Tags
Anti Muslim, BJP, fertility fallacy, Hindu Population, hindutva, India TFR, Narendra Modi Failures, RSS, TFR, VHP, Yogi Adityanath
ఎం కోటేశ్వరరావు
ప్రతి సమాజంలో కనీసం 2.1 మంది పిల్లల్ని కంటే అది అంతరించి పోకుండా ముందుకు సాగుతుంది ఇది జనాభా శాస్త్రవేత్తలు చెబుతున్న మాట.ప్రపంచ జనాభా తాజా నివేదిక ప్రకారం భారత్‌లో జననాల రేటు 1.9 మాత్రమే, అంటే ప్రతి మహిళ సగటున పిల్లల్ని కంటున్న సంఖ్య అది. 1960లో ఆరుగురికి జన్మ నిచ్చింది, ఇలా ఎందుకు ఇలా జరుగుతోంది. హిందూమతాన్ని రక్షించుకోవాలని, సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ పవన్ కల్యాణ్ లాంటి నేతలు ఊగిపోవటాన్ని చూస్తున్నాము. అది నటనో లేక నిజంగానే వేసే వీరంగమో తెలియదు. హిందువులను మైనారిటీలుగా మార్చి ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు చూస్తున్నారంటూ విద్వేషాన్ని రెచ్చగొట్టే బాపతు మనకు ఈ రోజుల్లో ఎక్కడబడితే అక్కడ కనిపిస్తున్నది. 2015లో సాక్షి మహరాజ్ (69) అనే బిజెపి ఎంపీగా నాలుగుసార్లు పని చేసిన స్వామీజీ హిందూమతాన్ని రక్షించుకోవాలంటే హిందూ మహిళ కనీసం నలుగురు పిల్లల్ని కనాలని చెప్పారు. నలుగురు భార్యలను చేసుకొని40 మంది సంతానాన్ని కనటం భారత్‌లో వీలుకాదు అంటూ వేరే మతం వారి మీద విద్వేషం వెళ్లగక్కారు. మహాత్మాగాంధీని చంపిన గాడ్సే ఒక దేశభక్తుడని చెప్పిన ఈ పెద్దమనిషి సన్యాసాన్ని వదలి వేసి వివాహం చేసుకొని నలుగుర్నిగాక పోతే 40 మందిని ఎందుకు కనలేదన్నది ప్రశ్న. ఇలాంటి స్వాములు, స్వామినులు జనాలకు ఇలాంటి సుభాషితాలు చెబుతుంటారు.
‘‘ హిందువులు పదిమంది పిల్లల్ని కనాలంటూ మితవాద బృందాలు ఇచ్చిన పిలుపు ప్రతికూలఫలితమిస్తుంది ’’ అనే శీర్షికతో హిందూస్తాన్ టైమ్స్ పత్రిక 2016 డిసెంబరు 26న ఒక వార్తను ప్రచురించింది. దాని సారాంశం ఇలా ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఉన్న పీఠాధిపతులు ధర్మ సంస్కృతి మహాకుంభ పేరుతో మూడు రోజుల సమావేశం నిర్వహించారు. ముస్లిముల సంఖ్య వేగంగా పెరిగిపోయి హిందువులను మించిపోతారు గనుక హిందువులు పదిమంది పిల్లల్ని కనాలని ఈ సదస్సులో పిలుపునిచ్చారు.జ్యోతిర్ మఠ శంకరాచార్యుడు వాసుదేవానంద సరస్వతి మాట్లాడుతూ హిందువులు పదేసి మంది పిల్లల్ని కనాలని, దేవుడే వారి సంరక్షణ చూసుకుంటాడని సెలవిచ్చినపుడు మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్, అసోం గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ ఆ సమావేశంలో ఉన్నారు. హిందూమత పరిరక్షకులం అని చెప్పుకొనే అనేక మంది ఆచరణ ఏమిటి ? ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న కమ్యూనిస్టుల నినాదాన్ని కాపీ కొట్టి హిందువులందరూ ఏకంకండి అని పిలుపులు ఇస్తున్నారు. అసలు వారి మధ్య ఏకీభావం ఉందా ? ప్రపంచమంతటా పెద్ద మతం క్రైస్తవం, వారు తమ మతాధిపతిగా పోప్‌ను ఎన్నుకుంటారు. అలాగే ఒక హిందూమతాధిపతిని ఎన్నుకోలేనివారు మొత్తం హిందువులందరినీ ఐక్యం కావాలని పిలుపు ఇవ్వటం దివాలాకోరుతనం కాదా ? ఎవరు అడ్డుకున్నారు ! నిలువు బొట్లు, అడ్డబొట్ల (సామాన్యులు కాదు ) పెద్దలు పరస్పరం ఆయా పుణ్యక్షేత్రాల గడపకూడా తొక్కరు. ఉదాహరణకు వైష్ణవాచార్యుడైన చిన్న జియ్యర్ స్వామి ఎన్నడైనా శివాలయాలకు వెళ్లటం ఎవరైనా చూశారా ! ఎందుకు బహిష్కరిస్తున్నట్లు ? ఈ ప్రశ్న నిరంతరం అడుగుతూ ఉండాల్సిందే. కాసేపు పక్కన పెడదాం.
అసలు హిందువులు ఎందరు పిల్లల్ని కనాలో చెప్పేవారి మధ్య ఏకీభావం ఉందా ? వారిని అసలు జనాలు పట్టించుకుంటున్నారా ? ఏ మాత్రం ఖాతరు చేసినా మనదేశంలో జనన రేటు 1.9కి పడిపోయి ఉండేది కాదు. హిందూత్వను పక్కాగా సమర్ధించే బిజెపి, దానికి పక్కా సనాతన్ అంటూ తోడైన పవన్ కల్యాణ్, మేమూ అదే అంటున్న తెలుగుదేశం పార్టీ తదితర మొత్తం 25 పార్టీల కలగూరగంప ఎన్‌డిఏ కూటమికి 2024లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల మొత్తం 43శాతం మాత్రమే. అదీ తమకు వివిధ రాష్ట్రాలలో ముస్లింలు, క్రైస్తవులు గణనీయంగా ఓట్లు వేశారని చెప్పుకున్న తరువాత, బిజెపి ఓట్లు 36.56శాతమే. అంటే మెజారిటీ హిందువులు, మొత్తం జనాభాలో ఈ కూటమికి మెజారిటీ లేదు. ఓట్లే వేయని వారు పది మంది పిల్లల్ని కనమంటే ముందుకు వస్తారా ? ఈ నినాదాలు ఇస్తున్నవారు, వాటిని బలపరుస్తున్నవారి కుటుంబాలలో ఎందరు అంతమందిని కన్నారో చెప్పమనండి.
2016 ఏప్రిల్‌లో గిరిరాజ్ సింగ్ అనే బిజెపి కేంద్ర మంత్రి ‘‘ ప్రతి ఒక్కరూ ఒకరూ లేదా ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలి, అంతకు మించి కన్నవారికి ఓటింగ్ హక్కులు రద్దు చేయాలి. ఈ నిబంధన భారతీయులందరికీ వర్తింప చేయాలి. హిందువులు, ముస్లింలు కూడా ఇద్దరేసి కొడుకులను మాత్రమే కనాలి. బీహార్‌లోని చంపరాన్ జిల్లాలో హిందూమత పెద్దలు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఈ మాటలు మాట్లాడారు. బీహార్‌లోని ఏడు జిల్లాల్లో ‘‘ మన జనాభా ’’ తగ్గిపోయిందని వాపోయారు. సాక్షి మహరాజ్‌గా సుపరిచితుడైన బిజెపి ఎంపీ, అవివాహితుడైన స్వామి సచ్చిదానంద హరి 2015 జనవరిలో మాట్లాడుతూ హిందూమత పరిరక్షణకోసం ప్రతి కుటుంబం నలుగురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. మరో అవివాహిత, విశ్వహిందూపరిషత్ నాయకురాలు సాధ్వీ ప్రాచీ మరింత ముందుకు పోయారు. సింహం కేవలం ఒక పిల్లకు మాత్రమే పరిమితం కాకూడదు.మనం కూడా ప్రతి కుటుంబంలో నలుగురు పిల్లల్ని కనాలి.సరిహద్దుల్లో ఒకరు శత్రువు మీద పోరాడాలి. ఒకర్ని సాధువుగా చేయాలి, మరొకర్ని సామాజిక సేవకోసం విశ్వహిందూపరిషత్‌కు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన శ్యామల్ గోస్వామి అనే నేత హిందూయిజం, సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందూ కుటుంబం ఐదుగురు పిల్లల్ని కనాలని చెప్పారు. కన్నయ్యదాస్ అనే అయోధ్య పూజారి, విశ్వహిందూపరిషత్ మద్దతుదారు కనీసం ఎనిమిది మంది పిల్లల్ని కనాలన్నారు.2015లో అలహాబాదులో జరిగిన మాఘమేళ సందర్భంగా బదరీకాశ్రమం శంకరాచార్య వాసుదేవానంద సరస్వతి మాట్లాడుతూ హిందువుల ఐక్యత కారణంగానే మోడీ ప్రధాని అయ్యారని, అందువలన మెజారిటీని కొనసాగించాలంటే ప్రతి హిందూ కుటుంబం పది మంది పిల్లల్ని కంటూ ఉండాలని చెప్పారు.విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా ఏం చెప్పారంటే ప్రతి హిందూ జంట నలుగురు పిల్లల్ని కనాలని సాక్షి మహరాజ్ చెప్పిందాంట్లో తప్పేముంది ? ఇతరులు పదిమందిని కంటుంటే మాత్రం ఎవరూ ఎలాంటి ప్రశ్న వేయరు, హిందువుల విషయంలోనే ఈ రచ్చ ఎందుకు అని వాదించారు.
ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు చేసిన సంస్థలలో ఒకటైన విశ్వహిందూపరిషత్ అధ్యక్షుడిగా ఉన్న ప్రవీణ్ తొగాడియా ఆర్‌ఎస్‌ఎస్ నడిపే పత్రిక ఆర్గనైజర్‌లో రాసిన ఒక వ్యాసంలోని అంశాన్ని హిందూస్తాన్ టైమ్స్ పత్రిక 2015 సెప్టెంబరు మూడవ తేదీన ‘‘ ముస్లింలకు ఇద్దరు పిల్లల నిబంధన ఉండాలన్న విహెచ్‌పి ప్రవీణ్ తొగాడియా ’’ అనే శీర్షికతో ఇచ్చిన వార్తలో ఉటంకించింది. ముస్లింలలో ప్రతి బిడ్డ పుట్టుకకు సబ్సిడీ ఇవ్వటం గాక ఇద్దరు బిడ్డలు పుట్టిన తరువాత కచ్చితమైన నిరోధాన్ని పెట్టాలని, అది శిక్షార్హమైన నేరంగా మరియు రేషన్, ఉద్యోగాలు, విద్యా సౌకర్యాలను నిలిపివేసి జనాభాను క్రమబద్దీకరించి మెరుగైన అభివృద్ది చేయాలని ప్రవీణ్ తొగాడియా రాశారని పేర్కొన్నది.జనాభా జీహాద్‌ను ఇప్పుడు వ్యతిరేకించకపోతే భారత్ త్వరలో ముస్లిం దేశంగా మారిపోతుందన్నారు.జనాభాలో వచ్చే మార్పులతో హిందూ కుటుంబాలు, భూమి, ఆస్తులు, మతపరమైన ప్రాంతాలు, ఉపాధి, వ్యాపారం, ఇతర అన్నింటికీ ముప్పు తలెత్తే ప్రమాదం ఉందని తొగాడియా పేర్కొన్నారు.
కాషాయ దళాల మాటలను ఎందుకు ప్రస్తావించాల్సి ఉందంటే వీరు లేక ముందు కూడా వేల సంవత్సరాలుగా హిందూమతం ఉనికిలో ఉంది. వందల సంవత్సరాల పాటు మొఘలులు, ఆంగ్లేయులు దేశాన్ని ఆక్రమించి పాలన సాగించినా 80శాతం ఇప్పటికీ హిందువులుగానే ఉన్నారు. మనుధర్మం, మరొకపేరుతో దళితులు, గిరిజనులను అమానుషంగా చూసిన కారణంగానే వారిలో అనేక మంది ముస్లిం, క్రైస్తవులుగా మారారు తప్ప అందరూ విదేశాల నుంచి వలస వచ్చిన వారి వారసులు కాదు.ఇప్పుడేదో హిందూమతానికి ముప్పు వచ్చిందని పదేసి మంది పిల్లల్ని కనాలంటూ పిలుపులు ఇస్తుంటే వాటిని జనం ముఖ్యంగా మహిళలు పట్టించుకోవటం లేదు. అందుకే పదేండ్ల నాటికీ ఇప్పటికీ జననాల రేటు తగ్గిపోతున్నది.
పిటిఐ వార్తా సంస్థ ఇచ్చిన వార్త ప్రకారం (2025జనవరి 25) ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రయాగ్‌రాజ్ పట్టణంలో జరిగిన విరాట్ సంత్ సమ్మేళనంలో పాల్గొన్నారు.(ఎగువన ఉన్న ఫొటోలో చూడవచ్చు) మహాకుంభనగర్‌లో జరిగిన ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి భజరంగ్ లాల్ బాంగ్రా ప్రతి హిందూ కుటుంబం ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. హిందువుల్లో జననాల రేటు తగ్గిపోవటం గురించి విహెచ్‌పి చేస్తున్న ప్రయత్నాలను ఆదిత్యనాధ్ ప్రశంసించారు. అంతకు ముందు వీరందరికీ గురువు అయిన ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన భగవత్ భారత సమాజం బతికి బట్టకట్టాలంటే ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. అయితే హిందువులు అనే పదం ఆ సమయంలో వాడకపోయినా దాని అర్ధం ఏమిటో ఎవరికి వారే ఊహించుకోవచ్చు. 2024 డిసెంబరు ఒకటవ తేదీన నాగపూర్‌లో మాట్లాడుతూ జనాభా శాస్త్ర ప్రకారం జననాల వృద్ధి రేటు 2.1లేకపోతే ఒక సమాజం దానంతట అదే నాశనం అవుతుంది, వేరే ఎవరూ నాశనం చేయనవసరం లేదు అన్నారు. ఆయన చుట్టూ ఉన్నవారందరూ హిందూ సమాజానికి ముప్పు వచ్చిందంటూ హోరెత్తిస్తుంటే ఆ మాటలకు కూడా అర్ధం అదిగాక వేరే ఎలా అవుతుంది.
జూన్ పదవ తేదీన ఐరాస విడుదల చేసిన ప్రపంచ జనాభా స్థితి నివేదికలో జననాల రేటు తగ్గిపోవటానికి దోహదం చేస్తున్న వివిధ అంశాలను పేర్కొన్నది, అవన్నీ మన దేశానికి కూడా వర్తిస్తాయి.మనతో సహా పద్నాలుగు దేశాలకు చెందిన పద్నాలుగువేల మంది నుంచి ప్రశ్నావళికి రాబట్టిన అంశాలను అది విశ్లేషించింది.ప్రస్తుతం ప్రపంచలో 800 కోట్ల మంది జనాభా అధికంగా ఉందనే అభిప్రాయాన్ని కలిగించటం ఒకవాస్తవమైతే అన్ని చోట్లా ఒకే విధంగా లేకపోవటంతో కొన్ని చోట్ల జననాల తగ్గుదల గురించి ఆందోళన వ్యక్తమౌతోంది. కోరుకున్నంత మంది పిల్లల్ని కనాలని అనుకున్నా ఐదోవంతు మందికి సాధ్యం కావటం లేదు.అనేక మందికి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఉన్నప్పటికీ వారిని సక్రమంగా పెంచేందుకు అవసరమైన ఉద్యోగ భద్రత, నివాసం, పిల్లల సంరక్షణ వంటి సమస్యల కారణంగా వెనకడుగు వేస్తున్నారు.ఉద్యోగాలు, పిల్లల సంరక్షణ మహిళల మీద భారాన్ని రెట్టింపు చేయటంతో ఎక్కువ మందిని కనేందుకు వారు విముఖత చూపుతున్నారు. అనేక దేశాల్లో ప్రసూతి సెలవులు, వేతనాలు ఎక్కువగా ఇవ్వటానికి ఇదొక కారణం, అయినప్పటికీ అనుకున్న మేర జననాలు పెరగటం లేదు.ఎక్కువ మంది పిల్లలు ఉంటే వత్తిడి ఎక్కువగా ఉంటున్నకారణం కూడా ఉంది. నైజీరియావంటిచోట్ల సగటున ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఎక్కువ మందిని కనాలనే సామాజిక వత్తిడి, ఆరోగ్యసేవలేమి సమస్యలను అక్కడ ఎదుర్కొంటున్నారు. సంతాన నిరోధక పద్దతులపై అనుమానాలు, అవగాహనలేమి కూడా ఉంది. కొన్ని చోట్ల సంతానాన్ని బట్టి ప్రోత్సాహకాలు ఇచ్చే పథకాలు ఉన్నప్పటికీ తాత్కాలికంగా కొంత లబ్దిచేకూరినా తరువాత ఎదురయ్యే సమస్యల కారణంగా వాటికి జనాలు ఆకర్షితులు కావటం లేదు. కుటుంబ సభ్యులు, భాగస్వాముల వత్తిడి కారణంగా తాము తక్కువ మంది పిల్లలను కన్నట్లు సర్వేలో చెప్పారు. మొత్తం మీద 39శాతం మందికి ఆర్థిక అంశాల పరిమితులు ఎక్కువ మంది పిల్లలు వద్దనుకోవటానికి కారణమౌతున్నాయి. పన్నెండు శాతం మంది ఆరోగ్య సమస్యల వలన కావాలనుకున్న సంఖ్యలో పిల్లల్ని కనలేకపోతున్నారు. తాము తమ పిల్లల భవిష్యత్‌కు హామీ, సమానత్వం తదితర అంశాలపై కలిగించే భరోసాను, పాలకుల చర్యల మీద కలిగే విశ్వాసాలను బట్టి జననాల రేటు పెరుగుతుంది తప్ప దానికి మించిన పరిష్కారం మరొకటి లేదు.
మనదేశంలో జననాల రేటు గణనీయంగా పడిపోతున్నప్పటికీ ప్రస్తుతం యువజనాభా ఎక్కువగా ఉంది. మొత్తం జనాభా 146 కోట్ల 39లక్షలు. ఈ సంఖ్య 170 కోట్లకు పెరిగిన తరువాత ఇప్పటి నుంచి 40 ఏండ్ల తరువాత తగ్గుముఖం పడుతుంది. తమిళనాడు, కేరళ, ఢల్లీి రాష్ట్రాలలో అవసరమైనదానికంటే జననాల రేటు తక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రతి మహిళకు 1.9 మంది పిల్లలు ఉంటే 1960లో ఆరుగురు ఉన్నారు. బీహార్, రaార్కండ్, ఉత్తర ప్రదేశ్‌లలో ఎక్కువ జననాల రేటు ఉంది. మన జనాభాలో ఇప్పుడు పద్నాలుగేండ్ల లోపు వారు 24శాతం, పది, పందొమ్మిదేండ్ల మధ్య వారు 17, పది, ఇరవైనాలు సంవత్సరాల వారు 26శాతం ఉన్నారు.
ఎవరెంతమంది పిల్లల్ని కనాలో కనకూడదో నిర్ణయించుకోవాల్సింది దంపతులు తప్ప స్వాములు, సాధ్వులు, ముల్లాలు, పాస్టర్లు కాదు. కానీ వీరంతా కుటుంబ జీవనాల్లో వేలు పెడుతున్నారు. పడకగదుల్లో దూరుతున్నారు. ఏమంటే మతాన్ని కాపాడాల్సిన బాధ్యత అని సుభాషితాలు చెబుతున్నారు. పోనీ వీరెవరైనా పిల్లలు, తల్లుల సంరక్షణ బాధ్యత తీసుకుంటారా ? లేదు, నారుపోసిన వాడు నీరు పోయడా అంటూ దేవుళ్ల మీద దేవదూతల మీద భారం మోపుతారు. తమ సన్యాసాన్ని పక్కన పెట్టి వివాహాలు చేసుకొని డజన్ల కొద్దీ పిల్లలను కంటున్నారా అంటే, అదే జరిగితే ఇప్పటి మాదిరి ఎక్కడబడితే అక్కడ తామరతంపరగా అలాంటి వారంతా ప్రత్యక్షం అయ్యే అవకాశమే లేదు. ఇతరులకు చెప్పేటందుకే నీతులు ! వీరిని ప్రశ్నించేవారే లేరా ? పురాతన మానవుడికి మదిలో తలెత్తిన తొలి ప్రశ్న ఎందుకు. అదే మానవాళి పురోగమనానికి చోదకశక్తి. కమ్యూనిస్టుల సంగతికాసేపు పక్కన పెట్టండి, వారు ప్రతిదాన్నీ ప్రశ్నించమంటారు. బుద్ధుడు, వివేకానందుడు ఇంకా అనేక మంది భారతీయ తత్వవేత్తలు ప్రశ్నించమన్నారు, వద్దు, ప్రశ్నించటం తప్పు అన్నవారు మనకు ఎక్కడా కనిపించరు. అయినా ఎందుకు మనం ప్రశ్నించలేకపోతున్నాం, ఎందుకు ప్రశ్న రోజురోజుకూ బిక్కుబిక్కుమంటోంది, పాలకులను చూసి భయమా, జనంలో తలెత్తిన స్వార్ధమా ?
