Tags
2023 Israel–Hamas war, ‘Crimes’ Against Palestinians, Iran protests, Israeli Aggression, Joe Biden, Netanyahu, Palestinian People, Riyadh Arab-Islamic summit, Saudi Arabia
ఎం కోటేశ్వరరావు
గాజాలో ఇజ్రాయెల్ యూదు దురహంకారులు జరుపుతున్న మారణకాండను ఖండించటంలో ముక్తకంఠంతో ఉన్న అరబ్, ఇస్లామిక్ దేశాలు దానిపై నిర్దిష్ట చర్యల అంశంపై సంశయంలో పడ్డాయి. శనివారం నాడు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరిగిన అరబ్‌లీగ్-ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ(ఓఐసి) అసాధారణ సంయుక్త సమావేశం జరిగింది. తక్షణమే గాజాపై జరుపుతున్న దాడులను విరమించాలని, అందుకోసం ఐరాస నిర్ణయాత్మక, కట్టుబడి ఉండేందుకు వీలైన తీర్మానం చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. ఆచరణాత్మక చర్యలు తీసుకొనే అంశంలో ఇరాన్ చేసిన ప్రతిపాదనలను సమావేశం పక్కన పెట్టింది. అనేక దేశాలకు అమెరికాతో ఉన్న సంబంధాలే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అక్టోబరు ఏడు నుంచి ఇజ్రాయెల్ కారణకాండను సాగిస్తున్నది.గాజాలో ఉన్న ఆసుపత్రులను అడ్డం పెట్టుకొని హమస్ తీవ్రవాదులు ఆయుధాలు దాచారనే సాకుతో ప్రధాన ఆసుపత్రితో సహా అన్ని వైద్య సదుపాయాలను నాశనం చేశారు. ఇప్పటివరకు పన్నెండువేల మందికి పైగా మరణించగా వారిలో పిల్లలు, మహిళలే 70శాతం ఉన్నారు. వీరిలో ఎందరు తీవ్రవాదులు ఉన్నదీ లేదా వారి ప్రతిఘటనదాడుల్లో మరణించిన తమ సైనికుల గురించి నిర్దిష్టమైన సమాచారం ఇజ్రాయెల్ చెప్పటం లేదు. దాని కట్టుకథలు, పిట్టకతలను వల్లిస్తూ మానవత్వం గురించి నిత్యం ధర్మపన్నాలు వల్లింఏ పశ్చిమ దేశాలు ఆత్మరక్షణ పేరుతో సాగిస్తున్న మారణకాండను నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి. మరోవైపు ఈ దాడులకు ప్రపంచమంతటా తీవ్ర వ్యతిరేకత వెల్లడి అవుతున్నది. బ్రిటన్ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా మూడుల లక్షల మంది పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శన జరిపారు.
గాజాలో వంద మందికి పైగా ఐరాస సహాయక సిబ్బందితో సహా అక్టోబరు ఏడు నుంచి నవంబరు 13వ తేదీ వరకు 11,240 మంది మరణించగా వారిలో పిల్లలు 4,609 మంది ఉన్నారు. చెబుతున్నదాని కంటే మరణాలు ఎక్కువగా ఉండవచ్చని అమెరికా అధికారులు చెబుతున్నారు. గాజాలో ప్రతి పది నిమిషాలకు ఒక పసిప్రాణాన్ని ఇజ్రాయెల్ బలిగొంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ చెబ్రియోసుస్ భద్రతా మండలిలో చెప్పాడు. గాజాలో ఎవరూ ఎక్కడా సురక్షితంగా లేరని అన్నాడు. ది న్యూఅరబ్ అనే మీడియా సంస్థ నవంబరు పదవ తేదీ నాటికి ఉన్న పరిస్థితి గురించి ఒక సమీక్షను ఇచ్చింది. దాని ప్రకారం 11,078 మంది మరణించారు. పౌరులు 10,203, వారిలో 4,506 మంది పిల్లలు, 3,207 మంది మహిళలు, 190 మంది ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. గాయపడిన వారు 30,220 కాగా పిల్లలు 8,663, మహిళలు 6,327 మంది. వీరు గాక శిధిలాల కింద మరో 2,551 మంది ఉన్నారు. పదహారు లక్షల మంది నెలవులు తప్పారు. 53,700 భవనాలు పూర్తిగా ధ్వంసం కాగా మరో 1,56,200 పాక్షికంగా దెబ్బతిన్నాయి.మీడియా సంస్థలు ఉన్న 111పూర్తిగా నాశనం లేదా దెబ్బతిన్నాయి,46 మంది జర్నలిస్టుల ప్రాణాలను తీశారు. పరిశ్రమలు 790, స్కూళ్లు 214,ఆరోగ్య వసతులు 113,మసీదులు 64, చర్చ్‌లు మూడు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్ గాజాలోని తమ ప్రాంగణాలపై జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వంద మంది తమ సిబ్బందికి సంతాపసూచకంగా ఐరాస పతాకాన్ని అవనతం చేసి నివాళి అర్పించింది. ఐరాస ప్రాంగణాల్లో కూడా హమస్ తీవ్రవాదులు ఉన్నారని ఇజ్రాయెల్ బాంబులు వేసిందా ? ఏ విధంగానూ సమర్ధించుకోని విధంగా మొత్తం గాజాను నివాసానికి పనికి రాకుండా చేసేందుకు, అక్కడి ఇరవై మూడులక్షల మందిని ఎడారి ప్రాంతాలకు తరిమివేసేందుకు యూదు దురహంకారులు దమనకాండ సాగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
తొలుత శని, ఆదివారాల్లో అరబ్ లీగ్, ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ సమావేశాలను విడివిడిగా జరపాలని సౌదీ అరేబియా ఏర్పాట్లు చేసింది. అయితే ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెరగటంతో శనివారం నాడే రెండు సంస్థల సమావేశం జరిపారు.యాభై ఏడు దేశాల అధినేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.పదేండ్లకు పైగా ఉప్పు-నిప్పుగా ఉన్న ఇరాన్-సౌదీ అరేబియా మధ్య ఈ ఏడాది మార్చి నెలలో చైనా కుదిర్చిన సయోధ్య కారణంగా దశాబ్దం తరువాత తొలిసారిగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి సౌదీలో అడుగుపెట్టాడు. అదే విధంగా అరబ్ లీగ్‌లో పున:ప్రవేశానికి అంగీకరించటంతో సిరియా నేత అసాద్ కూడా రియాద్ సమావేశంలో భాగస్వామి అయ్యాడు. ఇజ్రాయెల్ దాడులను ఖండించటమే గాక దాని మీద ఆర్థిక, రాజకీయ ఆంక్షలను అమలు జరపాలని ఇరాన్ చేసిన ప్రతిపాదనకు కొన్ని దేశాలు వ్యతిరేకత వెల్లడించటంతో ఖండన వరకే తీర్మానంలో పొందుపరిచారు. అయినప్పటికీ ఐక్యత పెరగటం ఒక ముఖ్యపరిణామం. ఇది ఇజ్రాయెల్ మీద వత్తిడిని మరింత పెంచుతుంది. అడ్డగోలుగా దాన్ని సమర్దించే దేశాలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొనేట్లు చేసింది. పాలస్తీనా విముక్తికోసం పోరాడుతున్న హమస్ సంస్థకు అన్ని విధాలుగా ఇరాన్ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌తో సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకొనేందుకు ఇటీవలి కాలంలో అమెరికా అనేక దేశాలను అదిరించి బెదిరించి లొంగదీస్తున్నది, ఒప్పందాలు చేయిస్తున్నది.
గాజాపై ఇజ్రాయెల్ మారణకాండ ప్రారంభానికి కొద్ది వారాల ముందు సౌదీ అరేబియా రాజు కూడా ఇజ్రాయెల్‌తో సానుకూల సంబంధాలకు చర్చలు జరుగుతున్నట్లు ప్రకటించాడు. గత కొద్ది సంవత్సరాలుగా అరబ్బు, ఇస్లామిక్ దేశాలతో సంబంధాల ఏర్పాటు సాగుతున్నది. యూదులు, ముస్లింలు అబ్రహాంను దేవదూతగా పరిగణిస్తారు గనుక అవి కుదుర్చుకుంటున్న ఒప్పందాలను అబ్రహాం పేరుతో పిలుస్తున్నారు. 2020 తరువాత యునైటెట్ అరబ్ ఎమిరేట్స్,బహరెయిన్, మొరాకో, అంతకు చాలా సంవత్సరాల ముందు ఈజిప్టు, జోర్డాన్ ఒప్పందాలు చేసుకున్నాయి.వీటన్నింటి వెనుక అమెరికా ఉంది. ఈ ఒప్పందాలు చేసుకున్న దేశాల మధ్య వాణిజ్యం, యాత్రీకుల రాకపోకలు పెరగటం తప్ప అంతకు మించి పురోగతి లేదు. దానికి ప్రధాన కారణంగా పాలస్తీనా రాజ్య ఏర్పాటును ఇజ్రాయెల్, అమెరికా అడ్డుకోవటమే. తాజా పరిణామాలు దేనికి దారితీసేది చూడాల్సి ఉంది.హమస్‌కు ఇరాన్ మద్దతు బహిరంగ రహస్యమే. మధ్యధరా సముద్రంలో పెద్ద ఎత్తున అమెరికా నౌకాదళాన్ని మోహరించినప్పటికీ ఇటీవలి కాలంలో ఇరాక్, సిరియా, ఎమెన్లలో ఇరాన్ మద్దతు ఉన్న సాయుధశక్తులు 40 డ్రోన్, రాకెట్ల దాడులు చేశాయి.
ఇజ్రాయెల్‌కు ఆయుధాల విక్రయాన్ని నిలిపివేయాలని, పశ్చిమగట్టుతో గాజా సంబంధాన్ని తెంచివేయాలనే యత్నాలను అంగీకరించేది లేదని రియాద్ సభ స్పష్టం చేసింది. ఈ సమావేశంలో విబేధాలు కూడా వెల్లడయ్యాయి. ఇజ్రాయెల్ మిలిటరీని ఉగ్రవాద సంస్థగా పరిగణించాలని, అసలు ఇజ్రాయెల్ ఉనికినే గుర్తించరాదని, ఆర్థిక, రాజకీయ ఆంక్షలు విధించాలన్న ఇరాన్ ప్రతిపాదనను అంగీకరించలేదు. 1967జూన్ 4వ తేదీ నాటి సరిహద్దులు, ప్రాంతాలతో జరూసలెం రాజధానిగా పాలస్తీనా ఏర్పాటు జరగాలని అరబ్బుదేశాలు కోరాయి.రియాద్ సభ ఆమోదించిన తీర్మానం పట్ల తమకు కొన్ని మినహాయింపులున్నాయని ఇరాన్ అధ్యక్షుడు వెంటనే ప్రకటించాడు. ఆ మేరకు వాటి గురించి జడ్డాలోని అరబ్‌లీగ్ కార్యాలయానికి అధికారికంగా తెలియచేశారు.అరబ్-ముస్లిం దేశాలు తీసుకున్న వైఖరిని తాము ఆమోదించటం లేదని గాజాలో ఉన్న ఇస్లామిక్ జీహాద్ సంస్థ ప్రకటించింది. అవి తమ బాధ్యతను విస్మరించినట్లు అది పేర్కొన్నది. ఇజ్రాయెల్‌తో అన్ని రకాల సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని అల్జీరియా ప్రతిపాదించింది.
రియాద్ సమావేశంలో పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ ప్రతిపాదనల సారం ఇలా ఉంది. దురాక్రమణలు, దాడులను నివారించాల్సిన బాధ్యత కలిగిన భద్రతా మండలి దానికి కట్టుబడి ఉండాలి, వైద్య, ఆహార సరఫరాలను అనుమతించాలి, బలవంతంగా నిర్వాసితులను కావించటాన్ని అడ్డుకోవాలి.రెండు దేశాలను ఏర్పాటు చేయాలన్న తీర్మానాన్ని ఉల్లంఘించి పాలస్తీనా ప్రాంతాలను దురాక్రమించటం, యూదుల నివాసాలను పెంచటాన్ని నివారించేందుకు గతంలో చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం చెందాయి, ఇప్పుడు మారణకాండకు పూనుకున్నారు, ఈ కారణంగా మిలిటరీ, భద్రతా పరిష్కారాలను అంగీకరించేందుకు అంగీకరించం.గాజా ప్రాంతం పాలస్తీనాలో భాగంగానే ఉండాలి, గాజా, పశ్చిమగట్టుతో సహా పాలస్తీనా ప్రాంతాలన్నీ ఉండే విధంగా ఒక సమగ్ర రాజకీయ పరిష్కారం కావాలి.2007 నుంచి గాజాలో పాలస్తీనా అధారిటీ 20బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది, తమ పౌరుల పట్ల అధారిటీ బాధ్యత అది. పాలస్తీనా రాజ్యం, పౌరులకు భద్రతా మండలి రక్షణ కల్పించాలి. సర్వసత్తాక రాజ్యాన్ని సాధించేందుకు ఆచరణాత్మకమైన పరిష్కారం కావాలి. క్వుద్స్ (అరబ్బీలో జెరూసలెం పేరు) రాజధానిగా పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి, ఐరాస 149వ తీర్మానాన్ని అనుసరించి అది జరగాలి.అంతిమంగా రాజ్య స్థిరత్వానికి గాజా పునర్‌నిర్మాణంతో సహా ప్రభుత్వానికి అవసరమైన ఆర్థిక సాయానికి అంతర్జాతీయ మద్దతు అవసరం. అని అబ్బాస్ స్పష్టం చేశారు.
రియాద్ సమావేశం ఒక విధంగా మధ్యప్రాచ్యంలో అమెరికా వ్యూహానికి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇజ్రాయెల్-సౌదీ, ఇతర దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని కుదర్చాలని చూస్తున్న యత్నాలకు తాత్కాలికంగా విఘాతం కలిగినట్లే.ఇజ్రాయెల్‌ను అమెరికా అదుపు చేయకుండా సమర్ధించటం, గాజా పరిణామాలతో అరబ్ దేశాలు ఆశాభంగం చెందాయి.రియాద్ సభకు ముందు నవంబరు తొమ్మిదిన ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో ఆర్థిక సహకార సంస్థ(ఇసిఓ) పదహారవ సమావేశం జరిగింది. దీన్లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రెయిసీ, టర్కీ అధినేత రిసెప్ తయిప్ ఎర్డోగన్ వంటి వారు పాల్గొన్నారు.1980దశకం నుంచి పశ్చిమాసియాలోని పాలకవర్గాలపై అమెరికా పట్టు బిగిస్తున్నది.సోవియట్‌ను కూల్చివేసిన తరువాత అది మరింత వేగం పుంజుకుంది. తన మిలిటరీ, ఆర్థికశక్తితో పూర్తి ఆధిపత్యాన్ని సాధించేందుకు పూనుకుంది.ఇరాన్, సిరియా కొరకరాని కొయ్యలుగా ఉన్నాయి. ఆంక్షలతో వాటిని సాధించేందుకు చూస్తున్నది. మిగిలిన దేశాలన్నీ చేతులెత్తేసిన కారణంగానే తరువాత కాలంలో విస్మరించిన ఓస్లో ఒప్పందాలను 1993, 95లో పాలస్తీనా విమోచనా సంస్థతో బలవంతంగా ఒప్పించారు. అంగీకరించకపోతే మద్దతు వెనక్కు తీసుకుంటామని కొన్ని దేశాలు బెదిరించాయి.దీంతో ఇజ్రాయెల్ మరింతగా రెచ్చిపోతున్నది. ఈ పూర్వరంగంలోనే హమస్ రంగంలోకి వచ్చింది. గాజాపై దాడులతో ఆ ప్రాంతంలోని దేశాలన్నీ తమ వైఖరులను సవరించుకోవాల్సి వచ్చింది. గాజాతో సరిహద్దును కలిగిన ఈజిప్టు రాఫా వద్ద గేట్లను తెరవాలని ఇజ్రాయెల్, అమెరికా చేసిన వినతిని ఈజిప్టు తిరస్కరించింది. అదే జరిగితే లక్షల మంది పాలస్తీనియన్లను ఈజిప్టులోకి తరమాలన్నది వాటి ఎత్తుగడ. కావాలంటే ఖాళీ చేయించిన పాలస్తీనియన్లను నెగెవ్ ఎడారిలోకి పంపండని కూడా అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి ఉచిత సలహా ఇచ్చాడు. అయితే అదే పెద్ద మనిషి ఇజ్రాయెల్ దుర్మార్గాలకు వ్యతిరేకంగా జనంలో వస్తున్న స్పందన చివరికి తన కుర్చీకే ఎసరు తెస్తుందని భావించి నిరసన ప్రదర్శనలు జరిపేందుకు అనుమతించాల్సి వచ్చింది.2013లో ఈజిప్టులో సంభవించిన మిలిటరీ తిరుగుబాటు తరువాత ఇలా వీధుల్లోకి జనాన్ని అనుమతించటం ఇదే ప్రధమం అంటున్నారు. ఇజ్రాయెల్‌కు నిరసన తెలుపుతూ టర్కీ తన రాయబారిని వెనక్కు పిలిచింది.జో బైడన్ జోర్డాన్ వచ్చి మంతనాలు జరిపినప్పటికీ జోర్డాన్ ఇజ్రాయెల్ దాడులను ఖండించకతప్పలేదు. చివరికి అది కూడా రాయబారిని వెనక్కు పిలిచింది. బహెరెయిన్ ఇజ్రాయెల్ రాయబారులను బహిష్కరించింది. ఒక్క ఇజ్రాయెల్‌కే కాదు, సౌదీ అరేబియాకూ ఇరాన్ నుంచి ముప్పు ఉందని అమెరికా చెప్పినప్పటికీ తోసి పుచ్చి సౌదీ గాజా అంశంలో ఇరాన్‌తో కలసి నడుస్తోంది. వీటన్నింటినీ చూస్తే తెల్లవారే సరికి అరబ్-ఇస్లామిక్ దేశాలన్నీ ఇజ్రాయెల్‌ను ఏదో చేస్తాయని చెప్పలేము గాని మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియా భౌగోళిక-రాజకీయ చిత్రంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇది అమెరికా ఆధిపత్యాన్ని ధిక్కరించటంలో ఒక ముందడుగే !


