Tags
BJP, China, Hindutva nationalism, Joe Biden, Narendra Modi Failures, Propaganda, RSS, Ukraine crisis, Vladimir Putin, Zelensky
ఎం కోటేశ్వరరావు
‘‘ నిజం…మోడీ ది ఉక్కు దౌత్యం…ఉక్రెయిన్ వ్యూహాత్మక పరిశ్రమల మంత్రి క్యమిషిన్…మోడీ ముప్ఫై గంటల అసాధారణ దౌత్య ప్రక్రియ…పోలాండ్ సరిహద్దు పట్టణం జెమిసిల్ నుంచి ఉక్రెయిన్ కివీవ్ కు 700 కిలోమీటర్లు ప్రయాణం…మొత్తం యుద్ధ ప్రమాద ప్రాంతమే….పది గంటలు రానూ… పది గంటలు పోనూ… అక్కడో పది గంటలు…యూరోప్..అమెరికా…మరో ప్రక్క రష్యా అసాధారణ ఉత్కంఠ మధ్య..చూపులన్నీ ఈ ఉక్కు మనిషి పైనే…రైల్ ఫోర్స్ వన్…మహా గట్టి రైలు…కదులుతున్న దుర్భేద్యమైన రైలు…దాన్ని అనుసరిస్తూ… రాడార్లు…సైనిక విమానాలు…అంటే ఒక రకంగా మూడు రోజుల పా టు…యుద్ధం ఆగిపోయినట్టే…అక్కడ మాదే విజయం..ఇక్కడ మాదే పై చేయి అంటూ ప్రస్తుతం రష్యా ఉక్రైన్లు ఉత్తుత్తి ప్రకటనలు…పోలాండ్..ఒకప్పటి వార్సా సంధికి ప్రసిద్ధి…ఏదో చెప్పాల్సినవి అన్నీ మోడీకి చెప్పేసుకున్నామన్న సంతృప్తి నాటోకి…ప్రపంచానికి తమ బాధ ఆగ్రహం మోడీయే అర్థం చేయించగలుగుతారన్న ఆశ ఉక్రెయిన్దీ….ఒక్కసారిగా పెరిగిపోయిన భారత్ ప్రసిద్ధి చూసి…అసూయా ద్వేషాలతో రగిలిపోతున్న ఆయుధ వ్యాపార లాబీలు…భారత్ ఆంతరంగిక వైఫల్యాలను ఎత్తి చూపడానికి మనకి ఇక్కడొక రాహువును వదిలిపెట్టారు…ఆటలో ఆటం బాంబు…సరే ఏదేమైనా రష్యా ఆయిల్ ఇస్తూనే ఉంటుంది…మన ద్వారా యూరోప్ కొంటూనే ఉంటుంది…మన డబ్బులు…మన ఆయిల్ రిజర్వులు పెరుగుతూనే ఉంటాయి…ఇది ఒక రకంగా యుద్ధ ఆర్థిక దౌత్యం…శ్రావణ్ శుక్రవారం మహాలక్ష్మి అనుగ్రహం…ఇలాంటి విన్యాసాలు కేవలం శక్తిమంతమైన దేశాలు మాత్రమే…తెలివైన దేశాలు మాత్రమే చెయ్యగలుగుతాయి…ఇప్పుడు భారత్ అంటే….భారత్ అంతే…మీ ఏడుపులే మన ఎదుగుదల…ఈ సమయంలో ఎవరెవరు ఏడుస్తారో చూస్తే చాలు…మనకు అర్థం అయిపోతుంది…రైలు ప్రయాణ సమయంలోనే …శత్రువును గమనించు…! అక్కడా…ఇక్కడా కూడా! జైహింద్ ’’
ఆగస్టు నెలాఖరులో నరేంద్రమోడీ ఉక్రెయిన్ పర్యటన గురించి ఆకాశానికి ఎత్తుతూ వాట్సాప్ విశ్వవిద్యాలయంలో పేరు లేకుండా ఎప్పటి మాదిరే కాషాయ మరుగుజ్జులు పెట్టిన పోస్టు పూర్తి పాఠమది. అలాగే జరిగిందా ? ఎవరేమంటున్నారు, నిజం ఏమిటి ? ఉక్రెయిన్ వివాదంలో భారత్ తటస్థంగా ఉంది. జూలై నెలలో మోడీ మాస్కో వెళ్లి వ్లదిమిర్ పుతిన్ను ఆలింగనం చేసుకున్నారు. దాన్ని తప్పుపట్టిన ఉక్రెయిన్ అధినేత జెలెనెస్కీ ఆగస్టు 23న మోడీ తమదేశాన్ని సందర్శించినపుడు అదే చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలో పేరు మోసిన రక్త పిపాసి నేరగాడిని మాస్కోలో కౌగలించుకుంది అని నాడు జెలెనెస్కీ ఎక్స్ చేశాడు. అదే వ్యక్తిని తాను కూడా కౌగలించుకోవటం ఏమిటి ? అదే నోటితో మోడీ జరిపిన తమ దేశ పర్యటన చరిత్రను సృష్టించిందని కూడా చెప్పాడు. ఆలింగనాల దౌత్యంలో ఎవరూ తక్కువ తినలేదు. మాస్కో వెళ్లినపుడు పశ్చిమదేశాలన్నీ మోడీని దుమ్మెత్తిపోశాయి. అది ఊహించిందే, వాటి ఆగ్రహాున్ని చల్లార్చి సంతుష్టీకరించేందుకు ఉక్రెయిన్ వెళ్లారు. కానీ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. అనుమానాలు, సందేహాలు వెల్లడిస్తూ వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఉక్రెయినుకు సౌహార్ద్రత ప్రకటించటం కంటేతన ప్రయోజనాలకే పెద్ద పీటవేసిందని ఆరోపించిన వారు కూడా ఉన్నారు.
తొలిరోజుల్లో టర్కీ ఒక ప్రయత్నం చేసింది తప్ప భారత్ లేదా మోడీని వివాదంలో మధ్యవర్తిగా ఎన్నడూ రష్యా పరిగణించలేదు. మనదేశం ఎన్నడూ అలా ప్రకటించుకోలేదు. తమ అతిధిగా వచ్చిన మోడీని జెలెనెస్కీ అవమానించటమే కాదు, ఇరకాటంలో పెట్టాడు. మోడీ స్వదేశానికి తిరుగు ప్రయాణమైన తరువాత కనీస దౌత్య మర్యాదలను కూడా పాటించకుండా వ్యవహరించాడు. జూన్ నెలలో స్విడ్జర్లాండ్‌లో ఒక శాంతి సమావేశం జరిగింది. దానికి రష్యాను అసలు ఆహ్వానించలేదు, చైనా వెళ్లలేదు, భారత్‌తో సహా పదమూడు దేశాలు హాజరైనప్పటికీ ఆ సమావేశం విడుదల చేసిన ప్రకటన మీద సంతకం చేయలేదు. భారత్ మరో శాంతి సమావేశం జరిపితే ఆహ్వానిస్తాం గానీ అది జరగటానికి ముందు భారత్ స్విస్ ప్రకటన మీద సంతకం చేయాలని జెలెనెస్కీ షరతు పెట్టాడు. మనదేశ వైఖరి తెలిసి కూడా విలేకర్లతో అలా మాట్లాడటం చౌకబారు తనం తప్ప మరొకటి . కాదు, పైగా జెలెనెస్కీ ఆహ్వానం మీదనే మోడీ వెళ్లారు. స్వాగతం చాలా మోటుగా లేదా వికారంగా పలికినట్లు బిబిసి వర్ణించింది. ‘‘విశ్వగురువు’’ కు ఇది అవమానమా ? ఘనతా ?
‘‘ పేద దేశాలు రెండవ శాంతి సమావేశం జరిపితే మంచిదని నేను నిజంగా నమ్ముతున్నాను. సౌదీ అరేబియా,కతార్,టర్కీ వంటి దేశాలు ఉన్నాయి. భారత్‌లో మనం అలాంటి సమావేశం నిర్వహించవచ్చని నేను నరేంద్రమోడీతో చెప్పాను. అది పెద్ద దేశం, అతిపెద్ద ప్రజాస్వామికదేశం. స్విస్ శాంతి సభ ప్రకటనపై సంతకం చేసిన దేశంలోనే సభ జరగాలి.అయితే నేను నిర్మొహమాటంగా చెప్పదలచుకున్నాను. ఈ షరతు కేవలం భారత్‌కు మాత్రమే కాదు. రెండవ సభ జరపాలని సానుకూలంగా కోరుకుంటున్న ఏ దేశానికైనా ఇదే వర్తిస్తుంది. శాంతి (స్విడ్జర్లాండ్) సమావేశ ప్రకటనపై ఇప్పటికీ సంతకం చేయని ఏ దేశంలో కూడా జరపటానికి మాకు కుదరదు ’’ అని మోడీ భారత్‌కు తిరుగు ప్రయాణమైన తరువాత భారతీయ విలేకర్ల సమావేశంలో జెలెనెస్కీ చెప్పినట్లు కీవ్ ఇండిపెండెంట్ అనే పత్రిక రాసింది.రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ దాని యుద్ధ ఆర్థికానికి భారత్ సాయపడుతున్నదని జెలెనెస్కీ చెప్పాడు. మోడీ రష్యా పర్యటన జరిపిన రోజే తమ అతిపెద్దదైన పిల్లల ఆసుపత్రి మీద దాడి జరిపిన పుతిన్‌కు నరేంద్రమోడీ అంటే గౌరవం లేదని వెల్లడి కాలేదా అంటూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. మీరు గనుక చమురు దిగుమతులు నిలిపివేస్తే పుతిన్‌కు పెద్ద సవాలు ఎదురౌతుంది.మోడీ శాంతిని కోరుకుంటున్నారు తప్ప పుతిన్ కాదన్నాడు. జెలెనెస్కీ విలేకర్ల సమావేశంలో మొరటుగా మాట్లాడాడు. అంతర్గతంగా మాట్లాడాల్సిన వాటిని విలేకర్ల ముందు చెప్పాడు.
మోడీ రష్యా పర్యటనపై విమర్శలకు దిగిన ఉక్రెయిన్, అమెరికాల ఆగ్రహాన్ని తగ్గించే నష్ట నివారణ చర్యగా ఉక్రెయిన్ పర్యటన జరిగిందని, శాంతికి కట్టుబడి ఉన్న భారత్‌కు, దానితో రష్యా సంబంధాలకు ఒక సవాలుగా ఈ పర్యటన మారిందన్న ఒక విశ్లేషకుడి వ్యాఖ్యను చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ ఉటంకించింది. స్విస్ ప్రకటనపై మనదేశం సంతకం చేయకపోతే అమెరికాకు, చేస్తే రష్యాకు ఆగ్రహం కలుగుతుంది.ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరి పరిస్థితి ఉంది. రష్యా కురుస్కు ప్రాంతంపై ఉక్రెయిన్ దాడి చేసినందున చర్చలకు అవకాశం లేదని పుతిన్ ప్రకటించిన తరువాత మోడీ జరిపి కీవ్ పర్యటన శాంతికి దోహదం చేస్తుందా ? అసలు ఎవరైనా వినిపించుకుంటారా ? తాము మధ్యవర్తి పాత్రను పోషించాలని కోరుకోవటం లేదని, ఉక్రెయిన్`రష్యా కోరితే వర్తమానాలను పరస్పరం తెలియ చేస్తామని భారత అధికారులు చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక రాసింది. పశ్చిమ దేశాలలో రష్యా ఒంటరిపాటైతే ఆసియాలో భారత ప్రత్యర్ధిగా ఉన్న చైనాకు మరింత దగ్గర అవుతుందని, అలా కాకుండా ఉండాలంటే యుద్ధానికి ఒక పరిష్కారం అవసరమని భారత్ భావిస్తోందని కూడా ఆ పత్రిక పేర్కొన్నది. ఉక్రెయిన్ వివాదంలో తటస్థంగా ఉన్న చైనా శాంతి ప్రతిపాదన చేసింది. జెలెనెస్కీ నుంచి దాని మీద ఎలాంటి స్పందన లేదు.మన వైపు నుంచి ఎలాంటి ప్రతిపాదనా లేదు.
తన పర్యటన తరువాత నరేంద్రమోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మరుసటి రోజు వ్లదిమిర్ పుతిన్‌కు ఉక్రెయిన్‌తో జరిపిన చర్చల గురించి వివరించినట్లు ఒక ఎక్స్ ద్వారా తెలిపారు. వివాదానికి శాంతియుత ముగింపు పలకాలంటే చర్చలు, దౌత్య పద్దతుల్లో చిత్తశుద్దితో నిమగ్నం కావాలని మోడీ చెప్పినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ కురుస్కు ప్రాంతం మీద ఉక్రెయిన్ దాడి చేసిన తరువాత పుతిన్ సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. రెండు దేశాల మధ్య పరిస్థితి విషమించటం తప్ప మెరుగుపడే అవకాశాలు లేవు.పరిస్థితి ఇలా ఉండగా అతిశయోక్తులతో కూడిన ఊరూ పేరూ లేని ప్రకటనలు, ప్రచారాలను నమ్మేంత అమాయకంగా వాట్సాప్ జనాలు ఉన్నారని భావించటం తప్ప మరొకటి కాదు ! పోలాండ్, ఉక్రెయిన్ పర్యటన జరిగింది రెండు రోజులైతే మూడు రోజులు యుద్ధం ఆగిపోయిందని చెప్పటాన్ని బట్టి మా ఊరి మిరియాలు తాటికాయలంత ఉంటాయి దొరా అన్నట్లు ఉంది.
