డోనాల్డ్‌ ట్రంప్‌ తీరు తెన్నులు : నరనరాన భారత్‌పై విద్వేషం ! అయినా ఆలింగనాలకోసం నరేంద్రమోడీ తహతహ !!

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు


మేకతోలు కప్పుకుంటే పులి చారలు కనిపించవు తప్ప దాని స్వభావం మారుతుందా ?నరేంద్రమోడీని డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఆలింగనాలతో ముంచి తేల్చవచ్చు తప్ప అతగాడి అంతరంగం బయటపడకుండా ఉంటుందా ! మన దేశమన్నా, మన పౌరులన్నా విద్వేషం వెళ్లగక్కేవారు అమెరికాలో ఎందరో ! వారిలో ఒకడైన మార్కో ఎలెజ్‌(25) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు అమెరికా మీడియాను ఆకర్షించాడు. సామాజిక మాధ్యమంలో వాడు పెట్టిన పోస్టులలో ‘‘ భారతీయుల మీద విద్వేషాన్ని సాధారణీకరించండి ’’ అన్నది ఒకటి. శ్వేతజాతి దురహంకారులు ఇలాంటి పోస్టులు పెట్టటం సర్వసాధారణం, ప్రతిదాన్నీ పట్టించుకోనవసరం లేదు. మరి మార్కో ప్రత్యేకత ఏమిట ? అమెరికా అసలైన అధ్యక్షుడిగా అధికారం చెలాయిస్తున్న ఎలన్‌ మస్క్‌, ఆంధ్రా అల్లుడు అంటూ మన జనాలు పొంగిపోయిన ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌, చివరిగా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అందరూ వాడిని సమర్ధించారు, ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి పోతే పిలిచి తిరిగి ఇవ్వాలని చెప్పారు. కొద్ది రోజుల్లో భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వస్తున్నాడని వారికి తెలుసు, అయినా భారత్‌ మీద విద్వేషం వెళ్లగక్కిన వాడిని సమర్ధించటం ఏమిటి ? ఈ పరిణామం మీద ఆత్మగౌరవం గురించి కబుర్లు చెప్పే కాషాయ దళాలుగానీ, కేంద్ర ప్రభుత్వం గానీ నోరుమెదపలేదు. దీన్ని లొంగుబాటు అనాలా ? బానిస మనస్తత్వం అనాలా !


సామర్ద్యం లేని ప్రభుత్వ ఉద్యోగులందరనీ ఊరికే కూర్చో పెట్టి మేపుతున్నాం, వారందరినీ ఇంటికి పంపిస్తాం అని డోనాల్డ్‌ట్రంప్‌ చెప్పాడు. అందుకు గాను ప్రపంచ కుబేరుడు, మనందరీకీ తెలిసిన సామాజిక మాధ్యమవేదిక ఎక్స్‌ అధిపతి ఎలన్‌ మస్క్‌ను కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ సామర్ధ్య శాఖ మంత్రిగా నియమించాడు. అతగాడు ఇప్పుడు 23లక్షల ప్రభుత్వ సిబ్బందికి ఒక ఆదేశం జారీ చేసి స్వచ్చందంగా తప్పుకొనేవారికి ఒక అవకాశం ఇస్తున్నాం, మిగిలిన వారి సంగతి తరువాత చూస్తాం అని ప్రకటించాడు. అమెరికాలో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అనే దినపత్రిక అత్యధికంగా కాపీలు ముద్రించేదిగా ముందున్నది. అది డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యల పట్ల విమర్శనాత్మక వైఖరిని ప్రదరిస్తుంది గనుక వ్యతిరేక పత్రికగా ముద్రవేశారు. ఆ పత్రిక ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌లో పని చేసిన మార్కో ఎలెజ్‌కు ఎలన్‌ మస్క్‌ తన శాఖలో ఎందుకు ఉద్యోగం ఇచ్చాడనో ఇతర కారణాలతో గానీ సమాచారాన్ని సేకరించి మార్కో ఎలెజ్‌ ఒక జాత్యహంకారి అని అతడు గతంలో పెట్టిన పోస్టులను ఉటంకిస్తూ, ప్రస్తుతం వాటిని సామాజిక మాధ్యమం నుంచి తొలగించినట్లు ఆ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదు. వార్త ప్రచురణ తరువాత తనను తొలగిస్తారనే అంచనాతో తానే రాజీనామా చేశాడు. అతగాడు గాజా, ఇజ్రాయెల్‌ అనే రెండిరటినీ భూమి మీద నుంచి లేపేసినా నేను పట్టించుకోను, స్వజాతి(మన దేశంలో కులం, గోత్రం, మతాలను పరిగణనలోకి తీసుకుంటారు) కాని వారిని వివాహం చేసుకున్నందుకు ప్రతిఫలం చెల్లించాల్సిన అవసరం లేదు వంటి పోస్టులు పెట్టాడు.


అలాంటి వాడిని వాడి మానాన వదిలేస్తే వేరు . అతన్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటాం అని ఎలన్‌ మస్క్‌ ప్రకటించటమే కాదు, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ సమర్దించటం అన్నింటికీ మించి డోనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ వాన్స్‌ చెప్పాడా అయితే నా అభిప్రాయమూ అదే అంటూ ఆమోద ముద్రవేశాడు. అలాంటి వ్యక్తితో మన ప్రధాని నరేంద్రమోడీ భేఠీ అయ్యేందుకు తాపత్రయపడుతున్నారు. ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో చూసిన తరువాత దాని గురించి మాట్లాడుకుందాం. మానవులు తప్పులు చేస్తే దేవతలు క్షమిస్తారు అంటూ ఎలన్‌ మస్క్‌ వెనకేసుకు రాగా కుర్రవాడికి రెండో అవకాశం ఇవ్వాలి అంటూ జెడి వాన్స్‌ సమర్ధించాడు. బుద్దిహీన సామాజిక మాధ్యంలో కార్యకలాపాల కారణంగా ఒక పిల్లవాడి జీవితాన్ని నాశనం చేయకూడదు అన్నాడు. మార్కో రాజీనామా గురించి విలేకర్లు అడగ్గా దాని గురించి తనకు తెలియదని ట్రంప్‌ చెప్పాడు, అయితే మీ ఉపాధ్యక్షుడు తిరిగి తీసుకొనేందుకు అంగీకరించాడు కదా అని విలేకర్లు చెప్పగా అలానా అయితే ఒకే అన్నాడు. మార్కోను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలా వద్దా అన్న సర్వేలో పాల్గొన్న వేలాది మందిలో 78శాతం అనుకూలంగా ఓటు వేసినట్లు తేలిసింది. గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్రమోడీ అమెరికా నేతలతో రాసుకుపూసుకు తిరిగి మనదేశ ప్రతిష్ట, పలుకుబడిని పెంచినట్లు ఊదరగొట్టిన తరువాత అమెరికాలో మనదేశం పట్ల వెల్లడైన విద్వేషతీరు ఇది.అయినా సరే దాన్ని పట్టుకువేలాడేందుకు పడుతున్న తాపత్రయాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు.


మార్కో ఎలెజ్‌ ఉదంతాన్ని అమెరికాలోని భారతీయ సంతతి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పుండు మీద కారం చల్లినట్లుగా ఎలెజ్‌ను సమర్ధించటంతో మండిపడుతున్నారు. జెడి వాన్స్‌ సతీమణి భారతీయ సంతతికి చెందిన చిలుకూరి ఉష. అందుకే కొందరు జెడి వాన్స్‌ను ఆంధ్రా అల్లుడు అని కూడా వర్ణించారు.తనను భార్యను కూడా తూలనాడినప్పటికీ ఆ పెద్దమనిషి ఎలెజ్‌ను పల్లెత్తుమాట అనకపోగా విమర్శకులు తనను భావోద్వేగాలతో బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఎదురుదాడి చేశాడు.రిపబ్లికన్‌ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు రో ఖన్నా అమెరికన్‌ ఇండియన్‌.ఎలెజ్‌ను తిరిగి తీసుకొనే ముందు అతడి చేత క్షమాపణ చెప్పిస్తావా ? ఇది మన బిడ్డల కోసం అని వ్యాఖ్యానించాడు. వాన్స్‌ కబుర్లు చెప్పటం సరే, రోజంతా ఆయన బిడ్డలకు భద్రత ఉంటుంది. ఇంటర్నెట్‌లో వేధింపులకు గురయ్యే అవకాశం ఉన్న భారతీయుల పిల్లల సంగతేమిటి ? అంటూ అనేక మంది ప్రశ్నించారు. మార్కో ఎలెజ్‌ను పిలిచి మరీ ఉద్యోగమివ్వటం అంటే జాత్యంహంకార, భారత్‌ వ్యతిరేక శక్తులను బహిరంగంగా ప్రోత్సహించటం తప్ప మరొకటి కాదు. గాయపడిన భారతీయుల మనోభావాలను నరేంద్రమోడీ పరిగణనలోకి తీసుకుంటారా ? డోనాల్డ్‌ ట్రంప్‌తో ఆలింగనాల్లో అన్నీ మరచిపోతారా ?


అమెరికాలో ఇప్పుడు రెండు పరిణామాలు జరుగుతున్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమర్ధవంతంగా పనిచేయటం లేదనే పేరుతో వారి సంఖ్యను తగ్గించటం, తద్వారా మిగిలే సొమ్మును కార్పొరేట్లకు,దుర్మార్గాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ వంటి వాటికి మళ్లించేందుకు లేదా బడ్జెట్‌లోటును పూడ్చేందుకు చూస్తున్నారు.ట్రంప్‌ సర్కార్‌ బెదిరింపులు, విసిగిపోవటం తదితర కారణాలో గడువులోపల 65వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్చంద ఉద్యోగవిరమణకు అంగీకరించారు. అయితే దీని గురించి వాద ప్రతివాదనలు వినేందుకు ఒక కోర్టు ఇచ్చిన గడువు సోమవారంతో ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుకు వచ్చేందుకు సిద్దంగా లేరు, వారిని వదలించుకొని ఉన్నత అర్హతలున్నవారిని నియమిస్తామని ట్రంప్‌ పత్రికా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ అన్నారు. స్వచ్చంద ఉద్యోగ విరమణకు అర్హత ఉన్న 23లక్షల మంది ఉద్యోగుల్లో 65వేలంటే చాలా తక్కువ అని చెప్పనవసరం లేదు. మిలిటరీ, పోలీసు వంటి కొన్ని తరగతులకు అనుమతి లేదు. మొత్తంగా పదిశాతం మంది ఉద్యోగుల తగ్గింపు విద్య, వైద్యం వంటి రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందనే హెచ్చరికలు కూడా వెలువడ్డాయి.తాను తీర్పు ఇచ్చే వరకు స్వచ్చంద ఉద్యోగ విరమణ అమలు నిలిపివేయాలని ఒక కోర్టు ఆదేశం ఇచ్చింది.


అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారిని వెతికి పట్టుకొని వారి దేశాలకు బలవంతంగా పంపటం ఇప్పటికే ప్రారంభమైంది. నిజానికి ఇది కొత్తేమీ కాదు, గతేడాది అక్రమంగా వలస వచ్చిన 90వేల మంది భారతీయులను అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. 2022 నాటి సమాచారం ప్రకారం అక్కడ కోటీ పది లక్షల మంది అక్రమవలసదారులు ఉన్నారు. వారిలో 48లక్షల మంది పక్కనే ఉన్న మెక్సికోవారే. మూడిరట రెండువంతుల మంది మెక్సికో, లాటిన్‌ అమెరికా దేశాల వారే ఉన్నారు. ఎల్‌ సాల్వడార్‌ నుంచి 7.5లక్షలు, భారత్‌ 7.25, గౌతమాలా 6.75, హొండురాస్‌ 5.25 లక్షల వంతున ఉన్నారు. ఇలా వచ్చిన వారు వ్యవసాయం,హోటల్‌,ఇతర చిన్న చిన్న పనులు చేస్తున్నారు.వీరందరూ ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితి. అయితే వీరితో పని చేయించుకొనే వారికి కూడా సమస్యే. ఒక్కసారిగా వీరంతా లేకపోతే ఏం చేయాలి ? ఇప్పటికే అనేక ప్రాంతాల పొలాల్లో నిలువు మీద ఉన్న పంటలు దెబ్బతినట్లు వార్తలు వచ్చాయి. వలసదారుల సమస్య ఫెడరల్‌ ప్రభుత్వానిది, అయితే తమ నేత ట్రంప్‌ మెప్పు పొందేందుకు రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్‌(మన ముఖ్యమంత్రి మాదిరి) రాన్‌ డెశాంటిస్‌ హడావుడి చేస్తున్నాడు. ఆ రాష్ట్ర శాసన సభ్యులు తనకు సహకరించాలని కోరుతున్నాడు. ట్రంప్‌ సర్కార్‌ అక్రమవలసదారులను బలవంతంగా తిప్పి పంపేందుకు తీసుకున్న కార్యక్రమానికి సహకరించని స్థానిక ఉద్యోగులను ఇంటికి పంపే అధికారం తనకు కావాలని కోరుతున్నాడు. ఫ్లోరిడాలో ఉంటూ విదేశాలకు డబ్బు పంపేవారు వాటి వివరాలను అందచేయాలని, తద్వారా వారి వలస స్థితిని గుర్తించవచ్చంటున్నాడు.


రాన్‌ డెశాంటిస్‌ తీరుతెన్నులను చూసి అనేక మంది అపహాస్యం చేస్తున్నారు. కొన్ని చట్టాలను చేసేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు పరిశీలించాలంటూ ఒక జర్నలిస్టు వ్యంగ్యంగా రాసినప్పటికీ అక్రమవలసదారులను వెనక్కు పంపితే తలెత్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి. ఫ్లోరిడాలో నమోదైన పౌరులకు ‘‘ పొలాల్లో పనిచేసే స్వేచ్చా చట్టం 2025 ’’ చేయాలి.తద్వారా పొలాల్లో మిరియాలు, చెరకు, ఇతర పంటలు ఎండి, చెడిపోకుండా ఎలా తీసుకురావాలో పౌరులకు శిక్షణ ఇవ్వాలి. ‘‘ దేశభక్తులైన ఈ కార్మికులకు ’’ పొలాల్లోకి రాను పోను బస్‌లను ఏర్పాటు చేయాలి, అవసరం ఉన్నా లేకున్నా ప్రతి నాలుగు గంటలకు వారికి ఐదు నిమిషాల పాటు మంచినీరు తాగేందుకు విరామం ఇవ్వాలి. పని చేసే సమయాల్లో తగిలే దెబ్బలు లేదా వడదెబ్బ లేదా తలెత్తే మానసిక వత్తిడితో భూ యజమానులకు ఎలాంటి సంబంధం లేదని పనిచేసే వారు హామీ పత్రం మీద సంతకాలు చేయాలి. ఫ్లోరిడా చొరవలో సహాయకులు అనే పథకం కింద ఇండ్లలో పనిచేసే వారికి నైపుణ్యాల శిక్షణ ఇవ్వాలి.హోటళ్లు కార్మికుల కొరత ఎదుర్కొంటున్నపుడు అత్యవసర పని చేసేందుకు సిద్దంగా ఉండాలి.అతిధేయ రంగంలో వారికి వారం పాటు శిక్షణ ఇవ్వాలి.మరుగుదొడ్లు శుభ్రం చేయటం, పరుపుల మీద దుప్పట్లు వేయటం, కార్పెట్ల మీద ఎలాపడిరతో తెలియని మరకలను తుడిచివేయటం వాటిని వారు నేర్చుకోవాలి. ఈ దేశభక్తులైన ఫోరిడియన్లు వలసదారులను పంపివేసినపుడు తలెత్తే కొరత లేకుండా ఆతిధ్య రంగంలో పనిచేసేందుకు రాష్ట్ర గవర్నర్‌ క్లీన్‌ స్వీప్‌ రియాక్షన్‌ ఫోర్సుగా పని చేయాలి. శిక్షణ తరువాత వీరికి ప్రతిష్టాత్మ మాగా (మేక్‌ ఎగైన్‌ గ్రేట్‌ అమెరికా) మెయిడ్‌ అనే హోదాతో అవార్డు ఇవ్వాలి.


క్లీన్‌ ప్లేట్‌ ఫండ్‌(కంచాలను శుభ్రం చేసేందుకు నిధి) ఏర్పాటు చేయాలి. రెస్టారెంట్ల నుంచి తొలగించిన వలస కార్మికుల వలన ఏర్పడే కొరత నివారణకు నమోదైన ఫ్లోరిడియన్లకు అంట్లు తోమే సేవలను అప్పగించాలి.రెస్టారెంట్లలో భోంచేసిన వారు తాము తిన్న ప్లేట్లను తామే కడిగితే అలాంటి వారికి బిల్లులో 20శాతం రాయితీ ఇవ్వాలి.గమనిక కొత్తగా నియమితులైన కార్మికులు తొలగించిన వారి మాదిరి కష్టపడి పని చేస్తారని భావించకూడదు. తొలగించిన ఒక్కొక్క హైతియన్‌ లేదా గౌతమాల కార్మికుడి స్థానంలో ముగ్గురు అంట్లుతోమే అమెరికన్‌ పౌరులను నియమించటం మంచిది. మామ్మల బెడ్‌ పాన్‌ చొరవ పేరుతో సేవా పనికి సిద్దం కావాలి. అక్రమవలసదార్లను వెనక్కు పంపటాన్ని పండగ చేసుకుంటూ మంచాల మీద ఉన్న వృద్ధుల సేవకు సిద్దం కావాలి. వారి పక్క బట్టలు మార్చటంతో పాటు బెడ్‌పాన్‌లు మార్చాలి. వృద్ధులను మంచాల మీదే ఉంచి పక్కలు మార్చటం మీకు తెలుసా, దీని గురించి ఫ్లోరిడా రాష్ట్రం ఇచ్చే నూతన శిక్షణ కార్యక్రమం ఎంతో ఉద్వేగపరుస్తుంది. ఇంటి ఆవరణలో పెరిగే గడ్డి మొక్కలను సంరక్షించటం, ఎక్కువగా పెరిగిన వాటిని కత్తిరించటం, రాలిన ఆకులను తొలగించటం, ఇంట్లో వంటగది, బాత్‌రూమ్‌లో మార్పులు, మరమ్మత్తులు, కప్పుల నుంచి నీరు కారటాల వంటి వాటిని కూడా స్వయంగా చేసుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందవచ్చని మీరెప్పుడైనా అసలు ఊహించారా, ఇప్పుడు అలాంటి సదవకాశం వచ్చింది.ఈ క్రమంలో నిబంధనలను అతిక్రమించినా ఎలాంటి తనిఖీలు, జరిమానాలు ఉండవు, ఇది ఒక గోడకూలిన శబ్దం కాదు, స్వేచ్చా ధ్వని సంకేతం !

డోనాల్డ్‌ ట్రంప్‌కు మతి చలించిందా ! సుంకాలను వ్యతిరేకించేవారంతా చైనా అదుపులో ఉన్నట్లేనట !!

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు


డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ముందునుంచీ ప్రకటించినట్లుగానే ప్రపంచ వాణిజ్య పోరుకు తెరతీశాడు. తన పన్నులను వ్యతిరేకించే విదేశమైనా లేక అమెరికాలో ఉన్న కంపెనీ అయినా సరే వారంతా చైనా అదుపులో ఉన్నట్లే అన్నాడు. ఇది రాసిన సమయంలో చెప్పిన మాటలకు, పాఠకులకు చేరే సమయానికి మార్పులు, విస్తరణ జరిగే రీతిలో ట్రంప్‌ వేగం కనిపిస్తోంది. కెనడా, మెక్సికోల మీద విధించిన పన్నుల అమలు కొంతకాలం వాయిదా వేస్తామనంటతో పాటు ఐరోపా మీద త్వరలో విధిస్తా ,వారు అమెరికా పట్ల భయంకరంగా వ్యవహరించారు, లాభాలకు ఒక అవకాశంగా తీసుకున్నారు, చైనా మీద ప్రకటించిన మొత్తాన్ని పెంచుతా అన్నాడు. స్వంత జనాలు, కంపెనీలతో పాటు ప్రపంచ వృద్ధికి నష్టం, అమెరికా పలుకుబడికీ దెబ్బ అన్న అనేక మంది ఆర్థికవేత్తల హెచ్చరికలను ఖాతరు చేయటం లేదు. కెనడా, మెక్సికోలపై 25శాతం, చైనా వస్తు దిగుమతుల మీద పదిశాతం పన్ను విధిస్తూ ఫిబ్రవరి ఒకటవ తేదీన ఉత్తరువులు జారీ చేశాడు. ఇప్పటి వరకు వెల్లడైన వైఖరులను చూస్తే అదిరించి బెదిరించి దారికి తెచ్చుకోవాలన్న ఎత్తుగడ కనిపిస్తోంది.పన్నులను వ్యతిరేకిస్తున్న వారు ఎవరైనా కుహనా వార్తల వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే(హెడ్జ్‌ ఫండ్స్‌) వారు లేదా సంస్థలు చైనా అదుపుల్లో ఉన్నట్లే అన్నాడు. తన నిర్ణయాలకు అద్భుత స్పందన వస్తున్నదని చెప్పుకున్నాడు. ఇతర దేశాలకు రాయితీల రూపంలో అమెరికా లక్షల కోట్ల డాలర్లు నష్టపోతున్నదన్నాడు. జనాలకు ఆర్థికంగా కొంత నొప్పి కలగవచ్చుగానీ అమెరికా ప్రయోజనాలకు ఆ మాత్రం భరించక తప్పదన్నాడు. దక్షిణాఫ్రికా భూములను గుంజుకుంటున్నదని, కొన్ని సామాజిక తరగతుల పట్ల చెడుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ఆ దేశానికి రానున్న రోజుల్లో నిధులు నిలిపివేస్తామని, గతంలో ఇచ్చిన వాటి మీద దర్యాప్తు చేస్తామని చెప్పాడు.


ఖండనలతో పాటు యావత్‌ ప్రపంచం అప్రమత్తమై ఎలా ఎదుర్కోవాలా అన్న శోధనలో పడిరది. అక్రమంగా దిగుమతి అవుతున్న ఫెంటానిల్‌ నిరోధానికి జాతీయ అత్యవసర పరిస్థితిని ట్రంప్‌ ప్రకటించాడు.కృత్రిమ సింథటిక్‌ మరియు నల్లమందుతో తయారు చేసే నొప్పి నివారణ, మత్తు మందును ఫెంటానిల్‌ అని పిలుస్తున్నారు. దీన్ని ఔషధంగా వినియోగించటానికి అనుమతి ఉంది. మాదక ద్రవ్యంగా కూడా వినియోగిస్తున్నారు.అక్రమంగా దిగుమతి అవుతున్న ఫెంటానిల్‌ అమెరికాలో లక్షల మంది ప్రాణాలు తీసిందని అధ్యక్ష భవన మీడియా కార్యదర్శి కారోలిన్‌ లీవిట్‌ ఆరోపించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే అమెరికా, అమెరికా అంటే ట్రంప్‌ అన్నట్లుగా పరిస్థితి తయారు కావటంతో కొంత మంది ఇప్పుడు ట్రంపెరికా అని పిలుస్తున్నారు. తాము చర్చలను తప్ప ఘర్షణను కోరుకోలేదని, కానీ ప్రతికూల చర్యలకు పూనుకోక తప్పటం లేదని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షియిన్‌బామ్‌ ఎక్స్‌ ద్వారా ప్రకటించారు. మెక్సికో ప్రయోజనాల రక్షణకు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకోవాలని తమ ఆర్థిక మంత్రిని కోరినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల ముఠాలతో మెక్సికో ప్రభుత్వం కుమ్మక్కు అయినందునే తాము పన్నులు విధించాల్సి వస్తోందంటూ అధ్యక్షభవనం చెప్పిన సాకును ఆమె ఖండిరచారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఏఏ వస్తువులను లక్ష్యంగా చేసుకోవాలో ఇంకా వెల్లడిరచలేదు. స్వతంత్ర మెక్సికో చరిత్రలో జరిగిన అతిపెద్ద దాడులలో ఇదొకటని, అమెరికాకెనడామెక్సికో కుదుర్చుకున్న ఒప్పందానికి ఇది విరుద్దమని పాలకపార్టీ నేత రికార్డో, ఆర్థిక మంత్రి ఎబ్రార్డ్‌ ప్రకటించాడు. తాము నష్టపడతామని, వారికీ అదే జరుగుతుందన్నారు.ప్రస్తుతం అమెరికాకు ఎగుమతుల్లో చైనాతో మెక్సికో పోటీపడుతోంది. మూడోవంతు మెక్సికో జిడిపి అమెరికాకు ఎగుమతులపై ఆధారపడి ఉంది. ఎగుమతి, దిగుమతుల్లో మెక్సికో వాణిజ్య మిగుల్లో ఉంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే పంది మాంసం, జున్ను, వ్యవసాయ ఉత్పత్తులు, ఉక్కు, అల్యూమినియం వస్తువుల మీద ఐదు నుంచి 20శాతం వరకు పన్నులు విధించాలని ఆలోచిస్తున్నది. బీరు,వైన్‌,పండ్లు, పండ్ల రసాలతో సహా అమెరికా నుంచి వచ్చే వస్తువులపై 25శాతం పన్ను విధించనున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ ప్రకటించాడు. తొమ్మిదివేల కిలోమీటర్ల దూరం ఉన్న సరిహద్దులో ఇరు దేశాల వాణిజ్య లావాదేవీలు రోజుకు రెండున్నర బిలియన్ల డాలర్ల మేర జరుగుతున్నాయి. పన్నుల విధింపు తమ మీద ఆర్థిక యుద్ధం ప్రకటించటం, రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని ఉల్లంఘించటమే అంటూ దీన్ని తాము, కెనడియన్లతో కలసి ప్రతిఘటిస్తామని బ్రిటీష్‌ కొలంబియా ప్రధాని డేవిడ్‌ ఇబై ప్రకటించాడు. డాలర్‌కు డాలర్‌ అన్న పద్దతిలో దెబ్బతీస్తామని కెనడాలోని ఓంటారియో రాష్ట్ర నేతలు చెప్పారు. తమ మీద అడ్డగోలుగా పన్ను విధిస్తే గట్టిగా ప్రతి స్పందిస్తామని ఐరోపా యూనియన్‌ ప్రతినిధి వ్యాఖ్యానించాడు.


ట్రంప్‌ చర్యను ఖండిస్తూ చర్చలకు ద్వారాలను తెరిచే ఉంచామని చైనా వాణిజ్య, ఆర్థిక మంత్రిత్వశాఖలు ప్రకటించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థలో పన్నుల విధింపును సవాలు చేస్తామని ప్రకటించాయి. ఫెంటానిల్‌ అమెరికా సమస్య. దాని మీద ఏ చర్య తీసుకున్నా తాము మద్దతు ఇస్తామని చైనా స్పష్టం చేసింది. తాము ఇప్పటికే అమెరికాకు సహకరిస్తున్నామని, గణనీయమైన ఫలితాలు కూడా వచ్చాయన్నారు. ట్రంపు పన్నులు చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ కాదని వాణిజ్య రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక రంగం మీద అమెరికా పన్నులు ఎలాంటి ప్రభావితం కలిగిస్తాయో అన్న ఆందోళన చెందుతున్నట్లు జపాన్‌ ఆర్థిక మంత్రి కాటో చెప్పాడు.తమ మీద ప్రభావం ఎలా ఉంటుందో చూసి తగిన చర్యలు తీసుకుంటామన్నాడు. మెక్సికోలో ఉత్పత్తి కేంద్రాలున్న దక్షిణ కొరియా కంపెనీల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో సన్నిహితంగా గమనించాలని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు చోయ్‌ శాంగ్‌ మోక్‌ ప్రభుత్వ సంస్థలను ఆదేశించాడు. కొన్ని కంపెనీలు అమెరికాలో ఉత్పత్తి జరపాలని ఆలోచిస్తున్నాయి. పీజా, కార్ల ధరలు పెరుగుతాయి సిద్దంగా ఉండండి అంటూ అమెరికా సెనెట్‌లో ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ సెనెటర్‌ చార్లెస్‌ ష్కమర్‌ హెచ్చరించాడు. కార్ల విడి భాగాల దిగుమతులపై పన్ను విధించి ధరలు పెరిగేందుకు దోహదం చేయవద్దని అమెరికన్‌ ఆటోమోటివ్‌ పాలసీ మండలి అధ్యక్షుడు మాట్‌ బ్లంట్‌ కోరాడు. పరిణామాలు, పర్యవసానాలను ఎదుర్కొనేందుకు భారత్‌తో సహా వర్ధమాన దేశాలన్నీ సిద్దం కావాలని కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ స్థాపకుడు ఉదయ్‌ కోటక్‌ కోరారు. తమకు నష్టం చేసే దేశాలన్నింటి మీద పన్నులు వేస్తానని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా వస్తువులను అన్యాయంగా భారత్‌ అడ్డుకుంటున్నదని ఆరోపించాడు.

ట్రంప్‌ పన్నులతో జరిగేదేమిటి అన్న చర్చ ఎన్నికలకు ముందే ప్రారంభమైంది. బస్తీమే సవాల్‌ అంటూ అన్ని దేశాల మీద తొడగొట్టిన కారణంగా మిగతా దేశాలన్నింటికీ కలిపి ఎంత నష్టం జరుగుతుందో ఒక్క అమెరికాకు అంత ఉంటుంది. ఏ ఏ వస్తువుల మీద పన్నులు విధిస్తారు, చేసిన ప్రకటనలు, ఇచ్చిన ఆదేశాలకు ట్రంప్‌ కట్టుబడి ఉంటాడా అన్నది కూడా చూడాల్సి ఉంది. బెదిరించటం వెనక్కు తగ్గటం అతని చరిత్ర. తొలిసారి అధికారానికి వచ్చినపుడు అక్రమ వలసలను నివారింటచంలో విఫలమైనందున మెక్సికో వస్తువులపై ఐదు నుంచి 25శాతం పన్నులు విధిస్తానని ప్రకటించాడు. తరువాత వెనక్కు తగ్గాడు. నిఘంటువులో దేవుడు, ప్రేమ, మతం తరువాత అందమైన పదం పన్నులు అని ట్రంప్‌ వర్ణించాడు. అమెరికా చరిత్రలో 1890దశకంలో 25వ అధ్యక్షుడు విలియమ్‌ మెకన్లీ ఎడా పెడా పన్నులు విధించిన నేతగా నమోదయ్యాడు. ఇప్పుడు ట్రంప్‌ అదే బాటలో నడుస్తున్నట్లు వర్ణిస్తున్నారు.ఇప్పటికే పెద్ద ఎత్తున లోటుబడ్జెట్‌తో ఉండగా పన్నులు తగ్గించాలని ట్రంప్‌ తలపెట్టాడు, తద్వారా వచ్చిన నష్టాన్ని విదేశీ దిగుమతులపై పన్ను విధింపుతో పూడ్చాలని చూస్తున్నాడు. అయితే దానికి దేశకార్మికవర్గాన్ని ఫణంగా పెట్టాలని చూస్తున్నాడు. దిగుమతి పన్నులు వేల కోట్ల డాలర్లు బహుశా లక్షల కోట్లు కూడా తమ ఖజానాలోకి వచ్చిపడవచ్చని ప్రపంచ ఆర్థికవేదిక సమావేశాల్లో ట్రంప్‌ చెప్పాడు.
అమెరికా విధించే పన్నులు ఎలా ఉండబోతున్నాయి, సామాన్యుల మీద ఎంత భారం పడుతుందన్నది ఇప్పుడు పెద్ద చర్చగా ఉంది. టాక్స్‌ ఫౌండేషన్‌ సంస్థ చెబుతున్నదానిని బట్టి కెనడా, మెక్సికోల మీద పన్ను కారణంగా అమెరికా జిడిపి 0.8శాతం దిగజారుతుంది, 1.3 ఎగుమతులు, 2.8శాతాల చొప్పున దిగుమతులు తగ్గుతాయి.లక్షా 84వేల ఉద్యోగాలు పోతాయి. ఎంత భారం పడుతుందనే లెక్కలు అన్నీ ఒకే విధంగా లేవు. పన్ను మొత్తం 272 బిలియన్‌ డాలర్లు ఉంటే కుటుంబానికి ఏటా 2,600 డాలర్లు అదనపు భారం అని కార్పే క్రాస్‌ బోర్డర్‌ సొల్యూషన్స్‌ పేర్కొన్నది. కెనడా, మెక్సికో దిగుమతుల మీద 25శాతం చొప్పున అమలు చేస్తే 232.5 బి.డాలర్లు, చైనా వస్తువులపై 43.2 మొత్తం 275.7బి.డాలర్లని దీని ప్రకారం 33 కోట్ల జనాభాలో తలకు 835 డాలర్ల చొప్పున నలుగురున్న ప్రతి కుటుంబం మీద 3,342 డాలర్లని మరో లెక్క.చైనా వస్తువులపై 60శాతం, మిగతా వాటిపై 20శాతం విధిస్తే ఏటా కుటుంబం మీద 2,600 డాలర్ల భారమని పీటర్సన్‌ ఇనిస్టిట్యూట్‌, మొత్తం మీద పదిశాతం విధిస్తే 2,045 డాలర్లని టాక్స్‌ ఫౌండేషన్‌, నేషనల్‌ రిటెయిల్‌ ఫెడరేషన్‌ అంచనా ప్రకారం 7,600 డాలర్లు ఉంటుంది. ఈ పన్నులతో కంపెనీలు, వినియోగదారుల నుంచి ప్రతిఘటన ఎదురు కావచ్చని కూడా చెబుతున్నారు. తొలిసారి అధికారానికి వచ్చినపుడు ట్రంప్‌ విధించిన పన్నులకు ప్రతిగా ఐరోపా యూనియన్‌, చైనా చర్యలు తీసుకున్నాయి.వ్యవసాయ రంగంలో ట్రంప్‌ మద్దతుదార్లు, ఇతరులూ నష్టపోయారు. జూరిచ్‌ విశ్వవిద్యాలయం,మచాసుచెట్స్‌, హార్వర్డ్‌, ప్రపంచ బ్యాంకు చేసిన అధ్యయనాల ప్రకారం ట్రంప్‌ విధించిన పన్నులు అమెరికాలో ఉపాధిని పునరుద్దరించలేదని అలాగని ఉపాధిని తగ్గించలేదని కూడా తేలింది. అందువలన ఇప్పుడు ట్రంప్‌ చెబుతున్న మాటలు, చేతల ప్రభావం, పరిణామాలు, పర్యవసానాలు వెంటనే వెల్లడయ్యే అవకాశాలు లేవు.భారత్‌తో సహా వివిధ దేశాలలో స్టాక్‌మార్కెట్లు, కరెన్సీ విలువల్లో ఒడుదుడుకులు మాత్రం కనిపిస్తున్నాయి.

డీప్‌సీక్‌, డీప్‌సీక్‌ – ఒక్క రోజే అమెరికాలో లక్ష కోట్ల డాలర్ల నష్టం, ప్రపంచానికి దడ పుట్టించిన చైనా ఏఐ యాప్‌ !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

తెలివి ఒకడబ్బ సొమ్ము కాదు, పశ్చిమ దేశాల, తెల్లతోళ్ల గుత్త అసలే కాదు. రక్షణాత్మక చర్యలతో తన ప్రత్యర్ధులను అణచివేయాలని ఎవరైనా ఎంతగా ప్రయత్నిస్తే అంతగా ప్రతిఘటనే కాదు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కూడా సవాలు విసురుతాయని గతంలో అణుబాంబులు, ఖండాంతర క్షిపణుల వరకు నిరూపించాయి. తాజాగా చైనా డీప్‌సీక్‌ కృత్రిమ మేథ యాప్‌ అమెరికాతో సహా ప్రపంచ మంతటా సంచలనానికి కారణమైంది. అనేక దేశాలో ప్రభుత్వశాఖలు, భారీ సంఖ్యలో కంపెనీలు ఆ యాప్‌ను తమ ఫోన్లు, కంప్యూటర్లలో పెట్టుకోవద్దని, దాని సేవలను వినియోగించవద్దని ఆంక్షలు విధిస్తున్నట్లు వార్తలు. చైనా సాంకేతికంగా ముందుకు పోకుండా అడ్డుకొనేక్రమంలో జో బైడెన్‌ 2022లో తెచ్చిన చిప్స్‌ చట్టం ప్రకారం డ్రాగన్‌ దేశానికి ఎలాంటి పరిజ్ఞానం, చిప్స్‌ను అందనివ్వకూడదు,ఒక వేళ ఇతర దేశాలు ముందుకు పోతే వాటి మీద కూడా ఆంక్షలు విధిస్తామని బెదిరించిన సంగతి తెలిసిందే.ఇప్పుడవి దానికే ఎదురుతంతున్నాయి. రక్షణాత్మక చర్యలకు ఎవరు పాల్పడినా అదే జరుగుతుంది. తగిన ప్రోత్సాహం, అవకాశాలను కల్పించాలేగానీ ఎవరైనా అద్భుతాలు సృష్టించగలరని ప్రత్యేకించి చైనా ఇప్పటికే నిరూపించింది. గంగలో మునిగితే కరోనా పారిపోతుందని చెప్పిన వారు ఇప్పుడు కోట్లాది మందిని మహాకుంభమేళా పేరుతో గంగా స్నానం చేయిస్తున్నారు. వారి నుంచి డీప్‌సీక్‌ వంటి నవకల్పనలు వెలువడతాయని ఆశించలేము. అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అన్నవారు ఇంకా ఆ పాటనే పాడుతున్నారు. నిజంగా ఉంటే ఘనాపాటీలు ‘‘ దేశం కోసం ధర్మం కోసం ’’ ఎలాంటి ఖర్చు లేకుండా ఈ పాటికి ఇంథనం, విమానాశ్రయాలతో పని లేకుండా ఎలా అనుకుంటే అటు తిరుగుతూ ఎందరు ఎక్కినా మరొకరికి సీట్లు ఉండే పుష్పక విమానాలను, కృత్రిమ మేథ(ఏఐ) భారతీయ యాప్‌ను ఎందుకు రూపొందించలేదన్నది ప్రశ్న !

ఈ రంగంలో చైనా కంపెనీ విడుదల చేసిన డీప్‌సీక్‌ఆర్‌ఐ యాప్‌ పెను సంచలనం సృష్టించటమే కాదు, అమెరికా కంపెనీల వాటాల ధరలు పతనమై దాని చరిత్రలో లేని విధంగా దాదాపు లక్ష కోట్ల డాలర్లు( 96,900) నష్టపోయేందుకు దోహదం చేసింది.పది సంవత్సరాల క్రితం అమెరికా ఓపెన్‌ ఎఐ కంపెనీ (చాట్‌ జిపిటి సృష్టికర్త) నాలుగున్నరవేల మంది సిబ్బంది, 660 కోట్ల డాలర్ల పెట్టుబడితో ప్రారంభమైంది. అదే చైనా డీప్‌సీక్‌ 200 మంది సిబ్బందితో ప్రారంభమై రెండు సంవత్సరాలు కూడా నిండలేదు.కోటి డాలర్లలోపు ఖర్చుతోనే యాప్‌ను అభివృద్ధి చేసినట్లు ది కొబెఇసీ న్యూస్‌లెటర్‌ స్థాపకుడు ఆడమ్‌ కొబెఇసీ ఎక్స్‌లో పేర్కొన్నాడు. ఈ రెండు కంపెనీలు ఇప్పుడు ఎలా పోటీబడుతున్నాయో చూడండని పేర్కొన్నాడు. ఒక్క ఎన్విడియా కంపెనీ వాటాల ధరలే 60వేల కోట్ల మేర నష్టపోయాయి. ఆ కంపెనీ సిఇఓ 2,100, ఒరాకిల్‌ అధిపతి సంపద 2,760 కోట్ల డాలర్లు నష్టపోయారు. అమెరికా స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఇంత నష్టం ఇదే ప్రధమం. తరువాత ఆ కంపెనీలు పుంజుకోవచ్చు, మార్కెట్లో నిలదొక్కుకోవచ్చు, అది వేరే అంశం. ఒక్కటి మాత్రం స్పష్టం వందల కోట్ల డాలర్లు ఖర్చుచేసిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారు, వాటాలను కొనుగోలు చేసేవారు ఒకటికి వందసార్లు ఆలోచించే విధంగా ఊరూపేరులేని డీప్‌సీక్‌ అంకుర సంస్థ మేల్కొలిపింది. దాని మీద ఇప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో సైబర్‌దాడులు జరుగుతున్నాయి. అమెరికా కంపెనీలు ఒక యాప్‌ను తయారు చేసేందుకు పది కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే చైనా కంపెనీ కేవలం 60లక్షల డాలర్లతో వాటికి ధీటైనదాన్ని రూపొందించింది.

ఆధునిక చిప్‌లను, వాటిని తయారు చేసే యంత్రాలను చైనా కంపెనీలకు విక్రయించరాదని అమెరికా ఆంక్షలు విధించిన తరువాత డీప్‌సీక్‌ తన సత్తాచాటింది. చిత్రం ఏమిటంటే అమెరికాకు చెందిన ఎన్వీడియా కంపెనీ తన వద్ద పాత తరం హెచ్‌800 రకం చిప్స్‌ను రెండువేలు కొనుగోలు చేసి వాటిని వినియోగించామని డీప్‌సీక్‌ ఇంజనీర్లు వెల్లడిరచారు. అందువలన చైనాకు ఆధునిక పరిజ్ఞానం అందకుండా మడిగట్టుకొని మంత్రాలు వేసిన వారు ఇప్పుడేం చేస్తారన్నది ప్రపంచానికి ఆసక్తి కలిగించే అంశం.చివరికి రద్దును అమ్మాలన్నా చైనా గనుక కొనుగోలుకు ముందుకు వస్తే ధనిక దేశాల కంపెనీలు భయపడే స్థితి వచ్చింది. ఇంత తక్కువ ఖర్చుతో చైనా యాప్‌లు తయారు చేస్తున్నపుడు వందల కోట్ల డాలర్లు ఖర్చు చేయటం అవసరమా అని అమెరికన్లలో సందేహాలు తలెత్తాయి. తాజా యాప్‌ను విడుదల చేయక ముందే అంటే జనవరి ప్రారంభం నుంచి డీప్‌సీక్‌ కంపెనీ మీద సైబర్‌ దాడులు ప్రారంభమయ్యాయని చైనా భద్రతా సంస్థ ఎక్స్‌లాబ్‌ వెల్లడిరచింది. అమెరికా, సింగపూర్‌, నెదర్లాండ్స్‌, జర్మనీ చివరికి చైనాలో చిరునామాలు కలిగిన సంస్థలు వేల సంఖ్యలో దాడులు జరుపుతున్నాయని, రానున్న రోజుల్లో ఇంకా పెరగవచ్చని కూడా హెచ్చరించింది. ఈ దాడులు జరుగుతుండగానే జనవరి 28వ తేదీన డీప్‌సీక్‌ఆర్‌ఐ మోడల్‌ యాప్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది అమెరికన్‌ ఏఐకి హెచ్చరిక అని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వర్ణించినట్లు సమాచారశాఖ మంత్రి కరోలిన్‌ లీవిట్‌ పేర్కొన్నారు.

చైనా యాప్‌ విడుదలకు వారం రోజుల ముందు డోనాల్డ్‌ ట్రంప్‌ స్టార్‌గేట్‌ పేరుతో సాంకేతిక రంగంలో తనకు అనుకూలమైన కొందరిని సమావేశపరచి కృత్రిమ మేథ, సంబంధిత రంగాలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 500బిలియన్‌ డాలర్ల మేర ప్రాధమిక సదుపాయాలను కల్పించనున్నట్లు, అది సాంకేతికరంగ భవిష్యత్‌కు తోడ్పడుతుందని ప్రకటించాడు. చైనాకు అడ్డుకట్ట వేసేందుకు కన్న కలలను అదే చైనా వారం రోజుల్లోనే ఆటతీరునే మార్చి వేస్తుందని ట్రంప్‌ ఊహించలేకపోయాడు. నిజానికి ఇతర చైనా కంపెనీలు ప్రపంచానికి సుపరిచతం తప్ప డీప్‌సీక్‌ గురించి పెద్దగా తెలియదు. అలాంటి కంపెనీ అమెరికా సాంకేతిక రంగాన్ని, ఖరీదైన ట్రంప్‌ పథకాలను ఒకేసారి దెబ్బతీసింది. తొలిసారి అధికారానికి వచ్చినపుడు ట్రంప్‌, తరువాత జోబైడెన్‌ కూడా సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్రాలు చైనాకు అందకుండా చూసేందుకు చేయని ప్రయత్నం లేదు. ఈ నేపధ్యంలో అనేక రంగాల్లో చైనా ముందున్నప్పటికీ మైక్రో చిప్స్‌, ఏఐ రంగంలో వెనుకబడి ఉందని వెంటనే అమెరికాను అధిగమించటం జరిగేది కాదని అనేక మంది భావిస్తున్న తరుణంలో అది వాస్తవం కాదని స్పష్టం చేసింది, ఇప్పటికే చిప్స్‌ తయారీకి శ్రీకారం చుట్టిన చైనా ఆ రంగంలో కూడా త్వరలో తన సత్తా నిరూపించటం ఖాయం. ఏఐలో సంచలనాలు సృష్టించిన చాట్‌ జిపిటిని రూపొందించిన ఓపెన్‌ ఏఐ సంస్థ మరికొన్నింటిని పెంపొందించటానికి ట్రంప్‌ స్టార్‌గేట్‌ పేరుతో ఈ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు పూనుకున్నాడు. ఈ రంగంలో అతిపెద్ద సంస్థలైన గూగుల్‌, మేటా, ఇతర పెద్ద సంస్థలను దీన్నుంచి మినహాయించాడు. చాట్‌ జిపిటిపై ప్రతి ఖాతాదారు మీద నెలకు రెండువందల డాలర్లు ఖర్చు అవుతున్నదని, నష్టాల్లో ఉన్నట్లు ఓపెన్‌ ఏఐ చెప్పింది.నిజానికి ఇప్పటి వరకు ఈ సేవద్వారా లాభాలు ఎలా వచ్చేదీ స్పష్టం కాలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఉచితంగా అందుబాటులోకి వచ్చిన డీప్‌సీక్‌ ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు.బైట్‌ డాన్స్‌ రూపొందించిన టిక్‌టాక్‌, అలీబాబా,మూన్‌షాట్‌,రిaపు వంటి చైనా కంపెనీలు ఇప్పటికే ఏదో ఒక రూపంలో అమెరికా సంస్థలను సవాలు చేస్తున్నాయి. మరోసారి అమెరికాను గొప్పదిగా చేయాలన్న ట్రంప్‌ మీద భ్రమలు పెట్టుకున్నవారు నేడు గాకపోతే రేపైనా కళ్లు తెరవక తప్పదు.

సంచలనాత్మక డీప్‌సీక్‌ గురించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. వాటన్నింటినీ నమ్మటానికి లేదు.దాని దగ్గర ఉన్న సమాచారంలో పదిలక్షల రికార్డులను ఎవరైనా చూడవచ్చని విజ్‌ అనే ఒక సంస్థప్రకటించింది. అయితే ఒక అరగంట వ్యవధిలోనే వాటికి తాళం వేశారని అనుమతి లేకుండా ఎవరూ చూడటానికి లేదని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ సమాచారం ఏమిటి ? ఎవరైనా తీసుకున్నారా ? దానికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిది అన్నది కూడా తెలియలేదు. టిక్‌టాక్‌ ఇతర యాప్‌ల ద్వారా చైనా సమాచారాన్ని సేకరిస్తున్నదనే ఆరోపణల మాదిరే ఇప్పడు దీని మీద కూడా అనేక దేశాల్లో హెచ్చరికలు చేస్తున్నారు. ఏ స్థాయిలో ఉన్న వారు కూడా దీని సేవలను పొందవద్దని అమెరికా నౌకా దళం తన సిబ్బందిని ఆదేశించింది.ఈ యాప్‌ మరో స్పూత్నిక్‌ క్షణాలను గుర్తుకు తెచ్చిందని కొందరు వ్యాఖ్యానించారు. నిజానికి ప్రపంచ తొలి సోవియట్‌ యూనియన్‌ కృత్రిమ ఉపగ్రహం స్పూత్నిక్‌1 ప్రయోగం అమెరికా ఒక్కదాన్నే కలవరపెట్టింది. ఇప్పుడు డీప్‌సీక్‌ చైనాను అడ్డుకోవాలని చూసే ప్రతి వారూ కాళ్లు విరగదొక్కుకొనేట్లు చేసింది.స్పూత్నిక్‌ ప్రయోగం పెను సంచలనం సృష్టించింది.అప్పటి నుంచి పెద్ద సంచలనాలను స్పూత్నిక్‌ క్షణాలు అంటున్నారు.

ప్రచ్చన్న యుద్ధం కారణంగానే అమెరికన్లు నాసాను రంగంలోకి తెచ్చారు.1950 దశకం ప్రారంభంలో అమెరికాకు చెందిన యుా2 అనే గూఢచార విమానం ద్వారా తమ రహస్యాలను సేకరించిందని గ్రహించిన సోవియట్‌ ప్రతి చర్యలను చేపట్టింది. దాని గురించి అమెరికా రాబట్టిన సమాచారం ప్రకారం 1955 నుంచి 61 సంవత్సరాలలో తమ దేశంలో ఉన్న శాస్త్రవేత్తలకంటే రెండు మూడు రెట్లు ఎక్కువ మందితో పరిశోధనలను జరిపించిందని అమెరికన్లు గ్రహించారు. దాని ఫలితమే 1957 అక్టోబరు నాలుగున ప్రపంచ తొలి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్‌1 ప్రయోగం. అది ఎంత సంచలనం అంటే న్యూయార్క్‌ టైమ్స్‌ సేకరించిన సమాచారం ప్రకారం అక్టోబరు 6`31వ తేదీల మధ్య 279 వ్యాసాలు, రోజుకు పదకొండు చొప్పున అమెరికా పత్రికల్లో వచ్చాయి. అమెరికా ద్వితీయ శ్రేణి శక్తిగా మారిందని మీడియా వ్యాఖ్యాతలు రెచ్చగొట్టారు. సోవియట్‌ సాంకేతికంగా ఎంతో ముందున్నదని, అది అమెరికా భద్రతకు ముప్పు అని భాష్యం చెప్పారు.అమెరికన్లలో తలెత్తిన కలవరపాటును తగ్గించేందుకు అసలు మనం 1956లోనే ఎక్స్‌ప్లోరర్‌1 అనే ఉపగ్రహాన్ని సిద్దం చేశామని ప్రచారం చేశారు. అయితే అది ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. సోవియట్‌ ఉపగ్రహ ప్రయోగానికి ఖండాంతర క్షిపణి పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఉపగ్రహంతో పాటు దాన్ని నింగిలోకి మోసుకుపోయిన ఆర్‌ా7 రాకెట్‌ పదిలక్షల పౌండ్ల శక్తిని విడుదల చేసిందని గ్రహించిన అమెరికన్లు దాన్ని చూసి కూడా కలవరపడ్డారు. ఆ రాకెట్‌ ద్వారా అణ్వాయుధాన్ని కొన్ని నిమిషాల్లోనే ఆరువేల కిలోమీటర్ల దూరం మోసుకుపోగల శక్తి కలిగిందన్నది మరింత ఆందోళన కలిగించి అంతరిక్ష రంగంలో తాము ఎంతో వెనుకబడి ఉన్నామని తరువాత కాలంలో వేగాన్ని పెంచారు. స్పుత్నిక్‌ వలన ఎలాంటి ముప్పు లేదని గ్రహించి ఐదు రోజుల తరువాత నాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌ హోవర్‌ దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ అదొక శాస్త్రప్రయోగ విజయం తప్ప భద్రకు ముప్పులేదని చెప్పారు. (తరువాత అమెరికా రెండు ఉపగ్రహాలను ప్రయోగించినా అవి విఫలమయ్యాయి) అదే పెద్ద మనిషి 1958లో మాట్లాడుతూ అంతరిక్ష శాస్త్ర, సాంకేతిక రంగంలో అమెరికా, ఇతర స్వేచ్చా ప్రపంచ దేశాలను సోవియట్‌ అధిగమించిందని, అమెరికా ప్రతిష్ట, నాయకత్వాన్ని ఖాతరు చేయకుండా ఉండేందుకు ఒక సాధనంగా వినియోగించుకోవచ్చని, గగన తలంలో ఉన్నతమైన మిలిటరీ సామర్ధ్యాన్ని ప్రదర్శించిన తొలిదేశంగా సోవియట్‌ అవతరించిందని అంగీకరించక తప్పలేదు.


డీప్‌సీక్‌ కంపెనీ 2023 చివరిలో ప్రారంభమైంది. అంతకు ముందు దాని అధినేత లియాంగ్‌ వెన్‌ఫెంగ్‌ ఒక వెంచర్‌ కాపిటల్‌ సంస్థను నడుపుతున్నాడు. దాని వాణిజ్య వ్యూహాలను రూపొందించేందుకు కృత్రిమ మేథను వినియోగించాడు. తరువాత కంప్యూటర్‌ ప్రాతిపదికగా పని చేసే రెండు కంపెనీలను పదేండ్ల క్రితం ఏర్పాటు చేశాడు. ఆ క్రమంలో తలెత్తిన ఆసక్తి నుంచి డీప్‌సీక్‌ యాప్‌ వెలువడిరది. ఇటీవలి కాలంలో చైనా తనదైన శైలిలో అమెరికన్లకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నది. ప్రపంచంలో అతి పెద్ద నౌకాదళ శక్తిగా రూపొందింది. ఆరవ తరం యుద్ధ విమానాన్ని ప్రయోగించింది. ఇప్పుడు కృత్రిమ మేథ రంగంలో షాకిచ్చింది. అమెరికా కంపెనీలు వందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే కేవలం 60లక్షల డాలర్లు, అంతగా ఆధునికం కాని, పరిమిత కంప్యూటర్‌ చిప్స్‌తో యాప్‌ను తయారు చేశారు. ఒక ఊరూపేరులేని సంస్థే ఆ ఘనతను సాధించటంతో సిలికాన్‌ వాలీలోని అగ్రశ్రేణి కంపెనీలు భయాలను వ్యక్తం చేశాయి.

అమెరికాకు ఇరాన్‌ అణుబాంబు భయం !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు


తనకు లొంగని దేశాలను కొండచిలువ మాదిరి అమాంతం మింగివేయాలని అమెరికా చూస్తుంది. అయితే దానికి సాధ్యం కావటం లేదు. అందుకే శతవిధాలుగా దెబ్బతీసేందుకు చేయని యత్నం ఉండదు.ఇరాన్‌ అణుకేంద్రాలపై దాడులు చేద్దామని ఇజ్రాయెల్‌ ప్రతిపాదిస్తే వద్దని అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ వద్దని వారించినట్లు వార్తలు వచ్చాయి. ఎందుకు అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. నిజానికి గతంలోనే అలాంటి ప్రయత్నం జరిగింది.నాటంజ్‌ అణుకేంద్రంలో 2021లో సంభవించిన పేలుడువిధ్వంసం వెనుక ఇజ్రాయెల్‌ హస్తం వుందన్నది బహిరంగ రహస్యం. అయితే ఏ మేరకు నష్టం జరిగిందన్నది ఇప్పటికీ వెల్లడి కాలేదు. అణుబాంబు తయారీ నుంచి ఇరాన్‌ వెనక్కు తగ్గాలంటూ 2015లో ఒక ఒప్పందం కుదరింది. డోనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారి అధికారానికి వచ్చిన తరువాత 2018 మే నెలలో ఏకపక్షంగా దాన్నుంచి అమెరికా తప్పుకుంది. దాంతో ఇరాన్‌ తన కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించింది. ఎంత వేగంగా అణ్వాయుధాన్ని చేయగలదు, దానికి ఉన్న అవకాశాలు, అవరోధాలు ఏమిటని ఆ రంగ నిపుణులు తర్జన భర్జన పడుతున్నారు. అణుపరీక్ష జరిపితే అధికారికంగా గుర్తింపు పొందిన అమెరికా, రష్యా, చైనా,ఫ్రాన్సు,బ్రిటన్‌ దేశాలుగాక అణ్వాయుధాలు ఉన్నట్లు ప్రకటించిన భారత్‌, పాకిస్థాన్‌, ఇజ్రాయెల్‌, ఉత్తర కొరియా, సరసన అణ్వాయుధాలున్న పదవ దేశంగా ఇరాన్‌ అవతరిస్తుంది. ట్రంపు ఆ దిశగా నెట్టేట్లు కనిపిస్తున్నాడు.

కొందరి అంచనా ప్రకారం అణ్వాయుధ రూపకల్పనలో కీలకమైనది బాగా శుద్ధి చేసిన యురేనియం.దాన్ని సమకూర్చుకున్న తరువాత కొన్ని నెలలు లేదా గరిష్టంగా ఒక ఏడాది కాలంలో ఆయుధం అందుబాటులోకి వస్తుందని కొందరు చెబుతున్నారు. అయితే చైనా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే కేవలం మూడు నుంచి ఐదు వారాల్లోనే సిద్దం చేయవచ్చన్నది ఒక అభిప్రాయం. ఏడాదైనాఐదు వారాలైనా ఇరాన్‌ అణ్వాయుధం తయారు చేయగలదన్నదే అమెరికాకు పట్టుకున్న భయం, అందుకే 2024లో అణుకేంద్రాలపై దాడి చేసేందుకు జో బైడెన్‌ సంశయించటం లేదా వద్దని వారించటం వెనుక ఉన్న అసలు కారణం అని చెప్పవచ్చు. ఆయుధ తయారీలో ఒకటి అణు సంబంధిత పదార్ధాలు, రెండవది అణేతర పరికరాలు కావాలి. ముందు అణు పదార్ధాలు సమకూరిన తరువాతే ఇతర పరికరాలకు రూపకల్పన చేయటం అమెరికా, ఇతర దేశాల అనుభవం. అదే చైనా విషయానికి వస్తే రెండిరటి తయారీ సమాంతరంగా ఏక కాలంలోనే ప్రారంభించి తక్కువ వ్యవధిలో రూపొందించి పరీక్ష చేయటం మరో ప్రక్రియ. ఇప్పుడు ఇరాన్‌ దీన్నే అనుసరిస్తోందని భావిస్తున్నారు. సమయ అవసరం ఉండదు.
అమెరికా, దానితో జతకట్టిన ఇతర దేశాల బెదిరింపుల పూర్వరంగంలో చైనా తనదైన శైలిలో అణ్వాయుధ రూపకల్పన చేసింది. బహిర్గతమైన సమాచారం ప్రకారం అణుబాంబు తయారీకి అవసరమైన యురేనియం 1964జనవరి నాటికి సిద్దమైంది. రెండు బాంబులు తయారు చేసేందుకు సమకూర్చుకుంది. దాన్ని ఆయుధంగా రూపొందించటానికి అవసరమైన ఇతర పరికరాల తయారీ ప్రక్రియను 1963నాటికే సిద్దం చేశారు. దీంతో 1964 మే ఒకటవ తేదీ నాటికి తొలి బాంబు తయారీకి అవసరమైన ఏర్పాట్లను శాస్త్రవేత్తలుఇంజనీర్లు సంయుక్తంగా రూపొందించారు.తరువాత అవసరమైన తనిఖీలు, తుది మెరుగులు దిద్ది ఆగస్టు 20 నాటికి రెండు బాంబుల రూపకల్పనకు రంగం సిద్దం చేశారు.క్వింగ్‌హై అణ్వాయుధ కేంద్రంలో మొదటి బాంబును కేవలం మూడు రోజుల్లోనే తయారు చేశారు. తొలి ప్రయోగాల తరువాత దాన్ని విడదీశారు. చైనా తొలి అణుపరీక్ష కేంద్రానికి వాటిని తరలించిన తరువాత కేవలం పది గంటల్లోనే తిరిగి అమర్చి బాంబును తయారు చేశారు.బాంబు తయారీకి అవసరమైన విధంగా యురేనియంలో మార్పులు, ఇతర పరికరాల తయారీ , వాటిని ఒకదగ్గర చేర్చి బాంబుగా మార్చేందుకు మొత్తం పట్టిన సమయం మూడు నుంచి ఐదు వారాలు మాత్రమే. ఆరు దశాబ్దాల క్రితం చైనా వద్ద అవసరమైన ఆధునిక పరికరాలు లేనప్పటికీ స్వయం కృషితో వారాపని చేశారు. ఇప్పుడు ఇరాన్‌ లేదా మరొక దేశం ఏదైనా బాంబుల తయారీకి పూనుకుంటే అన్ని ఆటంకాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.చైనా తయారీ శాంతి కాలంలో జరిగింది. అదే ఇరాన్‌ ఇప్పుడు ఎదుర్కొంటున్న బెదిరింపుల వంటి పూర్వరంగంలో తలచుకుంటే మూడు వారాల్లోనే తయారు చేయవచ్చని చెబుతున్నారు. గతంలో ఇజ్రాయెల్‌ సంపాదించినట్లు చెబుతున్న సమాచారం ప్రకారం 1999 నుంచి 2003వరకు అమద్‌ ప్లాన్‌ పేరుతో ఇరాన్‌ యురేనియం శుద్దితో సమాంతరంగా బాంబుల తయారీకి అవసరమైన ఇతర ఆయుధ భాగాల రూపకల్పన చేపట్టింది. ఐదు అణ్వాయుధాలను తయారు చేయాలని, వాటిలో మూడిరటిని సాహెబ్‌3 ఖండాంతర క్షిపణులకు అమర్చాలని, ఒకదానితో భూ గర్భంలో పరీక్ష జరపాలన్నది ఇరాన్‌ కార్యక్రమంలో ఉన్నట్లు చెప్పారు. ఇదే వాస్తవమైతే చైనా తొలి బాంబుల మాదిరే ఇరాన్‌ కార్యక్రమం కూడా ఉందని చెబుతున్నారు. పశ్చిమ దేశాల నిపుణుల విశ్లేషణల ప్రకారం అమెరికా 1945లో జపాన్‌లోని నాగసాకి పట్టణంపై వేసిన ఫాట్‌ మాన్‌ బాంబు మాదిరే చైనా తనతొలి బాంబుకు రూపకల్పన చేసినట్లు, ఇప్పుడు ఇరాన్‌ కూడా అదే మాదిరి పథకాలతో ఉందని భావిస్తున్నారు. అయితే చైనా తొలి రూపకల్పనకు, ఫాట్‌మాన్‌కు చాలా తేడా ఉందని కొందరు విబేధిస్తున్నారు. సాంకేతికపరమైన అంశాలు పాఠకులలో అత్యధికులకు అంతగా ఒక పట్టాన ఎక్కేవి కాదు గనుక వాటి జోలికి పోవటం లేదు. ఏ దేశం రూపొందించినా బాంబు బాంబే, దాన్ని ఎక్కడ ప్రయోగించినా అపారనష్టం కలిగిస్తుంది.అమెరికా తన దగ్గర ఎంతటి విధ్వంసక ఆయుధం ఉందో చూడండి అంటూ ప్రపంచాన్ని భయపెట్టేందుకు జపాన్‌ నగరాల మీద వేసింది తప్ప నిజానికి అవసరం లేదు, ఆ సమయానికి జపాన్‌ చేతులెత్తేసి లొంగుబాటలో ఉంది, యుద్దం చివరి దశలో ఉంది. ఆ తరువాత అణుకార్యక్రమం చేపట్టిన దేశాలన్నీ కూడా మా ఇల్లు మీకెంత దూరమో మీ ఇల్లు కూడా మాకు అంతేదూరం కబడ్దార్‌ అమెరికా అని హెచ్చరించేందుకు బాంబులకు రూపకల్పన చేశాయి. ఆధిపత్యం కోసం అమెరికాచేస్తే, ఆత్మరక్షణకు మిగతా దేశాలు పూనుకున్నాయి. అందుకే ప్రతి దేశానికీ అణ్వాయుధం రూపొందించుకొనే హక్కు ఉందని, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధ ఒప్పదం వివక్షతో కూడుకున్నదని అనేక దేశాలు భావిస్తున్నాయి. వాటిలో మనదేశం కూడా ఉన్నందున ఆ ఒప్పందం మీద సంతకం పెట్టేందుకు నిరాకరించింది.


ఇరాన్‌ బాంబుల రూపకల్పన గురించి ప్రపంచానికి అంతగా తెలియదు.ఎంతో రహస్యంగా జరుపుతున్నది.అణు పరిజ్ఞానం కూడా అంతర్జాతీయ బ్లాక్‌ మార్కెట్లో దొరుకుతున్నది. పాకిస్థాన్‌ అణుకార్యక్రమ పితామహుడిగా పరిగణించే అబ్దుల్‌ ఖాదిర్‌ ఖాన్‌ చైనా అణ్వాయుధం 548 నమూనాను లిబియాకు అందచేశాడన్న ఆరోపణ ఉంది.చైనా బాంబుల మాదిరే ఇరాన్‌ రూపకల్పన కూడా ఉందని కొందరు పోల్చుతున్నారు. అయితే ఇరాన్‌ కూడా అలా పొందిందా లేదా అన్నది తెలియదు. అణు విద్యుత్‌ కేంద్రాలున్న ప్రతి దేశమూ అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం శుద్ది చేపట్టే సామర్ధ్యం కలిగి ఉంటుందన్నది ఒక అభిప్రాయం. అందుకే అనేక దేశాల వద్ద అణుబాంబులు ఉన్నాయని చెబుతారు. ఏ విదంగా చూసినప్పటికీ ఇరాన్‌ వద్ద కావాల్సిన పరిజ్ఞానం ఇప్పటికే ఉన్నదని, ఏ క్షణంలోనైనా బాంబులను రూపొందించగలదని భావిస్తున్నారు.అమెరికా జాతీయ గూఢచార కార్యాలయ అంచనా ప్రకారం 2015 అణు ఒప్పందం జరగటానికి ముందు ఇరాన్‌ వద్ద అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంలేదని అయితే 2024 జూలై నాటికి చూస్తే అణ్వాయుధ తయారీకి అవసరమైన పరిజ్ఞానంలో మెరుగైన స్థానంలో ఉందని, తలచుకొంటే ఆ పని చేస్తుందని పేర్కొన్నట్లు వార్తలు.అయితే బాంబులను తయారు చేసేదీ లేనిదీ ఇంతవరకు బహిరంగంగా ఇరాన్‌ సూచన ప్రాయంగా కూడా చెప్పలేదు. గత ఏడాది ఇజ్రాయెల్‌ చర్యలను, అమెరికా తీరుతెన్నులను చూసిన తరువాత, ముఖ్యంగా డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అదికారానికి వచ్చిన పూర్వరంగంలో ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేయనుందని భావిస్తున్నారు. వివరాలతో నిమిత్తం లేకుండా 2022 నుంచి ఇరాన్‌ అధికారులు తమ అణుకార్యక్రమం గురించి బహిరంగంగా మాట్లాడటాన్ని పెంచారు. కొన్ని నివేదికల ప్రకారం 70శాతం మంది ఇరాన్‌ పౌరులు అణ్వాయుధాలు కలిగి ఉండాలని భావిస్తున్నట్లు తేలింది.


తొలిసారిగా ఫాసిస్టు లక్షణాలు గలిగిన డోనాల్డ్‌ ట్రంప్‌ను అమెరికన్లు గతంలో ఒకసారి, ఇప్పుడు రెండవసారి ఎన్నుకున్నారు.ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడేం చేస్తారన్న చర్చ ప్రారంభమైంది. తిరిగి ఇరాన్‌తో అవగాహనకు వస్తాడా లేక బెదిరింపులతో నిరోధించేందుకు చూస్తాడా? అణుకేంద్రాల మీద దాడులు చేస్తే ఆ కార్యక్రమం నుంచి వైదొలుగుతుందని ఎవరూ భావించటం లేదు. అక్కడ ఉన్న పాలకులను మార్చి తొత్తులను గద్దెనెక్కించటం లేదా ఇరాన్ను భౌతికంగా ఆక్రమించుకోవటం తప్ప మరొక మార్గం లేదని కొందరు సూచిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో దీన్లో ఏదీ జరిగేది కాదు.ట్రంప్‌ వదరుబోతుతనం, ఉన్మాద చర్యలకు పాల్పడితే ఇరాన్‌ అణుకార్యక్రమం మరింత వేగం అందుకుంటుంది. ప్రచ్చన్న యుద్దంలో తామే గెలిచామని అమెరికా చెప్పుకున్నప్పటి నుంచి అణ్వాయుధాలను మరింతగా పెంచుకుంటూ పోతున్నది. ట్రంప్‌ ఏలుబడిలో ఇంకా పెరిగి ఏటా రెండులక్షల కోట్ల డాలర్ల మేర ఖర్చు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో అమెరికా అనుకుంటున్నది ఒకటి జరుగుతున్నది మరొకటి అన్నట్లుగా పరిణామాలు ఉన్నాయి. అణు ఒప్పందం నుంచి వైదొలిగితే ఇరాన్‌లో ఉన్న పాలకులు అధికారాన్ని కోల్పోయి కొత్తవారు వస్తారనే తప్పుడు సలహాను ట్రంప్‌ బుర్రలోకి సలహాదారులు ఎక్కించిన కారణంగానే 2018లో వైదొలిగినట్లు ఒక అభిప్రాయం. అయితే దానికి భిన్నంగా అణుకార్యక్రమం మరింత వేగవంతమైంది, పట్టుదల పెరిగింది. తమ పౌర అణుకార్యక్రమం గురించి ట్రంప్‌ ఈసారి మరింత ఆచరణాత్మక, వాస్తవ ప్రాతిపదికన వ్యవహరిస్తారని, తమతో సంప్రదింపులు ప్రారంభించాలని ఇరాన్‌ఉపాధ్యక్షుడు, వ్యూహాత్మక వ్యవహారాలనుచూసే నిపుణుడు మహమ్మద్‌ జావేద్‌ జరిఫ్‌ జనవరి మూడవ వారంలో బహిరంగా కోరాడు. దవోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో ఈ మాటలు చెప్పాడు. గతంలో తప్పుదారి పట్టించి మాజీ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌లను దూరం పెట్టారని కూడా గుర్తు చేశాడు. అమెరికా వైదొలిగిన కారణంగానే తమ కార్య క్రమం మరింత వేగం పుంజుకుందని కూడా చెప్పాడు. తాము అణ్వాయుధాల నిర్మాణం చేయాలనుకోవటం లేదని, అలా అనుకొని ఉంటే ఎప్పుడో చేసి ఉండేవారమన్నాడు. ఇరాన్‌ వైపు నుంచి వచ్చిన ఈ అవకాశాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ వినియోగించుకుంటాడా ? తలబిరుసుతనంతో మరింతగా రెచ్చగొట్టి మరో అణ్వాయుధ దేశాన్నిరంగంలోకి తెస్తాడా, బంతి ట్రంప్‌ కోర్టులో ఉంది.

వేతన పెంపుదల : కమ్యూనిస్టులు పోరాడితే సంస్థలకు వ్యతిరేకం-అదే కార్పొరేట్లు కోరితే….?

Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

బడ్జెట్‌ ప్రక్రియలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హల్వా వంటకాన్ని ప్రారంభించారు. అంటే బడ్జెట్‌ ప్రతుల ముద్రణకు శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటులో ప్రవేశపెట్టేంత వరకు సిబ్బంది ముద్రణాలయం నుంచి బయటకు వచ్చేందుకు వీల్లేదు. గతంలో ఏ వస్తువు మీద ఎంత పన్ను వేస్తారో, ఎంత తగ్గిస్తారో ముందుగానే వెల్లడి కాకూడదని అలా చేసేవారు. ఇప్పుడు పార్లమెంటుతో పని లేకుండానే జిఎస్‌టి కౌన్సిల్లో ముందుగానే అన్నీ నిర్ణయిస్తున్న తరువాత నిజానికి బడ్జెట్‌లో అంత రహస్యమేమీ ఉండదు. బడ్జెట్‌ ప్రవేశపెట్టేబోయే ముందు కేంద్ర ప్రభుత్వం వివిధ తరగతులతో సంప్రదింపులు జరపటం ఒక నాటకం తాము కోరుకున్న వారికి పెద్ద పీట వేయటం చేదు వాస్తవం. నిర్మలా సీతారామన్‌ వరుసగా ఆరు బడ్జెట్‌లు, ఒక తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టి మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ రికార్డును అధిగమించారు.మరో బడ్జెట్‌కు సిద్దం అవుతున్నారు. ఏ బడ్జెట్‌ చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా కార్పొరేట్లకు పెద్ద పీటవేయటంలో కూడా ఆమె రికార్డు సృష్టించారు. తాజా బడ్జెట్‌ గురించి అన్ని తరగతులను చర్చలకు ఆహ్వానించారు గానీ రైతులను కావాలనే విస్మరించారు. ఎందుకంటే నరేంద్రమోడీకి ఇష్టం ఉండదు గనుక. అంచనాలకు దూరంగా వర్తమాన ఆర్థిక సంవత్సరంలో వృద్ది రేటు ఉంది. ఎందుకు అంటే జనాల వినియోగం తగ్గిపోవటం ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. చిన్నప్పటి ఏడు చేపల కథను గుర్తుకు తెచ్చుకుంటే అందులో ఏడ్చిన పిల్లవాడు ఒక్కడైతే వర్తమాన కథలో ఎందరో. కానీ కేంద్రీకరణ అంతా వారిలో ఒకరైన వినియోగదారు మీదే ఉంది.


కమ్యూనిస్టులు వేతన పెంపుదల కోరగానే అనేక మంది విరుచుకుపడుతుంటారు. వీరికి పరిశ్రమలు,వ్యాపారాలు ఎలాపోయినా ఫరవాలేదు, కార్మికులకు వేతనాలు, అలవెన్సులు, బోనస్‌లు ఇంకా ఏవేవో పెంచాలంటారు, మొత్తం సంస్థలనే అప్పగించాలంటారు, వేరే పనేలేదని దుమ్మెత్తి పోస్తారు. నిజమే, వాటి గురించి చట్టాలు, నిబంధనలు ఉన్నవే కదా, వాటినే కమ్యూనిస్టులు అడుగుతున్నారు, దీనమ్మ జీవితం ! చట్టాలు అమలు జరగాలని, వాటి మేరకు పాలన జరగాలని కోరుకోవటం కూడా తప్పంటారా ? ఇది ప్రమాదకర పోకడ, తమదాకా వస్తే గానీ తెలియదు. కమ్యూనిస్టుల సంగతి సరే సాక్షాత్తూ కార్పొరేట్ల అధిపతులే వేతనాలు పెంచాలని, న్యాయంగా ఉండాలని చెబుతున్న సంగతి కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని వారికి ఎలా చెప్పాలి ! బెంగలూరు కేంద్రంగా పని చేస్తున్న వెంచర్‌ కాపిటల్‌ సంస్థ ఆరిన్‌, దాని చైర్మన్‌ మోహనదాస్‌ పాయ్‌. గతంలో ఇన్ఫోసిస్‌ కంపెనీ సిఎఫ్‌ఓగా పని చేశారు. ఆయన వేతనాల గురించి చెప్పిన మాటల సారం ఇలా ఉంది.(ఎకనమిక్‌ టైమ్స్‌ డిసెంబరు 19,2024) ‘‘ 2011లో ఇన్పోసిస్‌లో కొత్తగా చేరిన ఉద్యోగి ఏడాదికి రు.3.25లక్షలు పొందితే ఇప్పుడు రు.3.5 లేదా 3.75లక్షలు మాత్రమే తీసుకుంటున్నారు. పదిహేను శాతం ఎక్కువగా ఇస్తుండవచ్చు, పదమూడేండ్ల తరువాత దీన్ని ఎలా సమర్ధించాలి ? 2011లో కంపెనీ సిఇఓ ఎంత పొందారు ? ఇప్పుడు ఎంత ? న్యాయంగా ఉండాలి కదా ! మన వాణిజ్యం ద్రవ్యాశతో నీచకార్యాలకు పాల్పడే సంస్థలుగా(మెర్సినరీస్‌)గా మారాలని మనం కోరుకోకూడదు.లాభాల కోసం ప్రయత్నించటం తప్పుకాదు.తామెంతో న్యాయంగా ఉంటున్నట్లు యజమానులు చెప్పుకుంటున్నారు గనుక కంపెనీలు కూడా న్యాయంగా ఉండాలి. సిబ్బంది అత్యంత విలువైన సంపద అని చెబుతున్నారు గనుక దయచేసి చెప్పినట్లుగా చేయండి’’ అన్నార్‌ పాయ్‌. ఇదే ఒక కమ్యూనిస్టు చెబితే ఏ మీడియా అయినా దాన్ని అంత ప్రముఖంగా ప్రచురిస్తుందాప్రసారం చేస్తుందా ? అసలు వార్తగా అయినా ఇస్తుందా !

వేతన పెరుగుదల లేదా స్థంభన, నిజవేతనాలు పెరగకపోవటం గురించి తరచూ కమ్యూనిస్టులు, కార్మిక సంఘాలు మాట్లాడుతుంటాయి. కానీ ఇప్పుడు ఇతరులు మాట్లాడుతున్నారంటే నిజంగా వారికి కష్టజీవుల జీవితాల మీద ప్రేమ పుట్టుకువచ్చినట్లా ? ఇటీవలి కాలంలో కార్పొరేట్లకు ఆకాశాన్నంటే రీతిలో లాభాలు రావటం వెనుక నరేంద్రమోడీ అనుసరించే విధానాలు కారణం. అయితే ఆ మేరకు కార్మికులకు వేతనాలు పెరగకపోతే వినిమయ గిరాకీ తగ్గి మొదటికే మోసం వస్తుందని అదే మోడీ ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ స్వయంగా హెచ్చరించారు. పండుగల సమయాల్లో కూడా అమ్మకాల గురించి వాణిజ్యవేత్తలు పెదవి విరిచారు. ఇంటి దగ్గర భార్య ముఖాన్ని చూస్తూ ఎన్నిగంటలు గడుపుతారు, ఆదివారాలతో నిమిత్తం లేకుండా వారానికి 90గంటలు పని చేయాలని ఎల్‌ అండ్‌ టి అధిపతి సుబ్రమణ్యన్‌ సెలవిచ్చారు.పిల్లలు, పెద్ద వారిని వదిలేసి ఇద్దరూ 90 గంటలు పని చేయాలని అనలేదు. ఇన్పోసిస్‌ నారాయణ మూర్తి మరో 20 గంటలు తగ్గించి 70 అన్నారు. వీరందరికీ స్ఫూర్తి ఎవరంటే అత్యవసర పరిస్థితి ప్రకటించి ప్రస్తుతం జైలుపాలైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సక్‌ యోల్‌, అతగాడు 120 గంటలు చేయాలన్నాడు. యంత్రాలు కూడా నిరంతరం పని చేస్తే అరిగి చెడిపోతాయి గనుక కొంత విరామం, నిర్వహణ పనులు చేస్తారు. కార్మికులకు అదేమీ అవసరం లేదన్నది ఈ అపరమానవతా మూర్తుల ఉవాచ.

కంపెనీలు వేతనాలు సక్రమంగా ఇస్తున్నాయా అంటే లేదు, పని మాత్రం చేయాలి.నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో నమోదైన 500 కంపెనీలకు 2024 ఆర్థిక సంవత్సరంలో పన్నుల చెల్లింపు అనంతరం వచ్చిన లాభాలు 15 ఏండ్ల గరిష్టం అని అనంత నాగేశ్వరన్‌ చెప్పారు.జిడిపి వృద్ధి రేటు అంచనాలకంటే తగ్గినప్పటికీ ప్రపంచంలో అధికవృద్ధి మన దగ్గరే అని పాలకపార్టీ పెద్దలు తమ భుజాలను తామే చరుచుకుంటున్నారు. ఉపాధి రహిత వృద్ధి, వేతన వృద్ధి బలహీనంగా ఉన్నపుడు కార్పొరేట్లకు లాభాలు తప్ప శ్రామికులకు ఒరిగేదేమీ లేదు.ద్రవ్యోల్బణం పెరుగుదలతో వారిలో కొనుగోలు శక్తి పడిపోతున్నది. ఐటి రంగంలో వేతన వృద్ధి దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే పడిపోయింది. దానికి తోడు రూపాయి విలువ పతనంతో ఎగుమతులు ప్రధానంగా ఉన్న ఆ రంగంలోని కంపెనీలకు లాభాలే లాభాలు. వివిధ రంగాల్లోని నిపుణులైన కార్మికులు(వారిని బ్లూ కాలర్‌ వర్కర్స్‌ అంటున్నారు) జీవన వేతనం కోసం నిరంతరం సతమతం అవుతున్నారు. వర్క్‌ ఇండియా అనే సంస్థ నివేదిక ప్రకారం దేశంలో 57శాతం మంది ఈ కార్మికుల వేతనాలు నెలకు రు.20 వేలకంటే తక్కువే, 29శాతం మంది 2040వేల మధ్య పొందుతున్నారు. కార్పొరేట్ల నిలయం దవోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుల్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ పెట్టుబడులను ఆకర్షించేందుకు పడుతున్న తాపత్రయం మంచిదే. కానీ కార్మికులకు ఆర్థిక న్యాయం, గౌరవాన్ని కలిగించేందుకు అవసరమైన వేతనాలు ఇప్పించేందుకు ఏం చేస్తున్నారు. రెండు చోట్లా కోట్లాది మందిగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల కనీస అవసరాలు తీర్చే విధంగా దశాబ్దాలతరబడి సవరణకు నోచుకోని కనీసవేతనాల గురించి ఒక్క పలుకూ చేతా లేదు. వారి విజన్లలో కార్పొరేట్లు తప్ప కార్మికులకు చోటు లేదు.ఆకలి కేకలతో ఉన్న 80 కోట్ల మందికి మరికొన్ని సంవత్సరాలు ఉచితంగా ఐదేసి కిలోల ఆహార ధాన్యాలు ఇస్తానంటారు తప్ప చేసేందుకు ఉపాధి కల్పించి ఆత్మగౌరవంతో బతకటం విశ్వగురువు నరేంద్రమోడీ అజెండాలో లేదు.శ్రమజీవులు ముష్టిని కోరుకోరుకుంటారా ?

నైపుణ్యం పెంచినట్లు మోడీ పదేండ్లుగా చెబుతున్నారు.వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. రేవంత రెడ్డి విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి కబుర్లు చెబుతుంటే చంద్రబాబు నాయుడు నిపుణులు ఎంత మంది ఉన్నారో ముందు లెక్కతేలాలంటున్నారు.పదేండ్ల నుంచి నైపుణ్యాలు నిజంగా పెంచితే దానికి తగిన విధంగా వేతనాలు వాటికి అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగాలి, కానీ తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అన్ని రంగాల్లో ఆటోమేషన్‌ , దాంతో ఉత్పాదకత పెరుగుతోంది ఉపాధి తగ్గుతోంది, కంపెనీల లాభాలు పెరుగుతున్నాయి. న్యాయమైన వేతనాలు చెల్లించటం కేవలం నైతిక విధాయకమే కాదు నిరంతర వినియోగ గిరాకీ పెరగటానికి కూడా అవసరమే అని అనంత నాగేశ్వరన్‌ నొక్కి చెప్పారు. కార్పొరేట్ల లాభదాయకతకార్మికుల సంక్షేమం మధ్య తేడాను తగ్గించకపోతే దీర్ఘకాలంలో దేశ ఆర్థిక స్థిరత్వానికి పెద్ద ముప్పు పొంచి ఉన్నట్లే. దేశంలో కాంటాక్టు కార్మికుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది, పరిశ్రమలను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారు, కార్మికులను మాత్రం తాత్కాలికం పేరుతో నియమిస్తారు. ఐటి రంగంలో సిఇఓవేల వేతనాలు చూస్తే గత ఐదేండ్లలో 5060శాతం పెరగ్గా దిగువ 20శాతం సిబ్బంది వేతనాలు 2025శాతం మాత్రమే పెరిగినట్లు మోహనదాస్‌ పాయ్‌ చెప్పారు. దిగువ 50శాతం మంది సిబ్బంది పెద్ద ఎత్తున దోపిడీకి గురవుతున్నారని కార్పొరేట్‌ సంస్థలు వారికి మెరుగైన వేతనాలివ్వాలని కూడా చెప్పారు. ఎక్కడైనా కమ్యూనిస్టులు లేదా కార్మిక సంఘాల నాయకత్వాన విధిలేని స్థితిలో కార్మికులు సమ్మెలకు దిగితే ఇంకేముంది సంస్థలు దివాలా అంటూ గుండెలు బాదుకొనే వారు పాయ్‌ చెప్పిందాన్ని ఏమంటారు ? దుకాణాలు, పరిశ్రమల్లో సహాయకులుగా ఉండే కాంట్రాక్టు కార్మికుల వేతనాలు గత ఐదేండ్లలో ఒకటి రెండుశాతమే పెరిగినట్లు అధ్యయనాలు తెలిపాయి.

కార్పొరేట్లు సంపదల పంపిణీకి వ్యతిరేకం, కానీ పరిమితంగా వేతనాలు పెరగాలని కోరకుంటున్నాయి. ఎందుకని ? మనదేశంలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం జరుపుతున్నారు, తమ ప్రయాణాలు సుఖవంతం, వేగవంతంగా జరిపేందుకు వేస్తున్నారని జనం భావిస్తారు, దాన్లో వాస్తవం లేకపోలేదు, టోల్‌ రూపంలో తగిన మూల్యం చెల్లిస్తున్నారన్నది వేరే అంశం. అదొక్కటే కాదు, జనం సొమ్ముతో రోడ్లను ప్రభుత్వం వేస్తే కాంట్రాక్టులు తీసుకొని లాభాలు పొందేది, నిర్వహణను తీసుకొని టోలు వసూలు చేసుకొనేది ప్రయివేటు కంపెనీలే.ఆర్థిక వ్యవస్థ మందగించినపుడు అమెరికాలో పెద్ద ఎత్తున రోడ్లు, వంతెనల వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి వివిధ కంపెనీల ఉత్పత్తులు పడిపోకుండా ఉద్దీపన ఇచ్చారు. మనదేశంలో జరుగుతున్నది కూడా అదే. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రాణాపాయంగా మారిన గర్భిణులను డోలీల ద్వారా ఆసుపత్రులకు చేర్చటం ఒకవైపు జర్రున జారే రోడ్ల మీద తుర్రుమంటూ ప్రయాణించే తీరు మరోవైపు చూస్తున్నాం. ఎందుకిలా ? ఎక్కడ లాభం ఉంటే అక్కడే పెట్టుబడులు. గతంలో కూడా కార్మికులకు యజమానులు వేతనాలిచ్చేవారు, అవి కుటుంబ సభ్యులు, వారు మరుసటి రోజు పనిచేయటానికి అవసరమైన శక్తినిచ్చేందుకు సరిపడా మాత్రమే. ఇప్పుడు ఉత్పాదకత ఎన్నో రెట్లు పెరిగి ఇబ్బడి ముబ్బడిగా ఉన్న సరకులు, సేవలు అమ్ముడు పోవాలంటే తగినంత మంది వినిమయదారులు కూడా ఉండాలి. అందుకే అవసరమైతే జనాలకు సబ్సిడీలు ఇచ్చి ఆ మేరకు మిగిలే సొమ్ముతో కొనుగోలు చేయించేందుకు చూస్తున్నారు. ఇంత చేసినా వినియోగం పెరగటం లేదు. ఎక్కువకాలం ఇలాగే ఉంటే పరిశ్రమలు, వాణిజ్యాలను మూసుకోవాలి. అప్పుడు కార్పొరేట్ల పెట్టుబడి వృధా అవుతుంది. కరోనా సమయంలో ఉచితంగా నగదు బదిలీ కూడా జరగాలని కొందరు సూచించారు, ఇప్పుడు వేతనాలు పెంచాలని తద్వారా జనం జేబుల్లోకి డబ్బు చేరాలని తమ సరకులు, సేవలకు మార్కెట్‌ కల్పించాలని చెబుతున్నారు. కమ్యూనిస్టులు చెబుతున్నట్లుగా హక్కుగా కోరేందుకు మాత్రం అంగీకరించరు.అవసరమైతే అణచివేస్తారు.

పనామా కాలువే కాదు…సప్త సముద్రాలూ, యావత్‌ భూమండలం కావాలంటాడు – డోనాల్డ్‌ ట్రంప్‌కు ఇచ్చేద్దామా !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

వెనుకటికి ఎవడో మీకు భయంగా ఉంటే అందరూ నా చుట్టూ ఉండండి అన్నాడట. డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా భద్రతకు ప్రపంచమంతా తనకు కావాలంటున్నాడు. ఇప్పటికే అన్ని ఖండాలలోని 80దేశాల్లో అమెరికాకు 800కు పైగా చిన్నా పెద్దా సైనిక స్థావరాలు, కేంద్రాలూ ఉన్నాయి, అవి చాలవట. ఏది కావాలంటే దాన్ని ఇచ్చేద్దామా ? అధికార స్వీకరణకు ముందు చెప్పిన మాటలను చూసి అనేక మంది డోనాల్డ్‌ ట్రంప్‌ పిచ్చివాగుడులే గద్దె నెక్కిన తరువాత బుద్ధిగా ఉంటాడు అనుకున్నారు. కానీ తరువాత వెలువడిన తొలి పలుకుల నుంచీ ఏదో తేడా కొడుతోంది అనుకుంటున్నారు. తమ కాలువ గురించి చేసిన వ్యాఖ్యలతో ఉలిక్కి పడిన పనామా దాన్ని బలవంతగా ఆక్రమించుకొనేందుకు అమెరికా చూస్తోందంటూ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. ప్రపంచ పరిణామాల్లో అమెరికా నానాటికీ ఒంటరి అవుతోంది. దానికి అనేక ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇంకేమాత్రం ప్రజాస్వామిక పద్దతుల్లో వ్యవహరిస్తే లాభం లేదని భావిస్తోందా ? తన రక్షణ మరొక పేరుతో ఏది కావాలని అమెరికా కోరుకుంటే దాన్ని ప్రపంచం ఇచ్చివేయాలా ? తమ నౌకలు సప్త సముద్రాల్లో తిరుగుతాయి, వాటి మధ్యన దేశాలు ఉంటాయి గనుక అవన్నీ తమ ఆధీనంలోకి రావాలంటే పుచ్చుకోబాబూ అంటూ సమర్పించుకోవాలా ? ప్రమాణ స్వీకారానికి ముందు కెనడా తమ దేశంలో 51వ రాష్ట్రంగా విలీనం కావాలన్నాడు, పనామా కాలువను తిరిగి తీసుకుంటా, డెన్మార్క్‌లోని స్వయం పాలిత ప్రాంతం గ్రీన్‌ లాండ్‌ కూడా కావాల్సిందే అన్నాడు. అసలు ట్రంప్‌ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు. అధ్యక్ష ప్రసంగంలో పనామా గురించి మాత్రమే ప్రస్తావించాడు. గతంలో తమ నేతలు తెలివి తక్కువగా దాన్ని అప్పగించారని అన్నాడు. దాన్ని తిరిగి తీసుకోకుండా ప్రశాంతంగా ఒక అధ్యక్షుడు ఎలా ఉండగలడన్నాడు. అందువలన పనామా కాలువ గురించి చూద్దాం.

వలస వచ్చిన ఐరోపా శ్వేతజాతీయులు అమెరికా ఖండమంతటా విస్తరించటానికి దేవుడు తమకు ఆదేశమిచ్చాడంటూ స్థానికంగా ఉన్న రెడ్‌ ఇండయన్లను ఊచకోత కోసి ఆక్రమించుకున్నారు. తరువాత మరో రూపంలో ప్రపంచాధిపత్యం కోసం అమెరికా పూనుకుంది. డోనాల్డ్‌ ట్రంప్‌ అజెండా దాని కొనసాగింపే. దక్షిణ అమెరికాను ఆక్రమించుకున్న స్పానిష్‌ పాలకులు తమ దేశం నుంచి పెరూ చేరుకోవాలంటే నౌకల రవాణా కోసం అట్లాంటిక్‌పసిఫిక్‌ సముద్రాలను కలుపుతూ ఒక కాలువ తవ్వాలనే ఆలోచనను పదహారవ శతాబ్ది ప్రారంభంలోనే చేశారు. ఎందుకంటే పదకొండువేల కిలోమీటర్ల మేర సముద్రంలో ప్రయాణించి చేరటం దూరా భారం కనుక వారికి ఆ ఆలోచన వచ్చింది. అమెరికన్లు తొలుత నికరాగువా ద్వారా అనుసంధానం చేయాలనే ఆలోచన చేశారు, తరువాత పనామాను ఎంచుకున్నారు. దాని కంటే ముందు ఈజిప్టులో సూయజ్‌ కాలువ తవ్వారు. ఐరోపా నుంచి ఆసియాకు నౌకలు రావాలంటే ఆఫ్రికా ఖండాన్ని చుట్టి వచ్చేవి. సమయం, ఖర్చు తగ్గించేందుకుగాను మధ్య ధ సముద్రంఎర్ర సముద్రం మధ్య ఒక కాలువ తవ్వితే అరేబియా, హిందూ మహాసముద్రాల్లోకి సులభంగా ప్రవేశించవచ్చని ఫ్రెంచి ఇంజనీర్లు ఆలోచనచేసి 185969 మధ్య కాలువ తవ్వి రవాణాకు వీలు కల్పించారు. దానిని చూసిన తరువాత పనామా కాలువను అదే ఫ్రెంచి ఇంజనీర్లు 188089 మధ్య కొంత మేరకు తవ్వి అనేక అవాంతరాలు రావటంతో నిలిపివేశారు. తరువాత అమెరికన్లు ఆ కాలువను స్వాధీనం చేసుకొని మిగతా భాగాన్ని పూర్తి చేసి 1914 నాటికి సిద్దం చేశారు. అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కావటంతో ఎలాంటి ప్రారంభోత్సవాలు లేకుండా నౌకలను అనుమతించారు. ఆ యుద్దంలో అమెరికా మిలిటరీకి అది ఎంతో ఉపయోగపడిరది.1977 వరకు అమెరికా ఆధీనంలోనే ఉన్న ఆ కాలువను అనివార్య స్థితిలో పనామాకు అప్పగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దాన్ని ఒక పట్టాన వదులుకొనేందుకు సిద్దపడకుండా 1999 వరకు సాగదీసింది.తరువాత దాన్ని పనామా నవీకరించి పెద్ద ఓడలకు వీలుగా విస్తరించింది.

పనామాకు ఇచ్చింది మేం గనుక తిరిగి మాకు కావాలని ఇప్పుడు ట్రంప్‌ చెబుతున్నాడు. అదే గనుక అయితే ముందు ప్రారంభించినందున మా సంగతేమిటని ఫ్రాన్సు అడిగితే....? ఎవరైనా ఎవడబ్బ సొమ్మని అడుగుతారు ! ట్రంప్‌ చెబుతున్న కారణం ఏమిటి ? అప్పగింత ఒప్పందాన్ని ఉల్లంఘించి పనామా ఆ కాలువను చైనాకు అప్పగించినట్లు ఆరోపించాడు.సర్వసత్తాక దేశమైన తమకు తమ కాలువ నిర్వహణను ఎవరికైనా అప్పగించే హక్కుందని పనామా అధ్యక్షుడు జోస్‌ రావుల్‌ ములినో వెంటనే స్పందించాడు. కాలువను తమకు ఏదో అప్పనంగా ఇచ్చినట్లు చెప్పటాన్ని ఖండిరచాడు. ఈ మార్గంలో అమెరికా చమురు, కంటెయినర్‌ ఓడల్లో 40శాతం ప్రయాణిస్తాయంటే అదెంత కీలకమో అర్ధం అవుతోంది. తమనుంచి ఎక్కువ మొత్తంలో టోల్‌ వసూలు చేస్తున్నట్లు ట్రంప్‌ ఆరోపించాడు. ఈ కాలువ రెండు వైపులా ఉన్న రేవులను 1997 ఒప్పందం ప్రకారం హాంకాంగ్‌ కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ కంపెనీ సికె హచిసన్‌ నిర్వహిస్తున్నది. తరువాత రెండు సంవత్సరాలకు చైనాలో ప్రత్యేక ప్రాంతంగా అనుసంధానమైంది. ఆ కంపెనీలో జపాన్‌ మిత్సుబిషి, అమెరికా కంపెనీ బీచ్‌టెల్‌ కూడా భాగస్వాములే. 2049వరకు హంకాంగ్‌ చైనాలో విలీనం కాదని, అప్పటి వరకు ఆ కంపెనీతో సహా అన్నీ కూడా లావాదేవీలు జరిపేందుకు చైనా అనుమతించింది, అప్పటి వరకు ప్రత్యేక ప్రాంతంగానే ఉంటుంది.అమెరికన్లు కాలువను పూర్తిగా 1999 డిసెంబరు 31న పనామాకు అప్పగించారు. ట్రంప్‌ అసలు ఏడుపు ఏమంటే ఇటీవలి కాలంలో పనామాచైనా సంబంధాలు విస్తరించాయి.2017వరకు అమెరికా కనుసన్నలలో నడిచిన పనామా తైవాన్ను తప్ప చైనాను అసలు గుర్తించలేదు. తరువాత చైనాను గుర్తించటమే గాక బిఆర్‌ఐలో భాగస్వామిగా మారింది. పనామా కాలువకు సమాంతరంగా చమురు, గ్యాస్‌ పైప్‌ లైన్‌ ఏర్పాటు ద్వారా అదనపు రాబడి పొందవచ్చని పనామా ఆలోచిస్తున్నది. అది జరిగితే అమెరికా ఇంథనం కూడా దాని ద్వారానే సరఫరా చేయాల్సి ఉంటుంది. అంతే కాదు ప్రపంచ వాణిజ్యంలో ఆరుశాతం ఈ కాలువ ద్వారా జరుగుతున్నది, దీని వలన పనామాకు 2024లో ఐదు బిలియన్‌ డాలర్ల మేర లాభం వచ్చింది, ప్రతి డాలరును లెక్కవేసుకొనే అమెరికా కార్పొరేట్లు ఇంత మొత్తాన్ని వదులుకుంటారా ! ఈ కారణంగా కూడా ట్రంప్‌ ఆ కాలువను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాడు. మెక్సికో గల్ఫ్‌గా వ్యవహరిస్తున్నదానిని అమెరికా గల్ఫ్‌గా పేరు మారుస్తూ ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశాడు. అయితే అమెరికా మాప్‌లో మాత్రమే ఆ పేరుతో ఉంటుంది, మిగతా దేశాలు తమ పటాల్లో పేరు మార్చాల్సిన అవసరం లేదు.తన చేతిలో పని గనుక పేరు మార్చాడు, పనామా కాలువను కలం పోటుతో స్వాధీనం చేసుకోగలడా ?

పనామాతో కుదురిన ఒప్పందం ప్రకారం అ కాలువ నిర్వహణలో తటస్థంగా ఉంటూ అన్ని దేశాలకు చెందిన నౌకలను అనుమతించాలని మాత్రమే ఉంది తప్ప తిరిగి అమెరికా తీసుకోవటానికి ఎలాంటి నిబంధన లేదు. హంకాంగ్‌ కంపెనీకి నిర్వహణను అప్పగించటాన్ని తటస్థ నిబంధన ఉల్లంఘన, చైనాకు అప్పగింతగా ట్రంప్‌ చిత్రించాడు. 2024 జూలైలో పనామా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ములినో ఒక మితవాది. తమ దేశంలో చైనా పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయని, అమెరికా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు గతంలో చెప్పాడు.దాన్ని అవకాశంగా తీసుకోవాలని ట్రంప్‌ చూస్తున్నట్లు ఉంది. ఒక వేళ అతగాడు లొంగిపోయినా జనం అంగీకరించరు. అందుకే వ్యతిరేకిస్తూ ప్రకటన చేయాల్సి వచ్చింది.ఈ కాలువను చైనా తన మిలిటరీ అవసరాల కోసం వినియోగించుకోవచ్చని అమెరికా ఆరోపిస్తున్నది.గత పదేండ్లలో ఒక్క చైనా మిలిటరీ నౌక కూడా ఆ కాలువలో ప్రయాణించలేదు. సరకు రవాణాలో కూడా చైనా వాటా చాలా తక్కువ. ఇక పనామాలో పెట్టుబడుల విషయానికి వస్తే అమెరికా నుంచి 13 బిలియన్‌ డాలర్లు ఉంటే చైనా 51.5కోట్ల డాలర్లు మాత్రమే. అందువలన ఏ విధంగా చూసినా అమెరికాకు పోటీ కాదు, ముప్పు కూడా కాదు. పనామా కాలువను మిలిటరీ లేదా ఆర్థికపరమైన బెదిరింపుల ద్వారా అదుపులోకి తీసుకోవటం గురించి ట్రంప్‌ ఆలోచన కూడా చేయవద్దని రష్యా హెచ్చరించింది. పనామాను మరోసారి దురాక్రమణ చేస్తే తప్ప కాలువను స్వాధీనం చేసుకొనే అవకాశం లేదు. ఆ కాలువ ఐదువందల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఉంది. దేశ జనాభా 45 లక్షలు. దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే 90వేల మంది సైనికుల అవసరం ఉంటుందని మిలిటరీ అధికారులు అంచనావేశారు. దీన్ని బట్టి ఎక్కడ ఎలా దాడి చేయాలో ఎంత మంది సైనికులు అవసరమో అన్నీ సిద్దం చేసుకున్నదనుకోవాలా ? అలాంటి దుండగానికి పాల్పడితే దక్షిణ అమెరికా దేశాలన్నీ మౌనంగా ఉంటాయా ! ఫ్రెంచి కంపెనీ పనామా కాలువ తవ్వకం ప్రారంభించిన సమయంలో పనామా ప్రాంతం కొలంబియాలో ఉంది. ఆ కాలువను అమెరికా తీసుకోవాలని నిర్ణయించిన తరువాత కొలంబియా అంగీకరించకపోవటంతో పనామాకు స్వాతంత్య్రం ఇవ్వాలంటూ అమెరికా తన మిలిటరీని పంపింది. తరువాత కాలువ పరిసరాలను ఆక్రమించి పనామాను రెండుగా మార్చింది. కాలువ కోసం తరువాత పనామాలో అనేక ఉద్యమాలు జరిగాయి. దాంతో అమెరికా వైదొలగక తప్పలేదు.

ఆగని ఇజ్రాయెల్‌ దుర్మార్గం : గాజాలో కాల్పుల విరమణ, పశ్చిమ గట్టులో దాడులు !

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు


గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన పదిహేను నెలల మారణకాండ తరువాత జరిగిన ఒప్పందంతో ప్రస్తుతానికి అది ఆగిపోయింది. దీంతో అటు పాలస్తీనియన్లు, ఇటు ఇజ్రాయెలీలు ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఉపశమనం ఎంతకాలం ఉంటుందో ఎవరూ చెప్పలేరు. కాపురం చేసే కళ కాళ్ల గోళ్ల దగ్గరే తెలుస్తుందంటారు.ఒప్పందం అమల్లోకి వచ్చిన తరువాత గాజాలో రాఫా ప్రాంతంలో ఒక బాలుడితో సహా ముగ్గుర్ని ఇజ్రాయెలీ దళాలు కాల్చిచంపాయి. పాలస్తీనాలోని మరో ప్రాంతమైన పశ్చిమ గట్టు జెరూసలెం నగర పరిసరాల్లోని గ్రామాల్లో దురాక్రమణదారులుగా ఉన్న ఇజ్రాయెలీలు తమ మిలిటరీ కనుసన్నలలో పాలస్తీనియన్ల మీద దాడులకు తెగబడ్డారు. జెనిన్‌ పట్టణంలో మిలిటరీ జరిపిన దాడుల్లో పది మంది మరణించగా పెద్ద సంఖ్యలో గాయపడ్డారు.పశ్చిమగట్టుపై ఇజ్రాయెల్‌ ఆధిపత్యం దేవుడిచ్చిన హక్కు అని ఐరాసలో ట్రంప్‌ కొత్తగా నియమించిన రాయబారి ఎల్సీ స్టెఫానిక్‌ అనటాన్ని బట్టి రానున్న రోజుల్లో దాడుల కేంద్రీకరణ ఆ ప్రాంతానికి మారనుందన్నది స్పష్టం. పాలస్తీనియన్లకు స్వయం నిర్ణయాధికార హక్కు లేదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆమె ఇజ్రాయెల్‌కు హక్కుందన్నారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందని తాను చెప్పలేనని ట్రంప్‌ స్వయంగా చెప్పటాన్ని బట్టి అమెరికాకు చిత్తశుద్ది లేదనేందుకు నిదర్శనం. అందుకే కాల్పుల విరమణ ఒప్పందంతో ఎవరూ పండుగ చేసుకోవటం లేదు. గాజాలో మంగళవారం నాడు భవనాల శిధిలాల కింద 120 శవాలు దొరికాయి. పాలస్తీనియన్లకు రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి యూదు మూకలదాడుల్లో ప్రాణాలు అర్పించటం లేదా మాతృభూమి కోసం తెగబడి ప్రతిఘటించటం. ఏడు దశాబ్దాలుగా జరుగుతున్నదిదే. అదే ఇజ్రాయెలీలను చూస్తే వారికి ప్రాణ భయం లేకున్నా, ఎటువైపు ఎవరు దాడి చేస్తారో అన్నభయంతో బతుకులీడుస్తున్నారు. సైరన్ల మోతలు వినిపిస్తే చాలు సొరంగాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. గాజాలో 47,105 మందిని చంపివేశారు. వీరిలో 80శాతం మంది మహిళలు, పిల్లలే ఉన్నారు.మరో1,11,147 మందిని గాయపరిచారు. అరవైశాతం భవనాలను నేలమట్టం చేశారు. ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడులు, వైద్య సంస్థల ధ్వంసంతో అనారోగ్యంపాలై మరణించిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఒప్పందం మూడు దశల్లో అమలు జరుగుతుంది.హమస్‌ వద్ద ఉన్న బందీలు, ఇజ్రాయెల్‌ వద్ద ఉన్న నిర్బంధితుల విడుదల తరువాత గాజా పరిస్థితి అజెండాలోకి రానుంది.రెండవ దశలో ఇజ్రాయెల్‌ సైన్యం పూర్తిగా గాజా నుంచి వైదొలగటం, నిరాశ్రయులైన వారిని స్వస్థలాలకు రప్పించటం, బందీలు`ఖైదీలను పూర్తిగా విడుదల చేయటం, మూడవ దశలో హమస్‌ చేతుల్లో బందీలుగా ఉండి మరణించిన వారి మృతదేహాల అప్పగింత ఇతర అంశాలు ఉంటాయి. ఈ ఒప్పందం గురించి ఎవరికి ఉండే అనుమానాలు వారికి ఉన్నప్పటికీ అంగీకారం మేరకు ఆదివారం నుంచి అమలు ప్రారంభమైంది.


నిర్ణీత గడువులోగా హమస్‌ విడుదల చేసే ముగ్గురు బందీల పేర్లు చెప్పలేదంటూ కాల్పుల విరమణ ప్రారంభమైనప్పటికీ రెండు గంటల వ్యవధిలో ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడులు జరిపి 19 మంది ప్రాణాలు తీసి 36 మందిని గాయపరిచిందంటే ఏ చిన్న సాకుదొరికినా మాట తప్పేందుకు పూనుకుంటుందన్న అనుమానం తలెత్తింది. ఆదివారం నాడు బందీలలోని ముగ్గురు మహిళలను హమస్‌ రెడ్‌క్రాస్‌ ప్రతినిధులకు అప్పగించింది. దానికి ప్రతిగా ఇజ్రాయెల్‌ 90మంది పాలస్తీనియన్లను వదలి పెట్టింది. తదుపరి 25వ తేదీ(శుక్రవారం నాడు) మరో నలుగురు మహిళలను అప్పగించనుంది. ఒక్కో బందీకి 30 లేదా 50 మంది పాలస్తీనియన్లను విడుదల చేయవచ్చని వార్తలు వచ్చాయి. మొత్తం 33 మంది బందీలు, వెయ్యికిపైగా నిర్బంధితుల విడుదల ఆరువారాల ప్రక్రియ సాఫీగా ముగిసిన తరువాత రెండవ దశ అమల్లోకి వస్తుంది. ఎవరెన్ని భాష్యాలు చెప్పినప్పటికీ కొన్ని వాస్తవాలను ఎవరూ మూసిపెట్టలేరు. ఇజ్రాయెల్‌ డేగకన్ను కప్పి హమస్‌ సాయుధులు గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్‌ భూభాగంలో ప్రవేశించి 2023 అక్టోబరు ఏడు రాత్రి జరిపిన దాడుల్లో 1,139 మరణించారు, 200 మందిని బందీలుగా పట్టుకున్నారు. దానికి ప్రతీకారం పేరుతో ఇజ్రాయెల్‌ మిలిటరీ మరుక్షణం నుంచి 2025 జనవరి 19వ తేదీ వరకు మారణకాండ జరుపుతూనే ఉంది. హమస్‌ దాడులను ఎవరూ సమర్ధించలేదు, కానీ ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని మానవహక్కులు, మానవత్వం గురించి నిత్యం పారాయణం చేసే పశ్చిమ దేశాలు నిస్సిగ్గుగా సమర్ధించాయి, అమెరికా అయితే గాజాను ధ్వంసం చేసేందుకు సామూహికంగా జనాన్ని చంపేందుకు రెండువేల పౌండ్ల బరువుండే భారీ బాంబులను కూడా సరఫరా చేస్తామని చెప్పింది.

ప్రపంచంలో అత్యంత ఆధునిక నిఘా, ప్రత్యర్థులను మట్టుబెట్టే పరిజ్ఞానం ఇజ్రాయెల్‌ సొంతం అని ఎంతో మంది చెబుతారు. అయితే గాజా, హమస్‌ విషయంలో అది వాస్తవం కాదని పదిహేను నెలల పరిణామాలు రుజువు చేశాయి. హమస్‌ వద్ద ఆధునిక ఆయుధాలు లేవన్నది బహిరంగ రహస్యం. వారికి ఉన్నది జనబలం, ఆదరణ మాత్రమే.ఎక్కడ ఉంటారో,ఎవరు సాయుధుడో, ఎవరు సాధారణ పౌరుడో గుర్తించలేనంతగా మమేకం అయ్యారు. ప్రతి ఒక్కరూ పౌరుడే, అవసరమైపుడు సాయధుడే. వ్యూహం ఎప్పటికప్పుడు మార్చుకోగలిగిన నేర్పరితనాన్ని బతుకుపోరు నేర్పింది. అందుకే ఇజ్రాయెల్‌ మిలిటరీ సామూహిక మారణకాండ, విధ్వంసకాండకు పాల్పడిరది. ఆసుపత్రులు, స్కూళ్ల భవనాలను నేలమట్టం గావించింది. సొరంగాల్లో ఉన్నారంటూ వాటిని ఉప్పునీటితో నింపింది. అమెరికా,బ్రిటన్‌, జర్మనీ వంటి దేశాలిచ్చిన ఆధునిక ఆయుధాలు హమస్‌ ముందు పనికి రాకుండా పోయాయి. అణుబాంబు వేస్తే పీడాపోతుందని ఇజ్రాయెల్‌ మంత్రి ఎలియాహు అనేవాడు పదే పదే డిమాండ్‌ చేశాడంటే ప్రతిఘటన వారిని ఎంతగా కలవరపెట్టిందో అర్ధం చేసుకోవచ్చు. అదిగో హమస్‌ను మట్టుపెడతాం ఇదిగో అంటూ కబుర్లు చెప్పారు. బేషరతుగా లొంగిపోతేనే దాడులను విరమిస్తామన్నారు, ఏదీ జరగలేదు. బలవంతుడైన సర్పము చలి చీమల చేత చిక్కి చచ్చిన పరిస్థితి వచ్చింది. వివరాలు రాకుండా మూసిపెట్టారు గానీ ఇజ్రాయెల్‌ ఉనికిలోకి వచ్చిన 1948 తరువాత అరబ్బులతో జరిపిన యుద్ధాలలో దేనిలోనూ చవి చూడని నష్టాలను పదిహేను నెలల గాజా ఊచకోతలో సంభవించినట్లు చెబుతున్నారు. ఒక వైపు హమస్‌, దానికి మద్దతుగా లెబనాన్‌లో హిజబుల్లా, ఎమెన్‌లో అన్సర్‌ అల్లా సాయుధులు జరిపిన దాడులు ఇజ్రాయెల్‌ మిలిటరీని ఉక్కిరిబిక్కిరి చేశాయి, ఆర్థికంగా ఎంతో నష్టపరిచాయి. అందుకే చివరకు కతార్‌ మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించకతప్పలేదు. అనేక ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ హమస్‌ రానున్న రోజుల్లో మరింతగా బలపడుతుందని విశ్లేషిస్తున్నారు.నిజానికి ఇప్పుడు కుదిరిన ఒప్పందంలోని అంశాలను గతేడాది మే నెలలోనే ప్రతిపాదించినపుడు హమస్‌ అంగీకరించినా ఇజ్రాయెల్‌ ముందుకు రాలేదు. అమెరికా కూడా వత్తిడి చేసినట్లు నాటకమాడిరది తప్ప చేసిందేమీ లేదు. మొత్తంగా చూసినపుడు ఇజ్రాయెల్‌ లొంగుబాటునే ప్రపంచం ఎక్కువగా చూస్తున్నది. తమ మిలిటరీ నాయకత్వం గురించి ఎన్నో భ్రమలు పెట్టుకున్న సాధారణ ఇజ్రయెలీ పౌరుల్లో తాజా పరిణామాలను చూసిన తరువాత కలచెదిరిందని వేరే చెప్పనవసరం లేదు.


ఒప్పందం గురించి జో బైడెన్‌ మాట్లాడుతూ తాను గతేడాది ప్రతిపాదించిన అంశాలను ఆ నాడు భద్రతా మండలి కూడా ఆమోదించిందని, తాజా ఒప్పందం కూడా అదే మాదిరి ఉందని పేర్కొన్నాడు.కానీ ఇదే పెద్ద మనిషి ఐదు సార్లు అదే భద్రతా మండలిలో కాల్పుల విరణమణ ప్రతిపాదనలపై ఒకటి కాదు ఐదుసార్లు వీటో ప్రయోగించిన అంశం దాస్తే దాగేది కాదు. తన కారణంగానే ఒప్పందం జరిగిందని చెప్పుకుంటున్నాడు. అయితే డోనాల్డ్‌ ట్రంప్‌ ఆ ఖ్యాతి పూర్తిగా తనదే అన్నాడు. తాను విజయం సాధించిన తరువాతే ఈ పరిణామాలు జరిగినందున తన ప్రభావమే పని చేసిందని చెప్పుకుంటున్నాడు. ఏడాది పాటు బైడెన్‌ చేయలేని దానిని ఒక్క భేటీతో తమ ప్రతినిధి సాధించినట్లు అతగాడి శిబిరం వర్ణించింది. దీన్లో ఎవరి వాటా ఎంత అన్నది పక్కన పెడితే గుణపాఠాలు ఏం తీసుకుంటారన్నది ప్రశ్న.

గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదరటాన్ని ఇజ్రాయెల్‌ కమ్యూనిస్టుపార్టీ స్వాగతించింది. ప్రారంభం నుంచి ఖైదీలు, అపహరణకు గురైన వారు, నిర్బంధితులు, బందీలు ప్రతి ఒక్కరినీ వదలి పెట్టే విధంగా ఒప్పందం కుదరాలని తాము కోరుకున్నట్లు తెలిపింది. అలాంటి ఒప్పందంతో వేలాది మంది పాలస్తీనియన్ల, వందలాది మంది ఇజ్రాయెలీల ప్రాణాలు నిలుస్తాయని పేర్కొన్నది.ఈ ఒప్పందంతోనే తాము సంతృప్తి చెందటం లేదని, ఆక్రమణ, దిగ్బంధనాలకు స్వస్తి పలుకుతూ పాలస్తీనియన్ల స్వయం పాలిత హక్కు, ఇజ్రాయెల్‌తో పాటు స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు దిశగా సంప్రదింపులు కొనసాగాలని కోరింది. తక్షణ లక్ష్యంగా గాజా ప్రాంత పునర్‌నిర్మాణం ఉండాలని, యావత్‌ ప్రపంచం ఆ బాధ్యత తీసుకోవాలని కమ్యూనిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది.ఒప్పందంలో మిగిలిన వ్యవధిలో లేదా ఖైదీల మార్పిడి ముగిసిన తరువాత మారణకాండను ప్రారంభించకుండా ఇజ్రాయెల్‌లోని మితవాద ప్రభుత్వాన్ని నిరోధించాలని కోరింది. కాల్పుల విరమణ ఒప్పందంతో ఇజ్రాయెల్‌లోని పాలస్తీనియన్ల మీద దాడులను తీవ్రం గావించేందుకు, పశ్చిమగట్టు ప్రాంతాన్ని ఆక్రమించే అవకాశం ఉందని కమ్యూనిస్టులు హెచ్చరించారు. శాంతి తప్ప మిలిటరీతో సమస్య పరిష్కారం కాదని భయంకరమైన, దీర్ఘకాలం సాగిన పోరు మరోసారి రుజువు చేసిందని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది.

హమస్‌తో ఒప్పందానికి అంగీకరించినందుకు పలుకుబడి కలిగిన మద్దతుదార్లను నెతన్యాహు కోల్పోయినప్పటికీ తక్షణమే పదవికి ఎలాంటి ముప్పు ఉండదని చెబుతున్నారు. ఏడాది పాటు ఒప్పందాన్ని తిరస్కరించి ఇప్పుడు సాధించిందేమిటని ప్రత్యర్ధులు నిలదీస్తున్నారు.హమస్‌కు నెతన్యాహు ప్రభుత్వం పూర్తిగా దాసోహమన్నదని ఇజ్రాయెల్‌ జాతీయ భద్రతా మంత్రి ఇత్మార్‌ బెన్‌ జివిర్‌ ధ్వజమెత్తాడు. అది లొంగుబాటు ఒప్పందమన్నాడు. ఏడాది పాటు ఈ ప్రతిపాదనలను తాను అడ్డుకున్నట్లు చెప్పాడు, దాన్ని అమలు చేస్తే తమ పార్టీ ప్రభుత్వం నుంచి వైదొలుగుతుందన్నాడు. మొదటి దశ అమలు తరువాత గాజాపై యుద్ధాన్ని కొనసాగించకపోతే తాము కూడా ప్రభుత్వం నుంచి బయటకు వస్తామని మరో పార్టీకి చెందిన ఆర్థిక మంత్రి స్మోట్‌ రిచ్‌ చెప్పాడు. వీరు వైదొలిగినప్పటికీ నెతన్యాహు ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తారు గనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. డోనాల్డ్‌ ట్రంప్‌ పాలస్తీనియన్ల వ్యతిరేకి, ఇజ్రాయెల్‌ అనుకూల వాదులను తన యంత్రాంగంలోకి తీసుకున్నాడు. అయినప్పటికీ తన పదవీ స్వీకారానికి ఒక రోజు ముందే కాల్పుల విరమణ అమల్లోకి రావాలని ఆదేశించినట్లు వార్తలు. ఇజ్రాయెల్‌ పాలకులు అమెరికా కనుసన్నలలో పనిచేస్తారని వేరే చెప్పనవసరం లేదు.హమస్‌ను లొంగదీసుకోవటం సాధ్యం కాదని నెతన్యాహుకంటే అమెరికన్లకే బాగా తెలుసు గనుక ట్రంప్‌కు ఇష్టం లేకున్నా అలాంటి నిర్ణయం తీసుకున్నాడు.దీన్ని చూపి ప్రపంచానికి పెద్ద శాంతిదూతగా కనిపించవచ్చు.గాజాలో ఏమైనప్పటికీ పశ్చిమ గట్టు ప్రాంతంలో ఆక్రమించుకున్న పాలస్తీనా ప్రాంతాలను స్వాధీనం చేసుకొనేందుకు ట్రంప్‌ మద్దతు పొందాలన్నది ఇజ్రాయెల్‌ ఎత్తుగడ. జెరూసలెంలో తమ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు గతంలో ట్రంప్‌ నిర్ణయించినపుడే అది తేటతెల్లమైంది. ఆమేరకు గతేడాది ఏర్పాటైంది. ఇప్పుడు ట్రంప్‌ ఏం చేస్తాడో తెలిసినప్పటికీ ఎలా చేస్తాడో చూడాల్సి ఉంది.

రైతు నేత దల్లేవాల్‌కు వైద్యం : ఫిబ్రవరి 14నచర్చలు ! మద్దతు ధరల చట్టబద్దతపై మోడీ దిగివచ్చేనా !!

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు


నవంబరు 26వ తేదీ నుంచి రైతుల సమస్యలపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చారాజకీయ రహిత సంస్థ కన్వీనర్‌ జగత్‌సింగ్‌ దల్లేవాల్‌ జనవరి 18వ తేదీ అర్ధరాత్రి వైద్య చికిత్సకు అంగీకరించారు, ఆ మేరకు ప్రభుత్వ వైద్యులు తగిన చర్యలను ప్రారంభించారు. ఫిబ్రవరి 14వ తేదీన చండీఘర్‌లో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. సంయుక్త కిసాన్‌ మోర్చా(రాజకీయ రహిత), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా ప్రతినిధులతో కేంద్ర అధికారులు చర్చలు జరిపారు. ఏడు పదుల వయస్సున్న దల్లేవాల్‌ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్న పూర్వరంగంలో ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు పోవాలని చర్చలు జరపటం, బిజెపికి కీలకమైన ఢల్లీి ఎన్నికలు, దల్లేవాల్‌కు మద్దతుగా మరో 121 మంది నిరవధిక దీక్షలకు పూనుకోవటం, కేంద్ర ప్రభుత్వంపై రోజు రోజుకూ వత్తిడి పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ మేరకు దిగివచ్చింది. ప్రధాని నరేంద్రమోడీ రైతుల గురించి మాట్లాడరు, రైతు ప్రతినిధులతో మాట్లాడేందుకు సమయం లేదంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు.కోట్లాది మంది రైతుల గురించి చర్చించేందుకు సమయం లేదనటాన్ని బట్టి ఎవరి ప్రాధాన్యతలు ఏమిటో స్పష్టం అయింది. బడ్జెట్‌పై చర్చలంటూ రైతు ప్రతినిధులను మినహా మిగిలిన వారందరినీ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించి చర్చలను జరిపింది. వీటన్నింటినీ చూసినపుడు వచ్చే నెలలో జరిగే చర్చల్లో ఒరిగేదేమిటి అన్నది పెద్ద ప్రశ్న.ఈనెల 31న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇతర సమస్యలతో పాటు రైతుల గురించి ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత, గతంలో రైతు ఉద్యమం సందర్భంగా మరణించిన వారికి పరిహారం, లఖింపూర్‌ ఖేరీ హింసా కాండ బాధితులకు న్యాయం,2013 భూసేకరణ పరిహార చట్ట పునరుద్దరణ,రైతులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్‌, రైతుల రుణమాఫీ వంటి అంశాలపై రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే.

బడ్జెట్‌ ప్రవేశపెట్టబోయే ముందు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వివిధ తరగతుల ప్రతినిధులతో చర్చలు జరపటం ఒక తంతుగా జరుగుతున్నది. అన్ని రోడ్లూ రోమ్‌కే అన్నట్లుగా ఏ పార్టీ చరిత్ర చూసినా గర్వకారణం ఏమీ లేదు. సంపదలలో పెద్ద పీట కార్పొరేట్‌ శక్తులకే వేస్తున్న కారణంగానే అసమానతలు ఏటేటా పెరుగుతున్నాయి. తంతుగా అయినా బడెట్‌ చర్చకు రైతు సంఘాలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించలేదు. కొంత మంది కొన్ని పోలికలు తెస్తున్నారు. వాటిలో ఉద్యోగులకు వేతన కమిషన్‌ ఏర్పాటుకు నిర్ణయించిందిగానీ రైతులకు ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించటం లేదన్నది వాటిలో ఒకటి. దీనిలో రెండవది వాస్తవం, ఉద్యోగులకు పది సంవత్సరాల తరువాత వేతన కమిషన్‌ ఏర్పాటును దీనికి ముడి పెట్టనవసరం లేదు. పదేండ్లకు ఒకసారి వేతన సవరణ ద్వారా వారికి అన్యాయమే జరుగుతున్నది తప్ప న్యాయం కాదు. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత, ఇతర అంశాల గురించి పరిశీలించేందుకు 2022 జూలైలో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇంతవరకు అది ఏమి చేసిందో ఎవరికీ తెలియదు, వారు నివేదిక సమర్పించరు, ప్రభుత్వమూ అడగదు, అంతా ఒక నాటకంగా మారింది. ఈ లోగా 2021లో క్షమాపణలు చెప్పి మరీ వెనక్కు తీసుకున్న మూడు సాగు చట్టాలను మరో రూపంలో ముందుకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. దేశంలో భూ కమతాలు పద్నాలుగు కోట్లకు పైగా ఉన్నాయి. వాటిలో 88శాతం రెండున్నర ఎకరాల లోపు కలిగిన రైతులే ఉన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదంటూ వారందరినీ కార్పొరేట్లకు అప్పగించేందుకు తన బాధ్యతను వదిలించుకొనేందుకు కేంద్రం చూస్తున్నది.ఒకసారి అది జరిగితే రాష్ట్రాలు కూడా అదేబాట పడతాయి.పరిశ్రమలు, వాణిజ్యాలకు అనేక రక్షణలు, రాయితీలు ఉన్నాయి. వాటి మాదిరిగానే తమకూ కల్పించాలని రైతులు కోరటం గొంతెమ్మ కోర్కె కాదు. కనీస మద్దతు ధరను ఒక్క హక్కుగా చట్టబద్దం చేయాలని కోరుతున్నారు.

పారిశ్రామిక ఉత్పత్తులకు, ఎగుమతులకు, దిగుమతులకూ రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం రైతులను ఎందుకు విస్మరిస్తున్నది, పోనీ వ్యవసాయం ఉపాధి కల్పించటం లేదా పరిశ్రమలు, సేవారంగాల కంటే ఎక్కువ 44శాతం మందికి కల్పిస్తున్నది. సంఘటితంగా పోరాడే స్థితిలో వారు లేకపోవటం తప్ప మరొకటి కనిపించటం లేదు. మనకు అవసరమైన వంట నూనెల్లో 60శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, దానికి ఎన్నో రాయితీలు ఇస్తున్నది ప్రభుత్వం కానీ ఇక్కడ నూనె గింజలు పండిరచేవారికి ధరల గురించి ఒక హామీ ఇవ్వటానికి ముందుకు రావటం లేదు.మార్కెట్‌ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదలివేస్తున్నది. గతేడాది సోయా, ఆవ రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువే పొందారు. మరోవైపున బియ్యం, గోధుమలు, ఉల్లి, పంచదార వంటి వాటి ఎగుమతుల మీద నిషేధం పెట్టి మార్కెట్లో రైతులకు అన్యాయం చేశారు. వినియోగదారులకు మేలు చేయటం అంటే రైతుల నోట్లో మట్టికొట్టటం కాదు కదా ! ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కంటే తక్కువకు రైతుల నుంచి చెరకును మిల్లులు కొనుగోలు చేయకూడదు(అది గిట్టుబాటు కావటం లేదు). అదే మాదిరి ఇతర పంటలకు ప్రభుత్వం ఎందుకు హామీ ఇవ్వటానికి నిరాకరిస్తున్నది ? కనీస వేతన చట్టాన్ని అమలు జరపకపోతే కార్మికులు కోర్టులకు ఎక్కే హక్కు ఉంది, కానీ రైతులకు కనీస మద్దతు ధరలకు అలాంటి అవకాశం లేదు. దాదాపు పదిహేను కోట్ల మంది రైతులు ఉండగా వారిలో తొమ్మిది కోట్ల మందికి ఏటా ఆరువేల రూపాయలు ఇచ్చి అదే మహాభాగ్యం అని చెబుతున్నది. తప్పుల తడకలతో కూడిన గణాంకాలు( వివిధ సూచికలను ప్రకటించినపుడు ప్రభుత్వమే అలా చెబుతున్నది. ఉదా : దేశ ఆకలి సూచిక) వెల్లడిరచినదాని ప్రకారం 2004-05లో వ్యవసాయ వాణిజ్య సూచిక 87.72గా ఉన్నది 2010-11 నాటికి 102.95కు పెరిగింది.దాని ప్రకారం పెట్టుబడుల కంటే పంటల అమ్మకం ద్వారా ఎక్కువ పొందారని భాష్యం చెప్పారు. అదే 202223లో ఆ సూచిక 97.21కి పడిపోయింది. అంటే రైతులు పొందుతున్నది తగ్గిపోయింది. అందుకే రైతుల కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కోరుతున్నారు.


రద్దు చేసిన మూడు సాగు చట్టాలను మూడు సంవత్సరాల తరువాత కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన మరో రూపంలో ముందుకు తీసుకురావటం ఆందోళన కలిగించే అంశం. నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ పాలసీ(నాంప్‌)ని 2024 నవంబరు 25న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ఆధ్వర్యాన డిసెంబరు 23న దేశమంతటా నిరసన తెలిపారు. అనేక మంది నిపుణులు విమర్శించారు. దాని మీద అభిప్రాయాలు తెలిపేందుకు కేవలం పదిహేను రోజులు మాత్రమే కేంద్రం గడువు ఇచ్చింది. ఇప్పుడున్న మార్కెటింగ్‌ వ్యవస్థలో ఎలాంటి లోపాలు లేవని కాదు, దాన్ని సంస్కరించకూడదని ఎవరూ చెప్పటం లేదు. అయితే ఆ పేరుతో ఇప్పుడున్నదాని కంటే ప్రమాదకరమైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయద్రవ్య పెట్టుబడి సంస్థలు సూచించిన పద్దతిలో సమూల మార్పులు ప్రతిపాదించటం ఆందోళనకరం. దాని ప్రకారం దేశమంతటిని అనుసంధానించే ఒకే మార్కెట్‌ను ఏర్పాటు చేస్తారు. ఇదంతా చిన్న రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాల కంటే కార్పొరేట్లకే ప్రాధాన్యత ఇచ్చే వ్యవహారం.రైతులు ముడి సరకును సరఫరా చేసేవారిగా మాత్రమే ఉంటారు.వాటి నుంచి ఉత్పత్తులు తయారు చేయటం,వాణిజ్యం, ఎగుమతి అంతా కార్పొరేట్లదే. ఈ క్రమంలో తేలే మిగులులో రైతుల వాటా గురించి ఎక్కడా స్పష్టత లేదు. అంతే కాదు కనీస మద్దతు ధరలకు ఎలాంటి హామీ ప్రస్తావన కూడా లేదు.అలాంటి ఉద్దేశ్యం ఉంటే ఈ పాటికి కేంద్ర ప్రభుత్వం దాని గురించి ఒక స్పష్టత ఇచ్చి ఉండేది. రైతాంగానికి గరిష్ట ప్రయోజనం, డిజిటల్‌, పారదర్శకత, జాతీయ మార్కెట్‌ సమాచారం వంటి పదజాలం ఎంతగా వల్లించినా వాటిని వినియోగించుకొనే అవకాశం ఎంత మంది రైతులకు ఉంటుందన్నది ప్రశ్న. ఇప్పుడు అనేక నియంత్రణలు ఉన్నా వాటిని ఖాతరు చేయకపోవటం, దొడ్డిదారిన ఉల్లంఘిస్తున్న కంపెనీలపై అసలు ఎలాంటి నియంత్రణలు ఉండకూడదని ఈ ప్రతిపాదనల్లో ఉన్నది. వ్యవసాయ ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ఈ విధానంతో రాష్టాల హక్కులు, నియంత్రణలకు నీళ్లదులుకోవాల్సిందే. అమల్లోకి వచ్చిన తరువాత గానీ ఇతర మంచి చెడ్డలు వెల్లడి కావు.

ఫిబ్రవరి 14వ తేదీన కేంద్ర, పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య జరిగే చర్చల అజెండా ఏమిటో తెలియదు. ఎవరెవరు పాల్గ్గొనేదీ ఇంకా స్పష్టం కాలేదు. ఒకటి మాత్రం స్పష్టం, ఇది ఒక రోజులో తేలే వ్యవహారం కాదు.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని 2012లోనే సిఎంగా ఉండగా నరేంద్రమోడీ కమిటీ నాటి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీని గురించి తాజా పార్లమెంటరీ కమిటీ కూడా సిఫార్సు చేసినా మోడీ మొరాయిస్తున్నారు. పార్లమెంటరీ కమిటీ సిఫార్సును అమలు చేయాలంటూ కేంద్రానికి సూచించాలని రైతు సంఘాల నేతలు సుప్రీం కోర్టును కోరారు. వ్యవసాయ గ్రాంట్లపై ఏర్పాటైన కమిటీ 202425 నివేదికను గతేడాది డిసెంబరు 20న పార్లమెంటుకు సమర్పించింది.దీన్ని కేంద్రం ఆమోదిస్తే అమలుకు ఉపక్రమించాలి తిరస్కరిస్తే కారణాన్ని చెప్పాల్సి ఉంటుంది. పార్లమెంటరీ కమిటీ చేసిస సిఫార్సు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఏడాదికి ఇస్తున్న కిసాన్‌ సమ్మాన్‌ యోజన మొత్తం రు. ఆరువేలను పన్నెండు వేలకు పెంచాలి.(దాన్ని చూసి కొంత మంది అమలు జరగనున్నట్లు ప్రచారం చేశారు) ఈ ప్రోత్సహకాన్ని కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు కూడా ఇవ్వాలి. కనీస మద్దతు ధరల చట్టబద్దతకు ఒక రోడ్‌ మాప్‌ను సాధ్యమైనంత త్వరలో ప్రకటించాలి. వ్యవసాయ కార్మికులకు కనీస జీవన వేతనాల నిమిత్తం జాతీయ కమిషన్‌ ఏర్పాటు. రైతులు, వ్యవసాయ కార్మికులకు రుణాల రద్దు పధకాన్ని ప్రవేశ పెట్టాలి.వ్యవసాయ శాఖ పేరులో వ్యవసాయ కార్మికుల పేరును కూడా చేర్చాలి.

కనీస మద్దతు ధరలకు అనుకూల వాదనల సారం ఇలా ఉంది. రైతులకు ధరల మీద ఒక చట్టబద్దత ఉంటుంది. మార్కెట్‌ వడిదుడుకుల నుంచి రక్షణ ఉంటుంది. మధ్యవర్తుల దోపిడీ నిరోధంగా ఉంటుంది.ఉత్పత్తి ఖర్చులను భరించేందుకు, ఆర్థిక పరమైన భద్రతను మెరుగుపరచుకొనేందుకు స్థిరమైన రాబడికి వీలు కలిగిస్తుంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఉత్పాదకత, సామర్ధ్యాలను పెంచుతుంది. ఆహార భద్రత, కొరతలను తీరుస్తుంది, దారిద్య్ర తగ్గింపుకు తోడ్పడుతుంది.రైతాంగ జీవనాన్ని మెరుగుపరుస్తుంది. మార్కెట్‌ వడిదుడుకులను తగ్గిస్తుంది. వ్యతిరేకించే వారేమంటారంటే.. మార్కెట్లో అసమతూకానికి దారితీస్తుంది, కొన్ని పంటలను అవసరాలకు మించి ప్రోత్సహిస్తుంది. సరఫరాఅవసరాల తీరు తెన్నులను విచ్చిన్నం చేస్తుంది.ప్రభుత్వాల మీద భారం మోపుతుంది, మిగులును కొని నిల్వచేయాల్సిన అవసరాన్ని పెంచుతుంది.వనరుల కేటాయింపులో అసమర్ధతకు దారి తీస్తుంది. పంటల వైవిధ్యానికి బదులు కొన్ని పంటలనే ప్రోత్సహిస్తుంది.అవినీతిని ప్రోత్సహిస్తుంది. మధ్యవర్తులు అవకాశంగా తీసుకొని రైతులకు లబ్దిని తగ్గిస్తారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలను అడ్డుకుంటుంది,ప్రతిదానికీ ప్రభుత్వం మీద ఆధారపడాల్సి ఉంటుంది. మార్కెట్‌ వ్యవస్థలో పోటీని తగ్గిస్తుంది. రైతులు కొత్త పద్దతులవైపు చూడకుండా కనీస మద్దతు ధరల మీద ఆధారపడతారు,మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా మారరు.

పాకేజ్‌ ఉపశమనమే : విశాఖ ఉక్కుపై వేలాడుతున్న ప్రయివేటు కత్తి !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విశాఖ ఉక్కును ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం రు.11,440 కోట్ల పాకేజ్‌ను ప్రకటించింది.ఆ మొత్తంలో రు.10,300 కోట్లు ఈక్విటీ వాటా సొమ్ముగా, మిగిలిన మొత్తం నిర్వహణ రుణం. అది గ్రాంటు కాదు.అయినా కనుక కొంత మేలు కలుగుతుంది. తీవ్రంగా ఉన్న రోగికి నొప్పి తగ్గించే మాత్ర ఇస్తే తాత్కాలిక ఉపశమనం తప్ప జబ్బు పోయినట్లు కాదు.ఈ మాత్రానికే తెలుగుదేశం శ్రేణులు సంబంరాలు చేసుకుంటున్నాయి. ఇది రెండిరజన్ల పాలన కారణంగానే జరిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజెపి పలుకులు వల్లిస్తున్నారు. ప్రయివేటీకరణ ముప్పు తొలగిపోయినట్లు నమ్మించేందుకు చూస్తున్నారు. ఆంధ్రుల ఆకాంక్షలను కేంద్రం గమనించిందని చిత్రిస్తున్నారు. ఈ పదజాలం నరేంద్రమోడీని పొగిడేందుకు తప్ప మరొకటి కాదన్నది స్పష్టం.నిజానికి బిజెపికి మతపరమైన మనోభావాలు తప్ప ఇతర అంశాలు పట్టవు. భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గౌరవార్దం ఆయన పేరు పెట్టిన భద్రావతి ఉక్కునే అమ్మేందుకు చూసిన వారికి విశాఖ ఉక్కు ఒక లెఖ్కా. దాన్ని రక్షించుకొనేందుకు 1,390 రోజులుగా కార్మికులు,వామపక్ష పార్టీలకు చెందిన వారు ఏదో ఒక రూపంలో నిరసన తెలియచేస్తూనే ఉన్నారు. ఈ ప్లాంట్‌ ఉనికిలోకి వచ్చిన నాలుగుదశాబ్దాల కాలంలో కేంద్రంలో, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఇష్టంలేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగానే ఉంది తప్ప ఆ సంస్థను నిలబెట్టేందుకు అవసరమైన మౌలిక చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు.
చంద్రబాబు నాయుడు చెప్పినట్లు రెండిరజన్ల పాలన కారణంగానే పదకొండువేల కోట్ల పాకేజ్‌ వస్తే కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండగా అక్కడి భద్రావతిలోని విశ్వేశ్వరయ్య ఉక్కు కర్మాగారానికి నెల రోజుల క్రితమే ఉక్కు శాఖా మంత్రి కుమారస్వామి పదిహేనువేల కోట్ల పాకేజ్‌ను ప్రకటించటాన్ని ఎలా చూడాలి. ఆ సంస్థ పునరుద్దరణకు పదివేల కోట్లు అవసరమని గతంలో చెప్పిన మంత్రి పదిహేనువేల కోట్ల పాకేజ్‌ ప్రకటించారు, 26వేల కోట్ల అప్పులున్న విశాఖ స్టీలుకు పదకొండున్నరవేల కోట్లా ? గొప్పలు చెప్పుకొనేందుకు కాస్త వెనుకా ముందు చూసుకోవాల్సిన అవసరం లేదా ? జనం మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ? విశాఖ ఉక్కు లాభాలతో నడిచేందుకు అవసరమైన స్వంత గనుల గురించి, సెయిల్‌ సంస్థలో విలీనం గురించి రెండిరజన్ల పెద్దలు ఎందుకు మాట్లాడటం లేదు.


భద్రావతి ఉక్కు ఫ్యాక్టరీ వ్యవహారాలను గమనించినపుడు ఒక వేళ విశాఖ ఉక్కును సెయిల్‌ సంస్థలో విలీనం చేసినా ప్రైవేటీకరణ ముప్పు ఉండదనే హామీ లేదు.భద్రావతి ఉక్కు సెయిల్లోనే ఉంది. అయినప్పటికీ దాన్ని మూసివేయాలని, విక్రయించాలని అదే సంస్థగతంలో నిర్ణయించటమే గాదు టెండర్లను కూడా పిలిచింది. లోక్‌సభ ఎన్నికలు జరిగి మూడోసారి నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2024జూన్‌ 30వ తేదీన మంత్రి కుమారస్వామి ఆ సంస్థను సందర్శించి తిరిగి పనిచేయిస్తామని వాగ్దానం చేశారు.అది జరిగిన నెల రోజులకు జూలై 30వ తేదీన అదే మంత్రిత్వశాఖ లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో దాన్ని ఇప్పటికే మూసివేయాలని నిర్ణయించామని అందువలన తిరిగి పనిచేయించే ఉద్దేశ్యం లేదని స్పష్టంగా పేర్కొన్నది. ప్రశ్న అడిగింది ఎవరో కాదు, షిమోగా బిజెపి ఎంపీ బివై రాఘవేంద్ర(మాజీ సిఎం ఎడియూరప్ప కుమారుడు). దానికి ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సమాధానం ఇచ్చారు. 2016 అక్టోబరులోనే సూత్రప్రాయంగా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ విధానం కింద ఫ్యాక్టరీని అమ్మివేసేందుకు అనుమతి ఇచ్చినట్లు, అయితే దరఖాస్తు చేసిన వాటిలో ఎంపిక చేసిన సంస్థలు తదుపరి ముందుకు పోయేందుకు ఆసక్తి చూపకపోవటంతో అమ్మివేయాలనే నిర్ణయాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. తరువాత దాన్ని మూసివేసేందుకు చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు.ఈ విషయాన్ని 2022 అక్టోబరు 14వ తేదీన పెట్టుబడుల మరియు ప్రభుత్వ ఆస్తుల యాజమాన్యశాఖకు తెలియచేసినట్లు కూడా మంత్రి తెలిపారు.ప్రస్తుతం 245 మంది పర్మనెంటు ఉద్యోగులు ఉన్నట్లు అనుబంధ సంస్థలు పంపిన కొన్ని పూర్తిగాని ఉత్పత్తులకు మెరుగులు దిద్దుతున్నట్లు, 202324లో అమ్మకానికి వీలైన పదమూడువేల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. నాలుగోసారి ఎంపీగా ఎన్నికైనప్పటికీ ఉక్కు ఫ్యాక్టరీని పునరుద్దరింప చేయటంలో విఫలమైనట్లు కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున రాఘవేంద్రపై విమర్శల దాడికి దిగటంతో ప్రశ్న అడగాల్సి వచ్చింది.

వంద సంవత్సరాల క్రితం మైసూరు రాజు నలవాది కృష్జరాజ వడయార్‌ రాజ్యంలో దివానుగా ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీ మైసూర్‌ ఐరన్‌ వర్క్స్‌ పేరుతో 1923లో భద్ర నది తీరంలో ప్రారంభమైంది.ఇతర లోహాలతో మిళితం చేసి ప్రత్యేకమైన ఉక్కును తయారు చేసిన దేశంలోని తొలి ఫ్యాక్టరీ ఇది. తరువాత మైసూర్‌ ఐరన్‌ మరియు స్టీల్‌ వర్క్స్‌గా మారింది. 1962లో 40:60శాతం వాటాలతో కేంద్రకర్నాటక ప్రభుత్వ కంపెనీగా ఉనికిలోకి వచ్చింది.1975లో విశ్వేశ్వరయ్య ఐరన్‌ మరియు స్టీల్‌ లిమిటెడ్‌ అని నామకరణం చేశారు. 1989లో సెయిల్‌ అనుబంధ సంస్థగా జతచేసి 1998లో విలీనం చేశారు.2004లో లాభాల బాట పట్టిన సంస్థ తరువాత నష్టాలపాలైంది.తరువాత సెయిల్‌ దాన్ని మూసివేసి విక్రయించాలని నిర్ణయించింది. ఈ ఫ్యాక్టరీ మూసివేత, అమ్మివేత నిర్ణయం రెండిరజన్ల పాలనలోనే జరిగింది.కర్ణాటకలో అప్పుడు బిజెపి అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత కూడా మూసివేతకే కట్టుబడి ఉన్నట్లు అది స్పష్టంగా చెప్పింది.ఉత్పత్తి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, తక్కువ పరిమాణంలో ఉత్పత్తి ఉందని, పాతబడిన సాంకేతిక పరిజ్ఞానం, కాపిటివ్‌ మైన్స్‌ కూడా లేవని, అల్లాయ్‌ ఉక్కు రంగంలో పోటీ ఎక్కువగా ఉందని 2023లో ఉక్కుశాఖ మంత్రిగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా పార్లమెంటులో వాదించారు. నాటకీయ పరిణామాల మధ్య గతేడాది డిసెంబరులో దాని పునరుద్దరణకు పదిహేనువేల కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించారు.అయితే నిర్దిష్ట చర్యలేవీ ఇంతవరకు ప్రారంభం కాలేదు, అది కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందా లేక ఏదో ఒకసాకుతో అయినకాడికి తెగనమ్మి వదిలించుకుంటారా అన్నది చెప్పలేము.


భద్రావతి ఉక్కుతో పోలిస్తే విశాఖ ఉక్కు ఎంతో అధునాతనమైన సంస్థ.ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖలోని అతి పెద్ద కంపెనీ. ఏది పెద్దది ఏది చిన్నది అన్న చర్చ అవసరం లేదు. రెండిరటినీ రక్షించుకోవాల్సిందే. ఇప్పుడు రెండు సంస్థలకూ కేంద్ర ప్రభుత్వం పాకేజీలను ప్రకటించాల్సి వచ్చింది.దీనికి కారణం కేంద్రంలో బలాబలాల్లో వచ్చిన మార్పే అన్నది స్పష్టం. ఎవరి మద్దతు అవసరం లేకుండా స్వంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం నరేంద్రమోడీకి లోక్‌సభ వచ్చినపుడు కళ్లు నెత్తికెక్కాయంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి అధికారానికి వచ్చినపుడు విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలని చంద్రబాబు నాయుడు గట్టిగా అడిగింది లేదు, జగన్మోహనరెడ్డి ఏలుబడి సంగతి తెలిసిందే. రెండు పార్టీలూ మోడీకి మద్దతు ఇవ్వటంలో పోటీ పడ్డాయి. భద్రావతి ఉక్కును పునరుద్దరించాలని బిజెపి నేత యడియూరప్ప నాయకత్వంలో ఆ పార్టీ ప్రతినిధివర్గం నరేంద్రమోడీని కలిసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు.బిజెపికి దూరంగా ఉన్న కారణంగా అప్పుడు దేవెగౌడ పాలనలో తగిన చర్యలు తీసుకొని ఉంటే మూతపడే పరిస్థితి వచ్చేది కాదని ఎడియూరప్ప కుమారుడు, ఎంపీ రాఘవేంద్ర నెపాన్ని ఆయన మీదకు నెట్టేందుకు చూశారు. భద్రావతి ఉక్కును కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాని కారణంగా అది అలాగే ఉండిపోయింది తప్ప లేకుంటే తుక్కు కింద ఎప్పుడో మారి ఉండేది.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 33వేల ఎకరాల్లో ఉంది.అందువలన అమ్మకానికి పెడితే దాన్ని ఎగరేసుకు పోయేందుకు సిద్దంగా ఉన్నారు.ఆ ఫ్యాక్టరీ కోసం ప్రాణాలర్పించిన వారుగానీ, దానికి భూములు ఇచ్చిన వారు గానీ పప్పుబెల్లాల్లా పందారం చేసి కారుచౌకగా ఎవరికో కట్టబెట్టేందుకు కాదు. ఇప్పటి వరకు ప్రైవేటీకరణ విధానంలో మార్పు చేసినట్లు కేంద్రం ఎక్కడా చెప్పటం లేదు. అందువలన తెలుగుదేశం, జనసేన నేతల మాటలు నమ్మనవసరం లేదు. తీరా వేటు పడిన తరువాత మేము చేయాల్సిందంతా చేశామని చేతులు దులుపుకుంటారు. ఇప్పటివరకు ఎంతో పట్టుదలతో ఉన్న కార్మికులు, వారికి మద్దతుగా ఉన్న వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలను మరింతగా జనం ఆదరించి నిలబడితే ప్రైవేటీకరణ ముప్పును తిప్పికొట్టటం అసాధ్యం కాదు.

పంజాబ్‌లో ‘‘ఎమర్జన్సీ’’ సినిమా ప్రదర్శనకు బ్రేక్‌, సిక్కులపై విరుచుకుపడిన కంగన ! నరేంద్రమోడీపై ఉక్రోషం !!

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు


అందరూ ఊహించినట్లుగానే వివాదాస్పద ‘‘ ఎమర్జన్సీ ’’ (అత్యవసర పరిస్థితి) సినిమా ప్రదర్శనకు పంజాబ్‌లో ఆటంకం ఏర్పడిరది. హిమచల్‌ ప్రదేశ్‌లోని మండీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన సినిమా హీరోయిన్‌ కంగన రనౌత్‌ నిర్మించి,దర్శకత్వం వహించటమే గాక ఇందిరా గాంధీ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు (2025 జనవరి 17న) విడుదలైన ఈ సినిమా గురించి ప్రశంసలు విమర్శలు వెలువడ్డాయి. చరిత్ర కంటే మైకం ఎక్కువగా కనిపించిందని, వాస్తవ చరిత్రను ఎలా తీయకూడదో దీన్ని చూసి నేర్చుకోవాలన్న అభిప్రాయం కూడా వచ్చింది. తన చిత్రాన్ని అడ్డుకోవటం కళాకారులు, కళను అడ్డుకోవటమే అంటూ కంగన రనౌత్‌ విమర్శలకు దిగారు. తొలి రోజు సినిమా వసూళ్లు గణనీయంగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. నోటి దురుసు వ్యక్తిగా పేరు మోసిన కంగనా రనౌత్‌ ‘‘ ఎమర్జన్సీ’’ సినిమా 2024లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపికి తలనొప్పిగా మారింది. చరిత్రను వక్రీకరించటమే గాక తమను దేశద్రోహులు, ఉగ్రవాదులుగా చిత్రీకరించారని, సోదరత్వాన్ని దెబ్బతీసి అది తమపై విద్వేషాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉన్నందున ఆ చిత్రంపై నిషేధం విధించాలంటూ దేశవ్యాపితంగా సిక్కులు డిమాండ్‌ చేశారు. ఖలిస్తాన్‌ మద్దతుదార్లు కంగనను చంపివేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో 2024సెప్టెంబరు ఆరున విడుదల తేదీని ప్రకటించిన కంగన కొద్ది రోజుల ముందు సెన్సార్‌ ధృవీకరణ పత్రం రాలేదని ప్రకటించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం, ఆమె ప్రధానిగా ఉన్నపుడు 21నెలల అత్యవసరపరిస్థితి విధింపు తదితర అంశాల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.2024 ఆగస్టు 14వ తేదీన 2.43నిమిషాల నిడివిగల ట్రైలర్‌ను విడుదల చేయగా 50లక్షల మంది చూశారని, కేవలం 461 మంది మాత్రమే ఇష్టపడినట్లు నమోదైనట్లు గతేడాది ఇండియా టుడే పేర్కొన్నది.ప్రతి ఒక్క ఓటునూ లెక్కించుకున్న బిజెపి దేశంలో ఉన్న మూడు కోట్ల మంది సిక్కులు ఉన్నందున వారంతా వ్యతిరేకిస్తారని భయపడిరది. లోక్‌సభ ఎన్నికల తరువాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నందున మొత్తం మీద ఏదో ఒకసాకుతో సినిమా విడుదలను వాయిదా వేయించారు. గతంలో బిజెపి మిత్రపక్షంగా ఉన్న అకాలీదళ్‌ కూడా సినిమా ప్రదర్శనను వ్యతిరేకించింది. వచ్చే నెలలో ఢల్లీి ఎన్నికలు జరుగుతుండగా విడుదలైన ఈ చిత్రం మీద తలెత్తిన వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. ఢల్లీిలో దాదాపు పది లక్షల మంది సిక్కు సామాజిక తరగతి ఓటర్లు ఉన్నారు, అక్కడ ఉన్న 70 నియోజకవర్గాలలో వారు విస్తరించి ఉన్నారు. అదే సామాజిక తరగతికి చెందిన ఆతిషి మోర్లెనా ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వ సిఎంగా ఉన్న సంగతి తెలిసిందే.


ఎమర్జన్సీ సినిమా ప్రదర్శనకు నిరసన తెలుపుతామని శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ(ఎస్‌జిపిసి) ఇచ్చిన పిలుపుతో శుక్రవారం నాడు పలు సినిమా ధియేటర్ల వద్ద సిక్కులు నిరసన తెలిపారు. దాంతో పంజాబ్‌ అంతగా సినిమా ప్రదర్శన నిలిచిపోయింది.సిక్కు మత చరిత్రను, 1984 ఉదంతాలను సినిమాలో వక్రీకరించారని ఆ సంస్థ విమర్శించింది. చరిత్రను వక్రీకరించి మసాలాను దట్టించకపోతే ఇలాంటి సినిమాలను ఎవరూ చూడరు గనుక అలా తీశారని, సెన్సార్‌బోర్డు, ప్రభుత్వాలు ఈ అంశాలను గమనంలోకి తీసుకోవాలని పంజాబ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరిందర్‌ సింగ్‌ రాజా పేర్కొన్నారు, ఉడ్తా పంజాబ్‌ పేరుతో తీసిన సినిమా కూడా అలాంటిదే అన్నారు. చండీఘర్‌ పక్కనే ఉన్న పంజాబ్‌ మొహాలీ నగరంలో సినిమా హాళ్ల వద్ద రైతులు కూడా నిరసన వెల్లడిరచారు. స్వర్ణదేవాలయం ఉన్న అమృతసర్‌ పట్టణంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ఎక్కడైనా అవాంఛనీయ ఉదంతాలు జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎస్‌జిపిసి హెచ్చరించింది. రానున్న రోజుల్లో కూడా హాలు యజమానులు ఇదే వైఖరిని అనుసరిస్తే మంచిది లేకుంటే నిరసనను తీవ్రం చేస్తామని పేర్కొన్నది. సంస్థ న్యాయవాది హర్జిందర్‌ సింగ్‌ రాష్ట్ర ్పభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో చిత్ర ప్రదర్శనను అడ్డుకోవాలని కోరారు. ఎమర్జన్సీ చిత్రంలో ముఖ్యమైన చరిత్రను నమోదు చేశారని, కంగన ప్రతిభావంతంగా నటించారని, బిజెపి నేత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రకటించారు. తన సినిమాను తిలకించి అభినందించినందుకు కంగన కృతజ్ఞత తెలిపారు. రాజకీయాల ప్రాతిపదికన సామాజిక మాధ్యమంలో స్పందించిన కొందరు కంగనకు జాతీయ అవార్డు ఇవ్వాలని కూడా చెప్పారు. నాడు ప్రతిపక్ష నేతలుగా ఉన్నవారిని గొప్పగా చూపారనే విమర్శలు వచ్చాయి.


ప్రధాని నరేంద్రమోడీని స్వయంగా కలవాలనుకున్నాను, జరగలేదు, అంత మాత్రాన ఇతర ప్రముఖులు కలిస్తే నేనెందుకు కలవరపడతాను అంటూ కంగన రనౌత్‌ తన ఉక్రోషాన్ని వెళ్లగక్కారు. శుభంకర్‌ మిశ్రా అనే జర్నలిస్టుతో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కంగన లేదంటూనే కలవరపాటును వెల్లడిరచారు. గతంలో రైతు ఉద్యమాన్ని గట్టిగా సమర్ధించిన సినిమా గాయకుడు, నటుడు, నిర్మాత దల్జిత్‌ దోసంజ్‌, కపూర్‌ కుటుంబ సభ్యులు ఇటీవల కలిసేందుకు నరేంద్రమోడీ అవకాశం ఇచ్చారు. కపూర్‌ కుటుంబం పేరెత్తకుండానే దానికి నా కెందుకు కలవరం, దీన్లో అలాంటిదేముంది అంటూ ఎదురు ప్రశ్నించారు. ప్రధాని అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల నిరసనలో దల్జిత్‌ ముందు వరుసలో ఉన్నాడు, వారిని సమర్ధించాడు అని కంగన ధ్వజమెత్తారు.మరి అలాంటి వ్యక్తిని కలుసుకొనేందుకు, తీరికలేకుండా ఉండే ప్రధాని అతని పాటలు వినేందుకు, సంగీతం గురించి చర్చించేందుకు కొన్ని గంటలు కేటాయించటం మిమ్మల్ని గాయపరచలేదా అన్న ప్రశ్నకు తనకు అవకాశం ఇవ్వకుండా దల్జీత్‌ను కలిసినందుకు తనకు ఎలాంటి కలవరం కలగలేదన్నారు, దీనికి కలవరపడాల్సిందేముంది? ఆయనకు అందరూ సమానమే, సినీ రంగానికి చెందిన అనుపమఖేర్‌, మనోజ్‌ ముంతాషిర్‌ వంటి వారికి గతంలో ప్రధాని కలిసే అవకాశం వచ్చింది.తనకు కొద్ది క్షణాలు మాత్రమే కలిసే అవకాశం వచ్చింది, ఇతరులు కలిసినందుకు నేను ఆశాభంగం చెందలేదు. నిజానికి నేను ఎన్నడూ ప్రధానిని కలవలేదు.ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒకసారి ఆయనకు నమస్కారం పెట్టాను తప్ప మాట్లాడలేదు. నేను ప్రధానికి పెద్ద అభిమానిని అని మీరు తెలుసుకోవాలి. కళల గురించి ఆయన ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకొనేందుకు అభిప్రాయాలు మార్పిడి, దీర్ఘమైన చర్చ జరపాలని కోరుకుంటాను అని కంగన వివరణ ఇచ్చుకున్నారు. తన చిత్రం ఎమర్జన్సీ ప్రచారంలో భాగంగా విడుదలకు ముందు రోజు ఆమె వివిధ మీడియా సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీ దృష్టిని ఆకర్షించటానికి ఆమె పడరాని పాట్లు పడ్డారు. అధికారానికి వచ్చిన 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని 2021లో చెప్పారు.స్వీయ అనుభవంతో తానీ మాటలు చెబుతున్నట్లు, తన అతి మంచితనం కారణంగా వ్యవస్థ తనను దేశం విడిచి అమెరికా వెళ్లేట్లు చేసిందని, మోడీ అధికారానికి వచ్చాక తాను తిరిగి వచ్చానని అందుకే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు భావిస్తున్నట్లు చెప్పుకున్నారు. అదే విధంగా కత్రినా కైఫ్‌ వంటి విదేశీ హీరోయిన్లు ఎంతో రాణించారని కానీ 2014తరువాత స్వదేశీ నటీనటులు, కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, విదేశీయుల నృత్యాలు ఆపాలని జనం చెప్పారని, ఇటాలియన్‌ ప్రభుత్వాన్ని తొలగించి ఒక చాయ్‌వాలాను ప్రధానిని చేశారని కూడా సెలవిచ్చారు. రైతు ఉద్యమాన్ని వ్యతిరేకించటమే గాక అందులో పాల్గొన్నవారిపై నోరు పారవేసుకున్నందుకు చండీఘర్‌ విమానాశ్రయంలో ఒక మహిళా కానిస్టేబుల్‌ చేతిలో చెంపదెబ్బ తిన్న సంగతి కూడా తెలిసిందే.