ఎం కోటేశ్వరరావు
వెనెజులా పరిణామాలు 2
ఏప్రిల్ 30, మే ఒకటవ తేదీన జరిపిన తిరుగుబాటు యత్నం విఫలం కావటంతో ఇప్పుడు వెనెజులా ప్రతిపక్ష నేత జువాన్ గుయ్‌డో అమెరికా ప్రత్యక్షంగా మిలిటరీ జోక్యంచేసుకోవాలని కోరుతున్నాడు. తమ నడకలో ఎలాంటి తడబాట్లు లేవని, మిలిటరీ జోక్యంతో సహా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని అమెరికా ప్రకటించింది. మరోవైపు గృహ నిర్బంధం నుంచి తప్పించుకొని కారకాస్‌లోని స్పెయిన్ రాయబారి ఇంట్లో ఆశ్రయం పొందిన ప్రతిపక్ష నేత లియోపాల్డ్ లోపెజ్‌ను అరెస్టు చేయాలని వెనెజులా సర్కార్ నిర్ణయించింది. అతను రాజకీయ ఆశ్రయం కోరలేదని తాము ఆతిధ్యం మాత్రమే ఇస్తున్నామని స్పెయిన్ ప్రకటించింది.
వెనెజులా వ్యవహారాల్లో అమెరికా జోక్యం నిత్యకృత్యం అన్న విషయం తెలిసినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త పధకాలు వేస్తూనే వుంటారు. ఆపరేషన్ లిబర్జీ పధకం కూడా అలాంటిదే. మధ్యంతర అధ్యక్షుడిగా జువాన్ గుయ్‌డో ప్రకటించుకోవటం, అతగాడి ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నట్లు అమెరికా, దాని కనుసన్నలలో నడిచే దేశాలతో దాన్ని గుర్తింప చేయటం, మదురో సర్కార్ నియమించిన రాయబారులను గుర్తించటం లేదని ప్రకటించటం వగైరాలన్నీ అంతర్జాతీయంగా వెనెజులాలో ప్రభుత్వం మారిపోయిందని, మదురో ఇంకేమాత్రం అధ్యక్షుడు కాదని ప్రపంచాన్ని నమ్మింపచేయటం ఈ పధకంలో భాగమే. దీన్ని అనేక దశల్లో అమలు జరిపారు. విఫలమైన అంకం ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి దేశంలో అంతర్గతంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చేయటం, మిలిటరీని తన వైపు రమ్మని కోరటం, తిరుగుబాటు చేయాలని అమెరికా పిలుపు ఇవ్వటం వంటి వన్నీ దానిలో భాగమే. కుట్రను గొప్పగా రూపొందించిన వారికి దాన్ని అనుసరించటానికి వెనెజులా జనం సిద్ధంగా లేరనే స్పృహ లేదు. అక్కడే పప్పులో కాలేశారు.
ఈ పధకంలో భాగంగా అమలు జరపాల్సిన వాటి మీద అమెరికాకు చెందిన సిఐఏ, యుఎస్ ఎయిడ్, ఎన్‌ఇడి వంటి వాటికి బాధ్యతలు అప్పగించారు. యుఎస్ ఎయిడ్ రూపొందించిన పలు దేశాలకు రూపొందించిన కార్యాచరణ పధకానికి సంబంధించిన పత్రం ఫిబ్రవరిలోనే వెల్లడైంది. ఆ సంస్ధకు అనుబంధంగా పనిచేసే ‘ యుఎస్ గ్లోబల్ డెవలప్‌మెంట్ లాబ్ ‘ 75పేజీల పత్రాన్ని రూపొందించింది. దానికి రాపిడ్ ఎక్స్‌పెడిషనరీ డెవలప్‌మెంట్(ఆర్‌ఇడి)(రెడ్) టీమ్స్: డిమాండ్ అండ్ ఫీజ్‌బులిటీ అని పేరు పెట్టింది.( వేగంగా దండయాత్ర నిర్వహించే బృందాలు: అవసరం మరియు సాధ్యాసాధ్యాలు) ఈ నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం వివిధ దేశాలలో రహస్య కార్యకలాపాలు నిర్వహించే సామర్ధ్యం గురించి అమెరికా మిలిటరీ, గూఢచార తదితర అధికారులు నివేదికను రూపొందించిన వారిని ఇంటర్వ్యూ చేశారు. ఒక్కో బృందం ఇద్దరిద్దరితో వుండాలని, ఎదురుదాడి, ఆత్మరక్షణ పద్దతులను, ప్రతికూల పరిస్ధితుల్లో ఎలా పని చేయాలో వాటికి నేర్పాలని అవి అమెరికా ప్రత్యేక దళాలు(ఎస్‌ఎఫ్) మరియు సిఐఏ పర్యవేక్షణలో పని చేయాలని నిర్దేశించారు. ఇవి స్ధానిక సామాజిక తరగతుల మధ్య అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తాయి. స్ధానికంగా వున్న పరిస్దితులను గమనించటం వాటికి అనుగుణంగా వెంటనే స్పందించి పధకాలు రూపొందించటం, నిధులు అందచేయటం, చిన్న చిన్న కార్యకలాపాల నిర్వహణ చేస్తాయి. వీటిలో సామాజిక కార్య క్రమాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే పేరుతో బోధలతో పాటు నిరసన కార్యక్రమాలను నిర్వహించటం కూడా వుంటాయి. దేశమంతటా స్వేచ్చ మరియు సహాయ కమిటీలను దేశ వ్యాపితంగా ఏర్పాటు చేయాలి. రెడ్ టీమ్స్ పైకి వుత్ప్రేరకాలుగా కనిపించాలి, వాటికి సామాజిక తరగతులను సమీకరించే పద్దతులు, చిట్కాలతో పాటు ఎదురుదాడి, ఆత్మ రక్షణకు ఆయుధాలను ఎలా వినియోగించాలో కూడా శిక్షణ ఇస్తారు. వారు స్ధానికులతో సంబంధాలను నెలకొల్పుకొని వారి ద్వారా మరికొందరిని ప్రభావితం చేసేందుకు, ప్రలోభపరచేందుకు వారి బలహీనతలను గుర్తించి డబ్బు,ఇతర వాటిని ఎరవేస్తారు. ఒకసారి వారి వలలో చిక్కిన తరువాత తమకు నిర్ధేశించిన రహస్యకార్యకలపాలలో నిమగ్నం చేస్తారు. ఈ అంశాలన్నీ ప్రతి దేశంలో అమలు జరపాల్సిన నమూనాలో భాగం. ఈ పధకాన్ని దక్షిణ అమెరికా దేశాలన్నింటా అమలు జరపాలి. ముందుగా అమెరికా పట్ల సానుకూలంగా వుండే ప్రభుత్వాలున్న దేశాలను ఎంచుకోవాలి. దీన్ని ప్రయోగాత్మకంగా అమలు జరిపేందుకు బ్రెజిల్‌ను ఎంచుకోవాలని సూచించారు.
ఈ ఏడాది జనవరిలో బ్రెజిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఫాసిస్టు జెయిర్ బల్‌సానారో అమెరికాతో సంబంధాల ఏర్పాటు గురించి బహిరంగంగానే చెప్పాడు. సిఐఏ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన తొలి బ్రెజిల్ అధ్యక్షుడయ్యాడు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ గతం కంటే తమ మధ్య సంబంధాలు బలపడ్డాయని, బ్రెజిల్ నాటోలో చేరాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఆ తరువాత బొల్‌సానారో ఫిబ్రవరిలో ఒక ప్రకటన చేస్తూ తమ గడ్డ మీద నుంచి అమెరికా మరో దేశంలో సైనిక జోక్యం చేసుకోవటాన్ని తాము అనుమతించబోమని ప్రకటించాడు. అయితే తండ్రికి సలహాదారు, పార్లమెంట్ సభ్యుడైన ఎడ్వర్డ్ బొల్‌సానారో మార్చినెలలో మాట్లాడుతూ ఏదో ఒక సమయంలో వెనెజులాలో సైనిక జోక్యం అవసరమని, అన్ని అవకాశాలున్నాయని చెప్పాడు. అయితే బ్రెజిల్ నుంచి ప్రత్యక్ష జోక్యం చేసుకొనే అవకాశం లేకపోతే అక్కడి నుంచి రెడ్ బృందాలు రహస్య కార్యకలాపాలను నిర్వహించాలని సిఐఏ సూచించింది.
నివేదికలో వెనెజులాలో నిర్వహించాల్సిన అంశాలను కూడా అనుబంధాలలో పొందుపరిచారు. ఏప్రిల్ ఆరవ తేదీన ఆపరేషన్ ఫ్రీడమ్ లేదా లిబర్టీ ప్రారంభమౌతుందని వాటిలో పేర్కొన్నారు. కాన్వాస్ అనే సంస్ధ అమెరికా నిధులతో వెనెజులాలో ప్రతిపక్ష పాత్రను ఎలా పోషించాలో జువాన్ గుయ్‌డోకు శిక్షణ ఇచ్చింది. దేశంలోని కీలకమైన వ్యవస్ధలను ధ్వంసం చేయటం ద్వారా మదురో ప్రభుత్వం మీద జనంలో అసంతృప్తిని రెచ్చగొట్టటం వాటిలో ఒకటి. దానికి అనుగుణంగానే కొద్ది వారాల క్రితం వెనెజులా విద్యుత్ వ్యవస్ధను దెబ్బతీసి అంధకారం గావించిన విషయం తెలిసిందే. ఇలాంటి సలహాలు, ఎత్తుగడలు అమెరికా జోక్యం చేసుకొనే అన్నిదేశాలకూ సూచించారు. చిత్రం ఏమిటంటే వుదాహరణకు అని చెప్పినట్లుగా వెనెజులాలోని గౌరి డామ్ వద్ద వున్న సైమన్ బోలివర్ జలవిద్యుత్ కేంద్రాన్ని దెబ్బతీస్తే పర్యవసానాలు ఎలా వుంటాయో వివరించారు.
ఆపరేషన్ లిబర్టీలో ఒక అంశం నిర్ణయాత్మక దశ అని పేరు పెట్టారు. దాన్ని ఏప్రిల్ 30, మే ఒకటవ తేదీల్లో అమలు జరపాలని చూశారు. దాని ప్రకారం ఏం జరిగిందో కొందరు ప్రత్యక్ష సాక్షుల వివరణ సారాంశం ఇలావుంది.ఆపరేషన్ లిబర్టీలో భాగంగా ఏప్రిల్ 30వ తేదీ తెల్లవారు ఝామున 5.46 నిమిషాలకు కొంత మంది సైనికుల రక్షణగా కెమెరా ముందు నిలబడిన లియోపాల్డ్ లోపెజ్ మాట్లాడుతూ పౌరులు వీధుల్లో ప్రదర్శనలుగా రావాలని, జువాన్ గుయ్‌డో వేచి వున్న లా కార్లోటా వైమానిక స్ధావరం వద్ద అందరం కలసి అక్కడి నుంచి మదురో ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కదులుదామని చెప్పాడు. ఆ తరువాత అర్ధగంటకు తాను నిర్బంధం నుంచి విముక్తి అయ్యానని, గుయ్‌డోకు విధేయులుగా వున్న సైనికులు తనను విడిపించారని ఇది నిర్ణయాత్మక దశ అని విజయానికి ఇదే తరుణం అన్నాడు. కొద్ది సేపటికి తాను వైమానిక స్ధావరం వద్దకు వచ్చానని చెప్పాడు. అయితే పంపిన ఫొటోలు దాని వెలుపల రోడ్డుమీదివి తప్ప మరొకటి కాదు. వుదయం 8.30కు తుపాకి కాల్పులు వినిపించాయి. ఎవరు ఎవరి మీద కాల్చారో తెలియని స్ధితి. మధ్యాహ్నానికి రోడ్ల మీద కొన్ని వుందల మందే వున్నారు. అక్కడి నుంచి ప్రదర్శన జరుపుదామని గుయ్‌డో, లోపెజ్ జనంతో చెప్పారు. ఆ సమీపంలోనే అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్, తదితర ప్రభుత్వ భవనాలు వున్నాయి. అటువైపు ప్రదర్శన సాగాలని చెప్పిన తరువాత భద్రతా దళాలు ప్రదర్శకులను అడ్డుకున్నాయి. రెండు గంటల సమయంలో నేషనల్‌గార్డ్స్, బొలివేరియన్ పోలీస్‌లు ప్రదర్శకులపై కాల్పులు జరిపారు. కొద్ది మంది గాయపడటం తప్ప ఎవరూ మరణించలేదు. సాయంత్రానికి కొద్ది మంది నిరసనకారులు అక్కడే వున్నారు.ఎక్కువ మంది వెళ్లిపోయారు.
తన ప్రయత్నం విఫలమైందని అర్ధం కాగానే గుయ్‌డో మే ఒకటవ తేదీన పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చాడు. మరోవైపు లోపెజ్ కారకాస్‌లోని చిలీ రాయబార కార్యాలయంలో వున్న తన భార్యాబిడ్డలను తీసుకొని స్పానిష్ రాయబార కార్యాలయానికి వెళ్లి ఆశ్రయం కోరాడు. అయితే వారు కార్యాలయానికి బదులు రాయబారి ఇంట్లో రక్షణ ఇచ్చారు. వారం రోజులుగా ఇప్పటికి అక్కడే వున్నాడు. ఇరవై అయిదు మంది తిరుగుబాటు సైనికులు బ్రెజిల్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. గుయ్‌డో గుర్తు తెలియని ప్రాంతానికి పారిపోయాడు. తొలి రోజు ఒకడు మరణించినట్లు,59 మంది గాయపడినట్లు వార్తలు వచ్చాయి. రెండవ రోజు మే డే నాడు కొన్ని చోట్ల గుయ్‌డో మద్దతుదార్లు ఘర్షణలకు దిగారు. పోలీసు కాల్పుల్లో ఒక యువతి గాయపడి తరువాత ఆసుపత్రిలో మరణించింది. అంతకు ముందు రోజు రాత్రే తిరుగుబాటును అణచివేసినట్లు మదురో ప్రకటించాడు. మే డే రోజున పెద్ద ఎత్తున ఆయన మద్దతుదార్లు వీధుల్లో అనేక చోట్ల ప్రదర్శనలు జరిపారు. తిరుగుబాటుదార్లు, వారి నేతలు గుయ్‌డో, లోపెజ్‌ల పట్ల మదురో సర్కార్ ఎంతో సంయమనం పాటించిందన్నది స్పష్టం. లేకుంటే వారు అంత స్వేచ్చగా కారకాస్ శివార్లలో తిరిగే వారు కాదు. తప్పుదారి పట్టిన పౌరుల పట్ల కూడా భద్రతా దళాలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాయి. భారీ ఎత్తున కాల్పులు జరిగాయని పశ్చిమ దేశాల మీడియా వార్తలు ఇచ్చింది. అయితే తరువాత అందుకు తగిన ఆధారాలు లేకపోవటంతో గప్‌చుప్ అయ్యాయి. తరువాత ఏమిటి అంటూ సమస్యను పక్కదారి పట్టించే కధనాలను ఇస్తున్నాయి. మచ్చుకు ఒకదాన్ని చూస్తే చాలు.
వెనెజులా పౌరులు పోగొట్టుకున్న తమ స్వాతంత్య్రం కోసం వీధుల్లోకి పెద్ద ఎత్తున వచ్చివుంటే ఎందరో మరణించి వుండేవారు. ఛావెజ్‌ను ఎన్నుకొని వారు పెద్ద తప్పు చేశారు. ఇరవై ఏండ్ల సోషలిజపు వినాశకర ప్రభావాలను చూస్తున్నారు. దశాబ్దకాలంగా ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలిపోయింది. ప్రజాస్వామిక స్వేచ్చలను అణచివేశారు. భావ ప్రకటనా స్వేచ్చ, స్వతంత్ర మీడియా అదృశ్యమైంది. సమాజంలోని ప్రతి స్ధాయిలో క్యూబా గూఢచారులను నింపివేశారు. దేశాన్ని ఒక పోలీసు రాజ్యంగా మార్చివేశారు. చివరకు మదురో వ్యక్తిగత అంగరక్షకులుగా భారీ సంఖ్యలో రష్యన్ సాయుధులు వచ్చారు. వెనెజులా మిలిటరీ ప్రస్తుత నాయకత్వాన్ని బలపరచి ప్రయోజనం లేదని గ్రహించి తిరుగుబాటు చేసే వరకు రష్యా, చైనా మదురోకు మద్దతు ఇస్తూనే వుంటాయి. అది ఎప్పుడు జరుగుతుందో చెప్పటం తొందరపాటు అవుతుంది.
ఇలా చెత్త రాతలన్నీ రాస్తున్నాయి. వాటన్నింటినీ దేవదూతల సందేశాలుగా భావించిన వారు ప్రచారంలో పెడుతున్నారు. ఆపరేషన్ లిబర్టీ కుట్ర ముందే వెల్లడి కావటంతో మదురో సర్కార్ తగిన జాగ్రత్తలు తీసుకోవటం కూడా జయప్రదంగా దాన్ని తిప్పి కొట్టటానికి దోహదం చేసిందనవచ్చు. వాస్తవం ఏమిటో అనుభవించిన వారికి స్పష్టంగా తెలుసు, ప్రతిపక్ష నాయకుల గురించి కూడా వారికి చెప్పనవసరం లేదు. అయితే అమెరికన్లు తెగించి ప్రత్యక్ష సైనిక చర్యకు పాల్పడతారా, మరోసారి మిగతా దేశాలలో మాదిరి చేతులు కాల్చుకుంటారా అన్నది వచ్చే ఎన్నికలలో లబ్ది కోసం డోనాల్ట్ ట్రంప్ చేసే పిచ్చి ఆలోచనలను బట్టి వుంటుంది. ఒక వేల ప్రత్యక్ష జోక్యం చేసుకుంటే అది లాటిన్ అమెరికాలో, ప్రపంచంలో మరో కొత్త పరిణామాలకు నాంది అవుతుంది.