రష్యాపై ఉక్రెయిన్‌ భారీ దాడి పర్యవసానాలేమిటి ? నాలుగు రోజులైనా నోరు విప్పని ట్రంప్‌, పుతిన్‌ !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

నాటో కూటమి దేశాలు సృష్టించిన ఉక్రెయిన్‌ సంక్షోభం అక్షరాలా పదకొండు వందల తొంభై ఆరవ రోజులో ప్రవేశించింది. ఎప్పుడు, ఎలా ముగుస్తుందో తెలియదు.ఆదివారం నాడు రష్యా గడ్డమీద ఆపరేషన్‌ స్పైడర్‌ వెబ్‌ (సాలెగూడు) పేరుతో ఉక్రెయిన్‌ జరిపిన డ్రోన్ల దాడిలో భారీ మొత్తంలో నష్టం చేకూర్చినట్లు జెలెనెస్కీ ప్రకటించాడు. దాన్ని ఉగ్రవాద చర్యగా వర్ణించిన రష్యా ప్రతిగా వెంటనే పెద్ద ఎత్తున దాడి చేసింది. ఉక్రెయిన్‌ చర్య మీద బుధవారం నాడు ఇది రాసిన సమయానికి అటు డోనాల్డ్‌ ట్రంప్‌ వైపు నుంచి ఇటు వ్లదిమిర్‌ పుతిన్‌ నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు. దాడి గురించి ఉక్రెయిన్‌ తమకు ఎలాంటి ముందస్తు సమాచారమూ ఇవ్వలేదనే ఒక్క మాట మాత్రమే అమెరికా అధ్యక్ష భవనం నుంచి వెలువడిరది. సోమవారం నాడు టర్కీ నగరమైన ఇస్తాంబుల్‌లో రెండు దేశాల మధ్య యుద్ధ ఖైదీలు, మరణించిన వారి మృతదేహాల మార్పిడికి సంబంధించిన అవగాహన కుదిరింది. మూడు రోజుల పాటు కాల్పుల విరమణ చేస్తామని రష్యా ప్రతిపాదిస్తే బేషరుతుగా అంగీకరించాలని ఉక్రెయిన్‌ చేసిన ప్రతిపాదనను పుతిన్‌ దూతలు తిరస్కరించారు.పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. రెండు శిబిరాలూ తాజా పరిస్థితికి అనుగుణంగా ఎత్తుగడలను రూపొందించుకొనే కసరత్తులో ఉన్నాయని వేరే చెప్పనవసరం లేదు. బందీల విడుదల గురించి గతంలోనే ఒక అవగాహన కుదిరి అమలు జరిపారు, మరోసారి మిగిలిన వారి గురించి చర్చలలో పాల్గ్గొనటానికి ఇరువురికీ అభ్యంతరం ఉండనవసరం లేదు. దానికి ఉక్రెయిన్‌ జరిపినదాడికీ సంబంధం లేదు. గడచిన మూడున్నర సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య ఇలాంటి దాడులు, ప్రతిదాడులూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆదివారం నాడు ఉక్రెయిన్‌ జరిపిన దాడికి ఉన్న ప్రాధాన్యతను తక్కువ అంచనా వేయనవసరం లేదు. యుద్ధం అన్న తరువాత రెండు వైపులా నష్టం ఉంటుంది. మూడున్నరేండ్ల రష్యా మిలిటరీ చర్యలో ఉక్రెయిన్‌ ఇప్పటి వరకు కోల్పోయిన ప్రాంతం, ఇతర వాటితో పోల్చితే ఆదివారం నాటి రష్యా నష్టం పెద్దదేమీ కాదు.ఇక ఇస్తాంబుల్‌ చర్చల విషయానికి వస్తే జూన్‌ రెండవ తేదీన ఖైదీల మార్పిడి గురించి తప్ప శాంతి ప్రతిపాదనల మీద ఎలాంటి పురోగతీ లేదు. ఉక్రెయిన్‌ దాడిని అవకాశంగా తీసుకొని పశ్చిమ దేశాల పండితులు రష్యన్‌ సామర్ధ్యం గురించి కథనాలు వండి వారుస్తున్నారు, ప్రచారదాడికి పూనుకున్నారు.

వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియాతో సహా రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్‌ డ్రోన్లను ఎలా పంపింది. ఏక కాలంలో ఐదు వైమానిక స్థావరాల మీద ఎలా దాడి చేసింది అన్నది ఇంకా బహిర్గతం కావాల్సి ఉంది. ఈ పథకాన్ని రచించేందుకు తమకు పద్దెనిమిది నెలలు పట్టిందని జెలెనెస్కీ చెప్పుకున్నప్పటికీ పశ్చిమ దేశాలన్నింటి ఉమ్మడి హస్తం దీనివెనుక లేకుండా ఉక్రెయిన్‌కు అంతసీన్‌ లేదు. అంతర్గతంగా రష్యాలో కొందరు చేతులు కలిపిన కారణంగానే డ్రోన్ల రవాణా జరిగిందన్నది ప్రాధమిక సమాచారం. రష్యా పత్రిక మాస్కో టైమ్స్‌ కథనం సారాంశం ఇలా ఉంది. ఉక్రెయిన్‌ నగరాల మీద బాంబులు వేసేందుకు ఉపయోగించే 41టియు 95 మరియు టియు 22 బాంబర్లు, ఏ 50 అనే రాడార్‌ విమానాన్ని ధ్వంస చేసినట్లు ఉక్రెయిన్‌ చెప్పినదాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంది. వీటిలో పదికంటే తక్కువే మిలిటరీ సర్వీసులో ఉన్నాయి.మరో రెండిరటిని 2024లో ఉపరితలం నుంచి ప్రయోగించే క్షిపణులతో ఉక్రెయిన్‌ కూల్చివేసింది. మూడున్నర సంవత్సరాలలో ఇది రష్యాకు మూడవ పెద్ద దెబ్బ. ఈ రకం విమానాలను ఇప్పుడు రష్యా ఉత్పత్తి చేయటం లేదు. టియు 160 రకం బాంబర్లు గాక ఇవి ఒకే సారి 16క్షిపణులను రెండు వేల కిలోమీటర్ల దూరం మోసుకుపోగలవు. ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులతో అనేక విమానాలకు నిప్పంటుకున్నట్లు, ఆర్పివేసినట్లు, ఎలాంటి మరణాలు లేవని, అనుమానితులను అరెస్టు చేసినట్లు రష్యన్‌ రక్షణ మంత్రిత్వశాఖ నిర్ధారించింది. రష్యా వూహాత్మక బాంబర్లలో 34శాతాన్ని ధ్వంసం చేశామని వాటి నష్టం 7 బిలియన్‌ డాలర్లని ఉక్రెయిన్‌ భద్రతా సంస్థలు చెప్పాయి.ఉపగ్రహ చిత్రాల ఆధారంగా విశ్లేషించిన వారు మొత్తం 13 విమానాలు నాశనం లేదా దెబ్బతినట్లు చెప్పారు. ఎనిమిదని వాషింగ్టన్‌ డిసికి చెందిన నిపుణుడు క్రిస్‌ బిగ్గర్స్‌ ఎక్స్‌లో పోస్టు చేశాడు.మరోచోట ఐదు అని ఉక్రెయిన్‌ ఓకో హోరా గ్రూపు విశ్లేషకులు పేర్కొన్నారు.


చెక్క పెట్టెలలో 117 డ్రోన్లను ఉంచి రష్యా ట్రక్కులలోనే రహస్యంగా తరలించామని, రిమోట్‌ కంట్రోలుతో చెక్క పెట్టెల మూతలను తొలగించి డ్రోన్లతో దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ పేర్కొన్నది. వైమానిక కేంద్రాల సమీపం నుంచి వాటిని ప్రయోగించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ చెప్పింది.ఒక వైమానిక కేంద్రం ఉక్రెయిన్‌ నుంచి సైబీరియాలో 4,300 కిలోమీటర్లు, మరొకటి 1,900కి.మీ దూరంలో ఉంది. మూడు కేంద్రాల మీద జరిగిన దాడిని తిప్పికొట్టిన్లు పేర్కొన్నది. పర్యవసానాలు, రష్యన్‌ మిలిటరీ సామర్ద్యాన్ని అంచనా వేయటం ఈ దశలో కష్టం. ఇదీ మాస్కో టైమ్స్‌ మరుసటి రోజు విశ్లేషణ. ఉక్రెయిన్‌ దాడి మీద రష్యా ఎలా స్పందిస్తుందోనని ప్రపంచమంతా ఎదురుచూస్తున్నది.అది అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ మీద ఆధారపడి ఉంటుందన్నది ఒక తర్కం. తాను అధికారానికి వచ్చిన 24 గంటల్లోనే పరిష్కరిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఫారిన్‌ పోలిసీ అనే పత్రిక సిఐఏలో రష్యా గురించి విశ్లేషణ చేసిన మాజీ డైరెక్టర్‌ జార్జి బీబీతో మాట్లాడిరది. పరిస్థితిని సాధారణ స్థాయికి తీసుకురావాల్సింది డోనాల్డ్‌ ట్రంప్‌ అని బీబీ చెప్పాడు. ఉక్రెయిన్‌ దాడి మీడియా ప్రత్యేకించి పశ్చిమదేశాల దృష్టిని పెద్దగా ఆకర్షించవచ్చు, రష్యా మీద పెద్ద ప్రభావం చూపుతుందని అనుకోవటం లేదు, దాని సామర్ద్యాన్ని దెబ్బతీయదని, రెండు దేశాల మధ్య పెద్ద మార్పులు తెస్తుందని అనుకోవటం లేదన్నాడు.


రష్యన్‌ మిలిటరీ వైమానిక, పెద్ద డ్రోన్ల దాడిని ఎలా ఎదుర్కోవాలా అన్నదాని మీదే భద్రత గురించి దృష్టి సారించింది తప్ప భూమి మీద నుంచి డ్రోన్లను ప్రయోగించి దెబ్బతీసే ఎత్తుగడల గురించి కేంద్రీకరించలేదన్నది ప్రాధమికంగా కనిపిస్తున్నది.తక్కువ ఎత్తులో సమీపం నుంచి దాడి చేసే చిన్న డ్రోన్ల గురించి దృష్టి సారించలేదు. ఇది ఒక్క రష్యాకే కాదు యావత్‌ ప్రపంచానికి ఒక మిలిటరీ గుణపాఠం. ఎలాంటి అనుమానం కలగకుండా రష్యన్‌ డ్రైవర్లు వాటిని ట్రక్కులలో వైమానిక స్థావరాల వద్దకు తీసుకు వెళ్ల గలిగారు. మాస్కోలోని ప్రధాన గూఢచార కార్యాలయం సమీపం నుంచే స్పైడర్‌వెబ్‌ కమాండ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి రిమోట్‌ కంట్రోలతో పని చేయించారని చెబుతున్నారు, నిర్ధారించుకోవాల్సి ఉంది. ఈ దాడి కారణంగా రెండు దేశాల చర్చల క్రమంలో మార్పు రాదని మరుసటి రోజే జరిగిన సమావేశం వెల్లడిరచింది. అయితే దీనికి, ఎవరికి వారు వేసే ఎత్తుగడలకు సంబంధం ఉండదు. ఈ దాడి తరువాత పుతిన్‌పై ట్రంప్‌ పట్టు పెరుగుతుందని కొందరు భావిస్తున్నారు. ఇప్పటి వరకు రష్యాకు అనుకూలంగా పరిస్థితి ఉందని వేసిన అంచనాలను సవరించుకోవాలని సూచిస్తున్నారు. అందువలన రష్యా డిమాండ్‌ చేస్తున్న షరతులతో ఒప్పందానికి అంగీకరించే అవకాశం ఉండదని సూత్రీకరిస్తున్నారు. ఇంతకు ముందే ఆ షరతులకు ట్రంప్‌ అంగీకరించలేదని, ఇప్పుడు మరింతగా వైఖరి గట్టిపడుతుందని అంటున్నారు. దాడికి ముందే గత కొద్ది రోజులుగా రష్యా మీద మరింత కఠిన వైఖరి తీసుకోవాలని, ఆంక్షల తీవ్రతను పెంచాలనే వత్తిడి ట్రంప్‌ మీద వస్తున్నది, ఐరోపా దేశాలు బహిరంగంగానే చెప్పాయి. పుతిన్‌ స్వయంగా కాల్పుల విరమణకు అంగీకరించకపోతే కొత్త ఆంక్షలను అమలు జరుపుతామనే సందేశాన్ని పంపగలడని విశ్లేషకులు చెబుతున్నారు. కొద్ది వారాల క్రితం ట్రంప్‌ తన ఓవల్‌ కార్యాలయంలో జెలెనెస్కీతో మాట్లాడుతూ ప్రయోగించటానికి తురుపుముక్కలేవీ లేవని చెప్పిన సంగతి తెలిసిందే. నాటో ప్రధాన కార్యాలయంలో అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేత్‌ ఫిబ్రవరిలో మాట్లాడుతూ 2014కు ముందు కలిగి ఉన్న ప్రాంతాలన్నీ తిరిగి వస్తాయని ఉక్రెయిన్‌ భావించటం వాస్తవ విరుద్దమన్నాడు. ఇప్పుడు ధ్వంసం చేశామని చెబుతున్న ఫైటర్‌లు రష్యా దగ్గర ఉన్నవాటిలో ఒక చిన్న భాగమే.
రష్యా మిలిటరీ బలగంతో పోల్చితే ఉక్రెయిన్‌ ఏ మాత్రం పోల్చటానికి లేదు. అయినప్పటికీ మూడున్నర సంవత్సరాలుగా అది నిలిచి ఎదిరిస్తున్నది.కొందరు చెబుతున్నదాని ప్రకారం ఉక్రెయిన్‌ తన సమాచారం మొత్తాన్ని మైక్రోసాఫ్ట్‌కు తరలించింది. దాని క్లౌడ్‌ సేవలను ఉపయోగించుకుంది. పలు పశ్చిమ దేశాలు సమన్వయం చేసుకొని రష్యా మీద సైబర్‌దాడులు జరిపాయి. ఎలన్‌ మస్క్‌ స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ స్టార్‌లింక్‌ను అందచేసింది. ఇది ఉక్రెయిన్‌ సమాచార వ్యవస్థలను పటిష్టం కావించింది. మైక్రోసాఫ్ట్‌తో పాటు క్లౌడఫేర్‌, పాలన్‌టిర్‌ వంటి అనేక సంస్ధలు సైబర్‌దాడుల్లో ఉక్రెయిన్‌కు తోడ్పడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికాతో సహా నాటో దేశాలన్నీ తమ సర్వశక్తులను ఉక్రెయిన్‌ మీద వడ్డి అనేక విధాలుగా సాయపడ్డాయి. వాటిలో ఆధునిక డ్రోన్ల ఉత్పత్తి ఒకటి.ఇది రష్యాకంటే ఆధునికమైన వాటిని ముందుగానే రూపొందించేందుకు తోడ్పడిరది. గూఢచార సమాచారం, ఆధునిక ఆయుధాల అందచేత గురించి చెప్పనవసరం లేదు. ఒక చిన్న దేశం రష్యాను ఓడిరచిందనే ప్రచారదాడికి దాన్ని ఒక సాధనం చేసుకోవాలని చూశాయి. మరోవైపున ఆర్థికంగా ఆంక్షలతో ఎలా దెబ్బతీశాయో చెప్పనవసరం లేదు. ఇంత చేసినప్పటికీ వాటన్నింటినీ రష్యా అధిగమిస్తూ ఇప్పటి వరకు ఐదోవంతు ఉక్రెయిన్‌ భూభాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగింది. అనేక మౌలిక వ్యవస్థలను ధ్వంసం చేయగలిగింది.
నాటో దేశాలు ఉక్రెయిన్ను నిలిపేందుకు ఎంత చేసినా అవి సఫలం కాలేకపోతున్నాయి. ఆయుధాలు ఇచ్చినా వాటిని వినియోగించే నైపుణ్యం ఉక్రెయిన్‌ మిలిటరీకి లేదని తేలింది, అంతే కాదు అవసరమైన సంఖ్యలో సైనికుల సంఖ్య కూడా లేదు. రష్యాలో ఉన్న రక్షణ ఉత్పత్తుల మౌలిక వ్యవస్థ ఎంతో ముఖ్యమైనది, రోజు రోజుకూ రష్యాకు అనుకూలంగా పరిస్థితులు మారటంలో అది కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నది. అయితే తెల్లవారేసరికి రష్యా పైచేయి సాధిస్తుందని అర్ధం కాదు. పోరు దీర్ఘకాలం సాగినందున ఉక్రెయిన్‌కు లభించిన సాయాలన్నీ తాత్కాలికం తప్ప ముఖ్యంగా ఆయుధాలు శాశ్వతం కాదు. ముందే చెప్పుకున్నట్లు అనేక ప్రాంతాలు రష్యా స్వాధీనంలోకి వచ్చాయి. ఇది రష్యాకు అనుకూలతలను పెంచింది.మిలిటరీ జవాన్ల సంఖ్యలో రష్యాదే ఆధిపత్యం. అందువల్లనే దాని ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాల మీద పట్టు నిలుపుకుంటోంది. ఉక్రెయిన్‌కు తగినన్ని బలగాలు లేని కారణంగా రష్యాలో ఆక్రమించుకున్న కురుస్కు ప్రాంతాన్ని అది నిలుపుకోలేకపోయింది. అనేక అనుభవాలను చూసిన తరువాత పుతిన్‌ సేనలు వ్యూహాన్ని మార్చాయి. పశ్చిమ దేశాలు ఆశించినట్లు ఆంక్షలతో రష్యా కుదేలు కాలేదు.పోరు విషయంలో తటస్థంగా ఉన్నప్పటికీ భారత్‌, చైనా దాని నుంచి చమురు, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేసి ఒక విధంగా ఆర్థికంగా ఎంతగానో ఆదుకున్నాయి. అవి కూడా లబ్దిపొందాయి, ఇదొక కొత్త అనుభవం.

మేడిన్‌ చైనా విడిభాగాల కోసం బారులు తీరుతున్న మేకిన్‌ ఇండియా ఉత్పత్తిదారులు ! ఎటూ తేల్చుకోలేని స్థితిలో నరేంద్రమోడీ !!

Tags

, , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మన ఆటోమొబైల్‌ పరిశ్రమ చైనా నుంచి రావాల్సిన ఒక చిన్న పరికరం కారణంగా ప్రస్తుతం ఆందోళన చెందుతోందంటే ఎవరైనా నమ్ముతారా ? అదే నియోడిమియమ్‌ ఐరన్‌ బోరోన్‌ అనే మాగ్నెట్‌.కార్లలో స్టీరింగ్‌ నుంచి బ్రేకులు, వైపర్‌లు, ఆడియో పరికరాల వంటి వాటికి ఇది ఎంతో ముఖ్యం. అది లేకపోతే మొత్తం కారు సిద్దమైనా ప్రయోజనం ఉండదు. వాటి తయారీ, సరఫరాలో గుత్తాధిపత్యం ఉన్న చైనా ఏప్రిల్‌ నుంచి ఎగుమతుల మీద పలు ఆంక్షలు విధించింది. వాటిని దేనికి వినియోగిస్తారో ముందుగానే ఆయా దేశాలు హామీ పత్రాలు ఇవ్వాలన్నది వాటిలో ఒకటి. కొన్ని దేశాలు వాటిని కొని చైనాతో వైరానికి దిగిన అమెరికా, ఐరోపా దేశాలకు అమ్ముకుంటున్నాయి.దాన్ని నిరోధించేందుకే ఆ షరతు అన్నది స్పష్టం. మన దేశంలో గతంలో దిగుమతి చేసుకున్న నిల్వలు జూన్‌ మొదటి వారం వరకు వస్తాయని అందువలన త్వరగా తెచ్చుకొనేందుకు చైనాతో సంప్రదింపులు(పైరవీలు) జరపాలని ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ సొసైటీ, ఆటోమోటివ్‌ కాంపొనెంట్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్ల ప్రతినిధులు చైనా వెళ్లేందుకు సిద్దం అవుతున్నారని బిజినెస్‌ టుడే పత్రిక 2025 మే 31వ తేదీ వార్తలో పేర్కొన్నది. 2024లో 470 టన్నుల మాగ్నెట్‌లు దిగుమతి చేసుకోగా ఈ ఏడాది 700 టన్నులకు నిర్ణయించారు. చైనా మీద ఆధారపడకుండా మనమే మాగ్నెట్‌లు తయారు చేసేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలో నిర్ణయించేందుకు జూన్‌ 3న ఉన్నతస్థాయి కమిటీ సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు కూడా ఆ పత్రిక రాసింది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవటం అంటే ఇదే ! పదకొండు సంవత్సరాల నుంచి ఏం చేసినట్లు ? తన పెట్టుబడులను మన ప్రభుత్వం అడ్డుకున్న కారణంగానే సరఫరాకు చైనా ఆంక్షలు పెడుతోందా ? ఏమో, ఎవరి ప్రయోజనం వారిది, ఎవరి తురుపు ముక్కలు వారివి !


లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ 2025 ఏప్రిల్‌ 25వ తేదీన తన సర్వే నివేదికను ప్రచురించింది.దాన్లో చెప్పినదాని ప్రకారం గడచిన ఏడాది కాలంలో భారతీయుల్లో 62శాతం మంది చైనా వస్తువులను కొనుగోలు చేశారు. అంతకు ముందు ఏడాది వారు 55శాతమే ఉన్నారు, 15శాతం మంది కొత్త చైనా వస్తువులు భారతీయ కంపెనీల ద్వారా వస్తే కొనుగోలు చేయటం ఖాయమని చెప్పారు. ఈ వివరాలు సూచిస్తున్నదేమిటి ? స్వదేశీ వస్తువులనే వాడండి అని పాలకులు ఎన్ని సుభాషితాలు పలికినప్పటికీ జనం పట్టించుకోవటం లేదు. ఆధునిక జీవితం, వినియోగదారీ తత్వాన్ని పెంచుతున్న కారణంగా నాణ్యమైన, చౌకగా దొరికే చైనా వస్తువుల కోసం ప్రపంచమంతా ఎగబడుతున్నపుడు మనవారు దూరంగా ఉంటారా ! మావెనుకే జనం ఉన్నారని చెప్పుకుంటున్న పార్టీ మాటలు విని ఉంటే చైనా దిగుమతులు పడిపోయేవి. దానికి విరుద్దంగా మోడీ ఏలుబడిలో రికార్డులు బద్దలవుతున్నాయి.


పదకొండు సంవత్సరాల ప్రచార ఆర్భాటం తరువాత పరిస్ధితి ఏమిటి ? ఏదీ ఊరికే రాదు. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో లక్కు మీద ఆధారపడిన రాజేంద్ర ప్రసాదు మాదిరి ఉంటే కుదరదు. కొంత మందికి చైనాలో కమ్యూనిస్టు నియంత్రత్వం కనిపిస్తుంది. నియంతల పాలన ఉన్నదేశాలన్నీ దాని మాదిరి ఎందుకు అభివృద్ధి చెందలేదో చెప్పాలి మరి. పరిశోధన మరియు అభివృద్ధికి గణనీయంగా ఖర్చు పెట్టిన కారణంగానే చైనా అనేక రంగాలలో దూసుకుపోతున్నది. ముందే చెప్పుకున్న మాగ్నెట్‌ల ఎగుమతిలో చైనా వాటా ప్రపంచంలో అపురూప ఖనిజాలతో తయారయ్యే వాటిలో 80శాతం వరకు ఉన్నట్లు అంచనా, మెటల్‌ మాగ్నెట్లలో 2012లో 49.6శాతం ఉండగా 2024కు అది 63.5శాతానికి పెరిగింది.నాన్‌ మెటల్‌ మాగ్నట్లలో 50.8 నుంచి 59.1శాతానికి పెరిగింది(మనీ కంట్రోల్‌ వెబ్‌ 2025 మే 29).మన నరేంద్రమోడీ తలచుకోవాలే గానీ తెల్లవారేసరికి వాటిని ఉత్పత్తి చేయగలరని గొప్పలు చెప్పేవారు మనకు కనిపిస్తారు. వాస్తవం ఏమంటే 2013లో మనకు అవసరమైన మెటల్‌ మాగ్నట్లలో చైనా నుంచి 73.5శాతం దిగుమతి చేసుకుంటే 2024లో 82.9శాతానికి పెరిగాయి. విద్యుత్‌ వాహనాల తయారీలో ఈ మాగ్నెట్‌లు కీలకం. పాకిస్తాన్‌ వందకు వంద, ఐరోపా సమాఖ్య 90, దక్షిణ కొరియా 87.4శాతం, అమెరికా దిగుమతుల్లో 75శాతం చైనా నుంచి తెచ్చుకుంటున్నాయి. ప్రపంచంలో 78 దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటుండగా వాటిలో 41 చైనా మీద 60శాతంపైగా ఆధారపడి ఉన్నాయి.మన పాలకులు లేదా పరిశ్రమగానీ చైనా మీద ఆధారపడకుండా చేయటంలో విఫలమయ్యారు. డోనాల్డ్‌ ట్రంప్‌ ఏడు అపురూప ఖనిజాలు, మాగ్నెట్‌ ఉత్పత్తుల దిగుమతుల మీద ఆంక్షలు విధించాడు.ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్నట్లుగా ఇది ఇతర దేశాలకు ఇబ్బందులు తెచ్చింది. మన విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ మే నెలలో 30 సర్టిఫికెట్లు జారీ చేసి చైనా నుంచి దిగుమతుల పునరుద్దరణకు వీలు కల్పించినట్లు వార్తలు వచ్చాయి. వాటిని రక్షణ అవసరాలకు లేదా తిరిగి అమెరికాకు ఎగుమతులు చేయబోమని హామీ ఇచ్చింది.వాటిని చైనా పరిశీలించిన తరువాత దిగుమతి చేసుకోవచ్చు, ఆ ప్రక్రియను త్వరగా చేపట్టాలనే పరిశ్రమల వారు పైరవీ కోసం చైనా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారని ముందే చెప్పుకున్నాం.

బిజెపి లేదా దానికి భజన చేసే గోడీ మీడియా పండితులు మేకిన్‌ ఇండియా గురించి గోరంతను కొండంతలుగా చిత్రించి కబుర్లు చెబుతారు. రాజకీయంగా అమెరికాతో అంటకాగేందుకు కేంద్ర పాలకులు తపించి పోతుంటారు. కాషాయ దళాలు నిత్యం చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతుంటాయి. కానీ ఆర్థిక విషయాల్లో మాత్రం చైనా కావాల్సి వస్తోంది. నరేంద్రమోడీ అధికారం స్వీకరించగానే 2014లో చెప్పిందేమిటి ? మేకిన్‌ ఇండియా పథకంతో దేశాన్ని ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా మారుస్తా, అందుకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తా అన్నారు, ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహక పధకం(పిఎల్‌ఐ) ప్రకటించారు. జిడిపిలో ఉత్పాదక రంగ వాటాను 15 నుంచి 2025 నాటికి 25శాతానికి పెంచుతానని, కీలక రంగాల్లో చైనా మీద ఆధారపడటాన్ని తగ్గిస్తా అని చెప్పారు. అందుకు దేశమంతటా గుజరాత్‌ నమూనా అభివృద్ధి చేస్తా అన్నారు. పదేండ్లలో జరిగిందేమిటి ? కొంత మేరకు ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఎగుమతుల విలువ పెరిగింది. జిడిపిలో వస్తూత్పత్తి వాటా పెరగకపోగా 14శాతానికి తగ్గింది. దీని గురించి మాట్లాడకుండా సెల్‌ ఫోన్ల ఎగుమతి చూడండి, ఆపిల్‌ కంపెనీ 20శాతం ఉత్పత్తి ఇక్కడే చేస్తున్నది అంటూ సర్వస్వం అదే అన్నట్లుగా చిత్రిస్తున్నారు. పిఎల్‌ఐ స్కీములో కేటాయించిన 1.9లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ దీనికి ఒక కారణం. టెలికమ్యూనికేషన్స్‌, పివి సెల్స్‌ వంటి కొన్ని దిగుమతులు చైనా నుంచి తగ్గాయి. కానీ ఔషధ రంగానికి అవసరమైన ఏపిఐ దిగుమతులు 75 నుంచి 72శాతానికి మాత్రమే తగ్గాయి. అనేక రంగాలకు ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాలను సాధించటంలో వైఫల్యం కనిపిస్తుంది. మొత్తంగా విజయమా వైఫల్యమా అన్నది చూడాలి. యాపిల్‌ కంపెనీని ఒక ఉదాహరణగా చూపుతున్నారు.చైనాలో ఉత్పాదక ఖర్చు పెరిగిన కారణంగా అది వియత్నాం, మనదేశానికి వచ్చింది. అమెరికాలో తడిచి మోపెడవుతుంది గనుక ఎన్ని పన్నులు వేసినా విదేశాల్లోనే తయారు చేస్తానని ట్రంప్‌కు తెగేసి చెప్పింది.షీ జింపింగ్‌, నరేంద్రమోడీ, ట్రంపా ఎల్లయ్యా పుల్లయ్యా అన్నది కాదు, దానికి కావాల్సింది లాభాలు. రేపు ఆఫ్రికా ఖండంలో ఖర్చు తక్కువగా ఉంటే పొలో మంటూ అక్కడికి పోతుంది. ఆ కంపెనీ చైనాలో విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, విడిభాగాలు తయారు చేసే పరిశ్రమలతో సమగ్ర ఒప్పందాలు చేసుకుంది. చైనా ప్రభుత్వ సహకారంతో రెండు దశాబ్దాల కాలంలో అది జరిగింది. మనదేశంలో అలాంటివేమీ లేదు.


వాజ్‌పాయి పాలనలో దేశం వెలిగి పోయింది అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ పాలన ముగిసి యుపిఏ అధికారానికి వచ్చిన రెండేళ్లకు 2006లో నేషనల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కాంపిటీటివ్‌ కౌన్సిల్‌ ఉత్పాదక రంగం సంక్షోభంలో ఉందని, జాతీయ ఉత్పాదక విధానాన్ని రూపొందించాలని కోరింది. దానికి అనుగుణంగా 2011లో యుపిఏ సర్కార్‌ పదేండ్లలో జిడిపిలో ఉత్పాదక రంగ వాటాను 25పెంచేందుకు ఒక విధానాన్ని ఆమోదించింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2014లో దానికి మేకిన్‌ ఇండియా అనే పేరు తగిలించి తానే రూపొందించినట్లు ప్రచారం చేసుకున్నారు. దాన్లో భాగంగానే సబ్సిడీలకు ప్రోత్సాహకాల పేరుతో కొత్త పేరు పెట్టి 2020లో పిఎల్‌ఐ స్కీమును ఐదేండ్ల ప్రణాళికతో ప్రకటించారు. దాని గడువు ముగిసినప్పటికీ లక్ష్యాలను సాధించకపోవటంతో పొడిగించాలని నిర్ణయించారు. చిత్రం ఏమిటంటే గాల్వన్‌ లోయ ఉదంతాల తరువాత దేశభద్రతకు ముప్పు అనే పేరుతో పరోక్షంగా చైనా పెట్టుబడులను నిషేధించిన మోడీ సర్కార్‌ ఈ స్కీము కింద ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల్లో చైనా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టి సబ్సిడీలు పొందవచ్చని నిర్ణయించింది. అయితే దానికి మనదేశంలో ఉన్న ఏదైనా కంపెనీతో సంయుక్త భాగస్వామ్యంలో 49శాతం వాటాకు పరిమితం కావాలని, యాజమాన్యం భారతీయ కంపెనీల చేతుల్లో ఉండాలని, సాంకేతిక పరిజ్ఞాన బదిలీలు జరగాలని షరతు పెట్టింది.(ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ 2025 ఏప్రిల్‌ 28). వేగంగా పని చేస్తానని చెప్పుకొనే మోడీ సర్కార్‌కు ఈ నిర్ణయం తీసుకొనేందుకు పదేండ్లు పట్టింది, చివరకు పెట్టుబడిదారుల వత్తిడి పని చేసినట్లు కనిపించి, ఏదైతే అదవుతుందని సందిగ్ధావస్ధ నుంచి బయటపడినట్లు ఉంది. చైనా, దాని కమ్యూనిస్టు పార్టీని వ్యతిరేకించే పచ్చివ్యతిరేకులు బిజెపిలో పుష్కలంగా ఉన్నారు. వారు అడుగడుగునా అడ్డుతగులుతున్నారు కనుకనే ఈ అలశ్యం. ఎందుకంటే చైనాను అనుమతిస్తే వారి సైద్దాంతిక దాడిని జనం ఏమాత్రం నమ్మరు. అన్నింటికీ మించి అమెరికా, ఐరోపా ధనికదేశాల మీద ఉన్న మోజు మామూలుగా లేదు. వేదాల్లో అన్నీ ఉన్నాయష అని చెప్పేవారు సంస్కృత గ్రంధాల్లో విమానాల తయారీతో సహా ఉందని చెబుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏమైనా వెలికితీశారా అంటే అదీ లేదు. పోనీ ఈ పదేండ్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులేమైనా కేటాయించిందా ? గత మూడు పారిశ్రామిక విప్లవాల బస్సులను ఎక్కలేకపోయామని నరేంద్రమోడీ చెప్పింది నిజమే, కానీ నాలుగో బస్సును ఎక్కటానికి చేసిందేమిటి అన్నది ప్రశ్న. జిడిపిలో అమెరికా 2.8, చైనా 2.1,దక్షిణ కొరియా 4.2, ఇజ్రాయెల్‌ 4.3శాతం ఖర్చు చేస్తుంటే మన ఖర్చు పదేండ్లలో 0.6 నుంచి 0.7శాతం మధ్య ఉందంటే మోడీ దేశాన్ని ఎంత వెనక్కు తీసుకుపోయారో అర్ధం అవుతోంది. ఎంతసేపూ ఆవు పేడలో, మూత్రంలో బంగారం ఉందా,ఏముంది అనే ఆత్రంతో పరిశోధనల మీద ఉన్న కేంద్రీకరణ మిగతా వాటి మీద లేదు. ఇందువల్లనే మనదంటూ చెప్పుకొనేందుకు హిందూత్వ తప్ప ఒక్క వస్తు బ్రాండైనా లేదు. చైనా నుంచి కంపెనీలు వస్తున్నాయదిగో చూడండి ఇదిగో చూడండి అంటూ ఇంట్లోకి గేటు బయటకు తిరిగి చూసినట్లు తప్ప స్వంత కంపెనీల ఏర్పాటు గురించి పట్టించుకోలేదు. ప్రైవేటు వారికి ఏం పడుతుంది, రిలయన్స్‌ , ఇతరులకు చమురు తవ్వకం ఇచ్చారు. పదేండ్ల నాటికీ ఇప్పటికీ స్వంత ఉత్పత్తి తగ్గింది తప్ప పెరగలేదు.

పదకొండేండ్ల మోడినోమిక్స్‌ తీరు తెన్నులు చూసినపుడు కొన్ని ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎండమావుల వెంట నీళ్ల కోసం పరుగెత్తినట్లుగా ఆధునిక టెక్నాలజీ కోసం మనదేశం అమెరికా వైపు చూస్తోంది. ఇంథనం, ఆయుధాల కోసం రష్యా మీద, చౌకగా వచ్చే వస్తువుల కోసం చైనా మీద ఆధారపడినట్లు కనిపిస్తోంది. ఇలా ఎంతకాలం అన్నది ప్రశ్న. చైనా వస్తువుల మీద ఆధారపడిన అమెరికా, ఇతర ఐరోపా దేశాలు నేర్చుకున్న గుణపాఠం మనవారు నేర్చుకోవటానికి సిద్దంగా లేరు. అందుకు నిదర్శనం పరిశోధన మరియు అభివృద్ధి కేటాయింపులను నిర్లక్ష్యం చేయటమే. మనదంటూ ఒక ప్రత్యేకత లేకపోతే సమగ్ర స్వయం సమృద్ధి అనేది పగటి కలే. ఏ దేశం కూడా మరొక దేశానికి తనకు లబ్దికలిగించే పరిజ్ఞానాన్ని మరొకదేశానికి పంచుకొనే స్థితి ప్రస్తుతం లేదు. అది పాతబడిన తరువాత మాత్రమే బదలాయిస్తున్నాయి. దేశాలతో వ్యవహరించే తీరును బట్టి వాణిజ్య లావాదేవీలు జరుగుతాయి. మనం ఇతరుల మీద ఆధారపడినంతకాలం అవి చెప్పినట్లు మనం వినాలి తప్ప మన మాట చెల్లదు. ఉదాహరణకు గాల్వన్‌ లోయ ఉదంతాలు జరిగినపుడు చైనా వస్తువుల దిగుమతులు నిలిపివేసి డ్రాగన్‌ దేశాన్ని మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని అనేక మంది వీధుల్లో వీరంగం వేశారు.చైనా ఎగుమతులు ఎన్ని, వాటిలో మనదేశ వాటా ఎంత అన్న కనీస సమాచారం తెలిసి ఉంటే ఆ గంతులు, ప్రకటనలు ఉండేవి కాదు. వారి మనోభావాలను మోడీ గట్టి దెబ్బతీశారు, దిగుమతులు పెంచారు. తాజాగా పాకిస్తాన్‌కు చైనా ఆయుధాలు అందించి సాయం చేస్తున్నదని ప్రచారం చేసినా చైనా వస్తువులు బహిష్కరించాలనే పిలుపులు రాలేదంటే తత్వం తలకెక్కిన బిజెపి ఈసారి ముందు జాగ్రత్త పడి తన మరుగుజ్జులను అదుపు చేయటమే, కాదంటారా !

చైనా సరుకు తుస్సు మంటే మన విమానాలు ఎలా కూలాయి ? ఇరకాటంలో మోడీ, కాషాయ దళాలు ఏమంటాయో మరి !

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


‘‘ ఆపరేషన్‌ సిందూర్‌లో భారత యుద్ధ విమానాల కూల్చివేతకు అంత ప్రాధాన్యత లేదు గానీ దానికంటే ఎలా కూలిపోయాయన్నది ముఖ్యం, తొలి రోజు వ్యూహాత్మక తప్పిదాలను 48గంటల్లోనే సరిచేసి పాక్‌ మీద దాడి చేశాం ’’ మన రక్షణ దళాల అధిపతి(సిడిఎస్‌) అనిల్‌ చౌహాన్‌ శనివారం నాడు సింగపూర్‌లో చెప్పిన మాటల సారాంశం. అయితే ఎన్నింటిని కూల్చారన్నది చెప్పటానికి నిరాకరించారు గానీ పాక్‌ ప్రధాని చెప్పినట్లుగా ఆరు అన్నది పచ్చి అవాస్తవం అన్నారు. పాక్‌తో ఘర్షణలో ‘‘ వైమానిక ఆస్తులను కొన్నింటిని కోల్పోయాం ’’ అని చెప్పారు, అంటే విమానాలు అని చెప్పనవసరం లేదు. పరిస్థితి అణుదాడుల వరకు వచ్చిందన్నది కూడా అవాస్తవం అన్నారు.మూడు రాఫేల్‌ విమానాలను పాక్‌ దళాలు కూల్చివేసినట్లు వచ్చిన తొలుత వచ్చిన వార్తలను మన అధికారులు ఖండిరచిన సంగతి తెలిసిందే. యుద్ధం అన్న తరువాత నష్టాలు ఉంటాయని, మన పైలట్లు అందరూ సురక్షితంగా తిరిగి వచ్చినట్లు కొద్ది రోజుల క్రితం మన త్రివిధ దళాల అధిపతులు విలేకర్ల సమావేశంలో చెప్పినపుడే సూచన ప్రాయంగా స్పష్టమైంది. ఇప్పుడు సిడిఎస్‌ మరింత స్పష్టంగా చెప్పారు. మరి ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ, ఒక్క విమానమూ కూలలేదని ఊరూవాడా ఊదరగొట్టిన కాషాయ మరుగుజ్జులు, వాటిని ప్రామాణికంగా తీసుకున్న మీడియా నిపుణులు ఏమంటారో తెలియదు. ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సెక్యూరిటీ స్టడీస్‌, సింగపూర్‌ సంస్థ షాంగ్రీ లా డైలాగ్‌(ఎస్‌ఎల్‌డి) పేరుతో ప్రతి ఏటా చర్చలు నిర్వహిస్తున్నది. 2001లో పురుడు పోసుకున్న ఈ సంస్థ 2002లో తొలి సారిగా అనధికార చర్చలు నిర్వహించింది. ఈ చర్చలను ఆసియా భద్రతా వ్యవహారాల సభగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో 22వ సభ మే నెల 30,31, జూన్‌ ఒకటిన జరిగింది. మన దేశం తరఫున 31వ తేదీన మన సిడిఎస్‌ అనిల్‌ చౌహాన్‌ అధికారయుతంగానే పాల్గొన్నారు.ఆ సభలో మాట్లాడటంతో పాటు వెలుపల రాయిటర్స్‌ వార్తా సంస్థ, అంతర్జాతీయ విలేకర్లతో కూడా ఆయన మాట్లాడారు. బ్లూమ్‌బెర్గ్‌ టీవీకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ సమావేశాలకు వివిధ దేశాల అధినేతలు, రక్షణ మంత్రులు,ఉన్నతాధికారులు రావటం జరుగుతున్నది. ప్రపంచమంతా తిరిగి పాకిస్తాన్‌ దుర్మార్గాలను ఎండగట్టాలని పార్లమెంటరీ ప్రతినిధి బృందాలను పంపి హడావుడి చేసిన ప్రభుత్వం కొద్ది ఖర్చుతో ఆసియా ఖండం, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రముఖులు పాల్గొనే ఈ సభలో ప్రభుత్వం ప్రధాని లేదా కనీసం రక్షణ మంత్రి లేదా విదేశాంగ మంత్రిని అయినా పంపలేదంటే వారికి ఎంత శ్రద్ద ఉందో వెల్లడి అవుతున్నది. పోనీ ఇంతకంటే దేశంలో ఉండి పొడుస్తున్నది ఏమైనా ఉందా ! సింగపూర్‌లో సిడిఎస్‌ చెప్పిన మాటలు అనేక అంశాలను ముందుకు తెచ్చాయి.మామ తిట్టినందుకు కాదు గానీ తోడల్లుడు తొంగిచూసి కిసుక్కున నవ్వినందుకు అన్నట్లు సిడిఎస్‌ మాటలపై చర్చ చేస్తే దేశద్రోహం అంటారేమో !

‘‘ మే ఏడవ తేదీన జరిగిందాన్ని గురించి నేను చెప్పగలిగిందేమిటంటే తొలి దశలో కొన్ని నష్టాలు ఉన్నాయి.సంఖ్య ముఖ్యం కాదు… ఆ నష్టాలు ఎందుకు జరిగాయి, ఆ తరువాత మనమేమి చేయాలనన్నది ముఖ్యమైన అంశం. మంచి విషయం ఏమంటే వ్యూహాత్మకంగా చేసిన తప్పిదాలను మేము అర్ధం చేసుకోగలిగాం, వాటికి పరిష్కారం ఉంది, వాటిని సరిదిద్దాం, రెండు రోజుల తరువాత దాన్ని అమలు జరిపాం, అన్ని రకాల మందుగుండుతో మన జెట్‌ విమానాలన్నీ మరోసారి దూరంగా ఉన్న లక్ష్యాలను చేధించేందుకు ఎగిరాయి. ఒక మీటరు అటూ ఇటూగా మూడు వందల కిలోమీటర్ల దూరంలోని పాకిస్తాన్‌ వైమానిక స్థావరాల మీద దాడి చేయగలిగాం, చైనా వారి ఆయుధాలు ఏమీ పని చేయలేదు. పాకిస్తాన్‌తో చైనా సన్నిహితంగా మెలిగినప్పటికీ వివాద సమయంలో చైనా నుంచి వాస్తవంగా సాయం అందిన సూచనలు లేవు. ఉత్తర సరిహద్దులో పరిస్థితులన్నీ సాధారణంగానే ఉన్నాయి. (వివాదం సందర్భంగా చైనా గూఢచార సమాచారం అందించిందా అన్న ప్రశ్నకు ) అలాంటి దానిని వాణిజ్యపరంగా చైనా నుంచి పొంది ఉండవచ్చు, చైనా లేదా అదేవిధంగా ఇతర వనరులనుంచి కూడా కావచ్చు ’’ అని సిడిఎస్‌ చెప్పారు. మొత్తం మీద సారాంశం ఇది.
ఇక చైనా ఆయుధాలు తుస్సుమన్నాయి, దేనికీ పనికిరానివని తేలిపోయింది, దీంతో మిలిటరీ అధికారులను చైనా జైల్లో పెట్టారని రాశారు. పాకిస్తాన్‌ వారే కొనుగోలు చేసేందుకు విముఖత చూపుతున్నారంటూ విశ్లేషణలు చేసిన వారు, వాటికి ప్రాధాన్యత ఇచ్చిన మీడియా యుద్ధ వీరులు ఇప్పుడు ఎలాంటి కతలు చెబుతారో తెలియదు. మన దగ్గర రష్యా ఇచ్చిన సుదర్శన చక్రం ఎస్‌`400 ఉంది, చైనా దగ్గర ఉన్నవి పని చేయటంలేదు, పనిలో పనిగా దాని ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవటానికి ఇదే తరుణం అని సలహాలు ఇచ్చిన వారు కూడా లేకపోలేదు. అసలు విమానాలు కూలలేదు, తప్పుడు సమాచారం వ్యాపింప చేస్తున్నారంటూ దాడులకు దిగిన సామాజిక మాధ్యమ మరుగుజ్జులు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు, కొన్ని నష్టాలు జరిగినా అంతిమంగా పాకిస్తాన్ను దెబ్బతీశామా లేదా అన్నది చూడాలంటున్నారు. ఈ వితండవాదానికి తిరుగులేదు.

విమానాలు కూలింది మన గడ్డమీదా లేక పాక్‌ భూమిలోనా అన్నది మరింత ఆసక్తికరంగా మారింది. మన పైలట్లు సురక్షితంగా వచ్చారని మన అధికారులు చెప్పటాన్ని బట్టి కూలింది మన దేశంలోనే అని చెప్పవచ్చు.2019లో బాలాకోట్‌ మెరుపుదాడుల సమయంలో పాక్‌ మిలిటరీ మన మిగ్‌ విమానాన్ని వారి భూభాగంలో కూల్చివేసి పైలట్‌ అభినందన్‌ వర్దమాన్ను బందీగా పట్టుకున్న సంగతి తెలిసిందే. మన భూభాగంలోనే మన విమానాల కూల్చివేత జరిగిందంటే అవి ఎగరగానే గతంలో చైనా నుంచి కొనుగోలు చేసిన పాక్‌ రాడార్లు పసిగట్టి కూల్చివేసినట్లు కనిపిస్తోంది. చైనా క్షిపణులు లేవలేదు, లేచినవి మన భూభాగంలో పేలకుండా పడ్డాయి అన్న వార్తలు తెలిసిందే. చైనా ఆయుధాలు పని చేయలేదని సిడిఎస్‌ కూడా చెప్పారు. అదే నిజమైతే అంటే పాకిస్తాన్‌ దగ్గర చైనా లేదా అమెరికా ఆయుధాలు తప్ప వేరే దేశానివి లేవు. అమెరికా వాటితోనే కూల్చివేసి ఉండాలి. వాటిని ఉపయోగించటానికి కొన్ని షరతులు పెట్టామని గతంలో అమెరికా ప్రకటించింది, ఈ సందర్భంగా ట్రంప్‌ వాటిని సడలించి ఉండకపోతే పాక్‌ మిలిటరీ ప్రయోగించి ఉండేది కాదు. ఆ విషయాన్ని చెప్పటం దేశద్రోహం కాదు, జరిగే నష్టమూ లేదు. రష్యా సుదర్శన చక్రంతో దెబ్బతీసినట్లు చెప్పుకున్న మనం అమెరికా ఆయుధాలతో దెబ్బతిన్నామని అంగీకరిస్తే కలిగే నష్టం ఏముంది ? ట్రంప్‌ అంటే భయమా ?


అసలేం జరిగిందో చెప్పాలన్న ప్రతిపక్షాల మీద సైన్యాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారా అంటూ ఎదురుదాడి చేసిన బిజెపి, కాషాయ దళాలు, సామాజిమాధ్య మరుగుజ్జులు ఇప్పుడెలా ఎగిరిపడతారో చూడాలి. పార్లమెంటు సమావేశం జరపాలన్న డిమాండ్‌ను బిజెపి తిరస్కరిస్తే చాలా మందికి అంతుబట్టలేదు గానీ అనిల్‌ చౌహాన్‌ ప్రకటనతో అసలు సంగతి అర్ధమైంది. నాలుగు రోజుల్లోనే ఆకస్మికంగా దాడులు ఆపివేసి కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవటం వెనుక కూడా విమానాలు కూలిపోయిన ప్రభావం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.మన తప్పిదాలను గుర్తించి సరి చేసుకున్నట్లే పాకిస్తాన్‌ కూడా తన తప్పిదాలను సవరించుకొని ఎదురుదాడులకు సిద్దమైందా ? ఇప్పటికైనా పార్లమెంటును సమావేశపరచి సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం లేదా !

యుద్ధం అన్న తరువాత రెండువైపులా నష్టాలు ఉంటాయనేందుకు రెండవ ప్రపంచ పోరు చక్కటి ఉదాహరణ అన్నది అందరికీ తెలిసిందే. పాక్‌తో జరిగిన యుద్ధాలు, చిన్న చిన్న జగడాలు అయినా అంతే దానికి మన దళాలను తప్పుపట్టాల్సింది గానీ నిరుత్సాహపరచాల్సిందిగానీ ఏమీ లేదు. పాక్‌ ఉగ్రవాదుల మీద కంటే మన జనం మీదనే బిజెపి దళాలు పెద్ద ప్రచారదాడి చేసినట్లు కనిపిస్తోంది. కొందరు నేతలు ఎలా నోరు పారవేసుకున్నదీ ఒక మధ్య ప్రదేశ్‌ మంత్రి మీద విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతీ తెలిసిందే. విదేశీ సంస్థలు ఇచ్చిన విమానాల కూల్చివేత వార్తలను చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఇచ్చింది. మాతో నిర్ధారించుకోకుండా నిరాధార వార్తలను రాస్తారా అంటూ మన విదేశాంగశాఖ నిరసన తెలిపింది. మరి ఇప్పుడు ఏమంటారు ? గతంలో ఇతర దేశాల మీడియా ఇచ్చిన సమాచారాన్ని గ్లోబల్‌ టైమ్స్‌ వార్తగా ఇచ్చినట్లే సిడిఎస్‌ చెప్పిన బ్లూమ్‌బెర్గ్‌ వార్తను ఉటంకిస్తూ అదే పత్రిక రాసింది.పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా మన సైన్యం ప్రాణాలకు తెగించి దెబ్బకు దెబ్బ తీస్తే అదేదో మోడీ స్వయంగా చేసినట్లు చిత్రించారు.తన వ్యక్తిగత ప్రతిష్టను, దానికి లోబడి బిజెపిని జనంలో ప్రచారం చేసేందుకు నరేంద్రమోడీ పడిన తాపత్రయం, చేసిన ఖర్చు, మీడియాను గోడియాగా మార్చిన తీరు, సామాజిక మాధ్యమ సంస్థలకు ఇచ్చిన పాకేజీల గురించి తెలిసిందే.


జరిగిందాన్ని గురించి కాంగ్రెస్‌ అనేక ప్రశ్నలను సంధించింది.మిలిటరీ చర్యలను సమర్ధించింది. తెలంగాణా మంత్రి కెప్టెన్‌ ఉత్తమకుమార్‌ రెడ్డి, జయరామ్‌ రమేష్‌ విలేకర్లతో మాట్లాడారు. జరిగిందాని మీద ఒక సమీక్షా కమిటీని వేయాలని కోరారు. కార్గిల్‌ యుద్ధం జరిగినపుడు ప్రస్తుత విదేశాంగ మంత్రి జై శంకర్‌ తండ్రి, రక్షణ వ్యవహారాల నిపుణుడు కె సుబ్రమణ్యం అధ్యక్షతన 1999లో వాజ్‌పాయి ఒక సమీక్షా కమిటీని ఏర్పాటు చేసినట్లు జయరామ్‌ రమేష్‌ గుర్తు చేశారు.ఐదు నెలల తరువాత ఆ కమిటీ సమర్పించిన నివేదికను పార్లమెంటు ఉభయ సభలలో ప్రవేశపెట్టారని ఇప్పుడు కూడా సిడిఎస్‌ చెప్పిన అంశాలను సమీక్షించాలని కోరారు.


సింగపూర్‌ సమావేశానికి సిడిఎస్‌ అనిల్‌ చౌహాన్ను పంపి చాణక్యుడు అనుకుంటున్న నరేంద్రమోడీ పప్పులో కాలువేశారా ? సిడిఎస్‌ను సింగపూర్‌కు అనవసరంగా పంపారని అక్కడ ఆయన ఒక ప్రచార విజయాన్ని పాకిస్తాన్‌కు అందచేశారని రక్షణ రంగ వ్యూహకర్త బ్రహ్మ చెలానే విమర్శించారు.పాకిస్తాన్‌కు మనం కలిగించిన నష్ట వివరాలతో పాటు మన విమానాలను కోల్పోయినట్లు మన గడ్డ మీద మాత్రమే చెప్పాలని అన్నారు. సింగపూర్‌ సభకు పాక్‌ మిలిటరీ అధికారి కూడా వచ్చారని ఆ సందర్భంగా మన నష్టాల గురించి చెప్పటం పాకిస్తాన్‌తో అనుసంధానం చేయటమే అన్నారు.భారత నిర్ణయాత్మక విజయాన్ని వివరించేందుకు నరేంద్రమోడీ రోడ్‌ షోలు చేస్తున్నారు. అయినప్పటికీ వాణిజ్య ఆంక్షలు విధిస్తాననే బెదిరింపుతో మిలిటరీ శత్రుత్వాన్ని తానే ఆపినట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ పదే పదే చెబుతున్నాడు.మోడీ ప్రయత్నాలను బలహీనపరుస్తున్నాడు. సింగపూర్‌లో మీడియాతో మాట్లాడి సిడిఎస్‌ పరిస్థితిని మరింత సంక్లిష్టం కావించారని చెలానే వ్యాఖ్యానించారు. ఆపరేషన్‌ సింధూర్‌ లక్ష్యాలు ఏమిటో చెప్పకుండా కొన్ని విమానాలు నష్టపోవటం గురించి చెప్పటం ఏమిటని మరో విశ్లేషకుడు సుషాంత్‌ శరీన్‌ అన్నారు.కొన్ని విమానాలు నష్టపోవటం కొలమానం కాదన్నారు. మొత్తం మీద చూసినపుడు మిలిటరీ చర్యలను అధికారంలో ఉన్న పార్టీ తన ప్రతిష్టను పెంచుకొనేందుకు చూస్తే ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోవని ఇప్పటికే వెల్లడైంది. మణిపూర్‌ పర్యటించి అక్కడి పౌర సమాజంలో తలెత్తిన అపోహలను పొగొట్టేందుకు రెండు సంవత్సరాలుగా దాని మొహం చూడని ప్రధాని నరేంద్రమోడీ పాక్‌తో ఘర్షణపై పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు తిరస్కరించి అప్రజాస్వామికంగా వ్యవహరించారనే విమర్శను మూటగట్టుకున్నారు. నష్ట నివారణకు ఇప్పటికీ సమయం మించి పోలేదు. విదేశాల్లో పర్యటించి వచ్చిన పార్లమెంటరీ బృందాల అనుభవాల పేరుతో పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే పరువు దక్కుతుంది.

కాశ్మీరుపై నమ్మలేని నిజం, వాస్తవాలు : పాకిస్తాన్‌కు అప్పగించటానికి అంగీకరించిన వల్లభాయ్‌ పటేల్‌ !

Tags

, , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు


ఆక్రమిత కాశ్మీరు(పిఓకె)ను పూర్తిగా స్వాధీనం చేసుకొనే వరకు యుద్ధాన్ని ఆపకూడదని నాటి హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చెప్పిన అభిప్రాయాన్ని నాటి ప్రధాని నెహ్రూ అంగీకరించలేదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఆమోదించి ఉంటే పహల్గామ్‌ దారుణం జరిగి ఉండేది కాదని మే 27వ తేదీన గుజరాత్‌ పర్యటనలో చెప్పిన మాటలకు మీడియా పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించింది. కాశ్మీరును ఆక్రమించుకొనేందుకు నాటి ముజాహిదిన్‌ దాడుల కొనసాగింపే పహల్గామ్‌ ఉదంతం అని మోడీ వర్ణించారు. నెహ్రూ నాడు యుద్ధాన్ని మధ్యలోనే ఆపివేసి చారిత్రక తప్పిదం చేశారని సంఘపరివార్‌ సంస్థలలో ఒకటైన బిజెపి పదే పదే చెబుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిపిన ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగించి ఆక్రమిత కాశ్మీరును విముక్తి చేయకుండా నరేంద్రమోడీ సర్కార్‌ వచ్చిన మంచి అవకాశాన్ని విడిచిపెట్టిందని జనం భావిస్తున్నారు. కనీసం ఉగ్రవాదుల మీద పాకిస్తాన్‌ నుంచి ఎలాంటి హామీ పొందకుండా సిందూర్‌ను నిలిపివేసిందని తీవ్ర అసంతృప్తి, విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో మోడీ జనం దృష్టిని మళ్లించేందుకు వల్లభాయ్‌ పటేల్‌ మాటున రక్షణ పొందినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గుడ్డిగా నమ్మేవారుంటే అది తాత్కాలికమే, వారు ఒకసారి కళ్లు తెరిస్తే నాన్నా పులి కథే. చివరికి నిజం చెప్పినా నమ్మరు.


కాశ్మీరు సమస్యను ఇరుదేశాలు పరిష్కరించుకోవాలన్నది సిమ్లా ఒప్పంద స్ఫూర్తి.దాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్‌ పాలకులు చిత్తశుద్దితో పనిచేసి పరిష్కరించలేదన్నది ఒక విమర్శ. వాస్తవమే, మరి బిజెపి చేసిందేమిటి ? జనతా పార్టీలో అది భాగస్వామి, వాజ్‌పాయి విదేశాంగ మంత్రిగా పని చేశారు. తరువాత ప్రధాని అయ్యారు. పదకొండు సంవత్సరాలుగా నరేంద్రమోడీ ఏలుబడి సాగుతున్నది. బిజెపి, దాని పూర్వ రూపమైన జనసంఫ్‌ు కాశ్మీరు సమస్యను ఓట్ల కోసం వాడుకోవటం తప్ప ఆక్రమిత కాశ్మీరును సాధించేందుకు మనదేశం వైపు నుంచి చేసిన ఒక్క ప్రయత్నాన్ని చూపమనండి. ఎందుకంటే ఆ సమస్య అలానే రావణకాష్టంలా కాలుతూ ఉండాలి. నెహ్రూ, కాంగ్రెస్‌ల మీద విమర్శలు చేస్తూ ఓట్లు దండుకొనేందుకు వినియోగించుకోవాలన్నది తప్ప బిజెపి చిత్తశుద్ది ఏమిటి ? 1994లోనే పార్లమెంటు ఆక్రమిత కాశ్మీరు మనదే అనే తీర్మానాన్ని కూడా ఆమోదించింది. మాకు అధికారమిస్తే పిఒకెను చిటికెలో వెనక్కు తీసుకువస్తాం అని తుపాకి రాముడు కబుర్లు చెప్పటం తప్ప పదకొండు సంవత్సరాల్లో ఒక్క అడుగువేసింది లేదు. ఆపరేషన్‌ సిందూర్‌తో వచ్చిన మంచి అవకాశాన్ని ట్రంప్‌ బెదిరిస్తే వెనక్కు తగ్గినట్లుగా జనం అనుకుంటున్నందున ముఖం మీద చెప్పకపోవచ్చుగానీ బిజెపి కబుర్లను ఇంకేమాత్రం నమ్మేస్థితి లేదు. దుకాణదారులు గోడమీద అప్పు రేపు అని రాసినట్లుగా రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ మరోమారు గురువారం నాడు అదే చెప్పారు. పిఓకెను మనకు పాక్‌ అప్పగించకపోతే ఏం చేస్తారో ఎప్పుడు చేస్తారో చెప్పాలన్న ప్రశ్నలకు సూటిగా చెప్పకుండా తెస్తాం అంటే మరో 75 ఏండ్లు ఆగాలని అర్ధమా !


పాకిస్తాన్‌లో భాగమైన తూర్పు బెంగాల్‌( నేటి బంగ్లాదేశ్‌)లో తలెత్తిన 1971 తిరుగుబాటును నాడు మనదేశం చక్కగా వినియోగించుకొని పాకిస్తాన్లోని ఒక ముక్కను విడగొట్టి ఒక తలనొప్పిని వదిలించుకుంది. నాడు పాకిస్తాన్‌కు మద్దతుగా అమెరికా మనలను బెదిరించేందుకు బంగాళాఖాతంలోకి తన సప్తమ నౌకాదళాన్ని దింపింది. అయినా ఖాతరు చేయకుండా ముందుకు పోవటమే కాదు, సోవియట్‌తో రక్షణ సంధి చేసుకున్నాం. మనకు మద్దతుగా తాను రంగంలోకి దిగాల్సి ఉంటుందనే సందేశం వెలువడటంతో అమెరికా వెనక్కు తగ్గింది. ఇప్పుడు పహల్గాం రూపంలో వచ్చిన అవకాశాన్ని నరేంద్రమోడీ ఎందుకు వినియోగించకోలేదు ? అన్నింటి కంటే ట్రంప్‌ జోక్యం లేదా బెదిరింపులతో వెనక్కు తగ్గి ఏమీ సాధించకుండానే పాకిస్తాన్‌తో రాజకీ కుదుర్చుకున్నట్లు జనం భావిస్తున్నారు. లేదూ పాక్‌ కోరికతో మనమే రాజీపడ్డామని చెబుతున్నారు, దాని ప్రకారమే అయినా ఏం సాధించారని సంధికి అంగీకరించారు. ఇప్పుడు కూడా రష్యాతో రక్షణ ఒప్పందం ఉంది అయినా 56 అంగుళాల ఛాతీ ధైర్యం చేయలేకపోయింది.


నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్లే కాశ్మీరుపై పటేల్‌ వైఖరిలో రెండూ ఉన్నాయి. పత్రికలు చదివేవారూ, టీవీలు చూసే ప్రతి ఒక్కరు చరిత్రలో ఏం జరిగిందనే శోధన చేయరనే గట్టి విశ్వాసంతో తమకు కావాల్సిందాన్నే కొందరు చెబుతారు.2018 ఫిబ్రవరి ఏడవ తేదీన ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో మాట్లాడుతూ ‘‘ సర్దార్‌ పటేల్‌ గనుక భారత తొలి ప్రధాని అయి ఉంటే మొత్తం కాశ్మీరు మనదే అయి ఉండేది ’’ అని చెప్పారు.కానీ అదే పటేల్‌కు అసలు కాశ్మీరు గురించి ఆసక్తి ఉందా ? ఉంటే నాటి రక్షణ మంత్రి బలదేవ్‌ సింగ్‌కు అలా లేఖ రాసేవారా ? కల్నల్‌ కటోచ్‌ను కాశ్మీరులో నియమించాలని, ఒకవేళ కాశ్మీరు గనుక వేరేదేశం(పాకిస్తాన్‌)లోకి వెళ్లిపోతే అతన్ని తిరిగి మనదేశానికి తీసుకురావాలని నరేంద్రమోడీ పుట్టక ముందే 1947 సెప్టెంబరు 13న లేఖ రాశారు. అది ఇంటర్నెట్‌లో అందరికీ అందుబాటులో ఉంది.


1947 ఆగస్టుఅక్టోబరు మధ్య తొలిసారిగా భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధం జరిగింది. అనేక మంది చరిత్రకారులు, విశ్లేషకులు రాసినదాన్ని బట్టి కాశ్మీరును రాబట్టుకోవాలా లేదా అనే అంశంలో నెహ్రూ, పటేల్‌ మధ్య గందరగోళం ఉంది. కనుకనే సెప్టెంబరులో పటేల్‌ అలా లేఖరాశారన్నది స్పష్టం. పటేల్‌ వైఖరి గురించి నరేంద్రమోడీ నోరు విప్పక ముందే అనేక మంది తమ రచనల్లో చర్చించారు. అవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎవరికి వారు స్వంత అభిప్రాయాలకు రావచ్చు. 1984లో రాజేంద్ర శరీన్‌ ‘‘పాకిస్తాన్‌ ద ఇండియా ఫాక్టర్‌ ’’ అనేపేరుతో రాసిన పుస్తకంలో అనేక అంశాలను చర్చించారు. అబ్దుల్‌ రాబ్‌ నిష్తార్‌ అనే పాకిస్తాన్‌ మంత్రితో పటేల్‌ సంభాషిస్తూ ‘‘ భాయ్‌ హైదరాబాద్‌, జునాఘడ్‌ల గురించి మాటలొద్దు, కాశ్మీరు గురించి చెప్పండి, కాశ్మీరును తీసుకోండి సమస్యను పరిష్కరించండి ’’ అని చెప్పినట్లుగా పేర్కొన్నారు. మౌంట్‌బాటన్‌ పాక్‌ ప్రధాని లియాకత్‌ అలీతో భేటీ అయినపుడు పాక్‌ రాజ్యాంగపరిషత్‌ సభ్యుడు సర్దార్‌ షౌకత్‌ హయత్‌ కూడా ఉన్నాడు. పాకిస్తాన్‌ గనుక హైదరాబాద్‌ను వదులు కుంటే దానికి బదులుగా కాశ్మీరును భారత్‌ ఇస్తుందని మౌంట్‌బాటన్‌ పటేల్‌ సందేశంగా లియాకత్‌ అలీకి చెప్పాడు. దాని మీద సంభాషణల్లో ‘‘ సర్దార్‌ సాహెబ్‌ మీకేమైనా మతిపోయిందా పంజాబ్‌ కంటే పెద్దదైన ప్రాంతాన్ని మనం ఎందుకు వదులుకోవాలి, దానికి బదులుగా కొన్ని పర్వతాలున్న దాన్ని ఎందుకు తీసుకోవాలి ’’ అన్నాడు. అంతే కాదు రాజేంద్ర శరీన్‌ పుస్తకంలో ఇంకా ఏమి ఉటంకించిదీ చూద్దాం.1947 జూన్‌లో కాశ్మీరు రాజు హరిసింగ్‌తో మౌంట్‌బాటన్‌ భేటీ అయ్యాడు. ఆ సందర్భంగా మౌంట్‌బాటన్‌ మాట్లాడుతూ ‘‘ మీరు పాకిస్తాన్‌తో కలవదలచుకుంటే భారత్‌ దాన్ని ఒక తప్పుగా భావించదు, ఆ మేరకు సర్దార్‌ పటేల్‌ స్వయంగా గట్టి హామీ ఇచ్చారు ’’ అని చెప్పినట్లు నాడు పటేల్‌ రాజకీయ కార్యదర్శిగా ఉన్న వి శంకర్‌ ( సర్దార్‌ పటేల్‌తో నా జ్ఞాపకాలు 1974 ) అనేపుస్తకంలో రాశారు.‘‘ కాశ్మీరు పాలకుడు ఒకవేళ తాను, తన రాజ్యానికి పాకిస్తాన్‌తో కలవాలనే ఆసక్తి ఉంటే ఆ దారికి నేను అడ్డుపడను ’’ అని పటేల్‌ అన్నట్లుగా కూడా శంకర్‌ రాశారు.


కాశ్మీరు గనుక పాకిస్తాన్‌ వైపు వెళ్లాలని ఎంచుకుంటే దాని నిర్ణయాన్ని నేను నిరాక్షేపణీయంగా అంగీకరిస్తానని పేర్కొన్నారు. నిజంగా పటేల్‌ ప్రధాని అయివుంటే అన్నంత పనీ చేసి ఉండేవారు కాదా ! ఈ విషయాన్ని అదే పటేల్‌ ఉపప్రధానిగా ఉన్నపుడు ప్రభుత్వ కార్యదర్శిగా పని చేసిన విపి మీనన్‌ నిర్ధారించారని 1990లో ప్రచురితమైన ‘‘ పటేల్‌ ఏ లైఫ్‌( పటేల్‌ జీవితం ) అనే గ్రంధంలో మహాత్మాగాంధీ మనవడు, చరిత్రకారుడు రాజ్‌మోహన్‌ గాంధీ రాశారు. అదే విషయాన్ని మౌంట్‌బాటన్‌ అప్పుడే మహమ్మదాలీ జిన్నాకు కూడా చేరవేశారు. అంతే కాదు కాశ్మీరు స్వతంత్ర దేశంగా ఉన్నప్పటికీ దాన్ని వ్యతిరేకించబోమని చెప్పినట్లు కూడా మౌంట్‌బాటన్‌ చెప్పాడు. కాశ్మీరును తీసుకొని దాని బదులు జునాఘడ్‌, హైదరాబాద్‌ సంస్థానాలను మనం తీసుకోవాలన్నది పటేల్‌ వైఖరి. అయితే మూడు సంస్థానాలూ తమకే కావాలనే దురాశతో జిన్నా దానికి ఒప్పుకోలేదు. ఒకవేళ అంగీకరించి ఉంటే……
స్వాతంత్య్రం వచ్చిన సమయంలో సంస్థానాలు ఏ దేశంలో విలీనం కావాలో నిర్ణయించుకొనే స్వేచ్చను ఇచ్చారు. అది తప్పా ఒప్పా అంటే దానికి పటేల్‌ కూడా నాడు అంగీకరించారు. గట్టిగా పటేల్‌ అడ్డుపడి ఉంటే అసలు సమస్యే ఉండేది కాదు, కాశ్మీరు ఆక్రమణకు గురయ్యేదే కాదు. హైదరాబాద్‌ సంస్థానం, కాశ్మీరు స్వతంత్ర దేశాలుగా ఉంటామని ప్రకటించుకోగా జునాఘడ్‌(ప్రస్తుత గుజరాత్‌ రాష్ట్రంలో ఉంది) పాకిస్తాన్‌తో చేరాలని నిర్ణయించుకుంది.కాశ్మీరులో అత్యధికులు ముస్లింలు కాగా పాలకుడు హిందూ రాజు, జునాఘడ్‌, హైదరాబాదులో అత్యధికులు హిందువులు కాగా పాలకులు ముస్లింలు. పటేల్‌కు ఆ నాటికే ముస్లింలంటే పడదో లేక దేశవిభజనకు కారకులయ్యారనే కోపమో ఏమో హైదరాబాద్‌, జునాఘడ్‌లను వదులుకొనేది లేదు, కావాలంటే కాశ్మీరును పాకిస్తాన్‌ తీసుకుంటే వ్యతిరేకించం అని చెప్పినట్లు కనిపిస్తోంది. తరువాత పటేల్‌ వైఖరిలో మార్పు వచ్చిందంటే దానికి కారణం కాశ్మీరు గురించి నెహ్రూ ఇతర నేతలు గట్టిగా నిలవటం, పాకిస్తాన్‌ దురాక్రమణకు పూనుకోవటమే. కాశ్మీరు హిందూ రాజు స్వతంత్ర దేశమంటూ నాటి బ్రిటన్‌, అమెరికా పన్నిన కుట్రలో భాగంగా హడావుడి చేస్తే అక్కడి జనం ముస్లింలు మాత్రం నేషనల్‌ కాన్ఫరెన్సు నాయయకుడు షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో భారత్‌లో విలీనాన్ని కోరుకున్నారు. ఆ కారణంగానే మూడొంతుల కాశ్మీరు మనలో విలీనమైంది. దక్షిణాసియాలో అమెరికా, బ్రిటన్‌ చెప్పుచేతల్లో ఉండే పాకిస్తాన్‌, దానికి మరో స్వతంత్ర దేశంగా కాశ్మీరుకూడా తోడు కావటాన్ని నాటి సోవియట్‌,చైనా తదితర సమీప దేశాలేవీ అంగీకరించలేదు. అదే జరిగి ఉంటే ఎలాంటి ముప్పు వచ్చి ఉండేదో సిక్కిం అనుభవం తరువాత తెలిపింది.

చైనాభారత సరిహద్దులో సిక్కిం మనదేశంలో విలీనం కాలేదు. రాచరిక దేశంగా ఉంది. అక్కడ పాగా వేసేందుకు రాజుకు అమ్మాయిలను ఎరవేసి తనవైపు తిప్పుకోవాలని అమెరికా చేసిన యత్నాన్ని నాటి ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వంలోని యంత్రాంగం వమ్ముచేసింది. భారత్‌లో విలీనానికి అవసరమైన కథనడిపి విజయవంతమైంది.ప్రజాభిప్రాయం మేరకు 1975లో మన దేశంలో విలీనమైంది. లేకుంటే హిమాలయాల్లో అమెరికా తొత్తు దేశంగా ఇజ్రాయెల్‌ మాదిరి మనకూ, చైనాకూ సమస్యలను తెచ్చిపెట్టి ఉండేది. కాశ్మీరు సమస్యను ఐరాసకు తీసుకువెళ్లి జవహర్‌లాల్‌ నెహ్రూ పెద్ద తప్పుచేశారన్నది బిజెపి ఆరోపణ. తప్పో ఒప్పో జరిగిపోయింది. అలా తీసుకువెళ్లినందుకు నిరసనగా వల్లభాయ్‌ పటేల్‌ ఎందుకు రాజీనామా చేయలేదు ? అంటే ఆ నిర్ణయానికి ఆయన కూడా అంగీకరించినట్లే, కనుక నెహ్రూనే బాధ్యుడిని చేయటం వక్రీకరణ.భద్రతా మండలి ఒక తీర్మానం చేయాలని 1948 జనవరి ఒకటిన భారత్‌ కోరింది. దాని మీద అదే ఏడాది ఏప్రిల్‌ 21న 47వ నంబరు తీర్మానాన్ని ఆమోదించారు. దాని ప్రకారం ఉభయ దేశాలూ కాల్పుల విరమణ పాటించాలి. ఇతర ప్రాంతాల నుంచి పోరాటానికి వచ్చిన గిరిజనులు, పాక్‌ పౌరులు, ఇతరులు కాశ్మీరు నుంచి వెళ్లిపోవాలి.భారత ప్రభుత్వం తన ఆధీనంలోని ప్రాంతాలలో మిలిటరీని కనీస స్థాయికి తగ్గించాలి. తద్వారా పాకిస్తాన్‌, భారత్‌ ఏ దేశంలో చేరేదీ నిర్ణయించేందుకు ప్రజాభిప్రాయ సేకరణకు వీలు కల్పించాలి.అది 1949 జనవరి ఒకటి వరకు జరగలేదు. ఈలోగా ఐరాస కమిషన్‌ మూడుసార్లు కాశ్మీరు సందర్శించింది. పరిస్థితి మీద ప్రభావితం చూపే విధంగా కాశ్మీరులో పాకిస్తాన్‌ మార్పులకు పాల్పడిరది. అందువలన ముందుగా పాక్‌ తన మిలిటరీ, పౌరులను అక్కడి నుంచి ఉపసంహరించాలి.తరువాత భారత్‌ వెనక్కు తీసుకోవాలి. ఆ తరువాత ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని 1948 ఆగస్టులో కమిషన్‌ భద్రతా మండలికి నివేదించింది. దీన్ని మనదేశం అంగీకరించగా పాక్‌ తిరస్కరించింది. చట్టబద్దంగా కాశ్మీరు మనదేశంలో విలీనమైంది, అంటే పాక్‌ మిలిటరీ, అది మద్దతు ఇచ్చిన వారు కాశ్మీరులో ఉండటం అంటే శత్రుపూరిత చర్య, దురాక్రమణకు పాల్పడటమే, ప్రజాభిప్రాయ సేకరణ అంటే విలీనాన్ని నిర్ధారించేందుకు తప్ప అంతకు ముందే అన్ని లాంఛనాలు పూర్తయినట్లు మనదేశం వాదించింది. అయితే ఇతర దేశాలతో ఒప్పందం చేసుకొనే ముందు తొలుత తమతో కాశ్మీరు ప్రభుత్వం యథాతధస్థితి (కాశ్మీరు అంతకు ముందు మాదిరే ఉండేట్లు ) ఒప్పందం చేసుకుందని, కాశ్మీరు పౌరులు తిరుగుబాటు చేశారని, మహరాజు పారిపోయినందున అతగాడికి ఒప్పందం చేసుకొనే హక్కులేదని పాకిస్తాన్‌ వాదించింది. విముక్త కాశ్మీరు ఆందోళనలు, గిరిజనుల తిరుగుబాట్లు వాటికవే పుట్టినవి తప్ప వాటికి తమ మద్దతు గురించి విమర్శకు తావేలేదన్నది. ముందు పాకిస్తాన్‌ తన దళాలను ఉపసంహరించుకోవాలని భారత్‌ అంటే మేము తప్పుకున్న తరువాత భారత్‌ వైదొలుగుతుందన్న గ్యారంటీ ఏమిటి అంటూ పాకిస్తాన్‌ అడ్డం తిరిగింది. అంతే, తరువాత జరిగిందేమీ లేదు.బంగ్లా విముక్తి తరువాత 1972లో ఇరుదేశాలు పరస్పరం చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని సిమ్లా ఒప్పందంలో నిర్ణయించటంతో ఐరాస పాత్రకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పటి వరకు వాజ్‌పాయి, నరేంద్రమోడీ ఎవరు ఏలుబడిలో ఉన్నప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ చేసిందేమీ లేదు.

హైదరాబాద్‌ సంస్థాన విలీనం గురించి ఎందుకు పటేల్‌ అంతగట్టిగా పట్టుబట్టారనటం ఆసక్తి కలిగించే అంశం. దేశం మధ్యలో మరొక దేశం లేదా పాకిస్తాన్‌ ప్రాంతం ఉండటం అంటే కడుపులో కాన్సరే అని పటేల్‌ వర్ణించాడు. అది వాస్తవమే. మరొక కారణాన్ని కూడా కొట్టి పారవేయటానికి లేదు. నైజాం నవాబు మీద స్వాతంత్య్రానికి ముందు నుంచే కమ్యూనిస్టులు పాలనకు వ్యతిరేకంగా సాయుధపోరాటం చేస్తున్నారు. చైనాలో దీర్ఘకాలం సాగిన కమ్యూనిస్టుల లాంగ్‌ మార్చ్‌ మాదిరి భారత్‌లో కూడా నైజాం సంస్థానం మారితే ప్రమాదకరమని నెహ్రూ ప్రభుత్వాన్ని సిఐఏ హెచ్చరించిందని చెబుతారు. ఆపరేషన్‌ పోలో నాలుగు రోజుల్లోనే ముగిసింది కానీ తరువాత నెహ్రూపటేల్‌ సైన్యాలు కమ్యూనిస్టుల మీద మూడు సంవత్సరాల పాటు అణచివేతకు పాల్పడ్డాయి. నైజాం నవాబు, వాడితో చేతులు కలిపిన జాగీర్దార్లు, దేశముఖల కంటే మిలిటరీ ఎక్కువ మంది కమ్యూనిస్టులను చంపింది, ఒక్క తెలంగాణాలోనే కాదు, దానికి మద్దతు ఇచ్చిన ఆంధ్రప్రాంతంలో కూడా వందలాది మందిని పొట్టన పెట్టుకుంది. పాకిస్తాన్‌ వైపు నుంచి కాశ్మీరు ఆక్రమణకు పూనుకోవటం, భారత్‌లో విలీనానికి రాజు హరిసింగ్‌ అంగీకరించటం, కేంద్ర ప్రభుత్వం సైన్యాలను పంపిన తరువాత పటేల్‌ వైఖరిలో మార్పు రావటం అనివార్యం. ఉక్కు మనిషి, పట్టిన పట్టు వదలడు కదలడు అని పటేల్‌ గురించి చెబుతారు. కానీ నరేంద్రమోడీ చెప్పినట్లుగా ఆక్రమిత కాశ్మీరును విముక్తి చేసేంత వరకు యుద్ధం కొనసాగించి ఉండాల్సిందనే వైఖరి మీద గట్టిగా పట్టుబట్టినట్లుగానీ, దానికి తిరస్కరించిన నెహ్రూతో విబేధించి మంత్రివర్గం నుంచి బయటకు రావటం గానీ ఎక్కడా మనకు కనిపించదు. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంలో 1949 జనవరి ఒకటి నుంచి రెండుదేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. పటేల్‌ కుమార్తె మణిబెన్‌ రాసిన డైరీలలో 1949 జూలై 23నమోదు చేసినదాని ప్రకారం ‘‘ మనం మొత్తం ప్రాంతం కావాలని కోరుతున్నాం… మొత్తం కాశ్మీరు కోసం పోరు సాగించాలి’’ అని ఉన్నట్లు బిజెపి నేత తరుణ్‌ విజయ్‌ రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. దానిలో నెహ్రూ నా మాట వినలేదు అనే భావం ఉందా ? అది కూడా యుద్దం ముగిసిన ఆరు నెలల తరువాత నిజంగానే నెహ్రూ వినలేదు అని చెప్పినందువలన ప్రయోజనం ఏముంది ? అంత పట్టుదలగల వ్యక్తి నిజంగా దేశానికి నష్టం జరిగిందని భావిస్తే రాజీనామా చేసి ఉండాలి. అటూ ఇటూ కాందిశీకులుగా వెళ్లిన వారు స్వస్థలాలకు వచ్చి తమ ఆస్తులను విక్రయించుకొనేందుకు వీలు కల్పించే ఒప్పందాన్ని నెహ్రూ పాకిస్తాన్‌తో చేసుకున్నారనే కారణంతో నిరనస తెలిపి వాణిజ్యశాఖ మంత్రిపదవికి శ్యామప్రసాద ముఖర్జీ రాజీనామా చేసి బయటకు వచ్చారు. తరువాత వెంటనే జనసంఘాన్ని ఏర్పాటు చేశారు. దానికే అంత పట్టుదల ఉంటే మరి ఉక్కు మనిషి పటేల్‌కు కీలకమైన కాశ్మీరు విషయంలో నెహ్రూతో విబేధాలు ఉంటే ఎందుకు బయటకు రానట్లు ? అందువలన కాశ్మీరు సమస్య మీద పటేల్‌ అసలు వైఖరిని వదలి నెహ్రూ మీద మరోసారి దాడి చేసేందుకు, తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తావించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.పోనీ నెహ్రూ, తరువాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఆక్రమిత కాశ్మీరు గురించి పట్టించుకోలేదని విమర్శిస్తున్న కాషాయ దళాలు తాము అమితంగా ప్రేమించే వల్లభాయ్‌ పటేల్‌ వాంఛను తీర్చాలనే చిత్తశుద్ది ఉంటే కబుర్లు కాదు, కార్యాచరణను ప్రారంభించాలి,యావత్‌ ప్రతిపక్షం, పౌరులూ సంపూర్ణ మద్దతు ఇస్తారు.

ముద్దులాట – దెబ్బలాట : అమెరికా ప్రతికూల సుంకాలపై చర్చలకు శ్రీకారం ! ఐరోపా సంతుష్టీకరణ యత్నం వృధా ప్రయాస అన్న చైనా !!

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

మాటల్లేవ్‌, మాట్లాడుకోవటం లేదు, ఒప్పందమూ లేదు, నేను చెప్పిందే వేదం అంటూ ట్రంప్‌ చిందులు వేశాడు. ఐరోపా సమాఖ్య దేశాల వస్తు దిగుమతులపై జూన్‌ ఒకటవ తేదీ నుంచి 50శాతం ప్రతికూల సుంకాలు విధిస్తానని బెదిరించిన ఆ పెద్దమనిషి ఒక అడుగు వెనక్కు వేసి జూలై 9వ తేదీ వరకు తన నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లేయన్‌ తనకు ఫోన్‌ చేసి మాట్లాడిన తరువాత గడువు పొడిగించేందుకు అంగీకరించినట్లు ట్రంప్‌ చెప్పాడు. ఫోన్‌ చేసింది నిజమే అని ఆమె కూడా నిర్ధారించారు. ఏప్రిల్‌ రెండవ తేదీన అమెరికా విముక్త దినంగా ప్రకటించిన ట్రంప్‌ అన్ని దేశాల మీద పదిశాతం చొప్పున ప్రతిసుంకాలు వేస్తాననటమే గాక కొన్ని దేశాల మీద అదనంగా కూడా వేయనున్నట్లు చెప్పాడు. ఐరోపా సమాఖ్య మీద 20శాతం అన్నాడు.ట్రంప్‌ బెదిరింపుల మీద దేశాలు చర్చలకు ముందుకు రాకపోవటంతో 90రోజుల పాటు అమలు నిలిపివేస్తున్నట్లు చెప్పాడు. ఆ గడువు జూలై 9వరకు ఉంది. చైనాతో రాజీకి వచ్చి 145ను 30శాతానికి తగ్గించాడు. ఐరోపా సమాఖ్య నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో జూన్‌ ఒకటి నుంచి 50 శాతం పన్ను విధిస్తానని, చర్చలేమీ లేవంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. ఒప్పందం కోసం ఎదురు చూడటం లేదు, 50శాతం పన్నుల అమలే తరువాయి, అమెరికాలో వస్తువులను ఉత్పత్తి చేస్తే ఎలాంటి పన్నులు ఉండవు అన్నాడు. వాణిజ్య మిగులు ఉన్న ఐరోపా తమ నుంచి ఇంథనం, ఆయుధాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలని ట్రంప్‌ వత్తిడి చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అమెరికా బెదిరింపుల పూర్వరంగంలో మరోసారి చైనాతో వాణిజ్య చర్చలు జరపాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించటం ట్రంప్‌కు పరోక్ష హెచ్చరికగా కనిపిస్తున్నది.అది ట్రంప్‌తో బేరమాడేందుకు కూడా కావచ్చు,చైనా మార్కెట్‌ అవకాశాల కోసమూ చూడవచ్చు. ఐరోపాలో రెండు ధోరణులు ఉన్నాయి. ఒకటి అమెరికాను ప్రసన్నం చేసుకొని పబ్బం గడుపుకోవాలని చూసేవారు కొందరైతే, ఎంతకాలమీ ముసుగులో దెబ్బలాట అని మండిపడుతున్నవారూ ఉన్నారు. అమెరికాను సంతుష్టీకరించటం అంత తేలిక కాదని గుర్తించటం అవసరమని చైనా వ్యాఖ్యానించింది.

ట్రంప్‌ దూకుడు వ్యవహారాన్ని ఐరోపా సమాఖ్య ఇప్పటి వరకు తాపీగా ప్రతిఘటిస్తున్నది. వేగంగా చర్చలు జరపనున్నట్లు ట్రంప్‌ చెప్పాడు. దౌత్యంలో అమెరికాకు ధీటుగా ఐరోపా ధనికదేశాలు ఉన్నాయి. ఎవరి తురుపు ముక్కలను వారు ప్రయోగిస్తున్నారు.ప్రపంచంలో అతి పెద్ద వాణిజ్య కూటమిగా ఉన్నాయి. మొత్తం మీద ఐరోపా 2024లో 236 బిలియన్‌ డాలర్ల మేర మిగులులో ఉంది. ఈ పూర్వరంగంలో తమ వస్తువులను భారీగా కొనుగోలు చేయాలని, ఉన్న ఆటంకాలు, వ్యాట్‌, అమెరికన్‌ కంపెనీల మీద వివక్ష, అపరాధరుసుముల వంటి వాటిని నామమాత్రం లేదా తొలగించాలని అమెరికా వత్తిడి చేస్తున్నది. అసలు ఐరోపా సమాఖ్య ఏర్పాటే అమెరికా, జపాన్నుంచి తలెత్తిన పోటీని ఉమ్మడిగా తట్టుకొనేందుకు అన్నది తెలిసిందే. అందువల్లనే అది ఆచితూచి వ్యవహరిస్తున్నది. పూర్తిగా తెగతెంపులు చేసుకొనేందుకు, అలాగని లొంగిపోయేందుకు సిద్దం కాదు. అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా 2024లో ఐరోపా యూనియన్‌ 600 బిలియన్‌ డాలర్ల మేరకు సరకులు ఎగుమతి చేసి 370 బి.డాలర్ల మేర దిగుమతులు చేసుకుంది.

తాజా పరిణామాలను చూస్తుంటే అమెరికా బెదిరింపులకు పూనుకుందన్నది స్పష్టం.తమ అధ్యక్షుడి పన్నుల బెదిరింపు ఐరోపా సమాఖ్య కింద మంటపెట్టింది, ఇతరులతో పోలిస్తే మెల్లగా నడుస్తున్న సంప్రదింపులు దీంతో వేగం పుంజుకుంటాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ బహిరంగంగానే చెప్పాడు. జూలై తొమ్మిది వరకు గడువు ఉంది గనుక ఏం జరుగుతుందో చూడాలి. ఇరుపక్షాలకూ ఇది ప్రతిష్టాత్మకమే. ‘‘ ఈ విషయంలో మేమంతా ఒకటిగా ఉన్నాం, మీరు మాలో ఒకరిని దూరం చేస్తే మా అందరినీ చేసుకున్నట్లే, మా వాణిజ్యం, మా కార్మికులు మొత్తం ఐరోపా వాసులకోసం ఐరోపా ఐక్యంగా ఉంటుంది. మీ చర్య ప్రపంచ ఆర్థికానికే దెబ్బ ’’ అని గతంలో స్పందించిన ఉర్సులా వాండెర్‌ యూరోపియన్లకు ఇప్పుడేమి చెబుతారన్నది ఆసక్తి కలిగించే అంశం. కొన్ని వస్తువులపై ట్రంప్‌ను దెబ్బకు దెబ్బతీయాలని ఐరోపా సమాఖ్య ఇప్పటికే తీర్మానించింది, అయితే ట్రంప్‌ 90రోజుల విరామం ప్రకటించటంతో ప్రతి చర్యలను ప్రకటించటం వాయిదా వేసుకుంది. శుక్రవారం నాడు 50శాతం పన్నుల ప్రకటన చేయగానే పరస్పర గౌరవంతో పరిష్కరించుకోవాలేగానీ బెదిరింపులతో కాదు, మా ప్రయోజనాలను రక్షించుకొనేందుకు కట్టుబడి ఉన్నామని సమాఖ్య వాణిజ్య, ఆర్థిక భద్రతా కమిషనర్‌ మారోస్‌ సెఫ్‌కోవిక్‌ గట్టిగా స్పందించాడు. సంప్రదింపులకు తాము సిద్దమే అన్నాడు. ఐరోపాకు మద్దతుగా తాము నిలుస్తామని జర్మనీ విదేశాంగ మంత్రి జాన్‌ వాడేపుల్‌ అన్నాడు. సంప్రదింపులు జరుగుతున్న తరుణంలో అదనపు పన్నుల గురించి ట్రంప్‌ ప్రకటన వాటికి దోహదం చేయదని, ఉద్రిక్తతలను తగ్గించాలని కోరుకోవటంతో పాటు దేనికైనా సిద్దమే అని ఫ్రెంచి మంత్రి సెయింట్‌ మార్టిన్‌ అన్నాడు.

గత చరిత్రను చూసినపుడు ట్రంప్‌తో ఐరోపా సమాఖ్య సంబంధాలు సజావుగా లేవు. తొలిసారి అధికారానికి వచ్చినపుడు ఐరోపా, మెక్సికో, కెనడా నుంచి దిగుమతి చేసుకొనే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై 2018లో పన్నులు విధించాడు. ఐరోపా సమాఖ్య అంత అధ్వాన్నంగా మరొకరెవరూ అమెరికా పట్ల వ్యవహరించలేదని అప్పుడు ఆరోపించాడు. అసలు అమెరికా నుంచి లబ్ది పొందేందుకే కూటమి ఏర్పడిరదన్నాడు. సమాఖ్య నుంచి విడిపోయిన బ్రిటన్‌తో అమెరికా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. మే ఎనిమిదిన కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అమెరికా వస్తువులపై దిగుమతి పన్ను 5.1 నుంచి 1.8శాతానికి తగ్గిస్తుంది. దీని వలన ఐదు బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువుల ఎగుమతికి వీలు కలుగుతుందని అధ్యక్ష భవనం తెలిపింది. ఇదే మాదిరి ఇతర ఐరోపా దేశాల్లోకి తన వస్తువులను కుమ్మరించాలని చూస్తున్నది. ఈ నేపధ్యంలో బ్రిటన్‌ పట్ల బహిరంగంగా ప్రకటించనప్పటికీ సమాఖ్య గుర్రుగా ఉంది. ఆ ఒప్పందాన్ని చూపి ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. పదిశాతం పన్నులైతే సరే అంతకు మించి ఉంటే ఒప్పందం కుదరకపోవచ్చని చెబుతున్నారు. ఇరవై లేదా 30శాతమైతే తాము కూడా ప్రతి చర్యలు తీసుకోకతప్పదని ఇప్పటికే కొంత మంది సంకేతాలిచ్చారు. ఒక టవల్‌ను సీటు మీద ఆ సీటు నాదే అన్నంత మాత్రాన భయపడే ప్రాంతం ఐరోపా సమాఖ్య కాదని వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఏకపక్షంగా తాను చెప్పిందానికి అంగీకరించాల్సిందే అంటున్న ట్రంప్‌ ఐరోపాను లొంగదీసుకోగలడా ? చైనా మాదిరి సమాఖ్య గట్టిగా వ్యవహరించగలదా ! అంతర్గతంగా ఆర్థిక వ్యవస్థ మీద పెరుగుతున్న వత్తిడి ట్రంప్‌కు ఊపిరి సలపనీయటం లేదు. పన్నులు లేకపోతే తమ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని గృహస్తులలో 56శాతం మంది పెద్దలు భావిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ సర్వే పేర్కొన్నది. కలుగుతుందని చెబుతున్న ప్రయోజనం కంటే తమపై పడే భారమే ఎక్కువ అని 52శాతం చెప్పారట.కేవలం 37శాతం మంది మాత్రమే ట్రంప్‌ పన్నుల విధానాన్ని సమర్ధించినట్లు మరొక సర్వే పేర్కొన్నది. అంతర్జాతీయంగా రోజు గడిచే కొద్దీ ఎవరు ఎలా బిగదీసుకుంటారో అన్న అనుమానంతో అదిరించి బెదిరించి ఒప్పందాలు కుదుర్చుకోవాలని ట్రంప్‌ చూస్తున్నాడు.

అమెరికా ప్రకటించిన పదిశాతం పన్నులు అలాగే ఉండగా బ్రిటన్‌ పన్నులు తగ్గించటం ఏమిటని మిగతా ఐరోపా దేశాలు మండిపడుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో బ్రిటన్‌ నేడు అమెరికాకు జూనియర్‌ భాగస్వామిగా ఉన్నందున దానితో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరి ఐరోపా సమాఖ్య కుదుర్చుకొనేందుకు సిద్దపడే అవకాశాలు లేవు. ఒకవేళ లొంగిపోతే ఆయాదేశాల్లో తలెత్తే సమస్యలు నాయకత్వానికి మరింత తలనొప్పిగా మారతాయి. అమెరికా లేదా ఐరోపా ధనికదేశాల్లో వస్తూత్పత్తి ఖర్చు ఎక్కువ అందువలన పరస్పరం పన్నులు విధించుకుంటే వాటికే నష్టం అని గత అనుభవం వెల్లడిరచింది.ట్రంప్‌ 50శాతం పన్ను నిర్ణయం ప్రకటించగానే రెండు చోట్లా స్టాక్‌మార్కెట్‌ పతనమైంది. చౌకగా వస్తువులను సరఫరా చేసే చైనా, తూర్పు ఆసియా, భారత్‌ వంటి చోట్ల నుంచి దిగుమతులు చౌకగా మారితే రెండూ నష్టపోతాయి. ఐరోపా నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 2024లో 20.6శాతం ఉంది.ప్రతికూల పన్నులు విధింపు, వాణిజ్య విధానాలు ప్రపంచ ఆర్థిక భవిష్యత్‌ను బలహీనం చేశాయని ఐరాస పేర్కొన్నది, ప్రపంచానికి ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు బహుముఖ సవాళ్లు విసురుతున్నాయని కూడా తెలిపింది.

త్వరలో చైనాఐరోపా సమాఖ్య వాణిజ్య ప్రతినిధుల చర్చలు పారిస్‌లో జరగనున్నాయి. సహకారం పెంచుకోవాలని ఉభయపక్షాలూ ఇటీవలి కాలంలో పదే పదే సంప్రదింపులు జరుపుతున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ దేశాల మంత్రుల సమావేశాలు జూన్‌ మొదటి వారంలో పారిస్‌లో జరగనున్నాయి. ఆ సందర్భంగా చైనాతో ఐరోపా సమాఖ్య ప్రతినిధులు భేటీ కానున్నారు. ట్రంప్‌ విధించిన గడువు జూలై తొమ్మిది వరకు ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడిరది. ఐరోపా యూనియన్‌కు అమెరికాతో సమస్యలున్నట్లే చైనాతో కూడా కొన్ని ఉన్నాయి. అయినప్పటికీ ఆర్థిక సహకారానికి సంబంధించి మే 13, 14వ తేదీలలో బ్రసెల్స్‌లో ఉభయ పక్షాలు సమావేశమయ్యాయి, మరుసటి రోజు ఫ్రాన్స్‌ ప్రతినిధులు చైనాతో చర్చించారు. చైనా ప్రతినిధివర్గ నేత వాంగ్‌, ఐరోపా నేత సెఫ్‌కోవిక్‌ మధ్య ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు కీలక చర్చలు జరిగాయి. పారిస్‌లో మూడవది జరగనుంది.సెఫ్‌కోవిక్‌ మార్చి 28న చైనా సందర్శించాడు, ఏప్రిల్‌ 18న వీడియో కాన్ఫరెన్సులో విద్యుత్‌ వాహనాల ధరలు, పెట్టుబడులు, ఆటో రంగంలో సహకారం గురించి ఉభయపక్షాలు చర్చలను ప్రారంభించాలని నిర్ణయించారు. పరస్పర లాభదాయకమైన సహకారం,కృత్రిమ మేథ, నూతన ఇంథన రంగాలు ఇతర అంశాలు ఉన్నాయి.ఈ పరిణామాల పట్ల అమెరికా గుర్రుగా ఉంది. చైనా వస్తువుల మీద తమ మాదిరి ఐరోపా సమాఖ్య కూడా ప్రతికూల పన్నులు విధించాలని అది డిమాండ్‌ చేస్తున్నది, అయితే ఐరోపా నుంచి ఇంతవరకు ఎలాంటి హామీ రాలేదని అమెరికా అధికారి ఒకరు చెప్పినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక రాసింది. అమెరికా తరువాత చైనా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. తమ మీద అమెరికా పన్నులను రద్దు చేస్తే ఉమ్మడిగా చైనా నుంచి ఇద్దరికీ ముప్పు ఉందని ప్రకటించేందుకు సిద్దంగా ఉన్నట్లు ఐరోపా పార్లమెంటు వాణిజ్య కమిటీ అధ్యక్షుడు బెర్నెడ్‌ లాంగే ప్రకటించటం గమనించాల్సిన అంశం.ఇవన్నీ చూసినపుడు నిజంగా అమెరికాకు వ్యతిరేకంగా కలసి వస్తే ఐరోపా, చైనా బలపడతాయి, లేకుంటే చైనాకు కొత్తగా పోయేదేమీ లేదు !

బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిలో 4వ స్థానం మోడీ గొప్పతనం – తలసరిలో 136 స్థానం నరేంద్రమోడీ ఘోరవైఫల్యం !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

జపాన్ను వెనక్కు నెట్టేసి మనదేశం ప్రపంచ జిడిపిలో నాలుగో స్థానానికి చేరిందని, రెండున్నర లేదా మూడు సంవత్సరాల్లో జర్మనీని కూడా పక్కనపెట్టి మూడవ స్థానానికి వెళతామని నీతిఅయోగ్‌ సిఇవో బివిఆర్‌ సుబ్రమణ్యం చేసిన ప్రకటనకు మీడియాలో పెద్ద స్పందనే వచ్చింది. అనేక మంది సంతోషిస్తున్నారు. ఇదొక గొప్పా అని పెదవి విరిచేవారు కూడా ఉన్నారు.నూటనలభై కోట్ల జనాభాలో ఈలెక్కల ఆల్జిబ్రా ఎంతమందికి అర్ధం అవుతుంది ? ‘‘ నేను చెప్పినట్లుగా మనది నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, నాలుగు లక్షల కోట్ల ఆర్థికం, ఇది నేను చెబుతున్న సమాచారం కాదు. ఐఎంఎఫ్‌ చెబుతున్నది, జపాన్‌ కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ ’’ అని సుబ్రమణ్యం నీతి అయోగ్‌ పాలకమండలి పదవ సమావేశంలో ప్రకటించారు. మనం రూపొందించిన పథకం ప్రకారం జరిగితే రెండు, రెండున్నర, మూడు సంవత్సరాల్లో మనది మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది అన్నారు. ఐఎంఎఫ్‌ ఏప్రిల్‌ 22 సమాచారం ప్రకారం వర్తమాన ధరల్లో సాధారణ(నామినల్‌) జిడిపి అమెరికా 30.51లక్షల కోట్ల డాలర్లు, చైనా 19.23, జర్మనీ 4.74,భారత్‌ 4.19, జపాన్‌ 4.19, బ్రిటన్‌ 3.84,ఫ్రాన్సు 3.21, ఇటలీ 2.42, కెనడా 2.23, బ్రెజిల్‌ 2.13 లక్షల కోట్లతో మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. 202526 నాటికి మన జిడిపి 4.187.017,జపాన్‌లో 4.186.431 బిలియన్‌ డాలర్లుగా అంచనా. వేసింది. బొమ్మను పాలకులు ఎలాగూ చూపించారు, వారు మూసిపెట్టే బొరుసు ఎలా ఉందో చూడాలి కదా !


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015లో 2.1లక్షల కోట్ల డాలర్ల నుంచి 2025లో దేశ జిడిపి 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు, ఇది 105శాతం పెరుగుదల అని ఐఎంఎఫ్‌ కొద్ది నెలల క్రితం చెప్పింది.అదే సంస్థ తాజాగా విడుదల చేసిన అంచనాలో ఆ మొత్తాన్ని 4.187 లక్షల కోట్లకు తగ్గించింది. జపాన్‌ మొత్తం 4.186 గనుక దాన్ని పక్కన పెట్టి మనకు నాలుగో స్థానాన్ని ఇచ్చింది. తేడా ఎంత 0.001 లక్షల కోట్లు. చెవులప్పగించేవారుంటే కాకమ్మ కతలు చెప్పేవారికి కొదవ ఏముంది. బిజెపి పెద్దలు 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని గొప్పలు చెప్పుకున్న అంశం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతటి అభివృద్ధిని ఏ ప్రభుత్వమూ సాధించలేదని కూడా బిజెపి ఐటి సెల్‌ మాలవీయ చెప్పారు.అలా ప్రచారం చేయటమే కదా ఆ పెద్దమనిషి ఉద్యోగం. వాస్తవం ఏమిటి, 2004లో మన్మోహన్‌ సింగ్‌ అధికారానికి వచ్చినపుడు జిడిపి 709 బిలియన్‌ డాలర్లు కాగా 2014 నాటికి అది 2030 బిలియన్లకు పెరిగింది. యుపిఏ పాలనా కాలంలో పెరుగుదల రేటు 186 శాతమని, 105కంటే ఎక్కువని కాస్త నిజాయితీ ఉన్నవారు కూడా చెబుతారు.


గతంలో ప్రధాని చెప్పిన కొన్ని అతిశయోక్తుల గురించి చెప్పుకుందాం. ‘‘ గత పదేండ్లలో జిడిపిని రెట్టింపు చేయటం అంకెలు కాదు, 25 కోట్ల మందిని దారిద్య్రరేఖ దాటించి నూతన మధ్యతరగతిని సృష్టించాం. వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు, సచేతనంగా ఆర్థికవృద్ధికి తోడ్పడుతున్నారు ’’. ప్రధాని నోటి నుంచి జాలువారిన ఈ మాటలను చూసి నవ్వాలా ఏడవాలో తెలియటం లేదు. ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్య్రరేఖ నుంచి ఎగువకు లాగాం అంటూనే కనీసం ఆహార ధాన్యాలు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న 140కిగాను 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార భద్రతా పధకం కింద గోధుమలు, బియ్యం ఇస్తున్నామని, మరికొన్నేండ్లు ఇస్తామని ఒక ఘనతగా చెప్పుకుంటారు. ప్రపంచ ఆకలి సూచికలో తాజాగా 127లో 105వ దేశంగా ఉన్నాం. ఆకలి లేని(9.9), స్వల్ప (10 నుంచి 19.9), తీవ్రం(20 నుంచి 34.9), ఆందోళనకరం(35నుంచి 49.9) , అత్యంత ఆందోళనకరం(50పైన) అనే ఐదు తరగతులుగా దేశాలను విభజిస్తే మన దేశం తీవ్ర తరగతిలో అంతకు ముందు, గత పదేండ్లుగా కూడా ఉంది. పదేండ్లలో జిడిపి రెట్టింపు అని ఇతర గొప్పలు కానీ పది సంవత్సరాల్లో 2014 నుంచి 2014వరకు మన ఆకలి సూచిక స్కోరు 28.2 నుంచి 27.3కు మాత్రమే తగ్గింది,దీనిలో అంత అభివృద్ధి ఎందుకు రాలేదు ? ఇదే కాలంలో పాకిస్తాన్‌ స్కోరు 29.6 నుంచి 27.9కి తగ్గింది, దీని గురించి చెబితే ఈ దేశంలో పుట్టీ, ఈ దేశంలో పెరిగీ, అన్నం తింటూ పక్కదేశాన్ని పొగుడుతున్నట్లు ఎదురు దాడి చేస్తారు. పాక్‌ రాంకు మన తరువాత 109, ఆకలిని ఎవరు ఎక్కువగా తగ్గించినట్లు ? గత పదేండ్లలో చైనా స్కోరు ఐదు కంటే తక్కువే ఉందన్న వాస్తవాన్ని చెబితే నానా యాగీ చేస్తారు. మోడీ సాధించిన విజయాలు మీకు పట్టవా అంటారు కొందరు. నిజమే 188 దేశాల జిడిపిలో మనలను నాలుగవ స్థానంలోకి తీసుకు వెళ్లినందుకు మోడీ ఘనత ఖాతాలో వేద్దాం. అదే తలసరి జిడిపిలో 136వ స్థానంలో ఉంచిన ఘనుడని కూడా కీర్తించాలా ! తలసరి జిడిపి కూడా నిజానికి ఒక మైండ్‌గేమ్‌ తప్ప మరొకటి కాదు. కొందరి దగ్గర సంపదలు పోగుపడటం అంటే ఆర్థిక అసమానతలు పెరుగుతున్నట్లే, మోడీ ఏలుబడిలో పెరిగినట్లు స్పష్టంగా తేలింది. సర్‌ గోచిపాతరాయుడు సంపద ఒక రూపాయి, 50,49 చొప్పున అంబానీ, అదానీల సంపదలు ఒక దగ్గర చేర్చి మూడుతో భాగిస్తే వచ్చే 33 గోచిపాతరాయుడి సంపద అంటే నవ్విపోతారు. అంబానీ ఇంట వివాహానికి విమానాలు,హెలికాప్టర్లు వేసుకొని వచ్చిన అతిధులు గోచిపాతరాయుడి ఇంటికి వస్తారా !


అసలు జిడిపి చర్చలోకి వెళితే బుర్ర బద్దలవుతుందంటే అతిశయోక్తి కాదు. దీన్ని సాధారణ(నామినల్‌), పిపిపి(పవర్‌ పర్చేజింగ్‌ పారిటీ) పద్దతుల్లో లెక్కిస్తున్నారు. రెండవదే వాస్తవానికి దగ్గరగా ఉంటుందన్నది కొందరి సమర్ధన. దాని ప్రకారం చూస్తే నరేంద్రమోడీ అధికారానికి వచ్చే నాటికే మన దేశం సాధారణంలో పది, రెండవ లెక్కలో మూడవ స్థానంలో ఉంది. మోడీ గణం రెండవ లెక్కలను ఎందుకు చెప్పటం లేదు. ఎందుకంటే దేశాన్ని ఇప్పటికీ అదే స్థానంలోనే మోడీ ఉంచారు గనుక. ఐఎంఎఫ్‌ 2025 పిపిపి అంచనా ప్రకారం చైనా 42.72, అమెరికా 30.51, భారత్‌ 17.65 లక్షల కోట్ల డాలర్లతో మూడవదిగా, రష్యా నాలుగు, జపాన్‌ ఐదవదిగా ఉంది. 2027 తొలి ఆరునెలల్లోనే సాధారణంలో 4.9లక్షల కోట్ల డాలర్లతో జర్మనీని కూడా దాటించేస్తారని ఊదరగొడుతున్నారు.అవన్నీ గిడసబారిన దేశాలుగా మారుతున్నాయి. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఆంబోతుల్లో అన్నట్లుగా చెప్పుకుంటే కుదరదు. మనం పోల్చుకోవాల్సింది చైనాతో కదా ! మన వృద్ధి రేటు చైనా, అమెరికా, జర్మనీ కంటే ఎక్కువగా ఉందని, గడచిన పదేండ్లలో భారత్‌ 105శాతం పెరుగుదల సాధించగా చైనా 76, అమెరికా 66, జర్మనీ 44, ఫ్రాన్సు 38, బ్రిటన్‌ 28శాతం పెరుగుదల సాధించిందని ఐఎంఎఫ్‌ చెప్పింది. లక్ష కోట్ల డాలర్ల కిలోమీటర్‌(మైలు) రాయిని దేశం 2007లో దాటింది.తదుపరి 2014లో రెండు లక్షల కోట్లు, 2025లో నాలుగు లక్షల కోట్లు దాటింది. 2032నాటికి పదిలక్షల కోట్ల డాలర్ల జిడిపి కలిగిన దేశంగా మారుతుందని కొందరు ఆర్థికవేత్తలు జోశ్యం చెప్పారు. వారి తర్కం ఏమిటి ? 2021లో మూడు లక్షల కోట్లకు విస్తరించింది. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రతి 18నెలలకు ప్రస్తుత వేగంలో ఒక లక్ష కోట్ల డాలర్లు పెరుగుతున్నది. ఇదే కొనసాగితే 2032 నాటికి 10లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది.


రానున్న కొద్ది సంవత్సరాల్లో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నందుకు ఇప్పటి నుంచి సంబరాలు జరుపుకుంటున్న వారిని చూసి ఆర్థిక నిపుణుడు డి ముత్తుకృష్ణన్‌ ఉత్సవాలు జరుపుకోవాల్సినంత ఘనత ఏమి సాధించామని 2024లోనే ప్రశ్నించారు. జిడిపిలో ఏ స్థానంలో ఉన్నామన్నది కాదు తలసరి రాబడిలో ప్రపంచంలో మనం 140వ స్థానంలో ఉన్నామని, మనకంటే 139దేశాలు ముందున్నాయని గుర్తించాలని చెప్పారు.(తాజాగా 136 గనుక 135 ముందున్నాయి) పిపిపి ప్రకారం చూసినా మన స్థానం 119 అని చెప్పారు. పదేండ్లలో మన జిడిపి 105శాతం పెరిగిందని ఏ ఐఎంఎఫ్‌ చెప్పిందో అదే సంస్థ 2025 తలసరి జిడిపిలో 141వ స్థానం అని కూడా జోశ్యం చెప్పింది. దివాలా తీసిందని చెప్పిన శ్రీలంక 133, బంగ్లాదేశ్‌ 143, పాకిస్తాన్‌ 159, షీ జింపింగ్‌ ఏలుబడిలో కుప్పకూలిపోయిందని కొంత మంది చెప్పే చైనా 71వ స్థానంలో (తాజాగా 70) ఉందని కూడా ఐఎంఎఫ్‌ చెప్పింది. మన తలసరి రాబడి పదివేల డాలర్లకు చేరాలంటే కనీసం 30 సంవత్సరాలు కష్టపడి పని చేయాలని, దానికి అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు ఉండాలని ముత్తు కృష్ణన్‌ చెప్పారు. చైనా తలసరి జిడిపి 2025లో 13,873 డాలర్లు, ఇప్పుడున్న మన 2,937 డాలర్ల నుంచి ఎదిగి ప్రధమ స్థానంలో ఉన్న మొనాకో 2,56,581( 2023 ప్రపంచ బ్యాంకు సమాచారం) లేదా డాలర్‌ దేవుడున్న అమెరికా 89,678(2025 ఐఎంఎఫ్‌) స్థాయికి, చివరికి పడకకుర్చీ మేథావులు చెబుతున్నట్లుగా అధిగమించే దూరం ఎంతో లేని చైనాను అయినా కనీసం అధిగమించాలంటే ఎంత సమయం పడుతుందో వేరే చెప్పనవసరం లేదు.


ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ నరేంద్రమోడీ నాయకత్వం కారణంగా ప్రపంచ వెలుగు దివ్వెగా భారత్‌ ముందుకు వచ్చిందని బిజెపినేత ప్రదీప్‌ బండారీ చెప్పిన మాటలు భజనరాయుళ్ల గళం తప్ప మరొకటి కాదు. పదకొండు సంవత్సరాలుగా వేసిన పునాదులే కారణమన్నారు. ఐరోపా దేశాలు, జపాన్‌ ఆర్థిక వ్యవస్థలు పెరుగుదల లేక గిడసబారిపోయాయి. రెండవ ప్రపంచయుద్ధానికి ముందు ఉన్న వలసలను కోల్పోయిన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మాజీ రాజుల వలే ఉన్నాయి. మిలిటరీలను నిషేధించిన కారణంగా అందుకు వెచ్చించే సొమ్మును పరిశోధనలకు మళ్లించి జర్మనీ, జపాన్‌, అమెరికా ఇచ్చిన దన్నుతో దక్షిణ కొరియా వేగంగా వృద్ధి చెందాయి. ఇప్పుడు వాటికి పరిమితి ఏర్పడిరది కనుకనే మనం ముందుకు వస్తున్నాం. ఒక నాడు మనకంటే వెనుకబడి ఉన్న చైనాతో తప్ప వాటితో పోల్చుకుంటే అవ్వతో వసంతమాడినట్లే ! అదేమంటే చైనా కమ్యూనిస్టు దేశమంటారు, మనది ప్రజాస్వామ్యం, స్వేచ్చ ఎక్కువ గనుక దాని కంటే ఎంతో ముందు ఎందుకు లేదు అంటే సమాధానం ఉండదు. ఒక ఐదు సంవత్సరాల పాటు ఐదులక్షల కోట్ల డాలర్ల గురించి ఊదరగొట్టారు. ఇప్పుడు పదిలక్షల కోట్ల గురించి చెప్పబోతున్నారు. 1950లో మన దేశంలో 20 కోట్ల మంది జనం ఉపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగు భూమి ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అన్న లెక్కలను పక్కన పెట్టి స్థిరంగా ఉందనుకున్నప్పటికీ అదే భూమి మీద 2023`24లో జనాభాలో 46.1శాతం మంది ఆధారపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే తెలిపింది. ఆరు సంవత్సరాల క్రితంతో పోల్చితే రెండు శాతం పెరిగారు. అంటే ఇప్పుడు 67 కోట్ల మంది పని చేస్తున్నారు.చైనాలో 24.1 శాతం లేదా 17.66 కోట్ల మంది(2023) పని చేస్తున్నారు. భూమి మీద ఆధారపడే వారు తగ్గటం అభివృద్ధి చెందిన దేశాల లక్షణం. వెనుకటికి ఒకడు మాది నూటొక్క అరకల వ్యవసాయం అని గొప్పలు చెప్పాడట. మీది అంటున్నావు ఎవరెవరికి ఎన్ని అంటే నాది ఒకటి మా అయ్యగారివి వంద అన్నాడట. జిడిపి కూడా అంతే !

అమెరికా – చైనా ఒప్పందం : ఇరకాటంలో విశ్వగురువు, కల్లలైన భారత పారిశ్రామికవేత్తల కలలు !

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

పరస్పరం లబ్ది పొందే విధంగా భారత్‌ మరియు అమెరికా మధ్య నిర్మాణాత్మకంగా వాణిజ్య చర్చలు జరుగుతున్నట్లు మన వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ నాలుగు రోజుల అమెరికా పర్యటన తరువాత శుక్రవారం నాడు ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. వెంటనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆపిల్‌ కంపెనీ భారత్‌లో గనుక ఉత్పత్తి కొనసాగిస్తే వాటి మీద 25శాతం పన్ను విధిస్తామని ప్రకటించాడు. ఒక రోజు ఆగి శామ్‌సంగ్‌ మీద కూడా అన్నాడు. అయినా సరే ఆ కంపెనీలు మనదేశంలో ఫోన్లు తయారీ చేస్తాయని చెబుతున్నారు. వెయ్యి డాలర్లకు యాపిల్‌ ఫోన్‌ తయారు చేస్తే 25శాతం చొప్పున 250 పన్ను చెల్లింపు, మరో 30డాలర్లు అసెంబ్లింగ్‌ ఖర్చు పోయినా అమెరికాలో తయారు చేసేదాని కంటే ఇంకా 280 డాలర్ల మేర లాభం ఉంటుంది గనుక ట్రంప్‌ను ఖాతరు చేయదని అంటున్నారు.మనం వాడుతున్న ఫోన్లలో ఒక్కో భాగం ఒక్కో దేశంలో తయారై వాటిని ఒక చోట చేర్చి మనం వాడే ఫోన్లుగా తయారు చేస్తారు. ఇది ఎక్కడ చౌక అయితే అక్కడికి ఏ కంపెనీ అయినా తరలిపోతుంది. అంటే ఆయా దేశాలు విడి భాగాలు నాణ్యం, చౌకగా తయారు చేయటాన్ని బట్టి వాటికి మార్కెట్‌ ఉంటుంది. అన్నీ ఒక దగ్గరకు చేర్చే ప్రక్రియసాధనాన్ని సరఫరా గొలుసు అంటున్నారు. పియూష్‌ గోయల్‌ అమెరికా వెళ్లటంతో ఆ పర్యటన మన దేశానికి శక్తినిస్తుందా ముప్పు తెస్తుందా అన్న సందేహాలు తలెత్తాయంటేనే అనుమానబీజం పడినట్లు. ఏం సాధిస్తారో చూద్దాం !

అమెరికా,చైనా నేతలు పన్నుపోరుకు తెరతీసినపుడు మనదేశంలోని పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు గాలివాటు లాభాలే లాభాలు అని సంబరపడ్డారు. చైనా సరఫరా గొలుసు బద్దలవుతుందని, దాని స్థానంలో తాముంటామని అమెరికాతో వాణిజ్యంలో మరింత లబ్ది పొందుతామని కలలు కన్నారు. అయితే ఆ రెండు దేశాలు జెనీవా ఒప్పందం కుదుర్చుకోవటంతో కుదేలయ్యారు.దేశమంతా పహల్గాం దారుణం, తదనంతర పరిణామాలతో నిమగ్నం కావటంతో దీని గురించి మీడియా పెద్దగా పట్టించుకోలేదు. ఆశలు కల్పించటంలో అది కూడా తక్కువ తినలేదు గనుక తేలుకుట్టిన దొంగలా ఉంది. జెనీవా ఒప్పందం జనాల నిత్యజీవితంపై వెంటనే ప్రభావం చూపేది కానందున మన జనాలకూ పట్టలేదు. వాణిజ్యంలో మనదేశం అమెరికాకు ఎక్కువ ఎగుమతి చేస్తూ తక్కువ దిగుమతి చేసుకుంటోంది. రెండు దేశాలూ పరస్పరం పన్నులు లేకుండా ఒప్పందం చేసుకుంటాయనే ప్రచారం జరిగింది. దాని వలన అమెరికాకు ఎక్కువ లాభం తప్ప మనకు కాదు. దిగుమతుల ముప్పు లేకుండా అనేక వస్తువుల మీద పెద్ద మొత్తంలో పన్నులు వేస్తూ మన వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు ఒక రక్షణ గోడ కట్టాం. దాన్ని బద్దలు చేయాలని ట్రంప్‌ కోరుతున్నాడు. నరేంద్రమోడీ అందుకు అంగీకరించినా, నామమాత్రపు పన్నులు వేసినా మన కోళ్ల, పాడి పరిశ్రమలు, వ్యవసాయం వంటివి కుదేలు అవుతాయి. అక్టోబరులో అనుకున్నది జూలై రెండవ వారంలో ఒప్పందం కుదురుతుందనే వార్తలు వచ్చాయి గనుక అప్పటి వరకు వేచి చూద్దాం. రెండు ఆర్థిక అగ్రరాజ్యాలు ఒప్పందం కుదుర్చుకున్న తరువాత వస్త్రాలు,ఔషధ, ఎలక్ట్రానిక్స్‌ రంగాలలో మనదేశానికి ఉన్నట్లు భావిస్తున్న అవకాశాలు కుచించుకుపోయినందున వ్యూహాత్మక పునరాలోచన చేయాల్సి ఉందని పోలిసీ సర్కిల్స్‌ అనే మీడియా ‘‘ అమెరికాచైనా పన్నుల ఒప్పందం భారత ఉత్పత్తిదారుల ఆశలను కల్లలు చేసింది ’’ అనే పేరుతో చేసిన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు.దాని సారాంశం ఇలా ఉంది. కొద్ది వారాలకు ముందు భారత ఎగుమతిదారులు ఉత్సాహంతో ఎగిరి గంతులు వేశారు, ఇప్పుడు నీరుగారిపోయారు. అమెరికా వస్తువుల మీద పది, చైనా వస్తువుల మీద 30శాతం పన్నుల విధింపుకు రెండు దేశాలు అంగీకరించాయి. దీంతో మన ఎగుమతిదార్ల లెక్కలు తారుమారయ్యాయి. అయితే మన వస్తువుల మీద విధిస్తున్న పదిశాతంతో పోలిస్తే చైనా సరకుల మీద 30శాతం ఉన్నందున మన ఎగుమతి అవకాశాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయని కూడా కొందరు భావిస్తున్నారు. మన దేశం నుంచి ఎగుమతి చేస్తే 20శాతం పన్నులు తక్కువగా ఉంటాయి గనుక వైద్య పరికరాలను తయారు చేసే పరిశ్రమలు భారత్‌కు రావచ్చని భావిస్తున్నారు. అయితే ఇది అమెరికాతో మనదేశం జరుపుతున్న చర్చల ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఐఫోన్లను భారత్‌లో తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేస్తే 25శాతం పన్ను విధిస్తామని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.


చైనా ప్లస్‌ ఒకటి అనే విధానం కింద అనుసరించిన తీరు కూడా మిశ్రమ ఫలితాలే ఇచ్చాయి.వియత్నాం,థాయ్‌లాండ్‌, కంపూచియా వంటి దేశాలు ఎక్కువగా సంస్థలను ఆకర్షించటానికి కారణం అక్కడ మనకంటే ఖర్చులు తక్కువగా ఉండటం, సులభమైన విధానాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలే కారణం. ఆపిల్‌ ఫోన్ల తయారీలో తప్ప ఇతర రంగాలలో మనం పెద్దగా రాణించలేదు. జెనీవా ఒప్పందం తాత్కాలిక స్వభావం భవిష్యత్‌ అనిశ్చితిని ముందుకు తెచ్చింది.ఆఫ్రికా మార్కెట్‌లోకి ఇటీవల మన ఎగుమతిదార్లు చొచ్చుకుపోయారు, అయితే ఈ ఒప్పందం చైనాకు అనుకూలతను పునరుద్దరించింది. ఒప్పందంలో లేని అంశాలు భారత్‌కు అనుకూలమే అయినా అమెరికాతో కుదిరే వాణిజ్య ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచ ఉత్పత్తిదారుగా మారాలన్న లక్ష్యం అంత తేలిక కాదు. ఏప్రిల్‌ 25న ఇదే పొలిసీ సర్కిల్స్‌ చేసిన విశ్లేషణలో ఎంతో ఆశాభావం, అపరిమిత లాభాల గురించి చర్చించారు. చైనాపై ట్రంప్‌ ప్రకటించిన 145, 245శాతాల పన్నులు అమలు జరుగుతాయని అనేక మంది భావించారు.కౌంటర్‌ పాయింట్‌ రిసర్చ్‌ వేసిన అంచనా ప్రకారం 2026 నాటికి ప్రపంచ స్మార్ట్‌ ఫోన్ల తయారీలో చైనా వాటా 64 నుంచి 55కు, భారత్‌ 18 నుంచి 25లేదా 28శాతానికి పెంచుకుంటుందని పేర్కొన్నారు.ఆపిల్‌ కంపెనీ భారత్‌లో తన ఉత్పత్తి వాటాను 202627 నాటికి 20 నుంచి 35శాతానికి పెంచుకోనుందని కూడా పేర్కొన్నారు.(దీనికి పిఎల్‌ఐ స్కీము కింద ఇచ్చే రాయితీలు ప్రధాన కారణం, ఆ సొమ్ము అయిపోయిన తరువాత సంగతేమిటి ?) కానాలిస్‌ సమాచారం ప్రకారం 2024లో 79శాతం డెల్‌ లాప్‌టాప్‌లు చైనాలో ఉత్పత్తి కాగా వచ్చే ఏడాది నాటికి సగం ఉత్పత్తిని వియత్నాం నుంచి చేయాలని ఆ కంపెనీ, అదే విధంగా చైనాలో 85శాతం ఉన్న ఉత్పత్తిని హెచ్‌పి కంపెనీ తైవాన్‌, మెక్సికోలకు గణనీయంగా తరలించాలని చూస్తోంది.

చైనా ప్లస్‌ ఒకటి అనే విధానంలో వియత్నాం,థాయ్‌లాండ్‌, కంపూచియా, మలేసియాలతో పోలిస్తే మన దేశం పరిమితమైన విజయాన్ని సాధించిందని నీతి అయోగ్‌ పేర్కొన్నది. ఇనుము, ఉక్కు రంగంలో 2025 ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో మన ఎగుమతులు 33శాతం తగ్గాయి, దీనికి చైనా సరఫరా ఎక్కువగా ఉండటంతో పాటు దిగుమతులు చేసుకొనే దేశాల్లో గిరాకీ కూడా తగ్గింది. చైనా వస్తువులపై 60శాతం పన్నులు ఉంటే భారత్‌ పోటీ పడే వీలు కలుగుతుందని కూడా నీతి అయోగ్‌ పేర్కొన్నది. కానీ ఇప్పుడు 30శాతం ఉన్నాయి, రానున్న రోజుల్లో తమ మీద భారం ఎక్కువ అనుకుంటే ట్రంప్‌ తగ్గించినా ఆశ్చర్యం లేదు. మన పరిస్థితి ఏమిటన్నది సమస్య.చైనా ఇప్పుడు మరింత లాభదాయకమైన వస్తు ఉత్పత్తి మీద కేంద్రీకరించింది. శ్రమశక్తి ఎక్కువగా ఉండే వాటిని క్రమంగా తగ్గిస్తున్నది. అయినా అలాంటి వాటిని అందిపుచ్చుకోవటంలో మనం వెనుకబడి ఉన్నాం. అప్పనంగా రావాలంటే ఏదీ మన దగ్గరకు రాదు. విషాదం ఏమిటంటే జిడిపిలో నాలుగో స్థానం, త్వరలో అమెరికా, చైనాలను అధిగమిస్తాం అన్న పోసుకోలు కబుర్లు చెబుతున్నారు. పదకొండు సంవత్సరాల మోడీ పాలన తరువాత అదీ నైపుణ్య వృద్ధి పేరుతో వేల కోట్లు ఖర్చు చేసిన తరువాత ప్రపంచంలో నైపుణ్య కార్మిక శక్తిలో 25వ స్థానంలో ఉన్నాం. అంటే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేని దుస్థితి. ఆపిల్‌ ఫోన్ల ఎగుమతి గురించి కేంద్ర పాలకులు పెద్దగా ప్రచారం చేస్తున్నారు. అమెరికాచైనా ఒప్పందం మన ఆశల మీద నీళ్లు చల్లిందని బిబిసి వ్యాఖ్య పేర్కొన్నది. ఇప్పుడు చైనా వస్తువుల మీద 30శాతం, మన వస్తువుల మీద 27 శాతం అమెరికా పన్ను విధిస్తున్నది. దీంతో చైనా నుంచి మన దేశానికి వస్తాయని చెప్పిన పరిశ్రమలు, కంపెనీలు, పెట్టుబడులు ఇప్పుడు వస్తాయా ? గత పదకొండు సంవత్సరాల నుంచి చెబుతున్న కబుర్లు ఆచరణలో కనిపించటం లేదు. చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలున్నాయని చెప్పేవారు కొనసాగిస్తూనే ఉన్నారు. వాటిని పాలకులు మన జనాలకు రంగుల కలగా చూపుతున్నారు. మోడీ విధానాలు దీర్ఘకాలంలో ఫలితాలు ఇస్తాయంటున్నారు. పదకొండు సంవత్సరాలలో మన పారిశ్రామిక ఉత్పత్తి జిడిపిలో 15శాతం చుట్టూ తిరుగుతున్నది తప్ప పెరగటం లేదు, పిఎల్‌ఐ పధకం పరిమితంగానే ప్రయోజనం కలిగించింది. నిజానికి యుపిఏ హయాంలో ఎక్కువగా ఉంది. కుండలో కూడు కదలకూడదు పిల్లోడు మాత్రం దుడ్డులా మారాలి అన్నట్లుగా మన వ్యవహారం ఉంది. ఇది నేను అంటున్నది కాదు. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా చెప్పిందే. పరిశోధన మరియు అభివృద్ధి రంగానికి జిడిపిలో మనదేశం 0.64శాతం ఖర్చు చేస్తుంటే చైనా 2.68, అమెరికా 3.5 శాతం చివరికి చైనాలోని ఒక్క హువెయి సంస్థ చేస్తున్న మొత్తం భారత్‌లో ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఖర్చు కంటే ఎక్కువ అన్నారు. పరిస్థితి ఇలా ఉంటే సాంకేతికంగా మనం వెనుకబడక ఎక్కడ ఉంటాం అని ప్రశ్నించారు.


రాజకీయంగా నరేంద్రమోడీ తన ప్రధాని పదవీ కాలంలో ఇంతటి విపత్కర పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదంటే అతిశయోక్తి కాదు. ఇంటా బయటా ఉన్న వంది మాగధుల కారణంగా విశ్వగురువుగా వర్ణితమైనందున ఇప్పుడు అదే ఇరకాటాన్ని తెచ్చింది. ఉదాహరణకు భారత్‌`పాకిస్తాన్‌ మధ్య తానే మధ్యవర్తిగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చానని ట్రంప్‌ ప్రకటించటాన్ని అంగీకరిస్తే గురు పీఠాన్ని స్వయంగా తక్కువ చేసుకున్నట్లు అవుతుంది. దాంతో పాకిస్తాన్‌ వైపు నుంచి వచ్చిన ప్రతిపాదనను అంగీకరించామని ప్రధమగణాలతో చెప్పించారు. అయినా ట్రంప్‌ పదే పదే అదే చెప్పాడు. చివరకు విధిలేక పాకిస్తాన్‌తో తలెత్తిన మిలిటరీ పరిస్థితి గురించి అమెరికా నేతలతో ఒప్పందానికి ముందు మాట్లాడినట్లు మన విదేశాంగశాఖ మెల్లగా అంగీకరించింది. పాక్‌పై మనదేపైచేయిగా ఉన్నపుడు ఏం సాధించి అంగీకరించారన్న ప్రశ్న మోడీని మరింత ఇరకాటంలో పెట్టింది. దుర్మార్గానికి పాల్పడిన వాడు ప్రాణభీతితో రాజీ అనగానే అంగీకరించాలా ? పాకిస్తాన్‌ ఉగ్రవాదులను అప్పగించలేదు, పట్టిస్తామని చెప్పలేదు, అసలు మద్దతు ఇచ్చినట్లు అంగకరించలేదు. ఈ విషయాలన్నీ అడుగుతారని పార్లమెంటు సమావేశం జరపటానికే నిరాకరించారు అపర ప్రజాస్వామికవాది. ప్రజాస్వామ్య దేవాలయం అని స్వయంగా వర్ణించి మొక్కిన పార్లమెంటులో మాట్లాడేందుకు భయపడుతున్నారని జనం అనుకుంటున్నారు. ఎంతటి విపత్కర స్థితి !

పుతిన్‌తో ఫోన్‌ తరువాత చేతులెత్తేసిన ట్రంప్‌, దిగ్భ్రాంతిలో ఐరోపా, మధ్యవర్తిగా పోప్‌ ?

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ శాంతి ఒప్పంద చర్చల నుంచి తప్పుకుంటానంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించటతో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఐరోపా హతాశురాలైంది.ప్రత్యక్ష పాత్ర పోషించలేననటమే కాదు, పుతిన్‌పై వత్తిడి తెచ్చేందుకు మరిన్ని ఆంక్షలు విధించాలన్న ఐరోపా నేతల సూచనలను కూడా తిరస్కరించినట్లు వార్తలు రావటంతో ఐరోపా దిగ్భ్రాంతికి గురైందనే విశ్లేషణలు వెలువడ్డాయి. తాను అధికారానికి వచ్చిన 24 గంటల్లోనే ఉక్రెయిన్‌ పోరు నిలిపివేస్తానన్నాడు డోనాల్డ్‌ ట్రంప్‌. పుతిన్‌తో భేటీ తరువాతే అది జరుగుతుందని కొద్ది రోజుల క్రితం చెప్పాడు. సోమవారం నాడు రెండు గంటలకు పైగా ఫోన్‌ సంభాషణ చేశాడు.చర్చలు అద్భుతంగా జరిగాయని ట్రంప్‌ వర్ణిస్తే అంతసీన్‌ లేదన్నట్లుగా పుతిన్‌ స్పందన ఉంది. పోప్‌ సాయంతో రెండు దేశాలూ సంప్రదించుకోవటం ద్వారా మాత్రమే శాంతి ఒప్పందం కుదురుతుందని, తక్షణమే చర్చలు ప్రారంభమౌతాయని ట్రంప్‌ ప్రకటించాడు.అమెరికా నుంచి ఎన్నికైన పోప్‌ 14వ లియో మధ్యవర్తిత్వం గురించి కొద్ది రోజల క్రితం వచ్చిన ఊహాగానాలను ట్రంప్‌ ఒక విధంగా నిర్దారించినట్లే. దీన్ని బట్టి శాంతి చర్చల కేంద్రంగా వాటికన్‌ మారనున్నదని చెప్పవచ్చు. అయితే ట్రంప్‌ మాటలకు విశ్వసనీయత, అక్కడేం జరుగుతుందన్న ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. ఇటీవల జరిగిన పరిణామాలను బట్టి పుతిన్‌కు ట్రంప్‌ ఫోన్‌ చేయటాన్ని మాస్కో విజయంగా కొందరు వర్ణిస్తున్నారు. కాల్పుల విరమణపై అవగాహనకు సిద్దంగా ఉన్నట్లు పుతిన్‌ చెప్పాడని రష్యా అధికారిక వార్తా సంస్థ నొవోస్తి పేర్కొన్నది.అయితే షరతులు వర్తిసాయన్నట్లుగా తమ ప్రతిపాదనల గురించి వెనక్కు తగ్గేదేలేని పుతిన్‌ కుండబద్దలు కొట్టినట్లు వ్యాఖ్యానాలు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ, ఇతర నాటో నేతలతో కూడా ట్రంప్‌ మాట్లాడిన తరువాత ఏం జరగనుందనేది ఆసక్తికరంగా తయారైంది.నాటకీయ పరిణామాలు జరుగుతాయా లేక ఎవరి తురుపుముక్కలను వారు ప్రయోగిస్తున్నారా అన్నది చూడాలి.‘‘ అహాలు పెద్దగా ఉన్నాయి. అయితే ఏదో ఒకటి జరుగుతుందని భావిస్తున్నా, అది జరగకపోతే నేను తప్పుకుంటా, వాళ్లే చూసుకుంటారు ’’ అని ట్రంప్‌ చెప్పటాన్ని బట్టి పుతిన్‌ గతంలో స్పష్టం చేసిన మూలకారణాలకు పరిష్కారం కుదిరితేనే శాంతి అన్న అంశాన్ని మరోసారి స్పష్టం చేసినట్లు చెప్పవచ్చు. కరవమంటే కప్పుకు విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉక్రెయిన్‌,దానికి బాసటగా నిలుస్తున్న ఐరోపా అగ్రరాజ్యాలు పుతిన్‌ షరతులను అంగీకరించే అవకాశం కనిపించకపోతే మధ్యలో నాకెందుకు అంటూ ట్రంప్‌ తప్పుకొనేందుకు పూనుకున్నట్లు కూడా కనిపిస్తోంది.దీనికి తోడు మిలిటరీ, గూఢచార సమాచారం అందచేత కూడా నిలిపివేస్తే ఉక్రెయిన్‌ గిలగిలా కొట్టుకుంటుందని విశ్లేషణలు వెలువడ్డాయి. శాంతి చర్చల నుంచి అమెరికా దూరంగా జరగకూడదని, మా అందరికీ అది కీలకమని సోమవారం నాడు పుతిన్‌తో ట్రంప్‌ ఫోన్‌ తరువాత జెలెనెస్కీ వ్యాఖ్యానించాడు. రష్యా దౌత్యపరమైన విజయం సాధించిందని కోమ్సోమోలస్కయా ప్రావదా పత్రిక వర్ణించింది.


ఎవరి రాజకీయం వారు చేస్తున్నారు. ఉక్రెయిన్‌లో పోరు ఆగటం లేదు. దీనికి కారకులెవరు ? రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతినా లేక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంపా ? సోమవారం నాడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడతానని ట్రంప్‌ చెప్పాడు. మాట్లాడే ముందు ఐరోపాలో ఉన్న నాటో దేశాల నేతలందరూ ట్రంప్‌తో చర్చించారు. బేషరతుగా చర్చలకు పుతిన్‌ వస్తే సరి లేకుంటే రష్యా మీద మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాలని చెప్పారు.అణ్వాయుధాలతో పని లేకుండానే ఉక్రెయిన్లో తమ లక్ష్యాలను సాధిస్తామని పుతిన్‌ చెప్పటమేగాక ఆదివారం నాడు రికార్డుస్థాయిలో 273 డ్రోన్లతో దాడి చేయించాడు. సంక్షోభానికి మూల కారణాలను గమనంలోకి తీసుకొని పరిష్కారానికి పూనుకోవాలని, ఆ దిశగా చర్చలకు తాను సిద్ధమే అని పుతిన్‌ మరోసారి చెప్పాడు. ప్రభుత్వ టీవీ విలేకరితో మాట్లాడుతూ అణ్వాయుధాలను ప్రయోగించే తప్పు తమతో చేయించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని అయితే వాటితో నిమిత్తం లేకుండానే పని పూర్తి చేయగలమని అన్నాడు.తమను భయపెట్టేందుకు ఖండాంతర క్షిపణులతో కవాతు చేస్తున్నట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది. పుతిన్‌ ఇంటర్వ్యూను ఆదివారం నాడు టీవీ ప్రసారం చేసంది. సోవియట్‌ పూర్వపు రిపబ్లిక్‌ అయిన ఉక్రెయిన్ను నాజీకరణ, మిలిటరీ రహితం కావించేందుకు,తటస్థంగా ఉండేందుకు సైనిక చర్యను ప్రారంభించినట్లు 2022 ఫిబ్రవరిలో రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యన్‌ భాష మాట్లాడే పౌరుల హక్కుల పరిరక్షణ కూడా మిలిటరీ చర్య ఉద్దేశమని పుతిన్‌ చెప్పాడు. సంక్షోభానికి మూలకారణాల్లోకి వెళ్లే వారు రష్యా ప్రయోజనాలను కూడా గమనంలోకి తీసుకోవాలని పదే పదే చెప్పాడు, అప్పుడే శాశ్వత శాంతి నెలకొంటుందన్నాడు. ఈనెల 16న ఇస్తాంబుల్‌(టర్కీ)లో రష్యాఉక్రెయిన్‌ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పంద చర్చలు విఫలమయ్యాయి. ఇరుదేశాల వద్ద ఉన్న యుద్ధ ఖైదీల మార్పిడికి మాత్రమే అంగీకారం కుదిరింది. అమెరికన్లు అంటే అధ్యక్షుడితో సహా మొత్తం అమెరికా జనాలు, నాయకత్వానికి వారి స్వంత జాతీయ ప్రయోజనాలు ఉంటాయి, వాటిని మేము గౌరవిస్తాము, మాక్కూడా అలాగే ఉంటాయి, అదేమాదిరి వాటిని కూడా మన్నించాలని పుతిన్‌ అన్నాడు.

సోమవారం నాడు పుతిన్‌కు ఫోన్‌ చేస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన తరువాత తన మనస్సులో ఏమున్నదో, ఏమి కోరుకుంటున్నాడో పుతిన్‌ టీవీ ఇంటర్వ్యూ రూపంలో ముందుగానే వెల్లడిరచటం తప్ప మరొకటి కాదు. దానికి భిన్నంగా చేసే ప్రతిపాదనలను అంగీకరించేది లేదని బహిరంగంగానే స్పష్టం చేశాడు.తమ షరతులకు ఆమోదం తెలిపే వరకు ఒకవైపు చర్చలు జరుపుతూనే సైనిక చర్యను కూడా కొనసాగిస్తామన్న సందేశమిస్తూ ఆదివారం నాడు భారీ ఎత్తున 273 డ్రోన్లతో రష్యా దాడి చేసింది. ఈ దాడి తరువాత రోమ్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌తో జెలెనెస్కీ సమావేశమై రష్యా మీద మరింత వత్తిడి తేవాలని కోరాడు. ట్రంప్‌ సమక్షంలో ఓవల్‌ ఆఫీసులో ఇద్దరూ గొడవ పడిన తరువాత జరిగిన తొలి భేటీ ఇది.బేషరతుగా, పూర్తిగా యుద్ధాన్ని ఆపకతప్పదు అనుకొనేవరకు రష్యాపై వత్తిడి పెంచాల్సిందే అని జెలెనెస్కీ తరువాత ఒక ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నాడు. కాల్పుల విరమణ గురించి మాట్లాడేందుకు ఇతగాడు ఇస్తాంబుల్‌ రాగా పుతిన్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోగా కనీసం ఒక మంత్రిని కూడా పంపలేదు. దాంతో ఉక్రెయిన్లో జరుగుతున్న రక్తపాతాన్ని ఆపేందుకు తాను ఫోన్లో మాట్లాడతానని ట్రంప్‌ ప్రకటించాడు. పుతిన్‌ వైఖరితో ఐరోపా నాటో దేశాలకు దిక్కుతోచటం లేదు.భయంకరమైన యుద్ధాన్ని త్వరలో ఆపేందుకు అమెరికన్లు, యూరోపియన్లు కలసి పని చేయాలని జర్మన్‌ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ ఆదివారం నాడు చెప్పాడు. ప్రస్తుత దశలో ఉక్రెయిన్‌కు శాంతి స్థాపక దళాలను పంపటం గురించి మాట్లాటటానికి ఏమీ లేదని, దానికి సుదూరంగా ఉన్నామని, ముందు ఆయుధ ప్రయోగం, మరణాలను ఆపాలి అన్నాడు.తమ ప్రమేయం లేకుండా శాంతి ఒప్పందం కుదరటాన్ని అంగీకరించేందుకు ఐరోపా నేతలు సముఖంగా లేరని మెర్జ్‌ మాటల్లో మారోసారి వెల్లడైంది. అంతకు ముందు అల్బేనియా రాజధాని టిరానాలో రష్యా మీద మరిన్ని ఆంక్షల విధింపు గురించి ఐరోపా నేతలు చర్చలు జరిపారు.

రష్యా సైనిక చర్య ప్రారంభమైన 2022లో టర్కీ చొరవతో తొలిసారి ఇస్తాంబుల్‌ నగరంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇతర నాటో దేశాల మాట విని జెలెనెస్కీ సాకులతో ముందుకు రాలేదు. ఆ తరువాత తిరిగి మలిసారిగా గత శుక్రవారం నాడు అక్కడే ప్రత్యక్ష చర్చలు జరిగాయి. కేవలం రెండు గంటల పాటు జరిగిన సంప్రదింపుల్లో వెయ్యి మంది యుద్ధ ఖైదీలను పరస్పరం మార్పిడి చేసుకొనేందుకు రెండు దేశాల ప్రతినిధి బృందాలు అంగీకరించాయి. దీనికి ఎలాంటి షరతులు లేవు. శాశ్వత శాంతి ఒప్పందానికి ముందుగా తాత్కాలిక కాల్పుల విరమణకు రష్యా అంగీకరించాలని, అటువైపు నుంచి స్పందన లేదని ఉక్రెయిన్‌ ప్రతినిధి చెప్పాడు. జరిగిందానిపట్ల తాము సంతృప్తిగా ఉన్నామని, నిరంతరం మాట్లాడేందుకు అందుబాటులో ఉంటామని రష్యన్‌ ప్రతినిధి అన్నాడు. కాల్పుల విరమణ ప్రతిపాదనలను రెండు పక్షాలూ పరస్పరం అందచేసుకోవాలని నిర్ణయించారు. రష్యా ఆధీనంలోకి వెళ్లిన తమ భూభాల నుంచి ఖాళీ చేసేందుకు తమకు ఏమాత్రం అంగీకారం గాని కొత్త షరతులను రష్యా ప్రతిపాదించినట్లు ఉక్రెయిన్‌ ప్రతినిధి చెప్పాడు. ఉక్రెయిన్‌ యుద్ధ పూర్వరంగంలో తలెత్తిన పరిణామాలను చర్చించేందుకు అల్బేనియా రాజధాని టిరానాలో 47ఐరోపా దేశాల నేతలు సమావేశమయ్యారు.అమెరికా, ఉక్రెయిన్‌, ఐరోపాదేశాలు చేసిన ప్రతిపాదనలకు రష్యా స్పందించలేదని, కొత్త ఆంక్షల గురించి చర్చించారు. అయితే ఐరోపా సమాఖ్య వాటి మీద ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని నిర్ణయించారు. పుతిన్‌ స్పందించకపోయినా ప్రయత్నాలు కొనసాగించాల్సిందేనని భావించారు.నెల రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్‌ సరే అన్నది. రష్యా తిరస్కరించింది. ఉన్నత స్థాయిలో చర్చలు అవసరమేనని అయితే ట్రంప్‌పుతిన్‌ భేటీకి సమయం పడుతుందని రష్యా ప్రతినిధి పెష్కోవ్‌ చెప్పాడు.రష్యన్‌ మిలిటరీ సరికొత్త దాడులకు సిద్దం అవుతున్నదని పశ్చిమదేశాల మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. బెలారస్‌కు కొత్త ఆయుధాలు ఇవ్వటంతో పాటు సెప్టెంబరులో సంయుక్తవిన్యాసాలు జరిపేందుకు రష్యా నిర్ణయించటాన్ని వారు చెబుతున్నారు. ఒకవేళ సరికొత్త దాడులు జరిగితే తూర్పు ఐరోపాలోని నాటో సభ్యదేశాలు లాత్వియా, లిథువేనియా, పోలాండ్‌లు ఒక రక్షణగా పనికి వస్తాయని భావిస్తున్నారు. రానున్నది వేసవి గనుక యుద్ధానికి అనువుగా ఉంటుందని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. ఇస్తాంబుల్‌ చర్చలు విఫలమైన నేపధ్యాన్ని బట్టి పోరు సంవత్సరాల తరబడి కొనసాగవచ్చని, తాము భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఉక్రేనియన్లు భావిస్తున్నట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. ‘‘ మమ్మల్ని రష్యా నాశనం చేయలేదు, మేము దాని ఆధీనంలోకి వెళ్లిన ప్రాంతాలను విముక్తి చేయలేము, అమెరికా సాయం లేకుండా ఇప్పుడున్న పరిస్థితిని మార్చలేము,కొంతకాలం తరువాత త్రాసు రష్యావైపు మొగ్గుతుంది, మేము భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మేము యుద్ధాన్ని కోరుకోవటం లేదు, ఒకటి, రెండు, మూడు ఇంకా దీర్ఘకాలం పట్టినా పోరుకు సిద్దమే. మేము స్వీడన్‌తో 21 సంవత్సరాలు పోరాడాము ’’ అని ఒక అధికారి చెప్పినట్లు గార్డియన్‌ పత్రిక రాసింది. తమ ఆధీనంలో ఉన్న ఐదు ప్రాంతాల నుంచే గాక లేని చోట్ల కూడా ఉక్రెయిన్‌ మిలిటరీని ఉపసంహరించాలని రష్యా డిమాండ్‌ చేస్తున్నట్లు వార్తలు.


శాంతి ఒప్పందం కుదరలాంటే దానికి ముందు తేలాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి.ఏకపక్షంగా ఏదీ జరగదు. శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని అమెరికా, ఐరోపా దేశాలు బెదిరించినా పుతిన్‌ వాటిని పూచికపుల్లలా తీసివేశాడు. ఉడుత ఊపులకు భయపడేది లేదని స్పష్టం చేశాడు. ఉభయపక్షాలకూ ముందు విశ్వాసం కుదరాలి.తమ మీద విధించిన ఆంక్షల సంగతి ముందు తేల్చాలని రష్యా కోరనుంది.అది జరిగిన తరువాత ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం సంగతి ఏమిటని పుతిన్‌ పట్టుబట్టటం ఖాయం. మూడు సంవత్సరాలుగా రష్యా స్వాధీనంలోకి వచ్చిన ప్రాంతాల సంగతి తేలాల్సి ఉంది. ఇవేవీ పరిష్కారం కాకుండా శాంతికి రష్యా అంగీకరించే అవకాశం లేదు. వీటిని అంగీకరించటమంటే ఐరోపా దేశాలు ఓడిపోయినట్లే గనుక అందుకు అవి అంగీకరిస్తాయా ?

చైనా అస్త్రాల గురించి ఎవరేమంటున్నారు, ఆయుధాల దిగుమతిలో భారత్‌ అగ్రస్థానం,రాఫేల్‌ మార్కెట్‌కు ముప్పు !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా మన మిలిటరీ జరిపిన ఆపరేషన్‌ సిందూర్‌లో ఉపయోగించిన ఆయుధాలు, పాకిస్తాన్‌ ప్రయోగించిన వాటి గురించి దేశంలో, ప్రపంచ వ్యాపితంగా చర్చ జరుగుతోంది. ఉద్రిక్తతల సమయాల్లో వెలువడే అభిప్రాయాలు పూర్తిగా నిజమే లేదా పూర్తిగా అవాస్తమే అని భావించినా పప్పులో కాలేసినట్లే. ఆయుధదాడులు కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే దానికంటే ప్రమాదకరమైన తప్పుడు వార్తల ప్రచారదాడి ఎక్కువగా జరుగుతోంది. అందువలన వినదగునెవ్వరు చెప్పిన…. అన్నట్లుగా వేగపడకుండా నిదానంగా వాస్తవాలు తెలుసుకోవాలి.ఈ క్రమంలో సంక్షిప్తంగా కొన్ని అభిప్రాయాలను చూద్దాం.వాటితో ఎవరైనా విబేధించవచ్చు, ఏకీభవించవచ్చు. క్షిపణుల తయారీ మన శాస్త్రవేత్తల ఘనత తప్ప రాజకీయనేతలది కాదు. మన దేశం ఆయుధాల ఎగుమతి గురించి గోరంతలను కొండంతలు చేస్తూ నరేంద్రమోడీ భజన చేస్తున్నారు. ఇదీ ప్రచారదాడే !


చైనా బజార్ల పేరుతో అమ్మిన ఢల్లీి నకిలీ సరుకునంతా చైనాకు అంటగట్టి తూలనాడిన రోజులున్నాయి. కొన్ని వస్తువుల నాణ్యత ప్రశ్నార్దకంగా ఉండవచ్చు.వాటిని కొనాలని చైనా ఎవరినీ బలవంతం చేయలేదు. ఇప్పుడు దాని ఆయుధాల నాణ్యత గురించి చర్చ జరుగుతోంది. చైనా తయారీ నూతన ఆయుధాలను ఏ యుద్ధం లేదా ఘర్షణల్లో ప్రత్యక్షంగా వాడని మాట వాస్తవం. అమెరికా తన ఆయుధాలకు ఇరాన్‌, ఇరాక్‌, ఇతర యుద్ధాలను ప్రయోగశాలలుగా చేసుకున్నది. అందుకని అనేక మందికి చైనా వాటి సామర్ధ్యం మీద అనుమానాలు ఉండటం సహజం. పాకిస్తాన్‌ వాటిని మనదేశం మీద ప్రయోగించిన తరువాత అనుకూలంగా వ్యతిరేకంగా విశ్లేషణలు వెలువడుతున్నాయి.తాజాగా కొత్త పల్లవి అందుకున్నారు. చైనా ఆయుధాల వెల తక్కువేగానీ, వాటి నిర్వహణ, మరమ్మతులు ఖర్చు ఎక్కువ అంటూ కొందరు అమెరికా, ఐరోపా ధనికదేశాల ఆయుధాల నిపుణులు చాణక్యనీతిని ప్రయోగిస్తున్నారు.

పాకిస్తాన్‌ ఉపయోగించిన చైనా ఆయుధాలను చూసిన తరువాత వాటి సామర్ధ్యంపై నెలకొన్న ఆందోళనకు ముగింపు పలికినట్లు కనిపిస్తోందని అకడమిక్‌ గులాం అలీ పేర్కొన్నారు.‘‘ రాఫేల్‌ కూల్చివేత : ప్రపంచ వేదికపై చైనా ఆయుధాలకు ఒక మలుపు ? ’’ అని సింగపూర్‌ ప్రెస్‌ హోల్డింగ్స్‌ అనే సింగపూర్‌ కంపెనీ నిర్వహిస్తున్న ‘‘ థింక్‌చైనా ’’ అనే పత్రిక(వెబ్‌) 2025 మే 16వ తేదీన ప్రచురించిన విశ్లేషణలో ఉంది.కొన్ని అంశాల సారం ఇలా ఉంది. పశ్చిమ దేశాలు అమ్మే అయుధాలకు షరతులు ఉంటాయి, చైనా ఎలాంటి ఆంక్షలు పెట్టదు. ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. వెల తక్కువ, పశ్చిమదేశాల వాటితో పోలిస్తే నాణ్యత తక్కువని భావించటానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి.1979 తరువాత నేరుగా చైనా ఆయుధాలను ఉపయోగించిన దాఖలా లేదు గనుక నాణ్యత గురించి అనుమానం. అందుకే అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ఆయుధాలకు ప్రాధాన్యత ఇస్తారు.మేనెల ఏడవ తేదీ చైనా జెట్‌ విమానాలకు అమర్చిన చైనా క్షిపణులతో పాకిస్తాన్‌ ఐదు భారత జెట్‌లను కూల్చివేసింది గనుక ఈ ఉదంతం చైనా ఆయుధాల గురించి ఉన్న అభిప్రాయాన్ని గణనీయంగా దెబ్బతీసింది.దీంతో మార్కెట్లో చైనా వాటా పెరిగింది. రంగంలో ఒక రాఫెల్‌ జెట్‌ను కూల్చివేయటం దాని చరిత్రలో ఇదే తొలిసారి, అదే విధంగా చైనా జె10, పిఎల్‌15క్షిపణికి కూడా ఇదే ప్రధమం. మూడు రాఫెల్‌ జెట్‌లను కూల్చివేసినట్లు పాకిస్తాన్‌ ప్రకటించగానే వాటి తయారీ సంస్థ దసాల్ట్‌ వాటాల ధర ఆరుశాతం తగ్గింది, మరోఐదుశాతం తగ్గవచ్చని భావిస్తున్నారు. చైనా జెట్‌ల తయారీ కంపెనీ ఎవిఐసి ధర ఒక్కరోజే 17.05శాతం, మరోకంపెనీ 6శాతం, మొత్తంగా చైనా ఆయుధ కంపెనీల వాటాలు 1.6శాతం పెరిగాయి. ఈ పరిణామం అనేక ప్రాంతాల్లో చైనా పలుకుబడి, విశ్వసనీయత పెరగటానికి తోడ్పడుతుంది.


స్విడ్జర్లాండ్‌ వెబ్‌ పోర్టల్‌ ఎన్‌జెడ్‌జెడ్‌.సిహెచ్‌ మే 16వ తేదీన ప్రచురించిన విశ్లేషణకు ‘‘ పాకిస్తాన్‌పై భారత్‌ దాడి సమయంలో ఫ్రెంచి రాఫేల్‌ కూల్చివేత పశ్చిమదేశాలకు పాఠం చెబుతుంది ’’ అని పెట్టారు.పాకిస్తాన్‌, దాని ఆక్రమణలో ఉన్న కాశ్మీరుపై భారత్‌ జరిపినదాడి సందర్భంగా చైనా నిర్మిత జెట్‌తో భారత్‌ కనీసం ఫ్రాన్సు నిర్మించిన ఒక ఆధునిక జెట్‌ను కోల్పోయింది. ఈ నష్టం తన స్వంత మిలిటరీ వ్యూహాలను పరిశీలించుకొనేందుకు ఐరోపాకు ఒక మేల్కొలుపు. ఈ ఉదంతం పశ్చిమదేశాల మిలిటరీ సాంకేతికతల సామర్ధ్యం గురించి ఆందోళన కలిగించింది.ఐరోపా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి రాఫేల్‌ మీద చాలా ఎక్కువగా ఆధారపడి ఉంది. పశ్చిమదేశాల వైమానిక దళాలు చైనా, రష్యా రక్షణ వ్యవస్థలకు వ్యతిరేకంగా తమ సన్నద్దతను మెరుగుపరచుకోవాలి.పరిస్థితికి తగిన జాగరూకత లేకపోతే ఆధునిక పరిజ్ఞానం మీదే ఆధారపడితే కుదరదు.అమెరికా, ఇజ్రాయెల్‌ మాదిరి ఎలాంటి నష్టం లేకుండా చూసుకొనేందుకు ముందస్తు సూచన లేకుండా భారత్‌ కూడా చేసింది, భారత వైమానికులు తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. సాంకేతికంగా ఉన్నతంగా ఉన్నామనే భావన మీద ఆధారపడి పాకిస్తాన్‌ సామర్ధ్యాలను భారత్‌ తక్కువ అంచనా వేసింది. మరోవైపు చైనా జె10 జెట్‌ మరియు పిఎల్‌15 క్షిపణి సామర్ధ్యం గురించి వైమానిక దళం తక్కువ అంచనా వేసింది.


డిఫెన్స్‌ ఇండస్ట్రీ యూరోప్‌ అనే వెబ్‌సైట్‌ ‘‘ కాశ్మీరు వివాదంలో భారత రాఫేల్‌ ఫైటర్‌ జెట్‌ కూల్చివేత ’’ అనే శీర్షికతో విశ్లేషణ చేసింది. భారత్‌ ఒక రాఫెల్‌ జెట్‌ను కోల్పోయినట్లు పేర్కొన్నది. అనధికారికంగా ఫ్రెంచి అధికారులు నిర్ధారించారు, అమెరికా వర్గాలు కూడా చెప్పాయని తెలిపింది. డిఫెన్స్‌ సెక్యూరిటీ ఆసియా అనే వెబ్‌సైట్‌ మే 15వ తేదీన వెల్లడిరచిన విశ్లేషణకు ‘‘ రాఫేల్‌ కూల్చివేత ? బిలియన్ల డాలర్ల ఒప్పందంపై ఇండోనేషియా పున:సమీక్షలో పడటంతో ఫ్రెంచి జెట్‌ పరువుపై దాడి ’’ అని పేరు పెట్టింది.మూడు భారత రాఫేల్‌ విమానాలను కూల్చినట్లు పాకిస్తాన్‌ ప్రకటించటంతో ఇండోనేషియా ఉన్నత స్థాయి రక్షణ అధికారులు రాఫేల్‌ యుద్ధ సామర్ధ్యం గురించి సమీక్ష చేస్తున్నట్లు తెలిసింది. ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి వెలువడిన ప్రకటనల ఆధారంగా నిర్దారణలకు రాకూడదని నిపుణులు హెచ్చరించినట్లు కూడా దానిలో ఉటంకించారు.ఎంతో అనుభవం ఉన్న అమెరికా తయారీ ఎఫ్‌16,18,22 రకాలను కూడా కూల్చివేశారని కూడా గుర్తు చేశారు. ఇటీవల జరిపిన పత్రికా గోష్టిలో భారత ఎయిర్‌ మార్షల్‌ ఎకె భారతి ఒక ప్రశ్నకు సమాధానంగా ‘‘ మేం యుద్ధ తరహా పరిస్థితిలో ఉన్నాం పోరులో నష్టాలు భాగంగా ఉంటాయి ’’ అన్న మాటలు పరోక్షంగా విమానాలను కోల్పోయినట్లుగా అంగీకరించినట్లే అని కొందరు విశ్లేషించారు. విమర్శలు వచ్చినప్పటికీ రాఫెల్‌ ప్రపంచంలో ఇప్పుడున్న వాటిలో మంచి వాటిలో ఒకటి అని కొందరు మద్దతు ఇచ్చినట్లు కూడా ఈ విశ్లేషణలో పేర్కొన్నారు. ఇండోనేషియా సామాజిక మాధ్యమంలో వస్తున్న వ్యాఖ్యలను కూడా ప్రస్తావించింది. ‘‘ జె10జెట్లతో దాన్ని ఎదుర్కోవచ్చని, అదెంతో చౌకని తెలుసుకొని ఒక ఇండోనేషియన్‌గా రాఫేల్‌ జెట్లను కొనుగోలు చేస్తున్నందుకు విచారపడుతున్నాను. మా అధ్యక్షుడు కొన్ని జె10 జెట్లు, ఇతర చైనా మిలిటరీ పరికరాలను కొనుగోలు చేస్తారని భావిస్తున్నాను.’’ అన్న ఎక్స్‌ పోస్టును మచ్చుకు ఉటంకించింది. ‘‘ భారత్‌ మరియు పాకిస్తాన్‌ వివాదం తరువాత చైనా ఆయుధాలకు పెరిగిన విశ్వసనీయత ’’ అనే శీర్షికతో మే 13వ తేదీన బ్లూమ్‌బెర్గ్‌ మీడియా ఒక విశ్లేషణ వెలువరించింది.ఇదేమీ చైనా అనుకూల సంస్థ కాదు. చైనాలో తయారయ్యే ఆయుధాలు నాశిరకం అనే అభిప్రాయం ఉన్నవారు మరోసారి మదింపు చేసుకోవాలని పేర్కొన్నది. తైవాన్‌ ఏర్పాటు చేసిన మేథోసంస్థ పరిశోధకుడు షు హసియావో హువాంగ్‌ మాట్లాడుతూ ‘‘ పిఎల్‌ఏ(చైనా మిలిటరీ) యుద్ధ సామర్ధ్యాల గురించి మరోసారి మదింపు చేసుకోవాల్సి ఉంది. తూర్పు ఆసియాలో అమెరికా మోహరించిన వైమానిక శక్తికి చైనా దగ్గరగా వస్తుండవచ్చు లేదా అధిగమించనూ వచ్చు ’’ అన్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది. పాకిస్తాన్‌కు అందచేసిన తరువాత దాడుల్లో తొలిసారిగా వినియోగించిన చైనా జె10సి విమానం సత్తాను రుజువు చేసుకుంది, ఇప్పటి వరకు వాటిని తైవాన్‌ జలసంధిలో పహారాకు మాత్రమే మోహరించారు. పేద దేశాలకు చైనా ఆయుధాలు ఆకర్షణగా ఉంటాయని సింగపూర్‌లోని రాజారత్నం అంతర్జాతీయ అధ్యయనాల సంస్థ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జేమ్స్‌ చెప్పటాన్ని విశ్లేషణలో ఉటంకించారు. చైనా ప్రభుత్వ సంస్థలు ఆయుధ ఎగుమతులకు సంబంధించి వివరాలను వెల్లడిరచనప్పటికీ స్టాక్‌హోంలోని సిప్రి సంస్థ అంచనా ప్రకారం గడచిన ఐదు సంవత్సరాల్లో చైనా ఎగుమతులు మూడిరతలకు పైగా పెరిగాయని బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది.


చైనా ఆయుధాలు నాణ్యమైనవి కాదనే వారు కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సివుంది. గడచిన మూడు దశాబ్దాల్లో చైనా ఆయుధ దిగుమతులను తగ్గించుకొని తానే స్వంతంగా తయారు చేసుకుంటున్నది. అత్యంత ఆధునిక ఆయుధాలను తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌కు అమెరికా విక్రయిస్తున్నది, పక్కనే ఉన్న జపాన్‌, దక్షిణ కొరియాలలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకొన్న అమెరికా అత్యాధునిక ఆయుధాలను చైనాకు వ్యతిరేకంగా మోహరించింది, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని వివాదం గావిస్తూ తనకు అనుకూలమైన దేశాలను సమీకరిస్తున్నపుడు సత్తా ఏమిటో రుజువుకాని తన ఆయుధాల మీద ఆధారపడేంత అమాయకంగా చైనా ఉంటుందా అన్నది ప్రశ్న. 2014లో దిగుమతుల్లో మనదేశం, సౌదీ అరేబియా తరువాత చైనా 5.1శాతంతో ఉంది. ఇప్పుడు 1.8శాతానికి తగ్గిపోయాయి, మొదటి పది దేశాల్లో దాని పేరు కనిపించదు.


ప్రపంచంలో ఆయుధాల దిగుమతుల్లో మూడు సంవత్సరాలుగా యుద్ధంలో ఉన్న కారణంగా ఉక్రెయిన్‌ ప్రధమ స్థానంలో ఉంది. ఏటా మనదేశం వేలాది కోట్ల ధనాన్ని వేరేదేశాలకు సమర్పించుకోవటం కంటే స్వయంగా రూపొందించుకోవటం ఆర్థికంతో పాటు ఆయుధాలకోసం ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. నరేంద్రమోడీ నాయకత్వంలో మనదేశం ఆయుధాల ఎగుమతుల రంగంలో ప్రవేశించిందని కొంత మంది ఆహా ఓహో అంటున్నారు.కొన్ని ఆయుధాలను తయారు చేస్తున్నమాట నిజం, దిగుమతులు, ఎగుమతుల్లో ఎక్కడున్నామో అతిశయోక్తులు లేకుండా చెప్పాల్సి ఉంది. ఆయుధాలను దిగుమతి చేసుకొనే పది అగ్రశ్రేణి దేశాల జాబితా నుంచి 199094 తరువాత తొలిసారిగా 2024లో చైనా పేరు తొలగించారు.అంతగా స్వంత తయారీలో ఉంది. గత ఐదు సంవత్సరాలుగా ప్రపంచ ఆయుధాల ఎగుమతుల్లో 5.9శాతంతో చైనా నాలుగవ స్థానంలో ఉంది. మూడవ స్థానానికి చేరవచ్చని చెబుతున్నారు. మనం మాత్రం పదేండ్ల నుంచి దిగుమతుల్లో మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాం. మన మేకిన్‌ ఇండియా కార్యక్రమం తీరిది. గతేడాది అంటే 202425లో మన దేశం ఎగుమతి చేసిన రక్షణ ఉత్పత్తుల విలువ రు.23,622 కోట్లని(2.76బిలియన్‌ డాలర్లు) రక్షణశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు, దీనిలో పదిహేనువేల కోట్లు ప్రయివేటు రంగం నుంచే ఉన్నాయి. 2029 నాటికి రు.50వేల కోట్ల లక్ష్యాన్ని నిర్ణయించారు. మనదేశం నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలకు రుణాలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుందో చెప్పనవసరం లేదు. మన మిలిటరీ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న దేశాలలో ఆర్మీనియా, అమెరికా, ఫ్రాన్సు అగ్రస్థానంలో ఉన్నాయి.ప్రపంచమంతటికీ ఆయుధాలను అమ్మే అమెరికా మనదగ్గర కొనేవాటిని తయారు చేసుకోలేని స్థితిలో ఉందా, కానే కాదు, వాటిని చౌకగా ఉత్పత్తి చేస్తున్నాం గనుక దానికి లాభం. హైటెక్‌ ఉత్పత్తులను అది అధికలాభాలకు మనవంటి దేశాలకు అమ్ముతున్నది.మనం ఆ స్థాయికి చేరటానికి ఇంకా చాలా సమయం పడుతుంది. పదేండ్లలో ఆయుధ దిగుమతుల్లో మన వాటా 9.5 నుంచి 8.3శాతానికి మాత్రమే తగ్గింది. వినియోగవస్తువుల ఉత్పత్తిలో చైనాను పక్కకు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారతామని చెప్పారు. అది జరగలేదు. రక్షణ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధిస్తే ఇతర దేశాల వత్తిళ్లకు గురికావాల్సిన అవసరం ఉండదు. పోనీ ఈ విషయంలోనైనా ముందడుగు పడిరదా అంటే ఇంకా చేయాల్సింది చాలా ఉందని అంకెలు చెబుతున్నాయి.పాకిస్తాన్‌ మీద జరిగిన దాడుల తరువాత తన ప్రతిష్టను పెంచుకోవటం మీదే ఎక్కువ శ్రద్ద పెడుతున్నట్లు కనిపిస్తోంది !

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్‌ రుణం : ఒక్కరూ మనవెనుక రాలే, దేశ పరువు తీశారు, అన్నీ తెలిసి నరేంద్రమోడీ జనాన్ని మభ్యపెట్టారా ?

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు


పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) రెండు ఖాతాలలో 350 కోట్ల డాలర్లు ఇచ్చేందుకు అంగీకరించింది. దీన్లో తక్షణమే వందకోట్ల డాలర్లు ఇస్తారు. వాషింగ్టన్‌ డిసిలో శుక్రవారం నాడు జరిగిన బోర్డు సమావేశం ఆమోదం తెలిపింది. ఈ మంజూరును అడ్డుకొనేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తామని ఎన్ని కబుర్లు చెప్పినా వాటిని ఖాతరు చేయకుండా రుణం ఖరారైంది. మనకు మద్దతుగా ఒక్కరంటే ఒక్క ఇతర డైరెక్టర్లు రాలేదు. ప్రపంచంలో మన పలుకుబడికి ఇది నిదర్శనమా ? పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలు, పర్యవసానాల్లో పాక్‌ను అష్టదిగ్బంధనం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో ఒకటిగా ఐఎంఎఫ్‌ నిధులు అందకుండా అడ్డుకుంటామన్న ప్రచారం తెలిసిందే. ఐఎంఎఫ్‌, దాని పని తీరు గురించి తెలిసిన వారు దేశంలో నెలకొన్న పరిస్థితులలో ప్రభుత్వం వృధా ప్రయాసకు లోనవుతున్నదని చెబితే మీ సొమ్మేం పోయింది, ఏదో ప్రయత్నం చేస్తున్నారుగా తప్పేముంది అనే వారు కొందరైతే మరి కొందరు దేశద్రోహులుగా చూసే తీరు ఉండటంతో ఎవరూ నోరు మెదపలేదని చెప్పవచ్చు. చిత్రం ఏమిటంటే పెద్ద మీడియా విశ్లేషకులు, సంపాదకులు కూడా పాఠకులను తప్పుదారి పట్టించే కథనాలను అల్లారు. సరే నరేంద్రమోడీ అండ్‌కో వచ్చిన ప్రతి అవకాశాన్నీ తమ ప్రతిష్టకు, ఓట్లు దండుకొనేందుకు ఎంత మేరకు ఉపయోగపడుతుందనే కోణంలో చూడటం కొత్తేమీ కాదు. ఇప్పుడూ జనాన్ని మభ్యపెట్టి అదే ప్రయత్నం చేశారు, భంగపడ్డారు. ఒక తర్కం ఎలా ఉందంటే కాల్పుల విరమణ షరతుల్లో భాగంగా వంద కోట్ల డాలర్ల రుణాన్ని పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్‌ ఇచ్చిందా అంటూ ఒక మీడియా వార్తకు శీర్షిక పెట్టారు. భారత్‌ దాడుల్లో తమ మిలిటరీ ఆస్తులు ధ్వంసమయ్యాయి గనుక తమకు రుణం ఇస్తే కాల్పుల విరమణ పాటిస్తామని పాకిస్తాన్‌ షరతు పెట్టి ఉండవచ్చని, అదే షరతుతో రుణం ఇచ్చి ఉండవచ్చన్నది ఒక భాష్యం. రుణానికి లంకె పెట్టి పాకిస్తాన్‌ మీద అమెరికా వత్తిడి తెచ్చిందని కూడా సెలవిచ్చారు. ఇది జరిగినదానికి విరుద్దం.


తమకు రుణం ఇవ్వకుండా చూసేందుకు భారత్‌ ప్రయత్నించినప్పటికీ ఐఎంఎఫ్‌ అంగీకరించటం పట్ల పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సంతృప్తి వెల్లడిరచినట్లు పిటిఐ వార్తా సంస్థ పేర్కొన్నది. మన ప్రధాని నరేంద్రమోడీ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే ఆర్థికశాఖ ఒక ప్రకటన చేస్తూ ఉగ్రవాదానికి ఊతమిస్తున్నందుకు రుణాన్ని బహుమతిగా ఇచ్చారని, ప్రపంచ మానవాళికి ప్రమాదకర సంకేతాన్ని పంపారని, నిధులు ఇచ్చే సంస్థలు, దాతలకు గౌరవాలకు భంగకరమని, ప్రపంచ విలువలను తక్కువగా చూసిందని విమర్శించింది.పాకిస్తాన్‌కు రుణమిస్తే ఆ మొత్తాన్ని సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగిస్తుందని, గతంలో ఇచ్చిన రుణాలను దుర్వినియోగం చేసిందని మన ప్రభుత్వం గట్టి అభ్యంతరాలను వ్యక్తం చేసింది.ఓటింగ్‌ సందర్భంగా మన నిరసన నమోదు చేసి ఓటింగ్‌ను బహిష్కరించింది.


పాక్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం.దేశ విదేశీ రుణ భారం 2024 నాటికి 130 బిలియన్‌ డాలర్లకు చేరింది. ప్రపంచ బ్యాంకు 48 బిలియన్‌ డాలర్లు ఇచ్చింది, 2025 మార్చి నెలాఖరుకు ఐఎంఎఫ్‌ ఇచ్చిన రుణాలు 6.2బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. అనేక దేశాల నుంచి చేబదులు మాదిరి సాయం పొందుతున్నది. తిరిగి కోలుకొనేందుకు, నిర్వహణకు అవసరమైన నిధి(ఆర్‌ఎస్‌ఎఫ్‌) పేరుతో 140 కోట్ల డాలర్లు, మరోఖాతా కింద 210 కోట్ల డాలర్లను ఇచ్చేందుకు సూత్రప్రాయంగా 2024 సెప్టెంబరు 25న ఐఎంఎఫ్‌ ఆమోదించింది.మార్చి నెల 25న అధికారుల స్థాయిలో ఐఎంఎఫ్‌, పాకిస్తాన్‌ రుణం గురించి ఒప్పందానికి వచ్చాయి. ఏడువందల కోట్ల డాలర్లను వంతుల వారీగా ఇస్తారు. 2025 మే నెల తొమ్మిదిన వాటి గురించి సమీక్షించి రానున్న 37నెలలో వాటిని విడుదల చేసేందుకు అంగీకరించింది. మొత్తం 700 కోట్ల డాలర్ల రుణం కావాలని పాకిస్తాన్‌ కోరింది.గతేడాది ఆగస్టు నాటికి 9.4బిలియన్‌ డాలర్లు ఉన్న విదేశీమారక ద్రవ్య నిల్వలు ఏప్రిల్‌ చివరి నాటికి 10.3బి.డాలర్లకు పెరిగాయి, వాటిని జూన్‌ నాటికి 13.9 బిలియన్లకు పెంచాలన్నది లక్ష్యం.ఆర్‌ఎస్‌ఎఫ్‌ నిధులతో ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినపుడు పునరుద్దరణ, చార్జీల వసూలుతో సహా నీటిని మరింత పొదుపుగా వాడేందుకు చర్యలు, కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం, సమాచార వ్యవస్థల మెరుగుదల వంటి అంశాలు చేపట్టాల్సి ఉంది. సవాళ్ల వాతావరణం ఉన్నప్పటికీ స్థూల అర్థిక స్దిరత్వం పునరుద్దరణ జరుగుతున్నదని ఐఎంఎఫ్‌ పేర్కొన్నది. వ్యవసాయ ఆదాయంపై పన్ను విధింపుతో సహా అనేక సంస్కరణలను చేపట్టినట్లు తెలిపింది.సకాలంలో విద్యుత్‌ ఛార్జీల సవరణ ద్వారా రుణభారం తగ్గిందని, పాకిస్తాన్‌ రిజర్వుబాంకు గట్టి చర్యల కారణంగా రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం తగ్గిందని, వ్యవస్థాగత సంస్కరణలు చేయాలని పేర్కొన్నది. నక్షత్రకుడి మాదిరి జనానికి వ్యతిరేకమైన షరతులతో పాకిస్తాన్‌ రుణాలు తీసుకున్నది. మనదేశంలో మాదిరి ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల నిలిపివేత, మూసివేత, తెగనమ్మటం, వినియోగదారుల నుంచి సేవలకు ఛార్జీలు, విద్యుత్‌ ఇతర రంగాలలో సంస్కరణల వంటివి వాటిలో ఉన్నాయి.


ఐఎంఎఫ్‌ నిబంధనల ప్రకారం ప్రతి దేశానికి ఓటింగ్‌ సంఖ్య ఉంటుంది. ఆ మేరకు ఇతర సందర్భాలలో ఓటు వేయవచ్చు. రుణాల మంజూరు విషయంలో ఏకాభిప్రాయమేగాని ఓటింగ్‌ ఉండదు. అంగీకారం లేని దేశం దూరంగా ఉండటం తప్ప వ్యతిరేక ఓటు వేసేందుకు అవకాశం లేదు. తాజాగా మనదేశం అదే చేసింది. ఐఎంఎఫ్‌లో ఓటింగ్‌ బలాబలాల విషయాన్ని చూద్దాం. అమెరికా 16.49, జపాన్‌ 6.14, చైనా 6.08. మొత్తం 25 మంది డైరెక్టర్లలో ఈ మూడు దేశాలకు ఒక్కొక్క డైరెక్టర్‌ నిరంతరం ఉంటారు. మిగిలిన 22 మందిని దేశాలతో కూడిన 22 బృందాలు వంతుల వారీ ఎన్నుకుంటాయి. ఉదాహరణకు బంగ్లాదేశ్‌,భూటాన్‌,శ్రీలంక, భారత్‌ కలసి ఒక బృందం. ఈ దేశాల నుంచి ఎవరో ఒక మాత్రమే ఉంటారు.వీటన్నింటి ఓటింగ్‌ బలం 3.05 మాత్రమే. మొత్తం ఓట్లు 49,91,063 కాగా చైనాకు 3,06,281 కాగా మన బృంద దేశాలన్నింటికీ కలిపి ఉన్నది 1,53,610 కాగా మన దేశానికి 1,32,596, బంగ్లాదేశ్‌ 12,118, శ్రీలంక 7,240, భూటాన్‌ 1,656 ఉన్నాయి. వేరే గ్రూపులో ఉన్న పాకిస్తాన్‌కు 21,762 ఉన్నాయి. ప్రస్తుతం మన దేశం నుంచి పరమేశ్వరన్‌ అయ్యర్‌ తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్నారు.


పాక్‌పై గతంలోనే ఒక అంచనాకు వచ్చిన ఐఎంఎఫ్‌ రుణం ఇవ్వకుండా ఉంటుందని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ఉగ్రవాదులకు మద్దతు, శిక్షణ ఇవ్వటం, ఇతర దేశాల మీదకు వదలటం ఇస్లామాబాద్‌కు కొత్త కాదు. తాము శిక్షణ ఇచ్చినట్లు ఆ దేశ మంత్రే స్వయంగా చెప్పాడు. అయినప్పటికీ దశాబ్దాలుగా ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ రుణాలు, గ్రాంట్లు ఇస్తూనే ఉన్నాయి. ఉగ్రవాదానికి వాటికి లంకె పెట్టలేదు.ఒక్క పాకిస్తానే కాదు, ఏ దేశానికీ అలాంటి షరతులేదు. అలాంటి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధన ఉండి ఉంటే అసలు ఏ దేశానికీ రుణం పొందే అర్హత, అవకాశం ఉండదు. ఏదో ఒక ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణ లేదా విమర్శలకు గురికాని దేశం ఒక్కటంటే ఒక్కటి లేదు. పహల్గాం ఉగ్రదాడితో నిమిత్తం లేకుండానే ముందే చెప్పినట్లు నెల రోజుల ముందే అధికారుల మధ్య కుదిరిన ఒప్పందానికి లాంఛన ప్రాయంగా ఆమోద ముద్రవేయటం తప్ప మే తొమ్మిది సమావేశానికి మరొక అజెండా లేదు. ఈ విషయాలన్నీ మన విధాన నిర్ణేతలు, పరిశీలకులకు తెలియవా ? తెలిసి కూడా జనంలో ఉన్న మనోభావాలను సొమ్ము చేసుకొనేందుకు, వ్యతిరేకిస్తున్నట్లు నాటకం ఆడారా ? ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దాయాదిని ఒంటరి పాటు చేసే క్రమంలో మిగిలిన దేశాలు కలసి వచ్చినపుడు ఒకటి రానపుడు వేరే ఎత్తుగడలను అనుసరించాల్సి ఉంటుంది. అందుకోసం తెరవెనుక ప్రయత్నాలు చేశారా ?2019లో పుల్వామా దాడికి ప్రతిగా మనం బాలాకోట్‌పై మెరుపుదాడి చేశాము. అప్పటి నుంచి లేదా అంతకు ముందు జరిగిన దాడుల నాటి నుంచి ఐఎంఎఫ్‌ లేదా ప్రపంచ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇస్లామాబాద్‌కు రుణాలు ఇస్తే వాటిని ఉగ్రవాదులకు మళ్లిస్తారని మన దేశం చేసిన ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా అంటే మీడియాలో అలాంటి ఛాయలు లేవు. అంతర్గతంగా వత్తిడి తెచ్చారేమో మనకు తెలియదు కదా అని అమాయకంగా చెప్పేవారు ఉండవచ్చు. ఆ ప్రకారం చూసినా నిజమే అనుకుంటే ఒక్కదేశం కూడా మన మాటకు గౌరవమిచ్చి మనతో పాటు కలసి రాలేదు. మన నిరసన తెలిపేందుకు బహిష్కరించామని ఇప్పుడు కొంత మంది చెబుతున్నారు. దానికి ముందు అడ్డుకుంటామని, మరేదో చేస్తామనే ప్రచార ఆర్భాటం ఎందుకు, ఆ మాటలు నమ్మి అనేక మంది నరేంద్రమోడీకి ప్రపంచంలో నిజంగానే అంత పలుకుబడి ఉందని అనుకున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల పాటు ఉక్రెయిన్‌ యుద్దాన్ని ఆపారని, చైనా, అమెరికాలను మన చుట్టూ తిరిగేట్లు చేశారనే ప్రచారాలు, భజనలూ తెలిసిందే. మన అభిప్రాయాలను ఖాతరు చేయని ఐఎంఎఫ్‌ నుంచి మన దేశం నిరసనగా తప్పుకుంటుందా ? అవమానాన్ని దిగమింగి కొనసాగుతుందా ? ఖ్యాతి అయినా అపఖ్యాతి అయినా నరేంద్రమోడీ ఖాతాలోనే పడతాయి మరి !