Tags

, , ,

Image result for sand crisis : ys jagan government brought on by one's self

ఎం కోటేశ్వరరావు
ఎవరు అవునన్నా కాదన్నా, అధికార పార్టీ నేతలు ఎంత గింజుకున్నా ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక ఒక ప్రధాన సమస్యగా మారింది. దీని వలన లక్షలాది మంది కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే పనుల్లేని రాజకీయవేత్తలకు చేతి నిండా పని దొరుకుతోంది. దీనికి కారకులు ఎవరు అంటే అధికార పక్షం ప్రకృతి మీద నెడుతోంది. నదులు, వాగులు, వంకలకు వరదలు తగ్గి ఇసుక తీసుకొనే పరిస్ధితి ఎంత త్వరగా రప్పిస్తావో భగవంతుడా అన్నట్లుగా ఉగ్గపట్టుకొని ఉంది. కారణాన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద నెడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బహిరంగంగా ఈ సమస్య మీద నోరు విప్పటం లేదు. అధికారులతో సమీక్షల సందర్భంగా చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు తప్ప ప్రత్యక్షంగా విన్నవారు లేరు.
ప్రస్తుతం రాష్ట్రంలో వివాదంగా మారిన ఇసుక సమస్యకు ప్రధాన కారణం జగన్‌ సర్కార్‌ స్వయం కృతమే అని చెప్పాల్సి ఉంది. అధికారానికి వచ్చిన తరువాత అంతకు ముందున్న విధానాన్ని నిలిపివేసి మూడునెలల తరువాత కొత్త విధానాన్ని నిర్ణయించారు. పోనీ అదేమన్నా విప్లవాత్మకమైనదా అంటే కాదు. అంతకు ముందు ఉచితం పేరుతో ఇచ్చినా అధికార పార్టీ పెద్దలకు కప్పం చెల్లించి ఇసుకను తెచ్చుకోవాల్సి వచ్చింది, రాష్ట్రంలో ఇసుక, మట్టి మాఫియాలు తయారయ్యాయన్నది కాదనలేని సత్యం. జగన్‌ సర్కార్‌ విధానం ప్రకారం ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి. టన్నుకు రూ 370 ధర, కిలోమీటర్‌కు రూ 4.90 రవణా చార్జీలు చెల్లించాలని నిర్ణయించారు. ఆచరణలో దొరుకుతున్న కొద్ది మొత్తం కూడా ఆ ధరలకు రావటం లేదన్నది వాస్తవం.
ముమ్మరంగా నిర్మాణాలు జరిగే సమయంలో దాదాపు మూడు నెలల పాటు ఇసుక క్వారీలను మూసివేయటాన్ని జగన్‌ అనుభవరాహిత్యం అనాలా, సలహాదారులు తప్పుదారి పట్టించారని భావించాలా ? ఏ నిర్ధారణకు వచ్చినా అంతిమంగా ముఖ్యమంత్రిగా జగన్‌దే బాధ్యత అవుతుంది.జూన్‌, జూలై మాసాల్లోనే పనులు పోతున్నాయని కార్మికులు గగ్గోలు పెడుతున్నపుడే మేలుకొని ఉంటే ఈ పరిస్ధితి తలెత్తి ఉండేది కాదు. ఇసుక విధానం ప్రకటించక ముందు కొన్ని చోట్ల అధికారపార్టీ పెద్దలు అనధికారికంగా ఇసుకను దండుకున్నారనే విమర్శలు వచ్చాయి. గ్రామాల్లో వ్యవసాయ పనుల్లో నిమగం కావటం, సాధారణంగా వర్షాకాలంలో, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఆగిపోయిన తరువాత తుపాన్ల కారణంగా అత్యవసరం అయితే తప్ప నిర్మాణాలు జరగవు. పట్టణాల్లో కూడా పరిమితమే. ఈ ఏడాది అసాధారణ రీతిలో కురుస్తున్న వర్షాలు, నదులకు వరదల కారణంగా ఇసుక తీయటంలో కొంత అసౌకర్యం ఏర్పడిందన్నది వాస్తవం. అధికార పార్టీ, ప్రభుత్వం ఈ కారణాలను చెప్పి సమస్య నుంచి తప్పుకోవాలని చూస్తోంది. నిర్మాణాలు ముమ్మరంగా జరిగే సమయంలో కార్మికులు నాలుగు డబ్బులు వెనకేసుకొని పనులు తక్కువగా లేదా లేని సమయంలో వాటితో కుటుంబాలను నెట్టుకొస్తారు. ఈ ఏడాది అటువంటి అవకాశాన్ని ప్రభుత్వం వమ్ము చేసింది. అదే జగన్‌ ప్రతిపక్షంలో ఉంటే ఈ పాటికి ఓదార్పు యాత్రలను ప్రారంభించి ఉండేవారు కాదా ! ఇప్పుడు అధికారంలో ఉన్నారు కనుక ఓదార్పు అనేందుకు అవకాశం లేదు, సహజంగానే ఇప్పుడు ఆ పాత్రను ప్రతిపక్షాలు తీసుకుంటున్నాయి.
వ్యవసాయంలో యంత్రాల వినియోగం నానాటికీ పెరుగుతున్న కారణంగా ఆ రంగంలో పని రోజులు తగ్గిపోతున్నాయి. గతంలో వ్యవసాయం తరువాత చేనేత ప్రధాన వృత్తిగా ఉండేది. ఆ రంగంలో యాంత్రీకరణ కారణంగా నేత కార్మికులు వ్యవసాయ కార్మికులుగా, నిర్మాణ కార్మికులుగా, ఇతర రంగాల్లోకి మారిపోయారు. వివిధ కారణాలతో నిర్మాణ రంగం నేడు వ్యవసాయం తరువాత ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. కార్మిక శాఖ వద్ద నమోదు అయిన నిర్మాణ కార్మికుల సంఖ్య 30 లక్షలు. వీరు గాక నిర్మాణ రంగ అనుబంధ కార్యకలాపాల్లో కనీసం మరో పదిలక్షల మందికి ఉపాధి దొరుకుతున్నట్లు అంచనా. ప్రతి రోజు కనీసం లక్ష టన్నుల ఇసుక అవసరమన్నది నిర్మాణ రంగం వారి అంచనా. దానికి గాను దొరకుతున్నది ఎంత అంటే వర్షాలు పడి నదులు, వాగులు, వంకలు పొంగుతున్న కారణంగా కొన్ని సందర్భాలలో అసలు లేదంటే అతిశయోక్తి కాదు. దొరికినా అది ఏమాత్రం చాలటం లేదు. అధికారులు రోజుకు 40వేల టన్నుల ఇసుక దొరుకుతోందని, కొన్ని నిమిషాల్లోనే విక్రయాలు అయిపోతున్నాయని చెబుతున్నారు. ఏ రోజు ఎంత విక్రయిస్తున్నారో, పరిస్ధితి ఎలా మెరుగుపడుతోందో అధికారికంగా సమాచారాన్ని వెల్లడించినపుడే ఏం చెప్పినా విశ్వసనీయత ఉంటుంది. తప్పు పట్టిన వారి మీద ఎదురు దాడి చేయటం తప్ప అలాంటిదేమీ లేదు.
ముఖ్యమంత్రి జగన్‌ ఈ సమస్య మీద అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి పరిస్ధితిని వివరించి, సలహాలు కోరి ఉంటే పరిణామాలు వేరుగా ఉండేవి. అదేమీ లేకపోగా చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు వత్తిడి పెరిగిన తరువాత అధికారులతో సమీక్ష జరిపారు. నవంబరులో ఇసుక వారాన్ని పాటించి కొరత రాకుండా చూడాలని కోరినట్లు అధికారికంగా వెల్లడించారు. అంతే కాదు, సరిహద్దు ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని దాన్ని అరికట్టాలని డిజిపిని ఆదేశించినట్లు చెప్పటం సమస్య తీవ్రతను అంగీకరించటమే. సరిహద్దు ప్రాంతాల ఇసుక సమస్య విషయానికి వస్తే ఇటు నుంచి అటు ఎలా వెళుతోందో అటు నుంచి ఇటు కూడా రావటం కొత్త విషయమేమీ కాదు. కొరతకు అది ప్రధాన కారణం కాదు. పెరుగుతున్న నిర్మాణాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇసుక దొరికే పరిస్ధితి కూడా లేదని గ్రహించటం అవసరం.ఈ ఏడాది వరదల కారణంగా ఇసుక లభ్యత పెరిగే అవకాశాలు ఉన్నాయి. వరదలు తగ్గుముఖం పట్టిన తరువాత ఇసుక తవ్వకం కూడా సులభం అవుతుంది.
సమస్యలు ఉన్నపుడు సహజంగానే ప్రతిపక్షాలు దాన్ని పట్టించుకోకపోతే తప్పు అవుతుంది. అధికార పక్షం వాటికి అలాంటి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి తప్ప వారికేమి హక్కు ఉంది అంటే కుదరదు. తెలుగుదేశం పార్టీ, బిజెపి వంటి పార్టీలు రంగంలోకి రాకముందే భవన నిర్మాణ కార్మిక సంఘాలు, వాటికి మద్దతుగా వామపక్షాలు ఈ సమస్యను ముందుగా ప్రభుత్వ దృష్టికి తెచ్చాయి. వారేమీ గత ప్రభుత్వంలో ఇసుక మాఫియాలు కాదు, అక్రమాలకు పాల్పడలేదు. ప్రారంభంలోనే ఈ సమస్యకు తెరదించి కార్మిక సంఘాలు, పార్టీలతో చర్చించి ఉంటే నేడు నిజంగా ఇసుకను రాజకీయం చేస్తున్న వారికి అవకాశాలు వచ్చేవి కాదు.

Image result for sand crisis : ys jagan government brought on by one's self
గత ప్రభుత్వంలో ఆర్జనకు కాదేదీ అనర్హం అన్నట్లుగా మార్చివేశారనటంలో ఎలాంటి మినహాయింపులు లేవు. ఎన్నికల్లో ఎంఎల్‌ఏలు, ఎంపీలుగా గెలిచిన వారు, వారి ప్రత్యర్ధులుగా పోటీ చేసి ఓడిన వారు ఎన్నేసి కోట్లు ఖర్చు పెట్టారో తెలియంది కాదు. ఆ మొత్తాలను వడ్డీతో అసలే కాదు, రాబోయే ఎన్నికలకు అంతకంటే ఎక్కువ పెట్టుబడులను సమకూర్చుకొనేందుకు సంపాదించాలంటే అడ్డదారులు తప్ప మరొక మార్గం లేదు. అందుకే రాజకీయనేతలు,ప్రజా ప్రతినిధులు ఎక్కడ అధికారం ఉంటే అక్కడకు చేరుతున్నారు. వారంతా చేతి వాటం ప్రదర్శించకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటారనే భ్రమల్లో ఎవరూ ఉండనవసరం లేదు. ఎన్నికల్లో భారీ పెట్టుబడులు పెట్టిన వైసిపి ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు, ఇతర నేతలు అవకాశాల కోసం ఆవురావురు మంటూ ఎదురు చూస్తున్నారు. వారిని అదుపు చేయటానికి ప్రయత్నిస్తే అధికార పార్టీలో అసమ్మతికి, వదలి వేస్తే రాజకీయంగా పతనానికి నాంది అవుతుంది. ప్రపంచంలో అనేక దేశాలలో అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతల మీద తీవ్ర విమర్శలు చేసి అవినీతి రహిత పాలన అందిస్తామని అధికారానికి వచ్చిన నేతలు అనేక మంది ఆచరణలో అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడిన ఉదంతాలు ఎన్నో. నేడు అధికారమే పరమావధిగా భావించే పార్టీలలో నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి ఎక్కడైనా ఒకరో అరో ఉండొచ్చు తప్ప మిగిలిన వారందరూ సంపాదనకు తెరతీసిన వారే. వైసిపి కూడా అదే కోవకు చెందినదే. తెలుగుదేశం అవినీతిని ఎన్నికలకు ముందూ తరువాత ఉతికిపారేస్తున్న వైసిపి నాయకత్వం సహజంగానే అందుకు భిన్నంగా ప్రవర్తించాలనే రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయరని ఆశించవచ్చా ?