ఎం కోటేశ్వరరావు
తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి కె. చంద్రశేఖరరావు ఏప్రిల్ 24వ తేదీన ఒక ప్రకటన చేశారు. ఒక విధంగా అది సాధారణం కాదు. రానున్న రోజుల్లో పత్తి పంట తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం వుంది కనుక రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సలహాయిచ్చారు. పత్తి ఎగుమతి సుంకాన్ని పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, నైరోబీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్ధ సమావేశంలో పత్తి ఎగుమతులపై రాయితీలను రద్దు చేసే నిర్ణయంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సంతకం చేశారని, అందువలన రానున్న రోజులలో పత్తి సంక్షోభం తీవ్రం కానుందన్నది ముఖ్య మంత్రి ప్రకటన సారాంశం.
అసలేమీ పట్టించుకోకపోవటం కంటే ఆలస్యంగా అయినా మేలుకోవటం మంచిదే కదా అనే బి పాజిటివ్ (ప్రతిదీ మన మంచికే ) అనే దృక్పధానికి అనుగుణంగా వుందనుకుంటే కెసిఆర్ ప్రకటన ఓకే. మిగతా ముఖ్యమంత్రులు ఈ మేరకైనా మొక్కుబడి తీర్చుకున్నారో లేదో తెలియదు. బహుశా కేసిఆర్ ముఖ్య మంత్రి కాక ముందు ఒక్క తెలంగాణా రాష్ట్ర సాధన తప్ప మరొక విషయాన్ని పట్టించుకొని వుండరు. రాష్ట్రం వచ్చిన తరువాత మిగతా విషయాలన్నీ చూసుకుందామనుకొని లేదా చేసుకొందామని అనుకొని వుండవచ్చు. అధికారానికి వచ్చిన రెండు సంవత్సరాల తరువాత పత్తి రైతులను హెచ్చరించటం గుడ్డిలో మెల్ల. ఎనిమిది సంవత్సరాల వ్యవధిలో అంటే 2018 నాటికి భారత్ ఎగుమతులపై ఇచ్చే సబ్సిడీని క్రమంగా తగ్గించాలని, ఈ లోగా సబ్సిడీని పెంచరాదని ప్రపంచ వాణిజ్య సంస్ధ 2010లోనే భారత్‌ను కోరింది. అంటే పత్తి,పత్తి వుత్పత్తుల ఎగుమతులపై సబ్సిడీని కూడా ఎత్తివేయాల్సి వుంటుంది.
అమెరికా అంటే వామపక్షాలు మినహా మన రాజకీయ పార్టీల నేతలకు అది సైకిలైనా, కారయినా, హస్తం, కమలం పువ్వయినా మరొకరికైనా మహా ప్రీతి. కొన్ని దేశాల వారు తొడకోసు కుంటే మనవారు మెడ కోసుకుంటారని యుపిఏ పాలనా కాలంలో అన్ని పార్టీల వారు కలసి అమెరికాతో ఒప్పందాలపై సై అంటూ పార్లమెంట్‌లో మైనారిటీ యుపిఏ ప్రభుత్వాన్ని గట్టెక్కించి మద్దతు పలికారు. అదే అమెరికా మన పత్తి సబ్సిడీలను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా వత్తిడి తెస్తోన్న విషయాన్ని కూడా కెసిఆర్ తన ప్రకటనలో ఎందుకు పేర్కొనలేదో తెలియదు. బహుశా రాష్ట్రానికి అమెరికా నుంచి వచ్చే పెట్టుబడుల కోసం వ్యూహాత్మకంగా మౌనం దాల్చి వుంటారని మనం అనుకోవాలి.
గతేడాది అక్టోబరు 29న కేంద్ర ప్రభుత్వం వస్త్రాలతో సహా వాణిజ్య వుత్పత్తుల ఎగుమతులపై ఇస్తున్న రాయితీలను పొడిగిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. అందుకు గాను కేటాయింపులను 18 నుంచి 21వేల కోట్ల రూపాయలకు పెంచినట్లు తెలిపింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత మన ఎగుమతులు దిగజారటం తప్ప పెరగని పూర్వరంగంలో ఈ చర్య తీసుకున్నారు. దీనిపై అమెరికాకు కోపం వచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో తలసరి ఆదాయం వెయ్యి డాలర్ల కంటే తక్కువ వున్నపుడు, ఆ దేశం నుంచి అన్ని రకాల వస్త్ర ఎగుమతులు వరుసగా ప్రపంచ వాణిజ్యంలో 3.25శాతం దాటితే ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధల ప్రకారం ఎగుమతి రాయితీలను రద్దు చేయాలన్న ఒక నిబంధనను అమెరికా వెలికి తీసి ఆ మేరకు ప్రపంచ వాణిజ్య సంస్ధకు ఫిర్యాదు చేసింది.ఆ తరువాతే నైరోబీలో జరిగిన సమావేశంలో కెసిఆర్ చెప్పినట్లు నిర్మలా సీతారామన్ సంతకం చేశారు. నిజానికి ఇది జరగబోతోందని గతేడాది జనవరిలోనే అధికార వర్గాలను వుటంకిస్తూ వార్తలు వచ్చాయి.(http://www.financialexpress.com/article/economy/textile-export-subsidy-under-wto-scanner/25566/
ఇప్పుడు రైతులను హెచ్చరించిన ముఖ్య మంత్రి ఏడాది కాలంగా, కేంద్రం సంతకం చేసినపుడు ఎందుకు మౌనంగా వున్నట్లు ? ఇలాంటి సమస్యలపై టిఆర్‌ఎస్ పార్టీ లేదా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఇలా ఒక్కొక్క పంట సాగును మానివేస్తూ పోతూ వుంటే అప్పుడు కెసిఆర్ అండ్ కో ప్రభుత్వం ముందు పరిష్కరించాల్సిన సమస్యలే వుండవు, పోనీ ప్రత్యామ్నాయంగా మిగిలే పంటలేమి వుంటాయి? రైతులు ఏమైనా ఫరవాలేదనా ? అని ఎవరైనా అంటే వారు తెలంగాణా అభివృద్ధి వ్యతిరేకి అన్న ముద్ర సిద్ధంగా వుంటుంది కదా !
కనీస మద్దతు ధరకంటే తక్కువ రైతాంగం అమ్ముకుంటున్నపుడు వారిని ఆదుకొనేందుకు చర్యలు తీసుకొని వుండుంటే అరే బయ్ ఇంక మనం చేయగలిగింది లేదు, వేరే పంటలు వేసుకోండి అంటే అర్ధం వుండి వుండేది. అదేమీ చేసినట్లు కనిపించటం లేదే ! మచ్చుకు గతేడాది నవంబరు మొదటి వారంలో పత్తి ధరలను చూసినపుడు అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇటు తెలంగాణాలోనూ పెద్ద తేడాలేమీ లేవు. అంతకు ముందు కంటే తక్కువ లేదా స్ధిరంగా వున్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. రైతాంగ ఆత్మహత్యలు ఎక్కడ ఎక్కువ ఎక్కువ తక్కువ అన్న చర్చలోకి పోనవసరం లేదు. ఒక అన్నదాత బలవన్మరణానికి పాల్పడినా అది పాలకుల విధానాల వైఫల్యం తప్ప మరొకటి కాదు.
పత్తి పంట తమను అప్పుల వూబి నుంచి బయట పడవేస్తుందనే ఆశతో రైతాంగం సాగు చేస్తున్నారు. వారిని దాని నుంచి మళ్లించాలనుకోవటం తప్పుకాదు. మరికొద్ది వారాలలో సాగుకు సిద్ధం అవుతున్న తరుణంలో కేవలం ఒక ప్రకటనతో సరిపెట్టాల్సిన అంశంగా ప్రభుత్వం భావిస్తోందా ? గతేడాది పంట మొత్తం రైతుల చేతి నుంచి బయటకు పోయిన తరువాత అంతకు ముందుతో పోల్చితే పత్తి ధరలు పెరిగాయి. అందుకు అంతర్జాతీయ పరిస్థితులు కూడా తోడయ్యాయి. రైతాంగాన్ని మానసికంగా సిద్దం చేయాలంటే వారితో ప్రత్యక్షంగా చర్చించాలి, వున్న అనుమానాలను నివృత్తి చేయాలి. ప్రపంచ వాణిజ్య సంస్ధ, కేంద్ర ప్రభుత్వం, తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి మధనం జరపాలి. వేరే ప్రాంతాల మేథావులు తప్పుదారి పట్టిస్తారనుకుంటే తెలంగాణాలో కావాల్సినంత మంది వున్నారు. వారికే పరిమితం చేయవచ్చు. పత్తి విత్తనాల ధరల గురించి జరిగినంత చర్చ ప్రత్యామ్నాయ పంటల గురించి లేదంటే అతిశయోక్తి కాదేమో !
ప్రత్యామ్నాయ పంటల గురించి ప్రతి ఏటా వ్యవసాయ ముద్రించే కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రి మొక్కుబడిగా వుంటోంది తప్ప రైతులను ఏమాత్రం ప్రభావితం చేయటం లేదు. రైతులు ప్రత్యామ్నాయంవైపు చూడాలంటే పత్తి కంటే అవి ఆకర్షణీయంగా వుండాలి. కనీసం తొలి సంవత్సరాలలో అయినా ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ హామీ వుండాలి. ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి ఒక్కొక్కటిగా వైదొలుగుతున్న స్ధితిలో కేవలం ప్రకటనలు నమ్మి ముందుకు వస్తారా ? ఇప్పటికైనా పత్తి గురించి ఒక సమగ్రమైన శ్వేత పత్రాన్ని ప్రకటించి దానిని రాజకీయాలకు అతీతంగా చర్చించి రైతాంగం ముందుకు వెళ్లటం సముచితంగా వుంటుంది. లేకుంటే తద్దినపు తంతుగానే భావించాల్సి వుంటుంది.