Tags

, , , ,

KCR, KTR extend wishes to YS Jagan for landslide victory in AP ...

ఎం కోటేశ్వరరావు
ఉద్యోగుల వేతనాల కోత పెట్టవద్దు, ఉద్యోగాలను రద్దు చేయవద్దు అని ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని అన్ని కంపెనీలను కోరారు. ఎంత మంది దయగల యజమానులు దాన్ని అమలు జరుపుతారో చూడాల్సి ఉంది. అనేక మంది ప్రధాని, ముఖ్య మంత్రుల సహాయ నిధులకు విరాళాలు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారు తప్ప తమ సంస్ధలలో వేతనాలు, ఉద్యోగాల గురించి ఏమి చెబుతున్నారో మనకు తెలియదు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత అంటూ మంగళవారం నాడు తెలంగాణా గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. తీరా ప్రభుత్వ ఉత్తరువును చూసే ఎంతశాతం వేతనాల చెల్లింపువాయిదా వేస్తున్నారో దానిలో పేర్కొన్నారు. కోతకు వాయిదాకు తేడా ఉంది. కోత విధిస్తే తిరిగి రాదు, వాయిదా అయితే వస్తుంది. ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి చెల్లించే వేతనాలకు ఇది వర్తిస్తుందని, తదుపరి ఉత్తరువులు ఇచ్చేంతవరకు ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. అంటే ఎన్నినెలలు అన్నది చెప్పకపోవటంతో పాటు వాయిదా వేసిన వేతన మొత్తాలను ఎప్పుడు, ఎలా తిరిగి చెల్లించేది కూడా సదరు ఉత్తరువులో లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు జరపకుండా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇది.
విపత్తు సమయాలలో అలాంటి నిర్ణయాలు తీసుకొనే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ సిబ్బంది ప్రతినిధులతో చర్చించి విధి విధానాలకు సంబంధించి ఆదేశాలు జారీ చేస్తే అదొకతీరు. లేనపుడు ఏకపక్ష నిర్ణయంగానే పరిగణించాల్సి ఉంది. వేతనాలతో పాటు పెన్షన్లు కూడా వాయిదా వేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అసెంబ్లీ, శాసనమండలి, అన్ని స్ధానిక సంస్ధలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల మొత్తం వేతనాల్లో 75శాతం, అఖిలభారత సర్వీసు తరగతికి చెందిన వారికి 60శాతం, ఇతర ఉద్యోగులలో నాలుగవ తరగతికి చెందిన వారికి మినహా మిగిలిన వారందరికీ 50శాతం, నాలుగవ తరగతి వారికి పదిశాతం వేతన చెల్లింపు వాయిదా ఉంటుంది. పెన్షన్లలో కూడా ఇదే శాతాలలో వాయిదా ఉంటుంది. అత్యవసర సేవలు అందిస్తున్న ఉద్యోగులకు సైతం ఎలాంటి మినహాయింపు లేదు.
ఆర్ధిక పరిస్ధితి అంతా సజావుగా ఉంది అని ముఖ్య మంత్రి కె చంద్రశేఖరరావు బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భంగా చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. మార్చినెల 31వ తేదీతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో 1,42,492 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని, వచ్చే ఆర్ధిక సంవత్సరానికి 1,82,914 కోట్లు ఖర్చు చేస్తామని ఆర్ధిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈలోగా ఉద్యోగుల వేతనాల్లో సగాన్ని వాయిదా వేయాల్సిన అగత్యం ఏమి వచ్చిందో ప్రభుత్వం చెప్పలేదు. ఇంతకంటే తీవ్ర పరిస్ధితిని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏప్రిల్‌ ఒక్క నెల సగం వేతనం ఇస్తామని, మిగిలిన సగం మొత్తాన్ని పరిస్ధితి మెరుగుపడిన తరువాత సర్దుబాటు చేస్తామని చెప్పినట్లు ప్రభుత్వ ఉద్యో గుల సంఘనేత ఒకరు చెప్పారు. తెలంగాణాలో నిరవధికంగా వేతన వాయిదాను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాకు వెల్లడించినదాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతలుగా జీతం ఇస్తామని సీఎం జగన్‌ చెప్పారని, రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నందున తాము సీఎం సూచనకు అంగీకరించామని వెల్లడించారు. ఈ ఒక్క నెల మాత్రమే జీతం రెండు విడతలుగా ఇస్తామని సీఎం చెప్పినట్టు సూర్యనారాయణ వివరించారు. కరోనా పరిస్థితుల ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, ఈ నెలలో సగం జీతం ఇస్తామని చెప్పారని, మిగిలిన జీతం నిధులు సర్దుబాటు అనంతరం ఇస్తామని తెలిపారని సూర్యనారాయణ పేర్కొన్నారు. ఇదే విధంగా తెలంగాణా ముఖ్యమంత్రి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఘాలుగా భావించబడుతున్నవారితో అయినా ఎందుకు సంప్రదించలేదన్నది ప్రశ్న. ఆంధ్రప్రదేశ్‌ అయినా తెలంగాణా అయినా ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగులు, పెన్షనర్లను తాత్కాలికంగా అయినా ఇబ్బందులకు గురి చేశారని చెప్పక తప్పదు. ప్రతి నెలా చెల్లించాల్సిన వాయిదా మొత్తాలు, ఇతర అవసరాలకు వేసుకున్న కుటుంబ బడ్జెట్లు తీవ్రంగా ప్రభావితం అవుతాయని ఇద్దరు ముఖ్యమంత్రులు, వారి సలహాదారులు, ఉన్నత అధికారులకు తెలియదా ? వాయిదా వేసిన వేతన మొత్తాల మేరకు కూడా రిజర్వుబ్యాంకు నుంచి రుణం లేదా అడ్వాన్సు తెచ్చుకోలేని దుస్ధితిలో ప్రభుత్వాలు ఉన్నాయా లేక వడ్డీ భారాన్ని ఉద్యోగుల మీద మోపే ఎత్తుగడ అనుకోవాలా ?
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ కంటే ముందుగా అసోం ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలనుంచి కొంత మినహాయించేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగ సంఘంతో ఆర్ధిక మంత్రి చర్చలు జరిపి వారిని ఒప్పించి నిర్ణయం తీసుకున్నారు. కరోనా నిరోధ చర్యల్లో నిమగమైన వారికి వేతన మినహాయింపు వర్తింప చేయరాదని కోరినట్లు ఉద్యోగ సంఘనేతలు ప్రకటించారు.వేతనాన్ని పది నుంచి ఇరవై శాతం వరకు మార్చినెలకు మినహాయిస్తారు. ఆ మొత్తానికి నాలుగున్నరశాతం వడ్డీతో తరువాత ఉద్యోగులకు చెల్లిస్తారు.
మరో రాష్ట్రం మహారాష్ట్రలో ప్రజాప్రతినిధుల వేతనాల్లో 60శాతం, ఒకటి, రెండవ తరగతి అధికారుల వేతనాల్లో 50, మూడవ తరగతి ఉద్యోగులకు 25శాతాన్ని మినహాయిస్తారు, ఇతరులకు ఎలాంటి మినహాయింపులేదు. వీటిని చూసినపుడు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో ఎన్‌జివోలు, ఉపాధ్యాయులు తీవ్రంగా ప్రభావితం అవుతారన్నది స్పష్టం. పెన్షనర్ల సంగతి చెప్పనవసరం లేదు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాది చివరిలో నిధులకు కటకటను ఎదుర్కొంటాయి. అందుకు గాను ముందుగానే బిల్లుల చెల్లింపు, కొత్తగా పనుల మంజూరు, వాహనాల కొనుగోలు వంటి కొన్ని చర్యలను ప్రకటించటం సర్వసాధారణం. ఇప్పుడు ఆర్ధిక సంవత్సరం ఆరంభమే ఉద్యోగుల వేతనాల వాయిదాతో ప్రారంభమైంది. ఇది మంచి సూచిక కాదు. తెలంగాణాలో ప్రస్తుతం రెండు విడతల కరవు భత్యం బకాయి ఉంది, ఇప్పటికే ప్రకటించిన మేరకు పిఆర్‌సి డిసెంబరు వరకు వెలుగు చూసే అవకాశం లేదు. మధ్యంతర భృతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఇతర దేశాల్లో ఉద్యోగులు, కార్మికుల పరిస్ధితి ఎలా ఉందో చూద్దాం. లాటిన్‌ అమెరికాలోని పరాగ్వేలో ప్రభుత్వ రంగ సిబ్బందికి మూడునెలల పాటు వేతనాల కోతను ప్రకటించారు. దేశాధ్యక్షుడు పొందుతున్న వేతనానికి మించి ప్రభుత్వ రంగ సంస్ధలలో ఉన్నతాధికారులెవరికీ వేతనాలు చెల్లించకూడదన్నది వాటిలో ఒకటి.దేశంలో ప్రకటించిన కనీస వేతనాల కంటే ఐదు రెట్లు ఎక్కువ పొందే వారికి పదిశాతం, పది రెట్లు పొందేవారికి 20శాతం వేతన కోత విధిస్తారు.ప్రజారోగ్యవ్యవస్ధను మెరుగుపరచే పేరుతో ఈ కోత విధించారు.

Telangana government lifts ban on transfer of employees till June ...
సింగపూర్‌లో కూడా తీసుకోవాల్సిన చర్యల గురించి జాతీయ వేతన మండలి కొన్ని సూచనలు చేస్తూ ఆయా రంగాలలో ముందున్నవారు నమూనాగా నిలవాలని కోరింది. ఉద్యోగుల వేతనాల కోత చర్యలకు ముందు కంపెనీలు యాజమాన్య పొదుపు సంగతి చూడాలన్నది సూచనలలో ఒకటి. యూనియన్లతో వేతన సంప్రదింపులకు ముందు కంపెనీల పరిస్ధితి గురించి అన్ని విషయాలు వివరించాలి. అన్ని చర్యల తరువాతే ఉద్యోగుల తొలగింపు ఉండాలని ప్రభుత్వం కంపెనీలకు చెప్పాలి. ముందు కంపెనీలు వేతనేతర ఖర్చు తగ్గించాలి. మానవ వనరులు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తే ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి. ప్రభుత్వ సాయాన్ని పొందాలి. మూడవదిగా వేతన కోతలుండాలి. తక్కువ వేతనాలు పొందేవారి మీద నామమాత్ర ప్రభావం పడాలి. వేతనాలు పెరిగే కొద్దీ కోతలు పెరగాలి. తప్పనిసరి అయితే ఉద్యోగుల తొలగింపు బాధ్యతాయుత పద్దతిలో జరగాలి.
ఈ నేపధ్యంలో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ పాలకులు అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకొని ఉండాల్సింది. ముందుగా ప్రభుత్వ శాఖలలో దుబారా తగ్గింపు చర్యలు ప్రకటించాలి. వాటి గురించి ఉద్యోగ సంఘాలు, సామాజిక, రాజకీయ, ప్రజాసంఘాలతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకొని ఉంటే కరోనాపై ఏకోన్ముఖ పోరాటం చేస్తున్న సందేశం జనంలోకి వెళ్లి ఉండేది. తెలంగాణాలో అవసరం లేకపోయినా వందల కోట్లు ఖర్చయ్యే కొత్త సచివాలయ నిర్మాణ ప్రతిపాదనను ప్రభుత్వం ఇంతవరకు విరమించుకోలేదు.ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అయినా ఆ పని చేసి ఉంటే గౌరవ ప్రదంగా ఉండేది. కొత్త అసెంబ్లీ, శాసనమండలి భవనాలు, కొత్త హైకోర్టుల నిర్మాణ ప్రతిపాదనలు కూడా అలాంటివే. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే ఉద్యోగులకు వేతనాలకే డబ్బు లేని స్ధితిలో మూడు రాజధానుల ప్రతిపాదనలను రద్దు చేసుకొని ప్రతిష్టకు పోకుండా వివాదం నుంచి గౌరవ ప్రదంగా బయట పడేందుకు ఇప్పటికీ అవకాశం ఉంది.
ప్రభుత్వాలు తీసుకొనే వేతన చెల్లింపు వాయిదా చర్యవలన ఉద్యోగులు తాత్కాలికంగా ఇబ్బంది పడినా బకాయిలను తరువాతైనా పొందుతారు. కానీ ప్రయివేటు రంగంలోని వారి పరిస్ధితి ఏమిటి ? అంత పెద్ద ప్రభుత్వాలే వాయిదాలు వేస్తుంటే మేము వాయిదాలు పని చేయని రోజులకు అసలు చెల్లించలేము అంటే కార్మికులు, ఉద్యోగులకు దిక్కేమిటి ? సాధారణ రోజుల్లోనే కనీస వేతనాలు అమలు జరపని సంస్ధల మీద ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు పని చేయని కాలానికి వేతనం ఇప్పించే చిత్త శుద్ధి పాలకులకు ఉందా ?