Tags

, , , , , , , ,

Image result for communal politics with mahabharata, ramayana epics

ఎం కోటేశ్వరరావు

కొన్ని సంఘటనలను, ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలను వక్రీకరించటం ఆ పేరుతో తమ అజెండాను అమలు జరపటం సంఘపరివార్‌ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల్లో దేవుళ్లు, దేవతల పేర్లను ప్రస్తావించి ఓట్లడగటం నిబంధనల వుల్లంఘన కిందికి వస్తుంది. కానీ ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలు, వారి అనుచర గణాలు ఈ ఎన్నికల్లో ఎన్ని సార్లు ఆ పేరుతో ప్రతిపక్షాలపై దాడి చేశాయో, రెచ్చగొట్టేవిధంగా మాట్లాడాయో చూస్తున్నాము. జై శ్రీరామ్‌ అని భారత్‌లో గాక పాకిస్ధాన్‌లో అంటామా అని అమిత్‌ షా, బెంగాల్లో జై శ్రీరామ్‌ అనటమే నేరమైంది, మా వాళ్లను జైల్లో పెడుతున్నారని నరేంద్రమోడీ నానా యాగీ చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యను ఆధారం చేసుకొని టీ అమ్మే వారు ప్రధాని కాకూడదా అంటూ తెగ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ సారి అదేమిటో మోసగాండ్లలో చాలా మంది పేర్ల చివర మోడీ అనే వుంది అని రాహుల్‌ గాంధీ చేసిన విమర్శను పట్టుకొని నన్ను అంటే అనండిగానీ నా వెనుక బడిన మోడీ కులం మొత్తాన్ని దొంగలంటారా అని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో కులాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు జై శ్రీరాం నినాదం చేస్తే జైల్లో పెడతారా అనే యాగీ కూడా బెంగాల్లో, ఇతర చోట్ల ఓట్ల వేటలో భాగమే. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచారానికి వెళుతుండగా భద్రతా ఏర్పాట్లను దాటి ముగ్గురు యువకులు ముందుకు వచ్చి మమతా బెనర్జీ కారు ముందు జై శ్రీరాం అంటూ నినాదాలు చేసి ఆమెను అడ్డుకోబోయారు. రెచ్చి పోయిన ఆమె వెంటనే కారు దిగి ఇప్పుడు రండి అంటూ కేకలు వేశారు. ఆ యువకులు పారిపోయారు. తరువాత పోలీసులు వారిని పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌లో విచారించి వదలి వేశారని మీడియా వార్తలు వచ్చాయి. ఈ వుదంతాన్ని సాకుగా చేసుకొని రాముడిని వీధుల్లోకి తెచ్చి ఓటర్లను రెచ్చగొట్టేందుకు బిజెపి పెద్దలు పూనుకున్నారు. కేరళలో కూడా అయ్యప్ప స్వామి పేరుతో నినాదాలు చేస్తూ హింసాకాండకు పాల్పడిన వారి మీద కేసులు పెడితే భక్తులను అడ్డుకున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు. భక్తి ఒక ముసుగు, దేవుడి పేరు ఒక సాకు తప్ప ఇంకేమైనా వుందా ?

మధ్య ప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి మాట్లాడుతూ అక్కడ పోటీ చేస్తున్న మాలెగావ్‌ పేలుళ్ల నిందితురాలు, బిజెపి అభ్యర్ధి ప్రజ్ఞ సింగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యల మీద స్పందించారు. హిందువులకు హింస మీద విశ్వాసం లేదు అని ఆమె మాట్లాడటం గురించి సీతారామ్‌ స్పందించారు. ఈ దేశంలో ఎందరో చక్రవర్తులు, రాజులు యుద్ధాలు చేశారు.రామాయణం, మహాభారతాలు కూడా ఎన్నో యుద్ధాలు, హింసతో నిండి వున్నాయి. ఒక ప్రచారకురాలిగా మీరు ఇతిహాసాల గురించి చెబుతారు. అయినా హిందువులు హింసకు పాల్పడరని అంటారు. దీనికి వెనుక వున్న తర్కం ఏమిటి ? హిందువులు హింసకు పాల్పడరనేది ఒక అవాస్తవం, దానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. తొలి దశ ఎన్నికలు అయిపోయాయి. తిరిగి వారి అసలైన అజెండా 370, 35ఏ ఆర్టికల్స్‌ రద్దు, వివాదాస్పద స్ధలంలో రామమందిర నిర్మాణం, వుమ్మది పౌర స్కృతి వంటి అంశాలకు వారు తిరిగి వచ్చారు. మూడవ దశ ఎన్నికల తరువాత భోపాల్‌లో ప్రజ్ఞా ఠాకూర్‌ను అభ్యర్ధిగా నిలబెట్టటం ప్రజలలో మనోభావాలను రెచ్చగొట్టే చర్య తప్ప మరొకటి కాదు. ఇదీ సీతారామ్‌ ఏచూరి వుపన్యాసంలో ఒక అంశం సారాంశం.

Image result for mahabharata, ramayana , violence

దీనిలో రామాయణ,భారతాల ప్రస్తావనను మాత్రమే ముందుకు తెచ్చి మతధోరణులును రెచ్చగొట్టేందుకు తద్వారా మిగిలిన దశల్లో ఓట్ల లబ్ది పొందేందుకు పూనుకున్నారు. ఏచూరి చేసిన విమర్శలో రెండో భాగానికి సమాధానం లేదు. హింసాత్మక ప్రవృత్తి కలిగిన వారు అన్ని మతాల్లో వుంటారని తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్రమోడీ వక్రీకరిస్తున్నారని ఏచూరి పేర్కొన్నారు.’ ఒక వుగ్రవాద కేసులో నిందితురాలిగా వున్న వ్యక్తిని అభ్యర్ధిగా బిజెపి నియమించిన అంశం మీద భోపాల్‌లో నేను చెప్పిన దానిని ఆయనకు అలవాటైన పద్దతుల్లో వక్రీకరించారు. వుగ్రవాదానికి మతం వుండదు, హింసాత్మక ప్రవృత్తి వున్న వారు అన్ని సామాజిక తరగతుల్లో వుంటారు. ఇతిహాసాలైన రామాయణ, మహాభారాతాల్లో కూడా అలాంటి వ్యక్తులు మనకు కనిపిస్తారు. మతపరమైన విభజనను మరింత పెంచేందుకు మోడీ అసత్యాలు చెబుతున్నారు’ అని ట్వీట్‌ చేశారు. ఏచూరి భోపాల్‌ వ్యాఖ్యలు హిందూమతాన్ని కించపరిచేవిగా వున్నాయని, మనోభావాలను దెబ్బతీశాయని ఇంకా ఏవేవో చేశాయని చెబుతూ కార్పొరేట్‌ రామ్‌దేవ్‌ బాబా, ఇంకా చిల్లర మల్లర ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వ్యక్తులు కొన్ని చోట్ల పోలీసు కేసులు దాఖలు చేశారు. సంఘపరివార్‌ ఎత్తుగడల్లో కేసులు దాఖలు చేసి కోర్టుల చుట్టూతిప్పే చౌకబారు చర్య ఒకటి. అయితే ఆ కేసులు నిలుస్తాయా లేదా, వాటికి ఎవరూ భయపడక పోయినప్పటికీ మీడియాలో ప్రచారం పొందవచ్చని, వివాదాలు జనం నోళ్లలో నానుతూ వుండాలనేది వారి లక్ష్యం. వారికి శివసేన తాళం, పక్కవాయిద్యాలుగా పని చేస్తున్నది.

Image result for mahabharata, ramayana , violence

ఈ సందర్భంగా తమ రాజకీయాలేవో తాము చెప్పుకోకుండా అనవసరంగా సీతారామ్‌ ఏచూరి వ్యాఖ్యలు చేశారంటూ కొందరు కపటంతో కూడిన సలహాలు ఇస్తున్నారు. అంటే తాము చెప్పిందే వేదం, పాడిందే పాట అంటూ కొంత మంది వక్రీకరణలకు, విద్వేష ప్రచారానికి పూనుకుంటే నోరు మూసుకొని కూర్చోవాలా? ప్రపంచంలో ఎక్కడా ఇలా కూర్చోలేదు, అది అసలు మానవ స్వభావానికే విరుద్దం. ఒక రాయికి, నోరు లేని పశువుకు, మనిషికి ఇంక తేడా ఏముంది. అనవసరంగా వ్యాఖ్యలు చేశారని కాదు, ఆయన అన్నదాంట్లో వున్న అసందర్భం, అసమంజసం ఏమిటన్నది చెప్పకుండా చేయకుండా వుంటే బాగుండేది , మనోభావాలను దెబ్బతీయటం, ఓట్లు పొగొట్టుకోవటం ఎందుకు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇది చచ్చిన చేపల బాట తప్ప బతికిన చేపల ఎదురీత కాదు. భిన్న అభిప్రాయం అనేది భారతీయ సంస్కృతిలో భాగం. దానికి వేల సంవత్సరాల నాడే చార్వాకులు లేదా లోకాయతులు నాంది పలికారు. వారిని భౌతికంగా నాశనం చేస,ి వారు రాసిన గ్రంధాలను ధ్వంసం చేసిన వుగ్రవాద చరిత్ర నాటి మత పెద్దలది, వారికి మద్దతు ఇచ్చిన రాజరికాలది. అయినా సరే ప్రతి తరంలోనూ ఛాందసాన్ని, మతోన్మాదాన్ని వ్యతిరేకించే శక్తులు పుట్టుకు వస్తూనే వున్నాయి. భావజాలాన్ని అంతం చేయటం ఎవరి వల్లా కాదన్నది చరిత్ర చెప్పిన సత్యం.పురోగామి భావజాలానికిి ప్రతీకలుగా వున్నవారిలో ఏచూరి ఒకరు. గతంలోఎందరో రామాయణ, మహాభారతాలను విమర్శనాత్మకంగా చూడలేదా ? చోళరాజు కుళోత్తుంగుడు శైవమతాభిమాని. వైష్ణవులను ఇతరులను సహించని కారణంగానే రామానుజుడు పన్నెండు సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం లేదా హోయసల రాజుల ఆశ్రయం పొందాడని చరిత్రలో లేదా ? అశోక చక్రవర్తి కళింగ యుద్ధంలో జరిగిన మారణకాండను చూసిన తరువాత మారు మనసు పుచ్చుకొని బౌద్ధమతాన్ని అవలంభించాడన్న చరిత్ర చెబుతున్నదేమిటి? కుళోత్తుంగుడు, అశోక చక్రవర్తి, లేదా శైవ, వైష్ణవ మతాభిమానులైన చక్రవర్తులకు వేదాలు, పురాణాలు, భారత, రామాయణాలు తెలియవా, వారు వాటిని చదివిన తరువాతనే కదా శైవ, వైష్ణవ మత యుద్దాలకు, ప్రార్ధనా మందిరాల విధ్వంసకాండ, కూల్చివేతలకు, మారణకాండకు పాల్పడింది. మరి వాటిలోని మంచి నుంచి వారేమి నేర్చుకున్నట్లు ? అలాంటి మారణకాండకు పాల్పడకుండా వారిని ఆ గ్రంధాల భావజాలం నిలువరించలేదే. ఒకనాడు ఒకరిని ఒకరు అంతం చేసుకోవాలని చూసిన వారు నేడు హిందూ మతం పేరుతో వారు శైవులైనా, వైష్ణవులైనా రాజీపడి ఇతర మతాల మీద దాడికి పూనుకుంటున్నారు.

Image result for mahabharata, ramayana , violence

ఇతిహాసాలైనా, పురాణాలు, వేదాలు, భగవద్గీత వంటి హిందూ మత గ్రంధాలైనా, ఇతర మతాలకు చెందిన బైబిల్‌ పాత మరియు కొత్త నిబంధనలు, ఖురాన్‌, సిక్కుల గురుగ్రంధమైనా మరొకటి అయినా ఎవరినీ వుగ్రవాదులుగా మారమని, ఇతరులను అంతం చేయమని చెప్పలేదు. వాటిని చదివినవారందరూ వుగ్రవాదులుగా మారి వుంటే ఈ పాటికి ప్రపంచంలో ఏ ఒక్కడూ మిగిలి వుండేవారు కాదు. ప్రపంచంలో అత్యధికంగా 230 కోట్ల మంది క్రైస్తవులు, 180 కోట్ల మంది ముస్లింలు, 115 కోట్ల మంది హిందువులు, అసలు ఏ మతం లేని వారు 120 కోట్ల మంది వున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వారు చెప్పేదాని ప్రకారం ఖురాన్‌ హింసను ప్రేరేపిస్తున్నదని చెప్పేదే వాస్తవం అయితే ప్రపంచంలో 180 కోట్ల మంది వుగ్రవాదులుగా మారి వుండాలి. ఐఎస్‌ వుగ్రవాదులు ముస్లింలే, వారు చంపుతున్నదీ సిరియా,ఎమెన్‌ వంటి ఇస్లామిక్‌ దేశాల్లోని జనాన్నే కాదా ? సౌదీ అరేబియా ముస్లిం దేశం మరొక ముస్లిం దేశం ఎమెన్‌ మీద యుద్దం చేస్తున్నది, ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికాతో సహకరిస్తున్నది. అలా చేయమని ఖురాన్‌ చెప్పిందా ? అమెరికాను, ఐరోపా దేశాలను పరిపాలించింది క్రైస్తవులే, ప్రపంచాన్ని ఆక్రమించుకున్నది క్రైస్తవ దేశాలకు చెందిన వారే. అనేక ప్రాంతీయ యుద్ధాలకు, రెండు ప్రపంచ యుద్దాలకు కారకులైన హిట్లర్‌, ముస్సోలినీ వంటి వారందరూ క్రైస్తవులే. యుద్ధాలు చేయమని, జనాన్ని చంపమని బైబిల్‌ బోధించిందా? అదే అయితే ఇతర మతాలకు చెందిన దేశాల మీద వారికి వారే ఎందుకు యుద్ధాలు చేసుకున్నట్లు ? ఈ రోజు ప్రపంచంలో దాదాపు 40దేశాలలో జోక్యం చేసుకుంటున్న అమెరికన్లు మత రీత్యా క్రైస్తవులే. బరాక్‌ ఒబామా అయినా, డోనాల్డ్‌ ట్రంప్‌ అయినా ఆ విధానంలో మార్పు లేదు. భారత, రామాయణాలు, భగవద్గీత, పురాణాలను చదివిన నరేంద్రమోడీ మరి నరహంతక చర్యలకు పాల్పడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ను కౌగిలింతలతో స్నేహం చేయమని ఆ గ్రంధాల్లో చెప్పాయా? ఆ దారుణాలను ఎందుకు ఖండించరు, అలాంటి శక్తులకు దూరంగా ఎందుకు వుండరు ? ముస్లింలు, క్రైస్తవులను ద్వేషించమని, వారి మీద విద్వేషాన్ని రెచ్చగొట్టమని భారత రామాయణాలు చెప్పలేదే, మరి వాటిపేరుతో హిందూత్వశక్తులు చెలరేగిపోతుంటే ఆ దేవుళ్లు,దేవతలు ఎందుకు జోక్యం చేసుకోవటం లేదు.

Image result for mahabharata, ramayana , violence

తాను బాబరీ మసీదు పైకి ఎక్కానని, దాని కూల్చివేతలో భాగస్వామి అయ్యానని, దేవుడు తనకు ఇచ్చిన అవకాశమదని, మరోసారి దొరికితే తిరిగి పాల్గొంటానని స్వయంగా టీవీ ఇంటర్య్యూలో ప్రజ్ఞ చెప్పటం అంటే బాబరీ మసీదు కూల్చివేత నేరాన్ని అంగీకరించటమే. సాంకేతికంగా కేసుల్లో నిందితులుగా వున్నప్పటికీ బహిరంగంగా అంగీకరించిన వారిని నేరస్తులు అనే జనం అంటారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, ఇతరుల సాయం వుంటే తప్ప నడవలేనంటూ కాన్సర్‌ చికిత్సకోసం బెయిలు ఇవ్వాలని కోరిన ఆమె ఎవరి సాయంతో పని లేకుండా ఎన్నికల ప్రచారం అంటూ భోపాల్‌ వీధుల్లో తిరిగి రెచ్చగొడుతున్నారు. ఎన్నికల కమిషన్‌ నిషేధం విధిస్తే గుళ్లు, గోపురాలు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఇదేమంటే పూజలు చేసుకోనివ్వరా అంటూ మనోభావాలను రెచ్చగొడుతున్న ఆమెను అబ్దాలకోరు అనాలా, నిజం చెప్పని మనిషిగా భావించాలా ? వుగ్రవాద కేసులో ఆమె జైల్లో వున్నారు. నిందితులు ముస్లింలు, క్రైస్తవులు అయితే వారికి ఆ మతాలను తగిలించి వుగ్రవాదులు అని మీడియా రాస్తున్నది, చూపుతున్నది. ఆ లెక్కన ప్రజ్ఞను హిందూ వుగ్రవాది, హిందూ వుగ్రవాదం అనాలా లేదా ? అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో వుగ్రవాద చర్యలకు పాల్పడిన శ్వేతజాతీయులకు శిక్షపడకుండా లేదా నామమాత్రంగా వేసే విధంగా ముందే పోలీసులు మతిస్ధిమితం లేని వ్యక్తి అని చెబుతారు. మీడియా కూడా జీహుజూర్‌ అంటూ అలాగే రాస్తున్నట్లుగా ప్రజ్ఞను కూడా మతిలేని స్దితిలో వున్నట్లు పేర్కొనాలా ? ఇలాంటి ఆమె దేశ సంస్కృతికి ప్రతీక అని నరేంద్రమోడీ అభివర్ణించటాన్ని ఏమనాలి? మహోన్నతమైన దేశ సంస్కృతి గురించి గర్వపడుతున్నవారి మనోభావాలు గాయపడ్డాయా లేదా? లేకపోతే ఇలాంటి వారే ప్రతీకలైతే మన సంస్కృతి కూడా అలాంటిదేనా అని ఎవరైనా అనుకుంటే తప్పు ఎవరిది?

ప్రజ్ఞ ఇంకా నిందితురాలే తప్ప నేరం రుజువు కాలేదు కదా , ఆమె తన మతం గురించి మాత్రమే చెప్పింది కదా ? ఇలాంటి వాదనలను బిజెపి వారు తెస్తున్నారు. ఇది పచ్చి అవకాశవాదం, తర్కానికి కట్టుబడనిది. అదే ఇతర మతాలకు చెందిన వారైతే కేసులు నమోదు చేసిన వెంటనే నేరస్తులనే ముద్రవేస్తున్నారు. నిర్ధారించేస్తున్నారు.అయినా కేసుల్లో ఇరుక్కొన్న వివాదాస్పదులైన వారు తప్ప మరొకరు బిజెపికి దొరకలేదా ? ఇదే పార్టీ పెద్దలు గతంలో ఆశారాంబాపు, డేరా బాబా గుర్మీత్‌ సింగ్‌ వంటి కరడు గట్టిన నేరస్ధులందరినీ నేరం రుజువు కాలేదు కదా అని సమర్ధించారు. వారి ఆశీర్వాదాలు పొందారు, వారితో తమకు ఓట్లు వేయించాలని సిఫార్సులు చేయించుకున్నారు. వారికి శిక్షలు పడిన తరువాత ఏ బిజెపి నేత అయినా వ్యక్తిగతంగా లేదా పార్టీ పరంగా అలాంటి వారిని సమర్ధించినందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారా? లేదే ? రేపు ప్రజ్ఞ నేరం రుజువైతే ఏమిటి?

Image result for pragya thakur

హిందువుల మీద సీతారాం ఏచూరి ఇలాంటి దాడులు చేయటం వల్లే కమ్యూనిస్టులు వున్న పలుకుబడి కూడా కోల్పోతున్నారు. అనే శాపనార్ధం ఒకటి. భారత, రామాయణాల్లో వున్న సంఘటనలు, పాత్రల మీద విమర్శలు లేదా వ్యాఖ్యలు చేసింది కమ్యూనిస్టులొక్కరే కాదే, ఎన్‌టిరామారావు సినిమాల్లో ఎన్ని డైలాగులు వున్నాయో తెలియదా, మరి అలాంటి వ్యక్తి పార్టీ పెట్టిన ఆరునెలల్లోనే అధికారానికి వచ్చారు. దానికేమంటారు? ఆ మాటకు వస్తే కాంగ్రెస్‌ నేతలెవరూ భారత, రామాయణాలను విమర్శించలేదు, వాటికి కట్టుబడే వున్నారు. మరి ఆ పార్టీ నేడు ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా ఎందుకు దిగజారినట్లు ? దాన్నుంచి దేశాన్ని విముక్తి చేస్తానని బిజెపి ఎందుకు చెబుతున్నట్లు ? నిజానికి సంఘపరివార్‌ లేదా ప్రజ్ఞ వంటి వారి శాపాలకే అంత శక్తి వుంటే రామాయణ విషవృక్షం అనే గ్రంధం రాసిన రంగనాయకమ్మ దశాబ్దాల తరువాత కూడా అదే వుత్సాహంతో ఇంకా రాస్తూనే వున్నారే. ప్రజ్ఞ చెప్పినట్ల హేమంత కర్కరే మాదిరి ప్రాణాలు తీయకపోయినా కనీసం ఆమె కలాన్ని పని చేయకుండా చేయలేకపోయిన నోటి తుత్తర సరుకని అనుకోవాలి. ఎందరో సాధ్వులుగా దేశమంతా తిరుగుతున్నవారు, పీఠాలు పెట్టుకున్నవారు వున్నారు. ఆశారాం బాపు, డేరా బాబాలు ఎందరో మానవతుల శీలాలను హరించారు,హత్యలు చేశారు. శీలం, ఏకత గురించి కబుర్లు చెప్పే ఇలాంటి సాధ్వులు ఒక్కడంటే ఒక్కడినీ శపించలేదేం. ప్రాణాలు తీయకపోయినా జీవచ్ఛవాలుగా మార్చి మరొకడు అలాంటి పనికి పాల్పడకుండా చేయవచ్చు కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మసీదుల్లో, రైళ్లలో అమాయకుల ప్రాణాలు తీసే తీవ్రవాద చర్యలు గాక తామక తంపరగా తయారవుతున్న తోటి యోగులతో కలసి దుష్టసంహారం కోసం శాపాలు పెట్టమనండి.

చివరిగా భారత, రామాయణాల గురించి ఒక్క మాట. ఒక్క భారతం ఏమిటి ఏ పురాణం చూసినా ముగింపు ఏమిటి దుష్ట సంహారం పేరుతో హింసాకాండలేగా. అసలు యుద్ధమే సమర్దనీయం కాదు. ధర్మ యుద్దమని కొన్నింటికి పేరు. నిజానికి ధర్మ యుద్దమైతే రెండువైపులా వారు గాక అధర్మంవైపు వారే మరణించాలి కదా ? మహా భారత యుద్ధంలో ఏడు అక్షౌహిణులు పాండవుల తరఫున పదకొండు అక్షౌహిణులు కౌరవుల తరఫున పాల్గొన్నాయి. ఒక వ్యాఖ్యానం ప్రకారం 18 అక్షౌహిణుల్లో 47,23,920 సైనికులు, గుర్రాలు, ఏనుగులు, రధాలు వున్నాయి. మరొక కధనం ప్రకారం కురు పాండవ యుద్దంలో మరణించిన వారి సంఖ్య 166 కోట్ల 20వేల మంది అని, బతికిన వారు 2,40,165 మంది అని యుధిష్టరుడు (ధర్మరాజు) చెబుతాడు. అంటే ఇంత మందిని బలిపెట్టినది ధర్మ యుద్దం ఎలా అవుతుంది. వంద మంది కౌరవ సోదరులను హతమార్చి వుంటే సరిపోయేదానికి ఇంత మందిని బలిపెట్టాలా ? మరొక కధనం ప్రకారం బతికింది పన్నెండు మందే అని ఎక్కడో చదివాను. ఇక రామాయణం. ఇది చెబుతున్నదేమిటి? రాముడు వాలిని చెట్టుచాటు నుంచి బాణం వేసి చంపాడు. అంటే చంపదలచుకున్నవాడిని ఎలాగైనా అంతం చేయవచ్చు అన్ననీతిని బోధించినట్లే కదా, నేడు జరుగుతున్న నేరాలన్నీ దాదాపు ఇలాంటివే కదా. ధర్మ యుద్దం అంటే ఒక తేదీ, స్ధలం నిర్ణయించుకొని ముఖాముఖీ తలపడటం ఎక్కడైనా జరుగుతోందా? రామ రావణ యుద్దంలో ఎందరు మరణించిందీ స్పష్టంగా తెలియదు. కానీ రావణుడి ఆయువు పట్టు విభీషణుడి ద్వారా తెలుసుకొని రాముడు చంపాడు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే కదా. ప్రత్యర్ది పార్టీల ఆర్ధిక ఆయువు పట్టు ఎక్కడుందో తెలుసుకొని ప్రభుత్వ సంస్ధల ద్వారా దాడులు చేయించి లేదా బెదిరించీ రాజకీయాల్లో ఫిరాయింపులు లేదా నాశనం చేయటం చూస్తున్నదే కదా. ఇలా చెప్పుకుంటే చాలా వున్నాయి. అందువలన భిన్న అభిప్రాయాలు, భిన్న స్వరాలు విప్పనివ్వండి, జనాన్ని తెలుసుకోనివ్వండి. పిచ్చిబియ్యాలకు,శాపాలకు భయపడే రోజులు కావివి అని గుర్తించండి.