Tags
2023 Israel–Hamas war, emmanuel macron, Gaza Tunnels, Joe Biden, Justin Trudeau, Narendra Modi Failures, UNSC Failures
ఎం కోటేశ్వరరావు
గాజాపై ఇజ్రాయెల్ మారణకాండ ప్రారంభమైన నలభై రోజుల తరువాత తొలిసారిగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మానవతా పూర్వక కోణంలో దాడులను ఆపాలని యూదు దురహంకారులను కోరుతూ 12-0 ఓట్లతో వేడుకోలు తీర్మానాన్ని ఆమోదించింది.అనేక దఫాల చర్చల అనంతరం మాల్టా ప్రతిపాదించిన ఈ తీర్మానంలో హమస్‌ను ఖండించలేదు గనుక తాము బహిష్కరించినట్లు అమెరికా, బ్రిటన్ ప్రకటించాయి. ఇజ్రాయెల్‌ను డిమాండ్ చేయకుండా వేడుకోవటం ఏమిటంటూ రష్యా నిరసనతో ఓటింగ్‌కు దూరంగా ఉంది.ప్రపంచంలో లక్షలాది మంది ప్రతి రోజూ ఏదో ఒక మూల నిరసన తెలుపుతున్నా, ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానం చేసినా పెడచెవిన పెట్టిన ఇజ్రాయెల్ ఈ తీర్మానాన్ని మన్నిస్తుందా ! వెనక్కు తగ్గుతుందా ? గాజాలోని ప్రధాన ఆసుపత్రి కింద నేలమాళిగల్లో దాక్కున్న హమస్ తీవ్రవాదులను పట్టుకొనే పేరుతో మొత్తం ఆసుపత్రినే పనికి రాకుండా చేసిన ఇజ్రాయెల్ మిలిటరీ అక్కడ ఎంత మంది తీవ్రవాదులను పట్టుకున్నదీ చెప్పకుండా ఆయుధాలను కనుగొన్నామంటూ లోకాన్ని నమ్మింపచేసేందుకు కొన్ని ‘ సిత్రాలను ‘ చూపుతున్నది. ఇలాంటి ఫేక్ వీడియోలు ఎక్కడైనా తయారు చేయవచ్చు, తాన అంటే తందాన అనే బిబిసి లాంటి టీవీలు అవి నిజమే అంటూ ప్రపంచాన్ని నమ్మించేందుకు నానా గడ్డీ కరవవచ్చు తప్ప లోకజ్ఞానంతో ఆలోచించే వారెవరూ నమ్మరు. నివాస ప్రాంతాలు, జనాన్ని మానవ కవచాలుగా వాడుకుంటున్న ఉగ్రవాదులు అంటూ ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నది.
గాజా ప్రాంతంలో సొరంగాలు ఉన్న అంశం కొత్తేమీ కాదు. వాటిపైన ఆసుపత్రులు, స్కూళ్లు, నివాసాలు, ఫ్యాక్టరీలు అన్నీ ఉన్నాయి. యూదు దురాక్రమణను ఎదిరించేందుకు పాలస్తీనా పోరాటయోధులు హమస్ ఆవిర్భవించక ముందు కొన్ని దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేసుకున్నారు. అవి వారి పోరుబాటలో విడదీయలేనివిగా మారాయి.అక్కడేమీ అడవులు, ఎడారులు లేవు. అక్కడే నివాసాలు, అవే పోరాట కేంద్రాలు. అక్కడ పుట్టి పెరిగే ప్రతి బిడ్డా అక్షరాభ్యాసంతో పాటు పోరుబాట పాఠాలు కూడా నేర్చుకోక తప్పని స్థితిని సామ్రాజ్యావాదులు, వారి బంటుగా ఉన్న ఇజ్రాయెల్ కల్పించిన కఠిన సత్యాన్ని ఎవరూ విస్మరించకూడదు. నిత్యం ఎప్పుడేమౌతుందో ఇజ్రాయెల్ పోలీసు, మిలిటరీ, యూదు ఉగ్రవాదులు ఎప్పుడు దాడులు చేస్తారో తెలియని స్థితిలో కార్చటానికి కన్నీళ్లు కూడా లేకుండా దశాబ్దాల తరబడి పెరిగారు, అక్కడే మట్టిలో కలిశారు. ఇప్పుడు ఈజిప్టు నేతలు అమెరికా చంకనెక్కి ఇజ్రాయెల్‌తో సఖ్యంగా ఉంటున్నారు తప్ప గతంలో అధికారంలో ఉన్నవారి ప్రోత్సాహం, సాయంతోనే పాలస్తీనా వారు సొరంగాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదిరిన తరువాత తమ భూభాగంలో ఉన్నవాటిని ఈజిప్టు కొన్నింటిని కూల్చివేసి, మూసివేసి, గోడలు కట్టి పాలస్తీనియన్లను రాకుండా కట్టడి చేసింది.
గాజాపై ఇజ్రాయెల్ దురాక్రమణ, మారణకాండ ప్రారంభించిన అక్టోబరు ఏడవ తేదీ నుంచి అక్కడ ఉన్న సొరంగాల గురించి పెద్ద ఎత్తున ప్రసారమాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇజ్రాయెల్ అమలు చేసిన దిగ్బంధనాన్ని వమ్ము చేసేందుకు వాటిని తవ్వారు. ఈజిప్టు నుంచి గాజా అక్కడి నుంచి పశ్చిమగట్టుతో పాటు ఇజ్రాయెల్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వాటిని విస్తరించారు.ఆహారం, ఇంథనం, ఔషధాలు, నిత్యావసర వస్తువులు వేటినీ అందనివ్వకుండా గాజా నుంచి పాలస్తీనియన్లు వారంతట వారే వేరే చోట్లకు తరలిపోయేట్లు చేసేందుకు అష్టదిగ్బంధనం చేశారు.ఈజిప్టు నుంచి వాటిని తెచ్చుకొనేందుకు తవ్విన సొరంగాలను స్మగ్లింగ్ మార్గాలుగా ప్రచారం చేశారు. గాంధీని మోసిన రైలు గాడ్సేను కూడా తీసుకువెళ్లింది అన్నట్లుగా కొన్ని సందర్భాలలో దొంగరవాణాకు ఉపయోగించిన వారు ఉంటే ఉండవచ్చు తప్ప అందుకోసమే వాటిని తవ్వలేదు. సరకులతో పాటు పాలస్తీనా యోధులకు ఇతర దేశాలు అందచేసిన ఆయుధాలను కూడా ఆత్మరక్షణకు ఆ మార్గాలద్వారా తీసుకురాబట్టే ఇజ్రాయెలీ మూకలు కొంత మేరకు అదుపులో ఉన్నాయి.
1979లో ఈజిప్టు-ఇజ్రాయెల్ మధ్య మైత్రి కుదిరింది.1987 నుంచి 1993వరకు సాగిన తొలి తిరుగుబాటుకు ఇజ్రాయెల్ రెచ్చగొట్టుడే కారణం. గాజాలోని జబాలియా ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిర్వాసిత పాలస్తీనీయన్ల శిబిరం మీదకు ఒక ట్రక్కుతో ఇజ్రాయెల్ మిలిటరీ చేసిన దాడిలో ముగ్గురు మరణించారు. అది ప్రమాదమని నమ్మబలికినప్పటికీ కావాలనే చేసిందనే ఆగ్రహంతో పాలస్తీనియన్లు ప్రారంభించిన నిరసన, ప్రతిఘటన ఐదేండ్లు సాగింది. ప్రధానంగా రాళ్లు, సీసాల్లో మండే ద్రావకాలను నింపి వాటికి ఫీజులు అమర్చి(మాల్టోవ్ బాంబు) సైనికుల మీద దాడులు చేశారు. అందుకనే దాన్ని రాళ్ల తిరుగుబాటు అని కూడా కొందరు వర్ణించారు. ఆ సందర్భంగానే సొరంగాల ద్వారానే అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్దాలను తిరుగుబాటుదారులు సమకూర్చుకున్నారు. ఓస్లో ఒప్పందాలను ముందుకు తెచ్చిన తరువాత తిరుగుబాటు ముగిసింది. దాంతో ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టిన ఇజ్రాయెలీ మిలిటరీ సొరంగాలు ఉన్నట్లు 1983లో అధికారికంగా ప్రకటించింది. 2009లో కొత్త వాటిని తవ్వేందుకు, ఉన్నవాటిని వినియోగించేందుకు వీలు లేకుండా ఈజిప్టు తన ప్రాంతంలో భూగర్భ ఆటంకాలను నిర్మించింది. అనేక సొరంగాలను మూసివేసింది.భూమి మీద ఉన్న సరిహద్దుద్వారానే రాకపోకలకు అవకాశమిచ్చింది.2007లో గాజా ప్రాంతంలో హమస్ పట్టు సాధించి ఆ ప్రాంతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గాజా పౌరులు కదలకుండా మెదలకుండా ఉండేందుకు ఈజిప్టు-ఇజ్రాయెల్ రెండూ ఆంక్షలను మరింత కఠినతరంగావించాయి. దానిలో భాగంగానే ఈజిప్టు 2013,14 సంవత్సరాలలో పన్నెండు వందల సొరంగాలను నాశనం చేసింది.
గాజాను దిగ్బంధించిన కాలంలో అధికారికంగా అనుమతించిన వాణిజ్యం కంటే సొరంగాల ద్వారానే ఎక్కవగా జరిగినట్లు 2015 నివేదికలో ఆంక్టాడ్ పేర్కొన్నది.2008.09 సంవత్సరాలలో గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ధ్వంసమైన ఆరువేల ఇండ్లను నిర్మించేందుకు ఇజ్రాయెల్ అనుమతించిన మేరకు అవసరమైన సామగ్రిని తరలించేందుకు నిర్మాణం గావించేందుకు ఎనభై సంవత్సరాలు పట్టేది. కానీ సొరంగాల ద్వారా పాలస్తీనియన్లు వాటిని సమకూర్చుకొని కేవలం ఐదు సంవత్సరాల్లోనే పూర్తి చేశారు. గాజాలో ఉన్న ఏకైక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నడవటానికి రోజుకు అవసరమైన పదిలక్షల లీటర్ల డీజిల్‌ను ఈజిప్టు నుంచి తెచ్చుకొనేందుకు కూడా అవే రవాణా మార్గాలు. గాజాలోని, మురుగు, ఉప్పునీటిని శుద్ధి చేసేందుకు అవసరమైన విద్యుత్ కోసం ఈ కేంద్రాన్ని వినియోగించారు. ఈజిప్టు తన ప్రాంతంలో ఉన్న సొరంగాలను మూసివేసిన తరువాత డీజిల్ దొరక్క ఆ కేంద్రం మూతపడింది. దాంతో మురుగు నీటిని సముద్రంలోకి వదలటంతో సముద్ర తీరంలో కాలుష్య సమస్య ఏర్పడింది. గాజాపై దిగ్బంధనాన్ని తొలగించి టన్నెల్ ఆర్ధిక వ్యవస్థకు స్వస్తి పలకాలని ఆంక్టాడ్ పేర్కొన్నది. నిర్మాణ సామాగ్ర రవాణాకు తాము అనుమతిస్తే వాటితో హమస్ మిలిటరీ అవసరాల కోసం వినియోగిస్తుందని ఇజ్రాయెల్ సాకులు చెప్పింది. రంజాన్ సందర్భంగా గాజా వెలుపలికి వెళ్లాలంటే ఈజిప్టు, ఇజ్రాయెల్ అనుమతించిన గేట్లద్వారానే వెళ్లాల్సి ఉండేది. సాకులు చెప్పి అనేక పరిమితులు విధించిన కారణంగా రాకపోకలకు కూడా ఆ సొరంగాలే పనికి వచ్చాయి. ఇజ్రాయెల్‌లో జనసమ్మర్ధం లేని, కాపాలా పెద్దగా లేని ప్రాంతాలకు ఈ సొరంగమార్గాలు విస్తరించి వాటి ద్వారా కూడా లావాదేవీలు నిర్వహించారు.
నెలరోజులకు పైగా టాంకులు, క్షిపణులతో ఒక్కో ఆసుపత్రిని ధ్వంస చేస్తున్న పూర్వరంగంలో ఒకవేళ నిజంగానే తీవ్రవాదులు ఎవరైనా ఆ సొరంగాల్లో ఉంటారా, ఇజ్రాయెల్, పశ్చిమదేశాల మీడియాలో చూపేందుకు ఆయుధాలను అక్కడే వదలి వెళతారా? 1967 యుద్దంలో ఈజిప్టు రక్షణలో ఉన్న గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఓస్లో ఒప్పందాల్లో భాగంగా 1993లో పాలస్తీనా అధారిటీకి వాటిని అప్పగించినట్లు ప్రకటించినప్పటికీ 2005లో మాత్రమే సైన్యాన్ని, అక్కడ నివాసాలు ఏర్పాటు చేసి ప్రవేశపెట్టిన యూదు పౌరులను వెనక్కు తీసుకుంది. ఆ తరువాత కూడా ఈజిప్టు పాలకులతో చేతులు కలిపి గాజాను దిగ్బంధం చేసింది, హమస్ తీవ్రవాదులను అణచేపేరుతో అనేక సార్లు గాజా మీద దాడులు చేసి వేలాది మందిని బలితీసుకుంది.తాజాగా అదే సాకుతో చేస్తున్న దాడులు మరింత దుర్మార్గంగా ఉన్నాయి, ఆసుపత్రులను కూడా వదల్లేదు.భద్రతా మండలి తీర్మానం భాషలో తొలుత కాల్పుల విరమణ పాటించాలనే డిమాండ్‌ను పెట్టగా తరువాత దాన్ని తొలగించి పిలుపు అనే పదాన్ని చేర్చారంటేనే దాన్ని ఇజ్రాయెల్ దయాదాక్షిణ్యాలకు వదలి పెట్టారన్నది స్పష్టం. కాదని ఠలాయిస్తే మీద చర్యలు తీసుకొనేందుకు ఎలాంటి ప్రతిపాదనలూ దానిలో లేవు. గతంలో బాల్కన్ నుంచి సిరియా వరకు అనేక సందర్భాల్లో ఇలాంటి వాటిని ఆమోదించారు. వాటిని పట్టించుకున్నవారుగాని, ఎలాంటి ఫలితంగాని లేదు. సరిగ్గా ఈ తీర్మానం ఆమోదిస్తున్న తరుణంలోనే గాజాలో పోరు తరువాత బలమైన మిలిటరీ శక్తిని అక్కడ ఉంచుతాం అని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హర్‌జోగ్ చెప్పాడు. ఇదే సమయంలో గాజాను ఆక్రమించటం పెద్ద తప్పిదం అవుతుందని స్పష్టం చేసినట్లు అమెరికా అధినేత జోబైడెన్ కొత్త పల్లవి అందుకొన్ని నాటకంలో మరో అంకానికి తెరలేపాడు.
మారణకాండను సమర్ధించటంలో ఎవరి పాత్రను వారు పోషిస్తున్నారు. పౌరులను చంపివేస్తున్నారని తక్షణమే కాల్పుల విరమణ జరగాలంటూ అక్టోబరు 26న ఐరాసా సాధారణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై మన దేశం ఓటింగ్‌లో పాల్గొనలేదు, అంటే పరోక్షంగా ఇజ్రాయెల్‌ను సమర్ధించినట్లే. పేద దేశాల రెండవ వాణి సదస్సులో శుక్రవారం నాడు ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ గాజాలో సాధారణ పౌరులను చంపివేయటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పటం విశేషం. దీన్నే ఏ రోటి దగ్గర ఆ పాటపాడటం అంటారు. ఐరాసలో ఇజ్రాయెల్‌ను ఖండిస్తే అమెరికాకు ఆగ్రహం కలుగుతుంది. పేద దేశాల సమావేశంలో ఖండించకపోతే వాటికి దూరం అవుతారు.పన్నెండు వేల మంది మరణించిన పూర్వరంగంలో ప్రపంచ మద్దతు కోల్పోతున్న ఇజ్రాయెల్‌ను నిస్సిగ్గుగా సమర్ధించిన వారే మాట మార్చిన తరువాత నలభై రెండవ రోజున నరేంద్రమోడీ నోరు విప్పారు. పిల్లలను చంపటాన్ని నిలిపివేయాలని గతవారంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రడెవ్, ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్ ఇజ్రాయెల్‌ను కోరారు. వారు ప్రారంభం నుంచీ ఇజ్రాయెల్‌కు గట్టి మద్దతుదారులుగా ఉన్న సంగతి తెలిసిందే. తొలుత హమస్ తీవ్రవాదులను అణచివేస్తున్నామని బుకాయించిన ఇజ్రాయెల్ మాటలను ఎవరూ నమ్మని స్థితి వచ్చింది. పౌరుల మరణాలను తగ్గించటంలో తాము విజయవంతం కాలేదని చివరికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా చెప్పాల్సి వచ్చింది ప్రజాభిప్రాయానికి, ఆగ్రహానికి వారు తలొగ్గి మాట మార్చిన తరువాతే నరేంద్రమోడీ స్పందించారు.
