Tags
Donald trump, Donald Trump u turn, Joe Biden, Ukraine crisis, Vladimir Putin, Volodymyr Zelensky
ఎం కోటేశ్వరరావు
నాటో కూటమిలో చేరి తమ భద్రతకు ముప్పు తెచ్చేందుకు పూనుకున్న ఉక్రెయిన్‌కు గుణపాఠం చెప్పేందుకు 2022 ఫిబ్రవరి 24న ప్రారంభించిన సైనిక చర్య గురువారం నాటికి 1,057 రోజులో ప్రవేశించింది. ఏ మలుపులు తిరుగుతుందో ఎలా ముగుస్తుందో అంతుబట్టటం లేదు.ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాలకు, బుద్ది చెప్పేందుకు పూనుకున్న రష్యాకు ప్రతిష్టాత్మంగా మారింది. తాను అధికారాన్ని స్వీకరించిన 24 గంటల్లోనే యుద్ధాన్ని ఆపుతానని ఈనెల 20న పదవీ బాధ్యతలు స్వీకరించనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పాడు. అంతేనా వీలైతే అంతకు ముందే ఆపుతానని కూడా చెప్పాడు. ఒక రోజులో కాదు గానీ కనీసం వందరోజులు పడుతుందన్నాడు ఉక్రెయిన్ రాయబారిగా ట్రంప్ ఎంచుకున్న కెయిత్ కెలోగ్. అంత తేలిగ్గా ఎలా కుదురుతుంది కొన్ని నెలలు, అంతకంటే ఎక్కువ కాలమే పట్టవచ్చునని ట్రంప్ సలహాదారులు చెప్పినట్లు రాయిటర్స్ తాజా కథనం.శ్వేత సౌధంలో ప్రవేశించే గడవు దగ్గర పడుతున్నకొద్దీ ట్రంప్ నోట దానీ ఊసేలేదు. మరోవైపు దిగిపోతున్న జో బైడెన్ యంత్రాంగం రష్యాపై మరిన్ని ఆంక్షలను విధించి సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తాడో చూస్తాం అన్నట్లుగా ట్రంప్‌కు సవాలు విసిరింది. ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడో ఏం జరగనుందో తెలియదు గానీ అగ్రరాజ్య రాజకీయాలు మనవంటి దేశాలకు సంకటాన్ని తెచ్చిపెడుతోంది. అమెరికా రక్షణ శాఖ గతవారంలో తమ దేశ భద్రతకు ముప్పు అంటూ రెండు చైనా చమురు సంస్థలపై కూడా ఆంక్షలు విధించింది. జనం చెల్లించిన పన్నుల నుంచి బిలియన్ల డాలర్లను ఉక్రెయిన్‌లో తగలేయటం ఎందుకనే రీతిలో ట్రంప్ మాట్లాడాడు. అయితే అవి నిజాయితీతో కూడినవి కాదు. అమెరికా ప్రయోజనాల వ్యూహంలో భాగంగానే ప్రతి పరిణామం జరుగుతోంది. నిజానికి ఉక్రెయిన్ పోరు కూడా దానిలో భాగమే. అది తెలియనంత అమాయకుడు కాదు ట్రంప్. రాజకీయనేతలు ఊరికే ఏమాటలూ చెప్పరు. అందుకే ఎన్నికల్లో లబ్దికోసం ట్రంప్ మాట్లాడాడా లేక మరొకవిధంగానా అన్న అనుమానాలు ఉండనే ఉన్నాయి. మరోవైపు ఉక్రెయిన్ పోరులో పశ్చిమ దేశాల మిలిటరీని వినియోగించే అంశం గురించి ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌తో జెలెనెస్కీ సంప్రదింపులు జరిపాడు. అమెరికా తాజా ఆంక్షలతో రాయితీ ధరలతో ఇప్పటి వరకు రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ముడిచమురు దిగుమతిని మనదేశం నిలిపివేసింది. మరోవైపున అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయి.పులి మీద పుట్రలా మన రూపాయి రికార్డు స్థాయిలో పతనం మరింత భారం మోపనుంది.
త్వరలో నాలుగో ఏడాదిలో ప్రవేశించనున్న ఉక్రెయిన్ రష్యా సంక్షోభం పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారు. దీనికి మూలం అమెరికా నాయకత్వంలోని నాటో కూటమిలోకి ఉక్రెయిన్‌కు స్థానం కల్పిస్తామని చెప్పటమే. తద్వారా రష్యా ముంగిటికి విస్తరించి ముప్పు తలపెట్టేందుకే అన్నది తెలిసిందే. అమెరికా అనుకున్నది ఒకటి అయింది ఒకటి. రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలన్నది కొంత మేరకు జరిగింది. అయితే ప్రచ్చన్న యుద్ధం ముగిసిన తరువాత తొలిసారిగా పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా రష్యాచైనా సంబంధాలు బలపడతాయని నాటో కూటమి ఊహించలేదనే చెప్పాలి. మూడు సంవత్సరాలుగా రష్యా ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఇదొక ప్రధాన కారణం. యుద్ధం కొనసాగిన కొద్దీ ప్రజల సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తోందనే మనోభావాలను ట్రంప్ రెచ్చగొట్టవచ్చు, దాని వలలో కొందరు పడవచ్చు గానీ సంక్షోభం ఎంత దీర్ఘకాలం కొనసాగితే అమెరికాకు అంతలాభం. అక్కడి ఆయుధ పరిశ్రమలకు లాభాలు, కొంత మందికి ఉపాధి, అదే విధంగా ధరల పెరుగుదలతో పాటు రష్యా ఇంథన మార్కెట్‌ను అమెరికా కంపెనీలు ఆక్రమించి లాభాలు పిండుకుంటాయి. అందుకనే ఏదో ఒకసాకు చూపి ట్రంప్ కూడా జో బైడెన్ బూట్లలో కాళ్లు దూర్చి నడిచేందుకే చూస్తాడు. ఐరోపాలోని అగ్రరాజ్యాలైన ఫ్రాన్సు, జర్మనీ, బాల్టిక్ దేశాలు, పోలెండు వంటివి కూడా అదే కోరుకుంటున్నాయి. ఎందుకంటే రష్యా బలహీనం కావటం వాటికి అవసరం. అందుకే ఈ సంక్షోభం ఇప్పట్లో ముగిసేది కాదని భావిస్తున్నారు. నాటో కూటమి దేశాల ఉద్దేశ్యాలను గ్రహించి కావచ్చు, తొలి రోజుల మాదిరి రష్యా ఇప్పుడు దూకుడుగా ముందుకు పోవటం లేదు, నిదానంగా అడుగులు వేస్తున్నది.
కొందరు పరిశీలకులు మరొక కోణాన్ని కూడా చూస్తున్నారు. ప్రపంచానికి శాంతిదూతగా కనిపించేందుకు, నోబెల్ బహుమతి పొందాలనే తపనతో ట్రంప్ ఉన్నాడు గనుక ఒక శాంతి ప్రతిపాదన చేయవచ్చని ఆశాభావంతో ఉన్నారు. అదేమిటో వెల్లడి కాలేదు గానీ లీకులుఊహాగానాలు వెలువడ్డాయి. వాటి ప్రకారం రెండు దశాబ్దాల పాటు ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వరు. దానికి ప్రతిగా రష్యా మిలిటరీ చర్యను ఆపివేయాలి.ప్రస్తుతం రష్యా ఆక్రమణలో ఉన్న ప్రాంతాలను ఉక్రెయిన్ వదులుకోవాలి. రెండు దేశాల మధ్య ఉన్న 1,290 కిలోమీటర్ల సరిహద్దులో మిలిటరీ రహిత ప్రాంతాన్ని ఏర్పాటు చేసి దాని పర్యవేక్షణ బాధ్యతను ఐరోపా దేశాలు చూసుకోవాలి. శాంతి చర్చలలో గనుక పాల్గొంటే రష్యా మీద విధించిన కొన్ని ఆంక్షలను వెంటనే తొలగిస్తారు. గతంలో నాటోను తమ వైపు విస్తరించబోము అన్న హామీని ఆ కూటమి దేశాలు విస్మరించినందున రష్యా అంత తేలికగా అంగీకరించకపోవచ్చు లేదా కొంత ఉపశమనం దొరుకుతుంది గనుక తరువాత చూసుకోవచ్చు లెమ్మని అంగీకరించవచ్చు. ఇప్పటికే క్రిమియాను కోల్పోయిన ఉక్రెయిన్ మరికొన్ని ప్రాంతాలను కోల్పోయేందుకు అంగీకరిస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. తొలుత కుదరదని చెప్పినప్పటికీ తరువాత మెత్తబడినట్లు నిర్ధారణగాని వార్తలు. ట్రంప్ ప్రతిపాదనలు తమ దృష్టికి వచ్చినపుడు రష్యా కొట్టిపారవేసింది. దాని అభిప్రాయం ప్రకారం ఉక్రెయిన్ శాశ్వతంగా తటస్థ దేశంగా ఉండాలి లేదా రష్యా ప్రభావంలోకి రావాలి, సరిహద్దులో నిస్సైనిక ప్రాంతం ఏర్పాటు, పర్యవేక్షణ బాధ్యతను ఐరోపా యూనియన్‌కు అప్పగించటాన్ని పుతిన్ అంగీకరించే అవకాశాలు లేవని వార్తలు వచ్చాయి. తన మిలిటరీ సామర్ధ్యాన్ని రష్యా పెంచుకుంటున్నదని కూడా చెబుతున్నందున ప్రస్తుత దశలో ఏం జరిగేదీ చెప్పలేము. ఇక రష్యాఉక్రెయిన్ యుద్ధ రంగాన్ని చూద్దాం.ఇప్పటికే రష్యా నుంచి తమ భూభాగం మీదుగా నడుస్తున్న ఇంథన సరఫరా వ్యవస్థను ఉక్రెయిన్ నిలిపివేసింది. రష్యా నుంచి టర్కీ ద్వారా ఐరోపా యూనియన్ దేశాలకు ఉన్న గ్యాస్ పైప్‌లైన్ ఒక్కటే పని చేస్తున్నది. దాన్ని ధ్వంసం చేసేందుకు అమెరికా, ఉక్రెయిన్ కుట్రపన్నాయని, దానిలో భాగంగానే ఉక్రెయిన్ దాడులు జరిపినట్లు, తొమ్మిది డ్రోన్లను తాము కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. ఇలాంటి పనులు చేస్తే ఉక్రెయిన్‌కు ఐరోపాయూనియన్ మద్దతు ఉండదని స్లోవేకియాహెచ్చరించింది. మంగళవారం నాడు వందలాది డ్రోన్లు, క్షిపణులతో మూడు రష్యా పట్టణాలపై ఉక్రెయిన్ దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి. రెండువందల డ్రోన్లు, ఐదు అమెరికా తయారీ ఖండాంతర క్షిపణులను రష్యా కూల్చివేసినట్లు టెలిగ్రామ్ ఛానల్ షాట్ తెలిపింది. తాము కూడా రష్యా వైపు నుంచి వచ్చిన 80డ్రోన్లలో 58ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ చెప్పింది. ఈ పరిణామాలను చూస్తుంటే ట్రంప్ గద్దెనెక్కే నాటికి పరస్పరదాడులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.తాజాగా రష్యా జరిపిన దాడులతో ఉక్రెయిన్ గ్యాస్, విద్యుత్ వ్యవస్థ దెబ్బతిని సరఫరాకు అంతరాయం కలిగింది.
రష్యా ఇంథన రంగం, చైనా సంస్థలపై ఆంక్షలను మరింత తీవ్రతరంగావిస్తూ జోబైడెన్ జనవరి పదిన నిర్ణయించాడు.ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా రష్యాను దెబ్బతీయటంతో పాటు తమ ఎల్‌ఎన్‌జి మార్కెట్‌ను పెంచుకోవటం అమెరికా లక్ష్యంగా ఉంది. రష్యాలోని రెండు అతి పెద్ద చమురు ఉత్పత్తి సంస్థలు, రవాణా చేసే 183 ఓడలు, ఎల్‌ఎన్‌జిని ఎగుమతి చేసే 80 కంపెనీలు,బీమా సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలను కొత్తగా ప్రకటించారు. బ్రిటన్ కూడా అమెరికాతో జతకలిసి ఉక్రెయిన్‌లో శాంతి కోసం అంటూ ఆంక్షలను ప్రకటించింది. ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయి. బుధవారం నాడు ప్రామాణిక బ్రెంట్ రకం ధర 80డాలర్లకు అటూ ఇటూగా ఉంది. తాజాగా ఆంక్షలకు గురైన వాటితో సహా ఇప్పటి వరకు 270 టాంకర్లకు చేరాయి. ఈ టాంకర్లతో సముద్ర మార్గాలలో రష్యా ఎగుమతుల్లో 42శాతం జరుగుతున్నది. ఎగుమతి అయ్యే చమురులో 61శాతం చైనాకు,మిగిలింది మనదేశం దిగుమతి చేసుకుంటున్నది. పశ్చిమ దేశాల ఆంక్షలను ముందుగా ఊహించి ప్రత్నామ్నాయ వనరులను చూసుకుంటున్నట్లు వార్తలు. గతేడాది ఈ టాంకర్ల ద్వారా చైనాకు రోజుకు తొమ్మిది లక్షల పీపాలు ఎగుమతి అయ్యాయి.మార్కెట్ విషయానికి వస్తే మార్చి నెలలో సరఫరా చేయాల్సిన చమురు ధర బ్రెంట్ రకం 81డాలర్లు దాటింది.గతేడాది ఆగస్టు తరువాత ఇంతగా పెరగటం ఇదే మొదటిసారి. ఆంక్షలకు ముందు ఖరారు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ జాబితాలో ఉన్న టాంకర్లను మార్చి నెలవరకు అనుమతిస్తామని తరువాత వచ్చే వాటిని వెనక్కి తిప్పి పంపుతున్నట్లు భారత్ ప్రకటించిందని వార్తలు వచ్చాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2024 నవంబరు నెలలోనే రష్యా నుంచి 55శాతం దిగుమతులు పడిపోయాయి. గత ఏడాది మొత్తం 430 టాంకర్ల ద్వారా రష్యా చమురు ఎగుమతులు చేసింది.
ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించే గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఐరోపా నేతలు పరిణామాలు, పర్యవసానాల గురించి సంప్రదింపులు జరుపుతున్నారు. ఉక్రెయిన్ పోరు నాలుగో ఏడాదిలో ప్రవేశించనుండగా శాంతికోసం పశ్చిమదేశాల మిలిటరీని తమ గడ్డ మీద మోహరించాలని జెలెనెస్కీ కోరుతున్నాడు.వార్సాలో ఫ్రాన్సు, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, పోలాండ్ నేతలు సోమవారం నాడు భేటీ జరిపారు.ఉక్రెయిన్ పోరుకు తామెందుకు భారీ మొత్తాలను ఖర్చు చేయాలని ట్రంప్ గతంలో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ భారాన్ని ఐరోపా మరింత ఎక్కువగా భరించాలని చెబుతున్నాడు. ఈ నేపధ్యంలో ఐదు ఐరోపా అగ్రరాజ్యాల భేటీ జరిగింది.పశ్చిమ దేశాల మిలిటరీని ఉక్రెయిన్‌లో మోహరించాలని ఏడాది క్రితం తాను సూచన చేసినపుడు తనను ఒంటరిని చేశారని మక్రాన్ భావిస్తున్నాడు.అయితే ఈ అంశం గురించి వార్సాలో చర్చించలేదని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ చెప్పాడు. ఒక వేళ నిజంగానే ఆ పనిచేస్తే ఆ చర్య ప్రపంచ గతిని మరో మలుపు తిప్పటం అనివార్యం. ఒకవేళ నాటో దళాలు రంగంలోకి దిగితే తమపై యుద్ధ ప్రకటనగానే పరిగణించి స్పందిస్తామని ఎప్పటి నుంచో రష్యా చెబుతున్నది. అందుకు సన్నాహాలు కూడా చేస్తున్నది, అవసరమైతే అణ్వాయుధాలను రంగంలోకి దింపుతామని హెచ్చరించింది.
