మనదేశం సురక్షితమైన హస్తాల్లోనే ఉందా ! నరేంద్రమోడీ తీరుతెన్నులేమిటి ?అంతరిక్షంలో చైనా ఆధిపత్యం !!

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

         హైపర్‌సోనిక్‌(ధ్వనికంటే ఐదురెట్లు వేగంగా ప్రయాణించే) క్షిపణులను అడ్డుకోవటం ఎంతో కష్టం, అందువలన భారత్‌కు వందలాది ఉపగ్రహాలు అవసరం అని ఇస్రో మాజీ అధిపతి ఎస్‌ సోమనాథ్‌ వ్యాఖ్యానించారు. జూన్‌ పదవ తేదీన కొన్ని పత్రికల్లో పెద్ద ప్రాధాన్యత లేకుండా ఈ వార్త వచ్చింది. సోమనాథ్‌ మాటల సారం ఏమిటంటే పెద్ద సంఖ్యలో  ఉపగ్రహాలు లేకపోతే సంక్షోభాలు తలెత్తినపుడు దేశ సాయుధ దళాలకు ముప్పు. ఇటీవలి కొన్ని ఉదంతాల్లో ఇది ప్రదర్శితమైంది. ఉదాహరణకు ఉక్రెయిన్‌ పోరులో అది ఎంత కీలక పాత్ర పోషించిందో బాగా కనిపించింది, అంతేగాదు ఇటీవల భారత్‌కూ అది అనుభవమైంది. క్షిపణుల ప్రయోగాలను ముందుగానే పసిగట్టేందుకు హెచ్చరికలు చేయటంతో పాటు వాటికి ప్రతి చర్యలను సూచించేందుకు ఐదువందల ఉపగ్రహాల రాసి అవసరమని అమెరికా పథకం రూపొందించింది.ఈ స్థాయికి భారత్‌కూడా ఎదగాలి.ఒక ఉపగ్రహం 15 నిమిషాల లోపు మాత్రమే పరిశీలించగలదు, అది వెళ్లిపోగానే వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు మరొకటి రావాలి. ఆధునిక యుద్ధాలలో ఉపగ్రహాల అవసరం, ప్రయోజనం గురించి సోమనాథ్‌ చాలా స్పష్టంగా చెప్పారు. మన పాలకులు చెప్పినా చెప్పకపోయినా ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌ మిలిటరీ మన విమానాలను కొన్నింటిని కూల్చిందన్నది వాస్తవం, యుద్ధం అన్న తరువాత నష్టాలు లేకుండా ఉంటాయా అని మన మిలిటరీ అధికారులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

     అంతరిక్షంలో చైనా తీక్షణత కారణంగా కీలకమైన సాయం చేయగలిగిందని దాంతో పాకిస్తాన్‌ విజయవంతంగా అడ్డుకోగలిగాయని భారతీయ మిలిటరీ వర్గాలు చెప్పినట్లు డిఫెన్స్‌ సెక్యూరిటీ ఆసియా అనే వెబ్‌సైట్‌ జూన్‌7వ తేదీన ప్రచురించిన విశ్లేషణలో పేర్కొన్నది. చైనా తెరవెనుక పాత్ర కారణంగానే ఆరు భారతీయ యుద్ద విమానాలను కూల్చివేయగలిగింది. సమాచారాన్ని పంచుకోవటం, దానికి అనుగుణంగా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవటం వలన భారత విమానాలను పసిగట్టగలిగింది.‘‘ వారి వైమానిక రాడార్‌ను అవసరానికి అనుగుణంగా మోహరించటానికి అది(చైనా) వారికి(పాకిస్తాన్‌) సాయపడిరది. అందువలన మన వైమానిక మార్గంలో చేసే చర్యలు వావారికి తెలిసిపోతుంది ’’ అని భారత రక్షణ శాఖ పర్యవేక్షణలో పని చేసే సెంటర్‌ ఫర్‌ జాయింట్‌ వార్‌ఫేర్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌ కుమార్‌ చేసిన ప్రకటనను ఆ వెబ్‌సైట్‌ విశ్లేషణ ఉటంకించింది. ఆపరేషన్‌ సిందూర్‌ ఘర్షణను కేవలం తన సన్నిహిత ప్రాంతీయ అనుయాయికి మద్దతు ఇచ్చే వ్యూహాత్మక అవకాశంగానే గాక  తను అధునాతన రక్షణ సాంకేతిక పరిజ్ఞానం ఆచరణలో ఎలా పని చేస్తుందో పరీక్షించటానికి కూడా చైనా వినియోగించుకుందని అశోక్‌ కుమార్‌ చెప్పారు.చైనా యావోగాన్‌ ఐఎస్‌ఆర్‌ ఉపగ్రహాలు భారత విమానాలు, మిలిటరీ జాడను కనిపెట్టటంలో నిర్ణయాత్మక పాత్రను పోషించాయని, పాకిస్తాన్‌ పైచేయి సాధించటానికి తోడ్పడినట్లు భారత రక్షణశాఖ వర్గాలు తెలిపినట్లు సదరు విశ్లేషణ పేర్కొన్నది. ఒక మేథావి, అధ్యయనవేత్తగా అశోక్‌ కుమార్‌ చెప్పిన ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎందుకు చెప్పలేకపోయిందన్నది సామాన్యులకు అంతుబట్టటం లేదు. .

     యావోగాన్‌ ఉపగ్రహాలు దక్షిణ చైనా సముద్రం నుంచి హిమాలయాల వరకు నిఘావేయగల వ్యవస్థలను కలిగి ఉన్నాయి.2023 డిసెంబరులో ప్రయోగించిన యావోగాన్‌ 41 ఉపగ్రహం ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా భారత ఉపఖండంపై కీలకమైన వైమానిక స్థావరాలు, ప్రాంతాల వివరాలను సేకరించినట్లు ఆరోపిస్తున్నారు. దీన్ని తాము వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల యాజమాన్యం కోసం దీన్ని ప్రయోగించినట్లు చైనా చెబుతోంది.  మిలిటరీ అవసరాలకూ వినియోగించవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చైనా ప్రస్తుతం లియో(లోఎర్త్‌ ఆర్బిట్‌), ఎంఇఓ(మీడియం ఎర్త్‌ ఆర్బిట్‌), జియో(జియో స్టేషనరీ అర్బిట్‌) అనే మూడు రకాల ఉపగ్రహాలు మొత్తం 5,330 కలిగి ఉందని, వీటిలో మిలిటరీ, ఇతర అవసరాలకు ఎన్నింటిని వినియోగిస్తున్నారన్నది వివరాలు తెలియకపోయినా, మనదేశానికి ఉన్న అన్నిరకాలు  218 ఉపగ్రహాలతో పోలిస్తే చైనా ఆధిపత్యం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వీటిలో ఎక్కువ భాగం పౌరఅవసరాల కోసం అంటున్నారు.2030 నాటికి మిలిటరీ అవసరాల కోసం 52 ఉపగ్రహాలను ప్రయోగించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది.     నిఘా,సమాచారం,లక్ష్యాల నిర్దేశానికి వీటిని వినియోగిస్తారు. మనదేశం ఎన్‌విఎస్‌ 02 రకం ఉపగ్రహాలతో మనదేశ సరిహద్దులకు పదిహేను వందల కిలోమీటర్ల పరిధిలో నిఘావేయగలదని, దాని ప్రయోగాలకు సిద్దం చేస్తున్నారు. ఇది అమెరికా జిపిఎస్‌, చైనా బెయిడౌ వ్యవస్థలతో సమానమైదని భావిస్తున్నారు. ఇస్రో మాజీ అధికారి మాధవన్‌కు ఇవన్నీ తెలిసినవే అయినప్పటికీ పెద్ద సంఖ్యలో ఉపగ్రహాల అవసరాల గురించి చెప్పిన మాటలను మన విధాన నిర్ణేతలు విస్మరించకూడదు. ఎవరో ఏదో చేస్తారని గాకపోయినా నేడున్న ప్రపంచ పరిస్థితులలో ఎవరి జాగ్రత్తలో వారుండటం అవసరం. పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి పాకిస్తాన్‌ దుర్మార్గాన్ని ప్రపంచానికి వివరించేందుకు మన పార్లమెంటరీ బృందాలు పర్యటించిన సంగతి తెలిసిందే.అమెరికా ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో రెండు దేశాలూ తమకు ముఖ్యమే అని చెప్పటమే కాదు, ఐరాసలో ఉగ్రవాద నిరోధ కమిటీ ఉపాధ్యక్ష పదవిని పాకిస్తాన్‌కు కట్టబెట్టటం, అన్నింటినీ మించి జి7 సమావేశం నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చి పాక్‌ ఫీల్డ్‌ మార్షల్‌ మునీర్‌ అసిమ్‌కు విందు ఏర్పాటు చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీరు మన పుండు మీద కారం రాసినట్లుగా ఉంది.

     సురక్షితమైన చేతుల్లో దేశం ఉందని ప్రధాని నరేంద్రమోడీ గురించి గొప్పగా ప్రచారం చేశారు.ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో మనలోపాలు వెల్లడయ్యాయి, వెంటనే వాటిని అధిగమించి పాక్‌ను దెబ్బతీశామని మన అధికారులు చెప్పారు. విదేశీ మీడియా సంస్థలు ఏ విషయాన్నీ దాచటం లేదు. రాఫెల్‌ విమానాలు కూలిపోయిన అంశాన్ని అధికారికంగా అంగీకరించనప్పటికీ దాని సామర్ధ్యం గురించి తలెత్తిన సమస్యల గురించి చర్చించేందుకు, దెబ్బతిన్న సంబంధాలను మరమ్మతు చేసేందుకు మనవిదేశాంగ మంత్రి జై శంకర్‌ ఫ్రాన్సు పర్యటించినట్లు డిఫెన్స్‌ సెక్యూరిటీ ఆసియా జూన్‌ పదిన రాసింది.తమ విమానాల కూల్చివేత గురించి భిన్నమైన వార్తలు వచ్చిన నేపధ్యంలో వాటిని విక్రయించిన దసాల్ట్‌ ఏవియేషన్‌ కంపెనీ భారత్‌లో ఉన్న తమ విమానాలను తనిఖీ చేసేందుకు ఒక స్వతంత్ర బృందాన్ని పంపుతామని ప్రతిపాదించగా మన దేశం తిరస్కరించినట్లు ఆ విశ్లేషణలో ఉంది.(ఒకసారి తనిఖీకి అనుమతిస్తే తమ విమానాలు ఎన్ని ఉన్నాయో వారికి తెలుస్తుంది, ఎన్ని లేకపోతే అన్ని కూలినట్లే, తరువాత అయినా ఆ వివరాలు వెల్లడైతే ఇబ్బంది గనుక మనదేశం తిరస్కరించి ఉండవచ్చు. తమ విమానాల గురించి అనుమానాలు పెరిగితే మార్కెట్‌లో పరువు పోతుంది, కొనుగోళ్లకు సందేహిస్తారన్నది దసోల్ట్‌ సమస్య)  తమ విమానాల్లో ఎలాంటి లోపం లేదని భారత వైమానిక దళంలోనే వ్యవస్థాపరమైన వైఫల్యాలు ఉన్నట్లు దసాల్ట్‌ భావిస్తోందట.అనవసరంగా తమ విమానాలను బదనాం చేశారని అది ఆగ్రహిస్తోందని వార్తలు.  మధ్యప్రాచ్యం, లిబియాల్లో తమ విమానాలు అద్భుతంగా పనిచేశాయని, తగినంత అనుభవం ఉన్న సిబ్బంది, సమన్వయం ఉంటే రాఫేల్‌కు తిరుగులేదని చెప్పుకుంటోంది.  అవసరమైన పైలట్లు కూడా భారత్‌లో లేరని కొరత, నిర్వహణ సమస్యలు ఉన్నట్లు వెబ్‌సైట్‌ విశ్లేషణలో పేర్కొన్నారు. పాక్‌తో ఇటీవలి వివాదానికి ముందు 2015లో 486 మంది ఉండగా తరువాత ఉన్న గణనీయంగా పెరిగినప్పటికీ ఇంకా 596 మంది పైలట్ల కొరత భారత వాయుసేనలో ఉన్నట్లు పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన కాగ్‌ నివేదికలో ఉన్నట్లు ఉటంకించారు.2016 నుంచి 2021 మధ్య ఏటా 222 మంది కొత్త పైలట్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ తక్కువ మందినే ఎంపిక చేసినట్లు పేర్కొన్నది. అవసరమైతే చైనా, పాకిస్తాన్‌లను ఎదుర్కొనేందుకు మన వాయుసేన 42 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలకు అనుమతి ఉండగా ప్రస్తుతం 31 మాత్రమే ఉన్నాయి. 2024 సెప్టెంబరు 19వ తేదీన వచ్చిన ఒక విశ్లేషణలో 30 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయని, 2025 చివరి నాటికి రెండు మిగ్‌`21 విమానాలతో కూడిన రెండు దళాలు సర్వీసు నుంచి తప్పుకుంటాయని పేర్కొన్నారు. ఒక స్క్వాడ్రన్‌ అంటే సంఖ్య ఎంత అనేదానిలో అన్ని చోట్లా ఒకే విధంగా లేవు. సాధారణంగా పన్నెండు నుంచి 24వరకు ఉంటాయి, కొన్ని  సందర్భాలలో అంతకంటే తక్కువతో కూడా ఉండవచ్చు.పాకిస్తాన్‌లోని బాలాకోట్‌ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడుల తరువాత 2019లో నరేంద్రమోడీ దేశం సురక్షిత హస్తాల్లో ఉందని ఒక సభలో చెప్పారు. దీనికి రెండు రకాల భాష్యాలు చెప్పవచ్చు. ఒకటి మన మిలిటరీ, దాని గురించి వేరే చెప్పనవసరం లేదు,ప్రాణలను ఫణంగా పెట్టి పని చేస్తున్నది తెలిసిందే. రెండవది పరోక్షంగా నరేంద్రమోడీ గురించి. ఆయన భక్తులు రెండోదాన్నే ఎక్కువగా ప్రచారం చేశారు. పదకొండు సంవత్సరాలుగా రక్షణ రంగంలో తీరుతెన్నులను చూశాం గనుక వాస్తవం ఏమిటో వేరే చెప్పనవసరం లేదు.

   మిలిటరీ గూఢచర్యం, నిఘా వంటి అవసరాలకు స్వంత ఉపగ్రహాలు లేని కారణంగా విదేశీ సంస్థల మీద ఆధారపడుతున్నాం. వారిచ్చే సమాచారం ఒక్కోసారి మనలను తప్పుదారి పట్టించేదిగా ఉంటోంది.గాల్వన్‌ ఉదంతాలలో అదే జరిగిందని చెబుతారు.లండన్‌ కేంద్రంగా పని చేస్తున్న  మిలిటరీ బాలన్స్‌ 2024నివేదిక ప్రకారం చైనా 245 మిలిటరీ ఉపగ్రహాలను నిర్వహిస్తుండగా మనం 26 మాత్రమే కలిగి ఉన్నాం.రెండోసారి వినియోగించే అంతరిక్ష నౌక  కూడా చైనా వద్ద ఉంది. ప్రత్యర్ధులను అడ్డుకొనేందుకు అంతరిక్షంలో ఆధిపత్యాన్ని సాధించేందుకు చైనా ఆసక్తితో ఉందని ఆస్ట్రేలియన్‌ వ్యూహాత్మక విధాన సంస్ధ సీనియర్‌ విశ్లేషకుడు మాల్కమ్‌ డేవిస్‌ చెప్పాడు. అమెరికా దాని అనుబంధ ఉపగ్రహాలకు ప్రతిగా అంతరిక్ష సామర్ధ్యాలను అభివృద్ధి చేస్తున్నదని, ఏ విధంగా చూసినా అమెరికాను అధిగమించేందుకు పూనుకున్నదన్నారు.

      గూఢచర్యం, నిఘా, ముందుగా సర్వే చేసే శక్తి కలిగిన ఐఎస్‌ఆర్‌ రకం 290ఉపగ్రహాలను చైనా మిలిటరీ నిర్వహిస్తున్నదని, మొత్తం ప్రపంచంలో ఉన్నవాటిలో అవి సగమని అమెరికా రక్షణ శాఖ 2023లో పేర్కొన్నది. కొరియా ద్వీపకల్పం, దక్షిణ చైనా సముద్రం, హిందూమహాసముద్రాలను పరిశీలించేందుకు వీలుకలుగుతుందని కూడా చెప్పింది.క్వాంటమ్‌ సమాచార ఉపగ్రహాన్ని చైనా ప్రయోగించిందని, ఎలాంటి అంతరాయం లేకుండా సమాచారాన్ని అందుకోగలదని కూడా అమెరికా నివేదిక చెప్పింది. అయితే మనదేశం, ఇతర దేశాలను భయపెట్టి తన అదుపులోకి తెచ్చుకొనేందుకు అమెరికా కొన్ని కల్పిత అంశాలను కూడా నివేదికల్లో పొందుపరుస్తుందని గమనించాలి. అమెరికా, నాటో కూటమి మిలిటరీలతో పోలుస్తూ ఆధునిక ధోరణులను అనుసరించటంలో చైనా మిలిటరీ ఎంతో వేగంగా పనిచేస్తుందని లండన్‌లోని సిటీ యూనివర్సిటీ ఫ్రొఫెసర్‌ డేవిస్‌ స్టుపుల్స్‌ చెప్పాడు. అమెరికాకు పోటీగా  ఐదు మీటర్ల సమీపం వరకు వెళ్లి సమాచారాన్ని పంపే స్వంత జిపిఎస్‌ వ్యవస్థలో చైనా 45ఉపగ్రహాలను కలిగి ఉంది. అంతే కాదు ఉపగ్రహాలను కూల్చివేయగల సామర్ధ్యాలను కూడా అది సమకూర్చుకుంటున్నది. అయితే ఇంతవరకు అలా కూల్చిన ఉదంతాలు లేవు గానీ అలాంటి సామర్ధ్యం తమకు ఉన్నట్లు వారు ప్రదర్శిస్తున్నారని డేవిస్‌ చెప్పాడు. ఉపరితలం నుంచి లేజర్‌ కిరణాల ద్వారా అంతరిక్షంలోని ఉపగ్రహాలు పనిచేయకుండా చేయటం, చిందరవందర చేయటం లేదా నష్టపరచగలదని అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ అనుమానిస్తున్నది.పని చేయని ఒక ఉపగ్రహాన్ని కూల్చివేసేందుకు చైనా 2007లో ఒక క్షిపణి ప్రయోగం చేసింది, తరువాత వాటిని కొనసాగిస్తున్నది, ఇది చాలా తీవ్ర విషయమని భావిస్తున్నారు.మనదేశం కూడా 2019లో అలాంటి ప్రయోగమే చేసింది. అమెరికా కూడా అదే పనిచేస్తున్నప్పటికీ దాన్ని పశ్చిమ దేశాలు తీవ్ర అంశంగా పరిగణించకపోవటం గమనించాల్సిన అంశం.  అమెరికాలోని ఎలన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌ ప్రైవేటు రంగంలో ఉపగ్రహ ఇంటర్నెట్‌ రంగంలో ముందున్నది, దానికి ధీటుగా చైనా ప్రభుత్వ రంగ సంస్థ శాట్‌నెట్‌ పదమూడువేల ఉపగ్రహాలను ఇంటర్నెట్‌కోసం అనుసంధానం చేసేందుకు గువోవాంగ్‌ పేరుతో పని చేస్తున్నది.

     చంద్రయాన్‌ వంటి ప్రయోగాలతో మన ఇస్త్రో శాస్త్రవేత్తల కృషి కూడా తక్కువేమీ కాదు. చైనాతో పోల్చితే మన వేగం చాలా తక్కువగా ఉంది. ఇలా చెప్పటాన్ని కొందరు ఇస్రో కృషిని తక్కువ చేసి చూపటంగానూ, దేశద్రోహంగానూ చిత్రించేవారున్నారు. వాస్తవాన్ని దాచి జనాలను భ్రమల్లో ఉంచటం దేశభక్తా, వంచనా ? నైపుణ్య వృద్ధి పేరుతో వేలాది కోట్లు తగలేస్తున్నారు.ముందే చెప్పుకున్నట్లుగా ఇంత పెద్ద దేశంలో మన వాయుసేనకు అవసరమైన సంఖ్యలో శిక్షణ ఇవ్వటానికి పైలట్లుగా ఎవరూ దొరకలేదంటే నవ్విపోతారు.పరిశోధన మరియు అభివృద్దికి మన దేశం జిడిపిలో 0.7శాతానికి అటూ ఇటూగా ఖర్చు ఉంది, అదే చైనా 2.7శాతం వరకు ఖర్చు చేస్తున్నది. ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి అని చతికిల పడిన తరువాత నాలుగు లక్షల కోట్లు, జపాన్‌ అధిగమించామని చంకలు కొట్టుకోవటం కాదు, చేయాల్సిన చోట ఖర్చు చేయటం ముఖ్యం. ప్రభుత్వ రంగం అసమర్ధంగా ఉందని చిత్రించి 1990దశకం నుంచి పూర్తిగా ప్రైవేటు రంగానికి అప్పగించటమే కాదు ఉన్న ప్రభుత్వ రంగాన్ని మూసివేసి ఆస్తులను తెగనమ్ముతున్నారు. మూడున్నర దశాబ్దాల ప్రైవేటు రంగం సాధించిందేమిటి ? చైనాను అనుకరిస్తామని చెబుతారు, అక్కడేమీ ప్రభుత్వ రంగ ప్రాధాన్యతను తగ్గించలేదు, పెంచుతూనే ఉన్నారు.మన ప్రయివేటు రంగం అంత సమర్ధత కలిగితే ఎందుకని చైనా కంటే జిడిపిలో మనదేశం అంతవెనుక బడి ఉంది.

          మన దేశం ఇటీవల ఏడాదికి మూడు ఉపగ్రహప్రయోగాలు జరుపుతుండగా ఈ ఒక్క ఏడాదే చైనా వంద ప్రయోగాలకు ప్రణాళిక రూపొందించింది.చైనా నిఘా ఉపగ్రహాలు కక్ష్య నుంచి ఐదు వందల కిలోమీటర్ల వరకు యుద్ధాలు, ఉద్రిక్తతల సమయంలో ప్రత్యర్ధుల మిలిటరీ కదలికలను పసిగట్టటం, లక్ష్యాలను గురిచూడటం వంటి పనులు చేయగలవు. రష్యా, ఉక్రెయిన్‌ పోరులో పశ్చిమ దేశాలకు చెందిన ఇలాంటి ఉపగ్రహాలు ఇచ్చిన సమాచారంతోనే ఉక్రెయిన్‌ దాడులు చేయగలుగుతున్నట్లు చెబుతున్నారు. పశ్చిమ దేశాల ముఖ్యంగా అమెరికా ప్రైవేటు సంస్థలు టిటెట్‌ తదితర సరిహద్దు ప్రాంతాల్లో చైనా మోహరింపు గురించి మన దేశానికి సమాచారాన్ని అందచేస్తున్నాయి.ఇటీవల చైనా కూడా పాకిస్తాన్‌కు అలాంటి సాయమే చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మనం ఇతరుల మీద ఆధారపడుతుండగా చైనా స్వంతంగా సమకూర్చుకుంటోంది. పెట్రోలు, డీజిలుపై భారీ మొత్తం సెస్‌ విధించి వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నారు. ఎందుకు అని ప్రశ్నిస్తే దేశ రక్షణ అవసరాలకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. అదే నిజమైతే చైనా కంటే ఇంతగా ఎందుకు వెనుకబడి ఉన్నట్లు ?

అమెరికాలో ఏం జరుగుతోంది : ప్రపంచ కాపిటలిస్ట్‌ రాజధాని న్యూయార్క్‌లో సోషలిస్టు పిడుగు జోహరాన్‌ మమ్‌దానీ ! నరేంద్రమోడీ యుద్ధ నేరస్తుడన్న యువనేత !!

Tags

, , , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మానవాళి చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ, ఎక్కడా విప్లవాలు చెప్పిరాలేదు, వాటికి ముహూర్తాలు, వాస్తు వంటివి కూడా లేవు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా వస్తాయో కూడా తెలియదు.అన్నింటినీ మించి అంతిమంగా అడ్డుకోవటం ఎవరివల్లా కాదు. 2025 జూన్‌ 24వ తేదీ బుధవారం నాడు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ రాజధాని న్యూయార్క్‌ నగరంలో పిడుగుపాటు. విప్లవం అని వర్ణించటం అతిశయోక్తి అవుతుందిగానీ పెట్టుబడిదారులకు దడపుట్టించే పరిణామం జరిగింది. ఈ ఏడాది నవంబరు నాల్గవతేదీన జరిగే నగర మేయర్‌ ఎన్నికలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా జోహ్రాన్‌ మమ్‌దానీ(33) ఎన్నిక యావత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని కోరుతూ 11 మంది పోటీపడ్డారు. అయితే 93శాతం ఓట్లు లెక్కించిన సమయానికి న్యూయార్క్‌ రాష్ట్ర ఎంఎల్‌ఏ జొహ్రాన్‌కు 43.5, రెండవ స్థానంలో ఉన్న న్యూయార్క్‌ మాజీ గవర్నర్‌, ఒక కార్పొరేట్‌ సంస్థకు అధిపతి అయిన అండ్రూ కుమోకు 36.4శాతం, మూడో స్థానంలో ఉన్న అభ్యర్థికి 11.3, నాలుగో స్థానంలో ఉన్న వ్యక్తికి 4.1 మిగిలిన అందరికీ కలిపి 4.6శాతం ఓట్లు వచ్చాయి. కుమో తన ఓటమిని అంగీకరించాడు.గత 36 సంవత్సరాలలో ఇంత పెద్ద ఎత్తున డెమోక్రటిక్‌ పార్టీలో ఓటర్లు పాల్గ్గొనటం ఇదే ప్రధమం. ప్రస్తుత మేయర్‌గా డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఎరిక్‌ ఆడమ్స్‌ ఉన్నాడు. బలాబలాలను బట్టి జోహ్రాన్‌ ఎన్నిక లాంఛన ప్రాయమే అని విశ్లేషకులు అంటున్నారు, అదే జరిగితే తొలి సోషలిస్టు మేయర్‌ అవుతాడు.


మన స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ నాయకత్వ విధానాలను వ్యతిరేకించే వారు తమ పురోగామి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. దాని నేతలుగా ఉన్న ఇంఎంఎస్‌ నంబూద్రిపాద్‌, పుచ్చలపల్లి సుందరయ్య వంటి అనేక మంది తరువాత కమ్యూనిస్టులుగా మారారు. అదే మాదిరి అమెరికా డెమోక్రటిక్‌ పార్టీలో పురోగామి విధానాలను ముందుకు తెచ్చేవారు డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. వారిలో సెనెటర్‌ బెర్నీశాండర్స్‌ బహిరంగంగా తనను సోషలిస్టుగా ప్రకటించుకున్నాడు. అదే బాటలో జోహ్రాన్‌ మమ్‌దానీ వంటి యువకులు పెద్ద సంఖ్యలో సోషలిస్టులుగా మారారు.వీరందరినీ కమ్యూనిస్టులుగా అక్కడి మీడియా, రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీలోని మితవాదులు ముద్రవేస్తున్నారు. జోహ్రాన్‌ ఒక కమ్యూనిస్టు పిచ్చోడని డోనాల్డ్‌ ట్రంప్‌ నోరుపారవేసుకున్నాడు.అమెరికా సమాజంలో ఒక మధనం జరుగుతున్నది. లక్షలాది మంది ఇటీవలి కాలంలో సోషలిస్టులం అని సగర్వంగా ప్రకటించుకుంటున్నారు. వారిని కమ్యూనిస్టులని ప్రచారం చేసినా ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. ఇది అక్కడి కార్మికవర్గం మార్పును కోరుకుంటున్నదని, వామపక్షం వైపు మొగ్గేందుకు సిద్దంగా ఉన్నట్లు, ఒక సామాజిక సంక్షోభానికి ఒక సూచికగా చెప్పవచ్చు. దీని అర్ధం తెల్లవారేసరికల్లా అధికారానికి రాబోతున్నారని కాదు.

జోహ్రాన్‌ అభ్యర్థిగా ఎన్నికైనట్లు ఫలితాల తీరు వెల్లడిరచగానే జరిగిన పరిణామాలు మనదేశంలో జరిగిందాన్ని గుర్తుకు తెచ్చాయి. కొన్ని పార్టీల వారు గతంలో సిపిఎం నేత జ్యోతిబసును ప్రధాని పదవికి సూచించగానే బాంబేక్లబ్‌గా పిలిచే బడాకార్పొరేట్‌ ప్రతినిధులందరూ సమావేశమై ఎట్టి పరిస్థితిలోనూ కానివ్వరాదని తీర్మానించారు. న్యూయార్క్‌ నగరానికి ఒక వామపక్షవాది మేయర్‌ కాగానే అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసే అవకాశం లేదు. అయినప్పటికీ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ప్రస్తుత మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ లేదా జోహ్రాన్‌తో పోటీ పడిన కుమోను స్వతంత్ర అభ్యర్ధిగా నిలపాలని, రిపబ్లికన్‌ పార్టీ పోటీ చేయకుండా మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞాపనలతో పాటు 20 మిలియన్ల డాలర్లను వసూలు చేయాలని పిలుపు ఇచ్చారు. జోహ్రాన్‌ ముందంజ గురించి తెలియగానే స్టాక్‌మార్కెట్లో కొన్ని కంపెనీల వాటాల ధరలు పడిపోయాయంటే ఎలాంటి కుదుపో చెప్పనవరం లేదు. డెమోక్రటిక్‌ పార్టీ సంస్కరణవాదంలో భాగంగా కొన్ని పురోగామి నినాదాలను ఇవ్వవచ్చు, జాత్యహంకారాన్ని వ్యతిరేకించవచ్చు,రిపబ్లికన్లతో పోలిస్తే మితవాదులు తక్కువగా ఉండవచ్చు తప్ప అదేమీ పాలకవర్గాన్ని సమూలంగా మార్చేది కాదు. గాజా మారణకాండను పూర్తిగా సమర్ధించింది. మమ్దానీ ఇజ్రాయెల్‌ను గట్టిగా వ్యతిరేకించటమే కాదు, ఎన్ని విమర్శలు వచ్చినా పాలస్తీనా మద్దతుదారుగా ఉన్నాడు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు న్యూయార్క్‌ వస్తే అరెస్టు చేయించేందుకు వెనుకాడనని కూడా చెప్పాడు. అందుకనే ప్రత్యర్ధులు అతనికి యూదు వ్యతిరేకి అని ముద్రవేశారు. అయినప్పటికీ న్యూయార్క్‌లోని యూదులు పెద్ద సంఖ్యలో అతని అభ్యర్థిత్వానికి మద్దతుగా ఓటు చేశారని వార్తలు వచ్చాయి. నరేంద్రమోడీ న్యూయార్క్‌ వస్తే భేటీ అవుతారా అని విలేకర్లు ప్రచారం సందర్భంగా అడగ్గా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులందరూ లేదని ముక్తకంఠంతో చెప్పారు. బెంజమిన్‌ నెతన్యాహు మాదిరి నరేంద్రమోడీ కూడా గుజరాత్‌లో మారణకాండకు బాధ్యుడైన ఒక యుద్ధ నేరగాడని జోహ్రాన్‌ చెప్పాడు.


జోహ్రాన్‌ తండ్రి మహమ్మద్‌ మమ్దానీ అమెరికాలో స్థిరపడిన గుజరాతీ మూలాలు ఉన్న ఉగాండా జాతీయుడు కాగా తల్లి ఒడిషాలో జన్మించిన పంజాబ్‌ హిందూ కుటుంబానికి చెందిన మీరా నాయర్‌(నయ్యర్‌ ) పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమా దర్శకురాలు, నిర్మాత. ఇజ్రాయెల్‌ హైఫా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి గౌరవ అతిధిగా వచ్చిన ఆహ్వానాన్ని 2013లో ఆమె తిరస్కరించారు. పాలస్తీనా ఆక్రమణనుంచి వైదొలిగినపుడు, జాత్యంహంకారాన్ని వీడినపుడు మాత్రమే ఇజ్రాయెల్‌ గడ్డమీద అడుగుపెడతానని చెప్పారు. జోహ్రాన్‌ వాగ్దానాల విషయానికి వస్తే తనను ఎన్నుకుంటే న్యూయార్క్‌ నగరంలో అద్దెలను స్థంభింప చేస్తానని, పేదలకు ఇండ్లు నిర్మిస్తానని, లాభనష్టాలు లేని ప్రాతిపదిక నగరపాలక సంస్థ సూపర్‌మార్కెట్లను ఏర్పాటు చేస్తానని, 2030 నాటికి గంటకు 30 డాలర్ల కనీసవేతన అమలు జరిగేట్లు చూస్తానని, అందరికీ అందుబాటులో ఉండే శిశు సంరక్షణా కేంద్రాల ఏర్పాటు వంటి తన వాగ్దానాల అమలుకు అవసరమైన పదిబిలియన్‌ డాలర్ల సొమ్మును ధనికుల మీద అదనంగా పన్నులు వేసి సమీకరిస్తానని చెప్పాడు.వలసవచ్చిన కుటుంబాల వారికి రక్షణ కల్పిస్తానని జోహ్రాన్‌ వాగ్దానం చేశాడు. ఇతగాడిని డెమోక్రటిక్‌ పార్టీలోని కార్పొరేట్‌ అనుకూల శక్తులు ఏదో ఒక సంస్కరణవాది అని సరిపెట్టుకోలేదు, వర్గపోరాటాన్ని ప్రోత్సహించే విప్లవవాదిగా చూశారు. ఆ పార్టీలో చేయి తిరిగిన పెద్దలు, మితవాదులు, కార్మిక, కార్పొరేట్‌ శక్తులు ఏకమై అనేక తప్పుడు ప్రచారాలు చేశారు. ఒక చర్చలో కుమో అతనో కుర్రకుంక అనుభవం ఏముందన్నారు. దాంతో జోహ్రాన్‌ చీల్చి చెండాడు. తాను అవమానకరంగా గవర్నర్‌ పదవికి రాజీనామా చేయలేదని, మిలియన్ల డాలర్లను అక్రమంగా కొట్టేయలేదని, వైద్య సౌకర్యాలకు కోత పెట్టలేదని, పదమూడు మంది మహిళలు లైంగికవేధింపులకు పాల్పడినట్లు తన మీద ఎవరూ ఆరోపణలు చేయలేదని తానలాంటి పనులు చేయకపోవటానికి నేను మీరు కాదు అన్నింటికీ మించి నా పేరు మమ్దానీ అంటూ దులిపేశాడు. ఇతగాడికి మద్దతుగా 30వేల మంది వలంటీర్లుగా పని చేశారు.వలస కార్మికులకు వ్యతిరేకంగా ట్రంప్‌ సర్కార్‌ తీసుకున్న చర్యలకు ఎలాంటి ప్రతిఘటన ఎదురైందో చూశాము. ఆ తరువాత జూన్‌ 14న రాజులు లేరు అంటూ లక్షలాది మంది జనం వీధుల్లోకి వచ్చి ట్రంప్‌ వ్యతిరేక ప్రదర్శనలు చేశారు. ఈ రెండు పరిణామాల వెనుక ప్రధాన చోదకశక్తి కాదు డెమోక్రటిక్‌ పార్టీ కాదు, వివిధ ప్రజాసంఘాలు, సామాజిక ఉద్యమాలు, అదే మేయర్‌ అభ్యర్థి ఎన్నికలో కూడా ప్రతిబింబించింది.


జొహ్రాన్‌ పూర్తి పేరు జోహ్రాన్‌ క్వామే మమ్దానీ. తండ్రి మహమ్మద్‌ మమ్దానీ ఒక గుజరాతీ ముస్లిం కుటుంబంలో 1946లో ముంబైలో జన్మించాడు. తరువాత ఆఫ్రికాలోని ఉగాండాకు ఆ కుటుంబం వలస వెళ్లింది. ఉగాండాలో ఉండగా 1963లో అమెరికాలో విద్య స్కాలర్‌షిప్‌ రావటంతో అక్కడ చదువుకున్నాడు. తిరిగి ఉగండా వెళ్లి అక్కడ బోధనావృత్తిలో చేరాడు. సినిమా దర్శకురాలు మీరా నయర్‌ తన సినిమా ‘‘ మిస్సిసిపీ మసాలా ’’ కోసం ఉగాండాలో పరిశోధనకు వెళ్లినపుడు 1988లో అక్కడ పరిచయమైన మహమ్మద్‌ హిమ్దానీని ఆమె రెండవ వివాహంచేసుకున్నారు. వారికి అక్కడే 1991లో జోహ్రాన్‌ జన్మించాడు.ఘనా తొలి అధ్యక్షుడు క్వామే అంటే అపరిమిత అభిమానంతో తమ కుమారుడి పేరులో క్వామే చేర్చారు. ఆ కుటుంబం తరువాత కొంత కాలం దక్షిణాఫ్రికాలో కూడా ఉంది, తరువాత అమెరికా వచ్చింది.2018లో జోహ్రాన్‌కు అమెరికా పౌరసత్వం వచ్చింది.రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలలో 2020లో తొలిసారిగా న్యూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు,2024లో మూడవసారి ఎన్నికై ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నాడు. ఆచరణ సాధ్యంగాని వాగ్దానాలు చేసినట్లుగా జోహ్రాన్‌ ఎన్నికను జీర్జించుకోలేని అదే పార్టీకి చెందిన ప్రస్తుత న్యూయార్క్‌ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ ఉక్రోషం వెలిబుచ్చాడు. చివరికి అనుకున్నదంతా జరిగింది,జోహ్రాన్‌ మమ్దానీ వందశాతం కమ్యూనిస్టు పిచ్చోడు,డెమోక్రటిక్‌ అభ్యర్ధిగా విజయం విజయం సాధించాడు, మేయర్‌ అయ్యేదారిలో ఉన్నాడు అని ట్రంప్‌ తన సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాడు. మన దగ్గర విప్లవకారులైన వామపక్షవాదులున్నారు,కానీ ఇతను భయంకరంగా ఉన్నాడు, అసహ్యంగా మాట్లాడుతున్నాడని కూడా ట్రంప్‌ రెచ్చిపోయాడు. జోహ్రాన్‌ ఎన్నికను అడ్డుకొనేందుకు కొందరు 1954నాటి కమ్యూనిస్టు వ్యతిరేక చట్టానికి దుమ్ముదులిపి పౌరసత్వాన్ని రద్దు చేసి ఉగాండాకు పంపే అవకాశాలను పరిశీలించాలని వత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు మీడియాలో విశ్లేషణలు మొదలయ్యాయి. ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.


ఈ ఏడాది జరిగే న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నిక అమెరికా చరిత్రలో ఒక ప్రత్యేక పేజీకి నాంది పలికింది. ఇటీవలి కాలంలో ఫాసిస్టు ధోరణులు పెరుగుతున్న పూర్వరంగంలో కార్మికవర్గం వామపక్ష అభ్యర్ధివైపు మొగ్గటం యావత్‌ పురోగామిశక్తులకు ఉత్సాహం ఇచ్చే పరిణామం. అమెరికాలో నిజమైన సోషలిస్టు శక్తుల పెరుగుదలకు తోడ్పడే పరిస్ధితి కనిపిస్తున్నది. డెమోక్రటిక్‌ సోషలిస్టులు ముందుకు తెస్తున్న సంస్కరణలనే మీడియా, శత్రువులు సోషలిజం, కమ్యూనిజం అని చిత్రిస్తున్నారు. వాటికి ఉండే పరిమితులను కార్మికవర్గం అర్ధం చేసుకున్న తరువాత శాస్త్రీయ సోషలిజం కోసం మరింత ముందుకు పోవటం తప్ప మరొక మార్గం లేదు. డెమోక్రటిక్‌ పార్టీ భవిష్యత్‌ను నిర్ణయించేది ఇప్పుడున్న నాయకత్వం కాదని దేశ కార్మికవర్గమేనని డెమోక్రటిక్‌ సోషలిస్టు సెనెటర్‌ బెర్నీశాండర్స్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వి కూడా ధ్వజమెత్తాడు. జోహ్రాన్‌ నోరు తెరిస్తే పాకిస్తాన్‌ ప్రజాసంబంధాల బృందం ఆ రోజు సెలవు తీసుకోవచ్చు. భారత్‌కు అలాంటి మిత్రులు ఉంటే వేరే శత్రువులు అవసరం లేదన్నారు.భారత్‌ మూలాలున్న జోహ్రాన్‌ భారతీయుడి కంటే పాకిస్తానీగా ఎక్కువ హడావుడి చేస్తున్నాడని బిజెపి ఎంపీ కంగనా రనౌత్‌ వ్యాఖ్యానించారు. అతని హిందూ గుర్తింపు లేదా రక్తం సంగతి పక్కన పెడితే హిందూయిజాన్ని లేపేసేందుకు ఇప్పుడు సిద్దంగా ఉన్నట్లు ఆరోపించారు. అసలు ఉక్రోషం ఏమిటంటే నరేంద్రమోడీని యుద్ధ నేరస్తుడని వర్ణించటమే అనివేరే చెప్పనవసరం లేదు. కొసమెరుపు ఏమంటే ప్రపంచంలోనే పిన్నవయస్కురాలైన మేయర్‌గా తిరువనంతపురంలో ఎన్నికైన సిపిఎం నాయకురాలు 21ఏండ్ల ఆర్య రాజేంద్రన్‌.ఆమెను గతంలో అభినందిస్తూ జోహ్రాన్‌ చేసిన ట్వీట్‌ను ఉటంకిస్తూ ఒక కమ్యూనిస్టును అభిందించిన ఇతగాడు కూడా కమ్యూనిస్టే అంటూ విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు.అయితే ఏంటట ! ఆర్య రాజకీయ భావాలకు సిపిఎం కార్యకర్తలైన ఆమె తలిదండ్రులే కారకులైనట్లుగా జోహ్రాన్‌ వామపక్షవాది కావటం వెనుక కూడా తలిదండ్రులు భావజాలమే పని చేసింది.

 
.

ఆగిన పరస్పర దాడులు : ఇరాన్‌ అణు కేంద్రాలు సురక్షితం, ఒప్పందం భవిష్యత్‌ ఏమిటి !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


నాటకీయ పరిణామాలు జరుగుతున్న పూర్వరంగంలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు.అదే జరిగినట్లు కనిపిస్తోంది.పన్నెండు రోజుల పాటు సాగిన ఇజ్రాయెల్‌`ఇరాన్‌ పోరు ముగిసిందని, రెండు దేశాలూ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు.మంగళవారం నాడు రెండు దేశాలూ దీన్ని ధృవీకరించాయి. తరువాత ఇరాన్‌ మీద ఆరోపణలు చేస్తూ ఇజ్రాయెల్‌ టెహరాన్‌మీద దాడులకు తెగబడినట్లు వార్తలు.అంతకు ముందు ఇరాన్‌ కూడా దాడి జరిపి నలుగురి ప్రాణాలు తీసిందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. టెల్‌అవీవ్‌ చర్యలను ట్రంప్‌ ఖండిరచాడు, పనిలో పనిగా ఇరాన్‌ మీద కూడా విమర్శలు చేశాడు. మూడు పక్షాలూ విజయం తమదంటే తమదే అని ప్రకటించుకున్నాయి. దాని సంగతి ఎలా ఉన్నా మూడు దేశాలకూ తలబొప్పి కట్టింది. ప్రపంచ దేశాలకు పెద్ద ప్రమాదం తప్పినందుకు శాంతిని కోరుకొనే వారందరూ సంతోషించే పరిణామం ఇది.తాము అనుకున్నవన్నీ సాధించామని, ఉల్లంఘనలకు పాల్పడితే తిరిగి దాడులు చేస్తామని ఇజ్రాయెల్‌ ప్రదాని నెతన్యాహు ప్రకటించాడు. అంతకు ముందు ట్రంప్‌ ప్రకటన తరువాత ఇరాన్‌ దాడులు కొనసాగిస్తున్నదని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌, ఇజ్రాయెల్‌ ఆక్రమణలోని జెరూసలెంలో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వార్తలు వచ్చాయి. దక్షిణ ఇజ్రాయెల్‌ పట్టణం బీర్‌షిబాపై జరిగిన దాడిలో నలుగురు మరణించారు. అంతకు ముందు కతార్‌ రాజధాని దోహా సమీపంలో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరం మీద ఇరాన్‌ క్షిపణిదాడి చేసింది. ట్రంప్‌ ప్రకటనతో ముడిచమురు మార్కెట్లో ధరలు పడిపోయాయి. ప్రామాణిక బ్రెంట్‌ రకం ధర జూన్‌ 12న 69.36 డాలర్లు ఉండగా 78 డాలర్లు దాటింది, మంగళవారం 67 డాలర్లకు పడిపోయి బుధవారం ఉదయానికి 68కి పెరిగింది. బి2 బాంబర్లతో అమెరికా జరిపిన దాడిలో ఇరాన్‌ అణుకేంద్రాలకు ఎలాంటి నష్టం జరగలేదని వార్తలు రాగా అమెరికా వాటిని ఖండిరచింది. మొత్తం మీద అమెరికా సామర్ధ్యం ప్రశ్నార్ధకంగా మారింది, నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఈ ఒప్పందం సజావుగా అమలు జరుగుతుందా, ఇతర సమస్యలను ఎలా పరిష్కరించుకుంటారు అన్న చర్చ మొదలైంది.


పశ్చిమాసియాలో ఏం జరగనుంది, కాల్పుల విరమణ అమలు జరుగుతుందా, ఆకస్మికంగా జరుగుతున్న పరిణామాల వెనుక ఏం జరిగిందీ అని పరిపరివిధాలుగా చర్చలు సాగుతున్నాయి. వాటన్నింటికీ కొద్ది రోజుల తరువాతే ఒక సమాధానం దొరుకుతుంది. యుద్ధాలు, ఉద్రిక్తతల సమయంలో ముందుగా బలయ్యేది ‘‘నిజం ’’. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక అన్నట్లుగా ఎవరేమి చెప్పినా దాన్ని యధాతధంగా తీసుకుంటే ఇబ్బందుల్లో పడతాము. ట్రంప్‌ ప్రకటనకు ముందు తరువాత ఏం జరిగిందన్నది ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం. రెండు వారాల తరువాత తాము యుద్ధంలో పాల్గ్గొనేదీ లేనిదీ వెల్లడిస్తామని ప్రపంచాన్ని తప్పుదారి పట్టించిన ట్రంప్‌ రెండు రోజుల్లోనే బి2 బాంబర్లతో ఇరాన్‌లోని అణుకేంద్రాలున్నట్లు భావిస్తున్న ప్రాంతాలపై దాడులు చేసి వాటిని పనికిరాకుండా చేశామని ప్రకటించాడు. అయితే అదింకా నిర్దారణ కాలేదని అమెరికన్‌ అధికారులే చెప్పారు. ముందుగానే ఊహించిన ఇరాక్‌ పాక్షికంగా శుద్ది చేసిన 408కిలోల యురేనియం, పరికరాలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వార్తలు.దీనికి ప్రతీకారంగా సోమవారం నాడు కతార్‌లోని అల్‌ ఉదీద్‌ అమెరికా మిలిటరీ స్థావరంపై ఇరాన్‌ దాడి చేసింది. తమలక్ష్యం ఇరాన్‌లోని అణుశుద్ధి సామర్ధ్యాన్ని దెబ్బతీయటమేనని, దాన్ని జయప్రదం కావించినట్లు ట్రంప్‌ చెప్పాడు. అలాంటిదేమీ లేదని ఇరాన్‌ చెప్పగా, కొత్తగా రేడియేషన్‌ ముప్పు లేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చెప్పింది. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు ఖాళీ చేసిన తరువాత ఎవరూ లేని భవనాలను మనదేశం దెబ్బతీసినట్లుగా అమెరికా దాడి ఉన్నట్లు చెప్పుకోవచ్చు.గగనతలంలోనే ఇంథనం నింపుకుంటూ దాదాపు పన్నెండువేల కిలోమీటర్ల దూరం 37 గంటల పాటు ప్రయాణించి బి2 బాంబర్లు దాడి చేసి వెనక్కు వెళ్లిపోయాయి. ఆటముగియలేదు అని దాడి తరువాత ఇరాన్‌ ప్రకటించింది.తామెవరికీ హనితలపెట్టలేదని అయితే ఎవరి నుంచీ ఎట్టిపరిస్థితిలోనూ వేధింపులను సహించేది లేదని అధినేత అలీ ఖమేనీ ప్రకటించాడు.


రెండు దేశాలూ శాంతికోసం తనను సంప్రదించాయని డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పుకున్నాడు. కాల్పుల విరమణకు ట్రంప్‌ తమను అభ్యర్ధించినట్లు ఇరాన్‌ ప్రకటించింది.రెండు దేశాలూ ఏదో విధంగా ఒప్పందం కుదరాలనే చూశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాల్పుల విరమణ వెనుక కతార్‌ కూడా ఉందనే వార్తలు వచ్చాయి. దోహా సమీపంలో ఉన్న అమెరికా వైమానిక స్థావరం మీద తాము దాడి చేయనున్నట్లు ముందుగానే ఇరాన్‌ తెలియచేసింది. తమ సత్తా ఏమిటో చూపేందుకే టెహరాన్‌ క్షిపణి దాడి చేసినట్లు కనిపిస్తోంది. యుద్ధం అన్న తరువాత ఉభయపక్షాలకూ నష్టమే. ఇప్పటికే ఆంక్షలతో బాగా దెబ్బతిన్నది ఇరాన్‌. గాజా మీద దాడులు చేస్తూ ఇజ్రాయెల్‌ కూడా ఆర్థికంగా ఎంతో నష్టపోయింది.ఇరాన్‌ మీద దాడులకు కూడా దానికి భారీగానే చేతిచమురు వదిలింది. అన్నింటికీ మించి పశ్చిమదేశాలు అందించిన రక్షణ కవచం ఐరన్‌ డ్రోమ్‌ తమను పూర్తిగా కాపాడుతుంది అన్న భ్రమల్లో ఉన్న ఇజ్రాయెలీలు అది పూర్తిగా వాస్తవం కాదని తొలిసారి తెలుసుకున్నారు. దీంతో సాధారణ పౌరుల నుంచి వచ్చిన వత్తిడి కూడా నెతన్యాహు మీద పని చేసిందనే చెప్పాలి. అమెరికాదీ అదేపరిస్థితి, ఇజ్రాయెల్‌కు ఎంతగా ఆయుధాలు అమ్మినా దాని వలన అమెరికన్‌ కంపెనీలకు లాభాలు తప్ప సాయం రూపంలో ఇచ్చే మొత్తం అమెరికా ఖజానా నుంచే భరించాల్సి ఉంది.ఇరాన్‌ అణుకేంద్రాలపై దాడి తరువాత దాని గురించి అమెరికా జనంలో పరిణామాలు, పర్యవసానాల గురించి, అసలు ఇది సరైన చర్యేనా అని పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. భవిష్యత్‌లో అమెరికా ఏ యుద్దంలోనూ పాల్గొనదని ప్రకటించిన ట్రంప్‌ ఇలా చేశాడేమిటి అని తర్జనభర్జనలు పడ్డారు. ఇరాన్‌ ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పటంతో ప్రపంచంలోని అమెరికన్లందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ట్రంప్‌ సర్కార్‌ హెచ్చరించటం కూడా దీనికి తోడైంది. ట్రంప్‌ చర్యను డెమోక్రటిక్‌ పార్టీ విమర్శించటం, అనేక చోట్ల యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు జరగటంతో ట్రంప్‌పై వత్తిడి పెరిగింది.


ఇరాన్‌ అణుశుద్ధి సామర్ధ్యాన్ని పూర్తిగా దెబ్బతీశామని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. అందువలన అంతకు ముందు మాదిరి తమతో మరోసారి ఒప్పందానికి రావాలని డిమాండ్‌ చేసే అవకాశం లేదు. దానికి భిన్నంగా ఒప్పందానికి పట్టుబడితే చెప్పిన మాటలన్నీ డొల్ల అని యావత్‌ ప్రపంచం భావించటమే కాదు, అమెరికా పరువు పోతుంది. ఈ పూర్వరంగంలో అమెరికా ఏకపక్షంగా వైదొలిగిన ఒప్పందం భవిష్యత్‌ ఏమిటి ? ఇరాన్‌ తిరిగి తన కార్యక్రమాన్ని కొనసాగిస్తుందా ? ఇవన్నీ శేష ప్రశ్నలు.దౌత్య తరుణం తప్ప 2015లో కుదిరిన ఒప్పందాన్ని పునరుద్దరించే అవకాశాలు లేవని రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ రయబకోవ్‌ వ్యాఖ్యానించాడు.అయితే ట్రంప్‌ ప్రకటనకు ముందే ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఐరాస, అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయాలంటే అణుకార్యక్రమం నుంచి ఇరాన్‌ తప్పుకోవాలని, దానికి బదులు శాంతియుత ప్రయోజనాలకు సహకరిస్తామని హామీ ఇచ్చిన ఒప్పందాన్ని సులభంగా ఇరాన్‌ అణు ఒప్పందం అని పిలుస్తున్నారు. దాని పూర్తి పేరు ‘‘ సంయుక్త సమగ్ర కార్యాచరణ పధకం(జెసిపిఓఏ). ఇరాన్‌తో పాటు భద్రతా మండలిలో ఉన్న ఐదు శాశ్వత సభ్యదేశాలైన అమెరికా,రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్సు, ఐరోపాయూనియన్‌తో పాటు జర్మనీ దీనిలో భాగస్వాములు.2013లో సంప్రదింపులు ప్రారంభమై 2015లో ఒప్పందం కుదిరింది.మరుసటి ఏడాది జనవరి 20 నుంచి అమల్లోకి వచ్చింది.ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌, సౌదీ అరేబియా వ్యతిరేకించగా ఇరాన్‌, అమెరికాల్లో ప్రభుత్వ వ్యతిరేకులు కూడా వ్యతిరేకించారు. దీన్నుంచి 2018లో అమెరికా వైదొలగటమే గాక మరిన్ని కఠినమైన ఆంక్షలను ప్రకటించింది.ఇరాన్‌తో ఎవరు వాణిజ్య లావాదేవీలు జరిపినా ఆ దేశాల మీద కూడా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. దాంతో మనదేశం అక్కడి నుంచి చమురు కొనుగోలు నిలిపివేసింది.


ఒప్పందం ప్రకారం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి 13 సంవత్సరాల్లో మధ్యతరహా శుద్ది చేసిన యురేనియం మొత్తాన్ని తొలగించాలి, నిల్వల్లో 98శాతం కోత పెట్టాలి, గ్యాస్‌ సెంట్రిఫ్యూజుల్లో మూడోవంతు తగ్గించాలి.పదిహేను సంవత్సరాల పాటు భారజల కేంద్రాలను నిర్మించరాదు,యురేనియంను 3.67శాతమే శుద్ధి చేయాలి.పదేండ్లలో తొలితరం శుద్ధి కేంద్రానికే పరిమితం కావాలి, మిగిలిన కేంద్రాలను అణువ్యాప్తి నిరోధించే కేంద్రాలుగా మార్చాలి. వీటన్నింటినీ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణకు అంగీకరించాలి.దీనికి ప్రతిఫలంగా అమెరికా, ఐరోపాయూనియన్‌, ఐరాస భద్రతా మండలి విధించిన అణుసంబంధ ఆంక్షలన్నీ ఎత్తివేయాలి. ఈ ఒప్పందం ఎనిమిది సంవత్సరాలు లేదా ఒప్పందం అమలు జరిగినట్లు అణు ఇంధన సంస్థ నిర్ధారించేవరకు అమల్లో ఉండాలని భద్రతామండలి తీర్మానించింది.2016లో అధికారానికి వచ్చిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఒప్పంద నుంచి వైదొలుగనున్నట్లు సాంకేతికంగా చెప్పకపోయినా 2017 అక్టోబరు 12న తమ దేశ చట్టాల ప్రకారం ఒప్పందాన్ని నిర్దారించలేమని ప్రకటించాడు.2018 మార్చి నెలలో ఐఏఇఏ సమర్పించిన నివేదికలో ఒప్పందానికి ఇరాన్‌ కట్టుబడి అమలు చేస్తున్నదని పేర్కొన్నది. అయితే ఇరాన్‌ రహస్యంగా అమలు చేస్తున్న ఆయుధకార్యక్రమం గురించి ఈ సంస్థకు వెల్లడిరచలేదని ఏప్రిల్‌ 30న అమెరికా, ఇజ్రాయెల్‌ ఆరోపించాయి. మే 18వ తేదీన ఒప్పందం నుంచి తాను వైదొలుగుతున్నట్లు అమెరికా ఏకపక్షంగా ప్రకటించింది.తరువాత నవంబరు నుంచి అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. తాము ఒప్పందానికి కట్టుబడి ఉండేది లేదని 2020జనవరి ఐదున ఇరాన్‌ ప్రకటించింది, అయితే అణుఇంధన సంస్థతో సమన్వయం చేసుకుంటామని ప్రకటించింది.


ఈ ఒప్పంద పూర్వరంగాన్ని పరిశీలించకపోతే సమగ్రత రాదు.1970లో ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఆనాడు అక్కడ అమెరికా అనుకూల రాజు ఉండటంతో శాంతికోసం అణువులు అనే కార్యక్రమం కింద సాయం చేస్తామని, దానికి ప్రతిగా అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి) మీద సంతకం చేయించింది అమెరికా. 1979 ఇరాన్‌ రివల్యూషన్‌లో అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని కూలదోసి అయాతుల్లా రుహల్లా ఖొమైనీ అధికారానికి వచ్చాడు. ఎన్‌పిటి అమలు సందేహాస్పదమైంది. అనేక మంది అణుశాస్త్రవేత్తలు ఇరాన్నుంచి పారిపోయారు. అణుపరిజ్ఞానం పట్ల ఖొమైనీ కూడా తొలిరోజుల్లో ఆసక్తి చూపలేదు.1980దశకం చివరిలో ఎన్‌పిటిని పక్కన పెట్టి చైనా సాయంతో అణుకార్యక్రమాన్ని ప్రారంభించారు, తరువాత పాకిస్తాన్‌, రష్యా కూడా దానికి సహకరించింది.2002లో పారిస్‌లో ఉన్న ఇరాన్‌ అసమ్మతివాదులు ఇరాన్‌ అణుకార్యక్రమం, కేంద్రాల గురించి వెల్లడిరచారు. తరువాత ప్రభుత్వం కూడా వాస్తవమే అని చెప్పింది.2003లో అణువిద్యుత్‌ కేంద్రాల సందర్శనకు ఐఎయిఏ ప్రతినిధులను అనుమతించారు తప్ప నమూనాలను సేకరించేందుకు తిరస్కరించారు.ఎన్‌పిటి రక్షణ జాగ్రత్తలు తీసుకోవటం లేదని ఆ సంస్థ నివేదించింది.2004లో కుదిరిన పారిస్‌ ఒప్పందం ప్రకారం తాత్కాలికంగా యురేనియం శుద్ధిని నిలిపివేసేందుకు అంగీకరించింది. అయితే తమ ప్రతినిధులు దేశద్రోహానికి పాల్పడ్డారని ప్రకటించిన ఇరాన్‌ 2006లో ఆ ఒప్పందం నుంచి వైదొలిగింది. తాము అణువిద్యుత్‌ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకుంటున్నాం తప్ప అయుధాల కోసం కాదని ప్రకటించింది. దాంతో భద్రతా మండలి చేసిన తీర్మానంలో అణుశుద్ది నిలిపివేయాలని కోరింది. క్షిపణి పరిజ్ఞానాన్ని అందచేయకూడదని ఇతర దేశాలను ఆదేశించింది, కొందరి ఆస్తులను స్తంభింపచేసింది.తరువాత మరో ఐదు తీర్మానాలు చేసి ఆంక్షలు విధించింది. తరువాత 2013లో అమెరికా చొరవతో చర్చలకు తెరతీశారు. ఆ తరువాత ఏం జరిగిందీ పైన చూశాం. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని ఏం చేస్తారు, తదుపరి చర్యలేమిటి అన్నది పెద్ద ప్రశ్న.

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ అంచనా తప్పిందా, బంకర్‌లో నెతన్యాహు, జి7 సభ నుంచి అర్ధంతరంగా వెనుదిరిగిన ట్రంప్‌ !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఇరాన్‌లో తెల్లవారు రaామున మూడు గంటల సమయంలో 2025 జూన్‌ 13వ తేదీ ఇజ్రాయెల్‌ వైమానిక దళం విరుచుకుపడిరది.రెండువందల జెట్‌లతో వంద లక్ష్యాలపై దాడి చేసింది. అనేక మంది మిలిటరీ ఉన్నతాధికారులు, అణుశాస్త్రవేత్తలను హత్యచేసింది. మరోవైపున ఆకస్మికదాడిని ఊహించని ఇరాన్‌ వెంటనే కోలుకొని ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రాణ భయంతో బంకర్‌లోకి వెళ్లిపోయాడు, నలభై లక్షల జనాభా ఉన్న రాజధాని టెల్‌అవీవ్‌ నగరం దాడులతో అతలాకుతలం అయినట్లు చెబుతున్నారు.కెనడాలో జరుగుతున్న జి7 కూటమి సమావేశాల నుంచి అర్ధంతరంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక రోజు ముందుగానే వెనుదిరిగాడు. ఇది రాసిన సమయానికి రెండు దేశాల మధ్య పరస్పరదాడులు కొనసాగుతున్నాయి. కోటీ 70లక్షల జనాభా ఉన్న టెహరాన్‌ నగరాన్ని వదలి వెళ్లాలని ఇజ్రాయెల్‌, దానికి వెన్నుదన్నుగా ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ పిలుపు ఇవ్వగా టెల్‌అవీవ్‌ను ఖాళీ చేయాలని ఇరాన్‌ ప్రకటించింది. ఇటీవలి కాలంలో నివాసిత ప్రాంతాల నుంచి జనం ఖాళీ చేయాలన్న పిలుపులు సర్వసాధారణంగా మారాయి. యుద్ధ సమయంలో జరిగిన నష్టాల గురించి ఎవరు ఏమి చెప్పినా అతిశయోక్తులు ఉంటాయన్నది తెలిసిందే. తమ పౌర నివాసాలపై ఇరాన్‌ దాడులు చేస్తున్నదంటూ ఇజ్రాయెల్‌ గుండెలు బాదుకుంటున్నది.దానికి పశ్చిమ దేశాల మీడియా సమర్ధన, కావాలంటే వారు కూడా మిలిటరీ కేంద్రాల మీద దాడులు చేయవచ్చు కదా అన్నట్లు ఫోజుపెడుతున్నాయి. ఇజ్రాయెల్‌ తొలిరోజు జరిపిన దాడి టెహరాన్‌లోని పౌరనివాస భవనం మీదే, అక్కడ నివశిస్తున్న అణుశాస్త్రవేత్తలతో సహా 60 మంది మరణించారు. నిత్యం గాజాలో ఆసుపత్రులు, పాఠశాలలతో సహా, నివాసభవనాలు చివరికి సహాయశిబిరాలు, సహాయ కేంద్రాల వద్ద ఉన్న పౌరుల మీద మారణకాండ జరుపుతున్నది, వేలాది మంది పిల్లలు, మహిళలు, కదలలేని వృద్దుల ఉసురుతీస్తున్న తీరు ప్రపంచం చూడటం లేదా !


కెనడాలో జరుగుతున్న జి7 కూటమి సమావేశాల నుంచి ముందే ఎందుకు వెనుదిరిగి వెళ్లిపోతున్నారన్న ప్రశ్నకు ఇంతకంటే ముఖ్యమైన పనులున్నాయని ట్రంప్‌ బదులిచ్చాడు. అటువంటపుడు అసలా సమావేశానికి ఎందుకు వెళ్లినట్లు ? ఈ పరిణామం గురించి భిన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఊహించినదానికి భిన్నంగా ఇరాన్‌ దాడులకు దిగటంతో తలెత్తిన పరిస్థితిలో ఏం చేయాలన్న తర్జన భర్జనలకు అన్నది ఒకటైతే, ఇరాన్‌పై స్వయంగా అమెరికా దాడులకు పూనుకోవాలన్న వత్తిడి పెరిగిన కారణం అని రెండవదిగా చెబుతున్నారు. రెండూ ఒకదానితో ఒకటి సంబంధాలు కలిగిన అంశాలే గనుక ఏం చేయనున్నారనేదాన్ని బట్టి పరిణామాలు ఉంటాయి. ఇరాన్‌ అణుబాంబులు తయారు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుందని గతంలో వార్తలు వచ్చాయి. అందుకే ట్రంప్‌ 60రోజుల్లో ఒప్పందానికి రాకపోతే మీ అంతు చూస్తానని ట్రంప్‌ బెదిరించాడు. ఆ గడువు ముగిసిన మరుసటి రోజే ఇజ్రాయెల్‌ దాడులకు దిగింది. అంతకు ముందు జాతీయ గూఢచార సంస్థ అధిపతి తులసీ గబ్బార్డ్‌ సెనెట్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఇరాన్‌ అణుబాంబును తయారు చేయటం లేదని గూఢచారులు అంచనాకు వచ్చినట్లు చెప్పారు. అణుకార్యక్రమం నుంచి వైదొలిగేట్లు చేసే వత్తిడిలో భాగంగా ఇజ్రాయెల్‌ దాడులకు ట్రంప్‌ పచ్చజెండా ఊపినట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో కొన్ని కేంద్రాలు పాక్షికంగా దెబ్బతినటం తప్ప భూగర్భంలో ఉన్న అసలైన కేంద్రాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వార్తలు వచ్చాయి. వాటిని దెబ్బతీయాలంటే బి2 బాంబర్లు లేదా 30వేల పౌండ్లు(13,607కిలోలు) భారీ బాంబులు అవసరం, అవి ఇజ్రాయెల్‌ వద్దలేవు గనుక నేరుగా అమెరికా రంగంలోకి దిగాలని వత్తిడి వస్తున్నదట. ఇంతకంటే ముఖ్యమైన పనులన్న ట్రంప్‌ వ్యాఖ్యకు ఇదే అర్ధమా ? లేక గౌరవ ప్రదంగా ఇజ్రాయెల్‌ను ఎలా బయటపడవేయాలని చూస్తున్నాడా ?


కెనడా నుంచి అర్ధంతరంగా ట్రంప్‌ వాషింగ్టన్‌ వెళ్లటం ఇరాన్‌ మరియు ఇజ్రాయెల్‌ మధ్య సయోధ్య కుదర్చటానికే అని ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్‌ మక్రాన్‌ వ్యాఖ్యానించాడు. అయితే మక్రాన్‌ చెప్పింది తప్పని, మీడియాలో ప్రచారం కోసం తాపత్రయపడుతున్నాడని, తన తిరుగు ప్రయాణానికి సయోధ్యకు సంబంధమే లేదని ట్రంప్‌ చెప్పాడు. అతగాడి మాటలను విశ్వసించాల్సినపని లేదు. ఇజ్రాయెల్‌ చర్యల గురించి పరిపరి విధాలుగా చర్చ జరుగుతున్నది. గతంలో మారణాయుధాలను గుట్టలుగా పోసిన ఇరాక్‌ నేత సద్దాం హుస్సేన్‌ ప్రమాదకరంగా మారినందున తాము దాడిచేశామని అమెరికా తప్పుడు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇరాన్‌ అణుబాంబు కార్యక్రమంలో ఉందని అది తమకు ముప్పు అని అందుకే ముందు జాగ్రత్తగా దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ ప్రపంచాన్ని నమ్మించేందుకు చూస్తున్నది. దానికి అమెరికా, ఐరోపా ధనిక దేశాలు వంతపాడాయి. వర్తమాన ప్రపంచంలో అణుబాంబులు కలిగిన దేశాలు కొన్ని తమకు లొంగని వారిని బెదిరించేందుకు పూనుకున్నాయి. అందువలన ఆత్మరక్షణ కోసం అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని ఏ దేశమైనా అణ్వాయుధాలను తయారు చేయవచ్చు. మనదేశం కూడా ఆ విధంగానే తయారు చేసింది. అణువిద్యుత్‌ కేంద్రాలు కలిగిన ఏ దేశమైనా ఆయుధాల తయారీకి అవసరమైన యురేనియంను శుద్ది చేసే సత్తా కలిగి ఉంటుంది.అమెరికా తొత్తు ప్రభుత్వాన్ని కూల్చివేసిన తరువాత మరోసారి అమెరికా కుట్రలకు సమాధానం చెప్పేందుకు ఇరాన్‌ నూతన నాయకత్వం అణుకార్యక్రమం చేపట్టింది.


నేడు పశ్చిమాసియాలో యుద్ధం చెలరేగటానికి అసలైన నేరస్తురాలు అమెరికా. ఇరాన్‌ తనకు కొరకరాని కొయ్యగా మారినప్పటి నుంచి దానికి వ్యతిరేకంగా చేయని కుట్ర లేదు. ఇజ్రాయెల్‌ తనకు ఇరుగు పొరుగు అరబ్‌, ఇస్లామిక్‌ దేశాల నుంచి ముప్పు ఉందంటూ పాలస్తీనాకు కేటాయించిన ప్రాంతాలతో పాటు ఇరుగుపొరుగుదేశాల ప్రాంతాలను ఆక్రమించింది. యూదులను తరలించి ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో జనాభా నిష్పత్తిని మార్చి అవి తమ ప్రాంతాలే అని చెప్పేందుకు పూనుకుంది. ఇప్పుడు ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని బూచిగా చూపి రక్షణ కావాలంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నది. ఇరాన్‌ అణుసమస్య పదమూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. నాటోలో చేరాలా లేదా అన్నది ఒక సార్వభౌత్వ దేశంగా ఉన్న ఉక్రెయిన్‌కు ఉందని వాదిస్తున్న అమెరికా అదే సార్వభౌమత్వం కలిగిన ఇరాన్‌ అణుబాంబును తయారు చేస్తుంటే చేయటానికి వీల్లేదని చెప్పటం అడ్డగోలు వ్యవహారం తప్ప మరొకటి కాదు. నాటోను విస్తరించబోమని గతంలో రష్యాతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లుగానే ఇరాన్‌తో చేసుకున్న 2015నాటి అణు నిరోధ ఒప్పందాన్ని అమలు జరపకుండా 2018లో ఏకపక్షంగా వైదొలిగింది. నాటోలో చేరే ఉక్రెయిన్‌తో తనకు ముప్పు ఉన్నందున రష్యా దాని మీది సైనిక చర్యను ప్రారంభించినట్లుగానే అమెరికా స్వయంగా వైదొలిగినందున తన కార్యక్రమాన్ని ఇరాన్‌ కొనసాగిస్తున్నది.ఇప్పుడు అది ఒక దశకు వచ్చినట్లు పసిగట్టింది గనుక ఆపివేయాలంటూ ఏకపక్షంగా బెదిరింపులకు దిగింది. ఆ ఒప్పందాన్ని అమెరికా పూర్తిగా అమలు జరిపి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదు, ఇరాన్‌ మరియు ఇజ్రాయెల్‌ కూడా సురక్షితంగా ఉండేవి. అందువలన అసలు నేరస్తురాలు అమెరికా. చరిత్రను చూసినపుడు అది అడుగుపెట్టిన ప్రతి చోటా సమస్య పరిష్కారం సంగతి తరువాత కొత్త వివాదానికి తెరలేపటాన్ని చూడవచ్చు. ఒక విషవలయంగా మార్చి తన రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకోసం చూస్తున్నది. పశ్చిమాసియాలో అది ఇంతవరకు ఎలాంటి నిర్మాణాత్మక పాత్రను పోషించటం లేదు, ప్రతినాయకుడిగా మారుతున్నది. పాలస్తీనా సమస్యను పరిష్కరించకుండా చూస్తున్నది, గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని విహార ప్రాంతంగా మారుస్తానని ట్రంప్‌ చెప్పటం మరింత అగ్నికి ఆజ్యం పోయటం గాక మరేమిటి ? మధ్యప్రాచ్య అడవిలో రారాజు సింహం లాంటిది అమెరికా, దానిలో కందిరీగవంటిది ఇరాన్‌, దాన్ని చంపటానికి అవసరమైతే మొత్తం అడవిని తగలబెట్టాల్సి ఉంటుందంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో ఒక రచయిత పేర్కొన్నాడంటే అమెరికన్ల ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

తాజా దాడులలో ఇప్పటి వరకు కనిపించినదాన్ని బట్టి ఇజ్రాయెల్‌కు ఉన్న పరిమితులు ఏమిటో అది అమెరికాను కూడా ఎలా యుద్దానికి లాగేందుకు చూస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. ఇరాన్‌ శక్తిని అది తక్కువ అంచనా వేసింది. లెబనాన్‌లో ప్రభుత్వేతర సాయుధ శక్తిగా ఉన్న హిజబుల్లా నెట్‌వర్క్‌లో ప్రవేశించి గత ఏడాది దానికి భారీ నష్టం చేకూర్చింది. అదే మాదిరి ఇరాన్‌లో చేయాలని చూసింది, కొందరు విద్రోహులను చేరదీసి కొంత మేరకు నెరవేరినట్లు కనిపిస్తున్నది. ఇరాన్‌లో ఎందరు మిలిటరీ కమాండర్లను హతమార్చినా ప్రత్యామ్నాయం ఉంటారన్న అంశాన్ని విస్మరించింది.హిజబుల్లాలోనే అలాంటి నేతలు ఉన్నపుడు ఇరాన్‌లో కొదవేముంటుంది. తన తొత్తుతో దాడులు చేయించి ఇరాన్‌న్ను దారికి తెచ్చుకోవాలన్నది అమెరికా దుష్ట ఎత్తుగడ, రష్యాను దెబ్బతీసేందుకు ఉక్రెయిన్‌తో ఇటీవల భారీ ఎత్తున దాడులు చేయించినప్పటికీ పుతిన్‌ లొంగలేదు, అలాంటిది ఇరాన్‌ సలాం కొడుతుందా ? ఇరాన్‌ దాడులతో అమెరికా, ఇతర పశ్చిమదేశాలు ఏర్పాటు చేసిన ఇజ్రాయెల్‌ ఐరన్‌ డ్రోమ్‌ దాన్ని కాపాడలేకపోయింది. రాజధాని, ఇతర నగరాలపై క్షిపణులతో విరుచుకుపడటంతో అది నివ్వెరపోయింది. చివరకు ప్రధాని నెతన్యాహు కూడా బంకర్‌లో దాక్కోవాల్సి వచ్చింది. మీకు రెండో అవకాశం ఇస్తున్నా అంటూ ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌ కెనడా నుంచి ఆకస్మికంగా వెనుదిరగాల్సి వచ్చింది. తాను కూడా ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొనాలా లేదా అని అమెరికా మల్లగుల్లాలు పడుతున్నది. నిజానికి ఇజ్రాయెల్‌ దాడికి దిగినప్పటికీ అమెరికాయే దాడి చేస్తున్నట్లు ఇరాన్‌ పరిగణిస్తున్నది.


ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డుల మాజీ జనరల్‌ కమాండర్‌ మొహసెన్‌ రెజాయి ఒక మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయెల్‌కు ఇస్తున్న మద్దతు, ఆయుధాలను అమెరికా, ఐరోపా వెంటనే విరమించుకోవాలి. కొనసాగితే గగనతలంలో తమ క్షిపణులు తలపడతాయని, అవి అమెరికా, బ్రిటీష్‌, ఫ్రెంచి విమానాలు ఏవైనా తమకు ఒకటే అని అన్ని పరిణామాలు, పర్యవసానాలకు తాము సిద్దపడి ఉన్నామని చెప్పాడు. మేం ముందుగా దాడులు చేయంగానీ ముగించేది మాత్రం మేమే అన్నాడు. పర్షియన్‌ గల్ఫ్‌లో ఉన్న తమ చమురు కేంద్రాలను ధ్వంసం చేస్తే ఏ దేశం కూడా చమురును వినియోగించుకోకుండా చేస్తామని ఇరాన్‌ అధినేత అలీ ఖమేనీ సలహాదారు మహమ్మద్‌ జావేద్‌ లారిజాని కూడా స్పష్టం చేశాడు.హార్ముజ్‌ జలసంధిని మూసివేస్తామని ఇరాన్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇరాన్‌ పశ్చిమ ప్రాంతంలో ఉన్న కొన్ని కేంద్రాలను ఇజ్రాయెల్‌ దెబ్బతీయగలిగింది గానీ మధ్య,తూర్పు ప్రాంతాలో ఉన్న ముఖ్యమైన వాటిని అది తాకలేకపోయింది. తాము దాడులు చేయగానే అలీ ఖమేని వ్యతిరేకులు పెద్ద ఎత్తున రంగంలోకి వస్తారని అధికార మార్పిడికి ఆజ్యం పోయవచ్చని ఇజ్రాయెల్‌ భావించినట్లు కనిపిస్తోందని, దానికి భిన్నంగా పరిణామాలు ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.విబేధాలు ఉన్నప్పటికి ఉమ్మడి శత్రువుగా ఇజ్రాయెల్‌ దానికి మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర దేశాలను వారు చూస్తున్నారు.పశ్చిమాసియా అంతటా అమెరికా వ్యతిరేక ధోరణులు పెరుగుతున్నపుడు ఖమేనీ పాలనపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ జనంలో జాతీయ భావాలు పెరిగినట్లు కనిపిస్తోంది, యుద్ధం ఎన్నిరోజులు సాగుతుందో, ఎలా ముగుస్తుందో తెలియదు !

మోడీ ఏలుబడిలో మరింత దిగజారిన లింగ అంతరం : జిడిపికి 2.9లక్షల కోట్ల డాలర్లనష్టం, అడిగేవారు లేరనేగా ఇంత అన్యాయం !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇన్ని మంచి విషయాలు చెప్పారు కదా మీ వాడిలో ఉన్న రెండు లోపాలు చెబుతారా అని పిల్లనివ్వటానికి వచ్చిన పెద్దలు తండ్రిని అడిగారట. ఓస్‌ అంతేనా ఒకటి వాడికి తెలియదు, రెండు ఇతరులు చెప్పేది వినడు అన్నాడట. కొందరు పాలకులను చూస్తుంటే అదే అనిపిస్తోంది. పదకొండు సంవత్సరాల నరేంద్రమోడీ పాలన విజయోత్సవాలంటూ బిజెపి, దాని మిత్రపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి.సగం మందిగా ఉన్న మహిళల స్థితి బాగుపడకుండా ఎన్నికబుర్లు చెప్పినా అది నిజమైన వృద్ధి కాదు. పచ్చి నిజం ఏమిటంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత దేశంలో లింగఅంతరం తగ్గలేదు కదా , అంతకు ముందు ఉన్నదానికంటే దిగజారింది. దీని వలన జిడిపికి జరుగుతున్న నష్టం మామూలుగా లేదు.2015లో మెకెన్సీ గ్లోబల్‌ సంస్థ చెప్పినదాని ప్రకారం(2015 సెప్టెంబరు 25వ తేదీ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా) పురుషులతో సమంగా ఉపాధి, సమానపనికి సమానవేతనం గనుక అమలు జరిపితే ప్రపంచ జిడిపికి 2025నాటికి 12లక్షల కోట్ల డాలర్లు తోడవుతుందని, దానిలో ఎక్కువ మొత్తం 2.9లక్షల కోట్ల డాలర్లు భారత్‌లో తోడవుతుందిని స్పష్టంగా పేర్కొన్నది. అది నాటి వేతనాలు, ద్రవ్యోల్బణం తదితరాల ప్రాతిపదికన వేసిన అంచనా అది. ఈ మొత్తం ఇప్పుడు అంచనా వేస్తున్న 4.187లక్షల కోట్ల డాలర్లకు అదనం, జర్మనీని కూడా దాటి మూడో స్థానంలోకి వెళ్లిపోయి ఉండేది. అసమానతల తగ్గింపు కృషికి మోడీని ఎంపిక చేసినట్లు చెప్పటం మరొక ప్రహసనం. అధికారానికి వచ్చిన మూడేండ్లకే అలాంటి నిర్ణయానికి సియోల్‌ బహమతి ఎంపికదార్లు ఎలా వస్తారు.ప్రధాని నరేంద్రమోడీకి 2018 సియోల్‌(దక్షిణ కొరియా) శాంతి బహమతి ఇచ్చారు.దేనికటా ! 2018 అక్టోబరు 24వ తేదీ మనవిదేశాంగశాఖ వెబ్‌సైట్‌లో పెట్టిన సమాచారం మేరకు మోడినోమిక్స్‌ ద్వారా ప్రపంచ ఆర్థిక పురోగతిని పెంచటానికి, ఆర్థిక వృద్ధితో భారతీయుల మానవాభివృద్దిని వేగవంతం చేసేందుకు, ప్రజాస్వామ్య వృద్ధి, దేశంలో పేదలు, ధనికుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు చేసిన కృషిని బహుమతి కమిటీ గుర్తించి ఎంపిక చేసిందని పేర్కొన్నారు. పదేండ్ల అనుభవం ఏమిటి ? 1961లో మన దేశంలో ధనికులుగా ఉన్న ఎగువ ఒకశాతం మంది వద్ద జాతీయ సంపదలో 12.9శాతం పోగుపడితే అది ఇప్పుడు 40శాతం దాటింది. నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన 1991లో 20శాతంగా ఉన్న కేంద్రీకరణ మోడీ అధికారానికి వచ్చే నాటికి 30శాతానికి చేరింది, మోడీ దాన్ని 40శాతానికి చేర్చారు, అసమానత తగ్గింది ఎక్కడ ? దిగువ 50శాతం మంది సంపద 1961నుంచి 2023 మధ్య 11.4 నుంచి 6.5శాతానికి దిగజారింది, మధ్యతరగతి అనుకొనేవారిది కూడా 43.7 నుంచి 29శాతానికి దిగజారింది, అంటే వారు కూడా పేదల్లోకి వచ్చారు. చిత్రం ఏమిటంటే ఇంత అసమానతలు పెరుగుతుంటే నిష్టదారిద్య్రం నుంచి పాతిక కోట్ల మందిని మెరుగైన స్థితిలోకి నెట్టామని చెప్పుకుంటున్నారు. ఇదొక ప్రహసనం, అంకెల గారడీ !


కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలో మేము, మామిత్రులు ఉన్నాం అని చెబుతున్న నరేంద్రమోడీ గుజరాత్‌ సిఎంగా అనుభవంఉన్నప్పటికీ మెకెన్సీ నివేదిక చెప్పిందేమిటో అర్ధం కాలేదా, వారేమిటి మాకు చెప్పేది అని ఖాతరు చేయలేదా ? ఇంతవరకు లింగ అంతరం, ఆర్థిక అసమానతల తగ్గింపుకు ఎందుకు చర్యలు తీసుకోలేదు ? మోడీ విజయగీతాలాపనలో తలమునకలుగా ఉన్న మీడియాలో ఎక్కడా దీని ప్రస్తావన కనిపించదు, వినిపించదు.2014లో ప్రపంచ ఆర్థికవేదిక విడుదల చేసిన నివేదిక ప్రకారం లింగఅంతరంలో 142 దేశాల్లో మన స్థానం 114, వచ్చిన పాయింట్లు 0.6455 కాగా అదే సంస్థ విడుదల చేసిన 2025 నివేదికలో 148దేశాలకు గాను 131వ స్థానంలో ఉన్నాం, వచ్చిన మార్కులు 0.644, గతం కంటే తగ్గాయి. జపాన్‌ కంటే ఈ ఏడాది కొన్నివేల కోట్ల డాలర్లు ఎక్కువగా ఉండి నాలుగో స్థానంలోకి వస్తుందన్న అంచనాలను చూసి పండగచేసుకున్న వారు లింగ అంతరం దిగజారటం గురించి మాట్లాడరేం ! మహిళలంటే చిన్నచూపు, నిర్లక్ష్యం, దీని గురించి చర్చ జరిగితే మోడీ విజయ బండారం బయటపడుతుందని తప్ప మరొక కారణం ఏముంది ?


పదకొండు సంవత్సరాలుగా ఎన్ని కబుర్లు చెప్పినా తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి అంతం లేదు. ఉట్టికొట్టలేనయ్య స్వర్గానికి ఎగురుతాడా అన్నట్లుగా 2047నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతానని చెబుతున్నారు.లింగ అంతరం అంటే స్త్రీ, పురుషుల మధ్య ఉన్న సమానత్వంలో ఉన్న తేడా మదింపు. అవకాశాలు, విద్య, ఆరోగ్యం, రాజకీయ సాధికారత, బతికి ఉండటం సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే మార్కుల ఆధారంగా సూచికలను తయారు చేస్తారు, వాటికి ఆయా దేశాలు ఇచ్చే సమాచారమే ప్రాతిపదిక. ఆర్థికభాగస్వామ్యం, విద్య,వైద్యం,రాజకీయ సాధికారత అనే నాలుగు అంశాలపై విడివిడిగా సూచికలు రూపొందిస్తారు, వాటన్నింటిని కలిపి సాధారణ లింగఅంతర సూచికను తయారు చేస్తారు. వీటిలో కొన్ని పెరుగుదల తగ్గుదల ఉన్నప్పటికీ పది సంవత్సరాలలో మొత్తం మీద స్వల్ప తగ్గుదల నమోదైంది. పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బిల్లు ఆమోదించినప్పటికీ గత ఎన్నికలలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అందువలన మహిళా సాధికారత సూచికలో 2023 కంటే 2025లో 14.7 నుంచి 13.8కి పాయింట్లు తగ్గిపోయాయి.మహిళలకు మంత్రిపదవులు కూడా 6.5 నుంచి 5.6శాతానికి పడిపోయాయి. మరోవైపు త్వరలో జిడిపిలో మూడో స్థానానికి ఎదుగుతాం, అభివృద్ధి చెందిన దేశంగా మారనున్నాం అని అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు మన ఇరుగు పొరుగుదేశాల స్థితి గతులను చూద్దాం. అన్నింటికంటే అధమ స్థానంలో ఉన్న పాకిస్తాన్‌తో 148తో పోల్చుకుంటే 131లో మెరుగ్గా ఉన్నాం. తాజా సూచికలో ఏకంగా 75 స్థానాలను మెరుగుపరచుకొన్న బంగ్లాదేశ్‌ 24, చైనా 103,భూటాన్‌ 119, నేపాల్‌ 125, శ్రీలంక 130, మాల్దీవులు 138వ స్థానంలో ఉన్నాయి.

బేటీ పడావో బేటీ బచావో (ఆడపిల్లల్ని చదివించండి, ఆడపిల్లల్ని రక్షించండి) అంటూ పదేండ్ల క్రితం పెద్దగా ఒక పధకాన్ని నరేంద్రమోడీ ప్రారంభించారు.దరిద్రం ఏమిటంటే దానికి కేటాయించిన నిధులే స్వల్పం కాగా ఆ మొత్తాన్ని కూడా ఖర్చు చేయటం లేదు. ఆరేండ్లలోపు బాలబాలికల నిష్పత్తి 1961నుంచి మనదేశంలో పడిపోతోంది.1991లో ప్రతి వెయ్యి మంది బాలురకు గాను 945 మంది బాలికలు ఉండగా క్రమంగా తగ్గుతూ 2011 నాటికి 918కి పడిపోయింది, తరువాత ఇంతవరకు జనాభా లెక్కలు జరగలేదు గనుక కేవలం అంచనాలు మాత్రమే చెబుతున్నారు.2019 21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం అంతకు ముందు 201516తో పోల్చితే 919 నుంచి 929పెరిగిందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 934, తెలంగాణాలో 894 మంది ఉన్నారు. కేంద్ర గణాంకశాఖ 2023లో విడుదల చేసిన భారత్‌లో స్త్రీ, పురుషులు అనే నివేదిక ప్రకారం 2036నాటికి ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు 952 మంది ఆడపిల్లలు ఉంటారని అంచనా వేశారు. మొత్తంగా స్త్రీ, పురుషుల నిష్పత్తిని చూస్తే 2025లో ప్రతి 106.453 మంది పురుషులకు వందమంది మహిళలు ఉన్నారని, దీని ప్రకారం జనాభాలో పురుషులు 51.56 శాతం ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 48.44శాతంగా ఉన్న మహిళలు 2036 నాటికి 48.8శాతానికి పెరుగుతారని అంచనా.2010లో ప్రతి వంద మంది ఆడపిల్లలకు 109.6 మంది మగపిల్లలు ఉన్నారని అంచనా. ఈ కారణంగానే అనేక మంది యువకులకు వివాహాలు కావటం లేదు. మంచి ఉద్యోగం, సంపద, రాబడి ఉన్నవారిని మాత్రమే అమ్మాయిలు ఎంచుకుంటున్నారని, వ్యవసాయంలో ఉన్నవారికి ఆలశ్యం అవుతోందని చెబుతున్నారు. జనాభా లెక్కలను 2027లో సేకరించనున్నందున వాటిని నిర్ధారించిన తరువాత మాత్రమే వాస్తవ పరిస్థితి వెల్లడి అవుతుంది. అప్పటి వరకు చెప్పేవన్నీ అంచనాలు మాత్రమే. ఉదాహరణకు 2025లో మన జనాభా 144కోట్లని గతంలో అంచనా చెప్పారు. ఇప్పుడు 146.39 కోట్లంటున్నారు. ఆడపిల్లల పట్ల వివక్ష, లింగనిర్దారణ పరీక్షలు చేయించి అబార్షన్లు చేయించటం వంటి దుర్మార్గం జరుగుతున్న కారణంగా బేటీ బచావో పథకాన్ని 2015 జనవరి 22న ప్రవేశపెట్టారు గానీ ఆచరణలో అలాంటి చర్యలను ఆపేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోలేదు.లింగ అంతరం తగ్గకపోగా మరింతగా పడిపోవటానికి కారణం ఏమిటో ప్రధాని లేదా ఆయన మద్దతుదారులు చెప్పాలి. ఇంతవరకు ఏ బిజెపీ నేతా కాషాయదళాల మేథావులు కూడా స్పందించలేదు.

లింగ అంతరంలో ఆడపిల్లలు బతికి బట్టకట్టటాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు, ఈ పథకంలో బేటీ బచావో అన్నా అదే. అందుకే ఈ పథకం వైఫల్యం కూడా అంతరం మరింతగా పతనం కావటానికి దోహదం చేసిందని చెప్పాల్సి వస్తోంది. ఈ పథకానికి కేటాయించిన నిధులతో నరేంద్రమోడీ బొమ్మతో ప్రచారానికే ఎక్కువ ఖర్చు చేశారు. ఏడాదికి రెండు పాయింట్ల చొప్పున మెరుగుదల సాధించాలన్నది లక్ష్యం. అది జరిగినట్లు కనిపించటం లేదు. మహిళా సాధికారతపై పార్లమెంటరీ కమిటీ 2021 సమీక్షలో ఈ పథకానికి కేటాయించిన సొమ్ములో కేవలం 25.13శాతమే ఖర్చు చేసినట్లు, వాటిలో కూడా 80శాతం ప్రకటనలకే వెచ్చించినట్లు, ప్రత్యేకించి పంజాబ్‌, హర్యానాలతో పాటు అనేక రాష్ట్రాలలో పథక లక్ష్యాలు నెరవేరలేదని కూడా తేలింది. కాగ్‌ నివేదికలు కూడా దీన్నే సూచించాయి. పదేండ్లు దాటుతున్నా దీని అమలు గురించి సర్వేలే చేయలేదు.2019లో ప్రభుత్వమే పార్లమెంటుకు ఈ విషయాన్ని చెప్పింది. లింగ నిష్పత్తి ఏమాత్రం పెరిగినా దానికి ఈ పథకమే కారణం అని చెప్పే స్థితిలో పాలకులు లేరు. లింగ నిష్పత్తి ఈ పధకం ప్రారంభమైన తరువాత కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో 2014లో 1107 ఉండగా 201617 నాటికి 976కు, నికోబార్‌ దీవుల్లో 985 నుంచి 839కు పడిపోయిందని వార్తలు రాగా 201921 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం పుదుచ్చేరిలో 959, అండమాన్‌, నికోబార్‌లో 914 ఉన్నట్లు పేర్కొన్నారు.


2024 లింగ అంతరం నివేదిక ప్రకారం పురుషుడు రు.100 సంపాదిస్తే అదే పనికి మహిళకు ఇస్తున్నది రు. 39.80 మాత్రమే.ఇది ఒక్క చిన్న చిన్న ఉపాధి, ఉద్యోగాలకే కాదు, టెక్నాలజీ, క్రీడలు, సినిమా రంగాల్లో కూడా ఇదే పరిస్థితి అంటే అతిశయోక్తి కాదు.ప్రఖ్యాత హీరోయిన్‌ దీపికా పడుకోన్‌ 2021 ఆగస్టులో ప్రతిఫల చెల్లింపులో వివక్షను ప్రశ్నించారు. తన భర్త రణవీర్‌ సింగ్‌ ఎంత కష్టపడతారో తానూ అదే చేస్తానని తనకు తక్కువ మొత్తం ఇవ్వచూపినందుకు సంజయ్‌ లీలా బన్సాలీ సినిమా బైజు బావరాలో నటించేందుకు తిరస్కరించినట్లు ఆమె బహిరంగంగా చెప్పారు. ఆమె ఒక స్థాయికి ఎదిగారు గనుక అలా చెప్పగలిగారు, ఎందరికి అలాంటి అవకాశం ఉంది. నిజానికి ఇది బాలీవుడ్‌లోనే కాదు దేశంలోని అన్ని సినిమా రంగాల్లో , ఇతర చోట్ల ఉంది.హాకీలో పది రెట్లు ఉన్నట్లు ఫెమినిజమ్‌ ఇండియా నివేదిక అదే ఏడాది పేర్కొన్నది. 2015లో కేరళలో జరిగిన జాతీయ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌లో బహుమతిగా పురుషులకు రు.1.2లక్షలు, మహిళలకు రు.50వేలుగా నిర్ణయించటాన్ని నిరసిస్తూ తాను పోటీలలో పాల్గొనటం లేదని దీపికా పాలికల్‌ నిరాకరించింది. మనదేశ శ్రమశక్తి మార్కెట్‌లో వేతన వ్యత్యాసం పెద్ద సమస్యగా ఉంది. నరేంద్రమోడీ తన మన్‌కీ బాత్‌లో ఎన్నడూ దీని గురించి ప్రముఖంగా ప్రస్తావించినట్లు, తొలగించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎక్కడా కనిపించదు. కరోనా సమయంలో అంతకు ముందున్నదానికంటే వేతన వ్యత్యాసం ఏడుశాతం పెరిగిందని పిఎల్‌ఎఫ్‌ఎస్‌ సర్వే సమాచారం వెల్లడిరచింది.
ఉద్యోగాల్లో చేరటంలో ఒకే స్థాయిలో 46శాతం ఉన్నప్పటికీ సిఇఓ,సిఎఫ్‌ఓ, సివోవో వంటి ఉన్నత స్థానాలో 25శాతానికి మించి మహిళలు లేరని కెపిఎంజి, మరియు ఏఐఎంఏ 2024 సర్వేలో తేలింది.అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారిలో మహిళలే ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి సమానవేతనాలు లేకపోవటం ప్రసూతి సెలవు వంటి సామాజిక భద్రత లేని విషయం తెలిసిందే.శ్రామిక మహిళలకు 26వారాల ప్రసూతి సెలవు ఇవ్వాలనే చట్టసవరణ తరువాత అనేక మంది యజమానులు పిల్లల్ని కనేవయస్సులో ఉన్నవారిని పనిలో పెట్టుకోవటం తగ్గించటం లేదా రాజీనామా చేయించి తరువాత చేర్చుకోవటం వంటి పనులకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. స్త్రీని దేవతగా పూజించే దేశం కదా ! కొన్నిదేశాల్లో తండ్రులకు కూడా పిల్లల సంరక్షణ సెలవులు ఇస్తున్నకారణంగా మహిళల నియామక వివక్ష కొంత మేర తగ్గింది. మనదేశంలో సైతం ఎందుకు దాన్ని ప్రవేశపెట్టకూడదు ? చట్టసభల్లో మూడోవంతు సీట్లు ఇవ్వటానికే వామపక్షాలు మినహా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఎన్ని నాటకాలాడాయో చూశాము. ? భూస్వామిక వ్యవస్థ భావజాలం నుంచి బయపడతారా ? ఒకవైపు పురోగమనంలో ఉన్నామని చెబుతూ మహిళలను అణచివేసిన సనాతన ధర్మాన్ని, మనువాదాన్ని తలకెత్తుకుంటున్న శక్తులు రెచ్చిపోతున్న తరుణంలో పురుషులతో సమంగా స్త్రీలను చూసేందుకు అంగీకరిస్తారా !

భారత్‌లో జననాల రేటు 1.9 : ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ! ఎందరు హిందూత్వ వాదులు పది మందిని కన్నారు !!

Tags

, , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు


ప్రతి సమాజంలో కనీసం 2.1 మంది పిల్లల్ని కంటే అది అంతరించి పోకుండా ముందుకు సాగుతుంది ఇది జనాభా శాస్త్రవేత్తలు చెబుతున్న మాట.ప్రపంచ జనాభా తాజా నివేదిక ప్రకారం భారత్‌లో జననాల రేటు 1.9 మాత్రమే, అంటే ప్రతి మహిళ సగటున పిల్లల్ని కంటున్న సంఖ్య అది. 1960లో ఆరుగురికి జన్మ నిచ్చింది, ఇలా ఎందుకు ఇలా జరుగుతోంది. హిందూమతాన్ని రక్షించుకోవాలని, సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ పవన్‌ కల్యాణ్‌ లాంటి నేతలు ఊగిపోవటాన్ని చూస్తున్నాము. అది నటనో లేక నిజంగానే వేసే వీరంగమో తెలియదు. హిందువులను మైనారిటీలుగా మార్చి ఇస్లామిక్‌ దేశంగా మార్చేందుకు చూస్తున్నారంటూ విద్వేషాన్ని రెచ్చగొట్టే బాపతు మనకు ఈ రోజుల్లో ఎక్కడబడితే అక్కడ కనిపిస్తున్నది. 2015లో సాక్షి మహరాజ్‌ (69) అనే బిజెపి ఎంపీగా నాలుగుసార్లు పని చేసిన స్వామీజీ హిందూమతాన్ని రక్షించుకోవాలంటే హిందూ మహిళ కనీసం నలుగురు పిల్లల్ని కనాలని చెప్పారు. నలుగురు భార్యలను చేసుకొని40 మంది సంతానాన్ని కనటం భారత్‌లో వీలుకాదు అంటూ వేరే మతం వారి మీద విద్వేషం వెళ్లగక్కారు. మహాత్మాగాంధీని చంపిన గాడ్సే ఒక దేశభక్తుడని చెప్పిన ఈ పెద్దమనిషి సన్యాసాన్ని వదలి వేసి వివాహం చేసుకొని నలుగుర్నిగాక పోతే 40 మందిని ఎందుకు కనలేదన్నది ప్రశ్న. ఇలాంటి స్వాములు, స్వామినులు జనాలకు ఇలాంటి సుభాషితాలు చెబుతుంటారు.


‘‘ హిందువులు పదిమంది పిల్లల్ని కనాలంటూ మితవాద బృందాలు ఇచ్చిన పిలుపు ప్రతికూలఫలితమిస్తుంది ’’ అనే శీర్షికతో హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక 2016 డిసెంబరు 26న ఒక వార్తను ప్రచురించింది. దాని సారాంశం ఇలా ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు ఉన్న పీఠాధిపతులు ధర్మ సంస్కృతి మహాకుంభ పేరుతో మూడు రోజుల సమావేశం నిర్వహించారు. ముస్లిముల సంఖ్య వేగంగా పెరిగిపోయి హిందువులను మించిపోతారు గనుక హిందువులు పదిమంది పిల్లల్ని కనాలని ఈ సదస్సులో పిలుపునిచ్చారు.జ్యోతిర్‌ మఠ శంకరాచార్యుడు వాసుదేవానంద సరస్వతి మాట్లాడుతూ హిందువులు పదేసి మంది పిల్లల్ని కనాలని, దేవుడే వారి సంరక్షణ చూసుకుంటాడని సెలవిచ్చినపుడు మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్‌, అసోం గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌ ఆ సమావేశంలో ఉన్నారు. హిందూమత పరిరక్షకులం అని చెప్పుకొనే అనేక మంది ఆచరణ ఏమిటి ? ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న కమ్యూనిస్టుల నినాదాన్ని కాపీ కొట్టి హిందువులందరూ ఏకంకండి అని పిలుపులు ఇస్తున్నారు. అసలు వారి మధ్య ఏకీభావం ఉందా ? ప్రపంచమంతటా పెద్ద మతం క్రైస్తవం, వారు తమ మతాధిపతిగా పోప్‌ను ఎన్నుకుంటారు. అలాగే ఒక హిందూమతాధిపతిని ఎన్నుకోలేనివారు మొత్తం హిందువులందరినీ ఐక్యం కావాలని పిలుపు ఇవ్వటం దివాలాకోరుతనం కాదా ? ఎవరు అడ్డుకున్నారు ! నిలువు బొట్లు, అడ్డబొట్ల (సామాన్యులు కాదు ) పెద్దలు పరస్పరం ఆయా పుణ్యక్షేత్రాల గడపకూడా తొక్కరు. ఉదాహరణకు వైష్ణవాచార్యుడైన చిన్న జియ్యర్‌ స్వామి ఎన్నడైనా శివాలయాలకు వెళ్లటం ఎవరైనా చూశారా ! ఎందుకు బహిష్కరిస్తున్నట్లు ? ఈ ప్రశ్న నిరంతరం అడుగుతూ ఉండాల్సిందే. కాసేపు పక్కన పెడదాం.

అసలు హిందువులు ఎందరు పిల్లల్ని కనాలో చెప్పేవారి మధ్య ఏకీభావం ఉందా ? వారిని అసలు జనాలు పట్టించుకుంటున్నారా ? ఏ మాత్రం ఖాతరు చేసినా మనదేశంలో జనన రేటు 1.9కి పడిపోయి ఉండేది కాదు. హిందూత్వను పక్కాగా సమర్ధించే బిజెపి, దానికి పక్కా సనాతన్‌ అంటూ తోడైన పవన్‌ కల్యాణ్‌, మేమూ అదే అంటున్న తెలుగుదేశం పార్టీ తదితర మొత్తం 25 పార్టీల కలగూరగంప ఎన్‌డిఏ కూటమికి 2024లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల మొత్తం 43శాతం మాత్రమే. అదీ తమకు వివిధ రాష్ట్రాలలో ముస్లింలు, క్రైస్తవులు గణనీయంగా ఓట్లు వేశారని చెప్పుకున్న తరువాత, బిజెపి ఓట్లు 36.56శాతమే. అంటే మెజారిటీ హిందువులు, మొత్తం జనాభాలో ఈ కూటమికి మెజారిటీ లేదు. ఓట్లే వేయని వారు పది మంది పిల్లల్ని కనమంటే ముందుకు వస్తారా ? ఈ నినాదాలు ఇస్తున్నవారు, వాటిని బలపరుస్తున్నవారి కుటుంబాలలో ఎందరు అంతమందిని కన్నారో చెప్పమనండి.


2016 ఏప్రిల్‌లో గిరిరాజ్‌ సింగ్‌ అనే బిజెపి కేంద్ర మంత్రి ‘‘ ప్రతి ఒక్కరూ ఒకరూ లేదా ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలి, అంతకు మించి కన్నవారికి ఓటింగ్‌ హక్కులు రద్దు చేయాలి. ఈ నిబంధన భారతీయులందరికీ వర్తింప చేయాలి. హిందువులు, ముస్లింలు కూడా ఇద్దరేసి కొడుకులను మాత్రమే కనాలి. బీహార్‌లోని చంపరాన్‌ జిల్లాలో హిందూమత పెద్దలు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఈ మాటలు మాట్లాడారు. బీహార్‌లోని ఏడు జిల్లాల్లో ‘‘ మన జనాభా ’’ తగ్గిపోయిందని వాపోయారు. సాక్షి మహరాజ్‌గా సుపరిచితుడైన బిజెపి ఎంపీ, అవివాహితుడైన స్వామి సచ్చిదానంద హరి 2015 జనవరిలో మాట్లాడుతూ హిందూమత పరిరక్షణకోసం ప్రతి కుటుంబం నలుగురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. మరో అవివాహిత, విశ్వహిందూపరిషత్‌ నాయకురాలు సాధ్వీ ప్రాచీ మరింత ముందుకు పోయారు. సింహం కేవలం ఒక పిల్లకు మాత్రమే పరిమితం కాకూడదు.మనం కూడా ప్రతి కుటుంబంలో నలుగురు పిల్లల్ని కనాలి.సరిహద్దుల్లో ఒకరు శత్రువు మీద పోరాడాలి. ఒకర్ని సాధువుగా చేయాలి, మరొకర్ని సామాజిక సేవకోసం విశ్వహిందూపరిషత్‌కు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన శ్యామల్‌ గోస్వామి అనే నేత హిందూయిజం, సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందూ కుటుంబం ఐదుగురు పిల్లల్ని కనాలని చెప్పారు. కన్నయ్యదాస్‌ అనే అయోధ్య పూజారి, విశ్వహిందూపరిషత్‌ మద్దతుదారు కనీసం ఎనిమిది మంది పిల్లల్ని కనాలన్నారు.2015లో అలహాబాదులో జరిగిన మాఘమేళ సందర్భంగా బదరీకాశ్రమం శంకరాచార్య వాసుదేవానంద సరస్వతి మాట్లాడుతూ హిందువుల ఐక్యత కారణంగానే మోడీ ప్రధాని అయ్యారని, అందువలన మెజారిటీని కొనసాగించాలంటే ప్రతి హిందూ కుటుంబం పది మంది పిల్లల్ని కంటూ ఉండాలని చెప్పారు.విశ్వహిందూ పరిషత్‌ నేత ప్రవీణ్‌ తొగాడియా ఏం చెప్పారంటే ప్రతి హిందూ జంట నలుగురు పిల్లల్ని కనాలని సాక్షి మహరాజ్‌ చెప్పిందాంట్లో తప్పేముంది ? ఇతరులు పదిమందిని కంటుంటే మాత్రం ఎవరూ ఎలాంటి ప్రశ్న వేయరు, హిందువుల విషయంలోనే ఈ రచ్చ ఎందుకు అని వాదించారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన సంస్థలలో ఒకటైన విశ్వహిందూపరిషత్‌ అధ్యక్షుడిగా ఉన్న ప్రవీణ్‌ తొగాడియా ఆర్‌ఎస్‌ఎస్‌ నడిపే పత్రిక ఆర్గనైజర్‌లో రాసిన ఒక వ్యాసంలోని అంశాన్ని హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక 2015 సెప్టెంబరు మూడవ తేదీన ‘‘ ముస్లింలకు ఇద్దరు పిల్లల నిబంధన ఉండాలన్న విహెచ్‌పి ప్రవీణ్‌ తొగాడియా ’’ అనే శీర్షికతో ఇచ్చిన వార్తలో ఉటంకించింది. ముస్లింలలో ప్రతి బిడ్డ పుట్టుకకు సబ్సిడీ ఇవ్వటం గాక ఇద్దరు బిడ్డలు పుట్టిన తరువాత కచ్చితమైన నిరోధాన్ని పెట్టాలని, అది శిక్షార్హమైన నేరంగా మరియు రేషన్‌, ఉద్యోగాలు, విద్యా సౌకర్యాలను నిలిపివేసి జనాభాను క్రమబద్దీకరించి మెరుగైన అభివృద్ది చేయాలని ప్రవీణ్‌ తొగాడియా రాశారని పేర్కొన్నది.జనాభా జీహాద్‌ను ఇప్పుడు వ్యతిరేకించకపోతే భారత్‌ త్వరలో ముస్లిం దేశంగా మారిపోతుందన్నారు.జనాభాలో వచ్చే మార్పులతో హిందూ కుటుంబాలు, భూమి, ఆస్తులు, మతపరమైన ప్రాంతాలు, ఉపాధి, వ్యాపారం, ఇతర అన్నింటికీ ముప్పు తలెత్తే ప్రమాదం ఉందని తొగాడియా పేర్కొన్నారు.


కాషాయ దళాల మాటలను ఎందుకు ప్రస్తావించాల్సి ఉందంటే వీరు లేక ముందు కూడా వేల సంవత్సరాలుగా హిందూమతం ఉనికిలో ఉంది. వందల సంవత్సరాల పాటు మొఘలులు, ఆంగ్లేయులు దేశాన్ని ఆక్రమించి పాలన సాగించినా 80శాతం ఇప్పటికీ హిందువులుగానే ఉన్నారు. మనుధర్మం, మరొకపేరుతో దళితులు, గిరిజనులను అమానుషంగా చూసిన కారణంగానే వారిలో అనేక మంది ముస్లిం, క్రైస్తవులుగా మారారు తప్ప అందరూ విదేశాల నుంచి వలస వచ్చిన వారి వారసులు కాదు.ఇప్పుడేదో హిందూమతానికి ముప్పు వచ్చిందని పదేసి మంది పిల్లల్ని కనాలంటూ పిలుపులు ఇస్తుంటే వాటిని జనం ముఖ్యంగా మహిళలు పట్టించుకోవటం లేదు. అందుకే పదేండ్ల నాటికీ ఇప్పటికీ జననాల రేటు తగ్గిపోతున్నది.

పిటిఐ వార్తా సంస్థ ఇచ్చిన వార్త ప్రకారం (2025జనవరి 25) ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ ప్రయాగ్‌రాజ్‌ పట్టణంలో జరిగిన విరాట్‌ సంత్‌ సమ్మేళనంలో పాల్గొన్నారు.(ఎగువన ఉన్న ఫొటోలో చూడవచ్చు) మహాకుంభనగర్‌లో జరిగిన ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్‌ ప్రధాన కార్యదర్శి భజరంగ్‌ లాల్‌ బాంగ్రా ప్రతి హిందూ కుటుంబం ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. హిందువుల్లో జననాల రేటు తగ్గిపోవటం గురించి విహెచ్‌పి చేస్తున్న ప్రయత్నాలను ఆదిత్యనాధ్‌ ప్రశంసించారు. అంతకు ముందు వీరందరికీ గురువు అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ భారత సమాజం బతికి బట్టకట్టాలంటే ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. అయితే హిందువులు అనే పదం ఆ సమయంలో వాడకపోయినా దాని అర్ధం ఏమిటో ఎవరికి వారే ఊహించుకోవచ్చు. 2024 డిసెంబరు ఒకటవ తేదీన నాగపూర్‌లో మాట్లాడుతూ జనాభా శాస్త్ర ప్రకారం జననాల వృద్ధి రేటు 2.1లేకపోతే ఒక సమాజం దానంతట అదే నాశనం అవుతుంది, వేరే ఎవరూ నాశనం చేయనవసరం లేదు అన్నారు. ఆయన చుట్టూ ఉన్నవారందరూ హిందూ సమాజానికి ముప్పు వచ్చిందంటూ హోరెత్తిస్తుంటే ఆ మాటలకు కూడా అర్ధం అదిగాక వేరే ఎలా అవుతుంది.


జూన్‌ పదవ తేదీన ఐరాస విడుదల చేసిన ప్రపంచ జనాభా స్థితి నివేదికలో జననాల రేటు తగ్గిపోవటానికి దోహదం చేస్తున్న వివిధ అంశాలను పేర్కొన్నది, అవన్నీ మన దేశానికి కూడా వర్తిస్తాయి.మనతో సహా పద్నాలుగు దేశాలకు చెందిన పద్నాలుగువేల మంది నుంచి ప్రశ్నావళికి రాబట్టిన అంశాలను అది విశ్లేషించింది.ప్రస్తుతం ప్రపంచలో 800 కోట్ల మంది జనాభా అధికంగా ఉందనే అభిప్రాయాన్ని కలిగించటం ఒకవాస్తవమైతే అన్ని చోట్లా ఒకే విధంగా లేకపోవటంతో కొన్ని చోట్ల జననాల తగ్గుదల గురించి ఆందోళన వ్యక్తమౌతోంది. కోరుకున్నంత మంది పిల్లల్ని కనాలని అనుకున్నా ఐదోవంతు మందికి సాధ్యం కావటం లేదు.అనేక మందికి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఉన్నప్పటికీ వారిని సక్రమంగా పెంచేందుకు అవసరమైన ఉద్యోగ భద్రత, నివాసం, పిల్లల సంరక్షణ వంటి సమస్యల కారణంగా వెనకడుగు వేస్తున్నారు.ఉద్యోగాలు, పిల్లల సంరక్షణ మహిళల మీద భారాన్ని రెట్టింపు చేయటంతో ఎక్కువ మందిని కనేందుకు వారు విముఖత చూపుతున్నారు. అనేక దేశాల్లో ప్రసూతి సెలవులు, వేతనాలు ఎక్కువగా ఇవ్వటానికి ఇదొక కారణం, అయినప్పటికీ అనుకున్న మేర జననాలు పెరగటం లేదు.ఎక్కువ మంది పిల్లలు ఉంటే వత్తిడి ఎక్కువగా ఉంటున్నకారణం కూడా ఉంది. నైజీరియావంటిచోట్ల సగటున ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఎక్కువ మందిని కనాలనే సామాజిక వత్తిడి, ఆరోగ్యసేవలేమి సమస్యలను అక్కడ ఎదుర్కొంటున్నారు. సంతాన నిరోధక పద్దతులపై అనుమానాలు, అవగాహనలేమి కూడా ఉంది. కొన్ని చోట్ల సంతానాన్ని బట్టి ప్రోత్సాహకాలు ఇచ్చే పథకాలు ఉన్నప్పటికీ తాత్కాలికంగా కొంత లబ్దిచేకూరినా తరువాత ఎదురయ్యే సమస్యల కారణంగా వాటికి జనాలు ఆకర్షితులు కావటం లేదు. కుటుంబ సభ్యులు, భాగస్వాముల వత్తిడి కారణంగా తాము తక్కువ మంది పిల్లలను కన్నట్లు సర్వేలో చెప్పారు. మొత్తం మీద 39శాతం మందికి ఆర్థిక అంశాల పరిమితులు ఎక్కువ మంది పిల్లలు వద్దనుకోవటానికి కారణమౌతున్నాయి. పన్నెండు శాతం మంది ఆరోగ్య సమస్యల వలన కావాలనుకున్న సంఖ్యలో పిల్లల్ని కనలేకపోతున్నారు. తాము తమ పిల్లల భవిష్యత్‌కు హామీ, సమానత్వం తదితర అంశాలపై కలిగించే భరోసాను, పాలకుల చర్యల మీద కలిగే విశ్వాసాలను బట్టి జననాల రేటు పెరుగుతుంది తప్ప దానికి మించిన పరిష్కారం మరొకటి లేదు.

మనదేశంలో జననాల రేటు గణనీయంగా పడిపోతున్నప్పటికీ ప్రస్తుతం యువజనాభా ఎక్కువగా ఉంది. మొత్తం జనాభా 146 కోట్ల 39లక్షలు. ఈ సంఖ్య 170 కోట్లకు పెరిగిన తరువాత ఇప్పటి నుంచి 40 ఏండ్ల తరువాత తగ్గుముఖం పడుతుంది. తమిళనాడు, కేరళ, ఢల్లీి రాష్ట్రాలలో అవసరమైనదానికంటే జననాల రేటు తక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రతి మహిళకు 1.9 మంది పిల్లలు ఉంటే 1960లో ఆరుగురు ఉన్నారు. బీహార్‌, రaార్కండ్‌, ఉత్తర ప్రదేశ్‌లలో ఎక్కువ జననాల రేటు ఉంది. మన జనాభాలో ఇప్పుడు పద్నాలుగేండ్ల లోపు వారు 24శాతం, పది, పందొమ్మిదేండ్ల మధ్య వారు 17, పది, ఇరవైనాలు సంవత్సరాల వారు 26శాతం ఉన్నారు.
ఎవరెంతమంది పిల్లల్ని కనాలో కనకూడదో నిర్ణయించుకోవాల్సింది దంపతులు తప్ప స్వాములు, సాధ్వులు, ముల్లాలు, పాస్టర్లు కాదు. కానీ వీరంతా కుటుంబ జీవనాల్లో వేలు పెడుతున్నారు. పడకగదుల్లో దూరుతున్నారు. ఏమంటే మతాన్ని కాపాడాల్సిన బాధ్యత అని సుభాషితాలు చెబుతున్నారు. పోనీ వీరెవరైనా పిల్లలు, తల్లుల సంరక్షణ బాధ్యత తీసుకుంటారా ? లేదు, నారుపోసిన వాడు నీరు పోయడా అంటూ దేవుళ్ల మీద దేవదూతల మీద భారం మోపుతారు. తమ సన్యాసాన్ని పక్కన పెట్టి వివాహాలు చేసుకొని డజన్ల కొద్దీ పిల్లలను కంటున్నారా అంటే, అదే జరిగితే ఇప్పటి మాదిరి ఎక్కడబడితే అక్కడ తామరతంపరగా అలాంటి వారంతా ప్రత్యక్షం అయ్యే అవకాశమే లేదు. ఇతరులకు చెప్పేటందుకే నీతులు ! వీరిని ప్రశ్నించేవారే లేరా ? పురాతన మానవుడికి మదిలో తలెత్తిన తొలి ప్రశ్న ఎందుకు. అదే మానవాళి పురోగమనానికి చోదకశక్తి. కమ్యూనిస్టుల సంగతికాసేపు పక్కన పెట్టండి, వారు ప్రతిదాన్నీ ప్రశ్నించమంటారు. బుద్ధుడు, వివేకానందుడు ఇంకా అనేక మంది భారతీయ తత్వవేత్తలు ప్రశ్నించమన్నారు, వద్దు, ప్రశ్నించటం తప్పు అన్నవారు మనకు ఎక్కడా కనిపించరు. అయినా ఎందుకు మనం ప్రశ్నించలేకపోతున్నాం, ఎందుకు ప్రశ్న రోజురోజుకూ బిక్కుబిక్కుమంటోంది, పాలకులను చూసి భయమా, జనంలో తలెత్తిన స్వార్ధమా ?

సిగ్గూ ఎగ్గూలేని బతుకులు : ఔను వాళ్లిద్దరూ విడిపోయారు, తిరిగి దగ్గరవ్వాలని చూస్తున్నారు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


కేవలం మూడు నిమిషాల్లోనే విడిపోయిన జంట ఉదంతం ప్రపంచంలో అత్యంత తక్కువ సమయం మనుగడ సాగించిన వివాహంగా చరిత్రలో నమోదైంది. కువాయిట్‌లో 2019లో ఇది జరిగింది, ప్రమాదవశాత్తూ తూలిపడిన వధువును బుద్ధిలేనిదానా అని తిట్టిన వరుడు తనకు అక్కర లేదనటంతో కోర్టుకు ఎక్కారు. అంతకు వందేళ్ల క్రితం ఒక హాలీవుడ్‌ జంట కేవలం 20నిమిషాల్లోనే విడిపోయింది. వివాహం మీద పునరాలోచనలో పడ్డ నటి భర్తను హానీమూన్‌ రూమ్‌లో పెట్టి బయట తాళం వేసి వెళ్లిపోయిందట. ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌, ప్రపంచ అగ్రరాజ్య అధిపతి డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రేమాయణం చెడిరది. ఇద్దరూ లాభాలు తప్ప మరొకటి పట్టని పక్కా వ్యాపారులే. ఛీ పో అంటే ఛా పో అనుకున్నారు, అంతలోనే మరోసారి దగ్గరయ్యేందుకు చూస్తున్నారు, సిగ్గూ ఎగ్గులేని బతుకులు. ప్రేమలో పడటానికి, విడిపోవటానికి, తిరిగి దగ్గర కావటానికి డాలర్లు తప్ప మరొక అంశాన్ని ఊహించటం కష్టం. జెఫ్రీ ఎప్‌స్టెయిన్‌ అనే అమెరికన్‌ పక్కా తిరుగుబోతు, తార్పుడుగాడు. పద్నాలుగు, పదిహేనేండ్ల ఆడపిల్లలను వలవేసి పట్టటం అనుభవించటం, బడాబాబులకు తార్చటం, తద్వారా లబ్దిపొందటం వాడి చరిత్ర.2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వాడి గురించి దర్యాప్తు చేసిన పోలీసులు సేకరించిన సమాచారాన్ని జెఫ్రీ ఫైల్స్‌ అంటున్నారు. వాటిలో డోనాల్డ్‌ ట్రంప్‌ పేరు ఉందన్నది తాజాగా ఎలన్‌ మస్క్‌ పేల్చిన బాంబు. అందుకే వాడిని జైల్లో లేపేశారని బయటకు ఆత్మహత్య చేసుకున్నాడని కథలు అల్లారని చెబుతారు. వీడి ఖాతాదార్లలో ట్రంప్‌ ఉన్నట్లు ఎక్స్‌ చేసిన మస్క్‌ దాన్ని వెనక్కు తీసుకున్నాడు. డోనాల్డ్‌ ట్రంప్‌ పేరు ఎప్‌స్టెయిన్‌ ఫైల్స్‌లో ఉంది, అందుకే వాటిని బహిర్గత పరచలేదు అని మస్క్‌ పేర్కొన్నాడు. తరువాత దాన్ని తొలగించాడు. దీని మీద తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లో నాకు వ్యతిరేకంగా ఎలన్‌ మస్క్‌ మారటాన్ని నేను పట్టించుకోను అన్నాడు, ఎయిర్‌ ఫోర్స్‌ ఒన్‌ విమానంలో ప్రయాణిస్తూ దాని గురించి నేనసలు ఆలోచించటం లేదన్నాడు.అయితే మస్క్‌ కంపెనీలతో ప్రభుత్వ కాంట్రాక్టుల గురించి ప్రతి అంశాన్ని పరిశీలిస్తామన్నాడు. డెమోక్రటిక్‌ పార్టీకి నిధులు ఇస్తే సంగతి చూస్తానని బెదిరించాడు.


ట్రంప్‌ను పదవి నుంచి అభిశంసన ద్వారా తొలగించాలని మస్క్‌ అన్నాడు. అదే నోటితో లాస్‌ ఏంజల్స్‌లో వలస కార్మికుల నిరసనలను అణచివేసేందుకు మిలిటరీని దింపిన ట్రంప్‌ను పొగుడుతున్నాడు. మస్క్‌తో మాట్లాడేదేలేదు అన్న ట్రంప్‌ మాట మార్చాడు. మస్క్‌ ఫోన్‌ చేస్తే మీరు మాట్లాడతారా అన్న విలేకర్ల ప్రశ్నకు దాని గురించి నిజంగా నేను ఆలోచించలేదు, నేను ఊహించగలను, దాని గురించి ఆలోచిస్తా అన్నాడు తప్ప అవునని కాదని చెప్పలేదు. దోచుకొనేదగ్గర, వాటాల పంపిణీలో దెబ్బలాట, జనాన్ని అణచటంలో ముద్దులాట. వర్గనైజం ఇది. ఎలన్‌మస్క్‌ పెద్ద వ్యాపారి, పారిశ్రామికవేత్త.తన టెస్లా కార్లను అమ్ముకోవాలన్నా, స్టార్‌లింక్‌ను పలుదేశాల్లో ఏర్పాటు చేయాలన్నా అమెరికా పాలకుల అండకావాలి. మన నరేంద్రమోడీ ఇటీవలనే అనుమతించటం దానికి పక్కా నిదర్శనం. డెమోక్రటిక్‌ పార్టీ మద్దతుదారుగా ఉన్న ఆ పెద్ద మనిషి అందుకోసమే డోనాల్డ్‌ ట్రంప్‌కు ఎన్నికల విరాళాల రూపంలో ఆర్థికంగా భారీ మొత్తంలో సమర్పించుకున్నాడు.అధికారానికి వచ్చిన మరుసటి రోజు నుంచే సతాయించటం మొదలు పెట్టాడు. రానున్న రోజుల్లో వినియోగదారులందరూ విద్యుత్‌ కార్లే కొనుగోలు చేయాలంటూ ఒక విధాన నిర్ణయం చేయాలని, వాటి మీద ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని పెంచాలని, వారికి అందుబాటులో మూలమూలనా చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశాడు. ట్రంప్‌ దానికి అంగీకరించలేదు . ఎందుకని ? అమెరికా కార్ల కంపెనీల యజమానుల చరిత్రను చూసినపుడు తమ కార్లను అమ్ముకొనేందుకు ప్రజారవాణా వ్యవస్థలైన బస్సులు, రైళ్లను, ట్రామ్‌లను పక్కన పెట్టేసే విధంగా ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చి విజయవంతమయ్యారు. వారికి పెట్రోలు, డీజిలు అమ్ముకొనే కంపెనీలు వత్తాసు పలికాయి. ఎక్కడో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఎలన్‌ మస్క్‌ ప్రపంచ కుబేరుడు కావచ్చు కానీ ఇప్పటికే ఉన్న చమురు కార్ల పరిశ్రమ మొత్తాన్ని మూసివేయించేంత మొనగాడా అది జరిగితే నీ సంగతి తేలుస్తామని ఆ రంగంలోని కంపెనీలు ట్రంప్‌ను హెచ్చరించటంతో ఇరకాటంలో పడి వెనక్కు తగ్గాడు. వారి మధ్య వైరానికి అసలు కారణం ఇదే !


ఎలన్‌ మస్క్‌, డోనాల్డ్‌ ట్రంప్‌ల అక్రమ సంబంధాలు జగమెరిగిన సత్యం. ఇంతకు ముందు గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బెన్‌ భార్య నికోలే సహాన్‌తో మస్క్‌ పెట్టుకున్న అక్రమ సంబంధం కారణంగా వారిద్దరూ విడిపోయారు. తాజా ఉదంతానికి వస్తే అమెరికా అధ్యక్ష భవనంలో ఉన్నత అధికారిగా పనిచేస్తున్న స్టెఫాన్‌ మిల్లర్‌ భార్య కాటీ మిల్లర్‌తో సంబంధం పెట్టుకున్నట్లు గుప్పుమంది. ట్రంప్‌ మీద ఆగ్రహంతో మస్క్‌ డోజ్‌ పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్లినపుడు అప్పటి వరకు అధ్యక్ష భవనంలో ఉద్యోగిగా ఉన్న కాటీ కూడా రాజీనామా చేసి ఎలన్‌ మస్క్‌ కంపెనీలో పని చేసేందుకు వెళ్లిపోయింది. వేరే సందర్భంలో స్టెఫాన్‌ మిల్లర్‌ ‘‘ అమెరికాను తిరిగి వెనక్కు తీసుకువచ్చాం’’ అని ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. దాని మీద మస్క్‌ స్పందిస్తూ ‘‘ నేను నీ భార్యను తీసుకుపోయినట్లేనా ’’ అని వ్యాఖ్యానించాడు. అయితే అదంతా నిజం కాదని తానలాంటి పోస్టు పెట్టలేదని మస్క్‌ చెప్పుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. తన స్వంత కృత్రిమ మేథ గ్రోక్‌ను సంప్రదిస్తే అది కూడా మస్క్‌ పెట్టిన పోస్టు స్క్రీన్‌ షాట్‌ నిజమే అని చెప్పిందట. అమెరికా స్టాక్‌ మార్కెట్‌ వీటిని పెద్దగా పట్టించుకోదు. ఇద్దరూ రాజీబాటలో ఉన్నారని సంతృప్తి వ్యక్తం చేయటంతో మస్క్‌ కంపెనీల వాటాల ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ పడిపోయన నాటి స్థాయికి చేరలేదు. వెంటనే వారిద్దరూ కలవక పోయినా కొన్ని నెలలకు పూర్తిగా సర్దుకుంటారని భావిస్తున్నారు.ఇద్దరి మధ్యా సంబంధాలు బాగున్నాయని అందరూ భావించినపుడు మార్చి నెలలో ట్రంప్‌ ఒక ఎర్ర టెస్లా కారు ముందు నిలిచి దానిని కొనుగోలు చేసినట్లు ఫొటోలకు ఫోజులిచ్చాడు. దాన్ని ఇప్పుడు వదిలించుకోవచ్చని అధ్యక్ష భవన సిబ్బంది చెబుతున్నారు.


మాజీ డెమోక్రాట్‌ అయిన మస్క్‌ 2016లో ట్రంప్‌ తొలిసారి అధికారానికి వచ్చినప్పటి నుంచి వాణిజ్య సలహ మండళ్లలో చోటు సంపాదించుకున్నాడు.రెండోసారి ఓడిపోయిన తరువాత ఇక చాల్లే మళ్లీ పోటీకి దిగవద్దన్నాడు. ఫ్లోరిడా గవర్నర్‌ డేశాంటిస్‌ పోటీ చేస్తే తాను మద్దతు ఇవ్వకపోయినా జో బైడెన్‌ మీద గెలుస్తాడని ఎక్స్‌ చేశాడు. కానీ 2024లో ట్రంప్‌కు అన్నీ తానే అన్నట్లు వ్యవహరించాడు. అతగాడి కోసమే తొలిసారిగా రిపబ్లికన్‌ పార్టీకి ఓటు వేశానన్నాడు. అమెరికా అధికారపీఠంపై అనుచరులతో ట్రంప్‌ దాడి చేయించినపుడు ఎక్స్‌ ఖాతాను రద్దు చేశారు. తరువాత మస్క్‌ కొనుగోలు చేసిన తరువాత 2022 చివరిలో పునరుద్దరించాడు.ట్రంప్‌ సొంతంగా ట్రూత్‌ అనే వేదికను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ కేసుల్లో ఇరుక్కునపుడు ఐదు కోట్ల డాలర్లు మస్క్‌ ఇచ్చాడు. ట్రంప్‌ ఎన్నడూ తనను డబ్బు అడగలేదని తానే ఇచ్చినట్లు చెప్పుకున్నాడు.ఎన్నికల్లో 25 కోట్ల డాలర్లు ఖర్చు చేశాడు. అధికారానికి వచ్చిన తరువాత మస్క్‌ గొంతెమ్మ కోర్కెలు తీర్చే అవకాశం లేదని ట్రంప్‌ పక్కన పెట్టటం ప్రారంభించాడు, ఇచ్చిన పదవితో పండగ చేసుకో అన్నాడు. విద్యుత్‌ వాహనతయారీదారులు కష్టకాలంలో ఉన్నారు. వారు బిలియన్ల డాలర్లను సబ్సిడీగా ఇవ్వాలని కోరుకుంటున్నారు, అది సాధ్యం కాదనటంతో మస్క్‌ ఆశాభంగం చెందాడని ట్రంప్‌ చెప్పాడు. తన మద్దతులేకపోతే రిపబ్లికన్లు ఓడిపోయి ఉండేవారని, కృతజ్ఞత చూపలేదని మస్క్‌ అంటే అతగాడికి పిచ్చి ఎక్కిందని, తానింకే మాత్రం అతగాడి గురించి ఆలోచించనని ట్రంప్‌ బదులిచ్చాడు. నేను చైనా, రష్యాలతో, ఇంకా చాల సమస్యలతో తీరిక లేకుండా ఉన్నాను, ఎలన్‌ గురించి ఆలోచించటం లేదు, మీకు తెలుసు అతగాడు బాగుండాలని కోరుకుంటున్నా అన్నాడు.గుడిలో లింగాన్ని, గుడినీ మింగాలనుకున్న మస్క్‌ ఇచ్చిన పదవితో సంతృప్తి చెందలేదు. దాంతో ఇద్దరూ రోడ్డెక్కారు. మస్క్‌ త్వరలో బయటకు వెళ్లిపోతాడని ట్రంప్‌ తన కాబినెట్‌, ఇతర ముఖ్యులతో వ్యాఖ్యానించినట్లు ఏప్రిల్‌ రెండవ తేదీన పొలిటికో పత్రిక రాసింది. మే చివరి వారంలో పదవీ కాలం ఒక రోజు ఉండగానే రాజీనామా చేశాడు.


ఈ బాగోతం చూసిన తరువాత సామాజిక మాధ్యమం, రాజకీయ వర్గాల్లో జోకులే జోకులు. సముచితమైన ఫీజు కింద మాకు స్టార్‌లింక్‌ కంపెనీ వాటాలు ఇస్తే ఇద్దరి మధ్య రాజీకుదుర్చుతాం, దెబ్బలాడుకోవద్దు అంటూ రష్యన్‌ మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్‌ చమత్కరించాడు. కావాలంటే మస్క్‌కు రాజకీయ ఆశ్రయం కల్పిస్తామని రష్యా ఇతర నేతలు చెప్పారు. ఎలన్‌ ఆశాభంగం చెందవద్దు, అమెరికాలో అసాధ్యమైన సమస్యలను ఎదుర్కొంటే మా దగ్గరకు రండి మాలో ఒకరిగా మారండి, మీ సాంకేతిక నైపుణ్యానికి పూర్తి స్వేచ్చ ఉంటుంది ఇక్కడ నిజమైన స్నేహితులు ఉన్నారంటూ ఎక్స్‌లు చేశారు. ఎవరెన్ని మాట్లాడినా ఒక డాలరు విలువ చేయవు అన్నది ట్రంప్‌, మస్క్‌ తీరు. ఈ మొత్తం ఉదంతంలో అంతిమంగా ట్రంప్‌దే పైచేయి అన్నది స్పష్టం. ఎందుకంటే అపరిమితమైన అధికారం ఉన్నందున ఎలన్‌ మస్క్‌ ఆర్థిక సామ్రాజ్యాన్ని కుప్పకూల్చివేసే అవకాశం ఉంది. అందుకే మస్క్‌ దారికి వచ్చినట్లు కనిపిస్తోంది. కొస మెరుపు ఏమంటే మంగళవారం నాడు ఎలన్‌ మస్క్‌ డ్రైవర్‌తో పనిలేని తన తొలి కారును ప్రయోగించి చూపాడు. దాంతో రోబోటాక్సీ రంగంలో అతగాడి కంపెనీ ఉందన్న భరోసాతో స్టాక్‌మార్కెట్‌లో వాటాల ధరలు పెరిగాయి.

నియంతృత్వం దిశగా అమెరికా ! మిలిటరీ ముట్టడిలో లాస్‌ ఏంజల్స్‌ నగరం !!

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డిసి, ఆర్థిక రాజధాని న్యూయార్క్‌, ప్రపంచ సినిమా హాలీవుడ్‌ రాజధాని లాస్‌ ఏంజల్స్‌. ఇప్పుడు ఈ నగరంపై ముట్టడికి అమెరికా మిలిటరీలోని నేషనల్‌ గార్డ్స్‌, మెరైన్లను అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దించాడు. 1965లో పౌరహక్కుల ప్రదర్శకులను అడ్డుకొనేందుకు అలబామా రాష్ట్రానికి అక్కడి ప్రభుత్వ అనుమతి లేకుండా నాటి అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ కూడా ఇదే మాదిరి మిలిటరీని పంపాడు, ఆ తరువాత ఇదే ప్రధమం. అక్రమ వలసదారులను ఏరివేసే పేరుతో ఇమ్మిగ్రేషన్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసిఇ) సిబ్బంది నగరమంతటా వందలాది మందిని అరెస్టు చేయటాన్ని జనం నిరసిస్తున్నారు. వారిని అణచివేసేందుకు శనివారం నాడు రెండువేల మంది మిలిటరీ నేషనల్‌ గార్డులను పంపిన ట్రంప్‌ సోమవారం నాడు మరో రెండువేల మందితో పాటు , 700 మంది మెరైన్లను కూడా రంగంలోకి దించాడు. తమ అధికారాన్ని అతిక్రమించి మిలిటరీని దించటాన్ని కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌ న్యూసమ్‌ కోర్టులో సవాలు చేశాడు. నిరసనలను తెలుపుతున్నవారి సమీపంలో ఉన్న జర్నలిస్టులను మిలిటరీ దూరంగా తరిమివేస్తోంది, ప్రజాప్రతినిధులను కూడా ఆ ప్రాంతాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నది. తమ అధ్యక్షుడు వెనక్కు తగ్గేది లేదని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ మరింతగా రెచ్చగొడుతూ ప్రకటించాడు. విదేశీ వ్యతిరేకత, ఉన్మాదాలను రెచ్చగొడుతున్నారు. లాటినోలు ఎక్కువగా ఉన్న పారామౌంట్‌ వంటి చోట్ల నిరసనలు పెద్ద ఎత్తున చెలరేగాయి. స్థానికంగా ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తినపుడు అమెరికాలో మిలిటరీని దించటం అసాధారణం. అలాంటిది కేవలం నిరసన ప్రదర్శనలు జరిగిన వెంటనే ట్రంప్‌ తీసుకున్న ఈ అసాధారణ చర్య ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సి ఉంది. లాస్‌ ఏంజల్స్‌ పాత నగర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు, అనేక పట్టణాల్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి.


ట్రంప్‌ ప్రాజెక్టు 2025పేరుతో అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాల్లో భాగంగా అధికారంలోకి రాగానే అనేక అంశాల్లో వేలు పెట్టాడు, సాధారణ భాషలో చెప్పాలంటే కెలికాడు. అక్రమంగా వలస వచ్చిన వారిని స్వదేశాలకు పంపాలి లేకపోతే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ఇచ్చిన ఆదేశాలతో లాస్‌ ఏంజల్స్‌ నగరం ఇప్పుడు ఆందోళనలతో అట్టుడుకుతోంది. న్యూయార్క్‌ నగరంలో వలస వచ్చిన కుటుంబాలకు చెందిన వారు 59లక్షల మంది ఉండగా తరువాత 44లక్షల మందితో ఈ నగరం ఉంది. మొత్తం జనాభాలో వీరు 33శాతం మంది. కొద్ది రోజులుగా అక్రమ వలసదారుల పేరుతో కొంత మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టటంతో వారంతా వీధుల్లోకి వస్తున్నారు.వారిని అదుపు చేసేందుకు ట్రంప్‌ సర్కార్‌ మిలిటరీని పంపింది. వలసదారులు శత్రుదేశాల మాదిరి లాస్‌ ఏంజల్స్‌ను ఆక్రమించుకున్నట్లుగా చిత్రించి నగరాన్ని విముక్తి చేయాలని ట్రంప్‌ ఆదేశించాడు. ఒక నాడు గొప్పనగరంగా విలసిల్లిన దానిని విదేశీ చొరబాటుదార్లు, నేరగాండ్లు ఆక్రమించినట్లు ట్రంప్‌ వర్ణించాడు. అక్రమ వలసదారులుగా చెబుతున్నవారు అమెరికాలో కోట్లాది మంది ఉన్నారు. అక్కడ తలెత్తిన ఆర్థిక, ఉపాధి సమస్యలను పరిష్కరించటంలో విఫలమైన పాలకులు వలస వచ్చిన వారే అన్నింటికీ కారణమంటూ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు, వారిలో ట్రంప్‌ ముందున్నాడు. ఐరోపా దేశాలలో కూడా ఇదే ధోరణి, ఎన్నికల సమస్యగా ఉంది.


ప్రస్తుతం లాస్‌ ఏంజల్స్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది, అణచివేత ఏ రూపం తీసుకుంటుందో, దానికి ప్రతిఘటనలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.చౌకగా పని చేయించుకొని లాభాలు పొందేందుకు అమెరికా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, వ్యవసాయ క్షేత్రాల వారు వలసలను ప్రోత్సహించారు. చట్టబద్దంగా వచ్చిన వారితో పాటు అక్రమంగా వచ్చిన వారిని చూసీ చూడనట్లు అధికార యంత్రాంగం వ్యవహరించింది. ఆర్థిక వ్యవస్థలో వారి పాత్ర తక్కువేమీ కాదు. వ్యవసాయం, సేవారంగం, నిర్మాణ రంగాలలో వారి పాత్ర పెద్దది.అధికారికంగా నమోదు కాని వారి సంఖ్య గురించి అంచనాలు మాత్రమే, కోటి మందికి పైగా ఉంటారని ఒక అంచనా. శ్రామిక శక్తిలో రికార్డుల్లో నమోదు కాని వారితో సహా విదేశాల్లో జన్మించిన కార్మికులు 18.6 శాతం లేదా 2.91 కోట్ల మంది అని 2023 కార్మిక శాఖ వివరాలు తెలిపాయి.అంతకు ముందు ఏడాది 18.1శాతం ఉన్నారు. వీరిలో 47.6 శాతం మంది మెక్సికో, ఇతర లాటిన్‌ అమెరికా దేశాల నుంచి వచ్చిన వారు కాగా25.1శాతం ఆసియా ఖండం నుంచి ఉన్నారు. అధికారికంగా నమోదు కాని వారు 83 లక్షల మంది ఉన్నట్లు, వారిలో 30శాతం మెక్సికో నుంచి మధ్య, దక్షిణ అమెరికా దేశాల నుంచి 20, ఆసియా నుంచి 15శాతం ఉన్నట్లు న్యూయార్క్‌ వలస అధ్యయనకేంద్రం అంచనా వేసింది. రానున్న సంవత్సరాల్లో వంట, ఇంటిపనివారు, డ్రైవర్లు, ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ వంటి పనులు చేసేందుకు డిమాండ్‌ పెరగనుందని చెబుతున్నారు.


కరోనా తరువాత ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు,ద్రవ్యోల్బణం తగ్గటానికి వలస కార్మికులు తోడ్పడ్డారని డల్లాస్‌ ఫెడరల్‌ రిజర్వుబ్యాంకు అధ్యయనం తెలిపింది. అమెరికాలో పుట్టి పెరిగిన వారు ఉద్యోగవిరమణ చేయటం, జననాలరేటు తగ్గిన కారణంగా 2019`21 మధ్య 20లక్షల మంది కార్మికులు తగ్గినట్లు, రానున్న పది సంవత్సరాలలో వలస కార్మికులు లేకపోతే వివిధ రంగాలలో ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణలో ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరికలు వెలువడ్డాయి.జనాభాలో వలస వచ్చిన వారు 13.8శాతం, వీరిలో కొందరు వాణిజ్యాలను కూడా ప్రారంభించారు, వారి ద్వారా 2022 ఒక్క ఏడాదే 110 బిలియన్‌ డాలర్ల రాబడి వచ్చింది.అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే ప్రకారం వలస వచ్చిన వారు ఫెడరల్‌ ప్రభుత్వానికి 2022లో 383 బిలియన్‌ డాలర్లు, రాష్ట్ర, స్థానిక సంస్థలకు 196 బిలియన్‌ డాలర్లు రాబడి చేకూర్చారు. నమోదు కాని కార్మికులు, ఆదాయ, సామాజిక భద్రత పన్నులే మొత్తం వందబిలియన్‌ డాలర్లకు పైగా ఉన్నాయి. చిత్రం ఏమిటంటే నిరుద్యోగ, ఆరోగ్యబీమా వారికి వర్తించకపోయినా పన్ను చెల్లించారు. 2033 నాటికి మరో 5.2శాతం వలస కార్మికులు పెరుగుతారని వారి వలన ఏడులక్షల కోట్ల డాలర్ల మేరతోడవుతుందని, జిడిపి 8.7లక్షల కోట్ల డాలర్లు పెరగటంతో పాటు ఫెడరల్‌ ప్రభుత్వానికి 1.2లక్షల కోట్ల పన్ను ఆదాయం పెరిగి, 900బిలియన్‌ డాలర్ల లోటు తగ్గుతుందని అంచనాలు వెలువడ్డాయి.వలస వచ్చిన వారి కారణంగానే స్థానికులకు అందాల్సిస సౌకర్యాలకు కోతపడుతున్నదని కొందరు సర్వేలు, బడ్జెట్ల పేరుతో రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. వలస వచ్చిన వారి గృహవసతి కోసం న్యూయార్క్‌ వంటి నగరాల్లో బడ్జెట్‌ కేటాయింపులు చేస్తూ ఇతరులకు కోతపెడుతున్నారని చిత్రిస్తున్నారు. నిజానికి పైనచెప్పుకున్నట్లుగా వలస వచ్చిన వారి నుంచి వచ్చే రాబడితో పోల్చుకున్నపుడు ఇవి పెద్ద మొత్తాలేమీ కాదు. వారు పని చేస్తున్న పరిశ్రమలు, వాణిజ్య, వ్యవసాయ రంగాల నుంచి వారి సంక్షేమానికి ప్రభుత్వం పన్నులు మరొక రూపంలో అదనంగా నిధులు సేకరించటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ వారికి నానాటికీ మరిన్ని రాయితీలు ఇస్తున్నారు తప్ప అదనపు రాబడికి పూనుకోవటం లేదు తక్కువ వేతనాలకు పని చేసే నైపుణ్యం అంతగా అవసరం లేని కార్మికులు ఇప్పుడు అమెరికాకు అవసరమని తెలిసినప్పటికీ ట్రంప్‌ వారి మీద దాడి ప్రారంభించాడు, లబ్ది పొందే కార్పొరేట్లు సహిస్తారా ?

వలస కార్మికులను వెనక్కు పంపుతానని ట్రంప్‌ పెద్ద ప్రకటనలు చేస్తున్నాడు.అందరినీ పంపాలంటే ఏడాదికి 500 బిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతాయని, రానున్న పది సంవత్సరాలలో కార్మికుల కొరత ఏర్పడుతుందని, జిడిపి 5.1లక్షల కోట్ల డాలర్లు తగ్గుతుందని తెలిసినా వ్యాపారవేత్త, లాభనష్టాలు తెలిసిన ట్రంప్‌ అలాంటి పనులకు ఎందుకు పాల్పడుతున్నట్లు ?ఎన్నికలకు ముందే వలస కార్మికులను పంపివేస్తానని ట్రంప్‌ వాగ్దానం చేశాడు. ఇప్పుడు లాస్‌ ఏంజల్స్‌ నగరంలో చిచ్చు పెట్టాడు. సైన్యాన్ని వెనక్కు తీసుకోవాలని కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ డిమాండ్‌ చేశాడు, ట్రంప్‌ చర్య రాష్ట్ర సార్వభౌమత్వాన్ని హరించటమే అన్నాడు. శాంతి భద్రతలకు విఘాతం కలగాలని వాంఛిస్తున్న ట్రంప్‌కు అలాంటి అవకాశం ఇవ్వవద్దని పౌరులను కోరాడు. నగర మేయర్‌ కరేన్‌ బాస్‌ కూడా గవర్నర్‌ను సమర్దిస్తూ ట్రంప్‌ చర్య అశాంతిని రెచ్చగొట్టినట్లు ఆమె వ్యాఖ్యానించారు. నగర కౌన్సిల్లోని 15 మంది సభ్యులు కూడా మిలిటరీ చర్యను ఖండిరచారు. వారి వైఫల్యం కారణంగానే తాను మిలిటరీని పంపినట్లు ట్రంప్‌ సమర్ధించుకున్నాడు.ట్రంప్‌ను సమర్ధించే మితవాద మీడియా నిరసన తెలుపుతున్నవారి మీద దుమ్మెత్తిపోస్తూ వార్తలు ఇస్తున్నది.

2024 నవంబరులో నగరపాలక సంస్థ వలసదారులను రక్షించేందుకు ‘‘ శరణ నగరం ’’ అని ఏకగ్రీవంగా తీర్మానించింది. వలస నిరోధ అధికారులను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం చేశారు. అంతకు ముందు వలసదారులను బహిష్కరిస్తామని ట్రంప్‌ వాగ్దానం చేశాడు. మిలిటరీని దించటాన్ని డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన 22 రాష్ట్రాల గవర్నర్లు ఒక ప్రకటనలో ఖండిరచారు. ట్రంప్‌ అధికార దుర్వినియోగం, దుర్మార్గమైన, విభజించే చర్య అన్నారు. మెక్సికన్లు లాస్‌ ఏంజల్స్‌ నగరంలో నివశించటాన్ని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్‌ సమర్ధించారు. వారు మంచి వారు, నిజాయితీ పరులు, నేరస్తులు కాదు, తమ కుటుంబాలకు తోడుగా ఉండేందుకు, మెరుగైన జీవితం కోసం వారంతట వారే వెళ్లారని ఆమె అన్నారు. నిరసనకారులు అమెరికా పతాకాలతో పాటు మెక్సికో జాతీయ జెండాలను కూడా ప్రదర్శించుతున్నారు. వాటిని చూపుతూ చూడండి విదేశీయులు మన దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారో వారిని బయటికి పంపవద్దా అంటూ రెచ్చగొడుతున్నారు. తాము అమెరికాకు వలస వచ్చామని, ఇక్కడే పిల్లలను కని పౌరులమయ్యామని తమ వారసత్వానికి చిహ్నంగా మెక్సికో పతాకాలను ప్రదర్శిస్తూ దమనకాండకు నిరసన తెలుపుతున్నట్లు ప్రదర్శకులు సమర్ధించుకుంటున్నారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిని రెచ్చగొట్టేందుకు ముసుగులు ధరించిన రహస్య పోలీసులను వినియోగించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిరసనకారులు అనుమానం వచ్చి ఎవరని ప్రశ్నిస్తే సమాధానం లేకపోగా బెదిరింపులకు దిగుతున్నారు.ముసుగులు ధరించిన ఐసిఇ సిబ్బంది ఒక రెస్టారెంటులో చొరబడి వంటవారిని అదుపులోకి తీసుకోవటంతో కస్టమర్లు అడ్డం తిరిగి ప్రశ్నించారు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో. అవాంఛనీయ చర్యలకు పాల్పడి ఆ నెపాన్ని వలస కార్మికులు మీద నెట్టే కుట్ర కనిపిస్తోంది. ఇలాంటి దుర్మార్గం ఫాసిస్టులు మాత్రమే చేయగలరన్నది చరిత్ర చెప్పిన సత్యం. తమకు అడ్డు పడితే గవర్నర్‌, నగర మేయర్లనూ అరెస్టు చేస్తామని ట్రంప్‌ యంత్రాంగం బెదిరించింది. ఈ దమనకాండకు నిరసనగా అనేక నగరాల్లో ప్రదర్శనలు జరపాలని పిలుపు నిచ్చారు. కార్మిక నేతల అరెస్టును కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిరది. వలస వచ్చిన వారిపై రాజ్యమే హింసాకాండకు పూనుకుందని కార్మిక సంఘాలు విమర్శించాయి. అనేక మంది స్థానిక అమెరికన్లు వలస వచ్చిన వారు తమ సోదరులే అంటూ మద్దతు తెలుపుతున్నారు. దమనకాండ అమెరికా విలువలకే వ్యతిరేకమని టీచర్స్‌ యూనియన్‌ ఒక ప్రకటనలో విమర్శించింది. ట్రంప్‌ జారీ చేస్తున్న ఆదేశాలను చూస్తుంటే నియంతృత్వంవైపు దేశాన్ని నడిపిస్తున్నట్లుందని డెమోక్రటిక్‌ సోషలిస్టు సెనెటర్‌ బెర్నీశాండర్స్‌ విమర్శించాడు.ఒకవైపు ప్రతికూల పన్నులతో ప్రపంచ దేశాల మీద దాడికి దిగిన ట్రంప్‌ దేశీయంగా వలసలు వచ్చారనే పేరుతో మిలిటరీ దాడులకు దిగాడు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ముదురుతున్న సమస్యలకు ప్రతిరూపాలే ఈ దాడులు. అందువలన అమెరికా సాధారణ పౌరులతో పాటు యావత్‌ ప్రపంచమూ డోనాల్డ్‌ ట్రంప్‌ దుర్మార్గాలపై గళమెత్తాలి !

వ్యవసాయ ఉగ్రవాదం : చైనా మీద ఆరోపణ మాత్రమే, అమెరికా అధ్యక్షుడు కెనడీ, బ్రిటన్‌ దుర్మార్గం గురించి తెలుసా !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


వ్యవసాయ ఉగ్రవాదం ప్రపంచమంతటా పురాతన కాలం నుంచి ఉన్నదే. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలోనే అస్సీరియన్లు తమ శత్రువుల ప్రాంతాలలోని బావులలో విషాన్ని కలిపేవారు. మొదటి ప్రపంచ యుద్ద కాలంలో ఫ్రాన్సుకు రవాణా అయ్యే గుర్రాలు, పశువులకు అమెరికాలో జర్మన్‌ ఏజంట్లు విషం ఇచ్చేవారు. కత్తి, బాకు, బల్లెం వంటి వాటిని కనుగొన్న తొలి మానవుడు వాటిని ప్రమాదకర జంతువుల నుంచి రక్షణకు, ఆహారం కోసం ఉపయోగించాడు. తరువాత అవే యుద్దాల్లో ఆయుధాలుగా మారాయి. శాస్త్రవేత్త చార్లెస్‌ డార్విన్‌ 1880దశకంలో చేసిన పరిశోధనలు పంటల్లో కలుపు మొక్కల నివారణకోసం రసాయనాలను కనిపెట్టేందుకు దారితీశాయి. తరువాత కాలంలో బ్రిటన్‌, అమెరికా, తదితర సామ్రాజ్యవాదులు, నియంతలు ఏకంగా పంటలు, అడవులనే నాశనం చేసేందుకు, లక్షలాది మంది మానవులు, జంతుజాలాన్ని అంతమొందించేందుకు వినియోగించిన చరిత్ర తెలుసా ? శాస్త్రవిజ్ఞానాన్ని మానవ, ప్రకృతి వినాశనానికి వినియోగించింది మానవ కల్యాణానికి బదులు వినాశనాన్ని కోరుకున్న దుర్మార్గులే అన్నది చరిత్ర చెప్పిన సత్యం. ప్రమాదకరమైన ఫంగస్‌ను అమెరికా వ్యవసాయక్షేత్రాల్లో ప్రవేశపెట్టి దాని ఆహార వనరును దెబ్బతీయాలని చైనా కుట్రపన్నింది, దానిలో భాగంగా ఇద్దరు చైనా జాతీయులు ఆ ఫంగస్‌ను అక్రమంగా తెస్తూ ఎఫ్‌బిఐకి దొరికి పోయారు. ఇదీ వార్త, ఒక ఆరోపణ, సదరు ఫంగస్‌ను ఎక్కడా ప్రయోగించలేదు. పరిశోధనల కోసం తెచ్చారన్నది ఒక అభిప్రాయం. అమెరికా మనదేశంలోకి వయ్యారి భామ అనే వినాశకారి అయిన కలుపు మొక్కను ఎలా ప్రవేశ పెట్టిందీ వేరే విశ్లేషణలో చూశాము. గుండెలు బాదుకుంటున్న అమెరికా కొన్ని దశాబ్దాల నాడే ఆ దుర్మార్గానికి పాల్పడిరది అనే అంశం ఎక్కడా మీడియాలో చర్చకు రావటం లేదు.పురాతన, ఆధునిక యుద్ధాలలో ఆహార ఉత్పత్తి వ్యవస్థలను దెబ్బతీయటం ఒక ఆయుధం. అందుకే చరిత్రను చదివినపుడు శత్రుదేశాలు కోటలను చుట్టుముట్టినపుడు నెలల తరబడి తట్టుకొనేందుకు ఆహారం, నీటిని నిల్వచేసుకొనే ఏర్పాట్లు చేసుకున్నట్లు అనేక దుర్గాలు, కోటల చరిత్రలు వెల్లడిరచాయి. ఆధునిక కాలంలో అందుకు జీవ, రసాయనాలను అమెరికా అస్త్రంగా వాడుకున్నది. అదెలా జరిగిందో చూద్దాం !


1953లో కొరియా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే నెల రోజుల ముందు ఉత్తర కొరియా ప్రాంతంలో అమెరికా వైమానిక దళం చేసిన దాడుల్లో 75శాతం వరి ఉత్పత్తికి నీటిని అందించే ప్రాజెక్టులను నాశనం చేసింది. ఇది తరువాత కాలంలో అక్కడ కరవుకు దారి తీసింది. కమ్యూనిస్టుల పాలనలో జనాన్ని ఆకలితో మాడ్చి చంపారని ప్రచారం చేసే మానవతావాదులకు ఈ విషయం పట్టలేదు. వియత్నాంపై దాడిచేసిన అమెరికా మొక్కలను నాశనం చేసే ఏజంట్‌ ఆరెంజ్‌ అనే రసాయనాన్ని ఆపరేషన్‌ రాంచ్‌ హాండ్‌ పేరుతో 1962 నుంచి 1971వరకు వెదజల్లింది. దీనికి ఆదర్శం ఎవరు అంటే మలయా యుద్ధంలో ప్రయోగించిన బ్రిటీష్‌ దుర్మార్గులు. అమెరికాలో రైలు మార్గాలు, విద్యుత్‌ లైన్లు వేసే ప్రాంతాలలో పిచ్చి మొక్కలు పెరగకుండా చూసేందుకు 1940దశకంలో దీన్ని తయారు చేశారు. మనందరికీ తెలిసిన మానశాంటో సహా తొమ్మిది కంపెనీల నుంచి వియత్నాంలో చల్లేందుకు అమెరికన్‌ మిలిటరీ 7.6 కోట్ల లీటర్లు కొనుగోలు చేసింది. దాన్ని చల్లిన చోట 40లక్షల మంది మీద ప్రతికూల ప్రభావాలను చూపింది,30లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. రెడ్‌ క్రాస్‌ సంస్థ అంచనా ప్రకారం పది లక్షల మంది వికలాంగులయ్యారు. ఈ దుర్మార్గ ప్రక్రియలో భాగస్వాములైన అమెరికా మిలిటరీలో అనేక మందికూడా దీని ప్రభావంతో కాన్సర్‌, లింఫోమా వంటి వ్యాధులకు గురైనట్లు తేలింది. వారికి పుట్టిన పిల్లలకు జన్యు సంబంధమైన వ్యాధులు వచ్చాయి, వారి దుర్మార్గానికి పిల్లలు బలయ్యారు. వియత్నాంలో పర్యావరణానికి కలిగిన హాని గురించి చెప్పనవసరం లేదు, 77లక్షల ఎకరాల్లో పంటలు పండలేదు, అడవుల్లో మొక్కలు పెరగలేదు. అనేక జంతువులకు హాని కలిగింది.మానవ మారణకాండను జనోసైడ్‌ అని వర్ణిస్తే పర్యావరణానికి చేసిన హానిని ఎకోసైడ్‌ అని వర్ణించారు. అమెరికా దురాక్రమణను వ్యతిరేకించిన వియత్నాం వీరులు అడవుల్లో ఉండటంతో వియత్నాం సరిహద్దుల్లో ఉన్న లావోస్‌, కంపూచియా అడవులను కూడా అమెరికా దుర్మార్గులు వదల్లేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్‌, అమెరికా, జర్మనీ వంటి దేశాలు రసాయన, జీవ ఆయుధాలను తయారు చేశాయి. ఆ సమయంలో అనేక ప్రాంతాల్లో వాటిని పరీక్షించి చూశారు. జపాన్‌పై అణుబాంబును వేసిన అమెరికా యుద్దం గనుక కొనసాగితే 1946లో జపాన్‌పై ఏజంట్‌ ఆరెంజ్‌ను ప్రయోగించాలని పథకం వేసింది. బ్రిటీష్‌ పాలనలో ఉన్న మనదేశం, ఆస్ట్రేలియాలతో సహా మొత్తం 1,100 కేంద్రాల్లో దాని పనితీరును పరీక్షించారు. అమెరికాను కూడా వదల్లేదు. ఉష్ణప్రదేశాల్లో ఎలా పని చేస్తుందో చూసేందుకు కెన్యాలో కూడా చల్లారు. మలయా ప్రాంత దేశాల్లో రబ్బరు తోటల్లో పెరిగే కలుపు మొక్కలను నివారించేందుకు తయారు చేసిన రసాయనాన్ని తమ మీద తిరుగుబాటు చేసిన మలయన్లు ఉన్న అడవుల్లో 1960వరకు బ్రిటీష్‌ మిలిటరీ ప్రయోగించింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని అమెరికా తరువాత ఇండోచైనా ప్రాంతంలో అమలు చేసింది.ముఖ్యంగా దక్షిణ వియత్నాం బలైంది. అనేక మంది గొప్పగా పొగిడే నాటి అమెరికా అధ్యక్షుడు కెనడీ ఈ దుర్మార్గానికి అనుమతి ఇచ్చాడు. ఈ దుర్మార్గం గురించి తెలుసుకున్న తరువాత అమెరికాలో వియత్నాం యుద్ధవ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది.తప్పుడు వాదనలతో ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా, బ్రిటన్‌ వ్యతిరేకించాయి.


అమెరికా ముందుగా ఎవరి మీద జీవ, రసాయన ఆయుధాలను ప్రయోగించదని, అయితే శత్రుదేశం ఏదైనా వినియోగిస్తే మాత్రం రసాయన ఆయుధాలను వదులుతామని అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ గొప్పగా చెప్పాడు, ఏ దేశమూ వినియోగించకుండానే అణుబాంబుతో సహా ఆ దుండగాలకు అమెరికా పాల్పడిరది. జపాన్‌లో వరి పొలాలను నాశనం చేసేందుకు అమెరికా వినియోగించింది.వియత్నాంలో ఏజంట్‌ ఆరంజ్‌ చల్లిన ప్రాంతాల్లో గత ఐదు దశాబ్దాలుగా చెట్లలో సాధారణ పెరుగుదల లేదు, మామూలు స్థితికి రావాలంటే చాలాకాలం పడుతుందని చెబుతున్నారు.వియత్నాం దురాక్రమణ, దాడుల్లో పాల్గొన్న అమెరికా సైనికులు ఏజంట్‌ ఆరంజ్‌ తదితర విషపూరిత రసాయనాలను వెదజల్లుతున్నపుడు వారికి కూడా వాటి ప్రభావం సోకిన కారణంగా 1984లో కోర్టు వెలుపల రసాయన కంపెనీలు 18 కోట్ల డాలర్లు పరిహారంగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఇజ్రాయెల్‌ ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాల్లోకి సముద్రపు నీరు, తమ నివాసాల నుంచి వెలువడే మురుగునీటిని పాలస్తీనియన్ల నివాసాలు, వ్యవసాయ భూముల్లోకి వదలి పనికి రాకుండా చేయటం నిత్యకృత్యం. ఇది కూడా ఒక రకంగా వ్యవసాయ ఉగ్రవాదమే. పంటలు పండకుండా అరబ్బులను మాడ్చే ఎత్తుగడ.

నీవు నేర్పియే నీరజాక్షా అని తమ వ్యవసాయం మీద చైనా దాడి చేయనుందని అమెరికా గగ్గోలు పెడుతోంది. దానికి ఇదేమీ కొత్త కాదు. ప్రతి దేశం మీద కుట్ర సిద్దాంతాలను ప్రచారంలో పెట్టటం తెలిసిందే. తద్వారా తాను చేసే దుర్మార్గాలను స్వంత జనం ప్రశ్నించకుండా సమర్ధించేందుకు అది ఎంచుకున్న ఎత్తుగడ.తాను పెంచి పోషించిన ఉగ్రవాదానికి అదే బలికావటం కూడా వాస్తవం న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై వైమానికదాడి అదే. తాను పెంచిన తాలిబన్లే దానికి పాల్పడ్డారు.అమెరికా జిడిపిలో వ్యవసాయం తక్కువే అయినప్పటికీ గణనీయ మొత్తం ఎగుమతులకు ఉపయోగపడుతున్నది. ఆల్‌ఖైదాతో చెడిన తరువాత తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని అనేక కేంద్రాలపై దాడులు చేసినపుడు దొరికిన పత్రాలలో అమెరికా వ్యవసాయ వివరాలున్న పత్రాలు దొరికాయి. వ్యవసాయాన్ని ఎలా దెబ్బతీయాలా అన్నది ఆల్‌ఖైదా శిక్షణలో భాగంగా బయటపడిరది.అమెరికాకు నాలుగు తరగతుల నుంచి వ్యవసాయ ఉగ్రవాద ప్రమాదం ఉందని 2012లో ఎఫ్‌బిఐ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. ఒకటి ఆల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు, రెండవది మార్కెట్లను తిమ్మినిబమ్మిని చేసి లబ్దిపొందాలని చూసే ఆర్థిక నేరగాండ్లు లేదా అవకాశవాదుల నుంచి ప్రధానంగా ముప్పు ఉన్నట్లుపేర్కొన్నారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి(ఎఫ్‌ఎండి అంటే ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌)ని వ్యాపింప చేస్తే మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం పడుతుందన్నది తెలిసిందే. మూడవ తరగతి అసంతృప్తి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు తమ కసి తీర్చుకొనేందుకు చేసే ఉగ్రవాద చర్యలు, నాలుగవ తరగతిగా జంతుహక్కుల రక్షకులు, పర్యావరణ ప్రేమికులు అని పేర్కొన్నారు. న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని పేల్చివేసిన తరువాత అమెరికాలో ఆగ్రో టెర్రరిజం ఆకర్షణీయంగ ఉన్నట్లు కనిపించిందట.


అమెరికా ప్రపంచ మిలిటరీ శక్తిగా ప్రపంచానికి కనిపించకుండా చేయాలంటే దాని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని ఒసామా బిన్‌లాడెన్‌ పదే పదే వాదించేవాడట.2004 అమెరికా ఎన్నికల సమయంలో ఒక వీడియోలో పదేండ్ల పాటు రష్యా రక్తమోడిరది, అమెరికా కూడా దివాలా తీసేంతవరకు అదే విధానాన్ని అనుసరించాలని చెప్పాడట. 2011 సెప్టెంబరులో అమెరికా ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడికి ఆల్‌ఖైదాకు అయిన ఖర్చు కేవలం ఐదు లక్షల డాలర్లేనని , అమెరికాకు కలిగిన నష్టం 500బిలియన్‌ డాలర్లని ఒసామా చెప్పాడు. ఉగ్రవాద సంస్థలు నిజంగా అలా ఆలోచిస్తున్నాయో, పథకాలు వేస్తున్నాయో తెలియదు గానీ అమెరికా విశ్లేషకులు మాత్రం ఏం చేస్తే ఎలా,ఎంతటి నష్టం జరుగుతుందో వారికి విడమరచి చెబుతున్నారు. ఆహార ధాన్యాలు విషపూరితం అయితే వాటి ఎగుమతులు ఆగిపోతాయి లేదా నిల్వలు పేరుకు పోతాయి. పశువుల్లో వ్యాధులను వ్యాపింప చేస్తే వాటిని హతమార్చాల్సి ఉంటుంది. పరోక్షంగా రైతాంగానికి భారీ మొత్తాలను పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది.పరిశ్రమలకూ పరిహారంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయి, ఖర్చులూ పెరుగుతాయి. పశువుల్లో గాలికుంటు వ్యాధిని అమెరికాలో 1929లోనే నిర్మూలించారు. ఇతర ప్రాంతాల్లో ఉంది. ఇది మసూచి కంటే 20 రెట్లు వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ కేవలం నలభై ఎనిమిది గంటల్లో వంద కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెందగలదు. ఏదైనా వస్త్రానికి అంటుకుంటే నెల రోజుల పాటు బతికి ఉంటుంది. దీని గురించి తెలుసుకొనే లోపే అమెరికాలోని 25 రాష్ట్రాలకు కేవలం ఐదు రోజుల్లో వ్యాపింపగలదని అంచనా. అమెరికాకు పక్కనే దక్షిణ అమెరికాలో ఈ వ్యాధి ఉంది. అమెరికాలో ఒక్కో రైతు 1,500 నుంచి పదివేల వరకు ఆవులను పెంచుతాడు. ఒక దగ్గర ఈ వైరస్‌ను ప్రవేశపెడితే జరిగే నష్టాన్ని ఊహించుకోవచ్చు.2001లో బ్రిటన్‌లో ఈ వ్యాధి వ్యాపించటంతో 40లక్షల పశువులను వధించాల్సి వచ్చింది. అదే అమెరికాలో సంభవిస్తే 60 బిలియన్‌ డాలర్ల నష్టం(2012అంచనా) అని పరిశోధకులు పేర్కొన్నారు.ఇలాంటి దుర్మార్గాలకు తాము పాల్పడిన ఉదంతాలు అమెరికా అధికార యంత్రాంగానికి తెలుసుగనుక వారు నిరంతరం భయపడుతూనే ఉంటారు, ఎందుకు అంటే అమెరికాను ప్రతి ఒక్కరూ ద్వేషిస్తున్నారు గనుక. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, అది అమెరికా నుంచి కూడా కావచ్చు !

వ్యవసాయ ఉగ్రవాదం : వయ్యారి భామను భారత్‌పై దాడికి పంపిన వగలమారి మామ !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు


అమెరికా వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకు ఫుసారియమ్‌ గ్రామినియారమ్‌ అనే ఫంగన్‌ను చైనా పంపిందని, దాన్ని తీసుకువచ్చిన ఇద్దరు చైనా జాతీయులను అమెరికా ఎఫ్‌బిఐ అరెస్టు చేసినట్లు అంతర్జాతీయంగా వార్తలు వచ్చాయి. దీన్ని ఆగ్రో టెర్రరిజం(వ్యవసాయ ఉగ్రవాదం లేదా దాడి ) అని పిలుస్తున్నారు. ఆ ఫంగస్‌ను పరిశోధనలకోసం తెచ్చారన్నది ఒక కథనమైతే అమెరికా వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకు తీసుకువచ్చారనేది మరొక ఆరోపణ. ఎవరినైనా కేసుల్లో ఇరికించదలిస్తే పోలీసులు లేదా క్రిమినల్‌ గాంగ్స్‌ మాదక ద్రవ్యాలను ప్రత్యర్థుల నివాసాలు లేదా కార్యాలయాల్లో పెట్టి కేసుల్లో ఇరికించటం తెలిసిందే. రెండు దేశాల మధ్య వైరుధ్యాలు ముదిరితే ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల సిబ్బంది గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపించి వెళ్లగొట్టటం సాధారణమే. అమెరికా, చైనా మధ్య నడుస్తున్న వైరం పూర్వరంగంలో ఫుసారియమ్‌ ఫంగస్‌ను అమెరికా ఏజంట్లే చైనీయుల చేతిలో పెట్టి అరెస్టు చేసి ఉండవచ్చు. ఎందుకంటే అది అమెరికాలో కూడా దొరుకుతుంది. అరెస్టు చేసిన ఎఫ్‌బిఐ కథనం ప్రకారం జున్‌యోంగ్‌ లియు అనే 34 ఏండ్ల పరిశోధకుడు చైనాలో పని చేస్తున్నాడు.తన స్నేహితురాలు యంగింగ్‌ జియాన్‌ (33) అమెరికాలోని మిచిగాన్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నది. ఆమెను కలిసేందుకు 2024జూలైలో అమెరికా వచ్చాడు, తనతో పాటు ఫంగస్‌ను తెచ్చాడు. జియాన్‌ పని చేస్తున్న ప్రయోగశాలలో పరిశోధన కోసం పంగస్‌ను తెచ్చినట్లు ఆరోపణ. వారి చర్యలు అమెరికా పౌరుల భద్రతకు పెను ముప్పు అంటూ కేసు నమోదు చేశారు. వారు కమ్యూనిస్టు పార్టీకి విధేయులు కావటం మరింత ముప్పని అమెరికా అటార్నీ చెప్పాడు. మన దేశంలో నక్సలైట్లను బూటకపు ఎన్‌కౌంటర్లు చేసినపుడు వారి వద్ద ఎర్ర అట్టలున్న విప్లవ సాహిత్యం దొరికినట్లు పోలీసులు చెప్పే పిట్టకతలు తెలిసినవే. అలాగే వారు చైనా కమ్యూనిస్టు పార్టీలో సభ్యులని కూడా అమెరికా పోలీసులు తెలుసుకున్నారట. తప్పుడు సమాచారం, తప్పుడు వీసాల ఆరోపణల గురించి చెప్పనవసరం లేదు. చైనా తన ఏజంట్లు, పరిశోధకులను అమెరికా సంస్థలలోకి చొప్పించి విద్రోహ చర్యలతో అమెరికా ఆహార సరఫరా వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ పని చేస్తోందని భారతీయ సంతతికి చెందిన ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ ఆరోపించాడు. ఆ కేసు ఏమౌతుంది ఏమిటి అన్నది ముందు ముందు చూద్దాం.

అసలు ఆగ్రో టెర్రరిజం గురించి అమెరికా గుండెలు బాదుకోవటాన్ని చూస్తే దొంగే దొంగని అరవటం గుర్తుకు వస్తోంది. మన దేశం గడచిన ఏడున్నర దశాబ్దాలుగా అమెరికా ఆగ్రో టెర్రరిజానికి బలి అవుతున్నది. ఇది నమ్మలేని నిజం, మన మీడియాకు కనిపించని వాస్తవం. మీరు ఎప్పుడైనా వయ్యారి భామ, కాంగ్రెస్‌ గడ్డి, పార్ధీనియమ్‌ అనే మాటలను విన్నారా ? మూడూ ఒకటే, మన రైతాంగాన్ని, మనకు తెలియకుండానే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అమెరికా కలుపు మొక్క. దీని శాస్త్రీయ నామం పార్థీనియం హిస్టరోఫోరస్‌. ఇది చూడటానికి అందంగా ఉంటుంది గనుక వయ్యారి భామ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్‌ గడ్డి అని పిలిచారు. అమెరికా అమ్మాయి కూడా అంటారు. ఒక మొక్క ఎంతో ఏపుగా పెరిగి చాలా త్వరగా పుష్పించి వేలాది విత్తనాలను విడుదల చేస్తుంది.చాలా చిన్నవిగా ఉండటంతో గాలిలో మూడు కిలోమీటర్ల వరకు వ్యాపించి మొలకలెత్తుతాయి. ఒక్కో మొక్క 60 కోట్ల పుప్పొడి రేణువులను వదులుతుందట. ఇవి మొలిస్తే పంటల దిగుబడి 40శాతం తగ్గుతుంది, వాటిని తాకితే, తింటే పశువులు, మనుషులకూ వ్యాధికారకాలవుతాయి.దేశంలో 35 మిలియన్ల హెక్టార్లలో ఇది వ్యాపించి ఉన్నట్లు అంచనా. ఇంకా ఎక్కువే అన్నది మరొక అభిప్రాయం. మొక్కగా ఉన్నపుడు దాన్ని నాశనం చేయకపోతే పుష్పించినపుడు రెచ్చిపోతుంది.


మనదేశం స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొన్నది. ఆసమయంలో అమెరికాతో ఉన్న సంబంధాలతో ప్రధాని నెహ్రూ అక్కడి నుంచి గోధుమలను దిగుమతి చేసుకుంటే వాటితో అమెరికా ఈ కలుపు మొక్కనూ కావాలనే మనకు బహుమతిగా పంపింది. అంతకు ముందు అసలు మన రైతాంగానికి దీని గురించి తెలియదు. ఇది పంటలను దెబ్బతీస్తుందని అమెరికన్లకు పూర్తిగా తెలుసు. గోధుమలతో పాటు పంపింది అంటే మన పొలాల్లో వ్యాపించి పంటలను దెబ్బతీయాలని, తద్వారా శాశ్వతంగా తమ మీద ఆహార ధాన్యాలకు ఆధారపడేట్లు చేసుకోవాలన్నది అమెరికా ఎత్తుగడ. నాడు పిఎల్‌ (పబ్లిక్‌ లా)480 పధకం కింద 1950దశకంలో కేవలం రెండు మిలియన్‌ టన్నుల గోధుమలను సాయంగా తెచ్చుకున్నందుకు ఇప్పటికీ మనం మూల్యం చెల్లిస్తూనే ఉన్నాం. అనేక మంది ఊపిరితిత్తులు, చర్మ వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు, నోరులేని పశువుల సంగతి సరేసరి. వ్యాధులతో పాటు పాలదిగుబడీ తగ్గిపోతుంది.దీన్ని అమెరికా మన ఒక్క దేశానికే కాదు 46దేశాలకు వ్యాపింప చేసిందంటే దాని కుట్ర ఎంత పెద్దదో అర్ధం చేసుకోవచ్చు, ఇది అతి పెద్ద ఆగ్రో టెర్రరిజం కాదా ! నాడు మనదేశం అలీన విధానాన్ని అనుసరిస్తున్నది, ఆహార ధాన్యాలు కావాలని కోరినపుడు తమతో కలిస్తే వెంటనే ఇస్తామని 1949లో నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌ ఒక బిస్కెట్‌ వేశాడు. నెహ్రూ అంగీకరించలేదు, ఉచితంగా వద్దు డబ్బుతీసుకోవాలని ప్రతిపాదించాడు.1955వరకు ఎటూ తేల్చలేదు, మరోవైపు దేశంలో ఆహార కొరత పెరుగుతుండటంతో అమెరికా సాయంగానే ఇస్తూ ప్రపంచంలో పది ప్రమాదకర మొక్కల్లో ఒకటైన వయ్యారి భామను మన మీదకు వదిలింది. కావాలనే వదలినట్లు ఇంత వరకు అంగీకరించకపోగా తామే పంపినట్లు ఆధారాలేమిటో చూపాలని మనలను దబాయిస్తోంది.

ప్రమాదకరమైన కలుపు మొక్కలు, విత్తనాలు ఇతర దేశాల నుంచి రాకుండా అరికట్టేందుకు అవసరమైన గట్టి చట్టాలు, నిబంధనల మనదేశంలో లేని కారణంగా అనేకం మన దేశంలో ప్రవేశించాయి. మెక్సికో, అమెరికా, లాటిన్‌ అమెరికా నుంచి వయ్యారి భామ ఇతర దేశాలకు వ్యాపించింది. మన దేశంలో దీన్ని పూర్తిగా తొలగించాలంటే పదేండ్ల పాటు ఏడాదికి 18,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని 2010లో శాస్త్రవేత్తలు చెప్పారు, 1955 నుంచి మనకు జరిగిన నష్టం రు. 2,06,716 కోట్లు అని ఒక అంచనా. ఇది గాక మనుషుల, పశువుల అనారోగ్య ఖర్చు అదనం. జీవ వైవిధ్యానికి జరిగిన నష్టం, పునరుద్దరణలను పరిగణనలోకి తీసుకుంటే ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ నష్టం అంటున్నారు. జమ్మూ`కాశ్మీరులో పాకిస్తాన్‌ ఉగ్రవాద సమస్య గురించి మాత్రమే మనకు తెలుసు, కార్గిల్‌ వంటి ప్రాంతాలలో వయ్యారి భామ తిష్టవేసింది, ప్రధాన భూభాగానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అండమాన్‌కు సైతం ఇది విస్తరించిందంటే దాని వేగం, ప్రమాదం ఏమిటో అర్దం చేసుకోవచ్చు. మన కళ్ల ముందు వయ్యారాలు పోతూ సవాలు చేస్తున్న ఈ ఆగ్రో ఉగ్రవాదిని అరికట్టేందుకు దేశమంతటా ఒకేసారి చర్యలు తీసుకొని ఉంటే నిరోధించి ఉండేవారు. కానీ జరగలేదు. దీని విస్తరణ ఎంత ప్రాంతంలో జరిగిందన్నది కూడా సమగ్ర అధ్యయనం లేదు. ఒక అంచనా ప్రకారం ఎక్కువగా పెరిగిన ప్రాంతం నుంచి దీన్ని తొలగించాలంటే హెక్టారుకు నలభై పనిదినాలు అవసరమని తేల్చారు. ఆయా సమయాలను బట్టి అందుకయ్యే ఖర్చును లెక్కకట్టాలి.


ఆగ్రో ఉగ్రవాది వయ్యార భామ గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం, వ్యవసాయంతో అనుబంధంగా ఉండే వాటిపై మరికొన్ని దాడుల గురించి చూద్దాం. వీర, రౌద్ర,శోక,హాస్య,శృంగార తదితర రసాలతో పాటు భీభత్స రసం అంటే ఉగ్రవాదమే. ఇతిహాసాలు, పురాణాల్లో వీరులు శత్రువులకు ఈరసాన్ని చవి చూపించినట్లు చదువుకున్నాం. కానీ ఆధునిక మిలిటరీ దుర్మార్గాల్లో బయో ఉగ్రవాదం కూడా ఒక ఆయుధం.అనేక ప్రమాదకర వైరస్‌లను ప్రత్యేకంగా ఎవరో పనిగట్టుకొని వ్యాపింప చేయనవసరం లేదు. అయితే సహజంగా తలెత్తినవి ఏవో ఇతరులు ప్రయోగించినవి ఏవో తెలుసుకోవటం అవసరం, అదేమీ కష్టం కూడా కాదు. ఆఫ్రికన్‌ హార్స్‌ సిక్‌నెస్‌(ఎహెచ్‌ఎస్‌) వైరస్‌ను తొలిసారిగా 1600 సంవత్సరాల్లో ఆఫ్రికాలోని సహారా ఎడారి కనుగొన్నారు. అది క్రమంగా మనదేశానికి వ్యాపించి మిలిటరీలో ఉన్నవాటితో సహా 20లక్షల గుర్రాల మరణానికి కారణమైంది. రిఫ్ట్‌వాలీ వైరస్‌ అనేది ఒంటెల ద్వారా వ్యాపిస్తుంది, అనేక దేశాలను అది చుట్టుముట్టింది,మన దేశం సంగతి తెలియదు, ఎప్పుడైనా రావచ్చు. మన వ్యవసాయానికి అనుబంధంగా ఉండేది పశుపాలన, చేపలు, రొయ్యలు, కోళ్ల పెంపకం వంటివి. వాటికి అనేక వైరస్‌లు వ్యాపిస్తున్నాయి. సంతలు, మార్కెట్‌లు పెద్ద వ్యాపక కేంద్రాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఆరేండ్ల నాటి అంచనా ప్రకారం దేశంలో ఎలుకలు, పందికొక్కుల సంఖ్య 240 కోట్లు, అవి ఇప్పుడిరకా పెరిగి ఉంటాయి. ప్రతి ఆరు ఒక మనిషి ఆహారాన్ని తింటున్నాయి. ఏటా 24లక్షల నుంచి 2.6కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు వృధా అవుతున్నాయి. వాటితో వచ్చే వ్యాధులు, వాటి నివారణ ఖర్చులపై అంచనాల్లేవు. వీటన్నింటినీ ఎవరు ప్రవేశపెట్టినట్లు ? ఇప్పుడైతే కుట్ర సిద్దాంతవేత్తలు, వారిని అనుసరించే మీడియా పండితులు వెంటనే చైనా అనేస్తారు. గతంలో ప్రపంచలో కోట్లాది మంది ప్రాణాలు తీసిన ప్లేగు, స్పానిష్‌ ఫ్లూ వంటి వాటికి కూడా అదే అని చెప్పినా ఆశ్చర్యం లేదు.బ్రిటీష్‌ పాలనా కాలంలో 1943లో వచ్చిన బెంగాల్‌ కరువుకు 30లక్షల మంది మరణించారు.వారి ఆకలి బాధ తీర్చటానికి ఆ రోజు ప్రపంచంలో ఆహారం లేదా అంటే ఉంది,బ్రిటీష్‌ వారికి పట్టలేదంతే ! ఇటీవలి సంవత్సరాల్లో తెల్లదోమ ఎంతటి వినాశనాన్ని కలిగించిందో చూశాము. తెగుళ్ల నివారణకు తయారు చేసిన సింథటిక్‌ పైరిత్రాయిడ్స్‌ వినియోగంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని కొత్త సమస్యలు తలెత్తాయి. అనేక పశ్చిమ దేశాలలో వాటిని నిషేధించినప్పటికీ మనదేశంలో వాటిని విక్రయించేందుకు ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. బహుళజాతి గుత్త సంస్థలు చేస్తున్న ఆగ్రో ఉగ్రదాడి తప్ప మరొకటి కాదు. అసలు అమెరికా గతంలో చేసిన ఆగ్రో ఉగ్రదాడులకు బలైన దేశాలు, ఉదంతాలు గురించి మరో విశ్లేషణలో చూద్దాం !