ఎం కోటేశ్వరరావు
బస్తీమే సవాల్ అంటూ చమురు యుద్ధానికి సౌదీ అరేబియా తెరలేపింది. ఇప్పటికే మేము గోచీతో ఉన్నాం, దాన్ని కూడా లేకుండా చేస్తారా ? చేయండి చూస్తాం అన్నట్లుగా యుద్దానికి సిద్దమే అని రష్యా పేర్కొంది. పోరు శంఖారావం దెబ్బకు 30శాతం వరకు చమురు ధరలు పడిపోయాయి. ఇది ఆరంభమే, ఎవరికి వారు తమ వైఖరులకు కట్టుబడి ఉంటే రానున్న రోజుల్లో ఇంకా పతనమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తరువాత మూడు రోజుల్లో చూస్తే స్వల్ప మార్పులు తప్ప చమురు మార్కెట్‌లో పెను మార్పులు లేవు. యుద్ధం అంటే అంత తేలిక కాదు కనుక ప్రారంభం చేసిన అన్ని యుద్ధాలు కొనసాగలేదు, కనుక ఎప్పుడు ఏమి జరిగేదీ చెప్పలేము, ఏ యుద్దమైనా అది వాంఛనీయం కాదు, నష్టదాయకం కనుక రాకూడదనే కోరుకుందాం. అయితే దానికి దారి తీసిన పరిస్ధితులు పర్యవసానాలను తప్పక చర్చించాల్సిందే.
అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన మేరకు నరేంద్రమోడీ సర్కార్ జనానికి చమురు ధరలు తగ్గిస్తుందా? లేక వినియోగదారుల జేబులు కొల్లగొట్టి వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు రాయితీల రూపంలో దోచి పెడుతుందా ? అసలు సౌదీ-రష్యా ఇప్పుడు చమురు ధరల యుద్దానికి దిగాల్సిన అవసరం ఏమిటి? ఎంత కాలం సాగుతుంది? ఎంత మేరకు ధరలు పతనం అవుతాయి ? పర్యవసానాలు ఏమిటి ? ఇలా ఎన్నో అంశాలు జనం నోళ్లలో నానుతున్నాయి.
సోమవారం చమురు ధరలు, స్టాక్ మార్కెట్ పతనం, మంగళవారం నాడు మన దేశంలో స్టాక్ మార్కెట్లకు సెలవు, బుధవారం నాడు నష్టాల పాలు కాలేదు గానీ లాభాలు కూడా రాలేదు. గురువారం నాడు ఐదు రకాల చమురుల్లో పీపా ధర నాలుగు 25 సెంట్ల నుంచి 182 సెంట్ల వరకు పతనం కాగా మరో నాలుగు రకాల ధరలు 85 నుంచి 297 సెంట్ల వరకు పెరిగాయి, అయినప్పటికీ సోమవారం నాటి కంటే దారుణంగా స్టాక్‌మార్కెట్లు పతనమయ్యాయి. సోమవారపు పతనానికి కరోనా వైరస్ వ్యాప్తి, చమురు ధరల యుద్దం అని చెప్పారు. కరోనా వైరస్ చైనాలో తగ్గుముఖం పట్టింది, ఇతర దేశాల్లో కేసుల సంఖ్య పెరిగింది, కరోనాను ప్రపంచ మహమ్మారిగా గత కొద్ది రోజులుగా పరిగణిస్తున్నారు, బుధవారం నాడు ప్రపంచ ఆరోగ్య సంస్ధ దానిని అధికారికంగా ప్రకటించటం తప్ప గత మూడు రోజుల్లో పెను మార్పులేమీ లేవు, అయినా స్టాక్ మార్కెట్ పతనం చాలా తీవ్రంగా ఉండటం విశేషం. బుధవారం నాడు చైనాలోని వైరస్ పీడిత ప్రాంతం హుబెరులో పది మంది మరణిస్తే వారిలో ఏడుగురు ఒక్క ఉహాన్ నగరానికి చెందిన వారే ఉన్నారు. గత వారం రోజులుగా హుబెరు రాష్ట్రంలోని ఉహాన్ మినహా 16నగరాలలో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
చమురు ధరల యుద్దం గురించి చూద్దాం. దీనికి సవాలక్ష కారణాలలో కరోనా వైరస్ ఒకటి మాత్రమే. ఒక వేళ ఆ సమస్య లేకపోయినా మరి కొద్ది వారాలు లేదా నెలల్లో చమురు యుద్దం తలెత్తి ఉండేది, కరోనా కాస్త ముందుకు జరిపింది. మన దేశంలో తన బడ్జెట్ లోటును పూడ్చుకొనేందుకు రిజర్వుబ్యాంకు దగ్గర డబ్బును లాక్కున్న మోడీ సర్కార్ ఎల్‌ఐసితో అనేక ప్రభుత్వరంగ సంస్దలను తెగనమ్మి ఇంకా మిగిలిన లోటును పూడ్చుకొనేందుకు చూస్తున్నది. నరేంద్రమోడీ జిగినీ దోస్తు (కాకపోతే అన్ని సార్లు ఒకరినొకరు ఎలా కౌగిలించుకుంటారు !) డోనాల్డ్ ట్రంప్ తన స్నేహితుడిని అనుసరిస్తున్నాడు. తాగుబోతులు అన్ని వనరులు అయిపోయిన తరువాత పెళ్లాం పుస్తెలు గుంజుకున్నట్లుగా అత్యవసరాల కోసం నిల్వచేసిన చమురులో కోటీ ఇరవైలక్షల పీపాల చమురును తెగనమ్మి 45బిలియన్ డాలర్లు సమకూర్చుకోవాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. అయితే చమురు ధరలు ఢమాల్ అనటంతో పరిస్ధితి మెరుగుపడేంత వరకు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. రష్యా కరన్సీ రూబుల్ విలువ మరింత పతనమైంది. మొదటి పర్యవసానం ట్రంప్, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మీద వత్తిడిని పెంచితే, రెండవ చర్య వలన ప్రపంచ మార్కెట్‌లో రష్యా నుంచి కొనుగోలు చేసే సరకులు తక్కువ మొత్తాలకు దొరుకుతాయి. తద్వారా రష్యాకు మేలు జరుగుతుంది. ఆంబోతుల కుమ్ములాట లేగదూడలకు ముప్పు తెస్తుంది అంటారు, కానీ ఇక్కడ చమురు ఆంబోతుల పోరు మనవంటి దేశాలకు మేలు చేస్తుంది. ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లు (తగ్గిన మేరకు లబ్దిని వినియోగదారులకు బదలాయించాలి) నరేంద్రమోడీ సర్కార్ వ్యవహరిస్తే జనానికి ఆయాసం తప్ప ఒరిగేదేమీ ఉండదు.
చమురు ఉత్పత్తి చేసే దేశాల సంస్ధతో సహకరించేందుకు తాము సిద్దమే, ఉత్పత్తిని తగ్గించటానికి, పెంచటానికి, ఒప్పందం కుదుర్చుకోవటానికి ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి అంటూనే ఏప్రిల్ ఒకటి తరువాత స్వల్ప కాలంలో రోజుకు రెండు, మూడులక్షలు అవసరమైతే ఐదులక్షల పీపాల వరకు చమురు ఉత్పత్తిని పెంచుతామని రష్యా ప్రకటించింది. అవసరమైతే వివాద పరిష్కారానికి తాము మధ్యవర్తిత్వం వహిస్తామని మెక్సికో ప్రకటించింది. గతంలో చమురు ధరలు పడిపోయిన సమయంలో పెంచేందుకు సహకరించుకోవాలని ఒపెక్-రష్యా 2016లో ఒక అవగాహనకు వచ్చాయి. ఇటీవలి కాలంలో చమురు ధరలు కొంత మేరకు తగ్గాయి. కరోనా వైరస్ వ్యాప్తి పూర్వరంగంలో వినియోగం తగ్గుతుందనే అంచనాతో రోజుకు పదిహేను లక్షల పీపాల చమురు ఉత్పత్తిని తగ్గించుదామని సౌదీ అరేబియా ఒక ప్రతిపాదన చేసింది. దానికి రష్యా అంగీకరించలేదు. దాంతో సౌదీ ప్రభుత్వ రంగ చమురు సంస్ద ఆరామ్‌కో రష్యా చమురు మార్కెట్‌ను దెబ్బతీసే విధంగా ఏప్రిల్‌లో సరఫరా చేసే చమురు ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మే లేదా జూన్ నెలలో మరోసారి ఒపెక్-ఇతర దేశాల సమావేశాలు జరగాల్సి ఉంది. ఫిబ్రవరి నెలలో రష్యా రోజుకు 11.289 మిలియన్ పీపాల చమురును వెలికి తీసింది. తాజాగా ప్రకటించినట్లు మరో ఐదు లక్షల పీపాలు అదనంగా తీస్తే అది కొత్త రికార్డుగా నమోదు కానుంది. ధరల పెంపుదలకు అందరం చమురు ఉత్పత్తిని తగ్గించుదామని ప్రతిపాదించిన సౌదీ అరేబియా అందుకు రష్యా అంగీకరించకపోవటంతో ఆగ్రహంతో ఏప్రిల్ నెలలో ఉత్పత్తిని రోజుకు 12.3 మిలియన్ పీపాలకు పెంచి మార్కెట్లను ముంచెత్తాలని తద్వారా ధరలను మరింత పతనం కావించాలని నిర్ణయించింది.దీని పర్యవసానంగా తమ ఆదాయం పడిపోకుండా చూసుకొనేందుకు నైజీరియా ఉత్పత్తిని పెంచనున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలో రోజుకు 80 మిలియన్ల పీపాలు ఉత్పత్తి అవుతుండగా అమెరికా 15మిలియన్లతో అగ్రస్ధానంలో, తరువాత సౌదీ, రష్యా ఉన్నాయి.
ఒక పీపా ధర 25 నుంచి 30 డాలర్లకు పడిపోయినా ఆరు నుంచి పది సంవత్సరాల వరకు తాము తట్టుకొని నిలబడగలమని రష్యా చెబుతోంది. పీపా ధర 12-20 డాలర్లకు పడిపోయినా తట్టుకొనే విధంగా బడ్జెట్‌లను సవరించుకోవాలని అవసరమైతే పదిడాలర్ల కంటే తగ్గినా ఎలాంటి ఢోకాలేకుండా చూసుకోవాలని సౌదీ అరేబియా సిద్దం అవుతోంది. అమెరికాలోని షేల్ ఆయిల్ ఉత్పత్తి సంస్ధలు ఉత్పత్తిని తగ్గించేందుకు పూనుకున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలు కొనసాగితే కొన్ని కంపెనీలు బతుకుతాయి, అయితే అవి అవి ఆక్సిజన్ కోసం చూస్తాయని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఉన్న ఉత్పతిలో రోజుకు పది నుంచి ఇరవై లక్షల పీపాల వరకు తగ్గించవచ్చని వార్తలు వచ్చాయి. కేవలం ఐదు కంపెనీలు మాత్రమే ఖర్చుకు తగిన ఆదాయాన్ని పొందుతున్నట్లు చెబుతున్నారు.
2009 తరువాత తొలిసారిగా చమురు వినియోగం ఈ ఏడాది తగ్గనుందని అంతర్జాతీయ ఇంధన సంస్ధ పేర్కొన్నది. గత ద శాబ్ది కాలంలో వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో ఇంథన కంపెనీలు పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నాయి. చమురు ధరల పతనం కారణంగా ఈ కంపెనీల రుణాలను కొనుగోలు చేసిన సంస్ధలు సాధారణంగా పొందే ఒక డాలరుకు 67 సెంట్లకు బదులు 55 నుంచి 60సెంట్ల వరకు మాత్రమే రాబట్టుకోగలవని బర్కలీ పేర్కొన్నది.
చమురు యుద్ధాన్ని సౌదీ అరేబియా ప్రారంభించినప్పటికీ రష్యా లక్ష్యం అమెరికా షేల్ అయిల్ కంపెనీలే అని కొందరు విశ్లేషిస్తున్నారు.సౌదీ తక్షణ లక్ష్యం రష్యన్ మార్కెట్‌ను ఆక్రమించటం అయినప్పటికీ చమురు ఎగుమతి దేశాల సంస్ధ(ఒపెక్) తమ మార్కెట్‌ను రోజు రోజుకూ అమెరికాకు అప్పగించటం తనకు ముప్పుగా రష్యా పరిగణిస్తోంది. 2009 నుంచి అమెరికా షేల్ అయిల్ ఉత్పత్తి పెరుగుతోంది.2019 అమెరికా ఉత్పత్తిలో 63శాతం(రోజుకు 7.7మిలియన్ పీపాలు) ఉంది. వారిని దెబ్బతీయటం రష్యన్ల లక్ష్యం. అయితే తాజా పరిణామాల పర్యవసానం రష్యన్లకు సైతం నష్టం కలిగించేదే. ప్రస్తుతం సౌదీ అరేబియా బడ్జెట్ అవసరాలకు గాను ఒక పీపా బ్రెంట్ రకం ముడిచమురు ధర 80 డాలర్లు ఉండాలి, అదే రష్యాకు 45 డాలర్లు ఉన్నా తట్టుకోగలదని అంచనా. అమెరికన్ ఉత్పత్తిదారుల పరిస్ధితి ఇప్పుడు తాడు మీద నడక మాదిరి ఉంది. చమురు యుద్దం పీపా ధరను ఇరవై డాలర్లకు పతనం కావించవచ్చని గోల్డ్‌మన్ సాచస్ విశ్లేషకులు చెప్పారు. 2019 వివరాల ప్రకారం ప్రపంచ చమురు నిల్వల్లో 75శాతం ఒపెక్ దేశాల్లో ఉండగా ప్రపంచ ఉత్పత్తిలో 42శాతం కలిగి ఉన్నాయి. ఒక దేశంగా ఉత్పత్తిలో అమెరికా ప్రధమ స్ధానంలో ఉన్నప్పటికీ ప్రపంచమార్కెట్‌ను నియంత్రించగల శక్తి ఇంకా ఓపెక్‌దే అని చెబుతున్నారు.
చమురు చరిత్రలోకి వెళితే వాణిజ్యపరంగా తొలిసారి వెలికి తీసి వినియోగించింది అమెరికాయే.1860వ దశకంలో అమెరికాలో అంతర్యుద్ధం కారణంగా పెరిగిన డిమాండ్‌తో పీపా చమురుధర ఇప్పటి ధరలతో పోల్చుకుంటే గరిష్టంగా 120 డాలర్లు ఉండేది. తరువాత కాలంలో గణనీయంగా పడిపోయింది.1900దశకంలో స్పిండిల్‌టాప్ చమురు బావిని కనుగొన్న తరువాత అమెరికా ఆర్ధిక వ్యవస్ధలో చమురు ప్రధాన పాత్ర వహించటం ప్రారంభమైంది. ఒక్క ఏడాది కాలంలోనే 1500 కంపెనీలు పుట్టుకు వచ్చాయి. దాంతో ధరలు మరింతగా తగ్గాయి. 1908లో ఇరాన్‌లో, 1930లో సౌదీ అరేబియాలో చమురు నిల్వలను కనుగొన్న తరువాత చమురు సరఫరా విపరీతంగా పెరిగింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మరింతగా విస్తరించటం, వియత్నాం యుద్ధం వంటి కారణాలతో పెరిగిన అవసరాలకు చమురు దిగుమతి చేసుకోవటం ప్రారంభించింది. ఇదే సమయంలో 1960లో ఇరాన్, ఇరాక్, కువాయిట్, సౌదీ అరేబియా, వెనెజులా చమురు ఎగుమతి దేశాల సంస్ధ(ఒపెక్)ను ప్రారంభించాయి. తరువాత కొన్ని దేశాలు చేరటం, సంస్ధ నుంచి విడిపోవటం జరిగినా ప్రస్తుతం 15దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అమెరికా, రష్యా వాటిలో లేవు. కొత్తగా బ్రెజిల్‌ను గత ఏడాది ఆహ్వానించారు.
1973లో పాలస్తీనా సమస్యలో అమెరికన్లు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వటం అది ఇరుగుపొరుగు అరబ్ దేశాలపై దాడులు, భూభాగాల ఆక్రమణల పూర్వరంగంలో ఒపెక్ దేశాలు అమెరికాకు చమురు ఎగుమతులను నిలిపివేశాయి. ధరలు కూడా పతనమయ్యాయి. అంతకు ముందు పశ్చిమ దేశాలకు చెందిన ఏడు చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్‌ను అదుపు చేసేవి, 1973 తరువాత ఒపెక్ నిర్ణయాత్మక శక్తిగా మారింది. ధరలు, ఉత్పత్తిని నియంత్రించింది.1991వరకు ఇదే కొనసాగింది. ఆ ఏడాది సోవియట్ యూనియన్ పతనమైన తరువాత అనేక సంవత్సరాల పాటు రష్యా చమురు ఉత్పత్తిలో సమస్యలు తలెత్తాయి, ఇదే సమయంలో ఆసియన్ దేశాలలో ద్రవ్య సంక్షోభం ఏర్పడింది. చమురుకు డిమాండ్ విపరీతంగా పడిపోయింది. తరువాత అనేక పరిణామాలు సంభవించినా ఒపెక్ నియంత్రణ కొనసాగింది. రష్యా చమురు పరిశ్రమ స్ధిరపడింది. ప్రపంచ చమురు నియంత్రణ రష్యా సహకారం లేనిదే సాధ్యం కాని పరిస్ధితి ఏర్పడింది. అందుకే 2016లో ఒపెక్ దేశాలు దానితో సమన్వయం చేసుకున్నాయి. మరోవైపున 2003 నుంచి అమెరికాలో షేల్ ఆయిల్ వెలికితీత ప్రారంభం, 2014 నుంచి విపరీతంగా పెరగటం వంటి పరిణామాలు, పర్యవసానాలతో ఒపెక్, రష్యా ఆధిపత్యానికి గండిపడింది. అమెరికా చమురు ఎగుమతి దేశంగా తయారైంది. అమెరికా అనుభవాన్ని చూసిన తరువాత అనేక దేశాలు షేల్ ఆయిల్, గ్యాస్ నిల్వల వెలికితీతకు పెద్ద ఎత్తున పూనుకున్నాయి. ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగటమే కాదు, ఇరాన్, మరొక ఒపెక్ దేశమైన వెనెజులా చమురు అమ్మకాలపై రాజకీయ కారణాలతో అనేక ఆంక్షలు విధించింది. వీటిని ఎదుర్కోవటంలో ఒపెక్ విఫలమైంది. గతశతాబ్దిలో ప్రపంచ చమురు ధరలను అమెరికా నిర్ణయించేది, తరువాత ఆ స్ధానాన్ని ఒపెక్ ఆక్రమించింది, అయితే ఇటీవల తిరిగి అమెరికా నియంత్రణశక్తిగా ముందుకు వస్తోంది. చమురు ధరలు పెరిగినపుడు అమెరికా ఉత్పాదక సంస్దలు పెద్ద మొత్తాన్ని మార్కెట్‌కు విడుదల చేసి లబ్ది పొందుతున్నాయి. ఒపెక్ చమురు అవసరం అమెరికాకు తగ్గిపోవటంతో ఆ సంస్ధ నియంత్రణ పని చేయటం లేదు.
2017,18 సంవత్సరాలలో రోజుకు 12లక్షల పీపాల ఉత్పత్తి తగ్గించాలని ఒపెక్ నిర్ణయించి అమలు జరిపింది. అది అన్ని దేశాల కంటే అమెరికా కంపెనీలకే ఎక్కువ లబ్ది చేకూర్చింది. మరోవైపున తన రాజకీయ, ఆర్ధిక పలుకుబడిని ఉపయోగించి తన కంపెనీలకు చమురు ఎగుమతుల అవకాశాలను అందిస్తోంది. ఉదాహరణకు ఇరాన్ మనకు మిత్ర దేశం, మన రూపాయలకు చమురు విక్రయించింది. యాభై ఆరు అంగుళాల ఛాతి గలిగిన ధీశాలి అని ప్రశంసలు పొందిన నరేంద్రమోడీ పిరికితనాన్ని ప్రదర్శించి ట్రంప్ ఆదేశాలకు లొంగి ఇరాన్ బదులు అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నారు. 2017లో 19లక్షల టన్నుల చమురును అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటే మరుసటి ఏడాది అది 62లక్షల టన్నులకు పెరిగింది. 2019 తొలి ఆరునెలల్లోనే 54లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నాము.
ఒపెక్ దేశాల మార్కెట్ వాటా ఒక నాడు 44శాతం ఉంటే నేడు 30శాతానికి పడిపోయింది. గత రెండు సంవత్సరాలలో అది మరింత వేగంగా జరిగింది. చమురు వ్యాపారం డాలర్లలోనే జరుగుతుంది. ఇటీవలి కాలంలో డాలరు రేటు పతనం కావటంతో ఎగుమతి దేశాలకు నష్టదాయకంగా మారుతోంది. ఒపెక్ దేశాలు ధరలు పెంచాలను కోవటం వెనుక ఇది కూడా ఒక ప్రధాన కారణం. తాజా చమురు యుద్దానికి నేపధ్యమిది.
చమురు యుద్దానికి రష్యా ఎందుకు సిద్ద పడుతోంది అన్నది అనేక మందిలో ఉన్న సందేహం లేదా ప్రశ్న. చమురు ధరలు పడిపోయినపుడు అమెరికా షేల్ ఆయిల్ ఉత్పత్తి తగ్గుతోంది. తమ మీద అమెరికా చీటికి మాటికి ఆంక్షలు విధిస్తూ ఆర్ధికంగా దెబ్బతీస్తోంది. అందువలన దాన్ని దెబ్బతీయాలంటే చమురు ధరలు పతనం కావాలని రష్యా కోరుకుంటోంది. గత ఐదు సంవత్సరాలలో అమెరికా ఆంక్షల కారణంగా వాటిని తట్టుకొని నిలబడే విధంగా రష్యా ఆర్ధిక వ్యవస్ధ ఒక సాధారణ స్దితికి వచ్చింది. దాని దిగుమతులు తగ్గుతున్నాయే తప్ప పెరగటం లేదు. రూబుల్ విలువ పతనమైతే ఎగుమతి దార్లకు మేలు, డాలర్ల ఆదాయం పెరుగుతుంది. అందువలన చమురు ధరలు పతనమైనా తమకు ఢోకా లేదని పుతిన్ భావిస్తున్నారు. రూబుల్ విలువ పతనమైతే తమ ఎగుమతులు పెరుగుతాయని తద్వారా చమురుతో వచ్చే నష్టాన్ని పూడ్చుకోవచ్చన్నది ఆలోచన. రష్యా దగ్గర ఇప్పుడు డాలర్ల నిల్వలు గణనీయంగా ఉన్నాయి, దాని అప్పులు కూడా తక్కువే. పీపా ధర వంద డాలర్లుంటే తప్ప గిట్టుబాటు కాని స్ధితిలో ఒక నాడు రష్యా ఉండేది. తరువాత తీసుకున్న పొదుపు, ఇతర చర్యల కారణంగా 51 డాలర్లు వచ్చినా బడ్జెట్ అవసరాలను తీర్చుకొనే స్ధితికి చేరింది. అది ఇప్పుడు మరింతగా తగ్గి 40డాలర్లకు చేరిందని చెబుతున్నారు. సౌదీ అరేబియా 80డాలర్ల ధర అవసరం ఉన్న స్ధితిలో ఉంది.
అమెరికా మీద ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే చమురు ధరల పతనం దాని చమురు ఉత్పత్తి కంపెనీలకు నష్టమైతే, మార్కెటింగ్ కంపెనీలకు లాభాలను తెచ్చిపెడుతుంది. ధరలు పతనమై షేల్ ఆయిల్ ఉత్పత్తి రోజు ఒక మిలియన్ పీపాలు తగ్గితే ఎగుమతి దేశ స్ధాయి కోల్పోయి దిగుమతి దేశాల జాబితాలో తిరిగి చేరుతుంది. చమురు స్వయం సమృద్ధికి కూడా అంతరాయం ఏర్పడవచ్చు. ధరలు తగ్గితే దిగుమతుల బిల్లు తగ్గుతుంది, మార్కెటింగ్ కంపెనీలకు లబ్ది కలుగుతుంది. ఈ నేపధ్యంలో సౌదీ ప్రారంభించిన చమురు యుద్దం ఎంతకాలం కొనసాగుతుంది? దాని వలన మన ఆర్ధిక వ్యవస్ధ, వినియోగదారులకు లబ్ది కలుగతుందా లేదా అని మరోసారి చూద్దాం.