ఎం కోటేశ్వరరావు
అసహనం ! అసహనం !! అసహనం !!! సహనానికి మారుపేరైన మన దేశం, అక్షర క్రమంతో పాటు సహనంలో కూడా అగ్రస్ధానంలో వున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అసహనం అనే మందుపాతర మీద వున్నదా అనిపిస్తోంది. ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుడు అన్నట్లు సామాజిక, రాజకీయ, ఆర్ధిక ఒకటేమిటి అన్ని రంగాలు, స్త్రీ, పురుష బేధం లేకుండా ఎక్కడబడితే అక్కడ అన్ని చోట్లా పెరుగుతున్న అసహనం ఎలాంటి పర్యవసానాలకు దారితీయనుందో !
అసహన రాజకీయాలు ప్రపంచానికి ముప్పు తెస్తున్నాయని 90దేశాల పరిణామాలను పరిశీలించిన మానవ హక్కుల నిఘా సంస్ధ జనవరిలో విడుదల చేసిన తన వార్షిక నివేదికలో ప్రకటించింది. అమెరికా, ఐరోపాలో ప్రజాకర్షక ధోరణి పెరుగుదల ప్రపంచంలో నియంతృత్వ నేతలను ప్రోత్సహించటం, బలిష్టం కావిస్తోందని కూడా హెచ్చరించింది.వేళ్లమీద లెక్కించగలిగిన ప్రపంచ బడా కార్పొరేట్లు, వాటి లాభాల కోసం కొన్ని ధనిక దేశాలు అనుసరిస్తున్న దివాళాకోరు విధానాల పర్యవసానంగా ప్రపంచం మొత్తం అభివృద్ధికి ఎదురుగాలి వీస్తున్నది. సంక్షోభం అంటు వ్యాధిలా వ్యాపిస్తున్నది.
అధికారమే పరమావధిగా ఏ అడ్డదారి తొక్కేందుకైనా సిద్ధం సుమతీ అన్నట్లు వుండే రాజకీయ పార్టీల, నేతల ప్రజాకర్షక నినాదాలు, చర్యలు ప్రకటించటాన్ని ఒలింపిక్స్‌లో చేరిస్తే మనకు అన్ని పతకాలు రావటం ఖాయం. తీరా అధికారానికి వచ్చాక వారి అసలు రంగు బయటపడుతోంది.తాబేలు నడక, ప్లేటు ఫిరాయించటం, చెప్పినవాటిని అమలు జరపమని ఎవరైనా అడిగితే వారిపై తాసుపాములా కస్సుమంటూ లేస్తున్నారు. ప్రశ్నించే తత్వాన్ని ఏ మాత్రం సహించలేక దురుద్ధేశ్యాలను ఆపాదించి అధికార దర్పంతో నోరు మూయించాలని చూస్తున్నారు. రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల పరిధి దాటి జర్నలిస్టులకు సైతం రాజకీయ అనుబంధాలు, వుద్ధేశ్యాలను ఆపాదించి అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇది ప్రమాదకర పోకడ, గర్హనీయం కాదా ?
విద్యా గంధం ఇచ్చే అత్యున్నత ఫలితం సహనం అని ప్రముఖ మానవతావాది హెలెన్ కెల్లర్ చెప్పారు. అది ఎంత మందిలో ప్రతిబింబిస్తున్నది అన్నది ప్రశ్న. ఒక కేసులో మన సుప్రీం కోర్టు మరో విధంగా చెప్పింది. అసహనం ప్రజాస్వామ్యానికేగాక వ్యక్తులుగా వారికి కూడా ఎంతో ప్రమాదకరం అని వ్యాఖ్యానించింది. ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలని సలహా ఇచ్చింది.
అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఎన్నికలు జరిగిన ప్రతి చోటా ప్రజాకర్షక వాగ్దానాల వరదలు వెల్లువెత్తుతున్నాయి. మచ్చుకు, ఫిలిప్పీనియన్ల జీవితాలను దుర్భరంగా మార్చివేసిన వారందరినీ అంతం చేయండి అంటూ ఎన్నికల ప్రచారంలో జనాన్ని రెచ్చగొట్టిన రోడ్రిగో డార్టే ఆదేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తాను అధికారంలోకి వస్తే అమెరికాలో వుద్యోగాలు అమెరికన్లకే, అమెరికాలో వుత్పత్తి చేయకుండా బయటి నుంచి దిగుమతులు చేసుకొంటే వాటిపై పెద్ద మొత్తంలో పన్ను విధిస్తా, బయటి దేశాలలో పని చేయించే కంపెనీలపై జరిమానాలు వేస్తా అంటూ వాగ్దానాలు చేసిన డోనాల్ట్ ట్రంప్ కూడా అధ్యక్షుడయ్యాడు. రాష్ట్రాన్ని ఒక పద్దతి ప్రకారం చీల్చకుండా అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్ మీద కారాలు మిరియాలు నూరుతూ వూరూ వాడా ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఆయన మిత్రపక్షం బిజెపి, వారిద్దరి మిత్రుడు పవన్ కల్యాణ్ గురించి తెలిసిందే.
బాబొస్తే జాబొస్తుందన్న నినాదం గురించి చెప్పనవసరం లేదు. ప్రత్యేక హోదా గురించి స్వయంగా నరేంద్రమోడీ ఇక వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు చేసిన హడావుడి, వేస్తున్న పిల్లి మొగ్గలూ అన్నీ ఇన్నీ కాదు. ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అక్కడ నరేంద్రమోడీ ప్రధాని, వెంకయ్య నాయుడు కేంద్రమంత్రి అయ్యారు. వీరందరూ రాజకీయాల్లో, పాలనా వ్యవహారాలలో ముదుర్లు తప్ప లేగ దూడలు కాదు. అందుకే తరువాత చూసుకోవచ్చు లెమ్మని ప్రత్యేక హోదావంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించి జనంపై ఎదురుడాడికి దిగారు.
చంద్ర ‘బాబా ‘ తత్వశాస్త్రం ప్రకారం కేంద్రంపై పోరాటం చేస్తే పోలవరం వంటి ప్రయోజనాలు దెబ్బతింటాయి. ప్రత్యేక హోదా బదులు పాకేజి తీసుకోవటం మెరుగు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అని పెద్దలు చెప్పారు గానీ అది చివరికి ఎదురు తన్నుతుంది. అధికారానికి వచ్చిన తరువాత అమెరికాలో ట్రంప్ కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అవి అసంగతమైనవని, ఆ చర్యలతో అమెరికాను అస్తవ్యస్ధతలోకి నెట్టారని, ఒక వ్యక్తి దేశాన్ని ఎలా నాశనం చేస్తాడో ఒక వుదాహరణగా మారాడని, పిచ్చివాడి చేతిలో రాయి మాదిరి జనం అధికారాన్నిచ్చారని, ఒక జోకర్‌గా ట్రంప్ తయారయ్యాడని చంద్రబాబు వివిధ సందర్బాలలో వ్యాఖ్యానించారు. జనం సొమ్మును అప్పనంగా ఖర్చు చేసి నేతల కీర్తి కండూతి కోసం మహిళా సాధికారత పేరుతో ఏర్పాటు చేసిన సదస్సును దలైలామాతో ప్రారంభోత్సవం చేయించారు.
ఈ రెండు చర్యలు ‘బాబా ‘ గారి లాజిక్కుకు విరుద్దమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు హాని కలిగించేవి. ట్రంప్ మరో నాలుగు సంవత్సరాలు అధికారంలో వుంటారు. అలాంటి వ్యక్తిని పిచ్చివాడని, అమెరికాను నాశనం చేస్తున్నాడు, జోకర్ అని విమర్శించిన తరువాత అమెరికా నుంచి లేదా అమెరికా కంపెనీలున్న మలేషియా తదితర దేశాల నుంచి పెట్టుబడులు ఎలా వస్తాయి. తనను అంత తీవ్రంగా విమర్శించిన నేత పాలకుడుగా వున్న రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే అమెరికాలో స్ధిరపడిన ప్రవాస ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భక్తులు పెట్టే పెట్టుబడుల గురించి ట్రంప్ ప్రభుత్వం సహిస్తుందా ? దలైలామా చైనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి మన దేశంలో ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యక్తి. అలాంటి పెద్దమనిషిని పిలిచి పెద్ద పీట వేస్తే గతంలో చంద్రబాబు చేసిన చైనా పర్యటనలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు చేసిన యత్నాలు ‘పవిత్ర సంగమం’ (కృష్ణా నది)లో పోసినట్లే కదా ! ఎందుకిలా ప్రవర్తిస్తున్నట్లు ? దలైలామాను పిలిచినందువలన మీడియాలో వార్తలు తప్ప పైసా ప్రయోజనం వుంటుందా ? చైనా కంపెనీలు ఒకటికి రెండుసార్లు వెనుకా ముందూ ఆలోచించవా?
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వర్తింప చేయటానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా నాన్చి, నాన్చి రెండు సంవత్సరాల తరువాత ఇచ్చేది లేదని కరాకండిగా చెప్పేసింది. దానికోసం పోరాడతానని చెప్పిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానాలు చేయించారు. తీరా హోదా లేదు పాకేజి ఇస్తామని చెప్పగానే అందని ద్రాక్ష పుల్లన అన్న నక్క సామెత చందాన హోదా వలన ప్రయోజనం లేదు, అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు తెచ్చే పాకేజి ఎంతో ముద్దు అని కొత్త పల్లవి అందుకున్నారు.పనికిరాదని ముందే తెలిసినపుడు ఎన్నికలలో వాగ్దానమెందుకు? అసెంబ్లీ తీర్మానాలెందుకు? హోదా బదులు పాకేజీకి ఆమోద ముద్ర కోసం పోరాడాలని ఎంపీల సమావేశాలలో వుద్బోధలెందుకు ? ప్రతి నెలా జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశాలలో తెలుగు దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నట్లు ?
పవిత్ర సంగమం ప్రాంతంలో ఏర్పాటు చేసిన జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ప్రధాని నరేంద్రమోడీ వస్తారని అయన కోసం ఎయిర్ కండిషన్ల మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయించారు చంద్రబాబు. ప్రధాని రావటం లేదని, కేవలం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడతారని ప్రధాని కార్యాలయం నుంచి వర్తమానం. చివరికి అదేమీ లేకపోగా ఏ కార్యక్రమాలూ లేకపోతే ఆకాశవాణిలో ప్రసారం చేసే ‘నిలయవిద్వాంసుల’ సంగీత కార్యక్రమాల మాదిరి వెంకయ్య నాయుడిని పంపారు. ప్రత్యేక హోదాను నిరాకరించిన తరువాత రాష్ట్రానికి రావటానికి నరేంద్రమోడీ జంకుతున్నారా ? వీడియో కాన్ఫరెస్సులో మాట్లాడకపోతే పోనీ రికార్డు చేసిన సందేశం పంపటానికి కూడా మోడీ తిరస్కరించారంటే కేంద్రంలో చంద్రబాబు నాయుడి పలుకుబడి ఏపాటిదో అర్ధం కావటం లేదా ?
హోదా లేదన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దానికి కూడా సహనంతో సర్దుకు పోతున్నారు. పోనీ పాకేజీని అయినా కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందా అంటే నెలలు గడుస్తున్నా ఇంతవరకు దాని ప్రస్తావనే లేదు. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా తయారైన స్ధితిలో వాటి గురించి అడగటమే పాపమన్నట్లుగా అటు వెంకయ్య నాయుడు, ఇటు చంద్రబాబు నాయుడు చిందులు వేస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా హోదా గురించి అడిగింది మేము మాత్రమే, మిగతావారెవరూ మాట్లాడలేదు, ఇప్పుడు మేమే అవసరం లేదంటున్నాము, అప్పటి మాదిరి ఇపుడు కూడా మిగతావారంతా నోర్మూసుకోవాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. మనం ఎక్కడున్నాం ప్రజాస్వామ్యంలోనా లేక నందంటే నంది పందంటే పంది అనక తప్పని నిరంకుశపాలనలో చెవుల్లో పూలు పెట్టుకొని వున్నామా ?
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా ఆయన ప్రభుత్వం పట్ల మీడియా వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. తన విధానాలను విమర్శించే లేదా పదే ప్రశ్నించే రెండు పత్రికలను, ఛానళ్లను లక్ష్యంగా పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ముద్రవేసి శత్రుపూరితంగా ఆయన వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తనకు నచ్చని ఛానళ్లు పత్రికలకు, ఇబ్బంది కలిగించే ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులకు పార్టీల ముద్రవేసి అదేపని చేస్తున్నారు. తటస్ధ వైఖరి తీసుకొనే మీడియా సంస్ధల జర్నలిస్టులే ప్రశ్నలు అడగాలని నిర్ధేశిస్తున్నారు. మీడియా తటస్ధత అంటే ఒక సంఘటన, ఒక అభిప్రాయం, అంశంపై ఒకే వైఖరిని పాఠకుల ముందుంచటంగాక అన్ని రకాల అభిప్రాయాలకు తగు స్ధానం కల్పించి అందచేయటం తప్ప విమర్శనాత్మక ప్రశ్నలు అడగకూడదని అర్ధం కాదు.
చంద్రబాబు తత్వశాస్త్రం ప్రకారం తటస్థం అంటే ఏం జరిగినా నోరు మూసుకోవాలని చెప్పటమే. తటస్ధ మీడియా సంస్ధల జర్నలిస్టులను కూడా చంద్రబాబుతో సహా ఏ ముఖ్యమంత్రీ సహించటం లేదు. మీడియా సమావేశంలో ఏదైనా ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగితే సదరు విలేకరి వార్త ఇచ్చేందుకు కార్యాలయానికి వెళ్లక ముందే సంపాదకుడు లేదా యాజమాన్య ప్రతినిధికి సచివాలయం నుంచి ఫోన్లు వెళ్లటం, ప్రకటనలను మరిచి పోవాల్సి వస్తుందని హెచ్చరించటం – వారు విలేకరికి తలంటించటం, వుద్యోగం నుంచి వుద్వాసనకు హెచ్చరికలు బహిరంగ రహస్యం. లాభాల కోసం రంగంలోకి వచ్చిన మీడియా సంస్ధలు చచ్చిన చేపల మాదిరి వాలునబడి పోతాయి తప్ప తటస్థంగా ఎ్కడుంటాయి ? వుద్యోగ భద్రత లేని కారణంగా అనేక మంది బలవంతంగా మౌనంగా సహిస్తున్నారు తప్ప జర్నలిస్టులందరూ ఆ స్థితికి చేరలేదు. ప్రజలకు వుపయోగపడతాయనుకున్న అంశాలను వెలికితీయటం, పాలకులుగా వున్న వారిని ప్రశ్నించే యావ, చేవ ఇంకా సజీవంగానే వుంది. అది లేని వారు యజమానులతో ప్రత్యక్ష సంబంధాలున్న రాజకీయనేతలో, యజమానో అధికారో చెప్పింది రాసుకొనే షార్ట్ హాండ్ గుమస్తాలు తప్ప జర్నలిస్టులు కారు. అటువంటి స్ధితి ప్రజాస్వామ్యానికి, జనస్వామ్యానికి ముప్పు.
తటస్థం అని చెప్పుకొనే మీడియా సంస్ధల యాజమాన్యాలకు రాజకీయపార్టీలతో వున్న సంబంధాలు బహిరంగ రహస్యం. అనేక మంది పెట్టుబడులు వాటిలో వున్నాయి, అందువలన తెలుగు నేలపై అలాంటి తటస్థ మీడియా ఎక్కడ వుందనేది పెద్ద ప్రశ్న. ప్రశ్నించిన విలేకరులు, మీడియా సంస్ధలపై వైఎస్, చంద్రబాబు, వెంకయ్య నాయుడు వంటి వారు విరుచుకుపడినపుడు సీనియర్ జర్నలిస్టులు కూడా మౌనం దాల్చటానికి పూర్వరంగమిదే. పోనీ ఈ మౌనం వలన జర్నలిస్టులు బావుకుంటున్నదేమైనా వుందా అంటే అదీ లేదు. తమకు చట్టపరంగా రావాల్సిన వేతన భత్యాలను పొందుతున్న జర్నలిస్టులు ఎంత మంది వున్నారు. అసలు చట్టాలే అమలు జరగటం లేదు, వాటిని అమలు జరపాల్సిన ప్రభుత్వాలు యజమానుల కొమ్ము కాస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలోగానీ తెలుగుదేశం పాలనలో గానీ ముఖ్య మంత్రులుగా వున్న వారు కొన్ని సంస్ధలపై విరుచుకుపడి వాటి ఆర్ధిక మూలాలను దెబ్బతీయటానికి ప్రయత్నించారే తప్ప జర్నలిస్టులకు అమలు చేయాల్సిన చట్టాల అమలుకు ఒక్కటంటే ఒక్క చర్యకూడా తీసుకున్న పాపాన పోలేదు. కార్మిక శాఖ అధికారులు ఎన్ని మీడియా కార్యాలయాలను సందర్శించారు, చట్టాల అమలును పర్యవేక్షించారో చెప్పమనండి. జర్నలిస్టుల వేతన చట్ట అమలు గురించి సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్నది.
చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చి మూడో సంవత్సరం త్వరలో పూర్తికానుంది. ఇంతవరకు జర్నలిస్టుల సమస్యలపై అధికారికంగా యూనియన్ ప్రతినిధులతో ఒక్కటంటే ఒక్క సమావేశం కూడా జరిపి సాధకబాధకాలను చర్చించలేదు. అక్రమాలను వెలుగులోకి తెస్తున్న అనేక మంది విలేకర్లపై అధికారపక్ష శాసనసభ్యులు, వారి దగ్గరి బంధువులు దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారిని నియంత్రించటం లేదు, జర్నలిస్టులపై దాడుల నివారణకు ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేయటానికి సర్కార్‌కు రెండున్నర సంవత్సరాలకుపైగా పట్టింది, ఇంతవరకు ఒక్క సమావేశం కూడా జరపలేదు. ప్రెస్ అకాడమీ కూడా అంతే. చైర్మన్ నియామకం జరిపారు, పాలకవర్గాన్ని వేయలేదు, ఎలాంటి కార్యకలాపాలను ప్రారంభించలేదు. జర్నలిస్టుల సంక్షేమం గురించి ఇంత వరకు అసలు కమిటీ నియామకమే జరపలేదు. ఎందుకని ?
అసహనాన్ని వ్యక్త పరిచేందుకు తెలుగులో ఒక సామెత వుంది. అదే మంటే నిస్సహాయతతో ‘ అత్తమీది కోపం దుత్తమీద చూపినట్లు ‘. రాజకీయ చాణుక్యుడిగా పిలిపించుకున్న చంద్రబాబు నాయుడి పరిస్థితి అలాగే వుందా అనిపిస్తోంది.అంతర్జాతీయ విషయాలపై స్పందన అడిగినపుడు మాదీ ప్రాంతీయ పార్టీ అంతర్జాతీయ విషయాలెందుకు బ్రదర్ అనే వారు. అలాంటిది ట్రంప్‌పై అసాధారణ వ్యాఖ్యలు చేయటాన్ని చూస్తే చంద్రబాబు బుర్ర ఎంతగా కలవర పడుతోందో అర్ధం చేసుకోవచ్చు. ఎపుడైనా ఇబ్బందికర ప్రశ్నలు ఎదురైనపుడు గతంలో నో కామెంట్ (వ్యాఖ్యానించదలచలేదు) అని తనదైన శైలిలో కన్నుగీటుతూ తప్పించుకొనే వారు. దాంతో విలేకరులు కూడా అంతకు మించి అడిగేవారు కాదు. కానీ ఇప్పుడు అలాంటి ప్రశ్న వస్తే వెంటనే ముందు నువ్వు ఏ పత్రిక, ఏ ఛానల్ అని అడుగుతున్నారు. దానిని బట్టి స్పందిస్తున్నారు. విశాఖలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ‘ప్రజాశక్తి’ విలేకరిపై విరుచుకుపడుతూ చేసింది అదే. ఆల్‌ఇండియా, ప్రపంచ స్ధాయిలో ఎందరో జర్నలిస్టులను చూశానని చెప్పిన చంద్రబాబు ఆ స్ధాయిలో వ్యవహరించి వుంటే ఆయనకు హుందాగా వుండేది. అలా చేయకపోవటం విచారకరం. ఏ జాతీయ, అంతర్జాతీయనాయకుడు ప్రశ్న అడిగిన వారిని నువ్వు ఏ సంస్ధ ప్రతినిధివి అని అడిగి రాజకీయ అనుబంధాన్ని అంటగట్టిన వుదంతం మనకు కనపడదు.
అంతెందుకు ఆ రెండు పత్రికలు, ఛానల్స్ అంటూ కయ్యం పెంచుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి తన కుటుంబ సభ్యులతో స్వయంగా ప్రారంభింప చేయించిన పత్రిక, టీవీ ఛానల్‌లో తాను వ్యతిరేకించిన మీడియా సంస్ధల నుంచి వచ్చిన వారినే జర్నలిస్టులుగా నియమించారు. జర్నలిజాన్ని ఒక వృత్తిగా ఎంచుకున్నవారికి విధి నిర్వహణ ముఖ్యం. వారు కూడా పౌరులే కనుక ఏ రాజకీయ అభిప్రాయాలనైనా కలిగి వుండవచ్చు.యాజమాన్యాల ఆదేశాల మేరకు పని చేసి వుండవచ్చు. అంతమాత్రాన పని చేసే సంస్ధను బట్టి రాజకీయాలు, వుద్దేశ్యాలను అపాదించటం తగని పని. ఆ మాటకు వస్తే ఇతర పార్టీల నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన వారి రాజకీయాల సంగతేమిటి ?
అనేక దేశాలు రక్షణాత్మక చర్యలలో భాగంగా తమ దేశాల నుంచి పెట్టుబడులు బయటకుపోకుండా చర్యలు తీసుకోవటంతో పాటు తామే ఆకర్షించుకొనేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. మీ ఇంటి కొస్తే మాకేం పెడతావ్ మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. మన దేశంలో రాష్ట్రాలు అంతకంటే ఎక్కువగా రాయితీలతో పోటీ పడుతున్నాయి. అందువలన విదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి వస్తాయని చెబుతున్న లక్షల కోట్ల పెట్టుబడుల పరిస్థితి అగమ్యంగా వుంది. విభజన సమయంలో ఇస్తామన్న ప్రత్యేక హోదా లేదు, దాని బదులు అంతకంటే మెరుగ్గా ఇస్తామన్న ప్రత్యేక పాకేజి బ్రహ్మపదార్ధంగా మారింది. నిజానికి అలాంటి ప్యాకేజీలు ప్రకటించటానికి కేంద్రానికి అసలు అధికారాలేమిటో ఎవరైనా చెప్పగలరా ?
కన్నుగీటితే చాలు కాసుల వర్షం అన్నట్లుగా రాష్ట్రానికి పెట్టుబడుల వరదలు వస్తున్నాయని, వాణిజ్యం చేసేందుకు అగ్రపీఠీన అత్యంత అనుకూల స్ధానంలో వున్నామని నిత్యం ఏదోఒక చోట సంతోషంతో విజయగాధలు వినిపిస్తున్న స్ధితిలో తమ అజెండాలోని వాటి గురించే ఒక చిన్న ప్రశ్న అడిగినా భరించలేని అసహనం ఎందుకు ? దేశ, విదేశాలు తిరిగి ఎంతో అనుభవం గడించిన చంద్రబాబుకు ఈ విషయాలేవీ తెలియవా ? రాష్ట్రంలో జనంలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లబరచటానికి ఏదో ఒక రాజకీయం చేయాలి, లోపల ఏమున్నా పైకి నటించాలి. కేంద్రం నుంచి ప్రచారం చేసిన మాదిరి సాయం రాదని తేలిపోయింది. మాటలతో ఎక్కువ కాలం గడపటం కష్టం. అనేక రంగాలలో పురోగతి లేమి దాంతో ఒకవైపు నిస్సహాయత, దాన్నుంచి మరోవైపు తలెత్తుతున్న అసహనం అన్నీ కలిస్తే చంద్రబాబు అని చెప్పవచ్చు.
అందుకే ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి, కాంగ్రెస్, వామపక్షాలు, చివరికి ప్రశ్నించే జర్నలిస్టులు ఎవరు ప్రశ్నించినా తట్టుకోలేకపోవటానికి కారణమిదే ! ఇప్పుడున్న స్ధితిలో ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని ప్రతిపక్షాన్ని చూసి భయపడాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు, ఏ రోజు ఏ ఎంఎల్‌ఏను తమ నుంచి తీసుకుపోతారో అని ప్రతిపక్షమే భయపడే స్ధితి. జనానికి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలను, వివిధ తరగతులపై జరుగుతున్న దాడులను ఎవరు ప్రతిఘటించాలి? ఎవరికి వారు ఏదో ఒక కారణం వెతుక్కొని నా వరకు వచ్చినపుడు కదా చూసుకోవచ్చు అనుకొనే వారికి జర్మన్ రచయిత మార్టిన్ నిమోలియర్ నాజీల గురించి రాసిన ప్రఖ్యాత కవితను గుర్తు చేయటం అవసరం.
వారు తొలుత కమ్యూనిస్టుల కోసం వచ్చారు- నేను కమ్యూనిస్టును కాదు కనుక మాట్లాడలేదు
తరువాత కార్మికనేతల కోసం వచ్చారు -నేను కార్మికనేతను కాదు కనుక మిన్నకున్నాను
తరువాత యూదుల కోసం వచ్చారు -నేను యూదును కాదు కనుక నోరు విప్పలేదు
తరువాత నాకోసం వచ్చారు – నోరు విప్పేందుకు అప్పటికి నా వెనుక ఎవరూ లేరు
Pingback: నిస్సహాయత + అసహనం = చంద్రబాబు – Leak Word