Tags
Acheedin, Bilkis Bano gangrape, BJP double standards, BJP hypocrisy, Manipur files, Narendra Modi Failures, price rise in india, sandeshkhali
ఎం కోటేశ్వరరావు
ఐదు వందల సంవత్సరాల నాటి కల రామాలయ నిర్మాణం జరిగింది, ఇక రామరాజ్యమే తరువాయి అని నరేంద్రమోడీ భక్తులు జనాన్ని నమ్మించేందుకు చూస్తున్నారు. కొందరైనా నిజమే అనుకుంటున్నారు. మరోవైపు రామరాజ్యం గురించి నేతలు చెబుతున్నదేమిటి ? దేశంలో జరుగుతున్నదేమిటి ? పదేండ్ల క్రితం నరేంద్రమోడీ అచ్చేదిన్(మంచి రోజులు) గురించి చెప్పారు. ఇప్పుడు కొత్తగా హామీలు, గారంటీలు అనే కొత్త పల్లవి ఎత్తుకున్నారు తప్ప దాని ఊసే ఎత్తటం లేదు. ఆడిన మాట తప్పని వారసులు కదా , పాతవాటిని చెప్పరు ! రాముడి సుగుణాల గురించి చెప్పేవారు తండ్రి మాట జవదాటని ఉత్తముడు అంటారు. ఆ రాముడిని ఆదర్శంగా తీసుకున్నాం అని చెప్పుకొనే నరేంద్రమోడీ అచ్చేదిన్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు, మంచి రోజులు వస్తే వచ్చాయని లేకపోతే ఎంతకాలం పట్టేది చెప్పాలా లేదా ? అసలు రామరాజ్యం అంటే ఏమిటి ? నరేంద్రమోడీ, బిజెపి గత పది సంవత్సరాల కాలంలో వాటిలో ఏ ఒక్కదాన్ని అయినా పాటించిందా ? గుజరాత్‌లో గోద్రా రైలు దగ్దం తరువాత జరిగిన మారణకాండ సమయంలో మోడీ రాజధర్మం పాటించాలని ఏకంగా అతల్ బిహారీ వాజ్‌పాయి చెప్పాల్సి వచ్చిందంటే తండ్రి మాట ప్రకారం అరణ్యవాసం వెళ్లిన రాముడి ఆదర్శాన్ని ఉల్లంఘించినట్లే కదా, ముఖ్యమంత్రిగా చేయాల్సింది చేయాలన్నారు తప్ప గద్దె దిగాలని వాజ్‌పాయి చెప్పలేదు. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడి పాలనలో ఏ మహిళా వితంతువు కాలేదు, క్రూరమృగాల నుంచి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. రోగాల గురించి భయం లేదు. ప్రపంచానికి బందిపోట్ల బెడదతప్పింది.తాము పనికిరాని వారమని ఎవరూ భావించలేదు.యువకులకు ముసలి వారు కర్మకాండలు చేయలేదు. అందరూ సంతోషపడ్డారు. సకల జనులూ ధర్మం మీద కేంద్రీకరించారు. అందరూ ఒక ఆదర్శపురుషుడిగా రాముడి వైపే చూశారు. ఒకరిని ఒకరు చంపుకోలేదు.అంతర్జాలం(ఇంటర్నెట్)లో ఉన్న సమాచారం ప్రకారం (వాల్మీకి రామాయణం, యుద్ధకాండ, సర్గ 128, 95 నుంచి 106 శ్లోకాలు) రాముడి పాలనలో జనాలు అవాస్తవాలు చెప్పకుండా ధర్మం మీదనే కేంద్రీకరించారు. అందరూ అద్భుతమైన వ్యక్తిత్వ లక్షణాలను కలిగి ఉన్నారు. అందరూ ధర్మానికి కట్టుబడి ఉన్నారు. ఆ విధంగా రాముడు వేలాది సంవత్సరాలు రామరాజ్యన్ని ఏలాడు.
అబ్బే ఇప్పుడు చెబుతున్నది అసలైన సనాతన ధర్మం కాదు అని చెప్పేవారు కొందరు. వర్తమాన భాష్యాలతో ఉన్న మనుస్మృతిని రాముడు అసలు పాటించలేదు. రాజగురువు, ప్రధాన సలహాదారైన బ్రహ్మరిషి విశ్వామిత్ర మార్గదర్శనంలో వశిష్ట ధర్మ సూత్రాలను పాటించాడు అని చెప్పేవారు కొందరు.ఇప్పుడు ఏది ఉనికిలో ఉందో, దాని సంగతి ఏమిటో, వేల సంవత్సరాలుగా అది కలిగించిన దుష్టప్రభావానికి కారణం ఏమిటో మాత్రం చెప్పరు.సనాతన ధర్మాన్ని పాటించాలి, పరిరక్షించాలి అంటున్నారు. దీని అర్ధం రాజ్యాంగాన్ని ఆ విధంగా తిరగరాయమనా ? ఇక నిత్యం రామభజన చేస్తున్నవారు, రామరాజ్యం గురించి చెబుతున్నవారేమంటున్నారు.2024 జనవరి 16వ తేదీ పత్రికల్లో వచ్చిన ఒక వార్త శీర్షిక ఇలా ఉంది.” రామరాజ్య నియమాలనే ప్రభుత్వం అనుసరిస్తున్నది, ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు చేస్తున్నది : ప్రధాని మోడీ ”. ఆయోధ్యలో రామాలయ ప్రతిష్ట కార్యక్రమానికి ముందు పదకొండు రోజుల అనుష్ఠానంతో దేశంలో వివిధ గుళ్లు గోపురాలను సందర్శించిన సందర్భంగా నరేంద్రమోడీ రామచరిత మానసతో సహా అనేక హిందూ పురాణాలను ఉటంకిస్తూ చెప్పిన మాటలకు పెట్టిన పేరది. నిష్టలో ఉన్న మోడీ వాస్తవాలను చెప్పారా, మరొకటా ? గడచిన తొమ్మిది సంవత్సరాలలో పాతిక కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటపడవేసినట్లు,పది కోట్ల మంది నకిలీ లబ్దిదారులను ఏరివేసినట్లు కూడా చెప్పారు.( ఇంత ప్రగతి సాదించి రామరాజ్యాన్ని నెలకొల్పితే ఎనభై కోట్ల మందికి మరో ఐదు సంవత్సరాల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నట్లు ఎందుకు ప్రకటించినట్లు ? దారిద్య్రం నుంచి బయటపడినా నెలకు ఐదు కిలోల ధాన్యం కూడా కొనుగోలు చేయలేని దుస్థితిలో జనం ఉన్నారని అర్ధమా ? రామరాజ్యంలో ఇలాగే ఉందా ? )
అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ గారు మరొక అడుగు ముందుకు వేసి బిజెపి జాతీయ సమావేశంలో మాట్లాడుతూ రామరాజ్య భావనను ప్రధాని మోడీ ఎంతో సమర్దవంతంగా అమలు జరిపినట్లు, రామరాజ్యం సిద్ధించినట్లు ఆకాశానికి ఎత్తారు. దానికి వికసిత భారత్ అని ముద్దుపేరు పెట్టారు. రాముడు పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం గడిపినట్లు రామాయణం చెబితే యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఐదు వందల సంవత్సరాల తరువాత రాముడు ఆయోధ్యకు వచ్చాడని చెప్పారు. వికసిత భారత్ తీర్మానంలో పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన దారుణాలను ఖండిస్తూ ఒక మహిళ పాలనలో ఇలా జరగటం సిగ్గుచేటని బిజెపి పేర్కొన్నది. నిజమే, కానీ బిజెపి రామరాజ్య పాలనలో మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించటం మర్యాదా, సిగ్గుచేటా ? కనీసం అలాంటి ఉదంతం జరగటం విచారకరం అని కూడా ప్రకటించని మర్యాద పురుషోత్తములు.బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ మహిళా రెజ్లర్స్‌ను లైంగికంగా వేధించిన సంఘటనలు దేశంలో కలిగించిన సంచలనం తెలిసిందే.ఇక గుజరాత్ బిల్కిస్ బానూ ఉదంతం తెలిసిందే. ఆమె మీద జరిగిన సామూహిక అత్యాచారం కేసులో యావజ్జీవ శిక్షలు పడిన వారు సత్ ప్రవర్తన కలిగిన బ్రాహ్మణులని కితాబు నిస్తూ శిక్ష పూర్తిగాక ముందే విడుదల చేసి సన్మానాలు చేసిన రామభక్తులను దేశం మరచిపోగలదా ! సుప్రీం కోర్టు ఆ నిర్ణయాన్ని రద్దు చేసి తిరిగి వారిని జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఇవన్నీ అపర శ్రీరాముడి ఏలుబడిలో జరిగినవే సుమా ? ఒక్కో ఉదంతం పట్ల ఒక్కో వైఖరి, శ్రీ రామరాజ్యంలో ఇలాగే జరిగిందా?
అయోధ్య రామరాజ్యంలో రోగాల భయం లేదని చెబుతారు. కానీ అపర శ్రీరామ చంద్రుడిగా నీరాజనాలు అందుకుంటున్న నరేంద్రమోడీ రామరాజ్యంలో ఎనిమిది సంవత్సరాల ఏలుబడి తరువాత 2022లో ప్రపంచంలో బయటపడిన టిబి కేసుల్లో భారత్‌లో నూటికి 27 ఉన్నాయి.2025 నాటికి ఆ వ్యాధిని అంతరింప చేస్తామని 2023లో మన దేశంలో జరిగిన ప్రపంచ టీబి సభలో దీక్షపూనారు. జరిగేదేనా ? దేశంలో ఆరోగ్యం మీద చేస్తున్న ఖర్చు ఏడాదికేడాది తగ్గిపోతున్నది. జనాభాలో అగ్రదేశంగా ఎదిగామని, దీనితో అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పుకుంటే చాలదు.వారంతా ఆరోగ్యంగా ఉంటేనే, లేకపోతే జరిగే నష్టం ఎక్కువ.కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య ఖాతాకు 2021-22లో 3.6శాతం కేటాయించగా మరుసటి ఏడాదికి అది 2.7కు, 2023-24కు 2.4శాతానికి కోత పడింది.2022-23కేటాయింపులో సవరించిన బడ్జెట్‌లో మరో15శాతం కోత విధించారు.ఇక జిడిపి పరంగా చూస్తే 2020-21లో1.23శాతం ఉన్నది 2023 ఆర్థిక సంవత్సరంలో 1.19, మరుసటి సంవత్సరం 1.17శాతానికి తగ్గింది. ప్రపంచ ఆర్థికవేదిక, ప్రజారోగ్య హార్వర్డ్ స్కూలు అధ్యయనం 2014 ప్రకారం వ్యాధులు, మానసిక అనారోగ్యం కారణంగా 2012 – 2030 కాలంలో 4.58లక్షల కోట్ల డాలర్ల మేర మన దేశం నష్టపోనుందని అంచనా. దీనిలో గుండె సంబంధిత వ్యాధుల వలన 2.17లక్షల కోట్ల డాలర్లు, మానసిక రుగ్మతల కారణంగా 1.03లక్షల కోట్ల డాలర్లు నష్టమని పేర్కొన్నారు.(టైమ్స్ ఆఫ్ ఇండియా 2023 ఏప్రిల్ ఏడవ తేదీ సంచికలో ఐదులక్షల కోట్లడాలర్ల జిడిపి కల మీ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంది అనే శీర్షికతో ప్రచురించిన విశ్లేషణ).2019లో గాలి కాలుష్యంతో తలెత్తిన అనారోగ్యం వలన జిడిపికి 1.36శాతం నష్టం(36.8 బిలియన్ డాలర్లు) జరిగింది.
ఇక అచ్చేదిన్ తీరు తెన్నులు చూద్దాం. నాలుగు సంవత్సరాల నరేంద్రమోడీ ఏలుబడి తరువాత 2018-2023 ఆగస్టు వరకు వివిధ రాష్ట్రాలలో ఉన్న నిత్యావసర వస్తువుల ధరల గురించి కేంద్రమే ప్రకటించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించిన సమాచారాన్ని 2023 ఆగస్టు నాలుగవ తేదీన రాజ్యసభలో వినియోగదారుల శాఖ మంత్రి అశ్వనీకుమార్ చౌబే ఇచ్చిన రాతపూర్వక సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో కొన్ని సరకుల ధరల పెరుగుదల తీరుతెన్నులు దిగువ విధంగా ఉన్నాయి.కిలో ఒకటికి రు.లలో, బియ్యం సాధారణ రకం. కొన్ని రాష్ట్రాలలో ధరలు ఇంకా ఎక్కువగా కూడా ఉన్నాయి. ఈ పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు, కుటుంబాల ఆదాయం పెరిగిందా అన్నది ప్రశ్న.
.రాష్ట్రం×× ఏడాది × బియ్యం ×గోధుమ×కందిపప్పు×మినప××పల్లీ నూనె×సన్‌ఫ్లవర్×బంగాళాదుంప
తెలంగాణా 2018 ×× 28.05 ××27.61 ××75.30 ××80.85 ×× 108 ×× 86.45 ××22.17
తెలంగాణా 2023 ×× 44.79 ××37.20 ××111.70 ××111 ××169.20××149.10 ××27.15
ఆంధ్ర ప్రదేశ్ 2018×× 31.63 ×× 29.08××66.41 ××73.19 ××106.90 ××87.76 ××19.06
ఆంధ్రప్రదేశ్ 2023 ×× 51.52 ××40.96 ××122.80 ××120 ××176.20 ××140.30 ×× 30.76
అచ్చేదిన్ అంటే ఏటిఎంలో డబ్బు మాదిరి వెంటనే రావని అనుకుందాం. కానీ పదేండ్ల తరువాత పరిస్థితిని చూసిన తరువాత కూడా మోడీ గ్యారంటీలను నమ్మగలమా ? గడచిన పది సంవత్సరాల్లో ధరలు 62శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అవన్నీ తప్పు అనుకొనే వారిపట్ల జాలిచూపటం తప్ప ఏమీ చేయలేం, అనలేం. నెలవారీ తలసరి వినియోగ ఖర్చుకు(ఎంపిసిఇ) సంబంధించిన సమాచారం ఇటీవలనే అందుబాటులోకి వచ్చింది.దాని ప్రకారం 1999-2000 నుంచి 2022-23వరకు వినియోగ ఖర్చు గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తోంది. పులిమీద పుట్ర మాదిరి 2012-13 నుంచి పది సంవత్సరాల కాలంలో గోడదెబ్బ-చెంపదెబ్బ అన్నట్లు ద్రవ్యోల్బణం పెరుగుదల, నిజవేతనాలు గిడసబారటంతో అనేక మంది జీవితాలు దిగజారి దుర్భరమయ్యాయి. ఆదాయం పెరిగిన కొద్దీ పరిస్థితి మెరుగుపడిందని చెప్పిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఉదాహరణకు నెలకు లక్షరూపాయల పైబడి రాబడి వచ్చేవారిలో 55శాతం మంది మెరుగ్గా ఉన్నట్లు చెప్పగా 25శాతం మంది దిగజారినట్లు చెప్పారు.వివరాలు దిగువ విధంగా ఉన్నాయి. దీన్ని బట్టి ఎవరికి వారు ఏ తరగతిలో ఉన్నదీ, గడచిన పది సంవత్సరాల్లో పరిస్థితి మెరుగుపడిందా, దిగజారిందా అన్నది అవలోకించుకోవచ్చు.
రాబడి××××××××× మెరుగుదల×× దిగజారుడు
లక్షకుపైగా ×××××× 55 ×× 25
50వేలు-లక్ష ××××× 47 ×× 30
25-50వేలు ××××× 38 ×× 38
10-25వేలు ××××× 32 ×× 44
5-10వేలు ××××× 28 ×× 52
5వేలలోపు ××××× 21 ×× 62
మన దేశంలో మధ్య తరగతి అంటే ఏమిటన్నదానికి నిర్దిష్టమైన నిర్వచనం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాను మధ్య తరగతికి చెందిన మహిళను గనుక వారి ఇబ్బందులు తెలుసు అని చెప్పారు. మంత్రిగా ఆమె రాబడి స్వయంగా ఇచ్చిన వివరాల ప్రకారం 2016-17లో రు. 5,85,580 ఉండగా 2018-19లో రు. 10,62,250, మరుసటి ఏడాది 10,38లక్షలకు, 2020-21లో 8.08లక్షలని పేర్కొన్నారు. ఇక ఆమెకు ఉన్న చరాస్తులు రు.63.39లక్షలని, స్థిరాస్తులు రు.1.87 కోట్లని పేర్కొన్నారు. ప్రైస్ రీసర్చ్ అనే సంస్థ నిర్వచనం ప్రకారం ఏడాదికి రు.30లక్షలకు మించి సంపాదించే వారు ధనికులు, 5 నుంచి 30లక్షల వరకు మధ్య తరగతి, 1.5 నుంచి 5 లక్షల వారు తరువాత తరగతి, 1.25లక్షల కంటే తక్కువ వచ్చేవారు అభాగ్యులు.మాస్టర్ కార్డు 2021లో పేర్కొన్నదాని ప్రకారం దేశంలోని ఎగువ 20శాతం మంది ధనికులు ఏటా రు.3,94,271 సంపాదిస్తున్నారు, మధ్యతరగతి రు.1,51,651, పేదలు రు.80,529 సంపాదిస్తున్నారు.అప్లయిడ్ ఎకనమిక్ రిసర్చ్ జాతీయ మండలి 2010లో సేకరించిన సమాచారం ప్రకారం మధ్య తరగతి అంటే రెండు-పది లక్షల మధ్య సంపాదించేవారు, తరువాత తరగతి 90వేల నుంచి రెండులక్షలు, అభాగ్యులు తొంభైవేల కంటే తక్కువ సంపాదించే వారు అని పేర్కొన్నారు. దీన్ని బట్టి మనం రామరాజ్యంలో ఉన్నామో లేదో , ఏ తరగతిలో ఉన్నామో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి.
