Tags
Anti communist, Attack on Indian Constitution, BJP, BR Ambedkar, emergency, Indira gandhi, Mahatama Gandhi, Mohan Bhagwat, Narendra Modi, RSS, secularism, Socialist, Supreme Court
ఎం కోటేశ్వరరావు
రాజ్యాంగ పీఠికలో ఉన్న లౌకికవాదం, సోషలిస్టు అనే పదాల గురించి పునరాలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే పిలుపునిచ్చారు.దేశంలో అత్యవసర పరిస్థితిని విధించి 50ఏండ్లు గడచిన సందర్భంగా ఢల్లీిలో జరిగిన ఒక సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య క్రమాన్ని పక్కన పెట్టిన అత్యవసరపరిస్థితి కాలంలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాలను రాజ్యాంగంలో చేర్చారని, తొలుత ఆమోదించిన దానిలో ఇవి లేవని చెప్పారు. సోషలిజం, లౌకికవాదాలను ఎన్నడూ ఆమోదించకపోవటమే కాదు తీవ్రంగా వ్యతిరేకించే ఆర్‌ఎస్‌ఎస్ నేత నుంచి ఇలాంటి ప్రతిపాదన రావటం ఆశ్చర్యం కాదు. కేశవానంద భారతికేరళ రాష్ట్రం మధ్య నడచిన వివాదం (1973) తీర్పులో రాజ్యాంగ వ్యవస్థ మౌలిక ఉపదేశంలో మౌలిక భావనలైన లౌకికవాదం, సోషలిజాలకు సంబంధించిన వాటిని మార్చటానికి వీల్లేదని ప్రవచించినట్లు సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆ తరువాత 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వాటిని నిర్ధిష్టంగా చేర్చారు. ఎస్‌ఆర్ బొమ్మయ్‌కేంద్ర ప్రభుత్వం మధ్య నడచిన వివాదం(1994)లో లౌకికవాదం రాజ్యాంగ మౌలిక అంశమని రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు దానిని మార్చటానికి వీల్లేకుండా చేసిందని తొమ్మిదిమంది సభ్యులుగల సుప్రీం కోర్టు రాజ్యాంగధర్మాసనం తీర్పు చెప్పింది. రాజ్యాంగ పరిషత్ సభ్యులు మన రాజ్యాంగంలో ఉండాల్సిన అంశాల చర్చలో తడమని అంశం లేదంటే అతిశయోక్తి కాదు. అనేక భిన్నాభిప్రాయాలు, రాజీల తరువాత ఒక రాజ్యాంగాన్ని ఆమోదించారు. లౌకిక వాదం గురించి ఆ చర్చలో జవహర్‌లాల్ నెహ్రూ చెప్పిందేమిటి ? ‘‘ లౌకిక రాజ్యం … అర్ధ సారం ఏమిటంటే ఏ ఒక్క మతమూ ఏది ఏమైనా రాజ్యం నుంచి ఎలాంటి ప్రాపకమూ పొందకూడదు.ఈ విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.మన ఈ గడ్డమీద ఏ ఒక్కరికీ ఏమతమైనా అనుసరించటానికి, చెప్పటానికి మాత్రమే కాదు ప్రచారం చేయటానికి కూడా హక్కు నిరాకరించకూడదు ’’ అన్నారు. అసలు తొలిసారి ఆమోదించిన రాజ్యాంగంలో ఈ మేరకు రాజ్యాంగంలో లౌకికవాదం అనే పదమే అసలు లేనట్లు ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలు జనాన్ని నమ్మింప చేస్తున్నారు. అనేక అంశాలను ఆర్టికల్ 25లో క్రోడీకరించారు.దానిలోని క్లాజ్ 2(ఏ)లో లౌకికవాద ప్రస్తావన ఉంది అలాంటి దానిని సమీక్షించాలని ఆర్‌ఎస్‌ఎస్ చెబుతోంది.దోపిడీ రహిత సమాజం గురించి అనేక మంది ప్రతిపాదించారు, దానికి సోషలిజమని పేరు పెట్టలేదు తప్ప రాజ్యాంగం ఆదేశిక సూత్రాలలో చేర్చిన అంశాల సారమదే. సోషలిజాన్ని వ్యతిరేకించేవారు ఆదేశిక సూత్రాలకు కట్టుబడి ఉంటారన్న హామీ ఏముంది ?
అసలు ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని కూడా ఆమోదించలేదు. రెండవ సర్వసంఘసంచాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ తన బంచ్ ఆఫ్ థాట్స్ అనే గ్రంధంలో మనది అని చెప్పుకొనే అంశం మన రాజ్యాంగంలో ఒక్కటీ లేదని రాశారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తరువాత ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ఆర్గనైజర్ 1949 నవంబరు 30వ తేదీ సంచికలో పురాతన భారత్‌లో ఉన్న రాజ్యాంగాన్ని ప్రస్తావించకుండా విస్మరించారని, శతాబ్దాల తరబడి ఆచరిస్తూ, అభిమానించిన మనుస్మృతిలో వర్ణించిన మను చట్టాలను విస్మరించారని సంపాదకీయంలో ధ్వజమెత్తింది. మను కాలం నాటి రోజులు అంతరించాయని అంబేద్కర్ చెప్పారు. కానీ అంతిమంగా మనుస్మృతి మాత్రమే హిందువులకు సాధికారత ఇస్తుందని అదే ఆర్గనైజర్ పత్రిక 1950 ఫిబ్రవరి ఆరవ తేదీ సంచికలో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి శంకర్ సుబ్బ అయ్యర్ రాసిన వ్యాసాన్ని ప్రచురించారు.
1975 జూన్25న ప్రకటించిన అత్యవసరపరిస్థితి 1977 మార్చి 21వ తేదీ వరకు అమల్లో ఉంది.అంతర్గత కల్లోలం, విదేశీ ముప్పు పరిస్థితుల కారణంగా రాజ్యాంగంలోని 352 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీఅహమ్మద్ ప్రకటించారు. రాజకీయంగా తనను వ్యతిరేకించిన వివిధ రాజకీయపార్టీలు, సంస్థలకు చెందిన 1,10,806 మందిని ఇందిరా గాంధీ జైలుపాలు చేశారు.1971లోక్‌సభ ఎన్నికలలో రాయబరేలీ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆమె ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సోషలిస్టు పార్టీ తరఫున పోటీ చేసిన రాజనారాయణ్ కోర్టును ఆశ్రయించారు. తొలిసారిగా మనదేశంలో ఒక ప్రధానిని హైకోర్టులో దాదాపు ఐదుగంటల పాటు బోనులో నిలబెట్టి విచారించటం అదే ప్రధమం. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జగ్‌మోహన్ సిన్హా 1975జూన్ 12న ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చారు. ఆ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేశారు. జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ ధర్మాసనం జూన్ 24న హైకోర్టు తీర్పును సమర్ధించింది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు ప్రధాని పదవిలో కొనసాగవచ్చని అవకాశం ఇచ్చారు. దాన్ని అవకాశంగా తీసుకొని మరుసటి రోజే అత్యవసరపరిస్థితిని విధించారు.1976 నవంబరులో మాధవరావు మూలే, దత్తోపంత్ టేంగిడీ, మోరోపంత్ పింగ్లే వంటి 30 ప్రముఖులు తమ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను జైలు నుంచి విడుదల చేస్తే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రతిపాదించారు(వికీపీడియా) ఆ లొంగుబాటు పత్రం ప్రకారం 1977 జనవరిలో వారు విడుదల కావాల్సి ఉంది. దాన్ని నాటి కీలక అధికారి హెచ్‌వై శారదా ప్రసాద్ ఆమోదించారు.ఇదీ ఆర్‌ఎస్‌ఎస్ అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన తీరు. అయితే కొంత మంది లొంగుబాటును వ్యతిరేకించారని కూడా చెబుతారు. నిజమేమిటో ఆర్‌ఎస్‌ఎస్ అధికారికంగా చెప్పాల్సి ఉంది.
ఇక లౌకికవాదం, సోషలిస్టు పదాల గురించి బిజెపి, ఆర్‌ఎస్ బండారం ఏమిటో చూద్దాం. వాటిని సమర్ధిస్తూ మాట్లాడిన ఆ సంస్థల నాయకులను ఎవరైనా చూశారా ? భారతీయ జనతా పార్టీ నవీకరించిన(2012) నిబంధనావళి పత్రం ఇప్పుడు ఆ పార్టీ వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంది.మొదటి పేజీలోనే లౌకికవాదం, సోషలిజం, ప్రజాస్వామ్యాలకు కట్టుబడి ఉన్నట్లు రాసుకున్నారు. నిత్యం కుహనా లౌకికవాదం అని, సోషలిజం మీద విషం గక్కుతున్నారంటే ఆచరణలో వారు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నట్లే. అది దేశద్రోహంతో సమానం. బిజెపిని కన్నతల్లి ఆర్‌ఎస్‌ఎస్ అన్నది జగమెరిగిన సత్యం. జనతా పార్టీ లేదా ఆర్‌ఎస్‌ఎస్ ఏదో ఒకదానిలో మాత్రమే సభ్యులుగా ఉండాలని ద్వంద్వ సభ్యత్వం కూడదన్న వివాదం వచ్చినపుడు ఆ సంస్థతో బంధం తెంచుకోవటానికి తాము సిద్దం కాదని కావాలంటే జనతా పార్టీ నుంచే వైదొలుగుతామని ప్రకటించి బిజెపిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హోసబలే లౌకికవాదం, సోషలిజం గురించి సమీక్షించాలని ప్రతిపాదించారంటే అది బిజెపికి కూడా వర్తిస్తుంది. ముందుగా బిజెపి నిబంధనావళి నుంచి దాన్ని తొలగించవచ్చు, కానీ ఆ పని చేయకుండా మొత్తం రాజ్యాంగానికే ఎసరు పెడుతున్నారంటే దాని వెనుక ఉన్న కుట్ర గురించి వేరే చెప్పనవసరం లేదు. బిజెపి చెప్పలేని అంశాలను ఆర్‌ఎస్‌ఎస్ నేతల ద్వారా పలికించటం ఒక ఎత్తుగడ. జనంలో వచ్చిన స్పందన అనుకూలమా ప్రతికూలమా అని సరిచూసుకోవటం గతంలో జరిగింది, ఇప్పుడూ ఆ నాటకమే మొదలెట్టారు.
రాజకీయాలతో నిమిత్తం లేని ప్రముఖులతో ఏర్పాటు చేసే కమిటీ ద్వారా రిజర్వేషన్లను సమీక్షించాలని ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన భగవత్ 2015 ప్రతిపాదించారు. అది పెద్ద వివాదాన్ని రేపింది. తరువాత 2017లో మరో నేత మన్మోహన్ వైద్య భిన్న నేపధ్యంలో ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్లు నిర్ణయించారని, అంబేద్కర్ కూడా అవి నిరవధికంగా కొనసాగటం అభిలషణీయం కాదు, ఒక పరిమితి ఉండాలని చెప్పారంటూ అంబేద్కర్ భుజం మీద తుపాకితో కాల్చాలని చూశారు. అది రాజకీయంగా బిజెపికి నష్టం అని జనంలో వచ్చిన స్పందనను చూసిన తరువాత తాము రిజర్వేషన్లను సమర్ధిస్తున్నామని, వివక్ష ఉన్నంత వరకు కొనసాగాలని పదే పదే ప్రకటనలు చేశారు. బిజెపి నేతలు అంబేద్కర్ గురించి ఇటీవలి కాలంలో ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. పదే పదే ఆయన భజన చేస్తున్నారు. చిత్రం ఏమిటంటే మహాత్మాగాంధీ కాదు అసలైన మహాత్ముడు హంతకుడు గాడ్సే అని సంఘపరివార్ దళాలు నిత్యం ప్రచారం చేస్తాయి. తమ పార్టీ మౌలిక సూత్రంగా మానవతావాదం ముఖ్యమైనదిగా ఉంటుందని బిజెపి నిబంధనావళి చెప్పింది. పార్టీ జాతీయవాదం, జాతీయ సమగ్రత, ప్రజాస్వామ్యాలతో పాటు దోపిడీ రహిత సమసమాజ స్థాపన కోసం ఆర్ధిక, సామాజిక సమస్యలపై గాంధీయిజవైఖరిని అనుసరిస్తామని కూడా పేర్కొన్నది. సానుకూల లౌకికవాదం అంటే సర్వధర్మ సంభవం మరియు విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నామని చెప్పింది. ఎక్కడా బాబాసాహెబ్ అంబేద్కర్ వాంఛించి ప్రవచించిన కులరహిత లేదా కులవివక్షలేని సమాజం కోసం లేదా అంబేద్కర్ భావజాలానికి కట్టుబడి ఉన్నామనే మాటే లేదు. ఇదీ అంబేద్కర్ పట్ల దాని నిజవైఖరి.
నిజానికి కుల,మత రహిత సమాజం కాషాయ దళాల అజెండాలోనే లేదు. పక్కా హిందూత్వ ఛాంపియన్లమని గల్లీ నుంచి ఢల్లీి నేతల వరకు రోజూ చెప్పటాన్ని చూస్తున్నాము.కులగణనను వ్యతిరేకించి చివరకు చేపడతామని చెప్పింది. బిజెపి ముందు రూపమైన జనసంఘం నేత దీనదయాళ్ ఉపాధ్యాయ 1965లో సమగ్రమానవతావాదం పేరుతో రాసిన గ్రంధంలో పేర్కొన్న పకారం ‘‘ నాలుగు కులాల(చాతుర్వర్ణ)పై మా దృక్ఫధం ప్రకారం అవి విరాట పురుషుని భిన్నమైన నాలుగు భాగాల(లింబ్స్`శాఖల)తో సమానమైనవి. అవి ఒకదానికొకటి సహకరించుకొనేవి మాత్రమే కాదు దేని ప్రత్యేకత దానిదిగా ఉండటంతో పాటు ఐక్యంగా ఉంటాయి, దేనికదే స్వతంత్రమైన గుర్తింపు, అభిరుచి కలిగి ఉంటాయి ’’ అంటే ఉన్న మనువాద కులవ్యవస్థను కొనసాగించాలనటం తప్ప వేరే భాష్యం లేదు.1990లో ప్రధాని విపి సింగ్ మండల్ కమిషన్ సిఫార్సుల అమలుకు పూనుకున్నపుడు ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ఆర్గనైజర్ సంపాదకీయంలో కులయుద్ధాలకు దారి తీస్తుందని రాశారు. పదమూడు సంవత్సరాల వయస్సులో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన దళితుడైన భన్వర్ మేఘవంశీ ‘‘ నేను హిందువును కాలేను ’’ అనే పేరుతో రాసిన పుస్తకంలో కులవ్యవస్థపట్ల ఆర్‌ఎస్‌ఎస్ వైఖరి గురించి అనేక అంశాలను లేవనెత్తారు. తన గ్రామానికి సంఘపరివార్ సభ్యులు వచ్చినపుడు వారికి తాను ఆహారాన్ని సిద్దం చేయగా దాన్ని తినకుండా మూటగట్టి పారవేయటంతో ఆర్‌ఎస్‌ఎస్‌లో కులతత్వం గురించి తనకు అవగతమైందని రాశారు.కొన్ని పదవుల్లో దళితులకు అవకాశం ఇవ్వరని, కేవలం ముస్లింల మీద దాడికి మాత్రమే తమను వినియోగించుకున్నారని కూడా పేర్కొన్నారు. అంబేద్కర్ గురించి నేరుగా చదివిన తరువాత బయటకు చెప్పిదానికి భిన్నంగా ప్రతిదీ సంఘపరివార్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకుపోతామని బిజెపి నిబంధనావళిలో చేర్చకపోవటానికి కారణమిదే.
మనదేశంలో కులవ్యవస్థ, అంటరానితనం ఎందుకు ఉన్నదంటే కాషాయ దళాలు వెంటనే చెప్పే సమాధానం అరబ్, ఇస్లామిక్ దండయాత్రలే కారణం అంటారు. హిందూ స్వాభిమానాన్ని దెబ్బతీసేందుకు హిందూ ఖైదీలను చర్మం తీసేవారిగా, గొడ్డు మాంసం కొట్టే అంటరానివారిగా మార్చారని చెబుతారు. ఎనిమిదవ దశాబ్దం తరువాత ఇస్లామిక్ దండయాత్రలు ప్రారంభమై ఉత్తర ఆఫ్రికా, మధ్యఆసియా, మధ్యప్రాచ్యదేశాల్లో సాగాయి. పదకొండవ శతాబ్దంలో మనదేశం మీద జరిగాయి. ఇతర దేశాలలో కూడా అక్కడ ఉన్న ఏదో మతానికి చెందిన వారిని ఖైదీలుగా పట్టుకొని ఉంటారుగా వారినెందుకు అంటరానివారిగా మార్చలేదు ? నరేంద్రమోడీ సర్కార్ ఎదుర్కొంటున్న సవాళ్లు రోజు రోజుకూ పెరుగుతున్నాయి, ఆపరేషన్ సిందూర్ గురించి జనంలో పెరిగిన అనుమానాలు బలపడటం తప్ప వాటిని తీర్చే స్థితిలో బిజెపి లేదు. అందుకే అంత్యవసరపరిస్థితి 50 ఏండ్ల సభ పేరుతో జనం దృష్టిని మళ్లించేందుకు రాజ్యాంగంలో సోషలిస్టు, లౌకికవాద పదాలను సమీక్షించాలన్న వివాదాన్ని రేపారు .75 ఏండ్లు గడచిన సందర్భంగా రాజ్యాంగం నుంచి ఆ రెండు పదాలను తొలగించాలని సుప్రీం కోర్టులో అనేక కేసులు దాఖలయ్యాయి. వాటి మీద సుదీర్ఘవిచారణ జరిపిన కోర్టు 2024 నవంబరు 25న ఇచ్చిన తీర్పులో వాటిని కొట్టివేసింది. తొలుత ఆమోదించిన రాజ్యాంగ పీఠికలో ఆ పదాలు లేవు గనుక వాటిని తొలగించాలనే వాదనలను తోసిపుచ్చింది. రాజ్యాంగబద్దమే అని స్పష్టం చేసింది. ఆ తరువాత కూడా హోసబలే సమీక్ష చేయాలని అంటున్నారంటే ఆ తీర్పును కూడా అంగీకరించటం లేదన్నది స్పష్టం. అధికారం ఉంది గనుక ఏమైనా చేయగల సమర్ధులు, ఏకంగా పార్లమెంటునే తగులబెట్టించిన హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నవారు రాజ్యాంగానికి, న్యాయవ్యవస్థకూ ముప్పు తెచ్చినా ఆశ్చర్యం లేదు, జనం ఆలోచించాలి మరి !



