్పొరేట్లు చూస్తూ ఊరుకుంటాయా ? పదేండ్లుగా ఇస్తున్న మాదిరే బిజెపికి నిధులు ఇస్తాయా ? వాటి ఆధీనంలో ఉన్న మీడియా సంస్థలు సానుకూల భజన కొనసాగిస్తాయా ? తమకు అనుకూలమైన పార్టీ, శక్తులను రంగంలోకి తెచ్చేందుకు చూడకుండా ఉంటాయా ? ఇలా ఎన్నో ప్రశ్నలు.


కార్లు లేదా సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులుగానీ ఎక్కడెక్కడో తయారు చేసిన విడి భాగాలను తీసుకు వచ్చి వాటికి ఒక రూపు(అసెంబ్లింగ్‌) ఇచ్చి తమ బ్రాండ్లు వేసుకొని అమ్ముతున్నారు. అలాంటి కార్ల ఫ్యాక్టరీకి మూడు సంవత్సరాల్లో 50 కోట్ల డాలర్లు పెట్టుబడి పెడితే ఎనిమిదివేల వాహనాలను దిగుమతి చేసుకొనేందుకు అనుమతి, వాటికి కేవలం 15శాతమే పన్ను విధిస్తామని కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించింది. అది ఒక్క టెస్లాకే కాదు, చైనాతో సహా ఎవరికైనా వర్తిస్తుంది.ఇలాగాక నేరుగా దిగుమతి చేసుకొంటే వాటి మీద 110శాతం పన్ను విధిస్తున్నారు. ఇప్పటికే చైనాలో ఫ్యాక్టరీ పెట్టిన టెస్లా అక్కడ తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. పోటీదార్లను దెబ్బతీసేందుకు ధరలను తగ్గించి మార్కెట్‌ను సొంతం చేసుకోవటం కంపెనీల ఎత్తుగడ. ఆ పోటీలో చైనా ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు స్థానిక ప్రైవేటు కంపెనీ అయిన బివైడి వంటి వాటికి కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇచ్చి నిలుపుతున్నది. అక్కడి సంస్థలు ఇంజన్లతో సహా కార్లకు అవసరమైన అన్ని భాగాలను తయారు చేస్తాయి, అటు వంటి పరిస్థితి టెస్లాకు గానీ మనదేశంలో ఉన్న సంస్థలకు గానీ లేవు. అందువలన చైనా కంపెనీలు కూడా మనదేశం వస్తే పరిస్థితి ఏమిటన్నది సమస్య.అయితే విద్యుత్‌ కార్ల ధరల విషయానికి వస్తే ప్రారంభ రకాల ధర టెస్లాతో పోల్చితే మన దేశంలో తయారవుతున్నవి తక్కువ వెలకే లభ్యమౌతున్నాయి. అందువలన అంతకంటే తక్కువ అయితేనే విదేశీ కంపెనీలు నిలదొక్కుకుంటాయి. 1990దశకం వరకు మన ప్రైవేటు రంగానికి ఎంతో రక్షణ ఉంది. తరువాత సరళీకరణలో భాగంగా విదేశీ కంపెనీలకు ద్వారాలు తెరవటంతో వాటితో చేతులు కలిపారు. ఇండోసుజుకీ, స్వరాజ్‌మజ్డా ఇంకా అలాంటివే ఎన్నో. తరువాత కూడా రక్షణలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరింతగా మార్కెట్‌ను తెరవటంతో తెగబలిసిన స్వదేశీ కార్పొరేట్లకు పెద్ద సవాలు ఎదురుకానుంది. వాటికి ప్రాతినిధ్యం వహించే బాంబే క్లబ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆర్థిక రంగంలో జరుగుతున్న పరిణామాలు రాజకీయ రంగంలో పర్యవసానాలకు దారి తీస్తాయన్నది ప్రపంచ అనుభవం. దానికి మనదేశం అతీతంగా ఉంటుందా ! నరేంద్రమోడీ పీఠం కదలకుండా ఉంటుందా !! కరవమంటే కప్పకు`విడవ మంటే పాముకు కోపం, ఏం జరుగుతుందో చూద్దాం !!!