Tags
Bilkis Bano gangrape, BJP, Gouri lankesh, Gurmeet Ram Rahim Singh, Hinduthwa, Narendra Modi Failures, Pawan kalyan, RSS, Sanatan Hindu Dharma, VHP
ఎం కోటేశ్వరరావు
తాను పక్కా సనాతనవాదినంటూ పవన్ కల్యాణ్ ఊగిపోతూ చెప్పారు, చెబుతూనే ఉంటారు. ఎందుకంటే సనాతనవాదం పులి స్వారీ వంటిది. ఒకసారి పులినెక్కిన వారు అది ఎక్కడికి తీసుకుపోతే అటు పోవాల్సిందే. ఊహలు, కంప్యూటర్ గ్రాఫిక్స్, సినిమాలు, సాహిత్యంలో తప్ప చరిత్రలో పులిని అదుపుచేసిన వారు ఎవరూ లేరు. పవన్ కల్యాణ్ ప్రస్తానం ఎలా ఉంటుందో చూద్దాం. వారాహి ప్రకటన సందర్భంగా చేసిన సనాతన విన్యాసాల మీద సామాజిక మాధ్యమంలో అనేక మంది అంతకంటే ఎక్కువగా స్పందించి చీల్చి చెండాడుతూ సంధించిన ప్రశ్నలకు ఎక్కడా సమాధానం రాలేదు.బహుశా ఇలా జరుగుతుందని అనుకొని ఉండరు.భావజాల పోరులో ఎదుటి వారి మీదికి బంతిని ఎంత వేగంగా విసిరితే అంతే వేగంగా తిరిగి వస్తుంది. తగ్గేదేలేదని చరిత్ర నిరూపించింది. సనాతన ధర్మమునందు విడాకులు లేవు అంటూ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన మాటలనుపవన్ కల్యాణ్ సుభాషితాలను కలిపిన ఒక పోస్టు సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. దాన్ని తనకు వర్తింప చేసుకొని ఎలా సమర్ధించుకుంటారో తెలియదు.
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారి మీద విరుచుకుపడిన మాటలు ఇంకా చెవుల్లో గింగురు మంటుండగానే సనాతనులకు తామే బ్రాండ్ అంబాసిడర్లమని చెప్పుకొనే వారు చేసిన పనికి సభ్య సమాజం సిగ్గుపడిరది. అఫ్‌కోర్సు వారిలో కట్టర్ హిందూత్వవాదులు ఉండరనుకోండి. ప్రముఖ జర్నలిస్టు, పురోగామివాది, హిందూత్వ వ్యతిరేకి అయిన గౌరీ లంకేష్‌ను కాల్చి చంపిన కేసులో నిందితులైన పరశురామ్ వాగ్మోరే, మనోహర్ యెదవే అనే వారిని కర్ణాటక సనాతన లేదా హిందూత్వశక్తులు విజయపురాలో 2024 అక్టోబరు 11న సన్మానించాయి. గౌరీ లంకేష్‌ను 2017 సెప్టెంబరు ఐదవ తేదీన కాల్చిచంపారు. బెంగలూరు సెషన్స్ కోర్టు అక్టోబరు తొమ్మిదవ తేదీన జారీ చేసిన ఆదేశాల మేరకు ఎనిమిది మంది నిందితులకు బెయిలు మంజూరు చేసింది. దీంతో మొత్తం 18 మందిలో 16 మంది బెయిలు మీద బయటకు వచ్చారు. మిగిలిన ఇద్దరిలో శరద్ కలాస్కర్ అనే వాడు మహారాష్ట్ర హేతువాది నరేంద్ర దబోల్కర్ హత్యకేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కారణంగా లోపలే ఉన్నాడు. వికాస్ పాటిల్ అనే వాడిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. పైన పేర్కొన్న ఇద్దరు నిందితులు కన్నడ పత్రిక వార్తా భారతి కథనం ప్రకారం తమ స్వస్థలం విజయపుర వెళ్లినపుడు కాళికాదేవి గుడిలో పూజలు చేశారు, సంఘపరివార్(ఆర్‌ఎస్‌ఎస్), శ్రీరామ్ సేన కార్యకర్తలు వారికి సన్మానం చేశారు, శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన హిందూత్వ నేతలు వారిద్దరినీ ఆరేళ్లుగా అన్యాయంగా జైల్లో ఉంచారని, విజయదశమి సందర్భంగా వారిని విడుదల చేయటం సంతోషమని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ ఈ వార్తను చదివారో లేదో తెలియదు. ఒకవేళ చదివినా ఆ కేసులోని వారు ఇంకా నిందితులే తప్ప నేరం రుజువు కాలేదుగా అని లా పాయింట్ తీసి ‘‘సనాతనుల’’ను సమర్ధించవచ్చు. అందుకే మరికొన్ని ఉదంతాలను పేర్కొనాల్సి వస్తోంది. గుజరాత్‌లో బిల్కిస్ బానూ అనే మహిళపై గోద్రా అనంతర మారణకాండ సందర్భంగా సామూహిక అత్యాచారం చేసి ఆమె కుటుంబ సభ్యులందరినీ హత్య చేసిన సంగతి తెలిసిందే. అత్యాచార కేసులో నేరగాండ్లలో పరివర్తన కలిగి మంచివారుగా మారారంటూ అక్కడి సనాతనవాదుల ఏలుబడిలోని రాష్ట్ర ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. ఆ సందర్భంగా వారిని సనాతన ధర్మాన్ని లేదా హిందూత్వను కాపాడేందుకు కంకణం కట్టుకున్నట్లు చెప్పుకొనే విశ్వహిందూపరిషత్ నేతలు వారికి సన్మానం చేసి, మిఠాయిలు పంచారు. సుప్రీం కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ప్రకారం అత్యాచారం కేసులో యావజ్జీవిత శిక్షపడిన వారు జైల్లో ఉండాల్సిందే. అయితే సదరు సదాచార సనాతనుల కేసులో ఆ తీర్పు రాక ముందే శిక్ష విధించినందున తరువాత వచ్చిన తీర్పు వారికి వర్తించదని, పాత నిబంధనల ప్రకారం వారి సత్ప్రవర్తకు మెచ్చి మేకతోలు కప్పి ముందుగానే జైలు నుంచి విడుదల చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. అయితే సుప్రీం కోర్టు ఆ చర్యను తప్పు పట్టి నేరగాండ్లను తిరిగి జైలుకు పంపింది. అత్యాచారాలకు పాల్పడిన వారిని ఉరితీయాలని ఒకనాడు నినదించిన మన సభ్యసమాజం నేడు నేరగాండ్లకు పూలదండలు వేసి సత్కరిస్తే మౌనంగా ఉండిపోయిందంటే మన చర్మాలు ఎంతగా మొద్దుబారిందీ తెలుస్తున్నది. దేన్నయినా సమర్ధించే బాపతు తయారవుతున్నారు. దీని మీద పవన్ కల్యాణ్ ఏమంటారో ? అంతేనా !
సకల కళావల్లభుడిగా పేరుగాంచిన హంతకుడు, ఇద్దరు మహిళలపై అత్యాచార నేరగాడు డేరా సచా సౌదా ప్రవచకుడు గర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) జీవిత ఖైదు అనుభవిస్తూ బెయిలు మీద వచ్చినపుడు హర్యానా బిజెపి నేతలు ఆశీస్సులు పొందారు. అతగాడి అనుచరుల ఓట్లు పొందేందుకు గాను తాజా హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెరోల్ మీద బిజెపి ప్రభుత్వం విడుదల చేసిందనే విమర్శలు వచ్చాయి.2018లో జమ్మూలోని కథువాలో ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారికి మద్దతుగా అక్కడ హిందూ ఏక్తా మంచ్ పేరుతో జరిపిన ప్రదర్శన తెలిసిందే.మహిళను దేవతగా కొలిచే సమాజంలో దాని గురించి రోజూ ప్రవచనాలు చెప్పేశక్తులే ఈ ఉదంతాలకు పాల్పడ్డాయంటే దేశం ఎటుపోతోందని కాదు, కొంత మంది ఎటు తీసుకుపోతున్నారో జనం ఆలోచించాలి. రామ్ రహీమ్‌కు 2017లో శిక్ష పడిరది, అప్పటి నుంచి ఉత్తరాదిన ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ పెరోలు ఇవ్వటం గమనించాల్సిన అంశం.
బిల్కిస్ బానూ ఉదంతంలో నేరగాండ్లను సమర్దించటంలో మతాన్ని కూడా జోడిరచిన దుర్మార్గం, దాన్నినిస్సిగ్గుగా సమర్ధించిన ఉన్మాదం కనిపిస్తుంది. వారంతా సనాతనులే.మతాలతో నిమిత్తం లేకుండా అత్యాచారం ఎవరి మీద జరిగినా దాన్ని ఖండిరచాల్సిందే. తమ నేతల ప్రమేయం ఉన్న ఉదంతాల పేరెత్తటానికి సనాతన నరేంద్రమోడీ సిగ్గుపడి ఉంటారు. 2014లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఢల్లీి నిర్భయ కేసును పేరు పెట్టి ప్రస్తావించిన ఆ పెద్దమనిషి తమ ఏలుబడిలో జరిగిన కథువా, ఉన్నావో అత్యాచారాల తరువాత మాట్లాడుతూ సాధారణ పరిభాషలో ఖండిరచారే తప్ప వాటి ప్రస్తావన ఎక్కడా తేలేదు. ఎందుకంటే కథువా ఉదంతంలో నిందితులకు మద్దతుగా బిజెపి మంత్రులు కూడా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. వారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సి ఉండగా విమర్శలు పెరగటంతో తీరికగా తరువాత రాజీనామా చేయించారు. ఉన్నావో ఉదంతంలో బిజెపి ఏంఎల్‌ఏ దోషి, ఇప్పుడు జీవిత కాలఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. ఏమీ తెలియని అమాయకుడు, అన్యాయంగా ఇరికించారంటూ అతగాడిని రక్షించేందుకు అనేక మంది ఎంఎల్‌ఏలు, బిజెపి పెద్దలు, పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎడిఆర్ అనే స్వచ్చంద సంస్థ మహిళల మీద నేరారోపుణలు తమ మీద ఉన్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్న 48 మంది ఎంఎల్‌ఏలు, ముగ్గురు ఎంపీల వారిలో సనాతన ధర్మ పరిరక్షణ గురించి రోజూ కబుర్లు చెప్పే బిజెపికి చెందిన వారు 14 మంది, తాము కూడా అదే బాటలో నడుస్తామని చెప్పే శివసేనకు చెందిన వారు 7గురు, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన వారు ఆరుగురు ఉన్నారు.
హర్యానాలోని ఆరు జిల్లాలు, పక్కనే ఉన్న పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో డేరా బాబా అనుచరులు ఉన్నారు. ప్రధానంగా దళిత సామాజిక తరగతికి చెందిన వారు. వారి ఓట్ల కోసం పడేపాట్లు ఇవి.వ్రతం చెడ్డా బిజెపికి ఫలం దక్కలేదని పరిశీలకులు చెబుతున్నారు.డేరా బాబా పలుకుబడి ఉందని భావిస్తున్న ఆరు జిల్లాల్లో 28 అసెంబ్లీ సీట్లుండగా బిజెపి గెలిచింది పది చోట్ల మాత్రమే, కాంగ్రెస్ 15 గెలుచుకుంది. గత రెండు సంవత్సరాల్లో రాష్ట్ర బిజెపి ప్రభుత్వం డేరాబాబాకు పదకొండుసార్లు బెయిలు ఇచ్చి బయటకు వదిలింది. ఏడు సార్లు వేర్వేరు చోట్ల ఎన్నికలకు ముందు బెయిలు ఇచ్చారు. తాజాగా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అదే జరిగింది. బిజెపికి ఓటు వేయాల్సిందిగా అనుచరులకు సందేశం పంపాడు. అతగాడి ఆశ్రమం ఉన్న సిర్సా జిల్లాలోని ఐదు అసెంబ్లీ సీట్లలో బిజెపికి ఒక్కటి కూడా దక్కలేదు. మూడు కాంగ్రెస్‌కు రెండు ఐఎన్‌ఎల్‌డికి వచ్చాయి. బిజెపితో పోటీ పడి కొందరు కాంగ్రెస్ నేతలు కూడా డేరాబాబా ఆశీసుల కోసం ప్రదక్షిణలు చేశారు. సనాతనవాదుల మందలో కొత్తగా చేరిన పవన్ కల్యాణ్ తాను ఎన్నో చదివానని చెప్పిన తరువాత ఆ వాదాన్ని భుజానవేసుకున్నారు గనుక అమాయకుడని అనుకోలేం. సినిమా రంగం మనిషి, అక్కడ ఏ ఫార్ములా నాలుగు డబ్బులు తెస్తే పొలోమంటూ మిగతావారూ దాన్నే అనుసరిస్తారు.
సనాతనంహిందూత్వ ఫార్ములా ఓట్లు రాల్చేదిగా ఉందని బిజెపి దాన్ని ఎప్పటి నుంచో రంగంలోకి తెచ్చింది. సవ్యసాచి మాదిరి సినిమాలతో పాటు రాజకీయాలను కూడా చేయాలనుకుంటున్నారు గనుక పవన్ కల్యాణ్ సనాతన ఫార్ములాను ఎంచుకున్నారని భావించవచ్చు. దీని వెనుక ఉన్న కారణాల గురించి కూడా చర్చ జరుగుతున్నది. మర్రి చెట్టువంటి చంద్రబాబు నాయుడి నీడలో ఎంతకాలం ఉన్నా ఎదుగూ బొదుగూ ఉండదు కనుక తాను ప్రత్యేకంగా కనిపించాలంటే సనాతనాన్ని భుజాన వేసుకున్నట్లు కొందరు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతు మీద ఆధారపడిన తాము ఆంధ్రప్రదేశ్‌లో హిందూత్వ అజెండా అమలు జరిపితే రాజకీయంగా ఇబ్బందులు తలెత్తవచ్చు గనుక శిఖండిలా పవన్ కల్యాణ్ణు రంగంలోకి దించిందని కూడా చెబుతున్నారు. హిందూమతంలో సంస్కరణలు తేవాలని ఆర్య(మహత్తర)సమాజాన్ని స్థాపించిన దయానంద సరస్వతిని సనాతన వాదులు కుట్ర చేసి చంపారనే విమర్శలు ఉన్నాయి. కొంత మంది తాము వేదాలను ప్రమాణంగా తీసుకుంటామని అదే సనాతన ధర్మమని అందమైన ముసుగువేసుకుంటారు. ఇది వేదకాలం కాదు, మనువాదులు అమలు జరుపుతున్న కుల,మత సమాజం.వేదాలను ప్రామాణికంగా తీసుకొనే వారేమీ కులమతాలకు అతీతంగా లేరు గనుక ఉన్న దుర్మార్గపూరిత వ్యవస్థను ఏదో ఒక పేరుతో సమర్ధించేవారిగానే పరిగణించాలి. పవన్ కల్యాణ్ కూడా ఆ తెగకు చెందిన వారే. అయితే ఐదు పదులు దాటిన ఆ పెద్దమనిషి గ్రహించాల్సిందేమంటే హిందూత్వ నినాదం పనిచేయటం వెనుక పట్టు పట్టిన తరుణంలో దాన్ని ఎంచుకున్నారు. ఆయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలోనే బిజెపి మట్టి కరచింది.వారణాసిలో నరేంద్రమోడీ మెజారిటీ గణనీయంగా పడిపోయింది.
మహనీయుడు అంబేద్కర్ దృష్టిలో సనాతన ధర్మం అంటే వేద,బ్రాహ్మణిజం అన్నది స్పష్టం.ఆయన కాలంలో కులమతాలు, అంతరాలు లేవని చెబుతున్న వేదకాలము లేదూ వేదాలకు అనుగుణంగా పాలనా లేదు.మనువాదం మాత్రమే ఉంది. అందుకే వేదాల జోలికి పోకుండా మనుధర్మ శాస్త్రాన్నే తగులపెట్టారు. మనువాదులు తాము చెప్పేదానినే సనాతన ధర్మమని భాష్యం చెబుతున్నారు, ఇప్పటికీ మన కళ్ల ముందు కనిపిస్తున్నది వారే. అందువలన ఎవరైనా సనాతనాన్ని వ్యతిరేకిస్తున్నారంటే మను ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నట్లే, దాన్ని పరిరక్షించాలని, విమర్శించేవారిని సహించబోమని పవన్ కల్యాణ్ వంటి వారు చెబుతున్నారంటే అంబేద్కర్‌ను కూడా వ్యతిరేకించుతున్నట్లే. ఉనికిలో లేని వేదకాల సనాతనంతో ఎవరికీ ఇబ్బంది లేదు,అమలులో ఉన్న మనుసనాతనం, అది సృష్టించిన వివక్షను నిర్మూలించాలా లేదా ?
