ఇది కదా కమ్యూనిస్టుల ముందు చూపు – మేథోవలస- తిరిగి రాకపై దశాబ్దాలనాడే చైనా ముందు జాగ్రత్త !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

రానున్న రోజుల్లో తమ దేశానికి హెచ్‌ 1 బి వీసా మీద వచ్చే వారు లక్ష డాలర్లు(88 లక్షలరూపాయలు) చెల్లించాల్సి ఉంటుందన్న అమెరికా అధ్యక్షుడి నిర్ణయం భారతీయులను విస్మయానికి గురిచేసింది. అనేక మంది డాలర్‌ కలలు కల్లలైనట్లు భావిస్తున్నారు. ఈ నిర్ణయానికి ట్రంప్‌ కట్టుబడి ఉంటాడా కార్పొరేట్లు తెచ్చే వత్తిడికి లొంగి సవరించుకుంటాడా అన్నది చూడాల్సి ఉంది. ప్రపంచ వ్యాపితంగా మేథోవలస-తిరిగి రాకల గురించి మధనం ప్రారంభమైంది.ట్రంప్‌ నిర్ణయం ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నది మరికొంత స్పష్టత వచ్చిన తరువాతనే చెప్పుకోవటం మంచిది. ఈ సందర్భంగా వచ్చిన కొన్ని వ్యాఖ్యలు, పత్రికా శీర్షికలు, వాటి వెనుక ఉన్న అంశాల గురించి చూద్దాం. అమెరికా లక్షల డాలర్ల ఫీజు కేవలం ఒక చెడ్డ విధానమేగాక చైనాకు వ్యూహాత్మక బహుమతి అంటూ ఒక బడా ఆంగ్ల పత్రికలో విశ్లేషణ ప్రారంభమైంది. హ్రస్వదృష్టితో ఉన్న అమెరికా వైఖరి కేవలం చైనా సాంకేతిక ప్రగతి పెరగటానికే తోడ్పడుతుందని కూడా వ్యాఖ్యాత వాపోయారు. విలువైన సంపదలను వెండి పళ్లెంలో పెట్టి చైనాకు అప్పగిస్తున్నారంటూ మరొకరు. ఎవరు ఎన్ని ఏడ్పులు ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా గడచిన ఐదు దశాబ్దాల చరిత్రను చూసినపుడు అమెరికా, ఇతర ధనిక దేశాల విధాన నిర్ణేతలు, మేథావులు అనుసరించిన విధానాలు, అడ్డుకోవటాలు జనచైనా ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డాయన్నది జగమెరిగిన సత్యం. చైనా గురించి ఈ మాటలు చెబుతున్నవారు ట్రంప్‌ నిర్ణయం భారత్‌కు బహుమతి అని ఎందుకు చెప్పలేకపోయారు ? అత్తారింటికి దారేది సినిమాలో పదిలక్షల రూపాయల సూట్‌కేసును పవన్‌ కల్యాణ్‌ బహుమతిగా ఇస్తే దాన్ని తీసుకు వెళ్లిన ఆలీ తాళం రావటం లేదంటూ తిరిగి వచ్చిన దృశ్యాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆకస్మికంగా వచ్చిన ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియని స్థితిలో పదకొండేండ్ల మోడీ పాలన మనదేశాన్ని ఉంచిందని భావించాలా ? ఎందుకంటే ఏది జరిగినా మోడీ కారణంగానే అంటున్నారు గనుక ఇలా వ్యాఖ్యానించాల్సి వస్తోంది.

ప్రతిభావంతులకు చైనా,బ్రిటన్‌ వల అన్నది ఒక ప్రముఖ తెలుగు పత్రిక శీర్షిక. అమెరికా అడ్డుకుంటే ప్రతిభను వృధా కానివ్వాలా ? ఆ పని మనమెందుకు చేయటం లేదని ప్రశ్నించాల్సిన వారు ఇతర దేశాల గురించి అలాంటి పదజాలంతో కించపరుస్తూ వ్యాఖ్యానించటాన్ని ఏమనాలి. అక్టోబరు ఒకటవ తేదీ నుంచి కె వీసాల జారీతో చైనా ఎంతో చురుకుగా ప్రపంచంలోని స్టెమ్‌ (సైన్సు,టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణిత) మేథావులను ఆకర్షిస్తున్నదని ట్రంప్‌ ప్రకటన తరువాత వార్తలు వెలువడ్డాయి. నిజానికి చైనా నిర్ణయం ఎంతో ముందుగానే తీసుకున్నది. మన మీడియా, అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ మన పాలకులు చైనా చర్యలను గుర్తించలేదు, అసలు ప్రయత్నం కూడా చేయలేదంటే అతిశయోక్తి కాదు.మనం లేకపోతే అమెరికాకు గడవదు అని మనజబ్బలు మనం చరుచుకున్నాం తప్ప అసలు వారెందుకు ప్రపంచమంతటి నుంచీ మేథావంతులను ఆకర్షిస్తున్నారు, తేడా వచ్చి ఆకస్మికంగా అడ్డుకుంటే ప్రత్యామ్నాయం ఏమిటి అని 2047 విజన్‌ గురించి చెబుతున్న నరేంద్రమోడీ గానీ, అంతకు ముందే విజన్లను ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గానీ ఎప్పుడైనా ఆలోచించారా ? కాక మీద ఉన్నపుడే ఇనుము మీద దెబ్బలు వేసి అవసరానికి అనుగుణంగా మలుచుకోవాలి. ఇప్పుడు యువత కూడా ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. అమెరికాగాకపోతే ఆస్ట్రేలియా, అదిగాక పోతే ఆఫ్రికా అన్నట్లు కొందరు మాట్లాడుతున్నారు. సంచార తెగమాదిరి ఎక్కడికో అక్కడికి పోవటం తప్ప మన దేశం పురోగమించటం గురించి, గౌరవ ప్రదమైన ఉపాధి గురించి ఎందుకు ఆలోచించరు ?

అమెరికా వ్యూహాత్మకంగా స్వయంగా చేసిన తప్పిదం అంటున్నారు సరే, దాంతో మనకు పోయేదేమీ లేదు, మనం ఎందుకు వ్యూహాత్మకంగా ఆలోచించలేదు అని కదా పాఠాలు తీసుకోవాల్సింది. చైనా కె వీసా ఎంతో స్మార్ట్‌గా, వ్యూహాత్మకంగా, నిర్దాక్షిణ్యమైన అవకాశవాదంతో ( రూత్‌లెస్లీ ఆపర్చ్యునిస్టిక్‌) ఉందని కూడా ఉక్రోషం వెలిబుచ్చారు. ఈ వీసాలకు దరఖాస్తు చేసుకొనేందుకు చైనాలోని ఏదో ఒక కంపెనీ ఇచ్చే అవకాశంతో పని లేదు. అనుభం కూడా అవసరం లేదు. వారు కోరిన అర్హతలు ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందే చెప్పుకున్నట్లు ప్రతిభావంతులను ఆకర్షించటం ఇప్పుడే ప్రారంభం కాలేదు. వేయి ప్రతిభల పథకం(టిటిపి) పేరుతో చైనా 2008 నుంచే ఆకర్షించటం ప్రారంభించింది. అయితే చైనా మీద ఉన్న తప్పుడు ప్రచారం, అమెరికాతో పోలిస్తే దక్కే ప్రతిఫలం తక్కువగా ఉండటం, కమ్యూనిస్టు నిరంకుశ ప్రభుత్వం అనే వ్యతిరేక భావనలు ఇలా అనేక అంశాలు చైనా వైపు చూడటానికి యువతను అడ్డుకున్నాయి. అది కూడా చాపకింద నీరులా తన పథకాన్ని అమలు జరిపింది తప్పహడావుడి చేయలేదు. ఇప్పుడు చైనా సాధిస్తున్న పురోగతి, ఇతర దేశాల్లో విధిస్తున్న ఆంక్షలు, జాత్యహంకారం వంటి వివక్ష ఇతర సమస్యల కారణంగా గతంలో మాదిరి అడ్డుకొనే అవకాశాలు పరిమితం. అనేక మంది వైద్య విద్యకోసం చైనా వెళ్లిన సంగతి తెలిసిందే.

మన దేశానికి ట్రంప్‌ మంచి అవకాశాన్ని కల్పించాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవటం మన విధాన నిర్ణేతలు, పాలకుల చేతుల్లో ఉంది. సేవారంగంలో మన యువత ముందంజలో ఉంది.మొత్తంగా చూసినపుడు సాధించాల్సింది ఇంకా ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఎంతో ఉంది. ప్రపంచంలో పరిశోధన మరియు అభివృద్ధి మీద చేస్తున్న ఖర్చు వంద రూపాయలు అనుకుంటే మనం చేస్తున్నది కేవలం రు.2.90 మాత్రమే. అదే అమెరికా 24.8, చైనా 22.80 ఖర్చు చేస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ప్రపంచంలో నవకల్పనలకు పేటెంట్‌ హక్కులు లభిస్తున్నాయి. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం 2023లో చైనా అత్యధికంగా 16,19,268 దరఖాస్తులు సమర్పించగా 7,98,347 మంజూరయ్యాయి. రెండవ స్థానంలో ఉన్న అమెరికా 5,94,340కి గాను 3,20,410 పొందింది. మన విషయానికి వస్తే ఐదవ స్థానంలో 70,068 మాత్రమే సమర్పించి 30,490 పొందాము. మూడవ స్థానంలో ఉన్న జపాన్‌ 2,89,530కి గాను 2,01,420, నాలుగవది దక్షిణ కొరియా 2,37,633కు గాను 1,35,180 పొందాయి. ఏదైనా పిండికొద్దీ రొట్టె.గడచిన పదకొండు సంవత్సరాలుగా అంతకు ముందు కూడా పరిశోధన, అభివృద్ధికి మనదేశం చేసిన ఖర్చు పెరగలేదు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అనే కబుర్లతో కాలక్షేపం చేస్తే ఇలాగే ఉంటుంది.పోనీ వాటినైనా వెలికి తీస్తారా అంటే అదీ చేయరు. పడక కుర్చీ కబుర్లు చెబుతుంటారు. యుద్ద ప్రాతిపదికన కొన్ని సంవత్సరాల పాటు అవసరమైన నిధులు కేటాయించి ప్రోత్సహిస్తే మనం కనీసం మూడవ స్థానానికి చేరుకుంటాం.ఈ అవకాశాన్ని మోడీ సర్కార్‌ సద్వినియోగం చేస్తుందా ? చౌకబారు రాజకీయాల మీదనే కేంద్రీకరిస్తుందా ? కొంత మంది అంచనా వేస్తున్నట్లు రానున్న రోజుల్లో ప్రావీణ్యం అసలైన శక్తిగా ముందుకు రానుంది. దీన్ని చైనా ఎప్పుడో గుర్తించింది, అమెరికా ఇప్పుడు నేర్చుకుంటున్నది, మరి మనం ? అవు సైన్సును నమ్ముకుంటే గోమూత్రం, పేడ దగ్గరే ఉండిపోతాం. వార్షిక ప్రపంచ రాంకింగ్‌లను చూసినపుడు చైనా విద్యా సంస్థల పురోగతి స్పష్టంగా తెలుస్తున్నది. ఇప్పటికీ చైనాను గుడ్డిగా వ్యతిరేకించే వారు అది అనుకరించేది తప్ప నవకల్పనలు చేసేది కాదని వాదిస్తారు. వారిని అలాగే ఉండనిద్దాం, వాస్తవాలను చూద్దాం. అమెరికాకు చెందిన న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ నివేదికలో 105 దేశాలకు చెందిన 2,250 ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ సంవత్సరం బీజింగ్‌లోని సిన్హువా విశ్వవిద్యాలయం ప్రపంచ రాంకుల్లో పదకొండవ స్థానం పొందింది. పెకింగ్‌, ఝెజియాంగ్‌ 25,45వ స్థానాల్లో ఉన్నాయి. 2018లో సిన్హువా, పెకింగ్‌ 50, 68 స్థానాలతో తొలి వందలో ఉన్నాయి.ఈ ఏడాది వాటి సంఖ్య పదిహేనుకు చేరింది.చైనాలో అమలు జరిపిన కరోనా ఆంక్షలు, అంతకు ముందే 2018లో ట్రంప్‌ తొలి పాలనా కాలంలో ప్రారంభమైన అమెరికా వేధింపులు పెరగటంతో 2019-20లో 3,72,532గా అమెరికాలో చదివిన చైనా విద్యార్థుల సంఖ్య 2023-24లో 2,77,398కి తగ్గింది. దీంతో ఇప్పుడు మన దేశం మొదటి స్థానంలోకి వెళ్లింది.

ఇప్పటి వరకు చైనా నుంచి అమెరికాకు మేథోవలస జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి తిరిగి రావటం ప్రారంభమైంది. దీనికి అక్కడ పరిశోధన మరియు అభివృద్ధికి చేస్తున్న ఖర్చు పెరగటంతో పాటు ప్రపంచ సరఫరా గొలుసులో చైనాను విస్మరించలేని స్థితికి చేరుకోవటం, అక్కడ కూడా అనేక స్టార్టప్‌లు ప్రారంభించటానికి ప్రభుత్వం అవకాశం కల్పించటం వంటి కారణాలు దీనికి దోహదంచేస్తున్నాయి.2035 నాటికి ప్రపంచ అగ్రస్థానంలో సాంకేతిక రంగాన్ని నిలబెట్టేందుకు చైనా పూనుకుంది. అందుకు అవసరమైన పెట్టుబడిలో అమెరికాతో పోటీపడుతోంది.ఓయిసిడి సంస్థ సమాచారం ప్రకారం పదేండ్ల క్రితం అమెరికా చేసిన పరిశోధన ఖర్చులో 72శాతం చేసిన చైనా 2023నాటికి 780 బిలియన్‌ డాలర్లు వెచ్చించి 96శాతానికి చేరుకుంది. పరిశోధన ఉత్పత్తిలో 2017లోనే అమెరికాను అధిగమించింది. డీప్‌ సీక్‌ సంచలనం తెలిసిందే. దానిలో పనిచేసిన వారందరూ చైనా యువకులే.కొంత మందికి ఎక్కడా పని చేసిన అనుభవం కూడా లేదు. దీనితో పాటు ఝజియాంగ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన గ్రాడ్యుయేట్లు డీప్‌ రోబోటిక్స్‌లో ప్రావీణ్యం పొందారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, ప్రమాదకరమైన హై ఓల్టేజి సమస్యల పరిష్కారానికి వారు కృషి చేస్తున్నారు. సిలికాన్‌ వాలీతో పోటీ పడేట్లుగా చైనా ప్రోత్సహిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞాన ఎగుమతులపై అమెరికా విధించిన నిషేధాలను సవాలుగా తీసుకుంది.అవకాశాలను అందిపుచ్చుకోవటంలో చైనాను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 1970దశకంలో అనివార్యమైన స్థితిలో ఐరాస భద్రతా మండలిలో కమ్యూనిస్టు చైనాను అసలైన శాశ్వత ప్రతినిధిగా అమెరికా గుర్తించాల్సి వచ్చింది.

దాని కొనసాగింపుగా చైనా ప్రారంభించిన సంస్కరణలను సొమ్ము చేసుకోవాలని అమెరికా భావించింది. తాత్కాలిక లాభాలను అమెరికన్లు చూస్తే దీర్ఘకాలిక లక్ష్యంతో సంస్కరణలను చైనా తలపెట్టింది.1978 వరకు అమెరికా ఉన్నత విద్యా సంస్థలలో చైనీయులకు ప్రవేశం లేదు. సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకొనే ప్రక్రియలో భాగంగా అమెరికా సైన్సు సలహాదారు ఫ్రాంక్‌ ప్రెస్‌ బీజింగ్‌ సందర్శనకు వచ్చాడు. అక్కడి నుంచి నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌కు ఫోన్‌ చేసి తమ విద్యార్థులు ఐదువేల మందిని అమెరికా విద్య కోసం పంపేందుకు ఆసక్తితో ఉన్నట్లు చైనా చెప్పిందని, ఏం చేయమంటారని అడిగాడు. ఐదువేలేం ఖర్మ లక్ష మందిని పంపవచ్చని వారికి చెప్పండని కార్టర్‌ సమాధానమిచ్చాడట. అలా వెళ్లిన లక్షలాది మంది చైనా విద్యార్ధులు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏటా 15 బిలియన్‌ డాలర్ల లబ్ది కలించారు.ఆ విధంగా అమెరికా మేథోవలసను ప్రోత్సహించి ఎంతోలబ్ది పొందింది. అక్కడి మార్కో పోలో అనే మేథో సంస్థ ప్రపంచ కృత్రిమే మేథ సర్వే చేసింది. అమెరికాలోని అగ్రశ్రేణి ఏఐ పరిశోధకుల్లో 37శాతం మంది అమెరికన్లు కాగా చైనీయులు 38శాతం ఉన్నట్లు తేలింది.చాట్‌ జిపిటి 4 ప్రాజెక్టులో కీలకమైన సేవలు అందించిన వారిలో 20శాతం మంది చైనీయులే. వీటన్నింటిని చూసిన తరువాత భయపడిన అమెరికన్లు పొమ్మనకుండా చైనీయులకు పొగ పెట్టారు. మా దేశంలో చదువుకొనేందుకు రావచ్చు గానీ స్టెమ్‌ కోర్సుల బదులు, మావవ, సామాజిక శాస్త్రాలను ఎంచుకోవాలని వత్తిడి తెస్తున్నది. ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన కోర్సులో ప్రవేశాన్ని పరిమితం చేసింది. అందుకే చైనీయులు వేలాది మంది స్వదేశం బాట పట్టి అమెరికాకు పాఠం చెప్పేందుకు పూనుకున్నారు. మోడీ సర్కార్‌ మనవారికి అలాంటి అవకాశాలను కల్పిస్తుందా అన్న శేష ప్రశ్న !

యువతకు పట్టని దోపిడీ : జిఎస్‌టి తగ్గింపు సరే ముడి చమురు ధర పతనమైనా పెట్రోలు, డీజిలు ధరలు తగ్గించరేం !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

ఈనెల 22 నుంచి నవరాత్రి కానుకగా తగ్గించే జిఎస్‌టి స్లాబులతో మీరు నేరుగా స్వర్గానికి భారతీయ పుష్పక విమానంలో పైసా ఖర్చు లేకుండా వెళ్లి రావచ్చన్నట్లుగా నరేంద్రమోడీ బొమ్మతో ప్రచారాన్ని ఊదరగొడుతున్నారు. అక్టోబరు లేదా నవంబరులో జరిగే బీహార్‌, తరువాత జరగాల్సిన మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పూర్వరంగంలో ఈ ప్రచారం మోతమోగుతున్నది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధులు పొందుతూ నరేంద్రమోడీ బొమ్మ పెట్టటం లేదంటూ బిజెపి నేతలు విమర్శలు చేస్తారు .ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు. పన్నెండు, 28శాతం పన్ను విధించే శ్లాబులను రద్దు చేసి ఐదు, పద్దెనిమిది శాతంతో పండగ చేసుకోవాలని చెబుతున్నవారు ఒక్క మోడీ బొమ్మనేే ఎందుకు పెడుతున్నట్లు ? జిఎస్‌టి తగ్గింపు నష్టాన్ని కేంద్రం రాష్ట్రాలకు బదలాయిస్తే మోడీ చిత్రం పెట్టుకున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ అలా కాదే, సగం నష్టాన్ని భరించేది రాష్ట్రాలు,ఎనిమిది వేల కోట్ల నష్టమని చంద్రబాబు ఇంజన్‌ ధ్వనులు చేస్తోంది, ఆ పేరుతో దేనికి కోత పెడతారో అది వేరే అంశం. జిఎస్‌టి తగ్గింపు ఖ్యాతి మొత్తం మోడీ ఖాతాలో వేస్తున్నారు. వీటినే చావు తెలివి తేటలు అంటారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం 2018లో జిఎస్‌టి ద్వారా వచ్చిన రాబడి రు.11,77,380 కోట్లు. సగటున నెలకు రు.98వేల కోట్లు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధరల పెరుగుదల, కొన్ని వస్తువుల మీద పన్ను పెరుగుదల వంటి కారణాలు కూడా తోడై 2024లో రు.20,12,720 కోట్లకు అంటే సగటున రు.183వేల కోట్లకు పెరిగింది.

ఇంత భారీ మొత్తంలో పన్ను రాబడి పెరుగుదల మోడీ సర్కార్‌ ఘనత అని చెబుతారు. నిజం ఏమిటి ? వినియోగం, పదేండ్లలో జనాభా 127 కోట్ల నుంచి 146 కోట్లకు చేరింది. పదేండ్లలో ద్రవ్యోల్బణం ఏటా సగటున 5.94శాతం చొప్పున పదేండ్లలో 59.4శాతం మొత్తంగా పెరిగింది. దీనికి తోడు పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను కూడా పెంచాయి. వీటన్నింటి కారణంగా జిఎస్‌టి కూడా ఆ మేరకు పెరిగింది. పన్ను ఎగవేతలను అరికట్టామన్నారు, నిజం ఏమిటో జనానికి తెలుసు ! జిఎస్‌టి తగ్గింపును దుకాణాల వారు ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు వార్తలు వచ్చాయి. దీపావళి నాటికి వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) సంస్కరణలను అమలు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 15 ఎర్రకోట ప్రసంగంలో చెప్పారు. వివరాలు తెలియకుండానే జనం పండగ చేసుకుంటారని మీడియా పెద్ద ప్రచారం చేసింది. అమెరికా పన్నుల దాడి, రానున్న బీహార్‌ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ ప్రతిష్ట పెంచటానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని రాయిటర్స్‌ ఇచ్చిన వార్తకు కొన్ని పత్రికలు శీర్షికలు పెట్టాయి. ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా ఓట్ల లాభం లేకుండా నరేంద్రమోడీ దేన్నీ తలపెట్టరు అని వేరే చెప్పనవసరం లేదు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నపుడు జిఎస్‌టి ప్రతిపాదనను బిజెపి వ్యతిరేకించింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2017 నుంచి అమలు చేసి తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నది.

ఏ కారుకు ఎంత, ఏ మోటార్‌ సైకిలుకు ఎంత, ఇలా పన్ను భారం తగ్గే వాటి గురించి ఇప్పటికే కంపెనీలు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి. గిరాకీ గిడసబారి లాభాల మీద ప్రతికూల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మధ్యతరగతి ఎక్కువగా కొనుగోలు చేసే విలాస వస్తువులపై 28 నుంచి 18శాతానికి పన్నుల తగ్గింపు వారికి ఊరటనిచ్చే మాట నిజం. పన్నెండు పన్ను జాబితాలో ఉన్నవాటిని ఐదుశాతానికి తగ్గించారు.గత లావాదేవీలపై జరిపిన విశ్లేషణ క్రిసిల్‌ నివేదిక ప్రకారం ప్రతి వంద రూపాయల జిఎస్‌టి రాబడిలో ఐదుశాతం ఉన్న వస్తువుల ద్వారా ఏడు రూపాయలు, పన్నెండు శాతం ఉన్నవాటితో ఐదు నుంచి ఆరు రూపాయలు, పద్దెనిమిదిశాతం వాటితో 70 నుంచి 75, విలాసవస్తువుల జాబితాలో ఉన్న 28శాతం నుంచి 13 నుంచి 15 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు ముందే చెప్పుకున్నట్లు 28,12శాతాలు ఉండవు. అందువలన ప్రామాణిక పన్నుశ్లాబ్‌ నుంచి ఎంత అనేది కొద్ది నెలల తరువాత గానీ వెల్లడి కాదు. తాజా మార్పులు, ఆదాయపన్ను మినహాయింపులు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వేతన సవరణతో మొత్తం నాలుగున్నరలక్షల కోట్ల రూపాయల మేర జనంలో కొనుగోలు శక్తి పెరిగేందుకు అవసరమైన సొమ్ము చేరుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టాలు తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదని ఊరడిస్తున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాత్రూముల్లో తప్ప బహిరంగంగా ఏడవటానికి కూడా అవకాశం లేదు, ఎవరి బాధలు వారివి.

జిఎస్‌టి తగ్గింపు వలన వస్తువుల ధరలు తగ్గి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు తప్ప కొనుగోలు శక్తి పెరగదు.డెలాయిట్‌ కంపెనీ చేసిన విశ్లేషణ ప్రకారం గత ఐదు సంవత్సరాలలో నిజవేతనాల పెరుగుదల మైనస్‌ 0.4 నుంచి ప్లస్‌ 3.9శాతం వరకు ఉందని పేర్కొన్నది. పైన చెప్పుకున్నట్లు సగటు ద్రవ్యోల్బణం 5.94 శాతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే నిజవేతనాలు ఎలా తగ్గిపోయాయో, పెరుగుదల ఎలా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. ఇన్‌ డాట్‌ ఐకాలిక్యులేటర్‌ డాట్‌ కామ్‌ విశ్లేషణ ప్రకారం 2014లో రు.5,765.94 రూపాయల వేతనం ఇప్పుడు పదివేలకు సమానం.ఈ మొత్తంలో పన్నులు, ఇతర కోతలు పోను ఇంటికి తీసుకుపోయిన మొత్తం రు.4,793 కాగా ఇప్పుడు పదివేల రూపాయలు వస్తే చేతికి అందుతున్నది రు.8,222గా ఉంది. అందువలన తట్టలతో డబ్బు తీసుకుపోయి బుట్టలతో సరకులు కొనుగోలు చేసే రోజుల వైపు పయనిస్తున్నామని చెప్పుకుంటే అతిశయోక్తి కాదు. అత్యంత ధనిక దేశం అమెరికాలో జిఎస్‌టి లేదు. అమ్మకపు పన్ను మాత్రమే ఉంది. వివిధ రాష్ట్రాలలో కనిష్టంగా నాలుగు శాతం నుంచి పన్నెండు శాతం వరకు మాత్రమే ఉన్నాయి. మన పొరుగునే ఉన్న చైనాలో ప్రామాణిక జిఎస్‌టి శ్లాబ్‌ 13శాతం మాత్రమే, ఇదిగాక తొమ్మిది, ఆరుశాతం శ్లాబులు ఉన్నాయి. క్రిసిల్‌ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి వచ్చే రాబడి నష్టం పెద్ద లెక్కలోనిది కాదు. అందువలన నూతన శ్లాబులు మీ జీవితాన్నే మార్చివేస్తుందన్న ప్రచారంలో నిజాలు కొద్ది నెలల తరువాత మాత్రమే వెల్లడవుతాయి.

ఉక్రెయిన్‌ – రష్యా పోరు మనదేశం, చైనాలకు ఎంతో మేలు చేస్తున్నది. అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యన్‌ చమురు రాయితీ ధరలకు వస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి ఎంతో మిగులుతున్నది. విపరీతంగా పెంచిన చమురు సెస్‌లను రద్దు చేస్తే వస్తుకొనుగోలు ఇంకా పెరుగుతుంది.సామాజిక మాధ్యమంలో చురుకుగా ఉన్న యువత ఇలాంటి విషయాల మీద ఎందుకు కేంద్రీకరించటం లేదు ? జిఎస్‌టి తగ్గింపు ఏ మేరకు జనాలకు ఉపశమనం కలిగించినా మంచిదే. కానీ చమురు భారం సంగతేమిటి ? దాన్ని జిఎస్‌టిలో ఎందుకు చేర్చరు ? రాష్ట్రాల మీద నెపం వేస్తున్నారు.ఎందుకు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి ? వాటికి ఉన్న ఆదాయవనరులలో అమ్మకపు పన్ను రద్దుచేసి జిఎస్‌టి తెచ్చారు. నష్టం వచ్చిన రాష్ట్రాలకు కేంద్రం పరిహారం చెల్లించింది. అదే విధంగా చమురు మీద వేస్తున్న వాట్‌ బదులు జిఎస్‌టికి మార్చి అదే విధంగా పరిహారాన్ని కేంద్రం ఎందుకు చెల్లించకూడదు ? అలా చెల్లిస్తే ఏ రాష్ట్రమైనా వ్యతిరేకత తెలుపుతుందా ? పోనీ వినియోగదారుల పట్ల ఏమైనా నిజాయితీగా ఉందా అంటే అదీ లేదు. దరిద్రం ఏమిటంటే దాని గురించి అడిగేవారేలేకపోయారు. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా చమురు ధరలను సవరిస్తామని ఒక విధానాన్ని అమలు జరిపిన ప్రభుత్వం 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి నిలిపివేసింది. అప్పటి నుంచి అంతర్జాతీయంగా ముడిచమురు ధర పడిపోయినా, రష్యా నుంచి రాయితీ ధరకు కొనుగోలు చేసినా ఆ మేరకు వినియోగదారుడికి తగ్గించలేదు. ప్రభుత్వమే అలా జనాల జేబులు కొట్టివేస్తున్నపుడు తగ్గించిన జిఎస్‌టి పన్ను మొత్తాలను ప్రయివేటు కంపెనీలు బదలాయిస్తాయంటే నమ్మేదెలా ? ధరల పెంపుదల మీద ప్రభుత్వానికి నియంత్రణ లేదు.

2023వ సంవత్సరంలో మన చమురు దిగుమతి బిల్లు రు. 16,82,475కోట్లు, అది 2024లో రు.14,80,232 కోట్లకు తగ్గింది. అంటే రెండు లక్షల కోట్ల రూపాయలు, అయినప్పటికీ ఒక్క పైసా కూడా డీజిలు, పెట్రోలు ధరలు తగ్గించలేదు. సామాజిక మాధ్యమాల మీద కొన్ని ఆంక్షలు పెట్టినందుకే నేపాల్‌ యువత ఎలా స్పందించిందో చూశాము.మనవారికి ఎందుకు పట్టటం లేదు. ఇవేమీ తెలియని అంశాలు కాదే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మనం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా సగటు ధర.93.15 డాలర్లు. నాడు నిర్ణయించిన ధరలే నేడు అమలు జరుగుతున్నాయి. అయిల్‌ ప్రైస్‌ డాట్‌ కామ్‌ సమాచారం ప్రకారం 2025 జనవరి 17న మన దేశం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా ధర 84.1డాలర్లు కాగా సెప్టెంబరు 18న 69.9 డాలర్లకు తగ్గింది. అయినా ఎందుకు ధరలు తగ్గించలేదు, ఎవరైనా సమాధానం చెప్పేవారున్నారా ? ఒక పీపా ముడిచమురు ధర పది డాలర్లు తగ్గితే దిగుమతి బిల్లులో లక్షా పదివేల కోట్లు మిగులుతాయి. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ధర 62 డాలర్లకు అటూ ఇటూగా ఉంది. మన అవసరాల్లో 2025 జూలై నెలలో 31శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాము. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక వేసిన గణాంకాల ప్రకారం 2022 నుంచి సెప్టెంబరు మొదటి వారం వరకు 1,260 కోట్ల డాలర్లు అంటే మన రూపాయల్లో లక్షా పదివేల కోట్లు మనదేశానికి మిగిలింది. గతంలో భారీ మొత్తాల్లో సెస్‌ విధించినపుడు ఒకసారి యుపిఏ ప్రభుత్వం చేసిన అప్పు తీర్చటానికి అని చెప్పారు. మరోసారి కరోనా వాక్సిన్‌ ఉచితంగా వేశారంటే డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారనుకుంటున్నారు అని బుకాయించారు. ఇంకోసారి మనదేశ రక్షణకు అవసరమైన మిలిటరీ ఖర్చుల కోసం అని మరో కత చెప్పారు. ఒక వేళ నిజంగా వాక్సిన్‌ పేరుతో విధించి ఉంటే అవసరం తీరింది గనుక ఆ మొత్తాన్ని ఎందుకు రద్దు చేయలేదు ? కేంద్ర ప్రభుత్వ సంస్థ కంప్ట్రోలర్‌ మరియు ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) తాజా నివేదిక ప్రకారం 2023-24 నాటికి విద్య, వైద్యం, రోడ్లు, వ్యవసాయం,స్వచ్చ భారత్‌, చమురు పరిశ్రమ అభివృద్ది పేరుతో వసూలు చేస్తున్న సెస్‌ మొత్తాలను ఆ రంగాలకు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే రు.3.69లక్షల కోట్ల మొత్తాన్ని వాటికి బదలాయించకుండా ఇతర అవసరాలకు మళ్లించినట్లు కాగ్‌ పేర్కొన్నది. సర్‌ఛార్జి, సెస్‌లో ఒక్క పైసా కూడా రాష్ట్రాలకు బదలాయించదు.

అసలు మనం దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ధర ఎంత దాన్నుంచి తయారు చేసే ఉప ఉత్పత్తులైన డీజిలు, పెట్రోలుకు ఎంత పడుతున్నది, ఎంత వసూలు చేస్తున్నారు. ఢిల్లీలో 2025 జూన్‌ నెలలో ఉన్న ధరల ప్రకారం లీటరు పెట్రోలు రు.100గా ఉంది.దానిలో చమురుశుద్ధి కేంద్రాలు డీలర్ల వద్ద వసూలు చేసేది రు.45, కేంద్ర ప్రభుత్వ ఎక్సయిజ్‌, సెస్‌ల మొత్తం రు.32.90, ఢిల్లీ ప్రభుత్వం 30శాతం చొప్పున వ్యాట్‌ రు.23.25, డీలర్లకు ఇచ్చే కమిషన్‌ రు.1.85, అంటే అసలు ధర కంటే పన్నుల వాయింపు 56.20 ఉంది.అదే డీజిలు మీద 51.3శాతం పన్నులున్నాయి. ఇతర రాష్ట్రాలు కొన్నింటిలో ఇంకా ఎక్కువ మొత్తం వ్యాట్‌ ఉంది. బిజెపి లేదా దాన్ని భుజాన మోస్తున్న తెలుగుదేశం, జనసేన,వైసిపి వంటి పార్టీలు ఎలా సమర్ధించుకుంటాయి. ఐరోపా దేశాల్లో పన్నుల మొత్తాలు 70శాతం వరకు ఉన్నాయి కదా అని ఎవరైనా అనవచ్చు. అవన్నీ ధనిక దేశాలు, వాటికీ మనకు పోలిక ఎక్కడ ? ప్రతిదానికీ మనవారు పోలుస్తున్న చైనాలో 2015 నుంచి పెట్రోలు లీటరు మీద 1.52 చైనా యువాన్‌లు(రు.18.84),డీజిలు మీద 1.2(రు.14.87) విధిస్తున్నారు. మన దేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం, రాష్ట్రాలు చమురు మీద వసూలు చేసిన మొత్తం రు.7.5లక్షల కోట్లు. ఇంత మొత్తం భారం మోపుతున్నప్పటికీ దాన్ని తగ్గించేందుకు మన దేశీయ ఉత్పత్తిని పెంచటం ఒక మార్గం. గడచిన పదేండ్లలో అంతకు ముందున్న దానికంటే ఉత్పత్తి తగ్గిందని చెప్పుకోవాలంటే పాలకులకు ఉండదు గానీ మనకు సిగ్గు వేస్తున్నది. యువత వీటిని ఎందుకు పట్టించుకోవటం లేదు !

కళ్లుండీ చూడలేని కబోదులా, రక్త పిపాసులా – గాజాపై అమెరికా ఆరవసారి వీటో !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

2023 అక్టోబరు 7వ తేదీ నుంచి పాలస్తీనా ప్రాంతమైన గాజాలో ఇజ్రాయెల్‌ ఊచకోతలో మరణించిన వారి సంఖ్య 65వేలు దాటింది. వీరిలో 70శాతం మంది అన్నెంపున్నెం ఎరగని పిల్లలు, వారి సంరక్షణ చూస్తున్న తల్లులే ఉన్నారు. లక్షలాది మంది గాయపడ్డారు, వేలాది మంది జాడ తెలియటం లేదు. నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, నిర్వాసితుల గుడారాలు, మానవతా పూర్వక సాయం చేస్తున్న కేంద్రాలు ఒకటేమిటి, ఏదో ఒక సాకుతో నిత్యం ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడులకు గురవుతున్నాయి. యాసిలెడ్‌ అనే ఒక సంస్థ తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం గాజాలో ఇజ్రాయెల్‌ చేసిన ప్రతి పదహారు హత్యలలో బలైంది 15 మంది సామాన్య పౌరులే అని తేలింది.ఈ ఏడాది మార్చినెల 18 తరువాత తాము 2,100 మంది సాయుధులను మట్టుబెట్టామని ఇజ్రాయెల్‌ చెప్పింది. తమ సమాచారం ప్రకారం 1,100 మందికి మించి లేరని సర్వే చేసిన సంస్థ పేర్కొన్నది. ఇదే కాలంలో 16వేల మంది పౌరులను చంపారు. ఇటీవలి కాలంలో నివాస ప్రాంతాల విధ్వంసం కూడా విపరీతంగా పెరిగింది. మార్చి నెలకు ముందు 15 నెలల కాలంలో భవనాల కూల్చివేతలు, దాడులు 698 జరిగితే, గడచిన ఆరునెలల్లోనే 500 ఉదంతాలు ఉన్నాయి. హమస్‌ను అదుపు చేయలేకపోయామనే ఉక్రోషంతో ఇజ్రాయెల్‌ ఎంతకు తెగిస్తున్నదో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

తాజాగా త్రివిధ దళాలు ప్రారంభించిన భీకరదాడులతో లక్షలాది మందిని తరిమివేస్తున్నారు. దిక్కుతోచని జనం తమ ప్రాంతాల నుంచి కకావికలౌతున్నారు.పదాతి దళాలు, వారికి మద్దతుగా యుద్ధ టాంకులు, వీటితో పాటు యుద్ద విమానాలు, హెలికాప్టర్లను రంగంలోకి దించి గాజాలో ఉన్న నివాస ప్రాంతాలపై పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతున్నది. దీంతో కాలినడకన, బండ్లు, దొరికిన వాహనాలతో లక్షలాది మంది గాజా దక్షిణం, ఇతర చోట్లకు వెళుతున్నారు, ఎక్కడ సురక్షిత ప్రాంతం దొరుకుతుందా అని చూస్తున్నారు. ఎక్కడ ఆగితే అక్కడ విమానాలతో దాడులు జరుగుతున్నాయి. పాలస్తీనా మరో ప్రాంతమైన పశ్చిమగట్టులో గ్రామాలు, పౌరుల మీద కూడా ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడులు జరుపుతున్నది. ఈ దారుణాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ భద్రతా మండలిలో గురువారం నాడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని 15కు గాను 14 సభ్యదేశాలు బలపరచగా అమెరికా వీటో చేసి అడ్డుకుంది. గాజా మారణకాండపై ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా వీటో హక్కుతో అడ్డుకోవటం ఇది ఆరవసారి.

గాజాలో ఇజ్రాయెల్‌ మారణకాండకు పాల్పడుతున్నట్లు తొలిసారి ఐరాస ప్రకటించింది. అయితే ఆ బృందం వాస్తవాలను పట్టించుకోలేదని, హమస్‌కు మద్దతుగా వ్యవహరించిందంటూ భద్రతా మండలిలో అమెరికా ధ్వజమెత్తింది. అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఇలాంటి తప్పుడు నివేదికలు ఇస్తున్న కారణంగానే తాము ఆ సంస్థ నుంచి తప్పుకున్నట్లు సమర్ధించుకుంది.ఐరాస మానవహక్కుల కమిషన్‌ గాజాలో మారణకాండ జరుగుతున్నదని చెప్పటం తప్పుడు ప్రచారమని అమెరికా మధ్య ప్రాచ్య ఉపరాయబారి మోర్గాన్‌ ఆర్టగస్‌ ఆరోపించింది.మానవహక్కుల కమిషన్‌ నివేదిక అంతా అవాస్తవాలతో నిండి ఉందని, హమస్‌కు లబ్ది చేకూర్చేదిగా ఉందని ఆమె ఆరోపించింది. ఎలాంటి ఆధారాలను చూపకుండా ఇలాంటి నివేదికలను రూపొందించటమంటే తన నిబంధనలను తానే ఉల్లంఘించినట్లు ఐరాసపై ఆమె ఆరోపించింది. యూదు వ్యతిరేక వేధింపులుగా వర్ణించింది.ఇజ్రాయెల్‌ ఆత్మరక్షణ హక్కును తీర్మానం గుర్తించలేదని, హమస్‌ చర్యలను ఖండించలేదని ఆరోపించింది.

సాధారణంగా భద్రతామండలి సమావేశాల్లో ఆయాదేశాల ప్రతినిధులు మాట్లాడిన తరువాత సమావేశాలు ముగుస్తాయి. కానీ గురువారం నాడు ఒకసారి మాట్లాడిన తరువాత సభ్యులు ఆగ్రహంతో రెండోసారి ప్రసంగించటం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్‌ దుర్మార్గంపై వెల్లడైన ఆగ్రహం, రెండు శిబిరాలుగా దేశాలు చీలిపోవటాన్ని ఇది సూచించింది.గాజాలో మారణకాండను నిలిపివేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రతిపాదించిన పది దేశాల్లో అల్జీరియా ఒక్కటే అరబ్బు దేశం. గాజాలో జరుపుతున్న దుర్మార్గాలను ఖండించటంతో పాటు, దాడులను ఆపాలని, అక్కడ కరువు విలయతాండవం చేస్తున్నదని, దాడులను మరింతగా విస్తరించేందుకు ఇజ్రాయెల్‌ పూనుకున్నదని తీర్మానంలో పేర్కొన్నారు.ఇజ్రాయెల్‌ ప్రతినిధి మాట్లాడిన తరువాత తిరిగి తనకు అవకాశం ఇవ్వాలని ఆ దేశప్రతినిధితో పాటు డెన్మార్క్‌ ప్రతినిధి కూడా కోరగా ఇజ్రాయెల్‌ వక్త కూడా అదే చేశారు. అల్జీరియాకు అంత ఆగ్రహం ఎందుకని ఎదురుదాడికి దిగాడు. ఇజ్రాయెల్‌ జైళ్లలో నిర్బంధించిన పదివేల మంది పాలస్తీనియన్లను చిత్రహింసలు పెడుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి.ఏ అంతర్జాతీయ సంస్థనూ పరిశీలించేందుకు అనుమతించటం లేదు. వారిని ఏ ఆరోపణలతో నిర్బంధించిందీ కూడా చెప్పటం లేదు.భద్రతా మండలిలో అమెరికా తమకు నైతికంగా మద్దతు ఇచ్చినందుకు ఇజ్రాయెల్‌ కృతజ్ఞతలు తెలిపింది. భద్రతా మండలి సభ్యులు అల్జీరియా, హమస్‌ ప్రభావానికి లోనైనట్లు రాయబారి డానన్‌ ఆరోపించాడు. గాజాలో ఉన్న తమ బందీలను విడిపించుకొనేందుకు, హమస్‌ను దెబ్బతీసేందుకే దాడులు చేస్తున్నామని చెప్పుకున్నాడు.. అమెరికా చర్యతో పాలస్తీనియన్లు తీవ్ర ఆశాభంగం చెందారని ఐరాస రాయబారి రియాద్‌ మన్సూర్‌ పేర్కొన్నాడు. గాజా నుంచి వెలువడుతున్న దృశ్యాలను చూస్తుంటే కడుపు తరుక్కు పోతున్నదని ప్రతివారినీ కదిలిస్తున్నాయని చెప్పాడు. పసిపిల్లలు ఆకలితో మరణిస్తున్నారు, ఇజ్రాయెల్‌ మిలిటరీ భవనాల మీద నుంచి పౌరుల తలల మీద కాల్పులు జరుపుతున్నది. సామూహికంగా హత్యలు చేస్తున్నారని చెప్పాడు.

భద్రతా మండలి తీర్మానంపై ఓటింగ్‌ జరుగుతున్న సమయంలోనే గతంలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించి లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది.సాయుధ సంస్థ హిజబుల్లానేతలు, మిలిటియాను మట్టుపెట్టేందుకే ఈ దుర్మార్గం అన్నది తెలిసిందే. గతేడాది నవంబరు నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ మిలిటరీ 4,500 సార్లు ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు లెబనాన్‌ మిలిటరీ ప్రకటించింది. గతేడాది నవంబరులో కుదిరిన ఒప్పందం ప్రకారం హిజబుల్లా సాయుధుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని, అక్కడ పాతిన మందుపాతరలను తొలగించేందుకు కంపూచియా, చైనా నిపుణులను అనుమతించాల్సి ఉంది. అయితే ఇజ్రాయెల్‌ పదే పదే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘస్తున్నది. అందువలన ఆ రెండు చర్యలూ అమలు జరగటం లేదు. ఒప్పందంలో మధ్యవర్తులుగా ఉన్న అమెరికా, ఫ్రెంచి నేతలు తమ మిత్రదేశాన్ని అంకెకు తెచ్చి ఒప్పందం అమలుకు పూనుకోవాలని లెబనాన్‌ ప్రధాని నవాఫ్‌ సలామ్‌ డిమాండ్‌ చేశాడు.ఒక్క దక్షిణ లెబనాన్‌ మీదనేగాక యావత్‌ దేశం మీద దాడులు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చిన అమెరికా ఎక్కడా కనిపించటం లేదు. అసలు లెబనాన్‌లో ప్రభుత్వమే లేదని అందువలన ఆ పేరుతో తాము ఆయుధాలను విసర్జించేది లేదని హిజబుల్లా చెబుతున్నది, ఇజ్రాయెల్‌ జరుపుతున్నదాడులు తమ వైఖరి సరైనదే అని నిర్ధారిస్తున్నట్లు కూడా అది పేర్కొన్నది. దోహా మీద ఇజ్రాయెల్‌ దాడులు జరిపిన తరువాత తన అనుయాయి అయిన కతార్‌ మీద దాడులను అమెరికా నివారించలేకపోయిందని అలాంటిది లెబనాన్ను ఎలా రక్షిస్తుందని హిజబులా ప్రశ్నించింది. భద్రతా మండలిలో అమెరికా వీటో చేయటాన్ని హమస్‌ తీవ్రంగా ఖండించింది.మారణకాండపట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నది. తీర్మానం ప్రవేశపెట్టిన పదిదేశాలను ప్రశంసించింది.

భావ ప్రకటనా స్వేచ్చ గురించి గొప్పలు చెప్పే బ్రిటన్‌ పాలకులు గాజాలో జరుగుతున్న మారణకాండ గురించి అక్కడి పౌరులు, పాలస్తీనా మద్దతుదారులు వాట్సాప్‌లో సమాచారం, సందేశాలు పంపిన వారి మీద కూడా ప్రభుత్వం దాడులు చేస్తున్నదని విమర్శలు వచ్చాయి. గాజాలో జరుపుతున్న దుర్మార్గాలకు నిరసనగా ఇజ్రాయెల్‌ జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు, ఇజ్రాయెలీ క్లబ్‌ సభ్యులు పాల్గొనే క్రీడలను బహిష్కరించాలని ఐరోపా వ్యాపితంగా ఉన్న ఫుట్‌బాల్‌ ఫెడరేషన్లు, మాజీ ఆటగాండ్లు, ఇతరులు కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించారు.ఇజ్రాయెల్‌కు ఆయుధాలు సరఫరా చేయటాన్ని ఇటలీ రేవు కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలో రావెన్న రేవుకు వచ్చిన రెండు ట్రక్కులను కార్మికులతో పాటు ఇతరులు అడ్డుకున్నారు. తన వినతి మేరకు ఆయుధాలతో ఉన్న లారీలను అంగీకరించేందుకు రేవు అధికారులు తిరస్కరించినట్లు నగర మేయర్‌ ప్రకటించాడు. ఇలాంటి ప్రతిఘటనే ఫ్రాన్సు, స్వీడన్‌, గ్రీస్‌ కార్మికులు కూడా చేపట్టారు. అయితే ఇటలీ రేవుకు వచ్చిన ఆయుధాలు ఎక్కడి నుంచి తరలించిందీ తెలియలేదు. ఇజ్రాయెల్‌తో అన్ని రకాల వాణిజ్య, ఇతర సంబంధాలను నిలిపివేయాలని కోరుతూ ప్రధాని జార్జియా మెలోనీపై వత్తిడి తెచ్చేందుకు ఇటలీలో అతి పెద్ద కార్మిక సంఘమైన సిజిఐఎల్‌ సెప్టెంబరు 22న సగం రోజు సమ్మె చేసేందుకు పిలుపునిచ్చింది. ఇతర కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. పాలస్తీనియన్లపై సాగిస్తున్న మారణకాండకు నిరసనగా ఎమెన్‌లోని హౌతీ సాయుధులు ఇజ్రాయెల్‌పై బలమైన క్షిపణిదాడి చేసి రాజధాని టెలిఅవీవ్‌లోని మిలిటరీ లక్ష్యాలను దెబ్బతీసినట్లు ప్రకటించారు. అయితే డ్రోన్లను తాము అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్‌ చెప్పుకుంది.ఇజ్రాయెల్‌ మీద ఆంక్షల విధింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని అయితే గాజాలో జరుగుతున్నదానిని మారణకాండగా తాము పిలిచేది లేదని జర్మనీ ప్రకటించింది. అక్టోబరులో జరిగే ఐరోపా సమాఖ్యలో ఆంక్షల విషయాన్ని పరిశీలిస్తామని ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ చెప్పాడు. అయితే తాను సాధించుకున్న లక్ష్యాల దామాషాలో దాని చర్యలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పాడు. వాటిని మారణకాండగా వర్ణించలేమన్నాడు. అక్కడ జరుగుతున్నది మారణకాండ అని ఐరాస కమిషన్‌ వ్యాఖ్యానించిన తరువాత జర్మనీ స్పందన ఇది.పాలస్తీనాకు రాజ్యహౌదా అన్నది ఇప్పుడు చర్చ కాదన్నాడు.

ఇజ్రాయెల్‌ దాడులు పెరగటంతో నగర జీవ నాడులు కుప్పకూలుతున్నాయని ఐరాస మావతాపూర్వక సహాయ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.గడచిన ఐదు రోజుల్లో పదకొండువేల మంది తలదాచుకుంటున్న గృహాలను కూల్చివేశారని, ఇప్పటి వరకు మొత్తం పదిలక్షల మంది నెలవులు తప్పినట్లు ఆదివారం నాటి నుంచే 56వేల మంది నిరాశ్రయులైనట్లు తెలిపింది.ప్రతి రోజూ సహాయ సంస్థలు 5.6లక్షల ఆహార పొట్లాలను అందిస్తున్నాయని, ఇజ్రాయెల్‌ ఒక పథకం ప్రకారం ఈ ఏర్పాట్లను దెబ్బతీస్తున్నదని కొన్ని ఆహార పదార్దాలతో పాటు కొన్ని ప్రాంతాలకు సరఫరాను అడ్డుకుంటున్నదని పేర్కొన్నది. గాజా దిగ్బంధనాన్ని నిరసిస్తూ అక్కడ చిక్కుకు పోయిన పౌరులకు సాయం అందించేందుకు 44 దేశాలకు చెందిన యాభైకి పైగా చిన్న చిన్న పడవలతో గ్లోబల్‌ సముద్‌ ఫ్లోటిలా పేరుతో ఒక సమూహం గాజావైపు ప్రయాణిస్తున్నది. దానిలో వైద్యులు, సాంకేతిక నిపుణులు, సంఘసేవకులు ఉన్నారు. దాన్ని అడ్డుకొనేందుకు ఇజ్రాయెల్‌ పూనుకుంది. ఉగ్రవాదులకు సాయపడేందుకు అనేక మంది ఆ పడవల్లో వస్తున్నట్లు ఆరోపించింది, ఆ ముసుగులో గతంలో మాదిరి దాడి చేసి నిర్భందించేందుకు పూనుకుంది.ఇలాంటి పడవల్లో వెళ్లి సాయం అందించటం పెద్ద విషయం గాకపోయినా ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని లోకానికి వెల్లడించేందుకు, వత్తిడి తెచ్చేందుకు 2010 నుంచి సాగుతున్నది. గతంలో హండాలా, మాడలీన్‌ నౌకలతో వెళ్లినపుడు ఇజ్రాయెల్‌ డ్రోన్లతో దాడి చేసింది.నౌకలలో ఉన్నవారిని నిర్బంధించింది.వారిపై దాడి చేయటంతో పాటు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నది, వేరే ప్రాంతాలకు బలవంతంగా తరలించింది.ఈ సారి ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడనుందో తెలియదు, యావత్‌ సభ్య సమాజం ఇజ్రాయెల్‌, దానికి నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న అమెరికా దుర్మార్గాన్ని ఖండించాల్సి, ఎదిరించాల్సిన అవసరం ఉంది.

అమెరికా పచ్చి మితవాది చార్లీ కిర్క్‌ హత్య – భారత్‌ సాంస్కృతిక ఫాసిస్టులపై సామాజిక మాధ్యమ స్పందనమేటి ?

Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

అమెరికా జనాభా 35 కోట్లు, తుపాకులు 50 కోట్లు, పెద్ద వారి దగ్గర సగటున 1.93 ఉన్నట్లు అంచనా. వాటిలో ఒక దానికి మూడుపదుల వయస్సున్న ఒక విశ్లేషకుడు, విద్వేష మితవాద ప్రచారకుడు చార్లీ కిర్క్‌ బలయ్యాడు. రోజుకు అమెరికాలో సగటున 131 మంది తుపాకులకు సమిధలవుతున్నారు. అలాంటి స్వేచ్చా గడ్డ మీద గుండెమీద చేయి వేసుకొని రోడ్ల మీదకు రావాలంటే రాజకీయ నేతలు భయపడుతున్నారు. భిన్న భావజాలం కలిగినవారి చేతుల్లో బలయ్యే స్థితి అమెరికాలో ఉంది. కిర్క్‌ హత్యపై అమెరికా, భారత్‌తో సహా యావత్‌ ప్రపంచ మీడియా గుండెలు బాదుకొంటోంది. అతడిని రెండు పదుల వయస్సు దాటిన టేలర్‌ రాబిన్సన్‌ అనే యువకుడు సెప్టెంబరు పదవ తేదీన కాల్చి చంపాడు. 31 ఏండ్ల కిర్క్‌ తన మిత్రుడు అంటూ 79 ఏండ్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్పందనతో పెద్ద ప్రచారం, చర్చ జరుగుతున్నది.ఈ నెల 21 కిర్క్‌ అంత్య క్రియలకు డోనాల్డ్‌ ట్రంప్‌ హాజరు కానున్నాడు. దేశవ్యాపితంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని ఆదేశించాడు. ఇంత జరుగుతున్న తరువాత మితవాద శక్తులకు వాటికి మద్దతు ఇచ్చే మీడియా పెద్దలకు ఒంటి మీద దుస్తులు నిలుస్తాయా ? అందులోనూ మితవాద, కార్పొరేట్‌, పురోగామి భావాల వ్యతిరేక మీడియా ప్రపంచ వ్యాపితంగా రెచ్చిపోతున్న రోజులివి. అనేక మీడియా సంస్థలలో ని చేస్తున్న జర్నలిస్టులు కిర్క్‌ హత్య మీద స్పందించిన తీరు నచ్చని యాజమాన్యాలు ఉద్యోగాల నుంచి తొలగించేందుకు పూనుకున్నాయి.

అమెజాన్‌ కంపెనీ యజమాని జెఫ్‌ బెజోస్‌ నడిపే వాషింగ్టన్‌ పోస్టు పత్రికలో కరేన్‌ అటియా అనే ఆఫ్రో అమెరికన్‌ మహిళా జర్నలిస్టును యాజమాన్యం ఎలాంటి కారణం చెప్పకుండానే ఉద్యోగం నుంచి తొలగించింది. ఆమె అమెరికాలో రాజకీయ హింసను అరికట్టటం గురించి కబుర్లు చెప్పటం తప్ప చిత్తశుద్దితో నివారణకు తీసుకున్న చర్యలేమీ లేవని, పేరు పెట్టకుండా కిర్క్‌ను పరోక్షంగా విమర్శించినందుకు యాజమాన్యం ఈ చర్యకు పాల్పడింది. అనేక మంది జర్నలిస్టులపై ఇతర సంస్థలు సస్పెన్షన్‌ లేదా తొలగింపుకు పాల్పడినట్లు పెన్‌ అనే జర్నలిస్టుల సంస్థ పేర్కొన్నది. కిర్క్‌ హత్యతో సంబరాలు చేసుకున్న విదేశీయుల వీసాలను రద్దు చేస్తామని ట్రంప్‌ బృందం హెచ్చరించింది. వామపక్ష తీవ్రవాదులే హత్యకు కారకులను వారి అంతు చూస్తామని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ బెదిరింపులకు దిగాడు. కిర్క్‌ హత్యకేసులో అనుమానితుడిని పట్టుకోక ముందే అదుపులోకి తీసుకున్నట్లు, తరువాత కొద్ది సేపటికే విడుదల చేసినట్లు భారతీయ సంతతికి చెందిన ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ చేసిన ప్రకటనపై దుమారం రేగింది. అతనా పదవికి పనికి రాడని తొలగించాలని కొందరు డిమాండ్‌ చేశారు. మరి కొందరు సమర్ధించారు.ముందుగా ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. ఏ భావజాలానికి చెందిన వారినైనా వ్యక్తిగతంగా హత్య కావించటం సమర్థించ కూడదు. అది భావదారిద్య్రం, సరకులేని బాపతు చేసే పని. యావత్‌ ప్రపంచంలో మితవాదం మీద భావజాల పోరు ఈనాటిది కాదు. పురోగామి శక్తులు అన్ని విధాలుగా సన్నద్దంగానే ఉన్నాయి. కిర్క్‌ను రాబిన్సన్‌ ఉద్రేకంతో చంపినట్లు కనిపిస్తున్నది. అయితే రాబిన్సన్‌ వామపక్ష భావజాలంవైపు ఆకర్షితుడు అయినందునే హత్య చేసినట్లు చిత్రించేందుకు చూస్తున్నారు. దానిలో భాగంగానే ఇటీవలి కాలంలో అతను వామపక్ష భావజాలం వైపు మొగ్గుతున్నట్లు కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పినట్లు అటావా రిపబ్లికన్‌ గవర్నర్‌ స్పెన్సర్‌ కాక్స్‌ ఒక టీవీలో ఆరోపించాడు. చంపటానికి ముందు రాబిన్సన్‌ ఒక నోట్‌ కూడా రాశాడని పోలీసులు చెబుతున్నారు. మొత్తం మీద వామపక్ష శక్తుల మీద దాడి చేసేందుకు ఈ ఉదంతాన్ని వినియోగించుకొనేందుకు చూస్తున్నారన్నది స్పష్టంగా కనిపిస్తున్నది.

మన దేశంలో ఒక నరేంద్ర దబోల్కర్‌, ఒక గోవింద పన్సారే, ఒక కలుబుర్గి, ఒక గౌరీ లంకేష్‌ ఇలా అనేక మంది పురోగామి, హేతువాదులు, కుల, మతత్వ వ్యతిరేకులను హిందూత్వశక్తులు సంవత్సరాల తరబడి కాపుగాచి చంపినపుడు మన మీడియాలో పెద్దగా స్పందన లేదు. పచ్చి మితవాది చార్లీ కిర్క్‌ వయస్సు, అనుభవంతో పోల్చితే పైన చెప్పుకున్నవారందరూ మేథావులు. మన దేశంలో ”సాంస్కృతిక ఫాసిస్టులు ” గా తయారైన వారు ముందుకు తెచ్చిన హిందూత్వ భావజాలానికి గురైనవారి చేతిలో వారు బలయ్యారు. కిర్క్‌ను హత్య చేసిన రాబిన్సన్‌ 33 గంటల్లోగానే అరెస్టు అయ్యాడు. ఇదే మనదేశంలో పైన పేర్కొన్నవారి హత్యా ఉదంతాలలో ఎంత కాలం తరువాత అరెస్టులు చేశారో, కేసులు ఏమైందీ తెలిసిందే. ఉదాహరణకు గౌరీ లంకేష్‌ కేసులో నిందితులపై ఇంతవరకు విచారణే పూర్తి కాలేదు. అయినప్పటికీ వారిలో కొందరిని హీరోలుగా సన్మానించిన సంగతి తెలిసిందే. గౌరీ లంకేష్‌ కేసులో 18 మంది నిందితులు కాగా ఒక్కడు మినహా అందరూ అరెస్టయ్యారు, బెయిలు మీద దర్జాగా తిరుగుతున్నారు. వికాస్‌ పాటిల్‌ అనేవాడిని ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పట్టుకోలేకపోయారు.ది న్యూస్‌ మినిట్‌ అనే వెబ్‌సైట్‌ వార్త 2024 అక్టోబరు 13 ప్రకారం నిందితుల్లో పరశురామ్‌ వాగ్మారే, మనోహర్‌ యదవే అనే వారిని సంఘపరివార్‌, శ్రీరామ్‌ సేన కార్యకర్తలు విజయపురాలో సన్మానించారు. అదే నెల 9వ తేదీన కోర్టు బెయిల్‌ మంజూరు చేయగానే 11న సన్మాన సభ. వార్తా భారతి అనే పత్రిక రాసిన మేరకు నిందితులు విజయపురాలోని కాళికా దేవి ఆలయంలో పూజ చేశారు, తరువాత శివాజీ విగ్రహానికి పూల మాలలు వేశారు. .

గౌరీ లంకేష్‌ ఒక జర్నలిస్టు, పురోగామి వాది. అలాగే చార్లీ కిర్క్‌ పచ్చి మితవాది, మీడియా రంగంలోనే ఉన్నాడు. తీవ్రవాద భావాలతో ఉన్న వామపక్ష వాదులు అద్భుతమైన చార్లీ కిర్క్‌ వంటి అమెరికన్లను నాజీలు, ఫాసిస్టులు, సామూహిక హత్యలు చేసేవారు, నేరగాండ్లుగా వర్ణిస్తున్నట్లు ట్రంప్‌ ఆరోపించాడు. అమెరికాలో ఏం జరుగుతోంది ? ఎవరు ఎవరిని చంపుతున్నారు. యాంటీ డిఫమేషన్‌ లీగ్‌ అనే సంస్థ పదేండ్ల నాటి పరిణామాల గురించి 2022లో ఒక అధ్యయనం జరిపింది.మూడింట రెండువంతులకు పైగా హత్యలు మితవాదులు చేసినవే అని తేలింది. మనదేశంలో మితవాద భావజాలాన్ని, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిని జాతివ్యతిరేకులు,తుకడే తుకడే గాంగ్‌, కుహనా లౌకికవాదులు, అర్బన్‌ నక్సల్స్‌ అంటూ ముద్రవేసినట్లుగానే అమెరికాలో కూడా తీవ్రవాద వామపక్ష వాదులని, మరొకటిగా చిత్రించి వాళ్లను చంపినా ఫరవాలేదన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. చంపివేస్తున్నారు. న్యూయార్క్‌ మేయర్‌ పదవికి పోటీ చేస్తున్న డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి జోహ్రాన్‌ మమదానీ తాను కమ్యూనిస్టును కాదని పదే పదే చెప్పినా డోనాల్డ్‌ ట్రంప్‌ పక్కా కమ్యూనిస్టు అంటూ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. జోహ్రాన్‌ డెమోక్రటిక్‌ సోషలిస్టు గనుక అలా అన్నాడని అనుకుందాం. జో బైడెన్‌ గెస్టపో పాలన కొనసాగిస్తున్నాడని ట్రంప్‌ ఆరోపించాడు. గెస్టపో అంటే హిట్లర్‌ నాజీ పాలనలో ప్రత్యర్ధులను మట్టుపెట్టే రహస్య పోలీసు దళం. అలాంటపుడు జో బైడెన్‌ ఫాసిస్టు అయినట్లా ? మనదేశంలో మత, కుల దురహంకారాలు ఉన్నట్లే అమెరికాలో జాత్యంహకారం ఉంది.

చార్లీ కార్క్‌ హత్య జరిగింది ఎక్కడ ? మితవాదుల అడ్డాగా ఉన్న అటా వ్యాలీ విశ్వవిద్మాయలయంలో , తుపాకి సంస్కృతి ఎక్కడ మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతున్నదంటే మితవాదులు ఎక్కువగా ఉన్న రెడ్‌ రాష్ట్రాలలో అన్నది జగమెరిగిన సత్యం.2021లో ట్రంప్‌కు మెజారిటీ వచ్చిన పదింటిలో ఎనిమిది రాష్ట్రాలలో తలసరి తుపాకి మరణాలు లక్షకు 33.9 ఉన్నాయి. డెమోక్రాట్లు బలంగా ఉన్న మసాచుసెట్స్‌లో 3.4గా ఉంది. సామూహిక తుపాకి హత్యలు ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయంటే మితవాదులు ఎక్కువగా ఉన్న చిన్న పట్టణాల్లో ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. రిపబ్లికన్ల తుపాకి విధానాలు వారినే బలితీసుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు.తుపాకి హింసాకాండను అరికట్టేందుకు కేటాయించిన బడ్జెట్‌లో ఈ ఏడాది ట్రంప్‌ యంత్రాంగం 15.8 కోట్ల డాలర్ల కోత పెట్టింది. మితవాదుల పట్ల అమెరికాలో ఎంత వ్యతిరేకత ఉందంటే కార్క్‌ హత్య వార్త వెలువడగానే కొందరు సైనికులు పండగ చేసుకున్నారని వార్తలు రాగా వారి సంగతి చూడాలంటూ రక్షణ మంత్రి హెగసేత్‌ ఆదేశించాడు. సామాజిక మాధ్యమంలో సాయుధ దళాలకు చెందిన వారితో సహా ఉద్యోగులు, టీచర్లు, ప్రొఫెసర్లు ఇంకా అనేక మంది హర్షం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారంటే చార్లీ కిర్క్‌ మీద ఉన్న ఆగ్రహానికి నిదర్శనంగా చెప్పవచ్చు.

ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవటం, అనుకరించటం ఈ రోజుల్లో ఎంతో సులభం.ప్రజలకు దూరమైన పాలకుల మీద శ్రీలంక జనం తిరుగుబాటు చేసిన తీరును బంగ్లాదేశ్‌లో అనుకరించారు, తాజాగా నేపాల్‌లో చూశాము. అదే విధంగా భావజాల రంగంలో కూడా అదే జరుగుతున్నదా ? అమెరికాలో చార్లీ కిర్క్‌ ఒక మితవాది, జాత్యహంకారి, అలాంటి వారు అన్ని రంగాలలో కోకొల్లలుగా ఉన్నారు. అతగాడిని చంపివేస్తే అనేక మంది పండగ చేసుకున్నారు. దాన్ని చూసిన తరువాత మనదేశంలో మితవాద జర్నలిస్టులు, లాయర్లు, ఇతర ప్రభావకులుగా పరిగణిస్తున్న ఆర్నాబ్‌ గోస్వామి, శాయి దీపక్‌, ఆనంద రంగనాధన్‌, వివేక్‌ అగ్నిహౌత్రి, అభిజిత్‌ అయ్యర్‌ మిశ్రా, స్మితా ప్రకాష్‌, మయూఖ్‌ రంజన్‌లకు అదే గతి పడుతుందనే పోస్టులు సామాజిక మాధ్యమంలో కొన్ని వచ్చాయి. అపహాస్యం చేస్తూ జోకులు కూడా వేశారు. అయితే వాటిని వామపక్ష శక్తులు, ఉదారవాదుల కలగా వర్ణిస్తూ కమ్యూనిస్టు వ్యతిరేకులు బురదచల్లేందుకు పూనుకున్నారు.నిజానికి అలాంటి పోస్టులను ఏ కమ్యూనిస్టూ, పురోగామి వాదీ కూడా సమర్ధించరు. పైన పేర్కొన్నవారు ఏ విధంగారెచ్చగొడుతూ మాట్లాడతారో, ఎలాంటి తిరోగామి భావ జాలాన్ని వ్యాపింపచేస్తున్నారో అందరికీ తెలుసు. వారి తీరు కమ్యూనిస్టులు కానివారికి కూడా ఆగ్రహం తెప్పిస్తున్నదంటే అతిశయోక్తి కాదు.పోస్టులు పెట్టిన వారికి ఎలాంటి భావజాలంతోనైనా సంబంధం ఉందోలేదో కూడా తెలియదు.మనదేశంలో మితవాద భావజాలానికి ధీటుగా సమాధానం చెప్పలేని దుస్థితిలో పురోగామి వాదులు లేరు.రాబిన్సన్‌ ఉపయోగించిన బుల్లెట్‌ మీద రేరు ఫాసిస్టు కాచుకో అని, మరోదాని మీద ఇటాలియన్‌ ఫాసిస్టు వ్యతిరేక పాటలోని ఒక చరణం రాసిి ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అది నిజం కావచ్చు కల్పితమూ కావచ్చు. అమెరికాలో ఫాసిస్టు వ్యతిరేక భావజాలం పెరుగుతున్నందున రాబిన్సన్‌ కూడా స్పందించి ఉండవచ్చు.

ఐరోపా, అమెరికాలో ఇటీవలి కాలంలో పచ్చి మితవాదులు, వారిని వ్యతిరేకించేవారి సమీకరణలు పెరుగుతున్నాయి. దీనికి ఒక ప్రధాన కారణం ఆర్థికంగా ఆయా దేశాలు అనేక సమస్యలను ఎదుర్కోవటం. ఇలాంటి పరిస్థితి ఉన్నపుడు మూఢభక్తి, మితవాద భావనలు పెరగటానికి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు లండన్‌లో వేలాది మంది వలసకార్మికులకు వ్యతిరేకంగా మితవాద శక్తుల పిలుపు మేరకు జరిగిన ప్రదర్శనలో b్గన్నారు. అనేక దేశాల్లో ఎన్నికల్లో ఇదొక ప్రధాన సమస్యగా మారుతున్నది. డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక వైపు విదేశీ వస్తువుల మీద దిగుమతి పన్నులు వేస్తూ మరోవైపు విదేశీ కార్మికులు, విద్యార్థుల మీద తీవ్రమైన ఆంక్షలు పెట్టటం, అమెరికా నుంచి పంపివేసేందుకు ప్రయత్నించటాన్ని మనం చూస్తున్నాం. మనదేశంలో నరేంద్రమోడీ తన విధానాలను వ్యతిరేకించే వారందరికీ దేశద్రోహులని ఎలా ముద్రవేస్తున్నారో అమెరికాలో మితవాదులను వ్యతిరేకించే శక్తులను వామపక్షం, తీవ్రవాదవామపక్షం, కమ్యూనిస్టులుగా చిత్రించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనికి శ్వేజాతిదురహంకారం, ఆఫ్రో అమెరికన్ల పట్ల వివక్ష, ముస్లిం వ్యతిరేకత వంటివి తోడవుతున్నాయి. పాలస్తీనా విమోచన కోరుతున్న శక్తులకు, ఇజ్రాయెల్‌ మారణకాండకు వ్యతిరేకంగా విద్యార్ధులు ఉద్యమిస్తే ఆయా విద్యా సంస్థల మీద ట్రంప్‌ కక్ష తీర్చుకుంటున్నాడు. ఒక చిన్న ఉదంతం కూడా పెద్ద పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. యువతలో గూడుకట్టుకున్న అసంతృప్తి సాధారణంగా ప్రదర్శనలు ధర్నాల రూపంలో ప్రదర్శితమౌతుంది. కానీ నేపాల్‌లో అలాంటి సూచనలేమీ లేకుండానే కేవలం సామాజిక మాధ్యమాల మీద ఆంక్షలు విధించటాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున వీధుల్లోకి రావటం బహుశా ప్రపంచంలో ఇదే మొదటి సారి.వారి వెనుక విదేశీశక్తులున్నాయనే మాట వినిపిస్తున్నప్పటికీ బయటకు కనిపించింది సామాజిక మాధ్యమాల అదుపుపై నిరసనే అన్నది వాస్తవం.మనదేశంలో సాంస్కృతిక సారధుల పేరుతో సంఘపరివార్‌కు చెందిన వారు ఎలా తయారువుతున్నారో అమెరికాలో చార్లీ కిర్క్‌ కూడా యుక్త వయస్సు నుంచే మితవాదభావజాల సైనికుడిగా తయారయ్యాడు. ఫాక్స్‌ న్యూస్‌ వంటి మీడియా సంస్థలు అలాంటి వారిని వామపక్ష భావజాలంపై దాడికి వినియోగించాయి.మన దేశంలో కూడా అలాంటి ధోరణులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అందుకే కిర్క్‌ హత్య తరువాత అలాంటి శక్తుల మీద సామాజిక మాధ్యమంలో అలాంటి వారికీ అదే గతి పడుతుంది లేదా పట్టాలని స్పందించారు, వీటి నుంచి అందరూ గుణపాఠాలు తీసుకోవాల్సి ఉంది.

కరీబియన్‌ ప్రాంతంలో చిచ్చు : వెనెజులా మిలిటరీ విన్యాసాలు, దాడులకు అమెరికా సన్నాహం !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


మాదక ద్రవ్యాల ముఠాలను అరికట్టే సాకుతో వామపక్ష పాలనలో ఉన్న వెనెజులాపై దాడులు చేసేందుకు అమెరికా సన్నాహాలు చేసింది. ఏ క్షణమైనా విరుచుకుపడవచ్చని వార్తలు వస్తున్నాయి. అధ్యక్షుడు మదురోను గద్దె దింపటం తమ లక్ష్యం కాదని చెబుతున్నప్పటికీ ఎవరూ నమ్మటం లేదు. అమెరికా దుర్మార్గాన్ని ప్రతిఘటించేందుకు సరిహద్దులో మదురో కూడా మిలిటరీని మోహరించి గురువారం నాడు త్రివిధ దళాలతో విన్యాసాలు నిర్వహించారు. వెనెజులా భూభాగంలో ఉన్న మాదకద్రవ్యాల మాఫియాలపై మిలిటరీ దాడులు చేస్తారా అన్న విలేకరి ప్రశ్నకు మీరే చూస్తారుగా అంటూ ట్రంప్‌ చెప్పటాన్ని బట్టి అమెరికా ఆంతర్యం స్పష్టంగా కనిపిస్తున్నది. కొద్ది రోజుల క్రితం కరీబియన్‌ సముద్రంలో ఒక పడవపై దాడి అమెరికా మిలిటరీ దాడి చేసి పదకొండు మందిని చంపివేసింది.వారికి మదురోకు సంబంధాలు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నద్ని అ బోటులో ఉన్నవారెవరికీ అమెరికా చెప్పే మాదక ద్రవ్యాల ముఠాతో ఎలాంటి సంబంధాలు లేవని మదురో సర్కార్‌ ప్రకటించింది. తమ కుటుంబ సభ్యులు కనిపించటం లేదని బంధువులు చేసిన ఫిర్యాదుతో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నది.తొలుత ఆ ఉదంతం కృత్రిమ మేథతో సృష్టించిన వీడియో అని మదురో పేర్కొన్నారు. వెనెజులా నుంచి వచ్చిన ఆ మోటార్‌ బోట్‌లో మాదకద్రవ్యాలు ఉన్నట్లు స్వయంగా ట్రంప్‌ కత చెప్పాడు. ఆ ముఠా అమెరికాలో హింసాత్మక చర్యలకు, మాదక ద్రవ్యాల వ్యాప్తి, సామూహిక హత్యలు, అమ్మాయిల అక్రమరవాణాకు పాల్పడుతున్నదని ఆరోపించాడు. ఆ తరువాత పోర్టారికోకు పది ఎఫ్‌ 35 రకం యుద్ధ విమానాలను అమెరికా తరలించింది. తప్పుడు సాకులతో అమెరికా దాడులకు పూనుకున్నదని మదురో శుక్రవారం నాడు చెప్పారు. మారణాయుధాలను గుట్టలుగా పోసినట్లు ప్రచారం చేసి ఇరాక్‌ మీద దాడులు చేసినట్లుగానే తమపై అమెరికా దుర్మార్గానికి పాల్పడేందుకు పూనుకున్నదన్నాడు. అనేక దేశాలతో పోల్చితే తమ దేశం ద్వారా రవాణా అవుతున్న మాదకద్రవ్యాలు స్పల్పమని చెప్పాడు. అమెరికన్లు వెనక్కు తిరిగి పోలేని చోటికి చేరుకుంటున్నారని హెచ్చరించారు. మదురోను అరెస్టు చేసేందుకు వీలు కలిగే సమాచారం ఇచ్చిన వారికి ఐదు కోట్ల డాలర్లు ఇస్తామని ఆగస్టు నెలలో అమెరికా ప్రకటించిన అంశం తెలిసిందే.1998లో హ్యూగో ఛావెజ్‌ నాయకత్వంలో వామపక్షాలు అధికారానికి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలను కూలదోసేందుకు మితవాద నేతలకు అనేక రకాలుగా అమెరికా సాయం చేసినప్పటికీ ఓటర్లు తిరస్కరించారు. విధించిన ఆంక్షలు పనిచేయటం లేదు. ఇప్పుడు మాదకద్రవ్యాల పేరుతో మరోకుట్రకు తెరలేపారు.


కరీబియన్‌ అంతర్జాతీయ జలాల్లో ఉన్న పడవను ఆపేందుకు, ప్రాణాలతో దాన్లో ఉన్నవారిని పట్టుకొనేందుకు అమెరికా మిలిటరీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.నేరుగా కాల్పులు జరిపి చంపివేయటం ద్వారా తాను తలచుకొంటే ఏ దేశంపై అయినా యుద్ధాన్ని ప్రకటిస్తామని, ఎవరినైనా మట్టుబెడతామనే బెదిరింపు సందేశాన్ని ఆప్రాంత దేశాలకు పంపినట్లయింది.తమకు పూర్తి అధికారాలు, సత్తా ఉందని ఈ ఉదంతంపై విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించాడు. పడవపై దాడి ఉదంతానికి ఒక రోజు ముందు మదురో మాట్లాడుతూ అమెరికన్లు అవాస్తవాలు చెబుతున్నారని వారు వెనెజులా చమురు, గ్యాస్‌ను ఉచితంగా దోచుకొనేందుకు వస్తున్నారని అందుకోసం ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడతారని హెచ్చరించాడు. 1898లో స్పెయిన్‌తో యుద్దాలకు తప్పుడు ప్రచారం చేశారని, 1964లో వియత్నాంపై దాడికి టోంకిన్‌ గల్ప్‌ కల్పిత ఉదంతాన్ని, 2003 ఇరాక్‌పై మారణాయుధాల గుట్టల గురించి ప్రచారం చేశారని అన్నాడు.మోనికా లెవెన్సీతో తన అక్రమ సంబంధ ఉదంతం నుంచి అమెరికన్లను పక్కదారి పట్టించేందుకు నాటి అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ సూడాన్‌ మీద దాడి చేయించాడని ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అలాంటి కుంభకోణంలో జెఫ్రి ఎప్‌స్టెయిన్‌ ఫైళ్లలో కూరుకుపోయాడని అన్నాడు.


తన ప్రత్యర్ధులైన ఇరాన్‌,లెబనాన్‌,హుతీ, హిజబుల్లా, హమస్‌ అగ్రనేతలను ఒక ప్రకారం మట్టుబెడుతున్న క్రమంలో ఇజ్రాయెల్‌ తాజాగా ఎమెన్‌ ప్రధాని, మంత్రులను హతమార్చటాన్ని చూశాము. ఈ దుర్మార్గాలన్నింటికీ అమెరికా, ఇతర పశ్చిమదేశాల సంపూర్ణ మద్దతు ఉంది. లాటిన్‌ అమెరికాలో వామపక్ష నేతలు అమెరికాకు కొరకరాని కొయ్యలుగా మారిన పూర్వరంగంలలో వారిని హతమార్చేందుకు అమెరికా చూస్తున్నది, దాని లక్ష్యంగా మదురో ఉన్నాడని వేరే చెప్పనవసరం లేదు.అమెరికా గద్దెపై ఎవరున్నా అదే చేస్తున్నారు. రెండవసారి అధికారానికి వచ్చిన మరుసటి రోజే విదేశీ ఉగ్రవాద సంస్థలను మాదకద్రవ్యాల మాఫియాలుగా చిత్రిస్తూ ట్రంప్‌ ఉత్తరువులు జారీ చేశాడు. ఆ ముసుగులో వెనెజులా సమీపానికి మిలిటరీని దించుతున్నాడు.ఇతర దేశాల్లో జోక్యం చేసుకొనేందుకు మిలిటరీకి అధికారమిస్తూ రహస్య ఉత్తరువులు ఇచ్చినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. వెనెజులా చమురు కొనుగోలు చేయవద్దని, దాన్ని రవాణా చేయవద్దంటూ ఆంక్షలు విధించింది. ట్రంప్‌కు చిత్తశుద్ధి ఉంటే అమెరికాలో విచ్చలవిడిగా దొరుకున్న మాదకద్రవ్యాలు, వాటిని సరఫరా చేసే వారి మీద కేంద్రీకరించాలి. ఒక అంచనా ప్రకారం అమెరికాలో 200 నుంచి 750బిలియన్‌ డాలర్ల మేరకు మాదకద్రవ్యాల విక్రయాలు జరుగుతుంటే ప్రాణావసరమైన ఔషధాల లావాదేవీలు 600 బిలియన్‌ డాలర్లు, చమురు లావాదేవీల విలువ 400 బి.డాలర్లు మాత్రమే అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పవచ్చు. మరోమాటలో చెప్పాలంటే ప్రపంచంలో మాదక ద్రవ్యాలను అత్యధికంగా వినియోగిస్తున్న, వాటి తయారీకి అవసరమైన ఔషధ సంబంధిత రసాయనాలు, ఆయుధాలను ప్రపంచానికి ఎక్కువగా సరఫరా చేస్తున్నది అమెరికా అన్నది నమ్మలేని నిజం. ఈ అక్రమలావాదేవీల్లో అమెరికాలోని బడా బాంకులు, కార్పొరేట్‌ సంస్థలు ఉన్నాయి. అమెరికన్‌ పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఇదంతా సాగుతుందా ? తన విధానాలు, కార్పొరేట్ల దోపిడీని ప్రశ్నించకుండా యువతను మత్తులో ముంచే ఎత్తుగడ కూడా దీని వెనుక ఉందన్నది స్పష్టం. ఐరాస 2025 ప్రపంచ మాదకద్రవ్యాల నివేదికలో వెనెజులా గురించి చేసిన ప్రస్తావన చాలా పరిమితంగా ఉంది. అక్కడ మాదక ద్రవ్యాల సాగు లేదా తయారీ దాదాపు లేదని పేర్కొన్నది.


కరీబియన్‌ ప్రాంతంలో అమెరికా మిలిటరీ మోహరింపు వెనుక బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. చైనాలోని తియాన్‌జిన్‌లో జరిగిన చారిత్మ్రాక షాంఘై సహకారం సంస్థ 25వ సమావేశంలో షీ జింపింగ్‌, నరేంద్రమోడీ, పుతిన్‌ కలయిక అమెరికా విధాన నిర్ణేతలకు వణుకుపుట్టించింది. వెంటనే గుక్క తిప్పుకోలేకపోయిన ట్రంప్‌ నాలుగు రోజుల తరువాత భారత్‌ను చైనాకు కోల్పోయినట్లు ఉక్రోషంతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశం ముగిసిన వారం రోజుల్లోనే బ్రిక్స్‌ సమావేశాన్ని ట్రంప్‌ జీర్ణించుకోలేకపోయాడు. వెనెజులా పేరుతో కరీబియన్‌ సముద్రంలో ఉద్రిక్తతలకు తెరతీశాడు. సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్సుద్వారా బ్రిక్స్‌ సదస్సును బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డిసిల్వా ప్రారంభించాడు. కరీబియన్‌ ప్రాంతంలో అమెరికా యుద్ద నావలు ఉద్రిక్తతకు కారణం అవుతున్నాయని చెప్పాడు. వెనెజులా మీద దాడికి సన్నాహాల్లో ఉన్నట్లు కనిపిస్తున్నదన్నాడు. డోనాల్డ్‌ ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు బ్రిక్స్‌ సమావేశానికి డుమ్మాకొట్టిన ప్రధాని నరేంద్రమోడీ విదేశాంగ మంత్రి జై శంకర్‌ను పంపారు. చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ మాట్లాడుతూ బ్రిక్స్‌ దేశాల మధ్య సహకారం మరింతగా పెరగాలని పిలుపునిచ్చాడు.


ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల తయారీ అక్రమరవాణా సమస్యలు ఉన్నాయి. ఒక దేశం మీదకు యుద్ధ సన్నాహాల మాదిరి కరీబియన్‌ సముద్రంలో అమెరికా యుద్ద నావలను దించింది. వాటిలో నాలుగున్నరవేల మంది మెరైన్లు, నావికులను మోసుకువెళ్లే నౌక, నియంత్రిత క్షిపణులను ప్రయోగించే మూడు డెస్ట్రాయర్లు ఇతర నౌకలు, మరోచోట పది యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇది వెనెజులాను బెదిరించేందుకు, దాడి చేసేందుకు అన్నది తెలిసిందే. ఇటీవలి కాలంలో ఎక్కడా అమెరికా ప్రత్యక్ష దాడుల్లో పాల్గొన్న ఉదంతాలులేవు. ఇతర దేశాలతో దాడులు చేయించటం, వాటికి ఆయుధాలు విక్రయించి లబ్దిపొందే విధానాన్ని అనుసరిస్తున్నది. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో మరోమారు విజయం సాధించిన నికొలస్‌ మదురో ప్రభుత్వాన్ని అమెరికా ఇంతవరకు గుర్తించలేదు.తాము బలపరిచిన ప్రతిపక్ష అభ్యర్థి గోన్‌జాలెజ్‌కు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు అమెరికా చెప్పుకుంది. అమెరికా గనుక దాడులకు పాల్పడితే తాము ప్రతిఘటించేందుకు సిద్దంగా ఉన్నామని, మిలిటరీతో పాటు లక్షలాది మంది పౌరులను దించుతామని మదురో హెచ్చరించాడు. దాదాపు ఇరవై ఐదువేల మంది సైనికులను కొలంబియా సరిహద్దులకు, చమురు శుద్ది కర్మాగారాలు ఉన్న ప్రాంతాలకు, సముద్రతీరానికి తరలించటమే గాక దేశవ్యాపితంగా డ్రోన్లు ఎగురవేయటంపై ఆంక్షలు విధించాడు. తమ జలాల్లో నౌకా దళం పహారా కాస్తుందని రక్షణ మంత్రి ప్రకటించాడు.ప్రస్తుతం మిలిటరీలో లక్షా 23వేల మంది సైనికులు ఉన్నారు. వీరు గాక మరో రెండులక్షల ఇరవైవేల మంది ప్రజాసాయుధులు ఉన్నట్లు మదురో ప్రకటించాడు. దేశంలో అమెరికా వ్యతిరేక భావనలను ముందుకు తేవటంతో పాటు పరిసర దేశాల మద్దతు పొందేందుకు వెనెజులా నాయకత్వం పూనుకుంది.

గతంలో మిత్రదేశంగా ఉన్న సమయంలో వెనెజులాకు అమెరికా నాలుగవ తరం ఎఫ్‌ 16 యుద్ద విమానాలను సరఫరా చేసింది. ఇప్పుడు వాటితోనే కరీబియన్‌ సముద్రంలో ఉన్న అమెరికా యుద్ధ నావల చుట్టూ చక్కర్లు కొట్టించారు. నియంతల పాలనా కాలంలో చమురు నిల్వలపై కన్ను, కమ్యూనిజాన్ని విస్తరించకుండా చూసేందుకు వెనెజులా ఆ ప్రాంతంలో ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో అమెరికా యుద్ధ విమానాలను అందచేసింది. అయితే అనూహ్యంగా ఛావెజ్‌ రంగంలోకి రావటంతో వెనెజులా బద్దశత్రువుగా మారింది. ఛావెజ్‌ అధికారానికి వచ్చిన తరువాత చైనా, రష్యాలతో మిలిటరీ సంబంధాలను పెట్టుకున్నాడు. ఒక దశలో తమపై విధించిన ఆంక్షలకు ప్రతిగా ఎఫ్‌16 విమానాలను ఇరాన్‌కు విక్రయిస్తామని ఛావెజ్‌ అమెరికన్లను హెచ్చరించాడు.2013 నుంచి నికోలస్‌ మదురో అధికారంలో కొనసాగుతూ చావెజ్‌ బాటను అనుసరిస్తున్నాడు. కరీబియన్‌ సముద్రంలో అమెరికా మోహరించిన నాలుగున్నరవేల మందితో వెనెజులాను స్వాధీనం చేసుకోవటం లేదా దాడి చేసే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.అమెరికా దాడులకు గురైన ఇతర దేశాలకు భిన్నంగా ప్రజాసాయుధులను కూడా వెనెజులా దింపే అవకాశం ఉంది. ఇరుగు పొరుగులాటిన్‌ అమెరికా దేశాలలో ఎక్కువ భాగం అమెరికా చర్యను ఖండిరచాయి. అమెరికా ఆంక్షలను ఖాతరు చేయకుండా చైనా చమురు దిగుమతి చేసుకోవటమే గాక వెనెజులాలో చమురు వెలికితీసేందుకు కూడా ముందుకు వచ్చింది. చైనా నుంచి మిలిటరీ జెట్లను కొనుగోలు చేసేందుకు మదురో ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.అయినప్పటికీ అమెరికా మిలిటరీ శక్తితో పోలిస్తే వెనెజులా బలం ఒక లెక్కలోనిది కాదు. దాని బలం, బలగం మదురోకు మద్దతు ఇస్తున్న జనం, ఇరుగు పొరుగుదేశాల సంఫీుభావమే !
 
.

చెవిలో పూలు : పాకిస్థాన్‌ ప్రాజెక్టుల నుంచి చైనా తప్పుకుందా, కాషాయ దళాలు, మీడియా కథనాల్లో నిజమెంత !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు


‘‘ పాకిస్థాన్‌ 60 బిలియన్‌ డాలర్ల ఆర్థిక నడవా ప్రాజెక్టు నుంచి వైదొలిగిన చైనా, నిధుల కోసం ఎడిబిని ఆశ్రయించిన ఇస్లామాబాద్‌ ’’ ఇది కొన్ని పత్రికల్లో వచ్చిన వార్త శీర్షిక.ఇదే అర్ధం వచ్చేవి మరికొన్నింటిలో వున్నాయి. దీనికి కాషాయ దళం చెప్పిన భాష్యం మచ్చుకు ఒకటి ఇలా ఉంది. ‘‘ భారత జాతీయ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే కనెక్టివిటీని మోడీజీ వ్యతిరేకించిన తరువాత (సిపిఇసి ప్రాజెక్టులో స్పష్టంగా సూచించడం) చైనా పాకిస్తాన్‌ యొక్క 60 బిలియన్‌ డాలర్స్‌ ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. ఇది భారతదేశానికి దౌత్యపరంగా అతిగొప్ప విజయం, పాక్‌కు చావు దెబ్బ ’’ అని పేర్కొన్నారు. ఇది నిజమా ? మొదటి అవాస్తవం ఏమిటంటే నరేంద్రమోడీ ప్రధాన మంత్రిగాక ముందే దానికి నాంది పలికిన 2013లోనే నాటి యుపిఏ ప్రభుత్వం ఈ పథకానికి అభ్యంతర తెలుపుతూ వ్యతిరేకించింది. ఎందుకు ? పాక్‌ ఆక్రమిత్‌ కాశ్మీరులో భాగమైన గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతంలో 600 కిలోమీటర్ల పొడవున పాకిస్థాన్‌ మరియు చైనా నడవా ప్రాజెక్టులో భాగంగా రోడ్డు మరియు రైలు మార్గ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు సాగుతుంది. అది చైనాలోని షింజియాంగ్‌ స్వయంపాలిత ప్రాంతం నుంచి మొదలై మూడువేల కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్‌ అరేబియా సముద్ర తీరంలోని గ్వాదర్‌ రేవు వరకు ఉంటుంది. గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతంపై మనదేశం హక్కును వదులుకోలేదు గనుక ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని మన ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అయినప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నారు.2014లో అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ సర్కార్‌ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వివిధ సందర్భాలలో నిరసన తెలుపుతూనే ఉంది. వాస్తవం ఇది కాగా, కొత్తగా మోడీ వ్యతిరేకత తెలిపినట్లు దానికి తలొగ్గి ప్రాజెక్టు నుంచి చైనా వైదొలిగినట్లు చెప్పటం జనాల చెవుల్లో పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు. ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.


నిజానికి మన్మోహన్‌ సింగ్‌ గానీ, నరేంద్రమోడీ గానీ ఈ సమస్య మీద పెద్దగా చేసిందేమీ లేదు. వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇద్దరూ చైనాతో ఇతర సంబంధాలను కొనసాగించారు. షాంఘై సహకార సంస్థలో మనదేశం 2005 నుంచి పరిశీలకురాలిగా 2014వరకు ఉంది. ఆ ఏడాది మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది. మనదేశమూ, పాకిస్థాన్‌ రెండూ 2017లో ఒకేసారి సభ్యత్వం పొందాయి. అప్పుడు సిపిఇసి నడవాను ఒక సమస్యగా మోడీ ముందుకు తేలేదు. నరేంద్రమోడీ హయాంలో 2020 గాల్వన్‌లోయ ఉదంతాల ముందుకు వరకు చైనాతో సంబంధాలు మరింత ముందుకు పోయాయి.ఐదేండ్ల తరువాత తిరిగి సాధారణ స్థితికి వస్తున్నాయి. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) 25వ వార్షిక సమావేశాలకు నరేంద్రమోడీతో పాటు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా హాజరయ్యారు. మోడీ వెంటనే తిరిగి రాగా సెప్టెంబరు మూడున జపాన్‌పై రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా సాధించిన విజయం 80వ వార్షికోత్సవ మిలిటరీ పరేడ్‌లో ఒక అతిధిగా షరీఫ్‌ పాల్గొన్నారు.ఆ ఉత్సవానికి నరేంద్రమోడీకి కూడా ఆహ్వానం ఉన్నప్పటికీ హాజరు కాలేదు. ఎస్‌సిఓ సమావేశాలలో సిపిఇసి గురించి అభ్యంతరాలు తెలిపినట్లుగానీ, చైనా నేతలతో మాట్లాడినట్లుగానీ ఒక్కటంటే ఒక్క వార్త కూడా రాలేదు. కానీ కొద్ది రోజుల తరువాత మీడియాలో వచ్చిన కథనాలను పట్టుకొని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ తనదైన శైలిలో రాసింది. ఆరు రోజులు పాటు చైనాలో ఉన్నప్పటికీ షెహబాజ్‌ షరీఫ్‌ సిపిఇసికి రెండవ దశ పెట్టుబడుల విషయంలో విఫలమయ్యారు.పరిమితమైన అవగాహన ఒప్పందాలు మాత్రమే చేసుకున్నారు.పెద్ద పెట్టుబడులేమీ లేవు. సిపిఇసి 2.0 ప్రారంభమైనట్లు షెహబాజ్‌ ఏకపక్షంగా ప్రకటించారు తప్ప చైనా వైపు నుంచి ఎలాంటి ప్రకటన లేదు.పరేడ్‌లో చైనా అధ్యక్షుడు తనతో పాటు పుతిన్‌, ఉత్తర కొరియా కిమ్‌ను తప్ప షెహబాజ్‌ను పట్టించుకోలేదు.పుతిన్‌తో సంభాషించినపుడు చెవులకు ఫోన్లను కూడా షరీఫ్‌ సరిగా అమర్చుకోలేకపోయారంటూ రాసింది. పాకిస్థాన్‌తో సిపిఇసి పెట్టుబడుల నుంచి వెనక్కు తగ్గినట్లు చైనా అధికారిక ప్రకటనను ఆర్గనైజర్‌ లేదా కథనాలు రాసిన ఇతర పత్రికలు చూపగలవా ?

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎటుతిప్పి ఎటురాసినా కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు రెండు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఇవ్వటం లేదని చైనా చెప్పిందని, గుట్టుచప్పుడు కాకుండా వెనక్కు తగ్గిందని, ఆ మొత్తాన్ని ఆసియన్‌ అభివృద్ధి బ్యాంకు (ఏడిబి) నుంచి తీసుకోవాలని పాక్‌ నిర్ణయించిందని రాశాయి. పదే పదే ఐఎంఎఫ్‌ నుంచి రుణాలు తీసుకుంటున్న పాకిస్థాన్‌కు తాము ఇచ్చిన రుణాలను చెల్లించే సత్తాదానికి ఉందా అనే అనుమానాలు చైనాకు వచ్చినట్లు పేర్కొన్నాయి. ఒక స్నేహితుడి కోసం మరొకర్ని వదులుకోలేమని ఇటీవల పాక్‌ ఆర్మీ ప్రధాన అధికారి అసిమ్‌ మునీర్‌ చెప్పాడని, దాంతో చైనా పెద్దగా ఆసక్తి చూపటం లేదన్నట్లుగా వర్ణించారు. ఇదే సమయంలో 8.5 బిలియన్‌ డాలర్లను వివిధ పథకాలకు చైనా అందించేందుకు పాక్‌ ప్రధానితో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వచ్చిన వార్తలను మన మీడియా పెద్దగా పట్టించుకోలేదు. రెండు బిలియన్‌ డాలర్లు ఇచ్చేందుకు తిరస్కరించిన చైనా కొత్తగా 8.5బి.డాలర్లు ఇచ్చేందుకు ఎందుకు అంగీకరించినట్లు ? ఈ మొత్తాన్ని సిపిఇసి 2.0లో ఐదు కొత్త కారిడార్లు, అదే విధంగా ఇతర రంగాలలో వినియోగించనున్నట్లు ప్రముఖ పాక్‌ పత్రిక డాన్‌ రాసిందని మనదేశ వార్తా సంస్థ పిటిఐ పేర్కొన్నది. తొలిసారిగా పశ్చిమ దేశాలతో చేతులు కలిపిన ఒక సంస్థ సిపిఇసిలో పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపిందని కూడా వార్తల్లో రాశారు.చైనాకు లాభదాయకం కాని వాటిలో అదెందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు ? సమాధానం ఉండదు.


నిజానికి ఇలాంటి కథనాలు రావటం ఇదే కొత్త కాదు. 2024 జూన్‌ 11న బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక రాసిన కథనానికి ‘‘ సిపిఇసి 2.0లేదు, భారీ పెట్టుబడులు లేవని పాకిస్థాన్‌కు చెప్పకనే చెప్పింది ’’ అనే శీర్షిక పెట్టింది. ఐదు రోజుల పర్యటన జరిపిన ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పర్యటనకు ముందు ఇస్లామాబాద్‌ అధికారులు సిపిఇసి మరొక ఉన్నత స్థాయికి తీసుకువెళతారని చెప్పారని అయితే ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని, పాక్‌ ఆశల మీద చైనా నీళ్లు చల్లిందని, పరిమిత లబ్దితోనే తిరిగి వెళ్లినట్లు నికీ ఆసియా రాసిందని దాన్లో పేర్కొన్నారు. ఏడాది క్రితం మోడీ చైనా వెళ్లలేదు, దానితో సాధారణ సంబంధాల స్థితి కూడా లేదు, అప్పుడెందుకు చైనా అలా వ్యవహరించిందో మీడియా ‘‘ వంట ’’ వారు, కాషాయ దళాలు చెప్పగలవా ? ‘‘పాకిస్థాన్‌ : ఎందుకు చైనా సిపిఇసి ప్రాజెక్టులు నిలిపివేసింది ?’’ అనే శీర్షికతో ఢల్లీి కేంద్రంగా పని చేస్తున్న అబ్జర్వర్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌ (ఒఆర్‌ఎఫ్‌) వెబ్‌సైట్‌లో 2020 నవంబరు 25వ తేదీన అయిజాజ్‌ వానీ రాసిన విశ్లేషణను ప్రచురించింది. అప్పుడు గాల్వన్‌లోయ ఉదంతాలతో చైనాతో మనదేశం వైరంలో ఉంది తప్ప మిత్రదేశంగా లేదు కదా, ఆ నాడే అలా ఎందుకు రాయాల్సి వచ్చినట్లు ? నరేంద్రమోడీ నిరసన లేదా పలుకుబడి ఏమైనట్లు ? అప్పటికే కొన్ని అంశాలను నిలిపివేసినట్లు అయిజాజ్‌ వానీ రాశారు. పాకిస్థాన్‌లో మాంద్యం, అవినీతి,బెలూచిస్తాన్‌ ఇతర తిరుగుబాట్లు వంటి అంశాలతో అనేక ప్రాజక్టులు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు.


సిపిఇసి అవకాశాన్ని పాకిస్థాన్‌ వృధా కావించిందని, మద్దతు గురించి చైనా పునరాలోచనలో పడిరదని సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయ మాజీ ఫ్రొఫెసర్‌ సజ్దాద్‌ అష్రాఫ్‌ 2025 మే రెండవ తేదీన రాశారు. పదేండ్ల తరువాత పాకిస్థాన్‌ అసమర్ధత, రాజకీయ అవకతవకల వంటి కారణాలతో అనేక కీలక ప్రాజెక్టులు ఆలశ్యం,వాయిదా పడటం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం.2015 ఏప్రిల్‌ 20న షీ జింపింగ్‌ ఇస్లామాబాద్‌లో ఎంతో అట్టహాసంగా ప్రాజెక్టును ప్రారంభించారు. పదేండ్ల తరువాత తలపెట్టిన 90 పథకాల్లో 38 పూర్తి కాగా మరో 23 నిర్మాణంలో ఉన్నాయి. మూడోవంతును ఇంతవరకు ముట్టుకోలేదు. దీనికి బాధ్యత పరిమితంగా చైనాది కాగా ఎక్కువగా ఇస్లామాబాద్‌దే ఉంది. అత్యంత కీలకమైన ప్రత్యేకించి సెజ్‌లు, పారిశ్రామికవాడలు పూర్తికాలేదు. దీనికి పాకిస్థాన్‌ రాజకీయ నేతలు, ఆసక్తి కనపరచని, సమన్వయం లేని ఉన్నతాధికారులదే బాధ్యత. వీటికి కేటాయించిన వనరులను ఆర్థికంగా పెద్దగా చెప్పుకొనేందుకు ఏమీ ఉండని లాహార్‌ మెట్రో రైలు ప్రాజక్టుకు మళ్లించారు. ఇలాంటి వాటికి తోడు 2021 నుంచి ప్రాజెక్టులలో పని చేస్తున్న చైనా సిబ్బందికి రక్షణ కల్పించటంలో తీవ్ర పరిస్థితి ఏర్పడిరది. అప్పటి నుంచి 14దాడులు జరగ్గా 20 మంది మరణించారు, 34 మంది గాయపడ్డారు. వీటిలో ఎక్కువ భాగం బెలూచిస్తాన్‌లో జరిగాయి. దౌత్యపరంగా ఇప్పటికీ సిపిఇసికి చైనా మద్దతు ఉన్నప్పటికీ 2023 తరువాత కొత్త పెట్టుబడుల పట్ల వెనక్కి తగ్గుతున్నది.


చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ(బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌) పెట్టుబడి పథకాన్ని ప్రారంభం నుంచి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు, వాటి ఆధ్వర్యాన నడిచే ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌, గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ గుండా రోడ్డు, రైలు మార్గాల నిర్మాణాన్ని కారణంగా చూపినప్పటికీ మనదేశం కూడా దానికి వ్యతిరేకమే అనే చెప్పాలి. పాకిస్థాన్‌లో రాజకీయ, ఇతర కారణాలతో అక్కడి రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించాయి. బెలూచిస్తాన్‌లోని ఉగ్రవాద శక్తులు చైనా జాతీయుల మీద చేసిన దాడుల వెనుక బిఆర్‌ఐని వ్యతిరేకించే దేశాలు ఉన్నాయని వేరే చెప్పనవసరం లేదు. ఇన్ని సమస్యలు, వాటి పరిణామాలు, పర్యవసానాల గురించి చైనాకు తెలిసినప్పటికీ ఎందుకు చేపట్టిందన్నది ప్రశ్న. ప్రపంచ ఫ్యాక్టరీగా తయారైన తరువాత దాని ఎగుమతులు, దిగుమతులు తక్కువ ఖర్చు, తక్కువ వ్యవధిలో యూరేషియా, ఆఫ్రికా దేశాలకు చేరేందుకు గల మార్గాలను అన్వేషించినపుడు సిపిఇసి ముందుకు వచ్చింది. దక్షిణ చైనా సముద్రం, మలక్కా జలసంధి ద్వారా రవాణా కంటే పశ్చిమ చైనాలోని షిజియాంగ్‌(ఉఘిర్‌) స్వయంపాలిత ప్రాంతం నుంచి పాక్‌ అరేబియా సముద్రరేవు పట్టణం గద్వార్‌ వరకు రవాణా సదుపాయాల ఏర్పాటు లాభదాయకమని భావించింది. చరిత్రలో ఇంగ్లీష్‌ ఛానల్‌ ప్రాంతంలో బ్రిటన్‌ మరియు ఫ్రాన్సును కలుపుతూ ఏర్పాటు చేసిన భూగర్భ రైల్వే టన్నెల్‌, పనామా, సూయజ్‌ కాలవల తవ్వకం అలా జరిగిందే. ప్రస్తుత పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సోదరుడు నవాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో 51 ఒప్పందాల ద్వారా 46 బిలియన్‌ డాలర్ల ఖర్చుతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రారంభించారు. ఇప్పుడు అది 65 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని అంచనా. మధ్యలో కరోనా, ఇతర సమస్యలతో అనుకున్నంత వేగంగా పూర్తి కావటం లేదు. ఈ నేపధ్యంలో పాకిస్థాన్‌ నుంచి 60 బిలియన్‌ డాలర్ల ప్రాజక్టు నుంచి చైనా వైదొలిగిందని రాస్తే జనం నమ్మాలా ? ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా శాశ్వతంగా ఉంటుందని భావించి మనదేశం అక్కడ మూడు బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. మనకు కూడా చెప్పకుండా అమెరికన్లు 2021లో అక్కడి నుంచి బతుకుజీవుడా మమ్మల్ని ప్రాణాలతో పోనిస్తే చాలంటూ ఆయుధాలు, రవాణా వాహనాల వంటి వాటన్నింటినీ వదిలి కాలికి బుద్ది చెప్పటాన్ని చూశాము. అప్పటి నుంచి మనదేశం తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించకపోయినా తెరవెనుక వారితో మంతనాలు జరుపుతూ పెట్టుబడులను రాబట్టుకొనేందుకు చూస్తున్న సంగతి బహిరంగ రహస్యం. వదలివేసినట్లు ఎక్కడా ప్రకటించలేదు. జూలై మొదటి వారంలో తాలిబాన్‌ సర్కార్‌ను గుర్తించిన ఏకైక దేశం రష్యా. దానితో మనకున్న సంబంధాలను ఉపయోగిస్తామని వేరే చెప్పనవసరం లేదు. అలాంటిది 60 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను అర్ధంతరంగా పాకిస్థాన్‌కు వదలి వట్టి చేతులతో చైనా తిరిగి వెళుతుందని మీడియాలో కొందరు రాస్తే, నరేంద్రమోడీ అభ్యంతరంతోనే ఆపని చేసిందని కాషాయదళాలు జనాన్ని నమ్మించేందుకు చూడటం నిజంగానే దుస్సాహసం. జనాలు చెవుల్లో పూలు పెట్టుకొని లేరని వారికి చెప్పకతప్పదు !

హిందూత్వ బాటలో బ్యాంక్‌ మేనేజర్‌ – పెద్ద కూర నిషేధంపై బెఫి నిరసన ! బిజెపి ఎంఎల్‌సిపై గోరక్షకుల దాడి !!

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆహార వ్యవహారాల్లో జోక్యం అంటే ఫలాన తినకూడదు అని ఆంక్షలు పెట్టటం వ్యక్తిగత స్వేచ్చలో మితిమీరిన జోక్యం చేసుకోవటం తప్ప మరొకటి కాదు. ఆహారం, ఆహార్యం కొన్ని సమూహాలకు అస్థిత్వ సూచికలుగా ఉన్నాయి. పెద్ద కూర, దీన్ని ఆంగ్లంలో బీఫ్‌ , అచ్చతెలుగులో గొడ్డు మాంసం అంటారు. తక్కువ ఖర్చుతో జనాలకు అవసరమైన ఎక్కువ ప్రొటీన్లు అందచేసే ఆహారం ఇది. ఇటీవలి కాలంలో హిందూత్వశక్తులు, సనాతనులుగా ముద్రవేసుకున్నవారు దీని మీద పెద్ద రాద్దాంతం, దాడులు, హత్యలకూ పాల్పడటాన్ని చూశాం. మేం శాకాహారులం మా మనోభావాలను గాయపరచవద్దు అనేవారు తయారయ్యారు. మాంసాహారులకు కూడా మనోభావాలు ఉంటాయి. తాజాగా కేరళలోని కోచ్చి నగరంలో కెనరా బ్యాంక్‌ ప్రాంతీయ కార్యాలయానికి బీహార్‌ నుంచి అశ్వనీ కుమార్‌ అనే మేనేజర్‌ బదిలీ మీద వచ్చారు. అప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా బ్యాంకు క్యాంటీన్‌లో పెద్ద కూర కూడా వారంలో కొన్ని రోజులు అందుబాటులో ఉండేది. ఆ పెద్దమనిషి రాగానే ఆహార జాబితా నుంచి దాన్ని తొలగించి నిషేధం విధించారు.ఎందుకంటే నేను తినను అని చెప్పారట. నాకు దక్కనిది ఎవరికీ దక్క కూడదు అనే సినిమా మాటలు బాగా వంటబట్టి ఉంటాయి. దేశంలో అనేక ప్రాంతాలలో ఇలాంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపిన సంగతి తెలియనంత అమాయకంగా సదరు అధికారి ఉంటారని అనుకోలేం. ఉద్యోగులు ప్రశ్నించిన తరువాత అయినా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఉంటే ఆ పెద్దమనిషి ఇప్పుడు మీడియాకు ఎక్కి ఉండేవారు కాదు. విధిలేని స్థితిలో బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బెఫి) నాయకత్వంలో సిబ్బంది నిరసన తెలుపుతూ బ్యాంకు ప్రాంగణంలో పెద్ద కూర, పరోటాల పండగచేసి నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఏ ఆహారం తీసుకోవాలన్నది వ్యక్తిగత ఎంపిక అంశమని, కొన్నింటి మీద నిషేధం విధించటం రాజ్యాంగహక్కులను ఉల్లంఘించటమే అని స్పష్టం చేశారు. బ్యాంకు అధికారి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక ఉన్నతాధికారి ఇష్టా ఇష్టాలకు అనుగుణంగా ఇతరులు ఆహార అలవాట్లను ఎందుకు మార్చుకోవాలని వారు ప్రశ్నించారు. మాంసాహారం తినాలని తామెవరినీ బలవంతం చేయటం లేదని బెఫి నేత చెప్పారు.


మాంసం, చేపలు, గుడ్లు తినరాదంటూ బలవంతం చేయటాన్ని బ్రాహ్మణీయ జాతీయవాదం(భావజాలం) అంటున్నారు. అనేక మంది బ్రాహ్మలు మాంసాహారాన్ని తింటారన్నది అందరికీ తెలిసిందే. తిరోగామి జాతీయవాదం ఏ రంగంలో, ఏ సమస్యపై తలెత్తినా దాన్ని వ్యతిరేకించాల్సిందే. మన దేశంలో ఆవును పూజించటానికి, గొడ్డు మాంసం తినటానికి లంకె పెడుతున్న కారణంగా తలెత్తిన భావజాల ఘర్షణను భౌతిక దాడులకు తీసుకుపోయేందుకు కొన్ని శక్తులు పనిగట్టుకు పనిచేస్తున్నాయి. బిజెపి పాలిత ఒడిషా రాష్ట్రంలో ఇద్దరు దళితులు చచ్చిన ఆవు కళేబరం నుంచి చర్మాన్ని వేరు చేయటాన్ని చూసిన కొందరు గోవధకు పాల్పడ్డారంటూ వారి మీద దాడి చేయగా ఒక వ్యక్తి మరణించాడు. ఉన్మాదాన్ని ఎలా ఎక్కించారో చూస్తున్నాం. దళితుల మీద దాడులకు ఆవునొక సాకుగా కూడా చూపిన ఉదంతాలు ఉన్నాయి. తమ ఇంట ఆవు చనిపోతే దాన్ని పూడ్చిపెట్టేందుకు ఏ సనాతనవాదీ ముందుకు రారు. ఇదీ గోవుల మీద ప్రేమ బండారం. చివరకు ఆ దళితులే కావాలి. సాంస్కృతిక గురుపీఠాల సృష్టికి ఆహారం ఒక ఉత్ప్రేక్షగా( ప్రస్తుతాన్ని అప్రస్తుతమైనదిగా మార్చటం) మారి చివరకు అవమానించేందుకు దారితీస్తున్నదని ప్రముఖ మేథావి, జెఎన్‌యు ప్రొఫెసర్‌ గోపాల్‌ గురు చెప్పారు. నైతిక పోలీసుల మాదిరి ఇలాంటి గురుపీఠాలు సాంస్కృతిక పోలీసులుగా బ్రాహ్మణ భావజాలాన్ని రుద్దే నిరంకుశ శక్తులుగా మారుతున్నాయి. వాటి ప్రభావానికి లోనైన కారణంగానే కెనరా బాంక్‌ కొచ్చి మేనేజర్‌ వంటి వారు తమ అధికార స్థానాలను ఉపయోగించుకొని నిషేధాలకు దిగటం సహించరానిది. నిజానికి సదరు మేనేజరుకు హిందూత్వ సంస్థలతో సంబంధాలు ఉన్నాయో లేవో తెలియదు. లేనప్పటికీ వాటి ప్రభాంతో తెలియకుండనే హిందూత్వ అజెండాను అమలు జరిపే ఒక పరికరంగా మారటాన్ని గమనించాలి. ఇలాంటి చర్యలకు ప్రతిఘటన తప్పదు. చిత్రం ఏమిటంటే దేశంలో 81శాతం మంది మాంసాహారులు ఉన్నట్లు కొన్ని సర్వేలు చెప్పగా 39శాతం శాకాహారులని కొన్ని సర్వేలు చెప్పాయి. ఒకటి మాత్రం వాస్తవం, ఏ విధంగా చూసినా మాంసాహారులే అత్యధికంగా ఉన్నప్పటికీ మైనారిటీలుగా ఉన్న శాకాహారులు తమ అలవాట్లను మెజారిటీ మీద రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. గోవధ గురించి దేశంలో ఎంతో చర్చ జరిగిన తరువాత దాని గురించి రాష్ట్రాలకు నిర్ణయాన్ని వదలివేస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్‌ 48లో పేర్కొన్నారు. దాన్ని విధి గాక ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. కొన్ని రాష్ట్రాలలో బిజెపి తన హిందూత్వ అజెండాలో భాగంగా గోవధ నిషేధ చట్టాలు చేసింది. అది కొత్త సమస్యలను ముందుకు తెస్తున్నది.


దోపిడీకి అవకాశం కల్పించే, సామాజిక పరంగా వివక్షాపూరితమైన మనువాదాన్ని సమర్ధించే శక్తులు ఇటీవలి కాలంలో రూటు మార్చి చిల్లి కాదు తూటు అన్నట్లుగా సనాతనం పేరుతో రాజకీయం చేస్తున్నాయి.అధునాతన కాలంలో సనాతనాన్ని పాటించటం ఎలా సాధ్యమో వారు చెప్పలేరు. రెండవది వేదకాలం గొప్పతనం గురించి ఒక వైపు చెబుతారు. పోనీ ఆ కాలానికి వెళ్లగలమా ? వేదకాలం గురించి చెప్పేవారు రెండో వైపున గోవధ నిషేధం గురించి మాట్లాడతారు. ఇది రెండిరటికీ పొసగని అంశం అని ఎంత మందికి తెలుసు? ఆవును పవిత్రంగా చిత్రించేవారు వేదకాలంలో ఆవు మాంసం తినటం గురించి ఎందుకు మాట్లాడరు ? వేదాలుగానీ, శాస్త్రాలు గానీ చరిత్రలు కావు.వాటిలో అనేక పరస్పర వైరుధ్యాలు ఉన్నాయి. కారణం ఎవరికి తోచిన వాటిని వారు రాసి వాటిలో చేర్చారు. ఎవరి వాదనలకు అనువుగా ఉన్నవాటిని వారు ఉటంకిస్తూ జనాలను మభ్య పెడుతున్నారు. యజ్ఞయాగాదులలో ఆవు పాలు, పెరుగు, నెయ్యి లేకుండా నేడు గడవటం లేదు. వేదాలతో సమానమైనదిగా భావించే శతపథ బ్రాహ్మణంలో యాజ్జవల్క్యుడు తాను బాగా ఉడికించిన పెద్దకూరను తింటానని చెప్పినట్లుగా ఉంది. దేవతల చక్రవర్తిగా పరిగణించే దేవేంద్రుడు ఎద్దుమాంస వడ్డన గురించి చెప్పాడు. వేదకాలంలో పూజారులకు ఆవులను ఇవ్వాలని లేకుంటే కనీసం ఆవు మాంసమైనా అందచేసే సాంప్రదాయం ఉన్నట్లు రాతలను బట్టి తెలిసిందే. కొంత కాలం తరువాత ఆవు వలన ఉపయోగం ఉందని గ్రహించి దాన్ని చంపకూడదని భావించారు. ఆ మాట చెబితే వినే పరిస్థితి లేకపోవటంతో ఆవు గురించి అభూత కల్పనలు, పవిత్రతను అంటగట్టి నిరోధించేందుకు కావాల్సిన వాటినన్నింటినీ చేర్చారన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ క్రమంలో ప్రతి జంతువుకు పవిత్రతను ఆపాదించి పురాణాల్లో రాయటం కనిపిస్తుంది. కానీ వాటిని వధించి తినటానికి ఉన్న అనుమతి ఆవుకు ఎందుకు నిరాకరిస్తున్నారన్నదే ప్రశ్న. దీన్ని లేవనెత్తితే అనేక మంది తమ మనోభావాలను స్వయంగా గాయపరుచుకుంటున్నారు. రాజకీయ నేతలు ఒకే ప్రకటనకు విరుద్ధ భాష్యాలు చెప్పినట్లుగా పురాణాలు, వేదాలలోని వాటికీ ఈ మధ్య తమకు అనుకూలమైన అర్ధాలు, భాష్యాలు చెప్పటాన్ని చూస్తున్నాము. చెప్పుకోనివ్వండి ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ధర్మరక్షకుల పేరుతో సంఘటితం అవుతున్నవారు అంగీకరించనివారి మీద బలవంతంగా రుద్దే గూండాయిజం ఏమాత్రం సహించరానిది.


ఊరకుక్కల కాట్లకు బలవుతున్న పిల్లలు, పెద్దల గురించి తెలిసిందే. ఇప్పుడు వాటికి తోడు యజమానులు పట్టించుకోకుండా వీధుల్లోకి వదలివేస్తున్న ఆవులు కూడా సమస్యగా మారుతున్నాయి. సనాతనులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఉదయం లేవగానే రోడ్ల మీద తిరుగుతున్న వాటన్నింటినీ తమ ఇండ్లకు చేర్చుకొని ఆదరిస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఎందుకు ఆపని చేయటం లేదు. ఇటీవల ఢల్లీి ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రయాణిస్తుండగా ఆకస్మికంగా ఒక ఫ్లై ఓవర్‌ మీదకు ఆవులు రావటంతో ఆకస్మికంగా డ్రైవర్‌ బ్రేకులు వేసి వాహనాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.చిత్రం ఏమిటంటే ఆమె కూడా ఒక సనాతన వాదే, ఆవులు వెళ్లేంత వరకు వాహనం దిగి చూశారు తప్ప సిబ్బందిని ఆదేశించి వాటన్నింటిని తన ఇంటికో, కార్యాలయానికో తోలుకు రమ్మని చెప్పలేదు. దేశంలో 50లక్షలకు పైగా ఆవులను రోడ్ల మీద వదలివేసినట్లు అంచనా, నిజానికి ఇంకా ఎక్కువే ఉంటాయి. యోగి ఆదిత్యనాధ్‌, పవన్‌ కల్యాణ్‌ వంటి పక్కా సనాతనవాదులు అత్యధిక రాష్ట్రాల్లో పాలకులుగా ఉన్న ఈ దేశంలో అలా బాధ్యతా రహితంగా వదలివేయటం ఏమిటి ! ఉత్తర ప్రదేశ్‌లోనే పన్నెండున్నర లక్షలు ఉన్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. బిజెపి పాలిత మహారాష్ట్రలో గోశాలల్లో ఉన్న ఒక్కో ఆవుకు రోజుకు రు.50 చెల్లిస్తున్న ప్రభుత్వం వృద్దాప్య పెన్షన్‌గా నెలకు ఇస్తున్న మొత్తం రు.1,500 అంటే ఆవుతో సమానం.బీహార్‌లో రు.400గా ఉన్న వృద్ధాప్య పెన్షన్‌ మొత్తాన్ని ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 2025జూన్‌లో నితీష్‌ కుమార్‌ సర్కార్‌ రు.1,100కు పెంచింది. అత్యంత మానవీయ కోణం ఉన్న ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని సర్కార్‌ జాతీయ సామాజిక సహాయ పథకం కింద మన్మోహన్‌ సింగ్‌ హయాంలో నిర్ణయించిన రు.200, రు.500మొత్తాలనే ఇప్పటికీ మంజూరు చేస్తున్నది. ఈ మాత్రానికే తమ వాటా ఎంత ఉందో లబ్దిదారులకు తెలపాలని కేరళ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాము ఇస్తున్న రు.1,600లలో ఎవరి వాటా ఎంతో చెప్పటానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని అక్కడి వామపక్ష ప్రభుత్వం చురక అంటించింది.

గో సంరక్షణ చట్టాలతో వట్టిపోయిన ఆవులను మేపటం రైతాంగానికి భారంగా మారుతున్నది. గతంలో వాటిని అమ్మివేస్తే వధశాలలకు తరలించేవారు. ఇప్పుడు ఆమ్ముకోవచ్చుగానీ కొనేవారెవరు ? మహారాష్ట్రలో ఉన్న జంతు సంరక్షణ చట్టాన్ని సవరించటం లేదా రద్దు చేయాలని ఏకంగా అక్కడి బిజెపి ఎంఎల్‌సి, మాజీ మంత్రి సదాశివ ఖోట్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అందుకుగాను మండిపడిన కాషాయదళాలు ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేయటమే కాదు దాడులకు పాల్పడటంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. పోలీస్‌ స్టేషన్‌ ముందు నిరసన కూడా తెలిపారు. సతారా జిల్లాలో కొందరు రైతులు తమ గేదెలను విక్రయించారు.వారికి డబ్బు చేతికి అందక ముందే గోరక్షకులమంటూ కొందరు వచ్చి వాటిని బలవంతంగా పూనే తరలించారు. రైతులు కోర్టుకు ఎక్కటంతో వారి పశువులను వెనక్కు ఇవ్వాలని ఆదేశించింది. అయితే వాటికోసం ఒక గోశాలకు వెళ్లగా అవి కనిపించలేదు. రైతులతో పాటు ఎంఎల్‌సి అక్కడ ఉండగా గోరక్షకులమంటూ వచ్చిన వారు తన మీద దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సదాశివ ఖోట్‌ చెప్పారు. మహారాష్ట్రలో వట్టిపోయిన ఆవులు, గేదెలను విక్రయించటానికి వీల్లేకపోవటంతో రైతాంగానికి అవి భారంగా మారాయి. షేత్కారి రైతు సంఘ నేత శరద్‌ జోషి, మరికొందరు ఎప్పటి నుంచో చట్టాన్ని సవరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాను మూడు దశాబ్దాలుగా రైతుల సమస్యల మీద పని చేస్తున్నానని గోరక్షకులుగా చెప్పుకుంటున్నవారు కనీసం ఒక్కసారైనా పాలు పితికిన వారు కాదని ఎంఎల్‌సి విమర్శించారు. గత కొద్ది వారాలుగా సాంప్రదాయకంగా పశువ్యాపారం చేస్తున్నవారు గోరక్షకుల పేరుతో ఉన్నవారి ఆగడాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.వారికి సదాశివ ఖోట్‌ మద్దతు ప్రకటించారు. వట్టిపోయిన పశువులకు నెలకు తొమ్మిదివేల రూపాయల వంతున మేతకు ఖర్చు చేస్తే రైతులకు వచ్చేదేమీ ఉండదని అందువలన వాటిని అమ్ముకోవటం మినహా మరొక మార్గం లేదని, అయితే గోరక్షకులమంటూ బయలుదేరిన వారు ఆ లావాదేవీలను అడ్డుకుంటున్నారని, రైతాంగానికి నష్టం కలిగిస్తున్నారని చెప్పారు.హిందూత్వ నేత మిలింద్‌ ఎక్బోటే ఒక ప్రకటన చేస్తూ ఎంఎల్‌సి పశువులను వధించేవారి తరఫున మాట్లాడుతున్నారని, రాజకీయాలనుంచి గెంటివేయాలని డిమాండ్‌ చేశారు. ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ కూడా పశువధ చేసే వారికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. అనేక రాష్ట్రాలలో పశువధ, వ్యాపారం వృత్తిగా ఖురేషీ అనే ముస్లిం తెగకు చెందిన వారు ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ మతాన్ని కూడా ముందుకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది.మహారాష్ట్రలో వట్టిపోయిన పశువుల సమస్య ముందుకు రావటం ఇదే మొదటి సారి కాదు. నిజానికి ఇది ఒక్క ఆ రాష్ట్రానిదే కాదు, పశువధ నిషేధం ఉన్న ప్రతి చోటా గోరక్షకుల పేరుతో రైతాంగాన్ని దెబ్బతీసే శక్తులు పేట్రేగిపోతాయి !

షాంఘై సహకారం : ట్రంప్‌ను హెచ్చరించిన జింపిగ్‌, భారత పర్యటన రద్దు, స్వరం మార్చిన అమెరికా !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కొన్ని సమయాలలో కొందరు మనుషులు ఎలా ప్రవర్తిస్తారో ఊహించలేం. అదే మాదిరి అంతర్జాతీయ రాజకీయాల ఎత్తులు జిత్తులలో భాగంగా సంభవించే పరిణామాలు కూడా అలాగే ఉంటాయి. ఆగస్టు 31, సెప్టెంబరు ఒకటవ తేదీలలో చైనాలోని రేవు పట్టణమైన తియాన్‌జిన్‌లో షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) 25 వార్షిక సమావేశం జయప్రదంగా జరిగింది. దాని చరిత్రలో ఇది ఒక చారిత్రక ఘట్టం అని చెప్పవచ్చు.ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పేందుకు ఈ సభ నాంది పలుకుతుందా ? పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉంటాయంటూ సానుకూలంగా, ప్రతికూలంగా ఉండే పండితులందరూ మల్లగుల్లాలు పడుతున్నారు. చైనా, భారత్‌ మధ్య వెల్లవిరిసిన స్నేహం మరింతగా విస్తరిస్తుందా లేదా అని కమ్యూనిస్టులు, పురోగామి శక్తులలో ఒకింత ఆనందం, అదే స్థాయిలో సందేహాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఒక్క ఈ తరగతికి చెందిన వారే కాదు చైనా, కమ్యూనిజాలను వ్యతిరేకించే, అమెరికాను భక్తితో కొలిచే కాషాయ దళాలు, ఇతరులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. జరుగుతున్న పరిణామాలు వారికి ఏమాత్రం మింగుడు పడటం లేదంటే అతిశయోక్తి కాదు. ఒకవైపు తియాన్‌జిన్‌లో నరేంద్రమోడీ చైనా ఎర్రజెండా కారులో ప్రయాణం, ఉపన్యాసాలు, కరచాలనాలు, ఆత్మీయపలకరింపులు జరుగుతుండగానే అమెరికాలో కలవరం మొదలై స్వరం మార్చి ప్రకటనలు చేయటం ప్రారంభించారు. ఎవరేం మాట్లాడుతున్నారో తెలియకుండా గందరగోళంగా మాట్లాడారు. తమ కౌగిలిలోకి వస్తారని భావించిన నరేంద్రమోడీ షీ జింపింగ్‌, పుతిన్‌తో చేతులు కలపటంతో డోనాల్డ్‌ ట్రంప్‌లో ఉక్రోషం కట్టలు తెగింది. ఈ ఏడాది చివరిలో తలపెట్టిన క్వాడ్‌ సమావేశంలో పాల్గొనేందుకు రావాల్సిన మనదేశ పర్యటనను రద్దు చేసుకున్నాడు. చివరి క్షణంలో మనసు మార్చుకున్నా ఆశ్చర్యం లేదు. అయితే తెగేదాకా లాగామా అన్న మలి ఆలోచనలో అమెరికన్లు పడ్డారనే చెప్పాలి.బహుశా ఆ కారణంగానే నవంబరులో వాషింగ్టన్‌తో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని మన వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ చెప్పారా ? చైనాకు దగ్గర అవుతున్నామన్న సందేశంతో అమెరికాతో మోడీ బేరమాడేందుకు పూనుకున్నారా ? ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. ఒకటి మాత్రం నిజం రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. ఎవరు తగ్గినా జనంలో గబ్బుపట్టటం ఖాయం.


షాంఘై ఐదు పేరుతో 1996 ఏప్రిల్‌ 26న చైనా, పూర్వపు సోవియట్‌ యూనియన్‌ విచ్చిన్నమైన తరువాత స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించిన రష్యా, కజకస్తాన్‌, కిర్ఖిరిaస్తాన్‌, తజికిస్తాన్‌లతో పాటు చైనా భాగస్వామిగా ఒక బృందం ప్రారంభమైంది. వాటిన్నిటికీ చైనాతో సరిహద్దు సంబంధాలు కొత్తగా ఏర్పడటంతో మిలిటరీ ఖర్చు తగ్గించుకొనేందుకు, పరస్పరం విశ్వాసం పాదుకొల్పటం వాటి ఒప్పంద అసలు లక్ష్యం. రెండవ సమావేశంలోనే బహుధృవ ప్రపంచం గురించి 1997 మాస్కో సమావేశంలో చైనా, రష్యా నేతలు ఒక ప్రకటన చేశారు. అంటే చక్రవర్తి, సామంత రాజులు అని గాకుండా ఎవరి స్వతంత్రవైఖరిని వారు కలిగి ఉండటం, పెత్తందారీ పోకడలకు దూరంగా, సహకరించుకోవటాన్ని సంకల్పంగా ప్రకటించారు. తరువాత 2001 జూన్‌ 21న ఆరవ దేశంగా ఉజ్బెకిస్తాన్ను చేర్చుకోవటమే కాదు షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) ఏర్పడి భాగస్వాముల మధ్య సహకారాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. తరువాత వివిధ సంస్థల ఏర్పాటుతో పాటు ఆర్థిక, భద్రతా విషయాల్లో కూడా చొరవ తీసుకొనేందుకు ముందుకు పోయారు. తరువాత దానిలో భారత్‌, పాకిస్తాన్‌, ఇరాన్‌, బెలారస్‌ సభ్య దేశాలుగా చేరాయి. ఇవి గాక 17దేశాలు చర్చల భాగస్వాములుగా, ఐక్యరాజ్యసమితి, ఆసియన్‌ కూటమి, పూర్వపు సోవియట్‌ రిపబ్లిక్‌లుగా ఉండి స్వతంత్రదేశాలైన వాటితో కూడిన కామనవెల్త్‌ ఇండిపెండెంట్‌ కంట్రీస్‌(సిఐఎస్‌) సంస్థ, తుర్క్‌మెనిస్తాన్‌ అతిధులుగా ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలలో ఈ దేశాలు ఉన్నాయి.మొత్తం 50 రంగాలలో సహకరించుకుంటున్నాయి. ఈ దేశాల జిడిపి 30లక్షల కోట్ల డాలర్లు ఉండగా ప్రపంచ జనాభాలో 42శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.


తియాన్‌జిన్‌ సమావేశాన్ని ప్రారంభించి చైనా నేత షీ జింపింగ్‌ పేరు ప్రస్తావించకుండానే అమెరికాకు తీవ్రమైన హెచ్చరిక చేశాడు. ప్రచ్చన్న యుద్ధ మానసిక స్థితి నుంచి బయటపడాలని, అంతర్జాతీయ సంబంధాలలో అదిరించి బెదిరించే ఎత్తుగడలు, కూటముల ఘర్షణలు సాగవని, నిజాయితీ, న్యాయంతో వ్యవహరించాలని ప్రపంచ నేతలను కోరాడు.సంస్థ సభ్యదేశాలు భద్రత, అభివృద్ధి రంగాలలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని, సవాళ్లు కూడా ఉన్నాయని చెప్పాడు.మిలిటరీ వ్యవహారాల్లో పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు ప్రారంభమైన ఎస్‌సిఓ ఇప్పుడు సరిహద్దులను అధిగమించి స్నేహ బంధంగా, పరస్పర విశ్వాసం,సహకారంతో విస్తరించిందని, ఈ స్పూర్తిని ముందు ముందు కూడా కొనసాగించాలని షీ జింపింగ్‌ ఆకాంక్షించాడు.విబేధాలను పక్కన పెట్టి పరస్పర లాభదాయకమైన అంశాల మీద కేంద్రీకరించాలని, ఆచరణ ప్రాతిపదికన నిజమైన ఫలితాల సాధన, ఉన్నతమైన సామర్ధ్యంతో వ్యవహరించాలని కోరాడు. సభ్యదేశాలన్నీ స్నేహితులు, భాగస్వాములే అన్నాడు. విబేధాలను గౌరవించాలని, వ్యూహాత్మక సంప్రదింపులతో ఏకాభిప్రాయ సాధనకు రావాలని కోరాడు. భద్రత, ఆర్థికపరమైన సహకారంలో భాగంగా సాధ్యమైనంత త్వరలో ఎస్‌సిఓ అభివృద్ధి బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకుందామని షీ ప్రతిపాదించాడు.ఈ ఏడాదే సభ్యదేశాలకు తాము రెండు బిలియన్‌ యువాన్ల మేర గ్రాంట్లు ఇస్తామని, వాటితో పాటు పది బిలియన్‌ యువాన్లు రానున్న మూడు సంవత్సరాలలో సభ్యదేశాల బాంకుల కన్సార్టియంకు రుణాలు కూడా ఇస్తామన్నాడు. కూటమి దేశాలలో ఇప్పటి వరకు చైనా 84బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది, దాని వాణిజ్య లావాదేవీల విలువ 2024లో 890 బిలియన్‌ డాలర్లు దాటింది. ప్రపంచ జిడిపిలో 23, జనాభాలో 42, ప్రపంచ చమురు నిల్వల్లో 20, గ్యాస్‌లో 44శాతాల చొప్పున ఈ కూటమి దేశాలు కలిగి ఉన్నాయి. ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకులకు పోటీగా పెద్దగా షరతులు లేకుండా బ్రిక్స్‌ కూటమి నూతన అభివృద్ది బ్యాంకును కూడా ఏర్పాటు చేసింది, ఇప్పుడు షాంఘై సహకార సంస్థ కూడా మరో బ్యాంకును ఏర్పాటు చేసేందుకు పూనుకుంది.


షాంఘై సహకార సంస్థ సమావేశాలకు ముందే ఆదివారం నాడు షీ జింపింగ్‌ మరియు నరేంద్రమోడీ భేటీ జరిగింది.చైనాతో సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవాలని వాంఛిస్తున్నట్లు మోడీ చెప్పారు. భారత్‌పై అమెరికా పన్నులు, జరిమానాలు అమల్లోకి వచ్చిన తరువాత జరిగిన ఈ సమావేశానికి పరిశీలకులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. పరస్పర మన్నన, విశ్వాసం, సున్నితత్వాల ప్రాతిపదికన ఇరుదేశాల సంబంధాలను పెంచుకొనేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు మోడీ పేర్కొన్నారు. ఏడు సంవత్సరాల తరువాత చైనాను తొలిసారిగా సందర్శించారు. ఇరుదేశాల సంబంధాలను మరింతగా ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని, నిరంతరం ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన అభివృద్దిని ముందుకు తీసుకుపోవాలని షీ జింపింగ్‌ ప్రతిస్పందించాడు. ఇరు దేశాల సంబంధాలలో సరిహద్దు సమస్యల నిర్ధారణ అంశాన్ని ముందుకు తేవద్దని, రెండు దేశాల ఆర్థిక అభివృద్ధి మీద ప్రధానంగా కేంద్రీకరించాలని, మనం ప్రత్యర్ధులు గాకుండా భాగస్వాములుగా ఉండాలని కట్టుబడి ఉన్నంతకాలం బెదిరింపులుగాక అభివృద్ధి అవకాశాల మీద దృష్టిపెట్టాలని రెండు దేశాల సంబంధాలు మరింతగా ముందుకు పోయి ఫలించాలన్నాడు.


ఈ వాంఛలను రెండు దేశాలూ వెల్లడిరచటాన్ని చైనాకు భారత్‌ మరింత దగ్గర అవుతున్నట్లు అమెరికా పరిగణిస్తోంది. సరిహద్దుల యాజమాన్యం గురించి ఒక ఒప్పందం, సరిహద్దు వాణిజ్యం, వీసాలు, విమానాల రాకపోకల పునరుద్దరణ, చైనా పెట్టుబడులకు అనుమతి, టిబెట్‌లోని మానససరోవరాన్ని భారత యాత్రీకులకు తెరవటం, విలువైన ఖనిజాలు, ఉత్పత్తులపై గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేయటం, ఎరువుల సరఫరా పునరుద్దరణ, సొరంగాలను తవ్వే యంత్రాల సరఫరా, అన్నింటికీ మించి చైనా కమ్యూనిస్టు పార్టీలో ప్రముఖుడు, విదేశాంగ మంత్రిగా ఉన్న వాంగ్‌ యి భారత పర్యటనలను ముఖ్యంగా డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారానికి వచ్చి ఏడాది కూడా గడవక ముందే ఇవన్నీ జరగటాన్ని అమెరికా జీర్జించుకోలేకపోతోంది. వీటితో పాటు షాంఘై సహకార సంస్థ అమెరికా నాయకత్వంలోని నాటో మిలిటరీ కూటమికి పోటీగా తయారు అవుతుందేమో అన్న భయం కూడా దాన్ని పట్టిపీడిస్తోంది. నిజానికి అలాంటి ఆలోచనలు కూటమిలోని ఏ దేశ అంజండాలో కూడా లేదు. పశ్చిమదేశాల అధికార కూటములకు భిన్నంగా నూతన అంతర్జాతీయ సంబంధాలకు ప్రయత్నిస్తున్నట్లు పాతిక సంవత్సరాల తీరు తెన్నులు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా పెత్తందారీతనాన్ని వ్యతిరేకించటం అంటే మరో మిలిటరీ కూటమిని కట్టటం కాదు.


నాటో, ధనికదేశాలతో కూడిన జి7, ఐరోపా సమాఖ్యకు పోటీగా తయారవుతుందేమో అన్న భయ సందేహాలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి అజెండా ఎస్‌సిఓలో ఇంతవరకు లేదు. బ్రిక్స్‌, ఎస్‌సిఓ రెండూ కూడా విస్తరణ దశలో ఉన్నాయి. స్థానిక కరెన్సీలతో వాణిజ్య లావాదేవీలు జరపాలనటంలో వాటి మధ్య ఏకీభావం ఉంది. తొలుత అది విజయవంతమైన తరువాత డాలరుకు పోటీగా మరోకరెన్సీని తీసుకురావచ్చు. రష్యా, భారత్‌, చైనాలతో కూడిన(రిక్‌) కూటమి గురించి కూడా కొందరు చర్చిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి ఆ దిశగా ఎలాంటి పరిణామాలు లేవు.అమెరికా చేసే దాడుల తీవ్రతను బట్టి అజెండాలోకి రావచ్చు. తెగేదాకా లాగినట్లు భావించి లేదా దిద్దుబాటు చర్యల్లో భాగంగా అమెరికా స్వరం మార్చింది. గత కొన్ని దశాబ్దాలుగా వాణిజ్యంలో భారత్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న తమనేత ట్రంప్‌ వ్యాఖ్యల పూర్వరంగంలో రెండు దేశాలూ ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చునని విత్తమంత్రి స్కాట్‌ బెసెంట్‌ వ్యాఖ్యానించాడు.తాము భారత్‌ నుంచి ఎంతో ఎక్కువగా కొనుగోలు చేయగా తమ నుంచి తక్కువ దిగుమతి చేసుకున్నట్లు ట్రంప్‌ చెప్పాడు. తమ వస్తువుల మీద ఎలాంటి పన్నులు ఉండవని భారత్‌ చెప్పిందనీ అయితే ఇప్పటికే సమయం మించిపోయింది గనుక తాను వెనక్కు తగ్గేదేలేదన్నట్లు మాట్లాడాడు. బెసెంట్‌ ఫాక్స్‌ టీవీతో మాట్లాడుతూ విబేధాలను కూడా పరిష్కరించుకోవచ్చన్నాడు. అన్ని అవకాశాలూ తమ ముందు ఉన్నాయని చెప్పాడు. చిత్రం ఏమిటంటే ట్రంప్‌ కంటే ముందు అమెరికా మరియు భారత సంబంధాల గురించి అమెరికా రాయబార కార్యాలయం పొగిడిరది. ఇరుదేశాల సంబంధాలు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాయంటూ తమ విదేశాంగ మంత్రి మార్క్‌ రూబియో చేసిన వ్యాఖ్యలను అది ఉటంకించింది. ట్రంప్‌ వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే బెసెంట్‌ భారత్‌ను సంతుష్టీకరించే స్వరంతో మాట్లాడాడు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్పాడు. షాంఘై సహకార సంస్థ సమావేశం మొత్తం మీద నాటకీయ వ్యవహారం, తద్దినం లాంటిదని, భారత్‌ ప్రపంచంలో అత్యధిక జనాభాగల ప్రజాస్వామిక దేశం, వారి విలువలు చైనా, రష్యాల కంటే అమెరికాకే దగ్గరగా ఉంటాయన్నాడు. అధ్యక్షుడు, రాయబార కార్యాలయం, ఇద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను చూసినపుడు వారి మధ్య సమన్వయం లేకపోవటంతో పాటు నష్టనివారణకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తంగా చూసినపుడు భారత్‌ను దువ్వేందుకు అమెరికా పూనుకుంది. ఈ నెలలో ఐరాస సమావేశాలకు వెళ్లిన సమయంలో ప్రధాని నరేంద్రమోడీ బృందం ట్రంప్‌తో భేటీ కానున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి, అది జరుగుతుందా లేదా జరిగితే ఏమిటి అన్నది చూడాల్సివుంది !

పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ : ముగ్గురు పిల్లల్ని కనాలంటున్న బ్రహ్మచారి ఆర్‌ఎస్‌ఎస్‌ మోహన భగవత్‌ !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

మీ కుటుంబంలో తరతరాల వారికి పుణ్యం రావాలంటే కాశీ దాకా తాటిపట్టె మీద దేకమన్నాడట ఒక సనాతనవాది. ముడ్డి మీది కాదుగనుక ఏమైనా చెబుతారు మీ పుణ్యం వద్దు మీరు వద్దు అంటూ ఒక పామరుడు చక్కాలేచిపోయాడని ఒక కథ.జనాభా తగ్గకుండా ఉండాలంటే ప్రతి మహిళ కనీసం ముగ్గురు పిల్లలను కనాలని బ్రహ్మచారి అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ సంఫ్‌ు వందేళ్ల సభలో చెప్పారు. మోసే గాడిదలకు తెలుస్తుంది మోపిన బరువెంతో అన్నట్లుగా పిల్లలున్నవారికి తెలుస్తుంది వారిని పెంచటంలో ఉన్న ఇబ్బంది. బ్రహ్మచారులు, కుటుంబ జీవనం లేని సాధువులు, సన్యాసులు, సాధ్విలకు ఏమి తెలుస్తుంది. మోహన్‌ భగవత్‌ ముగ్గురు పిల్లల గురించి చెప్పటం ఇదే మొదటిసారి కాదు. అయితే సంఘపరివార్‌ సభ్యులు లేదా దాని గురించి గొప్పగా చెప్పుకొనే వారు ఎంత మంది ముగ్గురు పిల్లలను కంటున్నారన్నది సమస్య.వారు ఎప్పటి నుంచో చెబుతున్నా జనాలు పట్టించుకోవటం లేదు. జననాల రేటు తగ్గుతూనే ఉంది. అయినా చెబుతూనే ఉండటం వెనుక పెద్ద ఓట్ల రాజకీయం ఉంది. అయితే జనాభా తగ్గుదల గురించి ఇతరులు అనేక మంది చెబుతున్నారు గదా భగవత్‌ చెప్పిందాంట్లో తప్పేముందని ఎవరైనా అడగవచ్చు. నిజమే, ముఖ్యమంత్రులు స్టాలిన్‌, చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు తప్పు వారు మతాన్ని జోడిరచలేదు. అదే అసలు సమస్య. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి 2022 అక్టోబరులో జనాభా అదుపుకు సమగ్ర విధానం ఉండాలని, మత ప్రాతిపదికన అసమతూకం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మనదేశంలోకి ఇస్లాం, క్రైస్తవం రాకముందు ఇక్కడ పుట్టిన మతాలు తప్ప మరొకటి లేవుగా, మరి అవి జనానికి ఒరగబెట్టిందేమిటి. అందరూ ఒకే మతం వారంటూ సమానంగా చూసిన పాపాన పోలేదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కులవివక్ష, పీడన అదనంగా ప్రసాదించటం తెలిసిందే.

నేడు దేశంలో ఉన్న వాతావరణం ఏమిటి ? హిందూ మతం బతికి బట్టకట్టాలంటే హిందువులు ఎనిమిది నుంచి పది మంది పిల్లలను కనాలని ఆర్‌ఎస్‌ఎస్‌ గుంపుకు చెందిన విశ్వహిందూ పరిషత్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా చెప్పారు.ఆయన కన్నది ఇద్దరిని, అలాంటి వారి కబుర్లన్నీ ఇలాగే ఉంటాయి. బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ నలుగురిని కనాలన్నారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 2006 ఏప్రిల్‌ 20వ తేదీన ‘‘కాషాయ జనాభా శాస్త్రం ’’ పేరుతో ప్రచురించిన విశ్లేషణ వివరాల ప్రకారం విశ్వహిందూ పరిషత్‌ అధ్యక్షుడు అశోక్‌ సింఘాల్‌ 2004లో మాట్లాడుతూ హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనకపోవటం ఆత్మహత్యా సదృశ్యమన్నారు.2005 ఫిబ్రవరిలో విహెచ్‌పి మార్గదర్శక మండల్‌ సమావేశంలో శ్రీకృష్ణుడి తలిదండ్రుల మాదిరి సంతానాన్ని కనాలంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు.సుభాష్‌ చంద్రబోస్‌ కృష్ణుడి మాదిరి ఎనిమిదవ సంతానమని, రవీంద్రుడు తొమ్మిదవ సంతానమని దానిలో పేర్కొన్నారు.హిందూ మహిళలు విచ్చల విడిగా అబార్షన్లు చేయించుకోకుండా చూడాలని విహెచ్‌పి కోరింది.ముస్లింల జనాభా అదుపులేకుండా పెరుగుతోందని, వారికి పోటీగా హిందువులు పిల్లలను ఎక్కువగా కనాలని హరిద్వార్‌లో జరిగిన విశ్వహిందూపరిషత్‌ మార్గదర్శక్‌ మండల్‌ పిలుపు ఇచ్చిందని రెడిఫ్‌ న్యూస్‌ 2006 జూన్‌ 15న ‘‘ హిందువులు జనాభాను పెంచాలని కోరిన విహెచ్‌పి ’’ అనే శీర్షికతో వార్త ఇచ్చింది. ఇలా కాషాయ గుంపునేతల మాటలను ఎన్నయినా ఉటంకించవచ్చు. హిందూ జాతి అంతరిస్తున్నదని, మతానికి ముప్పు వచ్చిందని, త్వరలో ముస్లిం జనాభా మెజారిటీగా మారుతుందని హిందూ మహాసభ నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులంతా పదే పదే చేస్తున్న గోబెల్స్‌ ప్రచారం తెలిసిందే.జనాభా సమతూకంలో ఉండాలని చెబుతారు.ఇప్పుడు ముస్లింల గురించి చెబుతున్నప్పటికీ తరువాత హిందువుల్లో ఏ కులం వారు ఎందరుంటే సమతూకం ఉంటుందో కూడా నిర్దేశించరని, సమాజం సమతూకంగా ఉండాలంటే చాతుర్వర్ణ వ్యవస్థ ఉండాలనే అజెండాను ముందుకు తీసుకురారనే హామీ ఏముంటుంది. అంటే వీరు చెప్పినట్లే జనం కులం, మతాన్ని పాటించాలి, ఎందరు పిల్లల్ని కనమంటే ఆ సంఖ్యలోనే కనాలి.


జనాభా పెరుగుదల తరుగుదల సమస్యలను మతకోణంలో చూడటం అవాంఛనీయ వైఖరి. ముస్లిం ఛాందసులు అధికారంలో ఉన్న ఇరాన్‌లో సంతానోత్పత్తి రేటు పడిపోతున్నది. 1950లో అక్కడ 6.9 ఉండగా 2024లో 2.08కి తగ్గింది. క్రైస్తవుల్లో కూడా ఛాందసులు తక్కువేమీ కాదు, కానీ ఐరోపాలో సంతానోత్పత్తి రేటు 1.5, సగం ఐరోపా, సగం ఆసియాలో ఉన్న టర్కీ ముస్లిం దేశం, అక్కడ కూడా అంతే ఉంది.ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న దేశాలను ముస్లిం దేశాలని పిలుస్తున్నారు.2011నుంచి 21 సంవత్సరాల కాలంలో ఈ దేశాల్లో సంతనోత్పత్తి రేటు 3.3 నుంచి 2.7కు తగ్గింది.విద్య, పట్టణీకరణ, ఆర్థిక, సామాజిక,ఆరోగ్య, శిశుమరణాలు తదితర పరిస్థితులను బట్టి తప్ప ప్రపంచంలో ఎక్కడా మత ప్రాతిపదికన పిల్లలను కనటం, మానటం లేదు. మేం సనాతనులం, పక్కా హిందువులం అని చెప్పుకుంటున్న కుటుంబాలలో తొగాడియా చెప్పినట్లు ఎంత మంది పదేసి మంది పిల్లలు కలిగి ఉన్నదీ చెప్పమనండి. తమ ఉన్మాద చర్యలకు ఉపయోగించుకోవటం తప్ప ఏ మతమూ పిల్లల బాగోగులకు బాధ్యత తీసుకోవటం లేదు.


2019 నుంచి 21 వరకు జరిగిన ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం జాతీయ స్థాయిలో సంతానోత్పత్తి రేటు 2.1 ఉంటే దక్షిణాది రాష్ట్రాలలో 1.64,ఉత్తరాదిన 2.0, పశ్చిమాన 1.81, తూర్పున 2.0, మధ్య ప్రాంతంలో 2.1 ఈశాన్య ప్రాంతంలో 2.15 ఉంది. రాష్ట్రాలన్నింటా ఒకే విధంగా లేదు.బీహార్‌లో 3.02, పక్కనే ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో 2.38, దాన్నుంచి ఏర్పాటు చేసిన ఉత్తరా ఖండ్‌లో 1.87, పశ్చిమ బెంగాల్లో 1.56 పక్కనే ఉన్న ఒడిషాలో 2.14 చొప్పున ఉంది. ఒకే రాష్ట్రంలో చూస్తే గుజరాత్‌ గ్రామీణంలో 2.15, పట్టణాల్లో 1.63, మధ్యప్రదేశ్‌లో 2.23 1.62, తెలంగాణాలో 1.95 1.63, ఆంధ్రప్రదేశ్‌లో 1.74 1.62 ఉంది.రెండు తెలుగు రాష్ట్రాలు, దేశమంతటా కాషాయదళాలు చెప్పినట్లుగా హిందువులు ఎనభైశాతం ఉన్నప్పటికీ సంతానోత్పత్తి ఒకే విధంగా ఎందుకు లేదు ? 201516 జాతీయ కుటుంబ సర్వే వివరాల ప్రకారం అత్యంత ఎక్కువ విద్యావంతులున్న జైన్‌ సామాజిక తరగతిలో 1.2శాతమే. ఇంత తక్కువ ఏ సామాజిక తరగతిలోనూ లేదు. అత్యంత పేదల్లో 3.2 ఉండగా ధనికుల్లో 1.5 మాత్రమే ఉంది. ముస్లిం సామాజిక తరగతిలో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉండటానికి వారు ఆలశ్యంగా మేలుకోవటమే. దానికి కుట్ర సిద్దాంతాలతో విద్వేష ప్రచారం చేయటం తగనిపని.దేశంలోని కొన్ని ప్రాంతాలలో మైనారిటీలు పైచేయి సాధించటాన్ని నివారించాలంటే పెద్ద హిందూ కుటుంబాలు ఉండాలని, ఉన్నత హిందూ కుటుంబాల వారు కుటుంబనియంత్రణ గురించి తీవ్రంగా సమీక్షించుకోవాని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే కేరళలోని కొచ్చిలో 2013లో జరిగిన ఒక సభలో పిలుపునిచ్చారు. కుటుంబ నియంత్రణ అన్నది హిందువులకు ఇంకేమాత్రం వ్యక్తిగత సమస్య కాదని, ఒక బిడ్డ చాలని వారు అనుకుంటే ముస్లింలు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారని విశ్వహిందూ పరిషత్‌ నేత చంపత్‌ రాయ్‌ 2015లో ఒక పత్రికా గోష్టిలో చెప్పారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు పిల్లల్ని కనాలని చెబుతున్నారు సరే, వారి బాగోగుల గురించి శ్రద్ద తీసుకోవాలని తమ మార్గదర్శకత్వంలో నడిచే కేంద్రం, 15 రాష్ట్ర ప్రభుత్వాలు, వారికి మద్దతుగా ఉన్న మరో ఆరు మిత్ర ప్రభుత్వాలకు ఎందుకు చెప్పటం లేదు ? ఎంత సేపటికీ మతం తప్ప శిశుసంరక్షణకు కేటాయింపులు, వివిధ పథకాల వైఫల్యం గురించి మీడియాలో వస్తున్న విశ్లేషణలు వారికి పట్టవా, కనిపించవు, వినిపించవా ! మతంతో నిమిత్తం లేకుండా ఎంతమంది పిల్లలు ఉన్నా ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి ఒక్క బిడ్డకు ఏడాదికి రు.44వేల చొప్పున మూడు స ంవత్సరాల పాటు నగదు ఇచ్చే పధకాన్ని చైనా ప్రవేశపెట్టింది. వారి జనాభా మనతో సమానంగా ఉంది. హంగరీలో ముగ్గురు అంతకంటే ఎక్కువ పిల్లలుంటే పన్నుల రాయితీ, గృహరాయితీ, పోలాండ్‌లో రెండవ బిడ్డ తరువాత ఎందరుంటే అందరికీ నెలవారీ నగదు, రష్యాలో 25 ఏండ్ల లోపు యువతులు పిల్లలను కంటే నగదు బదిలీ, అమెరికాలో తొలిసారి తల్లులయ్యేవారికి బేబీ బోనస్‌ పేరుతో ఐదువేల డాలర్లు, దక్షిణ కొరియాలో కూడా రాయితీలు ఇస్తున్నారు. నేటి పిల్లలే రేపటి పౌరులు అని కబుర్లు చెప్పటం తప్ప వారి సక్రమపెరుగుదలకు మనదేశంలో తీసుకుంటున్న చర్యలేమిటి ? కార్పొరేట్‌ కంపెనీలకు గణనీయంగా పన్ను మొత్తాలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం మరోవైపున శిశు సంరక్షణ కేటాయింపులకు కోత పెడుతున్నది.


పోషకాహార లేమితో పిల్లలు గిడసబారి పోవటం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవటం, రక్తహీనత వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. పేద పిల్లల్లో ఉండాల్సినదానికంటే బరువు తక్కువగా ఉంటే, ధనికుల పిల్లల్లో హానికరమైన ఊబకాయం సమస్య పెరుగుతోంది. ఐదేండ్లలోపు పిల్లలు 35.5శాతం మంది పోషకాహారం లేక గిడసబారినట్లు, 19.3శాతం ఎత్తుకు తగ్గ బరువు లేరని, 32.1శాతం మంది బరువు తక్కువ, మూడు శాతం ఎక్కువ బరువు ఉన్నట్లు 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది.49 ఏండ్ల పురుషుల్లో 25, మహిళల్లో 57శాతం మందికి రక్తహీనత ఉంది.దేశంలో 74శాతం జనాభాకు ఆరోగ్యవంతమైన ఆహారం లేదని సర్వేలు తెలుపుతున్నాయి, ఆకలి సూచికలో మనం దిగువన ఉన్నాం. ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్‌ అని ఎన్నడో మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన పరిస్థితులే నేడు కూడా ఉన్నాయని చెప్పుకోవాల్సి రావటం సిగ్గుచేటు. బాల్యంలో పోషకాహారలోపం ఉంటే అది ఆర్థిక వ్యవస్థకు నష్టమేగాక ఆరోగ్యపరంగా భారంగా మారుతున్నది. అంగన్‌వాడీల నుంచి ఆరేండ్లలోపు పిల్లలు కేవలం 50.3శాతమే ఏదో ఒక సేవను పొందుతున్నారు. కేంద్ర బడ్జెట్‌, రాష్ట్రాల బడ్జెట్ల గురించి పాలకులు గొప్పలు చెప్పుకోవటం తప్ప పిల్లల సంక్షేమానికి కేటాయిస్తున్నదేమిటి ? 2017 కేంద్ర బడ్జెట్‌లో 3.2శాతం కేటాయిస్తే 2021లో అది 1.9శాతానికి తగ్గి 2024లో 2.3దగ్గర ఉంది. జిడిపిలో 2000సంవత్సరంలో 0.12శాతం కాగా 2024కు 0.10కి తగ్గింది. బీహార్‌లో 2020 నుంచి 2022వరకు మూడు సంవత్సరాల్లో కేటాయించిన బడ్జెట్లో ఖర్చు చేసిన మొత్తాలు 83,76,77శాతాలు మాత్రమే ఉన్నాయి.దేశానికి ఆదర్శంగా చెప్పిన గుజరాత్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పరిగణిస్తారు. అక్కడ నరేంద్రమోడీ ఏలుబడి సాగింది. రక్తహీనతలో అగ్రస్థానంలో దేశానికే ‘‘ ఆదర్శం ’’గా ఉంది !

జిఎస్‌టి స్లాబుల తగ్గింపు : మాయల మరాఠీలను తలదన్నే నరేంద్రమోడీ మహాగారడీ మామూలుగా లేదుగా !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


దీపావళి కానుకగా వస్తు,సేవల పన్ను(జిఎస్‌టి) భారాన్ని తగ్గించనున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. దీనికి మీడియాలో ఇప్పటికే పెద్ద ప్రచారం వచ్చింది. సిద్దం సుమతీ అన్నట్లు కాచుకొని ఉండే కాషాయ దళాలు భజన ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం 12,28 పన్ను శ్లాబులను రద్దు చేసి ఐదు, 18శాతం స్లాబులకు అంగీకరించగా, జిఎస్‌టి మండలి నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే పన్నెండు, 28శాతాలలో ఉన్న వస్తువులను దేనిలో కలుపుతారు అన్నది ఇంకా ఖరారు కాలేదు. ఈ చర్యతో కలిగే లాభాలు, నష్టాల గురించి మీడియాలో విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాటి మంచి చెడ్డల గురించి మాట్లాడుకొనే ముందు ఇప్పుడున్న తీరు తెన్నులేమిటో చూద్దాం. ప్రతిదాన్లో ఉన్నట్లు మంచీ చెడు ఉంటాయి, ఏదెక్కువ అన్నదే గీటురాయిగా ఉండాలి.


జిఎస్‌టి కూడా ప్రపంచబ్యాంకు ఆదేశిత విధానమే. విదేశీ కంపెనీలు, వస్తువులకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అమ్మకపు పన్ను విధించటంతో వాటికి తలనొప్పిగా ఉండి దేశమంతటా ఒకే పన్ను విధానం తీసుకురావాలని వత్తిడి తెచ్చిన ఫలితమే ఇది. దీన్ని అమలు చేయాలని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 115వ రాజ్యాంగ సవరణ బిల్లును బిజెపి, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ వ్యతిరేకించారనే అంశం చాలా మందికి గుర్తు ఉండి ఉండదు. బిజెపికి మద్దతు ఇచ్చే వ్యాపారవర్గం పన్నుల ఎగవేతకు అవకాశాలు ‘‘ తగ్గుతాయని ’’ వ్యతిరేకించినట్లు కూడా చెబుతారు. రాజకీయ నేతలు ఎల్లవేళలా కుడి, ఎడమ జేబుల్లో పరస్పర విరుద్దమైన ప్రకటనలు పెట్టుకొని సంచరిస్తూ ఉంటారట. ఏది వాటంగా ఉంటే దాన్ని బయటకు తీస్తారు. జిఎస్‌టి బిల్లు తిరోగామి స్వభావం కలిగినదని, సమాఖ్య ఆర్థిక మూలాలకు పూర్తిగా వ్యతిరేకమని ముఖ్యమంత్రి పాత్రలో 2011 ఫిబ్రవరి 11న వాదించిన రాజనీతిజ్ఞుడు మోడీ. ప్రధాని హోదాలో దానికి పూర్తి విరుద్దంగా రెండో జేబులో ఉన్న ప్రకటన బయటకు తీశారు.(మోడీ కంటే రెండాకులు ఎక్కువ చదివిన చంద్రబాబు స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్ల గురించి ప్రతిపక్షంలో ఉండగా చెప్పినదానికి అధికారానికి వచ్చిన తరువాత మాట మార్చినట్లు ) తన ప్రభుత్వం ముందుకు తెచ్చిన జిఎస్‌టి బిల్లు గురించి 2016 ఆగస్టు 9న పార్లమెంటులో మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రిగా తనకు సందేహాలు ఉండేవని ఇప్పుడు అవి ఒక ప్రధానిగా ఆ సమస్యలను పరిష్కరించటాన్ని సులభతరం చేసిందని చెప్పుకున్నారు. దానికి తోడు అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రణబ్‌ ముఖర్జీతో కూడా అనేక సార్లు చర్చించినట్లు చెప్పుకున్నారు.(మోడీ సందేహాలను ఆయన తీర్చని కారణంగానే బిల్లును వ్యతిరేకించారా) అదియును సూనృతమే ఇదియును సూనృతమే అని వంది మాగధులు తాళం వేశారు.2017 జూలై ఒకటి నుంచి జిఎస్‌టి అమల్లోకి వచ్చింది.తరువాత కొన్ని శ్లాబుల్లో వస్తువుల జాబితా మార్పు, పన్ను రేటు పెంపుదల వంటివి జరిగాయి.


ప్రతి వంద రూపాయల జిఎస్‌టి రాబడిలో ఏ స్లాబ్‌ నుంచి ఎంతవస్తున్నదంటే ఐదుశాతం ఉన్న వస్తువుల ద్వారా ఏడు రూపాయలు, పన్నెండు శాతం ఉన్నవాటితో ఐదు, పద్దెనిమిదిశాతం వాటితో 65, విలాసవస్తువుల జాబితాలో ఉన్న 28శాతం నుంచి పదకొండు రూపాయలు వస్తున్నాయి. మీడియా రాస్తున్న ఊహాగానాల ప్రకారం పన్నెండుశాతం శ్లాబులో ఉన్న జాబితాలో 99శాతం వస్తువులను ఐదు శాతం స్లాబులో చేరుస్తారు.తొంభై శాతం వస్తువుల మీద పన్ను మొత్తాన్ని 28 నుంచి 18శాతానికి తగ్గిస్తారు.పాపపు పన్ను వస్తువులు అంటే పొగాకు ఉత్పత్తులు, పాన్‌ మసాలా వంటి ఐదు లేదా ఏడు ఉత్పత్తులను 40శాతం మరియు సెస్‌ విధించే ప్రత్యేక శ్లాబులో ఉంచుతారు. బంగారం మీద మూడుశాతం మారదు, వజ్రాల మీద 0.25 నుంచి 0.5శాతానికి పెంచవచ్చు.ఈ కసరత్తు తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత రాబడి తగ్గుతుంది లేదా వినియోగదారులకు ఎంత మేరకు ఉపశమనం కలుగుతుంది అంటే ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ ఏటా 1.45శాతం అంటే రు.32 వేల కోట్లు మాత్రమే అని చెప్పారు. ఇతరులు రు.60 వేల నుంచి 1.8లక్షల కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఒక నిర్ణయం జరిగి కొన్ని నెలల రాబడి చూసిన తరువాత మాత్రమే ఏది వాస్తవం అన్నది చెప్పగలం. ఒకటి మాత్రం ఖాయం జనానికి తగ్గేది స్వల్పం.


దేశంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు అనుగుణంగా నిజవేతనాలు పెరగకపోవటంతో వస్తువినియోగం తగ్గుతున్నది. ఇది కార్పొరేట్‌ శక్తులకు ఆందోళన కలిగిస్తున్నది. అందువలన వినియోగాన్ని పెంచాలంటే హెలికాప్టర్‌ మనీ అంటే నేరుగా నగదు ఇవ్వాలని కరోనా సమయంలో కొందరు సూచించారు. మరొకటి పన్నుల తగ్గింపు ఒక మార్గంగా చెబుతున్నారు. అందుకే 28శాతం ఉన్న వస్తువులను 18శాతంలోకి మార్చేందుకు పూనుకున్నారు. గత ఏడాది కాలంగా శ్లాబుల తగ్గింపు గురించి మధనం జరుగుతున్నది. 2024 డిసెంబరులో 55వ జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశంలో చర్చకు పెట్టారు. కొన్ని వస్తువుల మీద పన్ను తగ్గింపు ద్వారా వచ్చే దీపావళి పండుగ తరుణంలో రు.4.25 లక్షల కోట్ల మేర వినియోగాన్ని పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచిన సమాచారం ప్రకారం 2018లో జిఎస్‌టి ద్వారా వచ్చిన రాబడి రు.11,77,380 కోట్లు. సగటున నెలకు రు.98వేల కోట్లు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధరల పెరుగుదల, కొన్ని వస్తువుల మీద పన్ను పెరుగుదల వంటి కారణాలు కూడా తోడై 2024లో రు.20,12,720 కోట్లకు అంటే సగటున రు.183వేల కోట్లకు పెరిగింది. సహజన్యాయం లేదా సామాజిక న్యాయం ప్రకారం అధిక ఆదాయం కలిగిన వారు ఎక్కువ మొత్తం పన్ను చెల్లించాలి, ఆ మేరకు తక్కువ రాబడి కలిగిన వారికి ఉపశమనం కలగాలి. ఆదాయపన్ను విషయంలో అదే జరుగుతున్నది. అదే జిఎస్‌టికి ఎందుకు వర్తించదు ?


ఫ్రాన్సు రాజధాని పారిస్‌ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ పాలసీ రీసెర్చ్‌ (సిఇపిఆర్‌) సంస్థ మన జిఎస్‌టి మీద ఒక అధ్యయనం చేసింది. జనాభాలో దిగువ 50శాతం మంది నుంచి 25శాతం రాబడి వస్తుండగా వారు వినియోగిస్తున్న వస్తు, సేవల వాటా 20 నుంచి 25శాతం మధ్య ఉంది.ఎగువ మధ్యతరగతిలోని 30శాతం మంది నుంచి రాబడి 35శాతం కాగా వినియోగం 35 నుంచి 38శాతం ఉంది. అదే ఎగువ 20శాతం నుంచి వస్తున్న మొత్తం 40శాతం కాగా వినియోగిస్తున్నది 45శాతంగా ఉందని మన కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఎస్‌ఎస్‌ఓ దగ్గర ఉన్న గణాంకాలను విశ్లేషించి చెప్పింది. ఇప్పుడున్న విధానం ప్రకారం అంబానీ, అదానీ, వారి దగ్గర పని చేసే దిగువ సిబ్బందిలో ఇద్దరు ఒకే షాపులో పండ్లుతోముకొనే బ్రష్‌లను కొనుగోలు చేస్తే నలుగురి మీద విధించే పన్ను మొత్తం ఒక్కటే. మొదటి ఇద్దరు జేబులో ఎంత తగ్గిందో అసలు చూడరు, కానీ పనివారు ఒకటికి రెండుసార్లు మిగిలి ఉన్న మొత్తాన్ని లెక్కపెట్టుకుంటారు. ఎందుకంటే ఆదాయ అసమానత. చూశారా చట్టం ముందు అందరూ సమానులే, సమానత్వం ఎంత చక్కగా అమలు జరుగుతోందో అని కొందరు తమ భుజాలను తామే చరుచుకుంటారు.


ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త థామస్‌ పికెట్టీ, మరో ప్రముఖుడు ల్యూకాస్‌ ఛాన్సెల్‌ ఒక అధ్యయనం చేశారు. అదేమంటే 1922 నుంచి 2015 మధ్య కాలంలో మనదేశంలో జరిగిన ఆదాయ అసమానత పరిణామాలను పరిశీలించారు. బ్రిటీష్‌ రాజ్యం నుంచి బిలియనీర్ల రాజ్యం వరకు అంటూ తమ పరిశీలనకు పేరు పెట్టారు. పేరుకు మనది గణతంత్ర రాజ్యం అని రాసుకున్నప్పటికీ గతంలో బ్రిటీష్‌ వారు పాలిస్తే ఇప్పుడు వారి స్థానంలో బిలియనీర్లు ఉన్నారు.1922ను ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నారు అంటే అదే ఏడాది మనదేశంలో బ్రిటీష్‌ పాలకులు ఆదాయపన్ను చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.మన జనాభాలో ఎగువ ఒకశాతం మందికి 1930దశకంలో 21శాతం రాబడి రాగా, 1980దశకంలో అది ఆరుశాతానికి తగ్గింది. తరువాత నూతన ఆర్థిక విధానాలు వచ్చాయి. ఎగువ నుంచి దిగువకు ఊటదిగినట్లుగా జనాభాలో దిగువన ఉన్న వారికి రాబడి ఊట దించేందుకు ఈ విధానాలను అనుసరిస్తున్నట్లు ఊట సిద్దాంతం చెప్పారు. కానీ జరిగిందేమిటి ? జనాభాలో ఒక శాతం ఉన్న ధనికుల ఆదాయం తిరిగి 22శాతానికి చేరింది. అందుకే బ్రిటీష్‌ వారి ఏలుబడి కంటే స్వాతంత్య్రంలోనే అసమానతలు పెరిగినట్లు వారు వ్యాఖ్యానించారు.1950 నుంచి 1980 మధ్య కాలంలో దిగువన ఉన్న 50శాతం మంది రాబడి మొత్తం సగటుతో పోలిస్తే ఎక్కువగా 28శాతం వేగంతో పెరగ్గా ఎగువన ఉన్న 0.1శాతం మంది రాబడి తగ్గిపోయింది. కానీ 2015 నాటికి అది తారుమారైంది. దిగువ 50శాతం మంది వృద్ధి రేటు పదకొండు శాతం కాగా ఎగువన ఉన్నవారిది 12శాతం పెరిగింది. మధ్య తరగతిగా ఉన్న 40శాతం మంది 23శాతం పొందగా ఎగువున ఒక శాతం మందికి 29శాతం ఉంది.


మనదేశంలో తొలి బిలియనీర్‌ నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌. పారిశ్రామికవేత్తలలో 1991లో ఒక్కరే ఉన్నారు. ఇండియా టుడే విశ్లేషణ ప్రకారం 2014లో 70 మంది 2025 నాటికి 284కు పెరిగారు. ఎగువ ఒక శాతం మంది వద్ద దేశ సంపదలో 40.1శాతం పోగుపడిరది. ఇంతగా ధనికులు పెరిగిన తరువాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరింతగా సంపాదిస్తారే తప్ప మోడీ చెప్పినట్లు సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదాన్ని సాకారం కానిస్తారా ? పార్లమెంటు, అసెంబ్లీల్లో పెరుగుతున్న కోటీశ్వరులు సామాన్యుల కోసం విధానాలను రూపొందిస్తారా ? 2025`26 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ 50లక్షల కోట్లు అనుకుంటే బిలియనీర్ల వద్ద ఉన్న సంపద 98లక్షల కోట్లు. ఒక్క ముంబైలోనే 90 మంది ఉన్నారని వారి సంపద 39లక్షల కోట్ల రూపాయలని లెక్క. ప్రపంచ అసమానతల ప్రయోగశాల(వరల్డ్‌ ఇనీక్వాలిటీ లాబ్‌) 2024 మార్చినెలలో విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం మనదేశంలో 2022లో వార్షిక రాబడి ఇరవై ఏండ్లు పైబడిన 92 కోట్ల మంది సగటు రు.2.3లక్షలంటే నెలకు ఇరవై వేలు. మధ్యగత రేఖ(మెడియన్‌) వార్షిక రాబడి రు.లక్ష అంటే నెలకు సగటున రు.8,750 మాత్రమే వస్తున్నది. ఎగువున ఉన్న పదిశాతం మంది ఏడాదికి సగటున రు.13లక్షలు, ఎగువ ఒక శాతం రు.50లక్షలు, ఎగువన 0.1శాతం మంది రెండు కోట్లు, 0.01శాతం మంది పది కోట్ల వంతున సంపాదిస్తున్నారు. ధనికుల్లో అగ్రశ్రేణి వారిలో 9,223 మంది సగటున 50 కోట్లు సంపాదిస్తున్నారు. ఇక సామాజిక తరగతుల వారీ చూస్తే ఐశ్యర్యవంతుల్లో 90శాతం మంది ‘‘ సవర్ణులు ’’’ 2.6శాతం దళితులు, మిగిలిన వారు ఓబిసిలు ఉన్నారట.2014 నుంచి 2022 కాలంలో ధనవంతులైన ఓబిసి బిలియనీర్ల సంపద 20 నుంచి పదిశాతానికి తగ్గగా సవర్ణులకు 80 నుంచి 90శాతానికి పెరిగిందని ఇనీక్వాలిటీ లాబ్‌ పర్కొన్నది. జనాభాలో 25శాతంగా ఉన్న వీరు 55శాతం సంపద కలిగి ఉన్నారట. ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఏమంటే ఇలాంటి ఆర్థిక అసమానతల ఉన్నపుడు శతకోటీశ్వరులు, అల్పాదాయ వర్గాలకు ఒకే జిఎస్‌టి రేటు సామాజిక న్యాయానికి విరుద్దం. ధనికుల మీద సంపదపన్ను విధిస్తే వచ్చే రాబడితో ఖజాన నింపుకోవచ్చు. వస్తు, సేవల పన్ను తగ్గిస్తే భారం ఎంతో తగ్గుతుంది.వినియోగం పెరిగితే యువతకు ఉపాధి పెరుగుతుంది, తద్వారా ప్రభుత్వాలకు రాబడీ పెరుగుతుంది. కానీ ఆ పని చేయటం లేదు. మోడీ సర్కార్‌ మహామాయ జిమ్మిక్కులతో శ్లాబుల కుదింపును రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకొనేందుకు చూస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇది తాత్కాలికమే. వాస్తవాలను గ్రహించినపుడు జనాలు చివరికి మోడీ నిజం చెప్పినా నమ్మని స్థితి వస్తుంది !