Tags
Amezon Master Stroke, China companies to India, China goods boycott, India imports from China, narendra modi bhakts, Narendra Modi Failures
ఎం కోటేశ్వరరావు
ఏడు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ మీద విమర్శల ధాటికి బిజెపి వారు ఉత్సవాలు జరుపుకోలేకపోయారు(ఆన్‌లైన్‌లోనే లెండి). చైనా లడఖ్ సరిహద్దులోని గాల్వన్ లోయ ప్రాంతంలో రెండు దేశాల మిలిటరీ మధ్య విచారకర ఉదంతం జరిగి ఏడాది గడిచిపోయింది. ఈ సందర్భంగా మోడీ గారిని ఒక విషయంలో అభినందించాల్సి వస్తోంది. విదేశీ పెట్టుబడుల ద్వారా మన జనానికి ఉపాధి, ఎగుమతులు పెంచుతామనే కదా తొలిరోజుల్లో గాలిమోటారెక్కి(విమానాలు) అనేక దేశాలు చుట్టివచ్చారు. గాల్వాన్‌లోయ ఉదంతాల నేపధ్యంలో కాషాయ అభిమానుల, వారి ప్రచారదాడికి గురైన వారి మనోభావాలకు అనుగుణ్యంగా చైనా యాప్‌లను నిషేధించారు. అక్కడి నుంచి వస్తున్న పెట్టుబడులను అడ్డుకున్నారు. కొన్ని దిగుమతులను కూడా తగ్గించినట్లు చెప్పారు. యాప్‌లను పక్కన పెడితే పెట్టుబడులను వదులుకోవటం అంటే మనకు కొన్ని ఉద్యోగాలు రాకుండా చేశారు.ఉద్యోగాల కంటే దేశభక్తి ముఖ్యం అని భావించిన వారు నిజంగానే ఆ చర్యలను సమర్ధించారు. కాని నరేంద్రమోడీ వారికి ఒక విపత్కర పరిస్ధితిని తెచ్చిపెట్టారు. ఇరకాటంలోకి నెట్టారు. అదేమంటే చైనాలో మరింత ఉపాధి పెంచే విధంగా రికార్డు స్ధాయిలో అక్కడి నుంచి వస్తు దిగుమతులు చేసుకున్నారు. ఈ వివరాలను వాట్సాప్ యూనివర్సిటీ పండితులు గానీ, పాకేజ్‌ల మీడియాతో సహా మోడీ భక్తులు గానీ ఎక్కడా ప్రచారం చేయరు.తేలు కుట్టిన దొంగలంటే ఇలాంటి వారే.
ట్రేడింగ్ ఎకనోమిక్స్ డాట్ కామ్ సమాచారం ప్రకారం 1991 నుంచి 2021 వరకు సగటున ఏడాదికి 136.71 బిలియన్ (వంద కోట్లు ) రూపాయల విలువగల దిగుమతులు చేసుకున్నాము. 1991ఏప్రిల్ నెలలో రు.0.01బిలియన్‌లు కాగా 2021 మార్చినెలలో ఆల్‌టైమ్ రికార్డు రు.498.29 బిలియన్ల మేరకు దిగుమతులు ఉన్నాయి. మేడిన్ లేదా మేకిన్ ఇండియా పధకాల ద్వారా దేశాన్ని ప్రపంచ ఫ్యాక్టరీగా మార్చి ఎగుమతులు చేసి ఇబ్బడి ముబ్బడిగా చేయలేనంత ఉపాధి కల్పిస్తామని చెప్పిన వారి హయాంలోనే ఇది జరిగింది. సెన్సెస్ అండ్ ఎకనమిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (సిఇఐసి) విశ్లేషణ ప్రకారం 2002 నుంచి 2021వరకు సగటున ఏటా రు. 222 బిలియన్ల మేరకు దిగుమతులు చేసుకున్నాము. ఈ ఏడాది ఫిబ్రవరిలో 459.6 బిలియన్ రూపాయల మేర దిగుమతులు చేసుకున్నాము. ఇవేవీ కమ్యూనిస్టులో, దేశద్రోహులో నిర్వహిస్తున్న సంస్దలు కాదు. లేదా మోడీని వ్యతిరేకించిన వారు తయారు చేసిన టూల్‌కిట్ల సమాచారమూ కాదు.
మరి ఈ వార్త తెలిస్తే చైనా వస్తువులను దిగుమతులు చేయవద్దు, నిషేధించండి, దిగుమతులు ఆపివేసి చైనాను మన కాళ్ల దగ్గర పడేట్లు చేయండి అని వీరంగం వేసిన వారందరికీ కరోనా, బ్లాక్ ఫంగస్ రాదు గానీ గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. నరేంద్రమోడీ రుషిగా మారే క్రమంలో ఉన్నారు కనుక ఆయనకేమీ కాదు, నమ్ముకున్న వారంతా ఆత్మలను నిర్భరంగా ఉంచుకోవాలి, గుండెలను దిటవు చేసుకోవాలి. అనుకున్నదొకటీ అవుతున్నదొకటి అని అవమానాన్ని తట్టుకోలేక ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా నిజాలను తెలుసుకోవటం ప్రారంభించాలి. భజనే చేయాలనుకుంటే మోడీ గారు గాకపోతే మరొకరు. బ్రతుకు ముఖ్యం కదా ! భక్తులు శత్రుదేశం అని ప్రచారం చేస్తున్నా ఖాతరు చేయకుండా దిగుమతుల్లో రికార్డు సాధించినందుకు మోడీని ”అభినందించక” తప్పదు. విశ్వగురువా మజాకానా ! ఎవరైనా ఇది కమ్యూనిస్టు లేదా మోడీ వ్యతిరేక ప్రచారం అని నిరూపిస్తే సవరించుకుంటానని సవినయంగా మనవి చేస్తున్నా.
భారత-చైనా ఎగుమతులు, దిగుమతుల తీరుతెన్నులు చూసినపుడు చైనాకు మనం వలస దేశంగా మారుతున్నామా అని ప్రశ్నిస్తూ ది ప్రింట్ పోర్టల్ 2021 ఏప్రిల్ ఒకటిన ఒక విశ్లేషణను ప్రచురించింది. తమను వెర్రి వెంగళప్పలను చేయటానికి ఈ పని చేశారని లేదా రాశారని మోడీ భక్తులు ఎవరైనా అనుకుంటే చేయగలిగిందేమీ లేదు. వారి స్వర్గంలో వారిని ఉండనిద్దాం. మన దేశం చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతులతో పోలిస్తే ఎగుమతులు ఐదో వంతు మాత్రమే ఉన్నాయి.2019-20తో ముగిసిన ఆరు సంవత్సరాలలో మన దేశ ఎగుమతులు సగటున 13 బిలియన్ డాలర్లు ఉండగా దిగుమతులు 66 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో చైనాకు మన ఎగుమతులు పెరిగిన తరువాతనే ఈ పరిస్ధితి ఉంది. ఈ వివరాలు చెబుతున్నామంటే చైనాను పొగడటంగానో మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారో అని ఎవరైనా అనుకుంటే వారికి కృష్ణ పట్నం ఆనందయ్య మందుతోనో లేక గుజరాత్‌లో మాదిరి గోమూత్రం, ఆవు పేడ పులిమిగాని చికిత్స చేయాల్సిందే.
స్వాతంత్య్రానికి ముందు మన దేశం బ్రిటన్‌కు ముడిసరకులు ఎగుమతి చేసేదిగాను అక్కడి నుంచి పారిశ్రామిక ఉత్పత్తులు, పెట్టుబడులను దిగుమతి చేసేదిగానూ ఉండేదన్న విషయం తెలిసిందే. అదే ధోరణి ప్రస్తుతం చైనాతో మన లావాదేవీలు ఉన్నందున ప్రింట్ విశ్లేషకులు మనం చైనాకు వలసదేశంగా ఉంటున్నామా అని ప్రశ్నించాల్సి వచ్చింది. గతంలో జాతీయ వాదులు వలస నుంచి విముక్తి కావాలని కోరుకున్నారు. మనమే పరిశ్రమలు స్ధాపించాలని కలలు కన్నారు. అసలు సిసలు జాతీయ వాదుల వారసులం అని చెప్పుకున్న కాంగ్రెస్ వారు గానీ, మేమే అసలైన జాతీయవాదులం అని చెప్పుకుంటున్న కాషాయ వాదులు గానీ చైనా నుంచి దిగుమతి చేసుకున్నవస్తువులతో మన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు పొందుతున్న లాభాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాంగ్రెస్ వారిని విమర్శించి గద్దెనెక్కిన బిజెపి గత ఏడు సంవత్సరాలలో ఈ ధోరణిని మార్చేందుకు చేసిన ప్రయత్నాలేమిటో ఎవరైనా చెప్పాలి.
2020 జనవరి నుంచి డిసెంబరు వరకు మన దేశం చైనా నుంచి 58.71 బిలియన్ డాలర్ల మేరకు వస్తువులను దిగుమతి చేసుకుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి హరదీప్ సింగ్ పూరీ ఈ ఏడాది మార్చి 17న లోక్‌సభకు చెప్పారు. చైనా తరువాత అమెరికా నుంచి 26.89, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 23.96, సౌదీ అరేబియా నుంచి 17.73, ఇరాక్ నుంచి 16.26 బిలియన్ డాలర్ల మేర దిగుమతులు చేసుకున్నాము.
ప్రపంచానికి ఎదురయ్యే అఘాతాలు, వత్తిళ్లను తట్టుకొనే స్ధితి స్ధాపకత ఉన్నట్లు చైనా సరఫరా వ్యవస్ధలు రుజువు చేశాయని అమెరికాలోని ఆర్కాన్సాస్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కె జెంగ్ ఈస్ట్ ఆసియా ఫోరమ్‌లో తాజాగా రాశారు. చైనా అంతర్గత మార్కెట్‌లో సొమ్ముచేసుకొనేందుకు, తమ దేశాలలో ఉత్పాదక ఖర్చులను మిగుల్చుకొనేందుకు బహుళజాతి గుత్త సంస్దలు భారీ ఎత్తున చైనాలో పెట్టుబడులు పెట్టాయి, ప్రపంచ ఫ్యాక్టరీగా, ప్రపంచ సరఫరా వ్యవస్ధ కేంద్రంగా చైనాను మార్చాయి. అమెరికా – చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్దం, కరోనా మహమ్మారి సంక్లిష్టమైన ప్రపంచ సరఫరా వ్యవస్ధ భేద్యతను వెల్లడించాయి. ఇటీవలి సంవత్సరాలలో చైనా అధిక విలువను జతచేసే పారిశ్రామిక ఉన్నతీకరణ, విలువ వ్యవస్దలో పెరుగుదల వైపు పయనించింది. వాణిజ్య యుద్దం, మహమ్మారి గానీ చైనా కేంద్రంగా ఉన్న సరఫరా వ్యవస్దను ఏమేరకు ప్రభావితం చేశాయో ఇంకా తెలియదు గానీ ప్రాధమిక రుజువులను బట్టి ప్రభావం అన్ని రకాల పరిశ్రమల మీద ఒకే విధంగా లేనప్పటికీ మొత్తం మీద స్వదేశీ విదేశీ మార్పులకు అనుగుణ్యంగా వత్తిళ్లను తట్టుకొనే విధంగా తగిన వ్యూహాలను రూపొందించుకొన్నాయని సదరు ప్రొఫెసర్ పేర్కొన్నారు. మన సంస్కృత ఘనాపాటీలు ఎలాంటి పాఠాలు చెబుతారో తెలియదు.
భారీ పరిశ్రమలుగా వర్గీకరించిన చైనా పరిశ్రమల లాభాలు గతేడాదితో పోలిస్తే ఏప్రిల్ నెలలో 57శాతం పెరిగాయి. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో గతేడాదితో పోలిస్తే లాభాలు గనుల రంగంలో 1.06 రెట్లు, ముడిపదార్ధాల తయారీ రంగంలో 3.66 రెట్లు పెరిగాయని జాతీయ గణాంక సంస్ద వెల్లడించింది. ఇటీవల రెండు సంవత్సరాల సగటు లాభాలు 29.2శాతం ఉండగా ఫార్మా రంగంలో ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో 80.2శాతం పెరిగాయి. దుస్తులు, వస్త్రాలు, ముద్రణ పరిశ్రమల్లో గత రెండు సంవత్సరాల్లో లాభాలు గణనీయంగా పడిపోయాయి, అయితే ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో మెరుగు పడి తేడా తగ్గినట్లు గణాంక సంస్ద వెల్లడించింది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో చైనా జిడిపి 18.3శాతం పెరగ్గా దక్షిణ కొరియా 1.8, ఫ్రాన్స్ 1.5, అమెరికాలో 0.4శాతం వృద్ది రేటు నమోదు కాగా జపాన్ 1.8, జర్మనీ 3.1, ఇటలీ 4.8, బ్రిటన్‌లో 6.1శాతం తిరోగమన వృద్ధి నమోదైంది.
ఏ నేతకైనా వైఫల్యాలు సహజం. ఒక మత గ్రంధంలో పాప ప్రక్షాళన చేసుకుంటే పరలోక ప్రాప్తి అని ఉంది తప్ప పుణ్య ప్రస్తావన లేదంటారు.అలాగే నరేంద్రమోడీ నిఘంటువులో వైఫల్యాలకు అర్ధమే లేదు.ఎందుకంటే పెద్ద నోట్ల రద్దుతో సహా ఇంతవరకు అన్నీ విజయాలే అన్నారు తప్ప ఒక్క వైఫల్యం గురించి కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ మోడీ ఎంతగా అపహాస్యం పాలయ్యారంటే కొద్ది రోజుల క్రితం బహుళజాతి గుత్త సంస్ద అమెజాన్‌లో ఒక పుస్తకాన్ని ఉచితంగా పొందండి అంటూ ప్రచారం సాగింది. దాని పేరు ఆంగ్లంలో ”మాస్టర్ స్రోక్ ” ( తిరుగులేని దెబ్బ లేదా తిరుగులేని యుక్తి ) రచయిత పేరు బెరోజ్‌గార్ భక్త్, అట్టమీద ప్రధాని నరేంద్రమోడీ బొమ్మ వేసి భారత్‌లో ఉపాధి వృద్ధికి గాను ప్రధానికి తోడ్పడిన 420 రహస్యాలు అని రాసి ఉంది. తీరా 56 పేజీల ఆ పుస్తకాన్ని తీసుకున్నవారు తెరిస్తే అంతా ఖాళీగా దర్శనమివ్వటాన్ని బట్టి నరేంద్రమోడీ మీద విసిరిన ఒక మాస్టర్ ్టస్టోక్ అని చెప్పవచ్చు. అది వైరల్ అయిన తరువాత అమెజాన్ దాన్ని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. బెరోజ్‌గార్ భక్త్ అంటే తెలుగులో పనిపాటా లేని భక్తుడు అని అర్ధం. ఇక 420 అంటే ఏ సందర్భంలో వాడతారో తెలిసిందే. ఉపాధి పోగొట్టటం తప్ప ఉపాధి కల్పనలో ఘోరవైఫల్యం గురించి ఒకవైపు చర్చ నడుస్తున్ననేపధ్యంలో మరోవైపు మీడియా, ఇతరంగా నరేంద్రమోడీ దేశానికి అందించిన అద్భుతమైన సేవ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో మోడీకి తోడ్పడిన 420 రహస్యాలు అంటే మోసాలు అని అర్ధం. మోడీ ఏలుబడిలో పెద్ద లేదా సానుకూలమైనవి ఏవీ లేవని చెప్పటమే.
చైనాతో పోటీ పడి మన దేశాన్ని వృద్ధి చేయవద్దని ఎవరూ చెప్పలేదు. చైనాకు వ్యతిరేకంగా మనల్ని నిలిపేందుకు పధకం వేసిన అమెరికన్లు, జపనీయులు చెప్పిన మాటలు నమ్మిన మన నేతల పరిస్ధితి సినిమాల్లో హాస్యగాళ్లలా తయారైంది. ఇంకే ముంది వెంటనే చైనా నుంచి వెయ్యి కంపెనీలు వస్తున్నాయి, అందుకొనేందుకు సిద్దంగా ఉండండి అని చెప్పగానే నిజమే అని హడావుడి చేశారు. ఏడాదైంది, ఏమైందో ఎవరైనా చెప్పారా ? ఎందుకని చైనా నుంచి అమెరికా సంస్ధలు మన దేశానికి రావటం లేదు. సరిహద్దుల్లో వాటిని అడ్డుకున్నారా ? గతేడాది మోడీ గారు చెప్పిందేమిటి ? ” రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఒక నూతన ప్రపంచ వ్యవస్ధ ఏర్పడటాన్ని మనం చూశాము. కోవిడ్-19 తరువాత అలాంటిదే జరగ నుంది. ఈ సారి ఉత్పాదక బస్‌ను భారత్ నడపనుంది, ప్రపంచ సరఫరా వ్యవస్ధలతో అనుసంధానం కానుంది. మనకు ప్రజాస్వామ్యం, జనాభా సంఖ్య, గిరాకీ రూపంలో నిర్దిష్టమైన అనుకూలతలు ఉన్నాయి.” అని 3డి సినిమా చూపారు. దాని కొనసాగింపుగా ముఖ్యమంత్రులందరూ పరిశ్రమలను అందుకొనేందుకు ఎర్రతివాచీలు పరిచి సిద్దంగా ఉండాలన్నట్లు మాట్లాడారనుకోండి.
నిజానికి చైనా నుంచి కంపెనీలు ఎన్ని బయటకు పోతున్నాయనేది పక్కన పెడితే అంతకు ముందే కొన్ని బయటకు వచ్చాయి. 2019 అక్టోబరు వరకు 56 కంపెనీలు బయటకు వస్తే వాటిలో మూడంటే మూడే మన దేశం వచ్చాయి, 26 వియత్నాం, 11 తైవాన్, 8 థారులాండ్ వెళ్లాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ ఎగుమతి సబ్సిడీలను వ్యతిరేకిస్తున్న కారణంగా దానికి పేరు మార్చి మన ప్రభుత్వం విదేశీ కంపెనీలకు ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహక పధకాన్ని ప్రవేశ పెట్టింది. దాని ద్వారా పదిలక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పిస్తామని చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని మాదిరి గ్రాఫిక్స్ చూపింది.2020-21 సంవత్సరంలో కొన్ని లక్ష్యాలను నిర్ణయించింది. పదహారు కంపెనీలు ఆసక్తి చూపగా పదిహేను విఫలమయ్యాయి. ఒక్క శాంసంగ్ మాత్రమే పూర్తి చేసింది. దాంతో మరొక ఏడాది పాటు వ్యవధిని పొడిగించి 2021-22లో చేసిన ఉత్పత్తిని తొలి ఏడాది లక్ష్యంగా పరిగణించాలని ఆలోచన చేస్తోంది. సెల్‌ఫోన్ తయారీ కంపెనీలు మొదటి ఏడాది నాలుగువేల కోట్ల మేరకు రెండవ ఏడాది ఎనిమిదివేల కోట్ల మేరకు ఉత్పత్తిని పెంచితే దాన్ని బట్టి రాయితీలు చెల్లిస్తారు.ఇలాంటివి గతంలో ఎగుమతుల పేరుతో ఉన్నా ప్రయోజనం కలగలేదు.
చైనా నుంచి లేదా ఇతర దేశాల నుంచి మన దేశానికి కంపెనీలు ఎందుకు రావటం లేదు. ఒకటి చైనా కంటే పన్ను ఎక్కువ. రెండవది ఇతర సౌకర్యాలకు పట్టే వ్యవధి, భూమి లభ్యతలోనూ సమస్యలుండటం వంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. అన్నింటికంటే మన కరెన్సీ విలువలో స్ధిరత్వం లేకపోవటం కూడా సమస్యగానే ఉంది. 2000 జనవరిలో చైనా కరెన్సీ మారకం ఒక డాలరుకు 8.27 ఉంది. గతేడాది అక్టోబరు నాటికి 6.69 యువాన్లకు పెరిగింది. ఇదే కాలంలో మన కరెన్సీ విలువ 43.55 నుంచి 74.54కు తగ్గింది. చైనా కరెన్సీ రెండు దశాబ్దాలలో 19శాతం బలపడగా మన కరెన్సీ 71శాతం బలహీనపడింది.కరెన్సీ విలువలో ఇంతటి ఒడిదుడుకులు ఉంటే కంపెనీలకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. డాలర్లలో పెట్టుబడి పెట్టిన వారికి వాటి విలువ తగ్గిపోతుంది. లాభాలు తీసుకుంటాయి తప్ప కంపెనీలు ముప్పుకు ఎందుకు సిద్దపడతాయి. అయితే మన దేశానికి కరెన్సీతో ఉన్న సమస్య ఏమిటి ? అది బలపడితే మన ఎగుమతులు తగ్గుతాయి, బలహీనపడితే పెరుగుతాయి, మనకు విదేశీ చెల్లింపులకు డాలర్లు కావాలి కనుక రూపాయి విలువను తగ్గించి ఎగుమతులు పెరిగేట్లు చూస్తున్నాం. మరోవైపు కనిపించే చిత్రం ఏమిటి ? దిగుమతి చేసుకొనే వస్తువుల ధర ఎక్కువగా ఉంటే మన ప్రభుత్వాలకు పన్ను రూపంలో ఆదాయం ఎక్కువ వస్తుంది. ఉదాహరణకు చమురు ధరలు పెరిగితే రాష్ట్రాలకు దాని మీద వచ్చే పన్ను ఆదాయం దామాషా ప్రకారం పెరుగుతుంది. దాన్ని జిఎస్‌టి పరిధిలోకి తెస్తే రాష్ట్రాలకు తగ్గే ఆదాయాన్ని చెల్లించే స్ధితిలో కేంద్రం లేదు. ఎవరి గోల వారిది.
మన దేశంలో మధ్య తరగతి, ధనికులు గణనీయంగా ఉన్నారనే అంచనాతో అనేక కంపెనీలు వినియోగవస్తువులను మన మార్కెట్లో నింపేందుకు చూస్తున్నాయి. అయితే కరోనా సమయంలో నరేంద్రమోడీ ఒకందుకు చేసుకున్న ప్రచారం మరొక విధంగా దెబ్బతీసింది. లాక్‌డౌన్ సమయంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు, పప్పులు ఇచ్చామని, ఇలాంటి కార్యక్రమం మానవ జాతి చరిత్రలో మరొకటి లేదని ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా చెప్పారు. నూట ముప్పై కోట్ల జనాభాలో ఇంత మంది పేదలు ఉన్న దేశంలో ఖరీదైన వస్తువులను తయారు చేస్తే ఎవరు కొంటారు, పెట్టుబడులు దండగ అవుతాయోమో అని అమెరికా, ఐరోపా ధనిక దేశాలు వెనకడుగు వేస్తున్నాయని చెబుతున్నారు. విదేశీ కంపెనీలకు కావాల్సింది పెద్ద సంఖ్యలో జనం కాదు, తమ వస్తువుల కొనుగోలు శక్తి ముఖ్యం. ఇదే సమయంలో నూటనలభై కోట్ల జనాభా ఉన్న చైనాలో 80 కోట్ల మంది మధ్యతరగతి, అధిక ఆదాయం కలవారు ఉన్నారు కనుక దానికి ప్రాధాన్యత ఇస్తారు తప్ప మనవైపు చూడరు.చైనాతో పోలిస్తే మన దేశంలో కొనుగోలు శక్తి కేవలం 20శాతమే. 1990 దశకం వరకు రెండు దేశాల తలసరి జిడిపి పోటా పోటీగా ఉంది. 2021 నాటికి నామినల్ పద్దతిలో మన కంటే చైనా తలసరి జిడిపి 5.4రెట్లు, పిపిపి పద్దతిలో 2.58 రెట్లు ఎక్కువ. దీన్ని మరో విధంగా చెప్పాలంటే ఎందుకంటే మన తలసరి ఆదాయం 2019లో 2104 డాలర్లు ఉంటే 2020లో 1965 డాలర్లకు పడిపోయింది. ఇదే సమయంలో చైనాలో 10,261 నుంచి 10,484కు పెరిగింది. కనుకనే చైనా ఉత్పత్తి చేయటంలోనే కాదు, వినియోగించటంలోనూ మనకంటే ముందుంది.
ఈ నేపధ్యంలో అమెరికన్ లేదా జపాన్ కంపెనీ అయినా అక్కడ ఉండేందుకే ప్రయత్నిస్తాయి తప్ప మన దేశానికి వచ్చేందుకు, చేతులు కాల్చుకొనేందుకు ఎందుకు పూనుకుంటాయి. ఒకవేళ బయటకు పోవాల్సి వస్తే మనకంటే రిస్కు తక్కువ ఉన్న దేశాలకే పోతాయి. కరోనాలో మన దిగజారుడు చూసిన తరువాత కనీసం అలాంటి ఆలోచన కూడా చేయరు. గిరాకీ మన నేతల ప్రకటనల్లో తప్ప వాస్తవంలో ఎక్కడుంది. అమెరికన్లు చైనాతో పోట్లాడతారు అక్కడే ఉంటారని ట్రంప్ పాలనా కాలం నిరూపించింది. మన దేశాన్ని వినియోగించుకుంటారని వారి చమురును మనకు అంటగట్టి వారు లబ్దిపొందటాన్ని కూడా ఇదే కాలంలో చూశాము. చైనాకు వ్యాపారం, మనకు కౌగిలింతలు ఇచ్చారు. హౌడీ మోడీ-నమస్తే ట్రంప్ వంటి జిమ్మిక్కులు చేసి వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. అమెరికా వైట్‌హౌస్‌లో ఎవరు కూర్చున్నా జరిగేది ఇదే.
అంతర్జాతీయ రాజకీయాల్లో అనుసరించే విధానాలు కూడా వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలసి చతుష్టయం పేరుతో మన దేశం చైనాకు వ్యతిరేకంగా పని చేయటం బహిరంగ రహస్యం. ఇదే సమయంలో చైనా తన అవసరాల కోసం పాకిస్దాన్ను దగ్గరకు తీస్తున్నది. మన పంచదార వ్యాపారులు పాకిస్ధాన్ కంటే పంచదారను టన్ను 40 డాలర్లకు తక్కువ ఇస్తామన్నప్పటికీ పాక్ నుంచి దిగుమతి చేసుకొనేందుకు చైనా మొగ్గుచూపింది. మన దేశం ఔషధ పరిశ్రమ చైనా మీద ఎంతగా ఆధారపడిందంటే అక్కడి నుంచి అవసరమైన పదార్ధాల దిగుమతి ఆగిపోతే పెన్సిలిన్ వంటి వాటిని మనం తయారు చేసుకోలేనంతగా అని చెప్పాలి. ఇక రాజకీయాల విషయానికి వస్తే మనం చైనా నుంచి దిగుమతులను నిలిపివేసి వారిని లొంగదీసుకుంటున్నట్లు కాషాయ మరుగుజ్జులు ప్రచారం చేస్తారు. ఇది జనాన్ని మోసం చేయటమే. మనం నిజంగా చేయాల్సింది మొత్తంగా దిగుమతులను నిలిపివేసి స్వయంగా తయారు చేసుకోవటం. కానీ జరుగుతోందేమిటి ? గతంలో మనం 2015లో చైనా నుంచి 2.8 బిలియన్ డాలర్ల మేర ఉక్కు దిగుమతులు చేసుకున్నాం ఇప్పుడు ఒక బిలియన్‌కు పడిపోయింది. ఎందుకు ? చైనా నుంచి దిగుమతి చేసుకోవాలంటే పదిహేనుశాతం ధర ఎక్కువగా ఉంది. దక్షిణ కొరియా తాను ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా మనకు ఎలాంటి పన్నులు లేని ఉక్కును సరఫరా చేస్తున్నందున చౌకగా దొరుకుతోంది గనుక అక్కడి నుంచి కొంటున్నాం. ఇలా అనేక అంశాల మీద జనాన్ని తప్పుదారి పట్టించే ప్రచారం జరుగుతోంది. కనుక బిజెపి లేదా మరొక పార్టీ ఏది చెప్పినా దేన్నీ గుడ్డిగా నమ్మవద్దు, ఏ దేశం మీదా గుడ్డి ద్వేషాలను పెంచుకోవద్దు.
Nice article
LikeLike