Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


మా నేత మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. మీ గొడవ భరించలేక కాసేపు అంగీకరిద్దాం, ఐతే ఏమిటి ? దాన్లో గొప్పేముంది ? లాల్‌బహదూర్‌ శాస్త్రి, మొరార్జీ దేశాయి, చరణ్‌ సింగ్‌, విపి సింగ్‌, ఐకె గుజ్రాల్‌ , చంద్రశేఖర్‌, దేవె గౌడ, మన్మోహన్‌ సింగ్‌ వీరి మీద ఉన్న మచ్చలేమిటో ఎవరైనా చెప్పగలరా ? వారి వెనుక చేరిన వారు అవినీతికి పాల్పడి ఉండవచ్చు. మన్మోహన్‌ సింగ్‌ మీద ఉన్న విమర్శ అదే కదా ! మోడీని ఆశ్రయించిన వారు అవినీతికి దూరంగా లేరని ఎవరైనా నిర్ధారించగలరా? మతోన్మాద అంశంలో మోడీతో ఎవరూ ఎవరూ పోటీ పడలేరు తప్ప మిగతా అంశాల్లో నరేంద్రమోడీ -మన్మోహన్‌ సింగ్‌లకు వ్యక్తిగతంగా పెద్ద తేడా ఏముంది ? అర్ధశాస్త్రం చదువుకున్నా మన్మోహనుడికి ఆర్ధికరంగంలో విదేశీ అవార్డులు రాలేదు. ఏం చదువుకున్నారో తెలియని నరేంద్రమోడీకి సియోల్‌ అవార్డు వచ్చింది. మచ్చలేని స్వచ్చ పాలన అందించాలనే కదా ఎవరినైనా ఎన్నుకొనేది. మచ్చ ల్లేవు చూడండి రచ్చల్లేవు చూడండి అని ఎంతకాలం బోరుకొట్టిస్తారు ? మతోన్మాదం పెద్ద మచ్చ కాదా ! అయినా అధికారాంత మందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్‌ అన్నట్లు తొందర ఎందుకు ! మోడీ గారి ఏలుబడి ఇంకా ఉంది, కనుక ముందస్తు ధృవీకరణ పత్రాలు ఇచ్చుకోవటం ఏమిటి ?
నేతకున్న మచ్చల సంగతి చరిత్ర చెబుతుంది. మనకు మనం స్వంత సర్టిఫికెట్‌లు ఇచ్చు కోకూడదు. పాలకుడు అవినీతి పరుడుగాక పోతే అది కొంతకాలం పాలకపార్టీకి పెట్టుబడిగా పని చేస్తుంది తప్ప శాశ్వత పాలనకు పాస్‌ పోర్టు, వీసా కాదు. దేశాన్ని అవినీతి ఊబి నుంచి వెలికి తీసి పులుకడిగిన ముత్యం అన్న పేరు తీసుకువస్తానని 2014లో నరేంద్రమోడీ చెబితే చాలా మంది నిజమే అనుకున్నారు. తొలి సారి ఎన్నికైనపుడు అన్ని విదేశీ ప్రయాణాలు ఎందుకంటే విదేశీ పెట్టుబడుల కోసం, ప్రపంచంలో పోయిన భారత ప్రతిష్టను పెంచటం కోసమే అన్నారు. నిజమే కామోసనుకున్నారు జనం !


ట్రాన్సఫరెన్సీ ఇంటర్నేషనల్‌(టిఐ) అనే సంస్ధ ప్రతి ఏటా అవినీతి అవినీతి గోచరత సూచిక పేరుతో ఒక నివేదికను వెల్లడిస్తుంది. దాన్లో ఎగువన ఉన్న దేశాలు ఛాతీ విరుచుకుంటాయి, దిగువన ఉన్నవి సిగ్గుతో తలదించుకుంటాయి. ఎనిమిదేండ్లుగా మోడీ అధికారంలో ఉన్నా ఒక్క ఏడాదంటే ఒక్కసారి కూడా తల ఎత్తుకోలేని పని తీరును కనపరిచారు.ఈ నివేదికను గీటురాయిగా తీసుకుంటే మోడీ ఏలుబడి ప్రపంచంలో మనల్ని తలతెత్తుకొనేట్లు చేసిందో, దించుకోనేట్లు ఉంచిందో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. లేదూ లెక్కలు తప్పు, చూసిన తీరు సరిగా లేదనుకుంటే ఈ సంస్ధ లెక్కలు, చూపుల నుంచి మమ్మల్ని మినహాయించండి అని ఈ పాటికి కేంద్ర ప్రభుత్వం టిఐకి రాసి ఉండాల్సింది. అదేమీ జరగలేదు.


2021 టిఐ సూచిక ప్రకారం 180దేశాల అవినీతి మార్కుల సగటు 43. మన దేశం 40 మార్కులతో 85వ స్ధానంలో ఉంది. 2014 సూచిక ప్రకారం 38 మార్కులతో 85వ స్ధానంలో ఉన్నాము. ఈ అంకెల తరువాత కూడా మచ్చలేని నరేంద్రమోడీని చూసి ప్రపంచం మెచ్చి మేకతోలు కప్పుతుందా ? దేశమచ్చను చూసి నవ్వుకుంటుందా ? ఈ వివరాలను మనం మూసిపెట్టుకోవచ్చు, గోడీ మీడియా మసిపూసి మారేడుకాయ చేయవచ్చు తప్ప ప్రపంచానికి తెరిచిన పుస్తకమే కదా ? అందువలన దేశభక్తులంగా మన కొందరు వ్యక్తులకు భజనలు చేయాలా ? చేస్తే ఎంతకాలం ? దేశం గురించి పట్టించుకోవాలా ? ఒక్క ఈ సూచికే కాదు, దేన్లో దేశానికి ఎన్‌డిఏ సర్కార్‌ పేరు తెచ్చిందో, ఏమి సాధించిందో ఎవరైనా చెప్పగలరా ? ఈ ప్రశ్న అడిగిన వారి మీద వెంటనే బూతుల క్షిపణులు పేలతాయి. గతంలో కాంగ్రెస్‌ ఏలుబడి గురించి ఇలాగే మాట్లాడారా ? దేశపరువు తీస్తారా ? మీరు ఈ దేశంలో పుట్టలేదా ఈ దేశ తిండితినలేదా అంటారు. వారి సంగతి తరువాత చూద్దాం. ఇలా అడిగేవారు ముందు తాము తింటున్నది ఏమిటో తిన్నదానికి గాను దేశానికి వారేం చేశారో, పెంచిన పరువు ప్రతిష్టలేమిటో చెప్పండి!


బీజింగ్‌ ఒలింపిక్స్‌ ప్రారంభ సభకు రెండు రోబోలతో సహా 1,200 మందితో క్రీడా జ్యోతిని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. వారిలో గాల్వన్‌ ఉదంతాల్లో పాల్గొన్న సైనికుడు ఒకడు ఉన్నాడంటూ మన దేశం ప్రారంభసభను బహిష్కరించటమే కాదు, ప్రారంభ సభ ప్రసారాన్ని కూడా చేయరాదని దూరదర్శన్‌ నిర్ణయించింది. దేశభక్తికి గీటురాళ్లు ఇవేనా ? కాసేపు అంగీకరిద్దాం. ఈ ఆగ్రహం చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తు దిగుమతుల పట్ల ఏమైనట్లు ? అవి ఒక రోజులో జరిగినవి కాదే ? అప్పుడు కళ్ల ముందు డాలర్లు, లాభాలు తప్ప గాల్వన్‌లో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, వారి కుటుంబాలు గుర్తుకు రాలేదా ? పాలూ, పెరుగులు ఎవరి నుంచైనా తీసుకోవచ్చు, వాటికి అంటూ సొంటూ ఉండదు అన్నట్లు చైనా వస్తువులకు దేశభక్తి నుంచి మినహాయింపులు ఉన్నాయా ?
గాల్వన్‌కు ముందు, తరువాత కూడా చైనా వస్తు బహిష్కరణే అసలు సిసలు దేశభక్తి, మేం ఇన్ని సరకులు బహిష్కరించాం, ఇన్ని బహిష్కరించాం అని చెప్పిన వాణిజ్య సంఘాలు ఇప్పుడెక్కడా కనిపించవేం ? వస్తుదిగుమతుల్లో తలమునకలుగా ఉన్నాయా ? సంఘపరివార్‌ సంస్ధ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? సరిహద్దు వివాదానికి, ఇతర సంబంధాలకు ముడిపెట్టకూడదని ఒకవైపు నీతులు చెబుతారా ? అది క్రీడలకు వర్తించదా ? ఏమిటీ వంచన ! జనాన్ని ఎంతకాలం మోసం చేస్తారు ? 2021లో మన దేశం 126బిలియన్‌ డాలర్ల మేరకు చైనాతో లావాదేవీలు జరిపి సరికొత్త రికార్డు నెలకొల్పిన అంశం మన ప్రధాని కార్యాలయం, విదేశాంగశాఖకు తెలియదా ? ఎందుకు అనుమతించినట్లు ? ఏమైందీ దేశభక్తి ?


ఇక అవినీతి సూచిక సంగతి చూస్తే దాన్లో అధమ స్ధానంలో ఉండటం దేశానికి తలవంపులే.టిఐ నివేదిక చెప్పిందేమిటి ? ” ఇదేమీ కాకతాళీయం కాదు. అవినీతి మానవహక్కుల దుర్వినియోగానికి వీలు కల్పిస్తుంది. దిగజారే ఒక విషవలయాన్ని ఏర్పాటు చేస్తుంది.హక్కులు, స్వేచ్చలు దిగజారతాయి, ప్రజాస్వామ్యం క్షీణించి దాని స్ధానంలో నియంతృత్వం చోటుచేసుకుంటుంది. అది ఉన్నత స్ధాయి అవినీతి పెచ్చరిల్లటానికి దోహదం చేస్తుంది. దీనికి సంబంధించి ఆందోళనకరమైన ఉదాహరణలను గత సంవత్సరం ముందుకు తెచ్చింది. మానవహక్కుల మద్దతుదార్లను హతమార్చటం, మీడియా సంస్ధలను మూసివేయటం నుంచి ప్రభుత్వాల దొంగకళ్ల కుంభకోణాలైన పెగాసస్‌ ప్రాజెక్టువంటి వాటి వరకు వాటిలో ఉన్నాయి.
వ్యవస్ధాపరమైన అవినీతి, బలహీనమైన సంస్ధలు ఉన్న దేశాల్లోనే కాదు, స్ధిరపడిన ప్రజాస్వామిక దేశాలుగా చెబుతున్నవాటిలో కూడా హక్కులు దిగజారుతున్నాయి, దుర్వినియోగ నియంత్రణ-నిరోధ నిబంధనావళిని కూడా తుంగలో తొక్కుతున్నారు.మానవహక్కులను గౌరవించటం అవినీతి అదుపునకు తప్పనిసరి, ఎందుకంటే అనాయాన్ని సవాలు చేసేందుకు పౌరులకు వీలు కల్పించే సాధికారతను కల్పిస్తుంది. మౌలిక స్వాతంత్య్రాలు,దుర్వినియోగ నియంత్రణ-నిరోధ నిబంధనావళిని అమలు జరిపే చర్యలను అడ్డుకొనేందుకు కరోనా మహమ్మారిని ప్రపంచ వ్యాపితంగా ఒక సాకుగా చూపారు. గుర్తు తెలియని డొల్లకంపెనీలకు స్వస్ధిపలకాలని అంతర్జాతీయంగా కదలిక వచ్చినప్పటికీ మిగతావాటితో పోలిస్తే శుద్దమైన ప్రభుత్వరంగం ఉండి ఎక్కువ మార్కులు వచ్చిన దేశాలలో కూడా బహుళజాతి అవినీతి కొనసాగుతూనే ఉంది.” అని నివేదిక పేర్కొన్నది. 2012 వరకు అవినీతి మార్కుల ప్రపంచ సగటు 43గానే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 25దేశాలు తమ మార్కులను గణనీయంగా మెరుగుపరచుకోగా 23 చోట్ల అదే విధంగా దిగజారింది. అత్యధిక మార్కులు తెచ్చుకున్న ప్రజాస్వామిక దేశాల్లో అవినీతి నిరోధక ప్రయత్నాలు దిగజారుతున్నాయి.వీటిలోని అనేక దేశాలు విదేశీ అవినీతి, అక్రమార్కులకు సురక్షిత స్వర్గాలుగా ఉన్నాయిని కూడా టిఐ నివేదిక చెప్పింది.


దేశంలో అవినీతి నల్లధనం ఎలా పెరిగిపోతోందో ఏ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద నిఘావేసినా రోజుకు ఎంత మంది నుంచి ఎంత నల్లధనం చేతులు మారుతోందో ఎవరైనా తెలుసుకోవచ్చు.2016లో పెద్ద నోట్ల రద్దుతో పెద్ద మొత్తంలో 3-4లక్షల కోట్ల మేరకు నల్లధనం వెలికి తీస్తామని చెప్పిన సర్కార్‌ నిర్వాకం ఏమిటి ? ప్రభుత్వం రద్దుచేసిన కరెన్సీ నోట్ల విలువ రు.15.41లక్షల కోట్లు. తిరిగివచ్చిన నోట్ల విలువ మొత్తం రు.15.31లక్షల కోట్లు. రానిది పదివేల కోట్లు మాత్రమే. అనేక మందికి నోట్ల రద్దు తెలియక, బయటపెడితే సంసారాల్లో ఎక్కడ తగాదాలు వస్తాయో అని భయపడి బయటకు రాని సొమ్ము అంతకంటే ఎక్కువే ఉంటుంది. మరోవిధంగా చెప్పాలంటే దొంగనోట్లు కూడా మోడీ సర్కార్‌కు ఇచ్చి అసలైన నోట్లు తీసుకున్నపెద్దలున్నారు.పెద్ద నోట్ల రద్దుతో సహా తమ సర్కార్‌ వివిధ పద్దతుల్లో వెలికి తీసిన మొత్తం రు.1.3లక్షల కోట్లని 2019 ఫిబ్రవరిలో నాటి ఆర్ధిక మంత్రి పియుష్‌ గోయల్‌ చెప్పారు.


పెద్ద నోట్లు రద్దు చేసిన 2016లో 6.32లక్షల నకిలీ నోట్లను పట్టుకున్నారు. తదుపరి నాలుగు సంవత్సరాల్లో 18.87లక్షల కోట్లకు చేరాయి. అంటే దొంగనోట్లు అచ్చువేసే ముఠాలు తగ్గేదేలే అన్నట్లుగా రెచ్చిపోతున్నాయి. పెద్ద నోట్ల రద్దు తరువాత పట్టుబడిన దొంగనోట్లలో వంద విలువగలవి ఎక్కువ ఉన్నాయి. తరువాత పట్టుబడిన వాటిలో కొత్త రెండువందలు, ఐదువందల విలువగల నోట్లు గణనీయంగా ఉన్నాయి.డిజిటల్‌ చెల్లింపుల గురించి ఎన్నికబుర్లు చెప్పినా ఇప్పటికీ నగదే నడుస్తోంది.2021అక్టోబరు 29న రు.29.17లక్షల కోట్ల నగదు చెలామణి ఉండగా 2016లో రు.16.4లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్‌బిఐ సమాచారం వెల్లడించింది.