Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

    ‘రోహిత్‌ చనిపోతే నేను వెళ్లలేదు… రకరకాల నేతలు పరామర్శకు వచ్చారు, నేను వెళ్లటం మంచిదా అన్న మీమాంసలో మౌనంగా వుండాల్సి వచ్చింది. ఏ సిఎం కూడా ఇలా జరగాలని కోరుకోడు’ :ముఖ్యమంత్రి కెసిఆర్‌

అబ్బ ! భలే చెప్పిండు కదా !!

    ఇంతకీ ఇన్ని రోజుల తరువాతైనా మీ మాంస తీరిందా? కొనసాగుతోందా? కొత్తది తలెత్తిందా ? అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా పాడు పొట్టకు అన్నమే వేతామురా , పోయినోడు ఎలాగూ పోయాడు, కేంద్రంలో బతికి వున్నవారితో తగాదా ఎందుకు ? పోనందుకు విమర్శలు ఎలాగూ రానే వచ్చాయి. నిండా మునిగిన వాడికి చలేమిటి ?

    ‘రోహిత్‌ వేముల మరణం దురదృష్టకరం ‘:ముఖ్యమంత్రి కెసిఆర్‌

అబ్బ ! భలే చెప్పిండు కదా !!

     రోహిత్‌ మరణానికి కారకడని విద్యార్ధులు వేలెత్తి చూపుతున్న వైస్‌ ఛాన్సలర్‌, అతగాడిపై ఎస్‌సిఎస్‌టి అత్యాచారాల చట్టం కింద పెట్టిన కేసుపై ఇంతవరకు ఏ చర్యా తీసుకోకపోవటానికి…. తస్సాదియ్యా ఇంకా పెద్దమ్మలా పట్టుకున్న మీ మాంస కొనసాగటమే కారణం, దొడ్డిదారిన వచ్చి విద్యార్ధులను రెచ్చగొట్టిన వ్యక్తికి ప్రాణహాని తలెత్తిందనే సాకుతో విద్యార్ధులను చావబాదటం, బెయిలు రాని కేసులు పెట్టటం పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టం ! ఎలాంటి శషభిషలు లేకుండా పోలీసు చర్యలను సమర్ధించటం ఏ ముఖ్యమంత్రికైనా పూర్వజన్మ సుకృతం !

    ‘ విసి ఛాంబర్‌ వద్దకు విద్యార్ధులు పోయినపుడు వారిని ఆపితే ఒక పంచాయతీ, ఆపకుంటే ఒక పంచాయతీ. విద్యార్ధుల దాడిలో విసి చనిపోతే పరిస్థితి ఏంటంటూ పోలీసులు పరిస్థితిని వివరించారు’:ముఖ్యమంత్రి కెసిఆర్‌

అబ్బ ! భలే చెప్పిండు కదా !!

   నిజమే వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు మీద విద్యార్ధులు ఎస్‌ఎసిఎస్‌టి చట్టం కింద పెట్టిన కేసులో ముందుకు పోతే నరేంద్రమోడీతో ఒక పంచాయతీ, పోకపోతే విద్యార్ధులతో మరొక పంచాయతీ.  కేంద్రంతో సఖ్యత కోరుకుంటున్నపుడు అందరూ అనుకుంటున్నట్లుగా విసిపై చర్య తీసుకుంటే పరిస్థితి ఎలా అని సలహాదారులు పరిస్థితిని వివరించి వుంటారు. లాఠీలు తీయటం వుత్తమం అని చెప్పి వుంటారు.

    అసలు అప్పారావు ఆకస్మికంగా విశ్వవిద్యాలయానికి రాత్రిపూట రానేల? వచ్చెను పో పోలీసులకు ముందుగా ఎందుకు తెలియచేయలేదు, తెలియచేయలేదు పో అప్పారావు వస్తే మూగి వాడి ముందు ముక్కు గీరినట్లుగా వుంటుందని పోలీసులకు తెలియదా ? తెలిసెను పో ముందస్తు చర్యలు తీసుకోకుండా ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? తోమెను పో విద్యార్ధులపై అంతగా విరుచుకుపడాలా? అంతగా నోరు పారవేసుకోవాలా ? పారవేసుకుంటిరి పో తరువాత అయినా పరిస్థితి తీవ్రతను తగ్గించేందుకు తరువాత విద్యార్ధులు, ప్రొఫెసర్లపై బెయిలు రాని కేసులు పెట్టనేల, పెట్టెను పో నిండుపేరోలగములో కేంద్రప్రభుత్వ పాలకులకు నొప్పి తగల కుండా ఎలాంటి వెరపు లేకుండా సమర్ధించనేల…….అకటా ????

   ‘భారత మాతాకీ జై అనని వ్యక్తి విద్యార్ధుల గురించి మాట్లాడటమా ?’: ఎన్‌విఎస్‌ ప్రభాకర్‌(బిజెపి ఎంఎల్‌ఏ)

అబ్బ ! భలే చెప్పిండు కదా !!

     అవధానంలో అప్రస్తుత ప్రసంగం అంటే ఇదే. చర్చ భారత మాత మీద కాదు. ప్రతిదానిని భారత మాత మీదకు మళ్లించే అజెండాలో భాగమైతే చెప్పండి నో ప్రాబ్లమ్‌. అసలింతకూ మీరు మహాత్మాగాంధీని జాతిపితగా గుర్తిస్తున్నారా లేక గాడ్సేను దేశభక్తుడిగా గుర్తిస్తున్నారా ? జాతిపితగురించి రాజ్యాంగంలో పేర్కొనలేదు అంటారా? భారత మాత కూడా అంతే కదా .మేకిండియా మీద కేంద్రీకరించకుండా బ్రేకిండియాపై కేంద్రీకరించారు. ఇదే అసలైన దేశ భక్తా? మర్చిపోయాను హైదరాబాదు విశ్వవిద్యాలయంలో జరిగిన దానికి అసలు కారకులు మీరే అని కదా విద్యార్ధి లోకం కోడై కూస్తున్నది.

   ‘భారత మాతాకి జై అనకపోయినా కొంత మందితో జై హింద్‌ అనిపిస్తున్నామంటే సైద్ధాంతిక పోరు మొదటి రౌండులో బిజెపి విజయం సాధించినట్లే ‘: అరుణ్‌ జైట్లీ

అబ్బ ! భలే చెప్పిండు కదా !!

   అవునులే భారత మాత దాస్యశృంఖలాలతో వుంటే ఆంగ్ల మాతను ఆరాధించిన మీరు రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే వైఫల్యాల బాట పట్టి దాన్ని దృష్టి మళ్లించేందుకు సైద్ధాంతిక పోరు ప్రారంభించారన్నమాట. భక్తి శివుడి మీద చిత్త చెప్పుల మీద అంటే ఇదేనా ! అవున్లే బ్రిటీష్‌ వారికి సావర్కర్‌ రాసిన లొంగుబాటు లేఖ కారణంగా స్వాతంత్య్ర వుద్యమ కాలంలో మీనోట స్వాతంత్య్రం మాట రాలేదు, భారత మాత దాస్యశృంఖలాలు మీకు కనపడలేదు. ఆ మాతను విముక్తి రాలిని చేసేందుకు ప్రాణత్యాగం చేసిన వారిలో మీ పూర్వీకులెవరూ లేరు. భరత మాత ముద్దు బిడ్డ సుందరయ్య అని కమ్యూనిస్టులు నిత్యం పాట పాడటం ఎప్పుడూ జెట్లీ విని వుండలేదేమో. భరత మాత అనే పదాన్ని తామే సృష్టించినట్లు దాని పేటెంట్‌ హక్కు కోసం పోరు జరిపినట్లు భలే బిల్డప్‌ ఇస్తున్నారులే. జైట్లీ మాదిరే పాతికేళ్ల క్రితం సోషలిజంపౖౖె పోరులో విజయం సాధించాం అని అమెరికా గర్వంగా చెప్పుకుంది. ఇప్పుడా అమెరికాలోనే ఎక్కడబడితే అక్కడ అవును మేం సోషలిస్టులం అని ప్రతి మూల నుంచీ యువకులు వస్తుండటంతో విజయం సాధించిన వారందరూ కమ్యూనిస్టులతో పెట్టుకొని తప్పు చేశామా అని తలలు పట్టుకుంటున్నారు. జైట్లీగారూ మీరు ప్రారంభించిన ఈ పోరులో తొలి విజయం సాధించినట్లు మీరు చెప్పుకుంటే దాన్ని స్వంత డబ్బా అంటారు. ఏమైనా దేశం ముందు సైద్దాంతిక యుద్ధాన్ని తెచ్చి ఎవరు ఎటో తేల్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. అందుకు మీకు అభినందనలు చెప్పక తప్పదు.