ఎం కోటేశ్వరరావు
కాంగ్రెస్ అధికారానికి వస్తే తాము ప్రతి కుటుంబానికి నెలకు ఆరువేల రూపాయల చొప్పున పేద కుటుంబాలకు అందచేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. దీని మీద కొందరికి లోపల ఇది జరిగేదేనా అన్న గుంజాటన వుంటే అటు సమర్ధించలేక, ఇటు వ్యతిరేకించలేక కొన్ని రాజకీయ పార్టీలు డోలాయమానంలో వున్నాయి. ఈ పధకాన్ని రూపొందించింది, రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయనే ఆర్ధిక మంత్రి అవుతారన్న వార్తలు వచ్చాయి. దాని మంచి చెడ్డల గురించి చర్చించుకోబోయే ముందు ఆ పధకం ఆచరణ సాధ్యమేనా అని సందేహించే వారు ఎందుకు సాధ్యం కాదో ఆలోచించాలి.
ఏడాదికి 25కోట్ల మంది జనాభా వుండే ఐదు కోట్ల పేద కుటుంబాలకు ఏడాదికి 72వేల రూపాయల చొప్పున కనీస ఆదాయాన్ని అందచేస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ఎన్నికల వాగ్దానం మోసం, జనాలూ జాగ్రత్త అంటూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గుండెలు బాదుకుంటున్నారు. అదే సమయంలో ఆ పెద్ద మనిషి మరో మాట కూడా చెప్పారు. తాము అమలు చేస్తున్న పధకాలన్నింటినీ కలిపి చూస్తే అంతకంటే ఎక్కువగానే వివిధ రూపాలలో పేదలకు చెల్లిస్తున్నామని అన్నారు. అంటే రాహుల్ గాంధీ ప్రకటించింది అసాధ్యమైన దేమీ కాదని జెట్లీ అంగీకరించినట్లే కదా !
ఇంతకీ రాహుల్ గాంధీ ఏమి చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు కనీసం పన్నెండువేలకు ఆదాయం తగ్గకూడదన్నది తమ ఆకాంక్ష అని దానిలో భాగంగా డెబ్బయి రెండు వేల రూపాయలను నేరుగా కుటుంబాల ఖాతాలో వేస్తామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ వుపాధి హామీ పధకం కింద 14కోట్ల మందిని దారిద్య్రరేఖ దిగువ నుంచి ఎగువకు చేర్చామని, దాని కొనసాగింపుగా ఈ రెండవ పధకంలో 25కోట్ల మందిని దారిద్య్రరేఖనుంచి ఎగువకు తీసుకు వస్తే దేశంలో మొత్తం దారిద్య్ర నిర్మూలన జరుగుతుందని కాంగ్రెస్ నమ్మబలుకుతున్నది. ఇందుకు గాను 3.6లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కాంగ్రెస్ చెబుతున్నది. తన నాన్నమ్మ ఇందిరా గాంధీ 1970దశకంలో గరీబీ హఠావో నినాదమిచ్చి ఓట్లను కొల్లగొట్టారు. దాదాపు ఐదు దశాబ్దాల తరువాత మనవడు పేదరికం నిర్మూలనకు బదులు పేద కుటుంబాలకు నగదు బదలాయింపు గురించి చెబుతున్నారు. అంటే పేదరిక నిర్మూలన చేయలేం, దానికి బదులు డబ్బు ఇస్తాం అనటమే. అంటే సమస్య తిరిగి మొదటికి వచ్చింది.
మన దౌర్భాగ్యం ఏమంటే మన పాలకులు వారు కాంగ్రెస్ అయినా బిజెపి అయినా మన దేశంలో దరిద్రం ఏ స్దాయిలో, ఎంత మంది వున్నారన్నది ఇంతవరకు నిజాయితీగా నిక్కచ్చి లెక్కలు చెప్పలేదు. దారిద్య్రం నిర్వచనం మీద ఏకాభిప్రాయం లేదు. మన పాలకులు జిడిపి విషయానికి వస్తే ప్రపంచ ధనిక దేశాలతో పోటీ పడుతున్నామని త్వరలో రెండవ స్ధానంలో వున్న చైనాను అధిగమిస్తామని చెబుతారు. కానీ దారిద్య్రరేఖ విషయానికి వస్తే మాత్రం అంతసీను లేదు. రోజుకు 1.9 డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారు ( మార్చినెల 28 డాలరు మారకం రేటులో రు 131) దారిద్య్రరేఖకు దిగువన వున్నట్లు లెక్క. ఇది అంతర్జాతీయ దారిద్య్రరేఖ పాతలెక్క, ప్రపంచ బ్యాంకు తాజాగా వేసిన మదింపులో రెండు రేఖలను సూచించింది ఒకటి రోజుకు 3.2 డాలర్లు రెండవది 5.5 డాలర్లకంటే తక్కువ సంపాదించే వారు దారిద్య్రంలో వున్నట్లే. రెండవదాని ప్రకారం ప్రపంచంలో 58శాతం మంది దారిద్య్రంలో వున్నారు.
2012లో మన కేంద్ర ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం 22శాతం దారిద్య్రరేఖకు దిగువన వున్నారు. ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం 2005లో 23.6శాతం మంది వున్నారు. ఐక్యరాజ్యసమితి సహ్రస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల ప్రకారం రోజుకు 1.25 డాలర్ల కంటే తక్కువ ఆదాయం వున్నవారు 2012లో 21.9శాతం. సురేష్ టెండూల్కర్ కమిటీ నివేదిక ప్రకారం కూడా అంతే వుంది. తరువాత రంగరాజన్ కమిటీ 2014లో చెప్పిన లెక్క 29.5శాతం. 2015లొ రోజుకు 1.9 డాలర్ల ప్రకారం 12.5 శాతం వున్నారు. జిడిపిలో దూసుకుపోతున్న మనం ఇప్పుడు తాజాగా ప్రపంచ బ్యాంకు చెప్పిన 3.2 డాలర్లతో లేదా 5.5డాలర్లతో దేని ప్రాతిపదికన దారిద్య్రాన్ని, దరిద్రులను లెక్కించాలి. రెండవదాని ప్రకారం అయితే ప్రపంచ సగటు 58శాతం లేదా అటూ ఇటూగా మన జనం దరిద్రంలో వున్నట్లే .
రాజీవ్ గాంధీ లేదా ఆయనకు సలహాలు ఇస్తున్నవారు రెండవ దానిని పరిగణనలోకి తీసుకొని రోజుకు 5.5 డాలర్లు (రు 380) లేదా నెలకు 12000 వేల రూపాయలు కనీస ఆదాయం అవసరమని తెల్చారు. అందుకే దానిలో సగం సంపాదించుకుంటే సగం నెలకు ఆరు చొప్పున ఏడాదికి 72వేలను ప్రభుత్వం నేరుగా కుటుంబాలలోని మహిళల ఖాతాలలో వేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదంతా మోసం అని చెబుతున్న ఆర్దిక మంత్రి అరుణ్ జెట్లీ ఏమంటున్నారు. ప్రస్తుతం తాము అమలు జరుపుతున్న వివిధ పధకాలు వుపాధి హామీ పధకం, ఆయుష్మాన్ భవ, ఎరువుల సబ్సిడీ వంటి వాటికింద ఏటా 7.8లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, దీనివలన లబ్ది పొందుతున్నది పేదవారే నని అయితే వివిధ పధకాల కింద వున్నందున మొత్తం ఎంత లభిస్తుందో లెక్కవేసుకోవచ్చు అంటున్నారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు పన్నెండు వేల చొప్పున ఆదాయం వచ్చేట్లు చేయాలంటే జిడిపిలో 1.5శాతం అవుతుందని కాంగ్రెస్ లెక్కలు వేసింది. తాము వాగ్దానం చేసిన పధకాన్ని అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు రెండూ పంచుకోవాల్సి వుంటుందని కూడా చెబుతున్నది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల మొదలు పెట్టి రెండు సంవత్సరాల వ్యవధిలో దేశ మంతటికీ విస్తరింప చేస్తామని కాంగ్రెస్ ప్రతినిధి చెప్పారు. ఏటా కేంద్ర ప్రభుత్వ ఎగుమతుల ప్రోత్సాహం, పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలు, పన్నుల రాయితీలతో పోల్చుకుంటే 3.6లక్షల కోట్ల రూపాయలను పేదలకు ఇవ్వటం పెద్ద లెక్కలోనిది కాదు
రాహుల్ గాంధీ ప్రకటించిన ఈ పధకం కొత్తదేమీ కాదు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న వివిధ సబ్సిడీలు, పధకాలకు అయ్యే ఖర్చు తగ్గించేందుకు గాను వాటిని అందుకు కేటాయిస్తున్న నిధులను నగదు బదిలీ రూపంలో అందచేయాలన్నది ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్ చేసిన సూచనల సారం.వుదాహరణకు వరి పండించే రైతులకు నగదు బదిలీ పధకం కింద కొంత మొత్తం, పేదలకు సబ్సిడీ బియ్యం బదులు నగదు ఇస్తే భారత ఆహార సంస్ధను పూర్తిగా ఎత్తివేయవచ్చు. ఈ దిశగా కేంద్ర పాలిత ప్రాంతాలలో కొన్ని చోట్ల పేదలకు బియ్యం బదులు నగదు బదిలీని ప్రయోగాత్మకంగా అమలు జరుపుతున్నారు. రైతులకు రైతు బంధు మరొక పేరుతో నగదు అందచేసేందుకు నిర్ణయించారు. తెలంగాణాలో ఆ రైతు బంధు పధకం కింద సొమ్ము తీసుకున్న రైతులు తమ ఎర్రజొన్నలు, పసుపు పంటలకు గిట్టుబాటు ధర లేదని బంద్‌లు చేయటమే కాదు, అరెస్టులయ్యారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా నిజామాబాద్ లోక్‌సభ బరిలో 178 మంది రైతులు అధికార పార్టీ అదిరింపులు, బెదిరింపులను లెక్కచేయకుండా పోటీకి నిలిచారు. ఎకరానికి ఎనిమిది వేలు ఇస్తే తాము చేయాల్సిందేమీ లేదని అధికార పార్టీ వూహించింది. పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులతో పోల్చుకుంటే ఎకరానికి ఎనిమిది వేలు ఒక లెక్క కాదు. అందుకే రైతులు రోడ్డెక్కారు.
కాంగ్రెస్ చెబుతున్న నెలకు 12వేల కనీస ఆదాయం కూడా ఇప్పటి ధరల ప్రకారం నలుగురు లేక ఐదుగురు వున్న కుటుంబ సభ్యుల అవసరాలకు సరిపోయే మొత్తం కాదు. అంతకు రెట్టింపు అవసరమని గణాంకాలు తెలుపుతున్నాయి. పట్టణ ప్రాంతాలలో ఒక వ్యక్తికి రోజుకు 2100, గ్రామాలలో 2400 కాలరీల శక్తినిచ్చే ఆహారం కావాలని అందుకు 1973-74లో రు.56.64, 49.09ల చొప్పున అవసరమని లెక్కవేశారు. ఇప్పుడు అంత మొత్తాలు రోజూ తాగే టీ, టిఫిన్ ఖర్చులకే చాలవు. అందువలన ఏటేటా దిగజారుతున్న రూపాయి విలువ, పెరుగుతున్న ధరలకు అనుగుణ్యంగా ప్రతి కుటుంబానికి అవసరమైన ఆదాయం వచ్చే విధంగా వుపాధి చూపితే దయాదాక్షిణ్యాలతో ఇచ్చే సొమ్ముకు ఎవరూ ఆశపడరు.
పేదలకు కనీస ఆదాయ పధకం అన్నది కొత్త ఆలోచన కూడా కాదు. మహమ్మద్ ప్రవక్త మామ, ఇస్లామిక్ రాజ్య తొలి పాలకుడు అయిన అబూ బకర్ ఏటా ప్రతి స్త్రీ, పురుషుడు, పిల్లలకు పది దిర్హామ్‌లు కనీసంగా అందచేయాలనే పధకాన్ని ప్రవేశపెట్టాడు. తరువాత ఆ మొత్తాన్ని ఇరవైకి పెంచాడు. క్రైస్తవ రాజ్యాలకు వ్యతిరేకంగా తమ పాలనను సుస్ధిర పరచేందుకు జనాన్ని ఆకర్షించే పధకమే ఇది. అమెరికాలో 1795లో భూ యాజమాన్య వ్యవస్ధను ప్రవేశపెట్టిన సందర్భంగా సహజంగా వచ్చిన వారసత్వ ఆస్ధులు కోల్పోయినందున నాటి మానవతా వాది ధామస్ పెయిన అమెరికా పౌరులందరికీ పరిహారంగా పౌర లాభం పేరుతో కొంత మొత్తాన్ని చెల్లించాలని ప్రతిపాదించాడు. అమెరికా ఆర్ధికవేత్త హెన్రీ జార్జి భూమి విలువ పన్నుద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని అమెరికన్లందరకూ డివిడెండ్‌గా చెల్లించాలని కోరాడు. 1966లో అమెరికాలో తలెత్తిన ఆర్ధిక సమస్యల పూర్వరంగంలో సంక్షేమ కార్యక్రమాల ఖర్చును తగ్గించేందుకు దారిద్య్ర నిర్మూలనకు కనీస వార్షిక ఆదాయం పేరుతో ఒక పధకాన్ని ప్రవేశపెట్టారు.1968లో 1200 మంది ఆర్దికవేత్తలు ఒక మెమో రాండంపై సంతకాలు చేసి ఆదాయ హామీ పధకాన్ని అమలు జరపాలని కోరారు. అయినా ఇప్పటికీ అమెరికాలో పేదరికం పోలేదు. ఫ్రెంచి పాలకుడు నెపోలియన్ బోనపార్టే కూడా పౌరుల మనుగడకు నిమిత్తం అవసరాలు తీర్చేందుకు కొంత మొత్తాన్ని తీసుకోవటం వారి జన్మహక్కని చెప్పాడు.
దీని వెనుక వున్న లాజిక్కును కూడా అర్ధం చేసుకోవాలి. మహమ్మద్ ప్రవక్త మామ అయినా మరొకరు అయినా వర్గ సమాజాలకు ప్రతినిధులు. అది బానిస సమాజం, ఫ్యూడలిజం, పెట్టుబడిదారీ విధానమైనా యజమానులకు పనిచేసేందుకు కార్మికులు కావాలి. వారు కావాలంటే కనీసం బతికి, పని చేసేందుకు అవసరమైన శక్తి అవసరం. ఆ కనీసఅవసరం వారికి తీరకపోతే పని చేసే వారు దొరకరు. అందుకే కనీస సంక్షేమ పధకాలను అమలు జరిపిన తీరు ప్రతి సమాజంలోనూ మనకు కనిపిస్తుంది. పశ్చిమ దేశాలలో కార్మికులు జబ్బుపడి పని మానితే వచ్చే నష్టం కంటే వారికి ఆరోగ్య సంరక్షణకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తే యజమానులకు వచ్చే లాభమే ఎక్కువగా వుంది కనుక పరిమితంగా అయినా ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఏదీ వుచితం కాదు, అలాంటపుడు అమలు జరిపే సంక్షేమ పధకాలను వుచితంగా అమలు జరుపుతారని ఎందుకు అనుకోవాలి.
ప్రస్తుతం అనేక దేశాలలో కనీస ఆదాయ హామీ పధకాలు అమలు జరుగుతున్నాయి, అయితే వాటికి షరతులు వర్తిస్తాయి. బ్రెజిల్‌లో పిల్లలను బడులకు పంపటం ఒక షరతు. మన దేశంలో 1934లో కాంగ్రెస్ నేత సుభాస్ చంద్రబోస్ తొలుత ఇలాంటి పధకం గురించి ప్రతిపాదించారు. తరువాత 1942లో జవహర్‌లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి ప్రతిపాదనలు చేయాలని కోరినప్పటి అది జరగలేదు.