ఎం కోటేశ్వరరావు
వివాదాస్పద ప్రముఖ జర్నలిస్టు ఆర్నాబ్ గోస్వామి బెయిలు మంజూరు తీరు తెన్నులపై వ్యాఖ్యలు చేసిన ప్రముఖ విదూషకుడు(కమెడియన్) కునాల్ కమ్రా తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని శుక్రవారం నాడు ప్రకటించారు. మరోవైపున కుమ్రాపై చర్య తీసుకోవాలని కోరుతూ అనేక మంది న్యాయవాదులు, న్యాయ విద్యార్ధులు సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. దీంతో సర్వోన్నత న్యాయస్ధానం వాటిని ఏమి చేయనుందనే ఆసక్తి దేశంలోనూ, వెలుపలా నెలకొన్నది. కునాల్ చేసిన వ్యాఖ్యలపై కోర్టు దిక్కార చర్యలు తీసుకొనేందుకు అనుమతించాలని కోరుతూ అనేక మంది చేసిన వినతికి అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ సమ్మతి తెలిపిన ఒక రోజు తరువాత కునాల్ తన వైఖరిని బహిరంగంగా వెల్లడించారు. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవటం లేదా క్షమాపక్షణ గానీ చెప్పేది లేదన్నారు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియదుగానీ ఈ ఉదంతం మరోమారు సుప్రీం కోర్టు జనం నోళ్లలో నానేందుకు దారితీసింది. ఆర్నాబ్ వ్యవహారం వెనక్కు పోయి సుప్రీం కోర్టు-భావ ప్రకటనా స్వేచ్చ అంశం ముందుకు వచ్చింది. మీడియా విస్తరణ కారణంగా ఎన్నడూ లేని విధంగా సామాన్యులలో సైతం ఈ అంశాలు చర్చకు దారితీయనున్నాయి.
ఇటీవలి కాలంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, తీర్పుల గురించి వెలువడుతున్న వ్యాఖ్యలు, విమర్శల మీద సామాజిక, సంప్రదాయ మాధ్యమాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నాయి. న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదించకూడదు గానీ వారిచ్చిన తీర్పులపై మంచి చెడ్డల చర్చ, విమర్శలు చేయవచ్చన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని అంశాలు, తీర్పులు, బెయిలు మంజూరు సందర్భాలలో కొందరు న్యాయమూర్తుల తీరుతెన్నులు, వ్యాఖ్యలు ఆ హద్దును కూడా చెరిపి వేస్తున్న నేపధ్యంలో ఈ అంశాలను చూడాల్సి ఉంది. భావ ప్రకటనా స్వేచ్చ పరిధి,పరిమితుల మీద మరింతగా మరోమారు స్పష్టత రానుంది.
ఆర్నాబ్ గురించేగాక ఇతరుల వ్యక్తిగత స్వేచ్చ అంశాలపై సుప్రీం కోర్టు మౌనాన్ని విమర్శించకుండా వదలకూడదు కనుక నా వైఖరిలో ఎలాంటి మార్పులేదని కునాల్ మరోమారు స్పష్టం చేశారు. అంతేకాదు పెద్ద నోట్ల రద్దు, జమ్మూ-కాశ్మీర్ ప్రత్యేక హౌదా రద్దు,ఎన్నికల బాండ్ల చట్టబద్దత లేదా ఇతర అనేక ముఖ్య అంశాలకు సమయాన్ని,దృష్టి సారించాల్సి ఉందని కూడా సుప్రీం కోర్టుకు సూచన చేశారు. సుప్రీం కోర్టు,న్యాయమూర్తులకు సంబంధించిన ధిక్కార అంశాలపై చర్యలు తీసుకోవాలని మూడవ పక్షం కోరేందుకు నిబంధనల ప్రకారం తొలుత అటార్నీ జనరల్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. భావ ప్రకటనా స్వేచ్చ పేరుతో ధైర్యంగా, అడ్డగోలుగా ఉన్నత న్యాయస్దానాన్ని, దాని న్యాయమూర్తులను విమర్శించవచ్చని జనాలు నమ్ముతున్నారు, అయితే అది ధిక్కార చట్టానికి పరిమితుల్లోనే ఉంటుందని వాటిని దాటితే శిక్ష అనుభవించాల్సి వస్తుందని అర్ధం చేసుకోవాల్సిన సమయమిదని అటార్నీ జనరల్ వ్యాఖ్యానించారు. ఈ అభిప్రాయంతో ఎవరికీ పేచీ లేదు, విబేధించటం లేదు. తీర్పులు, వాటిని వెలువరిస్తున్న న్యాయమూర్తుల తీరుతెన్నులు ఇటీవలి కాలంలో లేవనెత్తుతున్న అంశాల సంగతేమిటన్నది జనాల ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ఈ అంశాన్ని విస్మరించగలమా ?
దేశ ఉన్నత న్యాయస్ధానం స్వతంత్రమైనది మరియు నిష్పాక్షికమైనది కాదు, కనుక దాని న్యాయమూర్తులు కూడా అంతే అనటం మొత్తం వ్యవస్ధ మీద తీవ్రమైన నింద మోపటమే, అయితే మరోవైపు అది పాలక బిజెపి కోర్టు అని, బిజెపి ప్రయోజనాలకే కోర్టు ఉన్నదని ఆరోపిస్తున్నారంటూ అటార్నీ జనరల్ కునాల్ ట్వీట్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో జస్టిస్ ఎన్‌వి రమణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల మీద తీవ్రమైన ఫిర్యాదులే చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి, సిఎం ప్రధాన సలహాదారు మీద కూడా కోర్టు ధిక్కార చర్యలు తీసుకొనేందుకు అనుమతి కోరిన న్యాయవాదికి రాసిన లేఖలో ఈ అంశం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉన్నందున తాను అనుమతి ఇవ్వటం లేదని, ఎవరైనా నేరుగా చర్యలకు ఉపక్రమించవచ్చని అటార్నీ జనరల్ చెప్పిన విషయం తెలిసిందే. అక్టోబరు ఆరవ తేదీతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సలహాదారు అజరు కల్లం మీడియాకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికి ఐదు వారాలు గడిచినా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ లేఖను ఏమి చేసిందీ తెలియదు.దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదును బహిర్గతం చేయటం, అది సంచలనం సృష్టించినదాని మీద ఏ చర్య తీసుకుంటారన్నది జనంలో సహజంగానే ఆసక్తిని రేకెత్తిస్తుంది.
జర్నలిస్టు ఆర్నాబ్ గోస్వామి తన రిపబ్లిక్ టీవీ స్టూడియో కోసం చేయించుకున్న పనికిగాను డబ్బు ఎగవేశారన్న ఆవేదనతో ఆర్కిటెక్ట్ అనవ్ నాయక్ 2018లో ఆత్మహత్యచేసుకున్నాడు. ఆ సందర్భంగా రాసిన లేఖలో ఆర్నాబ్ చెల్లించాల్సిన డబ్బు గురించి ఆవేదన వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అందువలన ఆత్మహత్యకు ఆర్నాబే బాధ్యుడనే ఆరోపణను గతంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బిజెపి-శివసేన ప్రభుత్వం తిరస్కరించి కేసును మూసివేసింది. ఇటీవల శివసేన-కాంగ్రెస్-ఎన్‌సిపి సంకీర్ణ కూటమి ప్రభుత్వం దానిని తిరిగి విచారణకు చేపట్టి అర్నాబ్‌ను అరెస్టు చేసింది. బోంబే హైకోర్టు ఈ కేసులో బెయిల్‌ను తిరస్కరించి సెషన్స్ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సలహా ఇచ్చింది. అయితే ఆర్నాబ్ సుప్రీం కోర్టు తలుపు తట్టారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇద్దరు సభ్యులు సుప్రీం కోర్టు బెంచ్ విచారించి బెయిలు మంజూరు చేసింది.హైకోర్టును తప్పు పడుతూ వ్యక్తిగత స్వేచ్చ రక్షణకు హైకోర్టులు తమ పరిధిని వినియోగించాలని న్యాయమూర్తి డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. తన జర్నలిజాన్ని లక్ష్యంగా చేసుకొని అరెస్టు చేశారని ఆర్నాబ్ కోర్టులో చేసిన వినతిని గమనంలో ఉంచుకొని చంద్రచూడ్ ఈ వ్యాఖ్య చేశారని భావిస్తున్నారు.
సుప్రీం కోర్టు తీరు తెన్నులపై సీనియర్ అడ్వకేట్ దుష్యంత దవే వ్యాఖ్యానిస్తూ వేలాది మంది పౌరులు జైల్లో ఉండి తమ కేసులను విచారించాలని వారాలు, నెలల తరబడి వేచి చూస్తుండగా ఆర్నాబ్ దరఖాస్తును వెంటనే చేపట్టటం తీవ్రంగా కలచివేసేదిగా ఉందని పేర్కొన్నారు. కునాల్ కమ్రా మీద కోర్టు ధిక్కరణ చర్యలకు అనుమతి ఇచ్చిన అటార్నీ జనరల్ చర్య దురదృష్టకరం, ప్రతికూల ఫలితాలనిస్తుందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లో న్యాయమూర్తులను బుద్ధిహీన వృద్దులు, ప్రజాశత్రువులు అని మీడియా వర్ణించినా అక్కడి సుప్రీం కోర్టు పట్టించుకోలేదు. కమ్రా మీద కోర్టు ధిక్కరణ చర్యకు ఉపక్రమిస్తే సుప్రీం కోర్టు అపహాస్యం పాలవుతుంది.బలవంతంగా గౌరవాన్ని పొందలేరు అని పేర్కొన్నారు.
కునాల్ కమ్రా మీద చర్య తీసుకోనట్లయితే సామాజిక మాధ్యమంలో ఉన్న మిలియన్ల మంది తమకు లేదా అభిమానించే వారికి తీర్పులు అనుకూలంగా రానట్లయితే న్యాయమూర్తులు, కోర్టుల మీద బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేయటం మొదలు పెడతారని ఏజి అనుమతి కోరిన వారిలో ఒకరైన న్యాయవాది రిజ్వాన్ సిద్ధికీ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ పతాకం ఎగురుతూ కాషాయ రంగుతో ఉన్న సుప్రీం కోర్టు భవన చిత్రాన్ని పోస్టు చేస్తూ కోర్టు విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అటార్నీ జనరల్‌కు న్యాయవాదులు రాసిన లేఖల మీద కునాల్ కమ్రా వ్యాఖ్యానిస్తూ దీన్ని కోర్టు ధిక్కరణ అని వర్ణించవద్దు,భవిష్యత్‌లో రాజ్యసభ స్ధాన ధిక్కరణ అని చెప్పండి అంటూ ట్వీట్ చేశారు. ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గొగోరు పదవీ విరమణ చేసిన తరువాత రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ దేశ సుప్రీం కోర్టు దేశంలో అత్యంత పెద్ద జోక్. ” జాతీయ ప్రాధాన్యత కలిగిన ” అంశాలపై సుప్రీం కోర్టు వేగంగా స్పందిస్తున్న తీరును చూస్తే కోర్టులలో మహాత్మాగాంధీ బొమ్మలను తొలగించి హరీష్ సాల్వే(అర్నాబ్ న్యాయవాది) చిత్రాలను పెట్టాలి. ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా ముందుగా వచ్చిన మొదటి తరగతి ప్రయాణీకులకు తొలుత మద్యం అందించే విమాన సహాయకుడి మాదిరి డివై చంద్రచూడ్ ఉన్నారు. అసలు ఎప్పుడూ విమానం ఎక్కని వారు లేదా సీట్లలో కూర్చోనివారిని వదలివేస్తారు. వెన్నెముక ఉన్న న్యాయవాదులందరూ సుప్రీం కోర్టు లేదా దాని న్యాయమూర్తులను ఉద్దేశించి మాట్లాడేముందు గౌరవనీయ అని సంబోధించటం మానుకోవాలి. చాలాకాలం క్రితమే ఆ భవనం నుంచి గౌరవం నిష్క్రమించింది. అని కునాల్ చేసిన ట్వీట్లలో పేర్కొన్నారు.
అటార్నీ జనరల్ తీసుకున్న నిర్ణయం సామాజిక మాధ్యమంలో పెద్ద చర్చకు తెరలేపింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద చర్యకు తిరస్కరించినపుడు ఇంత వివాదం కాలేదు. టీవీ యాంకర్‌గా అర్నాబ్ గోస్వామి అత్యంత వివాదాస్పదుడు, ఏకపక్షంగా వ్యవహరించటం గురించి తెలిసినవారందరూ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ చర్చలో అతని కంటే న్యాయవ్యవస్ధ మీద కేంద్రీకృతం కావటం గమనించాల్సిన అంశం. జర్నలిజానికి సంబంధం లేని ఒక నేరంతో ప్రమేయం ఉన్న కేసులో వ్యక్తిగత స్వేచ్చ గురించి సుప్రీం న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఈ స్పందనకు మూలం. సాధారణంగా ఒక బెయిలు దరఖాస్తును వేగంగా పరిష్కరిస్తే ప్రశంసలు సహజం, అర్నాబ్ విషయంలో దానికి భిన్నంగా జరిగింది.
హత్రాస్ అత్యాచారం, హత్య ఉదంతంలో వార్తలు సేకరించేందుకు ఆ గ్రామం వెళుతున్న జర్నలిస్టు సిద్దికీ కప్పన్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసుల అక్రమంగా నిర్బంధించారు. అతన్ని విడుదల చేయాలన్న హెబియస్ కార్పస్ పిటీషన్‌ను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. జర్నలిజానికి సంబంధం లేని కేసులో జర్నలిస్టు ఆర్నాబ్‌కు వెంటనే బెయిలు మంజూరు చేసింది. ఆర్నాబ్ పిటీషన్‌లో ఉన్న లోపాలను కూడా పట్టించుకోకుండా కోర్టు ప్రారంభమైన వెంటనే బెంచ్ మీద పెట్టారు.
సుప్రీం కోర్టులో బెయిలు దరఖాస్తులు ఎన్ని పరిష్కారం కాకుండా ఉన్నాయి ? ఒక దరఖాస్తు పరిష్కారానికి సగటున ఎంతవ్యవధి తీసుకుంటారు అంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తానని ఒకరు ట్వీట్ చేశారు. కొందరు వ్యక్తుల దరఖాస్తులను అత్యవసరంగా తీసుకోవాల్సిన మరియు వ్యక్తిగత స్వేచ్చలకు రక్షణ కల్పించాల్సిన నేపధ్యంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు అవసరమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రాహ్మణుడైన ఆర్నాబ్ పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ మనుస్మృతి ప్రకారం ఉద్దావ్ థాకరేను చంపివేయమని అదృష్టం కొద్దీ డివై చంద్రచూడ్ ఆదేశాలు జారీ చేయలేదు అంటూ మరొకరు ట్వీట్ చేశారు. బిజెపి+ఆర్‌ఎస్‌ఎస్+ఎన్నికల కమిషన్+సిబిఐ+ఐటి+ఇడి+న్యాయవ్యవస్ధ+ మీడియా+ఫేస్‌బుక్‌లతో మహాకూటమి ఉందని దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఒక ట్వీట్ ఉంది.
సుధా భరద్వాజ 807 రోజులు, ఆసిఫ్ సుల్తాన్ రెండు సంవత్సరాలు, షజ్రీల్ ఇమామ్ 286, మీరన్ హైదర్ 223, ఇష్రాత్ జహాన్ మరియు ఖాలిద్ షఫీ 255, ఆసిఫ్ తన్హా 178, దేవాంగ కలితా మరియు నటాషా నర్వాల్ 171, ఉమర్ ఖాలిద్ 58, కిషోర్ చంద్ర వాంగ్‌ఖెమ్ 30 రోజుల నుంచి జైల్లో బెయిలు దరఖాస్తులతో ఉన్నారు అని ఒకరు ట్వీట్ చేశారు. వీరంతా నేరాలు చేశారని, వీరిని ఆర్నాబ్‌ను ఒకే గాటన కట్టటం ఏమిటని కొందరు ప్రశ్నించారు. నేరం రుజువు కానంత వరకు ఎవరూ దోషులు కానప్పుడు కొందరికి సంవత్సరాల తరబడి బెయిలు నిరాకరణ, ఆర్నాబ్‌కు అంతవేగంగా ఎలా ఇచ్చారనేదే ప్రశ్న. ఎనభైనాలుగు సంవత్సరాల పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుడైన స్టాన్ స్వామి బెయిల్ పిటీషన్ ఇరవై రోజులు ఆలశ్యం చేసిన కోర్టు ఆర్నాబ్ విషయంలో అంతవేగంగా కదలటాన్ని ఎలా సమర్ధించుకుంటుంది ? రిపబ్లిక్ టీవీలో నిత్యం విద్వేష పూరిత ప్రచారం చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్నాబ్ వ్యక్తిగత స్వేచ్చకు ఇతరులకు వివక్ష ఎందుకు ?
ఇటీవలి కాలంలో కొన్ని బెయిలు ఉత్తరువుల తీరు తెన్నులు విమర్శకు గురికావటం ఆర్నాబ్ వ్యవహారంతో ఆరంభం కాలేదని గ్రహించాలి. బిజెపి మాజీ ఎంపీ అయిన సోమ్ మరాండీ మరొక ఐదుగురికి ఒక కేసులో బెయిలు మంజూరు చేస్తూ వారంతా 35వేల రూపాయల చొప్పున పిఎం కేర్ నిధికి జమచేయాలని, ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని జార్ఖండ్ హైకోర్టు ఆదేశించింది. పిఎం కేర్ నిధి వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని కేంద్ర చెప్పటంతో వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. కరోనా పోరులో భాగంగా ఆరోగ్యసేతు యాప్‌ను కోట్లాది మంది డౌన్‌లోడ్ చేసుకున్నారన్నది కూడా తెలిసిందే. ఇదే రాష్ట్రంలో సామాజిక మాధ్యమంలో ముస్లింలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన కేసులో అరెస్టయిన రిచా భారతి ఐదు గ్రంధాలయాలకు ఖురాన్ పంపిణీ చేయాలని బెయిలు షరతుగా ఒక మెజిస్ట్రేట్ ఆదేశించారు. బెయిలు రాజ్యాంగంలోని హక్కుల నిబంధనల మేరకు ఇవ్వాలా లేక న్యాయమూర్తుల విచక్షణ మేరకా అన్నది ప్రశ్న.
యావత్ దేశ దృష్టిని ఆకర్షించిన జెఎన్‌యు మాజీ విద్యార్ధి నేత కన్నయ్య కుమార్ మీద మోపిన కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ప్రతిభా రాణి 27పేజీల సుదీర్ఘ బెయిలు ఉత్తరువు జారీ చేశారు. సాధారణంగా బెయిలు ఉత్తరువులు చిన్నవిగా ఉంటాయన్నది తెలిసిందే. అతని మీద మోపిన నేరం రుజువుకాక ముందే తుది తీర్పు మాదిరి బెయిలు ఉత్తరువులో అసందర్భంగా అనేక అంశాలను పేర్కొన్నారు. కన్నయ్య కుమార్ మీద సంఘపరివార్ శక్తులు చేసిన ప్రచారంలోని అనేక అంశాలలోని జాతి వ్యతిరేక ధోరణులు, సరిహద్దులను సిపాయిలు కాపాడటం-వాటికి భావ ప్రకటనా స్వేచ్చను జోడించటం వంటివన్నీ బెయిలు ఉత్తరువులో చేసుకున్నాయి.అన్నింటికీ మించి పదివేల రూపాయలను జెఎన్‌యు చెల్లించాలని పేర్కొన్నారు. ఇదే విధంగా బిజెపి నేత స్వామి చిన్మయానందపై వచ్చిన అత్యాచార కేసులో బెయిలు సందర్భంగా కూడా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి 25పేజీల ఉత్తరువులో బాధితురాలి మీద అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేశారు.
ఆరు సంవత్సరాల క్రితం పూనాలో మోషిన్ షేక్ అనే ఐటి ఇంజనీర్‌ను ముగ్గురు హత్య చేశారు.వారికి బెయిలు మంజూరు చేసిన న్యాయమూర్తి వ్యాఖ్యలు ప్రమాదకరమైనవిగా ఉన్నాయి. హతుని తప్పిదం ముస్లిం కావటం, ఆకుపచ్చ రంగుచొక్కా ధరించటం, గడ్డం పెంచుకోవటం, నిందితులకు గతంలో ఎలాంటి నేర చరిత లేదు. మతం పేరుతో వారిని రెచ్చగొట్టినట్లుగా దాంతో వారు నేరానికి పాల్పడినట్లుగా కనిపిస్తోందని న్యాయమూర్తి పేర్కొన్నారు.మేక పిల్లను తినదలచుకున్న తోడేలు కథ తెలిసిందే. దేశంలో ఫలానా రంగు చొక్కా ధరించకూడదని, గడ్డం పెంచుకోకూడదనే నిబంధనలేవీ లేవు. రెచ్చగొట్టటం లేదా రెచ్చిపోవటం అనేది ఎటు నుంచి ఎటు జరిగినా ఉత్తిపుణ్యానికే జరగవు. ఈ కేసులో నిందితులు వివాదాస్పద, విద్వేషాలను రెచ్చగొడుతుందన్న విమర్శలు ఉన్న హిందూ రాష్ట్రీయ సేన సభలో ఉపన్యాసాలు వినేందుకు వెళ్లారన్నది వెల్లడైంది.
మావోయిస్టు సానుభూతి పరులనే పేరుతో హత్యవంటి తీవ్రనేర ఆరోపణలు లేకపోయినా, కుట్ర ఆరోపణలతో చక్రాల కుర్చీ ఉంటే తప్ప కదల్లేని అనారోగ్యంతో ఉన్న సాయిబాబా వంటి వారితో పాటు ఎనిమిది పదుల వయసున్న వరవరరావు వంటి వృద్దులకు కోర్టులు బెయిలు నిరాకరిస్తున్నాయి. గుజరాత్ మారణకాండలో నరోదా పాటియా ఉదంతంలో శిక్ష పడిన బిజెపి నేత మాయా కొడయానీకి అనారోగ్యం పేరుతో బెయిలు మంజూరు చేశారు. ఆ మారణకాండలోనే 33 మందిని సజీవంగా దహనం చేసిన సరదార్‌పైరా ఉదంతంలో శిక్షపడిన 13మందికి అసాధారణరీతిలో బెయిలు మంజూరు చేస్తూ గుజరాత్ వెలుపల సామాజిక సేవ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఇలాంటి ఉదంతాలలో బెయిలు నిందితులు ఎవరో చెప్పనవసరం లేదు. ఆర్నాబ్ గోస్వామి వ్యవహారం బహిరంగ రహస్యం. అతని అరెస్టుకు నిరసనగా బిజెపి నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కాశ్మీరులో కథువా, హత్రాస్ ఉదంతాలలో నిందితులు నిర్దోషులు అంటూ అదే బిజెపి నేతలు వెనుక వేసుకు వచ్చిన సంగతి తెలిసిందే. కనుకనే కోర్టులు, న్యాయమూర్తులు ఎవరికోసం ఉన్నాయి, ఎవరికోసం పని చేస్తున్నారనే వ్యాఖ్యలు, విమర్శలు తలెత్తుతున్నాయి. న్యాయవ్యవస్ధ కూడా దోపిడీ వర్గపు కనుసన్నలలోనే నడుస్తుందని ప్రపంచంలోని కమ్యూనిస్టుల సాధారణ అభిప్రాయం. దీనితో ఏకీభవించవచ్చు, తిరస్కరించవచ్చు. ఐదు దశాబ్దాల క్రితం దేశ రాజ్యాంగం మీద తమకు విశ్వాసం లేదంటూ తుపాకి పట్టిన నగ్జల్స్ కోర్టుల మీద విశ్వాసం లేదని తమపై మోపిన కేసుల సందర్భంగా చెప్పారు. ఒక అయిడియా మీ జీవితాన్నే మార్చి వేస్తుందన్నట్లుగా నేడు వెలువడుతున్న తీర్పులు, వాటి తీరుతెన్నులు కమ్యూనిస్టులు చెప్పేపని లేకుండానే, వారితో విబేధించేవారితో సహా అనేక మందికి న్యాయవ్యవస్ధ మీద విశ్వాసం పోతోంది. అందువలన తిరిగి దాని మీద విశ్వాసాన్ని పునరుద్దరించాలంటే ఎక్కడ ప్రారంభించాలి? విత్తు ముందా -చెట్టు ముందా ? కునాల్ కమ్రా వంటి వారిని శిక్షించా లేక అలాంటి వారి వ్యాఖ్యలకు తావివ్వని తీర్పులు, న్యాయమూర్తుల తీరుతోనా ? కునాల్ మీద కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో తెలియదు. గతంలో ప్రశాంత భూషణ్ మీద వచ్చిన కేసుకు దీనికి ఎంతో తేడా ఉంది. దాఖలైన కేసును విచారణకు చేపడితే మీడియా, ఇతర అన్ని రంగాలలో మరింత తీవ్రమైన చర్చకు దారి తీయటం అనివార్యం. ప్రశాంత భూషణ్ వ్యాఖ్యానించినట్లు అది ప్రతికూల ఫలితాల నిస్తుందా లేక అటార్నీ జనరల్ వంటి వారు చెబుతున్నట్లు సానుకూల ఫలితాలనిస్తుందా ? మరి కొంత మందికి న్యాయవ్యవస్ధల మీద విశ్వాసాన్ని పోగొడుతుందా ?