Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

నోటి తుత్తరతో సమస్యలు తీసుకురావద్దని ప్రధాని నరేంద్రమోడీ తన పార్టీ అనుచరగణానికి చెప్పాల్సి రావటం ఆ పార్టీ ఎలాంటి సంకట స్ధితిని ఎదుర్కొంటోందో తెలియచేస్తోంది. జర్నలిస్టుల ప్రత్యక్షంగా మాట్లాడకుండా మౌన దీక్షపూని ఒక ప్రపంచ రికార్డు ఇప్పటికే సృష్టించిన మోడీ త్వరలో ఐదో సంవత్సరంలో ప్రవేశించబోయే వుత్సవంతో కలిపి దాన్ని కూడా ఒక విజయంగా జరుపుకుంటారు. ఒకవైపు నేత నిక్కచ్చిగా వుంటే మరోవైపు అందుకు విరుద్ధంగా పండ్లుతోముకోవటమైనా మానతారేమోగాని బిజెపి నాయకులు మీడియా ముందు మాట్లాడకుండా ఒక్కరోజు కూడా గడపలేని స్ధితికి వచ్చారు. అయితే మోడీ ఇప్పుడెందుకు హెచ్చరించారనేదే అందరినీ ఆలోచింపచేస్తున్న అంశం. ఊరందరిదీ ఒక దారయితే వులిపికట్టెది మరొక దారి అన్నట్లుగా కథువా(అసిఫా) అత్యాచార వుదంతంపై దేశ మంతటా ఆగ్రహం, విచారంతో నిరసన వ్యక్తం చేస్తుంటే, పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారాలు జరిగినపుడు నిందితులకు వురి శిక్ష విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ చారిత్రాత్మకమైనది కనుక పండుగ చేసుకోవాలని బిజెపి నేతలు పిలుపునిచ్చారు.

వైపరీత్యం ఏమంటే ఎనిమిదేండ్ల అసిఫాపై అత్యాచారం జరిపి హత్య చేశారని కొందరిపై అభియోగం మోపారు. నిందితులు నిర్దోషులని, హిందువులను గబ్బు పట్టించటానికి ఇదంతా చేస్తున్నారంటూ వీధులకు ఎక్కి ప్రదర్శనలు చేసిందీ, కేసు నమోదుచేయకుండా పోలీసులను అడ్డుకున్న బిజెపి అనుకూల లాయర్ల, నేతలు,కార్యకర్తల తీరు తెన్నులు చూసి దేశం ఇంకా దిగ్బ్రాంతి నుంచి ఇంకా కోలుకోలేదు.Û గతంలో గోరక్షకుల మంటూ ఆవులను రక్షించటానికి ముందుకు వచ్చిన వారే ముక్కుపచ్చలారని పసి పిల్లపై అత్యాచారం చేసిన నిందితులకు మద్దతుగా రేపిస్టు రక్షకులుగా ముందుకు వస్తారని ఎవరూ వూహించి వుండరు. దాన్నుంచి దృష్టిమళ్లించటానికి తెచ్చిన ఆర్డినెన్స్‌పై పండుగ చేసుకోవాలని పిలుపివ్వటం గుండెలు తీసిన బంట్లకు తప్ప అన్యులకు అసాధ్యం. బిజెపి అభిమానులు దీన్ని ఎలా జీర్ణించుకుంటున్నారో అనూహ్యం. తమదాకా వచ్చినపుడు గాని వారికి తెలియదని సరి పెట్టుకోవటం తప్ప ఇంకేం చేయగలం. అనేక ప్రజావ్యతిరేక నిర్ణయాలపై వేగంగా నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్‌ దీనిపై ఎందుకు తాత్సారం చేసిందని, అదీ ఆర్డినెన్స్‌ జారీ చేయాల్సినంత అగత్యం ఏమిటని అడగటం పాచిపోయిన పాత పాట ‘దేశద్రోహం’ అవుతుందేమో !

పన్నెండు సంవత్సరాల లోపు బాలికలపై అత్యాచారం జరిగితే మరణశిక్ష, 12ా16 సంవత్సరాల మధ్యవారిపై జరిగినపుడు పది నుంచి ఇరవై సంవత్సరాలకు పెంచాలని మోడీ సర్కార్‌ తెచ్చిన ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. బిజెపి అధికార ప్రతినిధి మీనాక్షీ లేఖీ మాట్లాడుతూ దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్‌ను నేటికి నెరవేర్చారని, ఈ రోజు చారిత్రాత్మకం అన్నారు. మహిళాసాధికారత పెంపుదలకు, గొడ్డుచాకిరీని తగ్గించేందుకు మోడీ సర్కార్‌ తీసుకున్న సానుకూల చర్యల గురించి చర్చించాల్సిన దినమిదన్నారు. అంతటితో వూరుకుంటే కిక్కేముంది. సమాజంలో వున్న కొంతమంది వున్మాదుల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు తీసుకున్న చర్యలతో ఇది పండుగ చేసుకోవాల్సిన సందర్భమని అన్నారు.అసిఫా వుదంతంపై దేశమంతటా, విచార,మౌన, నిందుతులను వెనుకేసుకు వచ్చిన బిజెపి నేతలపై ఆగ్రహ ప్రదర్శనలు చేస్తుంటే ఈమె గారికి పండుగ చేసుకోవాల్సిన అవసరం కనిపించింది.

గత చరిత్రను చూసినపుడు బిజెపిలో నోటి దురుసుతనం లేదా తుత్తర ఎంత ఎక్కువగా వుంటే అంత త్వరగా వారు అధికార ప్రతినిధులుగా, పదవులు పొందుతారని వెల్లడైంది. దానికి కారణం మత, సామాజికరీత్యా విద్వేషభావాలను, ప్రచారాలను రెచ్చగొట్టటం, వదరుబోతుతనం తమకు ప్రయోజనకరమని ఆ పార్టీ వ్యూహకర్తలు భావించటమే. అదుపు తప్పిన నోళ్లు ఎప్పుడు ఏంమాట్లాడతాయో తెలియదు. అది రాజకీయంగా నష్టం కలిగించటం, తమ తెలివితక్కువ తనంతో ఓహో ఈ పార్టీ ఇలాంటివారితోనే నిండి వుందనే సందేశం ఇటీవలి కాలంలో అనేక మందికి అవగతం అవుతుండటంతో నోళ్లను అదుపులో పెట్టుకోవాలని మోడీ చెప్పాల్సి వచ్చింది.

‘ఇంత పెద్ద దేశంలో ఒకటి రెండు అత్యాచారాలు జరిగితే ఏమైంది, దానికే అన్ని వైపుల నుంచి నానా యాగీ చేయటం న్యాయం కాదు’ అంటూ కేంద్ర కార్మిక, వుపాధిశాఖల మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌ స్వయంగా వ్యాఖ్యానించాడు. ఇలాంటి వ్యాఖ్యలు బిజెపి కార్యకర్తలకు మంచి వుత్సాహాన్నిచ్చి సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా స్పందించిన వారి మీద విరుచుకుపడేట్లు చేస్తాయి. అసలు విషయాన్ని జయప్రదంగా పక్కదారి పట్టిస్తాయి.’ ప్రతి సమస్య మీద విశ్లేషణ చేసే ఒక సామాజిక శాస్త్రవేత్తగానో లేక పండితులుగానో భావించుకొని టీవీ కనపడిన ప్రతిసారీ ఒక ప్రకటన చేసేందుకు తొందరపడవద్దు ‘ అని నమో ఆప్‌ ద్వారా నరేంద్రమోడీ తన సహచరులను మందలించారు. గత నాలుగు సంవత్సరాలలో అనేక మంది బిజెపి నేతలు మసాలా వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఒక బిజెపి నేత ఏర్పాటు చేసిన నైట్‌క్లబ్‌ను ప్రారంభించి మీడియాలో గబ్బుపట్టగానే నాకు అది క్లబ్బు అని చెప్పకుండా మోసం చేశారంటూ చేతులు దులుపుకున్న సాధువైన పార్టీ ఎంపీ గిరిరాజ్‌ సింగ్‌ ‘ ఒక వేళ రాజీవ్‌ గాంధీ ఒక నైజీరియన్‌ మహిళను పెళ్లి చేసుకొని వుంటే, ఆమెకు తెల్లతోలు లేకపోయి వుంటే కాంగ్రెస్‌ ఆమె నాయకత్వాన్ని ఆమోదించి వుండేదా ?’ అని వ్యాఖ్యానించారు. తరుణ్‌ విజయ్‌ అనే మరో ఎంపీ ‘ మేము జాత్యహంకారులమే అయితే మొత్తం దక్షిణ భారత్‌లో మేము ఎందుకు వుండేవాళ్లం. తమిళనాడు మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్‌ మరియు కేరళ మీకు తెలుసు, వారితో మేము జీవిస్తున్నాం, మా చుట్టూరా నల్ల వారున్నారు’ అని సెలవిచ్చిన విషయం తెలిసిందే. ‘డార్విన్‌ సిద్ధాంతం తప్పు ఎందుకంటే కోతులు మనుషులుగా మారటాన్ని ఎవరూ చూడలేదు’ అన్న సత్యపాల్‌ సింగ్‌, ‘మహాభారతంలో అంధుడైన ధృతరాష్ట్రుడికి సంజయుడు యుద్ధరంగంలో ఏం జరుగుతున్నదీ చెప్పగలిగాడంటే ఆ రోజు ఇంటర్నెట్‌ మరియు సాంకేతిక పరిజ్ఞానం వుండబట్టే ‘ అన్న త్రిపుర బిజెపి ముఖ్యమంత్రి విప్లవకుమార్‌ చెప్పిన మాటలతో బిజెపి నవ్వులపాలైంది. అయితే కొద్ధి సంవత్సరాల క్రితం ఇలాంటి మాటలను స్వయంగా నరేంద్రమోడీయే చెప్పినపుడు మీడియా వాటికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. వాటిని సమర్ధించేందుకు అనేక మంది సమర్ధకులు బయటకు వచ్చారు. ఇప్పుడా సీన్‌ లేదు. అధికారానికి వచ్చిన ఆరునెలలకు 2014 అక్టోబరులో వైద్యులు,శాస్త్రవేత్తలు పాల్గన్న ఒక సమావేశంలో నరేంద్రమోడీ మాట్లాడుతూ మహాభారత సమయంలోనే జెనెటిక్స్‌ శాస్త్రంలో భారత్‌ ప్రావీణ్యం సంపాదించిందని, వినాయకుడికి ఏనుగుతలను అంటించటం ఆ సమయంలో మనకు ప్లాస్టిక్‌ సర్జన్స్‌ వున్నారనేందుకు ప్రత్యక్ష రుజువు అని సెలవిచ్చారు. అంతటి పెద్దమనిషే అలా అన్నతరువాత అనేక మంది తరువాత ఎన్నో అశాస్త్రీయ, కేవలం నవ్వులాటకు పనికి వచ్చే, మన దేశ పరువు తీసే అంశాలను ముందుకు తెచ్చి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వీటిని ప్రవచించిన పెద్దలందరూ నిజంగా వాటిని గట్టిగా విశ్వసించబట్టే చెప్పారు. ఎందుకంటే ఈ దేశంలోని తిరోగమన వాదులు బిజెపి పుట్టకముందే వేదాల్లోనే అన్నీ వున్నాయష అంటూ చేసిన ప్రచారాన్ని చిన్న తనం నుంచి తలకెక్కించుకున్నవారెందరో వున్నారు. వారిలో కాషాయ కుటుంబానికి చెందిన వారు అగ్రస్ధానంలో వుంటారు.

విద్వేష పూరిత ప్రసంగాలు చేసే నోళ్లు కూడా చిన్నవేమీ కాదు, తక్కువేమీ లేవు. వారు ఒక హిందువును చంపితే మేము వంద మంది ముస్లింలను చంపుతామన్న యోగి ఆదిత్యనాధ్‌, ఇంట్లో ఆవు మాంసం వుందంటూ దాద్రిలో దాడి చేసి ఇంటి యజమాని మహమ్మద్‌ అఖ్లాక్‌ను హత్యచేసిన తరువాత నిందితులను బదులు మాంసం కలిగి వున్నందుకు ఆ కుటుంబాన్ని అరెస్టు చేయాలన్న ఎంఎంల్‌ఏ సంగీత్‌ సోమ్‌, మన దేశాన్ని హిందుస్తాన్‌ అని పిలుస్తారు, అంటేదాని అర్ధం ఇది హిందువులది, గతంలో ఒక పద్దతి వుండేది ఎంత పెద్ద గడ్డం వుంటే అంత ఎక్కువ లబ్ది కలిగించేవారు అన్న ఎంఎల్‌ఏ విక్రమ్‌ సైనీ వ్యాఖ్యలు మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ విషయంలో నరేంద్రమోడీ ఏమీ తక్కువ తినలేదు. ముఖ్యమంత్రిగా వున్నపుడే ముస్లిం కాందిశీక శిబిరాలన్నీ పిల్లలను పుట్టించే ఫాక్టరీలని, వుత్తర ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ఖబరస్తాన్‌(ముస్లింల శ్మశానవాటిక) ఏర్పాటు చేసినపుడల్లా ఒక శ్మశానాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిందే అని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. బిజెపి మిత్ర పక్షం శివసేన నాయకులూ ఈ విషయంలో బిజెపితో పోటీపడతారు. అలాంటి పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం బిజెపి ప్రజాప్రతినిధుల బాధ్యతారహితమైన వ్యాఖ్యలకు బాధ్యత ప్రధానిదే అని దాడి చేసింది. ఈ బిజెపి రాజ్యంలో ప్రధాని మోడీని చూసి వుత్తేజం పొందే పార్టీ మంత్రుల నోటికి అదుపుండదు అని పేర్కొన్నది.

పోనీ ఇలా నోరు అదుపులేని నేతల పట్ల బిజెపి గతంలో ఎలా వ్యవహరించింది? 2008లో ముంబై వుగ్ర దాడుల సందర్భంగా నాటి హోం మంత్రి ఆర్‌ఆర్‌ పాటిల్‌ నోరు జారారు. పెద్ద పట్టణాలలో ఇలాంటి చిన్నచిన్న అంశాలు జరుగుతుంటాయి అన్నందుకు గాను నానా యాగీ చేసిన బిజెపి ఆయన రాజీనామా చేసే వరకు వూరుకోలేదు. మరి ఇప్పుడు దేశమంతటినీ కుదిపివేసి వున్నావ్‌ అత్యాచార వుదంతంపై ఇంత పెద్ద దేశంలో ఒకటి రెండు అత్యాచారాలు జరిగితే ఏమైంది, దానికే అన్ని వైపుల నుంచి నానా యాగీ చేయటం న్యాయం కాదు అన్న కేంద్ర మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌ను కనీసం అదే బిజెపి మందలించను కూడా లేదు, ద్వంద్వ ప్రమాణాలు అంటే ఇవే.

ఒక అత్యాచారం జరగ్గానే చేసిన వాడిని వురి తీయాలి, వాడి అంగాన్ని నరికివేయాలంటూ ఆగ్రహం తీవ్ర స్ధాయిలో వ్యక్తం చేయటం సహజం. హత్య నేరమే కొన్ని కేసులలో యావజ్జీవ శిక్ష పడుతుంది, కొన్నింటిలో వురి శిక్ష కూడా వేశారు. ఎందుకీ తేడా ? ఏదైనా హత్య హత్యేకదా ? వుద్రేకంలోనో, అసంకల్పిత ప్రతీకార చర్యలోనో మరొక కారణంతో జరిగితే అది సాధారణ హత్య. అలాగాక కుట్ర చేసి లేదా హత్యలు చేయటమే పనిగా పెట్టుకొని లేదా, వున్మాదంతో చేసేవి దారుణ హత్యలు. అందుకే శిక్షల్లో తేడా. వురి శిక్ష వేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అంటే అనేక దేశాలు, మన దేశ అనుభవం చూసినా అలాంటి వాటి వలన ఫలితమేమీ కనపడటం లేదు. అందువలన సిపిఎం వంటి పార్టీలు, కొన్ని సంస్ధలు వురి శిక్షలు వద్దు ఇతర శిక్షలు వద్దని చెబుతున్నాయి. వద్దన్నవారిని దుండగులను ప్రోత్సహించేవారుగానూ, కావాలన్నవారిని నిరుత్సాహపరిచేవారుగానూ అనేక మందికి కనిపిస్తారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులలోనూ, ఇతరత్రా చూసినపుడు అవాంఛనీయ శక్తులు ఇతర పార్టీలలనే ఎక్కువగా వున్నట్లు ఎవరికైనా ఇట్టే అర్ధం అవుతుంది.

సరే బిజెపి వారు అనేక చారిత్రకాంశాలకు ఆద్యులమని చెప్పుకుంటున్నారు గనుక వారు చెప్పుకున్నట్లు పన్నెండు సంవత్సరాల లోపు వయస్సు వున్న బాలికలపై అత్యాచారం చేసిన వారికి వురి శిక్ష విధిస్తూ , అంతకంటే కాస్త పెద్దవారిపై అత్యాచారం జరిగితే శిక్షను పది నుంచి 20కి పెంచుతూ శిక్షాస్మృతిని సవరిస్తూ తొలిసారిగా ఆర్డినెన్స్‌ తెచ్చిన ఆ ఖ్యాతిని కూడా వారి ఖాతాలోకే వేద్దాం. దాంతో పాటే మరొకదానిని కూడా వేయాలి. ఒక పన్నెండేళ్లలోపు బాలికపై అత్యాచార కేసులో నిందితులు నిర్దోషులంటూ హిందూ ఏకతా మంచ్‌ పేరుతో జరిపిన ప్రదర్శనలో బిజెపి మంత్రులు పాల్గనటం కూడా ఇదే ప్రధమం కనుక దీన్ని కూడా ఆ ఖాతాకే జమచేయటం న్యాయం.ఇక బేటీ బచావో నినాదం ఇచ్చిన ఖ్యాతి కూడా నరేంద్రమోడీ ఖాతాలోనే వేయాలి. దేశంలో అత్యాచారాలు ఈనాటివి కాదు. కొత్తగా బిజెపిలో ప్రారంభంగాని మాట నిజం.2016 లెక్కల ప్రకారం మొత్తం రేప్‌ కేసులు 39068,రోజుకు 107, గంటకు 4.46, ప్రతి 14ని నిమిషాలకు ఒక అత్యాచారం జరిగింది.

ఇక వివరాల్లోకి వస్తే ఆరేండ్ల లోపు అభాగినులు 520,6ా12 ఏండ్ల మధ్య వారు 1596,12ా18 ఏండ్ల మధ్య వయస్కులు 8656, మిగిలిన 22205 మందిలో 57 మంది అరవై సంవత్సరాల పైబడిన వారు కూడా వున్నారు. పన్నెండు సంవత్సరాల లోపు వారు 1114 మంది వున్నారు.2016లెక్కల ప్రకారం నాలుగో వంతు మైనర్‌ బాలికలపై జరుగుతున్నాయి. రెండు సంవత్సరాల నాడు ఇంత మందిపై జరిగాయి, తరువాత సంవత్సరం కూడా ఎంతమంది బలయ్యారో లెక్కలు వారికి అందుబాటులో వుంటాయి కనుక కేంద్రంలోని పెద్దలకు తెలియకపోదు. అలాంటపుడు ఆర్డినెన్స్‌లోని శిక్ష మంచిదో చెడ్డతో అన్న మీమాంసను పక్కన పెడితే ఇన్ని సంవత్సరాలు ఎందుకు తేలేదు, ఇన్నాళ్ల తరువాత తెచ్చిందానిని చారిత్రకం అని ఎందుకు డబ్బా కొట్టుకుంటున్నారు. దీన్ని కూడా ఓట్లకోసం వాడుకుంటారా? 2013 ఆగస్టు ఒకటిన ఆశారామ్‌ బాపు అనే ఒక బాబా దయ్యం వదలగొట్టే నెపంతో తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు బాబా నిర్దోషి అంటూ సమర్ధించిన వారిలో బిజెపి నేతలున్నారు. ఇప్పుడు ఆ కేసులో తీర్పు వెలువడనుండగా శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చుననే భయంతో పోలీసులను మోహరించాల్సిస దుస్ధితి వచ్చిందంటే బాబా భక్తులకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చినట్లు ? ఆ కేసులో బాబాపై పోస్కో చట్టంతో పాటు షెడ్యూలు కులాలు, తెగలపై అత్యాచార నిరోధ చట్టం కింద కూడా అభియోగాలను మోపారు.కోర్టు బాబాను దోషిగా తేల్చి యావజ్జీవ శిక్షవిధించింది. అదే కేసులో మరో నలుగురికి జోధ్‌పూర్‌ కోర్టు శిక్షలు వేసింది. ఈ సందర్భంగా ఐదు సంవత్సరాల క్రితం ముంబయ్‌లో శక్తి మిల్స్‌లో సామూహిక అత్యాచారానికి గురైన ఫొటో జర్నలిస్టు కేసును పరిశీలించటం సముచితం. ఇది శ క్తి మిల్స్‌ కేసుగా కూడా పిలుస్తారు. ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం కేసులో 2014 మార్చి 20న ఇచ్చిన తీర్పులో ఐదుగురు నేరగాండ్లలో ముగ్గురికి మరణశిక్ష, ఒకడికి జీవిత ఖైదు విధించింది. అప్రూవర్‌గా మారినవాడిని వదిలేసింది. అదే మిల్స్‌ ఆవరణలో జరిగిన మరొక అత్యాచార వుదంతంలో ఒక మైనర్‌ బాలుడు నిందితుడు. వాడికి మూడు సంవత్సరాల శిక్ష విధించారు. చట్ట ప్రకారం అంతకంటే ఎక్కువ లేదు.

వదిలేద్దాం, ఓట్ల కోసం దేన్నయినా వాడుకోగల దిట్టగా బిజెపి ఆరితేరిందని దాని ఘనతను కీర్తిద్దాం. ఇప్పటికే వున్న చట్టాల ప్రకారం దారుణమైన నేరాలకు వురి శిక్ష విధించటానికి అవకాశం వుంది. ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్క బాలిక వుదంతంలో కూడా కోర్టులు ఎందుకు వురి శిక్ష విధంచలేదు. న్యాయమూర్తులలో స్పందన లోపించిందా? అసాధారణ రేప్‌ కేసులలో వురి శిక్ష విధించాలని, అయితే తమ పార్టీ సూత్రప్రాయంగా వురిశిక్షకు వ్యతిరేకమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ అభిప్రాయం చెప్పారు. అది నచ్చని వారు తప్పు పట్టవచ్చు, కానీ కొందరు రేపిస్టులను సిపిఎం సమర్ధిస్తోందంటూ దాడులకు దిగారు. అసలు కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సు ఇప్పుడు రావటానికి కారణం ఏమిటి? కాశ్మీర్‌లోని కథువా ఎనిమిదేండ్ల బాలిక అసిఫా వుదంతంలో నిందులపై కేసు పెట్టకుండా అడ్డుకోచూసింది బిజెపి మద్దతుదారులైన లాయర్లు, నిందితులకు మద్దతుగా హిందూ ఏకతా మంచ్‌పేరుతో మతోన్మాదులు జరిపిన ర్యాలీలో పాల్గన్నది బిజెపి మంత్రులు, దీనిపై తీవ్ర విమర్శలు రావటంతో వారిని వుద్యోగాల నుంచి వూడగొట్టింది బిజెపి. గోరక్షక్‌ నుంచి రేపి స్ట్‌ రక్షక్‌ మారిందనే పేరు వచ్చింది. ఇంత పరువు పోయాక ఆ నష్ట నివారణ చర్యలో భాగం తప్ప ఆర్డినెన్స్‌లో నిజాయితీ ఎక్కడుంది? ఆర్డినెన్స్‌ తెచ్చినందుకు అభినందించుకోండి, వూరూరా తిప్పి సన్మానాలు చేయించి నీరాజనాలు పట్టండి, సమర్ధించని వారిని విమర్శించాల్సినంత సీన్‌ బిజెపి వారికి లేదు. చిత్రం ఏమిటంటే అసిఫా అత్యాచారాన్ని ఇంతవరకు ఖండించేందుకు నోరు రాని బిజెపి వారందరూ ఒక్కసారిగా ఇప్పుడు ఆర్డినెన్స్‌పై ఎక్కడలేని వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో దారుణ అత్యాచారానికి గురైన నిర్భయ పేరుతో ఒక చట్టాన్ని చేశారు. ఇప్పుడు పేరు ఎలాగూ బయటకు వచ్చింది కనుక తెచ్చిన ఆర్డినెన్స్‌ను చట్టంగా మార్చేటపుడు బిజెపి వారికి ఏమాత్రం నిజాయితీ వున్నా ఆసిఫా చట్టం అని పేరుపెడతారా ?