Tags

, , , ,

ఎంకెఆర్‌

   ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే నిజమౌతుందన్నది జర్మన్‌ నాజీ గోబెల్స్‌ ప్రచార సూత్రం. సర్జికల్‌ దాడుల గురించి ఏకంగా ప్రధాని, రక్షణ మంత్రే ఆ సూత్రాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నారని గత కొద్ది రోజులుగా చేస్తున్న ప్రచార తీరు వెల్లడిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవైపు మంగళవారం నాడు న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశంలో మన విదేశాంగశాఖ కార్యదర్శి ఎస్‌ జయశంకర్‌ మాట్లాడుతూ సర్జికల్‌ దాడులు కొత్తగా జరిపినవి కాదని, గతంలో జరిగిన వాటి గురించి సైన్యానికి మాత్రమే తెలుసునని, ఇటీవలి దాడుల గురించి తొలిసారిగా బహిరంగంగా వెల్లడించారని స్పష్టంగా చెప్పారు. అదే సమయంలో హిమచల్‌ ప్రదేశ్‌లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటి దాడులను ఇజ్రాయిల్‌ మాత్రమే చేయగలదని విన్నామని ఇప్పుడు భారతీయ సైన్యం కూడా ఎవరికీ తీసిపోదని వెల్లడైందని అన్నారు. ఇలాంటి దాడులు తొలిసారిగా జరిగాయని రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ చెప్పిన మాటలనే ప్రధాని మరొక రూపంలో చెప్పారు తప్ప అర్ధం ఒకటే.

     ఇక్కడ రెండు విషయాలు. సర్జికల్‌ దాడులు గతంలో కూడా జరిపామని విదేశాంగ శాఖ కార్యదర్శి చెప్పిన విషయం ప్రధాని నరేంద్రమోడీకి తెలియదు అనుకోవటం అమాయకత్వం. తెలిసి కూడా ఇలాంటి దాడులు చేయగల సత్తా ఇజ్రాయెల్‌కు మాత్రమే వుందని విన్నామని చెప్పటం మన మిలిటరీని అవమానించటం తప్ప మరొకటి కాదు. నిజంగా తెలియకపోతే ప్రధానిగా రెండున్నర సంవత్సరాలలో తెలుసుకొని వుండి వుండాలి. తరతమ తేడాలతో ప్రపంచంలో ప్రతి మిలిటరీకి వుంటుందన్నది అందరికీ తెలిసిన సత్యం. ఎందుకంటే ఇటీవల మన మిలిటరీ జరిపిన దాడుల సందర్భంగా మీడియాలో ఈ విషయాలన్నీ చర్చించారు. అలాంటిది ఇజ్రాయెల్‌కు మాత్రమే వుందని విన్నామని ప్రధాని స్వయంగా చెప్పటం అంటే మీడియా వార్తలు కూడా ప్రధానికి తెలియవా ? రెండవది ఇజ్రాయెల్‌ పేరు ప్రస్తావించటం అంటే దాని గొప్పతనాన్ని పొగడటం, దాని మిలిటరీతో మన మిలిటరీని పోల్చటం. ఇదింకా అవమానకరం .

    ప్రపంచంలో అత్యంత దుర్మార్గమైన వాటిలో ఇజ్రాయెల్‌ మిలిటరీ ఒకటి. పై నుంచి కింది వరకు దానిలో యూదు దురహంకారం, దురాక్రమణవాదాన్ని నింపారు. మన మిలిటరీ అందుకు పూర్తిగా విరుద్ధం. అరబ్బుల ప్రాంతాలను ఆక్రమించుకోవటంతోనే ఇజ్రాయెల్‌ పుట్టింది. ఆ తరువాత దాని పరిసరాలలో వున్న జోర్డాన్‌,లెబనాన్‌, సిరియా, ఈజిప్టు ప్రాంతాలను ఆక్రమించుకొని ఇప్పటికీ తిష్ట వేసింది.అంతర్గతంగా అరబ్బుల ప్రాంతాలను అక్రమంగా ఆక్రమించుకొనేందుకు పూనుకున్న ఇజ్రాయెలీలకు రక్షణగా మిలిటరీ వ్యవహరించటం అందిరికీ తెలిసిందే. ఇజ్రాయెల్‌ దురాక్రమణను ఎదుర్కొనే క్రమంలో దాని సరిహద్దులలో అనేక దేశాల మిలిటరీ వుంటుంది. వాటిని నిరంతరం రెచ్చగొట్టటం, యుద్ధానికి కాలుదువ్వటం, అరబ్బు ప్రాంతాలలోని సాధారణ పౌరుల ప్రాంతాలపై రహస్య దాడులు జరపటం దాని నిరంతర కార్యక్రమాలలో భాగం. అందువలన అది చేసే సర్జికల్‌ దాడులు, మన మీద దాడులకు సిద్ధంగా వున్న ఆక్రమిత కాశ్మీర్‌లోని పాక్‌ ప్రేరేపిత వుగ్రవాద శిబిరాలపై మన సైన్యం దాడులు చేయటం ఒకటి కాదు. ఇజ్రాయెల్‌ చర్యలు యుద్ధోన్మాద కవ్వింపు అయితే మన సైన్యం చర్యలు ఆత్మరక్షణ, వుగ్రవాద నిరోధ చర్యలలో భాగం. ఇజ్రాయెల్‌ వంటి దుష్ట మిలిటరీ తప్ప మన సైన్యాన్ని పొగడటానికి, పోల్చటానికి మరొక మిలిటరీ దొరకలేదా ? పాలస్తీనా పౌరుల న్యాయమైన పోరాటానికి మద్దతు, ఇజ్రాయెల్‌ దాడులు, దురాక్రమణను వ్యతిరేకించే మన పశ్చిమాసియా విదేశాంగ విధాన కీలకాంశానికి విరుద్ధంగా ఇజ్రాయెల్‌ను పొగడటం తగని పని. ఒకవైపు పాలస్తీనా వైఖరిలో ఎలాంటి మార్పు లేదంటూనే ఇజ్రాయెల్‌ను పొగడటం శకుని, శల్యసారధ్యాలను గుర్తుకు తెస్తోంది.

     గతంలో ఇలాంటి సర్జికల్‌ దాడులు జరగలేదని, జరిగినవి ఏవైనా వుంటే స్ధానికంగా చేసినవి తప్ప ప్రభుత్వ ప్రభుత్వ ప్రమేయంతో జరగలేదని ప్రకటించిన రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ తరువాత మరొక అడుగు ముందుకు వేసి ప్రధాని, తాను ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం కలిగిన వారం కనుకనే ఈ దాడులు జరిగాయని చెప్పి దాడుల ఖ్యాతిని ఆ సంస్థకు ఆపాదించేందుకు ప్రయత్నించారు. ఇదొక ప్రమాదకర పోకడ. పేరుకు సేవా, సాంస్కృతిక సంస్ధ అని చెప్పుకుంటూ అనేక వివాదాలు, మత ఘర్ణణలను రెచ్చగొట్టే సంస్ధగా విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌, దాని భావజాలంతో పని చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రధాని, రక్షణ మంత్రి గాలిని విదేశాంగ కార్యదర్శి తీసినట్లయింది.