Tags
anti china, China, Dalai Lama, Dalai Lama succession row, Kiren Rejiju, Narendra Modi Failures, Xi Jinping
ఎం కోటేశ్వరరావు
పద్నాలుగవ దలైలామా 90వ జన్మదినోత్సవం హిమచల్ ప్రదేశ్ ధర్మశాలలో లిటిల్ లాసాగా పిలిచే మెక్‌లియోడగంజ్‌లో జూలై ఆరవతేదీ ఆదివారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు కిరణ్ రిజుజు, లాలన్ సింగ్ హాజరయ్యారు.ఒక భక్తుడిగా దలైలామా నిర్ణయమే తనకు శిరోధార్యమని, మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా కిరణ్ రిజుజు పునరుద్ఘాటించారు. దలైలామా వారసుడి గురించి కొద్ది రోజులుగా పెద్ద రచ్చే జరిగింది.పరిణామాలు, పర్యవసానాల గురించి భయపడిన టిబెట్ బౌద్ద దలైలామా టెంజిన్ జియాట్సో ఆ వివాదానికి తాత్కాలికంగా తెరదించారు. సుగలాగ్‌ఖాంగ్ ప్రధాన బౌద్ద ఆలయంలో దీర్ఘకాలం ఆయన జీవించాలని కోరుతూ జరిపిన ప్రార్ధనల సందర్భంగా మాట్లాడుతూ తాను మరో 30 నుంచి 40 సంవత్సరాలు జీవిస్తానని ప్రకటించారు. ‘‘ అనేక జోశ్యాలను చూసినపుడు అవలోకితేశ్వర ఆశీస్సులు ఉన్నట్లు భావించాను. ఇప్పటి వరకు చేయగలిగిందంతా చేశాను. ఇంకా 30`40 సంవత్సరాలు జీవించగలనని అనుకుంటున్నాను , ఇప్పటి వరకు మీ ప్రార్ధనలు ఫలించాయి. మనం దేశాన్ని కోల్పోయినప్పటికీ భారత్‌లో ప్రవాసం ఉంటున్నాము. ఇక్కడ నేను ఎన్నో పొందాను, ధర్మశాలలో నివసిస్తున్న వారంతా కూడా అలాగే లబ్దిపొందాలని, నేను చేయగలిగిన సేవ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. అంతకు ముందు తనవారసుడు చైనా వెలుపలే జన్మిస్తాడని చేసిన ప్రకటన వివాదాన్ని రేపింది.
దలైలామా తరువాత ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో తెలియదు గానీ మనదేశం చైనా అంతర్గత వ్యవహారమైన వారసుడి విషయంలో అనవసరంగా వేలుబెట్టి చైనాతో చెప్పించుకొని, సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇది గౌరవప్రదమా, అసలు అవసరమా ! ఐదు సంవత్సరాల తరువాత రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొంటున్న తరుణంలో చైనాను రెచ్చగొట్టటం ద్వారా మనదేశానికి ఒరిగేదేమిటని ప్రతివారూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వారసుడి విషయంలో దలైలామా ఆకాంక్షలను అనుసరించాలని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి, బౌద్దుడైన కిరెన్ రిజుజు చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది.చైనా తీవ్ర అభ్యంతరం తెలిపిన తరువాత మతవ్యవహారాల్లో ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్య చేయలేదని మనవిదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరణ ఇచ్చారు. తన తదనంతరం దలైలామా వ్యవస్థ కొనసాగుతుందని, 2011లో తాను ఏర్పాటు చేసిన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టు తన వారసుడిని నిర్ణయిస్తుందని కొద్ది రోజుల క్రితం దలైలామా చేసిన ప్రకటనతో రచ్చ మొదలైంది. గతంలో చేసిన ప్రకటననే పునరుద్ఘాటించారు. గాడెన్ ఫోడ్రాంగ్ అనేది టిబెట్‌లోని లాసాలో ఉన్న 17వ శతాబ్దం నాటి డ్రెపంగ్ సంఘారామంలో ఉన్న దలైలామా నివాసం పేరు. ఆ ట్రస్టుకు దలైలామా చైర్మన్, ఆయన సన్నిహితులుగా ఉన్నవారు సభ్యులు, దలైలామా కార్యాలయమే దాని వ్యవహారాలను చూస్తున్నది.పదిహేనవ దలైలామా, తదుపరి పరంపరను నిర్ణయించాల్సింది ఆ ట్రస్టు మాత్రమే అని ప్రభుత్వంతో సహా మరొకరికి అధికారం లేదని దలైలామా ప్రకటించారు. ఈ ట్రస్టుతో పాటు న్యూఢల్లీి, జూరిచ్ నగరాల్లో కూడా ట్రస్టులను ఏర్పాటు చేశారు. మతానికి చెందిన లామాలు, ఇతర పెద్దలు వారసుడిని గుర్తించి ప్రతిపాదిస్తే అంతిమంగా ఈ ట్రస్టు ఆమోదిస్తేనే వారసత్వం ఖరారు అవుతుందని ట్రస్టు నిబంధనావళి పేర్కొన్నది.
ఇక్కడే అసలు సమస్య ఉంది. గతంలో ఎంపిక చేసిన వారసుల పేర్లను ఒక బంగరు కలశంలో వేసి లాటరీ పద్దతిద్వారా ఎంపిక చేస్తారు, ఆ పేరును చైనా కేంద్రప్రభుత్వం ఆమోదిస్తేనే అమల్లోకి వస్తుందని, గతంలో ఇలాగే జరిగిందని బీజింగ్ ప్రకటించింది.తన ఎంపిక అలాగే జరిగిందని తెలిసినప్పటికీ ఈ విధానాన్ని 14వ దలైలామా అంగీకరించటం లేదు. అతగాడి ప్రకటనపై తాము ఎలాంటి వ్యాఖ్య చేయబోమని, మత వ్యవహారాలపై ఎలాంటి వైఖరిని తీసుకొనేది లేదని మన కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దలైలామా ప్రకటన సంబంధిత వార్తలను చూశామని, మతాలకు సంబంధించిన విశ్వాసాలు, వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి జోక్యం చేసుకోవటం లేదని. మత స్వేచ్చకు కట్టుబడి ఉన్నామని విదేశాంగశాఖ పేర్కొన్నది. క్వింగ్ రాజరిక పాలన నాటి నుంచి బంగారు కలశంలో ఉంచిన పేర్లతో లాటరీ తీసి ఎంపిక చేసిన దానిని చైనా ప్రభుత్వ ఆమోదిస్తే దలైలామా, పెంచన్ లామాలను ఖరారు చేస్తారని, ఆ మేరకు ప్రభుత్వ అధికారం కొనసాగుతున్నదని, దానికి తిరుగులేదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్ స్పష్టం చేశారు.ప్రస్తుత దలైలామాను కూడా అదే పద్దతిలో ఎంపిక చేయగా నాటి ప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు. తమ అంతర్గత వ్యవహారాల గురించి జాగ్రత్తగా వ్యాఖ్యానించాలని ఆమె మన కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు చేసిన ప్రకటన గురించి పేర్కొన్నారు. టిబెట్‌పై ప్రకటించిన వైఖరికి భారత్ కట్టుబడి ఉండాలని, టిబెట్ సంబంధిత వ్యవహారాలపై చేసే వ్యాఖ్యలు ఇరుదేశాల సంబంధాల మెరుగుదల, అభివృద్ధికి విఘాతం కలిగించకూడదని హితవు చెప్పారు. దలైలామా ప్రకటనను చైనా ఖండిరచిన తరువాత అతగాడికి మద్దతుగా కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడటంతో చైనా స్పందించింది. దలైలామా వైఖరిని పునరుద్ఘాటిస్తూ వారసుడి నిర్ణయంలో మరొకరి పాత్ర లేదని మంత్రి మాట్లాడారు. గాల్వన్ ఉదంతం తరువాత రెండు దేశాల సంబంధాలు స్థంభించిన సంగతి తెలిసిందే. గతేడాది రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జింపింగ్ భేటీ తరువాత ఏడాది కాలంలో సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి. కైలాష్,మానస సరోవర్ యాత్రలను పునరుద్దరించారు.
టిబెట్ బౌద్ధ మతానికి ఉన్నత మతాధికారి దలైలామా. మన దేశంలో పీఠాధిపతులకు చాంతాడంత పేర్లు ఉన్నట్లే ప్రస్తుత దలైలామా మతపరమైన పేరు జెస్టన్ జాంఫెల్ గవాంగ్ లొబసాంగ్ యెషే టెంజిన్ గియాస్టో. పొట్టిగా టెంజిన్ గియాస్టో అని పిలుస్తారు. పుట్టినపుడు పెట్టిన పేరు లామో తోండప్. ఇతగాడు వివాదాస్పదమైన మతగురువు, 1935 జూలై ఆరున జన్మించారు. దలైలామాలను జీవించి ఉన్న బుద్ధుడు లేక బోధిసత్వుడు అని నమ్ముతారు. మరణానంతరం వారసులను ఎన్నుకుంటారు. దలై అంటే సముద్రం, ఇది మంగోలియన్ భాషా పదం.పదమూడవ దలైలామా మరణించిన నాలుగు సంవత్సరాల తరువాత 1937లో అతడి వారసుడిగా టెంజిన్ను ఎంపిక చేశారు, 1939లో దలైలామాగా ప్రకటించారు. మరుసటి ఏడాది ఫిబ్రవరి 22న చైనా ప్రభుత్వం ఆమోదముద్రవేసింది. అమెరికా, బ్రిటన్ కుట్రలో భాగంగా కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1959లో టిబెట్‌లో తిరుగుబాటు పేరుతో సాయుధులను రంగంలోకి దించారు. వారిని చైనా ప్రభుత్వం అణచివేసింది, తిరుగుబాటు కేంద్రంగా దలైలామా కార్యక్షేత్రాన్ని గుర్తించారు.దాంతో 1959 ఏప్రిల్ 29న సిఐఏ పథకం ప్రకారం దలైలామాను నేపాల్ ద్వారా దాటించి అసోంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న తేజ్‌పూర్ పట్టణంలో ప్రవేశపెట్టి ఆశ్రయం కల్పించారు.ఉత్తర ప్రదేశ్‌లోని ముస్సోరీలో దలైలామాతో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు, మరుసటి ఏడాది హిమచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు రప్పించారు.చైనాపై సిఐఏ రూపొందించిన కుట్ర సిద్దాంతాన్ని నమ్మిలేదా అమెరికా వత్తిడికి లొంగి నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దలైలామాకు ఆశ్రయం కల్పించారు. మూడవ ప్రపంచ యుద్ధంలో టిబెట్ నుంచి చైనా భారత్ ఇతర దేశాల మీద దాడి చేసేందుకు పథకం రూపొందించిందన్నది సిఐఏ కట్టుకథ. అమెరికా, బ్రిటన్ కుట్రల కారణంగా కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం తొలి పది సంవత్సరాలలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నది. వాటిలో టిబెట్‌లో తిరుగుబాటు కుట్ర ఒకటి. దలైలామా అన్న గయలో తోండుప్ సిఐఏ ఏజంట్‌గా మారాడు. తెరవనుక ఉండి కథంతా నడిపించింది అతనే (97 సంవత్సరాల వయస్సులో ఈ ఏడాది ఫిబ్రవరి 8న పశ్చిమబెంగాల్లోని కలింపాంగ్‌లో మరణించాడు) అని, కుట్ర గురించి పూర్తిగా దలైలామాకు తెలియదని కూడా చెబుతారు. ఏమైనప్పటికీ తరువాత కాలంలో తెలిసినా అదే అమెరికా ప్రాపకంలో నాటి నుంచి నేటి వరకు చైనాకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉన్నాడు.2011వరకు టిబెట్ ప్రవాస ప్రభుత్వ అధినేతగా చలామణి అయ్యాడు. తరువాత వేరేవారికి బాధ్యతలను అప్పగించాడు.
చైనాను అస్థిరపరచటం సాధ్యం కాదని గ్రహించిన అమెరికా విస్తారమైన దాని మార్కెట్‌లో ప్రవేశించేందుకు పూనుకొని ఐరాసలో కమ్యూనిస్టు ప్రభుత్వమే అసలైన చైనా ప్రతినిధిగా గుర్తించటంతో పాటు సాధారణ సంబంధాలను ఏర్పరుచుకుంది. దాంతో టిబెట్ తిరుగుబాటుదార్లకు అందచేస్తున్న సాయాన్ని 1972 నుంచి తగ్గించింది తప్ప ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది.దలైలామాకు 1989లో నోబెల్ శాంతి బహుమతిని కూడా ఇప్పించింది.మనదేశంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ సకల వసతులు కల్పిస్తూ చైనా వ్యతిరేక ప్రచారానికి అన్ని రకాలుగా తోడ్పడుతున్నారు. దలైలామా తరువాత స్వతంత్రుడైౖన పెంచెన్ లామా బౌద్దులకు ముఖ్యుడు. అతగాడే పదమూడవ దలైలామా వారసుడిగా గుర్తించిన ముగ్గురిలో ఒకడు లామో ధోండప్ తరువాత 14వ దలైలామా అయ్యాడు.క్రీస్తుశకం 1642 నుంచి కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన 1949వరకు చైనా ప్రభుత్వానికి లోబడి పరిమిత అధికారాలతో టిబెట్ ప్రాంతంపై దలైలామాలు లేదా అతగాడి ప్రతినిధులు రాజకీయ అధికారాన్ని కూడా చెలాయించేవారు. దీన్నే టిబెట్ స్వతంత్రదేశమని వక్రీకరించారు.1912లో చైనాలో తలెత్తిన తిరుగుబాటుతో క్వింగ్ రాజరికం పతనమై స్వతంత్రదేశంగా అవతరించింది, ఆ సమయంలో బ్రిటీష్ వారి కుట్రలో భాగంగా టిబెట్ స్వాతంత్య్రాన్ని పదమూడవదలైలామా ప్రకటించాడు. అయితే సన్‌యేట్ సేన్ నాయకత్వంలోని జాతీయ ప్రభుత్వం గుర్తించలేదు, టిబెట్ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని స్పష్టం చేసింది. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత కూడా అదే విధంగా కొనసాగింది. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో కొందరు టిబెటన్లు జపాన్‌కు అనుకూలంగా వ్యవహరించటంతో వారిని అణచివేసేందుకు నాటి పాలకుడు చాంగ్‌కై షేక్ మిలిటరీని పంపి అణచివేశాడు. తరువాత జరిగిన పరిణామాల్లో ఖామ్ అనే యుద్ద ప్రభువు ఆధీనంలో ఉన్న టిబెట్ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొనేందుకు కమ్యూనిస్టు ప్రభుత్వం 1950 అక్టోబరులో ప్రజాసైన్యాన్ని పంపి స్వాధీనం చేసుకుంది. అదే ఏడాది పదిహేనేండ్ల వయస్సులో 14వ దలైలామాను టిబెట్ పాలకుడిగా ప్రకటించినప్పటికీ కమ్యూనిస్టు ప్రభుత్వం అంగీకరించలేదు.1951లో చైనా ప్రభుత్వానికి లోబడి స్వయంపాలిత ప్రాంతంగా టిబెట్ ఉండేందుకు దలైలామా ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు.1954లో మావోతో భేటీ అయ్యాడు, చైనా పార్లమెంటు స్టాండిరగ్ కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. మావో తనను ఒక కొడుకు మాదిరి చూశాడని దలైలామా తన ఆత్మకథలో చెప్పాడు.
1954 తరువాత సిఐఏ తనకుట్రను అమలు ప్రారంభించింది.1956లో దలైలామా భారత్‌ను సందర్శించినపుడు ఒకవేళ తాను రాజకీయ ఆశ్రయం కోరితే అంగీకరిస్తారా అని ప్రధాని నెహ్రూను కోరాడు.చైనా ప్రభుత్వంతో అప్పటికే ఒప్పందం ఉన్నందున అలాంటి పని చేస్తే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, రెచ్చగొట్టినట్లు అవుతుందని నెహ్రూ సున్నితంగా తిరస్కరించారు. ఆ తరువాత అమెరికా వత్తిడికి లొంగిన నెహ్రూ ఆశ్రయమే కాదు, తిరుగుబాటు ప్రభుత్వ ఏర్పాటుకు కూడా సహకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అంశం రెండు దేశాల మధ్య ఒక ప్రధాన సమస్యగానే ఉంటోంది. మన ప్రభుత్వం టిబెట్‌ను చైనాలో అంతర్భాగంగా గుర్తిస్తూనే వేర్పాటు వాదులకు అనధికారిక మద్దతు కొనసాగిస్తున్నది.మనదేశంలో కాలు పెట్టిన తరువాత 1967లో తొలిసారిగా దలైలామా విదేశీ పర్యటనకు జపాన్ వెళ్లారు. ఆయనకు వీసా ఇచ్చిన ప్రభుత్వం తమ గడ్డమీద ఉన్నంత వరకు చైనా వ్యతిరేక మాటలు మాట్లాడవద్దని షరతు విధించింది.కానీ మనపాలకులు మాత్రం పూర్తి స్వేచ్చ ఇచ్చారు.

